వాసిష్ఠరామాయణము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

వాసిష్ఠరామాయణము

పంచమాశ్వాసము

క. శృంగారాకారశ్రీ
     సంగతదివ్యాంతరంగ సరసిజనిలయా
     లింగితవక్ష యహోబల
     శృంగస్థలనటనరంహ శ్రీనరసింహా.1

నిర్వాణప్రకరణము

.

వ. దేవా పరమతత్త్వార్థవివేకి యగు వాల్మీకి భరద్వాజున కి ట్లనియె. న ట్లు
     పశమునప్రకరణం బెఱింగించి వసిష్ఠుండు రామచంద్రుం గనుంగొని౼
     యీయర్థంబునకు ఫలంబు నిర్వాణంబ యని సెప్పంబడు. నందు
     భుసుండ, దేవపూజ, బిల్వ, శిలాఖ్య, అర్జున, శతరుద్ర, బేతాళ
     భగీరథ, శిఖిధ్వజ, కిరాత, చింతామణి, గజ, చూడాల, కచ, మిథ్యా
     పురుష, భృంగి ఇక్ష్వాకు, వ్యాధ,యోగభూమికోపాఖ్యానంబులన
     జీవన్ముక్తివర్ణితంబు లగునితిహాసంబు లేకోనవింశతి యుండు. నందు
     ప్రణవధ్యానంబునం జిత్తవిశ్రాంతి గలుగుట భుసుండోపాఖ్యానంబు
     నం జప్పంబడు, నవ్విధం బాకర్ణింపుము.2
గీ. దేహములయందు నహమిక, దృశ్యసమితి
     యాత్మ యనుటయు, వస్తువులందు మమత,
     యలమి యెందాఁక వర్తించు నంతదాఁకఁ
     బాయ దెప్పుడు చిత్తవిభ్రమము వత్స.3
క. విను మంతర్ముఖుఁ డై జగ
     మను తృణముఁ జిరగ్నియందు నాహుతిగాఁ దా

     నొనరించిన మునివరునకు,
     మొనయదు విభ్రాంతి చిత్తమున నెన్నఁటికిన్.4
వ. అనిన నిని రఘువరుండు మునివరున కి ట్లనియె.5
క. నీ విచ్చినబోధంబున
     జీవన్ముక్తుండ నైతిఁ, జిరవాసనతో
     నీవిధము వాయుధారణ
     నేవిధమునఁ బొందవచ్చు నెఱిగింపు తగన్.6
వ. అనిన వనిష్ఠుం డి ట్లనియె.7
క. ఘోరభవోత్తారణకును
     నారూఢధ్యానయోగ మగునది౼యంత
     ర్మారుతధారణ మన, నా
     త్మారామజ్ఞానసౌఖ్య మన, ద్వివిధ మగున్.8
క. ఈరెంటియందు మారుత
     ధారణ మది యోగ మండ్రు, తఱుచుగ నివి సా
     ధారణములు గా వని యధి
     కారివిశేషమును శివుఁడు గావించెఁ జుమీ.9
వ. అట్లు గావున, నీకుఁ బరమజ్ఞానం బెఱింగించితి నింకఁ బ్రాణధారణా
     యోగంబు తెఱం గెఱింగించెద. నాకర్ణింపుము.10
సీ. భూనాథ విను రత్నసానుశృంగంబునఁ
                    బద్మరాగపురుచిఁ బరఁగుకల్ప
     తరు వొప్పు. నామ్రాని దక్షిణస్కంధ కో
                    టరమున గనకవల్లరులయింట
     నుండు భుసుండాఖ్యుఁ డొకవాయసశ్రేష్ఠుఁ
                    డాతండు చిరజీవి యఖలములను
     వీతరాగుఁడు, కాలవేది, శ్రీమంతుఁడు

                    శాంతుఁడు, నిత్యవిశ్రాంతబుద్ధి,
గీ. యతనిఁ గనుఁగొను వేడుక నచటి కరిగి
     చూచునెడ నమ్మహీజంబుఁ జుట్టియున్న
     పసిడితీఁగెలకొనలపుష్పములయందు
     గలసి క్రీడించు బహువిహంగముల గంటి.11
వ. మఱియును.12
క. శశిశకలసదృశబిసలత
     లశనములుగ సామగాయనాభ్యాసకళా
     వశుల పితామహవాహన
     శిశులను హంసములఁ గంటి చెలఁగుచు నంతన్.13
ఉ. వాయసవృద్ధవర్గ మిరువంకల డగ్గఱి తన్నుఁ గొల్వఁగా
     నాయతపక్షయుగ్మమును నంజననీరదనీలవిస్ఫుర
     క్కాయము దీర్ఘతుండమును గల్గి సుఖస్థితి నున్నవాని దీ
     ర్ఘాయురుపేతు నిత్యవిజితాంతకశుండు భుసుండుఁ గాంచితిన్.14

భుసుండోపాఖ్యానము

క. కని డాయఁబోవఁ బ్రీతి
     న్గనుఁగొని సత్కారవిధు లొనర్చి సుఖాసీ
     నునిఁ జేసి పరమసమ్మద
     మున బొందెడువాయసోత్తమున కి ట్లంటిన్.15
శా. ఏ కాలంబునఁ బుట్టి తీవు? మఱి నీ కీ బ్రహ్మవిజ్ఞాన మి
     ట్లేకృత్యంబున సంభవించె? నది మున్నెం తయ్యె నీ కాయు? వీ
     వేకార్యంబు లెఱింగి? తీగృహము నీ కెవ్వాఁడు ము న్నిచ్చె? నో
     కాకాధీశ్వర, నాకు జెప్పుము మదిన్ గౌతూహలం బయ్యెడిన్.16
సీ. అనిన భుసుండుఁ డి ట్లను.–మహాభాగ నా
                    తెఱఁ గెల్లఁ జెప్పెదఁ దెలియ వినుము,

     సప్తమాతృకలు నుత్సవవేళఁ గజకంఠుఁ
                    గొలుచువేడుక వెండికొండ కరుగ,
     నందు బ్రాహ్మికి వాహ మగుహంసికకు నలం
                    బుసవాహ మగుకాకపుంగవునకు
     బుట్టితిఁ; బుట్టినప్పుడు బ్రాహ్మి నా కిట్టి
                    విజ్ఞానసంపద వేడ్క నిచ్చె,
గీ. వెండి నాతండ్రి యిందు న న్నుండఁ బనిచె;
     నతనిపంపున నిం దుండ నగణితంబు
     లైనకల్పాంతములును మన్వంతరములు
     జనియె, నే నెన్ని చెప్పుదు మునివరేణ్య.17
వ. అనిన నే నిట్లంటిఁ. గల్పాంతంబులం దెట్టి యోగీంద్రులు నిత్తెఱంగున
     నున్నవారు లేరు. నీ వెత్తెఱంగున నుంటి? వనిన; నతండు౼మునీం
     ద్రా, యీశ్వరశాసనం బలంఘనీయంబు, గావునఁ గల్పాంతంబుల
     యందు పృథివ్యాధిభూతంబులంద యణగి వర్తించుచు నెక్కా
     లంబు సుఖించుచుండుదు౼ననిన; నతని కి ట్లంటి.18
క. నీవును జ్ఞానవిదుండవు,
     గావున మును సన్నబ్రహ్మకల్పంబులయం
     దే వేవి చూచి తేర్పడ,
     నావిధ మెఱిగింపు మనిన నతఁ డి ట్లనియెన్.19
మ. అనఘా, యే మని చెప్ప! ధాత్రి జనశూన్యం బయ్యెఁ బెక్కేఁడు; లం
     త నగ క్ష్మాజ లతా తృణాది యడరన్ దా భస్మ మై తోఁచె; న
     య్యినచంద్రాదులపుట్టువుల్, సురవరోపేంద్రస్థితుల్, క్రోడ మై
     కనకాక్షున్ హరి ద్రుంచుటల్, శిశువులై కాన్పింతు రింకేటికిన్.20
క. ము న్నేడుగురు వసిష్ఠులఁ
     గన్నారఁగఁ జూచినాడ కమలజతనయా,

     యెన్నఁగ నష్టమ తను వగు
     ని న్నిచటం జూడఁ గంటి నిండిన ప్రేమన్.21
క. ఒకమా టాకాశంబున,
     నొకపఱి యుదకమున, నగ్ని నొకయెడ, గిరియం
     దొకవేళఁ, జుట్టుచుండుదు
     నకలంకవిభావనంబు లద్భుతలీలన్.22
వ. మఱియును.23
సీ. కలియుగంబులు నూఱు గనుగొంటి, హరి బుద్ధ
                    జనంబులును నూరు చనియె మున్ను,
     త్రిపురదాహంబులు దీఱె ముప్పదిమార్లు,
                    దక్షమఖంబులు లక్ష యణఁగె,
     సాంగంబు లగు వేదసంఖ్యలు పె క్కేఁగె,
                    నెన్నంగరాని యనేకపాఠ
     ముల నొప్పెడు పురాణములు పెక్కు వర్తించె,
                    న ట్లితిహాసరామాయణములు
గీ. చనియెఁ బెక్కులు, మోక్షశాస్త్రములగ్రంథ
     లక్ష లుదయించె, వాల్మీకిదక్షనిరత
     శిక్షలును వ్యాసుఁ డనుమునిచేతఁ బరుల
     చేత భారతములుఁ బెక్కు సేయఁ బడియె.24
క. భువి రామాయణకథలును
     భవిష్యదుద్భవముతోడఁ బండ్రెం డగుచు
     న్నవి, కృష్ణావతరణములు
     నవి పదియా ఱయ్యె, వచ్చు నవతారముతోన్.25
వ. అట్లు గావున జగద్భ్రాంతి యిట్ది. దీని కవధి సెప్పరాదు. నీవడిగిన
     యర్థం బెఱింగించితి. నింక నేమి యభీష్టం బడుగు మనిన నతనితో

     బ్రాణు లపమృత్యురహితు లై చిరంజీవు లెట్లగుదు రెఱింగింపవే.
     యనిన నవ్వాయసవిభుం డి ట్లనియె.26
క. దోసము లనుమౌక్తికములు
     వాసన లనుతంతువుల నవారణఁ గ్రువ్వన్,
     రోసినచిత్తమువానికి
     నోసరిలున్ మృత్యు వెందు నుత్తమపురుషా.27
క. విను నిర్మలమును బావన
     మును నేకముఁ బరమసౌఖ్యమును నైనపదం
     బున నెవ్వనిమది దగులునొ,
     యనఘా, యాతనికి మృత్యు వతిదూర మగున్.28
గీ. ప్రకటసంసారరోగకారణము లగుచు
     నడరు కామాదిశత్రుల నడఁచునట్టి
     యాత్మరతులును బ్రాణచింతాభియుతులు
     నగుమహాత్ముల దెస మృత్యు వరుగ దెపుడు.29
వ. ఈ రెంటియందును సర్వదుఃఖక్షయకారిణియు, సకలభాగ్యదాయిని
     యుఁ, జిరాయుఃకారణంబును, నగు ప్రాణచింతన మతిసుఖప్రద యై
     వర్తిల్లు, దాని విధం బెఱింగించెద నాకర్ణింపుము.30
సీ. పరఁగ హృద్గత మైన ప్రాణానిలము వెలి
                    ద్వాదశాంగుళమాత్ర వచ్చి యణఁగు
     నది రేచకం బగు; నదియ నిశ్చలత
                    బహిఃకుంభకం బగు; నదియ మఱలి
     హృదయంబు సొచ్చి పెం పెసగఁ బూరక మగుఁ;
                    గదల కాంతరకుంభకత్వ మొందుఁ;
     దప్పక యిబ్భంగిఁ దాన వర్తిలువాయు
                    చింతనం బది ప్రాణచింత యండ్రు,

గీ. ఇదియు దుఃఖౌఘనిరసని, యిందు నిలిచి
     యెవ్వ రుండుదు; రట్టివా రెల్లనాఁడు,
     శుద్ధబుద్ధస్వరూపులు సుఖులు ఛిన్న
     మతులు నై యెందుఁ దగులక మనుదు రనఘ.31
క. విను బహిరంతర్ముఖముల
     మునివర ప్రాణము నపానమును వర్తిల రెం
     టిని గూర్చి నడుమఁ జిత్తముఁ
     గొనకొని వర్తింప నదియ కుంభక మయ్యెన్.32
క. మానుగఁ బ్రాణము వొదువ క
     పానం బడఁగంగ నేది ప్రబలుం డమల
     జ్ఞానస్వరూపతత్త్వము
     నానందముతో భజింతు ననవరతంబున్.33
ఉ. ప్రాణ మణంగి యుండఁగ, నపానము నుద్భవ మొందకుండఁ, ద
     త్ప్రాణవియత్పదంబున నకంపితమై కలనాకలంక ని
     ర్వాణము నిష్కళంకముఁ బరంబుఁ జిరానుభవోత్తమంబు గీ
     ర్వాణనుతంబు యోగిసుకరంబును నైనపదంబు నొందెదన్.34
గీ. అట్టి ప్రాణసమాధిని నట్టివిమల
     సంవిదానంద మైనవిశ్రాంతి గలిగి,
     తలఁప భూతభవిష్యదర్థముల నెపుడు;
     వర్తమానంబు చూతు నకర్త నగుచు.35
క. ఆపదలను ధీరుఁడ నై
     శ్రీపరిణతి సముఁడ నగుచుఁ జిత్తంబున న
     వ్యాపితభావాభావుఁడ
     నై పెంపునను జిరజీవి నై యున్నాఁడన్.36
వ. అనిన నతనిం గనుంగొని 'మహాభాగా, నీచరిత్రం బింతయొప్పునే! యతి

     విచిత్రం. బట్లు గావున సకలభువనభూషణుండ వై యాత్మారామసుఖం
     బు లనుభవింపు,' మని యవ్వాయసయోగి నామంత్రణంబు చేసి, చను
     దెంచితి, నట్లు గావునఁ బ్రాణనిరోధంబునను జిరకాలజీవులు జీవన్ము
     క్తులు నై సుఖియింతు రని యెఱింగించి వసిష్ఠుఁడు.37
క. భూనాథ యీ భుసుండా
     ఖ్యానము వినఁ గాంచుపుణ్యకర్ముల కచల
     జ్ఞానంబు సంభవించుఁ జి
     దానందసుఖంబు లొందు నంబుజనయనా.38
వ. అని భుసుండోపాఖ్యానంబు సవిస్తరంబుగా నెఱింగించి, యిట్టి చిత్త
     విశ్రాంతిరూపం బైననిర్వాణంబు దేవపూజ నైన సంభవించుఁగావున
     తత్కథాక్రమం బెఱింగించెద నాకర్ణింపు. మని వసిష్ఠుండు రామ
     చంద్రున కి ట్లనియె.39
చ. తిరముగ శయ్య నుండి పెరదేహముతోఁ గలలోన దిక్కులన్
     దిరిగెడునట్లు గాని, యొకదేహమునం దిర మొంద దాత్మ; సం
     సరణము నిట్ల దీర్ఘ మగుస్వప్నము, దీర్ఘమనోభ్రమంబు, దీ
     ర్ఘరమితచిత్తరాజ్యమును, గా మదిలోనఁ దలంపు రాఘవా.40
వ. అదియునుం గాక.41
ఉ. చచ్చుట నిక్క మందఱకుఁ, జావునకై పరితాప మేటికిన్?
     వచ్చుధనం బవశ్యమును వచ్చును, దాన మదింప నేటికిన్?
     గ్రచ్చర రాగరోషభుజగంబులు రెండు మనోబిలంబునం
     జొచ్చి కలంపఁగా నెఱుక చొప్పడ కున్నది గాక, రాఘవా.42
క. చతురులు శాస్త్రప్రజ్ఞా
     రతులును నై రాగరోషరక్తు లగుదు రే,
     నతిభారవాహిగార్దభ
     గతి సదృశులె కాన వారిఁ గాల్చనె తండ్రీ.43

గీ. అట్లు గావున భయదంబు నాత్మధైర్య
     హానియు నమంగళంబును నైనయట్టి
     క్షుత్పిపాసంబు నెడలించి స్రుక్క చెడని
     చిన్మయానందసౌఖ్యంబుఁ జెందు మెపుడు.44
వ. అని బోధించి యమ్మహాముని తొల్లి శంకరుం డానతిచ్చిన దేవపూజా
     మహిమ యెఱింగించెద నాకర్ణింపు. మని యి ట్లనియె.45

