Jump to content

వేదము చరిత్రయా?

వికీసోర్స్ నుండి

వేదము చరిత్రయా?

Is Rigvada a history?

వేదభాష .

వేదము మతగ్రంథ మనుటకంటెను చరిత్రయనుట సమంజసమని నే నింతకుమున్ను వ్రాసినాను. చరిత్రాంశములు హెచ్చుగ నందుండుట చేతను నప్పుడు వ్రాయబడిన యితర చరిత్రలు కానరాక పోవుటచేతను హిందువులకు ఋగ్వేదమే ముఖ్య చరిత్రగ నున్నది, హిందువులలోఁ జరిత్రలు లేవనియు చరిత్రలు వ్రాయునం తటి శక్తి వారికి నుండలేవనియు పాశ్చాత్యు లభిప్రాయపడినారు. అంతయేల బౌద్ధ యుగమునకును నార్యులకు వ్రాతయేయుండ లేదని పాశ్చాత్యు లనేకులు పలుకు టయగాక తమగ్రంధములందు వ్రాసినారు, కావున వారియభిప్రాయము తప్పని చూపుటకునై వేదభాషను గుఱించియు వారికీ వ్రాఁతయుండినదియా లేదాయను విషయమును గుఱించియు యించుక వ్రాయఁబూనెద. ఇపుడు మనకు నుండు సంస్కృతభాషకు సమమైనదియే దేవనాగరి భాష, ఆ రెంటికినిఁగల తారతమ్యము బహుస్వల్పము, ఆ స్వల్పభేదము సైతము వేదయుగమునకుఁ బిదపఁబుట్టిన వ్యాకర ణముల ననుసరించి కలిగినది. వేదఋక్కులన్నియు సనాతన దేవభాషలో నున్నవి. దేవభాషకును నిప్పటికీ సంస్కృతభాషకును గల భేదము తెలియుటకునై యిచట నొక యుదాహరణ మిచ్చెదను.

1. 2. 1 వేదము. వాయవా యాయాహి దర్శతా, యిమి, సోమా అరంకృతా, తేషాంపాహి శృధీ హవం .

దానికి సంస్కృత రూపము వాయవా యాయాహి దర్శనీయా, యిమి, సోమా, అలంకృతా, తేషాం, పిబా, శృణూ హవం ,

పై ఋక్కులోని నాలుగు శబ్దములయొక్క రూపములు సంస్కృతంబున మారినవి.

పైరీతిగ శబ్దములలో నించుక భేదమగపడును. ఇట్టిభేదములు సనాతన భాషలలో నుండుట సహజమేను. "ఛాసరు" కవిగ్రంథమును జదివినవారికి, నా భాషకును నిప్పటి యింగ్లిషు భాషకును నెంతవ్యత్యాసముండునది తెలియును. సంస్కృతము వ్యవహారభాషగ నెప్పుడు నుండలేదని కొందఱు పాశ్చాత్యు లభి ప్రాయపడినారు.. సంస్కృతభాష మేలైనది కాదనియు నా భాషలో నొకవస్తువునకు నొకమాటయగాక యనేకశబ్ధములున్నవనియు కొందఱి యభిప్రాయము, ఇలీటు భాషకుఁ బేరిడిన పాశ్చాత్యపండితుల యభిప్రాయము ఖండింప నితర పాశ్చాత్య పండితుల యభిప్రాయ మిచటవ్రాసెదను

సంస్కృత ప్రశస్తి

"సంస్కృతభాష యత్యాశ్చర్యకరమైనదనియు గ్రీకుభాషకంటెను బుష్టి కరమైనదనియు లాటిన్ భాషకంటెను శబ్దబాహుళ్యము గలదనియు Sir W. Jones గారభిప్రాయ మిచ్చినారు. సంస్కృతమున నొక సమస్తపదము 152 పదముల కూడికకలదిగ నున్నదని వారే వ్రాసినారు. అంతకంటెను హెచ్చుగ ప్రొఫెసర్ బాపుగారు తాత్పర్యమిచ్చుచు నతిసౌందర్యమైనట్టియు ప్రతిధారాళముగఁ బ్రవ హించునట్టియు భాష సంస్కృతమని పలికినారు. భాషలలో భాష సంస్కృతభాష యని మాక్సముల్లరుగారి తాత్పర్యము. సంస్కృతభాష నన్నిటనిండి, పుష్టిగనున్నది కావున దీనికి సంస్కృతమను శబ్దము సార్థకపడినదని జన్మ పండితుఁడు ష్లీగల్ వ్రాసినాఁడు, ఇటులుండఁగ జేమ్సమిల్లు గారు తమకు హిందువులపైఁగల దురభిప్రాయ మనుసరించి పలుకుచు "భాష గొప్పదనుటకు సాదృశ్యమొక వస్తువునకు నొక పేరు మాత్ర ముండవలెనుగాని యంతకంటెను హెచ్చుగ నుండరా పని వ్రాసినారు. వారి తాత్పర్యమే నిజమైనచో పద్యకావ్యముల గతియేమి? వాక్పటుత్వ మెచటనుండును? భాషాభివృద్ధి యెటులగును? ಬುದ್ಧಿ యెటుకుశలతఁగనును? సౌందర్యాలంకారములును శక్తియు పుష్టియు లేకయున్న భాషగతి యేమియగునోయని పాశ్చాత్యుల నేకులు ప్రశ్నించినారు. సంస్కృతము లాటి కంటే నధిక గౌరవముగల భాషయనియు నాభాషలో సూర్యునకు ముప్పదియుఁ జంద్రునకు నిఱువదియు గృహమునకు నిలువదియుఁ భాషాణమునకు నాఱునుఁ బర్ణమునకు నైదునుఁ గోఁతికిఁ బదియు గోవునకుఁ దొమ్మిదియు శబ్దములున్న పని లిపేఠీపోలైకో గారు మెచ్చినారు. దేవనాగరీ భాషాక్షరములనుండి పాశ్చాత్య భాషాక్షరము లేర్పడెనని బోన్సుగారి తాత్పర్యము, గ్రీకుభాష సంస్కృతమునుండి పుట్టినదని పోకాక్కు గారి యభిప్రా యము. "సంస్కృతమునకును గ్రీకుభాషకును నైరాన్లభాషకును సంబంధము విశేషముగ నున్న దనియు శబ్దవాక్య పల్లవములు నొక్క తీరుగనే యున్న వనియు డాక్టర్ ప్రిచర్డుగా రభిప్రాయపడినారు. సంస్కృతములో నొకటినుండి పదివరకు గల సంఖ్యల నామములే యనేక భాషలలోఁ జేరినవనియు ప్రపంచములో నొకా నొక కాలమున సంస్కృతమే వ్యవహార భాషగా మాటలాడుచుండిరనియు భావు గారు వ్రాసినారు. సంస్కృతలిపి యతి పురాతనకాలమునకుఁ జేరినదని వెబ్బరుగా రభిప్రాయపడినారు. "హిందువులకు భాష యెంత కాలమునుండి యున్నదియో యంతకాలమునుండియు వారికి వ్రాఁతయుండెనని డాక్టర్ విల్సన్ గారు లిఖించి నారు. అక్షరముల సాహాయ్యమువలన వ్రాయువ్రాఁత యిండియాలోఁ - బురాతన కాలమునుండి యున్నవనియును శాసనముల కేగాక దిన వ్యవహార చర్యలందు సైతము వ్రాఁత విశేషముగ నుపయోగించుచుండిరని హీరన్ గారభిప్రాయపడిరి. గోల్డుస్టక్కరు, రాత్తు, విట్నీ, మొదలగువారు " ప్రాతిశాఖ్య రచించిన ఋషులు తమయెదుట గ్రంథములులేక దానిని వ్రాసియుండరని నిర్ధారించినారు.

లిపియుండెనా?

