విజయనగర సామ్రాజ్యం - పీస్, నూనిజ్ యాత్రాకథనాలు/డొమింగో పీస్ కథనం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

విజయనగర భౌగోళిక పరిస్థితి గురించి[మార్చు]

(పుట..237) ఈ దేశంలో (విజయనగర సామ్రాజ్యంలో) చిట్టడవు లెక్కువ. మిగిలిన ప్రాంతమంతా రాళ్ళు గుట్టల మయం. కొన్ని ప్రాంతాల్లో బారులు తీరిన వృక్షాలున్నాయి. పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో జామ, మామిడి తోటలెక్కువ. చింత చెట్లు కూడా ఎక్కువే. ఇంకో రకమైన మహా వృక్షాలు కూడా ఉన్నాయి. ఈ వృక్షాలు ఆ దారెంబడి వెళ్ళే వర్తకులకు నీడ నిస్తున్నాయి. ఒక పట్టణ సమీపాన ఇటువంటి మహా వృక్షం క్రింద తమ తమ సామానులతో కొందరు వర్తకులు సేద తీరుతున్నారు. వీరి 320 గుర్రాలన్నీ గుర్రపు శాలలో వరుసగా నిలబడినట్లుగా ఆ చెట్టు క్రింద విశ్రమించడం నేను చూశాను. ఇటువంటి మహావృక్షాలు చిన్నవి, పెద్దవి ఈ దేశమంతటా ఉన్నాయి (ఇవి మర్రి చెట్లు). ఈ దేశంలోని భూములు సారవంతమై, వ్యవసాయ యోగ్యమైనవి. ఇక్కడి ప్రజలకు పశు సంపద ఎక్కువ. ఆవులు, బర్రెలు, గొర్రెలు, కోళ్ళు, మొదలైన వాటిని ఇళ్ళ మధ్యలోను అడవుల్లోనూ పెంచుతున్నారు. ఇవి మన పోర్చుగీసు దేశంలోకన్నా ఇక్కడెక్కువ. ఇక్కడి భూములలో వరి ఎక్కువగా పండిస్తారు. మనదేశంలో లేని జొన్న, బీన్సు, ప్రత్తి వంటివి కూడా పండుతున్నాయి. ధాన్యాన్ని ప్రజల అవసరాలకే గాక గుర్రాలకు కూడా పెడుతున్నారు. ఎందుకంటే మనదేశంలో లాగ ఇక్కడ బార్లీ ధాన్యం లేదు. ఇక్కడ గోధుమ పంట కూడా ఎక్కువే. ఈ దేశంలోని పల్లెల్లో పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువ. ఇక్కడి రాజు తమ పల్లెవాసులను వారి ఇళ్ళ చుట్టూ మట్టితో మాత్రమే గోడ కట్టుకొనుటకు అనుమతిస్తాడు. ఎందుకంటే వారు తన కంటే బలవంతు లౌతారని భయం. కానీ దేశ సరిహద్దు సమీపాన గల పట్టణ వాసులకు మాత్రం తమ ఇళ్ళ చుట్టూ రాతి గోడలను కట్టుకొనుటకు రాజు అనుమతిస్తాడు. పల్లెవాసులకు ఆ అవకాశం లేదు.

(పుట 238) మన పోర్చుగీసు దేశం కన్నా ఈ దేశం చదునుగా నున్నందున గాలి వేగం ఎక్కువ. ఇక్కడి ప్రజలు తాము పండించిన నూనె గింజల నుండి తామే తయారు చేసుకున్న యంత్రాల తోనే నూనెను తీస్తారు. (ఇవి నూనె గానుగలు) ఈ దేశంలో నీటికొరత ఉంది. ఎందుకంటే విశాలమైన దేశంలో నదులు తక్కువ. అందుచేత ఇక్కడి ప్రజలు చెరువులను త్రవ్వి వర్షాకాలంలో వచ్చే వాననీటితో వాటిని నింపి తమ అవసరాలకు వాడుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీటి ఊటలపై ఆదారపడి ఉన్నారు. ఇంకొన్ని ప్రాంతాలలో భూములు పూర్తిగా మెట్ట భూములు. వీరు పంటలకు వర్షాలపైనే ఆదారపడి ఉన్నారు. కొంతమంది ప్రజలు తమ పొలాలలొ గోతులు త్రవ్వి అందులో లబించిన నీటితో తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. (ఇవి దిగుడు బావులు). వీరికి వర్షాభావ మెందుకంటే, మన దేశంలో లాగా వీరికి చలికాలం లేదు. కాని ఇక్కడ ఒక సంవత్సరం విడిచి ఒక సంవత్సరం తుపాను లొస్తుంటాయి. ఇక్కడి చెరువుల్లో నీరు మురికిగా ఉంటాయి. ఎందుకంటే దుమ్ము ధూళితో కూడిన బలమైన గాలులు నీటిని శుభ్రంగా ఉండనీయవు. అంతేగాక వీరి పశువులు, గొర్రెలు, బర్రెలు వంటి ఇతర జంతువులు కూడా ఈ నీటినే తాగుతుంటాయి.

ముఖ్యమైన విషయ మేమంటే ఈ దేశ వాసులు ఆవులను, ఎద్దులను చంపరు. ఎద్దులు వీరి సామానులను మోస్తాయి (ఎద్దుల బండి గురించి). అంతేగాక వీరు ఎద్దులను, ఆవులను పూజిస్తారు. దేవాలయాల్లో వీటి శిలా విగ్రహాలున్నాయి (దేవాలయాల్లో ఉన్న నంది విగ్రహాల గురించి). వీరు కొన్ని ఎద్దులను దేవాలయాలకు అంకితమిస్తారు. అటువంటి ఎద్దులు ఎక్కడ తిరిగినా ఎవరూ వీటికి ఎటువంటి హాని చేయరు. (గతంలో ప్రతి ఊరికి ఒక "దేవరెద్దు" ఉండేది. ఎవరూ దానికి ఎటువంటి హాని చేయక పోగా, అది ఎవరింటి కొచ్చినా దానికి మంచి ఆహారమిచ్చి బొట్టుపెట్టి నమస్కరిస్తారు. ఇది ఆచారం). ఈ దేశంలో గాడిదలు కూడా ఉన్నాయి. కాని వీటిని చిన్న చిన్న పనులకే ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఉతికే బట్టలను తీసుకెళ్ళడానికి గాడిదలను ఉపయోగిస్తారు.

(పుట. 240) విజయనగర సామ్రాజ్యం లోని నగరాలు, పట్టణాలు, పల్లెల గురించి వివరించాలంటే చాలా అవుతుంది "ధార్వార్" అనే నగరాన్ని గురించి మాత్రం వివరిస్తాను.

ధార్వార్ నగరం గురించి[మార్చు]

(ప్రస్తుతం ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది)

ధార్వార్ నగరంలో అతి ఆరుదైన, అతి ముఖ్యమైన కట్టడం ఒకటుంది. ఈ నగరం చుట్టూ కోట ఉన్నా, అది నేను పైన చెప్పిన కారణాల వల్ల రాతి కట్టడం కాదు. దీనికి పశ్చిమ దిశగా అందమైన నది ఉండగా మిగతా దిక్కులందు మైదాన మున్నందున కోట గోడ, దానికి అగడ్త ఉన్నాయి. ఈ నగరంలో ఉన్న ఆ కట్టడం ఒక దేవాలయం. ఇది చాల అందమైనది. ఇటువంటిది ఆ చుట్టుపక్కల చాలా దూరం వరకు లేదు. ఇది ఏకశిలతో నిర్మితమై, వృత్తాకారం కలిగి అత్యంత కళాత్మకమైన శిల్ప కళ కలిగి ఉంది. అందులోని శిల్పాలు రాయి నుండి ఒక మూర ముందుకు ఉన్నందున ఆ ప్రతిమను అన్ని వైపులనుండి చూడగలము. అవి ఎంత అందంగా ఉన్నాయంటే, వాటిని అంతకంటే అందంగా చెక్కలేరు. రాతి స్తంబాలతో నిర్మితమైన ద్వారంలో దాని (పుట..241) పైనున్న శిల్పకళను బట్టి ఇది ఇటలీలో తయారైనదేమో ననిపిస్తుంది. దీనికున్న అడ్డ పట్టీలు, దూలాలూ అన్నీ శిలా నిర్మితాలే. పలకలు గాని కర్రలు గానీ వాడలేదు. ఆవిధంగా లోపల గాని బయటగాని, అదే శిలలతో నిర్మితమైనది. ఈ కట్టడం మొత్తం బలిష్ట మైన ప్రహరీ గోడచే పరివేష్ఠింప బడియున్నది. ఇది పూర్తిగా రాతి మయం. ఈ దేవాలయానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఇవి చాల పెద్దవే గాక చాల అందంగా కూడా ఉన్నాయి. తూర్పు వైపున నున్న ద్వారానికి చిన్న వరండాల వంటివి ఉన్నాయి. అందులో "జోగినులు" కూర్చొని ఉన్నారు. ఈ ఆవరణంలో ఎర్రటి చిన్న దేవాలయా లున్నాయి. అందులో ఓడ స్తంభం లాంటి రాతి స్తంభం ఉంది. దానికి మొదట నాలుగు పలకలుగా ఉండి తర్వాత ఎనిమిది పలకలుగా అకాశం వైపు నిలబడి ఉంది. ఇలాంటి దాన్ని నేను ఇటలీలోని రోమ్‌లో చూసి ఉన్నందున ఇది నాకు అంత ఆశ్చర్యాన్ని కలిగించ లేదు (ఇది ధ్వజస్తంభం). ఈ దేవాలయాల్లో ఉన్న విగ్రహాలు కొన్ని ఆడ, మగ రూపంలో ఉండగా ఇంకొన్ని ఎద్దు రూపంలోను,. కోతి రూపంలోను ఉన్నాయి. మరి కొన్నింటిలొ ఒక గుండ్రటి రాయి మాత్రమే ఉంటుంది. వీటినే ఈ ప్రజలు పూజిస్తారు.(ఇక్కడ చెప్పిన విగ్రహాలు - దేవతా మూర్తులు, ఎద్దు రూపం లోనిది నందీశ్వరుడు, కోతి రూపం లోనిది ఆంజనేయ స్వామి, గుండ్రటి రాయి శివ లింగం అయి ఉంటుంది)

ఈ ధార్వార్ నగరంలో ఉన్న దేవాలయంలోని విగ్రహం శరీరం అంతా మాన వాకారంలో ఉండి ముఖం మాత్రం ఏనుగు ముఖం. దంతాలు కూడా ఉన్నాయి. (ఈ విగ్రహం ఖచ్చితంగా వినాయకుడిదే). చేతులు మాత్రం మూడు + మూడు = ఆరు ఉన్నాయి. వీరు చెప్పేదాన్ని బట్టి ఈ విగ్రహానికి ఇప్పటికే నాలుగు చేతులు పడి పోయాయట. ఇక మిగిలిన చేతులు పడిపోతే అప్పుడు ఈ ప్రపంచం అంతా మునిగి పోతుందట. దీన్ని దైవ నిర్ణయంగా బావిస్తారు. దీనిపై వీరందరికి మంచి నమ్మకం ఉంది. వీరు విగ్రహానికి ప్రతి రోజు ఆహారం పెట్టి అది తిటుందని నమ్ముతారు. భోజన సమయంలో ఈ దేవాలయానికి సంబంధించిన స్త్రీలు నాట్యం చేస్తారు. ఈ స్త్రీలకు జన్మించిన ఆడపిల్ల లందరూ ఈ దేవాలయానికే చెందుతారు. వీరందరూ గుణ హీనులు. కానీ వీరు గౌరవ ప్రదమైన వీధులలోనే మంచి గృహాలలోనే నివసిస్తారు. వీరికి సంఘంలో మంచి గౌరవం ఉంది. వీరిలో కొందరు సేనా నాయకుల భార్యలు కూడా ఉన్నారు. అదే విధంగా గౌరవప్రద వ్యక్తులు కూడా నిస్సంకోచంగా ఈ స్త్రీల ఇంటికి వెళ్ళి వస్తారు. రాజు తన రాణులతో ఉన్న సమయంలో కూడా తమలపాకులు నమలుతూ ఈ స్త్రీలు వెళ్ళి రావడానికి అనుమతి ఉంది. ఇటువంటి అవకాశం సంఘంలో ఎంతటి పరపతి ఉన్న వ్యక్తికైనా వీలు కాదు.