దేవపూజోపాఖ్యానము

సీ. భక్తి నే నొకనాఁడు భాగీరథీతటి
                    శివుని చిత్తమునఁ బూజించి, పిదపఁ
     గను విచ్చి చూడ, శంకరుఁడు ప్రసన్నుఁ డై
                    ముంచటఁ బొడసూప, మ్రొక్కి నిలిచి
     ప్రాంజలి నై ౼ దేవ, పరమాత్మ, పరమేశ,
                    శర్వ, కళ్యాణంబు సర్వపాప
     హరణంబు నగు దేవతార్చనవిధ మెట్టు
                    లాన తి౼మ్మనుటయు హరుఁడు పలికె,౼
గీ. మునిగణాధీశ యీక్రియ వినుము దెలియ;
     హరిహరులు గారు దేవత, లరయఁ జిత్ర
     దేవరూపులు గా, రకృత్రిమ మసాధ్య
     మైనసంవత్స్వరూపం బయాదివేల్పు.46
క. ఆకాశాదులపగిది న
     నేకం బగువస్తువందు నేర్పడ నాద్యం
     బై కృత్రిమరహితం బగు
     శ్రీకరతత్సత్త్వ మదియ శివుఁ డనఁబరఁగున్.47
క. ఆ మహిమ యెఱుఁగ నేరని
     పామరు లాకారపూజఁ బరఁగుదు రొకపె

     ట్టామడ చననోపక యర
     యామడ చని నిల్చినట్ల యాత్మవివేకా.48
క. పారావారవివర్జిత
     మై రంజిలు చిత్ప్రకాశ మది దృఢ మగు; నా
     కారాదులు లే వెల్లెడ;
     నారయఁ గల్బాంతదశలు నంద యణంగున్.49
సీ. శాంతియ బోధంబు, సమతయ పుష్పముల్,
                    చిత్సౌఖ్యసత్తయే శివుఁడు, నిట్టి
     యాత్మార్చనయె దేవతార్చన యగుఁ; గాని
                    యాకారపూజు లనర్చనంబు
     లాత్మపూజయ యనాద్యంతంబు నద్వితీ
                    యము నఖండము నబాహ్యంబు నైన
     యానంద మొసఁగు, బాహ్యము నాంతర మనంగఁ
                    దత్పూజ ద్వివిధ మై తనరు; నందు
గీ. బాహ్యపూజాప్రకారంబు పరఁగ వినుము,
     సర్వభావాంతరస్థయు శమితకళయు
     సదసదంతరసామాన్యసత్త్వవతియు
     నైన సంవిత్తిసత్త దా నమరు నొకటి.50
వ. అమ్మహాసత్తాత్మత దేవుం డనిపించుకొనును. నతండు సర్వశక్తిమయుండు
     గావున శక్తిమండలతాండవంబునఁ బ్రవృత్తినివృత్తులం బొందుచుండు.
     నదియు విజ్ఞానశక్తియు క్రియాశక్తియు కర్తృత్వశక్తియు నుల్లాస
     శక్తియు నిరోధశక్తియు నను ని ట్లనంతశక్తు లగుచుండు. నందు
     నుల్లాసశక్తి సంసారవిజృంభణంబు సేయు. నిరోధశక్తి దాని నిశ్శే
     షంబు సేయుచుండుఁ. గావున.51
క. జగదాధార మనంతము
     నగణితరవినిభము భాసనాభాసకమున్

     విగుణము సంవిన్మయమును
     నగు సంతస్స్వప్రకాశ మది పూజ్యముగాన్.52
వ. అది యె ట్లంటేని.53
సీ. కడలేని తత్పరాకాశకంధరము వా
                    సాదికాకాశకోశాంఘ్రితలము,
     నఖలదిక్పూర్ణబాహామండలము శివ
                    మగణితస్ఫురిత నానాయుధంబు,
     హృత్కోశకోణసంహితవిశ్రమితమహా
                    బ్రహ్మాండభాండపరంపరంబు,
     నై చెలువొందిన యఖలపూజ్యుఁడు సంవి
     దాత్ముఁ డాతని కుపహారవిధులు
గీ. వలవ వవినాశనంబు శీతలము లమృత
     మును నదీనంబు నాత్మీయమును ఘనంబు
     నైన యక్లేశలభ్యవిజ్ఞాన నియతి
     నమ్మహాత్ముఁడు పూజల నందుఁ దాన.54
క. విను ముట్టుఁ జూచుఁ జను మూ
     ర్కొను బలుకును నిద్రపోవుఁ గుడుచు న్విడుచున్
     ఘనచిన్మయాత్ముఁ డగునా
     తని కొండొకపూజవలదు ధ్యానము దక్కన్.55
క. విను మిట్టి పూజలను మూఁ
     డునిమేషములంత సేయుడును గోదానం
     బునఁ గలఫల మగు; దిన మె
     ల్లను జేసిన పరమధామలాభము నొందున్.56
వ. ఇవి పరమధర్మంబును పరమయోగంబును నగు; నిది బాహ్యపూజ
     యనంబడు నింక నంతఃపూజ యెఱింగించెదఁ; చిత్తగింపుము.57

మ. స్థితుఁడు న్నిర్గతుఁడున్ బ్రసుప్తుఁడును నాసీనుండుఁ దా భోగియున్
     గతభోగుండును దూరసంస్థితుఁడు బ్రాంతస్థుండు సర్వంబు నై
     వితతాకాశశివాత్మకం బయిన సంవిజ్ జ్ఞానలింగంబు నం
     చితబోధాత్మసమాధి నిచ్చలును బూజింపం దగున్ సంయమీ.58
సీ. అట్టి చిన్మయరూప మగునాకుఁ బె క్కగు
                    చిత్తదృక్ఛక్తులు చెలఁగుసతులు,
     విశ్వంబు నాకు నివేదన, మనము దౌ
                    వారికుం డగుఁ, బ్రతిహారి చిత్త
     మతులఖండజ్ఞానవితతి భూషణములు,
                    ద్వారంబు లింద్రియదశక మరయ,
     నబ్భంగి నీరూప మగునన్ను సమబుద్ధిఁ
                    దప్పక పూజింప నొప్పు; నిట్టి
గీ. పరమపూజకుఁ దివ్యసంపత్తివలదు;
     కామదం బగు పూజయుఁ గలదు వినుము,
     ప్రాప్త మగునట్టి భక్ష్యపానాదు లాత్మ
     కర్చనము చేసి సుఖి యగు టదియ లెస్స.59
వ. ఇ ట్లాత్మపూజార్హంబు లగు భక్ష్యాదివస్తుసంపద్ద్రవ్యంబు లన్నియు
     నేకం బగుశాంతరసంబుచేతను దిరస్కృతంబు లగు నట్లు గావున దేశ
     కాలకలనాకలితంబు లగువస్తువులవలని సుఖదుఃఖవిభ్రమంబు లుడిపి
     నిత్యజ్ఞానార్చితశరీరనాయకుండ వై సుఖం బుండు. మని యుపదే
     శించి యమ్మహాదేవుండు మఱియు ని ట్లని యాన తిచ్చె.60
క. ఈవిధము పూజ నిచ్చలు
     గావించెడు నతని కేను గలదైవములున్
     సేవితుల మగుచుఁ దగ సం
     భావింతు మతండు వొందుఁ బరమపదంబున్.61

గీ. లేని వయ్యును గలయట్లు గానిపించు
     జగము లాభాసమాత్రమ యగు మునీంద్ర;
     యెండమావులు నీళ్లని యెఱిఁగినట్లు
     మూఢుఁ డేతత్త్వ మెఱుఁగక మునుఁగు నందు.62
చ. అలఘువివేక, జీవుఁ డని యాత్మునిఁ దెల్తురు గాక యెందున
     జ్ఞులు. జడిమోద్భవుండు నలసుండు ననార్యుఁడు నైనమూఢు నే
     కొలఁదుల శిక్ష సేసెదరు? క్రూరుని సౌమ్యునిఁ జేయఁ బోక, తాఁ
     గలఁ బొడగన్నమర్త్యునకుఁ గన్నియ నిచ్చుట యౌఁ దలంపగాన్.63
వ. అని యనేకప్రకారంబుల నుపదేశించి యప్పరమేశ్వరుం డంతర్ధా
     నంబు నొందె. నని రామచంద్రున కెఱింగించి వసిష్ఠుండు మఱియు
     ని ట్లనియె.64
క. ఈ యర్చన యక్లేశం
     బాయతవాసనలు దీన నణఁపుదు మెపుడున్
     బాయక ప్రాప్తిక్రియ యగు
     నా యాత్మార్చనము నింద యణఁచినభంగిన్.65
చ. అరయఁగఁ బ్రాప్తమైన క్రియలం దొక విఘ్నము గల్లెనేనియున్
     మెరమెర పొందఁగా దదియు మిక్కిలి పూజయ, దాన దోషముల్
     పొరయవు, గాన జీవు నెడఁబుట్టెడు గ్రాహ్యము గ్రాహకత్వమున్
     సరి యగుయోగపూజ ధృతిఁ జల్పుము రాసుత యాత్మపూజయున్.66
వ. అని యిట్లు దేవపూజోపాఖ్యానం బెఱింగించి వసిష్ఠుండు రామచంద్రుం
     గనుంగొని యింక నంతర్భావకంబు లగుసకలార్థంబులుం గలయది
     యవ్యయం బగు చైతన్యంబ. యీయర్థంబు విదితం బగు బిల్వో
     పాఖ్యానం బెఱింగించెద నాకర్ణింపు. మని యి ట్లనియె.67

బిల్వోపాఖ్యానము

గీ. ప్రాప్తములు వచ్చుచోటను బ్రథమవేళ
     సుఖిత మగునట్లు, తర్వాత సుఖము లేక
     యునికి యనుభూతసిద్ధంబు జనుల కెల్ల
     దీని నెవ్వఁ డెఱుంగఁడు ధీరహృదయ.68
ఉ. కోరినవేళ వస్తు వొడఁగూడ సుఖం, బది మీఁదఁ గల్గ; దా
     గౌరవ మెల్లఁ గోరికయ గావున, వాసనఁ బాయ నిస్పృహా
     చారత సర్వకర్మములుఁ జల్పుము, పెక్కుకళంకువల్ మదిం
     గూరిననైన; దీని మదిఁ గొందల మందక నిల్పు రాఘవా.69
వ. సర్వాత్మకంబు నేకంబు నగు బ్రహ్మంబు భువనభ్రమవిభ్రమంబుల ననే
     కంబువోలె నుండు. నంతియగాని తక్కొండు లే దీయర్థంబు బిల్వఫ
     లరూపంబునం జెప్పంబడు వినుము.70
సీ. విపులత్వమునను వేవేలయోజనము లై
                    యుగసహస్రములందు నిగిరిపోక
     నమలంబు నధికంబు నతివిస్ఫుటంబు నై
                    యొక్కమారేడుబం డొప్పుచుండు,
     నది ప్రాఁతయయ్యును నమృతాంశుశకలమా
                    ర్దవసుందరంబు నై తనరుచుండుఁ,
     గల్పాంతవాతవేగంబునఁ గదలక
                    కోటియోజనముల కొలఁది వడిని
గీ. మూల మనఁగల్గి యీజగంబులకు నెల్లఁ
     దాన యాధార మగుచుండు, దాని చుట్టు
     మెఱసి బ్రహ్మాండములు విశ్రమించుచుండు,
     రవికులక్షీరనిధిచంద్ర రామచంద్ర.71
వ. అనిన విని రామచంద్రుఁ డి ట్లనియె.72

క. మునిసార్వభౌమ, బిల్వం
     బని యిప్పుడు మీరు సెప్పినది నామదికిన్,
     మును చెప్పిన చిత్సత్తయ
     యని తోచెడి దీనిఁ దెలియ నానతి యీవే.73
వ. అనిన నమ్ముని యఖిలంబును జిత్తోద్భవరూపంబు. అది యహంకారం
     బున విస్తరిల్లుచుండు. ఖేదంబు చిత్తచాంచల్యంబె కాని, యన్యంబు
     గా; దని బిల్వోపాఖ్యానం బెఱింగించి వసిష్ఠుం డధ్యాత్మనిర్వికల్పము,
     నఖండైకరసము, నగు నీయర్థంబు విశదంబు సేయుటకు శిలోపాఖ్యా
     నంబు సెప్పంబడు. నాకర్ణింపు మని రామచంద్రున కి ట్లనియె.74

శిలోపాఖ్యానము

క. మృదువును మెఱుఁగును విస్మయ
     పదమును నిబిడము నరేంద్రపరిపూర్ణము నై
     విదిత మగు నొక్కశిల యన
     నది విని రఘురాముఁ డనియె నధికప్రజ్ఞన్.75
గీ. అనఘ మీరు చెప్పినది చిత్పదమ, యది
     శిలయు ఘనము నేకకళయు నగుటఁ,
     దా నరంధ్ర మయ్యు లోనుంచు జగముల
     మిన్ను గాడ్పు నాఁచికొన్నయట్ల.76
క. నాకము భువియును భవనము
     నాకాశముఁ బర్వతములు నబ్ధులు దిశలున్
     దూఁకొని శిలలో నివి గన
     నేకత మచ్ఛిద్రతయును నెందుఁ దలంపన్.77
వ. సకలలోకంబులు దనయంద యుండ యమ్మహాశిలయు నరంధ్రంబును,
     నభేద్యంబును, శంఖచక్రగదాపద్మరేఖాంకితంబును, నై సుషుప్తిభా
     వంబున నుండు పరబ్రహ్మం బని శిలోపాఖ్యానతాత్పర్యంబు సెప్పిన

     విని వసిష్ణుండు హర్షనిర్భరమానసుండును, పులకితశరీరుండును, బాష్ప
     కణకలితకపోలుండును, గద్గదకంఠుండును, ముకుళితకరకమలుండును,
     నై రామచంద్రుం గనుంగొని౼అహో మహాప్రాజ్ఞుండవు గదే! ఈ
     రహస్యంబు సెప్పి. తీవ యప్పరమేశ్వరుండ. వని యగ్గించి యింక వివేకి
     యగువానికి యుద్ధాదిక్రియలను జిత్తవిశ్రాంతిబోధకం బగునీయ
     ర్థంబున కర్జునోపాఖ్యానంబు గల దాకర్ణింపు. మని యి ట్లనియె.78

అర్జునోపాఖ్యానము

గీ. సమతఁ గర్తృత్వ భోక్తృత్వ సాక్షి యగుచు
     ననుగమించిన పుర్యష్టకాఖ్య మగుచు
     నెఱయు సంవిత్తి యర్జునునిం బ్రబుద్ధుఁ
     డైనకృష్ణుఁడు బోధించె నయ్య వినుము.79
మ. ఇటమీఁదన్ రవిసూనుఁ డైనయముఁ డి ట్లేప్రొద్దు నీప్రాణులం
     బటురోషంబునఁ జంప వేసరి తపఃప్రాప్తుండుగా, భూమియు
     త్కటభారం బుడుపం జనించెదరు వీఁకన్ గృష్ణపార్థాఖ్యు లై
     నటనోదారబలప్రసిద్ధి నరుఁడున్ నారాయణుండున్ భువిన్.80
గీ. అందు భారతరణమున నర్జునుండు
     యుద్ధవిముఖాత్ముఁ డగుటకు నొయ్య నతని
     ననునయించుచు శ్రీకృష్ణుఁ డానతిచ్చు
     నట్టి వ్యాఖ్యాన మెఱిఁగింతు ననఘ వినుము.81
సీ. చిద్రూప మెన్నఁడుఁ జెడదు సంపూర్ణంబు
                    నిర్దోష మీవును నిర్జరుండ,
     వజుఁడవు, నిత్యుండ, వాత్మ, కేపట్టునఁ
                    బుట్టువుఁ జావును బొరయ వెందు,
     నిట్లయ్యె నిటమీద నెట్లగు ననరాదు,
                    శాశ్వతుఁ డాద్యుండు, సర్వమయుఁడు,

     తనుబాధ లెందు నాతని సోఁక, వటుగాన
                    ననురక్తి దొఱఁగి యేకాంతబుద్ధి
గీ. నన్ని కర్తవ్యములును బ్రహ్మార్పణముగ
     నాచరింపుము, బ్రహ్మంబ వగుడు వీవ;
     విలయవాయువు వీచిన వింధ్య మగులు
     నపుడు గురుశాస్త్రమతు లలంఘ్యములు పార్థ.82
వ. అట్లు గావున నప్రబోధంబున వాసస లధికంబగు, నాత్మవిజ్ఞానంబువలనం
     జేసి నశించు నని మఱియుఁ బెక్కువిధంబులఁ గృష్ణుం డర్జును బో
     ధించి సమరకర్తవ్యోన్ముఖు జేయంగలవాఁ డగుం గావున నట్ల నా
     సక్తచిత్తుండవై సర్వంబు నాచరింపు మని వసిష్ఠుం డర్టునోపాఖ్యానం
     బెఱింగించి రామచంద్రుం గనుంగొని జంతువులకు జన్మపరంపర సంక
     ల్పభ్రాంతియ. ఈయర్థంబున శతరుద్రోపాఖ్యానంబు గల దాకర్ణిం
     పు మని మఱియు ని ట్లనియె.83

