వావిలాల సోమయాజులు సాహిత్యం-2/వసంతసేన
అంకితము
శ్రీ వల్లభజోస్యుల సుబ్బరాయలకు
భాసకవితాలయమున సంభవము నొంది
శూద్రకుని యింట మోహనస్ఫూర్తిఁ బెఱిఁగి
నాహృదయరంగమున నిల్చి నాట్యమాడి
తమకమున వచ్చె నేఁ డిది మిము వరించి
బహుళ సాహిత్య వనలతా ప్రసవ విసర
బంధు రామోద పరిపూర్ణ పథ విహారి!
మన్మనోనంద నోద్భూత మహిత కుసుమ
మిది గ్రహింపుము సంప్రీతి నెద వహించి
మానవోత్తమ! కారుణ్యమధురమూర్తి!!
సకలవిద్యా రసామృతాస్వాదననమున
జిరతరంబైన మీ యశస్నేహమంది
వెలయుఁగావుత నీకృతి తెలుఁగు నాఁట!
తొలి పలుకు
సంస్కృతదృశ్య కావ్యప్రపంచంలో ఆదికవి భాసుడు జానపద కథా సాహిత్యమునుంచో లేక గుణాఢ్యమహాకవి 'బృహత్కథ' నుంచో ఈ రమణీయమైన కథను స్వీకరించి స్వాయత్తం చేసికొని 'దరిద్రచారుదత్త' రూపకాన్ని సృజించినాడు. మహాకవి శూద్రకుడు మరికొన్ని కథా సన్నివేశాలనూ సంభాషణలనూ కల్పించి కథలో వివిధ ప్రణయవిభేదాలు విస్పష్టంగా గోచరించేటట్లు "మృచ్ఛకటిక”ను కల్పించి సంస్కృతదృశ్యకావ్యసుందరికి ఒక విశిష్టమూ, అమూల్యమూ అయిన అలంకారాన్ని చేకూర్చి విశ్వవిఖ్యాతి గడించినాడు.
ఈ రూపకంలోని గుణాలన్నీ భాస శూద్రక మహాకవులవి దోషములు నావి. 'వసంతసేన' వ్రాసి దరిదాపు ఎనిమిది సంవత్సరాలు కావచ్చింది. నేటివరకూ దీనిని నాటక ప్రియులకు సమర్పించలేక పోయినాను.
ఈ 'వసంతసేన'కు శూద్రకుని కథ కేవల మాధారము. శూద్రకుని కథలో చారుదత్తుడికి ధూతాదేవి పత్నిగా ఉన్నది. ఇట్టి స్థితిలో వసంతసేనపై అనురాగ మనుచితమని యామె మరణానంతర మాతడు వసంతసేనపై అభిమానమును గొన్నట్లు, నేను మార్పొనర్చినాను. మైత్రేయుని పాత్రకు వ్యక్తిత్వం ఉన్నట్లు మూలంలోని కథలో గోచరించదు. వైదికుల ఆ కేకరాలను పరిభాషలను దేవాదేవేషు, అయంవై, వికిరపిండం, బ్రహ్మిష్ఠోబ్రహ్మిష్ఠి, ఇత్యాదులను అతనిచేత పలికించి ఒక ప్రత్యేకత నాపాదించటానికి ప్రయత్నించాను. శకార పాత్రకు 'వెర్రిపాటలను' పెట్టటంలో వినూత్నతను ఉద్దేశించాను. ఇతని విషయంలో వసంతసేన ఇంటిముందు తిరుగాడటం, వీధిభాగవతం ఆడటానికి యత్నించటం నూతన కల్పనలు. మదనికాశర్విలకుల యన్యోన్యానురాగాన్ని వసంతసేన గ్రహించి వారికి వివాహం చేయటం కూడా స్వతంత్ర కల్పన.
ప్రదర్శనానుకూల్యతకోసం ఇందులో ఒక దృశ్యం దీర్ఘంగాను, మరొక దృశ్యం స్వల్పంగాను కల్పించడమైంది. ఇందలి అల్పదృశ్యాలన్నీ ప్రథమయవనికలు (Curtain Risers) ప్రాచీన నాటకాలల్లోని విష్కంభాలను పోలినవి. విశ్రాంతికోసం పదోదృశ్యంముందు అల్పదృశ్యాన్ని కల్పించలేదు. అక్కడనుంచి ఉత్తరార్థం ప్రారంభ మౌతుంది.
రచన, ప్రదర్శన, ముద్రణలలో నాకు తోడ్పడిన నా మిత్రులందరికీ కృతజ్ఞుణ్ణి. ఆదరపూర్వకంగా ఈ కృతిని అంకితం తీసుకోటానికి అంగీకరించిన సాహిత్య ప్రియంభావుకులు, కవులు, నాటకకర్తలు, పండితులు, మానవోత్తములు ఐన ప్రధానాచార్యులు శ్రీ వల్లభజోస్యుల సుబ్బారావు గారికి నా నమోవాకములు. శ్రీ గుర్రం మల్లయ్యగారి చిత్రాలతో ఈ నాటకాన్ని అలంకరించే అవకాశాన్ని చేకూర్చిన ఆప్తమిత్రులు శ్రీ ఊట్ల కొండయ్యగారికి నా ప్రణయ పూర్వక నమస్మారములు.
ఉమాసదనం:
సాహిత్య కళోపాసి
బ్రాడీపేట, గుంటూరు:మే 5, 1953
వావిలాల సోమయాజులు
పాత్రలు
పురుషులు:
- చారుదత్తుడు : కథానాయకుడు
- మైత్రేయుడు : చారుదత్తుని మిత్రుడు
- శర్విలకుడు మదనిక భర్త, దొంగ
- శకారుడు : రాజశ్యాలకుడు
- కుంభీలకుడు : విటుడు, శకారుని మిత్రుడు
- సంవాహకుడు : జూదరి, బౌద్ధసన్యాసి
- అధికరణకుడు : న్యాయోద్యోగి
- శోధనకుడు : న్యాయస్థాన కరణికుడు
- గోహ : న్యాయస్థాన సేవకుడు
- రోహసేనుడు : చారుదత్తుని కుమారుడు
స్త్రీలు :
- వసంతసేన : గణిక, చారుదత్తుని ప్రియపత్ని
- మదనిక : వసంతసేనకు సేవిక, చెలికత్తె
- రదనిక : చారుదత్తుని గృహసేవిక
ఒకటో దృశ్యం
(ఉజ్జయినీ నగరం, సమయం దీపాలవేళ. కామదేవాలయ ప్రాంగణంలో కుడివైపు చిన్న వేదికమీద మదనదేవ విగ్రహం. ఎడమవైపు ఒక వేదిక అలికి ముగ్గులు పెట్టి ఉంటుంది. ప్రవేశము రాజశ్యాలకుడు శకారుడు, అతని మిత్రుడు ఒక విటుడు, కుంభీలకుడు)
శకారుడు : (రాజసంతో నాలుగు దిక్కులూ పరికిస్తూ) బావా! ఇటువంటి బ్రహ్మాండమైన ఆలయాన్ని మనవాళ్లు ఎందుకు కట్టించారో ఎన్నడైనా ఆలోచించావా?
కుంభీలకుడు : (చమత్కారంగా) మహాప్రభువులు, తమబోటివారి కొలువులో పడ్డ తరువాత తీరుబడి ఎక్కడేడ్చింది?
శకారుడు : అయితే నాకొక మంచి ఊహ తోచింది.
కుంభీలకుడు : (వెటకారంగా) ఓహోఁ (ఏదీ అన్నట్లు చిటిక వేస్తాడు)
శకారకుడు : (స్వాతిశయంతో నిలిచి బావా! నేను మహాపండితుణ్ణి, రామాయణ, భారత, భాగవతాలూ, ఇంకా అనేక గ్రంథాలు ఉఫ్‌మని ఊదేశాను. నాలుగు వేదాలల్లో నాకు తెలియని సంగతులు వేరే ఏమున్నవోయ్. ఆలోచించకుండా ఈ మంచి మనస్సు అరనిమిషం ఊరుకోదు.
కుంభీలకుడు : ఇంతకూ ఇటువంటి దేవాలయాలు....
శకారుడు : ఆఁ, పూర్వులు ఇవి కట్టించటంలో పరమ రహస్యం ఒక్కటే. ఊళ్ళో మగవాళ్ళనూ, ఆడవాళ్ళనూ ఉదయం సాయంకాలం ఒక్కచోట చేర్చటానికి.
కుంభీలకుడు : చేరిస్తే -
శకారుడు : ఇంతేనా మరి? పెళ్ళిళ్ళు కానివాళ్ళకు పెళ్ళిసంబంధాలూ, అవీ లేనివాళ్ళకు ప్రేమ సంబంధాలూ కష్టం లేకుండా కుదిరిపోతవని.
కుంభీలకుడు : బావా! నీవు ఇక్కడెక్కడా పుట్టదగ్గ పురుషుడివే కావు, భూలోక బృహస్పతివి.
శకారుడు : హిఁ, హిఁ, హిఁ, హిఁ... (జ్ఞప్తికి తెచ్చుకున్నట్లు) ప్రొద్దు పోయిందంటే వినకుండా ఆలయంలో అతివలుంటారు రమ్మని ఇంతదూరం నడిపించుకో వచ్చావు. ఏరీ? ఇంతసేపు ఇంతులను చూడకుండా ఈ శ్యాలకమహారాజు ఎలా ఉంటాడనుకున్నావు?
కుంభీలకుడు : తొందరపడితే ఎట్లా?
శకారుడు : కానీ, బావా ఇదుగో మనం చిన్ననాడు చెప్పుకున్న తత్వం ఒకటి పాడుకుంటాను (చిందువేస్తాడు)
గు, గ్గు, గూటి చిలకేది రన్నా!
చిన, చిన్న గూడుచినబోయె రన్నా! (చిందు వేస్తాడు)
(క్షణంలో స్ఫురించినట్లు) బావా! వసంతసేన !!
కుంభీలకుడు : ఆమె ఇంకా ఇంటిదగ్గర బయలుదేరే వేళే అయి ఉండదు.
శకారుడు : దీపాలు పెట్టిన తరువాత ఇంకేం వస్తుంది?
కుంభీలకుడు : నేను ఆమెను రమ్మని చెప్పిందే అప్పుడు.
శకారుడు : అయితే మన మంత్రం పారిందన్నమాట! పిట్ట పట్టుకు చిక్కిందన్నమాట!!
కుంభీలకుడు : చిక్కటమేమిటి! కాసేపట్లో ప్రభువుగారి చేతుల్లో చిమిడిపోబోతుంటే.
శకారుడు : (పెద్దపెట్టున) హిఁ, హిఁ, హిఁ బావా! (మెడలో హారం తీసి అతనికి ఇవ్వబోయి మళ్ళీ మెళ్ళో వేసుకొంటూ) నా కోసం వసంతసేన వస్తుందా?
కుంభీలకుడు : ఆఁ
శకారుడు : తప్పకుండా?
కుంభీలకుడు : తప్పకుండా!
శకారుడు : నా మీద ఒట్టే? (చెయ్యి జాపుతాడు)
కుంభీలకుడు : (చేతిలో చేయి వేస్తూ) నీ మీద ఒట్టే. శకారుడు : హిఁ హిఁ హి - వసంతసేనే! నాకోసమే!! ఇక్కడికే!!! బావ కూడా తోడు ఉన్నప్పుడే! హిఁ హిఁ హిఁ (చిందువేస్తూ వెకిలిగా)
దశ్శరభ! శరభా!! దమ్మక్క పిల్ల!!
నీరంటి పిల్ల! నిమ్మంటి పిల్ల!!
పొన్నంగి కళ్ళు
మున్నంగి వొళ్లు,
పిల్లంటే పిల్లా!
కల్లంటి పిల్ల!!
దశ్శరభ! శరభా!! దమ్మక్క పిల్లా!!
నీరంటి పిల్ల! నిమ్మంటి పిల్ల!!
కుంభీలకుడు : ఏం బావా! నీవిప్పుడే నిలిచేటట్లు లేదు. ఈ నాట్యం అంతా ప్రభువువారు ఎక్కడ నేర్చుకున్నారో!
శకారుడు : అక్కతోపాటు అయ్యవార్లంగారివద్ద చెప్పుకున్నాం రణభరతం! రావణభరతం!! నేను గొప్ప ఆటగాణ్ణి.
కుంభీలకుడు : ఆటగాడి వేమిటి? గొప్ప పాటగాడివి కూడా.
శకారుడు : (కుంభీలకుడి చేతిలో ఉన్న పానపాత్రవైపు వేలు చూపిస్తూ) ఏది బావా! ఒక గుక్కెడు ఇలాతే- కళ్ళకు కాస్త కళ్లొస్తుంది.
కుంభీలకుడు : (వరుసగా శకారుడి చేతికిచ్చిన చిన్న పాత్రలో ముమ్మారు పానీయం పోస్తాడు)
శకారుడు : (ఆర్చుకుంటూ తాగి) బావా! నేనెవరిని?
కుంభీలకుడు : (ముఖం వైపు తీక్షణంగా చూస్తూ) శ్యాలకమహారాజులుం గారు.
శకారుడు : నీవో!
కుంభీలకుడు : తమ సేవకుణ్ణి
శకారుడు : (ఆధిక్యస్ఫోరకంగా) ఛీ! సేవకాధముడివి!!
కుంభీలకుడు : (గొంతుమార్చి) బావా! అయితే నీకోసం వసంతసేన రాదు కోపం వస్తున్నది. శకారుడు : వసంతసేన రాదూ? కోపం వస్తున్నదా? సహించను. దాన్ని చంపేస్తాను (చిన్న మొండికత్తి మొలలో నుండి లాగి ఎక్కిళ్ళు పెడుతూ)
భళి, భళీ, ప్రభువులది
బంగారుబాట!
తనమాట వినకుంటె
తప్పనిది వేట!!
కుంభీలకుడు : (ఒళ్ళు తెలియటం లేదన్నట్లుగా అభినయించి దగ్గరకు పోయి తడుతూ) బావా! వసంతసేన వచ్చేస్తున్నది!
శకారుడు : ఆఁ!. రంభలా రమ్మను - (కత్తి మొలలో దోపి) అది వొచ్చేటప్పటికి నేను రమ్యంగా రాభణాసురుడిలా కనిపించాలి. ఇదుగో, బావా! ఈ హారం నీ మెళ్ళో వేసుకో. (హారం ఇస్తాడు)
కుంభీలకుడు : (అందుకొని మెళ్ళో వేసుకుంటాడు)
శకారుడు : (చొక్కాకు కుట్టిన అద్దం చూచుకుంటూ హారాలు సవరించుకుంటుంటే కుంభీలకుడు సహాయం చేస్తాడు) నేను ఇప్పుడు ఎట్లా వున్నాను బావా!
కుంభీలకుడు : మహారాజులుంగారిలా ఉన్నావు మన్మథ దేవుడి మరిదిలా ఉన్నావు.
శకారుడు : వసంతసేన వచ్చేటప్పటికి ముచ్చటగా ఆ అరుగుమీద కూర్చొని అసురగానం పాడుకుంటుంటాను.
కుంభీలకుడు : (చిరునవ్వుతో) బావా! నీ పాట వినిపిస్తే గుళ్ళు కూలిపోతాయి. వసంతసేన వచ్చినదోవనే వెనక్కు వెళ్ళిపోతుంది.
శకారుడు : అయితే ముద్దులు మూట కట్టేటట్లు పొలిమేరలో పోలేరమ్మలాగా గంభీరంగా కూర్చుంటాను. దాని చేతనే ఆడించు, పాడించు. (పోయి వేదికమీద సగర్వంగా కూర్చుంటాడు)
కుంభీలకుడు : (దూరం నడచి) అదుగో ప్రాకారం దాకా వచ్చేసింది. (ఒక పద్దతిలో కూర్చోపెట్టి) ఇలా కూర్చో - గుమ్మం దాకా వచ్చింది.
శకారుడు : (బిర్రబిగిసి దగ్గుతాడు) కుంభీలకుడు: వెంట మదనిక కూడా వస్తున్నది. వెర్రిచేష్టలు చెయ్యకు. వసంతసేన అందరివంటిది కాదు గణిక!
శకారుడు : ఆఁ! కణికా! మదనిక కూడా వెంట వస్తున్నదా? మరీమంచిది మనకోసం ఇద్దరినీ మాట్లాడుదాం.
కుంభీలకుడు : (నిశ్శబ్దమన్నట్లు) ఇస్! (దగ్గరకు వచ్చారని హస్తసంజ్ఞ)
శకారుడు : (మళ్ళీ దగ్గుతాడు)
కుంభీలకుడు : (దగ్గరకు వచ్చి) మదనారాధన కాగానే మదనికను పంపించివేస్తుంది. అందాకా మనం అవతలి స్తంభం చాటున నిలబడి కనిపెడుతుందాం. లే.
శకారుడు : ఉఃఁ ఉఃఁ (అయిష్టాన్ని ప్రకటిస్తాడు)
కుంభీలకుడు : (తాను బయలుదేరుతాడు. శకారుడు తప్పనిసరి ఐతే అనుసరిస్తాడు)
(ముందు మదనిక పూజాపాత్రికతో నడుస్తుంటే వెనక వసంతసేన వస్తుంటుంది. పూజాద్రవ్యాలు క్రిందపెట్టి మదనిక ప్రక్కకు తప్పుకుంటుంది. వసంతసేన మదనవిగ్రహానికి ముందుగానిల్చి నమస్కరించి నాట్యభంగిమలో సాభినయంగా అంజలించి పాట పాడుతుంది)
జయ, జయ, మధుమయ, మదనా!
జయ, జయ, యువజన, సదనా!!
ఓ జైవాతృక!
రససాంయాత్రిక!!
సుషమాసుందర!
మానసమందిర!! జయ, జయ
త్రిభువనపావన!
నవయుగజీవన!!
ఓ సుమసాయక!
ఉజ్జ్వల నాయక!!
జయ, జయ, మధుమయ మదనా!
జయ, జయ, యువజన సదనా!!
అడవిలో కాచిన వెన్నెలను చేయదలచుకున్నావు. నా పవిత్ర ప్రేమలతకు ప్రపంచములో ఆలంబనమే లేదా? అనుగ్రహించి నీవిచ్చిన ఈ అందచందాలు ఆటపాటలూ అర్ధోన్మత్తులైన ఈ పామరపల్లవుల పాలు చేయవలసిందేనా? రసిక దాంపత్య ప్రణయానికి ఈ దాసి నోచుకోలేదా? ఊహాగానాలతో ఉజ్వలానంద రసపిపాస తీర్చుకోలేను స్వామీ! నా స్వప్నసౌఖ్యాలకు వాస్తవిక స్థితి రాదా? కనికరించి నా కామితమీడేర్చు ప్రభూ! నీ దయ రానిది ఇక నీ పాదదాసి జీవించలేదు నీకు ఆటలుండవు! - పాటలుండవు!! మదనికా!
(నిస్త్రాణతో లేచి వేదికను సమీపిస్తుంది)
మదనిక: (దగ్గరకు వస్తూ) అక్కా!
వసంతసేన : అమ్మాయీ! ఆర్యచారుదత్తులు ఇందాకనే ఆలయానికి బయలుదేరారంటివే?
మదనిక: అవును. అబద్ద మేముంది!
వసంతసేన : మరి ఏరీ?
మదనిక: (ఎవరికోసమో నిరీక్షిస్తున్నట్లు నటించి) మైత్రేయులూ ఆర్యులూ రాచబాటలో ఆలయానికి పయనమౌదా మనుకుంటుంటే విని ఆఘమేఘాల మీద వచ్చి నిన్ను పిలుచుకోవచ్చానక్కా!
వసంతసేన : ఈ పాటికి వారు వచ్చి వెళ్ళిపోయి ఉండరు గదా!
మదనిక : ఇంతలోనేనా? మనం అడ్డదారిని కూడా వస్తిమి.
వసంతసేన : ఇంకా వారు వస్తారంటావా?
మదనిక : వస్తారనే నా నమ్మకం. (వసంతసేన ప్రక్కకు చేరి కూర్చుంటూ) అక్కా! ఈ దినం అప్పుడే ఆటచాలించావు.
వసంతసేన : ఎందుకో నాట్యం చేయాలని ఆసక్తే లేదు. ఇదని చెప్పలేకుండా ఉన్నాను. కాసేపు గజ్జె కట్టానో లేదో ఎంత అలసిపోయినానో చూడు. (వేదనపడుతుంటే మదనిక ఉత్తరీయపు కొంగుతో విసురుతుంటుంది) అమ్మాయీ! ఏమైనా సరే, వారు ఏమనుకుంటున్నా సరే, ఈ దినం ఆర్య చారుదత్తులు వస్తే ఆ సంగతి అడిగివేస్తాను. లేకపోతే మనస్సును కలతపెట్టే కోరికను ఎన్నాళ్ళని దాచిపెట్టేది? మదనిక : (సాలోచనగా) ముందు నీవే బయటపడితే చులకనైపోతావేమో!
వసంతసేన : అల్పుల విషయంలో అంతే కావచ్చును. కానీ ఆర్యుల విషయంలో సంకోచించ నవసరంలేదనుకుంటున్నా.
మదనిక : అయినా, అక్కా! నీ పవిత్రప్రేమకు ఈ ప్రక్కదారులెందుకు? వారు వస్తున్నారేమో!
వసంతసేన: అమ్మాయీ! ఆయనకు విధ్యుక్తంగా నిలవబడి ప్రణామం చేయగలుగుతానా?
మదనిక : (సకరుణంగా) అక్కా! నీ వింత బేల వనుకోలేదు. (కొంతదూరం ముందుకు నడిచి) అరుగో! ఆర్యులూ మైత్రేయులూ!!
వసంతసేన : అమ్మాయీ! నాకేమిటో అర్థంగాని భయమేస్తున్నది.
మదనిక : భయమెందుకు? రాగానే నిలవబడి నమస్కారం చెయ్యి! చిరునవ్వుతో చిత్తాన్ని ఆకర్షించు.
వసంతసేన : ఆ పని నాకు సాధ్యమౌతుందా?
మదనిక : అక్కా! ఆయనమటుకు అన్నీ ఉడిగిపోయిన అద్వైతికాడుగా! నీవు కాకలు తీరిన కళోపాసివీ - దగ్గరికి వచ్చేస్తున్నారు. సిద్ధపడు! నేను వెనుక ప్రక్కగా నిలవబడతాను.
(బయలుదేరబోతుంది)
వసంతసేన : నేను ఒంటరిగా ఉండలేను. అయినా వారి ఆరాధనకు అడ్డువస్తానేమో! నేనూ ఆ విగ్రహం వెనకనుంచీ వారి సౌందర్యాన్ని కళ్లార చూచి ఆనందించి తరువాత వచ్చి నమస్కరిస్తాను. (పూజాపాత్రిక వేదికమీదనే ఉంచి ఇద్దరూ విగ్రహాలవెనుకకు వెళ్ళిపోతారు)
(ప్రవేశము - మైత్రేయుడు, చారుదత్తుడు)
చారుదత్తుడు : మైత్రేయా! ఎంత చల్లనిస్వామి!! ఒక నమస్కారం చేసివద్దామా!
మైత్రేయుడు : (క్రోధముతో) పంచబాణాలు మనమీద పడేయటానికేనా? చాలు చాల్లే - మొక్కటానికి కోటాన కోట్ల దేవతలుంటే దొరక్క దొరక్క నీకు బలే దేవుడు దొరికాడులేవోయ్!! తార్పుగత్తెలదొర!! (వేదికమీద చతికిల పడుతూ) నేనిక్కడ కూర్చుని జంధ్యానికి బ్రహ్మముడి పూర్తి చేసుకుంటుంటాను. నీవు వెళ్ళి పూజించి ఆయన వేసే పుట్టెడు బాణాలు నీమీదనే వేయించుకో.
చారుదత్తుడు : (విగ్రహం చేరువకు నడిచి, సాష్టాంగపడి లేచి మోకరిల్లి ప్రార్థిస్తాడు)
శంభు స్వయంభు హరయో హరిణేక్షణానాం
ఏనా క్రియంత సతతం గృహకుంభదాసాః
వాచామగోచర చరిత్రవిచిత్రితాయ
తస్మై నమో భగవతే కుసుమాయుధాయ
(ఒక పాత్రలో ఉన్న పుప్పొడి చేతికందుకొని కళ్ళ కద్దుకొని శిరస్సుమీద ఉంచుకుంటాడు. మరికొంత చేత్తో పుచ్చుకొని మైత్రేయా! ఈ పుప్పొడి నీ శిరస్సున ధరించు, నీ సమస్త దోషాలూ హరిస్తవి (వేయబోతాడు).
మైత్రేయుడు : (చనువుతో కూడిన పెడసరంతో) నీ శిరస్సుమీద ఉంచుకున్నావుగా! చాల్లే. దోషాలు సమస్తమూ దగ్ధం చేయటానికి భూతేశుడిచ్చిన విభూతి ఉండగా (సంచిలోనుంచి బయటకు తీసి విభూతి మళ్ళీ పెట్టుకుంటూ) నా కెందుకీ ముష్టి పుప్పొడి, కంపుకొడుతూ, పైగా నేనేమన్నా వెనుక దోషాలు చేశానా? ఇంకముందు చేయబోతున్నానా? ఘోటక బ్రహ్మచారిని!
చారుదత్తుడు: (దానిని కూడా తన శిరస్సుమీద ఉంచుకుంటూ) మైత్రేయా! దేవతలమీద కూడా నీకెందుకోయ్ ఇంత ఉక్రోషం.
మైత్రేయుడు : ఊరికే వస్తుందా. గోపురకలశాలకనీ, గోడగడ్డలకనీ, ఈ దొంగదేవుడి గుడిమొఘాన ఇంత డబ్బు తగలేశావు గదా, తిండికి చాలక నానా గడ్డి కరుస్తుంటే నా చేత తిట్లైనా తింటానికి ఒప్పుకున్నాడు గాని ఒక్క చిల్లి గవ్వైనా ఇచ్చాడా. మనకీ దేవుడు?
చారుదత్తుడు : (వేదికమీద కూర్చుంటూ) నీవు ఎంత వెర్రిబాగులవాడివి! మన బ్రతుకే ఆ భగవంతుడి కృపకాదుటోయ్.
మైత్రేయుడు : నా బ్రతుకు కూడానా నా ఖర్మం కాలితే! ఓం శాంతిః శాంతిః -
చారుదత్తుడు : మనం ఆయన ఋణం తీర్చుకోలేని ఈ దరిద్రస్థితికి వచ్చామని నాకెంతో చింత వేస్తున్నది. మైత్రేయుడు : (వెటకారంగా) పాపము!
చారుదత్తుడు : (ఆలయంవైపు చూస్తూ) ఈమధ్య కొంతకాలంనుంచీ ఆలయంవైపున రావటానికే కాళ్ళాడటం లేదు సిగ్గేస్తున్నది.
(*) శ్రీదేవి నామీద దయ ఉంచిన దినాలల్లో నా ధనంతో చిత్తజదేవుని మహోత్సవాలు ప్రతివత్సరం జరిపించాను.
ఒకనాటి కైంకర్యానికి కూడా ఈనాడు నా దగ్గిర ఏమీ లేదు.
మైత్రేయుడు : చాలు. చాల్లే! పెట్టిందంతా చాలదూ! ఇక్కడుంటే ఇంకా నీకేవో ఇటువంటి ఊహలే కలుగుతుంటవి. లే!
చారుదత్తుడు : (దృష్టి వసంతసేన, మదనికలు వదలిపోయిన పూజాపాత్రికమీద పడుతుంది) పాపం! ఎవరో ఇది మరచి ఇంటికి వెళ్ళిపోయినట్లున్నారు.
మైత్రేయుడు : ఆ ఏదీ - మా అక్కగారు తులసీమందిరం ముందు పెట్టుకొని పూజ చేసుకోటానికి ఎంతో బాగుంది.
చారుదత్తుడు : (పూజాపాత్రలో ఉన్న ఒక పూవు చేతికి తీసుకుని వాసన చూస్తూ) ఎవరైనా ఆలయవనంలో పూలకోసం తిరుగుతున్నారేమో!!
మైత్రేయుడు : (లేచి నాలుగుదిక్కులూ కలయచూస్తూ ఉండగా ఒకవైపునుంచి మదనిక వసంతసేన వచ్చి చారుదత్తుని ముందు నిలబడతారు)
చారుదత్తుడు : (వెనుకగా వసంతసేన నిలుస్తుంది. మదనిక చారుదత్తునివైపూ, పూజాపాత్రికవైపూ ఒక మాటు దృష్టిని నడిపిస్తుంది) అమ్మా, ఇది మీదేనా? తీసుకువెళ్ళండి - (అని అందిస్తాడు)
మదనిక : (వసంతసేనను ఉద్దేశించి) ఇది మా అక్కగారిది.
వసంతసేన : (ముందుకువచ్చి నమస్కరించి లజ్జతో నేలబొటనవ్రేలితో వ్రాస్తూ నిలుచుంటుంది)
చారుదత్తుడు : జయోస్తు - శుభమస్తు - అమ్మా! నీ పేరు?
మదనిక : వసంతసేన!
చారుదత్తుడు: (చకితుడై) వీణావాదనంలో విశేషప్రజ్ఞావంతురాలని విఖ్యాతిగన్న వసంతసేనవు... మదనిక : అవును... ఆమె మా అక్కగారే!
చారుదత్తుడు : ఆలయానికి చాలా ప్రొద్దుబోయి బయలుదేరారు?
మదనిక : (ఛలోక్తిగా) మా అక్కగారు కోరినపూవు ఈ తోటలో ఇప్పుడే వికసించింది.
చారుదత్తుడు : పూలే వెతుక్కుంటూ వచ్చి మీ వాడలో అమ్ముడుపోవలసిందిగా!
వసంతసేన : ఆర్యా! అమ్మకానికి రాని పూవుమీద ఆశపెట్టుకొన్నప్పుడు అక్కడికే వెళ్ళక తప్పుతుందా!
చారుదత్తుడు : అమ్మా! నీ ఛలోక్తికీ, రసికతకూ సంతోషము.
వసంతసేన : ధన్యోస్మి.
చారుదత్తుడు : మీ వీణావాదనం వినటానికి ఎప్పుడైనా అవకాశ మిప్పిస్తారా?
వసంతసేన : తమ కభ్యంతరమా? (అంజలితో ప్రేమావలోకనం చేస్తుంది)
చారుదత్తుడు : మనఃస్వస్థత చూచుకొని ఒకమాటు మీ ఇంటికి ఏకాంతంగా వస్తాను.
మైత్రేయుడు : చారుదత్తా! ప్రొద్దు పోతున్నది. ఇంక బయలుదేరుదామా, ఆలస్యమైతే అక్కయ్యగారు ఆదుర్దాపడుతుంటారు.
చారుదత్తుడు : (బయలుదేరుదామన్నట్లుగా లేస్తూ) అమ్మా!
వసంతసేన : (నమస్కరిస్తుంది)
చారుదత్తుడు : మైత్రేయా! (బయలుదేరమని దారి చూపిస్తాడు)
(ఇరువురూ నిష్క్రమిస్తారు)
మదనిక : అక్కా! మొదట్లో అంత సిగ్గుపడ్డావేం? ఇంతకేనా ఏమిటో అడిగివేస్తానన్నావు?
వసంతసేన : ఆ రెండుముక్కలైనా ఎలా అనగలిగానో ఇప్పుడు నాకే అర్థం కావటం లేదు. ఏమిటో వారితో మాట్లాడటమంటే భయం వేసింది మదనికా! - అయితే వారు నా మనస్సు గ్రహించి ఉంటారా?