విజయనగర కోటలు, ప్రాకారాల వివరణ[మార్చు]

(పుట..242)

ధార్వార్ నగరం నుండి విజయనగరం 18 లీగుల దూరంలో ఉంది. అదే ఈ దేశపు రాజదాని. రాజైన శ్రీకృష్ణ దేవ రాయులు ఈ నగరం లోనే నివసిస్తాడు. విజయనగరం ఇంకా రెండు లీగుల దూరం ఉందనగా, ఎత్తైన కొండ చరియల మధ్య నుండి విజయ నగరానికి ప్రవేశ ద్వారం ఉంది. ఇటువంటి ప్రవేశ ద్వారాల ద్వారా మాత్రమే ఈ నగరంలో ప్రవేశించగలము. వేరే మార్గం లేదు. ఇటువంటి పర్వత శ్రేణులు నగరం చుట్టు 24 లీగుల పర్యంతం ఉండగా, దీనిలోపల వృత్తకారంలో మరి కొన్ని పర్వత శ్రేణులున్నాయి. ఈ పర్వత శ్రేణుల వరుస ఎక్కడైనా లేనిచో అక్కడ బలమైన గోడతో పూరించి నందున అంతా కొండలతోనే చుట్టబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రవేశ ద్వారాలు తప్ప మిగతా అంతా ఈ విధంగానే ఉంటుంది. ఇటువంటి ప్రవేశ ద్వారాలను కొంత మంది కాపలా కాస్తుంటారు. ఇటువంటి రక్షణ వ్యవస్థ అన్ని ప్రాకారాలకూ ఉంది. ఇటువంటి పర్వత శ్రేణుల ప్రాకారాల మధ్య లోయలలో, మైదానాలలో వరి, మామిడి తోటలున్నాయి. ఈ కొండల మధ్యలో చెరువులుండి నీటి పారుదల కుపయోగ పడుతున్నాయి. ఈ కొండలలో ఎటువంటి చెట్లు గాని పచ్చదనం గానీ లేదు. తెల్లటి పెద్ద బండ రాళ్ళు ఒక దాని పై ఒకటి, దాని పైన ఒకటి ఏ ఆధారమూ లేకుండా ఆకాశంలో అలా నిలబడి యున్నాయా అని అనిపిస్తున్నాయి. ఇటువంటి కొండల మధ్యలోనే విజయనగరం ఉంది.

(పుట..244) మొదటి ప్రాకారాని కున్న పశ్చిమ ద్వారం ప్రధానమైనది. గోవా నుండి వచ్చే వారికి ఇదే ప్రవేశ ద్వారం. ఈ ద్వారం వద్ద ఈ దేశపు రాజు బలిష్ఠమైన గోడలతో, ఎతైన గోపురాలతో, చక్కటి వీధులతో ఒక అందమైన నగరాన్ని నిర్మించాడు. ఈ నగరంలో అనేక మంది వ్యాపారస్తులు, గొప్ప వ్యక్తులూ నివసించడానికి రాజు ప్రోత్సహించాడు. అందుచేత ఈ నగరంలో జనసంఖ్య చాలా ఎక్కువగా ఉంది. (పుట. ౨౪౫) నీటి అవసరాలకు ఈ దేశపు రాజు అతి పెద్ద చెరువును త్రవ్వుతున్నప్పుడు నేను చూచాను. సుమారు 15 - 20 వేల మంది పనిలో నిమగ్నమై ఉన్నారు. వీరు చీమల్లాగా కనిపిస్తూ ఉన్నారు. వారి కింద ఉన్న భూమి కనిపించనంతగా ఉన్నారు. కూలీలను మూడు విభాగాలు చేసి ఒక్కొక్క విభాగాన్ని ఒక్కో సేనాపతికి అప్పజెప్పి పని పూర్తి చేయించాడు రాజు. ఈ చెరువు రెండు మూడు సార్లు తెగిపోయింది. రాజు తన పురోహితులను పిలిపించి దీనికి కారణం కనుక్కోమన్నాడు. దానికి ఆ బ్రాహ్మణులు ఆలయంలోని మూల విగ్రహం స్థానభ్రంశమైందని, దేవుడు బలి కోరుచున్నాడని అందుకు మనుషులను, దున్న పోతులను, గుర్రాలను దేవునికి బలి ఇవ్వాలనీ సలహా ఇచ్చారు. రాజుగారి అనుమతి మేరకు ఆలయం ముందు 60 మంది మనుషులను, కొన్ని గుర్రాలను, అలాగే దున్న పోతులను బలి ఇచ్చారు.

(పుట 245) ఈ బ్రాహ్మణులు తమకు తాము అతి పవిత్రులమని భావిస్తారు. ఈ రాజ్యంలో ఇతర బ్రాహ్మణులున్నా వారు రాజు వద్ద, వివిధ హోదాలలో అధికారులుగాను కొందరు వ్యాపారస్తులు గాను, ఇంకొందరు వ్యవసాయదారులు గానూ జీవిస్తున్నారు. ఈ పౌరోహిత్యం వహిస్తున్న వారు మాత్రం తమను తాము అత్యున్నతులుగా భావిస్తారు. వీరు మాంసం, చేపలు వంటి మాంసాహారము తినరు.

శ్రీ కృష్ణ దేవరాయలు కొత్తగా నిర్మించిన నగరం, నాగలాపురం గురించి[మార్చు]

(పుట 246)

కొత్తగా నిర్మించిన ఈ నగరానికి రాజు తన భార్య మీదున్న ప్రేమకు చిహ్నంగా ఆమె పేరు పెట్టాడు. ఈ నగరంలో రాజు ఒక అందమైన దేవాలయాన్ని కూడా నిర్మించాడు. ఈ నగరంలోని ఇళ్ళు ఒకే అంతస్తు కలిగి, చదునైన పైకప్పుతో ఉన్నాయి . రాజు నివసించే అంతఃపురం చుట్టూ ప్రహరీ గోడ ఉండి లోపల ఆనేక వరుసల ఇళ్ళు ఉన్నాయి. ఈ అంతఃపురానికి రెండు ప్రవేశ ద్వారాలున్నాయి. ప్రవేశ ద్వారము విశాల ఆవరణముతో వరండాలతో, ఆ వరండాలలో రాజుగారి పిలుపు కోసం నిరీక్షించే ప్రముఖులతో నిండి ఉంది. ద్వారాల ముందు అనేక మంది కాపలా దారులున్నారు. (కొత్తగా రాజు నిర్మించిన ఈ నగరాన్ని నాగలాపురమని పేరు. ప్రస్తుతము దాని పేరు హోస్పేట. పైన చెప్పిన అందమైన ఆలయం, ప్రస్తుతమున్న అనంత శయన ఆలయం)

(పుట..247)

శ్రీ కృష్ణ దేవరాయలు ఎలా ఉన్నాడు?[మార్చు]

రాజు మామూలు ఎత్తుతో అంత సన్నగానూ కాక, అంత లావు గానూ కాక మధ్యస్తంగా ఉన్నాడు. ఇతను ఇతర దేశస్తులను చాల మర్యాదగా గౌరవిస్తాడు. ఇతను ధర్మబద్ధుడైన గొప్ప పాలకుడు. ఇతనికి రారాజని, చక్రవర్తి అని, లార్డ్ ఆఫ్ సెవెన్ సీస్ అండ్ ల్యాండ్ అనీ బిరుదులు ఉన్నాయి. ఇతని పేరు "శ్రీ కృష్ణ దేవరాయలు " ఇతనికి పన్నెండు మంది భార్యలున్నా వారిలో ముగ్గురే మహారాణులు. ఈ మహారాణుల కొడుకులకే రాజ్యాధికారం ఉంటుంది. మిగతా భార్యలలో ఎవరికైనా ఒకే కొడుకుంటే అతనిక్కూడా రాజ్యాధికారం ఉంటుంది. ఈ మహారాణులలో ఒకరు ఒరియా (కళింగ) రాజ కుమార్తె, ఇంకొకరు శ్రీరంగ పట్నం రాజ కుమార్తె. మూడో మహారాణి యుక్త వయస్సులో రాజు ప్రేమించిన అమ్మాయి. శ్రీ కృష్ణ దేవరాయలు తాను రాజైనప్పుడు ఈమెను పెళ్ళాడి మహారాణిని చేస్తానని మాట ఇచ్చి నందున ఆమె కోరికను నెరవేర్చాడు.

(పుట..248) రాజుగారి భార్యలు అందరికి ప్రత్యేకంగా భవనాలు, స్త్రీజన పరివారము, సేవకులు (స్త్రీలే) వారికి కావలసిన ఆవాసములు అన్నీ ఉన్నాయి. పురుషు లెవ్వరు అందు ప్రవేశించరు. వీరు కూడా బయటకు వెళ్ళరు. తప్పని సరియై వెళ్ళవలసి వస్తే మూసి ఉన్న పల్లకిలో వెళ్తారు. ప్రజలు కూడా వీరికి దూరంగా ఉంటారు. చాలామంది నపుంసకులు వీరికి రక్షణగా ఉంటారు.

నేను విన్నదాని ప్రకారం ఈ అంతఃపుర స్త్రీలు అత్యంత ధనవంతులు. వీరి వద్ద ధనమే కాకుండా బంగారు ఆభరణాలు, వజ్రాలు, ముత్యాలు వంటి జాతిరత్న సంపద అధిక మొత్తంలో ఉంది. ఒక ఉత్సవ సందర్భంలో వారి అభరణాల అలంకారం చూసి నిశ్చేష్టుడ నయ్యాను. ఆ సందర్బాన్ని తర్వాత వివరిస్తాను. ఈ స్త్రీజన పరివారంలో పన్నెండొందల మంది ఉన్నారని విన్నాను. వీరిలో కత్తి డాలు పట్టగలిగిన వీర వనితలు, కుస్తీ పట్టగల వారూ, పాడగలవారు, నాట్యగత్తెలూ ఉన్నారు. ఈ ముగ్గురు మహారాణులు తమ మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా స్నేహంగా మెలుగుచున్నారు. ఈ ముగ్గురు రాణులు, వారి పరిచారికలు వారి రక్షక భటులు, కాపలా దారులు, ఇతర పనివారు వీరందరు నివసించడానికి భవనాలు, ఇతర నివాసాలూ ఎన్ని ఉండాలి, ఎన్ని వీధులలో ఉండాలి?.