శతరుద్రోపాఖ్యానము

మ. ఒక భిక్షుండు సమాధిశాలి గలఁ డయ్యోగింద్రుచిత్తాంబుజం
     బొకనాఁ డాపగ వీచు లై నిగుడున ట్లుల్లోల మై తా నొకా
     నొకకర్మాశ్రయచింత నొంది తిర మై యొక్కింతసే పుండఁగా
     నొకయాత్మప్రతిభావిశేషకలనం బుద్భూత మై యంతటన్.84
సీ. అతని చిత్తంబు లీలార్థ మై సామాన్య
                    జనభావకాంక్షతో మనుజుఁ డగుచుఁ,
     గోరి జీవితుఁ డనుపే రిడికొని ఘన
                    స్వప్నపట్టణమున సంచరించి,
     యట పానమదమత్తుఁ డై నిద్రవోవుచు,
                    కలలోన విప్రుఁ డై చెలఁగి, యందు
     నిద్రించి కలలోన నెఱయ సామంతుఁ డై

                    భుజియించి, మఱి నిద్రఁబొంది కలను
గీ. ఒక్కభూపాలుఁ డై నిద్రనొంది, యందుఁ
     గల సురాంగన యై, రతిక్రాంతి నిద్ర
     నెసఁగ మృగి యయ్యుఁ, గ్రమమున నివ్విధమున
     బహువిధస్వప్నభవపరంపరలు వొంది.85
క. తుది రుద్రుఁ డైతి నని తన
     మది నిక్కల గాంచి తొంటి మహితభవంబుల్,
     విదితముగఁ గనియె, శివురూ
     పొదవిన విజ్ఞాననిర్మలోత్తమబుద్ధిన్.86
వ. ఇవ్విధంబునం దెలిసి యతం డొక్కయేకాంతస్థలమున సుఖాసీనుండై
     యాత్మీయం బైనస్వప్నశతదర్శనంబులు దలంచుకొని విస్మితుండై, య
     హో విశ్వమోహిని యగుమాయ యిట్టిది గదే, మరుమరీచికాజలం
     బువోలె లేని దయ్యును గలయట్ల భ్రమియించుచున్నయది; యాయా
     రూపంబుల నమితంబు లగు సంసారారణ్యభూములయందుఁ బెక్కుజ
     న్మంబులఁ బరిభ్రమించి నేఁడు రుద్రుండనైతి. నిందు ననేకయుగంబులు
     ను బహువిచిత్రంబులునుం జనియె. అతీతంబైన యతిప్రభృతిసంసారశ
     తంబు నాలోకించెదంగాక.౼ యని తలంచుకొని చనుదెంచి యతండు.87
ఉ. ఆదిఁ బ్రసుప్తుమాడ్కి నగు నయ్యతిదేహము గాంచి చేతనో
     త్పాదన యందుఁ జేసిన నతండును రుద్రుఁడ యయ్యె; నిద్దఱున్
     సాదరలీలఁ జిద్గగనసంసృతిపట్టినమేనిఁ గాంచి ప్రా
     ణోదయ మందుఁ జేయుటయు నొప్పుగ రుద్రుఁడ యయ్యె నాతఁడున్.88
క. ఇవ్విధమునఁ జని వరుసన
     యవ్విప్రప్రభృతు లైనయంగంబులకున్,
     నివ్వటిలఁ దనువు లొసఁగిన
     నవ్విధి శతరుద్రమూర్తు లైరి కుమారా.89

వ. ఇట్లు మహాభిక్షుసంకల్పంబు లగుజీవితాదులు శుద్ధసంవిదంశంబులై
     నిత్యులుంబోలె నుండి. రిది మనోమాయ యని శతరుద్రోపాఖ్యానం
     బెఱింగించి వసిష్ఠుడు రామచంద్రుని గనుంగొని. ౼యింక సుషుప్తి
     యనువునఁ బునర్జనకం బగు వివేకం బెఱింగించుటకుఁ గర్కటికథ
     యునుంబోలె నొప్పు బేతాళప్రశ్నసంఘంబు గల దాకర్ణింపు. మని
     మఱియు ని ట్లనియె.90
క. మునివృత్తి౼గాష్ఠతాపసి
     యన జీవన్ముక్తుఁ డనఁగఁ న ట్లిరుదెఱఁగై
     చను; నందుఁ గ్రియ లసారము
     లని విడుచు జితేంద్రియత్వ మది ప్రథమ మగున్.91
క. యుక్తాయుక్తము లెఱిఁగి వి
     రక్తుం డయి సంవివేకరతుఁ డయ్యును లో
     కోక్తిఁ జరించిన జీవ
     న్ముక్తుం డగు నది ద్వితీయమునివృత్తి యగున్.92
వ. అట్లు గావున.93
గీ. శాంతు లగువీర లిరువురు సములు, వీరి
     చిత్తనిశ్చయరూపాత్మసత్త యైన
     భావ మది మౌన మని చెప్పఁబడుఁ గుమార
     యదియు మూఁడువిధంబు లై యమరు నందు.94
వ. అది యె ట్లనిన95
గీ. మాటలాడ యునికి వాఙ్మౌన, మింద్రి
     యములఁ గుదియించుబలిమియె యక్షమౌన,
     మన్నిచేష్టలు నడఁగించియున్న యునికి
     కాష్ఠమౌనంబు నాఁబడుఁ, గమలనయన.96
వ. ఇట్లు చెప్పంబడు చిత్తవిభ్రమహరణం బగు మౌనత్రయంబునకు
     గాష్ఠతాపసుండు ముఖ్యుం డట్లు కావున.97

సీ. అవిభాగయును, ననాయాసయు, నాద్యంత
                    శూన్యయు, నైనసుషుప్తి సత్త.
     ధ్యానచిత్తులకు నధ్యానమానసులకు
                    మౌనసంగతిమై సమంబు దలఁప,
     నానాత్వవిభ్రమం బైనయీజగ మెల్ల
                    నస్థిరం బని నిర్ణయముగ నెఱిఁగి,
     సందేశరహితచిత్సద్భావ మది యౌర
                    కౢప్తమైనట్టి సుషుప్తి యండ్రు,
గీ. ఏకమయ్యు దా ననేకసంవిద్రూప
     మై వెలుంగు జిత్స్వభావ మదియ
     యనిన యట్టియెఱుక యత్యంత మగునేని,
     మహిత మగుసుషుప్తి మౌన మండ్రు.98
క. విను సమ్యగ్ జ్ఞానస్థితి
     నొనరించి సమాధిఁ జేసి యుత్తమసంవి
     ద్ఘను లగువారల నెందును
     ననుపమవిజ్ఞానయోగు లండ్రు, కుమారా.99
క. సమమతిఁ బ్రాణమనోయో
     గము నందఁగ శాశ్వతమును ఘనతరము ననా
     ద్యము నగు చిత్పద మొందెడు
     నమృతాత్ములె యోగయోగ్యు లండ్రు మునీంద్రుల్.100
వ. ఇ ట్లిరుదెఱంగులవారికి నకృత్రిమం బగుసంవిత్తత్త్వం బెట్టిదనిన. వాస
     నావాగురాక్రాంతం బగుమనఃప్రాణవర్తనంబు లెచ్చోట నణంగు
     నదియ పరమపదం బనంబడు. సంసారస్వప్నవిభ్రాంతులయందు బేతా
     ళవాక్యంబులైన శుభప్రశ్నంబులు గల వవి యెఱింగించెద నాకర్ణిం
     పు; మని వసిష్టుం డి ట్లనియె.101

బేతాళోపాఖ్యానము

మ. వెలయు గర్కటిభంగి నాత్మవిదుఁ డౌ బేతాళుఁ డొక్కండు రే
     యిల వర్తించుచు నొక్కపట్టణములో నేకాకి యై వచ్చు భూ
     తలనాథుం గని వెంటఁబట్టి ౼ నరనాథా మాకు నాహార మీ
     స్థలి నీవాత్మవిదుండ వేనిఁ జెపుమా సాధించి మాప్రశ్నముల్.102
సీ. పరఁగ నేరవిరశ్మిఁబరమాణువులు నజాం
                    డంబు లౌ, నేమారుతంబు వీవ
     నెగయుచు నమ్మహాగగనరేణువు లుండుఁ,
                    బలుమాఱుఁ గలలను గలఁకుఁ జనుచు
     నమలతేజోమయం బగునాత్మరూపంబు
                    విడుచుచు నుండియు విడువఁ డెవ్వఁ,
     డరఁటి యేకం బయ్యు నాకులుఁ బొరలు నై
                    నట్టిచందమున నేయణువు లమరు,
గీ. నణువిధం బగు నేపరమాణువునకు
     నణువు లగు మేరుగగనాబ్జజాండసమితి
     యవయవము లేని యేపరమాణుశిఖరి
     శిలలలోపలిమజ్జ యీసృష్టి యయ్యె?103
క. ఇత్తెఱం గగు నాప్రశ్నల
     కుత్తరములు వేగ చెప్ప నోపవ యేనిన్,
     దుత్తునుకలుగా నాచే
     కత్తిని మెడఁ గోసి నీదుకండలఁ దిందున్.104
క. అని జంకించుచుఁ బ్రశ్నలు
     దను నడిగిన, భూవిభుండు దంతమరీచుల్
     వినువీథి నిగుడ, నాతని
     గనుఁగొని యి ట్లనియె మృదులగంభీరోక్తిన్.105

సీ. అతనుసంవిత్సూర్యుఁ డఖిలంబు నెఱిఁగించు
                    పరమభాస్వరచిత్ప్రభామయుండు,
     త్రసరేణువులు జగత్రయములు, తత్కాంతి
                    విజ్ఞానరకవిచేత వెలుఁగు నెపుడు,
     గాలసత్తయును, నాకారసత్తయుఁ, బరి
                    స్పందసత్తయుఁ, జిదానందశుద్ధ
     చైతన్యసత్తయు, సర్వంబుఁ బరమాత్మ
                    మాయారజం; బకంపమునఁ బొరలు
గీ. జగము లనియెడి నీమహాస్వప్నమునను
     బహుతరస్వప్నములు గాంచు; బ్రహ్మ మదియ,
     శాంతిసంపన్న మైన నిజస్వరూప
     మెన్నడును విడువఁగలే దహీనచరిత.106
క. అరఁటియుఁ బత్త్రంబులచేఁ,
     బొరలైన ట్లంతరములఁ బొందుచుఁ బ్రహ్మ
     స్ఫురణవివృత్తముఁ బరపును
     బొరలును నై విశ్వ మగుఁ బ్రబోధనిధానా.107
క. తగ సూక్ష్మంబు నలభ్యము
     నగుటఁ బరబ్రహ్మరూప మణు వగు నది దా
     నగణితశక్తి ననంతం
     బగుటను గనకాచలాదు లై పొలు పొందున్.108
గీ. దీని పరమాణువులు మేరుదినకరాదు
     లవి యసఖ్యంబు లగు, బరమాణు వదియ
     సర్వపూరక మగుమహాశైల మయ్యె,
     జ్ఞప్తిమయ ముగుదీనిమజ్జయ జగంబు.109
వ. అనఘా విజ్ఞానమాత్రంబ యిీజగత్రయం. బని మహీపాలుండు చెప్పిన

     నిజప్రశ్నోత్తరంబులు విని సంతుష్టాంతరంగుఁ డై బేతాళుం డతని
     విడిచి భావితాత్ముండును, నవిచారవంతుండును, విగతక్షుత్పిపాసుండు
     ను, నై యొక్కయేకాంతప్రదేశంబున నిరంతరధ్యానపరుండై సుఖం
     బుండె. నని బేతాళోపాఖ్యానంబు సెప్పి వసిష్ఠుం డింక దుర్లభంబగు
     బుద్ధివిశ్రమం బాత్మప్రయత్నంబున సులభం బగు. నీయర్థంబున
     భగీరథోపాఖ్యానంబు గల దాకర్ణింపు మని యి ట్లనియె.

110

భగీరథోపాఖ్యానము

సీ. రాజేంద్రుఁ డగుభగీరథుఁడు ప్రాణులయార్తి
                    నరసి నిర్విణ్ణుఁ డై యాత్మఁ దలఁచి,
     తిరిగివచ్చుచు నుండు దినములు రాత్రులు,
                    నాదానదానంబు లణఁగ వెందు,
     నిస్సారకృత్యంబు నిత్య మై జరిగెడు,
                    నెద్ది ప్రాపింపంగ నెల్లక్రియలు
     జెడిపోవు నా చేతఁ జిక్కిన దం దెల్ల
                    నత్యంతదుర్వ్యాప్తి; యని విరక్త
గీ. చిత్తుఁ డై త్రితలుని గురు, జేరి మ్రొక్కి,
     యయ్య యీదుఃఖముల కెప్పు డవధి యనుడుఁ;
     దనదు చిన్మాత్ర యగు పరమాత్మ యెప్పు
     డెఱుగఁబడు నప్పు డీయార్తి దొఱఁగు, ననిన.111
క. విని నరపతి చిన్మాత్రము
     ననుపమమును నచ్యుతంబు నని యెఱుగుదు, నా
     త్మను, నందు నాకుఁ జిత్తం
     బనఘా యెబ్భంగి నిల్చు నని యడుగుటయున్.112
వ. అనిన విని త్రితలుం డి ట్లనియె.113

క. భీషణసంసారరుజా
     భేషజమును రాగశైలభిదురము దళిత
     ద్వేషము నైన యహంకృతి
     శోషణ నాత్మోపలబ్ధి చొప్పడు ననుడున్.114
క. గిరియందుఁ దరువు పొదలిన
     వరుసన కాయంబునందుఁ బ్రభవించె నహం
     కరణ; మది యెట్లు చెడు? నని
     ధరణీశ్వరుఁ డడుగ, గురుఁ డతని కి ట్లనియెన్.115
మ. సకలంబుం బెడఁబాసి శాంతత విశేషంబుల్ విసర్జించి పా
     యక నిర్భీకత యీషణత్రయమనోహంకారశత్రుండ వై,
     యకలంకాత్ముఁడ వై, యకించనత భిక్షాహారి వై, యెందుఁ జే
     రక వర్తించిన నున్నతోన్నతపదప్రాప్తుఁడ వౌ దెల్లెడన్.116
క. అని త్రితలుఁడు బోధించిన
     జననాథుఁడు సన్న్యసించి జగమున భిక్షా
     శనుఁ డై ధీవిశ్రాంతిం
     గనుఁగొని క్రుమ్మఱుచుఁ గొంతకాలంబునకున్.117
గీ. మార్గవశమునఁ జేసి క్రమ్మఱఁగఁ దనదు
     పురికి నేతేర నెఱిఁగి యప్పురమువారు
     పిలిచి యిండ్లకుఁ గొనిపోయి భిక్షసేయ
     నచట భూపతి చనుదెంచి యర్థి మ్రొక్కి.118
క. ఈరాజ్య మేలుకొమ్మని
     యారాజు ప్రియంబు సెప్ప నచ్చట నుండన్,
     దా రోసి వెడలి క్రమ్మఱి
     ధారుణిఁ గ్రుమ్మఱుచుఁ గనియెఁ దనగురు నొకచోన్.119
వ. కనుఁగొని వినయావనతుం డై తనకు చిత్తవిశ్రాంతి యగుట విన్న

     వించె, నంతఁ గొంతకాలంబునకు నిజపురవిభుఁడు మృతుండైనం, బౌరు
     లు రాజర్షి యైన భగీరథుకడకుం జనుదెంచి ప్రార్థించినఁ గ్రమ్మఱం
     జని రాజ్యాభిషిక్తుం డై సప్తసముద్రముద్రితం బగుధరావలయంబు
     పాలించుచు సర్వసముండును, శమయుక్తుండును, వీతమత్సరుండును,
     బ్రాపకార్యకర్తయు, గృతనిశ్చయుండును, జీవన్ముక్తుండు నై యుండె,
     నని భగీరథోపాఖ్యానం బెఱింగించి వసిష్ఠుండు ప్రతిబంధంబులు వా
     యక యాత్మజ్ఞానంబు దుర్లభం బగు నీయర్థంబున శిఖిధ్వజోపా
     ఖ్యానం బెఱింగించెద నాకర్ణింపు. మని రామచంద్రున కి ట్లనియె.120