మదనిక : (చిరునవ్వుతో) ఏమో! అంజలిపట్టి ఆర్పకుండా కాటుకకళ్ళతో సంభాషించిన రసికురాలివి. నీకే అర్థం కావాలి. వసంతసేన : (బుగ్గమీద తట్టి) చాల్లేవే పరిహాసం, మదనికా! మనఃస్వస్థత చూచుకొని ఏకాంతంగా మీ ఇంటికే వస్తాననటంలో...
(శకారుడూ, కుంభీలకుడూ ప్రవేశించిన తరువాత)
శకారుడు : (రాజనంతో) ఒరేయ్! మనం దానికిచ్చిన హారాలు లెక్కవేస్తే ఎన్నైనై.
కుంభీలకుడు : (నమ్రభావంతో లెక్కిస్తూ) దరిదాపు మూడు వందలు?
శకారుడు : (దగ్గుతూ) మనతో అది సరిగాఉంటే ఇంకా ముట్టేవి కావట్రా!
కుంభీలకుడు : మహాప్రభువులు ముట్టకపోవటమేమిటి తమ దగ్గిర!
శకారుడు : (వేదికమీద కూర్చున్న వసంతసేన, మదనికల నుద్దేశించి) ఒరేయ్! వాళ్ళెవరో కనుక్కో!
కుంభీలకుడు : (మదనికతో) అమ్మాయీ! మీరెవరు? ప్రభువుగారు...
మదనిక : అయ్యా! వారెవరు?
కుంభీలకుడు : శ్యాలక మహారాజులుంగారు!
మదనిక : (వెళ్ళిపోదామన్నట్లు కనుసంజ్ఞ చేస్తూ) అక్కా! శ్యాలక మహారాజులుంగారు! శ్యాలకమహారాజులుంగారు! (లేచి పూజాపాత్రికతో మదనిక శకారుడు దగ్గరకు వచ్చి వంగి నమస్కరించి జారుకుంటుంది. ముందే వసంతసేన వెళ్ళిపోతుంది)
కుంభీలకుడు : ఏదో గుసగుసలాడి ఆ పిల్లపోరి మళ్ళా వస్తుందనుకున్నాను. పరిగపిట్టల్లా ఇద్దరూ పారిపోతున్నారు. బావా! నీవు వేసిన పన్నాగం పారలేదు.
శకారుడు : (గతుకుతూ ఉన్న గొంతుకతో) ఆఁ, రెండు పిట్టలూ మన మన్మథబాణాల గురి తప్పించుకుని పారిపోయినయ్! ఉఁ (కోపంతో) ముందుగా నీవు వాళ్ళతో మాట్లాడిరాలేదన్నమాట!
కుంభీలకుడు : అయితే మటుకు మాట్లాడినట్లు కనిపిస్తారా నీవే చొరవ చేసుకోవాలి గాని.
శకారుడు : (అలోచించి ఉద్వేగంతో) ఆ దరిద్ర చారుదత్తుడితో అంతసేపు గౌరవమిచ్చి మాట్లాడిందే - మహాప్రభువు అని నీవు చెప్పినా అది మాటైనా మాట్లాడకుండా
దుక్కిపిట్టలా తుర్రుమంటుందా బావా! (*) ఇది
దాటదీపరి! కసుమాల! దాట్లగుట్ట! దుక్కిపిట్ట! పిశాచంబు!! దొంగతొర్రు!!
(యక్షగాన ఫక్కికలో)
ఔర! రాజును నేను మాటాడకిట్లు
పారిపోతాదె బావ ఈ పడుపుకత్తె!!
(రొప్పుతూ) అవమానం సహించను. వెంటపడి జుట్టుపట్టి వెనక్కు లాక్కోవస్తాను. (పోబోతుంటే కుంభీలకుడు వారిస్తాడు)
శకారుడు : ఇప్పుడు ఎంతకోపం వచ్చిందో తెలుసునా -
కుంభీలకుడు : ఔనౌను! - ప్రభువువారికి కుంభకర్ణుడి నిద్రంత కోపం వచ్చింది!
శకారుడు : బావా! నీకు నాతోపాటు వేటాడటమంటే ఇష్టమేనా?
కుంభీలకుడు : ఆఁ.
శకారుడు : కరుకుట్లు తినటమంటే ఇష్టమేనా?
కుంభీలకుడు : ఆఁ.
శకారుడు : అయితే నే చెప్పినట్లు విను - దీన్ని సాధించాలి.
కుంభీలకుడు : ఔను సాధించాలి. (ఇద్దరూ చేతిలో చేయి వేసుకొని ఊపుకుంటూ)
ఆరె పులీ! భళిరె. భళీ!!
నేను కలీ, నీవు బలీ
సంతకాడ సాని దాని
వంతపాట బంతి ఆట! ...ఆరె పులీ!!
మొన్న రేతిరి వెన్నెలలోన
నన్ను చూచి కన్నుగీటిన,
అన్నులమిన్న చిన్నదాని
కోలాటమె కోలాటము ...ఆరె పులీ!
(నిష్క్రమిస్తారు)
రెండో దృశ్యం
(పూజాపాత్రిక ఊపుకుంటూ అత్యుత్సాహంతో ఏకాంతంగా వసంతసేన మదనాలయం నుంచి ఇంటికిపోతూ పాడుకుంటుంది)
నావ నైనానోయి సఖుడా!
నడుపవోయీ, నావికుడవై!!
కారు మొగిలులు లేనె లేని
గాలిగుంపులు రానె రాని
ప్రణయసాగరతీరభూముల
పాడుకోరా! ఆడుకోరా!! నావనైనా...
వెండి వెలుగుల నిండి వెలిగే
వింత లోకములోన సఖుడా!
నాకు నీవై నీకు నేనై
ఏకమౌదామోయి సఖుడా!! నావనైనా...
కుంభీలకుడు : వసంతసేనా!... నిలు!... నిలు!!
శకారుడు : (తెరలో నిష్కర్షగా) వసంతసేనా! వసంతసేనా!!
వసంతసేన : (వెనుదిరిగి చూచి) అయ్యో! అయ్యో!!
శకారుడు : (కుంభీలకుడితో ప్రవేశించి) మేము... మేము వసంతసేనా!
వసంతసేన : (భయకంపితస్వరంతో) పల్లవికా. పరభృతికా! మదనికా! మధుకరికా!... అయ్యో! అయ్యో!
శకారుడు : బావా! ఎవరో మనుష్యులను పిలుస్తున్నది.
కుంభీలకుడు : పరిజనాన్ని బావా! శకారుడు : ఆడవాళ్ళనేనా?
కుంభీలకుడు : ఉఁ.
శకారుడు : (ధైర్యంతో) రానీ, వందలకొద్ది రానీ - చూడు, మరి మన ప్రతాపం! (మీసం మీదికి చేయిపోనిచ్చి గొంతు సవరించుకొంటూ అడుగు ముందుకు వేస్తాడు)
వసంతసేన : (భయకంపంతో) మధూ! మధుకరికా!!
శకారుడు : బావా! బావా!!
వసంతసేన : (వెనుకకు నడుస్తుంటుంది)
శకారుడు : (ముందుకు నడిచి) (*) నీ వెంటపడి నేను తరుముతుంటే ఆపటానికి కుంతికొడుకైన ఆ శంతనుడికీ, రంభ కొడుకైన ఆ రావణాసురుడికీ ఇద్దరికీ చేతకాదు. మరింకెవ్వరికి శక్యం? నీ పల్లవిక, నీ పరభృతిక, మధు, మధుకరిక నన్నేమి చేస్తారు? (చెయ్యి పట్టుకోబోతాడు).
వసంతసేన : (యుక్తిగా) అయ్యా! నేను అబలను.
కుంభీలకుడు : అమ్మాయీ! నీకేమీ భయంలేదు.
శకారుడు : బావ చెప్పినట్లు, ఆఁ, నీకేమి భయంలేదు.
వసంతసేన : (గౌరవాన్ని నటిస్తూ) మీరు మహాత్ములు! తెలుసుకోలేక పోయాను. (నగలు తీసి యివ్వబోతుంది)
కుంభీలకుడు: (శకారుడివైపు చూస్తూ) మా ప్రభువుగారు నీ అలంకారాలకు ఆశపడేవారు కాదమ్మాయీ!
శకారుడు : (సదర్పంగా) మనమే ఇటువంటి అలంకారాలు అనేకమంది అమ్మాయిలకు అడిగించుకోకుండా ఇచ్చామని చెప్పవోయ్!
వసంతసేన : అయితే మరి నన్ను నాదారిని -
శకారుడు : ఎక్కడికి?
వసంతసేన : నా ఇంటికి?
శకారుడు : (ఠీవిగా) పిల్లా! నేను దేవపురుష మనుష్యుణ్ణి! వసంతసేన : (అతివినయంగా) దేవపురుష మనుష్యులేమిటి? దేవ దానవ పురుష మనుష్యులు - మహాత్ములు!
కుంభీలకుడు : మా అమ్మాయికి మీ గొప్పదనం ఇప్పటికర్థమైంది!
శకారుడు : (కుంభీలకుణ్ణి దూరంగా పొమ్మని హస్తసంజ్ఞ చేస్తూ) వసంతసేనా! మీ అన్నమీద ఒట్టు నిన్ను వెన్నాడటంలో నేను ఎంతో అలిసిపోయినాను, సొలసి పోయినాను! దేవీ! కేతకీదళకఠోరవల్లీ! (ముఖం తేలవేస్తూ ప్రేమకుమారం చేస్తాడు).
వసంతసేన : ఏమిటా వెకిలిచేష్టలు! ఎవరనుకున్నావో! - నడు అవతలికి - (గద్దిస్తూ) ఉఁ.
శకారుడు : (కోపంతో) బావా! ఏమిటి మీ చెల్లెలి బెదిరింపు? నేనేమి వాడొదిలిపెట్టినానా, కాడొదిలిపెట్టినానా? ఎక్కడికి పొమ్మంటుంది? - చూడ బోతే చేయి చేసుకుండేదాకా మాట వినేటట్టు లేదు.
కుంభీలకుడు : (వసంతసేన దగ్గరికి వచ్చి) అమ్మాయీ! మా ప్రభువుగారి కంటే నీకు మంచి రసికులు ఎక్కడ దొరుకుతారని.
వసంతసేన : అయ్యా! అనురాగానికి యోగ్యత అవసరం.
శకారుడు : అఁ- ఆ దరిద్రచారుదత్తుడి కున్నంత యోగ్యత వరపురుషుణ్ణి వాసుదేవుణ్ణి నాకు లేదన్నమాట! బావా! ఇది క్షమింపరాని అవమానం అని చెప్పు.
కుంభీలకుడు : (నిష్కర్షగా) అమ్మాయీ ఇది క్షమింపరాని అవమానం!
వసంతసేన : రాచబాటలో బలాత్కారం చేయటం భరింపరాని అవమానం.
శకారుడు : బావా! ఇక ఇది మనమాట వినదు. (దగ్గరకు పోయి చేయి పట్టుకుంటాడు)
వసంతసేన : (విదలించి పెద్దగొంతుకతో) పల్లవికా! పరభృతికా! మధురికా! (దూరంగా రదనిక మైత్రేయుడు బల్యన్నంతో ప్రవేశిస్తారు)
శకారుడు : బావా, ఎవరో మనుష్యులు!
కుంభీలకుడు : (జారుకుంటాడు)
శకారుడు : బావా! బావా!
వసంతసేన : (గొంతు పెద్దదిచేసి) పల్లవికా! పరభృతికా!! శకారుడు : (రదనిక మైత్రేయులను చూచి కుంభీలకుడితో పాటు వెళ్ళిపోతాడు).
మైత్రేయుడు : బల్యన్నం క్రిందపెట్టి చేయి అడ్డం పెట్టుకొని చూస్తూ) ఎవరక్కడ? రదనికా?
వసంతసేన : (ముందుకు వచ్చి వెనక పరిచయమున్నట్లు).
అయ్యా! ఈ ఇల్లు తమదేనా?
మైత్రేయుడు : ఎవరు? వసంతసేనా! ఇది చారుదత్తుడి ఇల్లు.
వసంతసేన : (స్నేహంగా ఆలయం నుంచి వస్తూ ఒంటరిగా ఇంటికి వెళ్ళటానికి భయపడుతూ ఉన్నాను. మదనిక వచ్చేటంతవరకు నేను మీ ఇంట్లో - (రదనిక చేతిలో దీపం ఆరిపోతుంది).
మైత్రేయుడు : రదనికా! ఇలాతే, ఈమెను ఇంట్లోదించి దీపం వెలిగించుకో వస్తాను. బల్యన్నాన్ని కుక్కలు ముట్టుకోకుండా కాపాడాలి.
మదనిక : బాబయ్యా! త్వరగా రావాలి.
మైత్రేయుడు : ఇక్కడున్నట్లు వస్తాను - (వసంతసేన నుద్దేశించి) అమ్మాయీ! (దారిచూపిస్తూ వెళ్ళిపోతాడు).
(శకారుడు కుంభీలకుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొంటూ వస్తుంటారు)
శకారుడు : బావా! బావా!
కుంభీలకుడు : బయలుదేరు.
శకారుడు : ఇంకా అక్కడ ఎవరో మనుష్యులు!
రదనిక : (ఛీ, ఛీ - కుక్కను విదలించినట్లు) బాబయ్యా! బాబయ్యా!!
శకారుడు : బావా, మనను వంచించటానికి గొంతుమార్చేసింది! (పోయి రదనిక చేయి పట్టుకుంటాడు).
రదనిక : మైత్రేయయ్యా! బాబయ్యా!! పరాభవము! పరాభవము!!
మైత్రేయుడు : (ఒక చేతితో దీపము రెండో చేతిలో కర్రతో ప్రవేశిస్తూ) ఆఁయ్! ఎవడ్రా అది? (దగ్గరకువచ్చి శకారుణ్ణి చూపిస్తూ) అమ్మాయీ! వీడేనా? - మాట్లాడవేంరా బెల్లంకొట్టినరాయిలా? ఏం చేశావు? శకారుడు : (మాట్లాడడు).
మైత్రేయుడు : అమ్మాయీ! ఈ వెధవ ఏం చేశాడు?
రదనిక : చేయి పట్టుకొని -
మైత్రేయుడు : ఆఁ (దుడ్డుకర్ర పైకెత్తుతాడు)
కుంభీలకుడు : (అడ్డం వచ్చి) శాంతించమంటావా? అమ్మాయీ నీవు ఇంట్లోకి వెళ్ళు. ఇదంతా చారుదత్తుడికి తెలియనీయకు.
రదనిక : (సరేనన్నట్లు తలపంకించి నిష్క్రమిస్తుంది)
మైత్రేయుడు : ఒరేయ్! ఎవర్రా మీరు?
కుంభీలకుడు : అయ్యా! ఆప్తజన మనుకొని మా మిత్రుడు భ్రాంతిపడ్డాడు క్షమించండి!
మైత్రేయుడు : ఓరి చిత్తకార్తె వెధవల్లారా! సిగ్గు బొగ్గు లేకుండా రాచబాటల్లో పరిహాసాలు ఆడుతున్నారా?
ఇది చారుదత్తుడి గృహవీథి అని మీకు తెలియదూ- కదలరేం? - ఉఁ- 'ఎత్తేఅగ్నే' చెపుతారా లేదా? లేకపోతే 'ఛిదంతాం' చేసి పంపుతాను.
కుంభీలకుడు : బాబయ్యా! తక్షణం వెళ్ళిపోతాం.
మైత్రేయుడు : ఉఁ!
శకారుడు : లొట్టిపిట్ట మోకాలిలా బట్టతలా వీడూ వీణ్ణి క్షమాపణ అడుగుతావేం బావా! ఈ బాపనయ్య ఏమో మహామండిపడుతున్నాడు? మన సంగతి కొంచెంచెప్పు -
కుంభీలకుడు : సమస్త సద్గుణాలున్న చారుదత్తుడి మిత్రుడు ఆయన. ఎంతైనా మండిపడవచ్చు. నీవూరుకో!
శకారుడు : గుణాలన్నీ మనబొక్కసంలో ఉంటే దరిద్ర చారుదత్తుడికి ఇంకా గుణాలెక్కడివోయ్!
కుంభీలకుడు : అధిక ప్రసంగం కట్టిపెట్టి మనం వెళ్ళిపోదాం పద.
శకారుడు : వసంతసేనను విడిచిపెట్టే!
కుంభీలకుడు : నీకింక వసంతసేన... ఆమె నీది కాదు. ఆమె చారుదత్తుడి ఇంట్లో చేరింది. శకారుడు : బావా! నేను దాని సంగతి తేల్చుకోంది రాను.
కుంభీలకుడు : నీ మంచికి చెపుతున్నాను. విను వసంతసేనకు నీమీద ప్రేమలేదు.
శకారుడు : నీకెవరు చెప్పారు?
కుంభీలకుడు : ఆమె చేసే పనులవల్లే తెలుస్తున్నది - నామాట విని రా పోదాం.
శకారుడు : (రానని తల త్రిప్పుతున్నాడు)
కుంభీలకుడు : (నిష్క్రమిస్తాడు)
మైత్రేయుడు : ఓరిత్వాష్టమా! ఇంకా ఇక్కడనే నిలబడ్డావేం!! వికిరపిండం (కర్ర ఎత్తుతాడు).
శకారుడు : (కొన్ని అడుగులు వేసి వెనక్కు తిరిగి) జాగ్రత్త! మా పిల్ల ఒంటినిండా నగలతో మీ ఇంట్లో ప్రవేశించింది. వ్యవహారం అధికారుల చేతుల్లో పడకముందే మా పిల్లను మాకు తెచ్చి ఒప్పచెప్పమను చారుదత్తుణ్ణి. లేకపోతే (కత్తి చూపిస్తూ) జాగ్రత్త!
(బెదిరిస్తూ నిష్క్రమిస్తాడు).
మూడో దృశ్యం
(చారుదత్తుని గృహము - ఏకాంతంగా వసంతసేన)
నీకు నీవే సాటి.
నాకు నేనే సాటి.
ఓ మనోహరతేజ!
ఓ మధువ్రతరాజ!! ॥ నీకు నీవే... ॥
పాలింపగా రమ్ము
ప్రణయసుమ మిది రాజ!
ఈతావి నీకొరకె.
ఈతనువు నీ కొరకె. ॥ నీకు నీవే... ॥
చారుదత్తుడు : (సాలోచనగా వసంతసేన వెనుకనుంచి ప్రవేశించి ఉత్తరీయం అందిస్తూ) రదనికా! చిట్టితండ్రి ఆరుబైట నిద్రపోతున్నాడు. - పాపం! చలి వేస్తుంటుంది. ఇది తీసుకోపోయి కప్పిరాపో.
వసంతసేన : (అందుకుంటూ తావి మూర్కొంటుంది)
చారుదత్తుడు : అమ్మాయీ! పోనీ రోహసేనుణ్ణి లోపలికి తీసుకోపోయి మండువాలో నిద్రపుచ్చు - రదనికా!
మైత్రేయుడు : (రదనికతో ప్రవేశించి) ఉహు హూ! చారుదత్తా! ఆమె ఎవరనుకున్నావో! మన రదనిక కాదు వసంతసేన! ఇదిగో రదనిక - అమ్మాయీ! రోహసేనుణ్ణి మండువాలో నిద్రపుచ్చు-
రదనిక : (వసంతసేన ఇస్తూ ఉన్న ఉత్తరీయం అందుకుంటూ నిష్క్రమిస్తుంది)
చారుదత్తుడు: వసంతసేనా! రదనికని భ్రాంతిపడి నిన్ను ఆజ్ఞాపించాను ఉత్తరీయ మందించి నీ శరీరాన్ని దూషితం చేశాను. వసంతసేన : మహాభాగా! జాజితావులు కుమ్మరించే మీ ఉత్తరీయం వల్ల నా శరీరం భూషితమే అయింది.
చారుదత్తుడు : అమ్మాయీ! నీ సరసహృదయం...
మైత్రేయుడు : రాజశ్యాలకుడు ప్రదోష సమయంలో ఆలయం నుంచి వస్తున్న ఈమెను బలాత్కరిస్తుంటే భయపడి మన ఇంటికి వచ్చింది.
చారుదత్తుడు : ఈ దరిద్రచారుదత్తుడు భంగ్యంతరంగా భాగ్యవంతుడైనా డన్నమాట!.... వసంతసేనా! పరిచారికను నియోగించవలసిన పని చెప్పి పూజ్యురాలవైన నిన్ను పరాభవించాను. క్షమించాలి.
వసంతసేన : అనుచితమైన సమయంలో ఆర్యులకు శ్రమ కల్పించి నందుకు మీరే నన్ను క్షమించాలి.
మైత్రేయుడు : బాగుంది వంగిన వరిచేలలా మీరు ఒకరికొకరు నమస్కరించుకోవటం.
చారుదత్తుడు : (పరిహాసం వద్దన్నట్లు) మైత్రేయా!
వసంతసేన : (నగలు ఒక పాత్రికలో ఉంచుతూ) ఆర్యా! దయ ఉంచి దీనిని మీ ఇంట్లో దాచి ఉంచండి. వీటికోసం ఎవరైనా పాపాత్ములు వెంట పడవచ్చును.
చారుదత్తుడు : (గ్రహించమన్నట్లుగా మైత్రేయా! (ఛలోక్తిగా) నగలను దాచటానికి ఈ పేదవాడి ఇల్లు -
వసంతసేన : దానికి నమ్మకం ప్రధానంగాని, ఇంటి గట్టి కాదుగా!
చారుదత్తుడు : మైత్రేయా! ఈ పాత్రను జాగ్రత్తచేసి పగలు వర్ధమానుడూ రాత్రిళ్ళు నీవూ కాపాడుతూ ఉండాలి.
మైత్రేయుడు : అయితే దాచిపెట్టను ఇచ్చిన ఈ నగలను మనం -
చారుదత్తుడు : తిరిగీ అడిగినప్పుడు ఇచ్చివేయాలి.
వసంతసేన : మరి నాకు సెలవా? తల్లిగారు నాకోసం దిగులు పడు తుంటారు. మదనిక వెళ్ళి చాలాసేపైంది.
చారుదత్తుడు : మైత్రేయా! అమ్మాయిని వీథిమూల తిరుగుడు దాకా తీసుకోపోయి దిగవిడిచి వస్తావా? మైత్రేయుడు : నేనా! (కొద్ది గొంతుకతో) ఛాందస చక్రవర్తిని! (చిన్న నవ్వుతో) మీరిద్దరూ రాచబాటలో నడుస్తుంటే మానససరోవరంలో విహారం చేసే హంసీహంసల్లా ఉంటారు. దీపం తీసుకోరానా?
చారుదత్తుడు : (వసంతసేనవైపు చూచి నవ్వుతాడు. ఆమె కూడా అభిప్రాయాన్ని గ్రహించినట్లు నవ్వుతుంది).
మైత్రేయుడు : దీపం ముట్టించి ఉన్నదో లేదో! - (లేవబోతాడు)
చారుదత్తుడు : మైత్రేయా! దీపంతో ప్రయోజనం లేదు.
(*) ప్రియమైన కాంతులతో ఆకాశానికి వెల్లవేసి కుముదినీ ప్రణయినులు వంతలు తీర్చటానికి చంద్రభగవానుడు వచ్చాడు. ఈ వెన్నెలలో నగరవీథుల్లో భయమేమాత్రమూ ఉండదు. నీవు దీపంకోసం శ్రమపడ నవసరం లేదు. పూజ్యురాలా! వసంతసేనా! (దారి చూపిస్తుంటే వసంతసేన ముందుకు నడుస్తుంది. చారుదత్తుడు వెనుక అనుసరిస్తాడు)
మైత్రేయుడు : (చతురోక్తిగా) వసంతసేన వెంట నన్ను నడవమంటా డేమిటి? నేనెందుకు, “దంపత్యో ర్మధ్య ఏవచ” - చిలుకా గోరువంకల్లా ఎంత బాగున్నారు - వసంతసేన
కొంత డబ్బు పెట్టుబడి పెడితే చారుదత్తుడు మళ్లా వ్యాపారం సాగిస్తే మైత్రేయుడు....... నాలుగో దృశ్యం
(ఒకవైపునుంచి రదనిక బుట్టతోటీ - మైత్రేయుడు మజ్జిగ తప్పేలతోటీ ప్రవేశిస్తారు)
మైత్రేయుడు : (గుర్తుపట్టుతున్నట్టు నటిస్తూ) అమ్మాయీ!
రదనిక : బియ్యం నిండుకుంటే అక్కగారికి తెలియకుండా అప్పుకని బయలుదేరాను.
మైత్రేయుడు : ఇంట్లో తండులాలు నసంతేనా?
రదనిక : (ఆకాశంవైపు చూస్తూ) చాలా ఎండబడ్డది (నిట్టూరుస్తుంది).
మైత్రేయుడు : (ఆలోచనా పూర్వకంగా) నేను మొన్న షోడశమహాదానాలల్లో తెచ్చినవీ, నాకు మహన్యాసాలకు వచ్చినవీ మంత్ర పుష్పపు డబ్బులు పెట్టి కొన్నవీ - అన్నీ అప్పుడే అయిపోయినై - ఇంతవరకూ పొయ్యిలో పిల్లి లేవలేదన్నమాట!
రదనిక : ఈ పూటకు అయ్యీ కానట్లుగా ఉంటే అక్కయ్య గారు మడికట్టుకున్నారు బాబయ్యా!
మైత్రేయుడు : (దీనభావాన్ని ప్రకటిస్తూ) ప్స్ - పాపం! పదిమంది వంటవాళ్ళను పెట్టుకొని వండించి పంక్తికి వడ్డించే మా అక్కయ్యగారికి చివరకు చేతులుకాల్చుకోటం తప్పించాడు కాడు బ్రహ్మ. వాడి ముండమొయ్య. అయితే పచ్చి బంగారం తినవలసిన పండులాంటి సంసారానికి ఇంతటి పరమ దౌర్భాగ్య స్థితి రావలసిన అగత్యమే ముందట? చెపితే విన్నాడా? బ్రాహ్మడి కేం వ్యాపారం? మొదట్లో లాభాలు వచ్చినట్లే కనిపించి కొత్తనీరుతో పాతనీరు కొట్టుకోపోయింది. ఒళ్లు తెలియకుండా సమారాధనలకనీ, సంతర్పణలకనీ, సప్తాహాలకనీ, సహస్రాలకనీ ఒకటే దానాలైపోతే కుబేరుడు కూడా కొల్లబోక ఏమౌతాడు?
రదనిక : బాబయ్యా! మహాత్ముడు, ఆయననని ఏం ప్రయోజనం? తిని కుడిచే భాగ్యానికి మనం నోచుకోకపోతే - అడిగినవాళ్ళకల్లా లేదనకుండా పెట్టిన ఆయనకు పెట్టవలసి వచ్చేటప్పటికి లోకం విశ్వాసం మాలినదై పోయింది. కాలికి బలపం కట్టుకొని ఇల్లిల్లు తిరిగినా సాయంత్రానికి తవ్వెడు గింజలు అప్పు పుట్టటం లేదు. నాకేమిటో బెంగగా ఉంది. అక్కయ్యగారు తలెత్తి మాట్లాడుతుంటే చూడలేకుండా ఉన్నాను.
మైత్రేయుడు : అమ్మాయీ! మనకేం భయంలేదు. నాతంటాలు నేను పడి పట్టించుకో వస్తానుగా! నీవు ఎవరెవరి ఇళ్లకు పోయివస్తున్నావో చెప్పు.
రదనిక : పిరాట్లవారింటికీ,
మైత్రేయుడు : లేవన్నారా?
రదనిక : ఇంట్లో పిల్లలెవరూ లేరట, ఆమె మడి కట్టుకున్నదట!
మైత్రేయుడు : కూర్చొని నెత్తిన గుడి కట్టుకోకపోయిందీ?
రదనిక : పురుషోత్తంవారింటికి పోతే పురుడొచ్చింది అప్పుసొప్పులు లేవన్నారు. గోరంట్లవారింటికి పోతే ఈ పూటకు సోలెడైతే పెట్టానన్నది కామమ్మ.
మైత్రేయుడు : (ఆశ్చర్యంగా) ఆఁ ఆఁ (నోటిమీద చెయ్యి వేసుకొని) నిన్న అచ్ఛాశాస్త్రుల్లు గాడిదమోత బియ్యం మూట నెత్తిన వేసుకొని ఇంటికి వస్తుంటే నేను కళ్లారా చూచాను. చారుదత్తుడి ఇంట్లో ఎవరి బాబు సొమ్మున్నదని వెనక ఏళ్ళ తరబడి మేశారో! తవ్వెడు గింజలు అప్పివ్వటానికి దడిచారూ! ఓరి వీళ్లతాడు తంగెళ్ళలో తెగ!
రదనిక : బాబయ్యా! తిట్టు తిమ్మై తగులుతుంది. ఏం ప్రయోజనం? భగవంతుడు వాళ్ళనోట అలా పలికిస్తున్నాడు.
మైత్రేయుడు : (దైన్యంతో) అమ్మాయీ! చారుదత్తుణ్ణి, అతని ఆప్తులమైన మననూ పరమాత్మ పరీక్షిస్తున్నాడు. కానీ కలకాలం కాని దినాలుండవు. ఆనాడు వీళ్ళంతా మన ఇంటికి అప్పుకు రారా? ఎవళ్ళసొమ్ము ఇక్కడ పాతిపెట్టలేదని మొఘాన పట్టుకొని ఎత్తిపొడవనా! ఏదీ (బుట్టను ఉద్దేశించి) ఇలాతే. ఎలా పుట్టవో, ఎందుకు పుట్టవో, ఎన్నాళ్ళు పుట్టవో చూస్తాను. ఇది ఇంటికి పట్టుకోపో. (మజ్జిగ తప్పేలా అందిస్తాడు)
రదనిక : (అందుకొని పరీక్షిస్తూ) ఇవేనా ఊళ్ళో దొరికిన మజ్జిగన్నీ?
మైత్రేయుడు : ఇవేనా? ఇంకానయం ఇవన్నా దొరికినై. ఇందుకు సంతోషించు. నా మొఘం చూచేటప్పటికి గేదె తన్నిందనీ, ఎండిపోయినదనీ, పాలు కాటుకపోయినవనీ, పిల్లి తాగిపోయిందనీ, పొంగుపోయినవనీ - వెనక 'చంద్రికాధౌతం దధి' అయితే గాని నాకు ముద్ద దిగేది కాదు గొంతు. ఇప్పుడో మంచినీళ్ళలో ఉప్పు వేసుకొని పోసుకుంటాను. అదీ పుట్టదనుకో, ఉప్పునీళ్ళే పోసుకుంటాను. సరే, నీవు పద. నేను ఇక్కడున్నట్లుగా వస్తాను.
రదనిక: బాగా ఎండపడ్డది. ఇప్పుడెందుకు వృథా ప్రయాస.
మైత్రేయుడు : దొరకవూ? ఎందుకు దొరకవూ? ఏ కొంపకైనా కన్నంవేసి తీసుకోవస్తాను గాని వట్టిచేతులతో చారుదత్తుడి గుమ్మం తొక్కుతానా! అక్కయ్యగారడిగితే ఇప్పుడే వస్తున్నాని చెప్పు - ఉఁ
రదనిక : (నిష్క్రమిస్తుంది)
మైత్రేయుడు : (క్రింది వేదపన్నం చెప్పుకుంటూ)
"భృగుర్వై వారుణిః వరుణం పితర ముపససార, అధీహి భగవో బ్రహ్మేతి, తస్మా ఏతత్ ప్రోవాచ, అన్నం ప్రాణం, శ్రోత్రం మనో వాచా మితి”
(నిష్క్రమిస్తాడు)
అయిదో దృశ్యం
(నిద్రాసమయం - చారుదత్తుని ఇల్లు - అతడు వీణ వాయించుకుంటుంటాడు.