(పుట..249) రాజు మాత్రం తన అంతఃపురంలో నివసిస్తుంటాడు. ఏ రాణితోనైనా కలవాలనుకుంటే ఒక నపుంసకుని చేత కబురు పంపుతాడు. ఇతడు కూడా రాణి అంతఃపురం లోనికి ప్రవేశించ కూడదు. అక్కడున్న స్త్రీ పరిచారికకు విషయం చెఫ్తాడు. అప్పుడా రాణి గారి పరిచారిక బయటకు వస్తుంది. విషయం తెలుసుకుని రాణి గారికి తెలియజేస్తుంది. అప్పుడు రాణి, రాజు చెప్పిన చోటుకు వెళ్ళడమో లేక తన వద్దకు రాజుని రప్పించుకోవడమో చేస్తుంది. ఈ వ్యవహారం ఇంకొక రాణికి తెలియదు. ఇదంతా ఈ నపుంసకుల ద్వారా జరుగుతుంది. ఈ నపుంసకులు రాజుగారికి అత్యంత విశ్వాస పాత్రులై ఉంటారు. వీరి జీతభత్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

ప్రభాత కాలాన రాజుగారి దినచర్య[మార్చు]

(పుట249) ప్రతి రోజు సూర్యోదయానికి ముందే రాజు నిద్ర లేచి నడుంకు మాత్రం ఒక చిన్న గుడ్డను కట్టుకొని, శరీరమంతా నువ్వులనూనెను మర్దన చేయించుకొని రెండు చేతులతో మట్టితో చేసిన బరువులను ఎత్తుతాడు. ఆ తర్వాత కత్తి తీసుకుని చెమట పట్టునంత వరకు వ్యాయామం చేస్తాడు. అప్పటికి మర్దన చేసిన నూనె అంతా చెమటతో బయటకు వస్తుంది. ఆ తర్వాత తన కుస్తీ వీరులలోని ఒకనితో కుస్తీ పడతాడు. ఈ శ్రమ అయిన తర్వాత తన గుర్రమెక్కి మైదానంలో అటు ఇటు స్వారీ చేస్తాడు. ఈ కార్యక్రమమంతా సూర్యోదయానికి ముందే పూర్తవుతుంది. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి మంత్రోచ్చారణతో రాజుగారికి స్నానం చేయిస్తాడు. తర్వాత తన అంతఃపురంలో నున్న ఒక ఆలయం లోనికి వెళ్ళి ప్రార్థన, ఇతర పూజా కార్యక్రమాలు పద్ధతి ప్రకారం చేస్తాడు. రాజుగారికి స్నానం చేయించే బ్రాహ్మణుడు చాలా ధనవంతుడు, ఇతనికి జీతం కూడా ఎక్కువే. ఇతన్ని రాజుగారు చాల పవిత్రునిగా జూస్తాడు. అక్కడనుండి రాజుగారు ఇంకొక భవనం లోనికి వెళ్ళతాడు. ఆ భవనం గోడలు లేకుండా అనేక స్తంభాలతో ఉంది. ఆ స్తంభాలకొక అందమైన గుడ్డ, పైనుంచి క్రింది వరకు చుట్టబడి ఉంది. దానిపై అందమైన చిత్రాలు అద్దబడి ఉన్నాయి. రెండు స్త్రీ చిత్రాలు అందంగా తీర్చబడి ఉన్నాయి. ఈ భవనంలో పరిపాలన సంబంధమైన అధికారులుంటారు. రాజుగారికి అత్యంత ప్రముఖుడైన "తిమ్మరుసు" అనే వృద్దుడు ఉంటాడు. ఇతను అంతఃపురంలోని అందరిని శాసించ గల్గి ఉంటాడు. పరిపాలనా సంబంధమైన విషయాలు మాట్లాడిన తర్వాత, ఆ ప్రముఖులు శలవు తీసు కుంటారు. అప్పటి వరకు రాజుగారి దర్శనార్థం బయట వేచి ఉన్న సామంతులు, సేనా నాయకులు, ఇతర ప్రముఖులూ ప్రవేశిస్తారు. వారు రాజుగారికి నమస్కరించి గోడ వెంబడి నిలబడతారు. వారు తమ చేతులను జేబులో పెట్టుకుని నేల చూపులు చూస్తూ మౌనంగా రాజుగారికి దూరంగా ఉంటారు. వారెవరూ తమలపాకులు నములుతూ ఉండరు. రాజుగారు వారిలో ఎవరితోనైనా మాట్లాడా లనుకుంటే తన భటుడు అతనికి తెలియ జేస్తాడు. అపుడా వ్యక్తి తల పైకెత్తి అడిగిన దానికి సమాధానం చెప్పి తిరిగి తన యథాస్థితికి వస్తాడు. రాజుగారు వారందరికి శలవిప్పించు నంతవరకు వారు అలాగే ఉంటారు. ఆ తర్వాత వారు రాజు గార్కి నమస్కరించి నిష్క్రమిస్తారు. ఈ నమస్కార విధానం ప్రత్యేకంగా ఉంటుంది. రెండు చేతులు పైకెత్తి రెండు అరచేతులు కలుపుతారు వీరందరు ప్రతిరోజు ఈ నమస్కార కార్యక్రమం ఉదయం చేస్తారు.

శ్రీ కృష్ణ దేవరాయల వారి మర్యాద మన్నన గురించి[మార్చు]

(పుట..251)

మేము ఈ రాజ్యానికి వచ్చినప్పుడు రాజుగారు తన కొత్త నగరంలో ఉన్నారు. మేమూ మాకూడా ఉన్న వారందరం రాజుగారి దర్శనార్థం అక్కడికి వెళ్ళాం. మేమంతా మా పద్ధతి ప్రకారం చాల ఆడంబరంగా దుస్తులు ధరించి వెళ్ళాము. రాజుగారు మమ్ములను చాల మర్యాద పూర్వాకంగా ఆహ్వానించారు. మాపై అతను చాల దయ, కరుణ చూపించారు. మేము రాజుగారికి చాలా దగ్గరగా ఉన్నాము.

(పుట...252) రాజుగారు ధవళ వస్త్రాలలో ఉన్నారు. ఆ వస్త్రాలు బంగారు దారంతో గులాబి పూలు ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. మెడలో అత్యంత విలువైన వజ్రాల హారం ఉంది. తలమీద పట్టు బట్టతో చేసిన, బంగారు జరీ పట్టీతో ఉన్న కిరీటం ఉంది. కాళ్ళకు చెప్పులు లేవు. రాజుగారి కాళ్ళకు చెప్పులు ఉంటే ఎవరూ లోపలికి రారు. ఈ దేశంలో చాల వరకు ప్రజలు చెప్పులు ధరించరు. రాజుగారు ధరించే చెప్పులు రెండు రకాలు. ఒక రకానికి ముందు మొనదేలి ఉంటాయి. రెండో రకానికి పాద భాగం తప్ప ఇంకేమీ ఉండదు. ముందు భాగంలో ఒక చిన్న బుడిపె లాంటిది ఉండి వేళ్ళ ఆదారంతో అది కాలికి ఉంటుంది. ఇవి రోమనులు కొందరు వాడేవారని తెలుస్తున్నది. రాజుగారు మా అందరికీ ఒక్కొక్క నూతన వస్త్రాన్ని ఇచ్చారు. దాని మీద అందమైన బొమ్మలు కుట్టి ఉన్నాయి. ఇది ఇక్కడి అచారమట. స్నేహానికి గుర్తుగా ఇస్తారట.

(పుట 253) మేము శలవు తీసుకొని విజయనగరాని కొచ్చాం. ఈ రెండు నగరాల మధ్య దూరం ఒక లీగ్ ఉంటుంది. ఈ దారంతా ఇటువంటి వరుస ఇండ్లతో విశాలంగా ఉంది. అంగళ్ళలో అన్ని రకాల వస్తువులు అమ్ముతున్నారు. ఈ దారి వెంట రాజుగారి అనుమతితో చెట్లు నాటించ బడ్డాయి. ఇవి అటు వచ్చి పోయే వ్యాపారస్తులకు నీడ నిస్తున్నాయి. ఈ దారి లోనే రాజుగారు రాతితో అందంగా నిర్మింప జేసిన పెద్ద ఆలయం ఉంది. అదే విధంగా ఇతర ప్రముఖులు నిర్మించిన ఆనేక దేవాలయాలు ఉన్నాయి. విజయనగరం ప్రవేశించడానికి ఒక ప్రవేశ ద్వారం ఉంది. నగర ప్రహరీ గోడ బలిష్ఠంగా ఉంది. కాని ప్రస్తుతం అక్కడక్కడా కొంత శిథిలమై ఉంది.

(పుట..253)

విజయనగర కోటల, భవనాల గురించిన వర్ణన[మార్చు]

గోడలపై బురుజు లున్నాయి. మైదాన ప్రాంతంలో నున్న ప్రహరీ గోడకు నీటితో నిండిన అగడ్త ఉంది. అంతేగాక గోడ వెంబడి సమాన దూరంలో మొనదేలిన రాతి బండలు పాతిపెట్టబడి ఉన్నాయి. పల్లపు ప్రాంతంలో ప్రహరీ గోడ కొండ భాగం వరకూ ఉంది. ఈ మొదటి ప్రాకారం దాటగానే చాలా దూరం వరకు వ్యవసాయ భూములు, వరి పంటలు, పండ్ల తోటలున్నాయి. సమృద్ధిగా నీరున్నది. ఈ నీరు చెరువుల నుండి మొదటి ప్రాకారం ద్వారా వస్తుంది.

(పుట..254) తర్వాత ఇంకో ప్రహరీ గోడ వస్తుంది. ఇది కూడా రాతి కట్టడంతో బలిష్ఠంగా ఉంది. ఈ ప్రవేశ ద్వారానికి రెండు బురుజులున్నాయి. ఇవి బలంగాను అందంగానూ ఉన్నాయి. లోపలికి ప్రవేశించగానే రెండు ఆలయాలున్నాయి. ఒకటి చుట్టూ గోడ కలిగి లోపల చెట్లుండగా, రెండో దానిలో భవనాలున్నాయి. ఇంకొచెం ముందు కెళ్తే ఇంకో ప్రవేశ ద్వారం., ఇంకో ప్రహరీ గోడ వస్తుంది. ఈ ప్రాకారం, మొదటి ప్రాకారం లోపలున్న నగరం చుట్టూ ఉంది. ఈ ప్రాకారంలోనే రాజాంతఃపురం, ఇతర సేనా నాయకుల నివాసాలూ ఉన్నాయి. ఈ ఇళ్ళు వరుసలుగా ఉన్నాయి. ముఖ్య వీధి అందంగా శిల్పకళతో మనోహరంగా ఉంది. ఈ ఇళ్ళవరసలు దాటిన తర్వాత ఒక విశాలమైన మైదానం వస్తుంది. అందులో అనేక బండ్లు, వాటిలో అనేక రకాల సామానులూ ఉన్నాయి. ఇది రాజాంతఃపురానికి ఎదురుగా ఉంది. ఈ మైదానం నగరానికి మధ్యలో ఉంది. రాజుగారి ప్యాలెస్ బలిష్ఠమైన ప్రహరీ గోడ గలిగి, లోపల పోర్చుగీసు లోని కోటల కన్నా విశాల ప్రదేశమున్నది. దీన్ని దాటి ఇంకొంచెం ముందుకెళితే అక్కడ రెండు దేవాలయా లున్నాయి. అందులో ఒక దేవాలయం ముందు ప్రతిరోజు ఆనేక గొర్రెలను బలి ఇస్తారు. ఇక్కడ తప్ప ఈ నగరంలో ఇంకెక్కడా గొర్రెలను గాని, మేకలను గాని చంపరు. వీటి రక్తంతో ఆ గుడిలోని దేవునికి ఆభిషేకం చేస్తారు. ఈ జంతువుల తలలను పూజారికి వదిలేస్తారు.