క్రీస్తుశకమునకు 350 సంవత్సరములకు మున్ను హిందువులకు వ్రాఁత పుస్తకము లెవ్వియును లేవని మాక్సముల్లరు గారు వ్రాసిన వ్రాత పిచ్చి వ్రాఁత యని పలువురు పండితు లభిప్రాయము. బేలీగారి గణిత మనుసరించి చూచినచోఁ గ్రీస్తుశకమునకు 8000 యేండ్లకు మున్ను హిందువులు క్షేత్రగణితములోను జ్యోతి శ్శాస్త్రమందును ప్రావీణ్యముఁ గాంచి యుండినటు లేర్పడును, అక్షరములును సంఖ్య లునులేక వారంతటి ప్రావీణ్య మార్జింపఁగలరా! మాక్సముల్లరుగారి యభిప్రాయమే నిజమైనచో జనులు బ్రాహ్మణములను జ్ఞప్తిలోనుంచుకొని యుండిరనెడి యర్థ మగును. బ్రాహ్మణములుండు రీతినిఁబట్టి యంతటి గ్రంథములు జ్ఞప్తిలో నుంచు కోనుట సాధ్యమే కావని ప్రొఫెసర్ మాక్సడన్కర్ అభిప్రాయపడినాఁడు. ఆక్సఫర్డు బాలియల్ కాలేజి సంస్కృతోపన్యాసకుఁడగు శ్యామజి కృష్ణవర్మ "వేదముల కాలమునుండి యార్యులకు లిపియుండెననియు వేదములలో నేమి బ్రాహ్మణములలో నేమి సూత్రములలో నేమి " వ్రాఁతకు" సమానార్థము నిచ్చు శబ్దములున్న వనియు పాణినికి బహుదినములకుమున్ను గద్య పద్య మంత్రగ్రంథము లుండె ననియు కానిచో పాణిని యంతటి వ్యాకరణము వ్రాయుట సాధ్యము కాదనియు వ్రాఁతలేనిది గొప్పవచనగ్రంథములు కంఠతః నేర్చికొనుట యసాధ్యమనియు నభి ప్రాయ మిచ్చినారు. శ్రుతియను శబ్దార్థమునుబట్టి వ్రాత యుండ లేదనిన స్మృతిగతి. సైత మట్టిదియ యగును. స్మృతులు వ్రాయఁబడినట్టివియని సకలురయభిప్రాయము..

ఋగ్వేదములో నొకభాగమున "వాక్యములుఁ జూచియుఁ జూడక, వినియును వినక ” యని యున్నది. వాక్యములుఁజూచి యనుటలో వ్రాతయుండె ననెడి యర్థ మిమిడియున్నది. మఱియొకవిషయముఁ సంఖ్యలు లేనిది కోటివరకును లెక్కపెట్టుట సాధ్యము కాదు. వ్రాత తెలియని కాలమున గ్రీకువారు. దళసహస్ర మునకంటె హెచ్చుసంఖ్యకుఁ బేర్లెఱుంగక యుండిరనియు రోమ్ వారు సహస్రమున కంటె హెచ్చుసంఖ్య తెలియకయుండిరనియు చరిత్రకారులు వ్రాసినారు. గ్రీసు దేశస్థు లార్యుల భాష మెచ్చుకొనుచుండిరనియు చెట్ల తొక్కు (పట్ట) పైన నార్యులు వ్రాయుచుండిరని "కర్టియస్సు"న్ను దూదిని గొట్టి దానిపై నక్షర ములు వ్రాయుచుండిరని "నియార్కస్సు"న్ను తెలిపినారు. ఆస్సరియాలో నిపుడు దొరుకు నిటికె పెల్లల పైనగల వ్రాఁతఁ జూచినచో నిప్పటికి 5000 వేల యేండ్ల క్రిందట నా దేశములో వ్రాఁతయుండెనని స్పష్టమగుచున్నది. ఆస్సిరియా వారు తమ నాగరీకత నార్యులనుండి నేర్చిరని నేనింతకుమున్ను వ్రాసినాను కావున నార్యులకు నిప్పటికి నైదు వేల యేండ్లకుమునుపే వ్రాఁతయుండెననునది స్పష్టము,

చరిత్రలుండెనా?

ఋగ్వేదాదులయందు చరిత్రాంశములు చాలుగనుండినను నది మత గ్రంథమని తలంచిన కారణంబునను నందుండు స్వరోచ్ఛారణ క్రమమును నోట నేర్వ కున్న జ్ఞప్తిలోనుంట యసాధ్యమయియుండిన కారణంబుననునార్యులు దానిని గురు మూలకముగఁ గంఠత నేర్చుచుండిరి. కావుననే యార్యులు మిగతచరిత్రగ్రంధము లనే కములు పోయినను వేదములు నిలిచినవి, మనలోఁ గాలమును దెలుపు పూర్వ చరిత్రలు లేవనుట నే నమ్మను, ఉండి, పోయిన వననగును. ఉండినవికొన్ని పరస్పర విరోధములతో నిప్పటి హిందువులబలెఁ బెనఁగులాడుచున్నవి. పరమతస్థులు మన పురాతన పుస్తక భాండాగారములను పరశురామ ప్రీతిఁ గావించిననునది చరిత్ర లభ్యసించినవారికెల్ల విదితము, హైందవ పుస్తకములపై “ఔరంగజేబు ”న కెంతటి యసహ్యముండినదియో సకలు రెఱుఁగుదురు. ఆఫ్గన్ తార్తారు ఆరెబ్బు జాతులవారు గ్రీసు పర్ష్యా యీజిప్టు యిండియా దేశములందుండిన పుస్తక భాండాగారములను గాల్చుటయగాక శిల్పులు తమప్రావీణ్య ప్రదర్శనమునకునై కట్టిన కట్టడములును, జెక్కిన ఱాతివిగ్రహములును లయమొనర్చి నింద్యులైరి. అలెగ్జాండ్రియన్ గ్రంధాలయము నాశనమొనర్చినవారి దౌష్ట్యమెంత దూషించి నను తీరదు. దానినుండి ప్రపంచమున కెంత నష్టమయ్యెనో పలుక నలవికాదు. బుద్ధ గయలోఁ దొమ్మిదిమేడలు నిండిన గ్రంధములును ధర్మగంజిలోను నంతటి పుస్తక భాండాగారమును, మఱియు నోదంతిపురమున నుండిన గొప్ప గ్రంథసంచయమును, కిల్జీసేనాధిపతి మహమ్మదు బెన్ సాం అనువాఁడు నాశనమొనర్చెనని చరిత్రలు దెలుపుతున్నవి. అన్వారాలోనుండిన గొప్ప సంస్కృత గ్రంధాలయమును “అల్లాయుద్దీన్ కిల్జీ కాల్చెననియు కోహాన్ లో నుండిన గ్రంధాలయము ఫిరోజిషా టోగ్లాకు లయ మొనర్చెననియు తురుష్క పండితులే వ్రాసినారు, ఈరీతి గ్రంధ నాశనమొనర్చు చెడుబుద్ధి పరమతస్థులగు పామరులకు నొక్కటియగాదు, పూర్వకాలంబునఁ బండితులకు సైతముండినది, గ్రెగరీ గొప్పపండితుఁడగు మఠస్వామిగ నుండినను లౌక్యులు విద్యనేర్చి వ్రాసిన గ్రంధము లెల్లను గాల్పించి భస్మము చేసెను. కుమారిలభట్టు బౌద్ధుల గ్రంధముల నడుగంటఁజేసెను, జైనుల ననేకుల వాదమున నోడించి వారి గ్రంధములు వారిలో మునింగి పోఁజేసిరి. ఈ దేశము గొప్పది కావున మూలంబడిన కొన్ని పూర్వగ్రంధ ములు హత శేపములుగ నిలిచినవి. హిందువులలోఁ జరిత్రలు వ్రాయువాడుక లేదని పలుకునది సాహసమో లేక యజ్ఞానమో, విశేషప్రయత్నము లొనర్చి యన్వే షించినచో రాజతరంగణినిఁబోలు మఱిగొన్ని చరిత్రములు దొరకవచ్చునని ప్రొఫెసరు హీరన్ గారు వ్రాసినారు. ఆస్సిరియా రాజగు Ashur Bani Pal " య వాఁడు దేశ దేశమునకును బండితులనుబంపి యిటికె పెల్లలపైన వ్రాయించి తన గొప్పపుస్తక భాండాగారంబున గోడలలో భద్రపఱచియుంచిన గ్రంధములెల్ల నిపుడు భూమిఁద్రవ్వఁగా దొరుకుచున్నవి. ఈపుస్తక భాండాగారముఁగల భవ నము యొక్క పటము History of Nations ” Part 7 లో హచ్చిన్సన్ గారు ప్రకటించినారు చూడనగును. వంశావళిని వ్రాసి రక్షించు "జాగా" యను జాతివారు రాజపుటానులో నిప్పటికీనున్న వారని విల్సన్ వ్రాసినాఁడు. పూర్వకాలమునుండియు వ్రాయుచుండిన యిట్టి చరిత్రాంశము లచట నచట నుండిన కారణంబుననే టార్డు దొరగారు " Annals of Rajastan, యంతటి చరిత్రము వ్రాయుటకు సాధ్య మాయెను. ఋగ్వేదము ప్రాచీనార్యుల చరిత్రములు గలది. ఇటీవల నుండిన యార్యుల చరిత్రములు పురాణములు దెలుపుచున్నవి. వీని నెల్లను సమపఱచి ప్రారంభము నుండియును నొక గొప్ప చరిత్ర వ్రాయుటకు హిందువులకు నోపిక లేకయున్నది. దీనికిఁ గారణము లనేకములున్నవి. వేదమెటు చరిత్రయయినదియు నాకు సాధ్య మైనంతవరకు వెదకి యీ క్రింద వ్రాయఁబూనినాను. (1) ప్రాచీనార్యు లెచట నెచట నుండిరి? (2) ఎటు జీవించుచుండిరి? (8) వారికి నుపయుక్తమైన సాధనము లెవ్వి: (4) వారికిఁ బశుసంపద యుండెనా? (5) జలవసతు లుండెనా? (6) వారు శాత్రవుల బాధకుఁ జిక్కి యుండిరా? (7) వారు స్వాతంత్య్రవృత్తినుండిరా లేక రాజుల యేలికకు లోఁబడియుండిరా? (8) వారి ముఖ్యాహార మెద్ది? (9) వారు మాంసభక్షకులా? (10) త్రాగుడుపోతులా? (11) క్రూరులా శాంతస్వభావులా? (12) వారి స్త్రీ లెట్టివారు? (13) వారి వివాహాది కర్మము లెటులుండెను? (14) వారికి శిక్షాస్మృతి యుండెనా? (15) వారికి రాజులుండిరా! (16) యుద్ధము లుండెనా? (17) దాయభాగ శాస్త్రములుండెనా? (18) వారి స్త్రీలకు నాభరణాదు లుండెనా? (19) వారి విద్యాభివృద్ధి యెట్టిది? (20) వారికి జూతులకట్టుబాటుండెనా? (21) వారు ద్యూతాది దుష్టకర్మ లోలురా? (22) వారియందు వ్యభిచారదోష ముండినదియా? (28) ఇప్పటివారికిఁ దెలిసినన్ని శాస్త్రవిచారములు వారికిఁ దెలిసి యుండెనా? (24) వారేమి మోటువారా నాగరికులా? (25) వారికి సముద్రయాన ముండెనా? ఇత్యాద్యనేక విషయములను గుఱించి వ్రాయుటయ చరిత్ర. పై విష యములు క్రమముగ నొక్కొక్కటిని గుఱించి వివరముగ వ్రాయవలెననిన నొక్కొక విషయమే యొక యుపన్యాసంబగును కావున పైఁ గ్రమము నంతగఁ బాటింపక, విషయములు వదలక తగినంతవరకు నిచట వ్రాసి మిగతభాగము వేఱక యువ న్యాసంబులోఁ జేర్చెదను.