ఆ తరవాత చిరిచాపమీద మైత్రేయుడు, మంచంమీద చారుదత్తుడు నిద్రకాయత్త
పడుతారు)
చారుదత్తుడు : అనేక వాద్యాలు విన్నాం గాని, మైత్రేయా! వీణ మాత్రం సాగరంలో పుట్టని జాతిరత్నమోయ్!... ఓహో! రేభిలుడు ఎంత చక్కగా వీణ వాయించాడు.
మైత్రేయుడు : (చాపమీద కాళ్ళు చాచుకొని మోకాళ్ళవరకూ ముసుగుపెట్టి కూర్చొని) చాలు, చాల్లే. మొగవాడికి సంగీతం ఆడదానికి సంస్కృతమూ! ఆడది సంస్కృతం చదువుతుంటే ముక్కుకు తాడుబోసిన ఆబెయ్య అరిచినట్లు బ్యా, బ్యా, అంభా అన్నట్లు వినిపిస్తుంది. మొగవాడు సంగీతం పాడుతుంటే శుద్ధ శ్రోత్రియుడు బోసినోటితో 'సహనా వవతు, సహనౌ భునక్తు' అన్నట్లు వినిపిస్తుంది.
చారుదత్తుడు : (నవ్వుతూ) మైత్రేయా! జాగ్రత్త. నీవు అనవసరంగా ఆడవాళ్ళ జోలికిపోబోకు. వెనుకటి దినాలు కావు సుమా!
మైత్రేయుడు : అయితే నాకేం భయం ఆంజనేయులవారి వంటి అనాది బ్రహ్మచారిని.
చారుదత్తుడు : మైత్రేయా! నీవు తప్ప నిన్నటిసభలో రేభిలుడి పాట మెచ్చుకోనివాళ్లు ఎవరూ ఉండరు.
మైత్రేయుడు : నాకేం లోపం కాదులే, వజ్రశుంఠ వాడి ముష్టిపాట మెచ్చుకోకపోతే! (చాపమీద వెన్ను వాల్చి ముసుగు పెట్టబోతూ) తన్నులు తిన్న గాడిదలా చాపమీద ఎంతసేపు పొర్లాడినా నిద్రపట్టేది కాదు. ఈ దినం ఎందుకో ముంచుకోవస్తున్నది. (ఆవలిస్తూ చిటికలు వేస్తూ!) ఇదిగో! మరిచిపోయినా, దాని నగల పాత్ర! వర్ధమానకుడి కిచ్చి జాగ్రత్త చేయించు. ఇవాళ నాకు ఒళ్లు తెలియని నిద్ర వచ్చేస్తున్నది.
చారుదత్తుడు : మైత్రేయా! దానిని రాత్రిళ్ళు భద్రపరచవలసింది నీవే. మైత్రేయుడు : ప్రతిరాత్రీ ఇది పక్కలో ఉంటుంటే నాబోటి ఘోటక బ్రహ్మచారికే వేశ్యలకు సంబంధించిన విచిత్రపుపీడ కలలు వస్తున్నవోయ్! ఏ తొత్తుకొడుకైనా దీన్ని దొంగిలిస్తే ఎంత బాగుంటుంది! ఇంత ఉజ్జయినీ పట్టణంలో అంత మొగవాడే లేకపోయినాడా! - ఈ దిక్కు మాలింది నా నిద్ర పాడుచేస్తున్నది. అయినా తప్పదు. "శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం!" (అసంతృప్తితో గునుస్తూ ముసుగు పెట్టుకొంటాడు)
చారుదత్తుడు : ఆహా! రేభిలుడు ఎంత చక్కగా రాగాలాపన చేశాడు. ఎంత స్ఫుటంగా, లలితంగా, మనోహరంగా, భావాన్వితంగా ఉంది అతని పాట యువనిక చాటున ఉండి పాడినట్లయితే నిజంగా నేనే ఎవరో యువతి పాడుతున్నదని భ్రాంతి పడేవాణ్ణి. మనోహరమైన గాత్రం! గొంతులో ఎంత చక్కని జీర!!
మైత్రేయుడు : జీరకాదు, బూర! బీరపాదుదగ్గిర ఎవడ్రా ఆ వాజమ్మ!
చారుదత్తుడు : మైత్రేయా! నీకింకా నిద్రపట్టలేదా?
మైత్రేయుడు : (మొగంమీద ముసుగు తొలిగించి) ఆఁ కలవరిస్తున్నానా? ఏనుగులను కట్టించి లాగినా ఈతడవ కంటిరెప్పలు విడిపడవు. (గుర్... గుర్... గుర్...)
చారుదత్తుడు : (నిశ్చలకంఠంతో) ఈశుష్కమైన జగత్తులో రేభిలుడి గానమాధుర్యానికి (వసంతసేన చిత్రపటం చూస్తూ) పోల్చదగ్గ వస్తువేమున్నది, ఒక్క మా వసంతసేన సౌందర్యం తప్ప? రేభిలా!
(*) మనసుకైనా అందుకోలేని సుకుమార విపంచీ కలస్వనాన్ని పంచ భూతాలుగా గ్రహించి మా కళ్ళకు కట్టేటట్లు ఒక మనోహరస్వర్గాన్ని సృజించావు. అపురూపమైన నీ అమృతశక్తికి ఇవే మా ప్రమాణాలు.
మైత్రేయా! (వాతాయనంవైపు నడిచి) కుముదినీ ప్రియల కుపితారుణ నేత్రరక్తిమలకు వెరచి చంద్ర భగవానుడు ఆకాశసౌధం మీదికి దిగివస్తున్నాడు. ప్రియా వసంతసేనా! నా జీవితాకాశంమీద నిలిచి లాస్యం చేసి నీవు చిరు వెన్నెలలు కురిసే దెప్పుడో కదా! (మందయానంతో నిమీలితనేత్రాలతో నిద్రను సూచిస్తూ పర్యంకాన్ని చేరుకొని దీపం తగ్గించి మంచం మీద మేనువాలుస్తాడు)
మైత్రేయుడు : (గట్టిగా గుర్రు పెడుతుంటాడు) శర్విలకుడు : (మందగమనంతో ప్రవేశించి దీపం పెద్దది చేసి ) కార్తికేయా! కనకశక్తీ!! (రెండడుగులు ముందుకు వచ్చి) మంచి నిద్రలో ఉన్నారు. (మద్దెలమీద చిన్న దెబ్బకొట్టి) నాట్యాచార్యుడి ఇల్లా ఇది! (వీణ పిల్లనగ్రోవి సవరిస్తాడు) ఇంటి గొప్ప చూచి ఎంత మోసపోయినాను. ధనమేమైనా భూస్థాపితం చేసి ఉంటాడా? (తోలుతిత్తిలో ఉన్న నీళ్లు చల్లి నల్లటిగింజలు ఎగురవేస్తూ) పిల్లల్లారా! గంతులు వేస్తూ ధనం ఎక్కడ దాచాడో వచ్చి చెప్పండి. (నిరాశతో) చేతులకు తడి కావటం తప్ప (లాభంలేదని మూకాభినయం చేసి)
మైత్రేయుడు : చారుదత్తా! ఎవడో దొంగ!
శర్విలకుడు : (వెనుకడుగు వేసి) ఆఁ.
మైత్రేయుడు : కన్నం త్రవ్వుతున్నాడు. నగలపాత్ర నీవు పుచ్చుకో (గుర్... గుర్... గుర్...)
శర్విలకుడు : నగలపాత్ర! పరమ దరిద్రులయింట ఏమి బాముకుందా మని వచ్చాడో వీడు అని నన్ను పరిహసిస్తున్నాడా? (దగ్గిరకుపోయి) లేదు, కేవలం పలవరింత!
మైత్రేయుడు : (పాత్రిక అందిస్తూ) గంగ ఒడ్డున కపిలగోవును చంపినంత
పుచ్చుకోకపోతే. పుచ్చుకో!
శర్విలకుడు : (అందుకోబోయి) అయ్యో! నా బ్రాహ్మణ కులానికి ఎంత తీరని కళంకం!
మైత్రేయుడు : మిత్రమా! ఇంకా అందుకోవేం? కామదేవుని గోపురకలశాన్ని తన్నినంత ఒట్టు - (అందిస్తాడు).
శర్విలకుడు : (అందుకుంటాడు).
మైత్రేయుడు : మిత్రమా! నీ చేతులింత చల్లగా ఉన్నవేం?
శర్విలకుడు : ఆఁ- ఒట్టు పెట్టావని పుచ్చుకున్నాను.
మైత్రేయుడు : ఇక గుండెమీద చేయి వేసుకొని శుభ్రంగా నిద్రపోతాను.
శర్విలకుడు : నూరేండ్లు! - (ముందుకు వచ్చి చురకత్తిలాగి జాగరూకతతో నిష్క్రమిస్తాడు. ఒక కొద్దికాలం నిశ్శబ్దం).
రదనిక : (ఉద్వేగంతో ప్రవేశించి) అమ్మయ్యో! దొంగ! దొంగ!! - బాబయ్యా కన్నం వేసి పారిపోతున్నాడు! మైత్రేయుడు : (అస్తావిస్తంగా లేచి) ఆఁ - దొంగను తవ్వి కన్నం పారిపోతున్నదా? పట్టుకో, పట్టుకో! అయితే కన్నం మొన్న మనం పులుసు కాచుకున్న గుమ్మడికాయంత ఉందా!
రదనిక : బాబయ్యా! కొంప గుణ్ణం వేసుకోపోతుంటే ఏమిటా పరిహాసం! అదుగో!
మైత్రేయుడు : (గుమ్మంవైపు చూస్తూ) చారుదత్తా! దొంగ! దొంగ!!
రదనిక: అమ్మా! అమ్మా!! (నిష్క్రమిస్తుంది).
చారుదత్తుడు : (నెమ్మదిగా లేస్తూ) ఏమిటీ హడావుడి, మైత్రేయా?
మైత్రేయుడు : ఏమిటేమిటి? - అటు చూడు. దొంగ కన్నం తవ్వాడు (నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని) అవ్వ! వీడి ముండమొయ్యా! వీడి ముండమొయ్యా!! ఎంత కన్నం తవ్వాడు! ఎంత కన్నం తవ్వాడు!! తన కొంపకు తవ్వుకోలేకపోయినాడు.
చారుదత్తుడు : (కన్నంవైపు చూచి తాపీగా) మైత్రేయా! దొంగ ఎవరో కాని మంచి నేర్పరి!
మైత్రేయుడు : నేర్పరా! వాడిపాడా! ఎవడో కొత్త క్షేప! మన ఇంటికి కన్నం వేసి వాడేమి బాముకుందామని.
చారుదత్తుడు : నేర్పరి కాడనటానికి వీలులేదు. చోరకర్మకు శాస్త్ర కర్తలు కనకశక్తీ, కార్తికేయులూ చెప్పిన లక్షణాలన్నీ తెలుసుకొని తవ్వాడీ కన్నం!
మైత్రేయుడు : బాగుంది, మన చదువు సంధ్యలు ఇందుకైనా ఉపయోగించినవి - అయితే చోరకర్మకూ ఒక శాస్త్రముందా? - మన ఋషులు దానికీ ఒక శాస్త్రమేడిచారూ? క్షురకర్మకూ ఒక శాస్త్రము ఏడవలేకపోయినారూ, గాలి మేసి గడ్డాలు పెంచుకొని పనిలేకపోతే సరి.
చారుదత్తుడు : (మందస్మితంతో) ఆ పనికి నీవు బ్రహ్మర్షి వైన తరువాత పూనుకో.
మైత్రేయుడు : (ఉద్రేకంతో) మొదట వాళ్ళ గడ్డాలు చెక్కించి మడ్డి వదిలిస్తాను.
చారుదత్తుడు : (కన్నంవైపు చూస్తూ) దొంగ పాపం! ఎవరో పొరుగూరివాడై ఉంటాడు. ఉన్నవాళ్ళమని ఉర్రట్లూగుతూ వచ్చి ఉన్న సత్తువంతా గోడలు త్రవ్వటానికి పెట్టి ఉత్తచేతులతో ఉదయం ఇంటికి చేరుకుంటాడు గామాలి. తెల్లవారిన తరువాత స్నేహితులు రాత్రి ఏమి దొరికిందిరా అని ప్రశ్నిస్తే ఆ దీనుడు అయ్యో, ఎంత బాధపడుతాడో!
మైత్రేయుడు : (వెగటుగా) అయ్యో పాపం! వాడి బాధ ఎలా ఉన్నా నీ బాధ చూస్తే నాకు మహాబాధ వేస్తున్నది. ఇల్లు చూడబోతే ఎంతో పెద్దదిగా ఉన్నది, అధమం ఏ కనక భాండమో దొరకక పోతుందా అని మన యింటికి కన్నం వేశాడు ఆ దొంగ పీనుగ! ఇంకా పాపం తలుస్తావేం? దొరికితే పాతేయించి పుఠం వేయించనూ?
చారుదత్తుడు : ఓరి తెలివితక్కువవాడా?
మైత్రేయుడు : ఎప్పుడూ ఆ మాట అంటావనే ఇందాక నగలపాత్ర నీకిచ్చి చాలా తెలివిగలవాడినైనాను. లేకపోతేనా, నీవా దొంగ వెధవను గురించి ఇంత చింతా పడకుండానే 'గుటకాయస్వాహా' చేసేవాడే.
చారుదత్తుడు : మైత్రేయా! నీవేమంటున్నావో నా కర్థం కావటం లేదు. వేళాకోళం చాలించు.
మైత్రేయుడు : నీవన్నట్లు నేను ఎంత తెలివితక్కువ వాడినైనా, మీరంతా ఎంత మహామహావిద్వాంసులైనా వేళాకోళానికి సమయం ఎరగని సన్యాసిని మాత్రం కాను.
చారుదత్తుడు : అయితే నగలపాత్ర ఇందాక నా చేతికి ఇచ్చావన్నమాట!
మైత్రేయుడు : ఔను. ఆ సందేహం ఎందుకు రావలసి వచ్చింది?
చారుదత్తుడు : ఎప్పుడు ఇచ్చావు?
మైత్రేయుడు : నీ చేతులు చల్లగా ఉన్నవే మంటినే, అప్పుడు.
చారుదత్తుడు : (యోజించి) అయితే నేను నీకొక మంచి మాట చెప్పనా?
మైత్రేయుడు : వాడది కాజేసుకోపోయినాడని కాదుగదా?
చారుదత్తుడు : కాదు, కాదు. వాడు చేసిన శాస్త్ర పరిశ్రమకు తగ్గ ప్రతిఫలం దొరికిందని కృతార్థుడైనాడని.
మైత్రేయుడు : వాడు కృతార్థుడౌటం ఎట్లా ఉన్నా నేను మాత్రం ప్రస్తుతం హతాత్ముడ నౌతున్నాను.
చారుదత్తుడు : ఎందుకని? మైత్రేయుడు : ఆ నగలపాత్ర మనది కాదని, చారుదత్తుడే తాతతండ్రులు లంకెబిందెలు వేసిన పాతరలు త్రవ్వి అంత ధనం వసంతసేనకు అచ్చి యిస్తాడని. వ్యాపారంలో మొన్నటి దెబ్బతో మనకు మిగిలింది 'అశ్మాచమే మృత్తి కాచమే' కదా!
చారుదత్తుడు : విధీ! నన్ను ఎంతకు తీసుకోవచ్చావు? సృష్టిలో లేని నూతన దారిద్ర్యాన్ని సృజించి నామీద ప్రయోగించావు. తన నీడను తానే నమ్మలేని వారవనితల వంశంలో పుట్టిన వ్యక్తికి నామీద నమ్మకం కలిగించావు. ఆమె హృదయంలో ప్రఖ్యాతదరిద్రుడనైన నామీద అనురాగబీజాలు విత్తి మొలకలెత్తిస్తున్నావు. ఈనాటి గాథతో నన్ను జీవచ్ఛవాన్ని చేయటానికి స్థిర సంకల్పుడవైనావా?
మైత్రేయుడు : చారుదత్తా! ఎందుకు నీకీ లేనిపోని పిరికితనం. నేను ఒక మంచి ఎత్తు ఎత్తుతాను. వసంతసేన వస్తే నువ్వు మెదలకుండా కడుపులో చల్ల కదలకుండా కూర్చో! - - ఆమె నగలపాత్రను గురించి ప్రశ్నిస్తూ, ఆపైన ఒక నాటకమాడతాను. చూడుమరి నా సత్తా.
చారుదత్తుడు : ఏమిటా నాటకం ?
మైత్రేయుడు : ఏముంది - అడగంగానే ఇచ్చినవాళ్ళెవరు? పుచ్చుకున్న వాళ్ళెవరు? చూచిందెవరు? అని గుక్క తిప్పుకోకుండా ఘనా, జటా చెప్పి గల్లంతు చేసి పంపించేస్తాను.
చారుదత్తుడు : అనుభవిస్తున్నది చాలక అబద్దం కూడా ఆడమన్నావా?
మైత్రేయుడు : నీవు అబద్ధమాడినట్లేలా ఔతుంది? మాట్లాడకుండా బెట్టుగా కవిరాజులా కలం పట్టుకొని ఆకాశంలోకి చూస్తూ ఆలోచించుకుంటూ కూర్చో.
చారుదత్తుడు : మైత్రేయా! మౌనం అర్ధాంగీకారం. అబద్ధం ఆడలేను. నగలకు తగ్గ విలువైనా వసంతసేనకు ఇచ్చివేయవలసిందే -
మైత్రేయుడు : ఎక్కడినుంచి తెచ్చి?
చారుదత్తుడు : (స్థిరకంఠంతో) క్షేత్రాలు చేసి, పది పట్టణాలు ముష్టెత్తి.
మైత్రేయుడు : 'అగ్నేయంతి ద్రవిణం భిక్షమాణాః' అని శ్రుతి. దాని కలవాటు పడితే దారిద్ర్య మెక్కడుంది? బ్రాహ్మణజాతికి వేదాలు విధించిన జీవనమే అది. దాన్ని సక్రమంగా సాగించుకున్నన్నాళ్ళూ ఎంతెంత మహారాజులూ వచ్చి మన పాదాలమీద పడి సాష్టాంగదండ ప్రణామాలు చేశారు. ఇప్పుడో కాలమే మారిపోయింది. చారుదత్తుడు : నేను ఋణవిముక్తుణ్ణి కావటానికి భిక్షాటనం తప్ప వేరేమార్గం లేదంటావా?
మైత్రేయుడు : మహాబ్రాహ్మణుణ్ణి ఉపనయనం నాటిమాట కంటే ఇంకో మంచిమార్గం ఉన్నదంటానా? - పద, బయలుదేరు. ఏ దేవతాప్రతిష్ఠ పేరో పెట్టుకొని పెద్దవాళ్ళ లోగిళ్ళన్నీ నువ్వు చూడు. ఎర్రని రాగి చెంబు నున్నగా తోమి ఎక్కిన గడప ఎక్కకుండా ఏడాదిపాటు యాయవారం నేను చేస్తాను. దాని నగలెంత చేసు అదెంత చేసు. ముష్టికి నష్టి లేదన్నారు పెద్దలు - దేవుడు మేలు చేస్తే మళ్ళీ వెనుకటి వ్యాపారం సాగించముటోయ్.
చారుదత్తుడు : విధీ! విధీ!!
(*) ఎందుకీ బ్రాహ్మణవంశంలో జన్మించమని విధించావో! ఎందుకు ధనమిచ్చావో!! ఎందుకు వర్తకుని చేశావో!! తుదకు దరిద్రుణ్ణి చేసి బిక్షాటన చేయమని ఎందుకు కల్పించబోతున్నావో!!
రదనిక : (హారముతో ప్రవేశిస్తూ) బాబయ్యా! అక్కయ్యగారు మీకిది ఇచ్చి రమ్మన్నారు. (చెవిలో ఏదో చెపుతుంది)
మైత్రేయుడు : (చారుదత్తునితో) మొన్న రత్నషష్టివ్రతోద్యాపన చేయించానులే. దక్షిణగామాలి. (చారుదత్తుని దగ్గరకుపోయి) - నేను నిన్న ఒక సంగతి జరిగితే ఒక బ్రాహ్మడికి కొంత చేతులలో పెడదామనుకున్నాను. ఇది వచ్చింది వచ్చినట్లు నీవు పుచ్చుకో -
చారుదత్తుడు : ఆ రహస్యమేమిటో ఈ దానమేమిటో!
మైత్రేయుడు : (బలవంతం చేస్తూ) ముందు ఇది పుచ్చుకో!
చారుదత్తుడు : (పుచ్చుకుంటూ) ఏమిటిది మైత్రేయా!
మైత్రేయుడు : ధూతాదేవివంటి మహాసాధ్విని పెళ్ళాడినందుకు ఫలం! మీ కష్ట సమయంలో ఇవ్వవలసిందని అక్కగారికి వదినెగారు వారి మరణ సమయంలో దీన్ని ఇచ్చినారట! ఆ కన్నం పూడ్పించను కాస్తా కూస్తా అవుతుందా.
చారుదత్తుడు : చిట్టచివరకు నాకు స్త్రీ ధనం దిక్కుకావలసి వచ్చిందా! కానీ దురదృష్టంవల్ల నేను దరిద్రుణ్ణి అయినాను - కష్టసుఖాలల్లో పాలు పంచుకునే నా ఆత్మబంధువులు మిత్రులున్నప్పుడు నేను దరిద్రుణ్ణే కాను. (కొంచెమాలోచించి) మైత్రేయా! వసంతసేన యింటికి ఉదయమే పోయి నేను మిత్రులతో జూదమాడి నగలు ఒడ్డి ఓడిపోయినాననీ దానికి ప్రతిగా ఈ రత్నావళిని స్వీకరించమని కోరుతున్నానని చెప్పి ఇచ్చిరాపో!
మైత్రేయుడు : అయ్యో! నీకేమైనా మతిపోయిందా, పిచ్చెక్కిందా? తిన్నామా? కుడిచామా? నగలపాత్ర దొంగ లెత్తుకోపోయినారు. దానికోసం వెలలేని రత్నహారం ఇచ్చుకుంటామా?
చారుదత్తుడు: నగలపాత్రకు ప్రతిగా రత్నహారం మనమివ్వటం లేదు. వసంతసేన నామీదుంచిన విశ్వాసానికి బహూకృతి ఇది.
మైత్రేయుడు : బాగుంది - వెర్రి తీరింది. రోకలి తల చుట్టమన్నాట్ట నీబోటివాడు.
చారుదత్తుడు : (దీనంగా) మైత్రేయా! ఎలాగైనా సరే ఆమె అంగీకరించేటట్లు చేయక తప్పదు.
మైత్రేయుడు : (స్నేహావలోకనంతో అంగీకరించి రత్నావళి గ్రహించి) అయితే మరి -
చారుదత్తుడు : రత్నహారం మీద ఏవిధమైన మమకారమూ మనకున్నట్లు కనిపించకూడదు సుమా!
మైత్రేయుడు : చస్తే కనిపిస్తానా?
(నిష్క్రమిస్తాడు)
ఆరో దృశ్యం
(వసంతసేన ఇంటిముందు) శకారుడు అలంకరించుకొని వచ్చి అటూ ఇటూ తిరుగుతూ
ఈ క్రిందిపదం పాడుతుంటాడు)
పప్ప, పప్పా, పప్పా, పప్ప!
పల్లేవోణ్ణి, పప్పా, పప్ప!
పడవా నడిపే పల్లేవోణ్ణి
దడవాబోకే పల్లెపడుచా!
దాటేస్తానే పల్లెపడుచా!!
పప్ప, పప్పా, పప్పా, పప్ప!
(లోపలికే వేగంగా పోబోతుంటే)
మదనిక : (ఆపుతూ) ఎవరండోయ్! ఆగండక్కడ!!
శకారుడు : (మంచి చేసుకొనే గొంతుకతో) ఓహో! నీవా పిల్లా! ఇక్కడున్నావేం, రా లోపలికి పోదాం.
మదనిక : ఎవరు మీరు? ఏమిటీ చనువు?
శకారుడు : నీవెవరో చెప్పు చూతాం.
మదనిక : వసంతసేన మా అక్కగారు!
శకారుడు : అయితే నీకు నేను బావగారిని, మరదలూ! నేను మా అక్కగారి తమ్ముణ్ణి. మా అక్కగారే రాజుగారిని ఉంచుకున్నారు. ఓస్ చిన్నదానివే. నీకింకా ప్రపంచజ్ఞానం లేనట్లుంది. - నే నెవరినో ఎరగనట్లున్నావు. శకారమహారాజులుంగారని వినలేదూ? (మనిషి ప్రక్కగా లోపలికి తోసుకోపోబోతాడు)
మదనిక : అయ్యా! ఎక్కడికా తోసుకోపోవటం? శకారుడు : నా ఇంటికి నేను వెళ్లుతుంటే ఓసి గడుగ్గాయ. కసికందువు నీవెవరే ఆపటానికి?
మదనిక : మీ ఇల్లు!
శకారుడు : (మొలలోనుంచి హారం బయటకు తీసి) మరదలూ ఇదిగో ఇటు చూడు, మొన్న మీ అక్కయ్య నీకొక మంచిహారం చేయించమంటే చేయించాను. ఇలారా, నీ మెళ్లో వేస్తాను.
మదనిక: (తానే చేతితో అందుకొని మెళ్ళో వేసుకుంటుంది)
శకారుడు : అమ్మాయీ! ఇక ఎంతసేపు మనం ఈ వాకిటి ముందు, లోపలికి పోదాం పద.
మదనిక : ఏమండోయ్! ఇప్పుడే మా అక్కయ్య ఎక్కడికో వెళ్ళింది.
శకారుడు : (ఆశ్చర్యంతో - ఉద్వేగంతో) వెళ్ళిందా? ఎప్పుడు? ఎలా? ఎక్కడికి? ఆమెను పిల్చుకురా! పోనీ నన్నే అక్కడికి ఈడ్చుకోపో.
మదనిక : (బిక్కమొగంతో) మా అక్కయ్యకు గొప్ప జ్వరం వచ్చింది.
శకారుడు : (త్వరలో) అయ్యో! ప్రియా! సమపీనస్తనీ ఆస్తి నాస్తీ!! నేను గొప్ప వైద్యుణ్ణి మరదలూ! నాడీ పరీక్షలో నరికినా దొరకను. మదన జ్వరమైతే మనం వెళ్లుతున్నాం కాబట్టి మందే అవసరం లేదు. జాతి జ్వరమతై నా కుప్పెకట్టు పని చేసినట్లు పని చేయటానికి మరోవైద్యుని సంచికట్టులోనే కుప్పెకట్టు దొరకదు. పాపం, త్వరగా పోదాం పద. ఎంత బాధ పడుతుందో!
మదనిక : అ హఁ హఁ! ఇది నిన్నటి ఉదయం సంగతి. ఆమె ఇప్పుడు దేవతా మందిరంలో పూజ చేసుకుంటుంది.
శకారుడు : అమ్మాయీ! కావలసినంత డబ్బు తెచ్చి యిచ్చే దేవుణ్ణి నేనుంటే మీ అక్క మరొక దేవుణ్ణి పూజించటమా! మంచి పని కాదన్నానని చెప్పు. డబ్బుకు దానికేం కొదవ దేశంలో. డబ్బంతా బొక్కసంది. బొక్కసం రాజుగారిది. రాజు మా అక్కది. మా అక్క నాది. నాది మీ అక్కది. లోపలికి పోదాం పద.
మదనిక : పోయినా - మాట్లాడదుగా ఎవరితోటీ?
శకారుడు : ఎవరితోనూ మాట్లాడదు గాని నాతో మాట్లాడుతుంది. మదనిక : ముందు మీరు వస్తున్నారని నేను లోపలికి పోయి అక్కకు చెప్పి వస్తాను. మీరు ఇక్కడనే ఉండండి. (లోపలికి పోబోతుంది)
శకారుడు : అ హఁ హఁ, వద్దు వద్దు, నా మాట విను. తరువాత మీ అక్క చేతిలో నన్ను వెంట తీసుకోరాలేదేమని దెబ్బతింటావు. నీ మంచికి చెబుతున్నాను. పోదాం పద.
మదనిక: (దూరంగా శర్విలకుడు వెతుకుతుంటాడు. ఆమె చప్పట్లు చరిచి శర్విలకుని పిలుస్తుంది) శర్విలకా! శర్విలకా!! ఇక్కడిక్కడ!
శకారుడు : అమ్మాయీ! ఎవరో మొగవాళ్ళను పిలుస్తున్నావే. సరేలే. నేనూ, బావా, సాయంత్రం వస్తామని మీ అక్కతో చెప్పు. అఁ - అయితే ఆ హారము - పోనీలే, నీ మెడలోనే ఉంచుకో.
(నెమ్మదిగా జంకుతూ అడుగులో అడుగు వేసుకుంటూ నిష్క్రమిస్తాడు)
శర్విలకుడు : (ప్రవేశిస్తూ శకారుడు తప్పుకొని పోతుంటే ఓర కంటితో చూస్తూ ఉంటాడు. దగ్గిరకు వచ్చి మదనిక చేయి చేత్తో పుచ్చుకొని) ప్రియా!
మదనిక : శర్విలకా! ఎందుకో తెల తెలపోతున్నావు? ఏమిటాదిక్కులు చూడటం?
శర్విలకుడు : (దీర్ఘంగా నిశ్వాసించి) తెల తెలపో కేంచేస్తాను?
మదనిక : ఏం చేశావు కాబట్టి
శర్విలకుడు : ఎవరి పాపం వాళ్లను కలత పెడుతుంది. ఎవరూ మన మాటలు వినరు కదా! - ఎందుకో మనస్సులో దిగులుగా ఉంది.
మదనిక: సంగతేమిటి? - ఎందుకలా ఉన్నావు? శర్విలకుడు : ఏమీ లేదు.
మదనిక : చెప్పటానికేమో సందేహిస్తున్నావు.
శర్విలకుడు : సందేహమెందుకు. నీ దగ్గిర నాకు రహస్యమేమిటి?
మదనిక : మరి విషయమేమిటో చంపక బయటపెట్టు.
శర్విలకుడు : మనం ఆమె కొన్నంత ద్రవ్యమూ ఇచ్చేస్తే నిన్ను విడిచి పెడుతుందా?
మదనిక : ఆమెవరు? శర్విలకుడు : మీ అక్క వసంతసేన.
మదనిక : ఇంట్లో పెత్తనమంతా ఆమె తల్లిది. మా అక్కమాటే సాగితేనా, పరిచారకుల నందరినీ ఊరికే విడిపిస్తుంది - కానీ నన్ను విడిపించేటంత ధనం నీకు ఎక్కడినుంచి వచ్చింది.
శర్విలకుడు : మదనికా! నీమీద ప్రేమ నా చేత ఒక సాహసకృత్యం చేయించింది.
మదనిక: ఆఁ! సాహసమా!!
శర్విలకుడు : అది కేవలం సాహసకృత్యమే కాదు పాపకృత్యం కూడాను - రాత్రికి అప్రతిష్ఠ తెచ్చిపెట్టాను. కాని శ్రమకు ఫలితం మాత్రం దొరికింది - ఇదిగో హారము! - (రొండిన దోపినమూట సంచినుంచి బయటికి తీస్తాడు)
మదనిక: (ఆశ్చర్యంతోనూ అన్వేషణగా) ఆఁ, శర్విలకా!