శిఖిధ్వజోపాఖ్యానము

సీ. అనఘ చూడాలాఖ్యయును శిఖిధ్వజుఁడును
                    నను దంపతులు రాజ్య మనుభవించి,
     వార్ధకంబున ముక్తవాంఛమై యధ్యాత్మ
                    శాస్త్రముల్ విన గురుశరణ మొంది,
     రందు చూడాల ము న్నాత్మప్రబోధకై
                    నిర్మలబుద్ధిఁ జింతించె నిట్లు;౼
     ఆత్మ యెయ్యది? కాయయష్టిచోదితలోష్ట
                    మట్లు హృత్ప్రేరిత మైనతనువు
గీ. నింద్రియగణంబు నేఁ గాను. హృదయ మనిన
     దరములిడి రాయివొరలించుకరణి బుద్ధి
     నిశ్చయంబునఁ బొడవడి నిగుడుఁగాన,
     నదియు నేఁ గాను నే నందు నేని.121
క. అని నిశ్చయాత్మ గావున
     నది జడ మేఁ గాను నిశ్చయము నిస్సారో
     ద్యదహంకృతిజన్మం బగు
     నదియును నేఁ గాను మఱి యహంకృతి యన్నన్.122

గీ. అదియు బాలుని భూతంబు గుదుచుభంగి
     భ్రమిత మగుచున్న జీవంబుఁ బట్టు జడతఁ,
     గావున నదియు నేగాఁను, జీవ మనినఁ
     బ్రాణమయమై కలంకువఁబడుమనంబు.123
వ. ఇట్టి సుకుమార మగుజీవం బన వేఱె యొకటి యుండంబోలు. నోహో
     యెఱింగితిం గదే! ఆది జగదుదయైకకలంకమును, స్వస్వరూపంబు నగు
     చిద్రూపంబుచేతన బ్రతుకుచున్నయది.124
క. అక్కట సంవిద్రూపం
     బిక్కపటజ్ఞేయకలన నెనసినజడతం
     జిక్కినది యిట్టు, లనలము
     పెక్కుదకముఁ బొంది రూపుఁ బెడఁబాయుగతిన్.125
సీ. అట్టి చిన్మయముఁ జైత్యము గూడి జడము శూ
                    న్యమును జైతన్యబోధ్యంబు నయ్యె,
     నింతకాలమునకు నెఱిఁగితి నిబ్భంగి
                    సకలంబు చిద్విలాసంబు దలఁప,
     నమలత సమత నహంకారరహిత మై
                    యుండు చిత్సత్తయ యెండు లేదు,
     శూన్యమై యుండెడు శుద్ధసత్తయె బ్రహ్మ
                    మచ్యుతంబు శివంబు నై వెలుంగు,
గీ. నను వివేకంబు నెమ్మది నభ్యసింప,
     నాత్మబోధ మఖండ మై యాత్మఁ బొడమ,
     నవ్వధూమణి పొల్చెఁ బెం పగ్గలించి
     లాలితం బైన నవపుష్పలతయుఁ బోలె.126
ఉ. ఆరమణీలలామ నవయౌవనసంపద నివ్వటిల్ల శృం
     గారరసంపుబొమ్మ యనఁగా నలిచన్నులుఁ జిన్నిమోము నూ

     గారుఁ గృశోదరంబు నల కావలియుం బొలుపొందఁగా దర
     స్మేరకటాక్షము ల్వొలయఁ జెచ్చెర వచ్చె నిజేశుపాలికిన్.137
క. వచ్చినభామినిఁ గనుఁగొని
     యచ్చెరువడి యానృపాలుఁ డంబుజనయనా,
     యిచ్చెలువ మైనయౌవన
     మెచ్చట నీ కబ్బె? ననిన నింతియుఁ బలికెన్.138
సీ. విను మేను విడుచుట వెండి పుట్టుట లేదు;
                    జననాథ, యిది సహజంబు దలఁప;
     నీసర్వమును బాసి యాసర్వమును సత్య
                    మును నైనయొక్కటి ముట్టఁగంటి;
     నాకాశసంకాశ మై కేవలం బైన
                    మనములో నశ్రాంతమును రమింతు,
     లే దుదయంబును, లేదు నాశనమును,
                    లేనిదియును లేదు, లేదు కలది,
గీ. అననుభూతియ యనుభూత మని సుఖింతు;
     దోషమును రోషమును మది దోఁప దెపుడు;
     జగ దఖండప్రభుత్వంబు సంభవించె,
     నాత్మ కిది రూప మి దరూప మనఁగ లేదు.129
క. గతరాగద్వేషంబుల
     నతిసూక్ష్మపు శాస్త్రదృష్టి యనుచెలికత్తెల్,
     సతతము గొలువఁగ, మది శ్రీ
     మతి నై సుఖ మున్నదాన మనుజవరేణ్యా.130
చ. మును నయనంబులుం గరణముల్ మతియుం గనువాని నెమ్మెయిన్
     గనుఁగొన, వీనితోడ వెలిగానివియుం బొడగాన; నాత్మ నెం
     దును నిది యిట్టిభావ మని తోఁపదు; సుస్థిర నైతి దీన౼నే

     ననవుడు సాధ్వివాక్యముల కర్థ మెఱుంగక యానృపాలుఁడున్.131
వ. వనితా పడుచుఁదనంబున నసంగతంబు లాడెద వని లేచి చనుటయుఁ
     జూడాల యాత్మగతంబున.132
గీ. ఇతనికర్మబంధ మందాకఁ బొలియదో?
     యుడుగ కేను నిచట నుండ నేల?
     ముక్త నైతి, యోగమున నభోగమనాదు
     లాచరింతుఁ గాక, యని తలంచి.133
చ. సతియు సమాధియుక్త యయి సంవిదుపాయము తండ్రి నిచ్చలున్
     సుతునకుఁ దెల్పుభంగి మృదుసూక్తులఁ దెల్పుచు నున్ననైనఁ ద
     త్పతి తెలియంగలేఁడు పసిబాలుఁడు విద్య లెఱుంగలేని యీ
     గతి నొకకొన్నియేండ్లకును గాంచి యెఱుంగక వేఁడ నాసతిన్.134
వ. ఇవ్విధంబునఁ జిత్తవిశ్రాంతిరహితుండై న యాశిఖిధ్వజునకుఁ జూడాల
     తన యోగసిద్ధులు నిచ్చలు శూద్రునకు యాగక్రియ లెఱింగించినట్టు
     లెఱింగించుచు నుండె. నని శిఖిధ్వజోపాఖ్యానంబు సెప్పి, వసిష్ఠుండు
     గురూపదేశంబున విజ్ఞానహేతు వగునని యీయర్థంబున కిరాటో
     పాఖ్యానంబు గల దాకర్ణింపు. మనిన విని రామచంద్రుం డమ్ముని
     చంద్రున కి ట్లనియె.135
గీ. యోగివర్య సిద్ధయోగిని యైన చూ
     డాల దెలుపఁ దెలియఁ జాలఁ డయ్యె
     నకట యార్తుఁ డైన యాశిఖిధ్వజుఁడును,
     నెవ్వ రింక దీని నెఱుగఁగలరు.136
చ. అనిన మునీశ్వరుండు ౼ మనుజాధిప యెందు గురూపదేశ మి
     ట్లన యొకత్రోవ చూపు, మఱి యావల శిష్యుని సిద్ధబుద్ధి దాఁ
     గనుఁగొను నన్న ౼ రాముఁడు జగంబున నిట్టిగురూపదేశ మే
     యనువున నాత్మబోధకు నుపాయ మగున్ బుధవర్య సెప్పవే.137

కిరాటోపాఖ్యానము

సీ. అనిన వసిష్ణుండు విను రామ వింధ్యాద్రిఁ
                    గలఁడు కిరాటుఁ డొక్కరుఁడు భార్య
     యును దాను నార్తుఁ డై మునివోలెఁ దిరుగుచు
                    నొక్కజాంగలభూమి నొక్కగవ్వ
     కసవుమాటున నున్నఁ గనుఁగొని కృపణుఁ డై
                    గదియంగఁ జని యది గానలేక
     యచ్చోటఁ గసవుగాం డ్రంతయుఁ బుచ్చి య
                    త్నంబున దివసత్రయంబు వెదక
గీ. నంత పూర్ణేందుమండలం బనఁగ వెలుగు
     నమరమణి యబ్బె నతనికి; నట్లు గవ్వ
     వెదక మణి యబ్బినట్లు కోవిదగురూప
     దేశగతి నాత్మబోధంబుఁ దెలియఁ బొందు.138
వ. ఒకటి వెదుక నొకటి కానంబడుఁ. గావున గురూపదేశంబు తత్త్వజ్ఞానం
     బునకుఁ గారణం బగు నని కిరాటోపాఖ్యానంబు సెప్పి, వసిష్ఠుండు సం
     శయగ్రస్తచిత్తునియందు విజ్ఞానంబు నిలువనేర: దీయర్థఁబున చింతా
     మణ్యుపాఖ్యానంబు గల దాకర్ణింపు మని రామచంద్రున కి ట్లనియె.139
ఉ. అంత శిఖిధ్వజుండు మది నాత్మవివేక మెఱుంగలేక య
     త్యంతతమోనిమగ్నుఁ డగునట్లు విమోహితుఁ డౌచు దుఖిత
     స్వాంతముతోడ భోగములు సత్యము గా వని చాలరోసి దే
     శాంతర మేఁగి తీర్థముల నాడుచు గృచ్ఛ్రము లాచరించుచున్.140
గీ. ఎందునను జిత్తవిశ్రాంతి నొంద లేక
     యార్తుఁడై రాజ్య మిది విష మని తలంచి
     ప్రజల బాలింపఁ జూడాలఁ బనిచి యడవి
     నుగ్రతప మాచరించుచు నుండె నంత.141

క. ఆదేవి దివ్యదృష్టి మ
     నోదయితునికర్మబంధనోదన మిఁక న
     ష్టాదశనమలకు నగు నని
     మోదిలె; నట నతనిచిత్తమున శమ మొందన్.142
వ. ఇవ్విధం బంతయుఁ దన దివ్యజ్ఞానంబునఁ దెలిసి, చూడాల యొక్క
     బ్రహ్మచారి యై నిజేశుముందట నిలిచిన నమ్మహీపాలుండు.143
చ. కలయఁ బసిండి లేపమునఁ గట్టినరూపముఁ బోలి, మేనిపై
     దెలు పగుజన్నిదంబు నునుఁదెల్లనిగోఁచియు నుత్తరీయమున్
     వెలిఁగెడుతారహారమును వేలిమిబొట్టును నూర్ధ్వపుండ్రమున్
     బొలుపుగఁ, బాదముల్ ధరను మోపక వచ్చిన విప్రనందనున్.144
క. కని పూజించిన, నాతఁడుఁ
     దన నేమం బడుగ, భక్తిఁ దత్పతి మీ ద
     ర్శనమున ధన్యుఁడ నయ్యెద
     ననఘా నీ వెవ్వ రనిన, నవ్వటు వనియెన్.145
వ. ఏను నారదపుత్త్రుండ నన, నన్నరపతి యమ్మహాముని కెట్లు పుత్త్రుండ
     వై తెఱింగింపవే యన, నక్కుమారుం డి ట్లనియె.146
ఉ. నారదుఁ డొక్కనాఁడు మును నాకనదిన్ విహరించుచో మరు
     న్నారులు నీటులో వివససంబులతో రమియింప వారి యా
     కారము లెల్లఁ జూచి ముని గ్రక్కున సంస్ఖలనంబు నొందినన్
     గోరి యమోఘవీర్య మొకకుంభమునం దిడ నందుఁ బుట్టితిన్.147
వ. కుంభుం డనువాఁడ నా తెఱం గెఱింగించితి. నీ వెవ్వండ! వీపర్వతంబున
     నేల యున్నాఁడ? వనిన, నవ్వటువున కమ్మహీపతి యి ట్లనియె.148
మ. విను విప్రోత్తమ యే శిఖిధ్వజుఁడఁ బృథ్వీపాలుఁడన్, భూమిపా
     లన వర్జించి పునర్భవైకభయడోలాలోలచిత్తుండనై

     వనవాసంబునఁ గ్రుస్సి తాపసుఁడ నై వర్తించుచున్నాఁడ; నిం
     దును నేమందు సుధారసంబు విషమై దుఃఖంబు రెట్టించెడున్.149
ఉ. నా నతఁ డిట్లనెన్ ధరణినాథ సులబ్ధి గురూపదేశవి
     జ్ఞానమ, నిత్యకర్మములు నా మదిఁ గాలముఁ బుచ్చుకంటె; న
     జ్ఞానులు వాసనారతి ఘనం బగుతత్క్రియలన్ ఫలేచ్ఛమై
     నూని యొనర్తు, రీవు నటు లుండుట యజ్ఞత గాదె చూడఁగన్.150
క. ఏ నెవ్వఁడ! నె ట్లీ సు
     జ్ఞానం బగు? నెట్లు చిత్తశమ మగు? నని య
     జ్ఞానత నేల నలందుర
     భూనుత! యన, నతఁడు విప్రపుత్త్రునితోడన్.151
క. గురుఁడును దండ్రియుఁ బంధుఁడు
     బరమాప్తుఁడ వీవ, శిష్యభావన నన్నుం
     గరుణింప నీకు మ్రొక్కెద
     ధరణీసురవర్య; యనుడుఁ దత్పతి కనియెన్.152
తరల. గురుఁడు చెప్పినభంగిఁ బుత్త్రుఁడు కోరి చేసినచాడ్పునన్
     ధరణినాయక చెప్పెదన్ విను తథ్య మైన మదుక్తులన్
     అరయ నద్భుత మైనయీయితిహాస మిట్లు ప్రసక్త మై
     యరుగుదెంచెను దీనిఁ జెప్పెద నాత్మబోధము సెప్పెడున్.153

చింతామణ్యుపాఖ్యానము

వ. అది యె ట్లంటేని.154
సీ. సర్వగుణాఢ్యుండు శాస్త్రియు నయ్యును
                    తజ్ జ్ఞుండు నగునొక్క ధన్యపురుషుఁ
     డవనివారి కసాధ్య మై చింతామణిఁ
                    బడయంగఁ గోరి తపంబు సేయ,

     నామణి ప్రత్యక్ష మై చేతి కబ్బినఁ
                    గని యాత్మసంశయమున నతండు
     నిమ్మణి యిటువేగ యిది యెట్లు వొందెడు
                    నని యూరకుండిన నదియు మఱలె,
గీ. నతఁడు మఱియును బహుతపం బాచరింపఁ
     గన్నులకుఁ దోఁచె నొక మంచి గాజుపూస,
     యిదియ సురరత్న మని యిచ్చ నెంచి దీన
     నఖిలసుఖములఁ బొందెద నని తలంచె.155
వ. అట్ల నీవు సర్వశాస్త్రకోవిదుడవు గావున తత్త్వజ్ఞానివై యకృత్రి
     మం బగు సర్వకర్మపరిత్యాగంబు చింతామణిగా నెఱుంగుము. సక
     లదుఃఖంబుల నణంచెడు నని రాజ్యపరిత్యాగంబు సేసి పురంబు విడిచి
     దూరం బగు మాయాశ్రమంబునకు వచ్చినాఁడవు. తత్త్యాగంబు పరి
     పూర్ణంబు గాఁ జేయవేని యాకాశంబు నంబుదంబు లాశ్రయించు
     భంగిని సంకల్పవికల్పంబులు నిన్నుం బొదువఁగలయవి.156
మ. ఇవి యె ట్లెక్కడ దుష్కరంబ యను ని ట్లీచింతల న్నిచ్చలున్
     మదిఁ దాత్పర్యము లేమి సంశయము సంపన్నం బగున్; దాన నొం
     దదు సంకల్పవివర్జనంబు, పరమానందోదయం బంద, దా
     యది లేకుండిన గాజు రత్న మని డాయం బోవున ట్లౌ జుమీ.157
వ. అమితం బగు నానందంబు విడిచి దుఃఖసాధనంబు లగుమిథ్యావస్తువుల
     యందు వేడ్క సేయునట్టి జనుండు హాస్యాస్పదుం డగు. నీవును
     చింతామణిం బొందెదఁ గా కని తలంచి యొక్కస్ఫటికోపలంబునుం
     బొందితివి. అని కుంభుండు శిఖిధ్వజునకుఁ జింతామణ్యుపాఖ్యానం
     బెఱిఁగించి; చిత్తత్యాగాత్మకం బైన సకలత్యాగంబుకంటెఁ బురుషార్థ
     సమాప్తి వేఱొక్కటి లేదు; ఈ యర్ధంబున గజవృత్తాంతంబు సెప్పెద,
     నాకర్ణింపు; మని యి ట్లనియె.158

గజోపాఖ్యానము

.