ప్రాచీనార్యుల జననస్థానమును గుఱించియు వారుండిన దేశములను గుఱించియు వారి నాగరికతను గుఱించియు నేనిదివరలో "The world is peopled by Aryans and influenced by Aryan Civilization" యను నుపన్యాసంబున వ్రాసినాను. మిగతవిషయము లిచట వ్రాయఁబూనెదను.

ఆ ర్యు ల ము ఖ్య వృ త్తి

ఆర్యయనుశబ్దములో నే ప్రాచీనార్యుల జీవనమెటు జరుగుచుండెనను విషయముఁ దెలియవచ్చును. “ఆర్” ధాతువు దున్నుట యనెడి నర్థమిచ్చును. కావున ప్రాచీనార్యులు కేవలకృషి కర్మవలన జీవించువారని తెలియవచ్చుచున్నది. కృషికర్మవారి జీవనోపాయముగ నేర్పడెను కావున వారికిఁ బశురక్షణ మవశ్యక మయ్యెను: స్థిరముగ నొక్కచోటనివసించి పశువులనుగట్టుకొని భూమిని దున్ని బ్రదుకువారని "యార్య" శబ్దమునుండి మనముగ్రహింపనగును. ఆర్యులకు నా జన్మశత్రువులుగ ట్యురేనియలుండిరి. వీరెక్కాలముననో యార్యులతోఁ గల హించి వేఱ్పడి వారిపై ద్వేషముఁ బెంచుచు వారికి నిఱుగుపొఱుగువారయి యుండిరి. ట్యురన్ శబ్దము గొఱ్లెలను రక్షించువారని యర్థమగును. వీరుస్థిరముగ నొక్కచోటనివసింపక యిండ్లు వాకిండ్లు లేక దేశద్రిమ్మరులుగ నుండిరి. అడవులు పర్వతములు సంచరించుటకు వారికి గొఱ్లె లుపయుక్తములయినరీతిగా బశువు లుపయుక్తములు కావయ్యెను. ప్రాచీనార్యులలో నైరాన్ లు చేరినవారు.అనేక సహస్రవత్సరంబు లార్యులు తమ జననస్థానమునందుండి పిదప గాశ్మీరముఁ జేరిరి, జననస్థాన మార్యులువదలినందులకుఁ గారణము లేచరిత్రకారుఁడును దృప్తికరముగ నుడువఁడు. ట్యురేనీయలబాధయే ముఖ్యకారణమయి యుండనగునని నే నూ హించెద. భూరిక్షామమని కొందఱనియెదరు. జనబాహుళ్యమని కొందఱాడెదరు. కారణము లెవ్వియయినను గానిండు, కాశ్మీరములో నార్యులు బహుకాల ముండి రనునది నిస్సందేహము. ఈ కాశ్మీర మొకానొక కాలంబున నీటిలో మునింగియుండిన కారణంబున నా ప్రదేశమంతయును బురద నేలగనుండెను. కశ్యపఋషి బోధితులై యార్యులు బురద నేలను సమపఱచిరి కావున నాదేశము కాశ్యపియని పిలువంబడు చున్నది.

భూ గో ళ ము, Geography.

ఋగ్వేదములోని కొన్ని ఋక్కుల యర్థముదెలియుటకు వేదభూగోళ మెఱుగుట యవశ్యకము. అటులనే యక్కాలమున నుండిన యనార్యులెవరయిన దియు తెలియకయున్న నిపుడు మనవారర్థము చేసికొను రీతిగ వారు భూతప్రేత పిశాచరాక్షసాదులని తెలియుటకు గారణంబగును. సృష్టికి సంబంధించిన జనులకు నారీతి నీచముగ సృష్టిలో లేని పేర్లెటు లార్యులు పెట్టినను విషయము సైతము తెలియుట యవశ్యకము. ఋగ్వేద రచనాంత్యకాలమునకు నార్యులు పూర్వదిశను గంగాయమునా సంగమస్థలమువరకు వ్యాపించియుండిరి. పశ్చిమమున “ఆస్సిరియా కాల్షియా” వరకు వ్యాపించిరి. ఇది "అక్కేడియన్" ల స్థానము. "సిధియన్సు బాల్ఖన్సు " యుండినస్థళ ముత్తర మేరగ నుండినది. అనఁగా నిప్పటి టర్కీ స్థానమని పిలువంబడు స్థళము, ద్రావిడులు వసించుభూమి దక్షిణముగ నుండినది. పైవివరించిన మేరలోనుండిన వారార్యులును సైరాన్ లు, ప్రాగ్దిశను గంగాతీరమువరకు వ్యాపించినవా రార్యులు, పశ్చిమమున కాల్షియా' వరకు వ్యాపించినవారైరానులు. ఆఫ్గన్ స్థాన్ బెలూచిస్థాన్ ను లందుండినవా రక్కాలంబునఁ జెడినయార్యులేను. గ్రీకులు వారినే 'ఆరియానా" లని పిలుచుచుండిరి. పశ్చిమమున నుండిన గాంధారు లార్యులుగనుండి చెడినవారు, కావున గాంధారులు నార్యులు గుఱ్ఱములను బెంచు వారని నింద్యముగఁబలుకుచుండిరి. ఆర్యులకును గాంధారులకు నపుడపుడు యుద్ధ ములు జడగుచుండెను.

పంచజనుల వివరము,

ఋగ్వేదమునం దచటనుండు ఋక్కులలో " పంచకృష్ట్యా, పంచ క్షిత్యా, పంచకార్షణ్యా, పంచజనా, పంచభూమా, పంచజాతా యను శబ్దములు వచ్చుచున్నవి. ఈ విభజనలనునవి యప్పటికాలమున బలవంతులుగనుండిన యధి కారులనుఁబట్టి యేర్పడినదని కొందఱియభిప్రాయము. (1) త్రిచ్చు (2) వురు. (8) అను (4) యదు (5) దూర్వసులనువారే బలవంతులుగనుండిన యధికారులు, సాయనాచార్యుల వారు పైశబ్దములు బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర, నిషాదుల కన్వయించునని పలికిరి. నిరుక్తకారుఁడగు యాస్క' తన కంటెను పూర్వముండిన పండితాభిప్రాయములను స్వీకరించి యాశబ్దములు గంధర్వులు, పితృలు, దేవులు అసురులు, రాక్షసులకు నన్వయించునని పలికిరి. ఈ జనులవిషయమున నేకాభి ప్రాయము లేకయున్నది. పైన నా చేనుడువంబడిన యధికారులకు సన్వయించునని నే నూహించినాను.