శర్విలకుడు : (హారంవైపు తదేకదృష్టితో) ఉస్ - వసంతసేన కిచ్చి ఆమెతో అప్పుడప్పుడూ ఉపయోగించమని చెప్పి నిన్ను విడిపించుకో. మనమిద్దరమూ వివాహం చేసుకొని సంతోషంగా కాలం గడుపుదాము.
మదనిక : (హారంమీదనే కళ్లు నిలిపి చూస్తూ) ఏదీ హారం?
శర్విలకుడు : (చేతికందిస్తాడు)
మదనిక : (పరీక్షిస్తూ) ఎక్కడో చూచినట్లుంది, నీకిది ఎలా దొరికింది?
శర్విలకుడు : అదంతా నీకెందుకు? ఇది తీసుకోవెళ్ళి ఆమెకిచ్చి నిన్ను విడిపించుకో!
మదనిక: ఈమాత్రం రహస్యం చెప్పటానికే నమ్మలేకపోతే ఇక మనమేమి వివాహం చేసుకుంటాము. మనస్సులో మనస్సు కలిపి సుఖపడతాము.
శర్విలకుడు : చారుదత్తుడి ఇంటికి ఎవరో దొంగలు కన్నం వేశారని జనం చెప్పుకోటం వినలేదూ?
మదనిక: (ఆవేగంతో) ఆ పని చేసింది నీవేనా? - ఆ యింట్లో ఎవరినీ కత్తితో పొడవలేదు కదా?
శర్విలకుడు : (దీనాననంతో తల త్రిప్పుతాడు)
మదనిక : గాయపరచలేదు గద? శర్విలకుడు : (తల త్రిప్పుతాడు, లేదన్నట్లు)
మదనిక : ఈ హారం మా అక్కగారిదే - ప్రదోషసమయంలో ఆమె మదనాలయం నుంచి వస్తూ ఆర్యచారుదత్తులకు దాచి పెట్టమని యిచ్చింది, కొన్ని అలంకారాలు.
శర్విలకుడు : (ఆశ్చర్యంతో) ఏమిటీ! -
మదనిక : ఇలారా! (దగ్గిరకు వచ్చిన శర్విలకునితో చారుదత్త - వసంతసేనల ప్రణయగాథను గురించి చెప్పుతుంది)
శర్విలకుడు : ఎండ వేడి సహించలేక ఏ కొమ్మను ఆశ్రయించుకొన్నానో దాని ఆకులే రాల్చానన్నమాట! (క్రింద చూస్తూ) అయితే ముందు కర్తవ్యమేమిటి?
మదనిక : తీసుకోపోయి ఏదోవిధంగా ఆర్యచారుదత్తులకే చేర్చటం మంచిది.
శర్విలకుడు : న్యాయాధిపతులకు చెప్పి శిక్ష విధిస్తే?
మదనిక : పిచ్చివాడా! చంద్రుడు ఎండకాస్తాడా! ఆర్యచారుదత్తులను ఎరగనట్లు మాట్లాడుతున్నావు.
శర్విలకుడు : (అది ఇష్టము కానట్లు ప్రవర్తిస్తాడు)
మదనిక : అయితే మరొకపని చేయటం మంచిది.
శర్విలకుడు : ఏమిటది?
మదనిక : ఆర్యచారుదత్తులే పంపినట్లుగా హారాన్ని అక్కకు చేర్చు. అప్పుడు ఆయన ఋణవిముక్తుడౌతాడు. నీవు దొంగవూ కావు - ప్రేమ ఉంటే పరిణయం మాట పరమేశ్వరుని కృప - ఇది మన విషయం.
శర్విలకుడు : మదనికా! ఇది నీ సౌశీల్యానికి తగ్గ ఊహ. నీ ప్రేమ నాలో పశువును మానవుడిగా పరిణమించిటట్లు చేస్తున్నది. మన వివాహానంతరం నాకే దివ్యత్వం తెచ్చి పెడతావో!
మదనిక : (అతని చేయి అందుకొని ముద్దు పెట్టుకుంటుంది) అదిగో, ఆ మావిగున్న చాటున కూర్చో - నేను లోపలకు వెళ్లిన పది నిముషాలలో తలుపు తడితే మా అక్కతో సమయానికి నిన్ను గురించి చెప్పవలసినమాట చెప్పి లోపలికి తీసుకోనెళ్లుతాను. శర్విలకుడు : (మావిగున్నవైపు బయలుదేరుతాడు. అతనికి మదనిక పాట వినిపిస్తుంది)
మదనిక : నీదే, నీదే, మధుకరుడా!
నీ ప్రియసుమ మిది మధుకరుడా!!
రసికుల లోపల రాజువురా!
ప్రసవకులమ్మున రాణినిరా! నీదే, నీదే....
మధువుల నిండిన బేల ఇదీ,
మనసున నిన్నే వలచినదీ,
తలపున నేయెడ నీవె సదా,
వలపే జీవననావ గదా! నీదే, నీదే.....
(నిష్క్రమించును)
ఏడో దృశ్యం
(వసంతసేన గృహంలో అంతర్భాగం. ఆమె చారుదత్తుని చిత్రాన్ని కూనిరాగాలు
తీసుకొంటూ చిత్రిస్తూ పూర్తి చేస్తూ ఉంటుంది. ఇంతలో మదనిక ఏదో పని ఉన్నట్లు
ప్రవేశిస్తుంది)
వసంతసేన : (కుంచెతో చిత్రపటాన్ని చిత్రిస్తూనే) మదనికా!
మదనిక: (మాట్లాడదు)
వసంతసేన : ఇదుగో? ఇటు చూడు!
మదనిక: (చూడదు)
వసంతసేన : చూడవా?
మదనిక : (ముద్దుగా అతిపరిచయ కంఠంతో) ఉఁః
వసంతసేన : పోనీలే చూడకపోతే మానిలే - (భావాన్ని మార్చి) ఈ చిత్రపటం ఎవరిదో చెప్పవే చూదాం?
మదనిక : (వసంతసేన దగ్గరికివచ్చి వేలితో మందలిస్తూ) చెప్పనా?
వసంతసేన: (చిరునవ్వుతో చెప్పమన్నట్లు తల ఊపుతుంది)
మదనిక : (నెమ్మదిగా నొక్కి ఒకమాట తరువాత ఒక మాటగా) నీవు కన్నార్పకుండా... ముగ్ధమోహనంగా... పరమాభిలాషతో... బహుళాసక్తితో
వసంతసేన : ఎంతసేపు ఈ స్వస్తి కానీ
మధనిక : (వేగంగా) ఎవరిని చూడటానికి ఇష్టపడతావో
మదనిక : వసంతసేన : వాళ్ళది
వసంతసేన : ఈ వక్రోక్తులు కట్టిపెట్టి ఏడిపించక త్వరగా చెప్పు. మదనిక : ఇంకా ఏం చెప్పమంటావు, చెపితినిగా.
వసంతసేన : ఏం చెప్పావు? - పోనీ ఈ చిత్రం ఎలా ఉందో చెప్పు-
మదనిక : (పూర్వవిధంగా) నీకోరిక తీర్చటానికి... నిశ్చల ప్రేమతో... నిర్మల హృదయంతో - పురివిప్పి నిలచిన నెమలిలా - పురుష పుంగవుడు అలంకరించుకొని ఆర్యచారుదత్తులు వచ్చి కూర్చున్నట్లున్నది. (నవ్వుపుట్టించే టట్లుగా) అక్కా ఆ భంగిమలో ఆర్యుల కన్నులనుంచి అమృతవృష్టి కురుస్తున్నట్లున్నది.
వసంతసేన : ఆర్యుల కరుణారసప్రదనేత్రాలను కమనీయంగా చిత్రించానా?
మదనిక : నీకు అనుమాన మెందుకు, నేను చెప్పటమెందుకు? నీ కుంచె ఆవిశాలశతపత్రనేత్రాల మీదికి పోకపోవటమే చెప్పుతున్నది.
వసంతసేన : (నవ్వి) వారి విశాలవక్షఃప్రదేశానికి లోపం -
మదనిక : ఊఁః - అణుమాత్రం రాలేదు - అయితే నీ గాఢాలింగన కౌతూహలం నీచేత మరింత కర్కశంగా చిత్రించేటట్లు చేయించిందేమోనని అనిపిస్తున్నది.
వసంతసేన : (కుంచెతో ఒక చుక్కపెట్టి) ఇప్పుడో!
మదనిక : ఆఁ. ఆయన సహజరూపం. చక్కగా సరిపోయిందక్కా! ఒక మాటు లోపలికివెళ్లిరా, నీవే వారనుకోని పలకరిస్తావో లేదో!
వసంతసేన : ఇచ్చకాలాడకు, మదనికా! చిత్రం నీకు ఎక్కడ నచ్చక పోయినా చెప్పు.
మదనిక : (పరిహాసం మాని నిశ్చలంగా) మనస్ఫూర్తితో చెప్పుతున్నాను. ఇందాక నీవు చేసిన మార్పుతో -
వసంతసేన : (అనునయిస్తూ) మార్పుతో,
మదనిక : నేను చెప్పటమెందుకులే!
వసంతసేన : పోనీలే -
మదనిక : అక్కా! నీ కర్ణమైందో లేదోగాని నీ హృదయం కూడా లగ్నమైంది.
వసంతసేన : (పటాన్ని చూచి మురిసిపోతూ) చిత్రాలు గీయటం ప్రారంభించి చివరకు ఏడాది కూడా కాలేదు గదా! అప్పుడే ఇంత సజీవ చిత్రాన్ని సృజించగలిగానా? మదనిక: ఆర్యచారుదత్తుల పరిచయం నీలో కళామూర్తిని జాగృతం చేసిందక్కా! పవిత్రప్రణయం వల్ల ప్రపంచంలో కళాస్రష్టలు ఎంతోమంది జన్మిస్తారనటానికి నీవు...
వసంతసేన : నిదర్శనమా! బాగుంది చారుదత్తుల రూపాన్ని చిత్రించటంమంటే సామాన్యం కాదే!
(చిత్రపటాన్ని చూస్తూ) మహాభాగా!
(*) ఓ కమనీయరూపా! మీ శరీరవిలాసాన్ని ఏ శిల్పైనా ఎలా చిత్రించగలడు? ఒకవేళ చిత్రించినా మీ కరుణాన్విత హృదయాన్ని భావనకూడా చేయలేడు. మదనికా! నా కేమిటీ ఆనందం - అనుభవించలేకుండా ఉన్నాను... ఏమిటో తెలియటం లేదు వివశనై పోతున్నాను. ఏది ఆ కుంచె (చేతికి తీసుకొని)
(లోపల మదనికా! మదనికా!!)
మదనిక : అక్కా, నన్ను అమ్మగారు పిలుస్తున్నారు.
వసంతసేన : (పొమ్మన్నట్లు సంజ్ఞ)
మదనిక : (వెళ్ళిపోతుంది)
వసంతసేన : (కూనిరాగం తీసుకుంటూ చిత్రాన్ని చూచి మురిసిపోతూ మధ్యమధ్య గీతానికి అనుగుణమైన నృత్యం చేస్తూ)
ప్రేమమయా! ప్రణయసఖా!!
ప్రణయపతీ! ప్రాణపతీ!!
చపలనురా, జలధరుడా!
చంద్రుడవు, చంద్రికను
రసికుడవు, రాగిణినీ!
నర్తకిని, నాయకుడా!
మధువునురా, మధుకరుడా!
నౌకనురా, నావికుడా!!
ప్రేమమయా! ప్రణయసఖా!!
ప్రణయపతీ! ప్రాణపతీ!!
(చిత్రాన్ని ముద్దు పెట్టుకోబోతుంది. తలుపు చప్పుడు)
వసంతసేన : (మదనిక రాగానే) ఎవరిదా గొంతు - ఎక్కడనో విన్నట్లున్నాను.
మదనిక : అది మన చారుదత్తులవారి మిత్రుడు శర్విలకులది కదూ!
వసంతసేన : (ఎరగనట్లు నటిస్తూ) శర్విలకులు!
మదనిక: అదేమిటక్కా! - అప్పుడే మరచిపోయినావా? ఆయనను ఆ దినం చారుదత్తులవారి ఇంట్లో... నీవు నాట్యం చేస్తుంటే -
వసంతసేన : (మళ్ళీ తలుపుచప్పుడు విని) పోనీలే - మరిచిపోయినానేమో - ఎందుకువచ్చారో - త్వరగా తీసుకోరా!
మదనిక: (శర్విలకుడిని తీసుకోరావటం కోసం నిష్క్రమిస్తుంది)
వసంతసేన : (ఆతురతతో వెళ్లుతున్న మదనికను చూచి చిరునవ్వు నవ్వి) జాణవంటే నీవేనే మదనికా! పాపం! మావిగున్ననీడలో మీరిద్దరూ చేసిన సంభాషణంతా నేను గమనించలేదనుకున్నావు గామాలి. స్నిగ్ధనేత్రాలతో కడుపార అతని సౌందర్యాన్ని త్రాగిన ఆ కళ్ళలోని ప్రేమప్రసన్నతంతా మటుమాయం చేసి ఎంతలో ఎంత చిత్రంగా నటించావే! శర్విలకుడు చారుదత్తుల మిత్రులా! నీవు నిజంగా నర్తకివే!
మదనిక: (ఆదరం నటిస్తూ) ఆర్య శర్విలక! ఇటు, ఇటు
శర్విలకుడు : (ప్రవేశిస్తూ) అమ్మాయీ! శుభము!
వసంతసేన : (సగౌరవంగా లేచి) ఆ ఆసన మలంకరించండి -
శర్విలకుడు : నన్నప్పుడే మరిచిపోయినట్లున్నారు.
వసంతసేన : (జ్ఞప్తికి తెచ్చుకుంటున్నట్లు నటించి) మరిచిపోవటమేమిటి? మీరు చారుదత్తులవారి -
శర్విలకుడు : ఔను, అతని మిత్రుణ్ణి.
వసంతసేన : ఏదో పెద్దపని పెట్టుకొని వచ్చినట్లున్నారు. (నగల పాత్రిక వైపు చూస్తుంది)
శర్విలకుడు : (లోపలినుంచి బయటకువస్తూ) మిత్రుడు చారుదత్తుడు మీకు ఇది భద్రంగా చేర్చి రమ్మన్నాడు. వాళ్ల ఇల్లు చాలా పాతదైపోయింది. అందులో పట్టణంలో దొంగలు ఈమధ్య ప్రబలిపోయినారు - ఎన్నాళ్లకూ మీరు మళ్ళీ అడిగి పుచ్చుకోలేదట. వసంతసేన : వారింట్లో ఉంటేనేం నా ఇంట్లో ఉంటేనేం?
శర్విలకుడు : మీ భావంలో అంతే కావచ్చు. కాని మావాడు ఏ అపకీర్తి నెత్తిమీద పడుతుందోనని చాలా భయపడుతున్నాడు. దాచిపెట్టటం కష్టంగా కూడా ఉందట. మీరే పుచ్చుకొని కాపాడుకోవలసిందని చెప్పి ఇచ్చిరమ్మని పంపించాడు.
వసంతసేన : పాపం! వారిని చాలా శ్రమపెట్టాను - క్షమించమని చెప్పండి.
శర్విలకుడు : అయితే మావాడు మీ క్షమాపణ అందుకుండేటంత అవ్యక్తుడు కాదులేండి. (నవ్వుతూ అందించబోతాడు)
వసంతసేన : మదనికా! (అందుకొమ్మన్నట్లు సంజ్ఞ)
మదనిక : (అందుకుంటుంది)
వసంతసేన : (ఏదో జ్ఞప్తికి వచ్చినట్లు) మీ పేరు శర్విలకులే కదూ!
శర్విలకుడు : (నవ్వుతూ) అయితే - నేనేం ప్రమాదం చెయ్యలేదుగదా, కొంపతీసి దీర్ఘంగా జ్ఞప్తికి చేసుకుంటున్నారు.
వసంతసేన : (నవ్వుతూ) మీలో ఇంత చమత్కారం ఉండబట్టే చారుదత్తులవారు నన్ను ఒక కోరిక కోరారు.
శర్విలకుడు : కోరికా? ఏమని?
వసంతసేన : పూర్వం నీ నగలపాత్ర తెచ్చిన మా మిత్రుడెవరైనా బహూకరించమని.
శర్విలకుడు : ఏదో 'హాస్యకేసరి' అని ఒక బిరుదు పారేయకండి భరించలేను.
వసంతసేన : అంతకంటే గొప్పబిరుదే - మీబోటి యువకులు మోయ లేకపోతే -
శర్విలకుడు : (బుజాలు బలం మోయటానికి సిద్ధపడుతూ ఉన్నట్లు పెట్టి) కానీయండి! ఎత్తండి!!!
వసంతసేన : ఆటే బరువుకాదు లెండి - మా మదనిక ఏమంత బరువుంటుంది.
శర్విలకుడు : మదనిక: (నివ్వెర పోతారు)
శర్వీలకుడు : మీరు దేనికైనా సమర్థులు - ఏదో నాటకమాడుతున్నారు.
వసంతసేన : నాటకాలు ఆడేవాళ్ల దగ్గిర నాటకాలాడకపోతే ఎలా గనకశర్విలకుడు : (మదనికవైపు చూస్తాడు)
మదనిక : (నిశ్చలంగా నిలుచుంటుంది)
వసంతసేన : మదనికా! ఇలారా!
మదనిక : (వసంతసేన దగ్గరకు వస్తుంది)
వసంతసేన : (చిత్రపటం దగ్గిర ఉన్న - పూలహారాలు రెండు తెచ్చి ఒకటి మదనికకు మరొకటి శర్విలకుడి చేతికిస్తుంది)
శర్విలకుడు : మీరు ఏమి చేయబోతున్నారో మాకేమీ బోధపడటం లేదు. ఇప్పుడు మనం ఉన్నది నాటకశాలలో కాదుగద - (గుటక వేసి) అమ్మయ్య! ప్రేక్షకులు ఎవరూ లేరు. బ్రతికాము - (ఇద్దరినీ ఎదురుమళ్ళ నిలువ బెడితే మదనిక హాస్యము మాని వేయమన్నట్లు సంజ్ఞ చేస్తుంది)
వసంతసేన : (ఇరువురి మధ్యా నిలబడి శర్విలకుడితో) మీరు వేళాకోళం మానేయాలి. ఆమె నర్తకి, నీవు నటుడవు. శర్విలకా! అమ్మాయీ మదనికా! - మీ ఇందాకటి సంభాషణమంతా నేను సౌధం మీదినుంచి వింటున్నాను. (మదనిక, శర్విలకుడు ఒకరి మొగం ఒకరు చూచుకుంటారు - శర్విలకుడు దొంగతనం పట్టుబడ్డట్లు బిక్కమొగం పెడతాడు) శర్విలకా! మా మదనిక నీ హృదయ సౌశీల్యానికి తగ్గ బహూకృతి. ప్రణయినీదాస్య విముక్తికోసం పరమ సాహసానికి పూనుకున్న ప్రియుడవు నీవు. ప్రియుని పాప పంకిలనుంచి బయటపడవేద్దామన్న పవిత్రాశయం గల ప్రణయిని మా మదనిక! మీ అవ్యాజానురాగానికి సేతువుగా నేను నిలవదలచుకోలేదు. ఈనాటినుంచి మా మదనిక స్వేచ్ఛాజీవి, నా సహోదరి, నీ ప్రేయసి! - అమ్మాయీ! నీవు అదృష్టవతివి, అనుకూలుడైన భర్త అతివలకు పూర్వజన్మ సుకృతం వల్ల కాని లభించడు. శర్విలకా! ఇదిగో, నీ ప్రియ! - మీ ఇరువురూ మాలాలంకరణం చేసుకో మని -
శర్విలకుడు : తల్లీ! నీ ఆజ్ఞ అనుల్లంఘనీయం (మదనిక మెడలో పుష్పహారం వేస్తాడు)
మదనిక : (శర్విలకుడి మెళ్ళో హారం వేస్తుంది)
శర్విలకుడు : (మధురంగా) మదనికా!
మదనిక : శర్విలకా! శర్విలకుడు : (బుజాలమీద చేయి వేసి మదనికను ముందుకు తెస్తే ఇరువురూ వసంతసేనకు నమస్కరిస్తారు)
వసంతసేన : అమ్మాయీ! నేను లోపలికి వెళ్ళి శర్విలకులు మన ఇంట్లోనే విందు చేస్తారని చెప్పి వస్తాను.
మదనిక : (ముగ్ధంగా ఊరుకుంటుంది).
శర్విలకుడు : మదనికా! ఏదీ ఆనాటి వెన్నెలరాత్రి - ఉద్యానవనంలో నీవు నన్ను ప్రశ్నించినపాట!
మదనిక : (ఆనందంతో)
ఎన్నటికో! ఎన్నటికో!!
స్వేచ్ఛా విహరణ
మిథున విహంగమ
జీవన మధురిమ ॥ ఎన్నటికో... ॥
ఎన్నటికో - ఎన్నటికో
విరులతోట విపణివీథి
వెన్నెలలో వేసగిలో,
ఎన్నటికో! ఎన్నటికో!!
శర్విలకుడు : (ఆమె కంఠస్థాయిని మించి)
ఈనాటికి నేటి కహో!
నీ నా బ్రతుకొక టైనది
పదముననే పదమిడుమా
పదవే పద పదవే - ॥ ఈనాటికి... ॥
నీ యెదయే నా యెదగా
నా యెదయే నీ యెదగా
అవధిలేని ప్రణయావని
ఆవలిదెస చేరుదమే - ॥ ఈనాటికి... ॥
(ఇరువురూ పాటతో నిష్క్రమిస్తారు)
ఎనిమిదో దృశ్యం
[శకారుడు ఏకాంతంగా యక్షగాన నాటకంలో వేషం వేయటానికి శబ్దం
చేసుకుంటుంటాడు.]
తరి తరి ధిమి తరి తత్తరి కిట తక
తధీం ధిమ్తరీ తక ధిమి ధిమి ధిమి
పొన్న మ్రాకుపై వెన్నదొంగనై
కన్నె గోపికల వన్నె చీరెలను
తకధిక తధిగిణ తోం
విడిచి నీటిలో పడినవేళలో
ముడిచిచేతిలో నడతు నీడలో
త్రిజమ్త కిట - దివ్యసుందరీ
ధాకిట్త కిట - భవ్యదేహముల
మునిజనపాలా! మురళీలోలా!!
అగధర కిట్తకిట - అమరవందితా
తక్కిట ధరి తక, ధరి కిట్త కిట్త ధిమి
త్రిజమ్త ధకి తక తరుంధ ధిమి కిట్త
(ప్రవేశము విటుడు - ఒళ్ళు తెలియకుండా శకారుడు శబ్దబ్రహ్మలో లీనమై పోతుంటాడు)
కుంభీలకుడు : (నవ్వుతూ) బావా! ఏమిటీ కొలుపు?
శకారుడు : ఆఁయ్ - జాగ్రత్తగా మాట్లాడు! కొలుపూ?
కుంభీలకుడు : పోనీ కొలువు కాకపోతే భాగోతం!
శకారుడు : ఉం- అలారా దారికి
కుంభీలకుడు : బావా! వాలకం చూడబోతే మహారాజువు. ఏదో చేసివచ్చినట్లున్నావే! శకారుడు : (ఏదో గొప్ప రహస్యం దాచిపెడుతున్నట్లుగా) ఓస్, ఇదివరకు చెప్పేశాం, ఇప్పుడు చేస్తున్నాం, ఇక చేస్తాం.
కుంభీలకుడు: అహఁహాఁ! మీకేమండీ, రసికాగ్రేసర చక్రవర్తులు మహాప్రభో! - అయితే నాకుకూడా -
శకారుడు : ఉష్ - నీకూ లేదు, నిన్ను పుట్టించినవాడికీ లేదు.
కుంభీలకుడు : పోనీలే, చెప్పవన్నమాట! (నడుస్తూ) మన స్నేహితం చెల్లు - (వెళ్ళబోతాడు)
శకారుడు : (పిలుస్తూ) బావా! గమ్మత్తుచేస్తుంటే అప్పుడే కోపమా!
కుంభీలకుడు : (దగ్గిరకు వచ్చి) అయితే చెప్పు.
శకారుడు : చెపితే?
కుంభీలకుడు : మన యిద్దరం మళ్లీ బావా, బావా!
శకారుడు : అయితే నీవన్నదే బావా!
కుంభీలకుడు : నీవన్నదే అంటే?
శకారుడు : మళ్ళీ భాగోతం?
కుంభీలకుడు : భాగోతమే! - ఎప్పుడు?
శకారుడు : ఈ రాత్రికి.
కుంభీలకుడు : ఎక్కడ?
శకారుడు : ఎక్కడో ఎందుకు బావా! మనకేం భయం, మనకోటలోనే.
కుంభీలకుడు : మనకోటలోనే! అదా ఇందాకటి ఊసంతా? - అదే జట్టా!
శకారుడు : ఆఁ మనజట్టే! - గోపికా వస్త్రాపహరణం.
కుంభీలకుడు : వస్త్రాపహరణమే! - తరువాతో, మహారాజుగారికి రాత్రికి నిండా పని తగిలింది - అదృష్టవంతుడివి బావా! - కలిసివస్తే ఇలా రావాలి, లేకపోతే -
శకారుడు : బావా! పోయినరాత్రి ఎంత ఎత్తెత్తా ననుకున్నావేం? కుంభీలకుడు : (కొంటెగా) ఆఁ ఎక్కడ?
శకారుడు : ఎక్కడేమిటి? దాని దగ్గరనే -
కుంభీలకుడు : దాని దగ్గరనే - ఓసి ముండా! - అంత ఎత్తు ఎత్తితేగాని ఒప్పుకోలేదేం?
శకారుడు : నేను కృష్ణయ్యైతే అది ఆగలేదట! -
కుంభీలకుడు : (ఛలోక్తిగా) లేకపోతే మరి నువ్వు సామాన్యుడివా? నీ ధాటీలకు అది ఆగవద్దు - మరి చివరకు ఒప్పుకుందా?
శకారుడు : చచ్చినట్టు.
కుంభీలకుడు : (నెమ్మది నెమ్మదిగా) అయితే, రేపు భామ వేషం వేసేది...
శకారుడు : వసంతసేనే?
కుంభీలకుడు : (నిర్ఘాంతపోయినట్లు) వసంతసేన!
శకారుడు : మరి మనదెబ్బంటే ఏమనుకున్నావు?
కుంభీలకుడు : నేను నీ మాట నమ్మను - నిజం చెప్పు.
శకారుడు : నువ్వూ నేనూ బతికి ఉన్నంత నిజం బావా? మరి నిన్న నా మెళ్లో ఉన్న హారమేమైందనుకున్నావ్?
కుంభీలకుడు : (ఆలోచిస్తూ) నీవు స్వయంగా ఆమెతో...
శకారుడు : ఆ లోతులన్నీ నీకెందుకోయ్! ఏదో మేము చేసుకున్నాం. రేపు భామ వేషానికి వసంతసేన గజ్జకట్టకపోతే అప్పుడడుగు!
కుంభీలకుడు : ఇంతకూ నీవు మాట్లాడలేదన్నమాట! - అయితే నిన్ను ఎవరో మోసగించారు.
శకారుడు : (తానూ ఆలోచనలోపడి) ఆఁ - మోసమే!
కుంభీలకుడు : హారం ఎవరికిచ్చావో చెప్పు - ఏం జరిగేది నే చెపుతాను.
శకారుడు : మాధురుడు మన్నే మోసగిస్తాడా?
కుంభీలకుడు : బలే, ప్రబుద్ధుడివి! చాలా గొప్పవాడికిచ్చావు. అయ్యా! - తూర్పు తిరిగి దణ్ణం పెట్టు. శకారుడు : (తల వంచుకొని నేలచూస్తూ) పోయి వాడిని పట్టుకుందాం?
కుంభీలకుడు : చిక్కుతాడనేవాడు నీకు. మంచి ఘనమైన 'శఠగోపురం' పెట్టాడు - బావా! ఆ జూదగాడి చేతిలో పెట్టిన హారం జువ్విచెట్టుక్రింద ఈపాటికే అయిపోయి ఉంటుంది.
శకారుడు : (బిక్కమొగంతో) అంగడికి పోతే దొరుకుతాడేమో!
కుంభీలకుడు : వాడు అంత అథమస్థు డనుకున్నావా? - ఇవాళ ఇంతకూ నిద్రలేచిన ముహూర్తం మంచిది కాదు. ఒక్కపూట ఊళ్లో లేకపోతే ఎంత ఉప్పెన తెచ్చుకున్నావు - (ఆలోచించి) - అయినా మొన్న మనం ఆట ఆడిన చోట వాడు ఇప్పుడు ఉంటే ఉండవచ్చు - పద!
శకారుడు : అయితే, మరి రాత్రి నాటకమో! కుంభీలకుడు : ఇంకా ఏం నాటకం? బూటకం. ఉఁ పద. వెతుకుదాం.
(ఇద్దరూ నిష్క్రమిస్తారు)
తొమ్మిదో దృశ్యం
[వసంతసేన ఇల్లు - చారుదత్తుని చిత్రపటంవైపు చూస్తూ - మధ్య మధ్య - వాతాయనం
(కిటికి) వైపు నడుస్తూ]
వసంతసేన :
నవవసంత మధుపా!
అధిపా. హృదయాధిప!!
ఎలదోటకు రాణి ఇది
లేబ్రాయపు సుమకన్యక
త్రపవీడిన నాపై నీ
కృపగల్గునో లేదో, ఓ నవవసంత...
ఎదతీవియ కదలించిన
పదమల్లెను, విననొల్లవొ?
యుగయుగాల కిది నీదే
వలపో, మరి, వగపో నవవసంత...
(లోపలనుంచి)
శర్విలకుని గొంతు :
మరల మరల నోహో! ఈ
మధువసంత మరుదెంచునె?
మదనిక గొంతు:
యౌవ్వనసుఖ మనుభవింప
కేలబేల లయ్యెదరు?
శర్విలకుడు : పూలతావి తరిగినదా మదనిక: పూలబ్రతుకె అరిగినదా
శర్విలకుడు : నాకమైన ఈ లోకము
మదనిక : నరకముగా మారు నొహో!
శర్విలకుడు : మదనిక :
మరల మరల నోహో! ఈ
మధువసంత మరుదెంచునె?
యౌవ్వనసుఖ మనుభవింప
కేల బేల లయ్యెదరు?
(శర్విలకుడు, మదనిక ప్రవేశిస్తారు. ఇద్దరూ వసంతసేనకు నమస్కరిస్తూ)
వసంతసేన : సుపుత్రప్రాప్తిరస్తు.
శర్విలకుడు : అమ్మా! మరి నాకు సెలవిప్పిస్తారా?
వసంతసేన : మా చెల్లెలూ మీరూ ఈ ఊళ్ళోనే ఉండటానికి నిశ్చయించుకున్నారా? కొన్నాళ్ళపాటు మా మదనిక నా దగ్గరనే ఉండాలని నాకు కోరికగా ఉంది.
శర్విలకుడు : ప్రస్తుతం మీ కోరికకే అనుకూలపరిస్థితి కూడా తోడైవచ్చింది.
వసంతసేన : అదేమిటి? (ఇద్దరి మొగాలూ చూస్తుంది)
శర్విలకుడు : మా ఆర్యకుడి సంగతి మీరు విన్నారా?
వసంతసేన : మా ఆర్యకుడంటే...
శర్విలకుడు : పోనీ ఏ ఆర్యకుని గురించైనా విన్నారా?
వసంతసేన : ఆఁ, విన్నాను. ఎవరో యాదవ యువకుడు ఉన్నాడనీ, ఒక సిద్ధుడు అతని చేయి చూచి ఈ దేశానికి రాజౌతాడని జోస్యం చెప్పాడనీ విన్నాను.
