విక్రమార్కచరిత్రము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

ప్రాచీనాంధ్ర మహాకావ్యములలో విక్రమార్కచరిత్రము లెక్కింపదగినది. విక్రమార్క మహారాజు జీవితమును వర్ణించు కావ్య మిది యని దీని పేరే తెలుపుచున్నది. 'చరిత్ర' నామముతో రచింపఁబడిన కావ్యములు దీనికి ముందు వెనుక లందును వ్రాయఁబడుచుండినవి. పండితారాధ్యచరిత్రము, దశకుమారచరిత్రము మఱియుఁ గేయూరబాహుచరిత్రములు దీనికిఁ బూర్పరచనలు, మను, వసుచరిత్రాదు లనంతరకృతులు. పండితారాధ్యచరిత్రము శైవమతప్రచారకుఁడును, గురుస్థానీయుఁడు నయిన మల్లికార్జున పండితారాధ్యుని జీవితవిశేషములను వర్ణించు ద్విపదకృతి. ఇట్టివానిలో నిది మొదటిది. దశకుమారచరిత్రము దండి సంస్కృతగద్యకావ్యమునకుఁ బద్యానువాదము. ఇది బహునాయక మగు కల్పితకథాసంపుటి. ఇట్టివానిలో నిది యాద్యము. కేయూరబాహుచరిత్రము సంస్కృతనాటికకుఁ బద్యానుకృతి ఐనను నిందు నీతికథ లనేకము క్రొత్తగా కవిచేఁ జేర్పఁబడినవి. ఇట్టి వానిలో నిదియే మొదటిది, తుదిది గూడ. తరువాతి కవులును సంస్కృతనాటకముల ననువదించినను వారు తమ కావ్యములయం దిట్లు నూత్నకథలను జేర్చరయిరి. ఈ విక్రమార్కచరిత్ర నాయకుఁడు లోకోత్తరగుణసంపన్నుఁ డగు విక్రమార్క మహారాజు. ఇతఁడు చారిత్రకపురుషుఁడే కాని, అతిలోకమహిమోపేతుఁడు. ఈయన సాహసౌదార్యపరాక్రమాది గుణస్ఫోరకము లగుకథ లనేకము లిందు వర్ణితములు. ఇట్టి వానిలో నిదియే మొదటిది.

దశకుమారచరిత్రాదు లాంధ్రసాహిత్యమునఁ గథాకావ్యములుగాఁ బరిగణింపఁబడుచున్నవి. దశకుమారచరిత్రము నందలి కథలు విడివిడిగాఁ బదుగురకు సంబంధించిన వగుటయే కాక పరస్పరసంబంధ మంతగా లేనివి. కేయూరబాహుచరిత్రము నందలి కథలు పైనుండి ప్రత్యేకముగాఁ జేర్పఁబడి ప్రధానకథతోఁ గాని, కథానాయకునితోఁ గాని బొత్తిగా సంబంధము లేనివి. వీనిని తొలగించినచో 'కావ్యము మఱింత రసవంత మగునేకాని, దాని కెట్టి న్యూనతయు వాటిల్లదు. ఈ విక్రమార్కచరిత్రము నందలి సమస్తకథలును నతనితో అత్యతసంబంధము కలవి. ఇందుండి కొన్నిటిని తొలఁగించితిమేని నాయకుని యుత్తమగుణములకుఁ గొంత న్యూనత నాపాదించిన వారమగుదుము. ఇది యీ కావ్యవైలక్షణ్యము.

వర్ణనాబాహుళ్యము చేతఁ గుమారసంభవ, నృసింహపురాణములును, ప్రౌఢశైలీవిన్యాసముచేతను శబ్దార్ధాలంకారబహుళవర్ణనాచమత్కారముచేత నుత్తరహరివంశమును; ఏకైకరాజనాయకత్వశృంగారరసప్రాధాన్యములచేత, కేయూరబాహుచరిత్రమును బ్రబంధలక్షణవిలసితములు. ఈ విక్రమార్కచరిత్ర మన్ననో ఉపర్యుక్తసమస్తగుణలక్షితమై ప్రబంధశయ్యాగ్రథితమయిన ప్రబంధసామ్యకృతి. మనుచరిత్రాది ప్రబంధకావ్యరచనకు మార్గదర్శకములైన పూర్వకావ్యములలో విక్రమార్కచరిత్ర మొక్కటి. అట్టి ప్రబంధకవులకు మార్గదర్శకు ఆయిన పూర్వకవులలో ఏతద్విక్రమార్కచరిత్ర కర్తయగు జక్కన కవియు నొక్కఁడు.

కవికుల గోత్రాదులు

జక్కన నియోగి బ్రాహ్మణుఁడు. ఇతని తండ్రి అన్నయామాత్యుఁడు, తల్లి అక్కమాంట. తాత పెద్దయామాత్యుఁడు. స్వవిషయమున నీ కవి కృత్యవతారికలో నింతకు మించి విశేషము లెవ్వియుఁ దెలుప లేదు. విక్రమార్కచరిత్ర కృతిభర్త యగు సిద్ధనమంత్రి కులగోత్రాదుల నుగ్గడించెనే కాని, తన కుల మెద్దియో, గోత్ర మెద్దియో, సూత్ర మెద్దియో సుతరాము సూచింపలేదు. జక్కన యింటి పేరు 'పేరం రాజు' వారని, శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావుగారు వ్రాసిరి కాని, దాని కాధారమును జూపరయిరి. అది మొదలు కొందఱు పేరంరాజు జక్కన యని వ్రాయుచున్నారు. ఇది యెంతవఱకు నిజమో విచార్యము. ఇట్లే పెద్దన తాత, తిరుకాళచోడునిచే సన్మానితుఁ డని జక్కన చెప్పిన దానినిఁబట్టి జక్కన కూడా నెల్లూరి పురవాసుఁడని యూహింపవచ్చునని అచ్యుతరావుగారు వ్రాసిరి. కాని జక్కన తాత కూడా నెల్లూరు వాస్తవ్యుఁడో, కాడో, నిజము మనకుఁ దెలియదు.

పండితకవి వంశము

జక్కన విద్వత్కవి. విద్యత్కవి వంశీయుఁడు. ఈ కవి తాతను గూర్చి ఈ క్రింది వివరములు అవతారిక (ఆ. 1-20)లోఁ దెలుపఁ బడినవి.

జక్కన తాత పెద్దయామాత్యుఁడు. గొప్ప పండితుఁడు, కవి. సంస్కృత ప్రాకృత శౌర్యసేన్యాది బహుభాషాకోవిదుఁడు. ఘటికామాత్రకాలములో బహుభాషలలో 'శతకము' జెప్పఁగలవాఁడు. ప్రహసన, భాణాది రూపకములు; చక్ర, చతుర్భద్ర, చతురుత్తరాధికక్షుద్రప్రబంధములు రచించు నేర్పరి. సకలరసములలో వర్ణనలు చేయు సమర్థుఁడు. ఏకసంధా, ద్విసంధా, త్రిసంధాగ్రహణపద్దతిని పద్యములను వినినంతనే ధారణ చేసి తిరిగి వినిపించుశక్తి గలవాఁడు. అన్నివిధముల అవధానములయందును నితరులను మించి యవధానము లొన రించు దక్షుఁడు. వృత్తకందము, కందవృత్తము, చతుష్కందము మున్నగు గర్భకావ్యవర్గనిర్మాణకుశలుఁడు. ఆంధ్రమునందుఁ బ్రబంధములు క్రొత్తలు పుట్టించుకొని (నూత్నకథలను గల్పించుకొని) లిఖించు ప్రతిభావంతుఁడు. అక్షరచ్యుతక , మాత్రాచ్యుతక , బంధచ్యుతకములును, నామగోప్య, క్రియాగోప్య, భావగోప్యములుగా పద్యములు చెప్పుటయందును, మఱియు సభలయందుఁ బద్యంబు గీతికార్భటిఁ జదువుటయందును చతురుఁడు. ఎల్లవిద్యల నెఱిఁగినవాఁడు. ఇతఁడు నెల్లూరి తిరుకాళవిభుని (నెల్లూరి మనుమసిద్ది తండ్రికినిఁ గుమారునకుఁ గూడ నీ పేరుగలదు) సభలో తన సాహిత్యపటిమను బ్రదర్శించి కీర్తిపాత్రుఁ డయ్యెను. ఇట్టి తాతకుఁ దగిన మనుమఁడు మన జక్కనకవి.

జక్కనకుఁ బూర్వపు నష్టప్రబంధములు

పై వివరములను బట్టి జక్కనకు సుమారు 50 సం. పూర్వమే ఆంధ్రభాషలో, ఆశు, బంధ, గర్భ, చిత్రకవిత్వములును, అవధాన (కవితా) విధానములును, మఱియుఁ బ్రఖ్యాత, మిశ్రమ, కల్పితేతివృత్తప్రబంధరచనమును బ్రచారమున నుండినట్లు తెలియవచ్చుచున్నది. జక్కన కూడ అవధానకవిత్వము చేయువాఁ డని కొందఱ అభిప్రాయము. తన తాత అవధానకవిత్వనిపుణుఁడని చెప్పెనే కాని, స్వవిషయమున అట్లెక్కడను జక్కన చెప్పలేదు.

ఇది చాలవఱకు వాస్తవమే యని తోఁచును. ఏలనఁ బ్రబంధకవులలోఁ బెద్దన హరికథాసారము మున్నగు ప్రబంధేతరగ్రంథములను గూడ రచించినట్లే పురాణయుగకవులును ఆ పురాణాదులు మాత్రమేకాక, ప్రబంధములను గూడ రచింపుచు వచ్చిరని యూహించుటకుఁ బ్రబలాధారములు కలవు.

లక్షణగ్రంథములయు దుదాహృతము లయిన పరిమితపద్యముల వలనను సాహిత్యచరిత్రల మూలమునను, నన్నయభట్టు రాఘవాభ్యుదయ, ఇంద్రవిజయము లను రెండుప్రబంధములను, తిక్కన ‘విజయసేన' మను బ్రబంధమును , ఎఱ్ఱన 'రామాయణ' ప్రబంధమును ('వల్మీకభవువచోవైఖరి రామాయణంబు నాంధ్రప్రబంధంబుఁ జేసె' నని చెదలువాడ ఎఱ్ఱాప్రెగడ); నన్నెచోడుఁడు 'కళావిలాస' ప్రబంధమును, నాచన సోముఁడు 'వసంతవిలాస' ప్రబంధమును మఱియుఁ జిమ్మపూడి యమరేశ్వరుఁడు 'విక్రమసేన' ప్రబంధమును రచించినట్లు తెలియవచ్చుచున్నది. కాని, యివి యన్నియు కాలవైపరీత్యముచే నష్టములయి మనకు లభింపకపోయినవి. ఈ గ్రంథములే యుపలబ్ధములయి యుండినచో 18వ శతాబ్దమునఁ బ్రబంధములు క్రొత్తఁగాఁ బుట్టిన వనునూహ సాహిత్యచరిత్రకారులకుఁ గలుగకుండెడిది.

తాతయగు పెద్దనామాత్యుని బహువిధకావ్యకరణదక్షత నంతగా నుగ్గడించిన జక్కన తత్కృతకావ్యనామ మొక్కటి యేనిఁ బేర్కొనకుండుటకు హేతువు విచార్యము. జక్కన తండ్రి కవియైనట్లు చెప్పలేదు. సరియైన రక్షణ లేక పెద్దన కావ్యప్రతులు జక్కననాటికే లుప్తమయి కీర్తిమాత్రము మిగిలియుండెనేమో? విచార్యము.

జక్కన కవిత్వవిశేషములు

జక్కన విద్వత్కవి యని వెనుకఁ దెలుపఁబడెను. తండ్రి పోలికలు గాక యితనికి తాతగారి పోలికలే వచ్చుట యదృష్టము. విక్రమార్కచరిత్రము మొదట కృతిభర్త యీ కవినిఁ గ్రిందివిధమునఁ బ్రశంసించెను.

'చక్కన నీ వైదుష్యము
చక్కన నీ కావ్యరచన చాతుర్యంబుల్
చక్కన నీ వాగ్వైఖరి
చక్కన నీ వంశమహిమ జక్కన సుకవీ! (ఆ. 1–28)

“స్వాభావిక నవకవితా
ప్రాభవముల నుభయభాషఁ బ్రౌఢిమఁ జెప్పన్
భూభువనంబున సరి లే
రాభారతి నీవుఁదక్క నన్నయజక్కా! (ఆ. 1-24)

జక్కన కవిత్వముఁ జెప్పుట యందు భారతీదేవితో సముఁడని కృతిభర్త ప్రస్తుతించినను జక్కన తాను 'శారదాదయావిధేయుఁ' డయినట్లు ఆశ్వాసాంతగద్యలో సవినయముగాఁ దెలుపుకొనినాఁడు. ఈ గద్యల మొదట 'శ్రీమదఖిలకవిమిత్ర' యను విశేషణమును వేసికొనెను. ఇది తిక్కనగారి 'ఉభయకవిమిత్ర' బిరుదము వంటిది కావచ్చును. కుకవినిరసనసందర్భమున నీ కవి యీ క్రిందిపద్యము కూడ వ్రాసెను.

'ప్రతిపద్యము చోద్యముగా
గృతిఁ జెప్పిన వొప్పుఁగాక, కృతి నొకపద్యం
బతిమూఢుఁడైనఁ జిత్రతఁ
బ్రతిపాదింపఁడె ఘుణాక్షరన్యాయమునన్?' (ఆ. 1–17)

ఇతని పూర్వులలో నన్నెచోడుఁడు కూడ నిట్టి యభిప్రాయము కలవాఁడే.

'అక్కజమై మహార్థనివహంబు సదుక్తులు మెచ్చఁ జూచినన్
గ్రుక్కిదమైన సత్కృతి యగుర్పగుఁ గాకిలఁ జీకు లావుకం
ద్రొక్కినయట్లు నోరఁగొలఁదుల్ పురికొల్పఁగ నందులోన నొ
క్కొక్కఁడు సక్కనైనగృతియుం గృతియందురె? వాని మెత్తురే!'

(కుమా. సం. ఆ. 1-38)

జక్కన తరువాతవారిలో ముఖ్యముగాఁ జేమకూర వేంకటకవి కూడ యీ మతమువాఁడే. రఘునాథరాయ లతని కవిత్వము నిట్లు కొనియాడెను.

'ప్రతిపద్యమునందుఁ జమ
త్కృతి గలుగం జెప్పనేర్తు, వెల్లెడఁ బెళుకౌ
కృతి వింటి మపారముగా,
క్షితిలో నీమార్గ మెవరికిన్ రాదు సుమీ!'

(విజ. విలా. ఆ. 1-50)

ఈ కవులు కావ్యము నందలి 'ప్రతిపద్యము' నందును ‘జమత్కృతి' గలుగునట్లు కావ్యము రచింపవలె నను అభిప్రాయము గలవారు. ఈ విషయమున వీరికి మతభేదము లేదు.

'ప్రతిపద్యము చోద్యముగాఁ గృతిఁ జెప్పిన నొప్పు' నను జక్కనమాట కేవలము కుకవినిరసనైకపరిమితప్రయోజనము కలది కాదు. విక్రమార్కచరిత్రము నతఁడు ప్రతిపద్యచమత్సృతిగా రచించి తన పంతము నిలుపుకొనినాఁడు. కావుననే జక్కన కవిత్వ మనిన సిద్ధమంత్రికిఁ బ్రీతి. ఈ విషయమును కవి యీ క్రింది షష్ట్యంతపద్యముచేత సూచించెను.

'అక్కాంబానందనునకు
ధిక్కృత సురరాజమంత్రి ధీవిభవునకున్
దిక్కూలంకషకీర్తికి
జక్కనకవి కావ్యకరణ సత్ప్రియమతికిన్.' (ఆ. 1-81)

చేమకూర వెంకటకవి రమునాథభూపాలుని గూర్చి పలికినట్లు ఈ జక్కనకవి గూడ-

తారసపుష్టియైఁ బ్రతిపదంబున జాతియు వార్తయుఁ జమ
త్కారము నర్థగౌరవముఁ గల్గ ననేకకృతుల్ ప్రసన్నగం
భీరగతిన్....

రచింపఁగల కవిసత్తముఁ డనియు, విక్రమార్కచరిత్రము నతఁ డట్లే రచించెననియుఁ జెప్పుట యతిశయోక్తి కాజాలదు.

పండితాభిప్రాయములు

ఇఁక నీ కవివరునిఁ గూర్చిన పండితాభిప్రాయము లొకటి రెండు దిగువఁ జూపఁబడును.

1. “ఈ జక్కన లాక్షణికుఁడైన మంచికవి. ఈతని కవిత్వము నిర్దుష్టమై మనోహరముగా నుండును. ఈ విక్రమార్కచరిత్రము నందలి కథలు సహిత మద్భుతములుగానే యుండును."

- వీరేశలింగం పంతులుగారు, క.చ.భా. 1.

2. “జక్కన విక్రమార్కచరిత్రము అల్లసాని పెద్దనగారి పాండిత్యమును, ముక్కు తిమ్మన గారి లాలిత్యమును, రామరాజభూషణుని ప్రౌఢియుం బొరసి చెన్నారుచున్నది."

[వేదం వేంకటరాయశాస్త్రి గారు. శారదాంబికాప్రథమకింకిణి అను విక్రమార్కచరిత్రముద్రణ విమర్శనము.]

3. “ప్రౌఢకవి మల్లన, మారన, జక్కన.... వీరు లాక్షణికులయిన గొప్పకవులు. వీరు రచించిన గ్రంథములు తొల్లింటి కవుల గ్రంథముల వలె మిక్కిలి కొనియాడఁ దగినవిగా నుండును."

- బి. సీతారామాచార్యులవారు, శ.ర పీఠిక.