(పుట 255) ఆ పూజారికి ఒక్కో తలకు ఒక నాణెం కూడా ఇస్తారు (సాకో). ప్రతి జంతువుని బలి ఇచ్చిన తర్వాత పూజారి తన బూరను (జోగి) ఊదుతాడు. దానర్థం, దేవుడు ఈ బలిని స్వీకరించాడని. ఈ పూజారులను గురించి తర్వాత చెప్తాను. ఈ ఆలయానికి దగ్గర్లోనే అందంగా అనేక బొమ్మలతో చెక్కబడిన ఒక రథం ఉంది. ఉత్సవ రోజుల్లో దీన్ని ప్రధాన వీధులలో త్రిప్పుతారు. ఇది చాల పెద్దదైనందున చిన్న వీధుల్లో తిరగదు. ఇంకొంచెం ముందుకెళితే అందమైన వరుసలుగా ఇళ్ళున్న వీధి కనిపిస్తుంది. ఇందులోని ఇళ్ళు ఎలా ఉన్నాయంటే, అందులో ధనికులు మాత్రమే నివసించ గలరు. ఈ వీధిలో ఆనేక మంది వర్తకులు కూడా నివసిస్తున్నారు. అక్కడ వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు ఇంకా ప్రపంచంలో దొరికే అనేకానేక వస్తువులను కొనవచ్చు. ఈ మైదానంలో సాయంత్రం వేళ అనేకమైన సాధారణ వస్తువులను కూడా అమ్ముతారు. చిన్న గుర్రాలు, అనేకరకాల పండ్లు, (నిమ్మ, ఆరంజి, ద్రాక్ష) కర్ర వస్తువులు, వంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఈ మైదానం చివరన ఇంకో ద్వారం ఉంది. ఇది రెండో ప్రహరీగోడ ప్రవేశ ద్వారంతో కలుస్తుంది. ఈ విధంగా ఈ విజయనగరం, మూడు కోట గోడలతో లోపల అంతఃపుర ప్రహరీ గోడలను కలిగి ఉంది.

(పుట..256) ఈ ద్వారం దాటగానే ఇంకో వీధి ఉంది. అందులో అనేక వృత్తి పనివారు నివసిస్తున్నారు. వారు అనేక వస్తువులను అమ్ముతున్నారు. ఈ వీధిలోనే అనేక దేవాలయా లున్నాయి. ఆ మాటకొస్తే ప్రతి వీధిలోనూ దేవాలయా లున్నాయి. ఇవి అక్కడి వ్యాపారస్తులకు వృత్తిపని వారికి సమావేశ మందిరాల వలె కూడా ఉపయోగ పడుతుంటాయి. కాని ప్రముఖమైన దేవాలయాలు నగరానికి వెలుపలే ఉన్నాయి. ఈ వీధిలోనే మా నాయకుడికి విడిది ఏర్పాటు చేసారు. ప్రతి శుక్రవారం ఇక్కడ సంత జరుగుతుంది. అందులో సముద్రపు ఉప్పుచేపలు, పందులు, అనేక రకాల పక్షులు, ఇంకా ఆనేక రకాల వస్తువులు ఈ దేశంలో తయారయినవి అమ్ముతున్నారు. వీటిలోని చాల వస్తువులు పేర్లు నాకు తెలియదు. ఇదే విధంగా ఈ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఒక్కో రోజు సంత జరుగుతుంది. ఈ వీధి చివరన ఆరబ్బు దేశస్తుల ఇళ్ళున్నాయి. వీరిలో చాలమంది ఈ దేశ పౌరులే. వీరు కాపలాదారులుగా రాజుగారి నుండి వేతనం పొందుతారు. ఈ నగరంలో వజ్రాలు, ముత్యాలు వంటి విలువైన వాటి వ్యాపారం జరుగుచున్నందున అనేక ఇతర దేశ వాసులు కూడా కన్పిస్తున్నారు. ఈ నగర వైశాల్యం గురించి నేను చెప్పను. ఎందుకంటే ఏ ఒక్క ప్రదేశంనుండి ఈ నగరాన్నంతటిని చూడ వీలు కాదు. నేను ఒక కొండ నెక్కాను. అక్కడి నుండి చాల వరకు నగరం కన్పించింది. ఈ ప్రాంతమంతా కొండలమయమై నందున నగరమంతా కనబడలేదు. అయినా నాకు కనుపించినంత నగర భాగమే "రోమ్" నగరమంత ఉంది. చూడడానికి చాల అందంగానూ ఉంది. అనేక పండ్ల తోటలతో, మధ్యలో నీరు ప్రవహిస్తున్న పంట కాలువలతో, అక్కడక్కడా చెరువులతోను, రాజాంతఃపుర సమీపంలో తాటి తోపులు, ముఖ్యమైన పండ్ల తోటలూ ఉన్నాయి. ఆరబ్బుల కాలనీ ప్రక్కన ఒక చిన్న నది ఉంది. దాని ప్రక్కన అనేక పండ్ల తోటలున్నాయి. ఎక్కువగా మామిడి, వక్క చెట్లు, జామ, నిమ్మ, ఆరంజి వంటి తోటలు ఒక్క దాని ప్రక్కన ఒక్కటి ఉన్నందున అదంతా కలిసి ఒక దట్టమైన అరణ్యంలాగ కనిపిస్తున్నది.

(పుట..257) ఇందులో తెల్ల ద్రాక్ష కూడా ఉంది. వీటికంతటికి నీరు, నేనిదివరకు చెప్పిన మొదటి ప్రహరీ గోడకు ఆవల నున్న రెండు చెరువుల నుండి వస్తుంది. ఈనగర జనాభాను లెక్కించడం సాద్యం కాదు. జనాభా గురించి రాస్తే ఇదేదో కట్టు కథ లాగ అన్పిస్తుంది. కావున దీని గురించి రాయలేను. కాని ఒక్కటి మాత్రం చెప్పగలను. వీధుల్లో నడుస్తున్న ప్రజలు, వారి ఏనుగులను తప్పించుకొని ముందుకు పోవడానికి సైనిక పటాలానికి గాని, గుర్రపు దళానికి గానీ అంత సులభం గాదు. అంటే వీధుల్లో జనం అంత ఒత్తుగా ఉన్నారన్నమాట. ఈ నగరం ప్రపంచంలోనే మిక్కిలి స్వయం సమృద్ది గలిగిన నగరం. ఇక్కడ ఆహార ధాన్యాలు, వరి, గోధుమ, జొన్న, పెసలు, ఉలవలు, పప్పు ధాన్యాలు అధిక మొత్తంలో నిల్వలున్నాయి. వీటిని నిల్వ చేయడానికి విస్తారమైన ఆవాసాలున్నాయి. వీటి ధరలు కూడా తక్కువే. ఇక్కడ గోధుమలు తక్కువ. ఆరబ్బులు తప్ప ఇతరులు దీన్ని తినరు. వీధుల్లో వచ్చిపోయే ఎద్దుల బండ్ల వరసలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార స్థలాలకు వెళ్ళే ఈ బండ్ల వరసలను దాటడానికి చాలాసేపు ఆగవలసి వస్తుంది. లేకుంటే వేరే దారి గుండా వెళ్ళ వలసి వస్తుంది. కోళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయి. నగరం లోపల ఒక "పావో" కు 3 కోళ్ళు అమ్ముతుంటే, అదే ధరకు నగరం బయట నాలుగు కోళ్ళు వస్తాయి.

(పుట...258) (ఈ పుటలో..అనేక రకాల పక్షులు వాటి ధరలు, కుందేళ్ళు వంటి జంతువులు, వాటి ధరలు,పాలు, పెరుగు విక్రయం గురించి చాల విపులంగా వివరించారు. ఈ విషయం అంత ముఖ్యమైనది కాదు గనుక వదిలేద్దాం)

(పుట259) ఇక్కడికి ఉత్తరపు వైపున పెద్ద నది ఉంది. ఇందులో మత్స్య సంపద ఎక్కువ. "ఆనెగొంది" అనే నగరం ఈ నది ఒడ్డున ఉంది. వీరు చెప్పే దాన్ని బట్టి ఈ నగరం చాల పురాతన మైనది. గతంలో ఈ నగరమే ఈ రాజ్యానికి రాజదానిగా ఉండేదట. కాని ఇప్పుడు ఇందులో కొద్ది మంది ప్రజలే ఉన్నారు. ఇప్పటికీ ఈ నగరంలో కోట గోడలు బలిష్ఠమైన రెండు కొండల మధ్య ఉన్నవి. దీనికి రెండు ప్రవేశ ద్వారాలున్నాయి. ఇందులో రాజు తరఫున ఒక సేనాధిపతి ఇందులో నివసిస్తున్నాడు. నదిని దాటి ఈ నగరానికి రావడానికి ప్రజలు బుట్ట పడవలను వాడుతున్నారు. ఇది, క్రింద చర్మం వేయబడి, కర్రలతో చేసిన పెద్ద గుండ్రని బుట్ట. ఈ పడవలు సుమారు 15 - 20 మందిని తీసుకు పోగలవు. అవసరాన్ని బట్టి గుర్రాలు, ఎద్దులను కూడా వీటి ద్వారా నదిని దాటిస్తారు. కాని ఎక్కువగా అవి నీటిలో ఈదుకుంటూ ఇవతలి గట్టుకు వస్తాయి. ఈ పడవలను ఒకడు తెడ్డుతో నడిపిస్తాడు. ఇవి తిరుగుతూ వెళ్ళతాయి. ఈ దేశంలో ఇటువంటి పడవలే ఎక్కువ.

(పైన చెప్పిన నగరం "ఆనెగొంది". శిథిలమైన ఈ నగరం ఇప్పుడు కూడా ఉంది. ఆ బుట్ట పడవలను "పుట్టి" అంటారు. ఇక్కడ చెప్పిన నది తుంగభద్రా నది. ఈ నదిని దాటడానికి ఇప్పటికి ఈ పుట్టి లనే వాడుతున్నారు)

హంపి లోని విరూపాక్షాలయం గురించి...(పుట 260)[మార్చు]

ఈ నగర ప్రహరీ గోడకు అవతల ఉత్తర దిక్కున మూడు అందమైన దేవాలయాలున్నాయి. ఒకటి విఠలాలయం. ఇది ఆనెగొంది కెదురుగా ఉంది. రెండోది చాలా పురాతన మైనందున దీన్ని వీరు చాలా పవిత్రంగా భావించి, యాత్రికు లెక్కువగా వస్తుంటారు. ఈ ఆలయ ముఖద్వారాని కెదురుగా తూర్పు వైపున అత్యంత అందమైన ఇళ్ళతోను, వరండాలతోను అలరారుచున్న వీధి ఉంది. ఇందులో ఇక్కడికి వచ్చే యాత్రికులకు వసతి కల్పించ బడుచున్నది. ధనవంతులకు కూడా వసతి గృహములున్నవి. రాజుగారి బసకు కూడా ఇక్కడ ఈ వీధిలోనే ఒక పేలస్ కలదు. ప్రధాన ద్వారంపై అందమైన చెట్టు చుట్టూ స్త్రీ, పురుషుల చిత్రాలతో ఉంది. ఈ ద్వారంపై అతి ఎత్తైన గోపురం కలదు. అందులో మనుషులు, ఆడ, మగ, వేట చిత్రాలు ఉన్నాయి. ఈ గోపురం క్రింద నుండి పైకి పోనుపోను సన్నంగా ఉంది. గోపురంలోనుండి లోపలి కెళ్ళగానే విశాలమైన ఆవరణం అందులో ఇంకో ప్రవేశద్వారం ఉంది. ఇది కూడా మొడటి దాని లాగే ఉంది. కాని చిన్నది. లోపలి కెళ్ళగానే మరో ఆవరణ, అందులో ఒక కట్టడం వరండాలతో చుట్టూ స్తంభాలతో ఉంది. (హంపిలో ఉన్న విరూపాక్షాలయం గురించి)