శర్విలకుడు : అవును. అతడే మా ఆర్యకుడు, నాకు చిరకాల మిత్రుడు, మన రాజుగారు ఆ సిద్ధుడిమాట విని వాణ్ణి పట్టి తెప్పించి చెరలో పెట్టాడు.
వసంతసేన : కారణం? శర్విలకుడు : పిరికితనం - అయినా నియంతల రాజ్యాలల్లో బందీని చేయటానికి కారణాలేం కావాలి? అనుమానం క్రింద అరవై ఏళ్ళదాకా శిక్షించవచ్చు. అతణ్ణి కారాగారంనుంచి తప్పించటం నా ధర్మం.
వసంతసేన : అతణ్ణి విడిపించే ప్రయత్నం చేసినవాళ్ళకు ఉరిశిక్ష వేయిస్తామని ఉజ్జయినీ అంతా చాటించారటగా?
శర్విలకుడు : అందుకని భయపడతానా? ఆత్మసఖుడు - అనవసరంగా కారాగారంలో కష్టాలు పడుతుంటే నా ఆత్మ ప్రశాంతి వహించలేదు. మిత్రులందరినీ కలుసుకొని రేపోమాపో వాణ్ణి బయట పడేసే ప్రయత్నం చేయాలి.
వసంతసేన : (మదనికను చూపిస్తూ) మా అమ్మాయి అభిప్రాయం అడిగారా?
శర్విలకుడు : (మదనిక వంక చూచి నవ్వుతాడు).
వసంతసేన : మదనికా! మరి మరిదిగారికి నీ అభిప్రాయమేమిటో చెప్పు.
మదనిక: (సిగ్గుతో మౌనం వహిస్తుంది).
వసంతసేన : (శర్విలకుడితో) మౌనం అర్ధాంగీకారం.
శర్విలకుడు : (నవ్వుతో) పరిపూర్ణాంగీకారమే
వసంతసేన : (నవ్వులో నవ్వు కలుపుతూ) ఇప్పుడు సగమూ, పూర్వము సగమూనా?
శర్విలకుడు, వసంతసేన: (నవ్వుకుంటారు)
శర్విలకుడు : మీ చెల్లెలు నేను తిరిగివచ్చేదాకా మీ యింట్లోనే ఉంటుంది - (శర్విలకుడు చేతి ఉంగరం తీసి దగ్గరికి వచ్చిన మదనిక చేతివేలికి పెట్టి చేయి ముద్దాడి వెళ్ళిపోతాడు. వసంతసేన వారి అనురాగవీక్షణాలను పరికిస్తూ మురిసిపోతూ ముఖవిన్యాసాలతో ఆనందం వెల్లడిస్తుంటుంది. అతడు వెళ్ళిపోయేదాకా ఇద్దరూ వెంటవెళ్ళి తిరిగివస్తారు)
వసంతసేన : అమ్మాయీ! మా మరిది ఎంత సాహసి అయినా తగు జాగ్రత్త ఉన్నవాడు.
మదనిక: (దిగులుతో దూరంగా నిలుచుంటుంది).
వసంతసేన : అమ్మాయీ! మదనికా!! (దగ్గిరవున్న పీఠంమీద కూర్చోబెట్టుకొని నా జీవితంలో ఇంత ఆనందప్రదమైన దినం వెనుక రాలేదు. మదనికా! నీవు ఒక ఇంటిదానివైనావు. మదనిక : అక్కా! ఈ జన్మలో నిన్ను మరచిపోలేను. ఎప్పుడూ కృతజ్ఞురాలినిగా ఉంటాను. అక్కా! అటు చూడు - మైత్రేయులు.
వసంతసేన : అమ్మాయీ! లేచివెళ్ళి వారిని తీసుకోరా వెంటఉండి -
మదనిక : (ఎదురుపోయి తీసుకోవస్తుంది. వసంతసేన వారు వచ్చేవరకూ అటే చూస్తూ ఉంటుంది.)
వసంతసేన : (లేచి సగౌరవంగా నిలవబడి) ఆర్యా! ఆ ఆసనమలంకరించండి.
మైత్రేయుడు : (ఎబ్బెట్టుగా కూర్చుని) అమ్మాయీ! నీ ఇల్లు కాదుగాని నా ఒళ్లు గుల్లయిపోయింది. ఎక్కే గడప, దిగే గడప, కూర్చుంటే గడప, లేస్తే గడప, అసలే ఐరావతం లాంటి మనిషినా! అడుగులో అడుగు పెట్టుకుంటూ అరటిపండు తొక్కమీద కాలుపడ్డట్టు జర్రున జారుకుంటూ, పడుతూ లేస్తూ పైకి వచ్చేటప్పటికల్లా ప్రాతఃసంధ్య వార్చుకొని బయలుదేరితే, మాధ్యాహ్నిక సంధ్యకు వేళ తప్పుతూ ఉన్నది. ఇంట్లో ఉంటే ఈ పాటికల్లా తవ్వెడు నువ్వులు తిలోదకాలకు పూర్తి చేసేవాణ్ణి. డబ్బుంటే ఇలా గోడలకూ, గొబ్బెలకూ పెట్టకపోతే...
(సర్దుకొని కూర్చుంటాడు).
వసంతసేన : ఇంత లోగిలి కట్టుకొని తమబోటి పెద్దవారికి మిక్కిలి శ్రమ ఇచ్చాను.
మైత్రేయుడు : (సర్దుకొంటూ) పరిహాసాలకేం గాని అమ్మాయీ! నీ యిల్లు చూచిన తరువాత ముల్లోకాలూ ఇందుమూర్తీభవించినవా అనిపిస్తున్నది. కుబేరభవనం దీని ముందు గుడ్డిగవ్వకు పనికిరాదు.
వసంతసేన : ధన్యురాలిని.
మైత్రేయుడు : కూర్చో అమ్మాయీ! నిలబడ్డావు?
వసంతసేన : (కూర్చొని) ఆర్యా! మీ మిత్రులు కుశలమేనా?
మైత్రేయుడు : మా చారుదత్తుడికి కుశలమే కాని, అతని నామసార్థక్యానికి ఈ మధ్య కొన్ని అవాంతరాలు వచ్చినవి.
వసంతసేన : ఆ సజ్జన మహావృక్షాన్ని ఎవరూ నీడకోసం ఆశ్రయించటం లేదా?
మైత్రేయుడు : (దైన్యాన్ని సూచిస్తూ తలవంచుకుంటాడు), వసంతసేన : ఆర్యా! ఏదో పనిబడి వచ్చినట్లున్నారు లేకపోతే ఎన్నడూ మా గడపలే తొక్కనివారు...
మైత్రేయుడు : (అటూ ఇటూ చూచి) ఈ అమ్మాయి, మీ చెల్లెలు మదనిక కదూ!
వసంతసేన : మీరు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు.
మైత్రేయుడు : అమ్మాయీ! ఆనాడు కామాలయం నుంచీ తిరిగి వచ్చేటప్పుడు చారుదత్తుడి ఇంట్లో దాచిపెట్టమని నగల పాత్ర ఒకటి ఉంచిపోయినావు.
వసంతసేన : అవును! జ్ఞాపకమున్నది. మీరు 'మన ఇంట్లో దాచనిచ్చిన దీన్ని' అని చమత్కరించారు, దానికి మీ మిత్రులు - 'వెంటనే ఆమె కోరినప్పుడు తిరిగి ఇచ్చివేయా'లని సమాధానం కూడా చెప్పారు - అదేనా?
మైత్రేయుడు : అదే! అది తనదే ననే భ్రాంతితో.
మదనిక: (దగ్గరకు వస్తూ) ఆఁ.
మైత్రేయుడు : మిత్రబృందంతో జూదమాడి మా చారుదత్తుడు ఓడి పోయినాడు.
మదనిక : వసంతసేన (ఒకరిమొగం ఒకరు చూచి నవ్వుకుంటారు).
మైత్రేయుడు : (మొగాలు చూస్తూ రత్నావళి బయటికి తీస్తూ) దానికి మారుగా ఈ రత్నహారం గ్రహిస్తావేమో అడిగి రమ్మని నన్ను పంపించాడు.
వసంతసేన : వారి ఔదార్యం లోకంలో పూర్వమెన్నడూ విన్నదేకాదు!
మైత్రేయుడు : రత్నహారం తీసుకోవటం నీకేమీ ఇష్టంలేనట్లున్న దమ్మాయీ!
వసంతసేన: అనురాగపూర్వకంగా మీ మిత్రులు పంపించిన హారాన్ని స్వీకరించకపోవటం మహాపచారం.
మైత్రేయుడు : ఆఁ, ఇందులో అపచారానికేమున్నదీ, విచారానికేమున్నది.
వసంతసేన : మదనికా! - (ఆ హారాన్ని అందుకోమన్నట్లు సంజ్ఞ చేస్తున్నది).
మదనిక: (చేయి చాపుతుంది).
మైత్రేయుడు : (ఇవ్వలేక ఇవ్వలేక ఇస్తూ) ఇది స్వర్గీయులైన మా అక్క ధూతాదేవిగారికి పుట్టింటివారు సూడిదగా ఇచ్చింది. వసంతసేన : అంత ప్రియమైన హారాన్ని మా నగల పాత్రకు ప్రతిగా ఇవ్వటము మా మహాభాగ్యము.
మైత్రేయుడు : (మదనికకు హారాన్ని ఇవ్వలేక ఇచ్చి లేచి కొల్లాయిగుడ్డ విదిలించుకొని పనైపోయిందన్నట్లుగా) అమ్మాయీ! వచ్చినపని పూర్తి అయింది. ఇక లేవనా, దేవతార్చనకు ప్రొద్దుపోతున్నది.
వసంతసేన : ఆర్యా! నేను ప్రదోషసమయంలో మీ మిత్రుల దర్శనానికి వస్తున్నానని నాకై సెలవీయండి.
మైత్రేయుడు : ఆఁ. (కానీ రానీ అన్నట్లు) అలాగా.
(నిష్క్రమిస్తాడు)
మదనిక : (హారం వసంతసేన చేతిలో పెడుతూ) చాలా ఆనందంగా ఉంది అక్కా! ఒక్కమాటు మెళ్లో వేసుకో చూస్తాను.
వసంతసేన : అమ్మాయీ! మైత్రేయులవారిని అందాకా పంపించిరా ?
మదనిక: (మాట్లాడకుండా వెళ్లుతుంది).
వసంతసేన : హారాన్ని పరిశీలిస్తూ - చారుదత్తుని చిత్రపటం వైపు చూస్తూ)
(*) ప్రభూ! ఈ పాద సేవకురాలిమీద, నీ శీతలామలస్నిగ్ధ దృష్టి పడిందా, ఈ నీరసశుష్కజీవితం ప్రణయప్రమదావన మౌతుంది.
సంవాహకుడు : (ఆవేగంతో ప్రవేశించి) అమ్మా! రక్షించండి! రక్షించండి!! (కాళ్ళమీద పడతాడు)
వసంతసేన : ఎవరు నీవు? ఎలా వచ్చావిక్కడికి? - దొడ్డి దారినా?
సంవాహకుడు : (ఔనన్నట్లు తల ఊపి) అమ్మా! ప్రధాన జూదరి మాధురుడికి పదిసువర్ణాలు ఆటలో అప్పు పడ్డాను. (తెరలో) ఓరి - బయటికిరా! వస్తే బ్రతకవు, పది సువర్ణాలూ కక్కిస్తా - (తలుపుకొడ్తూ) అమ్మా! తలుపు బ్రద్దలు కొట్టి వస్తాడేమో! రక్షించు తల్లీ! నీ ఋణం తీర్చుకుంటాను.
వసంతసేన : ఎవరు నువ్వు? సంవాహకుడు : నాది పాటలి. ఒక సంసారి బిడ్డను. సంవాహకవృత్తితో జీవిస్తాను.
వసంతసేన : చాలా సుకుమారమైన విద్య!
సంవాహకుడు : అమ్మా! పాడుజూదం, అప్పులో పడ్డాను తల్లీ! ఉజ్జయినీపురంలో మా ఏలిక దానకర్ణుడు. ఆయన ఇచ్చిన అధిక వేతనాలతో దుర్వ్యసనాలపాలై ఇప్పుడు బయటపడలేకపోతున్నాను.
వసంతసేన : ఆయననే ఇప్పుడూ అడగరాదూ?
సంవాహకుడు : నాబోటి దీనులను కరుణించి దాతృత్వంలో ఇప్పుడాయన -
వసంతసేన : దరిద్రుడైనాడా?
సంవాహకుడు : (సిగ్గుతో తలవంచుకుంటాడు).
వసంతసేన : మీ యజమాని పేరు అడగవచ్చునా?
సంవాహకుడు : మహాభాగ చారుదత్తులు.
వసంతసేన : (సంతోషంతో) ఇదిగో - ఈ కంకణం వారికిచ్చి ముందు నీ ఋణం తీర్చుకోరా - పది సువర్ణాలా?
సంవాహకుడు : (వసంతసేన చేతికిచ్చిన కంకణాన్ని తీసుకోపోయి మాధురుడికిచ్చి వెంటనే తిరిగివస్తాడు) అమ్మా! ఈ నిరుపేద మీ ఋణం ఎలా తీర్చుకుంటాడో! - మీ బోటి దయగలవాళ్లు ఈ లోకంలో కనుపించటమే అరుదు. ఈ సేవకుడు నేర్చుకొన్న విద్యతో మీ ఋణం తీర్చుకుంటాడు.
వసంతసేన : ఇన్నాళ్ళనుంచి ఎవరి శుశ్రూష చేసి ధన్యుడవైనావో వారి దగ్గిరనే నీ విద్యకు సార్థకత లభించనీ.
సంవాహకుడు : తల్లీ! నేనా మహాభాగుణ్ణి చూడలేను. ఆయన ప్రియవాది. ప్రియదర్శనుడు. పరమ దయాళువు. మమ్మల్ని చూచినపుడల్లా మా దీనస్థితికీ, తన అశక్తతకూ చింతపడతాడు.
వసంతసేన : మహాత్ముల లక్షణమే అది. ఇతరుల బాధను తమ బాధగా పరిగణిస్తారు.
సంవాహకుడు : అమ్మా! నేను ఒక నిశ్చయం చేశాను. నా జీవితంలో ఎన్నడూ జూదంమొగం చూడను. బౌద్ధసన్యాసినై సంఘారామాలల్లో సాధువృత్తితో జీవితం వెళ్ళబుచ్చుతాను. వసంతసేన : అంత సాహసం చెయ్యకు.
సంవాహకుడు : అమ్మా! నా కోరికకు అడ్డుపెట్టకు. సంఘసేవ చేయటానికి నాకు మరో సదవకాశం లేదు.
(నిష్క్రమిస్తాడు)
మదనిక : (ఒక్క ఉత్తరీయంతో ప్రవేశించి) అక్కా! అక్కా!! ఘంటమోదకంవల్ల ఇవాళ అన్యాయంగా మనం అధికారుల చేతుల్లో పడేవాళ్ళమే!
వసంతసేన : తప్పించుకోపోయిందా ఏమిటి?
మదనిక : కట్టుగొలుసు తెంపుకొని రాచబాటలో ఒకరిని తొండంతో పట్టుకొని నేలకేసి కొట్టబోయింది.
వసంతసేన : (ఆశ్చర్యంతో) ఆఁ!
మదనిక : జనం చచ్చె చచ్చె అని కేకలు వేశారు. మన కర్ణపూరకుడు అంకుశంతో లొంగగొట్టి -
వసంతసేన: అమ్మా! పరువు కాపాడాడు - ఆ ఉత్తరీయ మెక్కడిది?
మదనిక : మరి తొందరపడకు. విను. జనంలోనుంచి ఒక మహానుభావుడు ఉత్తరీయాన్ని బహుమానంగా కర్ణపూరకుడి కిచ్చాడట!
వసంతసేన : అది జాజిపూల వాసనే వేస్తున్నదా?
మదనిక : (జాగు చేస్తూ) ఈ మధ్య చేమంతిపూలే పెట్టుకోటంవల్ల జాజిపూల వాసనే మరిచిపోయినాను అక్కా
వసంతసేన : చివర నామధేయం ఉందో లేదో చూడు.
మదనిక: (పరిశీలించి) చా... రు
వసంతసేన : ద....త్త - అవునా? మహాభాగుడిదేనా! ఏదీ ఆ మదనిక దగ్గరినుంచి ఒడిచి తీసుకొని కప్పుకొని సంతోషంతో దీర్ఘంగా నిట్టూర్చి (*) నా ప్రియుని కీర్తిస్ఫూర్తితో దిక్కులన్నిటికీ జాజితావులు వెదజల్లే మహత్తరోత్తరీయమా ఇదిగో ఈ అంసభాగము వక్షస్థలము నీవి. నీ ఆనంద నాట్యాని కివి రంగస్థలాలు. నిరుపమానమైన నీ కళాకేళి నక్కడనుంచి నిరూపించు. మదనిక : అక్కా! నీ ఒంటిమీద కెక్కి ఈ ఉత్తరీయం అందం తెచ్చుకున్నది.
వసంతసేన : పొరబాటు. చారుదత్త మహాభాగుల ఉత్తరీయాంశుకంవల్ల నా శరీరానికి నూతనోత్తేజం కలిగింది. మదనికా! వారి సేవకుడికి కంకణమిచ్చి మానం నేను కాపాడినందుకు నా సేవకుణ్ణి ఈవిధంగా ఆర్యుడు తెలియ కుండానే గౌరవించాడు.
మదనిక: అదేమిటి?
వసంతసేన : ఇప్పుడే అప్పుపడ్డ ఆర్యులసేవకుడికి పది సువర్ణాల కంకణమిచ్చి ఋణవిముక్తుణ్ణి చేశాను.
మదనిక : (నవ్వుతూ వసంతసేన కప్పుకున్న ఉత్తరీయం సవరిస్తూ) అక్కా! ఇది నీవు వ్యయం చేసిన పదిసువర్ణాల కంకణం విలువ వుంటుందా?
వసంతసేన : నీ మొగుడు వారింట్లో దొంగిలించిన భూషణ పాత్రకంటే ఎన్నో రెట్లు విలువ చేస్తుంది. (అని అంజలి ముడిచి వాసన చూస్తూ ఉంటుంది) అమ్మాయీ! మనం త్వరగా అలంకరణ పూర్తి చేసుకొని ఆర్యచారుదత్తుల ఇంటికి బయలుదేరాలి - రత్నహారం వెంటతీసుకోవెళ్ళాలి. మరిచిపోవద్దు. జ్ఞప్తి ఉంచుకో (ఉరుములు - మెరుపులు)
మదనిక: అక్కా! అటుచూడు! అకాలదుర్దినము. కారుమేఘాలు బాగా క్రమ్ముకోవస్తున్నవి-
(వాతాయనంవైపు నడిచి) కుంభవృష్టి తప్పదు.
వసంతసేన : (*) మదనికా! ఈ శ్రావణపయోదాలు లోకాలకు ప్రళ యంగా కుంభవృష్టి కురియనీ. నేల బీటలు వారేటట్లు పిడుగులు పడనీ, ఏమైనా రమణీయాకృతితో నేను నా ప్రియుని ఇంటికి వెళ్ళి తీరవలసిందే!
మదనిక: అక్కా! ప్రవాసంనుంచి తిరిగివచ్చే ప్రియులకు వాసకసజ్జికలు స్వాగతమిచ్చినట్లు, అదుగో, అటుచూడు! ఆ గిరిశృంగాలమీద మయూరాంగనలు పురులు విప్పి మధుర క్రేంకారాలతో అంబుదస్వామికి ఎలా స్వాగతమిస్తున్నవో!
వసంతసేన : అయ్యో! దిక్కులన్నీ పట్టపగలే కారుచీకట్లలో కలిసి పోతున్నవి. జగత్తుకు ఇక ఈ దినం భయంకర కాళరాత్రేనా? ప్రళయం రానీ! నా ప్రయత్నం మానను!! మదనిక: అక్కా అటుచూడు! (మేఘగర్జ) మేఘగర్జ విన్న తరువాత కూడా నీకు ధైర్యం సడలటం లేదా?
వసంతసేన : (ఆకాశంవైపు దృష్టి నిల్పి) (*) ప్రభూ! పర్జన్యా!! నేను ప్రౌఢోజ్వల వేషంతో నా ప్రియుని ఇంటికి బయలుదేరుతుంటే ఈ ప్రావృట్కాల ఘనఘోషలతో, ద్రోణవృష్టులు కురియ తలపెట్టావు. ఈ దౌష్ట్యం నీబోటివాని కర్హమైందేనా?
మదనిక : అక్కా! అతడేమి చేస్తాడు? మేఘాధిపతి ఇంద్రమహారాజుకు నీమీద దయ తప్పింది.
వసంతసేన : ఇంద్ర మహారాజుకు దయతప్పనీ, చంద్రమహారాజుకు దయ తప్పనీ - ముల్లోకాలూ ప్రళయకల్లోలాబ్దిలో మునిగిపోనీ - అదుగో! ఆ మెరుపుకన్నె అలా దారి చూపుతూ వెలిగితే చాలు!! (ఔత్సుక్యంతో)
(*) అమ్మా, సౌదామినీ!! ఆ మేఘరాజును అలాగే ఉరమనీ. అతడు మగవాడు. హృదయేశ్వరునికోసం విరహార్తనైన నేను అభిసారికనౌతున్నాను. నన్ను ఏవిధంగా ప్రియుని ఇంటికి చేరుస్తావో!
(నిష్క్రమిస్తుంది)
పదో దృశ్యం
[చారుదత్తుని ఇల్లు - ఆషాఢ మేఘగర్జనలూ మెరుపులూ - సాయం సమయం -
మధ్య మధ్యన ఆలోచించుకుంటూ అతడు కవితాగానం చేస్తూ మధ్య మధ్య తాళపత్ర
గ్రంథం మీద లిఖిస్తూ ఉంటాడు]
చారుదత్తుడు :
"సకియ యేతెంచు నేమొ, ఆషాఢజలద!
బిట్టు గర్జించి యిటు భయపెట్టకయ్య:
తిమిరముల జీల్చి భవదీయ దేహకాంతి
తోడుపడ గదె, తల్లి, విద్యుల్లతాంగి!
ఆగు మొక్కింత జలదుడా! ఆగవోయి :
రామగిర్యాశ్రమోపాంత రమ్యభూమి
సకియ నెడబాసి నాడు వేసారు యక్షు
దూతవే నీవు చెప్పుమా తొలుత సఖుడ?
ఇతని నీ గతి ఘోషింపనిమ్ము శంప!
అటులె కాయించి వెన్నెల నమృతరూపి
దెసల వెలిగింప హృదయాధిదేవి వచ్చు
వచ్చు దుర్దినమైన నే ప్రళయమైన”
మైత్రేయుడు : (ప్రవేశిస్తూ విసిగిపోయినట్లుగా) ఛీ, ఛీ, ఛీ! బులిబుచ్చి కాలబూచి
గాయత్రిసాక్షిగా దానిమొఘం మళ్ళీ చూడకు. చదువుకున్న బ్రాహ్మణ్ణని చాప వేసిందా?
పోనీ వట్టినేలమీదైనా గట్టిగా కూర్చోమందా? సుడి పడిపోయి దాని కొంపకు చేరుకుంటే
కాస్త శుద్ధి చేసి గుక్కెడు మంచినీళ్ళిచ్చిందా? పచ్చి పుండాకోర్!! అరెరె! వెళ్ళింది
మొదలు రెండో ప్రసంగమే లేదాయె! కాకులకు కోకిలలెలా పుడతాయి ఉ హుఁ
హు. - 'విత్తమాత్రోపాధే సకల పురుషాభిలాషిణీ సామాన్యా!! చారుదత్తుడు : మైత్రేయా! ఏం జరిగిందేమిటి? - వెళ్లిన పని ఏమైంది?
మైత్రేయుడు : ఏమైంది? 'అయంవై'
చారుదత్తుడు : వసంతసేన రత్నావళి తీసుకోలేదా?
మైత్రేయుడు : తీసుకోకపోవటమేం? - చేదా? తేనెలొలికే కుసుమకోమల హస్తాలతో దివ్యంగా తీసుకున్నది.
చారుదత్తుడు : అయితే 'అయంవై' అంటావేం? చెడిపోవటమేముంది?
మైత్రేయుడు : మనమేం తిన్నామా? కుడిచామా? భూషణ పాత్రిక దొంగలెత్తుకో పోయినారు. దానికోసం మన - మా స్వర్గీయులైన అక్కగారి జ్ఞాపకచిహ్నమైన అమూల్య హారం పోయింది.
చారుదత్తుడు : భూషణపాత్రకు ప్రతిగా రత్నహారాన్ని మనం ఇచ్చా మటోయ్ ! అయితే మైత్రేయా! ఆమె దాన్ని సంతోషంగా గ్రహించిందా?
మైత్రేయుడు : ఆఁ, ఆఁ - ఆగ్రహించింది ఆగ్రహించింది, అయ్యా! గుళ్ళో గంటపోతే నంబి కేంలోటు?
చారుదత్తుడు : మైత్రేయా ఏమిటి నీకీ కోపం? పరమ దరిద్రుణ్ణన్న ప్రతీతి ఎరిగి కూడా నగలపాత్ర మనయింట్లో దాచి పెట్టటానికని ఆమె ఇచ్చింది గమనించావా? ఆ నమ్మకానికి మనం పంపించిన హారం తగ్గ బహుమానమా?
మైత్రేయుడు : (వికటంగా) లేదు! లేదు!! ఇదిగో! నీవింత వెర్రి బాగులవాడి వని కనిపెట్టి అది నీ చేతికిచ్చింది దొంగను పంపించి దోయించింది. హారాన్ని హరించింది చారుదత్తా!
చారుదత్తుడు : (పొరబాటన్నట్లు) మైత్రేయా!
మైత్రేయుడు : (వినిపించుకోకుండా) అమ్మా! కనుసైగ చేసి చెలికత్తెలతో కలిసి పైటకొంగు చాటుగా నన్ను పరిహసిస్తుందీ. వాళ్లూ దీనికి తోడుబోయిన వాళ్లే. 'ఇంద్రాణి' ముండలు. ఆఁ పరమబ్రాహ్మణుణ్ణి పట్టుకొని పరాచకాలాడటమా! నీకు కోపం వస్తుందని ఊరుకున్నాను. లేకపోతేనా పెట్టవలసిన నాలుగు 'వషట్కారాలూ' పెట్టి 'దేవాదేవేషు’ చేసి వచ్చేవాణ్ణి. (జాలిగా) చారుదత్తా! నీకెందుకీ సానిసాంగత్యం? నా మాట విను. చారుదత్తుడు : మైత్రేయా! వసంతసేన హృదయం నీకు అణుమాత్రమైనా అర్థం కాలేదు. ఆమె నీవనుకుంటూ ఉన్నట్లు సామాన్య కాదోయ్! సద్గుణోపేత. ఆమె హృదయం అమృతమయం.
మైత్రేయుడు : సరే! మంచిది, కానియ్! ఆ అమృతమంతా తాగి అమాంతంగా దేవతవై కూచో, మా నెత్తిమీద ఏముంది? అగడ్తలో పడ్డపిల్లికి అదే వైకుంఠం. ఏదో 'కంచిమేక’వు. కమ్మటి బ్రాహ్మడవు. దొరికావు. అదంతా నాకెందుకు, శ్రుతిమించి రాగానపడ్డ తరువాత. నిన్ను చూడటానికని ఆమెగారు ప్రదోష సమయంలో మన ఇంటికి వస్తుందట! చెప్పమన్నది. మేలిమి బంగారంలాంటి నీ మెత్తదనం బాగా తెలుసుకుంది. రత్నావళి చాలలేదు కామాలి. మొరపెట్టి మరేదైనా కొంత గిలుబాడుకోపోదామని వస్తున్నట్లుంది.
(లేస్తాడు)
చారుదత్తుడు : రానీ - సంతోషపెట్టి పంపటానికి ప్రయత్నిస్తాను.
మైత్రేయుడు : (కోపంతో గట్టి గొంతుకతో) ఏమిచ్చి - నన్నిచ్చి -
చారుదత్తుడు : మైత్రేయా! కొంచెం శాంతించు. చాలా శ్రమపడి వెళ్ళివచ్చావు. కాసేపు అలా విశ్రమించు.
మైత్రేయుడు : 'అమ్మగారి' ఇంటినుంచి వచ్చి 'సచేలస్నానం' చేసి చాలాసేపు విశ్రమించే వచ్చాను.
చారుదత్తుడు : మైత్రేయా! ప్రణయదాంపత్యం నీబోటి పరమ ఛాందసుడికి ఏమి తలకెక్కుతుంది? ఒక మహాకవి తన ప్రేమమూర్తితో ఏమంటున్నాడో విను.
"కోరను స్వర్గ మిచ్చినను
కోరను బ్రహ్మపదమ్మె కల్గినన్
సారెకు సారెకున్ మధుర
సప్రసవాసవమిచ్చి ప్రేమతో
మారశిలీముఖాంగుళుల
మంజులదివ్యవిపంచి మీటి నా
నీరసజీవితమ్మునకు
నిత్యము ప్రాణము పోసినన్ సఖీ!'
ఒదులుకుంటాడుగా! ఓరి త్వాష్ట్రం! అందంగా చెప్పగలుగుదుము గదా అని ఈ 'బ్రహ్మష్ఠ బ్రహ్మిష్ఠి' గాళ్ళందరూ అవాకులు చెవాకులు వ్రాస్తే సరా! ఇలాంటి కుకవులే పుట్టకపోతే లోకం ఇంత అల్లకల్లోలమయ్యేదే కాదు. అందుకనే 'నానృషిః కురుతే కావ్య' మన్నారు పెద్దలు - అంతా కవులే! అంతా మహాకవులే. పుట్టగొడుగుల్లాగా ఇంతమంది మహాకవులు పుట్టుకొచ్చారేమోయ్, ఈ కాలంలో-
చారుదత్తుడు : మైత్రేయా : ఈనాటి మహాకవుల ప్రణయకవిత్వం నీ బోటి వాళ్ళకు ఆగమ్యగోచరంగా ఉంటుంది -
మైత్రేయుడు : ప్రణయాన్ని అనుభవించి వ్రాసిందేనా? ఈ ప్రళయ కవిత్వమంతా! ఒకవైపు పెళ్ళాడిన వాళ్ళ వీపులు విరుగుతూ ఉంటవిట! ఇంకోవైపు నుంచి ప్రేమతత్వం మీద ప్రణయగీతాలు ఘంటం కక్కుతూ ఉంటుందిట! - అంతేనా? అయితే, తమరు జెప్పే 'ప్రళయకవిత్వం' కూడా ఇషువంటిదేనా స్వామీ? (తలుపు చప్పుడు) చారుదత్తా! మీ ధనికుడు వచ్చినట్లున్నారు -
చారుదత్తుడు: (నవ్వుతూ భావం గ్రహించినట్లు) మా ధనికుడెవరు?
మైత్రేయుడు : నీవు ఋణపడి రత్నహారమిచ్చుకున్న వారు?
చారుదత్తుడు : నీవు ఎంత పరిహాసం చేసినా నాబోటి జూదరులకు ధనికులతో స్నేహం తప్పనిసరిగదా! (వచ్చిన మదనికను చూసి) అమ్మాయీ! మీఅక్కగారు వచ్చారా!
(ఔనని తలూపి మదనిక నిష్క్రమిస్తుంది).