4. “జక్కయ కవిత్వము ప్రౌఢమైనది. వర్ణనాంశములు పెక్కులు గలవు. స్వాభావికములైన వర్ణనలకంటె నుత్ప్రేక్షాదులయందే యీ కవి కభిరుచి మెండు.

పదునెనిమిది వర్ణనలను సందర్భోచితముగా నీ కావ్యమున మనోహరముగా వర్ణించియుండెను.

ఈ కవి లోకోక్తుల నెన్నిఁటినో సందర్భోచితముగ నీ కావ్యమం దిమిడ్చియున్నాఁడు.

విక్రమార్కచరిత్ర ముత్తమములైన యాంధ్రకావ్యములలో నొకటి."

ఆంధ్రకవి తరంగిణి-సం. 4.

జక్కనకవి సంస్కృతాంధ్రభాషలయందుఁ జక్కని వైదుష్యము గలవాడు. వ్యాకరణ సాహిత్యశాస్త్రపాండిత్యముతో పాటు, జ్యోతిశ్శాస్త్ర, యోగశాస్త్రముల యందును, యజ్ఞయాగాది వైదికకర్నిర్వహణవిధానము నందును

మంచి పరిచయము సంపాదించినవాఁడు. సంస్కృతము నందును, గవిత్వము చేయుశక్తి గలవాఁ డని యితఁ డీ కావ్యమున రచించిన కొన్ని శ్లోకముల వలనఁ దెలియుచున్నది. ఇందుకుఁ గొన్ని యుదాహరణములు,

జ్యోతిశ్శాస్త్రము :- విక్రమార్కుఁడు జనించిన సందర్భమున నితఁడు వ్రాసిన పద్యములు.

“దిసకృద్వాసర చైత్రశుద్ధ నవమిం దిష్యం దృతీయాంశ స
జననంబొందెడు రాగమంజరికి రాజద్భాగ్యసౌభాగ్య మా
చనలగ్నంబునఁ బుత్రరత్నము, నిజోచ్చక్షేత్రసందీప్తులై
యినమందారసురాసురేజ్యబుధు లాయిందు న్విలోకింపఁగన్.

(ఆ. 1-174)

(ఇన, మంద, అర అని యిట పదవిభాగము; అనఁగా సూర్య, శని, అంగారకులు; తిష్యన్ అనఁగా పుష్యమి నక్షత్రము నందనుట.) రవ్యాది గ్రహము లాఱును తమ తమ ఉచ్ఛస్థానముల నుండి పుష్యమి నక్షత్రమునఁ దన స్వగృహము నందున్న చంద్రునిఁ జంద్రలగ్నమును వీక్షించుచుండగా శుభలగ్నమునందు విక్రమార్కుఁడు జన్మించినట్లు కవి వర్ణించెను. శ్రీరామచంద్రుఁడు నీ దినముననే జన్మించెను.

పై జన్మముహూర్తమునకు జ్యోతిష్కు లీక్రిందిఫలితమును జెప్పిరఁట.

శ్లో॥ కుముదగహనబంధౌ వీక్ష్యమాణే సమస్తై
     రగనగ గృహవాసైర్దీర్ఘజీవీసతుస్యాత్.
     యదసదశుభజన్యం యచ్చకీదృద్విమోదం
     సభవతి నరనాథస్సార్వభౌమో జితారిః." (ఆ. 1-78)

అని హోరాస్కంధబంధురంబైన యీ పద్యంబు నుపన్యసించి యిక్కుమారుండు దీర్ఘాయురుపేతుండును, జితారిసంఝాతుండును, జక్రవర్తిపదఖ్యాతుండును నగు నని విన్నవించిరఁట!

వీరు చెప్పినట్లే విక్రమార్కుఁడు చక్రవర్తి యయ్యెను. కాని శ్రీరాముఁడు జన్మించిన దినముననే జన్మించుటచేత నేమో, భట్టి సలహా ప్రకార మితఁడును జీవి తమున సగము కాలము రాజ్యము నందును, గడమ సగము (సంవత్సరమునకు ఆఱు నెలల చొప్పున) లోకసంచారము చేయుచు అన్యత్రయుఁ గడపెను. పైనిఁ బేర్కొనిన హోరాశాస్త్రము సంస్కృతమునఁ గలదు. 'కలౌపారాశరీహోరా' యనుట నిది మిగులఁ బ్రామాణికము. జక్కన యిందలి శ్లోకము నుద్ధరించి ఫలితాంశమును జెప్పుటఁ జూడ నీ కవికి జ్యోతిశ్శాస్త్రమునందు మంచి పరిచయము గలదని తెలియును. ఇట్లే శరదృతువర్ణనము నందలి యీ క్రింది పద్యమును నీవిషయమునే నిరూపించెను.

“జలజచ్ఛత్రరుచిం బ్రకాశతరకాశశ్రేణికాచామరం
బులభద్రాసనకాంతి రాజ్యపద మొప్పుల్ మీఱఁ గుంభోద్భవుం
డెలమిన్ దక్షిణదిక్కునం దుదితుఁడయ్యెం, జంద్రతారాబలం
బుల మేలైనదినంబు లెవ్వరికి సమ్మోదంబు సంధింపవే!" (ఆ. 4-18)

యోగవిద్య

ఈక్రింది పద్యము కవికిఁ గల యోగవిద్యాపరిచితి నెఱిఁగింపఁగలది.

'బద్ధసిద్ధాసనపరిణతిఁ గూర్చిండి
                  హృదయసమాధాన మొదవఁ జేసి
మూలాలవాలసమున్నతి గైకొని
                  యనిలు మధ్యమనాడియందు నిలిపి
యంతర్గతము లైన యాఱుదామరలకు
                  నభినవోల్లాసంబు ననునయించి
యాంతరజ్వలనసంక్రాంతిచేఁ దొరఁగెడు
                  చంద్రకళాసుధాసారధారఁ
దడిసి, యాత్మాన్తుసంధానతన్మయత్వ
నిశ్చిలాంతరంగుండయి నిస్తరంగ
నీరనిధియునుబోలె నొప్పారుచున్న
మునివరేణ్యునిఁ బొడగంటి, మనుజనాథ.(ఆ. 2-218)

పంచమాశ్వాసము నందలి 127 నుండి 135 వఱకుఁ గల పద్యములలో కవికి గల అశ్వమేధయాగవిధానపరిజ్ఞానము నెఱంగించును.

సంస్కృతకవిత్వము

ఈ క్రింది శ్లోకములు జక్కన సంస్కృతపద్యరచనాశక్తినిఁ దెలుపును.

విరూపాక్షస్తుతి.

భజతభవభుజఙ్గం, పాణి హేలాకురఙ్గం,
ప్రమదహృదయసఙ్గం, బాలచంద్రోత్తమాఙ్గమ్,
వరమకుటపిశఙ్గం, వాసకైలాసశృఙ్గం,
జితమదనదపాఙ్గం, శ్రీవిరూపాఠలిఙ్గమ్.(ఆ. 2-222)

దీని తరువాత నున్న 228, 224 కూడ విరూపాక్షస్తుతిశ్లోకములే కాబట్టి యిటఁ జూపలేదు.

కృతిపతి - బంధువులు

ఈ విక్రమార్కచరిత్ర కృతిపతి సిద్ధనమంత్రి యైనట్లు వెనుక సూచింపఁబడెను. ఇప్పు డితని వివరములు కొన్ని తెలుపఁబడును.

కృతిభర్తయగు సిద్ధనమంత్రి తండ్రి జన్నమంత్రి. తల్లి అక్కమాంబ. (జక్కనకవి తల్లి పేరు కూడ అక్కమాంబయే.) పెదతండ్రి భాస్కరమంత్రి. తాత మారనసోమయాజి. ఈ సిద్ధనమంత్రికి వెన్నెలగంటి సూర్యుఁడు పెదతండ్రిగా సన్నుతిగన్నవాఁ డని షష్ఠ్యంతముల చివరిపద్యము(ఆ. 8-2)లో చెప్పఁబడినది. వీరు హరీతసగోత్రులు, ఆపస్తంబసూత్రులు. (ఆ. 1-58, 50), బ్రాహ్మణప్రభువులు.

సూరన సోమయాజి :- కృతిభర్తయగు సిద్ధనమంత్రి తండ్రికి నితఁడు తాత, పరమశైవాచారపావనుఁడు. వేదశాస్త్రపురాణవిజ్ఞానముచే ఎద్దనపూడి యను నగ్రహారమును, ఛత్రచామరాదిరాజలాంఛనములను బడసినఁవాడు.

సిద్ధనమంత్రి:- ఇతఁడు సూరన సోమయాజి మనుమఁడు. తండ్రివలెనే యితఁడును వేదశాస్త్రవిజ్ఞానవిత్తముఁడు. మంత్రిగాఁ బ్రసిద్ధి కెక్కెను.

భాస్కరమంత్రి :- సిద్ధమంత్రి జ్యేష్ఠపుత్రుఁడు. అమృతగిరీంద్రుఁ డను సంయమికి శిష్యుఁడు. సూర్యనమస్కారనియమవ్రతుఁడు. ఈశ్వరాగమపరమార్థవేది.

జన్నమంత్రి :- సిద్ధమంత్రి ద్వితీయసుతుఁడు. భాస్కరమంత్రికి దమ్ముఁడు. కృతిపతి యగు సిద్ధనకు జనకుఁడు. ఈతని జక్కన యీ క్రింది పద్యమున (ఆ. 1-14) ప్రశంసించెను.

విమలవర్తనమున వేదశాస్త్రపురాణ
                  వాక్యార్థసరణికి వన్నె వెట్టెఁ

బరమహృద్యంబైన పద్యశతంబున
                  దేవకీతనయు విధేయుఁ జేసె
రసికత్వమున దేవరాయమహారాయ
                  కరుణాకటాక్షవీక్షణముఁ గాంచెఁ
గర్ణాటకటకముల్ గలయంతయును మెచ్చ
                  గణకవిద్యాప్రౌఢి ఘనతకెక్కె
గురులఁ బోషించె సత్కవివరుల మనిచెఁ
బ్రజలఁ బాలించె భాగ్యసంపద వహించె
హరితమునిముఖ్యవంశరత్నాకరేంద్ర
చంద్రుఁడై యొప్పు సిద్ధయజన్నమంత్రి.

పై పద్యమువలన ముఖ్యముగా నీ జన్నమంత్రి శ్రీకృష్ణునిపై వంద పద్యముల శతకకావ్యమును రచించినట్లును, దేవరాయల కటాక్షమునకుఁ బాత్రుఁ డయ్యెననియు, మఱియు గణకవిద్యయందు మిగులఁ బ్రసిద్ధి గాంచెననియుఁ దెలియుచున్నది. ఇందు స్పష్టముగఁ జెప్పఁబడకున్నను 'ప్రజలఁ బాలించె ననుటచే నీ జన్నమంత్రి దేవరాయలకు మంత్రిగా నుండినట్లు భావింపఁబడుచున్నది. (ఆ.1.46) ఇతరమంత్రులు జన్నమంత్రికి సరిరారని కవి నుడివియున్నాఁడు.

సిద్ధమంత్రి :- జన్నమంత్రి ప్రథమసుతుఁడు. ఈయనయే విక్రమార్కచరిత్ర యొక్క కృతిభర్త. జక్కనకవి యితనిఁ బ్రశంసించిన పద్యము దిగువ నుదహరింపఁబడుచున్నది.

చిత్రగుప్తునకైనఁ జింతింపనరుదైన
                  గణితవిద్యాప్రౌఢి ఘనత కెక్కె
నవరసంబులయందు నవ్యకావ్యంబులు
                  కవిజనంబులు మెచ్చగా నొనర్చె
నాణిముత్తెములసోయగము మించినవ్రాలు
                  వరుసతో నిరుగేల వ్రాయ నేర్చె
నాత్మీయిలిపులట్టు లన్యదేశంబుల
                  లిపులను జదువంగ నిపుణుఁ డయ్యె
దేవరాయమహారాయ ధీవిధేయ
మంత్రివల్లభ చామనామాత్యదత్త
చామరచ్ఛత్రశిబికాది సకలభాగ్య
చిహ్నముల నొప్పె జన్నయసిద్ధమంత్రి.(ఆ. 1-50)

సిద్ధనమంత్రి తనతండ్రివలెనే గణితవిద్యయందుఁ బ్రౌఢిమముగలవాఁడనియు, కవులు మెచ్చునట్లు నవ్యకావ్యములు రచించిన సత్కవియనియు, (అట్టి కావ్యనామములు తెలుపఁబడలేదు?); రెండుచేతులతోఁగూడ ఆణిముత్తెములవంటి వ్రాలు వ్రాయనేర్చినవాఁడనియు, పరదేశలిపులను అవలీలగాఁ జదువుటయుదు నిపుణుఁడనియు, మఱియు దేవరాయల మంత్రివల్లభుఁ డగు చామనామాత్యునిచేత దత్తములయిన రాజచిహ్నములు గలవాఁడనియుఁ దెలియుచున్నది.

పెదతండ్రియగు భాస్కరమంత్రివలెనే సిద్ధనమంత్రికూడ సూర్యనమస్కారవ్రతనియమయుతుఁడని 'దినకరదండనమస్కృతి దినదినసంవర్థమానతేజోనిధికిన్ ' (ఆ. 1.58) అను కవివాక్యము తెలుపుచున్నది. మఱియు నితఁడు 'శ్రీనాథచరణయుగళధ్వానాధీనాంతరంగుఁడు' (ఆ. 2-1), 'శివపదద్వయీకీర్తనుఁడు' (ఆ. 2-262), కావున హరిహరభేదము లేని అద్వైతి. బెల్లముకొండ భైరవస్వామి యితని యిలవేలుపు (ఆ. 1-260).

'శ్రీమద్వాణీవిలాసజిహ్వాగ్రతలా'(ఆ. 1-1.)
'కవితాకారా!' (ఆ. 8-124)
రామాయణ సుప్రలాప్తరసికకలాపా!(ఆ. 2-281)

అని కవి సంబోధించుటచేత సిద్ధనమంత్రి కవియైయుండెననుటలో సందేహము లేదు. కృత్యాద్యవతారకలో (ప. 50) నితఁ డినేకకావ్యము లొనర్చినట్లును కవి చెప్పెను. కావున నీ “రామాయణసుప్రలాప' అను సంబోధనము వలన నితఁడు ‘రామాయణము'ను కావ్యముగా రచించియుండెనేమో యని అనుమానింపఁదగియున్నది(?).

కృతికర్త కృతిభర్తల కాలము

విక్రమార్కచరిత్ర కృతికర్తయగు జక్కన కవి యొక్కయు, కృతిభర్త యగు సిద్ధనమంత్రి యొక్కయు కాలమును గూర్చి యాలోచింపవలసి యున్నది. వీరి కాలమును దెలియుటకుఁ గావ్యాదిలో జక్కన పేర్కొనిన కొందఱు ప్రధానవ్యక్తుల నామములే మనకు ముఖ్యాధారములు. అవి యివి.

1. రాజేంద్రచోఁడుని వలన సూరన సోమయాజి అగ్రహారమును పడసెను. సూరన సోమయాజి కృతిభర్త తాతకుఁ దండ్రి.

2. దేవరాయ మహారాయల కడ జన్నమంత్రి మంత్రిగా నుండెను. జన్నమంత్రి కృతిభర్తకుఁ దండ్రి.

8. కృతిభర్త యగు సిద్ధనమంత్రి దేవరాయ మహారాయల మంత్రివల్లభుఁ డగు చామనామాత్యుని వలన రాజలాంఛనములు పడసెను. చామనామాత్యుఁడు దేవరాయల కడ 'దండనాయకుఁడు గాఁ గూడ నుండె నని శ్రీమ ద్వవల్ల య, వరసుత చామన దండాథినాథ సామ్రాజ్యరమాసామగ్రీ సంపాదక...(ఆ. 167)

4. జక్కన తాతయగు పెద్దయామాత్యుఁడు నెల్లూరి తిరుకాళవిభుని మెప్పించి యతనిచే బహూకృతుఁ డాయెను.

5. కవీంద్రకుంజరుఁ డగు వెన్నెలగంటి సూరన రెడ్డివేమ నరపాలకుచేత మహాగ్రహారములు పడసెను. ఈ సూరనకవి కృతికర్త యగు సిద్ధనకు “పెదతండ్రిగా సన్నుతిగన్నవాఁడు.

పైనిఁ బేర్కొనిన రాజేంద్రచోడుఁడు మున్నగువారినిఁబట్టి కృతికర్త కృతిభర్తల కాలమును నిర్ణయింపవలెను. వీరేశలింగము పంతులుగారు మున్నగువా రిట్లే చేసిరి. కాని యీ విమర్శకుల యభిప్రాయములు పరస్పరము భేదించుచున్నవి. వారి వాదములను పునరుద్ధరించిన గ్రంథవిస్తరము కాగలదు. కావున వాదసారాంశములు మాత్రమే తెలుపఁబడును.

సూరన సోమయాజికి ఎద్దనపూడిని అగ్రహారము నొకఁగిన రాజేంద్రచోడుఁడు క్రీ.శ. 1158 నుండి 1188 వఱకు నుండెనని శ్రీ వీరేశలింగం పంతులుగారు.

“ఈ రాజేంద్ర చోడరాజు వెలనాటి దుర్జయవంశజుఁడు క్రీ.శ.1163 నుండి 1181 పఱకు పాలించిన రాజేంద్ర చోడరాజు అనుటకు సందియము లే”దని శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు.

