వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/ఆంధ్ర రచయితలు
ఆంధ్ర రచయితలు(1936)-మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
తెలుగు భాషలో కవిచరిత్రలు చాలాకాలము నుండి రాయబడుచున్నవి. వీనిలో 1865 లో ప్రచురితమైన వీరేశలింగము పంతులుగారి "కవిచరిత్రము" ప్రధానమైనది. దీని తరువాత మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి 1936లో ప్రచురించిన "ఆంధ్ర రచయితలు" పేరుపొందినది. దీనిలో పరవస్తు చిన్నయసూరి (జన్మము 1806) నుండి తుమ్మల సీతారామమూర్తి చౌదరి (జన్మము 1901) వరకు సుమారు నూరుగురు మహా రచయితలను గూర్చి సద్విమర్శతో వ్రాయబడిన గ్రంథం. ఈ పుస్తకం భారత డిజిటల్ గ్రంథాలయం ద్వారా డిజిటల్ రూపంలో కి మార్చబడగా, వికీసోర్స్ సభ్యులు యూనికోడ్ పాఠ్యీకరణ చేశారు. దీనిలో చిన్నయసూరి గురించిన చరిత్రలోని భాగం క్రింద నివ్వబడినది.
"ప్రాచీనాంధ్ర భాషాయుగమునకు నన్నయవలె, అర్వాచీనాంధ్ర భాషాశకమునకు ' చిన్నయ ' మార్గదర్శకుడు. నన్నయ తననాటి వ్యావహారికమును గ్రాంధికవ్యాహారముగా సంస్కరించుటకు చింతామని రచించిన శబ్దశాసనుడు. చిన్నయ దేశభాషలో బాలవ్యాకరణము రచించి యాంధ్రపాణిని యనిపించుకొనిన సూరి. చింతామణికి శేషగ్రంథముగా ' అథర్వణ కారికలు ' బాలవ్యాకరణమునకు శేషగ్రంథముగా ' ప్రౌఢవ్యాకరణము ' వెలువడినను విద్వాంసుల శాస్త్రార్థముల కాగినవి చింతామణి బాలవ్యాకరణములు రెండే. నన్నయభట్టు భారతామ్నాయము నాంధ్రీకరించి తెలుగున బద్యకవితకు బాటవేసెను. చిన్నయ సూరి నీతిచంద్రిక సంధానించి యాంధ్రమున గత్యకవితకు ఘంటాపథము కల్పించెను. ఆదికవి యనబడిన నన్నయభట్టారకునకు బూర్వ మాంద్రమున బద్యకవిత్వము చేయుటకు వీలుపడదు. అటులే, చిన్నయసూరికి బూర్వము గద్యగ్రంధములు రచించినారు. లేదనుటకు ధైర్యము చాలదు. కాని 'నీతిచంద్రిక ' వంటి యుత్తమ వచన శైలి యనన్య లభ్యమైన వైలక్షణ్యము గలిగియే యున్నది. కావున బద్యమున నన్నయకువలె గద్యమును జిన్నయకు నాద్యస్థానము నీయలెను."