మైత్రేయుడు : ఓహో! లజ్జాభినయం ఇంకా అయిపోలేదు కామాలి. ఇదే కొంప తీసేది - తెలివితేటలంటే అలా వెలిగిపోవాలి (కోపంతో వసంతసేన వచ్చేవైపుకు వెన్ను తిప్పి కూర్చుంటాడు).
వసంతసేన : (మదనికతో ప్రవేశించి యిద్దరికీ నమస్కరిస్తుంది).
చారుదత్తుడు : (ఆసనం చూపిస్తూ) వసంతసేనా? ఈ ఆషాఢారంభం నీకు సుఖప్రదంగానే ఉందా?
వసంతసేన : (కూర్చొని స్మితం చేస్తుంది). మైత్రేయుడు : (వసంతసేనవైపు తిరిగి) అమ్మాయీ! అవతల అట్లా మేఘాలు కమ్ముకొస్తుంటే ఏదో ముంచుకోబోయినట్లు ఆత్రంతో పరుగెత్తుకోవచ్చావు.
మదనిక : బాబయ్యగారూ! మీరు ఇచ్చిన రత్నావళి విలువ ఎంతో కనుక్కోబోదామని వచ్చింది మా అక్కయ్య!
మైత్రేయుడు : (చారుదత్తునివైపు సాభిప్రాయంగా చూస్తాడు).
మదనిక : ఆమె అది తనదేననే భ్రాంతిలో ఒక చెలికత్తెతో జూదమాడి ఓడిపోయింది.
వసంతసేన : ఆ గెలుచుకున్న మా 'శాద్వల' మొగుడు ఒక రాజచారుడు. దానిని తీసుకొని గతరాత్రి ఎక్కడికో వెళ్ళిపోయినాడు.
మదనిక : (కనుసైగ చేసి చెప్పవే అన్నట్లు) ఉఁ. చెప్పు.
వసంతసేన : (నీవే నన్నట్లుగా) కానీ.
మదనిక : అతడు తిరిగివస్తేగాని మీ హారం మీకు రాదు. అందాకా ఈ భూషణపాత్ర మీ యింట్లో పూటగా ఉంచుకోవలసిందని మా అక్కయ్య అభిప్రాయం.
వసంతసేన : (భూషణపాత్ర ఉత్తరీయం నుంచి బయటికి తీస్తుంది)
మైత్రేయుడు : (కూర్చున్నచోటి నుంచి లేచి పాత్రికను పరీక్షిస్తూ) మామాటలే మాకు ఒప్పచెపుతున్నారా? ఆఁ! చారుదత్తా! నేను చెప్పలేదు. మన ఇంట్లో దొంగతనం ఎవరు చేయించారో! ఇది, అదే, ఆ భూషణపాత్రే! ఏం సందేహం లేదు. ఇంకా అనుమానమెందుకు?
మదనిక : (లేని కాఠిన్యంతో) బాగుంది వ్యవహారం! జాగ్రత్తగా చూచి మాట్లాడండి!
మైత్రేయుడు : నా బ్రాహ్మణ్యం తోడు. ఇది అక్షరాలా ఆ సువర్ణపాత్రే! చారుదత్తా!
చారుదత్తుడు : (నవ్వుతూ) నాకేమనటానికీ తోచడం లేదు. దాని విషయం నీవే తేల్చు.
వసంతసేన : (నవ్వుతూ) నిజం చెప్పవే మదనికా! మీ ఆయన 'ప్రతిభ' ఆర్యులు కూడా వింటారు.
మదనిక : నీవే కానీ అక్కా!
వసంతసేన : నీ నోటిమీదిగా వస్తే మీవారి ప్రతాపం బాగా అర్థమౌతుంది. మదనిక : (కోపం చూపిస్తుంది).
వసంతసేన : పోనీలే ! (మైత్రేయుడితో) ఆర్యా! నేను మీ ఇంట్లో దాచిపెట్టమని ఇచ్చిన భూషణపాత్రను కన్నం వేసి దొంగిలించాడు మా మదనిక మొగుడు.
చారుదత్తుడు: మదనికకు పెళ్ళైందా ఏమిటి?
వసంతసేన : దానికీ మీరే కారకులు - మొన్న రాత్రే పాణిగ్రహణం!
చారుదత్తుడు : సంతోషం!
మైత్రేయుడు : (ఆలోచించి) మదనిక దొంగపెళ్ళామన్న మాట!
చారుదత్తుడు : (నవ్వుతూ) దొంగ పెళ్ళాం కాదోయ్ - దొంగకు పెళ్ళాం.
మైత్రేయుడు : ఏమైతేనేం? మన సువర్ణపాత్ర దొరికింది. దొంగ చిక్కాడు. నేను చెప్పలేదుటోయ్ ప్రశ్న - సరిగా అన్నట్లే నాలుగోదినానికి దొంగ దొరికాడు.
చారుదత్తుడు : వసంతసేనా! నీవు కూడా జూదరివైనావా?
వసంతసేన : మీరు జూదరులైతే నేనుమాత్రం జూదరిని కాకుండా ఉండగలనా?
మదనిక : బాబయ్యా! మీరింకా కొంతసేపు ఇక్కడే ఉంటారా?
మైత్రేయుడు : మీరెవ్వరూ లెమ్మనకుండానే ఈ చలిగాలి రయ్యిమని విసరికొడుతూ నన్ను లేచిపొమ్మంటున్నది - అమ్మాయీ, ఒకమాట. (ఇద్దరూ నిష్క్రమిస్తారు).
చారుదత్తుడు : వసంతసేన : (ఒకరిని చూచి ఒకరు నవ్వుకుంటారు)
చారుదత్తుడు : ప్రియా! నేను జూదరిని ఎందుకైనానో తెలుసునా? ఈ జగత్తు నాబోటి నిరుపేదను నమ్మదని. సత్యం ఎవరికి బోధపడుతుంది. కేవలం ప్రచారంమీద ప్రపంచము నడుస్తున్నది. తనలోపాన్ని ఒకరిమీదికి నెట్టటం కన్నా ఒకరి లోపాన్ని తనమీదికి తీసుకోవటం మంచిదని నా నమ్మకం.
వసంతసేన : మీబోటివారి కది చెల్లుతుంది.
చారుదత్తుడు : (మందస్మితంతో) నీవు మాత్రం ఏమి తక్కువ తిన్నట్టు -
వసంతసేన : అందుకనే మదనుడు మన ఇద్దరినీ చారుదత్తుడు : వసంతసేనా! అటుచూడు, ఆ కొండకొమ్మున మేఘగర్జ విని మయూరాంగనలు కదుపులు కట్టి ఎలా నాట్యమాడుతున్నవో!
వసంతసేన : అవి తమ వియోగగాథలను మధుర క్రేంకార మిషతో అంబుదప్రభువుకు విన్నవించుకుంటూ ఉన్నవి.
చారుదత్తుడు : (మరొకవైపు చూపిస్తూ) అదుగో, ఆ ఆషాఢ వలాహకస్వామి శితికంఠుని కంఠకాళిమ కంటే నీలాతినీలమైన శరీరంతో మందగమనం చేస్తున్నాడు - ఆయన సప్త సముద్రాలల్లో తాగిన నీటినన్నిటినీ ఒక్కమాటుగా పుక్కిలిస్తేనా?
వసంతసేన : సాగరాధిపతి పంట పండుతుంది. వధూసంగమం!
చారుదత్తుడు : మహాకవులకు వసంతకాలం నచ్చినట్లు ఈ ఆషాఢం నచ్చలేదు. నాకు మాత్రం ప్రావృట్కాలమంటే పరమప్రీతి. ఈ ఋతువు తలపుకువస్తేనే ఎన్నెన్నో మనోహరభావాలు, ప్రవాసరాధికలు, వాసవసజ్జికలు, అభిసారికలు - ఒక వంక సాగర మేఘనాథులు, మరొకవంక నదీనద మయూరాంగనలు. ఉత్తేజకరమైన కవితాసామగ్రికీ ఋతువు ఉజ్జ్వలమైంది.
వసంతసేన : ఆర్యా! అభిసారికనై వచ్చిన నాకు మాత్రం మరొక ఋతువుమీద అభిమానమెలా కలుగుతుంది?
చారుదత్తుడు : (వసంతసేన దగ్గిరికి వస్తూ) ప్రియా!
వసంతసేన : (అతని బుజాన్ని ఆలంబంగా గ్రహించి నిలుస్తూ) ప్రభూ!
చారుదత్తుడు : మన ద్వితీయ పరిచయం నాడు నీవు వినిపించిన గీతం ఏదీ, మరొక్కమారు వినిపించు -
వసంతసేన : మీ వీణావాదనం తోడుగా ఉంటేగాని ఈ దినం పలకలేను, క్షమించాలి.
చారుదత్తుడు : (వీణవైపు నడచి వసంతసేనను పాడమని సంజ్ఞ చేస్తాడు).
వసంతసేన: (పాడుటకు ఉద్యుక్తమౌతుంది)
నెమ్మదికి రావె ఈ
తుమ్మెదకు ఓ పూవ!
అమ్ముకోబోకె నీ
నెమ్మనము ఓ పూవ!! నెమ్మదికి....
పొలతి! బేలవె నీవు
ప్రొడతన మెరుగవే!
ననకులమ్మున కెంత
నగుబాటె, నగుబాటె! నెమ్మదికి....
ఈ కోన నీకంటె
తావిగల పూవేది!
ఆతురత యేగాని
ఆతడెరుగడె మనసు నెమ్మదికి....
చారుదత్తుడు : (ఒక చేతిలో వీణను నిలిపి వెళ్ళి వసంతసేనను మరొక చేతిలోకి తీసుకొని) ప్రియా!
వసంతసేన : ప్రభూ!
చారుదత్తుడు : (సేదతీర్చిన తరువాత) జాజిపూలను ఆఘ్రాణించటానికి ఈ కాలమంత మంచిదిలేదు. ఈ ఋతువులో ఉద్యానవనాలు సామాన్యమైనవే నందనవనాన్ని పరిహసిస్తవని ప్రతీతి. నిజమేనా?
వసంతసేన : అసత్యం అనుభవపూర్వకంగానే గ్రహిద్దాం.
వర్షం కూడా కొంచెం వెనకబడినట్లుంది. తోటకు....
చారుదత్తుడు : (చూచి) దుర్దినలక్షణాలు దూరమైపోయినవి.
నేను మన ప్రయాణ సన్నాహం చేయమని పూర్వమే వర్ధమానకుడిచేత బండి సిద్ధం చేయించాను. అతడు రాగానే నీవు బయలుదేరు.
వసంతసేన : (అంగీకారాన్ని సంజ్ఞమూలకంగా తెలియజేస్తుంది).
చారుదత్తుడు : (నిష్క్రమిస్తాడు).
వసంతసేన: (చారుదత్తుడి తాళపత్రగ్రంథంలో పద్యాలు చదివి హృదయానికి హత్తుకుంటుండగా మదనిక ప్రవేశిస్తుంది. వసంతసేన ఉలికిపడి మదనికను చూసి శాంతించి) అమ్మాయీ! ఈ హారం స్వర్గీయులైన మా అక్క ధూతాదేవిగారిది. ఈ హారాన్ని ప్రణామాలతో లోపల ఒదినగారికి సమర్పించు.
మదనిక: అదేమిటక్కా! చారుదత్తులవారికి కోపం రాదూ! వసంతసేన : వారిని నేను సమాధానపరుస్తాగా, నీవు వెళ్ళిరా! ఆలస్యం చెయ్యకు.
మదనిక : ('ఆ స్థితికి వచ్చావుగదా' అని నవ్వుతూ నిష్క్రమణ మారంభించి తిరిగి సంతోషంతో వెనుకకు వచ్చి) అక్కా! అక్కా!! అదుగో, వర్ధమానకుడి చేత చారుదత్తుల వారు బండి పంపించారు. పక్షద్వారం దగ్గర నిలుచున్నది - ఉఁ. బయలుదేరు.
వసంతసేన : అమ్మాయీ! నీవు ఇంటికి పద. నేను కొద్దిసేపట్లో ఈ బండిమీదనే ఇంటికి చేరుతాను.
మదనిక : అక్కా! నీ ప్రణయగ్రంథాన్ని ద్రాక్షాపాకంలోనే నడవనీ -
వసంతసేన : (వెనక్కు తిరిగి, నవ్వి ముక్కుమీద చెయ్యివేసి వారిస్తూ వెళ్ళిపోతుంటే)
మదనిక :
అక్కా! ఓ అక్కా!!
పదవే, పద, పదవే
లోకాన, నీలోన
లేదే కాదారి
ఈ దారే నీ దారి
అక్కా! ఓ అక్కా!!
మనసులలో మాటలలో
తలుపులలో వలపులతో
ఒకటై మీరొకటై
అక్కా! ఓ అక్కా!!
(వసంతసేన ఒకవైపు మదనిక మరొకవైపు నిష్క్రమిస్తారు).
పదకొండో దృశ్యం
[శకారుడి జీర్ణోద్యానవనం - సంవాహకుడు బౌద్ధభిక్షువై సంఘారామంలో జీవిస్తూ
ముసురుపట్టి గుడ్డలు మురికిపట్టడం వల్ల పుష్పకరండానికి వచ్చి స్నానంచేసి
కాషాయశాటీ విదలించుకుంటూ నేలమీద ఏ పురుగును త్రొక్కి పాపం చేస్తానో అన్నట్లు
భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ]
భిక్షుకుడు : 'నశ్యామి అహంభూ నశ్యతిలోకే, శ్రూయతాం ధర్మ' - అయ్యో! అయ్యో!! రాజశ్యాలకుడు, సంస్థానకుడు. భగవన్ బుద్దదేవా?
శకారుడు : (వెనుక నుంచి వచ్చి పట్టుకొని) ఓరి దొంగసన్యాసీ! నిలు, అక్కడ! లేకపోతే కల్లంగడిలో ముల్లంగిదుంపలా నీ తల చితుక కొడతాను.
భిక్షుకుడు : స్వాగతము ఉపాసకా!
శకారుడు : ఏమిటీ?... పాసకా! సంస్థానకుణ్ణి, రాజశ్యాలకుణ్ణి, శకారమహా రాజును, పాసకా అంటానికి నీకెంత ఒళ్లు చియ్యబట్టిందిరా?
భిక్షుకుడు : 'బుద్ధోపాసకా' అని నిన్ను నుతిస్తున్నాను. నిందించటం లేదు.
శకారుడు : (సగర్వంగా) అయితే నుతించు, నుతించు.
భిక్షుకుడు : నీవు పుణ్యుడవు, ధన్యుడవు.
శకారుడు : నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు?
భిక్షుకుడు : ఈ కాషాయాంబరం కడుక్కోటానికి.
శకారుడు : ఆఁ ఏమి ధైర్యం! ఈ పుష్పకరండం నాది. దీన్ని మా బావగారు నాకిచ్చారు. ఉత్తమ భూలోకనిత్యకళ్యాణ మానవుణ్ణి నేనే ఈ మడుగులో స్నానం చెయ్యను. మురిగిన ముల్లంగి దుంపవాసన కొట్టే నీ మురికిగుడ్డ ఇందులో ముంచావా, ఒక్క తాపు తన్నేవాళ్ళు లేక? భిక్షుకుడు : అయ్యా! నేను కొత్త సన్యాసిని.
శకారుడు : అలా చెప్పు. పుట్టినప్పటినుంచీ నీవు సన్యాసివి కావా?
భిక్షుకుడు : (భయంతో) అహఁ
శకారుడు : ఎందుకు కాలేదో చెప్పు - లేకపోతే -
భిక్షుకుడు : తథాగతా! తథాగతా!!
శకారుడు : నిన్ను బయటికి వెళ్ళనీయను. ఇక్కడ నీ పంచప్రాణాలూ అన్నుపట్టి పోవలసిందే.
భిక్షుకుడు : తథాగతా! బుద్ధభగవాన్!-
శకారుడు : కానీ - ఒక పనిచేస్తే నిన్ను కనికరించి ఒదిలిపెడతాను. ఇదిగో ఆ సరస్సులో నీళ్ళను నీవు నీ చిల్లుల శాటిలో మూటకట్టి అందులో పిండిన బురదలో దానిని ఉతికితే -
భిక్షుకుడు : (ఆలోచించి) అలాగే - మూర్ఖమహేంద్రా!
శకారుడు : మూర్ఖమహేంద్రా!!
కుంభీలకుడి గొంతు : (తెరలో) బావా! బావా!!
శకారుడు : ఆఁ. బావ బండితో అప్పుడే వచ్చేశాడా?
కుంభీలకుడు : (దగ్గిరకు వచ్చి బెట్టుగా చేతులు కట్టుకొని నిలబడతాడు)
శకారుడు : బావా! సన్యాసి దీవించిన దానిలో (మూర్ఖ శబ్దాన్ని వదిలేసి) మహేంద్రా అంటే ఏమిటి?
కుంభీలకుడు: 'దేవేంద్రా' అని.
శకారుడు : (భిక్షుకుడి దగ్గరికి వచ్చి) ప్రభో! - అలా మళ్ళీ ఒకమాటు దీవించండి. నా పుష్కరిణికి వచ్చి నిత్యమూ మీ గుడ్డ తడుపుకొండి. నేను మీ శిష్యుణ్ణి. మీ దీవెనవల్ల నేనే దేవేంద్రుడనైతే (చంకలు కొడుతూ) ఆర్యకుడు సిద్ధుల దీవనలవల్ల రాజౌతాడని భయపడుతూ ఉన్న మా బావగారు నన్ను చూచి ఇంకా భయపడతాడు. భయపడాలి! హిఁ హిఁ హిఁ ప్రభో! హిఁ హిఁ హిఁ. భిక్షుకుడు : (సవినయంగా శకారుడు దారిచూపిస్తుంటే నిష్క్రమిస్తాడు).
శకారుడు : బావా! బండి తీసుకో రమ్మంటినే - బండి ఏదీ? నాగరకుణ్ణి నడిచిపోలేను.
కుంభీలకుడు : అదుగో! దూరంగా!! అటుచూడు!!
శకారుడు : (అతి సంతోషంతో) బలే బలే!! (ఇంతలో ఎద్దుల మెళ్లో గంటల చప్పుడు వినిపిస్తుంది. అది వినంగానే శకారుడు)
బండిరాయ్, మనా బండిరా!
బండిరా, మనాయ్ బండిరా!!
ఉక్కు ఇనుమూ బండిరా
చక్కదనముల బండిరా
దిక్కులన్నీ ఏలుకొచ్చే
అక్కగల మా బండిరా, బండిరాయ్...
వానగాలికి వెరవదు,
పరసపిడుగుల సెదరదు,
పోతుమల్లే పోతు ఉంటే
కోతులన్నీ బెదరురా
బండిరాయ్, మనా బండిరా!!
బండిరా, మనాయ్ బండిరా!!
కుంభీలకుడు : (మూడుసార్లు ఆపి ఆపి దీర్ఘమైన ఈలలు వేస్తాడు).
శకారుడు : (ఏదో రహస్యమున్నట్లుగా నటిస్తూ ఉన్న కుంభీలకుడితో) ఏదీ రహస్యం! పోనీలే - చెప్పవుకదూ?
కుంభీలకుడు : స్వస్థచిత్తుడిని కా బావా! తరువాత నీకొక మంచి రహస్యం చెప్పుతాను.
శకారుడు : ఆఁ - రహస్యమే - మంచి రాహస్యమే - (చిందులేస్తూ)
రాహస్య మన ఆస్యమన
రాజులకు మెప్పూ!
రణ మన్న గుణ మన్న
రమణులకు ముప్పు రాహస్యమన...
సీతమ్మ చెవిలోన
చెప్పె రాభణుడూ
రామయ్య ఒడలెల్ల
రంగు రంగైపోయె! రాహస్యమన...
(పెదిమలు విరుస్తూ యక్షగాన పద్ధతిలోకి దిగుతాడు) నేను గంధర్వుణ్ణి.
కుంభీలకుడు : గంధర్వుడ వేమిటోయ్! - వట్టి తెలివి తక్కువనబడటం, వాడి అమ్మ మొగుడివి.
శకారుడు : బావా! బండి ఇంకా దగ్గరికి రాలేదు. గిత్తలు తెగినవా! స్థావరకుడు విరిగెనా? తాళ్లు చచ్చెనా?
కుంభీలకుడు : (నవ్వుతూ కాదన్నట్లు తల ఊపబోతుంటే).
శకారుడు : మరి ఏమిటి?
కుంభీలకుడు : అదుగో మనబండి. ఒరే అక్కడ త్రిప్పి ఆపు -
శకారుడు : బావా! పుణ్యుడవు, గణ్యుడవు, ఆత్మసఖుడవు, ఆంతరంగిక మిత్రుడవు - కానీ నీవుపోయి ముందు బండి ఎక్కు
కుంభీలకుడు : అలాగే (ఎక్కబోతాడు).
శకారుడు : (పోతూ ఉన్న వాడిని బుజంమీద చెయివేసి వెనకకు లాగి) నీ అబ్బసొమ్మా! మీ తాతసొమ్మా! బండి ఎవరిదనుకున్నావు? నేను సర్వజ్ఞుణ్ణి, సంస్థానకుణ్ణి, రాజశ్యాలకుణ్ణి. ఆగు ఆగు - ఈ బండి నాది. నన్ను ముందెక్కనీ - కాదు, కాదులే. నీవే ఎక్కు (మంచి చేసుకుంటూ) బావా! ఇందాక ఏదో రహస్యం చెపుతానన్నావు. ఏమిటది బావా?
కుంభీలకుడు : చెప్పటానికేమీ లేదు. కళ్ళార చూపిస్తాను.
శకారుడు : కళ్ళార చూపించటమే! హిఁ హిఁ హిఁ - ఈ కళ్ళారే - హిఁ హిఁ హిఁ. బావా! గొంతులోనా గుండెకొట్టాడుతాది. కొంచెం చెప్పుదూ, - ఇదిగో నేను నీ బావను కదూ?
కుంభీలకుడు : (చెవిలో బిగ్గరగా) వసంతసేన!
శకారుడు : వసంతసేనే! - ఏదీ? కుంభీలకుడు : మన ఉద్యానవనంలో
శకారుడు : నాకోసమే -
కుంభీలకుడు : (నీకోసమే అన్నట్లు కన్నుముడుస్తూ సంజ్ఞ).
శకారుడు : త్వరగా రా బావా? వెళ్ళిపోయిందేమో - బావా! (మోడినడకలు నడుస్తూ).
తుర్రుమన్నా పిట్ట
దోటికెక్కిందీ -
దోటిలోపల తానె
గూడు కట్టిందీ! తుర్రు...
బుర్రుమన్నా పిట్ట
బార కందిందీ
చిటికలోనే రాజు
గుటుకవేస్తాడు - తుర్రు...
(రాజసంతో ఆజ్ఞాపిస్తూ) బావా! మన వర్ధమానుణ్ణి బండి ఆ కూలిపోయిన ప్రాకారం మీదుగా పోనిమ్మను.
నడు -
కుంభీలకుడు : బావా! కైపు బాగా తగ్గించుకోవాలి! (శకారుడు ముందు, వెనక కుంభీలకుడూ నిష్క్రమిస్తారు)
(తెర)
పన్నెండో దృశ్యం
[శకారుని జీర్ణోద్యానం - వసంతసేన ఏకాంతంగా ఒకపూలమొక్క మీద వాలిన
తుమ్మెదను నిశ్చలంగా చూస్తూ సాభిప్రాయంగా]
తుమ్మెదవా!, తుమ్మెదవా!!
నమ్మరాని తుమ్మెదవా!
మనసిచ్చిన పాటలతో
మరులు కొల్పి మా కన్నెల
మధువానిన వెనుక నీవు
మరల మోము చూపింపవు - తుమ్మెదవా?
విలపింపకు లేయెడదల
విలపించెడు వేదనతో
విరహభార మెరుగక ఈ
విరులు మనసు దొరుకదు పో-
తుమ్మెదవా! తుమ్మెదవా!!
నమ్మరాని తుమ్మెదవా!
(ఉద్విగ్న హృదయంతో) ఆర్య చారుదత్తా! ఏ ఉద్యానంలో కూర్చొని మీరూ కలలు కంటున్నారో! బండి తారుమారైంది, నా అదృష్టంతోపాటు, ఈ జీర్ణోద్యానం చేరుకున్నాను. మరుక్షణంలో ఏమి రాబోతున్నదో ఎరుగను. అయ్యో! ఆషాఢమేఘరాజు గర్జించి ఎంత చెప్పినా వినకుండా మూర్ఖం చేసి, ఆ మహాత్ముణ్ణి తిట్టిపోసి బయలుదేరివచ్చాను. ఈ అనుభవం కోసమే నేమో! (మరొకదిక్కుచూచి) తనకుసుమామోదాన్ని గ్రహించి ఆనందించి అనుభవింప జేసే మధుకర ప్రియుడు రాలేదు కాబోలు పాపం! ఈ జాజిపూవు తేనెకన్నీటి బొట్లు నేలరాల్చేస్తూ ఉన్నది. ప్రభూ! నీ ప్రియసుమము కూడా ఈ దురదృష్టానికే నోచుకున్నదా? (బిగ్గరగా) మహాభాగా! మహాభాగా!! ఇక్కడ నాకు దిక్కెవ్వరు? శకారుడు : (వేగంగా ప్రవేశించి) ఆఁ ఆఁ. ఆగు ఆగు నాకు దిక్కెవరు? వరపురుషుణ్ణి, వాసవుణ్ణి, మానవ వాసుదేవుణ్ణి నేనుండగా నీకీదుర్భర దురంతచింత ఏలనే తక్కోల తమాలనీలవేణీ!
కుంభీలకుడు : (వెనకనుంచి ప్రవేశిస్తూ) మహారాజా! తాము ఇంకా రాలేదనే మా చెల్లెలు భయపడుతున్నది. మీకోసమే మా చెల్లెలు వచ్చింది.
శకారుడు : బావా! నీ వల్లనే మా అదృష్టం పండి రాలిపోతున్నది. వెనక మీ చెల్లెలికి కోపం వచ్చేటట్లు ప్రవర్తించాను - కాదే ప్రసవశరసుమ కొదమకోమలవల్లీ! (విటుడితో) నీవు కొంచెం దూరంగా వెళ్లు - నేను కాస్త కాళ్ళమీద పడి ఆమెకు కనికరం కలిగేటట్లు కామతంత్రం జరపాలి. పక్కన పరపురుషుడుంటే పడుచువయసుది - ఉపపతి అంటే భర్త చెప్పిన మాట వినదు. ఉఁ. (వెళ్ళమని సంజ్ఞ చేస్తాడు)
కుంభీలకుడు : (వెళ్ళబోతుంటే)
వసంతసేన : (వినలేక చెవులు మూసుకొని సంభాషణ ఐనతరువాత గద్గద స్వరంతో) అన్నా! శరణు - నేను చిక్కులో పడ్డాను.
కుంభీలకుడు : అమ్మాయీ! నీకేమి భయంలేదు. (అని వెళ్ళిపోయి ప్రక్కన నిలుచుంటాడు)
శకారుడు : (కాళ్ళమీద వాలుతూ) వసంతసేనా! మనోహారిణీ!! నీవు చిక్కులో పడ్డావు నేను నా సమస్తసామంతమణిగణకోటీరమైన నా శిరస్సుతో నీ పాదాబ్జాలమీద పడుతున్నాను. సమస్త దుర్నయాలూ క్షమించి నన్నేలుకోవే గోరోజనాతిలక పాటల ఫాలదేశా! అర్చితరతీశా!!
వసంతసేన: (వారిస్తూ) ఛీ! మూర్ఖుడా!! - నేను నీకోసం రాలేదు.
శకారుడు : మూర్ఖుడా! (అతికోపంతో) 'మూర్ఖీ'! - బావా! (కుంభీలకుడు నెమ్మదిగా ప్రవేశిస్తాడు) బావా! నిన్ను చూచి మీ చెల్లెలిని సహించాను. చూస్తున్నావా, నాకు ఎంతలో ఎంతెంత కోపం తెప్పిస్తున్నదో! - నా ఉద్యాన వనానికి వచ్చి నాకింత కోపం తెప్పిస్తుందా? ఒప్పించు మీ కోసమే వచ్చానని చెప్పించు. (దగ్గిరకు పోతాడు)
వసంతసేన : (కోపంతో) నడు. అవతలికి.
శకారుడు : బావా! ఇక దీన్ని ఊరుకోను. జడపట్టి జటాయువు, వాలి పెళ్లాన్ని పెళ్ళాడినట్లు... కుంభీలకుడు : (కఠినంగా) మీకోసం రాని స్త్రీని బలాత్కరించటం ప్రభువులైన మీబోటివారికి పద్ధతి కాదు.
శకారుడు : (వికటంగా నవ్వి) పడతుల విషయంలో ప్రభువేమిటోయ్! ఒక తడవ వాత్స్యాయనంలో పారదారాధికరణం చదువు.
కుంభీలకుడు: (మైత్రిగా దగ్గరకుపోయి) మనం ఈ వెన్నెట్లో అసలైన కథలు చెప్పుకుంటూ కాలినడకన పట్టణంలోకి వెళ్ళిపోదాము.
శకారుడు : అయితే స్థావరకుణ్ణి బండి తోలుకోరమ్మని చెప్పు. - స్థావరకా! నీ గుండెలు తోడుతాను. తోలుకోరావద్దు. (మతిమార్చి) నేను దేవతల ముందరా, బ్రాహ్మణుల ముందరా బండి ఎక్కకుండా రాను. రథమెక్కిపోతుంటే రాజశ్యాలకులని జనం చెప్పుకోవాలి సుమా!
కుంభీలకుడు : పోనీ బండిలోనే వెళ్ళిపోదాం.
శకారుడు : (వసంతసేనను చూచి) నేను ఇప్పుడు రాను. నీవు బండి ఎక్కి వెళ్లు.
కుంభీలకుడు : అయితే మీతో సావాసం చెల్లు.
శకారుడు : ఉఁ
కుంభీలకుడు : (ప్రక్కకు తొలిగి ఆలోచిస్తుంటాడు)
శకారుడు : ప్రియా! ఇంతీ, వాసంతీ, ఓ వసంతకర సరోజ సేమంతీ!
(బాగా దగ్గరకు వచ్చేస్తాడు).
వసంతసేన : అన్నా! అన్నా!! (అని భయంతో కుంభీలకుడి వైపు చూస్తుంది) నీకేమైనా దెయ్యం పట్టిందా. నీకు నేను అక్కను గదరా?
శకారుడు : (కోపంతో) మహారాణి మా అక్కగారితో నా, నీకు ఒంతు. చూడు నిన్నేం చేస్తానో.
కుంభీలకుడు : బావా! బండి సిద్ధం చేయించాను.
శకారుడు : బావా! నీకు కుచ్చుల జరీ అంచు ఉత్తరీయం కావాలా? నాతోపాటు వేడి వేడి ఐణమాంసం తినటమంటే ఇష్టమేనా?
కుంభీలకుడు : అయితే! శకారుడు : (కత్తి అందిస్తూ) దీన్ని చంపు.
కుంభీలకుడు : (చెవులు మూసుకుంటాడు).
శకారుడు : ఈ ఉద్యానవనంలో చంపితే నిన్నెవరూ చూడరు.
కుంభీలకుడు : చంద్రుడూ, నక్షత్రాలూ, వనదేవతా చూస్తూనే ఉన్నారు.
శకారుడు : (పై ఉత్తరీయం అందిస్తూ) ఇదిగో దీన్ని చాటుచేసి చంపు. బంగారు కడియాలు బహుమానమిస్తాను - చంపవా?
కుంభీలకుడు : ఉఁః
శకారుడు : నిన్ను కూడా (పైకి దూకపోతే). కుంభీలకుడు : ఓయి, బాబో! (పారిపోతాడు).