పలువురు వెలనాటి రాజేద్రచోడులలో కడపటివాఁ డగు కులోత్తుంగ రాజేంద్రచోడుఁడు మనుమసిద్ధికి సమకాలికుఁ డనియు (నితని శాసనములు 1171-1176 సంవత్సరములో కన్పట్టుచున్నవి.) కావున నీ కులోత్తుంగ రాజేంద్రచోడుఁడే సూరన సోమయాజికి అగ్రహార మొసంగి యుండుననియు కవితరంగిణికర్త అభిప్రాయములు.

దేవరాయలు క్రీ.శ. 1408-1422 సంవత్సరము వరకు కర్ణాటకరాజ్యము పాలించె ననియు సిద్ధనమంత్రియు, నితని తండ్రి జన్నయయు నితని యొద్ద మంత్రులుగా నుండిరని శ్రీ వీరేశలింగం పంతులుగారు.

ఈ దేవరాయలు మొదటి దేవరాయలు. ఇతఁడే సిద్ధనకుఁ బోషకుఁ డనియు, జక్కనయు నీ కాలమువాఁడే అనియు శ్రీ శేషయ్యగారు కూడ వ్రాసిరి. శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారును, శ్రీకొ. వేం. లక్ష్మణరావుగారును జక్కన మొదటి దేవరాయల కాలమువాఁడే యని నిశ్చయించిరి.

చామనామాత్యుఁడు మొదటి దేవరాయలకు మఱియు రెండవ (ప్రౌఢ) దేవరాయలకడ మంత్రిగను, దండనాయకుఁడుగను నుండెననియు, గృతిపతియగు సిద్ధనమంత్రి చామనామాత్యునిచే చామరచ్ఛత్రాది రాజలాంఛనములు పొందియుండినవాఁడనియుఁ గావున జక్కన కవి కూడ ఉభయ దేవరాయల కాలమున అనఁగా 1404-1447 సంవత్సరముల మధ్యకాలమున నుండియుండుననియు, అందును ముఖ్యముగాఁ బ్రౌఢ దేవరాయల కాలమున విద్వత్రశస్తి నొందియుండుననియు శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావుగారి అభిప్రాయము.

తిక్కన పోషకుఁడగు (నెల్లూరి) మనుమసిద్దికి తండ్రియైన తిక్కరాజే తిరుకాళచోడుఁ డనియు, నితఁడు కవిసార్వభౌమబిరుదాంకితుఁ డగు పండితప్రభువనియు, నీతఁడే జక్కన తాత యగు పెద్దయామాత్యుని గారవించి యుండుననియు శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు వ్రాసిరి.

పెద్దయామాత్యుని గౌరవించినది మనుమసిద్ధి తండ్రికాక మనుమసిద్ధి కుమారుఁ డగు ఇమ్మడి తిరుకాళవిభుఁడని శ్రీ చాగంటి శేషయ్యగారు తెలుపుచున్నారు.

కృతిపతి యగు సిద్ధన పెదతండ్రి యని చెప్పఁబడిన వెన్నెలగంటి సూరన కవికి అగ్రహారము లొసగిన రెడ్డి వేమనరపాలుఁడు శ్రీ వీరేశలింగము పంతులుగారు చెప్పినట్లు అద్దంకి ప్రభువగు ప్రోలయవేముఁడు (1820–1850) కాఁడనియు ఇతఁడు కోమటి వేముని కుమారుఁడగు రాచవేమారెడ్డి (1420- 1424) అయి యుండునని శ్రీ అచ్యుతరావుగారి అభిప్రాయము.

సూరన కవికి అగ్రహార మొసఁగినవాఁడు ప్రోలయ వేమారెడ్డియే అని కవితరంగిణికర్త.

పైవిషయములనుబట్టి పండితులమధ్య ఏకాభిప్రాయము కుదరలే దనుట స్పష్టము. ఈ విషయ మింకను బరిశోధింపఁదగియున్నది. కావున జక్కన కవి శ్రీనాథ మహాకవికి సమకాలికుఁ డనియు విక్రమార్కచరిత్రము పదునేడవ శతాబ్ది ప్రథమపాదాంతమున రచింపఁబడి సిద్ధనమంత్రికిఁ గృతి యొసఁగఁబడినట్లు స్థూలముగ మనము తలంపవచ్చును.

విక్రమార్కచరిత్రము - కథాకావ్యము

విక్రమార్కచరిత్రము ప్రాచీనాంధ్రకథాకావ్యములలో నొకటి. సంస్కృతమున దండి మహాకవి రచించిన వచన దశకుమారచరిత్రమును జంపూకావ్యముగా నాంద్రీకరించి కేతన కధాకావ్యప్రక్రియకు మార్గదర్శకుఁ డాయెను. ఇందు రాజకుమారునితోఁ గూడ మంత్రికుమారాదులు పదుగురు ప్రదర్శించిన సాహసకార్యములను దెలుపు కథ లనేకము వర్ణింపఁబడియున్నవి. గుణాఢ్యపండితుఁడు పైశాచీభాషలో నసంఖ్యాకకధలతో రచించిన బృహత్కథయే భారతదేశీయకథాకావ్యములలో మొట్టమొదటి కధాకావ్యము మాత్రమే కాక తరువాత సంస్కృతభాషయందును, దేశభాషలందును వెలువడిన యిట్టి పెక్కింటి కిదియే మాతృక. ఇది బృహత్కథ యగుట వలన దీనిని గ్రహింపక కేతన కవి లఘుకథాసంపుటి యనఁదగు దశకుమారచరిత్రమునే గ్రహించెను. కేతన యనంతరము మంచనకవి సంస్కృతమున రాజశేఖరకవి రచించిన “విద్ధసాలభంజిక" యను నాటికను గ్రహించి, మూలకథలోఁ గొన్ని మార్పులు చేయుచు, మూలాతిశాయిగా మధ్యమధ్య సుమారు ఇరువది నీతికథలను జేర్చి దీని నొకకథాకావ్యముగ నాంద్రీకరించి కేయూరబాహుచరిత్ర మని పేరుంచెను. ఈ కేయూరబాహుచరిత్రము సంస్కృతనాటకములకు మొట్టమొదటి కావ్యరూపానువాదము; తెలుఁగులో రెండవ కథాకావ్యము. పిదపఁ బేర్కొనఁదగినది యీ జక్కన విక్రమార్కచరిత్రమే. ఐన నిది పైరెంటికంటెను గొంత వైలక్షణ్యము గలదిగా నున్నది. సంస్కృతము నందును విక్రమార్కుని సాహనపరాక్రమౌదార్యములను వర్ణించు పద్యకావ్యములు కలవు. విక్రమార్కచరిత్రము, బేతాళపంచవింశతి యనునవి యిట్టివి. నేను జూచినంతవరకు సంస్కృత విక్రమార్కచరిత్రము నందలి కధలు స్వల్పముగ జక్కన విక్రమార్కచరిత్రము నందును గోచరించినను ఇందలి పెక్కుకథ లందు లేవు. అందలికథ అనేకము లిం దగుపడవు. తెలుఁగు విక్రమార్కచరిత్రము నందలి కొన్నికథలకు మూలము లనఁదగిన కొన్నికథలు బృహత్కథ యందును దాని సంస్కృతాంధ్రానువాదము లగు “కథాసరిత్సాగర” సంపుటము లందును గోచరించును. ఆంధ్రదేశమునందుఁ దన కాలమునఁ బ్రజలలోఁ బ్రచారము నందున్న విక్రమార్కుని కథలను గూడ జక్కన తన కావ్యమునందుఁ జేర్చియుండు నని యూహింపఁబడుచున్నది. "భట్టి విక్రమార్కుల కథ” లను వచనగ్రంథమొకటి యనేకకథలతోఁ గూడినది తెలుఁగులో నున్నను, నిది యత్యాధునికము. జక్కన కించుక తరువాత కొఱవి గోపరాజు రచించిన “సింహాసన ద్వాత్రింశిక" యను పద్యకథాకావ్యము సంస్కృత విక్రమార్కచరిత్రమున కాంధ్రీకరణ మని చెప్పవచ్చును. ఏలయన నీరెంటి యందును విక్రమార్కుని సింహాసనమున కలంకారముగ నుండిన ముప్పది రెండు సాలభంజికలే విక్రమార్కుని సాహసౌదార్యాదులను ప్రశంసించు 32 కథలను భోజరాజుకు వినిపించును. ఈ కథలనే సందర్భానుసారవర్ణనాదులలో విస్తరింది గోపరాజు తెలుఁగున రచించె నని పై రెండు గ్రంథములను బోల్చిచూచిన దెలియనగును. ఇక బేతాళపంచవింశతిలోని 25 కథలు విక్రమార్కునకు బేతాళుఁడు స్వయముగాఁ జెప్పినవి. వాని ప్రణాళికయే వేఱు. జక్కన విక్రమార్కచరిత్రకు దానితో సంబంధము లేదు. గీర్వాణ విక్రమార్కచరిత్రము నందలి ప్రాస్తావిక నీతిశ్లోకములకుఁ గొన్నిఁటిని జక్కన తెనుఁగు చేసి యున్నను నిందలి కొన్ని కథలకు సంస్కృతమున సూచనలు కనవచ్చినను సంస్కృత విక్రమార్కచరిత్రమునకు జక్కన విక్రమార్కచరిత్ర మనువాదము కాక చాలవర కిది స్వతంత్ర్యగ్రంథ మనుట వాస్తవము. ప్రస్తుత విక్రమార్కచరిత్రకుఁ బిమ్మట గోపరాజు సింహాసన ద్వాత్రింశిక, అనంతామాత్యుని భోజరాజీయము, కోవెల గోపరాజు సింహాసన ద్వాత్రింశిక, కదరీపతి శుకసప్తతి మఱియు అయ్యలరాజు నారాయణకవి హంసవింశతి మున్నగునవి యీ కోవకుఁ జెందిన కావ్యములలోఁ ప్రసిద్ధములు.

ఇట నొక్కమాట. విక్రమార్కచరిత్రము విక్రమార్కునికి సంబంధించిన కథలను వర్ణించునట్లే, అనంతామాత్యుని భోజరాజీయము కూడ భోజరాజు జీవితమునకు సంబంధించిన కథలను వివరించు కావ్యమయినట్లు తఱచు తలంపఁబడుచున్నది. కాని యిది సరికాదు. భోజరాజీయమునందు మొత్త మేడాశ్వాసములు కలవు. వీనిలో ద్వితీయాశ్వాసమునందు మాత్రము భోజరాజు జన్మవృత్తాంతము మఱియు నతఁడు ధారానగరాధిపతి యయిన పిమ్మట సర్పటి యనునొక యౌషధసిద్ధుని మోసగించి “ధూమవేధి" యను రసవాదవిద్యను గ్రహించి యతనిచే శప్తుఁడయి, యనంతర మతని యనుగ్రహమునకుఁ బాత్రుఁడయి సిద్ధుని భోజనము సేయు మని ప్రార్థించును. భోజరాజీయమునందు భోజరాజు కధ యేతన్మాత్రమే. తక్కిన ఐదాశ్వాసములందును సర్పటి తాను “పంచభిక్ష" వ్రతనియమము కలవాఁడు కావున భోజునింట భుజింపజాల నని తెలిపి, భోజరాజ డడుగఁగా సిద్ధుఁ డతనికి భిక్షాటనమహాత్మ్యము, అన్నదానఫలము మున్నగువానిని వివరించు పలుకథలను జెప్పి, పిమ్మట మఱి నాలుగిండ్లలో భిక్షఁగొని తెచ్చుకొని భోజరాజు సహపంక్తిని భుజించుటతో నీకావ్యము సమాప్త మగును. కావున నిందలి ప్రధానేతివృత్తము భోజరాజునకు సర్పటి పంచభిక్షమహాత్మ్యమును, అన్నదానఫలమును దెలుపు కథలను జెప్పుట. తెలుఁగులోని ప్రసిద్ధ కావ్యములలో నిదియు నొకటి.

విక్రమార్కచరిత్రము నందలి కధలు

జక్కన విక్రమార్కచరిత్ర మెనిమిది యాశ్వాసముల మహాకావ్యము. ఇందలి పద్యగద్య సంఖ్య 1500 పై చిల్లర. ఇందు విక్రమార్కుని సాహసపరాక్రమౌదార్యాదులను వివరించు నద్భుతకథ లనేకములు వర్ణింపఁబడినవి. ఆశ్వాసానుసారముగ నిందలి కథాంశములు రేఖామాత్రముగ నీ క్రిందఁ దెలుపఁబడుచున్నవి.

I. ప్రథమాశ్వాసము :-
(1) కథా నాయకుఁడగు విక్రమార్కుని యొక్కయు నితని సోదరులగు వరరుచి, భట్టి , భర్తృహరి యనువారి జన్మవృత్తాంతము.
II. ద్వితీయాశ్వాసము :-

(1) విక్రమార్కుఁడు దిగ్విజయతత్పరుఁడయి వింధ్య కేఁగి వింధ్యవాసినికి నమస్కరించి, ఆలయబహిః ప్రదేశమున వాలిసుగ్రీవులను రక్కసులను వంచించి దివ్యప్రభావమహితము లగు యోగదండము, పాదుకలు రత్నపాత్ర మఱియు దివ్యకంథను సంపాదించుట.

(2) విక్రమార్కుఁడు యోగదండప్రభావమున మేరుసమీపమున జంద్రగిరి యను నగరమును నిర్మించి, పాలించుచుండుట.

(3) పాదుకల సహాయమున బ్రహ్మసభ కేఁగి, యతని మెప్పించి, బ్రహ్మాస్త్రమును బడసివచ్చుట.

(4) ఉజ్జయిని కేఁగి కాళికాలయము కెలని కొలనిపై వేలాడు నుట్టిచేరుల నొక్కవేటునఁ దెగ వేసి దేవిని మెప్పించి, భట్టితోఁ గూడి నుజ్జయిని రాజ్యమును వేయేండ్లు పాలించునట్లు వరమును, విక్రమాంక సాహసాంకుఁ డను బిరుదమును బడసివచ్చుట; ఉజ్జయినికి రాజగుట.

(5) ఇంద్రుని యాహ్వానమున స్వర్గమున కేఁగి, యతనివలన “ద్వాత్రింశత్సాలభంజికారంజితంబగు దివ్యసింహాసనము” బహుమతిగాఁ బడసి, దాని నధిష్ఠించి రాజ్య మేలుచుండుట.

(6) కనకస్తంభము నెక్కి సూర్యమండలమున కేఁగి, యతని వలన బంగారము నొసంగు రత్నకుండలములను బడసివచ్చి, వానినొక యర్థికి దానమిచ్చుట.

(7) మాయావరాహమును వెంబడించి పాతాళబిలముఁ జొచ్చి బలి చక్రవర్తి వలన రస, రసాయనములు కానుకగాఁ బొంది వచ్చి, వాని నొక వృద్ధ విప్రున కొసఁగుట.

(8) మధుర కేఁగి రక్కనునితోఁ బోరి కమలావతి యను నచ్చరను రక్షించి, యామె యొసఁగిన దివ్యమణిని పురందరుఁ డను వైశ్యకుమారున కిచ్చుట.
III. తృతీయాశ్వాసము : -

(1) భార్య చేసిన వంచన వలన విరక్తుఁ డయి తపస్సునకుఁ బోవ నిశ్చయించుట అను భర్తృహరి వైరాగ్యవృత్తాంతము.

(2) భర్తృహరి విక్రమార్కునకుఁ జెప్పిన, బహుశ్రుతుఁ డను మంత్రి నందభూపతిని బ్రహ్మహత్య దోషము వలనఁ గాపాడిన కథ.
IV. చతుర్ధాశ్వాసము :-
(1) నారదముని యాదేశమున సిద్ధపురరాజును యుద్ధమునం దోడించి, విక్రమార్కుఁడు విదర్భ రాజపుత్రిక యగు అనంగవతిని వివాహమాడి సుఖముండుట.
V. పంచమాశ్వాసము :-

(1) చిత్రకూటాద్రి కేఁగి కాళికను మెప్పించి విక్రమార్కుఁడు మౌనవ్రతుఁ డగు మునికి వరము లిప్పించుట.

(2) విక్రమార్కుఁ డశ్వమేధయాగము చేయుట; సముద్రుఁడు కానుకగా బంపిన నాలుగు దివ్యరత్నములను విప్రున కిచ్చివేయుట.

(3) విక్రమార్కుని యౌదార్యగుణపరీక్షకు సంబంధించిన కథ.

(4) నరమోహిని యను వారనారిని రక్షించి యామెను కమలాకరునకు వివాహ మొనరించిన కథ.
VI. షష్ఠాశ్వాసము :-

(1) మౌనవ్రత యగు కళావతి యను పాతాళ రాజపుత్రి వృత్తాంతము

(2) కళావతి మౌనమును భంగము చేయుటకై “దీపకంబము"చేత విక్రమార్కుఁడు చెప్పించిన రాగమంజరి సింహళ రాజకుమారుల కథ.
VII. సప్తమాశ్వాసము :-

(1) కళావతి మౌనమును రెండవసారి భంగము చేయుటకై విక్రమార్కుడు కర్పూరకరండముచేతఁ తెప్పించిన “రాజశేఖరుఁ" డను రాజకుమారుని వివాహకథ.

