వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/ప్రాణాయామము

వికీసోర్స్ నుండి

Download this featured text as an EPUB file. Download this featured text as a RTF file. Download this featured text as a PDF. Download this featured text as a Mobi. పుస్తకం దింపుకోండి!

పుస్తక ముఖచిత్రం

శ్రీ శివానంద విరచితమైన ప్రాణాయామము (1945); అనువాదకులు - దిగవల్లి శేషగిరిరావు

యోగులు, ఎడతెగని ధారణవలన అనేకములైన సిద్ధులను పొందెదరు. ఇట్టి సిద్ధులను పొందినవారిని సిద్ధులందురు. సిద్ధులను పొందుటకై వారు సాధనను చేసెదరు. ఇట్టి సాధనలలో ప్రాణాయామము అనునదొక ప్రధానమైన సాధన, ఆసనములను అభ్యసించుటవల్ల స్థూలశరీరము వశపడును. ప్రాణాయామమువల్ల సూక్ష్మశరీరము లింగశరీరములు వశపడును. శ్వాసకు, మజ్జాతంతువులకు చాల దగ్గరి సంబంధము గలదు. అందువలన శ్వాసను వశపరచుకొనుటచే, సహజముగనే ఆంతరిక ప్రాణతంత్రులు వశపడును.

హైందవ మతము ప్రాణాయామమునకు చాల ప్రాధాన్యము నిచ్చును, ప్రతి బ్రహ్మచారి, గృహస్థు, ప్రతిదినము త్రిసంధ్యలందును సంధ్యావందన సమయమున ప్రాణాయామమును చేయవలెను. హిందువులుచేయు ప్రతి మతసంబంధమగు కర్మయందును ప్రాణాయామము గలదు. హిందూయోగులు ధారణా మహిమచే భిన్నభిన్నములగు నూరు విషయములను గురించి జ్ఞప్తియుంచుకొని శతావధానమును చేతురు. ఈ శతావధాని (శతావధానము చేయువాడు) ఒకరితరువాత, మరొకరు త్వరత్వరగ వేయు నూరు ప్రశ్నలను జ్ఞప్తి యందుంచుకొని వరుస ప్రకారము జాగరూకతతో జవాబు చెప్పుచుండవలెను.

ప్రాణ మను నదొక సూక్ష్మమైన శక్తి, ఇది స్థూల ప్రపంచములో చలనము, కృత్యముల రూపమునను, సూక్ష్మ ప్రపంచములో సంకల్ప రూపమునను కనిపించును. ప్రాణాయామ మన, ప్రాణశక్తులను నిలువచేసి కొనుట. ఇందువల్ల ప్రాణ శక్తులు వశపడును. స్నాయువులలో చైతన్యము వచ్చి, బాహ్య ప్రపంచ విషయములను తెలిసికొన గలుగుట, ఆంతరిక సంకల్పములను గురించి యోచింప గలుగుటలు ప్రాప్తించ గలవు, ప్రాణశక్తిని వశపరచుకొనుటయే ప్రాణాయామ మందురు. ఇట్టి ప్రాణాయామముచే తన ప్రాణశక్తిని లోబరుచుకొన్న వాడు, తననేగాదు తదితర ప్రపంచ మంతటిని జయించిన వాడగును. ఈ ప్రాణమే ఈ సృష్టికంతకు మూలాధారము. యోగి ప్రపంచమునంతను తన శరీరముగ తలచును. ఏలనన, తన శరీరము ఏ పంచ భూతములచే సృష్టింప బడినదో, ఆ పంచభూతముల చేతనే గదా ఈప్రపంచ మంతయు సృష్టింపబడుట! తన నాడీ మండలమును నడుపుచున్న ఆ మహత్తర శక్తియే, ఈ ప్రపంచము నంతను నడుపుచున్నదిగా తలచును. కావున, తన శరీరమును జయించుటవలన, తాను ప్రకృతి యందలి సమస్త శక్తులను జయించితి ననెడి భావముతో యోగి యుండును. ఈ సృష్టి యందలి భౌతిక, మానసిక శక్తులన్నియు, అందే లయమగు చున్నవి. ఈ రెండు పదార్థములు లేకుండ నున్నవస్తు వేదియు ఈ సృష్టియందు లేదు. శక్తి నిత్యత్వము, పదార్ధ నిత్యత్వము అను, రెండుమూల సిద్ధాంతములు ప్రకృతియందు గలవు. ఈరెండు శక్తులలో ఆకాశతత్వము సృష్టించుటను (ఎల్లప్పుడు) చేయుచుండును; శక్తి, ఎడతెగకుండ యీ సృష్టింప బడిన పదార్థములకు చైతన్యము నిచ్చును. ఈ రీతిని శక్తి భిన్న భిన్న స్వరూపములలో చక్రమువలె తిరుగు చుండి, పున: బలిష్ఠ మగును; అదేరీతిని ఆకాశముగూడ, మరల, ఈ శక్తులు రెండవ చుట్టును ప్రారంభింప బోవునపుడు, భిన్న భిన్న స్వరూపములను కలిగించుటకై తిరిగి ఆకాశ తత్వముపై పనిచేయును. ఈ రీతిని, ఆకాశతత్త్వము మారిపోయి స్థూల సూక్ష్మరూపములుగా మారి నప్పుడెల్లను, ప్రాణశక్తికూడ అదే రీతిని స్థూల సూక్ష్మరూపములు గలదిగ మారును.

యోగి తనశరీరము నొక సూక్ష్మప్రపంచముగ నెంచి, నాడీవిధానము, ఆంతరి కేంద్రియములచే తన శరీరము నిర్మింప బడినదని తెలిసికొని, తన పరిశ్రమవలన వీటి మర్మముల నన్నిటిని కనుగొని, వీటి నన్నిటిని వశపరచుకొని, జగత్తునంతను జయించును.

ఇట్టి మహత్తరమైన ప్రాణమును వశపరచుకొనినవాడు, భౌతికజీవితము, భౌతికవిషయముల నన్నిటిని వశపరుచుకొన గలడు. ఇట్టివాడు తన శరీరమును, మనస్సును వశపరచుకొన గలుగుటేగాదు, సృష్టియందలి ప్రతి ప్రాణియొక్క శరీరము, మనస్సులనుకూడ తన వశములోనికి తెచ్చుకొనగలడు. ఇదే ప్రాణాయామము నభ్యసించి, ప్రాణశక్తిని వశపరచుకొనుట వల్ల గలుగు ఫలితము. ఇట్టి యోగి, తన శరీరమునందే జగత్తంతయు నున్నట్లు గుర్తించి, జగత్తునందుగల సర్వశక్తులు తన శరీరమునందున్నవని భావించి, ఆ శక్తుల నన్నింటిని తన వశము చేసికొనుటకు ప్రయత్నించును. ఇట్టి సిద్ధినిపొందుట కొర కాత డనేక రకములగు అభ్యాసముల నొనర్చును.

పూర్తి గ్రంథం చదవండి.