శకారుడు : వసంతసేనా! నీకు కావలసినన్ని నగలు చేయిస్తాను మేడలు కట్టిస్తాను.
వసంతసేన : పూర్వమే బుద్ధి ఒక సహకారాన్ని ఆశ్రయించింది. ఇక పలాశాల మీదికి పోదు.
శకారుడు : ఆ దరిద్రచారుదత్తుడు నీకు సహకారమా! నేను పలాశమా! - వాడినే స్మరించు.
వసంతసేన : సర్వదా ఆ మహానుభావుడు నా హృదయంలోనే ఉన్నాడు.
శకారుడు : అయితే నన్ను ప్రేమించవా?
వసంతసేన : ప్రేమించలేను!
శకారుడు : ఒకటి - రెండు - మూడు.
వసంతసేన : (మౌనంగా ఊరుకుంటుంది).
శకారుడు : (వెళ్ళి పీక పట్టుకుంటాడు)
వసంతసేన : మహానుభావా! చారుదత్తా!!
శకారుడు : ఇప్పటికైనా నన్ను ప్రేమించు.
వసంతసేన : చారుదత్తా! శకారుడు : (పీక నులుముతాడు)
వసంతసేన : చారు... దత్తా (మూర్ఛపోతుంది)
శకారుడు : (చేతులతో ఎండుటాకులదాకా తీసుకోపోయి కప్పి గుటకలు వేస్తూ చేతులు దులుపుకుంటూ) ఉడతను మింగిన పిల్లిలాగా ఉప్పిడిచప్పిడి లేకుండా బావ మళ్ళీ వచ్చేటప్పటికి వెళ్ళిపోతాను. (కూనిరాగంతో).
“రాధమ్మ మాటవిని
రంభ చెడిపోయింది
రామయ్య కైపోయె
లంకకాపురము” రాధమ్మ....
కుంభీలకుడు : (ప్రవేశించి) బావా! వసంతసేన ఏదీ?
శకారుడు : ఏదీ? తప్పించుకోపోయింది.
కుంభీలకుడు: (అనుమానంతో) నిజం చెప్పు.
శకారుడు : (నవ్వుతూ) చంపేశాను బావా! (చూపిస్తాడు).
కుంభీలకుడు : (నిర్ఘాంతపోతాడు).
శకారుడు : నాకేం భయం! ఇది చారుదత్తుడి ఇంట్లో నగలు దాచిపెట్టింది. అవి కాజెయ్యటానికి అతడే ఈమెను చంపాడని అపవాదు కల్పిస్తాను.
కుంభీలకుడు : ఒక పాపానికి మరొక పాపమా! - అంతా నేను వెళ్ళి అధికరణకులకు చెపుతాను.
శకారుడు : నాకేం భయం. చెప్పుకో. తాడూ బొంగరం లేని నీ మాటలు ఎవరు వింటారు. చెప్పుకో - అంతగా అవసరమైతే అక్కగారితో చెప్పి, బావగారితో చెప్పించి, వాళ్ళ ఉద్యోగాలే ఊడబెరికిస్తాను. తెలిసిందా? జాగ్రత్త!
కుంభీలకుడు : ఏముంది - రెండు ఒదులుకుంటే సరి ప్రపంచంలో, మానం, అభిమానం - రాజ్యాలు జయించవచ్చు రాజులు కావచ్చు.
శకారుడు : (కోపంతో) ఛీ! అధిక ప్రసంగం చాలించు - (వసంతసేనవైపు చూచి
సంతోషంతో) హఁ హఁ హఁ
ఇద్దరు ఇల్లాండ్ర
ఏలేటి మగవాని
ఇబ్బంది చూడండయా : హఁ హఁ
ఇబ్బంది చూడండయా!
ముద్దుల గోపాల
బాలుని చిత్రమే
ప్రొద్దున పొల్పుగ
చూడండయా! ఇద్దరు....
పెద్దాలితో పోరు
వద్దు నా కంటాడు
రద్ది కిదే నాకు
పెద్ద యనుకొంటాడు ఇద్దరు....
ముద్దుల చిన్నది
బుద్ధిగల దంటాడు
ఇద్దరికి కాకుండ
ఇడిగానె ఉంటాడు ఇద్దరు....
(వెళ్ళిపోతుంటే)
కుంభీలకుడు : (సకరుణంగా వసంతసేనను చూస్తూ దీనంగా నిలువబడతాడు).
(ఇద్దరూ నిష్క్రమిస్తారు)
పదమూడో దృశ్యం
(న్యాయశాస్త్రానికి వెళ్ళే రాచబాట కూడలి)
మైత్రేయుడు : అమ్మాయీ! ఎక్కడనుంచి?
రదనిక : (చేతిలో పూలబుట్ట చూపిస్తూ) అక్కగారి పూజకు పూలు తీసుకొని వస్తున్నాను.
మైత్రేయుడు : చారుదత్తుడు ఇంటికి వచ్చాడా?
రదనిక : నేను బయలుదేరే వరకూ రాలేదు.
మైత్రేయుడు : నేనూ ఉదయం నుంచీ ఈ వీథినే కాచుకొని కూర్చున్నాను. దాని ఇంటికి కూడా చేరలేదు. రాత్రి రాలేదు. ఉదయం రాలేదు ఎక్కడికి పోయి ఉంటాడబ్బా? పోనీ, వర్ధమానకుడైనా వచ్చాడా?
రదనిక : రాలేదు.
మైత్రేయుడు : (యోచించి పెదిమె కొరికి) ఆ బులిబుచ్చి కాలబూచి అందంగా దొండపండులా ఉన్నాడని ఏ మందో పెట్టి ఇతగాణ్ణి ఏ ఊరో లేవదీసుకోపోలేదు కదా?
రదనిక : వసంతసేనేనా?
మైత్రేయుడు : (కోపంతో) ఆఁ, ఆ వసంతసేనే!
రదనిక : ఈ ఊళ్లో ఉంటేమటుకు ఆమె అనురాగానికి ఎవరు అడ్డువస్తారని. అయినా ఆమె చారుదత్తులవారిని ప్రేమించిన విషయం లోకవిఖ్యాతం అయిపోయింది కూడాను. అందుకనే మన రోహసేనుడికి బంగారుబండి చేయించుకోమని హారాలు కూడా ఇచ్చింది. మైత్రేయుడు : ఇచ్చింది. చారుదత్తుడు ఎలాగూ ఉంచుకోడని తెలిసి యిచ్చింది. అతగాణ్ణి మనకు లేకుండా చేయటానికి లంచం పోసింది. లేకపోతే చారుదత్తుడేమైనట్లు? వర్ధమానకు డేమైనట్లు? బండేమైనట్లు? ఎడ్లేమైనట్లు?
రదనిక : బాబయ్యా! ఇందాక నేను పూలకు వెళ్ళుతుండగా బండి ఎక్కి ఆర్యకుడు తప్పించుకోపోయినాడనీ అతణ్ణి పట్టి యిచ్చినవాళ్లకి నాల్గువందల వరహాలు బహుమానమనీ దండోరా వినిపించింది.
మైత్రేయుడు : అయితే -
రదనిక : మన వర్ధమానుడే ఆర్యకుణ్ణి బండిలో ఎక్కించుకొని ఒప్పించటానికి వెళ్ళి ఉంటాడు.
మైత్రేయుడు : ఓసి వెర్రిదానా! అయితే మన చారుదత్తుడేడి మరి?
రదనిక : వారూ ఆర్యకుడికి సాయం చెయ్యటానికి వెళ్ళి ఉంటారు.
మైత్రేయుడు : ఆ నెత్తిమీది కులదేవత వసంతసేనతో కూడానేనా?
రదనిక : ఆమె ఇంటికి వచ్చి ఉంటుంది.
మైత్రేయుడు : ఇందాకటివరకూ అది కొంపకు చేరుకోలేదు. ఇదుగో మళ్ళీ వెళ్ళుతున్నాను. ఇందాక నీవన్న నగలు - రోహసేనుడికి బంగారుబండి చేయించుకోమని ఇచ్చినవి - దానికి వెంటనే చేర్చమని వెళ్లేటప్పుడు నాకో పని కూడా పెట్టి వెళ్ళాడు. ఎన్ని తడవలని పోయేది, ఆ పాడుకొంపకు. ఇందాకనే దాని తల్లి మండిపడ్డది.
రదనిక : ఎందుకని?
మైత్రేయుడు : ఎందుకనేమిటి? మన ఖర్మం బాగుండలేదని. చారుదత్తుడే దాని పిల్లను చెడగొట్టాడట, చెప్పుచ్చుకొని నాలుగుపళ్లూ రాలగొట్టేవాళ్లు లేక - నాలుగు డబ్బులు సంపాదించుకోకుండా నలుగురు బంధువుల నోట్లో దాన్ని నగుబాట్లు చేస్తున్నాడట! వసంతసేనకు శకారయ్యంటే గిట్టకుండా చేసిందా చారుదత్తుడేనట!
రదనిక : చాలు! చాలు!!
మైత్రేయుడు : ఒక మాటా! ఒక పలుకా! అప్రాచ్యపు ముండ - ఇంతకూ మన బంగారం మంచిదయితే కంసాలి ఏమి చేస్తాడు? రదనిక : (వ్రేలితో చూపిస్తూ) అదుగో - బాబయ్యా! ఆ మనుష్యుల మధ్య నడిచేది చారుదత్తయ్యగారే - ఆ! పెద్దబాబయ్యగారే!
మైత్రేయుడు : అవును నిజమే. (చత్వారమున్నట్లుగా పరిశీలించి) ఆఁ. అతగాడే - అటూ ఇటూ ఉన్నది రక్షాధికారులే! - ఆఁ అధికరణమంటపానికే.
రదనిక : అధికరణమంటపానికా?
మైత్రేయుడు : అమ్మాయీ! నీవేమీ భయపడకు - ఏదో నెత్తిమీదికి తెచ్చిపెట్టుకున్నాడు. అతడేం చేస్తాడు. గ్రహచారం పెద్దమ్మ నెత్తిమీద ఎక్కి పాతచెప్పుతో పకాళించి తంతుంటే. నీవు ఇంటికి వెళ్లు. నేను సంగతేమిటో విచారించి వస్తాను. అక్కగారికి ఈ సంగతేమీ తెలియనీయకు.
(నిష్క్రమిస్తాడు).
రదనిక : (మైత్రేయుడు వెళ్ళిపోయిన దాకా చూచి నిష్క్రమిస్తుంది).
(తెర)
పదునాల్గో దృశ్యం
(న్యాయస్థానము అధికరణకుడు, శోధనకుడూ, వారి వారి స్థానాలల్లో కూర్చోని
ఉంటారు)
అధికరణకుడు : శకారయ్య! మదనిక!!
శోధనకుడు : శకారయ్య! శకారయ్య!! - మదనిక! మదనిక!!
(మదనిక ప్రవేశించి అటూ ఇటూ చూచి ఒకమూల నిలవబడుతుంది. శకారుడు న్యాయస్థానాన్ని నాలుగుదిక్కులూ వెర్రిగా పరిశీలిస్తుంటాడు).
అధికరణకుడు : శోధనకా! ఆయన ఎవరో కనుక్కో.
శోధనకుడు : ఎవరు మీరు?
శకారుడు : “ఎవరు మీరు" - అప్పుడే కళ్ళింత నెత్తికెక్కాయా? ఓరి మీ తస్సలుదియ్యా! (బింకంగా) శకారమహారాజును!
అధికరణకుడు : కోపించకండి మహారాజా! అలా అడగటం మా సంప్రదాయం. శోధనకా! మహారాజులుంగారికి ఆసనమిచ్చి మర్యాదచేయవోయ్!
శకారుడు : (శోధనకు డిచ్చిన అసనంమీద కూర్చొనబోతూ) అధికరణకా! మా వ్యవహారం చక్కగా చూడకపోతే మాఅక్కతో చెప్పి మా బావతో చెప్పించి మీ ఉద్యోగాలు ఊడబెరికిస్తాను, జాగ్రత్త!
శోధనకుడు : చిత్తం - చిత్తం - దయచేయండి.
శకారుడు : (కైపువల్ల త్రేణుస్తూ) ఈ నేలంతా నాదే. నా ఇష్టం వచ్చినచోట కూర్చుంటాను. ఇక్కడ కూర్చోనా? అక్కడ కూర్చోనా? (అధికరణకుడి దగ్గిరికిపోయి) నీవు లే ఇక్కడ కూర్చుంటాను. కాదులే. ఇక్కడే కూర్చుంటాను. అధికరణకుడు : (శకారకుడి కోసం వేసిన ఆసనంమీద కూర్చుంటూ) శోధనకా! కార్యార్థిని చెప్పుకో మను.
శోధనకుడు : (శకారుడితో) అయ్యా! మీరు చేసే నింద ఏమిటో చెప్పుకోండి.
శకారుడు : మా బావగారు నాకు క్రీడించటానికి ఉద్యానవనాల్లో కల్లా శిరోభూషణ మీ పుష్పకరందోద్యానమిచ్చారు. నేను ప్రతిదినం అక్కడ చెట్టు ఎండబెడుతాను. చివుళ్ళు తెంచుతాను.
అధికరణకుడు : అయితే ముఖ్యాంశ మేమిటో త్వరగా బయటపెట్టండి.
శకారుడు : నాకు అక్కడ ఈ దినం... ఒక స్త్రీ... శవం... ఒకటి... కనిపించింది. అఁ హఁ హఁ... కనిపించలేదు.
అధికరణకుడు : ఆ స్త్రీ ఎవరో మీకు తెలుసా?
శకారుడు : హఁ హఁ హఁ (వెర్రిగానవ్వి) నాకు తెలియకపోవటమేమిటి? ఒళ్ళంతా బంగారంతో ఓయ్యారపు నడకలు నడిచే నా స్త్రీని నేనెరగనా? బలే ప్రశ్న వేశావు మొత్తానికి?
అధికరణకుడు : అయితే ఆమె మీకేమౌతుంది?
శకారుడు : ఏమౌతుందేమిటి? నా స్త్రీ.
అధికరణకుడు : అయితే మీ స్త్రీని ఎవరు చంపారని మీ అనుమానం?
శకారుడు : దుర్మార్గుడు చారుదత్తుడి ఇంట్లో ఆమె పూర్వం కొన్ని నగలు దాచమన్నది. వాటిని అపహరించటానికి ఆమెను చంపాడు. ఆ పాపం మెడకు చుట్టటానికిని నా జీర్ణోద్యానంలో పారేశాడు.
అధికరణకుడు : అయితే ఎవరు చంపారని మీ అనుమానం?
శకారుడు : "నేను కాదు”
అధికరణకుడు : "నేనుకాదు" (అని ఉచ్చరిస్తూ తాళపత్రం మీద వ్రాసుకుంటాడు)
శకారుడు : అధికరణకా! దీనికే ఇంత (ఎక్కిళ్ళు) అల్లట తల్లటైపోతున్నావేం? ఎవరో చంపితే చూచానని వ్రాసుకో.
అధికరణకుడు : చారుదత్తుడు చంపాడని మీకు ఎలా తెలిసింది? శకారుడు : మెడ వాచింది. ఆభరణాలు లేవు.
అధికరణకుడు : అంతమాత్రాన చారుదత్తయ్య దోషియని నిశ్చయించటానికి వీలులేదు.
శకారుడు : నిన్నటి సాయంత్రం నా ప్రియురాలు, మదనికతో చారుదత్తుని ఇంటికెళ్ళింది. తరువాత దానికీ స్థితి పట్టింది.
అధికరణకుడు : మీ ప్రియురాలు వారి ఇంటికి ఎందుకు వెళ్ళిందని మీ అభిప్రాయం?
శకారుడు : సంగీతం నేర్చుకోటానికి - అది మీకు అనవసరమైన ప్రశ్న.
అధికరణకుడు : శోధనకా! - మదనిక.
శోధనకుడు : మదనికా?... కొంచెం ముందుకు.
మదనిక : (కొంచెం ముందుకు వచ్చి నిలబడుతుంది).
అధికరణకుడు : అమ్మాయీ! శకారయ్యగారు చెప్పేమాటలన్నీ నిజమేనా?
మదనిక : ఆర్యచారుదత్తులు పిలుచుకోరమ్మన్నారని ఉద్యానవనానికి మా అక్కను వర్ధమానకుడు బండి ఎక్కించుకోవెళ్ళాడు.
అధికరణకుడు : మీ అక్కను చారుదత్తయ్య హత్య చేశాడని నీవు నమ్ముతావా?
మదనిక : ఆమెమీద అంతటి అనురాగం ఉన్నవాళ్ళు ఈ ఉజ్జయనీ పట్టణంలో మరెవ్వరూ లేరు.
అధికరణకుడు : శకారయ్యా! వింటున్నావా? దీనికి నీవేమంటావు?
శకారుడు : అది చిన్నపిల్ల. దానికేం తెలుసు, దాని మొఘం. ఆ మాటలు నమ్మవద్దు. చారుదత్తుడే చంపాడు.
అధికరణకుడు : శోధనకా! చారుదత్తయ్య.
శోధనకుడు : చారుదత్తయ్య! చారుదత్తయ్య!!
(ఇద్దరు రక్షకభటులు తీసుకోవచ్చి నిలవబెడితే చారుదత్తుడు వచ్చి తలవంచుకొని నిలవబడతాడు)
శకారుడు : (కోపంతో) ఓరి స్త్రీఘాతుకా! నీ మొఘం చూడకూడదు. పంచమహాపాతకాలూ చుట్టుకుంటవి. అధికరణకుడు : చారుదత్తయ్య వారికి ఒక ఆసనమీయరా!
శోధనకుడు : ఇటు దయచెయ్యండి.
చారుదత్తుడు : (అధికరణకునికి నమస్కరిస్తూ కూర్చుంటాడు)
శకారుడు : స్త్రీ ఘాతుకులకూడా ఆసనమిచ్చి గౌరవిస్తారా? కానియ్యండి, కానియ్యండి. మా బావగారికి తెలియకుండానే దేశంలో అధర్మం, అక్రమం, అన్యాయం నడుస్తూ ఉన్నది.
అధికరణకుడు : (శకారునితో) న్యాయస్థానంలో మీరు చాలా శాంతంగా ప్రవర్తించాలి. (చారుదత్తునితో) అయ్యా! మీకీ పట్టణంలో ఎవరైనా స్త్రీ స్నేహితులున్నారా?
చారుదత్తుడు : (సిగ్గుతో తలవంచుకుంటాడు)
శకారుడు : (అధికరణకునితో) సిగ్గు నటిస్తూ చేసిన పని కప్పి పుచ్చు తున్నాడు, జాగ్రత్తగా కనిపెట్టు.
అధికరణకుడు : ఆర్యా! ఇది వ్యవహారము. సిగ్గుతో ప్రయోజనం లేదు.
శకారుడు : (గర్విపోతుగా) అందులో వ్యవహారం నాతో రాజశ్యాలకులతో - జాగ్రత్త!
చారుదత్తుడు : మీతో వ్యవహారం దుస్సాహసమే.
శకారుడు : రత్నహారాలకు ఆశపడి రాణిలాంటి నా ప్రియను గొంతు పిసికి జీర్ణోద్యానంలో పారేస్తావుట్రా!
చారుదత్తుడు : అసంబద్ధాలాడకు.
అధికరణకుడు : అయితే, ఇప్పుడు ఆమె ఎక్కడ యున్నది?
చారుదత్తుడు : నా కేమీ తెలియదు.
శకారుడు : అదీ సంగతి, అలా బయటపడు.
మదనిక : అయ్యా! నాదొక మనవి. చారుదత్తులవారు రత్నహారాలకు ఆశపడేవారనటం అసంబద్ధం. ఒకప్పుడు వారింట్లో దాచిపెట్టిన హారం దొంగలెత్తుకుపోతే దానికి బదులుగా మా అక్కకు రత్నహారమిచ్చారు. అధికరణకుడు : ఇష్! (చారుదత్తునితో) అయ్యా నిన్న సాయంత్రం వసంతసేన మీ ఇంటినుంచి నడిచివెళ్ళిందా? లేక బండిలో వెళ్ళిందా?
చారుదత్తుడు : నేను ఇంట్లో ఉన్నంతవరకు ఎక్కడికీ వెళ్ళలేదు. తరువాత ఏమి జరిగిందో నాకు తెలియదు.
అధికరణకుడు : ఆమెను ఎవరో హత్యచేసి జీర్ణోద్యానంలో పారేశారన్న సంగతైనా తెలుసునా?
చారుదత్తుడు : ప్రియా! వసంతసేనా!
(*) లేత వెన్నెలలకు సొగసీయ నేర్చిన దంతకాంతితో, మావిచిగుళ్ల విలాసాలతో ఓప్పే కావిమోవితో ఇంపెసలారిన నీ ముఖకాంతిని త్రాగి నేడేరీతిగా ఈ అపకీర్తి విషాన్ని క్రోలగలనో కదా!
శకారుడు : ఇంత రభసెందుకు? - హత్య చేశానని అంగీకరించు.
(అధికరణకునితో) ఇంకా అనుమాన మేమిటయ్యా!
చారుదత్తుడు: నా దారిద్య్రలక్షణాలల్లో ఇదీ ఒకటి? తేనెలో మాగిపోతూ ఉన్న పూలమీదికి తుమ్మెదపిండ్లు బారులు కట్టి వచ్చేటట్లు ఆపత్కాలంలో లోపాలు అనంతంగా నన్నావరిస్తున్నవి.
అధికరణకుడు : చారుదత్తయ్యా! సత్యమేమిటో త్వరగా బయట పెట్టండి.
శకారుడు : వ్యవహార విషయంలో మీకింత పక్షపాతం పనికిరాదు. ఒకవంక హత్య చేశాడని స్వచ్ఛంగా నిరూపితమౌతుంటే ఇంకా ఏమిటా గ్రుచ్చి గ్రుచ్చి అడగటం - ఉఁ. తీర్పు చెప్పండి - ఇంకా ఆ స్త్రీ ఘాతుకుడికి ఆసనమిచ్చి గౌరవించటమెందుకు? లెమ్మన రేం?
చారుదత్తుడు : (ఆసనం మీదనుంచి లేచి నిలువబడతాడు).
శకారుడు : హిఁ హిఁ హిఁ - (అతను వదిలిన చోటు ఆక్రమించి) చారుదత్తా! నేనే చంపానని నీ నోటిమీదుగా ఒకమాటు -
మైత్రేయుడు : (హఠాత్తుగా ప్రవేశించి) చారుదత్తా! చారుదత్తా!! నిన్నిక్కడికి రప్పించినదెవరు? కారణం? చారుదత్తుడు : నా విధి! (శకారుణ్ణి చూపిస్తూ) ఇతడు ఉపాదానకారణం. మైత్రేయా (చెవిలో ఏదో చెపుతాడు).
మైత్రేయుడు : ఓరి బ్రహ్మిష్ణో బ్రహ్మిష్ఠి! చారుదత్తుడిమీద నిందారోపణ చేసి న్యాయస్థానానికి రప్పించావట్రా? ఎన్నడైనా అతడు ఇలా వచ్చాడా? కులట లిచ్చిన సొమ్ములు పెట్టుకొని కులికే కోతీ! ఏమన్నావో నాముందు చెప్పు - నీ బుద్ధిలా కుటిలంగా ఉన్న ఇదిగో (చూపిస్తూ) ఈ కర్రతో -
శకారుడు : ఆయ్! - వ్యవహారం నాకూ చారుదత్తయ్యకూ మధ్య నీవెవడివిరా, బ్రాహ్మణార్థాలు చేసి బ్రతికే బడుగా! పిండాలు పీక్కోతినే పీనుగా!!
మైత్రేయుడు : ఏదీ ఆ మాట మళ్ళీ అను. పాదరక్షాప్రహారాలు - (చెయ్యి ఎత్తగానే చంకలో నగలు నేలమీద పడతవి)
శకారుడు : అవిగో - మా వసంతసేన నగలు. ఈ పాపిష్ఠిసొమ్ము కోసమే (చారుదత్తుణ్ణి చూపిస్తూ) ఈ పాతకి దాని గొంతు పిసికి పారేశాడు!
మైత్రేయుడు : ఆఁ - ఆఁ అన్యాయం. చారుదత్తా, సత్యమేమిటో ఎందుకు బయటపెట్టవు?
చారుదత్తుడు : మైత్రేయా! సత్యాసత్యలు ఈ అధికరణకులూ, ఈ రాజులూ పరిశీలించలేరు నా జీవితసర్వస్వం అయిన వసంతసేన లేని తరువాత నేను మాత్రం జీవించటమెందుకు?
మైత్రేయుడు : అదేమి మాట! రోహసేనుణ్ణి ఏం చేశావు.
అధికరణకుడు : (మదనికతో మైత్రేయుడి ఒంటినుండి జారిన నగలు చూపిస్తూ) అమ్మాయీ! ఈ నగలు మీ అక్కనౌనో కాదో పరిశీలించి చెప్పు.
మదనిక : ఆ నగలవంటివే కాని, అవి కావు.
మైత్రేయుడు : రెంటినీ చేసిన వాడు ఒకడై ఉంటాడు.
అధికరణకుడు చారుదత్తయ్య దోషి అని నిశ్చయించటానికి ప్రబల నిదర్శనం కనబడుతున్నది. చారుదత్తుడు : దోషమేమిటో ఎరుగని వంశంలో పుట్టాను. మీరు నిశ్చయించుకున్న తరువాత పరమాత్ముని దృష్టిలో నేను దోషిని కాకపోయినా లోకదృష్ట్యా దోషినే ఇన్ని మాటలెందుకు కాని -
(*) పరము ఒకటున్నదనే భయభావం లేకుండా పాపబుద్ధినై తరుణిని, దర్పకుని జన్మభూమిని, రతికైనా వందనం చేయదగినదాన్ని... నేను... అబ్బా... ఏవిధంగా చెప్పగలను?
శకారుడు : ఏమున్నది చెప్పటానికి - "చంపాను" - ఈమాట నీవు కూడా ఒక్కమాటు నీ నోటితో చెప్పు.
చారుదత్తుడు : (మాట్లాడడు).
అధికరణకుడు : చారుదత్తయ్య దోషి అని నిరూపిత మౌతున్నది కాబట్టి -
శకారుడు : కొరత వేయటమే శాస్త్రసమ్మతమైన శిక్ష.
అధికరణకులు : రాష్ట్రీయులు చెప్పినదే శిక్ష.
శకారుడు : ఓరి గోహా! (ప్రవేశించిన తరువాత) వధ్యస్థానానికి నడిపించాలి.
(ఒక భటుడు ప్రవేశించి నమస్కారం చేస్తాడు. చారుదత్తుని చేతికి గొలుసులు బిగించి నడిపిస్తారు).
(తెర)
పదిహేనో దృశ్యం
చారుదత్తుడు : ఏ అన్నెపున్నె మెరుగని నావంటివానికిదేనా నీవు విధించవలసిన శిక్ష!
విధీ! నీకు హృదయం లేదు. నీది గుండెకాదు. కఠిన కర్కశ గండోపలము. ఆగర్భ
శ్రీమంతుని ఇంట అనన్యభోగాలనుభవించిన ఓ శరీరమా, నీకెంత దుస్థితి
సంప్రాప్తమైంది! ఈ రక్తగంధానులేపనంతో ధరాపరాగధూసరితమై...
శోధనకుడు : ఓరి గోహిగా! అటు చూడసే. ఆ జనాన్ని చూడు. అయ్యగారిని ఎలా శూలం మీదికి ఎక్కిస్తావో!
గోహ : ఏమో దొర. ఈ మందిలో గగ్గోలు చూస్తే నాకు చేతులు వొడికిపోతున్నవి దొరా!
శోధనకుడు : ఒరేయ్! ఒకమారు తలపైకెత్తి చూడు. మేడలమీద ఆడంగులు అయ్యగారిని ఎలా చూస్తున్నారో చూడు.
చారుదత్తుడు : (తలపైకెత్తి) కనిపడేసిన నాలుగోనాడే నా కన్నతల్లి కాటికిచేరినా కన్నబిడ్డల్లా నన్ను చూచుకున్న ఓ ఉజ్జయినీ జనకుల్లారా! మీ ముద్దుబిడ్డ ఇక మీకుండడు. మీ చారుదత్తుడు మీకు లేడు. చింతించి ప్రయోజనం లేదు. మీ కన్నీరు కడళ్ళై కెరటాల బరువులతో పరువెత్తినా, లోకాలు ముంచెత్తినా మీ బిడ్డను బ్రతికించుకోలేరు.
యంయం వాపి స్మరన్ భావం త్యజ
త్యంతే కళేబరమ్
తంతమేవైతి కౌంతేయా!
సదా తద్భావ భావితః
శోధనకుడు : గోహిగా, చారుదత్తయ్యను అక్కడ ఆగమను. ఇది ఘోషణస్థానం.
ప్రజలందరికి ఒకమాటు అపచారమూ, శిక్షా రెంటిని గురించి చెప్పు.
గోహ : (తప్పెట మోగిస్తూ) ఓ అయ్యోయ్! ఇనండి. ఇనండి! ఈ చారుదత్తయ్య ఇనయదత్తయ్య మనుమడు, సాగరదత్తయ్య కొడుకు - ఇనండి. సాని ఇసంతశేనను శకారయ్య ఇద్దానవనంలో దుడ్డుకాసపడి పీక నులిమేసి సంపిండు. సొమ్ముతో దొరికిండు. నేరం ఒప్పుకుండాడు. దొరగోరు చాత్రపెకా రంగా ఈయన గోరికి సూలమెక్కించమని సెలవిచ్చిండు. ఈ తప్పుకు వోరికైనా యిదే చాత్తి. తెలుసుకోండొహో, తెలుసుకోండి.
చారుదత్తుడు : చారుదత్తా! చారుదత్తా!! నీవెంత పరమ దౌర్భాగ్యుడివి. వేదఘోషలతో వివిధ పవిత్ర క్రతువులతో వన్నెకెక్కిన నీపరిపూతవంశానికి తీరనికళంకం తెచ్చి పెట్టావు. ప్రపితామహా, వినయదత్తా! - పితామహ, యజనదత్తా! - ఈ బ్రాహ్మణ బ్రువుడివల్ల మీ పుణ్యనామావళి ఈ ఘోషణ స్థానంలో ఈ రీతిగా వీరినోట పడవలసి వచ్చింది. మీమీ లోకాలల్లో మీ దీర్ఘతపస్సులకు ఈ నికృష్ట దుర్ఘటనలతో ఈ నీచుడు ఎంత అంతరాయం కల్పించాడు. శపించండి! మీ శాపోదకం వల్లనైనా వీడికి ఏ జన్మలోనో శాంతి కలుగుతుంది. శపించండి!!
శోధనకుడు : ఓరే గోహిగా! ఇంకా ఈ జనాన్ని ఎంతదూరం రానిస్తావురా? పంపించెయ్! అయ్యా మీరంతా ఇక యెంటరాకూడదు. వెళ్ళిపొండి.
గోహ : ఓ దొరల్లారో! (నమస్కరిస్తూ) పొండి. పొండి. కదలరేం.
శోధనకుడు : ఆఁ. కదలరేం (గోహాతో) ఎంతచెప్పినా కదలరేంరా? గోహిగా రక్షకభటులను రప్పిద్దామా ఏం?
గోహ : ఏం చేసేది దొరా? సావమన్నావా, ఏమిటి? పీక సినిగేట్లు ఎంత కొట్టుకున్నా పోకపోతే - మన ఎంటనే మంది శూలందాకా ఒచ్చారో (చారుదత్తుణ్ణి చూపిస్తూ) ఆ అయ్య సావెట్లున్నా మన సావు మూడిందే శకారయ్య సేతుల్లో.