సీ. కలదు వింధ్యాటవి గజరాజ మొక్కటి
                    తత వజ్రసన్నిభ దంతశోభి,
     హస్తిపుఁ డొక్కఁ డాహస్తి నేర్పునఁ బట్టి
                    గొలుసున నొకతాటఁ గుదియఁ గట్టి,
     మ్రా నెక్కె; నంత నాయేనుఁగు కొమ్ముల
                    సంకెలఁ ద్రెంచుచో సరభసమున
     నామ్రాని విఱుచునో యని వాఁడు దానిపై
                    కుఱికెద నని తప్పి యుర్విఁ బడిన,
గీ. వానిఁ గనుఁగొని కరుణ నవ్వారణేంద్ర
     మిట్లు పడియున్న వాని నిం కేల చంప
     ననుచు మన్నించి తనభూమి కరిగె, నడవి
     జంతువులయందుఁ బుణ్యవాసనలు గలవు.159
ఉ. ఆతఁడు వెంబడించికొని యాకరి చొప్పున నేఁగియేఁగి తా
     నాతతగుల్మమధ్యమున నారసి గల్గొని దానిఁబట్ట నా
     ఖాతము ద్రవ్వి నాకలము గప్పినఁ, గానక కుంభి దామద
     స్యూతత నందుఁ గూలెఁ గులిశోద్ధతిఁ గూలినకొండకైవడిన్.160
గీ. ఇవ్విధంబున లోఁబడి యిభముఱేఁడు
     కట్టువడియును పోని దుఃఖమున నుండె;
     నట్లెగా ధర లోఁబడ్డయపుడె పగఱఁ
     దునుమఁ డేనియు మీఁదట దుఃఖ మొందు.161
క. అని చెప్పి కుంభుండు నీకు గజదృష్టాంతకథాభిప్రాయం బెఱుంగం
     బోల దెఱింగించెద. దీనం బ్రబుద్ధుండవై సర్వత్యాగపరుండవు గమ్మని
     యి ట్లనియె.162

సీ. అనఘ వింధ్యము ధర, యాగజం బీవు, వై
                    రాగ్యవివేకముల్ రదనయుగము,
     హస్తిపుం డనఁగ నీయజ్ఞత, రాగశృం
                    ఖలమునఁ గట్టినకాలు మనసు,
     ఆగొలు సూడ్చుట భోగేచ్ఛ విడుచుట,
                    తాటిపై నుండి తా ధరణిఁ బడుట
     పరగ రాజ్యము నీవు పాసిరాఁ దలఁకున
                    జ్ఞానంబు, దయ వానిఁ జంపకుంట
గీ. ఫలసమాసక్తితోఁ జేయఁబడినక్రియలు
     దాన క్రమ్మఱ లేచి యజ్ఞాన మట్లు
     వారకయ వచ్చి నీవెంట పడిఁ బ్రపంచ
     ఖాతమునఁ ద్రోచె నినుఁ బట్టి భూతలేంద్ర.163
క. నీ వారాజ్యము విడిచిన
     దా విడువక వెంటఁ దగిలి తఱి దప్పక ని
     న్నావిధినిఁ ద్రోచె లోఁబడఁ
     దా వడి నినుఁ గట్టి మోహతమ మచలాత్మా.164
క. ఆ మదకరిపరివారము
     నీమానసవైభవంబు, నెఱి నోదముపై
     వేమఱు గప్పిన తీఁగెలు
     భూమీశ్వర వినుము నీ తపోదుఃఖంబుల్.165
వ. అని గజోపాఖ్యానంబు కుంభుండు శిఖిధ్వజునకుఁ జెప్పె. నని వసిష్ఠుం
     డు రామచంద్రున కెఱిఁగించె. నిబిడంబైన గురూపదిష్టజ్ఞానంబున
     సర్వత్యాగంబు గలుగు. అట్లు శిఖిధ్వజుండు కుంభుండు చెప్పిన వాక్యం
     బులు విని సంతుష్టాంతరంగుం డై యతనితో ని ట్లనియె.166
మ. పుడమిన్ రాజ్యము మందిరంబులు మహాభోగంబులున్ మాని యీ
     యడవిన్ దాపసి నైతి, విప్ర, సకలత్యాగంబు లిం కెట్లు? నా;

     వడు గోహో నరనాథ యిట్టిదియు సర్వత్యాగమే! దీనిపై
     నుడివోకున్నది నీకు రాగ, మెదలో నూహింపు, మేలయ్యెడిన్.167
వ. అనిన నాశ్రమోపకరణం బైన యతనిశరీరంబునందు సద్యోజాతం
     బగుసర్వత్యాగం బుదయింప జేయ వెండియుఁ దపశ్చరణంబు సేయు
     చున్న యవ్విభున కి ట్లనియె.168
క. ఈగతిఁ బేర్చిన నఖిల
     త్యాగము నీ కబ్బ దెందు నవనీశ, తనూ
     వాగురయు జన్మమరణో
     ద్యోగకరం బైనమనసుఁ దునుమక యున్నన్.169
గీ. బంధము జగంబు, చిత్తంబు పరఁగ దాని
     నణఁప నేర్చిన నది మహాత్యాగ, మనిన;
     చిత్త మేరూపముది? దానిఁ జెఱుచు టెట్టు?
     లాన తిమ్మన నావిప్రుఁ డతని కనియె.170
సీ. ఆల వేదనాత్మ కాహంకృతి చిత్రభూ
                    జమునకు రూపబీజంబు; దీన
     నిగిడిన యనుభూతి చిగురు; తద్వృత్తిని
                    రాకరణయు నిశ్చయాత్మికయును,
     సంకల్పమూర్తి నాఁ జనునట్టిబుద్ధియ;
                    దానిభేదంబు చిత్తంబు మనము
     చేతనంబును; నిట్టి చిత్తవృక్షంబు నా
                    మూలశాఖలతోడఁ గూలఁద్రోయు,
గీ. మనుడుఁ; జిత్తమునకు నహమిక వి త్తంటి
     విది దహించు నగ్ని యెద్ది? యనుడు;
     నేను నాఁగ నిందు నెవ్వండ నను విచా
     రంబు దాని కింగలంబు సుమ్ము.171

వ. అనిన మహీపతి యి ట్లనియె.172
క. ఔనౌఁ దెలిసితి, మేనుం
     గా? నింద్రియగణము నహమికాచిత్త మనో
     ధీనిచయము జడము లవియుఁ
     గా; ననవుడుఁ గుంభుఁ డతనిఁ గనుఁగొని పల్కెన్.173
గీ. ఇవి జడంబు లగుట నిన్నియు నేఁ గాన
     టంటి, మఱియు నెవ్వఁ డగుదు వనిన?
     సకలభావములను జని మృతి లేదను
     నట్టి చిన్మయాత్మ నగుదు నేను.174
ఉ. ఇట్టిది యైననన్నుఁ గుదియించె నహంకృతి చిత్తబీజమై
     యెట్టి తపంబున న్విడువ, దేను నశక్తుఁడ నైతి, నావుడున్;
     గట్టిగఁ గారణంబునన కార్యము పుట్టు, న టన్న దీనికిన్
     గట్టడిరోషవేదనమ కారణ? మట్టిది మానిపింపవే.175
క చిత్తమ చిత్తోన్ముఖమై
     యిత్తెఱఁ గహమిక ఘటించె నిటుసేయంగా;
     నత్తపసి మఱియుఁ జెప్పుమ
     యెత్తెడువేదనకు హేతు వెయ్యది; యనుడున్.176
వ. అన్నరపతి యి ట్లనియె.177
సీ. అనిలుచే ఘనకంప మడరునట్టుల సత్య
                    తత్త్వమాత్రమున వేదనలు వొడముఁ,
     దతవేదనలను జిత్తమునకు వి త్తైన
                    యహమిక వేదన యయ్యె. ననుడు;
     మునిచంద్రుఁ౼డక్కార్యమునకుఁ గారణ మెందు
                    లేదు, గార్యంబును లేదు, భ్రమము

     భ్రాంతిన తోఁచు, బ్రపంచంబు రజ్జుస
                    ర్పన్యాయమున నకారణమ౼యనిన,
గీ. నధిపుఁ డీసృష్టి మును చేసి నట్లు వేధ,
     యతఁడు కారణ మేల కాఁ డనిన, విప్రుఁ౼
     డనఘ మును శాంత మైన బ్రహ్మము తదీయ
     కలనఁ మది దాన యజునకు, గారణంబు.178
వ. అనిన విని శిఖిధ్వజుండు.౼అయ్యా! కారణంబు లేక బ్రహ్మ యె ట్లుదయిం
     చెం జెప్పవే? యని యడిగిన,కుంభుం డతని కి ట్లనియె. అనంతం, బక్షతం
     బు, శాంతం, బప్రతర్క్యం, బవిజ్ఞేయంబు, శివంబు, శుద్ధంబు, నై యెద్ది
     వెలుంగు, దానివలనఁ బద్మభవుండు దాన తానయై యుదయించెఁ.
     దన్మాత్రజనితంబును, దదాత్మకంబును; నై సృష్టి వెలుంగు, నట్లు
     గావున, కార్యకారణంబు లెవ్వియు నొండు లేవు; నాకుం గర్తృత్వ
     భోక్తృత్వంబులు లేవు; తత్పరబ్రహ్మంబు సకలంబు నని నిశ్చయించి
     యజ్ఞానంబు శాంతిం బొందింపుము. దానిచేఁ జైత్యంబు నాశం బగు
     నని సెప్పంబడు నెట్లనిన.179
క. స్థానచ్యుత మగునట్టిది
     నానాటికి నాశ మొందు నరవర మఱి తా
     దానన మ్రందిన నదియును
     దా నొచవక చెడెడి నెందు దప్పదు సుమ్మీ.180
మత్తకోకిల. ఆదిదేవుఁడు తాఁ జిదాత్మకుఁ డౌట నాత్మఁ దనంతఁ దా
     మేదినీసలిలాదు లైన యమేయశక్తిమహత్త్వసం
     పాదనాత్మత నొంది దానన పద్మజుం డన నుండు నం
     దేదియు న్మఱి లేదు బ్రహ్మమ యెంతయున్ నరనాయకా.181
చ. అనిన నృపాలుఁ డి ట్లను మహాత్మ యెఱింగితి నీ సదుక్తులన్
     బనుపడ కర్త లేమినిఁ బ్రపంచము లేమిఁ పదార్థదర్శి లే

     మిని, మఱి నేను లేనపు డమేయపదార్థవీభాగదృష్టియున్
     జనియె, ననంతశాంతరససాగర మెల్లెడ నిట్లు దొట్టెడున్.182
వ. అని యిట్లు కుంభునిచేతఁ బ్రబోధితుండై పరమజ్ఞానవంతుఁ డైన య
     మ్మహీపాలుండు మహామోహసముద్రసముత్తీర్ణుం డై మఱియును.183
క. ఆ వటు నుపదేశము మది
     భావించి, చిదాత్మసౌఖ్యపదపరిణతుఁ డై,
     భూవిభుఁడు ఱాతిరూపము
     కైవడి, చిత్తంబుఁ గన్ను గదలక యుండెన్.184
వ. ఇవ్విధంబునఁ గొంతసేపునకుఁ బ్రబుద్ధుండును, బ్రస్ఫరితనయనుండు,
     నైన యతిని జూచి, కుంభరూపిణి యైనచూడాల యి ట్లనియె.185
గీ. అమల మై పూర్ణ మై మృదు వైనపదవి
     భానుఁడును బోలె విశ్రాంతిఁ బడయఁ గంటె,
     తరలెనే భ్రాంతి? గలదె యంతఃప్రబుద్ధి?
     ధ్యేయ మెఱిఁగితె; దృశ్యంబు దెలిసె నయ్య?186
చ. అన విని నీప్రసాదమున నన్నిటిమీఁద మహావిభూతియున్
     ఘనమును నైనచిత్పదవిఁ గంటిఁ; జిదాత్మవివేకు లైన స
     జ్జనపదసంగమం బమృతసారసుఖంబు మునీంద్ర; యిట్టి దేఁ
     గనుగొనమున్ను, నీకతనఁ గంటిని నే, డిది యేమి నావుడున్.187
సీ. ఆ కుంభుఁ డను – నృప, యంతవిశ్రాంత మై
                    యింద్రియోల్లసభోగేచ్ఛ లణఁగ,
     నాచార్యహితవాక్య మంటి చిత్తంబున
                    కాలపాకమున వృక్షమునఁ బండ్లు
     రాలు కైవడి, దేహమాలిన్య మురిఁబోవుఁ,
                    దివిరెడి తద్భేదదృష్టి నుండు

     నజ్ఞాన మనునది యణగించునదియె పో
                    ప్రకటవిజ్ఞానంబు పరమపదము,
గీ. తుదిఁ బ్రబుద్ధుండ వైతి, ముక్తుండ వైతి,
     విజితచిత్తుండ వైతివి, వినుము, మౌని
     నిర్మలుండును నాకాశనిభుఁడు నగుచు
     నలరు ౼ నన విని యతని కి ట్లనియె విభుఁడు.188
వ. మునీంద్ర, ప్రబుద్ధుఁడ వై ననీవు తజ్ జ్ఞునకుఁ జిత్తంబు లే దంటివి.
     జీవన్ముక్తు లగువారు చిత్తుబుఁ బాసి యెట్లు విహరింతు? రెఱింగిం
     పవే యనిన నతం డి ట్లనియె.189
మ. పునరుత్పత్తి నిమిత్తవాసన ఘనీభూతస్థితిన్ జిత్త మై
     తనరున్; దజ్ జ్ఞునియందు లేదదియ, సత్తామాత్ర మైయుండు, నా
     తనికిన్ గర్మములన్ బునర్జనన మందం జేయ, దమ్మూఢభా
     వన చిత్తంబు, ప్రబుద్ధభావనను సత్త్వం బండ్రు, భూమీశ్వరా.190
సీ. అనగచిత్తత్త్వలయప్రబుద్ధులు నతి
                    సత్త్వయుక్తులు సర్వసములుఁ దలఁప
     స్వర్గాదిఫలద మౌ సకలక్రియలు మాని
                    శమదమాసక్తత సర్వవస్తు
     వుల నుదాసీనత గలిగి యస్పందచి
                    త్తుఁడవు గ; మ్మచలచిత్తులకుఁ దిరిగి
     రాదు సంసారంబు, నీదుఃఖతతి యెల్ల
                    బుద్ధిచంచలతన పుట్టుచుండుఁ,
గీ. గాన నెప్పుడుఁ జిత్తసంకలన లుడిగి,
     శాశ్వతైశ్వర్య మొందు ధీసార,౼యనుడు,
     నెట్లు చలనాచలత్వంబు లెడసి యుండు,
     నానతిమ్మన, పటువు దా నతని కనియె.191

మ. జల మంభోనిధి యైనమాడ్కి జగ మౌ సత్తైకచిన్మాత్ర మ
     వ్వలన బ్రహ్మమ? మూఢకోటి కిది దృగ్వైషమ్య మై తోఁచుఁ; ద
     త్కలనం దోఁచినదృష్టి, సమ్యగవలోకం బైనఁ దల్లీన మౌఁ,
     దలఁపన్ ద్రాటను బుట్టుసర్పభయ మా త్రాటన్ లయం బౌగతిన్.192
గీ. శాస్త్రచింతల సజ్జనసంగమములఁ
     జల్ల నగుఁ జిత్త మల్లనఁ జంద్రుభంగిఁ.
     గేవలాభాస మది స్వానుభావమహిమ
     దోఁచు నుల్లంబులో మహాత్ములకుఁ దాన.193
వ. అని యి ట్లుపదేశించినం బ్రీతుండై శిఖిధ్వజుండు పరమసమాధి నుండె.
     చూడాలయు నిజరూపధారిణియై తనపురంబునకుం జని రాజ్యాను
     సంధానంబు చేసి కొన్నిదివసంబులకుఁ గ్రమ్మఱి నమ్మహీపాలుకడ కే
     తెంచి సమాధినిష్ఠుం డైయున్న యతనిం గనుంగొని.194
చ. అతని సమాధి మాన్ప సతి యార్చె వనేచరు లెల్ల బెగ్గిలన్,
     మతిఁ జలియింపకుండె గిరిమాడ్కి నతండును, నింతి వెండి సం
     తతముగ నార్చి యార్చియుఁ గదల్పఁగ నోపక సత్త్వనిష్ఠ మైఁ
     బతి యొడలి న్గదల్చెడునుపాయము వేఱె తలంచె నావుడున్.195
క. విని రఘురాముఁడు శాంతిం
     గని యాత్మం దాన నిష్ఠ గలరూపుక్రియన్
     దనర మునిబుద్ధి శేషిం
     చెనె సత్త్వగుణంబ? నా వసిష్ఠుఁడు, పలికెన్.196
చ. ఎనయఁ బ్రబోధహేతు వగు నెవ్వనియుల్లము సత్త్వశేష, మా
     ఘనుఁ డచలాత్ముఁ, డాపురుషుకాయము సంతతపుష్టి గల్గి యుం
     డను, మఱి స్రుక్క దుక్కఱదు, దూలదు, దాఁ దనకే వశంబ యై
     మను నిది, యట్ల మీఁదికథ మానుగఁ జెప్పెద నీకు రాఘవా.197
వ. ఇట్లు తలంచి చూడాల యతని శరీరంబు సొచ్చి యాద్యంతరహితం
     బైన తన చేతనస్థితిం జెంది కేవలసత్త్వవంతుం డగు నిజకాంతుని