(పుట 261) దీనికి మధ్యలో గర్భగుడి ఉంది. ఈ గర్భగుడి ముందు నాలుగు స్తంభాలున్నాయి. అందులో రెండు బంగారు పూత తోను, మరో రెండు రాగిరేకు తాపడం తోనూ ఉన్నాయి. ఈ గుడి చాల పురాతనమైనందున, స్తంభాలపై నున్న బంగారు పూత కొంతభాగం పోయి లోపలున్న రాగి రేకు కన్పిస్తున్నది. అంటే ఆ నాలుగు స్తంభాలు రాగివే నన్నమాట. దేవుడి కెదురుగా నున్న స్తంభాలను ప్రస్తుతం పరిపాలిస్తున్న రాజు శ్రీ కృష్ణ దేవరాయలు ఇచ్చాడు. మిగాతావి అతని పూర్వీకు లిచ్చినవి. ద్వారానికి ముందు పైకప్పు వరకు రాగితో తాపడం చేయబడి ఉంది. పై కప్పులో పులి లాంటి జంతువుల బొమ్మలు చిత్రించబడి ఉన్నాయి. విగ్రహం ముందున్న స్తంభాలలో అక్కడక్కడా రంధ్రాలున్నాయి. రాత్రులందు వాటిలో నూనెదీపాలు పెడతారని వీరు చెప్పారు. ఆ విధంగా రెండు మూడు వేల దీపాలు పెడతారట. (పైన ఉదహరించిన ఆలయం హంపీ లోని విరూపాక్షాలయం. పైన చెప్పిన ఆలయ వివరాలు నాలుగు వందల సంవత్సరాల క్రిందటి పరిస్థితి). దీని తర్వాత చిన్న భూగర్భ గది లాగ ఒకటున్నది. దీనికి రెండు తలుపులున్నాయి. అందులో ఒక విగ్రహం నిలబడివుంది. దీనికన్నా ముందు మూడు తలుపులున్నాయి. ఇది అంతా చీకటిగా ఉంది. ఇక్కడ ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉంటుంది. ఇక్కడున్న ద్వార పాలకులు పూజారిని తప్ప ఎవ్వరినీ లోపలికి పోనివ్వరు. నేను వారికి కొంతధనం ఇచ్చినందున నన్ను లోనికి పోనిచ్చారు. ఈ రెండు ద్వారాల మధ్య చిన్న విగ్రహాలున్నాయి. ఇందులోని ప్రధాన విగ్రహం ఏ ఆకారమూ లేని గుండ్రటి రాయి మాత్రమే (౧*). దీనికి వీరు చాల భక్తితో పూజ చేస్తారు. (౧* ఇది శివ లింగం) ఈ ఆలయం వెలుపల భాగమంతా రాగితో తాపడం చేయబడి ఉంది. గుడి వెనుక వైపున వరండాకు దగ్గరగా తెల్లని చలువరాతి విగ్రహం ఉంది. దానికి ఆరు చేతులున్నాయి. ఒకచేతిలో..........ఇంకో చేతిలో కత్తి, ........

(పుట 262) మిగతా చేతులలో ఎవో పవిత్రమైన వస్తువు లున్నాయి. దాని పాదాల క్రింద ఒక బర్రె, ఇంకో జంతువు ఉన్నాయి. ఈ జంతువు బర్రెను చంపడానికి సహాయం చేస్తున్నట్టుంది. (ఇది మహిషాసుర మర్దని విగ్రహం) ఈగుడిలో నిత్యం నేతి దీపాలు వెలుగుతుంటాయి. ఈ చుట్టు పక్కల ఇతర ఆలయాలున్నాయి. విరూపాక్షాలయంలో నుండి ఉత్తర దిశలో నున్న.... అనగా తుంగభద్రా నది వైపు బయటికి వస్తే అక్కడున్న కోనేరు ముందు ఈ ఆలయా లున్నాయి). ఇవి కూడా అన్ని దేవాలయాల లాగే ఉన్నాయి. కాని ఇది ప్రధాన మైనది, పురాతనమైనదీను.

(పుట 262) ఈ ఆలయాలకు చాల భవనాలు, భూములు, తోటలు, ఉన్నాయి. వాటిలో బ్రాహ్మణులు తాము తినడానికి కూరగాయలు, ఇతర పంటలూ పండించుకుంటారు. ప్రత్యేక ఉత్సవాల సందర్భంలో చక్రాలున్న రథాన్ని లాగుతారు. ఆ సందర్భంలో నాట్యగత్తెలు నాట్యమాడగా, వాద్యకారులు వాద్యాలను మ్రోగించగా అత్యంత వైభవంగా ఈ రథాన్ని గుడి ముందున్న వీధిలో ఊరేగిస్తారు. ఇటువంటి ఉత్సవ సందర్భం నేను ఈ నగరంలో ఉండగా రాలేదు. కాబట్టి నేను చూడలేక పోయాను. ఈ నగరంలో ఇంకా చాలా ఆలయాలున్నాయి. వాటి నన్నింటిని గురించి వ్రాయాలంటే చాలా ఎక్కువ అవుతుంది. మన దేవుని నమ్మని వీరు, మనలాగే కొన్ని దినాలలో విందులు చేసుకుంటారు. అలాగే కొన్ని రోజులు ఉపవాసముంటారు. ఆ దినాలలో పగలంతా ఏమి తినకుండా ఆర్థరాత్రి పూట మాత్రమే తింటారు. ముఖ్యమైన ఉత్సవం రోజున రాజుగారు తన కొత్త నగరం నుండి విజయనగరాని కొచ్చి, ఈ ఉత్సవంలో పాల్గొనడం ఒక ఆచారం. ఈ సందర్భంలో ఈ దేశంలో నాట్యగత్తె లందరు, ఇక్కడికి రావాలి. అదే విధంగా, సైన్యాధిపతులు సామంత రాజులు ఇతర ప్రముఖులు వారి సిబ్బందితో సహా రావలసి ఉంటుంది. కాని యుద్ధప్రాంతంలో ఉన్నవారికి సుదూర ప్రాంతంలో ఉన్నవారికీ యుద్ధభయం ఉన్న ప్రాంతాల వారికీ రాకుండుటకు మినహాయింపు ఉంది. ఈ ఉత్సవాలు సెప్టెంబరు ౧౨ తారీఖున ప్రారంభమై, రాజాంతఃపురంలో తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. (ఇవి దసరా ఉత్సవాలు)

(పుట 363)

రాజాంతఃపురంలో దసరా ఉత్సవాల వర్ణన[మార్చు]

ఇంచుమించు 500 సంవత్సరాల క్రితం "డొమింగో పీస్" అనే యాత్రికుడు విజయనగరంలో ప్రత్యక్షంగా చూసి వివరించిన దసరా ఉత్సవాల సంబరాలు వారి మాటల్లో వినండి)

అంతఃపుర ముఖ ద్వారం ఈ మైదానానికి ఎదురుగా ఉంది. ముఖద్వారంపై గోపురముంది. ఈ ద్వారం నుండే ప్రారంభమయిన ప్రహరీగోడ అంతఃపుర ప్రాంగణమంతా చుట్టి ఉంది. ఈ ద్వారం వద్ద చాల మంది కాపలాదారు లున్నారు. వారు తమ చేతుల్లో కర్రలు, కొరడాలూ పట్టుకొని ఉన్నారు. వీరు తమ అధికారి చెప్పిన వారిని, ప్రముఖులనూ తప్ప మరెవ్వరినీ లోనికి వంపరు. ఈ ద్వారం దాటి లోపలికెళితే ఒక మైదానమున్నది. ఇక్కడ కూడా ద్వార పాలకులున్నారు. లోపలి కెళ్ళగానే మరో మైదాన ముంది. దీని చుట్టూ ఉన్న వరండాలలో ఉత్సవాలను చూడడానికి వచ్చిన సేనాధిపతులు ఇతర ప్రముఖులూ ఉన్నారు. ఈ మైదానానికి ఉత్తరం ఎడం వైపున ఒకే అంతస్తు కలిగిన ఒక పెద్ద భవనం కలదు. మిగతావి కూడా అదేవిధంగా ఉన్నాయి. ఏనుగు ఆకారంలో చెక్కిన శిలా స్తంభాలు ఇంకా ఇతర శిల్పాలతో నిండిన స్తంభాలపై ఈ భవనం ఉంది. ముందు భాగమంతా ఖాళీగా ఉంది. అక్కడి కెళ్ళడానికి రాతి మెట్లదారి ఉంది. దీని చుట్టూ వరండా లున్నాయి. ఇక్కడ కూడా ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన వారున్నారు. దీనిని "హౌస్ ఆఫ్ విక్టరీ" అని పిలుస్తారు. ఈ రాజుగారు ఒరిస్సా (కళింగ)ను జయించి తిరిగి వచ్చిన తర్వాత తన విజయానికి గుర్తుగా దీన్ని నిర్మించాడు. (దీన్నే ఇప్పుడు "దసరా దిబ్బ" అని అంటున్నారు). ఈ మైదానానికి కుడి ప్రక్కనున్న స్థలంలో కర్రలతో ఏర్పాటు చేసిన ఎత్తైన వేదికలున్నాయి. ఇవి ఎంత ఎత్తున్నాయంటే, ఇవి బయటి నుండి కూడా ప్రహరీ గోడ మీదుగా కన్పిస్తుంటాయి.

(పుట 264) ఈ వేదికలు ఈ దసరా ఉత్సవానికి మాత్రమే ఏర్పాటు చేసారు. వీటి చుట్టూ అందమైన ఎర్రటి, ఆకు పచ్చని రంగుల పట్టు బట్ట, క్రింద నుండి పైదాక కప్పబడి ఉంది. ఇటువంటి కర్ర వేదికలు పదకొండున్నాయి. ఈ గేటు కెదురుగా రెండు వృత్తాకార వేదికలున్నాయి. అత్యంత ఆడంబరంగా ముస్తాబైన, రత్నఖచితమైన ఆభరణాలు ధరించిన నాట్యగత్తెలు ఆ వేదికల మీదున్నారు. ఈ గేటు కెదురుగానే తూర్పు దిక్కున మధ్యలో హౌస్ ఆఫ్ విక్టరీ లాంటి వేదికలు రెండున్నాయి. వీటిపై కెక్కడానికి అందంగా చెక్కబడిన రాతి మెట్లున్నాయి. ఒకటి మధ్యలో ఉండగా రెండోది ఆ చివరనున్నది. దీనికి అన్నివైపుల, క్రింద, పైనా, అ స్తంభాలతో సహా అందమైన కుట్టుపని ఉన్న బట్టతో కప్పబడి ఉంది. ఈ రెండు భవనాల పై రెండు వేదికలు ఒకదానిపై ఒకటి కట్టబడి ఉన్నాయి. ఇవి కూడా అందమైన శిల్పకళతో ఉన్నాయి. ఈ వేదికలు రాజుగారి పుత్రులకు, వారి అంతరంగికులకు, కొన్ని సందర్బాలలో నపుంసకులకూ ఉపయోగిస్తారు. రాజుగారి అనుమతి ప్రకారం ఉత్సవం బాగా కనుపించే విధంగా రాజుగారికి దగ్గరగా, పైనున్న వేదిక మీద మాకొరకు ప్రత్యేకించారు. నేనిదివరకే చెప్పినట్లు రాజుగారి అంతఃపురంలో రాజుగారు, వారి రాణులు, వారి భటులు, పరిచారికలు సిబ్బంది అందరూ కలిసి పన్నెండు వేల మంది ఉంటారు. వారు లోనికి వెళ్ళడానికి దారి ఉంది. (పుట...265) రాజాంతఃపురానికి, "హౌస్ ఆఫ్ విక్టరి" వేదికకూ మధ్య ఒక దారి ఉంది. దీని ద్వారా అంతఃపుర ప్రాంగణంలోనికి వెళ్ళవచ్చు. లోపల ౩౪ వీధులున్నాయి. ఈ దసరా వేదికపై రాజుగారి కొక ప్రత్యేక మయిన గది ఉంది. అది బట్టతో కప్పబడి, తలుపులు కలిగి ఉంది. అందులో దేవి విగ్రహం ఉంది. వేదిక మధ్యలో మెట్లకెదురగా చిన్న వేదికపై ఈ రాజ్యం యొక్క సింహాసనం ఉంచబడి ఉంది. నాలుగు అంచులు కలిగి మధ్యలో గుండ్రంగా ఉండి, ఇది అత్యంత నేర్పు గలిగిన చక్క పనితనంతో ఉండి పట్టుబట్ట కప్పబడివుంది. చుట్టూ బంగారపు సింహం బొమ్మలున్నాయి. బట్టల మధ్య ఖాళీలలో ముత్యాలు పరచి, వాటిపై నున్న బంగారు పళ్లేలలో రత్నాలు, వజ్రాలు వంటి విలువైనవి పోసి ఉన్నాయి. చుట్టూ ప్రముఖ వ్యక్తుల బంగారు విగ్రహాలున్నాయి. ఈ ఆసనంపై పూలతో అలంకరించబడిన బంగారు విగ్రహం ఉంచబడి ఉంది. ఈ ఆసనం ప్రక్కన వేదికపై కిరీటం లాంటిది నిలబెట్టబడి ఉంది. ఇది కూడా ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలు వంటివి పొదగబడి ఉన్నాయి. దీని మందం రెండు మూడు అంగుళాలున్నది. దీని ముందు రెండు మూడు దిండ్లు ఉన్నాయి. రాజుగారు ఉత్సవ సందర్భంలో ఇక్కడ కూర్చుంటారు.

