వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు (1997) - జిడ్డు కృష్ణమూర్తి
జిడ్డు కృష్ణమూర్తి 1895లో మే 11వ తేదీన మదనపల్లిలో జన్మించారు. 14వ ఏట దివ్యజ్ఞాన సమాజం వారు చేరదీయగా, అనీబిసెంట్ సంరక్షణలో పెరిగారు. భావికాలంలో జగద్గురువుగా భాసిల్లాలని కృష్ణమూర్తికి శిక్షణనిచ్చారు. అయితే 1929లో హాలెండులో జరిగిన సమావేశంలో జగద్గురువు అనే యీ అత్యున్నతమైన పదవినీ, తమ చుట్టూ ఏర్పడిన సంస్థలను, అశేషమైన ఐశ్వర్యాన్నీ అవలీలగా పరిత్యజించి వేసి, ఒంటరిగా నిలబడ్డారు. ఏ సంస్థల ఆధ్వర్యమూ లేకుండానే ప్రపంచమంతా పర్యటించి, మానవుడిని దుఃఖాల నుండి, సమస్త బంధనాల నుండి విముక్తం చేయడమే ప్రధానాంశంగా ప్రసంగించారు. సత్యం అనేది బాటలు లేని సీమ అనీ, దానిని చేరుకోవడానికి మతాలుగానీ, సంస్థలుగానీ, గురువుగానీ అవసరంలేదనీ నొక్కి చెప్పారు.
ఇది కామెంటరీస్ ఆన్ లివింగ్ (ఫస్ట్ సిరీస్) అనే ఆంగ్ల రచనకు శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు తేట తెలుగులోనికి చేసిన యథాతథ అనువాదం. తక్కిన పుస్తకాల కంటె కామెంటరీస్ ఆన్ లివింగ్‌కు ఒక ప్రత్యేకత ఉన్నది. కృష్ణమూర్తి ప్రచురణలలో ఎక్కువ భాగం వివిధ సందర్భాల్లో, వివిధ ప్రదేశాల్లో చేసిన ప్రసంగాలు కాగా యీ ప్రస్తుత గ్రంథం ఆయన స్వయంగా చేసిన లిఖిత రచన. వివిధ దేశాలలో పర్యటిస్తున్నప్పడు సామాన్యులుగా, ప్రముఖులూ కూడా ఎంతోమంది తమ సమస్యలను, ఆవేదనలను వెల్లడించుకునేవారు. ఆంగ్లంలో వ్రాసి పెట్టుకున్న యీ ఉదంతాలను చదవడం వల్ల ఎందరికో ఉపయోగంగా ఉంటుంది. దర్పణంలా మనల్ని మనమే పరిశీలించుకునే అవకాశం కల్పించే ఈ జీవిత వ్యాఖ్యానాలు తెలుగు పాఠకులలో నవ్య నూతనమైన జీవనదృష్టిని వెలిగిస్తాయి.
"వ్యర్థ ప్రసంగం, వ్యాకులత - రెండూ చిత్రంగా ఒకలాంటివే. రెండూ మనస్తిమితం లేకపోవడం వల్ల వచ్చేవే. మనస్తిమితం లేని మనస్సుకి ఏదో ఒక వ్యాపకం, ఎప్పటికప్పుడు వైవిధ్యం ఉండాలి. ఎప్పుడూ ఏదో హడావిడిలో ఉండాలి. ఎన్నో అనుభూతులూ, చిన్న చిన్న సరదాలూ కావాలి. వ్యర్థ ప్రసంగం చేయటంలో ఇవన్నీ ఉంటాయి.
గంభీరతకీ, చిత్తశుద్ధికీ విరుద్ధమైనది ఊరికే కబుర్లు చెప్పటం. ఇంకొకరి గురించి మంచిగా గాని, చెడ్డగాగాని మాట్లాడటం అంటే తన్ను తాను తప్పించుకోవటమే. ఈ తప్పించుకోవటమే వ్యాకులతకి కారణం. తప్పించుకోవటంలోనే ఉంటుంది సహజంగా - అస్తిమితత్వం. ఇతరుల వ్యవహారాల గురించి తాపత్రయ పడటమే కొందరి పని. లెక్కలేనన్ని పత్రికలు, పేపర్లూ వాటిలోని కబుర్ల గురించీ, హత్యల గురించీ, విడాకులు లాంటి గొడవల గురించీ చదవటంలో ఆ తాపత్రయం కనిపిస్తుంది.
ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని బాధ పడతాం కాబట్టి వాళ్లందరి గురించీ మనం అన్నీ తెలుసుకోవాలనుకుంటాం. దీన్నుంచే అనేక రకాలుగా, మోటుగా, నాజూగ్గా గొప్పలు పోవటం, అధికారాన్ని ఆరాధించటం జరుగుతుంది. ఈవిధంగా మనకి అంతకంతకి పై పటారం పెరిగి, లోపల శూన్యం మిగులుతుంది. పైడాబు ఎంతగా ఉంటే, అన్ని అనుభూతులూ, అన్ని ఆకర్షణలూ ఉండాలి మనకి. దీనితో మనస్సు ఎప్పుడూ స్తిమితంగా ఉండదు - దేన్నైనా శోధించటానికి గాని, కనుక్కోవటానికి గాని.
వ్యర్థ ప్రసంగం ద్వారా వ్యక్తమయేది స్తిమితంలేని మనస్సు. మౌనంగా ఉన్నంత మాత్రాన ప్రశాంతమైన మనస్సు అని సూచన కాదు. ప్రశాంతత ఏదైనా మానుకున్నందువల్లగానీ, వద్దనుకున్నందువల్లగానీ రాదు. ఉన్నదాన్ని అర్థం చేసుకోవటంతో వస్తుంది. ఉన్నస్థితిని అర్ధం చేసుకోవాలంటే చురుకుగా తెలుసుకోగలిగి ఉండాలి, ఎందుచేతనంటే ఉన్నది ఎప్పుడూ స్థిరంగా ఉండదు కనుక. "