     చేతనాచలనంబు నొందించి విహంగంబు వినువీథినుండి నిజమంది
     రంబు ప్రవేశించి నట్లు క్రమ్మఱ తనశరీరంబు సొచ్చి బ్రహ్మచారి
     రూపంబున సుఖాసీన యై యుండి.198
ఉ. తారక మంద్ర మధ్యములు తానము లేర్పడఁ జంచరీకఝుం
     కారముభంగి సామములు గానము సేయఁగ, నల్ల నల్ల నా
     తారతరస్వరంబు విని తత్పతి సత్త్వగుణైకచేతనం
     బారఁ బ్రబుద్ధ మై తనరె నామనిఁ బద్మిని పొల్చుకైవడిన్.199
సీ. ఇబ్బంగి మేల్కని యెదురఁ గుంభునిఁ గాంచి
                    యర్చించి నిలిచిన యానృపాలుఁ
     జూచి ౼ జీవన్ముక్తి సుస్థితి నొందెనె?
                    పరమచిదానందపదవియందు,
     విశ్రాంతి నొందితె? విదిత మై యది భేద
                    మి దభేద మనుబుద్ధి యెడలె నయ్య?
     ఆపాతరమ్యంబు లైనసంకల్పంబు
                    లరిగెనె? చిద్దర్శి వైననీకు
గీ. సమము నాధేయహేయదశావ్యతీత
     మును బ్రశాంతముఁ బ్రాప్తార్థమోదమయము
     నగుచుఁ జల్ల నై యున్నె నీయంతరంగ?
     మనిన, – నా బ్రహ్మచారి కి ట్లనియె, నతఁడు.200
వ. మహాత్మా! నీప్రసాదంబున విశ్వాంతరంగం బైనమార్గంబు గంటి;
     సంసారసీమాంతం బయ్యెఁ; బొందవలసిన నిశ్చయార్థంబుఁ బొందితి.
     ననిన, నట్లగాత, సుఖంబుండు, మని చూడాల తనపురంబునకుం జని
     కతిపయదినంబులకుఁ గ్రమ్మఱ బ్రహ్మచారి యై ఖిన్నముఖారవిందంబు
     తోఁ బొడసూపినం గని, శిఖిధ్వజుం — డిది యేమి? యింత ఖేదం
     బేల వచ్చె? నని యడిగిన, – కుంభుం డి ట్లనియె.201

గీ. అధిప నిన్నుఁ జూడ నరుదేర, నడుమ దు
     ర్వాసుఁ డట్టె చూచి వట్టియలుకఁ
     గనలి రేలు సతివి గ మ్మని శపియించె,
     నదియ దుఃఖహేతు వనిన నృపుఁడు.202
క. అడలకు మునివర నియతిం
     గడవగ రా దది యవశ్యకర్తవ్యకుమ నా,
     పడు గౌఁ గా కని రేలం
     బడతియుఁ బగ లెల్లఁ బురుషభావము నగుచున్.203
ఉ. కొన్ని దినంబు లి ట్లగుడుఁ గోమలి నా కగుభర్త ధాత్రిలో
     నెన్నఁగ లేఁడు భూప, నను నీవ వరింపు మటన్న , దీన నే
     మున్నది? యట్ల కా కనుడు, నుగ్మలియుం గపటానురక్తితో
     నన్నరనాథుఁ గూడి సుఖ మందుచు నుండెఁ జెలంగి రాత్రులన్.204
క. ఈగతిఁ గొన్నాళ్లకుఁ బతి
     భోగేచ్ఛఁ బరీక్ష గొనఁగఁ బొలఁతుక మాయా
     యోగమున నొకసురేంద్రుని
     వేగమ పుట్టింప నతఁడు విబుధులు గొలువన్.205
మ. చనుదెంచెన్ సితదంతి నెక్కి విపులైశ్వర్యంబుతో దేవతా
     వనితావక్త్రసరోజసౌరభసుఖవ్యాసంగభృంగాంగనా
     ఘనఝంకారసమేతకిన్నరవధూగానానుమోదాత్ముఁ డై
     జననాథాగ్రణిపాలికిం జనఁగఁ, బూజల్ చేసె నాయింద్రునిన్.206
వ. ఇవ్విధంబునఁ బూజించి;౼దేవా! యతిదూరం బగుదివంబున నుండి
     యిచ్చటికి రాఁగతం బేమి? యనిన; నతనికి దివిజనాయకుం డి ట్లనియె.207
సీ. భూమీశ నీగుణంబులు విని వచ్చితి
                    మరయ భిక్షులు వచ్చుకరణి; నిపుడు

     రమ్ము నాకమునకు, రంభాదిసతులు నీ
                    యొప్పు చూడఁగఁ గోరుచున్నవార;
     లఖిలభోగంబుల నచట జీవన్ముక్తుఁ
                    డవు నీవు కల్పాంత మనుభవింపు౼
     మనుడు మహీపాలుఁ డచటిపోడుము లెల్ల
                    నెఱుఁగుదు, నాకేల యింత సెప్ప?
గీ. నెచట నేనియు దీవియ నా కచట నేల?
     నెల్లచోటుల నే రమియింతు సుఖము;
     స్వర్గ మది యెంత యచ్చటి సౌఖ్య మెంత?
     యందు రా నొల్ల విచ్చేయు మమరనాథ.208
క. అన విని సురవిభుఁ డతనిన్
     గనుఁగొని దీవించి చనిన గ్రమ్మఱఁ; దా నా
     తని రాగద్వేషస్థితిఁ
     గనిఁ గా కని తలం చెఁ గపటప్రేమన్.209
చ. మెలఁతు యోగమాయ నొకమిండనిఁ దా ఘటియించి వేడ్కమైఁ
     జెలఁగుచుఁ బర్ణశాలకడఁ జీఁకటిమామిడిమ్రానిక్రింద ను
     ద్గళరవకంకణక్వణనతాడనభూషణచుంబనధ్వనుల్
     కలగొని మ్రోయఁ జౌర్యరతిఁ గాంతుని వీనులు సోఁకఁ జేయఁగాన్.210
క. అంతయు గని యాపతి యా
     వంతయుఁ జింతిలక ముదిత లగుదురు గాతన్
     గాంతయు విటుఁడును నని తా
     సంతసమున నచటు వాసి చనియె నిజేచ్ఛన్..211
వ. ఇట్లు చనుటయుం గని చూడాల యచ్చెరువడి యహో యనేక
     సిద్ధులు నితని యందుండు నీతని చిత్తంబు గలంపనేర, నత్యంతసుస్థి
     రుం డయ్యెంగదే! యని యతనికి నిజవృత్తాంతం బెఱింగించెదగాక;

     యని పూర్వశరీరధారిణియు, మనోహారిణియు, నై తనమ్రోల నున్న
     యింతిం గనుంగొని విస్మితోల్లసితలోచనుం డై శిఖిధ్వజుం డి ట్లనియె.212
ఉ. ఓలలితాంగి నవ్యదళనోత్పలలోచన యెందునుండి నీ
     వే లరుదెంచి తిందులకు? నీ చిఱునవ్వులు నీ మృదూక్తులున్
     నీ లలితాస్యమండలము నీ చనుదోయి మదీయభార్య చూ
     డాలయ పోలె దోఁచెడు; విడంబము మాని యెఱుంగఁ జెప్పుమా.213
సీ. అన విని చూడాల నగుదు నే; సంశయం
                    బేల నరోత్తమ! యిట్టి నేన
     కుంభరూపంబుఁ గైకొని నిన్ను బోధింప
                    నన్నిరూపంబులు నైతి వినుము,
     విదితవేద్యుఁడ వీవు విజ్ఞానదృష్టి నం
                    తయుఁ జూచుకొ మ్మన్న, ధరణినాథుఁ
     డచ్చరు వంది రాజ్యము వాసినది మొద
                    లిడి తుద యగుకృత్య మెల్ల నాత్మ
గీ. గృష్టిఁ గనుఁగొని, నిజసమాధియును వదలి,
     యుచితభాషల నద్దేవి నూఱడించి,
     సంతసము మానసంబున వింతసేయ
     నతివ కవికారలీల ని ట్లనియె, విభుఁడు.214
వ. నిరీహుండును, నిస్పృహుండును, నిరాళుండును, శాంతుండును,
     సహమర్థరూపంబు నై యున్నవాఁడ. నింతియగాని యన్యంబు లే
     దని కేవలచిన్మాత్రనిష్ఠుండఁ గావున మోదఖేదంబులం దొఱంగి నిబ్బ
     రంబున నతిశయక్షయరహితత నొంది సంవిద్రూపంబు నైతి నది
     యిట్టి దట్టి దని చెప్ప నశక్యంబు.215
క. నీకారణమున భవము ని
     రాకరణ మొనర్చి, సంవిదాకాశగతిన్

     గైకొంటి, నీకు మ్రొక్కెద
     నా కాచార్యుండ వీవ నలినదళాక్షీ.216
వ. అనిన విని చూడాల యమ్మహీపాలుని బోధించి నిజపురంబునకుం దో
     డ్కొని పోయి యిరువురు జీవన్ముక్తులై పదివేలేండ్లు రాజ్యసుఖంబు
     లనుభవించి విదేహముక్తులై; రని చూడాలోపాఖ్యానం బెఱింగించి;
     వసిష్ఠుండు ౼ చిత్తత్యాగంబున సర్వత్యాగంబగు. నీయర్థంబునఁ గచో
     పాఖ్యానంబు గల దాకర్ణింపు, మని రామచంద్రున కి ట్లనియె.217

కచోపాఖ్యానము

చ. కచుఁడు మరుద్గురున్ జనకుఁ గన్గొని మ్రొక్కుచు, నయ్య, సంసృతి
     ప్రచరణ మె ట్లణంగు? నని పల్కిన;౼ సర్వవివర్జనంబు దా
     నుచితము దీని కన్నఁ;౼ జని యొక్కఁడు గానల వత్సరాష్టకం
     బచలితవృత్తి నుండి, శమ మందమి వెండియుఁ జెప్పెఁ దండ్రికిన్.218
క. చెప్పిన సర్వత్యాగము
     యప్పుడు బోధించి తండ్రి యరిగినఁ, గచుఁడున్
     దప్పక గతకల్మషుఁ డై
     యప్పాటఁ జరింప, మూఁడుహాయనములకున్.219
క. మతి శమ మందక వాచ
     స్పతి గ్రమ్మఱఁ గాంచి యలఁతఁ బడి యిట్లను;౼ నీ
     గతి సర్వంబును విడిచిన
     నతిశయవిశ్రాంతి యేల యందదు తండ్రీ.220
వ. అనిన కొడుకున కతఁ డి ట్లనియె, చిత్తత్యాగంబు చేసిన సర్వశాంతి
     యగు ననినఁ, ౼ జిత్తం బెట్టిది? తత్త్యాగం బేవిధంబున సంభవించు?
     జెప్పవే, యనిన గురుం డి ట్లనియె.221
క. చిత్తమున నొకటి వేఱే
     హత్తిన యంతరభిమాన మది గావున నో

     యుత్తమగుణ తత్త్యాగం
     బెత్తెఱఁగునఁ గలుగు నదియు నెఱిఁగింపు తగన్.222
క. అనుడు, బృహస్పతి కనుమూ
     సినకంటెం, బువ్వుతొడిమఁ జిదుమటకంటెం,
     జను నది యక్లేశంబన
     విను చిత్తత్యాగమహిమ విమలవిచారా.223
వ. ఏకంబు, నాద్యంతరహితంబు, జిన్మాత్రంబు, వితతంబు, వియదమలం
     బు, నగు పరమచైతన్యంబు గల, దదియ చిత్తగింపు, మంతట నిగతఖే
     దుండ వగుదువు.224
గీ. ఈ యహంకృతి యేటిది? యెందుఁ బుట్టె?
     నింతయును భ్రాంతి, యేనును, నితఁడు ననెడు
     ద్వైత మది మిథ్య, కాలదిగ్వశతఁ గ్రాఁగి
     పోవు రూపాదికము లెల్లఁ బొంకు లనఘ.225
వ. అట్లు గావున దిగ్దేశకాలావచ్ఛిన్నంబును, నిర్మలంబును, నిత్యోదితం
     బును, సర్వార్థమయంబును, నేకార్థంబు, నగు చిద్రూపంబ వగు,
     మని యుపదేశించిన, నతండును నట్టి పరమజ్ఞానయోగంబున జీవన్ము
     క్తుఁ డయ్యె. నని కచోపాఖ్యానంబు సెప్పి వసిష్ఠుం డవిచారితరమణీ
     యం బగునీయహంకారం బెంతయు నిరర్థకంబ. యీయర్థంబున
     మిథ్యాపురుషోపాఖ్యానంబు సెప్పెద. నాకర్ణింపు మని రామచం
     ద్రున కి ట్లనియె.226

మిథ్యాపురుషోపాఖ్యానము

సీ. కలఁడు మాయాయంత్రగతుఁ డైనపురుషుండు;
                    వాఁ డాత్మ సంకల్పవశత నొంది,
     యాకాశ మార్జించి, యది యిష్టధన మని
                    యొనరఁ దద్రక్ష కి ల్లొకటి గట్టి,

     యివి నాకు దక్కెఁ బొ మ్మనునంత, నాయిల్లు
                    కాలవశంబునం గూలుటయును,
     నాయింటితోడ నా యాకాశమును బోయెఁ
                    గటకటా యనుచు దుఃఖమునఁ బొగిలి,
గీ. చపలమతిఁ బొంది, యీ యాకసంబు గావ,
     నాతఁ డొక నూయి ద్రవ్విన, నదియుఁ గూల,
     గూపగత మైన బయలును గూలె నకట
     యనుచు వాపోయెఁ, దత్పరుఁ డగుటఁ జేసి.227
క. వెండియును గగనరక్షకుఁ
     గుండంబులు మేడ మాడుగులు నూతులు వాఁ
     డొండొండు కట్ట నవి చెడు
     చుండఁ, దదాకాశములకు, నో యని యేడ్చెన్.228
వ. అని చెప్పి వసిష్ఠుం డీవృత్తాంతంబు తేటపడ నెఱింగించెద, నాకర్ణిం
     పు. మమ్మాయాపురుషుండు సర్గాదియందు ననంతంబును, నసత్తును,
     శూన్యంబును నై, స్వయంప్రకాశం బగు నంబరంబున జనియించిన య
     హంకారం బగు. నతండు నాత్ముం డయ్యును నాత్మరక్షణార్థం బై యనే
     కశరీరంబులు గల్పించుకొని యవి చెడుచుండ నాత్మహాని యయ్యె
     నని దుఃఖితు డగుచుండు. నీవును నట్లపోలె ఘటమఠాకాశనాశక్లేశం
     బునం బొందక సుఖం బుండు. మని మఱియు ని ట్లనియె.229
శా. ఆకాశంబునకంటె విశ్రుతము శూన్యం బవ్యయంబున్ సదా
     వ్యాకోచంబును నైనయాత్మ యది గ్రాహ్యం బౌనె నెద్దానఁ; జి
     త్తాకాశంబున మేన పుట్టి చెడఁగా నయ్యాత్మయుం బోయె నం
     చేకాలంబున నేడ్చు భూతతతి దా నిక్ష్వాకువంశాగ్రణీ.230
గీ. ఘటమఠాదులు చెడిపోవ గగన మెందు
     నేక మై యున్న భంగిమై నినకులేశ