శోధనకుడు : ఆలస్యమైతే మన కొంపమీదికి వస్తుంది.
గోహ : (చారుదత్తుణ్ణి చూపిస్తూ) అయ్యగారు చెప్పే ముక్కలు రెండూ సెపితే మంది ఎనక్కు పోతుంది దొరా? ఆయన్ను బతిమాలుకుందాం (చారుదత్తుడి దగ్గరకు పోయి) పెబో! మా పాణాలు దక్కించు. మా పెళ్ళాల తాడు తెగుద్ది. మందిని పంపించెయ్ దొరా! (చారుదత్తుడు రెండడుగులు వెనక్కు వేయగానే) దండాలు దొరా? దయగల అయ్యదొరా!
చారుదత్తుడు : (ప్రజలతో) అన్నలారా! నా దురదృష్టానికి మీరేం చేస్తారు? ఇది ఈ జన్మలో చేసుకొన్న పాపం కాదు. పురాకృతం. నా జీవితనావతో సౌఖ్యసముద్రాలలో వ్యాపారం సాగించాను. అది నడిసముద్రములో అనుకోని కొండరాయికి కొట్టుకొని బ్రద్దలైపోతున్నది. అందులో మునిగిపోతూ ఉన్న నన్ను కనికరించి మటుకు మహానావికులు కాని మీరేం చేస్తారు? చింతించకండి. “యదన్హాత్ కురుతేపాపం తదన్హాత్ ప్రతిముచ్యతే” నామీది ప్రేమ నాచిట్టితండ్రి రోహసేనుడిమీద చూపించండి. మీ జీవితాలల్లో పవిత్రప్రేమకు భంగం కలిగించకండి (నమస్కరిస్తూ) ఇక తాము నాకు సెలవిప్పించండి. (జనం కదలరు) వెళ్ళరా! రాజాజ్ఞను వ్యతిక్రమించి అరాజకం చెయ్యటానికి పూనుకోకండి. ఆ అపకీర్తి నా కంట గట్టకండి. సెలవు. (జనం కదిలి మూకలు మూకలుగా వెళ్ళిపోయే కోలాహలం వినిపిస్తుంది)
గోహ : (శోధనకుడితో) దొరా! చారుదత్తయ్య బలే దొడ్డ అయ్యగదూ! ఆయన మాటంటే సూసినవ్ దొరా! మంది గొర్రెల మందలాగా టుర్రో అంటే టుర్రో.
శోధనకుడు : శకారయ్య వస్తాడేమోరా! - త్వరగా నడిపించు. కొంచెం తొందరపెట్టు.
గోహ : ఆయన ఇట్ట మొచ్చినంతసేపు నడవనీ దొరా! అయ్య పోదామంటే పోదాం, ఆగమంటే ఆగుదాం. బంగారమంటి అయ్య మళ్ళీ సూద్దామంటే మనకంటికి మాత్రం కనబడతాడా!
చారుదత్తుడు : (భ్రాంతితో) మదనికా! మదనికా! మరణసమయంలో మా వసంతసేన చారుదత్తుడి మనస్సులో ఉందో లేదో అని పరీక్ష చేయటానికి వచ్చావా? మనస్సులోనే కాదు. నాలోవున్న ప్రత్యణువులో మనసిజశిల్పి చిత్రించిన ద్వందాతీత మనోజ్ఞమూర్తి, ఆ అమృతమూర్తి స్థిరంగా ఉంది సుస్థిరంగా ఉంది. మదనికా! నేను మాత్రం నిర్భాగ్యుణ్ణి, ప్రియా, వసంతసేనా!
(*) లేకపోతే ఆనంద రసకుంభవృష్ణులు కురిసి నా హృదయక్షేత్రాన్ని సంతోషపెట్టటానికని నీవు రానే వచ్చినప్పుడు ఈ నూతనాకృతితో నన్ను భస్మీభూతుణ్ణి చేయటానికి ఈ మహాప్రళయం వస్తుందా!
(ఒక్కమాటు దీర్ఘ నిశ్వాసం చేసి గోహా, శోధనకులను చూచి) నాయన లారా! ఏదో భ్రాంతిలో పడ్డాను. మీ ఉద్యోగ ధర్మాలకు ఆలశ్యం చేశాను. క్షమించండి. ఇక నడవండి.
గోహ : చిత్తం దొరా?
(రెండడుగులు వేయగానే నాన్నా, చారుదత్తా, నాన్నా, చారుదత్తా అని మైత్రేయ, రోహసేనుల రోదన కంఠాలు వినిపిస్తవి). చారుదత్తుడు : (వెనకకు తిరి) మైత్రేయా... రోహసేనా!! (మైత్రేయుడు రోహసేనుడు ప్రవేశిస్తారు)
మైత్రేయుడు : (కన్నీళ్ళతో) చారుదత్తా!
చారుదత్తుడు : మైత్రేయా! మైత్రేయా!! దుఃఖించి ప్రయోజనం? మనం దరిద్రులం. దరిద్రుల కిది కాని కాలం. ధనవంతుడెంత అభాజనుడైనా తల ఒగ్గిపోవటమే మనధర్మం. లేకపోతే - ధనంతో ఎంతపనైనా చేయగలుగుతాడు. నాయనా! రోహసేనా! (దగ్గిరకు తీసుకొని) మైత్రేయుడు మామయ్యే నీకు సమస్తమూ. అమ్మ చెప్పినట్లు విను పెరిగి పెద్దవాడవై నీ తాతముత్తాతల పేరు నిలవబెట్టు నాయనా. ఇదిగో! (మెడలో జందెము తీసి)
తండ్రీ! (*) ఇది తుదకీ నీకీయటానికి దక్కింది. సంతోషించు. బ్రాహ్మణ బిడ్డవైన నీకిదే నగ. ఇది స్వర్ణహారం కాదు ముప్పేటలు ముత్తెపుసరం అంతకంటే కాదు. కానీ నీ తాతలు, తండ్రులు, దేవతలు దీనివల్లనే తృప్తు లౌతారు.
రోహసేనుడు : నీవు ఎక్కడికి నాన్నా!
చారుదత్తుడు : ఒక అభం శుభం ఎరుగవుగదా తండ్రీ! ఎక్కడికి వెళుతున్నానో చెప్పమన్నావా? తండ్రీ!
(*) మాసిన కీర్తితో, దయమాలిన శూలంతో, కంఠాన ఈ భాసుర రక్తమాలికతో,
దుఃఖాగ్నితో, పరేత భస్మసింహాసనాన్ని అధిష్ఠించి, ఆ యముడు ఏలుకునే యజ్ఞవాటికకు.
గోహ : ఓ సిన్నదొర! రాజుగారి ఆజ్ఞ స్మొశానానికి.
శోధనకుడు : మీ నాన్నగారిని చంపటానికి తీసుకొనిపోతున్నాము.
రోహసేనుడు : అబ్బీ - మా నాన్నగారిని ఒదిలిపెట్టి నన్ను తీసుకోపోండి. నేను వస్తాను.
చారుదత్తుడు : నాయనా! రోహసేనా!! ఇటురా తండ్రీ! (దగ్గిరికి తీసుకొని) ప్రేమామృతనిష్యందివంటి నీ మాటలు నా హృదయసాగర గర్భాన్ని కలిచేస్తున్నవి తండ్రీ!- (*) నీకు వేయేండ్ల ఆయువు కలుగుగాక! ఏది నాన్నా! ఇలారా! (కౌగిలించుకొని) ఈ దరిద్ర దేహానికి నీ కౌగిలి చందనలేప మైందోయ్. తండ్రీ! దీనికి ఏ ఔశీనరచర్చ కూడా తుల్యం కాలేదు. (ముద్దు పెట్టుకోనాయనా అని ముద్దు పెట్టించుకుంటాడు) మైత్రేయా! నాయనా! నీవు మామ వెంట ఇంటికి వెళ్లు. అత్త మీకోసం దిగులు పడుతుంది. (గోహ శోధనకులతో) ఇక మీదే ఆలస్యం.
శకారుడు : (ప్రవేశించి) ఒరే ఏమిటిరా ఈ ఆలస్యము. అడుగులో అడుగు వేసుకుంటూ మీ అబ్బ చచ్చినట్లు (రోహసేనుణ్ణి తోసివేస్తూ) పద, అవతలికి.
మైత్రేయుడు : (ఎత్తుకొని) నాన్నగారికి నమస్కారం చెయ్యి నాయనా!
చారుదత్తుడు : (రోహసేనుడు నమస్కరిస్తే దీవిస్తాడు).
శకారుడు : ఒరేయ్, నేను వచ్చేటప్పటికల్లా అంతా పూర్తి చేయించండి. నా కంటిముందు పని జరగాలి. ఆఁ జాగ్రత్త.
(నిష్క్రమిస్తాడు).
శోధనకుడు : నడు, బాబూ! నడు. ఈ దుర్మార్గుడు ఏమైనా మా ప్రాణాలకు ముప్పు తెస్తాడు.
గోహ^ : ఓ దొరా! ఈ అయ్య దుండగం బలేమోపైంది.
చారుదత్తుడు : (నిట్టూర్పుతో) రామప్రభూ! రామప్రభో!!
(శోధనకుడూ, గోహాలు నడిపిస్తుంటే చారుదత్తుడు వెంట నడుస్తాడు.).
(తెర)
పదహారో దృశ్యం
[శ్మశానభూమిలో ఉరికొయ్య అమర్చి ఉంటుంది. చారుదత్తుని శిరచ్ఛేదనానికి బలిపీఠం
ఎక్కించుతారు.]
శోధనకుడు : అయ్యా! చారుదత్తయ్యా నీ కులదైవాన్ని స్మరించుకో.
చారుదత్తుడు : (స్మితం చేసి) కులదైవమా! దైవమంటూ ఒకడుంటే కదా కులదైవము దైవం మీద ఈ లోకానికి నమ్మకం లేదు. అయినా అనుక్షణం దైవాన్ని మరచిపోనూలేదు. దైవమొకడు లేడు - ఇదియథార్థము (*) ఆ దైవమే ఉంటే నీవు వధ్యుడవని ఈ కఠోరశిక్ష నా మీద విధించగలరా? దారుణమైన అపకీర్తి పంకిలం నన్ను అలమింది, విబుధాలయం నుంచి దిగివచ్చి నా ప్రియ దీన్ని క్షాళన చేయుగాక!
శకారుడు : (ఆతురతతో ప్రవేశించి) ఇంకా చూస్తారేం రా! డిండిమం మ్రోగించండి. ఒరేయ్ చారుదత్తా! తాటిపట్టి వంటి నీ నాలుకతో ఇప్పటికైనా సరే దేవుని ఎదుట ఒక్కమాటు వసంతసేనను చంపానని ఒప్పుకో. నీకు శిక్ష తగ్గే మార్గం ఆలోచిస్తాను.
చారుదత్తుడు : శిక్ష తగ్గుతుందని చేయని పని చేశానని ఎలా అంగీకరించేది?
శకారుడు : నీమీద కనికరం కలిగింది. శిక్ష తగ్గిద్దామని ఉద్దేశిస్తున్నా, లేకపోతే శూలారోహణమే రాజాజ్ఞ.
చారుదత్తుడు : దావానలంవంటి ఆపదలో దహనమై పోతున్నానని భయంలేదు. కానీ - లోకంలో నన్నంతగా ప్రేమించిన వసంతసేనను ప్రణయినిని ధనలోభంతో చంపాననే అపకీర్తి వ్యాపిస్తుంది కాబోలు. శరీరం కంపిస్తున్నది. కంపించి ఏం ప్రయోజనం? కర్తవ్యం?
శకారుడు : (నిష్కర్షగా) చంపానని ఒప్పుకోటం?
చారుదత్తుడు : అవును. నిజమే చంపానని ఒప్పుకోవటమే. లోకం దృష్టిలో చంపినట్లు స్థిరమైపోవటం నిశ్చయమైపోతున్న తరువాత అంగీకరించటానికి నాకు అభ్యంతరమెందుకు? శకారుడు : ఒక్కమాటు నోటితో చంపానని అంటే...
చారుదత్తుడు : చంపాను. ఆపైన...
శకారుడు : క్రింద ఆకాశం పైన భూమి. శూలంక్రింద నువ్వు శూలంపైన నేను. హిఁ హిఁ హిఁ - చూస్తారేంరా, ఒప్పుకొన్న తర్వాత శూలమెక్కించక, చూస్తారేం రా?
కుంభీలకుడు : (నురగలు గక్కుతూ ప్రవేశించి) అయ్యా! ఆగండి. ఆగండి, ఆర్యచారుదత్తుడు నిర్దోషి - ఇదుగో రాజశాసనం!
శకారుడు : బావా! బాబూ! ఎవరు ఎవరిని చంపితేనేం? మనం ఇంటికిపోయి మంచి - కల్లు.
కుంభీలకుడు : ఛీ - వసంతసేనను చంపింది చాలక చారుదత్తుని వంటి పవిత్రమూర్తిని అన్యాయంగా శూలమెక్కిస్తావా?
ఇదిగో! రాజాజ్ఞ. శోధనకా! గోహా! శకారుణ్ణి శూలమెక్కించండి.
శోధనకుడు : (శాసనం చూస్తాడు)
గోహ : రా. అయ్యా రా. పెద్దమనిషివి.
శకారుడు : (ఆశ్చర్యంతో) నా ప్రియురాలిని నేను చంపానా! వీడు పచ్చి దొంగ - శోధనకా ఇది దొంగముద్ర! - దొంగపత్రం!! (తెరలో కుంభీలకుడు రాజముద్ర చిక్కించుకొన్నాడు. అతడు దొరికితే పట్టుకోవలసిందని రాజాజ్ఞ).
శకారుడు : చూస్తారేంరా, పట్టుకోండి.
కుంభీలకుడు : (చారుదత్తుడి కాళ్ళమీద పడి) తండ్రీ, నిన్ను రక్షించటానికి రాజముద్ర గూడా దొంగిలించాను. కానీ (కాళ్ళమీద పడతాడు).
చారుదత్తుడు : (శిరస్సు మీద చేయి ఉంచి).
(*) లే. కృపాళూ, లేవయ్యా! నేనీ రీతిగా మృత్యుముఖాన్ని చేరబోతుంటే నీ ప్రాణాలొడ్డి నన్నెందుకు రక్షింపబూనుకుంటావు. నీవే నాకు ఆప్తబంధుడివి. అయినా నీవు తలపెట్టిన ఈ ప్రాణరక్షాక్రియకు విధాత అడ్డుపడ్డాడు.
నాయనా, చింతించకు, నీకు శుభమగుగాక! (కుంభీలకుని లేవదీసి గోహ శోధనకులు పట్టుకుంటారు) శకారుడు : ఒరేయ్! చావబొయ్యే సన్యాసి వాడి పాదాలు పట్టుకుంటే ఏముందిరా. ఇవిగో బంగారు పాదాలు పట్టుకో. క్షమిస్తాను. నీకు ఇప్పటికైనా చెప్పి రాజపౌరోహిత్యమిప్పిస్తాను.
కుంభీలకుడు : ఆర్యకుడే రాజైతే మీ బావగారి కొకటుంటే గదా! తా దూరను లేదుగాని మెళ్ళో ఒక డోలుట!
శకారుడు : ఆఁ. ఒరేయ్ఁ - నేను చారుదత్తుడి చావుచూచి గాని వెళ్ళను. వీడిని వెంట తీసుకోపోయి నా కత్తితో ముక్కలు ముక్కలు చేసి నేను తినేటట్టుగా రాజశాసనం పుట్టించాలి. త్వరగా కానివ్వండి.
శోధనకుడు : (చారుదత్తునితో) ఆర్యా! శూలానికి నమస్కారం చెయ్యి.
చారుదత్తుడు : (శూలానికి నమస్కరిస్తాడు).
గోహ : అయ్యా! భయపడుచున్నారా?.
చారుదత్తుడు : భయమా! భయమెందుకు? మృత్యుదేవతా దర్శనం లోకంలో జన్మమెత్తిన తర్వాత దేవతలైనా సూర్యచంద్రాదులకే తప్పలేదు. నా ప్రియురాలిని ఒక్కమాటు స్మరించుకోనీయండి.
తరువాత ఈ తుచ్ఛశరీరాన్ని మీ ఇష్టం వచ్చినట్లు - హా ప్రియా! వసంతసేనా-
వసంతసేన : (ప్రవేశించి) ప్రభూ! చారుదత్తా!!
గోహ : (శూలాన్ని దగ్గిరకు తేబోతుంటాడు).
శకారుడు : (ఒకవైపు చూచి) వసంతసేన! - చచ్చామురా, బాబూ దశ్శరభ, శరభో! - (పరుగెత్తబోతాడు).
చారుదత్తుడు : (వసంతసేనను చూచి) ఎవరీమె? మృత్యు మహాబిలములో ప్రవేశించిన నన్ను తిరిగి బ్రతికించటానికి వచ్చిన కాటిదేవతా! కాదు. వసంతసేన!
(*) ఏమిటి? వసంతసేనా! కాదు. ప్రతిరూపము. పొరబాటు. ఆమె! నన్ను కాపాడటానికి స్వర్గభూమిని విడిచి వచ్చింది. నిజమా ఇది భ్రాంతా? ఆమని పూలతోటలా ఉన్న ఈమె వసంతసేనే! పూర్వ మున్న స్వర్గానికే వెళ్ళలేదు. అమే!
వసంతసేన : ఆర్యా! ఔను, మీ వసంతసేననే! వసంతసేన : జీర్ణోద్యానంలో శకారుడు నన్ను పీకనులిమి వెళ్ళిపోయిన తర్వాత రక్షించిన మహాత్ముడు.
చారుదత్తుడు : భదంతా! మీకు మేమేమి ప్రత్యుపకారం చేయగలమో!
సన్యాసి : ప్రత్యుపకారమా! నాదే మీకు ప్రత్యుపకారం. వీడు పూర్వా శ్రమంలో మీ పాద సంవాహకుడు (వసంతసేనతో) తల్లీ నీకు వెనక ఎన్నడూ చెప్పలేదు. నీవు పది సువర్ణాలిచ్చి జూదరి చేతుల్లో ప్రాణాలు దక్కించిన వాడు వీడే - (వసంతసేన ఆశ్చర్యంతో చూస్తుంది) (విటుడూ, శర్విలకుడూ! నడు, పద, కొట్టు. (శకారుణ్ణి నడిపించుకో వస్తాడు).
కుంభీలకుడు : నిన్ను ఏం చేస్తానో చూడు.
శకారుడు : నా కొలువులో బతికి నా కొంప తీయిస్తావుట్రా.
శర్విలకుడు : ఆర్యా! ఇడుగో మీ శత్రువు. వీడికి ఏమి శిక్ష విధించాలో మీరే నిర్ణయించాలి. ఆర్యక మహారాజులు మిమ్మలినే న్యాయాధిపతులుగా ఎన్నుకున్నారు.
కుంభీలకుడు : (వధ్యమాలిక శకారుడి మెడలో వేస్తాడు).
శకారుడు : (చారుదత్తుడి కాళ్ళమీద పడుతూ) మహాత్మా! శరణు! శరణు!
చారుదత్తుడు : శరణాగతుణ్ణి వదలివేయటము ఆర్యధర్మమూ, ఉత్తమ ధర్మమూ!
శకారుడు : (నమస్కారం చేస్తూ) అమ్మయ్య! బ్రతికానురా బాబూ! దశ్శరభ శరభా!
మైత్రేయుడు : (ప్రవేశించి) మిత్రమా! ఆర్యకుడు రాజైనాడు (ఆశ్చర్యంతో) వసంతసేనతో (శర్విలకుని చూచి) ఇతగాడిని కలలో చూచినట్లుంది.
శర్విలకుడు : అయ్యా నేను మీ ఇంట భూషణపాత్ర అపహరించిన గజదొంగను. ఆర్యకమహారాజ స్నేహితుణ్ణి.
వసంతసేన : మా మదనిక ప్రియసఖుడు! శర్విలకుడు!
మైత్రేయుడు : అందుకనే కలలో చూచినట్లున్నా నన్నది.
శర్విలకుడు : ఆర్యకమహారాజు తల్లిగారికి వధూ! బిరుదమిచ్చారు.
చారుదత్తుడు : ప్రియా! ప్రియవధూ! వసంతసేనా! ఈ రక్తగంధానులేపనం నాకు వివాహోచితాలంకారమే! ఈ వధ్యశిలే మన పాణిగ్రహణవేదిక! (కైదండలతో చారుదత్త వసంతసేనలు, మదనికా శర్విలకులు పాడుతారు. మైత్రేయుడు, రోహసేనుడు సంతోషంతో చూస్తుంటారు).
అందరు : జీవనది నీ వొంటి
చేర విక హంసా!
పురుషులు : పడతి నీ నీడగా
నడచునే హంసా!!
అందరు : జీవనది నీ వొంటి
చేర విక హంసా!!
స్త్రీలు : పతిని నీ జోడుగా
పడసితివె హంసా!
అందరు : జీవనది నీ వొంటి
చేర విక హంసా!
(తెర)
అనుబంధం
(మూలములో (*) గుర్తు ఉన్నచోట్ల వచనం వ్రాసి పద్యాలతో ఆడదలచిన వారి
ఉపయోగం కోసం వాటిని ఇక్కడ వరుసగా ముద్రించడమైనది).
పుట 117 - సిగ్గేస్తున్నది తరువాత
సిరి దయఁ జూచునాఁడు ననుఁ జిత్తజదేవమహోత్సవంబు లే
జరిపితి నాధనంబుననె సర్వజనుల్ వినుతింప, నేఁడు నన్
సిరి నిరుపేదఁ జేసె, మది సిగ్గిలుచున్నది చేతులారఁగా
మరునకుఁ గాన్కనీయ నొకమాడయు మాకడలేదు మిత్రమా!
పుట 119 - తుర్రుమంటుందా బావా!
దుడ్డు దొబ్బెడు దొడ్డ దొమ్మర గెడపోరి,
దండుగుల్ పెట్టించు మిండకోరి,
తంపటల్ తలకెత్తు తాపికత్తెలదు త్త
రడ్డిమడ్డిజనాల రంకుతొత్తు
నిక్కమాడని బైసి కొక్కెర జలజంత,
రొక్కాల వలపుల చక్కిజంత,
కోలాట మాడేటి కైలాట నెఱదొడ్డి,
గోవాళ్ళ హరియించు గొప్పదిడ్డి,
దాటదీపరి, కసుమాల, దాట్లగుట్ట,
దుక్కిపిట్ట, పిశాచంబు, దొంగతొఱ్ఱు
ఔర, రాజును నాతొ మాటాడకిట్లు
పారిపోవునె బావ! ఈ పడుపుకత్తె!
పుట 122 - శకారుడు (ముందుకు నడచి)
ఆప నెవరికీ శక్యమే అతివ! నిన్నుఁ
దరుముచుండఁగ నొంటి నాదరికిఁ జేరి
కుంతికొడు కైన యాదుష్టశంతనునక!
ఇంతిరో! రంభసుతుఁ డైన రాభణునక !!
పుట 129 - దీపంతో ప్రయోజనం లేదు....
వలపుల కాంతులన్ గగనవాటిక వెన్నెలవెల్ల వేసి యా!
కలువల రేఁ డిదే కుముదకాంతల వంతలఁ దీర్పవచ్చె - నీ
వెలుఁగుల వెన్నెలన్ నగరవీథులఁ గల్గదు భీతి సుంతయున్!
నిలుము శ్రమింపగా వలయునే నిను దీపికనై సుహృద్వరా!
పుట 134 - సౌందర్య తప్ప రేభిలా!
మనసున కందరాని సుకుమార మనోజ్ఞ విపంచికాకల
క్వణనమె పంచభూతతతిగా గ్రహించి సృజించినావు మా
కనులకుఁ గట్టునట్టు లవగాఢత మంజులస్వర్గలోక మో
యనిమిషగాయకా! ప్రణతు లియ్యవె నీకమనీయ విద్యకున్.
పుట 139 - చారుదత్తుడు విధీ! విధీ!!
ఏటికి నెంచితో జగతి నెత్తఁగ జన్మము బ్రాహ్మవంశమం?
దేటికి యర్థ మిచ్చితివొ? ఏటికి వర్తకుగా నొనర్చితో?
ఏటికి నన్ దరిద్రునిగ నీగతిగా నొనరించి తండ్రి, భి
క్షాటనఁ జేయఁగా దగినఁ కల్పనఁ జేసితివో కదా విధీ!
పుట 149 - (చిత్రపటాన్ని చూస్తూ) మహాభాగా!
ఓ కమనీయరూపమహిమోజ్జ్వల! సద్గుణదివ్యరత్న ర
త్నాకర! మీవిలాసముల ధన్యుఁడు శిల్పి యొకండు చిత్రమం
దేకరణిన్ రచింపనగు - నేగతి నేని నొనర్చె నేని యా
ప్రాకటమానసాబ్జమును భావనసేయు సమర్థుఁడే ప్రభూ!
పుట 163 - (చారుదత్తుని చిత్రపటంవైపు చూస్తూ)
పాదసేవకురాలిపైఁ బడియె నేని
శీతలామల భవదీయ స్నిగ్ధనేత్ర
రాగర క్తిమ శుష్కనీరస జగంబు
ప్రణయప్రమదావనంబు నా బ్రతుకు కింక
దెసలన్ జాజులతావి నా ప్రభుని కీర్తిస్ఫూర్తితో నిల్పు నో
వసనమ్మా! నిలు మంసభాగములపై వక్షస్థలం బోసి నీ
లసదానందమనోజ్ఞలాస్యములకున్ రంగస్థలం బీయెడన్
అసమానమ్మగు నీ కళావిభవ మత్యంతంబు రూపింపవే!
పుట 166 - (కుంభవృష్టి తప్పదు)
ఉరుమఁగ నిమ్ము శ్రావణపయోదములన్ ఘనగర్జలొప్పఁగాఁ
గురియఁగ నిమ్ము, లోకములకున్ బ్రళయంబగు కుంభవృష్టి, తా
మురలఁగ నిమ్ము, హ్రాదినుల నుర్వర బీటలు వార, బ్రీతిమై
నరిగెద నేఁడు నా ప్రియునకై యభిసారికనై రయంబునన్.
పుట 167 - వసంతసేన (ఆకాశంవైపు దృష్టి నిల్పి)
ఏ ప్రౌఢోజ్జ్వలవేషధారిణిగఁదండ్రీ, నా ప్రియుం జేరఁబో
నీ ప్రావృడ్ఘనఘోరవర్షములతో నీ మేఘ నిర్ఘోషలా?
ఓ పర్జన్య! పయోదరాజ!! దయలేదో, గుండె రాయయ్యెనో,
ఈ పాపమ్మది యేమి? నీకుఁ దగునే యీదాష్ట్యమోహాప్రభో!
పుట 167 చూపుతూ వెలిగితే చాలు
ఆమెయి మేఘరాజు కఠినాత్ముడు నన్నెరపింప నోసి సౌ
దామని! గర్జసేయు భయదంబగు దారుణద్రోణవృష్టి - కా
నీ మగవాఁ డతండు, హృదయేశునకై విరహార్తనైన న
న్నే మెయిఁ జేర్చెదో ప్రియుని యింటికి నమ్మితినే తలోదరీ!
పుట 195 - చారుదత్తుడు: ప్రియా! వసంతసేనా
క్రొన్నెల లేఁత వెన్నెలలకున్ సొగసిచ్చెడు దంతకాంతితో
ప్రన్ననిచూతపల్లవవిలాసము లొప్పెడు కావిమోవితో,
వన్నెలఁ జిన్నెలన్ గలుఁగువారెడి, నీ ముఖకాంతిఁ ద్రావి ఓ
యన్నువ! దుర్యశోవిషమయాసవ మేగతిఁ గ్రోల నేర్తునే
పర మొకటున్న దన్న భయభావము లే కిటు పాపబుద్ధినై
తరుణిని రూపసంపదల దర్పకమోహనజన్మభూమి నో
హరిహరి! ఓ విధాత!! రతి కైనను వందనమాచరింపఁగా
నొరలెడు దాని - నేగతిగ నోడెద నే వచియింప నాపయిన్.
పుట 200 - నేను మాత్రం నిర్భాగ్యుణ్ణి
ఏనిర్భాగ్యుఁడ - కానిచో నిటులనౌనే - నీవు ప్రేమామృత
శ్రీనిష్యందినివై మదీయ హృదయోర్విన్ దృప్త 'గావింపఁగా
రానేవచ్చినవేళ వచ్చె నిటు దుర్వారాగ్ని కీలాళితో,
నీనవ్యాకృతితో మహాప్రళయ మం దే దగ్ధమైపోవగన్.
పుట 201 (మెడలో జందెము తీసి)
తుది నీకీయఁగ నాకు దక్కినది, సంతోషింపు మో తండ్రి! నీ
కిదియే బ్రాహ్మణబిడ్డకున్ నగ - ఇదేమీ స్వర్ణహారంబు కా
దిది ముప్పేటల ముత్తెపున్ సరము కానేకాదు - ఇద్దాననే
తుది నీ తాతలు తండ్రులున్ సురలు సంతోషింతురో పుత్రకా!
పుట 201 - ఎక్కడికి వెళ్ళుతున్నారో చెప్పమన్నావా!
మాసినకీర్తితోడ, దయమాలిన శూలముతో, గళంబునన్
భాసుర రక్తమాలికల బంధుర దుఃఖకఠోరవహ్నితో
నోసుత! యేఁగుచుంటి యముఁడుజ్జ్వలుఁడౌచు ప రేత భస్మసిం
హాసన మెక్కి చేసిడి మహాధ్వరభూమికి నే హవిస్సునై.
పుట 201 - కలిచేస్తున్నవి తండ్రీ!
వేయేండ్లాయువు కల్గుఁగాక భువి నా ప్రేమోదధీ, తండ్రీ! రా
రా, యాహ్లాదముతోడ ముద్దిడుము, నీయాశ్లేషసౌఖ్యంబునం
దీయత్యంతదరిద్రదేహమున కయ్యెన్ జందనాలేపముల్ -
ఏయౌశీనర చర్చ తుల్యమగు నోయీ, తండ్రి కిద్దానితోన్.
దైవమొకండు లేఁ, డిది యథార్థము, దోష మొకింత లేని నా
పై వచియింతురే యిటుల వధ్యుఁడ వన్న కఠోరశిక్షయా
దైవమె యున్నచో - నలమె దారుణనీలకళంకపంక మ
న్నా! విబుధాలయంబు డిగి నాప్రియ క్షాళన చేయుఁ గావుతన్
పుట 204 - (శిరస్సు మీద చేయి ఉంచి)
లే లే లెమ్ము కృపాళు, ఓ కరుణశీలీ! లెమ్ము, లేవయ్య నే
నీలీలన్ జొర మృత్యుగహ్వరము తండ్రీ! యొడ్డి నీ ప్రాణముల్
యేలా రక్షణసేయఁ బూనెదవు - నీవే యాప్తబంధుండ నో
యీ! లే లెమ్ము విధాత యడ్డుపడియెన్ ఈ ప్రాణరక్షాక్రియన్
పుట 205 - కాదు. వసంతసేన
ఏమి? వసంతసేన యగునే, ప్రతిరూపమె! కాదు, ఆమెయే -
యీమెయె స్వర్గభూమిడిగినే నను గావఁగ, సర్వమీయెడన్
ఏమిది? భ్రాంతి యౌనె? హృదయేశ్వరి స్వర్గము చేరలేదెమున్
ఆమనిపూలతోఁట కెనయై యిటువచ్చె వసంతసేనయే.
This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.