(పుట 266)

ఉత్సవాలు ఎలా ప్రారంభమవుతాయంట[మార్చు]

రాజుగారు ఊదయాన్నే ఈ వేదికపై కొచ్చి దేవి విగ్రహం ఉన్న గదిలోనికి తన పూజారులతో వెళ్లి పూజాదికాలు నిర్వహిస్తాడు. బయట ఆంతరంగికులు, ప్రముఖులూ ఉంటారు. ఎదురుగా నాట్యగత్తెలు నాట్యం చేస్తూంటారు. వరండాలలో ఉత్సవాన్ని చూడడాని కొచ్చిన సేనాధిపతులు, ఇతర ప్రముఖులూ ఉంటారు. వేదిక ముందు అత్యంత ఆడంబరంగా అలంకరించ బడిన పదకొండు గుర్రాలు, వాటి వెనుక నాలుగు ఏనుగులూ ఉన్నాయి. దేవి గదిలో నుండి రాజుగారు బయటకు రాగానే, వెంట ఉన్న పుజారి తన చేతిలో ఉన్న బుట్టలోని తెల్లని గులాబి పూలతో వస్తాడు. రాజుగారు మూడు పిడికిళ్ల పూలు తీసుకుని గుర్రాలపై చల్లుతాడు. ఆదే విధంగా ఏనుగులపై కూడా చల్లుతాడు. ఆ తర్వాత పూజారిగారు క్రిందకి దిగి మిగతా గుర్రాలపై కూడా మిగిలిన పూలు చల్లుతాడు. తర్వాత రాజుగారు దేవి విగ్రహం ఉన్న గదిలోని కెళ్లగానే దాని కున్న పరదాలను తొలగిస్తారు. రాజు ఆసీనులు కాగానే 24 ఎనుబోతులను, 150 పొట్టేళ్లను విగ్రహానికి బలి ఇస్తారు.

(పుట 267) ) ఆ తర్వాత రాజుగారు ఇతర వేదికల పైకి వెళ్తాడు. మెట్లెక్కేటపుడు పైన ఉన్న ఆ బ్రాహ్మణులు రాజుగారి మీద పూలు చల్లుతారు. అక్కడ రాజుగారు తన కిరీటం తీసి క్రింద పెట్టి తిరిగి దేవి విగ్రహం ఉన్న గదికి వస్తాడు. ఆక్కడ దేవికి నమస్కరించి ఇంకో ఆలయంలోని కెళ్తాడు. అక్కడున్న అగ్నిగుండంలో ఒక విదమైన పొడి చల్లుతాడు. (ఇది విభూతి అయి ఉండును). అక్కడి నుండి తన గుర్రాల వద్దకు వస్తాడు. అక్కడున్న సేనాధిపతులు, ఇతర ప్రముఖులు, సామంత రాజులూ సమర్పించిన బహుమతులను, వారి నమస్కారాలను స్వీకరించి అక్కడి నుండి తన అంతఃపురం లోనికి వెళ్లి పోతాడు. ఈ విధంగా ప్రతిరోజు (తొమ్మిది రోజులు) జరుగుతుంది.

(పుట 268) (ఈ పుటలో కూడా ఈ దసరా ఊత్సవాల వర్ణన ఇంకా చాల విపులంగా వివరించబడి ఉంది. ఈ వివరాలు అంత ప్రాధాన్యం ఉన్నవిగా అనిపించలేదు గనుక వదదిలి వేసాను.)

దసరా సందర్భంగా జరుగు వినోద కార్యక్రమాలు[మార్చు]

సాయంత్రం మూడు గంటలకు అందరూ ఈ మైదానంలో సమావేశ మవుతారు. ముఖ్యంగా సేనాధిపతులు, యువరాజులు, పుర ప్రముఖులు, సామంతులు ఇలా అందరూ వారికి నిర్దేశించిన ఆసనాలలో ఆసీనులై ఉంటారు. స్త్రీలు, అనేక రకాల వజ్రాభరణాలు, ముత్యాలు, బంగారు కడియాలు ధరించి వచ్చారు. ఒక పైపు నాట్యగత్తెలు నాట్యం చేస్తుంటే మరో వైపు కుస్తీ పోటీలు జరుగుచున్నాయి. కుస్తీ పోటీలు చాల క్రూరంగా ఉంటాయి. ఈ పోటీలలో పండ్లు రాలిపోవడం రక్తం కారడం, స్పృహ కోల్పోవడం వంటివి కూడా జరుగుతూంటాయి. సైనికులు వారి వారి ఆయుధాలతో విన్యాసాలు చేస్తుంటారు. కీలు గుర్రం లాంటివి కూడా ఉన్నాయి. చీకటి పడగానే అనేక రంగురంగుల దీపాల అలంకరణలతో ఆ మైదానమంతా పట్ట పగలుగా తోస్తున్నది. వినోద కార్యక్రమాలు పూర్తవగానే బాణాసంచా కాల్చడం ప్రారంభ మవుతుంది. అనేక రాకెట్లు, బాంబులు పేల్చారు. ఇది పూర్తయిన తర్వాత సైన్యాధిపతులకు సంబంధించిన అలంకృత రథాలు ప్రవేశిస్తాయి. కొన్ని రథాలు రెండు మూడు అంతస్తులు కలిగి ఉన్నాయి. వీటిలో నాట్యాల వంటి వివిధ విన్యాసాలు జరుగుతున్నాయి. ముందుగా రాజుగారి గుర్తుగా రెండు గొడుగులు ఉన్న గుర్రం వస్తుంది. తర్వాత ఇతర గుర్రాలు వస్తాయి. వాటి విన్యాసాలు అయిన తర్వాత గుర్రాలన్నీ ఆరు వరుసలుగా రాజుగారి ముందు నిలబడతాయి. అన్నింటికన్నా ముందు రాజుగారి గుర్రం ఉంటుంది. అప్పుడు లోపలనుండి ఒక బ్రాహ్మణుడు ఒక పళ్లెంలో, కొబ్బరి కాయలు, బియ్యం, పూలు ఇంకా కొన్ని వస్తువులు ఒక కుండలో నీళ్లతో వచ్చి గుర్రాల చుట్టూ తిరిగి ఏదో కార్యక్రమం చేసి లోనికి వెళ్లిపోతాడు. ఇప్పుడు అనేక మంది స్త్రీలు, అనేక రకాల వాద్యాలతో ప్రవేశిస్తారు.(ఈ స్త్రీలు ధరించిన వివిధ రకాల వస్త్రాలు, ఆభరణాల వివరణ చాలా ఉంది. నాట్యం తర్వాత సైన్యం ప్రవేశిస్తుంది. సైన్యం వేషధారణ గురించి చాల వివరాలున్నాయి. (పుట 273) )

ఈ దసరా సందర్భంగా అంతఃపుర స్త్రీలు బంగారు, వజ్రాభరణాలను ప్రదర్శించే తీరు గురించి[మార్చు]

ఇరవై ముప్పై మంది స్త్రీలు చేతిలో బెత్తాలతో భుజాన కొరడాలతో లోపలి నుండి వస్తారు. వారి వెంబడి కొందరు నపుంసకులు కూడా వస్తారు. వీరందరు అనేక రకాల వాయిద్యాలను వాయిస్తుండగా వారి వెనక కొంత మంది స్త్రీలు ప్రత్యేకంగా అలంకరించుకుని వస్తారు. వారి అలంకరణ ఈ విధంగా ఉంది: "వారు ధరించిన పట్టుబట్టలు చాల ఖరీదైనవి. తలకు పొడవాటి టోపీ ధరించారు (ఇవి కిరీటాలయి ఉంటాయి). ఈ టోపీలపై పెద్ద పెద్ద ముత్యాలతో చేసిన పుష్పాలు అమర్చబడి ఉన్నాయి. వారి బుజాలపైన, మెడ మీదా వేసుకున్న అభరణాలు బంగారంతో చేసి వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాల వంటి విలువైన రాళ్లను పొదగబడి ఉన్నాయి. అంతే గాక భుజకీర్తులకు ముత్యాల హారాలు వేసుకున్నారు. ముంజేతులకు కంకణాలు కూడా వజ్రాలు వంటివాటితో తాపడం చేయబడి ఉన్నాయి. మోచేతి నుండి పైభాగం కొంత ఖాళీగా ఉన్నా, క్రింద చేతికి వేసుకున్న కంకణాలు కూడా వివిధ రకాల వజ్రాలతో ఉన్నాయి. వారు వేసుకున్న కాళ్ల కడియాలు, వాటికి పొదగబడిన పజ్రాలూ మిగతా వాటికన్నా విలువైనవిగా ఉన్నాయి. వారు తమ చేతులతో బంగారు బిందెలను ఎత్తుకున్నారు. వాటిలోపల ముత్యాలను లక్కతో తాపడం చేసి అందులో ఒక దీపం పెట్టబడి ఉంది. వీరందరు పదహారు ఇరవై సంవత్సరాల మధ్య వయస్సున్నవారు.

(పుట..274) ) వీరు ధరించిన ఆ బంగారు ఆభరణాల బరువుతో వారు సరిగా నడవలేక పోతున్నారు. అందుచేత వారి పక్కనున్న ఇతర స్త్రీలు వారి చేతులను పైకెత్తి నడవడానికి సహాయ పడుతున్నారు. ఈ విధంగా వీరందరు ఆ గుర్రాల చుట్టూ మూడు సార్లు తిరిగి అంతఃపురం లోనికి వెళ్లిపోతారు. ఈ స్త్రీలందరు అంతఃపుర మహారాణుల చెలికత్తెలు, సహచరులు మాత్రమే. ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో ప్రతి మహారాణి తనకు కేటాయించిన రోజున తన పరిజనాన్ని ఈ విధంగా ప్రదర్శనకు పంపుతుంది. ఈ విధంగా ఈ మహారాణులు ఆయా రోజుల్లో ఆభరణాలతో అలంకరించిన తమ చెలికత్తెలను పంపి తమకున్న ఆభరణాల గొప్పతనాన్ని ప్రదర్శించుకుంటారు. వీరందరు లోపలి కెళ్లగానే గుర్రాలు కూడా వెళ్లిపోతాయి. తర్వాత ఏనుగులు వచ్చి వందనం చేసి వెళ్లిపోతాయి. రాజుగారు కూడా వెళ్లిపోతాడు. తర్వాత పూజారులు వచ్చి దేవి విగ్రహాన్ని తీసుకుని దసరా వేదికపై నున్న గదిలో పెడతారు. అప్పుడు రాజుగారు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. అపుడు ప్రతి రోజు లాగానే కొన్ని ఎనుబోతులను, పొట్టేళ్లను అక్కడ బలి ఇస్తారు. బలి కార్య క్రమం జరుగుతున్నప్పుడు, ఆ తర్వాతా కూడా చాల సేపటి వరకు నాట్యగత్తెలు నాట్యం చేస్తూనే ఉంటారు. ఈ తొమ్మిది రోజుల్లో ఎవరూ పగటి పూట భోజనం చేయరు. ఉపవాస ముంటారు. రాజుగారితో సహా అందరి భోజన సమయం ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఆర్థరాత్రి మాత్రమే. ఈ విధంగా ఈ దసరా ఉత్సవాలు జరగగా తొమ్మిదో రోజు ౨౫౦ దున్న పొతులను, ౪౫౦౦ గొర్రెలనూ బలి ఇస్తారు.