     దేహములు వోవ చెడిపోక దేహియందు
     నేకనిర్లేపరూప మై యెసఁగి వెలుఁగు.231
వ. ఇట్లు గావున శాంతంబును, సర్వంబు, నేకంబును, నాద్యంతవర్జితంబు
     ను, భావాభావనిర్ముక్తంబును, నగు బ్రహ్మంబ కాని యితరంబు లేదని
     యెఱింగి, సుఖివి గ, మ్మని మిథ్యాపురుషోపాఖ్యానంబు సెప్పి, వసి
     ష్ఠుండు సమాధిరహితం బయ్యును, మహాకర్తృత్వంబున ధీవిశ్రాంతి
     సంభవించు. నీ యర్థంబున భృంగీశోపాఖ్యానంబు గల, దాకర్ణింపు
     మని రామచంద్రున కి ట్లనియె.232
గీ. వివిధ మగుచింత లన్నియు విడిచి పెట్టి,
     భవ్యచిన్మాత్రకోటరపదవిఁ గూడి,
     వేద్యనిర్ముక్త మైన సంవిత్తి తత్త్వ
     నిష్ఠ, నేప్రొద్దు విహరింపు, నృపవరేణ్య.233
క. వినుచుం బల్కుచు ముట్టుచుఁ
     గనుచున్ మూర్కొనుచుఁ గ్రొత్తగా దిది సత్యం
     బని తలఁపు మెల్లక్రియలును
     ఘన మగుచిద్బ్రహ్మతనువు గా కొండగునే.234
వ. అది యె ట్లంటేని.235

భృంగీశోపాఖ్యానము

సీ. భృంగీశుఁ డొకనాఁడు గంగాధరునిఁ గాంచి
                    మ్రొక్కి హస్తంబులు మొగిచి౼దేవ,
     యేనిశ్చయముఁ బట్టి యీ జగజ్జీర్ణగే
                    హమున గతజ్వరుఁ డై చరింతు,
     నాన తిమ్మనిన; — మహాదేవుఁ డను ౼సర్వ
                    శంకలు నుడిగి సుస్థైర్యలీల
     ననఘ మహత్యాగి వగుము, మహాకర్త
                    వగుము, మహాభోక్త వగు, మనుటయుఁ

గీ. దద్విధ త్యాగ భోగకర్తవ్యములకు
     నెట్టి లక్షణ? మనిన నుమేశుఁ డనియె౼
     బరమగోప్యంబు క్రైవల్యపదము, నైన
     దీని నెఱిఁగింతు, నెంతయుఁ దెలియ వినుము.236
క. జనియును, మృతియును, ధర్మం
     బు నధర్మము, దుఃఖమును, లే దని నె
     మ్మనమునఁ బోవిడు నెవ్వం
     డనఘా, మఱి యతఁడె పో మహాత్యాగి ధరన్.237
క. ఫలవిఫలరాగరోషో
     జ్జ్వలధర్మాధర్మదుఃఖసౌఖ్యము లెందున్
     దలఁపక చరించు నెవ్వం
     డలఘుమతీ, యతఁడె పో మహాకర్త ధరన్.238
క. సమభావన నెందు విరో
     ధము వడయుక, కోర్కు లెల్ల దా వీడ్కొని ప్రా
     ప్తమ యనుభవించు నెవ్వం
     డమలమతీ, యతఁడె పో మహాభోక్త ధరన్.239
వ. మఱియు దృశ్యకరణం బంతయు దొఱంగిన యతండును, మహాత్యాగి
     యగు. నని శంభుండు భృంగీశున కుపదేశించె. నీవు నీమార్గం
     బెఱింగి సుఖింపుము.240
క. అంతర్ముఖుఁ డై కృత్యం
     బంతయు వెలి నాచరించునయ్యోగియ యే
     కాంతుఁడు నిరహంకార
     స్వాంతుఁడు నై చిన్మయాత్మసౌఖ్యముఁ గాంచున్.241
వ. అని భృంగీశోపాఖ్యానం బెఱింగించి, వసిష్ఠుం డాత్మాహంకారాభిధా
     నవిచారంబున నెఱుంగ నశక్యంబైనయది గురూపదేశంబున నెఱుంగ

     నగు. నీయర్థంబున నిక్ష్వాకూపాఖ్యానంబు గల దాకర్ణింపు;
     మన విని, రఘువల్లభుండు — మహాత్మా, యహంకారాభిధానం బగు
     చిత్తంబు గళితం బగునప్పుడు సత్త్వగుణం బెట్లు నిలుచు? నానతిమ్మ
     నిన, నమ్మునిపతి యి ట్లనియె.242

ఇక్ష్వాకూపాఖ్యానము

సీ. కలుషంబు చెడి యహంకారమయస్వాంత
                    మడఁగంగ, లోభమోహాదు లెందుఁ
     బొదలవు; బలిమి మైఁ బుట్టెనేనియు వాని
                    ముంప లే, వుదక మంబుజము వోలె;
     ముదితాదికస్త్రీల వదనంబు విడువుము,
                    వాసనాగ్రంథులు నోసరిల్ల,
     గోపంబు రూపఱు, లోపించు మోహంబు;
                    గాన కవ్యాపన్న మైనవస్తు
గీ. వమలవిజ్ఞానదృష్టి నాద్యంబు గాఁగ,
     ముక్తి కుద్యోగి గానట్టిమూఢహృదయుఁ
     గాల్పనే! రామ, తొల్లి యిక్ష్వాకు మనువు
     నడిగె, నీయర్థ మదియు నేర్పడఁగ వినుము.243
క. ఎట్లు జనించెఁ బ్రపంచం?
     బెట్టిది రూపంబు దీని? కీభవపాశం
     బె ట్టూడును? వలలందును
     బిట్ట వెడలి నట్లు ముక్తి బెరయున్ దండ్రీ.244
వ. అనిన విని యిక్ష్వాకునకు మను వి ట్లనియె.245
శా. ఓహూ యీదశ నీవివేకమున ని ట్లొప్పారె నీప్రశ్న మీ
     దేహాద్యం బగుదృశ్య మింతయు మృగీతృష్ణాంబు లె ట్లట్ల; తా

     నూహాతీతము, నచ్యుతం, బగుచిరవ్యోమంబు, నిత్యంబు; దు
     ర్మోహం బైనజగంబు, బోధముకురంబుం బొంది తోఁచుం జుమీ.246
చ. సహజము లై బహిఃస్ఫురణశక్తులు కొన్ని యజాండపంక్తు లౌ,
     బహువిధభూతభావపరభావము లౌ; నది యెల్ల నీజగ
     న్మహిమ, యనైక్య మైక్యమును నా మఱి బంధవిముక్తి నాఁగ లే
     దు, హిమకరాన్వయద్యుతిచిదాత్మ వెలుంగుచు నుండు నెప్పుడున్.247
క. జలము తరంగము లగుగతి
     నల చిచ్ఛక్తియ ప్రపంచ మగుఁ గానఁ, జలా
     చలబంధమోక్షకలనలు
     దలఁపక సౌమ్యుండ వగుము ధరణీనాథా.248
చ. కుచములమీఁదఁ బెన్నిదురఁ గూరిన బాలునిఁ దల్లి గాన లే
     కెచటికిఁ బోయనో యనుచు నేడ్చినయ ట్లజరామరస్థితిన్
     అచలితుఁ డైనయాత్మ గన నందక దేహముపాటు చూచి తా
     న చివికి డస్పితిన్ విధివినాశము బొందితి నన్ జనం బిలన్.249
గీ. అంబువు గదల బుగ్గలు నైనయట్లు
     చిత్తసంకల్పవశమున సృష్టి యయ్యెఁ,
     గాన నిశ్శంకఁ గదలక కదలినట్టు
     లాత్మసంకల్ప మని రాజ్య మనుభవింపు.250
సీ. అకట చిత్రము మాయ యఖలమోహిని! సర్వ
                    గతుఁ డయ్యుఁ దన్ను దాఁ గానఁ డాత్మ
     కడలేని సచ్చిదాకాశమయంబ యీ
                    జగ మని తెలిసిన శాంతమూర్తి
     సద్బ్రహ్మకవచుఁ డై సతతంబు సుఖయించు,
                    నహమికావిరహిత మయి, యభావ
     మైనభావము శూన్య, మది నిరాలంబంబుఁ,
                    జిన్మయంబును గాఁగ సృష్టిఁ దలఁపు

గీ. ద్వైతభావంబు దుఃఖావహంబు, దీని
     సామ్యశిఖిఁ గాల్చితే నీకు సౌఖ్య మందు,
     కణఁగి యతి యైన గృహి యైన కామియైన
     శాంతుఁ డై నను నీబుద్ధి జరగవలయు.251
క. పొలియుట, బ్రతుకుట, పోవుట,
     కలుగుట, నే నతఁడు ననుట, గలుగక మదిలోఁ
     దలఁచినయట్టి మహాత్ముఁ
     డిల జీవన్ముక్తుఁ డగు నహీనవివేకా.252
క. అనుదినము నభ్యసింపని
     జనులకుఁ జెడిపోవు కళలు, జ్ఞానకళ మనం
     బున నొలసిన సుక్షేత్రం
     బునఁ బెట్టిన రాజనంబుపోలికిఁ బొదలున్!253
చ. హరిహరపద్మసంభవముఖామరు లెంచినచర్చ లెల్ల నాం
     తరమతిఁ జిత్తలీనగణనాదిచరిత్రము లంచు నుండుమీ.
     యరుదుగ సర్వదర్శనము లందలియర్థము నిశ్చయించి య
     ట్లరసినఁ జిద్విలాసము నిరంకుశ మౌను నరాధినాయకా.254
గీ. చిత్తలయము గన్న చిన్మాత్రులకు ముక్తి
     సుఖమువోలె నొండుసుఖము లేదు.
     ముక్తి దేశకాలములు గా వహంకృతి
     ప్రకృతిభావ మణఁపఁబడుట ముక్తి.255
క. వర్ణాశ్రమధర్మాచా
     రార్ణవము తరించు నెవ్వఁ? డతఁడు ప్రపంచో
     త్తీర్ణుఁ డగు ననుట పరఁగు, ను
     దీర్ణమతిన్ వెడలు వనమృగేంద్రమ పోలెన్.256

క. విను కర్మఫలత్యాగికి
     దనుళవు మఱి సుకృతదుష్కృతంబులు, స్ఫటికం
     బున వర్తిలు రాగమునా
     యనువున ఫలకర్మరాగ మందదు తజ్ జ్ఞున్.257
క. జ్ఞానప్రాప్తిక్షణమున
     దా నవు ముక్తుండు; పిదపఁ దను వది తీర్థ
     స్నానమునఁ బడిన శ్వపచ
     స్నానంబునఁ బడిన రెండు సమమ తలంపన్.258
వ. అని యివ్విధంబునఁ బరమజ్ఞానోపదేశంబు చేసి, బ్రహ్మవిదుండ వగు. మని
     మనువు నిజగృహంబునకుం జనియె నిక్ష్వాకుండును నతండు సెప్పినట్ల
     జీవన్ముక్తుం డై రాజ్యసుఖం బనుభవించుచుండె. నని యిక్ష్వాకూపా
     ఖ్యానంబు సెప్పి, వసిష్ఠుండు.. విశ్రాంతస్వాంతుం డైనవానికి లౌకిగా
     చారంబు తఱుచు లేకుండు, నీయర్థంబున మృగవ్యాధోపాఖ్యానం
     బు నెఱింగించెద; ననిన రామచంద్రుం డి ట్లనియె.259
క. జీవన్ముక్తుల కధికము
     గా వంటిరి మీరు గగనగమనాదులు ము,
     న్నీవిధమునఁ దగువారల
     కేవి యపూర్వాతిశయము లెఱిఁగింపుఁ డనన్.260
క. జ్ఞానికి నేయతిశయమును
     నూనదు మదిఁ దాఁ దనంత, సురుతరమంత్ర
     ధ్యానతపస్సిద్ధి నభో
     యానాదులు గలుగు, దీన నధికత గలదే?261
క. ఆరయ విజ్ఞానికి సం
     సారికిని విశ్లేష మెందు సకలంబున నా
     స్థారహితంబును నిర్మల
     వైరాగ్యము నైనమనసు వసుధాధీశా.262

చ. అపగతసంసృతిభ్రముఁడు నాత్మరతుండును నైనయోగి కే
     నెపమున నెందుఁ జిహ్నము జనింపదు. కామవిషాదరోషలో
     లుపగుణమానమత్సరవిలోపము సేసి యనామయస్థితిన్
     జపలత లేక యుండుటయె శాశ్వతచిహ్నముగాని రాఘవా.263
ఉ. జీవులకారణంబు విను చిత్పదదూరత నుండ్రు, కర్మముల్
     ద్రోవఁగరాక వారి సుఖదుఃఖము లేపడగించుచుండు; నా
     స్థావశవృత్తి బంధమును, దానివిముక్తియ, ముక్తి, గావునన్
     నీవును నట్ల హృత్కలన నిల్పఁగ సౌఖ్యము నొందు రాఘవా.264
వ. గ్రాహ్యగ్రాహకసంగంబుల సావధానుండవై సంకల్పంబులం దొఱంగి
     సుఖింపుము. తత్త్వజ్ఞులు గతార్థంబునకు వగవరు; భవిష్యద
     ర్థంబునకుఁ, జింతింపరు; క్రమప్రాప్త మగువర్తమానార్థంబు గ్రహిం
     తు రదియునుంగాక.265
సీ. ధీరజీవునకును ద్రివిధరూపంబులు
                    స్థూలంబు, సూక్ష్మంబు, తుదిఁ బరంబు;
     నందుఁ బరముఁ బట్టి నా రెంటి విడువుము;
                    కరపాదమయ మైన కాయ మెందు
     స్థూలంబు నా భోగధుర్య మౌ, మఱియు, సూ
                    క్ష్మంబునా సంకల్పమయమనంబు,
     అతివాహికమ నానగు నది; మఱి యనా
                    ద్యంతచిన్మాత్రంబు నై వికల్ప
గీ. రహితమై యున్నయదియు పరస్వరూప;
     మదియె మూఁడవరూ పగు; ననిన విభుఁడు
     స్వప్నజాగ్రత్సుషుప్తినిష్ఠంబుగాని
     తుర్య మెఱిఁగింపు మౌనిశార్దూల యనుడు.266

గీ. అహమీకానహమికలు మాయఁగ ససత్తు
     సత్తు నెడ బాసి యెందు నసక్తుఁ డగుచు
     నమలుఁడును సముఁ డై యుంట యదియ తుర్య
     మండ్రు; వేదాంతవిదులు లోకాధినాథ.267
వ. సంకల్పంబులేమిచే నిది జాగ్రత్తయు స్వప్నంబునుం గాదు. జాడ్యస్థితి
     లేమిం జేసి సుషుప్తియుఁ గా. దహంకారనిరసనంబున సమతోదయం
     బునం జిత్తంబు వియదాకృతి యగుచుండఁ దుర్యావస్థ సంభవించు.
     నీవు ప్రబుద్ధుఁడవు గాన, భవత్ప్రబోధవృద్ధిం బొందెద విఁక వ్యాధ
     వృత్తాంతం బెఱింగించెద నాకర్ణింపుము.268

వ్యాధోపాఖ్యానము

సీ. ఒకకానలోపల నొకకిరాతు డేటు
                    వడి పాఱుమృగము వెంబడిన బఱచి
     కానక యచ్చోట మౌని నొక్కనిఁ గాంచి
                    యెటు వారె మృగ మని యి ట్లొకింత
     యద్భుతంబుగ వారి నడిగిన, నమ్మౌని౼
                    సౌఖ్యమౌనుల, మేము సముల, మడవి
     నుందుము, వ్యవహారయోగ్యమౌ నట్టి య
                    హంకార మెందు మాయాత్మ లేదు,౼
గీ. అనెడు మునినాథు పలుకుల కర్థ మెఱుగ
     కా కిరాతుడు దనయిచ్చ నవల నరిగె.
     నిఖిలసంకల్పములఁ బాసి నీవు నట్లు
     తుర్యపదమును బొందు సుస్థైర్యలీల.269
వ. అట్లు గావునఁ బ్రశాంతి నభేదచిత్తు లైన మును లెచ్చోట నున్నను
     ముక్తులే యని వ్యాధోపాఖ్యానంబు చెప్పిన విని రామచంద్రుండు
     సంతుష్టాంతరంగుం డై యమ్మునివల్లభునకు సమస్కరించి౼చిత్తవి

     శ్రాంతిహేతువులైన యోగభూము లేడని మున్నెఱింగించితిరి. వాని
     నభ్యసించువిధం బెట్లు? వాని సాధించు యోగచిహ్నం బెట్టిది?
     సవిశేషంబుగా నానతిమ్మనిన, నమ్మహాముని యిట్లనియె.270

