Jump to content

వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము

ఉపోద్ఘాతము

ఆంధ్ర వాఙ్మయమునకు పందొమ్మిదవ శతాబ్ద్యుత్తరార్ధమున నూతనవికాసము కలిగినది. అట్లే దేశమందంతటను, ఒక్క భాషకే అననేల, పెక్కింటికి నూతనోజ్జీవము కలుగజొచ్చినది. మదరాసు విశ్వవిద్యాలయ స్థాపనము, ఆంగ్లవిద్యాప్రాబల్యము, పత్రికాప్రచారము, పాశ్చాత్యనాగరికతాప్రాచుర్యము మున్నగు ననేకకారణములచే జనులరుచులు వేషభాషలు మాఱజొచ్చినవి. అంతకుముందు దేశమందులేనివి, వాఙ్మయమునకు జీవనౌషధములు, ముద్రాయంత్రములు వెలయజొచ్చినవి. దేశమంతయు మేలుకొనందొడంగినది. అట్టి యాసంధికాలమున పలువురు పండితులును, వర్తకులును, సంస్కృతాంధ్ర గ్రంథములను, కనబడినవానినెల్ల వీలున్న పరిష్కరించి, లేకున్న దొరకినది దొరకినట్లుగా ముద్రించి, అదేయదనుగ హెచ్చు వెలలకు విక్రయించుచుండిరి. కవులును కొందఱు ఆంగ్లవిద్యా సంపర్కముచే నూతనమార్గములలో కవనములకుం దొడంగి, తత్పూర్వము ఆంధ్రమున లేనివానిని, నాటకాదులను ఆంగ్ల గీర్వాణాదిభాషలనుండి యనువదించుచుండిరి.

ఇట్లు క్రొత్తయావేశముతో రచించు నీకవులు పెక్కు ప్రమాదములకు లోనగుచుండిరి. సంస్కృత గ్రంథముల ననువదించువారు మూలమును చక్కగా అనుసరింపకయు ఔచిత్యముం బాటింపకయు, పైగా గీర్వాణగ్రంథముల యాంగ్లానువాదముల నాథారముగాగొని అనువదించియు పలుపాట్లు పడుచుండిరి. అప్పటికి స్వతంత్ర నాటకము లింకను వెలువడ లేదు; వచనగ్రంథములు వ్రేళులపై లెక్కపెట్టదగినవిగా నుండినవి; కవనము ఇంకను ప్రాచీనమార్గమున పాడిన పాటయే పాడుటగా నుండినది. అట్టి యీకలమున శ్రీ వేదము వేంకటరాయశాస్త్రులవారి యాగమనము ఆంధ్రవాఙ్మయమున నొక క్రొత్త యుగమును సూచించుచున్నది. గద్య పద్య నాటక విమర్శకాది విషయములలో వారుచూపిన మార్గములు పెక్కులు.

శ్రీ శాస్త్రులవారింగూర్చి నేటిరచయితలు పరిపరవిధముల వ్రాయుచున్నారు. శాస్త్రులవారు అసాధువాఙ్మయమును పూర్తిగా నిరసించినారు. అందులకు కసితీర్చుకొనుటగా వారిని కొందఱు నిరంతరము విమర్శించుచున్నారు. శాస్త్రులవారి గ్రంథములు విమర్శకు గుఱియైనట్లు ఆధునికులలో నెవరి గ్రంథములును కాలేదనుట అతిశయోక్తికాదు. అదిపనిగా శ్రద్ధాళువులు వారిగ్రంథములం జదివి, రసము గ్రహించి, తా మభివృద్ధినంది వారిని దైవమువలె కొనియాడువారును, అట్లే ఇతర కార్యములను మానుకొని అదిపనిగా నిరంతరము వారిగ్రంథములను పరీక్షగావించి, ఏవైనను, అచ్చు పొరబాట్లుగాని, ఏమఱుపాట్లుగాని దొరకిన నిధి దొరకినట్లు సంతోషించుచు వారిని దూషించు వారును కనబడుచున్నారు. శాస్త్రులవారు ఆంధ్రవాణి కొనర్చిన సేవను గుఱించియు, వారు, చూపిన నూతనమార్గ ములం గుఱించియు, నేటి యాంధ్రవిద్యార్థి లోక మేమియు నెఱుంగదు. కొందఱకు పెద్దలకే, శాస్త్రులవారు గొప్పపండితులనుట తప్ప, వారేమి గ్రంథముల రచించినదియు తెలియదు. నేటి యాంధ్రవాఙ్మయమునందలి నూతన రచనావిధానముల కెన్నింటికో వారు మార్గదర్శకులై యుండ, తెలియని కొందఱు, ఇతరులు చూపిన మార్గములను వారనుకరించిరని సయితము వ్రాయసాగిరి. శాస్త్రులవారికి ప్రసన్నులుకాని కొందఱు నిరంతరముచేయు ప్రచారముచే, శాస్త్రులవారింగూర్చి దురభిప్రాయము లేర్పడుటకుసయిత మవకాశము కలుగుచున్నది. ఇట్టి సందర్భమున పలువురు శాస్త్రులవారి జీవిత విశేషముల నెఱుంగం దలంపుకొని యుండుటచే ఈ చిన్నిజీవితచరిత్రను కూర్చితిని ఇయ్యది సమగ్రముకాదు. అట్టిది వ్రాయుట గొప్పపని, కాలముపట్టును; అందులకు చాలకృషియు అపేక్షితము. శాస్త్రులవారికి వారిమిత్రులును, సమకాలిక పండితవర్యులును రచించిన జాబులలోని విశేషవృత్తాంతములనెల్ల ప్రకటింతునేని ఈ చరిత్ర బృహత్కథయంత పెరుగును, ముద్రించుటయు ఈ కాగితముల కాటకములో కష్టమగును కావున నేను నిరంతరము వారి శుశ్రూషలో వినుచుండిన విశేషములను, వారి ముద్రితాముద్రితగ్రంథములయందే అటనట చెదరియున్న వారి వ్రాతలను "ఒక్కచోటనె యొడగూర్ప నుత్సహించి" కేవలమొక జాపితాగా నీచరిత్రను వ్రాయుచున్నాడను.

_________