పై యధికారులుండిన దేశముల నేర్పఱుప నిపుడు శాశ్వతములుగ నిలి చిన నదులవిషయముఁ దెలుపుట యవశ్యకము.

న దు ల వి వ ర ము

ఋగ్వేదములోఁ బదియ మండలము 75 సూక్తములోఁగల నదీస్తుకు లీరీతి బలుకుచున్నవి.

"జల దేవతలారా! యజమాను నింటనుండు కవి మిమ్ము నుతించు చున్నాఁడు, మీ రొక్కరొకరు సప్తశాఖలయి మూడుప్రవాహములుగఁ బ్రవహించు చున్న వారు. అందఱిలోను సింధూనది మిగుల గాంభీర్యముగలది"

"సింధూ! ధనధాన్య ప్రదేశముగల, దిశకు నీవు స్రవహించునపుడు వరుణ దేవుఁడు నీకుఁగాను మార్గమేర్పఱచెను. నదుల కెల్ల నీవు రాజుగ రాజిల్లు చున్నావు"

" సింధూ! గోవులు పొదుగులో: బాలునించుకొని దూడలసరసకుఁ బోవురీతిని, మిగత నదులు జలమునించుకొని నిన్ను జుట్టుచున్నవి. రాజు సేనను గూడి యుద్ధమునకుఁ బోవురీతిని సుభయ పార్శ్వములోను నదుల నిడుకొని పురో గామిగ నీవు నడచుచున్నావు"

సింధూనదీ! నీవు ప్రారంభమునఁ ద్రిస్తమతో సంగమించితివి. పిదప సుసార్తు రసాస్వాతి వీరితోఁ గూడితివి. కూభా గోమలతో గలసిన క్రుమానుగూడి మహా తనూనదినిఁ జేరితివి. ఈ నదుల నెల్లఁ గూడికొని యొకరథములో నీవు నడచుచున్నావు.

దేశచరిత్రల ప్రావీణ్యముగల సండితునకుఁగాని యీయొక సూక్తము నుండి యార్యుల వాసస్థానము లూహింపనుగాని వేదములో బలుకుబడిన నదుల నామము లిప్పటినదుల నామములతో సరిపోల్చుట గాని కష్టతమము. సింధూనది నామమును దాని యుపనదుల నామములును ననేక ఋక్కులలో నుదహరింపఁ

బడినవి. సరస్వతీనది యతివిచిత్రముగ వర్ణింపఁబడినది,

స ర స్వ తి యె ద్ది ?

"ఆహారవస్తువులు పుష్టికరముగ సమర్చుకొని జలధ్వనితో సరస్వతి వచ్చుచున్నది. ఇత్తడికోటవలె మమ్ముఁ గాపాడుచున్నది. రథమునెక్కి యుద్ధము నకుఁబోవు యోధునింబలె , నతివేగముగఁ బోవుచున్నది. మిగత నదుల నెల్ల వెనుక వదలి ముందు నడచుచున్నది, యని యొక ఋషి వర్ణించినాడు. " నదీజలములలో నిర్మలమై పర్వతములనుండి సముద్రమునకుఁ బాఱుచున్నది. విశాలమగు ప్రపంచ మునకు సౌభాగ్యము లిచ్చుచున్నది. దానితీరములందుండు వారికి బాలునుఁ దేనెయునిచ్చును.

నడు ఈ సరస్వతియే "సింధూ" నదియని యాంగ్లేయులు గొందఱు తలఁచి నారు. ఏలయన; సింధూనది యన్ని నదులలోను గొప్పది. పరిష్యాలోనుండు గొప్ప నది పేరు హరక్వెతి. ( Helmond ) ఆ పేరు సరస్వతీ నామమేను. గొప్ప లకు సరస్వతియనుట సహజమను కారణమును దెలుపుచున్నారు. వేదములోని గాని మఱి యేగ్రంథమునందుఁగాని సింధూనది సరస్వతియని పిలువంబడ లేదు. సరస్వతి ప్రత్యేకనది యనియు దాని చెల్లెలు దృషద్వతీయనియు నుడువంబడినది. బహుశా యీనదు లొకానొక సమయమున గొప్పనదులుగ నుండి సముద్రమునకుఁ బోవుచుండెను గాఁబోలు కాలాంతరముల పైన సన్నగిల్లి రాజపుత్రస్థానపు టెడా రులలో నదృశ్యములైయుండును, జనన స్థానమున నిప్పటికిని సరస్వతీ నామమున చిన్ననది యున్నదనియు నంత్యభాగమందది ఘూర్ఘారని పిలువఁబడుచున్న దనియు నుడివెదరు. పై రెండునదుల మధ్య ప్రదేశమే " బ్రహ్మావర్త " మని పిలువఁబడు చున్నది. ఈ దేశమునకుఁ బశ్చిమదిశ నుండునదే " పంచనదీ " తీర భూమి, పంజాబు, సరస్వతీ దృషద్వతుల మధ్యనుండు బ్రాహ్మణులను జేరి ప్రపంచజను. లెల్లరు ధర్మాధర్మ సూక్ష్మములు తెలియవలెనని మనుస్మృతి పలుకుచున్నది. పంచనదీతీర భూములు తెలియ ఋగ్వేద ఋక్కులలోనుండు నామములిపుడు దురవగాహములు కావున వానివివరములు దెలిపెద.

ఇప్పటి ఆంగ్లేయ నామము ఋగ్వేదనామము గ్రీకువారి నామము
1.జీలం వితస్త హైడాస్పెన్
2.చీనాబీ ఆశిక్ని అకిసినోన్
3.రావి ఐరావతి లేక పురోష్ణి హైడ్రోటన్
4.బియాస్ విపాశ లేక ఆర్యిక్య హైపానీస్
5.సట్లేజ్ శతధ్రు/ శతుద్రి జుడాడ్రస్

పైన వివరించిన యైదునదులునుగూడి మరుద్ఖృధయను నామమున బ్రవహించుచుండెను. మరుద్ఖృధయన గాలి చే వృద్ధినందునదియని యర్థము. సుసార యనఁగ సింధూనది. పై నదీతీరములందుండిన జనులెవరయినది తెలిసినంతవరకు వివరించెద.

పం జా బు న దీ తీ ర వా సు లే రా జు లు.

(1) పురూష్ణీ( Ravi ) కి నుత్తరభాగమనఁగా నుత్తర పంజాబంతయు 'పురు' యను నాయకునకుఁ జేరిన భూములు. ఈ పురపంశమునకే భరతవంశము వారని పేరు సైతమున్నది.

(2) శతద్రు ( Sutlaj ) కు దక్షిణదిశకు నుత్తరముగ హిమాలయమువరకు " త్రిక్షు” భూములు, ఋగ్వేదమున (3. 33) ఋక్కులో పురూష్ణీకినుత్తరమున

  • పురుదేశమనియు శతద్రుకుఁ బ్రాగ్దక్షిణ భూములు త్రిక్షుభూములనియు తెలుపఁ

బడినది. పురువంశమువారు భరతవంశమువారయి తుదకు 'కురు" వంశమువారైరి "త్రిక్షు” వంశమువారు బహుశా పాంచాలురని తోఁచెడు. ఈ వంశము పురాణ యుగమున సంత్యమైనది కాఁబోలు, యదుదూర్వసులు “త్రిక్షు" భూములకు దక్షిణ మునను ప్రాగ్దక్షిణములను యమునానదివరకు వ్యాపించియుండిరని యూహ కలుగుచున్నది. యదువంశమువారే సూరసేనులని పేరంది మథుర ముఖ్యపట్టణ ముగఁ జేసికొనిరి. సింధూనదికిఁ బశ్చిమభాగమున "అను " వంశమువారి 'దేశము. పైనఁబలికిన ఆరియానాయనునదే వీరి దేశము, వీరు చెడినయార్యులని చరిత్రకారులు. వ్రాసినారు. పైన వివరించిన పంచజనులుగాక మతవిషయమునను సాంఘిక విషయ ముల్లోను జెడినయార్యులు కొందఱుండిరి, గాంధారానువులకుఁ బశ్చిమభాగ భూములందు” “‘పృథులు”” పార్సూన్ ” లుండిరి. ఋగ్వేదములో నుదహరింపఁబడిన " పురుత్రిక్షుల యుద్ధమున పృధుపార్ములు త్రిక్షులపరముండిరి. పృథులనఁ బార్థి యను లు, పార్సులనఁ బారశీకులు సంపూర్ణోత్తర భాగ దేశములం. దుత్తరకురులు నుత్తర మదురాసులుండిరి. ఆర్యులదేశములను బుట్టినవారు ద్రావిడులు సిథియన్ లు అక్కేడియక్ లు, వీరితో నార్యులపుడపుడు యుద్ధ మొనర్చు చుండిరి.