యోగభూమికోపాఖ్యానము

సీ. విను ప్రవృత్తుండు, నివృత్తుండు, నన నొప్పు
                    సర్గాపసర్గవాంఛల నరుండు;
     ఆ యిరువురయందు నపవర్గ మెంత సం
                    సారంబ మేలని సంస్మరించుఁ
     గర్మప్రవృత్తులకు కడలొత్తునంబుధి
                    నడిమికూర్మము మేడ దొరకినట్లు,
     పెక్కుజన్మంబులపిదప వివేకంబు
                    చేపట్టి, సంపృతిస్థితి యసార
గీ. మకట యిది సాలు, లాభలోభాతిశయవి
     రహిత మగునట్టి పరమవిశ్రమము నాకు
     నెట్లు సిద్ధించు? నని యాత్మ నెఱిఁగి దివురు
     నట్టి పుణ్యాత్ముఁడు నివృత్తుఁ డంబుజాక్ష.271
మ. అకటా యెట్లు విరక్తుఁ డై కడతు జన్మాంబోధి యే నన్విచా
     రకళ న్వాసన లంత కీ లెడలి జీర్ణత్వంబు నొందంగఁ బా
     య కుదారక్రియలం బ్రవృత్తుఁ డనుమోదాయత్తుఁ డై గ్రామ్యమూ
     ఢకుచేష్టల్ పరికించి సత్క్రియలు వేడ్కం జేయు నిర్లేపుఁడై.272
ఉ. మర్మము లాడఁ డెందుఁ, బలుమాఱును నెచ్చట నైనఁ దెచ్చి తా
     నర్మిలి శాస్త్రసంచయ ముదగ్రభవాంబుధి దాఁటఁ గోరు, స
     ద్ధర్మవిచారుఁ డౌ నతఁడు దా నగు నాదిమయోగభూమికిన్
     ధర్మము లెల్ల యోగ్యతనె తా నొనరించుఁ దదార్యుఁ డిమ్మహిన్.273
వ. అది విచారణాభిధానం బగు ప్రథమయోగభూమిక.275

సీ. ఆభూమి కెక్కిన యతఁడు శ్రుతిస్మృతి
                    ధ్యానధారణయోగతత్త్యగోష్టి
     వ్యాఖ్యానములు సేయు వైదుష్యవంతులఁ
                    గొలిచి శాస్త్రంబులు దెలిసికొనుచుఁ,
     బరపదార్థప్రతిభావజ్ఞుఁ డై గృహ
                    చింత గృహస్థుఁడు సేయునట్ల
     నెఱయఁ గార్యాకార్యనిశ్చయం బెఱుఁగుచు,
                    మదమానమోహదుర్మత్సరములు
గీ. లోభలాభాతిశయములు లోనుగాఁగఁ
     బాము కుబుసంబు నూడ్చినభంగి నూడ్చి,
     శాస్త్ర గురుసేవ గని రహస్యముల బుద్ధి
     నూను నట్టిద రెండవ యోగభూమి.274
క. విను రఘునాథ యసంగమ
     మను మూడవ యోగభూమి నంతట నతఁ డె
     క్కును, బ్రన్నని పువ్వులపా
     న్పునఁ జెంది సుఖించుచున్న పురుషుని మాడ్కిన్.276
చ. ఉపనిషవర్ధతత్త్వరస ముల్లమునం గడ లొత్త నైహికా
     విపులసుఖంబు గోరక వివేకకథాకథనక్రమంబులన్
     విపులశిలాతలస్థలుల విశ్రమ మొంది యసంగచిత్తుఁ డై
     యపరిమితప్రమోదముల నందుచుఁ గాలముఁ బుచ్చు రాఘవా.276
క. అమలిన బహుశాస్త్రాభ్యా
     సములను శుభకర్మములను జంతువులకు ను
     త్తమ వస్తుదృష్టి వొడముం
     గ్రమ మొప్పఁ దృతీయభూమికాపరిణత యై.277
వ. విను మ య్యసంగమంబు సామాన్యంబు, విశేషంబు, నన రెండువిధం
     బులై యుండు నందు నర్థంబులయెడ కర్తయు, భోక్తయు, బాధ్యుం

     డును, బాధకుండును, నేఁ గాన నియును; సుఖదుఃఖంబు లీశ్వరాధీ
     నంబు లనియును; భోగరోగంబులును, సంయోగవియోగంబులు
     ను, గాలవశం బనియును ; ననేకవస్తువులయందు నాసఁజేయక యునికి
     సామాన్యసంగం బగు. మఱియుఁ దత్క్రమవియోగంబున, దుర్జన
     వియోగంబున, నాత్మజ్ఞానప్రయోగంబునఁ, బౌరుషప్రయత్నంబున,
     సంతతాభ్యాసంబునం జేసి, పరమవస్తువు కరతలామలకంబై తోఁచు
     చుండు, సంసారసాగరంబునకుఁ బారంబును సారంబు నగు పరతత్త్వ
     స్థితిఁ జెంది, సకలంబు నీశ్వరాధీనం బనుటయుఁ బూర్వకర్మం బను
     టఁయుఁ దొఱంగి, మౌని యై పరమశాంతిం బొందుటయు నది విశేషా
     సంగము బని మఱియును.279
మ. వెలియున్ లోనును క్రిందు మీఁదు దిశలున్ విన్వీథియున్ జేతనం
     బు లజాండంబులు వస్తు వస్తుకలనంబుం బొందఁగా భాసమై
     కలిమిన్ లేమిని డింది కాంతిమయమై కళ్యాణ మై నిత్యమై
     యలరారున్ రఘునాథ యిట్టిది విశేషాసంగమం బెప్పుడున్.280
ఉ. సమ్మదసౌరభంబును నసంసృతిపత్త్రచయం బచింతనా
     ళమ్ము నవిఘ్నకంటకతలంబును నై వెలయున్ వివేకప
     ద్మ మెదలోపల న్మొలచి తత్త్వవిచారరవిప్రబుద్ధమై
     యిమ్ముల ని య్యసంగులకు నిచ్చు ఫలంబు తృతీయభూమికన్.281
సీ. సజ్జనసంగతి సత్కర్మసంచయం
                    బునఁ గాకతాళీయముగ జనించు
     నాదిభూమిక యనునమృతాంకురము వి
                    వేకాంబుసేచనం బెంచి యరయవలయు,
     నది యుదకంబున సరళమై తలయెత్త
                    ఘనవిచారంబునఁ గర్షకుండు
     సారంభ మరసిన ట్లరయంగవలయు; నీ
                    భూమిక తరువాతిభూమికలకు

గీ. మనికిప ట్టగు; నంతర్విమర్శ నొంది,
     ధృతి నసంగత్వమను నీతృతీయభూమిఁ,
     గన్న పురుషుండు, సంకల్పకలన లుడుగు,
     ననిన విని రామచంద్రుఁ డి ట్లనియె మునికి.282
వ. మహాతా! మూఢుండు, నసత్కులసంభవుండుఁ, బ్రమత్తుండు, నప్రాప్త
     యోగసంగుండు, నగువారికి నెట్లు సంసారోత్తరణం బగు? నీభూమి
     కలయందు నొక్కటిని బొంది మృతుం డగువాని కెట్టిగతి సంభవించు?
     నెఱింగింపవే; యనిన నమ్మునిపుంగవుం డి ట్లనియె283
సీ. రూఢదోషుం డగుమూఢున కొకమాటు
                    జన్మశతంబులు చనినఁ, గాక
     తాళీయమున నైనఁ దజ్ జ్ఞసంగతి నైన
                    నలరు వైరాగ్య; మ ట్లంతదాఁక
     సంసార మధికమై సాగు; నావైరాగ్య
                    మొంద వాలాయంబు నుదయ మొందు
     నాదిభూమికయందు నణఁగు సంసారంబు,
                    సరి నొప్పు శాస్త్రార్థసంగమంబు;
గీ. యోగభూమిక నొంది మే నురిలెనేని,
     భూమికాశానుసారతఁ బొదలిపోవు
     నతఁడు సురమానమున దివ్యసతులఁ గూడి
     యమరపదమున భోగంబు లందుచుండు.284
ఉ. అంతట పుణ్యబాపనిచయం బుడివోవఁగ శుద్ధు లైన శ్రీ
     మంతులయింటఁ బుట్టి మును మాయనివాసన భూమికాక్రమా
     క్రాంతి వహించి మీఁద నధికం బగుభూమిక కెక్కి యోగి యై
     యంతము లేనియట్టి పరమాత్మయ తా నగుచుండు రాఘవా.285

గీ. మొదలిభూమినుండి మూఁడుభూములు వ్యవ
     హారమాత్రభేద మై జగంబు
     పుట్టు దోఁచు చునికిఁ బొల్చు జాగ్రత్సంజ్ఞ,
     నందుఁ బొందుఁ గేవలార్యుఁ డెందు.286
క. కర్తవ్యము లొనరించి, య
     కర్తవ్యము లుడిగి, ప్రకృతికరణభరణతన్
     వర్తిల్లుచు శాస్త్రార్థ మ
     నార్తస్థితి సలుపునతఁడ యాచార్యుఁ డగున్.287
వ. అట్టి యాచార్యత్వంబు ప్రథమభూమి నంకురితంబును, ద్వితీయభూమి
     వికసితంబును,దృతీయభూమి ఫలితంబును, నగు నందు నాచార్యుండై
     మృతుండైనయోగి శుభసంకల్పసంచితంబు లగు దివ్యభోగంబులు
     చిరకాలం బనుభవించి క్రమ్మఱ భూలోకంబునం బుట్టి యోగియగు.
     నీతృతీయభూమికాభ్యాసంబున నజ్ఞానపరిక్షయంబుఁ బొంది చిత్తంబు
     పూర్ణేందుమండలనిభంబై సంవిద్ బోధంబు సంభవించు నంత.288
సీ. ఎనయ నాలవభూమి కెక్కినయోగీంద్రు
                    లవిభాగమున ననాద్యంతపదము
     సమముగాఁ జూతురు, సర్వంబు నిబ్భంగి
                    ద్వైతంబు లేక యద్వైత మొందు,
     స్వప్నంబుగతిఁ దోఁచు జగము గానఁ జతుర్థ
                    భూమి స్వప్నాఖ్యమై పొలుచు; నంత
     శరదంబుదాంశంబు సరి బుద్ధిపలచ నై
                    యణఁగి సత్తామాత్ర మగుచు నిలిచి
గీ. సరి నశేషంబు నొక్కట శాంతిఁ బొంది,
     నపగతద్వైతనిర్భాసుఁ డై సుషుప్తి
     నెనయఁ బంచమభూమిక నెక్కుఁ గాన
     సొరిది నీభూమి కొప్పు సుషుప్తి సంజ్ఞ.289

ఉ. పంచమభూమి సుప్తి ఘనభావము నొంది సమాంతరస్థితిన్
     మించి వెలింగి యానిరతి మేకొనియున్ బరిశాంతవృత్తి ని
     ద్రాంచితుఁ డొక్కనాఁడు వితతాభ్యసనం బొనరించి వాసనా
     సంచయ మేది తుర్యయను షష్ఠకభూమిని బొందు నంతటన్.290
గీ. అందు సదసత్తు లహమికానహమికలును
     మాని, క్షీణమనస్కుఁడై, మఱియు ద్వైత
     మనుట నద్వైత మనుట లే కాత్మశాంతి
     శమితహృధ్గ్రంథియును వివాసనుఁడు నగుచు.291
వ. అనిర్విణ్ణుండును, నిర్వాణుండు, నై నివాతదీపంబునుం బోలె, జీవన్ము
     క్తుం డై యుండు.292
క. అంబరమున మునిగిన కుం
     భంబుగతిన్ లోన వెలిని పరిశూన్యుం డై,
     యంబుధిలో మునిగినకు
     భంబుగతిన్ లోన వెలిని పరిపూర్ణుండై.293
వ. ఇవ్విధంబున నుండియు నొక్కించుక విశేషమాత్రంబు పొందియుఁ
     బొందనిదెస విదేహముక్తి యగు సప్తభూమిక యగు. నది యవాఙ్మా
     నసగోచరంబును సకలభూమికలకు సీమాభూమికయు నగు నమ్మహా
     పదంబు.294
ఉ. కొందఱు రుద్రుఁ డండ్రు, మఱి కొందఱు విష్ణుం డటంద్రు, ధాత్రిలో
     గొందఱు బ్రహ్మ యండ్రు, మఱి కొందఱు శూన్యమ యండ్రు, వెండియున్
     గొందఱు కాల మండ్రు, మఱి కొందఱు వేడ్కఁ బ్రధానపూరుషా
     స్పందవిభాగ మండ్రు, బహుశాస్త్రవికల్పమతప్రవృత్తు లై.295
వ. అట్లుగావున నామరూపంబులు లేకుండియుఁ, కల్పితనామంబులు
     సెప్పంబడు నాభూమిక, కని సెప్పి వసిష్ఠుండు.296

క. ఈ సప్తభూమికల న
     భ్యాసం బొనరించు నతని కఘభవభయముల్
     వే సమయు, నీకుఁ జెప్పితి;
     నీసరణి సుఖింపు నీవు నిల రఘురామా.297
వ. అని వసిష్ఠుండు సప్తమభూమికోపాఖ్యానంబు సవిస్తరంబుగా నెఱింగిం
     చిన సంతుష్టాంతరంగుం డై రఘుపతి మునిపతి కి ట్లనియె.298
చ. పరమరహస్యరూప మయి పావన మై నిగమాంతసార మై
     పరఁగిన బ్రహ్మవిద్య బహుభంగులు మీ రటు చెప్పి చిత్తమున్
     మెరమెర మాన్పి నార, లిఁక మీదిపదస్థితిఁ గంటి, మంటి, మ
     ద్గురుఁడును దల్లిదండ్రులు సఖుండును దైవము మీర సంయమీ.299
చ. అనిన వసిష్ఠుఁ డి ట్లనియె నచ్యుత మాధవ పుండరీకలో
     చనుఁడ వనాదివిష్ణుఁడవు శాశ్వతమూర్తివి కారణార్థ మై
     జననము నొంది నాదెసఁ బ్రసన్నదయామృతదృష్టి నించి యీ
     పనిగొని యెల్లలోకముల భవ్యునిఁ జేసితి నన్ను రాఘవా.300
వ. అని వినయావనతవదనుండై యనేకవిధంబులం బ్రశంసించి రామచం
     ద్రుని వీడ్కొని పసిష్ఠుండు నిజాశ్రమంబునకుం జనియె. నక్కుమార
     చూడామణియును సర్వసముండును, శాంతుడును, జీవన్ముక్తుండు, నై
     రాజ్యసుఖంబు లనుభవించుచుండె. నీవును నీయర్థంబు నేమఱక
     చిత్తంబున నిల్పుకొని సుఖివి గ. మ్మని యుపదేశించిన విని, భరద్వా
     జుండు వాల్మీకిమునికిం బ్రణమిల్లి వీడ్కొని పరమజ్ఞానసంపన్నుం
     డును, జీవన్ముక్తుండు, నై నిజేచ్ఛ విహరించుచుండె. నని వాసిష్టరా
     మాయణంబు పదార్థప్రమేయంబుల సరణిఁ దప్పక తెనుంగుభాష
     గద్యపద్యంబుల రచియించితి; నవధరింపుము.301
శా. శాంతస్వాంత నిరస్తదైత్యగణ భాస్వచ్ఛిన్మయాకార దు
     ర్దాంతౌఘప్రతికూలనామచయ, వేదవ్యాసవాక్యార్థవి

     శ్రాంతోదాత్త నిజప్రభావ యఘపారావారసంశోషణా
     చింతాతంతులతాలవిత్ర వరదా శ్రీసంశ్రితోరఃస్థలా.302
క. అంభోదనాదవిలస
     ద్గంభీరమహాట్టహాస కనకకశిపుసం
     రంభనిరాస రమాస్తన
     కుంభద్వయకలితగేహగురుభుజమధ్యా.303
మాలిని. శుకవినుతకలాపా శుద్ధబుద్ధస్వరూపా
     వికసితజలజాక్షా విశ్వరక్షైకదక్షా
     సకలరిపునిరస్తా శంఖచక్రాబ్జహస్తా
     ప్రకటితశుభగాత్రా పద్మగేహాకళత్రా.304

గద్య.
ఇది శ్రీనృసింహవరవ్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజసగోత్ర
పవిత్రయ్యలామాత్యపుత్త్ర సరసగుణధుర్య సింగనార్య
ప్రణీతం బైనవాసిష్ఠరామాయణంబునందు
నిర్వాణప్రకరణం బన్నది
పంచమాశ్వాసము


సంపూర్ణము