వికీసోర్స్:ప్రదర్శన గ్రంథాలు/ఆంధ్రుల సాంఘిక చరిత్ర
ఆంధ్రుల సాంఘిక చరిత్ర (1950) - రచయిత:సురవరం ప్రతాపరెడ్డి
ఆంధ్రుల సాంఘిక చరిత్రలో తెలుగు వారు వెయ్యేళ్ళ కాలంలో ఎలా జీవించారన్న విషయాన్ని వివరించే అపురూపమైన గ్రంథం. "తారీఖులు దస్తావేజులు ఇవి కాదోయ్ చరిత్రకర్థం" అని సంప్రదాయ చరిత్ర రచన లక్ష్యాలు, పద్ధతులు తప్పుపట్టాడు మహాకవి శ్రీశ్రీ. అదే కవితలో
చారిత్రక విభాత సంధ్యల/ మానవకథ వికాసమెట్టిది?/ ఏ దేశం ఏ కాలంలో/ సాధించిన దే పరమార్థం?/ ఏ శిల్పం? ఏ సాహిత్యం?/ ఏ శాస్త్రం?ఏ గాంధర్వం?/ ఏ వెల్గుల కీ ప్రస్థానం?/ ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?
అన్న కవితాపాదాలకు రూపమిస్తూ ఒక జాతి జనుల సంఘర్షణకు, అలవాట్లకు, పద్ధతులకు రూపంగా వెలువరించారు సురవరం ప్రతాపరెడ్డి ఈ పుస్తకాన్ని. ఒక సాంఘిక సముదాయంగా తెలుగు జాతి ఏ కష్టనిష్టూరాలు ఎదుర్కొన్నది, ఏ అలవాట్లు చేసుకున్నది, ఏ పద్ధతుల్లో జీవించినది, ఏయే పడికట్లు కలిగివుండేది అన్నవి అన్వేషిస్తూ వెయ్యేళ్ళ తెలుగు వారి జనజీవితానికి అద్దంగా ఆంధ్రుల సాంఘిక చరిత్ర రూపొందింది. ప్రామాణికత, ఆసక్తిదాయకమైన అంశాల మేలుకలయిక అయిన ఈ పుస్తకం వెలువడిన తొలిముద్రణకే ఆంధ్ర పండిత లోకంలో ప్రముఖులైన రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారి మన్నన పొందింది. తర్వాత ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథంగా నిర్ణీతమైంది, ప్రస్తుతం గ్రూప్ పరీక్షలకు పాఠ్య పుస్తకాల్లో ఇదీ ఒకటి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను సురవరం ప్రతాపరెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. 20వ శతాబ్ది ముగిసి కొత్త సహస్రాబ్దిలోకి అడుగుపెడుతున్న తరుణంలో 1999లో వెల్చేరు నారాయణరావు, జంపాల చౌదరి రూపొందించిన 20వ శతాబ్ది ఉత్తమ తెలుగు పుస్తకాల జాబితా "ఈ శతాబ్దపు రచనా శతం" సహా అనేక ఉత్తమ పుస్తకాల జాబితాలో చోటుచేసుకుంటూనే ఉంది.
"ఒకనాడు మన తెనుగుసీమలో ప్రతి బ్రాహ్మణ గృహంలో ఒక గ్రంథాలయం వుండేది. ధనికులు తివాసీలపై కూర్చునేవారు. "బురునీసు దుప్పటులు కప్పుకొనేవారు. అప్పులవారిని "పొంగడ దండల"తో శిక్షించేవారు. దొంగలనుపట్టి "బొండకొయ్యలో" వుంచేవారు; రెండవ భార్యను చేసుకొంటే, ఆమెకు "సవతి కడెము" తొడిగేవారు: యుద్ధంలో ఓడినవారు "ధర్మాచార" పట్టేవారు; తాంబూలం వేసుకోడానికి "పాన్ దానులు ఉపయోగించేవారు; రైతులు ఏరువాకను, "వింతటి పండుగను" చేసుకొనేవారు; కరణాలు "వహి" అనేపుస్తకాలలో లెక్కలను వ్రాస్తూండేవారు; పీనుగులను కాల్చిన బూడిద మచ్చుమందుగా పనిచేస్తుందని దొంగలు నమ్ముతుండేవారు-ఈ రీతిగా శ్రీ ప్రతాప రెడ్డిగారు వ్రాసిన "సాంఘిక చరిత్ర" మన పూర్వీకుల జీవిత విధానాన్ని గురించి చెప్పే విశేషాలకు అంతేలేదు.
ఈ చరిత్ర దాదాపు ఒక జీవిత కాలపు పరిశోధనా ముక్తాఫలం"—నార్ల వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రభ సంపాదకీయంలో