(2) పై దానికి అనుబంధముగాఁ గల కీరశారికల వివాదమునఁ బుట్టిన

రెండు చిన్నకథలు.
VIII. అష్టమాశ్వాసము :-
(1) మూడవసారి కళావతి మౌనమును భంగము చేయుటకయి విక్రమార్కుఁడు సువర్ణకలశముచేతఁ జెప్పించిన పద్మావతి, గుణవతి, లీలావతి యను నక్కసెల్లెండ్రగు మువ్వురు రాజపుత్రికల యొక్క “అనంగశాస్త్రవైదగ్ధ్యము"ను బ్రదర్శించు కథ. ఈ కథమాత్రము అసభ్యము, అవినీతికరము కూడ. కాని కధాకావ్యములఁ గొన్నింటను క్షేత్రమహాత్మ్యకావ్యములందుఁ గొన్నింటను నిట్టి సభ్యేతరకథాంశములు గోచరించుచుండుట వలనను, లాక్షణికశిఖామణి యగు దండి దశకుమారచరిత్రము నందును నిట్టి వుండుటవల్లను నీ కావ్యములలో నిట్టి వుండుటయు నొక సంప్రదాయ మని యూహింపవలసి యుండును(?). మఱియు నీ కథాకావ్యములు సాధారణముగా భారతాదుల వలె విజ్ఞానదాయకములుగా నుండుటకంటె వినోదదాయకములుగా నుండునవిగా నుద్దేశింపఁబడినవగుటయు నిందులకుఁ గారణాంతరముగా నూహింపవచ్చునేమో!

పైఁ గథాంశములను బరిశీలించినచో నీ విక్రమార్కచరిత్రము నందు సుమా రొక యిరువది కథ లున్నట్లు మసము తెలిసికొనగలము. అంతమాత్రముచేత దీని మహాకావ్యత్వమున కెట్టిలోపమును సంక్రమింపదు. మహాకావ్యము నందు భిన్నకథ లనేకము లుండుట దోషము కాదనుటకు మహాకవి కాళిదాసు “రమువంశ" మే ప్రబలతార్కాణము. ఇంతేకాక రఘువంశము నందు ఒకే వంశమునకుఁ జెందిన 22రు రాజుల వర్ణనాంశములు కలవు. ఇందట్లు గాక ఈ యిరువది కథాంశములును నాయకుఁ డగు విక్రమార్కుని గుణౌదార్యాదులను బ్రశంసించునవే యగుట నిందు వస్తైక్యత కలదనుటలో సందేహము లేదు. హరవిలాసమును నిట్టిదే కదా!

కథానాయకుని గుణగణములు

ఏతత్కావ్యనాయకుఁ డగు విక్రమార్కుఁడు పౌరాణికపురుషుఁడు కాక చరిత్రప్రసిద్ధుఁడు. విక్రమశక మితనిపేరఁ బుట్టినదే. సాహసపరాకమౌదార్యాది గుణసంపత్తిచేత లోకోత్తరుఁడు. నిజఫాలతలాగ్రచర్మమును ఖడ్గముతో జీల్చి చూపిన విక్రమార్కుని సాహసమున కచ్చెరువంది బ్రహ్మయిట్లు ప్రశంసించెను.

“ఆర్వురు చక్రవర్తులు పదార్వురు రాజులు విశ్వధారణీ
నిర్వహణప్రభావమున నేర్పరులైనను, వీని సాటియే
సర్వఫలప్రదానమున సాహసికత్వరమాసమగ్రతన్
గర్వితవీరవైరిచయఖండనమండనవిక్రమక్రియన్.(ఆ. 2–84)

మఱియు

“ఈయిల ధర్మరక్ష వెలయింప జనించినయట్టి యాదినా
రాయణమూర్తి వీవు, భవదంఘ్రిసరోరుహసేవ యర్థిమైఁ
జేయఁగ నాత్మఁ గోరి సరసీరుహగర్భుఁడు పుట్టె భట్టియై;
పాయక జోడుగూడి యిలఁ బాలన సేయుట మీకు నైజమౌ.” (ఆ.2-84)

అని సర్వేశ్వరి యగు కాళికావాక్యము. మఱియు బలిచక్రవర్తి కూడ

“బలము ప్రతాప మీగి దయ భాతి విభూతి వినీతి ధర్మని
శ్చలత కళావిశేషము నిజం బవధానము మాన మాదరం
బెలమి యనం బొగడ్త గలయిన్నిగుణంబులఁ గీర్తి కెక్కి, నీ
విల భరియింపఁగా జనుల కేల విచారము? భూతలేశ్వరా." (ఆ. 2-147)

అని విక్రమార్కుని గుణగణమును గీర్తించెను. వేయేల ?

పాడిసమస్తముం బొగడఁ బాయక యాశ్రమవర్ణధర్మముల్
జాడలు దప్పకుండ మఱి సజ్జనరక్షణ దుష్టశిక్షణ
క్రీడలె భూషణంబులుగఁ గీర్తివహించె ధరిత్రి నవ్విభుం
డేడవచక్రవర్తి పదునేడవరాజునునై మహోన్నతిన్.” (ఆ. 8-123)

అను కీర్తికిఁ బాత్రుఁడయినవాఁడు విక్రమార్క మహారాజు. మఱియు,

“కనుఁగొనిన వేయి, మాటా
డినఁ బదివే, ల్గుడువ లక్ష, డెందము ప్రమదం
బునఁ బొందినఁ గోటిధనం
బనయము నర్థులకు విక్రమార్కుం డొసఁగున్."(ఆ. 2-18)

ఇట్టి దాతృత్వ మనన్యసామాన్యముఁ గదా!

విక్రమార్కచరిత్రము - ప్రబంధరచనామార్గము

ఏవంవిధగుణగణవిభూషితుఁ డయిన విక్రమార్కుని సమస్తజీవితవృత్తాంతమును వెనుక వివరింపఁబడిన యిరువది కథాంశముల వర్ణనముతో విక్రమార్కచరిత్రమును జక్కన యొక మహాకావ్యముగా సంతరించెను. ఇంతకుఁ బూర్వము దీనిని కథాకావ్య మంటిని. ఐనఁ బ్రమాదము లేదు. కథాకావ్యమును మహాకావ్యభేదమే. మహాకవి బాణుని కాదంబరి కథాకావ్యమే. కావున జక్కన విక్రమార్కచరిత్రమును మహాకావ్యమే. మహాకావ్యమే యన నేల? దీని నతఁ డొకమహాప్రబంధప్రాయముగానే నిర్మించె ననుట సత్యదూరము కాదు.

రసము - వర్ణనలు

ఇందలి కథ లన్నియును నాశ్చర్యాపాదకము లగుట నిందలి యంగిరస మద్భుతము. వీరశృంగారాదు లితరము లంగరసములు. విక్రమార్కుఁడు రక్కసులతోఁ బోరిన సందర్భములందు వీరము చవి చూపింపఁబడినది. ద్రౌపదిని పాంచాలరాజు పార్థునకు భార్యగా యజ్ఞమునఁ బడసినట్లు, విక్రమార్కునకు భార్యగా నొసఁగుటకై విదర్భరాజు వరమునఁ బడసిన అనంగవతినిఁ బెండ్లాడఁ గోరి విదర్భపై దండెత్తిన ప్రతినాయకుఁ డగు సిద్ధపురరాజుపై విక్రమార్కుఁడు దండెత్తిపోయినప్పు డుభయసైన్యములకును జరిగిన సంకులసమరమును జతురాశ్వాసము (ప. 40-128) నందు సుమారు 90 పద్యములలో నతిదీర్ఘముగఁ దిక్కన మార్గము ననుసరించి వీరరసము తొణకాడునట్లు వర్ణించినాఁడు. పిదప నీ యాశ్వాసము నందే యుద్ధమున విజయలక్ష్మిని వరించిన విక్రమార్కునకును అనంగవతికిని జరిగిన వివాహమహోత్సవమును జక్కన సమస్తవైదికలౌకికసంప్రదాయానుసారముగా (ప. 181–200) సుమారు డెబ్బది పద్యములతో గడుమనోహరముగా వర్ణించియున్నాఁడు. వివాహానంతరము విక్రమార్కుఁడు భార్యతో నిజపురప్రవేశ మొనరింపఁగాఁ బురస్త్రీలు రాజును జూడవచ్చుట మున్నగునవి శృంగారప్రధానముగా ప్రబంధమార్గమున వర్ణింపఁబడినవి. అనంతరము సూర్యాస్తమయ, చంద్రోదయవర్ణనములు కలవు. పిమ్మట కేళీగృహతల్పగతుఁ డయి రాజుండఁగా సఖు లనంగవతిని శయ్యాగృహమునకుఁ దోడితెచ్చుట మొదలుకొని విక్రమార్క భూపతి 'ప్రసవశరశాస్త్రమతకళాపారంగతత్వము' మఱియు 'చతురశీతికరణప్రౌఢి' సంచర్శనపర్యంత (ప. 200-225) మభివర్ణింపఁబడినది. పంచమాశ్వాసము మొదటి 60 పద్యములలో అనంగవతీవిక్రమార్కుల ప్రమదావనవిహార, లీలాశైలారోహణ, డోలారోహణ, పుష్పాపచయ, జలకేళీ వ నాదులు శృంగారప్రధానముగఁ బ్రబంధఫక్కినిఁ గావింపఁబడినవి: విక్రమార్కుఁడు యుద్ధయాత్రకు బయలుదేరుటకు ముందు చతుర్ధాశ్వాసాదిలో అనంగవతి సౌందర్యవర్ణనము (ప. 18-18), వర్షర్తు (ప. 28-85), శరదృతు (88-89) వర్ణ నలును, పంచమాశ్వాసము మొదట వసంతర్తువర్ణనమును గావింపఁబడినది. ఇ ట్లించుమించుగా చతుర్థాశ్వాసము మొత్తమును మఱియుఁ బంచమాశ్వాసము మొదటి 60 పద్యములను గలిపి ముద్రించిన యెడల నిది యొక ప్రత్యేకప్రబంధమే కాఁగలదు. కావున రాయలయుగవు ప్రబంధరచనకు మార్గదర్శకు లయినవారిలో జక్కనయు నొక్కఁ డనుట నిక్కము.

విక్రమార్కచరిత్రము - మల్లన రాజశేఖరచరిత్ర కథకు మూలము

అష్టదిగ్గజకవులలో నొకఁడుగాఁ బరిగణింపఁబడుతున్న మాదయగారి మల్లనకవికృతమగు "రాజశేఖరచరిత్ర″ మొక ప్రబంధము. రాజశేఖరుఁ డనురాజకుమారుఁడు తాను గాంచిన కాంతిమతి యను రాజకన్యకను ప్రేమించి వివాహ మగుటయే యిందలి ప్రధానకథావస్తువు. ఈ కథకు మూలము కలదా? లేక యిది కల్పితమా! యను విషయములను గూర్చి శ్రీ వీరేశలింగము పంతులుగారు ఆలోచించియుండలేదు. ఈ విషయమును గూర్చి శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావుగారు ప్రత్యేకశ్రద్ధ వహించి, పరిశోధించి, రాజశేఖరచరిత్రము కల్పితప్రబంధ మని నిర్ణయించిరి. కథాకల్పనమును గూర్చిన వారి యభిప్రాయ మిట పొందుపఱుపఁబడుచున్నది.

“ఈ గ్రంథ మందలి కథేతివృత్త మేపురాణము నుండి గాని, యేకథాకోశము నుండి గాని తీసికొనఁబడినదో తెలియరాలేదు. అనేక పురాణములను, కథాసరిత్సారాదికథాగారములను పరిశోధించితిని. కానీ యీ కథకు మాతృకను కనుఁగొనలేకపోయితిని. బండారు తమ్మయ్యగారు సైతము దీని మూలకథ యెచ్చటను గానఁబడలేదనియే దెలిపిరి. కావున నీ కథ కవికల్పితమనియే యిప్పటివఱ కూహింపవలసియున్నది." (ఆంధ్రవాఙ్మయ చరిత్రము. భా. 2, పు-305). 'ఈ కథ నీ కవి నూతనముగా గల్పించినను బ్రశంసాపత్రము లగునంశములు గోచరింప'వని మఱొకవాక్య మిందే కలదు. ఇట్లు వీరు దీనినిఁ గల్పితకావ్య మనిననాటినుండియు రాజశేఖరచరిత్రము కల్పితకావ్యమే యను నభిప్రాయ మాంధ్రసాహిత్యలోకమున స్థిరమయిపోయి నేటికి నిది యిట్టిదిగానే తలపఁఁబడుచున్నది.

కాని వాస్తవమునకు రాజశేఖరచరిత్రము మూలరహితమైన కల్పనప్రబంధము కాదు. ఇందలి కథ మిగులఁ బ్రాచీనమే, కాని పౌరాణికము కాదు. మల్లన రాజశేఖరచరిత్రకు మూలభూతమయిన చిన్నకథ యొకటి 'కథాసరిత్సాగరము' నందే కలదు. (లంబ. 12; తరం. 10: బేతాళుని కథ. 3) కాని ఈ రెండు కథలు మాత్రమే పోల్చి చూచినచో శ్రీ అచ్యుతరావుగారు వ్రాసినట్లు వీని పరస్పరసంబంధము గుర్తించుట యెవ్వరికిని సాధ్యము కాదు. వీని యందలి నాయికానాయకుల పేళ్లు కూడ పూర్తిగ భిన్నముగ నుండుటయే యిందులకుఁ గారణము. కాని జక్కన విక్రమార్కచరిత్రము సప్తమాశ్వాసము మొదట గల రాజశేఖరుని కథను దాన పిమ్మట కథాసరిత్సాగరము నందిలి కథను గూడ పోల్చుకొనుటకు వలయు నాధారములు మనకు లభింపకపోవు. కావున విక్రమార్కచరిత్రము నందలి రాజశేఖరుని కథ దిగువ సంగ్రహింపఁబడుచున్నది.

విక్రమార్కచరిత్రమునందలి రాజశేఖరుని కథ

కథోత్పత్తి హేతువు :- కళావతి యను నాగలోక కన్యక యొక్క మౌనవ్రతమును భంగము చేసి, యామెచే రెండవసారి పలికించుటకయి విక్రమార్కుఁడు 'కప్పురపు బరణికి' నిజమంత్రశక్తిచేఁ బ్రాణము పోసి యొక కథ చెప్పుమని కోరఁగా నది యీ క్రింది కథఁ జెప్పెను.

వంచక (ఆవంచక) మను బురమును విక్రమకేసరి యను రాజు పాలించుచుండెను. ఆయన రాణి ఉమావతీమహాదేవి. వారికి రాజశేఖరుఁ డను పుత్రుఁడు కలిగెను. రాజశేఖరుఁడు పితృమార్గము ననుసరించు ఉత్తమక్షత్రియుఁడు. ఒకనాఁ డతఁడు సైన్యముతో వేఁట కేగెను. వేఁటాడుచుఁ బోయి పోయి పార్వతీదేవి మందిరమును గాంచి, దేవికి మొక్కి, యా చెంత నొక రాచిలుకతోఁడ సంభాషించుచున్న యొక యోగిని గని, సమీపించెను. ఆ చిలుక “యఱువదినాలుగువిద్యల నెఱవాది యనియుఁ, ద్రికాలవేది" యనియుఁ జెప్పి దాని నా యోగిని రత్నపంజరముతోఁ గూడ రాజశేఖరున కొసఁగెను.

అంత రాజశేఖరుఁడు దేవ్యాలయసమీపలతాగృహమున విశ్రమించి, యా చిలుకను జూచి కుతూహలముతోఁ దన భావిఫలప్రాప్తినిఁ గూర్చి బ్రశ్నింపఁగా నది యిట్లు చెప్పెను. “సత్యధర్ముఁ డను అవంతీపురాధీశుని కూఁతురగు కర్పూరమంజరి నీకు భార్య కాఁగలదు. వైవాహికవార్తయు నిప్పుఁడే రాఁగలదు". అని చెప్పుచుండగనే చతురిక యను చెలికత్తె దూతికఁగా వచ్చి రాకుమారునకు మ్రొక్కి కూర్చుండెను. అంత నామెను జూచి, చిలుక

“పలుకులనేర్పునం జెవుల పండువు చేసితి వింతసేపు నా
పలుకు శిలాక్షరంబుగ శుభంబది శీఘ్రముగాఁగ నంతయుం
దెలియఁగఁ జెప్పు మింక భవదీయసమాగమనప్రసంగముల్
జలజదళాక్షి యేమిటికిఁ జల్లకు వచ్చియు ముంత దాఁపఁగన్."

అని పలుకరింపఁగా విని యచ్చెరువంది యాసుందరి యిట్లు విన్నవించెను. “సత్యధర్ముఁ డవంతిదేశాధిపతి. అతని రాణి లీలావతి, వీరికిఁ గర్పూరమంజరి యను తనూజ కలదు. అమె సకలవిద్యలు నేర్చిన యందగత్తె. 'ఒకనాఁడు చెలులతో గూడ మన్మథపూజకయి యామె శృంగారవనమున కరిగెను. అచ్చటఁ జిలుకకుఁ బురాణకథలు చెప్పుచున్న యొకశారికను జూచెను. రాజపుత్రిక సమీపించఁగా నది యామె చేతఁ జిక్కెను. రాజకుమారి దాని కళాకుశలత్వమునకు గారణ మడుగఁగాఁ దాను సరస్వతీదేవి చేతిచిలుకచేతఁ బెంపఁబడితి ననియుఁ, ద్రికాలవేది ననియుఁ జెప్పెను. అది విని కర్పూరమంజరి తనకుఁ గాఁబోవు పతిని గూర్చి ప్రశ్నింపఁగా నది యావంచక రాజసుతుఁ డగు రాజశేఖరుఁడు భర్త కాఁగలఁడని తెలిపి యతని గుణరూపాదులను ప్రశంసించెను. ఇట్లు శారిక వలన మీవృత్తాంతమును విని. రాజపుత్రి విరహబాధకుఁ గుఱి కాఁగా, చెలులా విషయము నామె జనకున కెఱిఁగింప నా రాజు మిమ్ము తోడ్కొని తేర నన్నుఁ బంపె" నని చెప్పి చతురిక మిన్నకుండెను.

రాజశేఖరుఁడు సంతోషించి పరివారముతోఁ జతురిక ననుగమించి, అవంతిపురాంతికోద్యానమున విడిసియుండఁగాఁ జతురిక యరిగి యా వార్త దెలిపి రాజకుమారిక సలకంచెను. సత్యధర్మవిభుఁడు అల్లు నెదుర్కొని తెచ్చి పుత్రిక నొసఁగి వివాహ మొనరించెను. ఇట్లు వివాహితుఁ డయి రాజశేఖరుఁడు భార్యతో గూడ ఆవంచకపురి కరిగి సుఖముండెను.

