Jump to content

వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/గురుపూజ

వికీసోర్స్ నుండి

గురుపూజ

గురుప్రాయులైన శ్రీ వేదము వేంకటరాయశాస్త్రులవారికిని శిష్యుడ నైన నాకునుగల పరిచయవిశేషముల గొన్నింటిని నివేదించి నాయొక్క ఋణభారమును కొంత దీర్చికోనెంచినాడను. నేను క్రైస్తవ కళాశాలలో 1897 వ సం. మొదలు 1902 వ సం. వఱకు విద్యార్థిగా నైదేడు లుంటిని. నేను తెనుగు తరగతికి జేరినవాడనయినను చేరిననాటినుండియు వీరి దర్శన గౌరవమును సల్లాపభాగ్యమును నాకు లభించినవి. ఆకాలమున నాకాలేజిలో 'ఆంధ్రభాషాభిరంజని' యనుపేర తెనుగుసమాజ మొక్కటి యుండెడిది. దాన నేనొక సభ్యుడను. ఏటేట రెండు మూడు పర్యాయములు వచ్చి ఆసమాజమును ఆదరించు గొప్పవారిలో శ్రీ శాస్త్రులవా రొకరు. వీరివచనము మృదుమధురము హాస్యరసశోభితము. ఎట్టి గాఢమైన విషయమైననుసరే, సరళముగను సరసముగను వివరించువిథానము వీరికలవడినట్లు పెఱ అగ్రాసనాధిపతులలో గానంబడద. వీరి ప్రసన్నత సర్వసభి కాకర్షకము. మేము చిన్నవారము, అల్పజ్ఞులము. అయినను మమ్ము మందలించునపుడుసయితము, మిక్కిలి మర్యాదతో, మేము పొరబాటుపాలైనట్లు పల్కుదురగాని తప్పులలో బడినట్లు కఠినముగా పలుకరు. నాకవిత్వతత్త్వవిచారమునకు బీజమైన కళాపూర్ణోదయ విమర్శనవ్యాసమును నేను వీరియధ్యక్షత క్రింద జదువగా గొంతవఱకు అత్యుక్తిదోషమందున్నదని మెత్తనిరీతిని పరిశీలించి నాకు ధైర్యముకలిగించిరి. మనసువిఱగునట్లు మాటలాడుట వీరిపద్ధతి గాదు - అనగా నితరపండితులపై దాడివెడలునప్పుడుతప్ప! వీరికిని మహామహోపాథ్యాయ కొక్కొండ వేంకటరత్నము పంతులుగారికిని నడచిన వాగ్యుద్ధము ఆనాటి ఆచారమునకు సరిపోయినదిగాని నేడు మనకు స్మరణయోగ్యము కాదు. వ్యాకరణాది మీమాంసలే నాటి విమర్శకవిచారములు. ఆచర్చలలో సరళము లరుదు; పరుషములే మెండు; భాష ప్రథానము, భావము కాదు. పరుషవాక్యములను తీసివేసినయెడల శాస్త్రులవారి విమర్శనము మనకెల్ల భాషాజ్ఞానమును విస్తరించిన వరప్రసాదము.