(పుట 275)

దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగే సైనిక బలగాల సమీక్ష[మార్చు]

దసరా ఉత్సవాలు ముగియగానే రాజుగారు తన సైనిక బలగాలను సమీక్షీస్తాడు. ఇందుకోసం నగరాని పది మైళ్ల దూరంలొ ఒక గుడారం ఏర్పాటుచేసి అందులో, ఇన్ని రోజులు పూజ లందుకున్న దేవివిగ్రహాన్ని ఉంచుతారు. ఈ గుడారం నుండి అంతఃపురం వరకు సేనా పతులు, ఇతర సైనికాధి కారులు తమ తమ సేనలతో వారి వారి హోదా ప్రకారం బారులు తీరుతారు. ఆ ప్రదేశంలో చెరువులుంటే దాని చుట్టు... దారి ఉంటె దాని వెంబడి, కొడల వాలులందు, అన్నింటా సైనిక దాళాలే. ఆ ప్రాంతంలో సైన్యం ఆక్రమించని ప్రాంతమే కనబదు. కాల్బలం సైనికులు ముందు వరుసలో ఉండగా, వారి వెనక, గుర్రాలు, వారి వెనుక ఏనుగులు ఇలా వరుసలుగా నిలబడతారు. వారందారూ తమ తమ ఆయుధాల తోనూ, తమ హోదాను తెలిపేపట్టీల తోను అందమైన దుస్తులతో ఉన్నారు.

(ఫుట..276) ) గుర్రాల తలమీద పాము పడగలు, పెద్ద జంతువుల చిత్రాలు అలంకరించ బడివున్నాయి. సైనికులు ధరించిన శిరస్రాణాలు వారి ముఖానికి, మెడకు కూడా కప్పబడి చూడ చక్కగా నున్నారు. గుర్రాలను కూడా రంగు రంగుల పట్టు బట్టలతో అలంకరించి ఉన్నారు. సైనికుల నడుముకు కత్తి, యుద్దాలలొ ఉపయోగించే చిన్న గొడ్డలి ఉన్నాయి. చేతులలో పొడవాటి ఈటెలు ఉండగా వాటికొనలు బంగారు, వెండితో చేయ బడ్డాయి. రాజు హోదా తెలిపే గొడుగులు అనేక రంగుల పట్టు బట్టతో చేసి ఉన్నాయి. ఏనుగులను కూడా ఇదే విధంగా అలంకరించి మెడలో గంటలతో తలమీద రంగు, రంగు బొమ్మల గీసి ఉన్నాయి.

(పుట 277) ) విలుకాండ్రు ధరించిన ధనుస్సులకు బంగారు పూత పూయబడి ఉంది. తుపాకి ధరించిన సైనికులు ముదురు రంగు దుస్తులు ధరించి ఉన్నారు. ఈ సమీక్షలో ఈటెలు, డాలు, విల్లులు, బాంబులు, ఇటువంటి ఆయుధాలను ఎలా తయారు చేసారా యనే కాక, వాటిని వాడే విధానం చూసి కూడా నేను చాలా ఆశ్చర్యపోయాను. సైనికులే ఇంతటి విలువైన దుస్తులు ధరిస్తుంటే ఇక రాజుగారు ఎలాంటి దుస్తులు ధరించేవారో ఊహించవచ్చు. రాజుగారు వెళుతుంటే పైన చెప్పిన విధంగా అలంకరించ బడ్డ కొన్ని ఏనుగులు, అదేవిధంగా ఇరవై గుర్రాలూ వెంబడి వెళతాయి. గుర్రాల కళ్లాలు ఇతర అలంకరణలలో బంగారం, ఇతర విలువైన రాళ్లూ పొదగబడి ఉన్నాయి. రాజుగారి దగ్గరగా ఒక పెద్ద పల్లకి ఉంది అది రాగితోగాని, వెండితో గాని చేయబడి ఉంది. దానిని పదహారు మంది మోస్తుంటే ఇంకో పదహారు మంది బరువు మార్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఇంతవరకు పూజలందు కున్న దేవి విగ్రహం ఉంది. ఆ విధంగా రాజుగారు వెళుతుంటే సైనికులందరూ గట్టిగా నినాదం చేసి, తమ తమ ఆయుధాలను భూమికి తాకించి శబ్దం చేసారు. గుర్రాలు గట్టిగా సకిలించాయి. ఏనుగులు ఘీంకరించాయి.. బాంబులు పేలాయి. తుపాకులు గర్జించాయి. ఈ శబ్దానికి నగరం అంతా తలకిందులై పోతుందా.. అని నాకు అనిపించింది. ప్రపంచం అంతా ఇక్కడే గుమిగూడి ఉందా.. అని కూడా అనిపించింది. ఈ విధంగా రాజుగారు అమ్మవారి గుడి లోకెళ్లునంత వరకూ ఉంది. రాజుగారు అలా లోపలి కెళ్లగానే సైనికులందరూ వెళ్లిపోతా రనుకున్నాను. కాని దానికి విరుద్దంగా అందరూ కదలకుండా రాతి బొమ్మల్లాగా నిలబడి పోయారు. గుడి లోపల రాజుగారు తన పూజా కార్యక్రమం పూర్తి గావించుకుని బయటకు వచ్చునంతవరకు వారు అలాగే నిలబడి ఉన్నారు. పూజానంతరం రాజుగారు బయటకు వచ్చి తన గుర్రమెక్కి వచ్చిన దారి వెంబడే నగరానికి బయలు దేరగానే సైనికు లందరూ తమ ఆయుధాలతో శబ్దం చేస్తూ ఉన్నారు. కొండలలో, గుట్టలలో ఉన్నవారు క్రిందికి దిగుతున్నారు. ఈ దృశ్యం చూస్తుంటే నాకు "నేను కల గంటున్నానేమో" ననిపించింది. నేను అలా తలతిప్పి అటూ ఇటూ చూస్తుంటే నేను నడుపుతున్న గుర్రం వెనకబడి పోయింది. సైనికాధికారు లందరూ నగరం వరకు రాజుగారి వెంబడి వెళ్లి తర్వాత విశ్రాంతికై వెళ్లిపోయారు. మిగతా సైనికులు తమ తమ గుడారాల వైపు వెళ్ళారు.

(పుట. 279)

విజయనగర సామ్రాజ్యం యొక్క సైనిక బలమెంత?[మార్చు]

రాజుగారి అధీనంలో ఒక మిలియన్ సైన్యం ఉంది. అందులో ౩౫,౦౦౦ మంది సైనికులు ఏ క్షణంలోనైనా పంపడానికి సిద్ధంగా ఉన్న వారిని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. నేను ఈ నగరంలో ఉండగా ఒక సందర్భంలో సముద్ర తీరంలో యుద్దం చేయడానికి ౫౦ మంది సైన్యాధిపతుల్ని, 1,50,000 సైనికుల్ని రాజుగారు పంపారు, సరిహద్దులో ఉన్న ముగ్గురు సామంత రాజులకు, తమ సైనిక శక్తిని ప్రదర్శించా లనుకుంటే రెండు మిలియన్ల సైనికుల్ని యుద్ధభూమికి తరలించగలరట. అందుచేత ఈ రాజుకు శత్రు భయంకరుడని బిరుదు గలదు. ఇంత సైన్యాన్ని పోషించడానికి రాజుగారికి ధనం ఎక్కడనుండి వస్తుందని ఎవరికైనా సందేహం కలుగుతుంది. ఈ రాజ్యంలో అనేక మంది కోటీశ్వరులున్నారు. ధనవంతులు, సైన్యాధిపతుల ఆధీనంలో నగరాలు, పల్లెలూ ఉంటాయి. ఎంతెంత సైన్యాన్ని వారు పోషించ వలసి ఉంటుందో రాజుగారు నిర్ణయిస్తాడు. ఈ విధంగా సైన్యాన్ని ఇటువంటి ధనవంతులు, జమీందార్లూ రాజుగారి తరఫున పోషిస్తుంటారు. రాజుగారి అవసరార్థం సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అదే విధంగా, రాజుగారు తన ఖజానా నుండి జీతం ఇచ్చే సైనికులు కూడా ఉంటారు. ఆ విధంగా రాజుగారి వద్ద 800 ఏనుగులు, 500 గుర్రాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. సామంతరాజులు, జమీందార్లు ప్రతి సంవత్సరం కట్టే కప్పం బహుమతులు చాలా ఉంటాయి. అదేవిధంగా దసరా సందర్భంగా కూడా ధనవంతులు రాజుగారికి అధిక మొత్తంలో బహుమతు లిస్తూంటారు. ఈ రాజ్యంలో ఒక పద్ధతి ఉంది. ప్రతి రాజు తాను ఏలుబడిలో ఉన్న కాలంలో ఒక పెద్ద ధనరాసిని కూడబెట్టి దాన్ని దాచిపెడ్తాడు. తన తర్వాత రాజ్యాని కొచ్చిన రాజు దాన్ని వాడడు. కనీసం అందులో ఎంత ఉందో కూడా చూడడు. అత్యవసరమైతే తప్ప దాన్ని వాడడు. ఆ విధంగా భద్రపరచిన ధనాగారం చాలా ఉంది.

(పుట 283) ) దసరా ఉత్సవాల తర్వాత రాజుగారు తాను నిర్మించిన కొత్త నగరానికి వెళ్తాడు. అక్కడి ప్రజలు రాజుగారికి ఘనస్వాగతం పలుకుతారు. రాజుగారి రాకతో వీధులన్నీ ఘనంగా అలంకరిస్తారు. ఆ సందర్భంగా ప్రతి ఉద్యోగి పేరు రాసి -- గుర్తింపు కొరకు వారి ముఖం, మీద ఇతర బాహ్య శరీరం మీదున్న గుర్తులను నమోదు చేస్తారు. ఇక్కడ కొత్త సంవత్సరంలో (దసరా తర్వాత వచ్చేది కొత్త సంవత్సరం) తన ఉద్యోగులందరికీ జీతాలివ్వడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం అందరికి వారి వారి హోదాను బట్టి వారికి జీతాలిస్తారు. ఈ ఉద్యోగులు వారి వారి హోదాను బట్టి వారు మూడు గుర్రాలు రెండు గుర్రాలు, ఒక గుర్రం కలిగి ఉంటారు.