ఇది జక్కన వర్ణించిన రాజశేఖరుని ప్రధాన కథ. దీని చివఱ శుకశారికల వివాదమునకు సంబందించిన మఱి రెండు చిన్న కథలు గలవు. అందుఁ బురుషులు పాపాత్ము లనుటకు నిదర్శనముగా శారిక చెప్పిన కథ మొదటిది. స్త్రీలే పాపాత్ము లనుటకు శుకము చెప్పిన కథ రెండవది. ఈ రెండును రాజశేఖరుని కథతో సంబంధించినవే. రాజశేఖరుని వివాహకథను మాత్రము జక్కన కవి చక్కని వర్ణనలతో శృంగారప్రధానముగా 74 పద్యములలో వ్రాసెను.

పరిశీలింపఁగా కథాసరిత్సాగము నందు త్రివిక్రమసేనునకు బేతాళుఁడు చెప్పిన సంగ్రహకథనే గ్రహించి జక్కన దానిని గొంత మార్చి పెంచి విక్రమార్కచరిత్రమునఁ జేర్చెనని తోఁచును.

కథాసరిత్సాగము నందలి కథ:-

సందర్భము– త్రివిక్రమసేనుని మౌనమును భంగము చేసి యతనితో మాట డించుటకు బేతాళుఁ డీ క్రింది కథఁ జెప్పెను.

కథ :- పాటలీపుత్రమును 'విక్రమ కేసరి' యను రాజు పాలించుచుండెను. ఆయన యొద్ద 'దివ్యజ్ఞానము' కలదియు 'సర్వశాస్త్రకోవిద'యు నగు చిలుక 'విదగ్ధ చూడామణి' యనునది శాపవశమున నాజన్మ మెత్తినది యొకటి యుండెను. దాని యుపదేశమున నా రాజకుమారుఁడు తనకుఁ దగిన మగధరాజు పుత్రికను 'చంద్రప్రభ' యను దానిఁ బెండ్లాడెను. ఆమెయొద్దను 'సర్వవిజ్ఞానశాలిని' సోమిక యను పేరు గల గోరువంక యుండెను'. ఇది ప్రధాన కథ. దీని చివఱఁ గూడ శుక శారికల వివాదమునఁ బుట్టిన, పురుషులే పాపాత్ము లనుటకు గోరువంకయు, స్త్రీలే పాపాత్ము లనుటకుఁ జిలుకయుఁ జెప్పిన రెండు కథలును గలవు.

సామ్యము:— పై రెండు కథలును మౌనవ్రతమును భంగము చేయుటకు నుద్దేశింపఁ బడినవి. ఈ రెంటి చివఱను శుకశారికల వివాదమునఁ బుట్టిన రెం డనుబంధకథలు నొకేవిధమునఁ గలవు. ఇఁక కథాసరిత్సాగరము నందలి కథానాయకుఁడు విక్రమకేసరి యని యుండగా జక్కన కథానాయకునకు రాజశేఖరుఁ డను క్రొత్తపే రిడి, 'విక్రమకేసరి' నామము నతని జనకున కొసఁగె ననుట యూహ్యము. నాయకుని యొద్ద దివ్యజ్ఞానము గల చిలుకయు, నాయిక యొద్ద నట్టిదే యగు గోరువంకయు రెంటియందును సమానముగాఁ గలవు. ఈ శుకశారికలు నాయికానాయకుల వివాహసంధానమునఁ బాల్గొనుట రెండు కథలయందును గనవచ్చును. ఈ పైసామ్యబాహుళ్యము ననుసరించి జక్కన రాజశేఖరుని కథకుఁ గథాసరిత్సాగము నందలి విక్రమకేసరి కథయే మూల మనుట నిస్సంశయము.

మల్లన రాజశేఖర కథలోని ప్రధానాంశములు :- జక్కన కథానాయకుఁ డగు 'రాజశేఖరుఁడే' మల్లన రాజశేఖరచరిత్ర ప్రబంధకథానాయకుఁడు. గ్రంధమునకును మల్లన నాయకుని నామమే పెట్టెను. రాజశేఖరుని పురనామము 'వంచక ' యనియు 'ఆవంచక' యనియు నిరుతెఱఁగుల జక్కన పేర్కొనఁగా మల్లన దీనిని 'అవంచి ఆవంచిక ' మని రెండు విధములఁ జెప్పెను. 'ఆవంచక' మనునది రెంటను సమానము. రాజకుమారి చెలికత్తె యగు దూతికకు జక్కన యొసఁగిన 'చతురిక' నామమునే మల్లన గ్రహించెను. పై నామములలో నెవ్వియును కథాసరిత్సాగరకథలో లేక , విక్రమార్కచరిత్రమునందే యుండుటవలన . వాని నటనుండియే మల్లన గ్రహించినట్లు తలంచుటయే సమంజసము. వీనితో పాటు యోగిని వృత్తాంతము, దివ్యజ్ఞానము గల శుకమును విక్రమార్కచరిత్రమునందు వలెనే రాజశేఖర చరిత్రమునందును గలదు. మఱియును జక్కన చెప్పిన రాజశేఖరుని కథయే కొలది భేదముతో రాజశేఖరచరిత్రము నందును సమగ్రముగాఁ గలదు. పైనిఁ దెలిపినవి కాక జక్కన కథలోని తక్కినపేర్లను మల్లన పూర్తిగా మార్చివేసెను. ఇట్లే రాజశేఖరుని నామమును గూడ మల్లన మార్చియుండెనేని, యీ ప్రబంధకథకు జక్కన వర్ణించిన రాజశేఖరుని కథ మాతృక యని గుర్తించుట సాధ్యము కాకుండెడిది.

ఈ రాజశేఖరుని కథను మల్లన దానొక ప్రత్యేక ప్రబంధముగాఁ బెంచి వ్రాయ సంకల్పించిన వాఁడు కావున కొన్ని నూత్నకథాంశములను గల్పించియు, వర్ణనాదులను జేర్చియు మూఁడాశ్వాసములకుఁ బెంచి రాజశేఖరచరిత్ర ప్రబంధమును రసవంతముగా రచించెను. ఇది యొక ప్రత్యేకప్రబంధ మగుట నిందలి సమస్తకథ నిట వివరించుట యనవసర మని తలఁచి విరమించితిని. ఇఁక సర్వసామాన్యముగఁ దలఁపఁబడుచున్నట్లు మల్లన రాజశేఖరచరిత్ర కల్పితప్రబంధము కాదనియు, నిందలి కథకు మూలము జక్కన రాజశేఖరుని కథ యనియు, మఱియు దానికి కథాసరిత్సాగరము నందలి విక్రమకేసరికథ మూల మనియు, మఱియు మనుచరిత్ర కథకు మార్కండేయపురాణ మెట్టిదో మల్లన రాజశేఖరచరిత్రకు, జక్కన విక్రమార్కచరిత్రము నట్టిదే యని తెలుపుటయే యింతవఱకుఁ గావింపఁబడిన కథావిషయవివరముయొక్క ముఖ్యోద్దేశము.

జక్కన చేసిన ప్రబంధవర్ణనలు

ఈ విక్రమార్కచరిత్రము నద్భుతావహము లగు ననేకకథలచే నాకర్షవంతముగఁ జేసి నవరసభరిత మొనరించి యాస్వాదనీయముగ నొనరించుటే కాక జక్కన దీనిని నానావిధవర్ణనాదులచేఁ గడు మనోహరము గావించెను, ఇపు డిందలి వర్ణనములను గూర్చి కొంత దెలుపఁబడును.

"నగరార్ణవశైలర్తు చంద్రార్కోదయ వర్ణనమ్
ఉద్యానసలిలక్రీడా మధుపానరతోత్సవాః
విప్రలంభోవివాహశ్చ కుమారోదయవర్ణనమ్,
మంత్రద్యూత ప్రయాణాజి నాయకాభ్యుదయా అసి.
ఏతాని యత్రవర్ణ్యంతే తన్మహాకావ్యముచ్యతే.
ఏషామష్టాదశానాంయైః కైశ్చిదూన మసీష్యతే."

మహాకావ్య, మహాప్రబంధముల యందుఁ బై యష్టాదశవర్ణనములలో నన్నిగాని, కొన్ని తక్కువగఁ గాని యుండవలె నని యాలంకారికుల మతము. విక్రమార్కచరిత్రము నందు జక్కన యించుమించుగా నుపర్యుక్తవర్ణనముల నన్నిఁటినిఁ జేయుట మాత్రమే కాక సందర్భానుసారముగ నితర సాధారణవర్ణనము లనేకములు నిందుఁ జేర్చినాఁడు. అట్టి ప్రధానాప్రధానవర్ణనలకు గ్రమముగా గ్రంథసందర్భములు దిగువఁ జూపఁబడుచున్నవి.

అష్టాదశవర్ణనములు :

1. పురవర్ణనము :- మధురానగరవర్ణనము నీకవి యత్యంతాసక్తితో సుమారు 37 పద్యములతో గావించినాఁడు. (ఆ. 1. 64-100)

ఇంతటితోఁ దనివిసనక తర్వాతిదగు దీర్ఘవచనము (ప. 101) చేతను మధురాపురిని సాంగోపాంగముగ వర్ణించెను. ఈ వచనమునందు బాణుని కాదంబరి శైలి ననుసరించి శ్లేషానుప్రాణిత మగు ఉపమా, విరోధాభాసాద్యలంకారాదులు హృద్యముగాఁ గూర్పఁబడినవి. సంస్కృతగద్యకావ్యములు జటిలదీర్ఘసమాసఘటితములయి యర్థావబోధమునఁ బండితులకే క్లేశదాయకములుగ నుఁడుటచేఁ గాబోలు; ప్రాచీనాంధ్రకవు లట్టివాని ననువదించుటకుఁ గానీ, యట్టి గద్యకావ్యము లను బ్రత్యేకముగ రచించుటకుఁ గాని పూనుకొనక తమ పద్యకావ్యములయందే యెడనెడ నట్టి వచనఖండముల నభినివేశముతో రచించియుందురు.

మధురావర్ణనము గాక యిందు ఉజ్జయినీ (ఆ.2-41, ఆ.8-112); వంచక (ఆ. 7-7); అవంతి (ఆ. 7-40); కాంచీ (ఆ. 7-112-118); విక్రమసింహము (ఆ. 7-112) లను పురములును వర్ణింపఁబడినవి.

2. సముద్రవర్ణనము : (ఆ. 5-12).

3. శైలవర్ణనము : శ్రీశైలపర్వతము (ఆ. 1-195-201); మేరుశైలము (ఆ. 2-13) లిందు వర్ణింపబడినవి.

4. ఋతువర్ణనము : వర్షర్తువు (ఆ. 4-26). శరద్వర్ణనము (ఆ. 4-38-39); వసంతర్తు (ఆ. 5-3-16).

5. చంద్రోదయవర్ణనము, చంద్రోదయము (ఆ. 6-67); చంద్రిక (ఆ. 6-69-71).

6. సూర్యోదయాదివర్ణనము : సూర్యోదయము (ఆ. 2-107, ఆ. 3-105); సూర్యాస్తమయము (ఆ. 3-8); సూర్యాస్తమయతమోవర్ణనము (ఆ. 6-62–66); అంధకారము (ఆ. 7-150); సూర్యమండలతాపవర్ణనము (ఆ.2-112).

7. ఉద్యానవిహారము . (ఆ. 5-18-25, ఆ. 8-32).

8. జలవిహారము : (ఆ. 5-38-64).

9. మధుపానము : (?)

10. రతోత్సవము : చతుర్థ, అష్టమాశ్వాసములు.

11. విరహము : (ఆ. 7-62, 64).

12.వివాహము : (ఆ. 4-131-200), అతిదీర్ఘమును, సాంగోపాంగ మయిన వర్ణనము.

13. సుతోదయము : (ఆ. 1-180-184).

14. మంత్రాలోచనము : (ఆ. 4-118-123).

15. దౌత్యము : (ఆ. 4- 58-73)

16. యుద్ధయాత్రావర్ణనము : (ఆ. 4-75-83)

17. యుద్ధవర్ణనము : (ఆ. 4-84-125)

18. నాయకాభ్యుదయము : (ఆ. 4-126-129).

పై పట్టిక వలన అష్టాదశవర్ణనములను జక్కన సుమారు 300 పద్యములలో గావించినట్లు తెలియవచ్చును. వీని యందును వనవిహార, జలవిహార, బుతు, యుద్ధ, పుర, వివాహవర్ణనలు క్రమముగా నుత్తరోత్తరదీర్ఘములు.

ఇతర వర్ణనములు :

స్త్రీ వర్ణనము ; ఆ. 1. 116-119; ఆ. 4. 16-19; ఆ. 5. 169-173; ఆ. 5. 44-49; ఆ.7.36; ఆ. 7. 40-46; ఆ. 7: 53-60; ఆ. 8. 42-46.

రాజవర్ణ నము: ఆ. 1.102; ఎఱకు వర్ణనము ఆ. 1.23; వృద్ధ బ్రాహ్మణవర్ణనము ఆ, 2-117, 155; నారదవర్ణనము ఆ. 4-3; విప్రకుమారవర్ణనము ఆ. 7.43; విటవర్ణనము ఆ. 8-6,7; ఇవిగాక తాపసులు, రాక్షసులు మున్నుగాఁ గల పురుషవర్ణన లనేకము గలవు.

వరాహవర్ణనము . ఆ. 2. 125, 126; 133; ఆ. 3.75

నాట్యవర్ణనము. ఆ. 2. 89, 91

అశ్వమేధయాగవర్ణనము : ఆ. 5.93-136

పరిమళవాయువర్ణనము : ఆ. 6.53

కోడికూత. ఆ. 6.73

యోగినీవర్ణనము : ఆ. 7.14

శుకవర్ణనము : ఆ. 7.26

భోజన వర్ణనము. ఆ. 4-188

రోదనవర్ణనము : ఆ. 7.153

పుణ్యతీర్థక్షేత్రదేవతావర్ణనము : కాశీవర్ణన ఆ. 2. 189-194; శ్రీశైలవర్ణనము ఆ. 2. 198-206; అహోబలము ఆ. 2. 208.212 మఱియు కాళహస్తి, శ్రీరంగము, అనంతశయనాది పుణ్యక్షేత్రవర్ణనము లిందు భక్తిరసప్రధానముగఁ జేయఁబడినవి. హేమకూట విరూపాక్ష వర్ణనములు నిందు గలవు. ఇందలి యీ ఘట్టములు పండితారాధ్యచరిత్ర, నృసింహపురాణ, కాళీఖండ, కాళహస్తిమహాత్మ్య, పాండురంగమాహాత్మ్యాదులలోని వర్ణనలను దలఁపునకుఁ దెచ్చును. ఇట్టి వర్ణనలచేత జక్కన తన కావ్యమునఁ బవిత్రవాతావరణమును సృష్టించెను. నన్నెచోడుని వలెనే దీనిని జక్కన శ్రీకారముతోఁ బ్రారంభించి 'మంగళమహశ్రీ' వృత్తముతో ముగించుట గమనింపఁదగియున్నది.

ఇతరవర్ణనలలో ముఖ్యము లని భావించినవి మాత్రమే యిచటఁ దెలుపఁ బడినవి. ఇక జక్కన యొక్క పద్యరచనాపాటవము, వర్ణనావైదగ్ధ్యము, పాండిత్యము, ప్రతిభ, భావనాశక్తి, శబ్దార్ధాలంకారప్రీతి, శేషయమకఘటనానైపుణి మున్నగు కవితాగుణములను స్ఫురింపఁజేయు కొన్ని పద్యములు మాత్ర మిట నుదహరింపఁ బడును. వానిఁ జదివి సహృదయు లగు పాఠకమహాశయులు జక్కన కవితాశక్తి నవగాహనము చేసికొందురు గాక!

వర్షర్తువర్ణము :
ప్రథమోదబిందులఁ బల్లవించె ననంగ
        నింద్రగోపద్యుతి నిలఁ దనర్చె
భానుచంద్రుల సూడుపట్టి గెల్చె ననంగఁ
        గంధరపటలాంధకార మడరె
జలదానిలంబునఁ బులకించెనో యనఁ
        గుటజభూజంబులు కోరగించె
స్తనితమర్దళరవంబునకు నాడె ననంగ
        వనమయూరములు నర్తనము చేసెఁ
బాంథజనచిత్తచిత్తసంభవమహాగ్ని
ఘనతరజ్వాలజాలానుకరణనిపుణ
వివిధవిద్యుత్పరంపరావిభ్రమంబు
లఖలహరిదంతరంబుల నతిశయిల్లె.(ఆ. 4-31)
దళితానంతదిగంతమై ఘుమఘుమధ్వానంబు సంధిల్లగాఁ
గలయం జాముల వ్రేలఁ గట్టినటు, లుగ్రవ్యగ్రలీల న్నిర
ర్గళధారాళకరాళమై కురిసె వర్షం బెందు నేయింటివా
రలుఁబొర్గింటికి నేఁగకుండఁగ నహోరాత్రంబుఁ జిత్రంబుగన్.(ఆ. 4 - 32)
గగనరత్నముకట్టు మొగులుతో నుదయించెఁ
        జరమదిక్కునఁ దోఁచె శక్రధనువు
పూర్వాపరవ్యాప్తిఁ బొలుపారె జలరేఖ
        లాలోలగతివీచె మూలగాలి
మెఱుఁగు మొత్తంబులు మెఱసె నుత్తరమునఁ
        గడఁగె దక్షిణపు మేఘముల గములు
ప్రాలేయఖానుండు పరివేషగతుఁ డయ్యెఁ
        జాతకంబులు నింగి సంచరించె

నెఱల పెనుపట్టె నేలపైఁ గొఱలఁ జొచ్చె
మొనసి చీమలగమిగ్రుడ్డు మోవఁ దొణఁగెఁ
గుజము కొనకొమ్మ డిగి క్రిందికొమ్మమీఁది
నిలుపుఁ గైకొను పులుఁగుల యెలుఁగు లెచ్చె.(ఆ. 4.27)

శరదృతువు నందలి ఒక దృశ్యము :

బాలలు లీలతో బలుసుఁ బండులచాయఁ దనర్చి పండికై
వ్రాలిన రాజనంబులకు వచ్చుశుకంబులఁ జేరనీక పోఁ
దోల రవంబుతోఁ జెఱకుఁదోఁటల నీడలనుండి పాడి రు
న్మీలితహావభావరమణీమకరాంకుని సాహసాంకునిన్.(ఆ. 4.39)

వసంతర్తువర్ణనము.