వీరికిని శ్రీ సమర్థి రంగయ్యసెట్టిగారికిని పరస్పరహితభావ మెక్కువ. సెట్టిగారు ఉపభాషావిద్యలకు విచారణకర్తలు; ఒక విధముగ శాస్త్రులవారికి యజమానులు. వారును మృదుహిత సరసవాక్ప్రగల్భులు. విద్యార్థులను సంబోధించునప్పుడు 'న' కారప్రయోగ మెన్నడును చేసినవారుకారు ;మీరు', 'దయ చేయండి', 'తమవిషయ మెఱుగుదును' ఇత్యాదిరీతుల మమ్ము మన్నించువారు. అట్టి తరుణముల మామనస్సులందు స్వచ్ఛందముగ జనించు వినయము, సిగ్గు, పూజ్యభావము, ఇట్టిట్టివని చెప్పగాదు. శ్రీ సెట్టిగారును శాస్త్రులవారును విద్యార్థులను మంచిమార్గములకు ప్రేరేపించు సహజశక్తి గలవారు. ఆచార్యుల కుండవలసిన యుత్తమగుణములలో నిదియొకటి. ఈకళయందు వీరిరువురును అసామాన్యులు. శ్రీ శాస్త్రులవారికి సరస్వతీప్రసన్నమేగాని లక్ష్మీకటాక్షము సంప్రాప్తించలేదు. ఆముక్తమాల్యదకు ఉత్కృష్టవ్యాఖ్యను, సంజీవనీనామకమును, రచించి ముద్రణకార్యమునకై ధనసాహాయ్యముంగూర్చి నన్ను హెచ్చరించిరి. అందులకై నేను అడుగకమున్నే, శ్రీ అల్లాడి కృష్ణస్వామయ్యగారు వేయిరూప్యములను, నిండుహృదయముతో సంతోషముగ నిచ్చిరి. ఇచ్చినదానికంటె ఇచ్చినరీతి గణ్యతరము. ఇది శ్రీ అల్లాడి కృష్ణస్వామియొక్క సహజౌదార్యలక్షణము. వ్యాఖ్యానమెట్లో ముద్రితమైనది. శ్రీ శాస్త్రులవారు, నాయందలి వాత్సల్యాతిశయముచే, ఏతద్వ్యాఖ్యానరంగాధిరోహణ మహోత్సవమును అగ్రపీఠమునుండి నడుపవలసినదిగా నన్నుం గోరిరి. నాకా అర్హతలేదు. సంస్కృతాంధ్రముల పారంగతులైన శాస్త్రుల వారి పరిపక్వామోఘవ్యాఖ్యాన మెక్కడ! తెలిసియు దెలియకపల్కు నే నెక్కడ! ఐనను గురువులయాజ్ఞ. అనుల్లంఘ్యము. ఒప్పుకొంటిని. సభ మద్రాసులో జరిగెను. విద్యాశేఖర ఉమాకాన్తముగారు మొదలగు విద్వద్వరేణ్యులు వచ్చిరి. "కనకపుసింహాసనమున" నేను గూర్చుంటిని అందఱి యెదుట, జంకుపాటుతో, ఆగ్రంథమును గుఱించియు, వ్యాఖ్యానమును బట్టియు, శ్రీ శాస్త్రులవారి జీవితమును, వారి భాషాదోహదాది కౌశల్యమును గూర్చియు వచించుచు, ఏమాత్రము బ్రాహ్మణేతర కవులకు మనభాషా చరిత్రలో తక్కువపాటు ఉద్దేశ్యపూర్వకముగనో లేక నిరు ద్దేశ్యముగనో సంభవించినదో అది విచారణీయమని సాహసించి నివేదించితిని. ఆముక్తమాల్యదయొక్క కర్తృత్వము అల్లసాని పెద్దన్నకు కొందఱిచే అర్పింపబడియుండుట న్యాయము కాదనియు, అది కృష్ణదేవరాయకృతమ యనియు, సిద్ధాంతీకరించిన వారగుట శ్రీశాస్త్రులవారికి నేను బహిరంగపఱచిన మీమాంస ఆశ్చర్యమును కలిగింపలేదు; అసహ్యముకాలేదు. కానికొందఱు పండితులు కోపపడిరి. సహజమేకద. నూతనాభిప్రాయములు అలవాటునకు వచ్చుటకు కాలముపట్టును గదా. ఈమధ్యలోనవి కొన్నియెడల కొందఱిలో మనస్తాపము కలిగింపకయుండునా? కాని శ్రీ శాస్త్రులవారియొక్క మనోవైశాల్యము కొలదికి మించినది. ఏవిషయమైనను సరే, క్రొత్తదిగా నుండనీ, ఆగమాచారములకు విరుద్ధముకానీ, వేగిరపడక, ఆగ్రహింపక, శాంతముగ ఆమూలాగ్రముగ పరిశీలించి, సత్యశోధనపరాయణత్వమును ప్రకటించువారిలో వీరు అగ్రగణ్యులు. కావుననే వీరియభిప్రాయములు సమరసములు సహృదయసమ్మతములునై యున్నవి.

శ్రీశాస్త్రులవారి యంతిమదశలో నెల్లూర వారియింటికిబోయి కృతప్రణాముడనై కొంతసేపు సంభాషించితిని. శ్రీ రేబాల లక్ష్మీనరసారెడ్డి గారిచే బ్రసాదింపబడిన పౌరసౌధమున అలంకారములమీద వారు అద్భుతమైనరీతిని ప్రసంగింపగా ఆనందపారవశ్యముం జెంది కొన్ని మాటలతో, అనగా అసం గత్యలంకారములకు దృష్టాంతములైన మాటలతో, సభోపసంహారముం గావించితిని.

ఆంధ్రభాషకు నూతనజీవనమును, నవీనకళను, నవ్యమును దినదినప్రవర్ధమానమును నయిన పరిణామమును ప్రసాదించిన పండితులును కవులును నాటకకర్తలును వచనరచనాధు రీణులును వ్యాఖ్యాతలును అయినవారిలో శ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారు ప్రథములు - అద్వితీయులు. వీరిపేరుచెప్పి, ఇంకెవరిపేరు చెప్పనగును?

