వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/మారిషస్‌లో తెలుగు తేజం
మారిషస్‌లో తెలుగు తేజం(2000)- మండలి బుద్ధ ప్రసాద్
ప్రైవేటు వ్యవసాయదారుల క్రింద కూలీలుగా పనిచేయటానికి 1835 లో కిష్టమ్, వెంకటపతి, అప్పయ్య అనే ముగ్గురు తెలుగు వారు కాందిశీకులుగా తొలిసారిగా మారిషస్‌లో అడుగుపెట్టారు.ఆ మరుసటి సంవత్సరం గౌంజన్ అనే ఓడలో దాదాపు 30 మంది తెలుగువారు ఆ ద్వీపంలో కాలుపెట్టారు. కాకినాడ సమీపాన వున్న 'కోరంగి' రేవు నుండి బయలు దేరి వచ్చినందుకు వాళ్లని కోరంగివాళ్ళు అని, వారు మాట్లాడే తెలుగు భాషకు 'కోరంగి భాష' అని పిలిచేవారు. 1843 సంవత్సరంలో కోరంగి పికేట్ అనబడే 231 టన్నుల బరువు నాలుగైదు తెరచాపలు గల బార్క్ అనే మాదిరి ఓడ రెండు సార్లు ప్రయాణం చేసి దాదాపు రెండు వందల మందిని మారిషస్ దీవికి చేర్చింది.
మారిషస్‌కు వచ్చేటప్పుడు వారు ఎంతో ఆశాపూరితంగా వచ్చేవారు. కానీ పోర్టులూయిస్ చేరుకుని వలస కేంద్రం యొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడే వారు ఏదో విషవలయంలో చిక్కుకున్నట్టు బాధపడేవారు. మానసికంగానూ, శారీరకంగానూ వారు బాధలు పడటానికి మారిషస్ వచ్చినట్టు తెలుసుకునేవారు. ఈ కాందిశీకులు బలోపేతమైన ఇనుప తీగల నడుమ రెండు రోజుల పాటు గడపవలసి వచ్చేది. అటుపిమ్మట వారిని పంచదార ఎస్టేటుకి పంపేవారు. సముద్రంలో ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొని వారు ఓడలో ప్రయాణం చేసేవారు. మారిషస్‌లో కాలుపెట్టిన తరువాతే వారు బ్రతుకు జీవుడా అనుకునేవారు.
మొదట మగవారు మాత్రమే వచ్చినా 1843 నుండి మహిళలు వారితో రావడం ప్రారంభించారు.
అలా వలసవెళ్ళిన తెలుగువాళ్ళు తమ భాషనీ, సంస్కృతినీ నిలబెట్టుకోవాలని తపన పడడాన్ని, మారిషస్ దేశ చరిత్ర, భౌగోళిక స్థితిగతులు, ప్రపంచ తెలుగు మహాసభల విశేషాల నేపధ్యంలో వివరించే గ్రంథం ఇది.
పూర్తి గ్రంథం చదవండి.