రాజకీరకుమారరాజి కక్షరశిక్ష
        యొనరింపవచ్చిన యొజ్జ యనఁగఁ
గలకంఠనికురంబకములకు వాకట్టు
        విడిపింపవచ్చిన వెజ్జనంగఁ
దరులతాదులకు వార్ధకము మానఁగ మందు
        సేయంగ వచ్చిన సిద్ధుఁడనఁగ
సంప్రణయక్రోధజంపతినివహంబు
        గలుపవచ్చిన చెలికాఁ డనంగ
మందమారుతోద్భూతమరందబిందు
సిక్త షట్పదజ్యారవశ్రీవిలాస
మకరకేతుప్రతాపసమగ్రమై, వ
సంత మేతెంచె సంతతోత్సవ మెలర్ప.(ఆ. 5.3)

కాముకులుఁ గామినులునుం
గామాతురు లగుట యరుదె? మనతరులతికా
స్తోమము ప్రేమము గైకొనె!
నామని నబ్జజునకైన నలవియె పొగడన్.(ఆ. 5-10)

ఉద్యానవిహారము :

మంజరీసంజాతమకరందమధుమత్త
        చంచరీకద్వంద సంభ్రమములఁ
గోరకితానేకకోమలవల్లికా
        వేల్లితభూజాత విలసనముల

సహకారఫలరసాస్వాదన సంతుష్ట
        శుకసతీపతిరుతి ప్రకటనములఁ
గిసలయాంకుర రసగ్రసన సముత్కంఠ
        కలకంఠ విటవిటీ కలకలములఁ
గనియు వినియు వసంతసంక్రాంతరాగ
సర్వసామాన్యమహిమ కాశ్చర్యమంది
చెలి కెఱింగించి కొనియాడి చెప్పి చెప్పి
ప్రమదవనకేళిఁ దేలిరి పతియు సతియు.(ఆ. 5.24)

పుష్పాచయము :

అందని పువ్వుగుత్తుదెసకై యఱుసాపఁగ నేల బాల? కో
యందలవయ్యె నేని, నెగయ న్నిను నెత్తెదనంచు, సంతసం
బందఁగ నెత్తియెత్తి విభుఁ డందఱిముందఱ డించుచుండఁగా
నందినకంటె సంతసము నందె లతాంగియు మాటిమాటికిన్. (ఆ. 5–27)

జలకేళి :

ఆ నెలతల్ సరోజినికినై దిగునప్పుడు నూత్నరత్నసౌ
పానములం దదీయతను బంధురబింబము లుల్లసిల్లెఁ దే
జోనిధియైన యానృపతి సోయగముం దరిసించు వేడుకం
బూని జలాధిదేవత లపూర్వగతిం జనుదెనించిరో యనన్. (ఆ. 5-45)

మృగమదపంకిలాంగు లొకమే నొకమే ఘనసారచందన
స్థగితలునైన కామినులు సాటిగ నొండొరుఁ జల్లి యాడుచో
సగమున నల్పు దెల్పులగు చాయలు సెందిఁ గళిందకన్యకా
గగననదీ సమాగమముకైవడిఁ బద్మిని యొప్పె నత్తరిన్. (ఆ. 5–47)

[1]

నెలతలు కంఠదఘ్నమగు నీరవిహార మొనర్ప నిల్చినం
గొలను తదాసనస్ఫురణం గ్రొత్తమెఱుంగు వహించెఁ బెక్కుత్రి

 

ప్పులఁబడి యొక్కచంద్రుని నపూర్వముగాఁ గనుటెంతయంచు వో
జలనిధినెంచి లీల బహుచంద్రులఁ దానొనరించెనో యనన్.(ఆ. 5-48)

చంద్రోదయము :

కైసేసి పూర్యదిక్కామినీమణి చూచు
        పద్మరాగంపుదర్పణ మనంగ
వేయిగన్నులుగల వేల్పుతొయ్యలిచేతఁ
        జూపట్టుచెంబట్టుసురఁటి యనఁగఁ
విరహులపై దండు వెడలంగఁ దమకించు
        నసమాయుధుని కెంపుటరిగ యనఁగ
గల్పకభూజశాఖాశిఖాగ్రంబున
        భాసిల్లు పరిపక్వఫల మనంగ
నభ్రమాతంగకులపతి యఱుతనొప్పు
కనకఘంటిక యనఁగ, లోకముల కెల్ల
నుదయరాగంబు రాగంబు నొదవఁజేయ
నిందుఁ డుదయించె లోచనానందుఁ డగుచు.(ఆ. 6-67)

చంద్రికావర్ణనము :

పసగల వెన్నెలమిసిమి పుక్కిటఁ బట్టి
        పొసఁగఁ బిల్లలనోళ్ళఁ బోసి పోసి
నున్ననిక్రియ్యన్కు వెన్నెలతుంపరల్
        హుమ్మని చెలులపై నుమిసియుమిసి
కమ్మనివెన్నెల కడుపునిండఁగఁ గ్రోలి
        తెలివెక్కి గఱ్ఱనఁ ద్రేన్చి త్రేన్చి
కన్నిచ్చలకు వచ్చు వెన్నెలక్రొన్నురు
        వేఱి వే ప్రియురాండ్ర కిచ్చియిచ్చి
తఱచు వెన్నలగుంపులఁ దాఱితాఱి
యీఱమగు వెన్నెలలలోనఁ దూఱి తూఱి
పలుచనగు వెన్నెలలలోనఁ బాఱి పాఱి
మెలఁగెఁ బెక్కు చకోరంపుఁ బులుఁగుగములు.(ఆ. 6-71)

నక్షత్రోదయము :

మెఱ పగ్గలింపఁ జుక్కలు
తఱచై పొడముటయు గగనతల మొప్పారెన్

మెఱుగారు ముత్తెములచే
మెఱవడి యగు నల్లపట్టు మేల్కట్టు గతిన్.(ఆ. 6-64)

సూర్యతాపవర్ణనము :

[2]కల్పాంతదుర్దాంతకలుషాంతకస్వాంత
        దుర్వారవహ్నికి నోర్వవచ్చు
నిష్ఠురనిర్దోషనిర్ఘాతసంఘాత
        జాతమహావహ్ని సైఁపవచ్చుఁ
బ్రళయకాలాభీలఫాలలోచనఫాల
        భాగానలస్ఫూర్తి బ్రతుకవచ్చుఁ
గాకోదరేంద్రఫూత్కారసంభవతీవ్ర
        కాకోలదహనంబుఁ గదియవచ్చుఁ
గాక సైరింపవచ్చునే లోకదహన
దర్శితంబైన యస్మత్ప్రతాపవహ్నిఁ
దావకోత్సాహ సాహసౌదార్య దైర్య
గతికి మెచ్చితి విక్రమార్క క్షితీంద్ర!(ఆ. 2-112)

సూర్యాస్తమయ వర్ణన :

పశ్చిమాంభోనిధిప్రాంతదేశంబున
        రంజిల్లు విద్రుమకుంజ మనఁగఁ
జరమాద్రిశిఖరదేశంబునఁ గనుపట్టు
        కమనీయఘనరత్నగండ మనఁగ
నపరదిక్కామిని యమరంగఁ గనుఁగొను
        పద్మరాగంపుదర్పణ మనంగ
పశ్చిమదిక్కుంభిఫాలభాగంబున
        బొలుపొందు జేగురుబొట్టనంగఁ
బూర్వకంధి వేలావనభూమిఁ బండి
కాలశుకతుండహృతి బిట్టుగదలి, యపర
జలధిలోఁ బడు దాడిమీఫల మనంగ
నబ్జినీవనబాంధవుఁ డస్తమించె.(ఆ. 3-85)

తపసివర్ణన :

అచ్చవెన్నెలమించు నపహసించు విభూతి
        యంగరాగంబుగా నలవరించి

యాగమోచితముగా నవయవంబులయందు
        లలితరుద్రాక్ష భూషలు వహించి
పొంబట్టు పుట్టంబు పొట్ట నందంబుగా
        ఘనాజటాజూటంబు గలయఁ బొదివి
యడుఁగుఁ గెందమ్ముల బెడఁగు రెట్టింపఁగాఁ
        గాంచనమణిపాదుకములు దొడిగి
జమిలి మొలతాట నినుపకచ్చడ మమర్చి
కక్కపాలయుఁ గక్షభాగమునఁ బూని
తరుణ శశిమౌలి యపరావతార మనఁగ
ధరణిపతి పాలి కేతెంచెఁ దపసి యొకఁడు.(ఆ. 2-97)

వృద్ధవిప్రవర్ణన.

పటలికావృతనేత్రపర్యంతరేఖలు
        పొదవికై వ్రాలిన బొమలతోడ
దంతపాతముల నెంతయు స్రుక్కిన కపోల
        తలముల నెలకొన్న వలులతోడ
నవగతకేశోత్తమాంగంబు కెలఁకులం
        దూగాడు నరపవెండ్రుకలతోడఁ
గ్రౌంచకంఠోపమాకారతఁ గనుపట్టు
        నస్నిగ్ధమైన దేహంబుతోడ
శతశతచ్ఛిద్రజీర్ణవస్త్రములతోడ
కల్పతతరపర్వయుతవంశయష్టితోడ
హరిసహస్రనామోచ్చారణరతితోడ
వచ్చి యొకవృద్ధభూసురవరుఁడు గదిసి.(ఆ. 2-117)
పలుకనిమోముఁ దొట్రుపడు పాదములున్ వగరంపుటూర్పులున్
వలవలనైన దంతములు వంగిన మేను వణంకు మస్తమున్
నిలుపఁగరాని యుక్కిసయు నెమ్మెయి నెక్కొను దప్పి పెంపుఁ జే
వెలుఁగునఁ జూచుచూపుఁ గల వృద్ధమహీసురుఁ డమ్మహీశ్వరన్.(ఆ. 2-155)

పాతాళరాజకన్యకవర్ణనము :

చిన్నారిపొన్నారిచెక్కుటద్దములపై
        జిఱునవ్వుమొలకలు చెంగలింప
మదనుని తూపుల మఱపించు చూపుల
        తెఱఁగుల మెఱుఁగులు తుఱఁగలింప

మొగమున కెగిరెడు బిగిచన్నుఁగవ మీఁద
        మణిహారరోచులు మాఱుమలయఁ
గమ్మని నెత్తావిగ్రమ్ము క్రొమ్ముడి నుఁడి
        యరవిరి విరవాది విరులు దొరఁగ
సాంధ్యరాగంబు వెడలిన చంద్రరేఖ
యెసకమునఁ బొప్ప మునుముట్ట ముసుఁగువుచ్చి
యాకళావతి మృదుల పర్యంకతలము
నందుఁ గూర్చుండఁబడి సాహసాంకుఁ జూచి.(ఆ. 7-172)

యుద్ధయాత్రావర్ణన:

అతఁడుం దానును గార్యలబ్ధిగతి నేకాంతంబ యూహించి, స
మ్మతితో సిద్ధపురీశుఁపైఁ జనుటకు న్మౌహూర్తికోత్తంస ని
శ్చితవేళన్ మొరయింపఁ బంచుటయు మించెన్ దండయాత్రాసము
ద్ధత నిస్సాణధణంధణంధణధణంధాణంధణన్వానముల్. (ఆ. 4-49)
పాలమున్నీటిలోఁ బవ్వళించిన యట్టి
        నీలవర్ణుఁడు నిద్ర మేలుకొనియె
వెగడొంది రవితేరినొగలఁ గట్టినయట్టి
        వాహంబు లణకలు వైచుకొనియె
నదరిపాటున బిట్టుబెదరి పర్వతపుత్రి
        కందర్పదమనునిఁ గౌఁగిలించెఁ
బన్నగంబులకెల్ల భయము మిక్కుటముగా
        బాతాళలోకంబు బమ్మరిల్లెఁ
గమలజుని వేదపఠనంబు కవలువోయె
నద్రులెల్లను నచలత్వ మపనయించె
దిగ్గజంబులు జిలజిలఁ దిరిగి మ్రొగ్గె
వారిరాసులు పిండులపండు లయ్యె.(ఆ. 4-50)

వరాహవర్ణన:

కోలముఁగాంచె నా నృపతికుంజరుఁ డంజనశైలవిగ్రహా
భీలముఁ బోత్రసాధన విభేదిత భూవివరోరుజాల కో
త్తాలము, ఘుర్ఘురధ్వని విదారితఖాద్రి గుహాంతరాళమున్
లోలవిలోచనాంచల విలోకిత రోషమహాగ్నికీలమున్. (ఆ. 2-133)

కోడికూత :

రాయిడికత్తెలై పెనుఁ బ్రాయిడి యత్తలయిండ్లఁ గోట్రముల్
సేయువిలాసినుల్ మునుకు సెందఁగ, వేశ్యల ప్రక్కదాపులం

బాయని కాముకుల్ వెలుకఁబాఱి కలంగఁగ మ్రోసెఁ 'గొక్కొరో
కో'యని కుక్కుటస్ఫురదకుంఠితకంఠకఠోరనాదముల్.(ఆ. 6-73)

రోదనవర్ణన:

పుటపుటనగు చనుఁగవపై
బొటపొటఁ గన్నీరు దొరఁగఁ బురపురఁ బొక్కం
దటతట గుండియ లదరఁగఁ
గటకట యిది నోముఫలము గాకేమనుచున్.(ఆ. 7-153)

భోజనపదార్థవర్ణన.

మించుకన్నులు గోరగించు రాజాన్నంబు
        నుపమింపరాని సద్యోఘృతంబు
నమృతోపమానంబులగు పిండివంటలు
        నుజ్జ్వలంటై యొప్పు నొలుపుఁ బప్పు
మదికింపుఁ బెంచు కమ్మని పదార్థంబులు
        బహుపాకరుచులైన పాయసములుఁ
దగువాసనావాసితములైన పచ్చళ్ళు
        వడియఁ గట్టిన యానవాల పెరుగు
సరసమధుర రసావళి సముదయములు
పంచసార సమంచిత పానకములుఁ
గమ్మకస్తురి నెత్తావిఁ గైపుచేసి
యూరుఁగాయలు జల్లని యుదకములును.(ఆ. 4-188)

ఇట్టి వర్ణన లెన్న నియుఁ గలవు. ఇవి యన్నియు శ్రీనాథయుగకావ్యము లన్నిఁటను సర్వసాధారణముగాఁ జూడనగును. పెద్దనాదు లగు ప్రబంధకవులును వీని నాదరించి రని చెప్ప నవసరము లేదు. ఇట్టి వర్ణనమును జక్కని ప్రబంధశయ్యతో నానాశబ్దాలంకారపౌష్కల్యముగా జక్కన గావించెను.

జక్కన రచనయం దెడనెడ కవిత్రయము కవితాప్రభావము ముఖ్యముగ గోచరించును. నన్నెచోడ, నాచనసోమ, హళక్కి భాస్కరుల పోకడలును గొన్ని కనవచ్చును.

పూర్వుల ప్రభావము జక్కన పై దోచునట్లే, తర్వాతి కవులు కొందఱపై జక్కన ప్రభావము స్పష్టముగా గోచరించు. జక్కన కవిత్వము చేతఁ బ్రభావితు లయిన వారిలోఁ బెద్దనామాత్యుండును చేమకూర వేంటకవియును ముఖ్యులు. కొన్ని సామ్యము లీ దిగువఁ జూపఁబడును.