ఆ ర్యు ల గు ణ ము లు

ఆర్యులత్యున్నత నాగరికతచేఁ బ్రసిద్ధికి నెక్కినవారుగనుండినను వారిగుణముల లోను మతవిధులలోను హెచ్చుతగ్గులు గలుగుటకుఁ గారణములనేకములు తట స్థించెను. ఆర్యులు సహజముగ సాత్విక స్వభావముగలవారై యుండిరనుటకు సంది యంబులేదు, మెత్తనివారయి పరులజోలికిఁబోవ నిష్టము లేనివారుగ నుండినది నిజము. కృషికర్మమును బశువులపోషణమును ముఖ్యములగువృత్తులుగ నుండిన వారనునది వాస్తవము. గృహమున సుఖవాసులై దైవాయత్తచిత్తులయి కాలముఁ గడపు చుండిరనునది యాదార్థ్యము. యుద్ధవృత్తి వారికి నిషిద్ధము. మానవరక్తముకాదు, మృగరక్తము సైతము వారు కంటఁజూడ నిచ్చయించువారు కారు. ఆహింసా వృత్తియవారి ప్రథమధర్మము. ఈగుణములు ప్రాచీనార్యులవి.

ట్యు రే ని య న్ల బా ధ లు

సుగుణ సంపదచే వారింట సుఖముగనుండుకాలమున వారికి నిఱుఁగుఁబొఱుఁగు వారిబాధలు బలమాయెను. కష్టసమయములం దొకానొకతఱి వారితో సంబంధ సం పర్కము లవశ్యకమయ్యెను. ఈసంబంధము లైరానులకు హెచ్చుగ నుండెను. ఆర్యు లకుఁ గ్వచిత్తుగ నుండెను. కావుననే యితర తెగలవారి దుర్గుణములు కొన్ని యార్యు లకుఁ బట్టుపడెను, ఇది సహజమేను. దీనినే డార్విన్ గారు సహజవస్తు గ్రహణవిధి ( Law of natural Selection) అని పిలిచిరి. ఉత్తరముననున్న సిథియన్లు మాటిమాటికి నార్యుల పైఁబడి ధనదాన్య పశువులను దొంగలింపసాగిరి. వీరాచార విహీనులు, దైవస్తుతులు లేనివారు. వీరినే యార్యులు పిశాచములనియు దొంగ లనియు నిందించుచుండిరి. ఐరాన్ లకు సైతము ట్యురేయుల బాధలు బలమాయెను. ’అహిష్మాన్ దేవ ” యను దానవునిబాధకుఁ దాళఁజాలక దైవమా! ట్యురేని యలు మాసత్వములను గొల్లఁగొట్టుచున్న వారు. ఋజుమార్గ ప్రవర్తనులయి పశువులఁ గాపాడుకొనుచును భూములు దున్నుకొనుచును, నుండువారిపై ద్వేషముఁ బెంచుచున్న వారు. వీరినుండి మముఁగాపాడుము ” అని యైరాన్ లు నుతించినారు. వీరికినించుక సమీప ప్రదేశములలోనే "అక్కాడ్లుం"డిరి, వీరిప్పటికి హెచ్చునాగరికులు కారు. సంపూర్ణ క్రూరస్వభావులుగ నుండలేదు. అయినను నీ రార్యుల నప్పుడప్పుడు బాధించుచుండిరి. వీరనేకములగు కోటలు గట్టుకొని పరులకు దుస్సాధ్యులై యుండిరి. ఈ యనార్యులకు నొక కాలమున శంబరుఁడను నాయకుఁ డుండెను. ఆర్యుల నాయకుఁడగు దివోదాసు వీనితో యుద్ధములు సలుపుచుండెను. "ఇంద్రా! నీనొకదినంబున శత్రువులఁ దొంబదితొమ్మిదికోటలు పడఁగొట్టితివి”

యని యొకఋషీ పలికినాఁడు;

ద్రా వి డు లొ క ది క్కు

ఇఁక నార్యుల భూములకు దక్షిణమున ద్రావిడులుండిరని యొక పురా తన చరిత్రకారుఁడు వ్రాసినాఁడు. పూర్వమునఁ బాటలయను నొకపట్టణము సింధూ నది దిగువభాగమున నుండెననియు నది రేవుగ నుండిన కారణంబున నిండియాలో న గు " మజ్లిన్ " బట్టలా రేవునుండి యితర దేశములకుఁ బోవుచుండెననియు నీ పట్టణవాసులు నాగజాతికిఁ జేరినవారనియు వీరి రాజ్యస్థాపకుఁడు వాసుకి యనియు వీరే ద్రావిడులనియు గ్రీకు చరిత్రములో నున్నదని రాగోజిన్ వ్రాసినది. ద్రావిడులకును ప్రాగుత్తర చైనావారికిని విశేష సంబంధ మున్న రీతిగ శబ్దతత్త్వజ్ఞులు ( Philologists )ను మానసగుణ విచారతత్త్వజ్ఞులు (Psychologists) ను తెలుపు చున్నవారు, అక్కాడ్లుకును ద్రావిడులకును చైనావారికినిఁ గేవల సంబంధములున్న వనియును వీరందఱు నాగులను బూజించువారనియు చరిత్రకారులు వ్రాసినారు. ద్రావిడులును అక్కాడ్లును ట్యురేనియలనుండి చెడుగుణము లనేకములు నేర్చిరి.

ట్యు రే ని య న్ లు

ట్యురేనియన్ లు ప్రతివస్తువులోను నెద్దియో యొక భూతమున్నదని నమ్మి యుండిరి, వా రైంద్రజాల విద్యలోను క్షుద్ర విద్యలోనుఁ బ్రావీణ్యముఁ గలిగి యిత రులను భ్రమపెట్టుచుండిరి. ఇట్టివారు " షామన్సు" అని పిలువఁబడుచుండిరి. వీరు దయ్యములు భూతములున్నవని నమ్మువారు. వానిని వదలింపు మంత్రము లుచ్చరించువారు, తాళ్లు, ఱప్పలు, చెట్లు, చేమలు, భూతప్రేత పిశాచముల యాహ్వానోచ్చాటన తంత్రములు క్షుద్రదేవతల సేవలు పశువధలు మానవబలులు నీ జాతివారినుండియే ప్రపంచంబున వ్యాపించినది. సామీప్య సంబంధమున నీ గుణ ములుకొన్ని యార్యులకు సైతము పూర్వకాలంబుననే పట్టువడెను. ఈ చెడుమత ములనుబట్టి బ్రాహ్మణములలోని యాగమకర్మములు బలమయినపుడు సహింపఁ జాలక జరదష్ట్రు ఋషి (Zoraster) యైరాన్ లకు నొకమత మేర్పఱచెను,

ఆ క్లా డ్లు

మనపురాణములలోని యనేక గాధలు పాతాళము, నరకము, యమదూతలు, పితృవాసములు ప్రళయవార్తలు మొదలగునవి యాకార్డుల మతమునకుఁ జేరినవి. ఆర్యులు మధ్య యేప్యాలోనుఁ గాశ్మీరములోను నుండునపుడే వారికి పై మతములు గొన్ని పట్టుపడెనని నే నెంచెద. కాశ్మీర మార్యులువదలి పంజాబు చేరు కాలమున దారిని దస్యుల బాధలు బలమాయెను. ఋగ్వేదమునం దీజనులను గేవల పిశాచ ములుగ వర్ణించినారు. అందఱిబలేనే వారుసు మానవులు నాగరికత లేనివారు క్రూరస్వభావులు, ఆటవికులు. వీరి పేరు ఋగ్వేదములోఁ బలుమారు వచ్చుచున్నది. దస్యులన జనులని యర్థము.

ద స్యు లు

రాక్షసులునుగారు పిశాచములునుగారు. ఐరాసుల జన్డవస్థలో వీరిని "దహ్యు" లని పిలిచిరి. అఖ్ఖెమీనియన్ల శాసనములో సైతము వీరికి దహ్యులని పేరున్నది. వీరార్యులను బ్రారంభమున బాధించుచుండిరి కావున "దస్య" శబ్దార్థము శత్రువులకుఁ బేర య్యెను.

ద స్య నా మ ము న క ర్ణ భే ద ము లు

వీరి నార్యులు జయించినపిచవ నార్యుల దాసులైరి. అపుడు "దస్య" శబ్దము సేవకులను నర్థమున నుపయోగింపఁబడెను. దస్యుల బాధ బలముగనుండి నపుడు వారిని నార్యులీరీతిగ శపించుచుండిరి.

