వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/మాధవ విజయము
మాధవ విజయము (1925),దువ్వూరి రామిరెడ్డి
దువ్వూరి రామిరెడ్డి రైతు, కవి. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు దువ్వూరి రామిరెడ్డి. 'కవి కోకిల' మకుటాన్ని ఇంటిపేరులో ఇముడ్చుకున్న దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది. కలకండ వంటి కమ్మని కావ్యాలు, పలకరిస్తే అశుధారాపాతంగా జాలువారే పద్యపూరిత ప్రబంధాలే కాకుండా సంస్కృత, అరబిక్ భాషల నుంచి ఎన్నో పుస్తకాలను ఆంధ్రీకరించిన నవ్యరీతి దువ్వూరి ప్రత్యేకం. కేవలం కవిగానే కాకుండా గొప్ప విమర్శకులుగా కూడా సమానమైన ఖ్యాతి గడించారాయన. దువ్వూరి కలం నుంచి జాలువారిన సాహితీ సౌందర్యం గురించి వర్ణించి చెప్పడం కష్టం. మచ్చుకు ఒక్క రచన చదివితే తప్పించి ఆయన లోతైన అంతరంగం ఆవిష్కరించడం అంత సులభం కాదు. మృదు మధురమైన మాటలు, గంభీరమైన శైలి, అన్నిటికీ మించి ఆ రచనా చాతుర్యం చదువరులను ముగ్ధలను చేస్తాయి. కళ్ళను అక్షరాల వెంట పరుగులెత్తిస్తాయి. చెప్పవలసిన విషయాన్ని సూటిగా, నాటుకునేటట్టు చెప్పడం వల్ల దువ్వూరి విమర్శలు ఆనాటి యువతలో ఆలోచనాత్మకధోరణిని రేకెత్తించాయి
స్థలము 9 : కారాగృహము.
(వెలుతురు తక్కువగ నుండును. మాధవుఁడు ఉద్రిక్త చిత్తుఁడై యటునిటు తిరుగుచుండును.)
మాధవుఁడు : నన్నేల వీరీ యంధకార కారాగారమున బంధించిరి? నేనేమి యపరాధ మొనరించితిని? రాజశేఖరుని దుర్మరణమునకు నేను కారకుఁడనని యనుమానపడిరా? ఎంత అన్యాయము? బాల్యమునుండి నా స్వభావము నెఱింగిన శాంతవర్మయు నన్ను సందేహించెనా? పుత్రశోకమున మతిచెడి సత్యాసత్య వివేక శూన్యుఁడయి తన క్రోధమునకు నన్ను బలియీయ నెంచెనా? లేక యిది యంతయు విజయవర్మ కపట కృత్యమైయుండు నా? ఆతఁడు నా పుట్టుమచ్చ సంగతి విని సంక్షుబ్ధచిత్తుఁడాయెను. నాజన్మ రహస్యము విజయవర్మ యెఱుంగునా? - అదియెట్లు సంభవించును? శాంతవర్మయె పొరపడియుండును. నాపక్ష మూను వా రెవ్వరు? కృతఘ్నుఁడు ఆతతాయి అను పాపకళంకమును వహించి నిరయసదృశమైన ఈకారాగారమున మరణపర్యంతము క్రుళ్ళవలయునా? అభ్భా! ... మనోరమ యేమనుకొనుచున్నదో! భ్రాతృహంతనని నన్ను దూషించుచున్నది కాబోలు! ఘోరవిధీ, నేను నీ యజ్ఞపశువునా?
(నేపథ్యమున గంటలు వినఁబడును)
(ఆలకించి) నిశ్శబ్దయామినీ గభీరతను భంగించుచు అశుభ సూచక కఠోర కంఠస్వరముతో ఆగంట "అవును అవును" అనిమ్రోగుచున్నది! (ఆలకించి) అదిగోతలుపులో తాళపుచెవి తిరుగుచున్న ఘర్ఘ రధ్వని వినఁబడుచున్నది. నన్ను వధ్యశిలయొద్దకు తీసికొనిపోవ రాజభటులు వచ్చు, చున్నారు కాఁబోలు!
(విజయవర్మ ప్రవేశించును)
మాధ : (సంక్షుబ్ధచిత్తుఁడయి) నీవా నన్ను వధింపవచ్చినది? (విజయవర్మ రెండుచేతులు గట్టిగ పట్టుకొనును)