అతివా! ముదియఁగ ముదియఁగ
మతి దప్పెనొ కాక నీకు, మనమున నియమ
వ్రతపరుల శూద్రరమణీ
రతికై బోధింపవత్తురా, యిది తగవా!(విక్ర.చ. ఆ. 1.144)
అనుటయుఁ బ్రవరుం డిట్లను
వనజేక్షణ యిట్లు పలుక వరుసయె, వ్రతులై
దినములు గడపెడు విప్రులఁ
జనునే కామింప మది విచారము వలదే.(మను.చ. ఆ. 2–52)
పారాశర్యప్రముఖుల
పారకృపామహిమ తేటపడ నింతులదౌ
కోరిక దీర్పుట వినమే
వారిసదాచార గౌరవం బెడలెనొకో!(విక్ర.చ. ఆ. 1-153)
వెలివెట్టిరే బాడబులు పరాశరుఁ బట్టి
        దాశకన్యాకేళి తప్పుసేసి
... .... .... ...
వారికంటెను నీ మహత్వంబు ఘనమె? (మను.చ. ఆ.2-73)
లలితకపోలమండలములన్ మణికుండలముల్ నటింప వి
చ్చలవిడిగా వినూత్నపురుషాయితకేలికి నగ్గలించు న
గ్గలికలు చెల్లకున్న, నధికవ్యథనొయ్యన మాటిమాటి కూ
ర్పులు నిగిడింపఁ జొచ్చిరి సరోరుహనేత్రలు గర్భఖిన్నతిన్.(విక్ర.చ. ఆ. 1-168)
మనసుకక్కుతి మెల్లనలేచి చేతులఁ
        గాంతుని జబ్బుగాఁ గౌఁగిలించు
.... .... ... ....
గాంక్షితక్రీడ కంగము పంపు సేయమి
        నొడ్డుగా నిట్టూర్పు లొరయఁ బొగులు
... ... ... ... ... (మను.చ. ఆ. 3-123)
కీలుకొప్పునఁ గన్నెగేదంగిఱేకులు
        పునుఁగు సౌరభముల బుజ్జగింప
నలికభాగంబున నెలవంక తిలకంబు
        కస్తూరివాసనఁ గుస్తరింప
సిరమైన పచ్చకప్పురముతో బెరసిన
        తమ్ములమ్మునతావి గుమ్మరింపఁ

గుచకుంభములమీఁది కుంకుమపంకంబు
        పరిమళంబులతోడఁ బరిచరింప
గంధవహనామవిఖ్యాతి గణన కెక్కు
నించువిలుకాని వేగువాఁ డేఁగుదెంచి
యిగురుఁబోఁడుల గమిరాక యెఱుకపఱిచె
సరసనుతుఁడైన యారాజచంద్రమునకు.(ఆ. 7-83)

పై పద్యము జక్కన, తిలకంబు కస్తూరివాసన, సిరమైన పచ్చకప్పురముతో బెరసిన తమ్ములమ్ము తావి, మఱియు గుచకుంభముల మీఁది కుంకుమపంకంబు పరిమళంబు మున్నగువాని సామూహికపరిమళముతో గంధవహుఁ డేఁగుదెంచి యా రాజచంద్రునకు జిగురుఁబోడుల గమి రాక యెఱుకపఱచినట్లు వర్ణించెను.

పెద్దన యిందలి కస్తూరి మఱియుఁ బచ్చకప్పురపుఁ బరిమళమును గ్రహించి తమ్ములమ్ముని గూర్చి యా తావిని మారుతమున కాపాదించి, 'మగువ పొలుపుల దెలుపు నొక్క మారుత 'మొలసెన్' అని తక్కిన మూఁడు కందపాదములను జటిలసంస్కృతసమాససంఘటిత మొనర్చి సాహిత్యమున సాటిలేని సౌరథములు వెదచల్లునట్లు క్రింది పద్యమును రచించి మించెను.

మృగమదసౌరభవిభవ
ద్విగుణితఘనసారసాంద్రవీటీగంధ
స్థగితేతరపరిమళ మై
మగువపొలుపుఁ దెలుపు నొక్కమారుత మొలసెన్ . (మను.చ. ఆ.2-24)

జక్కన చేసిన ఈ క్రింది పర్వతవర్ణన :

కనియె నతండు శంకరశిఖాశశిరంజితచంద్రకాంతసం
జనితజలార్ద్రకల్పతరుజాలముఁ గిన్నెరకన్యకాప్రమో
దనమణిశృంగిసంగతలతావనజాలము దివ్యవాహినీ
వనజవనీతలద్రుహిణవాహమరాళము మేరుశైలమున్. (ఆ. 5-74)
లోలతఁ గాంచె నాసుగుణలోలుఁడు చారుశిలాగళజ్ఝరీ
జాలతటీప్రవాళఘనసత్తరువాటముఁ బార్శ్వతుంగభ
ద్రాలహరీవినోదవిహరజ్జలశీకరనిర్గతశ్రమో
ద్వేలహరప్రణామ మతిదీపితకూటము హేమకూటమున్. (ఆ. 2-218)
అనవిని విక్రమార్కవిభుఁ డప్పుడు చారుఁడు మున్నుగాఁగ వే
చనికనియెన్ సమాధిగతసంయమిరత్నవినూత్నపేటమున్
ఘనమదహస్తిహస్తపరికంపితసాసుగతాగవాటముం
గనదురు రత్నవచ్చిఖరకమ్రకిరీటముఁ జిత్రకూటమున్. (ఆ. 5.74)

పద్యములు మనుచరిత్రము నందలి

అటఁ జనికాంచె భూమిసురుఁ డంబరచుంబిశిరస్సజ్ఝరీ
గటకచరత్కరేణుకరకంపితసాలము శీతశైలమున్.(మను.చ. ఆ.2-3)

కల్పనకు గొంతవఱకు ప్రేరకము లనఁదగియున్నవి. మఱియు జక్కన చేసిన యీక్రింది వరాహవర్ణనము:

కొండొకవాలముం గుఱుచకొమ్ములు, నన్నువలైన వీనులున్
.... .... .... .... .... .... ...
తొండములేని భద్రకరితో నెనయైన వనీవరాహమున్.(ఆ. 3-75)
బలమిఁక నేమి నెప్ప విను పండువెదు ళ్ళవలీల మోరత్రో
... ... .... ... ... .... ..... ...
... ... ... ... .... .... .... ...చప్పరించు, న
ప్పోలము వరాహపోతములు భూవర తొండములేని యేనుఁగుల్.(మను.చ. ఆ. 4-18)

అను పెద్దన పద్యమునకు మూలప్రాయముఁగ నున్నది.

ఏనుబొత్తుకు రాక యెన్నఁడు నారగిం
        పనియట్టి భక్తి మజ్జనకుఁ దలఁచి
చెమట నెత్తురుగాఁగఁ జిత్తమ్మునఁ దలంచి
        యర్మిలిఁ బెనుచు మదంబఁ దలఁచి
నిముసంబుననుఁ బాసి నిలువక యొడఁగూడి
        చరియించు మత్రాణసఖులఁ దలఁచి
గంధసింధురసైంధవోత్కరముఁ దలఁచి
సతత సేవాగతనరేంద్రవితతిఁ దలఁచి
వనట యొదవిన నింత యొప్పని మనమున
నున్నచందంబుగాని వేఱొండు లేదు.(వి.చ. ఆ. 6-59)
ననునిముసంబు గానకయున్న నూరెల్ల
        నరయు మజ్జనకు డెంతడలునొక్కొ!
యెపుడు సంధ్యలయందు నిలువెళ్ళనీక న
        న్నోమెడుతల్లి యెంతొఱలు నొక్కొ!
యనుకూలవతి నాదు మనసులో వర్తించు
        కులకాంతమది నెంత కుందునొక్కొ!
కెడఁదోడు నీడలై క్రీడించు సచ్ఛాత్రు
        లింతకు నెంత చింతింతురొక్కొ!(మను.చ. ఆ. 2-17)

పై పద్యములకుఁ బోలిక స్పష్టము. దీనితో మనుచరిత్రము, ఆశ్వాసము, 3-98, 99 పద్యములను గూడ చదివినచో సందర్భము కూడ సరిపోవును.

ఇవికాక విక్రమార్కచరిత్రము నందలి 'దేవియుఁ దేవరయుఁబోలె, నెలవి పాఱఁగ నవ్వుచు, బంగారు సకినెల భంగి మెఱయ. యతులకైనఁ దెమలి యినుపకచ్చడము లూడిపడునన్న; జాజిపక్కెరలతో, చిలుక గుఱ్ఱపుఁ లౌజు' మున్నగు యపూర్వపదప్రయోగములు మనుచరిత్రము నందును గోచరించును. ఆంధ్రకవితాపితామహుని యాదరమునకుఁ బాత్రుఁడైన జక్కనకవి నిక్కముగాఁ బ్రశంసనీయుఁడు.

అర్ధాలంకారము లందువలెనే జక్కనకు శబ్దాలంకారాదుల యందు మక్కువ యెక్కువ. అనుప్రాస, అంత్యానుప్రాసాదులే కాక ఈ కవి శ్లేషయమకముల నధికముగ గూర్చియున్నాఁడు. అవి కొన్ని యీ దిగువ సూచింపఁ బడుచున్నవి.

శ్లేషలు :ఆ. 1. ప.65, 101 (వచనము); ఆ. 4. 143 మున్నగునవి చూడనగును.

అంత్యానుప్రాసలు : ఆ. 2. ప. 133, 198, 200, 218, 220, 210 చూడఁదగును.

యమకములు : ఇవి చేమకూర వేంకటకవిపై జక్కన ప్రభావము నూహించుటకు దోడ్పడును.

1. 'ని, న్నేమను దాన నింక నెటు లేమనుదాన మహాదరిద్రతన్.(ఆ. 3-8)
2. ‘విజయపాలుని నెమ్మోము విన్నవోయి
    తెల్లవాఱిన కైవడి తెల్లవాఱె'(ఆ. 3.102)
3. ఏకతంబున నిది యేకతంబున వచ్చెనో' (ఆ. 3. వ. 106)
4. 'కరము కరమునఁ గీలించి కరము బ్రీతి'(ఆ. 3-127)
5. 'తమ్ములాకొమ్మ నెమ్మోవితమ్ములనఁగ
    బింబ మా యింతి కెమ్మోవి బింబ మనఁగ
    జాతి యానాతి లేనవ్వు జాతి యనఁగ
    రామ యొప్పారు లోకాభిరామ యగుచు'. (ఆ. 4-18)
6. ఏకాంత కాంతరూపమొ
   యీకాంతుని నయనవీథి కిరవైనది గా
   కేకాంతంబునఁ గాంతల
   కేకాంతులు నొఱపుసడల నిట్లుండుదురే!(ఆ. 6-54)
7. పగలెల్లను దమునేచిన
   పగలెల్లఁ దలంచి యిరుల పౌజులు....(ఆ. 6.63)

8. చల్లనిమందని పై పైఁ
    జల్లనిమందొకటి లేదు, సతిడెందమునన్
    జల్లఁదన మందదయ్యెను
    జల్లనిమందులను దాపసంపద మించెన్.(ఆ. 1-138)
9. కదళికాకాండకాంతవర్గములతోడి
    పెందొడలు కొంత పెందొడ లెందునరయ.(ఆ. 1-119)

ఇ ట్లనేకార్ధములు గల సంస్కృతాంధ్రపదముల నేకవాక్యము నందు భిన్నార్థప్రతిపాదకములుగ సంఘటించి చమత్కరించు యమకమార్గమునకు మొదట నాచనసోముఁడును బిదప జక్కనాదులును బునాదులు వేయఁగా చేమకూర వేంకటకవి దీని నాంధ్రమున విస్తరించి వ్యాప్తికిం దెచ్చెనుగాని, యీ మార్గమున నాఁటికిని నేఁటికిని, చేమకూర కవియే సిద్ధహస్తుఁడు.

జక్కన కవి తెలుఁగు నుడికారములను, సామెతలను దన కావ్యమున విరివిగఁ బొందుపఱచెను. అట్టివి కొన్ని దిగువఁ జూపఁబడును.

పసిఁడిపళ్లెరమైనన్ జేరుపఁగఁ జోటువలెను
ములుముంటఁ బుచ్చుటయె కార్యము
తెడ్డునాకి యుపవాసము మాన్పికొనంగ నేటికిన్
ఎందు గుడి మ్రింగువానికి సంది పిండివడియము
ముందట నుయ్యి వెన్క లోతగు గొయి
పులిమీసముల నుయ్యెల లూగవచ్చునే?
ఏమిటికి నేనుఁగు నెక్కియు దిడ్డి దూరగన్
తనయింటి దీప మనుచును
విను ముద్దిడుకొనఁగఁ దలఁచు వీఱిఁడి గలఁడే?
ఏమిటికిఁ జల్లకు వచ్చియు ముంత దాపఁగన్
వంకలొత్తఁ దిలకంబులె రాజుల చిత్తవృత్తముల్?
వే కరుగవె యగ్గిపొంత వెన్నయుఁ బోలెన్
ఆఁడువారల దిట్టతనం బెఱుఁగ బ్రహ్మదేవుని వశమే?
నీడయు రూపంబుఁ బోలె నెయ్యం బలరన్
సింహము మెడగంటవోలె యభయంబునఁ బొందె
తామరపాకు నీటిక్రియఁ చల్లండమందెను
సూదిపిఱుంద తాటిక్రియఁ జొచ్చిన చోటులు సొచ్చు
జడవిడిచి వదరుపట్టుట;
కన్నుండఁగఁ గనుపాపను గొన్నవిధంబున

ముగురం గూర్చిన ముండదైవము
బిగిచన్నుల నడిమి మణులపేరుం బోలెన్
మరువము మొలవఁగఁ దోడనె వరిమళ ముదయించినట్లు
పచ్చపయికంబు లేకుండ వెచ్చపఱచి

పలుకుఁబడులు : పూసగ్రుచ్చినగతి; కరతలామలకముగా , ఆమూలచూడముగ; పల్లవిపాటగా; తలపూ వాడకయుండఁగ; చెక్కడచిన వసరాలెడు; మొలపూసలు ద్రెవ్విననాఁటనుండియున్; పులు గడిగిన ముత్యముసిరి; దేవియుం దేవరయుఁబోలె; తాళమువైచినగతి; సెలవిపాఱఁగనవ్వుచు; పులకండపుఁబొమ్మ; నివాళి సేయునగవులు; ముంగిలెఱుంగని ముద్దరాలు-; పగలుచాటు; కాలుద్రవ్వు; వక్కరించు; మగమాటలాడు; బొమ్మవెట్టు: తూ పొడుచు; కొల్లకోటుసేయు; త్రోద్రోపులాడు; తూఱుదుంకెనలాడు; చాటున కెక్కు; కర్ణపారణ మొనరించు; గిరవులుపుత్తెంచు; ఇల్లడపెట్టు; వారకంబిచ్చు; పులుకడుగు; కనుఁబాటు దాఁకు; కరసానఁ బట్టించు; కార్యఖడ్గములు – ఇట్టి వడుగడుగున దడఁబడుచుండును.

కొన్ని ప్రత్యేక పదములు : పొతముగ; వాలాయించి; ఒడమి; విల్వకాఱు; ఉత్తులు; ఆందోళము నొందు; నేలమాలె; పుడుకు వేదుఱు; కొలువుసాల; తెరవాఱు; రిత్తకురిత్; సునాయాసముగా; నీరామని; అణకలు వైచుకొను; కవలుపోవు; గాదము; కంచులి; రజ్జులాట; మొక్కలంబుగ; పుతపుతవోవు; ఖధునీ; నమ్మునం గలియు; పిల్లుగట్టు; తొడుకొనివచ్చు; పక్కెర; పౌజు; మజా; బైసుక పెట్టు; ఇసిరింతలువాఱు; కొలుకాఁడు; ఈలవెట్టు; బళాయివెట్టు; డాగు; జరి; కుంటెనీలు; కోడిగీలు: జుమ్మికాండ్రు; ఇచ్చగొండులు: ఉచ్చమల్లులు; (బంగారు) సకినలు; (అంగన) నడపు; గిరవుపట్టు; గిఠవు పట్టు; బాగాలు —మున్నగు దేశ్య, అన్యదేశ్యపదజాలము నీ కవి యిందు విశేషముగఁ బ్రయోగించియున్నాఁడు.

విక్రమార్కుఁ డుజ్జయిని యందలి కాళికామందిరమునఁ బ్రవేశించిన సందర్భమున నందలి వివిధవిచిత్రవిషయములను వర్ణించుచు ద్వితీయాశ్వాసమున నొక దీర్ఘవచనమును [51] రచించెను. అందలి మణిమండపములు “ప్రసిద్ధసిద్ధజనకథితనవనాథచిత్రచరిత్రవర్ణనప్రమోదహృదయసామాజికవిరాజమాన"ము లయినట్లును; మఱియు నందొక చోట “నిరవధికభక్తిరసాతిశయప్రాణాపహారసమర్పణమహావీరశిలాప్రతిరూపంబు"లు నుండినట్లును జక్కన కవి వర్ణించెను. జక్కన కాలమునందు "నవనాథసిద్ధుల' కథలు ప్రచారమున నుండె ననుట కీ కాలముననే గౌరనకవి రచించిన ద్విపద 'నవనాథచరిత్ర' కావ్యమే తార్కాణము. ఇట్లే. పలనాటి మహావీరుల కథలును బ్రచారమున నుండె ననుటకు శ్రీనాథకవి ద్విపద 'పల్నాటివీరచరిత్రము' వలన నూహింపవచ్చును. కావున నీ కవి తన కాలమునఁ గడు ప్రసిద్ధము లయిన నీ రెండువిషయముల నిం దేదోవిధమునఁ జేర్చి సూచింపయుండినోపు నని తోఁచును. - ?

జక్కన తన కావ్యమునందు భర్తృహరి రచించిన సంస్కృతగ్రంథముల నేకారణమునవో యిందుఁ బేర్కొనలేదు. కాని వరరుచి కృతులను నొకపద్యమునఁ ప్రత్యేకముగా నిట్లు పేర్కొనియున్నాఁడు.

వచియించెఁ బ్రాకృతవ్యాకరణాగమం
        బభినవంబుగ భోజవిభుఁడు మెచ్చ
సకలవర్ణాశ్రమాచార నిర్ణయమొప్ప
        ధర్మశాస్త్ర మొనర్చెఁ దజ్ఞు లలర
ధీయుక్తి మెరయ జ్యోతిశ్శాస్త్ర మొనరించె
        సకలలోకోపకారకము గాఁగఁ
గాళిదాసుని నవ్యకావ్యవిద్యాప్రౌఢి
        వరకవీశ్వర చక్రవర్తిఁ జేసె
భవ్యనారాయణీయ ప్రపంచసార
శారదాతిలగారి ప్రశస్తమంత్ర
శాస్త్రసర్వంకషజ్ఞానసరణి మించె
శీలవతిపట్టి సర్వజ్ఞశేఖరుండు.(ఆ. 1-188)

'సంస్కృత కవి జీవితము' (మల్లాదివారు) నందు భర్తృహరి విషయము కలదు గాని అందు 'వరరుచి' ప్రసక్తి కానరాదు. భోజుఁడును గాళిదాసును సమకాలీనులే కాక వరరుచియ వారికాలమువాఁడే యయినట్లు పై పద్యము వలన తోచును. ఇందు జక్కన తెలిపిన గ్రంథములు వరరుచి కృతములు ప్రాకృతగ్రంథము లగుట మల్లాదివారు వీనిని గూర్చి తెలిపియుండరు. ఈ కవి కృత్యాది సంస్కృత (ప్రాకృత) కవిస్తుతిలోఁ గూడ వరరుచి, శాతవాహనులను బ్రశంసించెను.