కావుననే వీరికి 'కళాప్రపూర్ణ' బిరుదమును ఆంధ్ర విశ్వవిద్యాలయముచే 1927 వ, సంవత్సరమున నిప్పించి ధన్యుడనైతిని. "నన్ను బి.ఏ. చేయవా?" అని నేను వైస్‌ఛాన్సలర్ అయినప్పుడు హేళనముగ నన్నడిగిరి. "అయ్యా, బి.ఏ., లను పుంఖానుపుంఖములుగ మీరలు చేసినారు గదా. ఈపిచ్చి మీకెందునకు?" అని నేను ప్రతిహేళనమొనర్చితిని. మనసులో మొదటినుండియు ఒక్కతలంపు నాకుండెడిది. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు స్థాపనకువచ్చిన పిమ్మట జరుగు మొదటి బిరుదప్రదాన మహోత్సవములో శ్రీశాస్త్రులవారికి 'కళాప్రపూర్ణ' నామకమైన డాక్టొరేటు బిరుదమును కానుకగా సమర్పింపవలెనని. భగవంతుని కృపచే ఆయభిలాష నెఱవేఱెను. ఈక్రింది ప్రశంసావాక్యములతో ఆ యుత్తమగౌరవ - బిరుదమును 1927 సం. డిసంబరు 5 తేదిలో నడచిన కాన్వొకేషనులో సమర్పించి మన యూనివర్సిటీ కృతకృత్యతా మహిమ వహించెను. "ఛాన్సెలర్ మహాశయా,

ఉభయభాషాపారీణులైన శ్రీ వేదము వేంకటరాయశాస్త్రి గారికి 'కళాప్రపూర్ణ^' అను గౌరవబిరుదమును ఆంధ్ర విశ్వకళాపరిషత్‌పక్షమున తాము సమర్పింపవలయు నని నావిన్నపము.

శ్రీ శాస్త్రులవారు చెన్నపురి క్రైస్తవకళాశాలలో జిరకాలము ప్రథానసంస్కృతపండితులుగనుండి పెక్కండ్రు విద్యార్థులకు జ్ఞానబోధచేసి కృతకృత్యులైన మహానుభావులు; మఱియు బహుగ్రంథముల రచించి భాషాభివృద్ధికి మిక్కిలి తోడ్పడినవారు. వీరు రచించిన ప్రతాపరుద్రీయాది స్వతంత్రగ్రంథములు వీరికవితాపరిపాటికిని, విమర్శనగ్రంథములు వీరి సునిశిత మతవిశేషమునకును, శృంగార నైషథాది వ్యాఖ్యానములును, కథాసరిత్సాగరాది భాషాంతరీ కరణములును వీరి రసజ్ఞతకును, సర్వంకషమైన పాండిత్యమునకును, తార్కాణములు. వార్ధకదశయందును మన:క్లేశ దేహక్లేశములకు వెనుదీయక, ఆముక్తమాల్యదకు సమగ్రమగు మహావ్యాఖ్యానమును వీరు మొన్ననే రచించి ప్రచురించుట తలపోయగా, భాషాకృషి వీరికి గర్తవ్యముగానేగాక స్వభావముగ గూడ బరిణమించినట్లు స్పష్టమగుచున్నది. ఆంధ్ర భాషోజ్జీవనమే నిజజీవిత పరమార్థముగ జేసికొని నిత్యప్రకాశమానమైన కీర్తిచే విరాజిల్లునీ శ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారికి దాము 'కళాప్రపూర్ణ' నామక ఉత్తమ బిరుదమును బ్రసాదింతురని నాప్రార్థన."

శాస్త్రులవారి జీవితము మఱువదగినదికాదు. ఆబాల గోపాలము ఎల్లవారును మనసున స్థిరముగ నుంచుకొనవలసినది. మహనీయుల జీవితములట్లు సన్మార్గబోధకములును పురోవృద్ధి కారణములునైన శక్తులు వేఱెవ్వియులేవు. ఈ మహనీయుని ఆశ్చర్యజనకమైన జీవితచరిత్రను అతని మనుమడును తన్నామాంకితుడునైన యువకుడు రచించియుండుట నాకు జెప్పరాని యంత ముదమును మెప్పును గలిగించుచున్నది. ఆంధ్రవాఙ్మయమున ఆంగ్లసారస్వతమునందుంబోలె జీవితచరితాది రచనలు కావలసినంత తఱుచుగా లేవు. అట్టిలోపమును పూరించు గణ్యములైన ప్రయత్నములలో నిదియొకటి. శ్రీ శాస్త్రులవారి జీవితమునందలి ఆయాదశావిశేషములను వారికడన వినియుండినందువలనను వారిగ్రంథములను పఠించుట చేతను శ్రీవారి స్వకీయ భాండాగారమునందలి వ్రాతల సాయముచేతను ఈరచనవీరికి సాధ్యమైనది. ఇతరు లింత సమగ్రమును సత్యమును అయిన చరిత్రను వ్రాసియుండ జాలరు. శైలియు మంచిది; నిర్దుష్టము; స్పష్టము. ఈయువకుడును తాత యట్ల గొప్పకీర్తిని గడించునుగాక. శాస్త్రులవారి పేరువలె 'వేదము' వారి ఎల్లరపేర్లును మనభాష ఎంతకాలముండునో అంతవఱకు దేదీప్యమానముగ నుండును గాత.

కట్టమంచి రామలింగారెడ్డి.
పద్మప్రభాస, చిత్తూరు.
11 - 11 - 1943