"ఇంద్రా! చెడ్డదృష్టి కలిగి పచ్చిమాంసము భక్షించు దుర్మార్గులగు వీరిపై నీ యసహ్యమంతయును జూపుము. ఈ దుష్టులు నగాధకూపంబులఁద్రోసి యంధకారమునఁ గప్పుము. ఆర్యుల దైవస్తవములను వీరు వినఁజాలరు, అట్టి దుర్మార్గుఁడొకఁడైనను వెలికిరానటుల నొత్తి కోపమునఁ బట్టియుంచులాగున నీకు బలము రానిమ్ము " అని యొకఋషి శపించెను.

ఆర్యావర్తమునకు నిండియాయనియు హిందుస్థానమనియుఁ బేరేలకలిగెను?

ప్రారంభమునుండియు నార్యు లెచటనెచట నుండిరో యా స్థళములకు నార్యావర్తమని పేరు గలిగియుండెను. ఇట్టి యార్యులకు హిందువులనియు వారి స్థానము హిందూస్థానమనియు నిండియాయనియు నామము వచ్చినందులకుఁ గార ణంబేమనిన: ఆర్యులు పంజాబు చేరిన పిదప నైరానులు నా స్థళమును " హెక్టా హిండాజ్ " యనియు యార్యులను " హెస్టా హైందవ " లనియు పిలుచుచుండిరి. ఋగ్వేదములో సప్తసింధవా యనియున్నది, హీబ్రూల మతగ్రంథమగు "నమాస్” అను గ్రంథములో నార్యుల దేశము " హన్డు " అని పిలిచినారు. ఇది సింధు శబ్దమునుండి పుట్టినదియ. ఈ "హన్డు " ను గ్రీకువారు " ఇండియోస్ ” అను చుండిరి. దీనినుండియే యిండియా శబ్దము పుట్టినది. " సింధు ” శబ్దము " శాన్ ధ్”, యను ఛాతువునుండి పుట్టినదనియును దానికి శక్తియని యర్థమనియు కొందఱభి ప్రాయపడినారు, ఇండియా యొక్క శక్తియుఁ గీర్తియునుఁ జూచి జ్యూజాతివారు దానిని హండని శిలుచుచుఁడికొని గ్రీసుపండితుఁడు థెటిసోక్లీసు వ్రాసినాడు. హీబ్రూ భాషలో " హండు అనఃగా శక్తియని యర్థము. కావున నార్యులను హిందువులని పిలుచుట పురాతన నామముగాని నూతనముగాదు హిందువులన శక్తి కలవారని యజ్ఞము, వినయ అతిపురాత సాగ్యులు, ఋజుమార్గప్రవర్తకులు సత్య మెపుడును మానరు నీతివదలరు. భూతదయ పశ్చాత్తాపమలుగలవారు. పెద్దల విషయమున విధేయతలు చూపువారు. విద్యాశక్తి హెచ్చుగనుఁడినది. ఒక కుటుంబ మొక చిన్న రాజ్యముగనుండెను.

ఆ ర్యు ల గృ హ కా ర్య ము లు

తండ్రి యా గృహ రాజ్యమునకుఁ బెద్ద. మిగతవారంద ఱతని ధారకులు. తల్లి గృహకృత్యములు నెఱవేర్చునది. అక్క చెల్లెండ్రు పిల్లలనూ ఆడించి రక్షించువారు. తమ్ములును గొడుకులును సేద్యమొనర్చువారు. బిడ్డలు పశువుల నింట రక్షించుచు: బాలుపిండి పాణి చేయువారు.అల్లుండ్రును బెద్దకుమారులును శిష్యులును గోవులను మేపుటకుఁ గొనిపోవుచు వ్యవసాయఁపుఁ బనులు నెఱ వేర్చుచుఁ దీరినపుడు యజమానునివద్దఁ జదువుచు నింట సుఖముగ నుండు చుండిరి. పరులు తమ్ము బాధించునప్పుడు తప్పు నితర కాలములం దితరులు జోలికిఁ బోపు వారు కారు. బాధించిరేని నాత్మరక్షణార్థము పోరొనర్చుచుండిరి. దానికిఁదగిన సాధనసంపద నార్జింప ధనుర్విద్య నేర్చిరి, పొఱుగువారిపోరు బలమయినట్టెల్ల యుధ్ధసాధనము లార్జించిరి.

బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులనుటకు గారణములు


గుఱ్ఱపు రౌతులైరి. వివిధాయుధ పాణులైరి , విమానయాన విద్య సైతము నేర్చిరి. దేశములో జనసంఖ్య హెచ్చయిన ట్టెల్లఁ గ్రోత్తగ భూములాక్ర మింపసాగిరి. ఇటు నవీనముగ భూములాక్రమించు తఱినిఁ గలిగిన యుద్ధములలో నతి సాహస పరాక్రమముల విజృంభించి తన జనులను రక్షించిన ధీరుఁడా దేశ మునకుఁ బెద్దయయి గౌరవమందుచుండెను. ఆరీతిగ నట్టి పరాక్రమశాలి రాజిల్లి గౌరవనీయుఁడైనందున వానికి " రాజ "ని బిరుదు నామమువచ్చెను. ఇండ్ల యందు నిలిచి యుద్ధమునకుఁబోయినవారి క్షేమ చింతనసేయుచుఁ దమకుఁదోఁచిన దైవ మును స్తుతించుచు మంత్రములు జపించుచు నుండిన ముసలివారు బ్రాహ్మణులనం బడిరి. బ్రాహ్మణములన మంత్రములు, పోరొనర్చుటకు శక్తి లేకయు, మంత్రముల కల్పించి దైవస్తుతులోనర్పు ప్రావీణ్యము లేకయునున్న జనులు "విశు" లనంబడిరి. అనఁగా నింటనుండువారని యర్థము. ఈరీతిగ నింటనుండువారు సోమరి పోతులుగాక యనేకకళల నభ్యసించుచు నా విద్యలయందుఁ బ్రావీణ్యముఁగని తమ్ముఁగాపాడు సత్త్వశాలురగు రాజన్యులకును వారినిఁ గాపాడు బ్రాహ్మణుల కును సాహాయ్యపడుచుండిరి. బ్రాహ్మణులన మంత్రములుచ్చరించువారని యర్థము గాని మఱియే విశేషార్థ మందునలేదు. ఈ మంత్రములు కల్పించువారు కొన్ని యిండ్లవారయి వారదేపనికిఁగాను విద్యా ప్రావీణ్యమందిరి. తమ సంతతివారికి నా విద్య నభ్యసింపఁజేయు చుండిరి. ఈరీతిగఁ గొన్నియిండ్లవారు మాత్రము మంత్ర విద్య నభ్యసించువారైరి. మిగతావారా విద్య నభ్యసింపఁగూడదను నిషేధవిధి యప్ప టికి నుండలేదు. క్షత్రియులన బలము గలవారని యర్థము. శాత్రవబాధ బలమయిన ప్రారంభ సమయమున గొందఱార్యులు బలమాశించు సాధనము లభ్యసింపసాగిరి. ఆవిద్యయ వారికి నలవాటయినందున వారి సంతతికి సైత మదేవిద్యఁ గఱపుచుండిరి. మంత్రములుచ్చరించు బ్రాహ్మణులు సైతము గొన్ని సమయములందు యుద్ధవిద్యా ప్రావీణ్యమార్జింపఁ బ్రయత్నించి యోధులైరి. ఈరీతిగ మంత్రార్జన విద్యయు బలా ర్జనవిద్యయు వివిధ కళాకౌశలమును నార్జించుచుండినను నార్యులెల్లరును గృషి కర్మము ముఖ్యముగఁ జూచుచుండిరి. ప్రాచీనార్యులు (Premitive Aryans ). కొంతకాలమువరకు: దమబుద్ధిని నితరవృత్తులందు వినియోగింపకయుండిరి. అపు డార్యులందఱు సమాన స్వాతంత్య్రముగలిగి యేచింతయును లేక సుఖముననుండిరి. పిదప దస్యులబాధకు నోర్వక యుద్ధములొనర్చి దేశములు సాధించి పరదేశముల భాగ్యములుఁ గొల్లఁగొట్టి శ్రీమంతుల రీతిగ రాజఠీవు లనుభవింపసాగిరి, దైవశక్తి యందు సంపూర్ణ విశ్వాసముగలవా రప్పటియార్యులు. కావున దైవములనుగుఱించి బ్రాహ్మణములు రచించి పఠించువారిస్తుతులు దైవమునిని తమకు యుద్ధములందు సాహాయ్యుఁడై జయమార్జింపఁజేసెనని యెన్ని బ్రాహ్మణములను రచించువారే దైవములని నమ్మిరి.