ఇందలి తుది యాశ్వాసము నందు విక్రమార్కునిచేఁ బ్రాణముపోయఁబడిన 'సువర్ణ కలశము' తన కథాకథన దక్షత నిట్లు తెలిపెను.

శృంగారాదిరసప్రసంగములుగాఁ జెప్పంగ నేర్తుం గథల్
సాంగోపాంగముగాఁగ, నొక్క కథ సువ్యక్తంబుగా నవ్వయిం
పంగాఁ జెప్పెదఁ జిత్తగింపుమని చెప్పం జొచ్చె భూపాలుతో
సంగోత్పాదక వాగ్విశేషరచనా సామర్థ్య మేపారఁగన్.(ఆ. 8.4)

ఇందుఁ జెప్పినట్లు శృంగారాది రసప్రసంగములుగా, సాంగోపాంగముఁగా, సువ్యక్తముగా నన్వయించునట్లు వాగ్విశేషరచనాచాతుర్య మేపారఁగాఁ గథలు చెప్పు నేర్పు జక్కన కవి కెక్కువ యనుట నిక్కువము. విక్రమార్కచరిత్రమను ప్రౌఢకథాకావ్యమును సలక్షణమును సాలంకారమును సరసవర్ణనాసహితమును

సంస్కృతాంధ్రభాషాపాండిత్యస్ఫోరకమును నగు చక్కనిశైలితో సరసప్రబంధరచనకుఁ జక్కని రాజమార్గమును సంఘటించిన జక్కనకవి కీర్తికినిఁ గృతికిని మంగళమహశ్రీ.

ఉత్తమ కావ్యములలో నొక్కటి యైన విక్రమార్కచరిత్ర మిప్పుడు క్రయమునకు లభించుట లేదు. ప్రసిద్ధగ్రంథాలయముల యందు మాత్రమే దీనిప్రతు లొకటి రెండు దొరికిన దొరకును. పూర్వముద్రణముల వివరములు దిగువ నొసఁగఁ బడుచున్నది.

ప్రకటనకర్తలు; సంవత్సరము; పరిష్కర్తలు

1. ఆనందముద్రాక్షరశాలాధిపతులు, (చెన్నపురి) క్రీ.శ. 1896 శ్రీ కొమాండూరు అనంతాచార్యులు మఱియు శ్రీ రాయదుర్గము నరసయ్యగారు.

2. వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్సు. (మద్రాసు) 1913

3. వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్సు. (మద్రాసు) 1926 శ్రీ బులుసు సీతారామశాస్త్రిగారు.

పైవానిలో ఆనందముద్రాక్షరశాలాధికారులు ప్రకటించిన విక్రమార్కచరిత్ర ముదితప్రతి యందు ముద్రణదోషములును పరిష్కరణదోషములును కోకొల్లలు. దీనినిఁ బరిశీలించి అప్పుడు చెన్నపురి క్రిష్టియన్ కాలేజి సంస్కృతప్రధానపండితులుగా నుండిన శ్రీ వేదము వేంకటరామశాస్త్రులవారు “శారదాకాంచిక ప్రథమకింకిణి" అను విక్రమార్కచరిత్ర ముద్రణ విమర్శనమును వ్రాసిరి. ఇందు వారు గ్రంథము నందలి పరిష్కరణదోషములను శతాధికముగ నెత్తిచూపుచు వానికి సవరణలను గూడ తెలిపిరి. ఈ “విక్రమార్కచరిత్ర విమర్శనము" (60 అచ్చు పుటల వ్యాసము). అముద్రితగ్రంథచింతామణి యందుఁ దదనుబంధముగ క్రీ.శ. 1898 సంవత్సరములోఁ బ్రకటింపఁబడినది.

తరువాత శ్రీ శాస్త్రుల వారి 'విమర్శనము' ననుసరించి కొంత సంస్కరించి ఈ కావ్యమును క్రీ.శ. 1913లోఁ బ్రకటించిరి. కాని యిందును తప్పులు దొరలనిపుట లేదని చెప్పవచ్చును. మఱల క్రీ.శ. 1926 సంవత్సరములో నీ కావ్యమును శ్రీశాస్త్రులవారి మాచనల ననుసరించి చాలవఱకు దోషములను బరిష్కరించి పునర్ముద్రించిరి. ఈ ప్రతి యందును దోషము లున్నను జాల తక్కువ.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పక్షమున ఈ విక్రమార్కచరిత్రము శుద్ధప్రతిని సిద్ధము చేయుటకు నేను వావిళ్ళవారి 1926 సంవత్సరము ముద్రితప్రతిని అతికష్ట ముతో సంపాదించఁగలిగితిని. దీనిని శ్రీ శాస్త్రులవారి విమర్శనసహాయముతో యథాశక్తిఁ బరిష్కరించితిని. స్వయముగాఁ గొన్ని సవరణలు చేయవలసివచ్చినది. పై గ్రంథములే కాక, (1) శ్రీ వీరేశలింగము పంతులుగారి ఆంధ్రకవుల చరిత్రము (భా. 1); (2) శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావుగారి విజయనగర సామ్రాజ్య మందలి ఆంధ్రవాజ్మయ చరిత్రము (భా.1 ); (3) శ్రీ చాగంటి శేషయ్యగారి ఆంధ్రకవితరంగిణి (సం. 4) యును ముఖ్యముగాఁ దోడ్పడినవి. ఏతత్కర్తలకు నా కృతజ్ఞతలు.

ఈ గంథమును బరిష్కరించుటలోఁ బూర్వముద్రణ మందలి ముద్రణదోషములు కనఁబడినంతవఱకు సవరింపఁ బడినవి. ఉన్న పాఠాంతరములలో సరసములును సముచితములు నని తోఁచినవి సరియైన పాఠములుగా గ్రంథము నందు గహింపఁ బడినవి. పూర్వ పాఠములు వావిళ్ళ1926. అను సూచనతో పుట యడుగునఁ జూపఁబడినవి. కొన్ని పదములకు మాత్రము అర్ధము తెలుపఁబడినది. ఇఁక యతిప్రాసలు మున్నగువానిలోఁ జేయఁబడిన ముఖ్యమగు సవరణలు కొన్ని యిటఁ దెలుపబడుచున్నవి.

సవరణలు :

1. ఆశ్వాసాంత గద్య.

“ఇది శ్రీ మదఖిలకవిమిత్ర పెద్దయన్నయామాత్యపుత్ర
..............జక్కన నామధేయ....

అని పూర్వముద్రితగ్రంథముల ఆశ్వాసాంతగద్యలో కలదు. వావిళ్ళవారి ముద్రణప్రతి పీఠికలో శ్రీ బులుసు సీతారామశాస్త్రిగారు “జక్కన పేరయాన్నయామాత్యుని కొడు" కని వాసిరి. ఈ పొరపాటు ఆంధ్రకవులచరిత్రములోని “ఈతని తండ్రిపే రన్నయామాత్యుం" డను దానివలన కలిగిన ట్లూహింపవచ్చును. కాని, యీ రెండును సరియైనవి కావు. కృత్యాదిలో జక్కనయే స్వయముగాఁ జెప్పిన యీ పద్యమును గమనింపుఁడు.

ఆఁడడు మయూరరేఖను
గాఁడం బాఱండు బాణగతి మన మెరియన్

బ్రోడగు పెద్దయయన్నన
మాడకు మాడెత్త యతని మాటలు జగతిన్.(ఆ. 1-21)

దీనినిఁ బట్టి పెద్దయ పుతుండగు అన్నయ జక్కన జనకుఁ డని స్పష్టపడుచున్నది. కావున ఆశ్వాసాంతగద్యలలో 'పెద్దయ యన్నయామాత్య పుత్ర' యని సవరింపఁ బడినది.

2. కృతిపతి యగు సిద్ధనమంత్రి తాత యగు సూరన సోమయాజికిఁ దనయుఁడని ముదిత గ్రంథములోఁ గలదు.

అమ్మహితాత్ముని తనయుఁడు
సమ్మానదయానిధానసౌజన్యరమా
సమ్మోదితబాంధవుఁడై
యిమ్మహిలో సిద్ధమంత్రి యెన్నిక కెక్కెన్.(ఆ. 1-134)

(వావిళ్ళ ప్రతి. 1926)

దీనికి

“అమ్మహితాత్ముని మనుమఁడు
... ... ... .. ... ... ... (ఆం.క.చ. పుట. 384)

అని పంతులుగారి పాఠము. మనుముం డనఁగా సంతతివాడని పంతులుగారు దీనిని సమన్వయించి, కవితరంగిణికర్తయును 'మనుమం' డను పాఠమునే గ్రహించుటే కాక కొన్ని తాళపత్రప్రతులందును 'మనుమం' డనియే యున్నదని వ్రాసిరి. (క.త..సం. 4. పుట, 218). కావున దీనివల్ల విశేష ప్రయోజనము కనబడకున్నను తాళపత్రప్రతి పాఠమే గ్రంథమున గ్రహింపఁబడినది.

3. పూర్వముద్రితప్రతులలో 5 కందపద్యముల చివర నొక ఉత్పలమాలతో షష్ఠ్యంతములు ముగింపబడియున్నవి. చివరిపద్యము :

“వెన్నెగంటి సూర్యుండు వివేకగుణాఢ్యుఁడు ...." (ఆ. 1-62)

అనునది యీ యుత్పలమాల ప్రక్షిప్త మనియు, నొక వేళ కవియే రచించియుండినచో నిది షష్యంతములలోఁ గాక కృతిపతివంశవర్ణనలోఁ జేరియుండదగిన దనియుఁ గవితరంగిణి కర్త యభిప్రాయము. ఇది చాలవఱకు వాస్తవ మనియే తోచును. ఐదు కందముల పిమ్మట నీ యుత్పలమాల యేల? అందును అంత గొప్ప కవీంద్రకుంజరుని దెచ్చి షష్ఠ్యంతములలోనా యిఱికించుట! ఈ పద్యముయొక్క కూర్పు ప్రక్షిప్త మని తీసివేయరానంతగా దాగున్నది. కాని షష్ఠ్యంతములలో నుంట వంశావలి వర్ణనలో సులభముగాఁ జేర్పరాకున్నది. ఆలోచింపఁగా దీనిని 51వ పద్యము పిమ్మటఁ జేర్చిన బాగుండు నని తోచినది. తర్వాత పద్యము మొదటి సగమును షష్ఠ్యంతముగా నుండి దీనితోఁ గలిపి చదివికొనఁదగియుండుట యిది 51వ పద్యమునకు పిమ్మటఁ జేర్పఁబడినది.

4. ముదిత గ్రంథములో నీ క్రింది పద్యమున యతి భంగము కలదు.

కనుఁగొని నెమ్మనం బలరగాఁ బులిజున్నును నేదుకన్ను దె
మ్మనినను దెచ్చువాఁడఁ బ్రియమైనవి యెల్లను జెప్పుఁడంచు గొ
బ్బున హృదయానువర్తి యయి(?) పల్కును బంతము నొక్కభంగిగాఁ
దనియఁగ నిచ్చు నవ్విభుఁడు తామరసాక్షులు గోరుకోరికల్.(ఆ. 1-169)

ఇందలి తృతీయపాదమున యతిభంగము గోచరించుచున్నది. ఇది సవరింపబడక ప్రశ్న (?) గుర్తు వేసి వదలి వేయఁ బడినది. గొబ్బున అనఁగా శీఘ్రముగా అని యర్ధము. 'గొబ్బన' అని దిద్దిన యతి సరిపోవును. కాని ఈ రూపము గలపదము శబ్దరత్నాకరము నందు లేదు. కాని జక్కన కవి అన్యత్ర 'గొబ్బనయని ప్రయోగించుట గమనింపఁ దగియున్నది.

జనవర! నీ పురోహితుల శాస్త్రరహస్యనిరూపణక్రియా
వనజభవప్రభావులగు వారి ముహూర్తము నిశ్చయింపఁగాఁ
బనుపు “శుభస్య శీఘ్ర" మను పల్కు నిజంబొనరింపు మన్న, గొ
బ్బనఁ బతిచిత్తవృత్తిగని భట్టి విదర్భుఁడుఁ దాను వేడుకన్.(ఆ. 4-134)

కావునం బూర్వ (169) పద్యము నందును దీని ననుసరించి 'గొబ్బన' అని సవరింపఁబడినది.

5. ప్రాస (?) ఈ క్రింది పద్యమును గమనింపుడు.

ఇది శిల వ్రాసిన యది యని
చతురత విప్రుఁడొకఁడు ప్రసంగవశమునం
జదివెను నొగి నీ పద్యము
నది యెఱుఁగఁగవలయు, నచటి కరిగెద భట్టీ! (ఆ. 2-45)

పై పద్యమునందు "దకార 'త' కారములకుఁ బ్రాసము కలదు. త, ద, లు రెండును స్వవర్గాక్షరములు కాబట్టి కొందఱు దీనిని “స్వవర్గజప్రాసము"గా చెప్పవచ్చును. ప్రాసభేధములను జెప్పుచు 'స్వవర్గజప్రాసము"ను చెప్పిన వాఁ డప్పకవి యొక్కడే. అప్పకవి యైనను,

"గ్రంథ మంధశబ్దంబులఁ గల ద్వితీయ
వర్ణములు రెండును నఘోషవర్ణములగు
నైన నిజవర్గభవ చతుర్ధాక్షరములఁ
గలియుం బ్రాసంబులును స్వవర్గజములనఁగ."

అని యిట్లు తవర్గ ద్వితీయ చతుర్ధాక్షరములకు థ ,ధ, లకుఁ బ్రాసమైతి చెప్పెను. మఱియు కవిత్రయము వారి పద్యములలో తవర్గ తృతీయ చతుర్థాక్షరము లనఁగా ద, ధ లకుఁ బ్రాసము గూర్పఁబడియుండుటచే థ, ధ లకును, ద, ధ లకు బ్రాసము చెల్లుననుట ప్రసిద్ధము. కాని వీనికి వర్గప్రథమాశరముతో గూడ ప్రాసము చెల్లునని చెప్పఁబడలేదు. థ, ధ లకును, ద, ధ లకును బ్రాసము చెల్లునపుడు త, ద లకు నేల చెల్లకుండవలె ననుట వేఱు విషయము. ఇందులకు బూర్వకవి ప్రయోగము లేవి యున్నట్లు లేవు. కావునఁ బై పద్యము నందలి ద్వితీయ చరణాదినిఁ గల 'చతురత' యనునది యర్ధభేదము లేకుండ 'చదురున" యని నాల్గుపాదము లందును (ద) ప్రాసము కుదురునట్లు సవరింపఁబడినది. పూర్వప్రతి పాఠము గూడ పుట యడుగున నీయఁబడినది. చిన్నచిన్ సవరణలు పెక్కు లున్నను పైనిఁ దెల్పఁబడినవి ప్రధానమయినవి.

విక్రమార్కచరిత్రము వంటి యుత్తమప్రాచీనకావ్యముల ముద్రితప్రతుల కీనాఁడు అంజనము వేసి చూడవలసిన దురవస్థ యేర్పడినది. ఇట్టి పరిస్థితిని గమనించి ప్రాచీనాంధ్రకావ్యములను బాఠకలోకమునఁ బునఃప్రచారమునకుఁ దెచ్చుటకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ దీక్షాకంకణముఁ గట్టుకొన్నది. అకాడమీ వారి యీ ఉపక్రమము నిజమున కొక సాహిత్యయజ్ఞము. ఏతదధ్యక్షుడు డాక్టరు బెజవాడ గోపాలరెడ్డిగారు యీ సారస్వతేచ్ఛకి యజమానులు. కళాభవనము చత్వరవేదిక . కార్యదర్శి శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు యాజ్ఞికులు. సహృదయపాఠకులు సదస్యులు. సాహిత్యప్రచారము సవనఫలము. ఈ క్రతునిర్వహణకార్యక్రమమున నొక ఋత్విక్కుగా వరించి, నాకును యత్కించిచ్భాగస్వామిత్వము నొసంగిన అకాడమీ వారికిని ముఖ్యముగా శ్రీ రామానుజరావు గారికిని కృతజ్ఞతలు.

పల్లా దుర్గయ్య

హైదరాబాదు
1-8-1987

  1. ఒక్క చంద్రునిఁ గన్న సముద్రుని, ననేక చంద్రులఁ గని మించుట యనుభావము సంస్కృత శాసనపద్యమునం గన్పట్టుచున్నది.
    శ్లో॥ యఃప్రోత్తుంగతరంగసంగతిభవద్దిండీరపిండచ్ఛలాత్
         తీరేతారతరేందుమండలమయీంమాలాం సదోత్పాదయన్
         భ్రామ్యన్ మందరమంథమంథన వశాదేకేదు సంభూతిజం
         క్షీరాబ్ధేరధరీకరోతి పరితఃకీర్తిం జగద్వాపినమ్.

    (కొండిపర్తి శాసనములు. 8. 33-37 పంక్తులు;తెలంగాణా శాసనములు. భా. 1.]

  2. పిల్లలమఱ్ఱి, భట్టుమూర్తి, అయ్యలరాజు మున్నగువారిలో నీ శైలియు, పదగుంఫనమును గోచరించును.