వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం
కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం (1998),జిడ్డు కృష్ణమూర్తి,అనువాదం: సరోజినీ ప్రేమ్ చంద్
నిత్యజీవితంలో ప్రతి మనిషి ఎదుర్కొనే సమస్యలను పూర్తిగా మౌలికమైన, ఒక నవ్య దృష్టితో కృష్ణమూర్తి పరికించి విశదీకరిస్తారు. విభిన్నమైన శాఖలకు చెందిన రచనలు యిందులో చోటుచేసుకున్నాయి. సభా ప్రసంగాలు, సందేహాలకు సమాధానాలు, వ్యాసరచనలు,ఇంటర్యూలు, దినచర్య వృత్తాంతాలు, యితరులకు చెప్పివ్రాయించినవి. లేఖలు, సంవాదాలు చర్చలు-వీటిలో జీవితానికి సంబంధించిన అత్యంత ప్రధానమైన అంశాలను నిర్దుష్టతతో దృశ్యీకరించారు. సత్యం మానవుడి మనస్సు నిర్మించుకున్న పరిమితులకు ఆవలగా, 'తెలుసుకున్నవారికి, సూత్రీకరించుకున్నవాటికి లేదా కల్పన చేసుకున్న వాటికి' ఆవలగా వుంటుందని, సత్యం కోసం అన్వేషిస్తున్నప్పుడు 'మొదటి అడుగే చివరదీ ' అని అంటారు కృష్ణమూర్తి. అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఆరంభించడంలోని వైశిష్ట్యాన్ని గట్టిగా నొక్కి చెప్పారు.
“ |
మొట్ట మొదటగా భౌతికమైన భయం వున్నది. ఇది జంతు జాతికి స్వభావ సిద్ధమైన ప్రతి స్పందించే గుణం, మనలో వున్నది చాలా వరకు జంతువుల నుండి వారసత్వంగా లభించినదే కాబట్టి మన మెదడు నిర్మాణంలోని చాలా ఎక్కువ భాగం జంతువుల నుండి సంక్రమించినదే. ఇది వైజ్ఞానిక సత్యం. ఇది ఒక సిద్ధాంతం కాదు. ఇది ఒక వాస్తవం. జంతువులలో హింసాత్మకత వుంటుంది. మనుష్యులలోను వుంది. జంతువులకి అత్యాశ ఎక్కువ. వాటికి మెప్పుదల యిష్టం. ముద్దు చేయించు కోవడం మరీ యిష్టం, సుఖంగా వుండటం కోసం ఆరాటపడతాయి. మనుష్యుల్లో కూడా యిదే కనబడుతుంది. జంతువుల్లో తమ స్వంతం చేసుకోవాలనే గుణం, పోటీ తత్వం వున్నాయి. మనుష్యుల్లోనూ అంతే. జంతువులు గుంపులుగా జీవిస్తాయి. మనుష్యులు గూడా ఒక బృందంగా ఏర్పడి పనిచేయాలనుకుంటారు. జంతువుల్లో ఒక సాంఘిక వ్యవస్థవుంది. మనుష్యుల్లోనూ వున్నది. ఇంకా ఎన్నో వివరాలు తెలుసుకోవచ్చును. అయితే జంతువులనుండి సంక్రమించినవి మనలో చాలా వున్నాయని గ్రహించడానికి యివి చాలు. ఈ జంతు లక్షణాల నుండి మనల్ని విముక్తి చేసుకోవడమే కాకుండా, యింకా ఆవలగా దీనిని మించి పోయి కనిపెట్టడం- కేవలం మాటల్లో శోధించడం కాదు, నిజంగా తెలుసుకోవడం- మనకు సాధ్యమేనా? సమాజం చేసిన, తాను పుట్టి పెరిగిన సంస్కృతి చేసిన నిబద్దీకరణాన్ని దాటుకొని మనసు ఆవలగా పోగలదా? పూర్తిగా విభిన్నమైన ఆయత ప్రమాణానికి చెందిన మరొక దానిని తెలుసుకోవాలంటే, అది దర్శించుకోవాలంటే- భయభీతి నుండి విముక్తి చెంది తీరాలి. |
” |