బ్రా హ్మ ణు లు దై వ ము లు

బలముగలిగి యుద్ధములు సేయు రాజన్యులందు దైవ మావేశించి వారి మూలకమునఁ దమ్మురక్షించినాఁడని నమ్మి క్షత్రియరాజులను రెండవ దైవముగ విశ్వసించిరి. పై రెండుతరగతులవారు గాక మిగతావారు విశులైరి. ఈరీతిగఁ గొని శతవత్సరంబులు గడచినపిదప దినదిన ప్రవృద్ధినందు జనులబుద్ధి కౌశలము చేఁ బై మూఁడు తరగతులు మూఁడు కులములు వారుగ విభజింపఁబడి కాలాంతరములపై హిందూ దేవతలరీతి ముప్పదిమూఁడు కులములయి యెఱువు నీరును లేక యీ కులవృక్ష మసంఖ్యాకములగు శాఖోపశాఖలతో హిందూదేశమును గప్పెను. ఆర్యుల యైక మత్యమును: జెఱిచెను, జనులను పూర్ణ స్వాతంత్య్రము తగ్గెను. భాగ్యవంతుఁడు పేద వాఁడనుబుద్ధి జనులందంకురించెను. గొప్పవారి పూజలు (Hero-worship ) ప్రారంభమాయెను. బ్రాహ్మణులు నిజముగ దైవములైరి. రాజులు దేవాంశ గలవారైరి.

ప్రాచీనార్యులు మాంసభక్షకులా? కాక, కేవల సాత్వికాహారములను గోనిమనినవారా? సాత్వికులైనచో నీ రాజస తామసాహారములు గొనుపద్దతి యెపుడువచ్చెను? ఈ విషయ మించుక చర్చింపఁచగినదిన నున్నది.

ఆ ర్యు లు మాం స భ క్ష కు లా ?

ఆర్యులు ప్రారంభమునుండియు మాంసభక్షకులని పాశ్చాత్యులనేకులు తాత్పర్యపడినారు. ఆర్యులు కేవల సాత్యిక గుణప్రాధాన్యులు కావున రాజస తామస గుణానువర్తుల సంబంధము చేరునంతవరకు వారు మాంసభక్షకులు కారనియు నా సంబుధదోషము సంభవించినవిదప సైతము మాంసాహారము గొనునంతటి విపత్తు సమయము దటస్థించువరకు నట్టిపద్ధతికిఁ బోయియుండరనియునుఁ దోఁచెడు’ ఆర్యు లప్పటికి భక్షింపవలయుననిన ఫలములు కందమూలాదులు సకల ధాన్య విశేష ములు పుష్కళముగనుండెను. వానితోఁ దృప్తిఁబొందియుండిరి. ప్రేమ క్రౌర్య మును సైతము జయించుననురీతినిఁ గ్రూరమృగములు సైతము వారి లాలనలకు లోఁబడియుండెను. కావున పశుపక్షి మృగాదులు వారి ప్రేమాస్పద జంతువులయ్యెను గాని యాహారాధారవస్తువులు గావయ్యెను. అనేకవిధములగు పిండివంటలమర్చి దేవతానివేదనలొనర్చి తాము భుజించుచుండిరి. పక్తి పురోడాశము అపూపములు కారంభములు ఈ మొదలగు పిండివంటలుండినటుల ఋగ్వేద ఋక్కులలోఁ దెలుపఁ బడినది. బియ్యము గోధుమలు నీరుజొన్న లుండినటులఁ గొన్నిఋక్కు లున్నవి, పాలుండెనని చెప్పనేల గోధనమే వారివిభవము, పెఱుగు వెన్న మీగడ తేనె యీవస్తువులు వారికి విశేషముగ నుండెను. ఆర్యుల నెల్ల కాలు మెదురించుచుఁ బోరు చుండినవారు ట్యురేనియన్లు, దస్యులు మొదలగువారు గృహక్షేత్రములు లేక మేఁకలతో నడవులలో సంచరించుచుండినవారు. వారికి మాంసమే యాహారముగ నుండెను, పంజాబు చేరినతఱి నార్యులకు దస్యులతోఁ బోరుబలమాయెను. దస్యులేమి సామాన్యులుకారు. ఆర్యులకు సులభముగ స్వాధీనులైనవారు కారు. ఆర్యయోధులు వారిని వెంబడించి దూరదేశములకు వెళ్లి యేండ్లకొలఁదిని దస్యులతో యుద్ధ మొనర్చుట యవశ్యకమయ్యెను. దస్యులుండినది కొండల ప్రదేశము. వారు భూములుదున్ని పుటలు పండించువారుకారు. ఆర్యయోధులాహరవస్తువులు గొని కొండలగుండ ప్రయాణము సేయునంతటి సాధన సంపద లుండినవారు కారు. కావుననే యుద్ధ కాలమున నుదరపోషణార్థ మడవినుండి పశుపక్షి మృగాదులనుజుంపుట యవశ్యక మగు కర్మమయ్యేను, కొన్నిదినములకిది యలవాటయ్యెను. ఈరీతి యుద్ధములకు బోయి శత్రువులను జయించి దేశములు సాధించిన యోధులే క్షాత్రముగలవారు కావుననే వారికి క్షత్రియులని నామమువచ్చెను. ఇందునఁ గొందఱు రాజన్యులైరి. కాలక్రమమున బ్రాహ్మణములు పఠించు బ్రాహ్మణులు "బలాచ పృథ్వీ" యను లోకోక్తిరీతిగ రాజన్యుల ననుసరింపవలసినది యవశ్యకమయ్యెను. "యథా రాజా తథాప్రజా " యను నుడి ననుసరించి ప్రజలు రాజులనూర్గ మవలంబించిరి. అయి నను జనులకది నూతన పథమయ్యెను కావున వారించుక సందియింపఁ దత్సందేహ నివారణార్థమునకై యాహారములగు పశుపక్షి మృగాదులను దేవబలులుగ నివే దించి పిదప భక్షింపసాగిరి. కొన్ని దినముల కీమాంసభక్షణము ముఖ్యమగు మర్యా దగ నేర్పడెను. గౌరవనీయులగు మహనీయు లింటికి సతిధులుగ వచ్చినపుడు, గృహస్థు తాను ప్రీతిగఁ బెంచిన యావును దేవబలిగనిచ్చి దాని మాంస మా యతి థికి భోజనమిడుచుండిరి కావుననే " యతిథికి గోఘ్ను డని పేరువచ్చెను. ఈ పద్ధతినుండి పుట్టినవియే గోమేధ అజామేధ అశ్వమేధములు, వేదయుగ ముననే యీమేధములు సులభమగు దేవబలులుగ నేర్పడి బ్రాహ్మణముల కాలమున ననేకకష్టతమములగు కర్మానుష్ఠానము లను వలలలోఁ జిక్కువడి తదనుష్ఠానపరుల ధనములాగుటకు స్వర్గసుఖమను గాలామిషమును దవిలించి జనుల ననేక మూఢ విధులలో ముంచెను. దేవబలుల నిచ్చుటకు నర్హమగు పశువులు మేఁకలు గొజ్జెలు ఆవులు ఎద్దులు దున్నపోతులు జింకలు, జయమార్జించి యోధులు పురిఁ జేరినపిదపఁ జట్టణ సంతర్పణ సమయమున ననేకములగు పశుమారణ కర్మములు జరుగుచు వచ్చెను, ఆవును దైవమని పూజించు నార్యు లెప్పుడేగాని యావునుఁజంపి భక్షించు చుండిరను విషయ మిప్పటి హిందువులు నమ్మరు. ఋగ్వేదమునందు సైతము గోవు దైవముగఁ బూజింపఁబడినది. బలిగఁ బెట్టి హింసించినరీతిగ నగపడదు. M. 6,16,47 లో గోవుల పేరున్నదిగాని యదీ గోమేధమును గుఱించి పలికినరీతిగా నగపడదు. అధర్వవేదములో నేడవకాండ 5-వ సూక్తములోఁ బశువులను బలులుగ దేవతలు పూర్వయుగములో నిచ్చుచుండు విధులుగలవనియు నటులా రాధించువారు పురాతన దైవములయిన సాధ్యులను జేరుదురనియు నొకానొక సమయమున దేవతలు కుక్కను బలిగనిచ్చి రనియు కొన్ని యాగములలో గోవుల యవయవములు బలి యిచ్చిరనియు చెప్పఁబడియున్నది. అదేవేదమునఁ బండ్రెండవ కాండలో నాల్గవసూక్తము 38వ ఋక్కులో "ఎవ్వడయిననుగాని యావు ఫలకారికాదని తలంచునో, వాడు దానిమాంసమును వండువాఁడగు " నని నిందింపఁబడినది. గొడ్డుబడిన యావును గాని, కందువేసికొనెడి గోవునుగాని వండనగునని యర్థముచేసినారు. 53.వ ఋక్కులో "బలిగ నారాధించిగాని యారాధింపక గాని యెవఁడావును తనయింట వండునో, వాఁడు దూషింపఁబడుచు, బ్రపంచము వదలిపోవునని వ్రాయఁబడినది. ఇనియన్నియునుఁజూడ వేదయుగములో గోబలియుండినట్టు నాకగపడదు. తైత్తరీయ బ్రాహ్మణములో "లావుగల యావు కాళ్లు " ఇంద్రునకు నివేదింపవలెను. గొడ్డు పడినయావును విష్ణువరుణులకు సమర్పింపవలెను. నల్లనియావు పూషణునకు బలి యివ్వవలెను. ఒక దూడనీని మరల నీనని యావును వాయువుకు నివ్వవలెను. రెండు వర్ణములుగల యావును మిత్రావరుణులకు నివేదింపవలెను. ఎఱ్ఱని యావును రుద్రు నకు సమర్పింపవలెను, గొడ్డుపడిన తెల్లని యావును సూర్యునకు నర్పింపవలెను" అని తెలుపఁబడినది. పంచశారదీయమను సవనములోఁ బదునేడు చిన్నయావులను బలియిచ్చు విధియున్నది. గొప్పతనము రావలయునని గోరువారీ సవన మొనర్ప. వలయునని తైత్తరీయ బ్రాహ్మణములోనే పలుకబడినది. గోమాంస సేవనమను నది యెప్పుడో వేదయుగమున నొకానొక కాలమునందుండి వదలంబడి మరల బ్రాహ్మణముల కాలములో హెచ్చయి రెండవతూరి సైతము వదలంబడినరీతిగ నగపడెడు. మాంసనిషేవణము దూష్యమని యనేకు లభిప్రాయపడి దానిని మానిరి. శతపథ బ్రాహ్మణములో "నావుమాంసమునుగాని యెద్దుమాంసమును గాని యెవఁడును దినవలదు. ఈ భూమినుండు సర్వభూతములును గో వృషభ ములు పెంచుచున్నవి. అవి సర్వభూతములను బోషించునవి కావున సర్వభూత శక్తియు దానికి ధారబోయుదము, ఇతర పశువుల శక్తి వానిలో నిడుదము, తత్కా రణముననే గో వృషభముల యాహారము హెచ్చెను. ఎవఁడుగో వృషభముల మాంసముదీనునో వాఁడన్నిటిని దినినవాఁడగును. అట్టివాఁడు పునర్జన్మమున విపరీతభూతముగఁ బుట్టును, వాఁడు పాపాత్ముండగును కావున గో వృషభముల మాంసనిషేవణము నింద్యము" ఇటుల నింద్యమని దూషింపఁబడినను లేతవయ సునసుండు గో వృషభ మాంసమైనచో నే భక్షించెదనని యాజ్ఞవల్కి పల్కెనఁట . ఇటు మాంసభక్షణ మాచారముగ బ్రాహ్మణముల కాలములోఁ గొంతవరకు నుండి నను నార్యులు పశువులను దేవబలులు సమర్పించుచుండిరికాని భక్షించుచుండ లేదని కొంచఱియభిప్రాయము. ఇదితప్పు. తైత్తరీయ బ్రాహ్మణములో నీరీతిఁ బలుకఁబడినది.