(పుట 284) )

డొమింగో పీస్ స్యయంగా చూసి వర్ణించిన శ్రీకృష్ణ దేవరాయల రాజాంతఃపురం[మార్చు]

మేము మా గవర్నర్తో కలిసి రాజుగారి కొత్త నగరానికి వెళ్లి విజయనగర రాజాంతఃపురాన్ని సందర్శించడానికి అనుమతి కోరాము. రాజుగారు సంతోషించి దయతో అంగీకరించారు. మేము వెనుదిరిగి విజయనగరానికి రాగానే రాజాంతఃపురానికి చెందిన అధికారులు మాకు అంతఃపురాన్ని చూపించారు. అంతఃపుర ద్వారం వద్ద మమ్మల్ని నిలిపి మేము ఎంత మందిమి ఉన్నామో లెక్కబెట్టుకుని ఒకరి తర్వాత ఒకర్ని లోనికి అనుమతించారు. అది ఒక గది. లోపల నేల అంతా నున్నగా గచ్చు చేయబడి ఉంది. గోడలు తెల్లగా ఉన్నాయి. ఆ ఎదురుగానున్నది రాజుగారి నివాసము. దీని ప్రవేశ ద్వారం కిరువైపుల రెండు చిత్రపటాలు చిత్రించబడి ఉన్నాయి. కుడి చేతివైపు నున్నది (పుట 285) ప్రస్తుతమున్న రాజుగారి తండ్రిది, రెండోది ప్రస్తుత రాజు (శ్రీ కృష్ణ దేవరాయలు) గారిది. ఈ గది నుండి బయటకు రాగానే ఎడమ వైపున రెండు గదులు, ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. క్రిందనున్న గది భూమట్టానికి కొంచెం దిగువగా ఉంది. రెండు మెట్లు దిగాలి.ఈ మెట్లు రాగితో తాపడం చేయబడి ఉన్నాయి. అక్కడనుండి పైదాక అంతా బంగారంతో పూత పూయబడి ఉంది. బయట ఇది గుమ్మటంలాగ ఉంది. దానికున్న నాలుగు తలుపులకు వజ్రాలు, రత్నాలు, మాణిక్యాలూ తాపడం చేయబడి ఉన్నాయి. పైన, బంగారంతో చేయబడిన దీపస్తంభాలు రెండు వేళ్ళాడుతున్నాయి. వాటికి కూడా వజ్రాల వంటి రాళ్లు పొదగబడి ఉన్నాయి. ఈ గదిలో ఒక మంచం ఉంది. దాని కాళ్లు కూడా గది తలుపులలాగే ఉన్నాయి. దాని పట్టీలకు బంగారం తాపడం చేయబడి ఉంది. దానిమీదున్న దుప్పటి నల్లటి శాటిన్ బట్టతో చేయబడి ఉంది. దానిమీద రెండు దిండ్లున్నాయి. వాటికి కవర్లు లేవు. దుప్పటికి చుట్టూ ముత్యాలు వరుసలుగా కుట్టబడి ఉన్నాయి. దీని పైనున్న గదిలో ఏముందో నేను చూడలేదు. ఈ భవనం లోనే ఇంకో గది ఉంది. ఇది అందంగా చెక్కబడిన రాతి స్తంభాలు కలిగి ఉంది. ఈ గదికి క్రిందా పైనా, గోడలకు, స్తంభాలకు కూడా గులాబి తామర పువ్వులు చెక్కబడిన దంతంచే కప్పబడి ఉంది. ఇటువంటి అందమైన గది మరొక్కటి నాకు మరెక్కడా కనబడలేదు. ఇందులో రెండు సింహాసనాలున్నాయి. అవి బంగారంతో చేయబడినవి. ఇంకో మంచం వెండితో చేయబడి ఉంది. దానిమీద రెండు దిండ్లున్నాయి. ఇందులోనే ఒక చిన్న ఫలకం చూశాను. అది నీలాలతో చేయబడి ఉంది. దీని క్రింద కొన్ని ఆర్చీలున్నాయి, అది అంతఃపుర ద్వారానికి ప్రక్కనే ఉంది. దీని తలుపులు పెద్ద బీగాలతో మూయబడి ఉన్నాయి. లోపల ముందు తరాల పాలకులచే దాయబడిన ఖజానా ఉంది.

(పుట 286) ఆ తర్వాత మేము ఒక పెద్ద హాలు లోనికి ప్రవేశించాము. ఇది అంతా అందంగా గచ్చు చేయబడి ఉంది. మధ్యలో కర్ర స్తంభాలున్నాయి వీటి పైభాగమంతా రాగితో తాపడం చేయబడి ఉంది. వీటి మధ్యలో నాలుగు వెండి గొలుసులున్నాయి. వాటి కొక్కేలు స్తంభాల పైభాగానికి తగిలించి ఉన్నాయి. ఇది రాజుగారు తన రాణులతో ఉయ్యాల లూగడానికి చేసిన ఏర్పాటు. ఈ హాలు ప్రవేశ ద్వారానికి కుడి ప్రక్కనున్న నాలుగైదు మెట్లు ఎక్కి ఇంకో అందమైన భవనంలోనికి ప్రవేశించాము. ఇది కూడా నేనిదివరకు చూసిన భవనం లాగానే ఉంది. వీరి ఇళ్లన్నీ ఎక్కువగా ఒకే అంతస్తు కలిగి పైకప్పు చదునుగా ఉంది. అక్కడున్న మరో భవనం రాతి స్తంభాలతో పైకప్పు మాత్రం చక్కతో చేయబడి ఉంది. స్తంభాలు రాగిపూత పూయబడి ఉన్నాయి. ఇవి బంగారంతో తాపడం చేయబడి ఉన్నవా అన్నట్లు ఉన్నాయి. ఈ భవన ప్రవేశ ద్వారం ముందు నాలుగు స్తంభాల మంటపం ఉంది. స్తంభాలపై నాట్యగత్తెలు ఇరర చిత్రాలు మలచబడి ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ ఎర్రటి రంగులో పూత పూయబడి ఉన్నాయి.(పుట 287.. ) ఈ భవనం దేవి విగ్రహాన్ని ఉంచడానికి మాత్రమే వాడుతున్నారు. ఇందులో చివరగా మూయబడిన గదిలో దేవి విగ్రహం ఉంది. ఉత్సవాల సందర్భంలో ఈ దేవి విగ్రహాన్ని బంగారు సింహాసనంలో తీసుకెళ్తారు. ఈ భవనం నుండి బయటకి వచ్చి ఎడంచేతి వైపు నడవగా ఒక వసారా లోనికి ప్రవేశించాము.(కారిడార్). ఇది ఈ భవనం అంత పొడుగున్నది. ప్రవేశ ద్వారం వద్దనే ఒక బంగారు మంచం, వెండి గొలుసులచే వేలాడదీయబడి ఉంది. దీనికి వజ్ర, వైడూర్యాలు తాపడం చేయబడి ఉన్నాయి. ఈ భవనం పై మరో అంతస్తు ఉంది. దీని తర్వాత వసారాలో ఇంకో గది ఉంది. గది బయట విల్లంబులు చేత బట్టిన స్త్రీల చిత్రాలు ఉన్నాయి. దీని తర్వాత కొంచెం పైకి ఎక్కగా అక్కడ పెద్ద గంగాళాలున్నాయి. ఇవి బంగారంతో చేయబడినవి. ఇవి ఎంత పెద్దవంటే ఒక్కో దాంట్లో రెండు పొట్టేళ్లను వండవచ్చు. (...so large that in each they could cook half a cow,,,,) వీటితో బాటు పెద్ద పెద్ద వెండి పాత్రలు, ఇంకా చిన్న బంగారు పాత్ర లున్నాయి. ఆ తర్వాత సన్నటి మెట్ల వరుస ద్వారా ఇంకో భవనంలో కెళ్లాము. ఇది అంతఃపుర స్త్రీలకు నాట్యం నేర్పే మందిరం. ఇది అందమైన శిల్పాలతో చెక్కిన స్తంభాలతో నిర్మించ బడినది. పై కప్పుకు ఏనుగులు, ఇతర వింత జంతువుల చిత్రాలు వేయబడి ఉన్నాయి. స్తంభాల మధ్య ఆర్చి కలిగి స్తంభాలపై వివిధ రకాల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. కొన్నింటికి రంగులు కూడా వేయ బడివున్నాయి. నాట్య కారుల శిల్పాల చేతిలో ఒక మద్దెల లాంటి వాయిద్యం ఉంది. ఈ నాట్య శిల్పాలు ఎలా ఉన్నాయంటే నాట్యం చేస్తూ చివరగా ఏ భంగిమలో నాట్యం నిలుపు చేస్తామో ఆ భంగిమలో శిల్పం ఉంది. ఇటువంటి భంగిమలు అనేకం ఉన్నాయి. నాట్య పాఠం నేర్చుకునే టప్పుడు ముందురోజు ఏ భంగిమతో నాట్యం ముగించామో ఈ శిల్పాన్ని చూసి అక్కడినుండి నాట్యం నేర్చుకోడానికి ఈ శిల్పాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈభవనం చివరన ఎడం ప్రక్కన స్త్రీల చిత్ర పటాలున్నాయి. నాట్యం నేర్చుకునే ముందు శరీరం నాట్యానికి అనువుగా మలుచు కొనుటకు వ్యాయామం చేస్తున్న స్త్రీల చిత్రాలున్నాయి. దీనికెదురుగ ఒక ఆసనం ఉంది. రాజుగారు ఇక్కడ కూర్చొని నాట్యాన్ని తిలకీచేవారు. ఇక్కడి నేల, గోడలు అంతా బంగారు పూత పూయబడి ఉన్నాయి. ఈ మధ్యలో ఒక నాట్యగత్తె నాట్యం చివర చూపే భంగిమలో ఉన్నట్లు బంగారు విగ్రహం ఉంది. ఇది పన్నెండు సంవత్సరాల వయస్సున్న అమ్మాయంత ఉంది.

(పుట.289) ) ఇంతకన్నా ఎక్కువగా వారు మాకు చూప లేదు. రాణివాస మందిరాల్లోకి నపుంసకులకు తప్ప ఎవ్వరికి అనుమతి లేదు. ఇక్కడి నుండి మేము లోనికెళ్లిన ద్వారం పక్కనున్న రెండో ద్వారం గుండా బయటికి వచ్చాము. అప్పుడు మమ్ముల్ని తిరిగి లెక్కించారు. వీరు చెప్పిందాన్ని బట్టి ఈ విజయనగరంలో వంద వేల ఇళ్లు పైగా ఉన్నాయి. అవి ఒకంతస్తు కలిగి పై కప్పు చదునుగా ఉండి ఇంటి చుట్టూ గోడ కలిగి ఉన్నాయి. ఈ నగరానికి ఉత్తర వైపున రాతి గుట్టలు, గుట్టల మధ్య నది, నది కవతల "ఆనెగొంది" అనే నగరం ఉంది. ఈ ఆనెగొందికి మూడు ద్వారాలు ఉన్నాయి. నదిని చిన్న పడవలలో దాటి ఈ నగరం లోనికెళ్లాలి. అక్కడే ఒక ద్వారం ఉంది. విజయనగరానికి వాయవ్య మూల కృష్ణాపురము ఉంది. ఇందులో అనేక ప్రముఖ దేవాలయా లున్నాయి. ఈ దేవాలయాలు చాలఎత్తు కలిగి ఉన్నాయి. వీటి మీద స్త్రీ పురుషుల శిల్పాలు అసబ్య కరంగా ఉన్నాయి.(ఇది విఠలాలయం సముదాయ ప్రాంతము. ఇక్కడ అనేక దేవాలయాలున్నాయి)

(ఇంత వరకు పోర్చుగీసు దేశస్తుడయిన "డోమింగో పీస్" అనే యాత్రికుడు సుమారు సామాన్య శకం 1520 - 22 మధ్యలో శ్రీ కృష్ణ దేవరాయలు పరిపాలించే కాలంలో విజయనగరాన్ని సందర్శించి తాను చూసిన విశేషాలను ఆయన మాటల్లోనే చదివారు.)