" లో భాగము చెడనటులు దాని చర్మము పలువుము. పిదప దానియెదఁ జీల్చి ఱెక్కలు విప్పి కొనిన పక్షిరితి నుండనిమ్ము. పిదప ముందరి కాళ్లను వేఱు చేయుము. బండియాకులంబలెఁ జీల్పుము, ఇఱవైయాఱు ప్రక్క యెముకలు వేఱ్వే ఱుగఁ జేయుము. పశుమలినమెల్లఁ బెల్లముఁద్రవ్వి దానిలోఁ ద్రోయుము, భూమినిఁగాఱిన రక్తము రాక్షసులకు వదలుము, అధ్రిగూ! కటికా! నీపని నీవు చేయుము. విధులనుసరింపుము " గోపాద బ్రాహ్మణములో వధింపఁబడిన పశువు యొక్క యవయము లెవరెవరు తీసికొనవలసిన విధు లేర్పఱవఁబడినవి.

పైరీతిన బ్రాహ్మణ కాలాంత్యమువరకు మాంసభక్షణవిషయము చర్చలో నుండినది. కొందఱు భూషించిరి కొందఱు దూషించిరి. ఆత్మ యొక్క పునర్జన్మము' సిద్ధాంతరీకరించినవెనుక నిది యించుక తగ్గనారంభించెను. పిదప గొన్ని పశువులు ధైవముగఁ బూజించుపద్ధతి ప్రారంభమాయెను. కావున గొన్ని పశుహింసలు నిలిచెను. పిదప బౌద్ధమతము వ్యాపించెను. పశుహింశ వారియందు బొత్తిగ నిలిచి పోయెను. అచటనచట నిలిచియుండిన పద్ధతిని వైష్ణవమత వ్యాపనమణఁచెను. నిజమగు బలిపశువు పిష్టపశువయ్యెను. మనుస్మృతి పుట్టుకాలమునకే మాంస భక్ష ణము నింద్యమైయుండెను.

మ. 5. (46) " ప్రాణకోటికి నొప్పిగాని, వానినిఁ జెఱనుంచుటగాని ప్రాణహింస
               గాని యొనర్ప నిచ్ఛయింపనివారు సుఖవిశేషమునందుదురు.

        (58) శతాశ్వమేధములనుండి కలుగునంతటి పుణ్యము మాంసభక్షణము
              వదలుటచే గలుగును.

ఆర్యులు పంజాబు చేరకమునుపు మాంసభక్షణ మెఱుంగరు. పంజాబు చేరిన కొంత కాలములోనే యది యలవాటాయెను. పశుబలులఋక్కులు నూత నములని నే నూహించెద. ప్రాచీనార్యులకుఁ బాకశాస్త్రము చక్కఁగ వచ్చియుండె ననియును, వారికి నుడికించువిధమును వేగించువిధమును జక్కఁగఁ బెలిసి యుండెననియును, పచ్చిమాంసమును దినువారినిఁ గ్రవ్యాదులనియు అమా డ్లనియు నిందించుచుండిరనియును మాక్సముల్లరుగారు వ్రాసినారు. గోవులను. జంపునట్టియిల్లు (Slaughter house or కమేల ) యుండెనని రమేశుచందర్ దత్తుగారు వ్రాయుచు M . 89.14, ఋక్కును చూపినారు. ఆ ఋక్కులోఁ గమేలా సంగతి వ్రాయఁబడినదిగాని గోవులఁ జంపినటు లందు లేదు.

ఆర్యులకు సముద్రయానముండెనా?

ఆర్యులకు సముద్రయాన ముండేనాయను విషయ మీ యుపన్యాసంబునం జర్చించి మిగతవిషయములనెల్ల మఱి యొక యుపన్యాసంబునకు నుంచెన. హిందు వులకు సముద్రయాన మెప్పుడు నుండలేదనువారు హిందూమతగ్రంధములగు వేద పురాణేతిహాసములు చదివినవారు కారనుటకు నే సందియమును లేదు. శృతిస్మృతు లేమి పురాణేతిహాసము లేమి నౌకాయాత్ర నిషేధవిధిని విధింపవు. సముద్రయాన మొనర్చనటులు ఋగ్వేదమునం దనేక ఋక్కులున్నవి,

మం. 1, 116,3
      1. 136. 3, 5

ఈ ఋక్కులలో ఋజు” యను రాజు సముద్రయానము
చేయునపుడు, నావమునుఁగ నశ్వినీ దేవతలు వానినిఁ దీరముఁ
జేర్చినటుల నున్నది.

1. 25. 7. వరుణునకు విహగముల గమనమార్గములును సముద్రములో సంచ
          రించు మార్గములు తెలిసినటులున్నది.

4, 55, 6, ద్రవ్యాపేక్షకులు సముద్రయానము సేయుకాలమున సముద్రుని
          స్తుతించునటులున్నది.

7. 89. 3. "వరుణుఁడును నేనును సముద్రముపైన నౌకాయాత్ర సలుపునపుడు
           నేనునావలో సుఖముగ నుంటిని, నావ, నీటిపై నల్లాడుచు నుయ్యెల
           యూఁచినటులఁ బోవుచుండెనని బ్రహర్షి యగు వశిష్ఠుఁడు పలుకు
           చున్నాఁడు.

ఈ క్రిందవివరించిన ఋగ్వేద ఋక్కు లన్నియును సముద్రయాన ముండినటుల రూఢిగఁ బలుకుచున్నవి.

M.1.25.7 M.4.55.6 M.8.18.17 10.44.6
1.48.3 M.5.25.9 64.9 63.10
56.2 45.10 72.3 101.2
97.7 54.4 42.3 105.9
131.2 59.2 9.73.1 180.2
14012 6.58.3 89.2 -
- 7.88.3 - -

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse