వావిలాల సోమయాజులు సాహిత్యం-2/నాయకురాలు (వావిలాల సోమయాజులు)
ప్రవేశిక
క్రీ. శ. 12వ శతాబ్ది మధ్యభాగం. హైహయ వంశస్థుడైన అలుగురాజు పలనాటి రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. చందవోలు రాజధానిగా ఆంధ్రదేశాన్ని ఏలుతూ ఉన్న వెలనాటి చోళరాజు పుత్రిక, మైలమ మహాదేవి, అతని దేవేరి. పలనాటి రాజ్యాన్ని తండ్రి ఆమెకు అరణంగా ఇచ్చాడు. భర్త దానికి పాలకుడైనాడు. విజ్జలదేవీ, భూరమాదేవీ అలుగురాజుకు ఇతర భార్యలు.
ముగ్గురిని వివాహమాడినా అలుగు రాజుకు చాలాకాలం సంతానం కలుగలేదు. మంత్రి దొడ్డయ జ్యేష్ఠ పుత్రుడు, బాదన్నను పెంచుకున్నాడు. దైవ వైపరీత్యం వల్ల దత్తస్వీకారానంతరం రాజుకు ముగ్గురు భార్యల వల్లా సంతానం కలిగింది. మైలమ దేవికి నలగామరాజూ, భూరమాదేవికి నరసింగరాజు, విజ్జలదేవికి మలిదేవాదులూ జన్మించారు.
నలగామరాజు బాల్యంలో అలుగురాజు రాజ్యాన్ని రెండుగా విభజించి ఒకభాగం పెంచుకున్న బాదన్నకూ, మరో భాగం నలగామరాజుకూ చెందేటట్లు చూడవలసిందని ఆనాడు మంత్రిత్వం నెరుపుతూ ఉన్న దొడ్డయ మంత్రి ద్వితీయ పుత్రుడు బ్రహ్మనాయునితో చెప్పి స్వర్గస్థుడైనాడు. తరువాత కొలది కాలానికే తన రాజ్యభాగాన్ని మలిదేవాదుల కిచ్చి బాదన్న మరణించాడు.
అలుగురాజు కుమాళ్ళనందరినీ సమానాదరంతో సాకుతూ బ్రహ్మనాయుడు కొంతకాలం రాజ్యచక్రం త్రిప్పి 'పలనాటి కిష్టయ్య' అనే ప్రఖ్యాతి గడించాడు. ఇంతలో నలగాముడికి యౌవనోదయమైంది. ఒకనాడు వేటకు పోయి ఎత్తిపోతల అడవుల్లో నాగమ్మ (నాయకురాలు)ను చూచి రాజధానికి ఆహ్వానించాడు.
నాగమ్మ ఒక రెడ్డి రైతు కుమార్తె. బ్రహ్మనాయుడు, నలగామరాజూ, పూర్వమే నాగమ్మ తండ్రిని ఏదో రాజనేరం కారణంగా ఉరికంబాని కెక్కించారు. ప్రతీకార వాంఛతో ఆమె రాజు ఆహ్వానాన్ని అంగీకరించి రాజధాని చేరింది. క్రమక్రమంగా ప్రాపకం అభివృద్ధి చేసుకొని మహామంత్రిణిగా మారిపోయింది. అన్నదమ్ముల్లో అంతఃకలహాలు పెంచింది. మాచర్లను మరొక రాజధానిగా చేయించి మలిదేవాదులను, బ్రహ్మనాయని, గురిజాలలో లేకుండా పంపించింది. ఏటేటా వారు గురిజాలకు వచ్చి నలగామరాజు ఆధిపత్యాన్ని అంగీకరించి కప్పం కట్టేటట్టు నిర్ణయించింది.
మలిదేవాదులకు రక్షకుడుగా బ్రహ్మన్న కొంతకాలం మాచర్ల రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా - ఏ పక్షం వోడిపోయినా ఏడేండ్లు రాజ్యం వదిలిపెట్టి అరణ్యవాసం చేసేటట్లు - పణం పెట్టి అతనిచేత కోడిపందాలకు ఒప్పించి మోసంచేసి నాగమ్మ గెలిచింది.
అష్టకష్టాలు పడి అరణ్యవాసం పూర్తిచేసుకొని వచ్చిన మలిదేవాదులకు తిరిగి మాచర్ల రాజ్యమివ్వమన్న బ్రహ్మన్న కోరికను ఆమె నిరాకరించింది. రాయబారాలమీద రాయబారాలు నడిచినవి. ప్రయోజనం లేకపోయింది. ఉభయ పక్షాలూ యుద్ధమేనని నిశ్చయించుకున్నవి. కారెంపూడి కదనరంగమే! ఆంధ్ర కురుక్షేత్రం!! అదే ఆంధ్ర
వీరభారత యుద్ధం!! పాత్రలు
పురుషులు
- బ్రహ్మనాయుడు: మలిదేవుని మహామంత్రి
- కొమ్మరాజు: సేనాపతి, నలగాముని వియ్యంకుడు
- అలరాజు: కొమ్మరాజు కుమారుడు
- కన్నమదాసు: బ్రహ్మనాయని పెంపుడు కొడుకు
- బాలచంద్రుడు: బ్రహ్మనాయని పుత్రుడు
- మలిదేవుడు: విజ్జలదేవి ప్రథమ పుత్రుడు, మాచర్ల రాజ్యాధిపతి
- నలగామరాజు: మైలమదేవి పుత్రుడు
- నరసింగరాజు: రమాదేవి పుత్రుడు
- కేతరాజు: ధరణికోట యువరాజు
- రణభట్టు: బ్రహ్మనాయుని సైనికుడు
- కొండుభట్టు : నలగామరాజు రాయబారి
స్త్రీలు
- నాగమ్మ: నాయకురాలు, నలగామరాజు మహామంత్రిణి
- మాంచాల: బాలచంద్రుని భార్య
- పేరిందేవి : అలరాజు భార్య
జంగిలీ, సేవకులూ సైనికులూ
ఒకటో దృశ్యం
(ఉషస్సు విరిసిపోయి అరుణోదయం అవుతూవున్న సమయం. వీర మేడపిలో బ్రహ్మనాయని కార్యాలోచనా మందిరము. ఒకవైపు నాయకురాలి చిత్రపటము. రెండో ప్రక్క చెన్నకేశవ స్వామి అలంకృతమైన దారు విగ్రహము, సభ్యులకోసం అమర్చిన ప్రత్యేక మృత్తికా వేదికలూ)
బ్రహ్మన్న : (దీర్ఘంగా నిశ్వాసం చేసి సాలోచనతో) కొమ్మన్న బావా! నా మనసిప్పుడు ప్రళయానంతరం పునఃసృష్టికి పూనుకొన్న బ్రహ్మదేవుడి మనస్సులా ఉంది. కట్టటం మొదలు పెట్టిన ఆశాసౌధాలల్లో పోనీ ఒక్కటైనా నిలవ కూడదూ? అయినా, మళ్ళీ మళ్ళీ కొత్తవి ప్రారంభిస్తూనే ఉన్నాను. (నిశ్చయ సూచకంగా) ఇది చిట్టచివర ప్రయత్నం. ఈ బ్రహ్మన్న భావి జీవితం దీనిమీదనే ఆధారపడి ఉంటుంది బావా!
కొమ్మన్న : (సాభిప్రాయంగా) బ్రహ్మన్న భావి జీవితమే కాదు, పలనాటి భావి భాగ్యోదయమంతా దీనిమీదనే.
బ్రహ్మన్న : మన అలరాజు రాయబారంతో అన్నీ తేలిపోవాలి. లేకపోతే ఇక -
(చెన్నకేశవ ఆలయం దిగుడు బావిలో స్నానం చేసి స్వామిదర్శనార్థం వచ్చిన మొదటి భక్తుడు మ్రోగించిన ఘంటికా నినాదం వినిపిస్తుంది)
కొమ్మన్న : అదిగో! చెన్నకేశవాలయ ఘంటిక చెప్పి వేస్తున్నది. సర్వమూ కుదుటబడుతుంది. తప్పదు. (వాతాయనం వైపుకు నడిచి) ఉషఃకాంతులు విరిసిపోయినవి. అలరాజు ప్రయాణ సన్నాహం పూర్తిచేసుకొని బయలుదేరుతుంటాడు.
బ్రహ్మన్న : (మంద మందంగా) సుముహూర్తం సమీపిస్తున్నకొద్దీ హృదయంలో కలత ప్రబలిపోతున్నది. ఆలోచనా వ్యగ్రతలో రాత్రంతా నిద్రపట్టింది కాదు. నిద్ర! ఇంతలో నాకెక్కడి నిద్ర! కళ్ళు కమ్మని నిద్రపోయి ఏడు ఏండ్లకు పైబడ్డది.
ఇమ్మహి వల్లభుండు మనుజేశ్వరుడై పలనాటి సీమర
మ్యమ్ముగ నేలుకొంచు ప్రజలందరు సర్వసుఖాల మున్గి రా
జ్యమ్ము సుభిక్షమై వెలియిబాలిన వేళల జూచినప్పుడే
కమ్మని నిద్రకు గలవు కన్నులు - అట్టి దినమ్ములున్నవా?
మలిదేవరాజు మాచర్ల అర్ధసింహాసనం అధిష్ఠించి 'అన్నా! బ్రహ్మన్నమంత్రీ!' అని పిలుస్తుంటే ఈ అంజలి హర్షాశ్రువులతో నిండే దినాలు ఉన్నవా (రెండు చేతులతో తలనొక్కుకుంటూ, ఉష్, ఎందుకో అప్రయత్నంగా బుద్ధి వినోదం మీదికి పోతున్నది.
(ఒకదానివెంట మరొక కోడికూత వినిపిస్తుంది)
కొమ్మన్న : (వేగంతో) ఎవరురా అక్కడ ?
(ఒక సేవకుడు ప్రవేశించి బ్రహ్మన్న కొమ్మన్నలకు ప్రణామం చేసి నిలబడుతాడు)
ఆ కూసిన కోళ్లలో ఒకటి పుంజు, రెండోది పెట్ట. పిలిపించనా, వినోదం చూద్దురుగాని?
బ్రహ్మన్న : (తిక్తస్మితంతో) ఒకటి పుంజు, రెండోది పెట్ట. పుంజు బ్రహ్మన్న. పెట్ట
నాయకురాలు, నాగమ్మ. చూడవలసినదేముంది? ఇంతవరకూ పెట్టే గెలిచింది. ముందేమి జరుగుబోతుందో ఇప్పుడే నిర్ణయం చేయదలచు కున్నారా? గౌతమ మహర్షిని మోసగించి ధర్మరాజ్యం పోగొట్టింది కుక్కుటము!
బ్రహ్మన్న చేతిలో సమస్త సంపదలతో తులతూగే అర్ధరాజ్యాన్ని పోగొట్టింది కుక్కుటము!!
కోళ్ళ సంగతితో వెనుకటిసంగతులన్నీ జ్ఞప్తికి తెచ్చారు బావా! కుటిల తంత్రజ్ఞురాలు మాంత్రికురాలు, నాయకురాలు మోసగించి ఒప్పించిన కోళ్ళపందానికే ఒప్పుకోక పోతే -
కొమ్మన్న : (అందుకొంటూ) మాచర్ల అర్ధరాజ్య సింహాసనం మీద మలిదేవ మహారాజు కాంతులు ప్రసరిస్తుండేవి. అర్థరాజ్యానికి మంత్రులైనా అనంత మహదాంధ్రరాజ్యాన్ని
స్థాపించేవారు. అయితే, కుక్కుటయుద్ధం -
బ్రహ్మన్న : (నిష్కర్షగా) చూడను. ఒకవేళ ఇప్పుడూ పెట్టే గెలిస్తే పుంజు బ్రహ్మన్నలో
ఊపిరి పోసుకుంటూ ఉన్న ఆశ పుటుక్కుమంటుంది.
కొమ్మన్న : బావా! ప్రతి విషయాన్నీ తామింత బ్రహ్మాండంగా యోచిస్తారని ఈనాడు తెలిసింది. క్షమించండి, వెనుకటి కష్టకాలం స్మృతికి తెచ్చాను. (ముందుకు వచ్చి చేతులు జోడించబోతే) బ్రహ్మన్న : (వారిస్తూ) సకల సేనాపతివి, సరిసాటి వాడివి. క్షమాపణ! (ముక్కుమీద
వేలు వేసుకుంటాడు)
(భిక్షాటనకు బయలుదేరబోతూ ఒక పాములవాడు నాగస్వరం పట్టి వెళ్ళుతుంటాడు. బ్రహ్మన్న రిక్కించి ఆ సంగీతాన్ని వింటూ)
బ్రహ్మన్న : వింటున్నారా?
కొమ్మన్న : పిలిపించమంటారా?
బ్రహ్మన్న : ఈ సమయంలో నా మనస్సు దానిమీదనే లగ్నమౌతున్నది.
కొమ్మన్న : (ఆలోచనలో పడుతాడు)
బ్రహ్మన్న : ఆలస్యమెందుకు? శుభసమయానికి ముందు సర్పదర్శనమని సందేహమా?
కొమ్మన్న : మహామంత్రీ! నా మనస్సును చక్కగా గ్రహించారు.
బ్రహ్మన్న : ఆ అవ్యక్త కలస్వనంలో ఏదో ప్రబోధగీతం ఉన్నది. అంతరాత్మ వినమని ప్రేరేపిస్తున్నది. మీకు ఇష్టం లేకపోతే నేనే -
కొమ్మన్న: (సగౌరవముగా) అంతటి అపచారమా! లేదు లేదు. నేనే పిలిపిస్తాను.
(సేవకుడితో) అబ్బీ! బ్రహ్మన్న దొర పిలుస్తున్నాడని వాణ్ణి (తీసుకోరమ్మని అంగుళీసంజ్ఞ చేస్తాడు)
సేవకుడు : చిత్తము\
(నిష్క్రమిస్తాడు)
కొమ్మన్న : బావా! మీ ఆత్మబలం అందుకో లేనిది.
బ్రహ్మన్న : అదే శ్రేష్ఠమైనది. ఎన్నిటినైనా ఎదుర్కొనే శక్తినిచ్చి నడిపిస్తున్నది.
(సేవకుడు పాములవాడితో ప్రవేశించి తానూ వాడూ ఇద్దరికీ నమస్కరించిన తరువాత ప్రక్కకు తప్పుకుంటాడు. చేతులు జోడించి గడగడ వణికి పోతూ ఉన్న పాములవాడితో)
కొమ్మన్న : (మృదువుగా) అబ్బీ! భయము లేదురా, కూర్చో.
పాములవాడు: (గద్గదకంఠంతో) సి... సి...సి...త్తము
(బూర నేలమీదపెట్టి నెత్తిమీద బుట్టదించి నింపాదిగా మోకాటి తండా వేసి కూర్చున్న తరువాత) బ్రహ్మన్న : అబ్బీ!
కొమ్మన్న : అటు తిరుగు - బ్రహ్మన్న దొర పిలుస్తున్నారు.
పాములవాడు : (అమాయకంగా) ఏంది దొరా! పలనాటి కిట్టయ్య ఆయెనేనా దొరా! ఓ కిట్టయ్య దొరో, దణ్ణము సామో! ఓ బెమ్మయ్య దొరో, దణ్ణము సామో!!
బ్రహ్మన్న : (ప్రతిగా నమస్కరించి) అబ్బీ, పాము నువ్వు చెప్పినట్టు వింటుందా?
పాములవాడు : (చెముడు వల్ల వినపడక పెద్దగొంతుకతో) నాది బురదమట్ట కాదు దొరా!
బ్రహ్మన్న : అయితే మరేమిటి?
పాములవాడు : నాగమదొరా... నాగమ
బ్రహ్మన్న : (సాలోచనుడై) ఉం.... నీ పేరు?
పాములవాడు : (చెవి రిక్కించి) నాగమదొరా... నాగమ
కొమ్మన్న : దొర నీ పేరే మంటున్నారురా!
పాములవాడు : నా పేరా? కాముడు దొరా!
బ్రహ్మన్న : (పామును చూపిస్తూ) ఇది నీకెక్కడ దొరికింది?
పాములవాడు : వనమూలికలకు పోతే ఎత్తిపోతల అడవుల్లో దొరికింది దొరా!
బ్రహ్మన్న : (సాభిప్రాయంగా తల పంకిస్తూ) ఓహో, అయితే దాన్ని కాసేపు ఆడించు.
పాములవాడు : అదే నన్నాడిత్తది దొరా!... సెప్పినట్టిందు.
బ్రహ్మన్న : చెప్పినట్టు కూడా విందూ?
కొమ్మన్న : అది నీ మాట విని ఆడకపోతే ఊళ్లో నీకు ముష్టి ఎవరు పెడతారురా?
పాములవాడు : ఒకొప్పుడు అదే నన్నాడిత్తది. తను ఆడుద్ది. మా ఆట అప్పుడు సూసిన్నోళ్ళు ఊరికే డబ్బు కురిపిత్తరు దొరా!
బ్రహ్మన్న : (మెడలో చిన్న హారం తీసి సేవకుడితో) ఇది వాడికిచ్చి పంపించు. (సేవకుడు ముందుకు వచ్చి హారం కళ్ళ కద్దుకొని వాడికిచ్చి) అబ్బీ, లే. పాములవాడు: (బ్రహ్మానందంతో) దణ్ణం దొరా! (ముమ్మారు బ్రహ్మన్నకూ కొమ్మన్నకూ నమస్కారం చేస్తూ నిష్క్రమిస్తూ ఉండగా)
కొమ్మన్న : అబ్బీ, (పాములవాడు వెనక్కు తిరిగితే)
బాగా ఆడేదినం దొర ముందుకు తీసుకోవచ్చి ఆడించి చూపరా!
పాములవాడు : సిత్తము, సిత్తము దొరా (నిష్క్రమిస్తాడు)
బ్రహ్మన్న : (దీర్ఘనిశ్వాసం చేసి) చెన్నకేశవా! చెన్నకేశవా!! నీ లీలలు అతిమానుషాలు తండ్రీ. అర్థంకావు సామాన్యులకు. కాముడు చెప్పింది అంతా సత్యమే.
కొమ్మన్న : సత్యమేమిటి?
బ్రహ్మన్న : తెలియలేదా?
కొమ్మన్న : (తెలియదన్నట్లు తల త్రిప్పుతాడు)
బ్రహ్మన్న : కాముడు... నలగాముడు! నాగము... నాగాంబ నాయకురాలు... ఎత్తిపోతల అడవుల్లో దొరికిందన్నాడు.
కొమ్మన్న : ఔను. అతగాడు ఆమెను చూచింది కూడా ఆ అడవుల్లోనే.
బ్రహ్మన్న : నా అంతరాత్మ అందుకనే వినమన్నది.
కొమ్మన్న : అదే నన్నాడిత్తదన్నాడు. ఇంకా నాగమ్మ ప్రభావం? నాగమ్మ చేతిలో - మీ బుద్ధిబల పారావారానికి అడుగు ఎక్కడ బావగారూ!
బ్రహ్మన్న: (చేదుగా నవ్వుతూ) అది వట్టి పొరపాటు. నా బుద్ధి బలమా! నాయకురాలి ముందు నేనూ నా బుద్ధిబలమూ ఎంత బావా! మా ఇద్దరికీ హస్తిమశకాంతరము!
కొమ్మన్న : కాదు, కాదు.
బ్రహ్మన్న : ఎంత శక్తి, ఎంత ధైర్యము, ఎంత సాహసము, ఎంత చాకచక్యము!... నాగాంబ వంటి ప్రజ్ఞామూర్తి స్త్రీ జాతిలోనే కాదు, పురుష జాతిలో కూడా పూర్వము పుట్టలేదు, ఇకముందు పుట్టబోదు.
చాణక్య మేధావిని సృష్టించి ఛాందసుడన్న అసంతృప్తితో సుకుమారమైన స్త్రీ మూర్తిలో అతని ప్రజ్ఞ ఎలా తాండవిస్తుందో చూచి ఆనందించదలచుకున్న బ్రహ్మ తన పేరు పెట్టుకున్నానని ఆమెను ఈ బ్రహ్మన్నమీద ప్రయోగిస్తున్నాడు. నాగమ్మ! నాగమ్మ శక్తి లోకోత్తరమైంది. అన్నదమ్ముల మధ్య అంతఃకలహాలు పెంచి అడవుల పాలు చేసింది. ఇంత బ్రహ్మన్ననూ కోడిపందెములో తిమ్మన్నను చేసింది. మలి దేవాదుల అర్దరాజ్యాన్ని మంట కలిపింది! మహాసామ్రాజ్యానికి ఏకైక మంత్రిత్వం వహించింది.
కొమ్మన్న : దైవ మనుకూలించలేదు గాని బ్రహ్మన్న మాత్రము సామాన్యుడా? కాలం కలిసి వస్తే ఆయన మేధా రథచక్రాలక్రింద ఎంతమంది నాయకురాళ్ళు నలిగిపోయేవాళ్ళో! బ్రహ్మన్న ప్రజ్ఞ! అధర్మానికి లొంగడు గాని - జాతి మత వైషమ్యాలకు స్వస్తి చెప్పి పలనాటిలో పులి మేకలను, రెంటినీ ఒక్క పడియ నీరు తాగేటట్టు చేసింది బ్రహ్మన్న! పలనాటి రక్తనాళ పటిమను యావదాంధ్ర లోకానికి పునః ప్రదర్శించింది బ్రహ్మన్న! ప్రజా చైతన్యాన్ని జాగృతం చేసి పాషండ ప్రభుత్వాన్ని అహింసా తత్వంతో ఎదుర్కొనే శక్తి నిచ్చింది బ్రహ్మన్న!!
బ్రహ్మన్న: ఏమైతే ఏం ప్రయోజనం? నా ప్రయత్నాలన్నీ అడవిలో కాచిన వెన్నెలలైపోతున్నవి. ఒకవంక ప్రజల అష్టకష్టాలు మరొకవంక మలిదేవుల మహాపదలు. ఎదుర్కోవలసిన శత్రువో మేధాపరిపూర్ణ మృగేంద్రము. సాధనము అహింస! అహింస!!
కొమ్మన్న : వీటన్నిటినీ మించిన మీ మేధాబలు మున్నదని మా నమ్మకము.
బ్రహ్మన్న : మీ ఒక్కరి నమ్మకమేనా? లేక -
కొమ్మన్న : నా నమ్మకమే దేశమంతటి నమ్మకము.
బ్రహ్మన్న : నన్ను దేశం అంతగా నమ్మిందా? ఎప్పుడూ నా శక్తిమీద నాకంతటి నమ్మకం కలుగలేదు.
కొమ్మన్న : ఇది నా ముందు నాటకమా? లేక మహామంత్రుల వారి బేలతనమా!
(భైరవ గదతో, కాలిగండ పెండేరంతో, పలకలు తిరిగిన కండరాలతో కన్నమదాసు ప్రవేశించి)
కన్నమ : ఏమిటి? నా తండ్రి బ్రహ్మన్నకే బేలతనమా?
ఎన్నడు సోకనట్టి పలు కీచెవి బడ్డది వ్రయ్యదేల బ్ర
హ్మన్నకె కల్గె బేలతనమన్నది - సత్యమె? కాదు, కాదు ధ
ర్మోన్నతమూర్తి అతనికి యున్నదె బేలతనమ్ము! పుత్రు డీ
కన్నమదాసు మేన నుడు కారని నెత్తుటి కాల్వ లుండగన్ -
(బ్రహ్మన్నతో) తండ్రీ! నమస్కారము (కొమ్మన్నతో) మామా! దీవించు.
కొమ్మన్న : (కన్నమను చేరి బుజం మీద చరుస్తూ) సంతోషము, కన్నమా! సంతోషము. తండ్రి బ్రహ్మన్నకు బేలతనమన్నమాట. సహించ లేక ఎంత ఆటోపం చేశావోయ్! (బ్రహ్మన్నతో) మహామంత్రీ! దేశం నిన్ను ఎలా గౌరవించి మీ అడుగు జాడల్లో నడవటానికి సంసిద్ధమైందో గమనించారా? ఈగను వాలనివ్వదు మీమీద.
కన్నమ : (వినయ పూర్వకంగా) క్షమించు మామా! ఎవరో తండ్రికి అపచారం చేస్తున్నా రనుకున్నాను.
కొమ్మన్న : తండ్రీ కన్నమా! కూర్చో...
(కొమ్మన్న తన వేదిక మీద కూర్చున్న తరువాత కన్నమదాసు తానూ వేదిక మీద కూర్చుంటాడు)
బ్రహ్మన్న: (శాంత గంభీర కంఠంతో) కన్నమా!
కన్నమ : (గౌరవ పురస్సరంగా) తండ్రీ!
బ్రహ్మన్న : నీవు అభ్యసిస్తూ వున్న అహింసా మార్గం ఇంత వరకూ వచ్చిందా? ఇలా ఆ దేవతను ఉపాసించటం ఎంతో కష్టం.
కన్నమ : (సిగ్గుతో తల వంచుకొని) సమస్త విషయాలల్లో దాన్ని పాటించ గలను. కాని, మీమీద అపచార విషయంలో నాకు ఒళ్ళు తెలియదు తండ్రీ!
బ్రహ్మన్న : (నింపాదిగా మంచిది, మంచిది.
కొమ్మన్న : (వాతాయనం వైపు చూచి) అలరాజు రథం వచ్చేస్తున్నది., అదుగో కారుబొల్లడి డెక్కల చప్పుడు. మహారాజుకు మళ్ళా పిలుపు వెళ్ళాలా?
బ్రహ్మన్న : ఆయన సమయానికి వస్తామన్నారు.
(రథ మాగిన ధ్వని. కొమ్మన్న బ్రహ్మన్న లిద్దరూ లేచి ద్వారా దేశం సమీపిస్తారు. రథం దిగి ద్వారం దగ్గరికి వచ్చిన అలరాజు బ్రహ్మన్న కొమ్మన్నలు ఎదురువస్తే)
అలరాజు : మామా! ఈ ఆచారమేమిటి? మహామంత్రులు మీరు నాకు ఎదురు నడవటమా! తండ్రీ! క్షంతవ్యుణ్ణి. బ్రహ్మన్న : కాదు నాయనా! నీవు నిత్యమున్న అలరాజువు కావు. మహా సామ్రాజ్య భారాన్ని నెత్తిమీది కెత్తుకొని మోయబోతున్న రాయబారివి తండ్రి ఐనా ఎదురు నడవ వలసిందే.
ఎదురుకు నేగుదెంచి యిటు లేటికి గౌరవమిచ్చుటంచునీ
మదికి కుమార! బాధ యొక మాత్రము కల్గెనె రాచకార్యమున్
పదిల మొనర్చి నీపయిని పంపుచు నుంటిమి రాయబారివౌ
దెదురుగ వచ్చినా మెఱిగియే - అలరాజువె నేడు అల్లుడా!
(బ్రహ్మన్న అలరాజు చెయ్యి అందుకొని తీసుకోవచ్చి కూర్చోబెడతాడు. మలిదేవరాజు
గండ భేరుండం బోయీల ఓహోం, బీహోం కేకలు వినిపిస్తవి)
అలరాజు : మహారాజులవారు మలిదేవులూ వస్తున్నారు. అందరమూ ఆయనను -
(బోయీల కేకలు ఆగిపోతవి. ద్వారం దగ్గరకు మలిదేవుడు వచ్చి బ్రహ్మన్నకు నమస్కారం చేసి, కొమ్మన్నకు మందస్మితం ఇచ్చి, సస్నేహంగా అలరాజు చేయి పట్టుకొని వస్తాడు. ఎవరెవరి స్థానాలను వారు ఆక్రమించుకుంటారు).
బ్రహ్మన్న : ముహూర్తం సమీపిస్తున్నది. ఉపక్రమిద్దామా?
(అందరు అంగీకారాన్ని తెలియపరుస్తారు)
బ్రహ్మన్న : ప్రభూ మలిదేవా! ప్రారంభించండి.
మలి దేవుడు : మహామంత్రులు మీరే ఉపక్రమించండి. చివరకు నాకు తోచినవి రెండు ముక్కలు చెప్పుకుంటాను.
బ్రహ్మన్న : నాయనా అలరాజూ! వేరే క్రొత్తగా చెప్పవలసినది ఏమీ లేదు. శుభ సమాలోచనమంతా రాత్రే విన్నావు కదా? అయినా-
నీకు నలగామరాజులుంగారు ఎంత ఆప్తులో మలిదేవరాజులూ అంత ఆప్తులే.
అలరాజు : (ఛలోక్తిగా) మలిదేవరాజులుంగారి కంటే నలగాములు కొంత ఎక్కువ కదూ, పిల్లనిచ్చినవాడు. ఆమెను ఇంట్లో పెట్టుకొని నన్ను వెళ్ళగొట్టినవాడు.
బ్రహ్మన్న : అదుగో దుర్మార్గంలో చరిస్తున్నాడని ముందే తీర్మానించు కోవద్దు. మొదటే అలా అయితే సాధువచనాలతో సంధి పొసగించలేవు తండ్రీ! సమయాన్ని అవగతం చేసుకొని ప్రవర్తించటం మనకు అత్యవసరము. అలరాజు : ఛలోక్తికన్నాను. అత్యవసరము.
బ్రహ్మన్న : (మందమందంగా) సౌమ్యంగానే సమయం వారు చెల్లించారు. అర్ధరాజ్యం పంచిఇమ్మని చెప్పు. అన్నదమ్ముల్లో అంతః కలహాలు దేశానికీ ప్రజకూ అపాయమని చెప్పు. నలగామ రాజులుంగారి మీద మలిదేవ రాజు గారికి ఉండుకున్న ప్రేమను ఉద్ఘాటించు. నా రాజభక్తిని విశదీకరించు.
సంధి సానుకూల పడనట్లు తోచిందా - ఈ మధ్య సభలో నాగమ్మ నలగామ రాజులుంగారి ముందే నరసింహ రాజులుంగారిని విశేషంగా పొగడిందట. అది అతణ్ణి ఉలికించనో, మనను మోసగించనో కనిపెట్టి వీలునుబట్టి భేదోపాయము ప్రయోగించు. నాయకురాలన్న ప్రతి ముక్కా జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పు. అదనంగా పుచ్చుకొన్న ఆరునెలల పుల్లరీ నీవెంట తీసుకొని రా. గోవులను విడిపించమను.
ఇంతగ చెప్పనేమిటికి? ఈవొక వేత్తవు రాజనీతి, వృ
త్తాంతము సర్వమున్ దెలియు, ధర్మమునం దనురక్తి నీకు, అ
త్యంత కృపాభరమ్ము హృదయమ్ములపై గల ఈ ప్రజాళిపై
స్వాంతము చల్లనై చెలగ సర్వము దిద్దుము బాంధవంబునన్.
సమర్థుడివి. విశేషించి చెప్పవలసిన పని లేదు. చెన్నకేశవ కృపవల్ల నీ పని
నెరవేరుతుంది. (దీవిస్తాడు).
అలరాజు : (కొమ్మన్న ముఖంగా తిరిగి) తండ్రీ!
కొమ్మన్న : సర్వసమర్ధులు మహామంత్రులు చెప్పిన తరువాత నేను చెప్పవలసినది ఏమీ ఉండదు. అయితే మన వైషమ్యాలను మనస్సులో పెట్టుకొని మాత్రం తొందర పడవద్దు. వాళ్ల దౌర్గత్యాలను ఖండించ వలసి వస్తే వెనుదీయనూ వద్దు. వీరకొమ్మన్న కొడుకువనిపించుకో. మంచనశర్మ చెప్పాడు. నీ జన్మనక్షత్రం పుష్యమిట - ఇవాళ రోహిణి. తారాబల చంద్రబలాలు కుదిరినవట. కోడలు పేరిందేవికి నా ఆశీస్సులు.
అలరాజు : (మలిదేవుడి ముఖంగా తిరిగి) మహారాజా!
మలిదేవుడు : అలరాజూ! నాయకురాలు సంధి పొసగనిస్తుందా? పురుష ప్రయత్నం చేయక తప్పదు. ఒంటరిగా నలగాముడితో అర్ధరాజ్యం సమానంగా అనుభవిస్తూ రాజ్యభోగాలల్లో తేలిపోతూ ఉండవలసిన మీ తమ్ములు అడవుల్లో అష్టకష్టాలూ పడుతున్నారను. అయినా మీకు సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నారని చెప్పు. ప్రేమ పూర్వకంగా కౌగిలించుకొని నరసింహుని యోగక్షేమాలు తెలుసుకొనిరా.
మరో విషయం! నాయకురాలు ఘాతుకురాలు! అల్లుడివి. ఆహార విహారాల విషయములో అశ్రద్ధ చెయ్యవద్దు.
అరుగుచు నుంటి వీ వటకు, అల్లుడ వైనను, కూర్మిలేని ఆ
ధరణిపతుల్ సభాసదులు ధర్మము తప్పెడు దుష్టబుద్ధు లీ
వెరుగుదు వేగతిన్ పలుక నే మగునో యట, కాని నీ ఋణం
బెరుగను ఎన్ని జన్మలకు నేనియు తీర్తుమొ లేదొ మిత్రమా!
(నమస్కరిస్తాడు)
అలరాజు : (వారిస్తూ) ఇక బయలుదేరనా? (ఆసనం మీదినుంచి లేవబోతుంటే)
కన్నమ : (హస్త సంజ్ఞతో ఆపుతూ) అలరాజా! నావి రెండు మాటలు.
అలరాజు : (బ్రహ్మన్నతో) మామా! ఇతడెవరు?
కొమ్మన్న : నాయనా, వీరకన్నమ. పేరు వినలేదా? బ్రహ్మన్న మామగారి ధర్మపుత్రుడు.
అలరాజు : (లేచి కన్నమ దగ్గిరికి వచ్చి) అయితే మా బావగారన్న మాట. ఏవీ ఆ రెండు మాటలు బావా!
కన్నమ : అలరాజా, సంధి కుదిరిన పక్షంలో నా మాటలతో ప్రయోజనం లేదు.
ఏడు సంవత్సరాల గడువు దాటిపోయింది. పుల్లరి మీకివ్వము అని మాచర్ల సీమ ప్రజలు నలగాములుంగారికి తెలియపరచుకుంటే నాగమ్మ గుర్రపు దళాన్ని పంపించి ప్రజను తొక్కించిందట. ఆ సీమ అట్టుడికి పోతున్నది. ఇప్పటికైనా ఆమె బ్రహ్మన్న తండ్రి పాదం పట్టుకొని క్షమాభిక్ష వేడుకోకపోతే ప్రజల హృదయ గోళంలో జ్వలించే విప్లవ ప్రళయాగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లి ప్రభుత్వ వనాలను దహించి వేయక మానవని చెప్పు.
ఇవి బ్రహ్మన్న ధర్మపుత్రుడు కడజాతి కన్నమదాసు చెప్పిన మాటలని చెప్పు.
ధర్మస్థాపన కాని పక్షమున నిద్రం చెంద దీ ప్రాణి హృ
న్మర్మస్థానములన్ శయించి ఆట సింహస్వామినై నిల్తు, మీ
దుర్మార్గం బిక చెల్లదంచు, పెడ బుద్ధుల్ మానుకొమ్మంచు మా
చర్మాజీవి హసించి చెప్పెనని రాజా బేలుకావింపుమా!
అలరాజు : నీ మాటలే చెప్పక తప్పదేమో! సెలవా?
(అందరూ హస్తసంజ్ఞ చేస్తారు. 'మీరంతా నిలవండి' అంటూ అలరాజు ద్వారం వైపు నడుస్తుంటాడు).
బ్రహ్మన్న : ద్వారసీమ వరకూ అనుసరించటం మా విధి నాయనా.
అలరాజు : (కొంత దూరం వెళ్ళి తరువాత) ఇక మీరంతా నిలవండి.
(సంధ్యా వందనం చేసుకుంటూ అర్ఘ్య ప్రదానం చేస్తూ ఉన్న బ్రాహ్మణవరులు అరుణ మంత్రం)
“భద్రం కర్ణేభి శ్శృణుయామ దేవాః
భద్రం పశ్యేమా క్షభి ర్యజత్రాః
స్థిరై రంగైస్తుష్టు వాగ్ంస స్తనూభిః
వ్యశేమహి దేవహితం యదాయుః"
అని వినిపిస్తుంది.
బ్రహ్మన్న : నాయనా! బ్రాహ్మణ వాక్కులు 'భద్ర'మని పలుకుతున్నవి. రథము ఎక్కు తండ్రీ!
(అలరాజు వెళ్ళి రథం ఎక్కుతాడు. రథనేమి శబ్దమూ, కారు బొల్లడి డెక్కల చప్పుడూ).
రెండో దృశ్యం
(గురిజాలలో నాగమ్మ కార్యాలోచనా మందిరము. ఒక వేదిక మీద బ్రహ్మనాయుని
చిత్రపటమూ, మరొక వేదిక మీద ఎడమ వయిపు ప్రళయతాండవం చేస్తూ వున్న
నటరాజస్వామి విగ్రహమూ మోకరిల్లి భక్తి భావముతో తదేక నిష్ఠతో అంజలి పట్టి)
నాగమ్మ : (ఉచ్చ కంఠంతో)
జయ మృత్యుంజయ దేవ మహేశా!
ప్రమథాధిప భూతేశ పరేశా!!
త్రియంబక, త్రిపురాంతక,
అంధకరిపు, గంగాధర - జయ...
జయ పినాకి జయ కృశాను
హే మహేశ, వ్యోమకేశ -
జయ మృత్యుంజయ దేవ మహేశా!
ప్రమథాధిప భూతేశ పరేశా!!
(నెమ్మదిగా లేచి ఠీవితో బ్రహ్మన్న చిత్రపటాన్ని పరికించి వికటంగా నవ్వుతూ)
బ్రహ్మన్నా! బ్రహ్మన్నా!! నీకీ నాయకురాలితోనా పగ. కాలకూట విషంతో నా చెర్లాటము. ఏనాడు నీవూ, ఈ నలగామరాజూ నా తండ్రిని ఉరికంబాని కెక్కించారో ఆనాడే కంకణం కట్టుకున్నాను.
(ముంజేతి కంకణం వైపు జూస్తుంది).
గొల్లగుంపులను పోగుచేసి దేశాన్ని కొల్లగొట్టి అరాజకం చేద్దామను కున్నాను. కాని మృత్యుంజయ కృప నామీద ప్రసరించింది. నలగాముడి కంటబడ్డాను. ఇక ఆట ఆడించంది మానను.
అయినా! బ్రహ్మన్నా, నీవూ అసామాన్యుడివి. అరణ్యవాస సమయంలో హత్య చేయించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. తప్పించుకున్నావు. మలిదేవులు అర్ధ రాజ్యాధికారం చేత పట్టావు. ప్రజల్లో విప్లవ బీజాలు మొలకలెత్తించావు. చాపకూడు, వైష్ణవ మత బోధతో వివిధ కులాలనూ ఆకర్షించావు. ఒకవేళ జయం నీకే కలిగితే కలుగవచ్చునేమో! - తుది దాకా వేధించంది మాత్రం వదలను. నిన్నూ నీ రాజకులాన్నీ రక్తపు నదులల్లో తేలాడించందే ఊరుకోను. నా తండ్రికి రక్త తర్పణం చెయ్యంది నా హృదయం శాంతించదు.
(నటరాజ విగ్రహాన్ని ఉద్దేశించి).
మహాదేవా! నాకు నీవే దిక్కు తండ్రీ! నా ఆశయాలను సఫలీ కృతాలు చెయ్యి తండ్రీ!
ఆశల్ పెల్లు కలంచు నాయెద మహేశా! రక్త దాహంబటం.
చాశన్ చాచెడు నాల్క తండ్రి, హృదయాహ్లాదంబు రాబోదు భూ
మీశున్ చేత నటింప చేసినను నాకీ కోర్కె చల్లార దే
కాశన్ గట్టి రణోర్వి వ్రాలి నను దీక్షాక్లుప్తి కావింపకన్ -
(దీర్ఘంగా ఒక వేదికమీద ఉన్న ఉత్త ఒరనూ, రెండు కత్తులనూ పరిశీలిస్తూ ఉంటుంది.
నరసింహరాజు ప్రవేశిస్తాడు)
నరసింహరాజు : మహా మంత్రిణీ! నమస్కారము.
నాగమ్మ : యువరాజా! ఆ ఆసన మలంకరించు.
(నరసింహుడు ఒక వేదిక మీద కూర్చుంటాడు)
నరసింహ : ఏమిటో దీర్ఘాలోచన చేస్తున్నారు.
నాగమ్మ : ఏమీలేదు, నాకొక సందేహం కలిగింది. తీరటం లేదు.
(ఉత్త ఒరనూ రెండు కత్తులనూ తీసుకోవచ్చి అతనికిచ్చి)
రెంటినీ ఒక్కమాటుగా ఉంచండి.
నరసింహ : (ఒరను అటూ ఇటూ త్రిప్పి పరిశీలించి) నాకర్థం కావటం లేదు.
నాగమ్మ : ఉంచలేరా!
నరసింహ : ఎలా సంభవము?
నాగమ్మ : నాకూ అదే సందేహం. అయితే ఏం చెయ్యాలి? నరసింహ : ఒక కత్తినే ఉంచాలి. ఏ కత్తిని -
నాగమ్మ : ఈ కత్తినే (ఒక దానిని చూపిస్తుంది) ఈ ఒర రాజ్యం. ఈ కత్తి నరసింహ రాజులుంగారు. ఆ కత్తి నలగామరాజులుంగారు.
నరసింహ : (సంతోషంతో) ధన్యుణ్ణి. మహామంత్రిణీ! మీకు సర్వదా కృతజ్ఞుణ్ణి.
తెలిసెను కొంత కొంతగ మదింగల మీ కృప ఎల్లవేళలన్
తలుపుడు చిత్తమందు నను, దాసుడు మీకెపుడెట్టి కార్యముల్
కలిగిన తీర్పగాగలడు, గర్వమెదింకను మిమ్ము కొల్చుటల్
కలుగుటె యెంచ భాగ్యమది, కాడు కృతఘ్నుడు వీడు మీయెడన్
(రెండు ఆబోతుల రంకెలూ జనకోలాహలమూ వినిపిస్తుంటవి)
నాగమ్మ : ఏమిటా రంకెలూ, కోలాహలమూ?
నరసింహ : (లేచి వాతాయనం వైపు నడిచి చూస్తూ)
రెండు ఆబోతులు హోరాహోరీగా కొట్లాడుతున్నవి.
నాగమ్మ : ఎవ్వరూ ఆపటానికి ప్రయత్నించటం లేదా?
నరసింహ : బలవంతుడు మధ్యకు -
నాగమ్మ : వాడు అయిపోయినాడా? లేదా?
(ఆబోతులు పెద్ద పెట్టుగా రంకెలు వేస్తుంటవి. ఒక వ్యక్తి మరణ వేదనతో 'హా' అని ధ్వని చేస్తాడు.)
నరసింహ : మీరు సెలవిచ్చినట్లే జరిగింది.
నాగమ్మ : జరక్క తప్పదు. జరగ వలసినదీ అంతే. ఇది నా మాట కాదు, మహాదేవుడి మాట.
నరసింహ : ఏమని?
నాగమ్మ : బలం గల రెండు పక్షాలు వివాదానికి దిగినప్పుడు అనవసరంగా జోక్యం కలిగించుకున్న వాళ్ళకు ప్రాణహరణము తప్పదని. నరసింహ : (ఆశ్చర్యంతో) మరి అలరాజు సంధికని వచ్చాడు (క్షణకాలం ఆలోచించి) అతనికీ అంతేనా?
అలబ్రహ్మన్నకు నన్నకున్ కలిగె గాదా దొడ్డవాదంబు ఈ
యిలకై, సంధిపొసంగ వచ్చానని తానే పూని అల్లుండు మా
అలరాజీయెడ కేగుదెంచె, యెదలో నాకొక్క సందేహమౌ
అలరాజైనను తప్పిదమొ, సెలవీయంగోరెదన్ మంత్రిణీ !
నాగమ్మ : అల్లుడని మోమాటమా?
నరసింహ : అవసరమైతే ఆ పని (తానే చేస్తానన్నట్లు హస్తసంజ్ఞ)
నాగమ్మ : అత్యవసరము.
నరసింహ : ఎందువల్ల?
నాగమ్మ : యువరాజ నరసింహరాజులుంగారు మహారాజులుంగారయ్యేటందుకు.
నరసింహ : అది ఇందు మూలంగా ఎలా సంభవం?
నాగమ్మ : అలరాజు అయిపోతేగాని బ్రహ్మన్న యుద్ధానికి దిగడు. యుద్ధం సంభవిస్తేనేగాని నలగామరాజులుంగారు నలిగిపోడు. నలగామ రాజులుంగారు నలిగిపోతేగాని నరసింహ రాజులుంగారు మహారాజులుంగారు కారు. నాగమ్మ ఈ కంకణం అప్పటికి గాని విప్పటానికి వీల్లేదు. సమయాన్ని బట్టి జాగ్రత్తగా కార్యం సానుకూలం చెయ్యాలి.
నరసింహ : స్వవిషయంలో అశ్రద్ధ వహిస్తానా? అది అసంభవము.
(నలగామ రాజూ అలరాజూ మాట్లాడుకుంటూ ప్రవేశిస్తారు. నాగమ్మ, నరసింహరాజూ సగౌరవంగా లేచి నిలబడుతారు. మహారాజు ఆసన మలంకరించిన తరువాత అందరూ వారి వారి స్థానాల్లో కూర్చుంటారు)
నలగామరాజు : అది అసంభవము. అయినా మహామంత్రిణి అందుకు అంగీకరించాలి. వారి ఇష్టాన్ని అతిక్రమించడానికి వీలు లేదు.
నాగమ్మ : (దగ్గిరకు వస్తున్న రాజుకు ఎదురు పోయి వెనక్కు నడుస్తూ) ప్రభూ! ఈ సేవకురాలి మీద ఇంత మన్నన చూపిస్తున్నందుకు కృతజ్ఞురాలు. నలగామ : నరసింహా!
నరసింహ : (శిరస్సు వంచి) ప్రభూ!
నలగామ : (సాభిప్రాయంగా) అలరాజు వచ్చాడు.
నరసింహ : ఏమండీ అల్లుడుగారూ జ్ఞప్తికున్నామా! మా మీద పూర్తిగా శీతకన్ను వేశారు.
అలరాజు : (నాయకురాలిని చూస్తూ) మావి ఎప్పుడూ చల్లటి కళ్ళే కాబట్టి.
నలగామ : బ్రహ్మన్న మహామంత్రులవారు కుశలమా?
అలరాజు : ప్రభువు వారిని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటారు.
నాగమ్మ : ఇన్ని ఆపదలు ప్రభువు వారికి తెచ్చిపెట్టవలసి ఉంటే స్మరించక ఎలా తప్పుతుంది?
నరసింహ : తమ్ములు మలిదేవులుంగారూ, వారి తమ్ములుంగార్లు కుశలమా?
అలరాజు : (నమస్కరిస్తూ) తమకుగా మీకు నన్ను నమస్కారం చేసి యోగ క్షేమాలు విచారించమన్నారు.
నరసింహ : (వికటంగా) ఆఁ బ్రహ్మన్న పెంచే ఆ పులి పిల్లలకు ఇంత వినయం ఎక్కడినుండి వచ్చిందోయ్ రాజూ!
అలరాజు : (నెమ్మదిగా ప్రశాంత చిత్తంతో) బ్రహ్మన్న మంత్రికి పులి మేకలనూ రెంటినీ ఒక పడియనీరు త్రాగించే ప్రజ్ఞ ఉంది కదూ, మరి అహింసే ఆయనకు పంచప్రాణాలు.
నాగమ్మ : శక్తి లేనప్పుడు అది చాలా మంచి సాధనము.
అలరాజు : (దెబ్బ కొడుతున్నట్లు) శక్తి ఉన్నదీ లేనిదీ పరీక్ష వస్తేనే గాని తెలియదు గదా!
నరసింహ : ఎవరి విషయంలోనైనా అంతే. ఎవరి హృదయాలల్లో ఏముందీ బయట పడదు.
అలరాజు : స్వతస్సిద్ధంగా అన్ని హృదయాలూ మంచివే, కాని అందులో అప్పుడప్పుడూ మహానాగాలు కొన్ని విషం కక్కి కలిచేస్తుంటవి. నలగామ : అలరాజా! వచ్చిన పని ఇక బయట పెట్టడం మంచిది.
అలరాజు : తమకంతా ఇది వరకే నివేదించాను. తమరే ప్రారంభించటం సమంజసం.
నలగామ : (సిద్ధపడి) మహామంత్రిణీ! అలరాజు ఇప్పుడు అల్లుడు కాదు, రాయబారి.
నాగమ్మ : సంతోషము ప్రభూ, తమ అల్లుడుగారు ఇంతవారయినారు. తమ మీదికే -
నలగామ: వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకివ్వమని -
నరసింహ : (అదిరిపడి) అర్ధరాజ్యమా! అడుగైనా ఇవ్వటానికి వీలు లేదు.
నాగమ్మ : మొదట్లో మోసం చేసి అర్ధరాజ్యం పుచ్చుకున్నారు. కోడి పందెంలో మోసానికి ప్రతిమోసం చేసి పుచ్చుకున్నాము. ఆ మాటకు వస్తే అర్ధరాజ్యానికి వాళ్ళకు అధికారమే -
నలగామ : మా తండ్రి కడుపున పుట్టడమే అధికారము.
నాగమ్మ : ఈ రాజ్యం అలుగు రాజులుంగారికి ఎలా సంక్రమించిందో కొంచెం ఆలోచించండి.
నలగామ: మా తల్లి మైలమమహాదేవులుంగారికి మా మాతామహులు అరణంగా ఇచ్చారు.
నాగమ్మ : అయితే వాళ్ళకు అధికారం లేదన్నమాటలో తప్పు లేదుగదా!
నలగామ : రాజ్యమంతా తల్లి గారి మూలంగా మా తండ్రి గారికి సంక్రమించింది. తండ్రి ఆస్తిని కొడుకులు సమానంగా పంచుకోవటం రాజనీతి కాదేమోగాని అసమంజసం కాదు గదా!
నాగమ్మ : అవును. మంచిదే.
అలరాజు : సంతోషము - సంతోషము.
నాగమ్మ : అయితే నరసింహరాజులుంగారికి కూడా మూడో వంతు పంచి పెట్టవలసి వస్తుంది.
నరసింహ : ప్రభువులవారు అలా చేయని అధర్మపరులా మరి.
నలగామ : (సందేహంలో పడ్డట్లు) అలరాజూ! దీనికి ఆ బ్రహ్మన్న ఏం సమాధానం చెపుతాడు? అలరాజు : బ్రహ్మన్నమంత్రుల వారికి సమాధానం లేకపోలేదు.
నాగమ్మ : (కటుగ్గా) ఏమిటది?
అలరాజు : (ప్రశాంతముగా) మలిదేవాదులకు అర్ధరాజ్యం బ్రహ్మన్న మంత్రులవారు అడగటంలో వారు అలుగురాజులుంగారి కుమాళ్ళని కాదు. మీరు పుట్టకపూర్వమే అలుగు రాజులుంగారు బాదన్నను పెంచుకొని ఇచ్చిన అర్ధరాజ్యం ఆయన స్వర్గానికి వెళ్ళేటప్పుడు మమకారం చేత మలిదేవాదులకు ఇచ్చి పోవటంవల్ల.
నలగామ : ఆ బాదన్నగారికి నేను సజీవుడనై ఉండగా అటువంటి అధికారం ఉండదు.
నాగమ్మ : అవును ప్రభూ! ఈ సమస్త దేశానికీ రాజ్యాధికారం మీదే. ఈనాటికైనా మీరు గ్రహించారు నా మాట.
అలరాజు : ఆ పక్షంలో ఈ సమస్త రాజ్యం మీదా మీకు ఏ విధమైన అధికారమూ లేదని బ్రహ్మన్న మంత్రులవారి ఆక్షేపణ.
నాగమ్మ : (నిష్కర్షగా) ఎట్లా?
అలరాజు : మైలమమహా దేవులుంగారు వెలనాటి వారి ఆడబడుచు. వారికి ఈ రాజ్యం అరణంగా వచ్చింది. వెలనాటివారు కళ్యాణీ చాళుక్య వీర సోమేశ్వరుల వారికి సామంతులన్న సంగతి మరిచిపోవద్దు. బ్రహ్మన్న మంత్రులవారు సోమేశ్వరులవారి కుమార్తెను మలిదేవుల కిప్పించి వివాహం చేయించారు. ఆ సమయంలో ఈ సమస్త రాజ్యమూ చక్రవర్తులే కుమార్తెకు అరణమిచ్చారు. అయినా బ్రహ్మన్నమహామంత్రుల వారు రాజ్యాన్నంతా మలిదేవులవారి కిమ్మని మిమ్మల్నికోరటం లేదు. అర్ధరాజ్యాన్ని ఇస్తే అంతటితోటే వారిని తృప్తి పరుస్తామంటున్నారు. వారి మాటలకు మలిదేవరాజులుంగారూ ఎగర్తించరు.
నాగమ్మ : (చల్లగా) ఒకవేళ ఇవ్వకపోతే?
అలరాజు : ఏం జరుగుతుందో మీరే నిర్ణయించుకోండి.
నరసింహ : యుద్దంతప్ప జరిగేది ఏముంది? ఆ క్రింద భూమీ, పైన ఆకాశమూను.
నలగామ: అర్ధరాజ్య మివ్వట మనేది పొసగదు.
అలరాజు : అంత అక్రమానికే వస్తే అవహం తప్పదన్న మాటే. ఒకమాట. అధికారం లేని రాజ్యాన్ని అంతా కబళిద్దామనుకోవటం దురాశ కదూ! నాగమ్మ : న్యాయమూర్తి ప్రభువువారిదే దురాశా! ఇది ఎన్నడూ వినని మాట.
నలగామ : నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి! రాజనీతి విశారదుణ్ణి! చాళుక్య వీర సోమేశ్వరుడి సామంతుడివని అవమానం చేసిన తరువాత అర్ధరాజ్యమివ్వట మనేదే అసంభవము. కూతురికి అతడు ఈ రాజ్యాన్ని అంతా అరణంగా ఇచ్చినా నేను వదిలిపెట్టను. యుద్ధరంగంలో అతడే ఎదురు నిల్చినా నిలిచి నిలుపుకుంటాను.
నాగమ్మ : (కాకఎక్కించే కంఠంతో) ప్రభూ! మీలో క్షాత్రం చచ్చిపోయిందని వాళ్ళ అభిప్రాయం.
అలరాజు : అయితే కక్ష ఈ విధంగా పెంచుకోవలసిందేనా?
నాగమ్మ : ప్రభువు వారికి ఇష్టమైతే అన్నదమ్ములు అయిదుగురికీ అయిదు ఊళ్ళు ఇస్తే బాగుంటుంది.
అలరాజు : బ్రహ్మన్న మంత్రులవారు నన్నిక్కడికి తిరిపెమెత్తటానికి పంపలేదు.
నరసింహ : అయిదు ఊళ్ళుమటుకెందుకు? అడుగైనా.......
అలరాజు : ఇవ్వరా? అంతేనా?
నలగామ : ఆ మాటకు వస్తే అంతే.
అలరాజు : ఇక మీ కక్షలు కదనరంగం తీర్చవలసిందేనా?
నాగమ్మ : ప్రభూ! ఈ బెదిరింపులు ఇంకా ఎంతకాలం సాగిస్తారు తెగవేసి చెప్పక?
నలగామ : రాజూ! వాళ్ళకు అడుగైనా ఇవ్వము. ఇష్టం వచ్చింది చేసుకొమ్మను.
అలరాజు : పోనియ్యండి. అదనంగా మీరు తీసుకున్న ఆరు నెలల పుల్లరైనా ఇస్తారా?
నాగమ్మ : ఇది అడగటంలో బ్రహ్మన్న ఎత్తు ఊహించారా ప్రభూ! దీనితో అధికారం ఉన్నదీ లేనిదీ బయట పడుతుందని పైగా ఆహవరంగాన్ని నడిపించటానికి కొంతగా అది అక్కరకు వస్తుందని కూడాను.
నలగామ : 'పుల్లరి' ఇవ్వటానికి వీల్లేదు.
అలరాజు : పోనీ మా గోవులు మాకు ఇచ్చేస్తారా? నరసింహ : ఆ గోవులు మీ వెందు కౌతవి? కాజేసుకోపోయిన చంద్రాయుధం అమ్మి కొన్నారు. అది మా తండ్రిగారిది. అందువల్ల ఆవులు మావే.
అలరాజు : (నలగామరాజు వైపు చూస్తూ) అంతేనా?
నలగామ: (పెడమొగంగా) ఔను.
అలరాజు : (ఆసనం మీది నుంచి లేచి) ఇక శాంతి వహించలేను. మీ అక్రమం మించి పోతున్నది. నేనే మీమీద యుద్ధం ప్రకటిస్తున్నాను. మామా! నీ రాజ్యం ఇక నిలవదు. నీవీ నాగమ్మ చేతిలో ఇంకా ఎన్నాళ్ళు ఆటబొమ్మవైపోతావు? ఎన్నెన్ని ఘోరకృత్యాలు చేస్తావు? పుల్లరి మీ కివ్వమని మాచర్ల సీమ ప్రజలు తెలియపరచుకుంటే నాగమ్మ గుర్రపు దళాన్ని పంపించి ప్రజను తొక్కించిందట! మాచర్ల సీమ అట్టుడికి పోతున్నది. ఆమె ఇప్పటికైనా బ్రహ్మన్న మంత్రులవారి పాదం పట్టుకొని క్షమాభిక్ష వేడుకోకపోతే విప్లవాగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లి ప్రభుత్వ వనాలను దహించి వేయక మానవు. ఇవి నా మాటలు కావు. బ్రహ్మన్నమంత్రులవారి ధర్మ పుత్రుడు కడజాతి కన్నమ దాసు చెప్పమని చెప్పిన మాటలు. మీ దురాగతాలను దేశం ఇక భరించలేదు.
నాగమ్మ : (కోపంతో) ప్రభూ! ఇది దౌష్ట్యం.
అలరాజు : దౌష్ట్యం నాదా? దుష్టంగా ప్రజాపాలన చేయించే నీది దౌష్ట్యం చేసే రాజుది దౌష్ట్యం.
నలగామ: (కొద్ది కోపంతో రూక్షంగా చూస్తూ) అలరాజూ! మితిమీరవద్దు.
అలరాజు : మితిమీరక తప్పదు. కడుపు కలచేసే భయంకర కృత్యాలు తలపుకు వస్తుంటే మితిమీరక ఉండటం ఎట్లా?
నలగామ : అయితే నీ ఇష్టం వచ్చినట్లు పేలు. యుద్ధానికే నేను సిద్ధ పడ్డాడని వారితో చెప్పు.
బెదరెడు వాడె వీడు వెరపింపగ బాలుని సంధి పేరిటన్
పదరగ పంపినారు నిను భ్రాతలె బంధువులే తలంప నా
మదిగల ప్రేమ తీరినది మాటలతో పనిలేదు చెప్పు మా
కదనమె నిశ్చయమ్ము - నలగామ నృపాలుడు జోదుకాదుకో
(అతివేగంగా నిష్క్రమిస్తాడు)
జన్మదేశాన్ని ఎందుకు నీ కడుపున పెట్టుకొని పాడు చేస్తావు. అన్ని విధాల అందె వేసినదనిపించుకున్న పలనాటి సీమకు నీవు అమ్మశక్తివై అవతరించావు. నిన్ను హత మారిస్తే కాని దేశం బాగుపడదు.
నరసింహ : (నవ్వుతూ) అలరాజూ! కొంచెం శాంతించవోయ్.
నాగమ్మ : ఉఁ నేను కదూ దేశాన్ని పాడు చేస్తున్నది. వర్ణాశ్రమాలకు స్వస్తి చెప్పించి వర్ణ సంకరం చేస్తున్న బ్రహ్మన్న దేశ క్షేమం కోరేవాడూ, నేను మాత్రం దేశ విద్రోహినా?
అలరాజు : అందులో రవ్వంత అబద్దం లేదు. నీవే దేశాభిమానివైతే 'హరీహరీ!' మేము దేశభక్తులమే కాదు. ముమ్మాటికీ నీవు దేశాభిమానివి కాదు. దేశద్రోహివి! దేశ విద్రోహివి! నీ బ్రతుకు దేశానికి అరిష్టదాయకము. నీ కాలినీడలు ఈ పుణ్యభూమికి కళంకం. నిన్ను కాల్చి మసి చేసి రక్తంలో కలుపుకొని త్రాగేటంత వరకూ నిద్ర పొయ్యే వ్యక్తి బ్రహ్మన్న మంత్రులవారి బలంలో ఒక్కడూ లేదు. ఆనాడు గాని మా కడుపులో చితి మంటలు చల్లారవు. నీకు మృత్యువు తప్పదు.
(కోపంతో వేగంగా నిష్క్రమించబోతే)
నరసింహ : (అడ్డుపడి నవ్వుతూ) అల్లుడూ! మామీద ఇంత కోపమైతే ఎలాగోయ్! ఇవాళ మా ఇంట విందు చేస్తేగాని పోనివ్వను.
అలరాజు : (వికట హాసంతో) మామా! మీరు ఎంత కైనా సమర్థులు. ఏ విషమైనా కలిపి ఇచ్చి ప్రాణాలు తియ్యవచ్చు.
నరసింహ : (నవ్వుతూ) శాంతించవోయ్ అల్లుడూ! కాస్త చిన్నా పెద్దను కనిపెట్టి మాట్లాడుతుండు, మరి - మేము బంధువులమని మరిచిపోకు. వ్యవహారం వ్యవహారమే. బంధుత్వం బంధుత్వమే.
(చేతిలో చెయ్యి పుచ్చుకొని నడిపించుకుంటూ నిష్క్రమిస్తాడు)
నాగమ్మ : (నటరాజస్వామి విగ్రహంతో) తండ్రీ! సమస్తమూ సక్రమంగానే సాగింది. సంధి నేను పడగొట్టించాననే అనుమానం లేకుండా నలగాముడి చేతనే ఆ పని చేయించాను. నరసింహుడు నా మాట మరిచిపోడు. అయితే అలరాజు అయిపోవటం వల్ల గొప్పలోటే. మేడ పైకి పోయి ఈ వార్తలన్నీ చెప్పి యుద్ధానికి సిద్ధపడేటట్లు (యోచించి) ఊఁ (చిటికెలో) మంచి ఊహ తోచింది. కొండు భట్టారకులచేత బ్రహ్మన్నకు లేఖ పంపించటం ఉత్తమము. దానితో అన్ని సంగతులూ -
నీలోతుల్ పరికింప బుద్ధి జలధీ! నీరౌను నా గుండెనా
లోలో సంతసమౌ నటించు భయమున్ క్రూరాతి ఘోరమ్ము నీ
లోలోర్మిధ్వని సర్వలోకములు కల్లోలంబులై నిల్వగన్
నాలో కోర్కె జనించె ఘోషలిడు మన్నా? ముక్త కంఠంబులన్!
మూడో దృశ్యం
(గురిజాల నాగమ్మ కార్యాలోచనా మందిరము. మధ్యాహ్న సమయము)
నాగమ్మ : (ఏకాంతముగా) మహాదేవా! అలరాజు హత్య అవసరమా? అత్యవసరము. శవాన్ని కంటిముందు చూస్తేగాని శత్రువులు తామే యుద్ధాన్ని ప్రకటించరు. నరసింహుడి చేత ఆ పని చేయించటంలో అభిప్రాయమో! సక్రమంగానే ఉంది. అన్నదమ్ములిద్దరి మధ్యా అంతః కలహాలు ఏర్పడితేనేగాని నాగాంబ ప్రాపకం వృద్ధి పొందదు. రాజ్యాన్ని ఎర చూపించాను. కాబట్టి నరసింహుడే ముందుగా ఈ విషయం నలగాముడికి చెప్పడు. ఈ సమయానికి నరసింహుడు ఆ పని పూర్తిచేసి ఉంటాడు.
పేరిందేవి : (విరబోసుకొన్న తలకట్టుతో ఆవేశంగా ప్రవేశించి) ఏ పని? పాతకి, హంతకి!
నాగమ్మ : (ప్రశాంతంగా) అమ్మాయీ! పేరిందేవి ఈ ఆక్రోశం ఎవరిమీద? ఎక్కడికో బయలుదేరి దారితప్పి ఇటు వచ్చావా?
పేరిందేవి : నరహంతకి నాగమ్మ ఇంటికే బయలుదేరి దారి తప్పానా?
నాగమ్మ : (కొంచెం కోపంతో) జాగ్రత్తగా మాట్లాడు. రాజకుమార్తెనని ఇష్టం వచ్చినట్లు - మాట్లాడుతున్నది మహామంత్రిణితో సుమా!
పేరిందేవి : (అసహనంతో) మహామంత్రిణితో కాదు మహమ్మారితో.
నాగమ్మ : ఛీ! నోరుముయ్యి. గెంటించేస్తాను.
పేరిందేవి : చితి మంటలలో చెర్లాట మాడబోతున్న పేరిందేవి నా గెంటింపులకు -
నాగమ్మ : (లాలనగా) అమ్మాయీ! సంగతేమిటో చెప్పకుండా నన్నిట్లా దూషించటం నీకు న్యాయమేనా?
పేరిందేవి : నా భర్తను హత్య చేయించింది నీవు కాదా?
నాగమ్మ : (ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ) నేనే! పేరిందేవి : (వెక్కిరింపుగా) నేనే!
జంగిలి : (వేగంగా ప్రవేశించి) అమ్మా!
(పేరిందేవిని చూచి సంగతేమిటో బయట పెట్టటానికి జంకుతాడు)
నాగమ్మ : చెప్పు - నీకేమీ భయం లేదు.
జంగిలి : (బెదురు చూపులతో) అలరాజులుంగారిని...
నాగమ్మ : ఉఁ. త్వరగా (కత్తిలాగి డొక్కకు మోటిస్తుంది)
పేరిందేవి : (మొలలో పిడి కత్తిలాగి) ఉఁ త్వరగా
నలగామ : (ఒరలో నుంచి లాగిన కత్తితో ప్రవేశించి) ఉఁ త్వరగా, అలరాజును హత్య చేసింది -
నాగమ్మ : (కన్నుగీటి) చెప్పు.
నలగామ : ఉఁ (డొక్కలో గుచ్చుతాడు)
జంగిలి : (నత్తిగా) న... న... న... న...
నలగామ : నాగమ్మా?
జంగిలి : (కాదన్నట్లు తల త్రిప్పుతాడు)
నాగమ్మ : (దీనంగా) ప్రభూ! నామీదనా మీ అనుమానం?
నలగామ : క్షమించు. మహామంత్రిణీ! (జంగిలితో) ఇక నిమిషం ఆలశ్యం చేస్తే చంపేస్తాను.
జంగిలి : న...న... నరసింగరాజులుంగారు.
నలగామ : (చేతిలో కత్తి ఆశ్చర్యపడుతూ జారవిడిచి) ఇదేమిటి? మహామంత్రిణీ! (పేరిందేవి చేతిలో కత్తి లాగుకొని) అమ్మా! వీడిని బలిచేసి నెత్తురు చూపిస్తాను. చూచి ఆనందిద్దువుగాని ఇక్కడనే ఉండు తల్లీ!
(వేగంగా బయలుదేరుతాడు)
నాగమ్మ : మహారాజా! కొంచెం శాంతించండి! ఇది సమయం కాదు!
పేరిందేవి : ఈ నాగమ్మ చెయ్యి లేకపోతే ఇలా అవదు తండ్రీ. బాబయ్య స్వయంగానాగమ్మ : (పితూరిగా) ప్రభూ!
పేరిందేవి : ఈ కాల సర్పాన్ని కడుపులో పెట్టుకున్నారు. విషాగ్నుల క్రక్కి దహించిగాని ఇది బయట పడదు.
నాగమ్మ : లేనిపోని అనుమానాలతో ప్రభూ! నన్నిలా రాకుమార్తె ఇందాకటినుంచీ తిట్టి పోస్తున్నది. నేను ఈ రాజ్య భారాన్ని మోస్తున్నది అపనిందలకేనా? నా మనసు విసిగిపోతున్నది. ఈ మంత్రి పదవి నాకు వద్దు.
(కత్తీ, మంత్రిత్వ చిహ్నాన్ని క్రింద పెట్టబోతుంది)
నలగామ : (ఆశ్చర్యంతో, జంకుతో) మహామంత్రిణీ!
పేరిందేవి : ఈ అపరశక్తి మిమ్మల్ని ఇలాగే బెదిరించి ఆడిస్తున్నది. చివరకు ఈ శక్తి జాతరలో చింబోతు కాబోకండి.
నాగమ్మ : ప్రభూ ఇది భరించరాని అవమానం. నాకు సెలవు దయ చేయించండి. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. (కత్తీ, చిహ్నమూ అందిస్తూ) ఇంతటి అవమానమా!
పేరిందేవి : నిత్యమూ హత్యలు చేయించే అదయ హృదయకు నీకూ అవమానమా?
నాగమ్మ : ప్రభూ! మీ అలుసే దీనికి కారణం. ఎదుట పెట్టుకొని కూతురి చేత తిట్టించకపోతే క్రూరదండన మరేదైనా విధించకపోయినారా దీన్ని శిక్షించటానికి?
పేరిందేవి : (పట్టరాని ఉద్వేగంతో) అమ్మ గయ్యాళీ! నీవు ఎంతకైనా సాహసివే తంత్రిణీ!
నలగామ : (కోపంతో) అమ్మాయీ!
పేరిందేవి : నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండించి కాకులకూ, గద్దలకూ పారేసి వినోదం చూచి సంతోషించినా నీవు చేయించిన పనికి శిక్ష చాలదే పిశాచీ!
నాగమ్మ : ప్రభూ! నన్ను ఎందుకిట్లా బాధపెడతారు? (కత్తీ, చిహ్నము మరొకమారు అందిస్తూ) అందుకోకపోతే -
నలగామ : (కోపంతో) అమ్మాయీ! ఇక మీరినచో సహించను.
పేరిందేవి : జరగవలసిందేమో ఇదివరకే జరిగింది. ఈ అపరశక్తి ఇక చేసేదేముంది?
నలగామ : మహా మంత్రిణీ! దానికేమీ తెలియదు. మొరుకుతనం. క్షమించండి. పేరిందేవి : ఏమిటీ! నన్ను క్షమించటమా! పరుల కార్యార్ధం ప్రాణత్యాగం చేసిన పతితో చితిశయ్య మీద సరస సల్లాపాలాడుకోబోతున్న నన్ను ఈ అపవిత్రురాలు క్షమించటమా!
నాగమ్మ : వింటున్నారా ప్రభూ!
నలగామ : అమ్మాయీ! నీ పెడసరపు మాటలు ఇక కట్టిపెట్టు. నీకేమన్నా వెర్రి ఎత్తిందా?
పేరిందేవి : బుర్రలు బ్రద్దలయ్యే దినం వస్తే ఎవరికి వెర్రి ఎత్తిందీ తెలుస్తుంది. మీ రాజ్యపాలనాకాంక్ష మిమ్మల్ని పశువును చేస్తున్నది.
నాగమ్మ : ప్రభూ! ఇక సహించలేను. నన్ను అవమానించినా లెక్కలేదు. మీ అవమానాన్ని నా మనస్సు భరించలేదు. ఇదిగో అందుకోండి. లేదా క్రిందపెట్టి వెళ్ళిపోతాను.
నలగామ : (దీనంగా) మహామంత్రిణీ! మీ పదవిని పరిత్యజించటానికి సమయం ఇదేనా? మీ నలగాముణ్ణి నట్టేటిలో ముంచిపోతారా?
నాగమ్మ : ప్రభూ! నా కాళ్ళకు మాటలతో పాశాలు తగిలించవద్దు.
నలగామ : పాశాలా - పాదాక్రాంతుడై మీ రాజు వేడుకొంటున్నాడు.
పేరిందేవి : అబ్బ! మీరు ఇంకా ఈ నాగమ్మ నల్ల మసి పూసి ఆడించి నట్లల్లా ఆడండి. నిజం నిలకడ మీద గానీ తేలదు. నా భర్త పవిత్ర మూర్తి. నేను పవిత్రను. మా ఇద్దరికీ స్వర్గంలో స్థానమున్నది. కాని, ఈ నడమంత్రపు నాగమ్మ మీకోసం రౌరవాది నరకాలల్లో రాజ్య భవనాలు కట్టిస్తున్నది. మరిచిపోవద్దు.
(వేగంగా నిష్క్రమిస్తుంది)
నలగామ : అమ్మాయి! (వెంట వెళ్లబోతుంటే)
నాగమ్మ : (ఆగమన్నట్లుగా) ప్రభూ!
నలగామ : (వెనకకు వచ్చి) మహాదేవా! మహాదేవా!! ఈ స్థితిగతులు నాకేమీ అర్థం కావటం లేదు తండ్రీ! మహామంత్రిణీ!
నాగమ్మ : నాకే సంగతీ తేల్చకుండా వెళ్ళిపోతారేం?
నలగామ : ఏమి తేల్చమంటారు? నాగమ్మ : నా రాజభక్తినే మీరు శంకించిన తరువాత ఈ మంత్రిపదవి నాకెందుకు?
నలగామ : నా బుద్ధిగడ్డి తిన్నది. నన్ను నట్టేటిలో ముంచవద్దు. ఇవి చేతులు కావు. మీ ఇష్టప్రకారం అడుగు దాటను.
(వంగి చేతులు పట్టుకోబోతాడు)
నాగమ్మ : (సవినయంగా) అమ్మమ్మ! అంత అపచారమా? పాపం పేరిందేవి పిచ్చిపిల్ల. ఆమె మాటలు పట్టించుకోను. మిమ్మల్ని మాత్రం అనలేదు. మీ పిల్ల నా పిల్ల కాదూ?
నలగామ : (చిరునవ్వుతో) మహామంత్రిణీ! సంతోషము. అయితే, నరసింహుణ్ణి చంపి ప్రతీకారం చెయ్యవద్దనటంలో... విశేషాభిప్రాయమేమిటో అర్థం -
నాగమ్మ : అయితే మీ శత్రువులను సంపూర్ణంగా జయించ తలచుకోలేదా?
నలగామ : ఏమిటి?
నాగమ్మ : (మంత్రాలోచనగా) ప్రధాన సైన్యాలను నడిపించేది అతడు.
నలగామ : అవును. అయితే?
నాగమ్మ : అతని మీద కసి తీర్చుకోవటానికి ఇది సమయంకాదు. శత్రు సంహారం పూర్తి అయిన తరువాత.
నలగామ : (అర్థమైనట్లు తల త్రిప్పుతాడు)
నాగమ్మ : 'అల్లుణ్ణి చంపావా' అని ఎన్నడూ సంభాషణలోనైనా హెచ్చరించవద్దు. ఏదో అవకాశం చూచుకొని అభినందిస్తే పొంగిపోయి మీరు చెప్పినట్లల్లా నడుచుకుంటాడు. (చేయి జాపుతుంది)
(నలగామరాజు కొద్దిసేపు ఆలోచించి అంగీకార సూచకంగా చేతిలో చేయి వేస్తాడు)
నాగమ్మ : కోపాన్ని ప్రస్తుతం మరిచిపోలేరా?
నలగామ : ప్రయత్నం విశేషం అనవసరం.
నాగమ్మ : (దైన్యం నటిస్తూ) ప్రభూ! నా రాజభక్తిని ఎంత శంకించారు?
నలగామ : మహామంత్రిణీ! నా బుద్ధి గడ్డి తిన్నదని మళ్ళీ ఒకమాటు అనిపించ తలచుకున్నారా? ఇక మీరది మరిచిపోవాలి. నాగమ్మ : మీ మనస్సు నేను ఎరుగనిదా? తీవ్రద్వేగంలో ఆ మాట తొందరమీద వచ్చేసింది. పాపం! పేరిందేవి పుట్టెడు దుఃఖంలో ఉంది. మీరు వెళ్ళి కొంచెం ఓదార్చండి. నేనూ వెంటనే బయలుదేరి వస్తాను.
(నలగామరాజు లేచి నాయకురాలు దారి చూపుతుంటే నిష్క్రమిస్తాడు. రాజు వెళ్ళిపోయే టంత వరకూ చూచి విజయ గర్వంతో తిరిగి వచ్చి)
నాగమ్మ : తంత్రం బాగానే పారింది. నలగాముడు నరసింహుడితో మాట్లాడడు. జంగిలే నరసింహుడితో జరిగినదంతా చెప్పివేస్తే? అతడు పట్టణానికి రాకముందే జంగిలిని దేవికి కానుకిస్తే?
తల్లీ - పేరిందేవీ! రాజ్యంతంత్రాలలో నీబోటి అమాయకులకూ, అనవసరమైన కష్టాలు వస్తుంటవి. అయ్యో నీకెంత ఆపద వచ్చింది.
కందును నీ శరీరము సుగాత్రిన వాతపరేఖ సోక నీ
అందము చంద మిట్టులతివా, చితి మంటలకయ్యె నోసి నా
డెందము కుందు నీకిది ఘటిల్లినదే గురు ఘోర మృత్యు సం
స్పందిత మామకీన మతి సర్పిత కోప విషాగ్ను లార్పగన్!
మహాదేవా! మహాదేవా!! ఇది నా తప్పిదము
కాదుగదా తండ్రీ! ఇందుకు నీవే సాక్షివి ప్రభూ!
(మహాదేవ విగ్రహం ముందు మోకరిల్లుతుంది)
నాలుగో దృశ్యం
(మేడపిలో బ్రహ్మనాయని కార్యాలోచనా మందిరం ఉదయవేళ సభాసదులందరూ వారివారిస్థానాలలో కూర్చొని అలరాజు రాకకు ఎదురు చూస్తూ ఉంటారు)
బ్రహ్మన్న : (ఆలోచనా నిమగ్నుడై నేలమీద చూస్తుంటాడు).
మలిదేవుడు : అన్నా! బ్రహ్మన్న మంత్రీ! అలరాజు ఇంకా రాలేదు.
కొమ్మన్న : చెప్పిన గడువు దాటిపోయింది. దారిలో ఏమన్నా ఆలశ్యం-
కన్నమ్మ : నాగమ్మ సామాన్యురాలు కాదట. అపాయమేమన్నా-
మలిదేవుడు : సంభవించి ఉంటుందనా? (బ్రహ్మన్నను చూస్తూ (అన్నా!) మాటాడరు?
కొమ్మన్న : మహామంత్రీ! మీరు మాటాడకపోతే మనస్సు పరిపరి విధాల పోతున్నది.
బ్రహ్మన్న : (తాపీగా) వేదఘోషతో అలరాజు బయలుదేరాడని ఆనందపడ్డాము.
కన్నమ : అయితే మీ అనుమానం?
బ్రహ్మన్న : అనుమానమో! అపోహో!!
మలిదేవుడు : మీ ఊహ అపోహ ఎలా అవుతుంది?
కొమ్మన్న : మీ అనుమానమేమిటితో త్వరగా -
బ్రహ్మన్న : ఏమీలేదు. అలరాజు బయలుదేరేటప్పుడు అరుణమంత్రం వినిపించింది. ఏమని?
కొమ్మన్న : (ఆతురతతో) ఔను. 'భద్రమ్ కర్ణేభిః' అని ప్రారంభం.
బ్రహ్మన్న : (మలిదేవుడితో) భద్రమంటే?
మలిదేవుడు : శుభమని కదా అన్నా!
బ్రహ్మన్న : లౌకికార్థం అది కాదేమో! కొమ్మన్న : జాగ్రత్త అని కదా తండ్రీ!
బ్రహ్మన్న : అదే నా అనుమానం.
కొమ్మన్న : (ఆవేగంతో) అశుభము వినబోతున్నామా?
బ్రహ్మన్న : తొందరెందుకు?
(అలరాజు రాయబార వార్తను వినటానికి కార్యాలోచనా మందిరము చుట్టూ మూగిన జనసమూహం చేసే కోలాహం వినిపిస్తుంటుంది)
మలిదేవుడు : (కన్నమ వైపు చూచి) ఏమిటా కలకలం?
కన్నమ : కార్యాలోచనా మందిరం చుట్టూ కట్టకడపటి మాటలు వినటానికి జనం మూగి ఉన్నారు ప్రభూ!
(“తప్పుకో' 'తప్పుకో' అని కేకలతో సేవకుని ప్రవేశం. సభా నమస్కారం చేసి పక్కకు తొలిగి)
సేవకుడు : గురిజాలనుంచి ఎవరో రాయబారిట ప్రభూ!
బ్రహ్మన్న : ప్రవేశపెట్టు (సేవకుడు నిష్క్రమిస్తాడు)
బ్రహ్మన్న : (సాభిప్రాయంగా) అలరాజు రాలేదు. ఎవరో రాయబారి!
మలిదేవుడు : అల్లుడు కదూ, వెళ్ళింది అత్తవారింటికి విందు మందులు పూర్తి చేసుకొని వెనక వస్తాడేమో!
బ్రహ్మన్న : (మందస్మితం చేస్తాడు)
(సేవకుడు దారి చూపిస్తుంటే కొండుభట్టు ప్రవేశిస్తాడు. వెనక ఇద్దరు సేవకులు బరువైన వెదురుపేళ్ళ బుట్ట నెత్తిన పెట్టుకొని వచ్చి సభ ముందు దించి సభా మర్యాద ననుసరించి పక్కకు తొలిగి నిలబడతారు)
కొండుభట్టు : (ప్రవేశిస్తూ) రాజాధిరాజ, రాయవేశ్యాభుజంగ, గండర గండాంక, ధైర్య నిర్జితసుమేరు శ్రీశ్రీ మలిదేవ మహారాజులవారికి కొండుభట్టు శతాధిక నతులు, ధిషణా వినిర్జిత చండప్రచండ చాణక్యులవారికి బ్రహ్మన్న మహామంత్రులవారికి నమస్కారాలు.
బ్రహ్మన్న : (చేదుగా నవ్వి) కొండుభట్టూ! ప్రజ్ఞావంతుడివి. ప్రణామాలతోనే పరిహాసం ప్రారంభించావు. మలిదేవుడు : రాజ్యభ్రష్టుని రాజాధిరాజు, గండర గండాంకుడు అని సంబోధించటం పరిహాసం కాక మరేమిటి?
బ్రహ్మన్న : (మందంగా శిరః కంపనం చేస్తూ) తప్పు నీది కాదు. నాగాంబ నీతివిశారద. అదిగో ఆసనమలంకరించు.
కొండుభట్టు : (నమ్రభావంతో కూర్చుంటాడు).
మలిదేవుడు : మా అన్నలు నలగామ నరసింహులు కుశలమా?
బ్రహ్మన్న : మహారాజులుంగారు నాగాంబను సగౌరవంగా చూస్తున్నారా?
కొమ్మన్న : అలరాజు అత్తవారింటికి క్షేమంగా చేరాడా?
కన్నమ : నా మాటలు చెప్పాడా?
కొండుభట్టు : మా ప్రభువుల వారికి క్షేమం. వారిమీద పరమేశ్వర కృపాకటాక్షం ప్రసరిస్తూ ఉన్నది. మహామంత్రిణి నాగాంబవారి మీద మహారాజులుంగారి మన్నన దిన దిన ప్రవర్ధమాన మౌతున్నది. అలరాజులుంగారు క్షేమంగా అత్తవారింటికి చేరారు. కన్నమా నీ మాటలు వీర పురుషోచితంగా విప్పి నొక్కి చెప్పాడు.
కన్నమ : (ఉద్వేగంతో) చెప్పక తప్పింది కాదా?
కొండుభట్టు : (బ్రహ్మన్నతో) ఈ ఫలకం మీది శ్రీముఖం చిత్తగించండి.
కొమ్మన్న : (ఆతురతతో అందుకొని) మహామంత్రీ!
(అనుజ్ఞకోసం వేచి ఉంటాడు)
బ్రహ్మన్న : ఆలస్యమెందుకు? కానివ్వండి బావా?
కొమ్మన్న : (ఫలక మందుకొని సభ నుద్దేశించి) సర్వలోకాశ్రయ, సమస్త భువనాశ్రయ, మహారాజాధిరాజ, సమస్త సామంత మణిగణ కోటీర పాటలీకృత పదాంభోజ శ్రీశ్రీ మలిదేవ మహారాజుల వారి సన్నిధికి తమ పాద పద్మారాధకుడు అనుంగు నలగామ నరాధముడు వ్రాయించుకున్న విన్నపం.
బ్రహ్మన్న : (పట్టరాని ఉద్వేగంతో) ఏదో ప్రళయ వార్త వినబోతున్నాము. చెన్నకేశవా! చెన్న కేశవా!!
మలిదేవుడు : అవమానం! అవమానం!! కన్నమ : (కోపంతో కళ్ళెర్ర చేసి) ఇంతకంటే అవమానమా?
బ్రహ్మన్న : (ప్రశాంత గంభీరంగా) శాంతించండి. చదవండి బావా!
కొమ్మన్న : (లేఖ చూస్తూ) తమ ఆజ్ఞానుసారంగా ఆరు నెలల పుల్లరీ ఈ సేవకుడు భక్తిపూర్వకంగా పంపుకుంటున్నాడు.
బ్రహ్మన్న : (ఉద్ఘాటిస్తూ) 'సేవకుడు' 'భక్తి పూర్వకంగా - (సోద్వేగంగా కొమ్మన్నతో) కానివ్వండి.
కొమ్మన్న : (లేఖనుంచి) అర్ధరాజ్య విషయంతో తమ ఆదేశం కోసం ఈ సేవకాధముడు నిరీక్షిస్తున్నాడు. నిద్రాసమయ సమయాంతర వినిర్మల భవదీయ పాదపం కేరుహారాధనోత్సుక మత్తబంభరము - నలగామ నరపతి
(నిట్టూర్పు విడుస్తాడు)
బ్రహ్మన్న : ఇక సందేహం తీరిపోయింది.
(బ్రహ్మన్న చూపు వెదురు వేళ్ళ పెట్టెమీద నిలుస్తుంది. అందరూ అటు చూస్తారు)
కన్నమా! (తెరవమన్నట్లు హస్త సంజ్ఞ)
కన్నమ : (ముందుకు వచ్చి వణికిపోయే చేతులతో మూత పైకెత్తి వెంటనే వదలివేసి)
ఘోరము! ఘోరము తండ్రీ, అలరాజు శవం!
కొమ్మన్న : (పేటికను సమీపించి) నాయనా! నా ఆశలన్నీ మంట కలిపావా?
మలిదేవుడు : (నమస్కరిస్తూ) అలరాజూ, నీకు నమస్కారం. నీ ఋణం పది జన్మలెత్తినా తీర్చుకోలేను.
బ్రహ్మన్న : ప్రభుసేవకూ, దేశసేవకూ నీ దేహాన్ని అర్పించావు అలరాజూ ధన్యుడవు.
కన్నమ : (క్రోధోద్వేగంతో) ప్రతీకారం చెయ్యలేని మన బ్రతుకులెందుకు? ఎన్నివేల శత్రు ప్రాణాలను అలరాజుకు రక్తతర్పణం చేస్తే ఈ కోపం చల్లారుతుంది. ఎక్కడో మటుమాయం చెయ్యవలచిన చిచ్చును మహావాయువై మేల్కొల్పుతున్నది నాగమ్మ, హంతకి.
మలిదేవుడు : కన్నమా! నాగమ్మనని ప్రయోజన మేమున్నది?
తారణ భూములందు పరదర్పము సర్వము త్రావిగాని రా
నేరని క్షాత్రవంశమున నిర్మలకీర్తి హరింప బుట్టె నీ
భీరువు రాచకార్యముల పేడిగతిన్ యొక ఆడుదాని దు
ర్వార విషాక్త హస్తమున వర్తిలి నాట్యమొనర్ప పూనెడిన్
కొమ్మన : (తెప్పరిల్లి వాలుతూ శవపేటిక దగ్గరకు వచ్చి)
అలరాజూ! నీ తల్లి పోయిన దుఃఖం తలపుకు వచ్చినప్పుడల్లా ధైర్యం చెప్పి కాపాడుకో వచ్చావు. నీ చేతి మీదుగా దాటి పోదామనుకున్నాను. ఇక నా బ్రతుకు ఎవరికోసం తండ్రీ! (కంట తడి బెడతాడు)
కన్నమ్మ : (కొమ్మన్న దగ్గరకు చేరి) మామా! నీ కన్నీరు చూడలేను. ఈ కసి పట్టలేను అనుజ్ఞ! మామా! అనుజ్ఞ!!
బ్రహ్మన్న : కన్నమా! శాంతించు - కొండుభట్టూ!
ఇంతేనా సంధివచనాలు. రాయబారికి రాక్షసమైన మరణదండన. ఈ పాపకృత్యానికి పూనుకున్నదెవరు?
కొండుభట్టు : నరసింగరాజులవారు తామని చెప్పమన్నారు.
మలిదేవుడు : నరసింగడు అంత గర్విపోతైనాడా?
కన్నమ : (వక్షస్థలం విరిచి) తండ్రీ! యుద్ధమిక తప్పదు.
బ్రహ్మన్న : (సాలోచనుడై) యుద్దము తప్పదా? అహింస లోకంలో ఇంత అడుగంటి పోయిందా? నా జీవితకాలంలోనే నేనే హింసాకాండకు పూనుకోవలసి వచ్చిందా? (తల పంకించి) యుద్ధం తప్పనట్టే వున్నది. పరిస్థితులు ఎన్నడో చేయి జారిపోయినవి.
రసములలోన నుత్తమము రాజని చెప్పగ జెల్లు నా కృపా
రసము జగాన ఇంకినది రక్తవిదాహము పెల్లు రేగెనే!
విసమిడినట్టి వానికిని విజ్ఞత ప్రాణము లీయనేర్పెనా
యసమగురుండు, బుద్ధుడు, మహాత్ముని బోధలు మాసిపోయెనే!
కొమ్మన్న : పెద్దవాడనైనాను. నాకు ఏదారీ తెన్నూ తెలియటం లేదు.
మలిదేవుడు : నరసింగడి తల తరగటం నిశ్చయించుకుంటే అన్ని దారులూ బయట
పడతవి.
పగయడ గించుటెంతయు శుభంబని యాపితి నింతదాకమి
మ్మగణిత యుద్ధవీరుల, మహాద్భుత విక్రమ శౌర్యుసారులన్
పగతురు చీరికిన్ గొనరు, భ్రాంతి వహించిరి, పాపబుద్ధులై
తగవు తలంప కీగతి నధర్మము చేసిరి - సంధి యొప్పునే
బ్రహ్మన్న : (ఏదో ఆలోచన చేసి కాదన్నట్లు తల త్రిప్పుతూ) బ్రహ్మన్న హృదయ
కుహరంలో చిర నిద్రపోతూ ఉన్న శార్దూలాన్ని మేల్కొల్పి కాటు చవి చూడదలచుకున్నారా
మీరు? ఈ కొమ్మన్న కుపితారుణ నేత్ర రుచుల ముందు కుమ్మరపురుగులు
కాతలచుచున్నారా మంచిది. (కన్నమ వైపుగా తిరిగి) రణగండ్ల యుద్ధం తరువాత
అస్త్ర సన్యాసం చేశాను. మళ్లీ కత్తి పట్టక తప్పదా?
కన్నమ : తండ్రీ! ఎంత మాట!
నీవై ఖడ్గము తాల్పగా వలెనె తండ్రీ! శత్రుపక్షంబులో
నీవాల్లభ్యము నోపగా గలుగు నువ్నీ లెవ్వ రున్నారు నా
పై విశ్వాసము నుంచి పంపుడట కస్మద్భాహు దర్పోద్ధతిన్
ఆ వీరావళి మస్తకంబులతొ మీకై క్రీడకావింపనే -
కొమ్మన్న : కన్నమా! నీవు నిజంగా అంతకు తగినవాడివి. నా గుండె మంటలను
అనేక గుండె మంటలతో చల్లార్చగల వీరుడివి నీవొక్కడివే నాయనా! ఏకైక పుత్రుడు.
రూపసి. రాజ్యతంత్రజ్ఞుడు ముద్దుబిడ్డ, అలరాజు. అబ్బా! ఎన్నాళ్లు ఎంత యత్నంమీద
మరిచిపోతే మరపునకు వస్తాడు, నా తండ్రి. దారుణ మృత్యువు. హృదయంలో ప్రచండ
ప్రతీకార జంఝామారుత రోదనం భరింప శక్యమా? కన్నమా!
కన్నమ : (ఉచ్చ కంఠంతో) మామా!
కొమ్మన్న : నురుమాడి అరివీర సస్యాన్ని అస్తిరాసులు తూరుపార పట్టవోయ్ తండ్రీ! వీరాధివీరుడవై, సకల సేనాపతివై, శత్రువుల పునుకల దండలతో ప్రేతపతికి కానుక లర్పించు. ఈ కసి అప్పటికైనా చల్లారుతుందేమో!
(సకల సేనాపతిత్వ చిహ్నమైన కరవాలాన్ని అందిస్తూ) ఈ కరవాలం ఇక నీది. కదన రంగాలను నడిపించవలసింది నీవు.
కన్నమ : (కత్తిని అందుకోటానికి చేయి జాపుతూ అంగీకారం కోసం ఎదురుచూస్తూ) తండ్రీ! మహారాజా! బ్రహ్మన్న : తప్పనిసరి అందుకో నాయనా!
మలిదేవుడు : సంతోషము కన్నమా!
కన్నమ : (చేతులు ముందుకు జాపి ఇవ్వమని కోరుతూ) మామా!
కొమ్మన్న : (సగౌరవంగా ఖడ్గాన్ని కన్నమకు ప్రసాదిస్తాడు)
కన్నమ : (వీరముష్టితో అందుకొని)
ఓ కరవాలమా! బహుళ యుద్ధములన్ క్షతజంబు త్రావి నీ
వీ కదనాగ్ని చల్లవడ నీ గతి నిద్దుర చెందినావు లే
వే కదనంబు వచ్చె అరివీరుల గుండెలు తల్లడిల్ల ధా
రాకృపణంబుతో రణ పరంపరలన్ లయకేళి సల్పవే
(అని కొండుభట్టు వంక ఉరిమి చూస్తాడు)
కొండుభట్టు : మహారాజా! నాకు సెలవా?
బ్రహ్మన్న : కొండుభట్టూ! మీ రాజుతో సంతోషమని చెప్పు. బ్రహ్మన్న జరిగింది మరచిపోడని చెప్పు.
(కొండుభట్టు సభ అంగీకారం పొంది నిష్క్రమిస్తాడు)
కొమ్మన్న : కన్నమా! దేశమంతటా విప్లవాగ్ని నివురు కప్పుకొని ఉన్నదని నీకు తెలుసు. కనిపెట్టి ఒక్కమాటుగా అన్నిచోట్లా ప్రజ్వరిల్లేటట్లు ఊదిరా. పో
కన్నమ : మామా! కార్యరంగంలో ప్రవేశించిన కన్నమకు -
(ఒక సేవకుడు ఆతురతతో ప్రవేశించి కొమ్మన్నతో)
సేవకుడు : ప్రభూ! నేను పేరిందేవి అమ్మవారి అనుచరుణ్ణి. చితిమంట లెక్కటానికి సిద్ధపడి అమ్మవారు మీ అనుజ్ఞ వేడి రమ్మని పంపింది.
కొమ్మన్న : పతివ్రతా శిరోమణివి తల్లీ! నీ కోరిక కాదనను.
(సేవకుడు నమస్కరించి వెళ్ళిపోతాడు)
గొడ్డుబోతు కావలసిన నలగాముడి కడుపున ఎంత కమ్మని పండు పుట్టింది? నా కొడుకును మించిన కోడలు.
(బాధతో) అబ్బా (ఒరగబోతే కన్నమ వెళ్లి పట్టుకుంటాడు) బ్రహ్మన్న : (దగ్గరకు వచ్చి) బావా! ధైర్యం పోగొట్టుకోకు. కాఠిన్యం తెచ్చి పెట్టుకో, కాని దినాలు వచ్చినవి.
కొమ్మన్న : చేసేదేముంది బావా!
కన్నమ : మామా! పగ సాధించటమే.
బ్రహ్మన్న : కన్నమా! ఆలస్యం చెయ్యకు. సైన్యాన్ని చేకూర్చుకో.
కన్నమ : (వీరోచితంగా) మీ అనుజ్ఞ అయితే సానికొంపల్లో సమర వీరులను మొలక లెత్తిస్తాను. గండ శిలల చేత ప్రచండ యుద్ధం చేయిస్తాను. పౌరుష ప్రలాపాలతో పల్నాటి నంతటినీ ఉడుకెత్తించి మీ వెనక నడిపిస్తాను. వీరుల గుండెల్లో ఉష్ణగుండాలను సృజిస్తాను. వేడి నెత్తురు పొంగి పొంగి కరుళ్ళు కట్టేటట్లు ముక్తకంఠంతో తాండవోద్రేక ప్రసంగం చేస్తాను. కావలసిన సైన్యాన్నంతా కట్టుబడి చేసుకుంటేనేగాని ఈ కన్నమ ఇక మీ కంటి ముందు కనబడడు. దీవించి పంపండి.
(వీరముష్టితో ప్రణామం చేస్తే అందరూ హస్తవిన్యాసంతో దీవిస్తారు)
అయిదో దృశ్యం
(మాచర్ల రాచబాట. నాలుగు దారులు కూడలి. పట్టణంలో ప్రజలందరూ
యుద్ధోపన్యాసాలు వినటానికి మూగి ఉంటారు)
నరసింహరాజు : (రాజసంతో) ఓ మహాజనులారా! మీలో ప్రతి అణువూ రాజభక్తి పరాయణమని వింటూ ఉన్నందుకు సంతోషము. ఎన్నాళ్ళనుంచో తహతహ పడుతుంటే ఈ నాటికి మీ దర్శన భాగ్యం లభించింది. మహాప్రభువు తామే మీకోసం స్వయముగా బయలుదేరుదామనుకున్నారు. కానీ శరీర స్వస్థత లేకపోవటం వల్ల తమకు బదులుగా నన్ను పంపించామని మీతో చెప్పమన్నారు.
ఇప్పుడు నేను యువరాజును కాను ఒక సామాన్య వ్యక్తిని. నా మాటలు రెండు ఆలకించండి.
మహారాజంతటివాడు మనలను ఎప్పుడు అర్థిస్తాడు? ఈనాడు అర్థించాడు. ఇంతకంటే మహోన్నత గౌరవం మన జీవితాల్లో రాదు. ముమ్మాటికీ రాదు.
మనమందరమూ ఆయనకు శాయశక్తులా సహాయము చేసి ఆయన్ను గెలిపించాలి. కుల విభేదాలు లేవట! వర్ణ సంకరం చేసేస్తున్నాడు బ్రహ్మన్న. మీ తాత తండ్రుల మతాన్ని త్యజించి అపాత్రులవటానికి ఇష్టపడుతారో మీరు, ధర్మ యుద్ధం చేసి వర్ణాశ్రమ ధర్మాలను నిలువ బెట్టుకుంటారో! ఆలోచించుకోండి.
నలగామ నరపతి రాజ్యం ప్రజారాజ్యం! ఆయన సింహాసనం మీద కూర్చున్నది మీకోసమే. అధర్మం దేశంలో ప్రబలిపోయినా వర్ణ సంకరం ప్రబలినా మాకిష్టమేనని మీలో ఒక్కరన్నా సరే మహారాజు తక్షణమే రాజ్యాన్ని పరిత్యజించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదీ? - ఎవరన్నా ఉన్నారా? (సభలో లేరు లేరని కేకలు) ఒక్కరూ లేరు. అబ్బా! మీ రాజభక్తికి అమితానందం వేస్తున్నది. (పట్టరాని సంతోషంతో) అహహఁ నేను భరించలేను. సెలవు.
(నమస్కరిస్తూ నిష్క్రమిస్తాడు)
యుద్ధం ఎందుకు వచ్చిందో మీకు చెప్పటం అనవసరమూ, అప్రస్తుతమూ, మీకు సమస్తమూ తెలుసును. అందుకోసం రాలేదీ కన్నమ! పల్నాటి ప్రజా హృదయంలో ప్రజ్వలితం కాలేక నిద్రపోతూ ఉన్న విప్లవ ప్రళయాగ్ని జ్వాలలను మేల్కొల్పటానికి వచ్చాడు.
మహాపదలకు పాలౌతున్న రాక్షస ప్రభుత్వానికి తలలొగ్గుతారో, లేక ధర్మ సంస్థాపనాచార్యుడు బ్రహ్మన్న భావి ప్రభుత్వంలో అనంత మహదానందాన్ని అనుభవిస్తారో తేల్చుకోండి! దాస్య శృంఖలాలకు చేతులందించి తట్టాడుతారా! కాటకాలల్లో కీటకాలౌతారా!! కారు కారు. మహాయోధులై మహదాశయాలను సాధిస్తారు. స్వాతంత్రాభిలాషులై పారతంత్ర్యాన్ని పరుగెట్టిస్తారు.
వర్ణాశ్రమ కులాచార రక్షణమని పేరు. రక్తపాతాలతో రాక్షసరాజ్యం! రాక్షస ప్రభుత్వం!! భరించలేము! భరించలేము...!
మన రాజ్యంలో 'రాజుకూ రడ్డికీ' భేదం ఉండకూడదు. సర్వమానవ సౌభ్రాతత్వం, సంఘజీవనం అభివృద్ధి పొందాలి. ఉపన్యాసాలతో ప్రయోజనం లేదు. హృదయం పరివర్తనం కావాలి.
నేను ఎవరినో తెలుసునా? అస్పృశ్యుణ్ణి. అంత్య జాతిని చండాలుణ్ణి. బ్రహ్మన్న తండ్రి నాకు ఇచ్చిన పదవి తెలుసునా సర్వసేనాధిపత్యం. ఆయననైనా నడపించవలసింది నేనే! ఇటువంటి సౌభ్రాతృత్వం మీకు ఏ ప్రభుత్వంలో దొరుకుతుంది? దొరకదు ముమ్మాటికీ దొరకదు!!! ఇది అధర్మ ప్రభుత్వం! అక్రమ ప్రభుత్వం!! బ్రహ్మన్న ప్రభుత్వం ధర్మ ప్రభుత్వం! ప్రజా ప్రభుత్వం!!
(ప్రజలలో హర్షధ్వనులు, కోలాహలమూ)
పలనాటి కిష్టయ్య పలుకులు మీరు ఎన్నో విన్నారు. ఇప్పుడు మమ్మలిని స్వాతంత్య్ర యుద్ధానికి సిద్ధం కమ్మని శంఖారావం చేస్తున్నాడు.
పాదఘట్టన చేయ బ్రద్దలై ఈ ధాత్రి
పాతాళవివరముల్ బయట పడగ,
భాసింప శస్త్రాళి ప్రళయ శంపాలతల్
కులశైల గహ్వరకోటి నొదుగ,
రణపరాక్రమ హేతి రగిలి ముల్లోకాలు
స్రుక్కి పోవగ మించి సుడిసి పడగ
సింహనాదము సోక చెలగి స్వర్లోకాన
కంచు తలుపులు ధ్వనించి విడగ,
ఏడు సంద్రాల నిదె పుక్కిలించి ఉమియ
వచ్చెనన భీతి నాషాఢవారి వాహ
పంక్తులట్లుగ రణభూమి పరుల నొంప
నస్త్ర వర్షాంబు ధారల నలుమ రండు.
జై బ్రహ్మన్న తండ్రికీ జై! జై బ్రహ్మన్న తండ్రికీ జై
(ప్రజలు అందుకొని జై బ్రహ్మన్న తండ్రికీ జై! జై వీర కన్నమకూ జై, జై, వీర కన్నమకూ జై!! అని సంతోష ధ్వానాలు చేస్తారు. కన్నమ నిష్క్రమిస్తాడు)
నరసింహరాజు : (ఫలకము మీద వ్రాసుకొని వచ్చిన ఉపన్యాసాన్ని మధ్య మధ్య ఆగుతూ తడబాటు పడుతూ, వణికిపోతూ చదువుతాడు)
మహాజనులారా! సైన్యంలో త్వరగా చేరండి. అనుకొన్న సంఖ్య పూర్తి అయిన తరువాత మీరు ఆశాభంగం చెందుతారు. ఆలోచిస్తూ ఆలస్యం చేసి తరతరాలూ నిలిచే భటవర్తులు పోగొట్టుకోవద్దు. రొక్క భృత్యం అదనం. పంక్తులలో అన్నాలు తినేవాళ్ళు పాలెగాళ్ళు అవుతారు. మన్నెవారికి మొదటి సేనాధిపత్యం. సైన్యంలో చేరిన ప్రతి సేద్యగానికీ రాబొయ్యే పదేండ్లకూ పుల్లరి ఉండదు.
యుద్ధం పూర్తి అయిపోయిన తరువాత రొక్కజీతాలూ పదవులూ తగ్గిపోవు... రండి వచ్చి జేరండి... సుఖాలు అనుభవించండి. ఎన్నో తరాలనుంచీ మహారాజు డబ్బుతిని ఆయనకు మీరు రుణపడి ఉన్నారు. (ప్రజలలో టుర్రో టుర్రో) (వణుకుతూ) అది... తీర్చుకోటానికి సమయం వచ్చింది. రాజ భక్తులను మిమ్మల్ని పదే పదే వేడ నవసరం లేదు.(ఎహై... ఎహై)... మీ ధర్మం కోసం, మీ విశ్వాసం కోసం, (బుర్... బుర్) మీ ప్రభువు కోసం సైన్యంలో చేరండి. పోరాడండి... రాజును గెలిపించండి.
(దిగో! దిగో! వెళ్ళు! వెళ్ళు! ఆపు! ఆపు! అని సభలో కేకలు. నరసింహరాజు వణుకుతూ నిష్క్రమిస్తాడు)
కన్నమదాసు : (ఎదురుగా ఆవేశంతో ప్రవేశించి) ఓ ధర్మయోధులారా! మీ పలనాటి కిష్టయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆ పిలుపు మీద మీకు నమ్మకముంటే బయలు దేరండి. ఆయన మీకు ఏమీ ఇవ్వలేడు. ఆశ పెట్టలేడు పెట్టి కొట్టేయలేడు... ఎప్పటికైనా ధర్మానికే జయమన్న సంగతి మీరెరిగిందే కదా! బ్రహ్మన్న ధర్మం!! ధర్మం పిలుస్తున్నది. ముందుకు నడుస్తారా! పిరికిపందలై వెనుకంజ వేస్తారా! త్వరపడండి! రేపే కారంపూడి కదనరంగానికి బయలు దేరుతున్నాము... త్వరపడండి! రణగండ్ల యుద్ధంలో బ్రహ్మన్న రణపరాక్రమం విన్న మీరు ఇంకో పక్షానికి ఎట్లా వెళ్ళగలరు... వెళ్ళలేరు...భజన కూటాలల్లో భండన వీరులు తయారు కండి. కల్లుకొట్లు కదనవీరులకు జన్మభూములు చెయ్యండి. చాకి బండలను సమరయోధులకు రచ్చబండలు కావించండి. యుద్ధం మీరే నడిపించేది జ్ఞప్తికి ఉంచుకోండి జయం మీదే. ఆనందించండి...
వీర ఘంటలు కట్టుకోండి! వీరపూజలు చెయ్యండి! వీరగంధం అలముకోండి!! బయలు దేరండి! రండి రంగానికి రండి -
రాక్ష సేశ్వరు గర్వ రక్తంబు దిగ ద్రావి
సీత చెరకు స్వస్తి చెప్పినాము,
ధర్మ సూనుని వైరి దావాగ్ని చల్లార్చి
కీర్తి హేమలత ప్రాకించినాము,
యవన వాహిని పొర్లి అరుదేర పొలిమేర
కడలనే సేతువుల్ కట్టినాము,
సాగర ధ్వని వచ్చు శత్రుపాథోధులకు
చెలియలి కట్టలై చెలగినాము,
ఆంధ్రులము దయా వీర రసాంబుధులము,
ఆంధ్రులము దాన వీర రసాంబుధులము,
ఆంధ్రులము కర్మ వీర రసాంబుధులము,
ఆంధ్రులము యుద్ధ వీర రసాంబుధులము
(కన్నమ నిష్క్రమించగానే ప్రజలు జై బ్రహ్మన్నకూ జై, జై వీర కన్నమకూ జై అని కేకలు వేస్తారు)
ఆరవ దృశ్యం
(మాచర్లలో గండు వారి సంస్థానము. సావడి ముందు ఆరుబయట నిలవబడి నిశ్చల
నేత్రాలతో మాంచాల ఆకాశం వంక చూస్తూ దీనంగా మబ్బు వెనక దాగి ఉన్న
చంద్రుణ్ణి ఉద్దేశించి)
మొగిలు మాటున డాగి
మగిడి రావేమోయి
ఓ రాజ! రేరాజ!!
రేరాజ! రాజా!!!
మగువ తారతో వలపు
తగదోయి, తగదోయి,
తరలి రావోయి మా
సరసి నీడల నాడ...
మొగిలు మాటున డాగి
మగిడి రావేమోయి,
ఓ రాజ! రే రాజ!!
రే రాజ! రాజా!!!
సంస్థానం మొదటి గుమ్మం దాటి లోపల ప్రవేశించిన ఒక బుడబుక్కల వాడు
భావస్ఫూర్తితో డమరు మోగించుతూ తాళ లయాన్వితంగా
అంబా పలుకు, జగదంబా పలుకు,
అంబా పలుకు, జగదంబా పలుకు !!
గండు వారి సంస్థానంలో
పండుగ తల్లి ఈ దినమూ
పరువపు వెన్నెల కాస్తుందీ,
పరువపు వెన్నెల కాస్తుందీ.
అంబా పలుకు, జగదంబా పలుకు,
అంబా పలుకు, జగదంబా పలుకు!!
వస్తూ ఉన్న భావాలను హృదయగతం చేసుకోలేక)
మాంచాల : పరువపు వెన్నెల! పరువపు వెన్నెలే!! చంద్రుడు రానిదే వెన్నెలా?... కల్ల. ఎన్నాళ్ళనుంచో నిరీక్షిస్తున్నాను. కంటిముందు శూన్యం తప్ప ఆ కువలయ మనోహరుడు, నా చంద్రుడు కనిపించటం లేదు. నా బ్రతుకుకీ కృష్ణపక్షం (నిష్కర్షగా) తప్పదు. చంద్రుడి ముఖ చంద్రిక కళ్లార తాగి మత్తెక్కి మైమరచే దినాలు ఈ మాంచాల జీవితంలో ఉన్నాయా! (నిరాశతో కూడిన నిట్టూర్పుతో) పరువపు వెన్నెల కాస్తుందా?
ఎన్నటికైన చంద్రునకు ఈయెడ మోహము కలి రాకపో
డన్న మహాభిమానమున నాత్మకు వ్రేగగు జీవనంబుతో
నున్నది ఈచకోరిక - మహోజ్వలుడాతడు నేడు వచ్చునా,
వెన్నెల కాయునా, అమృత వీచికలన్ తనివార నిచ్చునా?
(బుడబుక్కల వాణ్ణి ఉద్దేశించి) వీడు పలికే మాట సత్యమౌతున్నదని ప్రతీతి. ఇది
కూడా అంతే అయితేనా, నా బ్రతుకు ధన్యమౌతుంది.
(బాలచంద్రుని చిత్రపటం వైపు నిర్ణిమేష వీక్షణం చేస్తుండగా లోపలనుంచి మాడచి గొంతుక “మాంచాలా, మాంచాలా” అని వినిపిస్తుంది. "మాడచీ! మాడచీ!!" అని తిరిగి పిలుస్తూ నెమ్మదిగా మాంచాల నిష్క్రమిస్తుంది. క్షణకాలం నిశ్శబ్దం. నేల చూచుకుంటూ నెమ్మదిగా బాలచంద్రుడు చేతిలో ఉన్న బొంగరంతో ఏమేమో మాట్లాడుకుంటూ ప్రవేశిస్తాడు)
బాలచంద్రుడు : ఒకటి ఒదిలిపోయింది. శ్యామాంగి మీది మోహం. నా రెండో వ్యసనం నీవు. ఇదిగో చివరిసారి నిన్ను (బుజం మీద వ్రేలాడుతున్న తాడు చుట్టి నేలమీద త్రిప్పి చేతిలో పట్టుకొని) ఇలా చిన్న నాటినుంచీ నీవు నా చేతిలో తిరిగి, తిరిగి ఈనాటికి నన్నే తిప్పేశావు. కానీ నీకూ నాకూ నేస్తం మాత్రం ఈనాటితో సరి.
('మాడచీ! మాడచీ' పంజరములోనుంచి గిజిగాడు తప్పించుకొని వచ్చాడా, 'ఏడీ ఏడీ'- అంటూ మాంచాల వెతుకుతూ ప్రవేశిస్తుంది. బాలచంద్రుణ్ణి చూసి నిర్ఘాంతపోయి నిలువబడుతుంది)
బాలచంద్రుడు : (నెమ్మదిగా మందస్మితంతో మాంచాల దగ్గరకు వెళ్ళి) అవును. మాంచాలా? పంజరంలో నుంచి తప్పించుకొనే వచ్చాను. మాంచాల : (తెప్పరిల్లి) మీరా?
బాలచంద్రుడు : (గాద్గద్యముతో) 'నేనే'
(క్షణకాలం నిశ్శబ్దం. ఒకరినొకరు ప్రేమార్ద్రలోచనాలతో చూచుకుంటారు)
బాలుడు : ఇలారా... (దగ్గరకు పోయి చేయి పట్టుకొని నెమ్మదిగా అలంకరించిన వేదిక మీద కూర్చోబెట్టి) మాంచాల సుఖంగా ఉంటున్నావా? (నేలమీద చూస్తూ ఉన్న మాంచాలతో) ఏమిటా సిగ్గు? నీ ముఖం ఇంతగా వాడి పోయిందేమిటి? (చేతితో ముఖం పైకి ఎత్తుతూ) ఎంతసేపు ఈ సిగ్గు వదిలిపెట్టదా ఏమిటి?
కనులు కనుల గలపి కాటు కలవి నీటు
నీలిమల గుండె వనములు నిలిపి తమము
చిరుత నవ్వుల చేమంతి సరుల నరుత
నతివ! పుష్పోపహారమ్ము లమర నిమ్ము
మాంచాల : అప్పుడే ప్రభూ, మీకు నేను అంత సన్నిహితురాలనైతే -
బాలుడు : మన అనుబంధం ఈనాటిది కాదుగా దేవీ!
మాంచాల : మీరు నన్ను అలా సంబోధిస్తే బాధపడటానికి నాకు మాత్రం మనస్సు లేదనుకున్నారా?
బాలుడు : (ప్రేమ పూర్వకంగా) మాంచాలా! ఒక్కమాటు 'బావా!' అని పిలు. హృదయభారం కొంత తగ్గుతుంది.
మాంచాల : (ముగ్ద మనోహరంగా) బావా!
బాలచంద్రుడు : (ఆర్ద్రంగా మాంచాలా! (హస్త కంకణాలను సవరిస్తూ) ఈ ఆభరణాలు నీ కోమల హస్తాలకు ఎంతో అనుయోగ్యంగా ఉన్నవి. మాంచాలా (చేయి గుండె కద్దుకుంటూ)
కన నొక మారు నిన్మరల, కట్టితి మంగళ సూత్ర మెన్నడో
కనికర మింతలేని నను కాంతునిగా నెద నమ్మి తన్విరో!
అనయము పూజ చేతు వధికంబగు భక్తి పతివ్రతామణిన్
నినుగన వచ్చినాడ, నవినీతుని ఏ గతిగా క్షమింతువో?
మాంచాల : మనసార ప్రేమించి చేస్తాను. బాలుడు : (దైన్యంతో) మాంచాలా!
మాంచాల : (ఆర్ద్రంగా) బావా!
బాలుడు : ఈ జగత్తులో సత్యమేదో అసత్యమేదో! అంతా మాయ, మోసము - నటన. నిజమబద్ధమనీ, అసత్యము సత్యమనీ భ్రమపడుతుంటాము.
(దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తాడు)
మాంచాల : ఎందుకో దీర్ఘంగా నిశ్వాసిస్తున్నారు?
బాలుడు : (మందమందగా) ఇన్నాళ్ళబట్టీ మోసపోయినానని ఈనాడు గ్రహించాను మాంచాలా?
మాంచాల : మిమ్మల్ని ఎవరు మోసగించారు?
బాలుడు : కపట ప్రేమ నటించి నా అర్థ ప్రాణాలు కాజేసిన శ్యామాంగి!... దాన్నని ఏమి ప్రయోజనం? సాని సాంగత్యం, నాదే దోషం. పోనీ పాపిష్ఠి ముండ. దాని సంగతెందుకు. నీ మనోహర సౌందర్యాన్ని ఆరాధించే అదృష్టం నాకు లేకపోయింది. మణిదీపికను మరిచిపోయి గాజుపూసతో కాలం గడిపాను. మాంచాలా! నీవు నా వెనుకటి జీవితాన్ని సంపూర్ణముగా మరిచిపోవాలి. మనసార నన్ను ప్రేమించాలి.
మాంచాల : ఏమిటి మీ అర్థం లేని మాటలు?
బాలుడు : మాంచాలా? ఇది మన ఇద్దరి నూతన జీవితాలకూ వసంతాగమ సమయం. (దృష్టి వీణమీద నిలిపి) నీవు వీణావాదనం చేస్తుంటే నేను గొంతు కలిపి ఒక పాట పాడుతాను.
మాంచాల : అందుకో మన్నారా?
బాలుడు : (అవశ్యమన్నట్లు) ఉఁ
(మాంచాల వీణ సవరించి బాలుని ఎత్తుగడ కోసం చూస్తూ ఉంటుంది)
బాలుడు : (గొంతు సవరించి)
ఓహో వసంతా! ఆహా వసంతా!!
సుఖదా వసంత!! శుభదా వసంతా!!
నందన వన సుమ సుందర
తుందిల మృదు మంద పవన, - ఓహో వసంత
చందన కురువింద మంద
గంధానిల వసన హసన, - ఓహో వసంత
సురభిసమయ కింశుక నవ
తరుణారుణ కిరణ చరణ, - ఓహో వసంత
చరణ రణిత చతుర రవణ
చలిత విహగ చికుర కిరణ, - ఓహో వసంత
ఓహో వసంత!! ఆహా వసంత!!
సుఖదా వసంత!! శుభదా వసంత!!!
(నెమ్మదిగా పాట పూర్తిచేసి నిమీలిత నేత్రాలతో పారవశ్యం పొందుతూ ఉన్న మాంచాల
దగ్గరకు చేరి చేతిలో వీణ అందుకొని యథాక్రమంలో ఉంచి, ఆమెకు శైత్యోపచారం
చేస్తుంటాడు)
మాంచాల : (తెప్పరిల్లి) బావా! అటు జూడండి. ఆ పూవు మీద వ్రాలిన భ్రమర బాలుడు ఏం చేస్తున్నాడో!
బాలుడు : (మందస్మితంతో కోమలంగా) ఏం చేస్తున్నాడు. మనసార ముద్దు పెట్టుకొని మకరందం తాగేస్తున్నాడు.
(సిగ్గుతో తలవంచుకున్న మాంచాల చిబుకాన్ని చేతులలో పుచ్చుకొని అయితే ఈ బాలుణ్ణి కూడా... అలాగే... గులాబీ పెదవులమీద... మకరందాన్ని తాగమని అభిప్రాయమా? గండువారి ఉద్యానంలో ఇంత కమ్మని పూవున్నదని ఎరగను మాంచాలా?
మాంచాల : (దీనంగా) బావా!
ఇది యొక కన్నెపూవు, హృదయేశ. మధూదయవేళ, ఏరికిన్
ముదము దలిర్పగా మనసు మ్రుచ్చిల నీయగ లేదు మున్ను నీ
కొదమతనమ్ముపై, వలపు గుప్త మొనర్చి విరాళి నుంటి కో
విద మధులిట్పభ్రూ! అనుభవింపుము నేడు రసప్రలోభివై.
మీద వాలిన తుమ్మెద వెళ్ళిపోతుంది. మాంచాల మరొకవైపు లగ్నమౌతుంది. బాలచంద్రుని పెదవి మందంగా వెనక్కు వస్తుంది.)
మాంచాల : బావా! భ్రమర బాలుడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆ ఝుంకారం కులపెద్దల పిలుపులా ఉన్నది. వాళ్ళ కులంలో యుద్ధం బయలు దేరిందేమో! అతడు వీరుడిలా ఉన్నాడు.
బాలుడు : మాంచాలా! నీ బాలుడు వీరాగ్రేసరుడు మన కులంలోనూ యుద్ధం వచ్చింది. దేశమంతా మారుమోగుతూ ఉన్న అన్న వీరకన్నమ పిలుపు వినలేదా నేనూ సిద్ధపడి యుద్ధానికి బయలు దేరుతున్నాను. నీ అనుజ్ఞకోసమే ఇక్కడికి వచ్చాను.
మాంచాల : వీరపత్నిని చేస్తానంటే వద్దంటుందా మాంచాల.
బాలుడు : మాంచాలా! గండు వారి ఇంటి బిడ్డవనిపించావు. నీబోటి వీర నారీమణులు ఎంతమంది జన్మిస్తే మన దేశానికి ఈ దాస్య విముక్తి కలుగుతుందో (శరీరాన్ని స్పృశిస్తూ) బయలు దేరనా?
మాంచాల : (లేచి చిత్రపటం దగ్గిర ఉన్న చంద్రాయుధాన్ని తెచ్చి చేతి కందించి) బావా! శాత్రవ రుధిర ధారలతో జలకమాడండి. ధర్మ దాస్య విముక్తి కోసం తనువు నర్పించండి. అవక్ర పరాక్రమంతో ఆహవభూమిలో వీరవిహారం చేసి ఆశాశలా మీయశోగానామృతం వెదజల్లండి.
బాలుడు : (పొంగిపోయి) ధన్యోస్మి! మాంచాలా! ధన్యోస్మి.
చిర విరహాగ్ని తప్త మతసీ కుసుమోజ్వల గాత్రవల్లి నా
కరజల జార్ద్రలాలనల కాంతి వహింపక మన్నె యోధవై
అరిరుధిరాపగన్ జలకమాడుము పొమ్మని శత్రుయోధ సం
భరిత రణోర్వికిన్ పనుచు ఫ్రొడిమ నీకడ కాక కల్గెనే
మాంచాలా! ఇక క్షణం నిలువలేను. నా బొంగరం కోమటి అన్నమ్మ తలకు తగలగానే
ఏమన్నదో తెలుసునా? అద్దంకి ఆబోతల్లే పొతరించానట! శత్రువుల మధ్య
చంద్రాయుధాన్ని ప్రయోగించి రంకులరాటంలా గిరగిరా త్రిప్పేటంతవరకూ ఇక నాకు
శాంతిలేదు. మాంచాలా! త్వరగా సిద్ధపడు. మాంచాల : ఇక్కడున్నట్లుగా వచ్చేస్తాను.
(లోపలికి వెళ్ళుతుండగా చూచి)
బాలుడు : మాంచాలా! నీ శీలం, నీ రూపం, నీ త్యాగం - రణరంగ మధ్యంలోనైనా నా మనస్సును వదిలేటట్లు లేవు. నీవు నాకు ధర్మ పత్నివి కావటం వల్ల నా జన్మ పరమ పవిత్రమైనదని భావించుకుంటున్నాను.
ఎందరొ రాచకన్నెలు జనించిరి భారత ధాత్రిలోన - ఈ
చందముగాగ వీరగుణ సంపద కల్గెనె మున్ను దేవి! నీ
వందరకున్ శిరోమణివిగా భవదీయ చరిత్ర క్రాలదే
సుందరగాత్రి భావియుగ శుభ్రచరిత్రల స్వర్ణపత్రమై
మంచాల : (ప్రవేశించి బాలుని పూలమాలతో అలంకరించి విల్లనంబు చేతికందుకొని)
బావా!
సమర క్షోణిని బాహు దర్ప మెసగన్ సంధించి చాపంబు న
దమలంబైన గుణంబు టంకృతులు సేయన్ కల్పవేళాగత
భ్రమితాంబోధ నినాదముల్ చెలగ గర్వస్ఫూర్తి మరొడ్డగా
సమరోర్వీపతి కైన గుండియలు డిల్లైవోవగా పోరుమా!
(మాంచాల అందించే విల్లును గౌరవపురస్సరంగా అందుకొని వీర ముష్టితో కళ్ళ
ఏడవ దృశ్యం
(గురజాలలో నాగమ్మకార్యాలోచనా మందిరము. యుద్ధ విషయిక సంభాషణ నడుస్తూ
ఉంటుంది
నాగమ్మ : (నివేదనా పూర్వకముగా) ప్రభూ! బాసపత్రికలు అందుకున్న మిత్రరాజులందరూ సమయం తప్పకుండా సైన్యాన్ని పంపిస్తున్నారు. వీర భల్లాణుడు లక్ష కాల్బలం, గజబలం నూరూ పంపించాడు. కామభూపతి పంపిన వేయి గుర్రపు దళం చేరింది. కాకతి ప్రతాపరుద్రుడు కాలర్లను కానుక లంపించాడు. సామంత రాజులే సైన్యానికి కావలసిన ఆహార పదార్థాలన్నీ అందజేస్తున్నారు. ఎవరుబట్టినా అవసరమైతే ఇంకా బలాన్ని పంపిస్తామనే వాళ్ళే -
నరసింహరాజు : (ఔత్సుక్యంతో) మన్నెరాజు ఏమన్నాడు మహామంత్రిణీ! గుండమ దేవుడి కోటలో గుర్రాలు మందలు మందలుగా ఉన్నవట కదూ? అతడేమన్నా-
నాగమ్మ : అతడి దేముంది మనకు ఆప్తుల్లోవాడు. తానే బలాన్ని వెంట నడిపించుకొని వస్తుంటాడు.
నలగామరాజు : దేశంలో ప్రజలో?
నాగమ్మ : (ఏహ్యభావంతో) ప్రజలా! పశువులు. వాళ్ళు ఏమంటే మనకేం? ఎర చూపిస్తే ఎన్ని చేపలైనా వాలుతవి. అందులో యువరాజులుం గారు తానై ప్రచారం చేసిన తరువాత గుంపులు గుంపులుగా వచ్చి చేరరా?
నరసింహరాజు : (స్వాభిమానంతో) ప్రజల విషయం నేను ఘంటాపథంగా చెపుతాను. బ్రహ్మన్న పక్షంలో ఒక్క పురుగు చేరదు.
చివరకు యుద్ధభూమిపయి చిక్కిన చిత్రవధల్ తొలంగవం
చవల కుటుంబ నాశనము లంచును నే బెదరించి వచ్చితిన్
ఎవియెవియో శుభం బనియ యెన్నియొ యాశను బెట్టి వచ్చితిన్
అవసరమైన బొక్కసము నంతయు వారికి క్రుమ్మిరించెదన్.
ప్రేరేపించాను.
ఎర్రని రాగినాణెం కనబడని ఈ దినాలల్లో బంగారపు మాడలు ఎవరికి చేదు? అంతేకాదు బ్రహ్మన్న వెర్రి వైష్ణవ బోధతో ప్రజ విసిగిపోయింది. చాపకూటితో సర్వం జగన్నాథం చేశాడని ఎంతో వ్యతిరేకభావం ప్రబలిపోయింది. బ్రహ్మన్న పేరు చెబితే దోవన బండి తోలుకునేవాడు కూడా మండిపడుతున్నాడు. ఊరూరా తిరిగి నేను ప్రచారం చేసిన తరువాత మన పక్షంలో చేరకుండా ఎలా ఉంటుంది ప్రజ? నేను నమ్మను. మత విషయాలు వాళ్ళకు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి.
నాగమ్మ : (నిశ్చింతగా) అసలు ప్రధాన విషయమే అది, మన యుద్ధం కూడా అందుకోసమే. మహా దేవుడి కృపవల్ల అంత్యంలో జయం కూడా మనదే. గొడ్లుతోలుకుండే కుర్ర కుంకలను గుంపుచేసి మనమీద యుద్ధానికి ....... అమ్మ, బ్రహ్మన్నా! నిన్ను ఏ విష్ణు చక్రం వచ్చిఅడ్డుకుంటుందో
నలగామరాజు :
బాగురె బాగురే! తమిని చక్రము నంపునె బ్రహ్మనాయుడా
భోగము జూడగా దగును పోరులలో మన పక్షమందు ను
ద్వేగము మీఱ నిల్చి హరు నుజ్వల నేత్రమహాగ్ని పుంజముల్
రేగి దహింప చక్రము హరీ హరి యంచును మొఱ్ఱపెట్టదో!
మన ముక్కంటి త్రినేత్రం ముందు ముక్కముక్కలై పోదూ ఆ విష్ణుచక్రం!
నరసింహరాజు : (ఉత్సాహంతో లేచి నిలవబడి) మన సైన్యం గట్టిగా ఊపిరి విడుస్తే 'ఉఫ్' మని ఎగిరిపోయే వెధవలు వీళ్ళను గురించి ఇంత ఆలోచనా? మహామంత్రిణీ! వాళ్ళలో మొగకాశకట్టి మొగమీసం మెలె వేసిన మల్లు పేరు ఒకటి చెప్పు. మన శంకరరెడ్డి జగదేకమల్లు! త్రిలోచన మల్లు త్రిలోక మల్లు!! త్రిపురాంతక మల్లు దివ్యమల్లు!!! ముమ్మడిరెడ్డి, ముత్యాలు రెడ్డి, అయ్యపురెడ్డి అఖండ యోధులు! వీరాధి వీరులు!! వెధవలు, వెధవలు!!! వీరులట! యుద్ధమట, నల్లిలా నలిపెయ్యక.
(కోపం చల్లార్చుకుంటా ఉంటాడు)
నాగమ్మ : (పెద్దపెట్టుగా నవ్వి) యువరాజా! అంత చులకనగా మాటాడవద్దు. వాళ్ళల్లో ఎంతమంది మల్లులున్నారో తెలుసునా? సాలెమల్లు, చాకలి మల్లు, కంసాలి మల్లు, కమ్మర మల్లు, మంగల మల్లూ, మాదిగ మల్లూ. నలగామ : (ఒక్క తడవగా) సరీ పోయింది, సంచు నేయనూ, ఉతకనూ, సాలెమల్లు, చాకలి మల్లు, నోరు కుట్టెయ్యనూ, తలమీద పెట్టు వెయ్యనూ కంసాలి మల్లూ, కుమ్మరమల్లూ, బుర్రగొరగనూ, పూడ్చి పెట్టనూ మంగల మల్లూ, మాదిగ మల్లూ.
(అందరూ విరగబడి నవ్వుతారు. ఇంతలో ఒక సేవకుడు ప్రవేశించి నమస్కారం చేసి)
సేవకుడు : ప్రభూ! ఎవరో రాయబారిట!!
నలగామ : వేళ్ళ బేరం కాళ్ళ కొస్తున్నట్టుంది.
నాగమ్మ : రాకేం చేస్తుంది. అందితే జుట్టూ, అందకపోతే కాళ్ళు.
నలగామ : మాట్లాడటమేనా?
నరసింహరాజు : రానివ్వండి. రభస చేసి పంపించేద్దాము. ఏ బాబుతో చెప్పుకుంటాడో, ఇచ్చిన చేరెడూ పుచ్చుకొని చెప్పుకింద తేలులా పడి ఉండక నిమిషానికొక రాయబారిట! రాయబారి!! ఇష్టం వచ్చినట్లు వాగి పోతారు. ఈ మాటు మితిమీరితే ఉప్పుపాతట్లో పాతేయిస్తాను.
నలగామ : మహామంత్రిణీ! తమ్ముడూ, నరసింహా! తప్పకుండా చెయ్యాలి. తైతక్కలాడిన అలరాజు హతమైనాడు.
నరసింహ : లేకపోతే (మీసం మెలివేస్తూ) అన్నగారిని అడ్డం వచ్చినట్లు అల్లుణ్ణని మాట్లాడటమా?
నాగమ్మ : ఇక అతణ్ణి ప్రవేశపెడదామా?
నలగామ : (సేవకుడితో) అతణ్ణి లోపలికి
(సేవకుడు చిత్తమని నిష్క్రమిస్తాడు)
నాగమ్మ : ఈ తడవ ఎవరిని పంపించి ఉంటారు?
నరసింహ : కొమ్మన్ననా?
నలగామ : అతడు నా గుమ్మం తొక్కనన్నాడు.
నరసింహ : (అవహేళనగా) అబ్బో! చాలా తక్కువైంది. ఆ పక్షి రాకపోతే మనమేమన్నా బతగ్గలమా? (సేవకుని వెంట బ్రహ్మన్న పంపిన రాయబారి రణభట్టు ప్రవేశించి కొంచె పరచే కంఠంతో)
మహారాజరాజా, మార్తాండతేజా!
విక్రమ బిడౌజా, వనితా మనోజా!!
పండిత సమాజా, సురలోక భూజా!
మైలమ తనూజా, నలగామరాజా!!
(వికటంగా నృత్యం చేస్తాడు)
నలగామ : ఓరీ నీ పేరు?
రణభట్టు : నా పేరా? రణభట్టు.
నలగామ : ఏం రణమోయ్ తోరణం - (బిగ్గరగా) నీకీ వెధవ కవిత్వం ఎట్లా అబ్బింది?
రణభట్టు : తమబోటి కవిభోజులు దయవల్ల.
నరసింహ : వీడు గుండులా బాగున్నాడు, మహా మంత్రిణీ మన కాల్బలంలో చేరిస్తే - అబ్బీ చేరుతావా?
రణభట్టు : (కత్తిపైకెత్తి) ఆఁ కోపం ఉన్నవాళ్ళను తుత్తునియలు చేస్తాను.
నరసింహ : బ్రతకటానికేనా?
రణభట్టు : చచ్చినా, "చంపినవాళ్ళను” చంపటానికి
నాగమ్మ : భట్టూ! నీ వెందుకు వచ్చావు?
రణభట్టు : మీరంతా ఎట్లా ఉన్నారో చూచిపోవటానికి?
నాగమ్మ : చూచావుగా ఉఁ, కదులు.
రణభట్టు : కేవలం కళ్ళతోనే చూచాను.
నాగమ్మ : ఓహో! నీవు చెవులతో కూడా చూస్తావన్నమాట?
రణభట్టు : (దెబ్బకొట్టినట్టుగా) మాటల్తో చూచి ఆ చెవులకు వినిపిస్తాను.
నలగామ : ఏమిటా ధోరణి? ఎక్కడినుంచి వచ్చావు?
రణభట్టు : (స్థిరంగా) తండ్రి బ్రహ్మన్న దగ్గరినుంచి. నరసింహ : ఓహో! తిమ్మన్న దగ్గరినుంచా, అలా చెప్పు.
నాగమ్మ : అందుకే వీడికీ ఇంత తలతిక్క
రణభట్టు : (కళ్ళెర్రచేసి) అన్ని తలతిక్కలూ ఆహవరంగంలో తీరుతాయి.
నలగామ : ఆహవరంగమా, ఎట్లా భట్టూ! భయమేస్తున్నదే.
రణభట్టు : (వెకిలిగా) మీకేం ప్రభూ! (నాయకురాలిని చూస్తూ) 'నాగం' ఉందిగా. పడగ అడ్డుపెట్టి గుండెలో గుచ్చుకునే బాణాలు ఆపుతుంది లెండి.
నరసింహ : అయితే భట్టూ! మీ సేనాపతెవరు?
రణభట్టు : కాలసర్పాలకు (నాగమ్మను చూచి) వెరవని కడజాతి కన్నమ.
నరసింహ : (ఆశ్చర్యం నటిస్తూ) అరెరె! చెప్పులన్నీ పూర్తి అయినవా?
రణభట్టు : (కనుగుడ్లు చిత్రంగా మిటకరించి) ఇక చెంప మీదికి ఎక్కటానికే తరువాయి.
నాగమ్మ : (కోపంతో) జాగ్రత్తగా మాట్లాడు, ఏనుగు చేత తొక్కిస్తాను.
రణభట్టు : రణరంగానికి తరలివస్తే ఆపని ఈ రణభట్టే తీరుస్తాడు దెబ్బకు దెబ్బ.
నలగామ : నీవు ఎవరి సభలో మాట్లాడుతున్నావో తెలుసునా?
రణభట్టు : తెలియకేం? బాగా తెలుసు. కీలుబొమ్మ సభలో.
నాగమ్మ : (కోపంతో కత్తి వరనుండి లాగి) ఇక నీ తోలు ఒలిచి రణభేరి చేయిస్తాను. (అని పైకి దూకబోతుంది).
నలగామ : మహామంత్రిణీ! శాంతించు. వీడు రాయబారిట.
రణభట్టు : ఇప్పుడు జ్ఞప్తికి వచ్చిందా. అల్లుడే రాయబారైనా, హత్య చేయటానికి వెనుకాడని మీకు రాజభటుడు లెక్కా యువరాజా! అందుకు సిద్ధపడే వచ్చాను. నీ కత్తికి పదునుంటే చూచుకో.
(అని గట్టిగా వూపిరి పీల్చి రొమ్ము విరుస్తాడు)
నరసింహ : ఇక అధిక ప్రసంగం చాలించు. నీ కండలు కాకులకు వేయించుకోకు.
నలగామ : నరసింహా... భట్టూ! నీవు చెప్పదల్చుకున్నదేదో త్వరగా కానీ.
రణభట్టు : నా మాటలు ఏమీ లేవు ప్రభూ! అన్నీ బ్రహ్మన్న తండ్రివి. నాగమ్మ : విసిగించక త్వరగా చెప్పు.
రణభట్టు : నీ కిందులో ప్రసక్తి ఏమీ లేదు.
నలగామ : (కోపంతో) భట్టూ! త్వరగా కానీ.
రణభట్టు : (నింపాదిగా) తండ్రి బ్రహ్మన్న మాటలివిగో... ప్రభూ! పగవృద్ధి పొందించే భ్రష్ఠులే కాని, ప్రక్కచేరి దానిని అడిగించే నేర్పరులు అరుదు. నరజన్మ దుర్లభం. అవ్యక్తకీటకమై అసాధువృత్తిలో చరించటం సులభం. పోరు మంచిది కాదు. యుద్ధం అశాంతికి మూలం. కాటకానికి కారణము. ప్రజలకు వినాశం. ధనవ్యయం. నీతికి దూరం. యశస్సుకు కళంకం. ధర్మ వినాశం. మీ అన్నదమ్ములను ఏకం చేసి మిమ్మల్ని అరివీరభయంకరులను చేయటం నా అభీష్టం. నరసింహరాజును పంపించి క్షమా భిక్ష వేడుకోటం ఇందుకు అత్యవసరం. మలిదేవ మహారాజు మనస్సు రక్తపాతానికి ఒప్పుకోటం లేదు. నా మనస్సు అంతకంటే వెనుకాడుతున్నది. అందుకు మీరు అంగీకరించని పక్షంలో రక్తపాతానికైనా, రాజు వెనుతీయటం లేదు. మళ్ళీ రాయబారిని పంపించటం మా అల్పత్వం కాదు. చివరకు ధర్మానికే జయ మన్న సంగతి మరువవద్దు.
నరసింహ : అబ్బా! ఉపన్యాసం అప్పుడే అయిపోయిందా? వినటానికి చాలా కమ్మగా ఉంది.
నలగామ : మహామంత్రిణీ! విన్నారా?- (వికటంగా)
రాజ భక్త్యుత్సాహ రాజ్యాంగ వేత్తలౌ
పారి పార్శ్వకు లెల్ల భ్రష్టులంట,
సాధు సంపత్శీల సౌభాగ్యములు లేని
అవ్యక్త కీటకం బైతినంట,
నరసింహు డర్థింప నాకై క్షమాభిక్ష
అరివీరభయదుడ నౌదు నంట,
రక్తపాతము చేయ 'రాజాధి మహారాజు'
మలిదేవునకు బుద్ధి మసల దంట,
వింటివా, మహామంత్రిణీ! వీనులొగ్గి
పెంపుతో మన మంగీకరింపకున్న
రక్తపాతంబె కానిమ్ము రాక మనసు
తట్టుకోనిమ్ము సమరంబు తప్పదంట.
లొంగుతాడేమోనని, మాటలతో మసిపూసి మారేడు కాయ చేయదల్చుకున్నాడు బ్రహ్మన్న.
నలగామ : భట్టూ! మీ రాజు యుద్ధానికి సిద్ధపడ్డాడా?
రణభట్టు : సిద్ధపడటమేమిటి కారెంపూడి కదనరంగం. సైన్యాలు బారులు తీర్చినవి. నాగులేరు దాహంతో రక్తం తాగటానికి నాలుక జాపు తున్నది. మీకిష్టమైతే మేము అందీయటమే ఆలస్యం.
నరసింహ : మహామంత్రిణీ! కదనరంగం కారెంపూడిట,
నాగమ్మ : మనకు కారెంపూడి అయినా ఒకటే, కైలాసమైనా ఒకటే. వచ్చే శివరాత్రి నాటికి కదనరంగానికి చేరుకుంటామని వార్త పంపండి.
నలగామ : మహామంత్రిణీ! శుభదినం.
ఎంతేనిన్ శుభమైనదా దినము భూతేశుండు స్వాంతంబునన్
పంతంబూని సమస్త లోకముల దీవ్యచ్ఛక్తి పోకార్చున
త్యంతంబున్, నటియించు తాండవము నుద్యద్దివ్య దర్పోద్ధతిన్
సంతోషంబుగ, నెంతయున్ శుభదినం బానాడు, పోరాడగన్
భూతేశుడు ప్రళయకాల నృత్యం ప్రారంభించే దినం. భట్టూ! వెళ్ళి చెప్పు, బ్రహ్మన్నను
సిద్ధపడమను.
నరసింహ : భట్టూ! ప్రాణాలు దక్కవను. మా బల్లెపు పోట్లు భరించలేరని చెప్పు. నరసింగరాజు సర్వసేనాధిపతియని చెప్పు. ఈ సమస్తాన్ని నడిపించేది నేనని చెప్పు.
నాగమ్మ : నాగమ్మ ఒక సేనని నడిపిస్తుందని చెప్పు.
రణభట్టు : నాగమ్మ నడిపించినా, నరసింహుడు నడిపించినా నా తండ్రి బ్రహ్మన్న భయపడడు. ప్రళయ కాల రుద్రుడు మీ వైపు రణరంగంలో త్రినయనం తెరిచినా బ్రహ్మన్న తండ్రి భయపడడు. బ్రహ్మన్న భటుడు ఒక్కడైనా ఉలకడు. మరుమాట పలుకడు. శత్రురక్తంతో అలరాజుకు తర్పణం విడిస్తే కాని శాంతి వహించడు. ఆచార రక్షణం అనే పేరుతో జరిగే దురాచారాలను అంతమొందిస్తే కాని నిద్రపోడు. ఆహవరంగంలో అపజయమన్నది ఎరుగడు ఆ బ్రహ్మన్న. మీ పాపకృత్యాలకు ప్రతిఫలం మరుసటి జన్మల్లో కూడా అనుభవిస్తారు.
(నిష్క్రమణ)
పెట్టుకున్నాము.
నరసింహ : మళ్ళీ ఆలస్యమైనకొద్దీ, ఆవేశం చల్లారిపోతుంది. ఈ పీడ త్వరగా వదిలించుకోటం మంచిది. తరువాత సుఖంగా గుండె మీద చెయ్యివేసుకొని నిద్రపోవచ్చు.
నలగామ : అవును. శత్రువంత గొప్పవాడు కాకపోయినా చమిరి వేసేదాకా ఉత్తమ క్షత్రియుడు నిద్రపోలేడు.
నాగమ్మ : కాని, ప్రభూ! రేపే బయలుదేరటానికి వీలు లేనట్లున్నది.
నరసింహ : ఆలస్యమెందుకు?
నాగమ్మ : మన కేతరాజు రాలేదు.
నలగామ : తాను వచ్చేటంత వరకూ సైన్యాలను కదిలించవద్దని పత్రిక పంపించాడు కూడా.
నరసింహ : అంతగా అతను వస్తే దారిలో కలుసుకుంటాడు.
నాగమ్మ : అతడికి కోపం వస్తుందేమో!
నలగామ : అతని మనఃప్రవృత్తి అటువంటిదే.
నాగమ్మ : అరుగో కేతరాజులుంగారు రానే వచ్చాడు.
కేతరాజు : (ప్రవేశించి) మహారాజా! నమస్కారము. (సౌహార్ద్ర పూర్వ కముగా) మహామంత్రిణీ కుశలమా? నరసింహా...
నలగామ : తండ్రీ! కేతరాజూ! కోటలో అంతా క్షేమమా? భీమరాజులవారి అస్వస్తత ఏమైనా నెమ్మళించిందా?
నరసింహ : అందరూ క్షేమమేనా, రాజూ!
కేతరాజు : అమరేశ్వర స్వామి కృపవల్ల అంతా కుశలమే.
సైన్యాన్ని వెంటపెట్టుకొని రమ్మని వార్త పంపారు. యుద్ధానికి నిశ్చ యించుకున్నారా ఏమిటి?
నలగామ : నిశ్చయించుకోవటమేమిటి? కదనరంగం కారెంపూడిట. బ్రహ్మన్న, అన్న, యుద్ధం చేసేదాకా వదిలేటట్టు లేరు. నాగమ్మ : రాయబారిమీద రాయబారిని పంపించి ఇష్టం వచ్చినట్లు పేలిస్తున్నారు.
నరసింహ : యుద్ధం చెయ్యక తప్పదులే రాజూ!
కేతరాజు : అన్నదమ్ముల మధ్య అంతఃకలహం నాకేమీ నచ్చటం లేదు.
నాగమ్మ : యుద్ధాన్ని ఆపటానికి ఎంత ప్రయత్నిస్తున్నా రెచ్చకొడుతుంటే ఎట్లా తప్పుతుంది?
కేతరాజు : రాబొయ్యే అంతఃకలహంలో, ఉభయ పక్షాలకు బంధువులం అయిన మాకు చాలా దెబ్బ. అయినా యుద్ధానికి దిగవలసినంత అగత్యం ఏమి వచ్చింది. ఏదోవిధంగా పరిష్కారం చేసుకోటం మంచిది కదా? ఆ పని యుద్ధం ప్రారంభం కాకముందే చూచుకోటం మంచిది. దీపముండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి కదా.
నలగామ : ఎంత తప్పించుకుందామని ప్రయత్నించినా పైన బడుతుంటే ఏం చేసేది రాజూ!
కేతరాజు : వీళ్ళ కోరిక ఏమిటిట?
నరసింహ : నన్ను అవమానించటం.
కేతరాజు : దేనికి ఏం కడుపు నిండుతుందని?
నరసింహ : అలరాజును నేను చంపించానని దేశంలో అల్లరి పుట్టింది. అందుకు వాళ్ళ కాళ్ళమీద పడాలట.
కేతరాజు : రెండువైపులా కసి బాగా పెరిగిపోయినట్లుంది. మహామంత్రిణీ! ఏవిధంగానైనా, యుద్ధాన్ని ఆపుచేయిస్తే మంచిది. దేశానికి క్షేమం, మీకు క్షేమం. మాకు క్షేమం.
నలగామ : ఇవన్నీ ఆలోచించే, ఆ పనికి మేము ఎంత ప్రయత్నించినా మితిమీరిపోయింది.
నరసింహ : రేపే సైన్యాలు యుద్ధరంగానికి బయలుదేరటం?
కేతరాజు : తొందరపడవద్దు.
నలగామ : మహా శివరాత్రి నాడే యుద్ధమని వార్త పంపించాము.
కేతరాజు : మహామంత్రిణీ! మళ్ళీ ఒక్క తడవ ప్రయత్నించటం క్షేమకరం. నాగమ్మ : మీ ఇష్టానుసారంగా నడుస్తాము. (నలగాముడితో) ప్రభూ! మళ్ళీ ఒక తడవ చూద్దాము.
నలగామ:
ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఫలితం అంతకంటే వేరుగా ఉండదు మహామంత్రిణీ!
అన్ని ప్రయత్నముల్ విఫలమైనవి మాయెడ ప్రేమలేదు బ్ర
హ్మన్నకు, నిన్న మొన్న మన మాతురతన్ వహియించి సంధికై
ఎన్నగ రాని యత్నమొనరించిన కల్గిన దేమి? నోచకే
దెన్నటికైన సంధి కలనౌనియు కల్గుట కౌను మంత్రిణీ!
కేతరాజు : స్వయంగా వెళ్ళి బ్రహ్మన్న మంత్రిని ఒప్పించి వస్తాను.
నాగమ్మ : ఆ పక్షంలో తప్పకుండా బయలు దేరటం మంచిది. వెళ్ళి రావలసిందే. వాళ్ళు మటుకు సంధి కంగీకరించరు. ఇది రూఢిమాట... ప్రభూ! మరొక పని చెయ్యటం మంచిదేమో?
నలగామ : ఏమిటది మహామంత్రిణీ!
నాగమ్మ : సైన్యాలన్నీ వాళ్ళు కదనరంగంలో బారులు తీర్చి నిలవబెట్టారు. మనం కూడా మొదట అనుకున్నట్లే రేపు బయలుదేర తీసి యుద్ధభూమికి చేర్చి కేతభూపతిని సంధికి పంపిద్దాము. యుద్ధం మానుకొమ్మని చెప్పించి చూద్దాము.
కేతరాజు : ఆ పని బాగుంది. అంతగా తలకు మించితే అప్పుడే యుద్ధం చెయ్యవచ్చు.
నరసింహ : (కొద్దిసేపు ఆలోచించి) మహామంత్రిణీ! చాలా బాగున్నది.
(నలగామరాజు ఆలోచనా నిమగ్నుడై వుంటాడు)
నాగమ్మ : ప్రభూ! దీనికి ఆలోచన అనవసరం. చింతించి ప్రయోజనం లేదు మీరేం చేస్తారు. యుద్ధం మాన్పించటానికి విశ్వప్రయత్నం చేశారు. విఫలమైనారు. వెధవల చేతుల్లో వెర్రి మొర్రి మాటలన్నీ పడ్డారు.
నలగామ : ఏదో ఒకటి మధ్యాహ్నము నిశ్చయిద్దాము.
నాగమ్మ : కార్యాలోచన మధ్యాహ్నమే ప్రారంభిద్దాము.
నలగామ : కేతరాజూ బయలుదేరుదామా?
(నిలవబడి నిష్క్రమణ ప్రారంభిస్తాడు)
నలగామ : నా కోరిక కూడా అదేనోయ్ రాజూ. చివరకు నష్టమెవరికి? ప్రజకు. ప్రజలెవరు? నా బిడ్డలు కారూ.
(కేతరాజు, నలగామరాజు నిష్క్రమిస్తారు)
నరసింహ : మహామంత్రిణీ! కేతరాజు సంధి జరిగించేస్తాడేమో! అప్పుడు మన కోరికలన్నీ భగ్నమౌతవి. అన్నను యుద్దంలోకి తరమటానికి అవకాశముండదు. (బిక్కమొగం పెట్టి)
నా సంతోషము సన్నగిల్లినది యన్నన్ జూడఁగా కేతరా
జున్ వచ్చెను, మాట నేర్పరి, యతం డాప్తుండు ఏ మాడునో
ఈ సన్నాహము సర్వమున్ జెడును, సంధేయైన నో మంత్రిణీ!
ఆ సింహాసన మెక్కు గీత విధి వ్రాయన్ లేదె నా మోమునన్.
రాజ్య సింహాసనం ఎక్కే గీత నా మొగాన వ్రాయనట్లున్నదే! మహామంత్రిణీ!
నాగమ్మ : సంధి జరగటమూ, కల్ల. ఎదుట పరసైన్యాన్ని చూస్తూ ఏ వీరులు సంధి కంగీకరిస్తారు? రణభట్టు పడ్డ అవమానాన్ని, బ్రహ్మన్నకు చెప్పక ఊరుకోడు. అలరాజు మృతి, పేరిందేవి సహగమనాలు, కొమ్మరాజును సంధికి ఒప్పుకోనిస్తాయా?
నరసింహ : (యోచించి) ఒప్పుకో నివ్వవు.
నాగమ్మ : ఈ తడవ అర్ధరాజ్యం, గోవులు, పుల్లరేకాకుండా మరచిపోయింది మరొకటడుగుతారు. దానితో సంధి కుదరదు. యుద్ధం తప్పదు.
నరసింహ : తమ బుద్ధి బలానికి నేనెప్పుడు వందన సహస్రాలు అర్పిస్తున్నాను. నా మీద కనికరం తప్పకూడదు.
నాగమ్మ : (పేచీగా ఓరచూపుతో) మీ మీదనా! అదంతా నా హృదయానికే తెలుసు.
నరసింహ : మరచిపోయినాను. మరిచిపోయింది మరొక్కటి వాళ్ళు కోరుతారన్నారు. అదేమిటి?
నాగమ్మ : మంత్రిత్వ విషయం. నన్ను తొలగించమని తప్పకుండా కోరుతారు.
నరసింహ : అన్న అంగీకరిస్తాడేమో ! నాగమ్మ : దానికి తగ్గ నాటకం నేను ఆడలేకపోతేనా? సంధి పడనివ్వ కుండా చేసే భారం నాది.
నరసింహ : చేతిలో చెయ్యి వెయ్యండి.
(చేయి జాపితే నాగమ్మ చెయ్యి వేస్తుంది)
ఈ నరసింహుడి కోరికలన్నీ ఫలిస్తే నాగమ్మ... మహా మంత్రిణికి బ్రహ్మరథం పట్టించడూ.
నాగమ్మ : ఆ పని చెయ్యవనే అనుమానం ఏ కోశానా లేదు. ఇక లేద్దామా? (నరసింహరాజు లేస్తాడు)
నాగమ్మ : బయలు దేరండి. వెంటనే సైన్యాలకు రేపే బయలుదేరాలని చెప్పండి. (నరసింహుడు నడుస్తుంటాడు) శివరాత్రి నాడు యుద్ధ ప్రారంభమని కూడా.
(నరసింహరాజు తల ఊపి నిష్క్రమిస్తాడు)
(నాగమ్మ ఏకాంతముగా ఆలోచనా నిమ్మగ్నురాలై ఎదుట ఉన్న కాత్యాయనీ విగ్రహాన్ని ఉద్దేశించి ఉచ్చకంఠంతో దేవీ, కాత్యాయనీ! అని సంబోధించి)
నమో నమో రణచండిక!
యమ జిహ్విక నమో నమో!!
కాళరాత్రి గాయత్రీ
లంకేశ్వరి హుంకారీ
నమో నమో రణ చండిక
యమ జిహ్విక నమో నమో!
కదన ప్రియ అభయప్రద!!
దుర్జయినీ హే! జననీ
నమో నమో రణ చండిక!
యమ జిహ్విక నమో నమో!!
(అని ప్రార్థించి కత్తి సారించి నిష్క్రమిస్తుంది)
ఎనిమిదో దృశ్యం
(కారెంపూడి యుద్ధరంగము. బ్రహ్మనాయుని శిబిరములో ఆయన పూర్వ సేనాపతి
కొమ్మరాజుతో చదరంగ క్రీడ జరుపుతుంటాడు. సేనాధిపతి కన్నమదాసు సేనలను
పర్యవేక్షణ చేస్తూ వుంటాడు)
బ్రహ్మన్న : బావా! నీ రెండు శెకట్లూ చచ్చిపోయినయ్.
కొమ్మన్న : అయితే మంత్రిని నడిపిస్తాను - ఇదిగో రాజు.
బ్రహ్మన్న : సరిగ్గా చేతికి చిక్కావు... నీ మంత్రి (పాచికను నడిపించి) ఈ గుర్రంతో సరి... రాజును తప్పుకో. జంట యెత్తులో నీ మంత్రి మసి
కొమ్మన్న : నీ గుర్రాన్ని తీసేస్తున్నాను.
బ్రహ్మన్న : నా బంటుతో రాజు... తప్పుకో నా బంటు మంత్రి అవుతాడు. తోసిరాజని ఆట కట్టిస్తాను. ఇదిగో ఆటకట్టు.
కొమ్మరాజు : నీవెంత కైనా చాత నైనవాడివి... మహా మంత్రీ... ఈ రాజునే కాదు నలగామ రాజునైనా నీ బంటుతోనే కట్టిస్తావు. తలనొప్పిగా వున్నది... ఇక ఆట...
కన్నమ : (హడావుడిగా ప్రవేశించి) తండ్రీ! ఇక ఎంత కాలము? ఈ వీరులను ఇక ఆపలేను. త్వరగా సెలవియ్యండి.
బ్రహ్మన్న : తొందరపడితే ఎలా నాయనా! ఇప్పటికైనా వాళ్ళ మనస్సు తిరుగుతుందేమో
కన్నమ : ఇంకా తిరగటమా తండ్రీ... అనుజ్ఞ!! కొంత బలాన్ని ముందుగా నది దాటిస్తాను.
(వీరముష్టితో నమస్కరిస్తాడు)
బ్రహ్మన్న : తొందర పడకు తండ్రీ! యుద్ధమంటే, నీకేమీ అర్థం కానట్లున్నది. తీరా దిగినతరువాత సగంలో వెనక్కు రాము. అందులో ఈపలనాటి వీరులకు ఒళ్ళు తెలియని పౌరుషం వచ్చేస్తుంది. కొంచెం శాంతించు నాయనా! కన్నమ : నేను సైన్యాలను ఆపలేకుండా ఉన్నాను తండ్రీ! (తెరలో కలకలం) ఓ యోధులారా! కొంచెం శాంతించండి.
బ్రహ్మన్న : (పానీయ పాత్ర లోపలికి తీక్షణంగా చూస్తూ ఉన్న కొమ్మరాజుతో) ఏమిటి బావా, తీక్షణంగా పరిశీలిస్తున్నారు?
కొమ్మరాజు : (చూపిస్తూ) ఈ ఈగను చూడండి మహామంత్రి!
బ్రహ్మన్న : (వంగి చూస్తున్నట్లు మెడ సారించి) ఇప్పపువ్వు సారాయిలో పడ్డ ఇది భయంకర రణరంగంలో పడిపోయిన బ్రహ్మన్న మాదిరిగానే తప్పించుకోటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నది. రణభట్టు రాయబారమైనా విఫలం కాకుండా ఉంటే ఎంత బాగుండేది.
సేవకుడు : (ప్రవేశించి) ప్రభూ! రాయబారిట.
బ్రహ్మన్న : (ఆశ్చర్యంతో ముఖం పైకెత్తి) ప్రవేశపెట్టు.
(సేవకుడు నిష్క్రమిస్తాడు)
(కొమ్మన్నతో) ఈ రాయబారి ఎక్కడినుంచి?
కొమ్మరాజు : నాగమ్మ మతి ఏమైనా తిరిగి ఉంటుందా?
కన్నమ : ఇంకా మీకెక్కడి వెర్రి. దిక్కులు తారుమారైనా ఆ మనిషి గుండె తిరగటం కల్ల. త్వరగా అనుజ్ఞ ఇవ్వక ఇంకా ఎందుకీ ఆలస్యం?
(ఒక సైనికుడు త్రోవ చూపిస్తుంటే కోటకేత రాజు ప్రవేశిస్తాడు)
బ్రహ్మన్న : ఎవరూ? ధరణికోట యువరాజు! కోటకేతూ!! రా! నాయనా, (కూర్చోమని హస్తసంజ్ఞ) భీమరాజుల వారికి కుశలమా?
కేతరాజు : (ఆసనమలంకరిస్తూ) అమరేశ్వర స్వామి కృప వల్ల, రణగండ్ల యుద్ధంలో మీరు చూపించిన అవక్ర పరాక్రమాన్ని నాకు కథలుగా వినిపించి ఎప్పుడూ మీ ప్రశంస చేస్తుంటారు బాబూ!
బ్రహ్మన్న : వారికి నానతులని చెప్పునాయనా! గడిచి బ్రతికితే వచ్చే కార్తిక పౌర్ణమికి అమరేశ్వర దర్శనం, భీమరాజులవారికి ప్రీతిపూర్వక నమస్కారం. కేతరాజు : గడచి బ్రతుకవలసినంత అగత్యం ఏమున్నది బాబూ? అంతా మీ ఇష్టప్రకారమే కానివ్వండి.
కొమ్మరాజు : యువరాజా! నాగమ్మ మిమ్మల్ని పంపించిందా?
కేతరాజు : అవును రాజూ! ఏవిధంగానైనా సంధి పొసగించుకొని రమ్మన్నది. రాజు అంగీకరించాడు.
బ్రహ్మన్న : మలిదేవ మహారాజుకు అర్ధరాజ్యం ఇవ్వటం అంగీకారమేనా?
కేతరాజు : అవును బాబూ!
కొమ్మరాజు : ఆరునెలల పుల్లరీ పంపిస్తుందా?
కేతరాజు : ఇదిగో నా వెంటనే పంపించింది.
కన్నమ : మా గోవులను వదిలి పెడతారా ప్రభూ?
కేతరాజు : (తీక్షణంగా చూచి) వెంటనే వదిలి పెట్టేటట్టు చేయిస్తాను.
బ్రహ్మన్న : అయితే...
కేతరాజు : సంధి పొసగినదన్నమాటే.
బ్రహ్మన్న : సంతోషం!
కేతరాజు : బ్రహ్మప్రయత్నం చేశాను. అన్నదమ్ములు మీరు పోరుకు దిగితే పునీతమైన పల్నాటిసీమ పొలికలనై పోతుందని చెప్పాను. విశ్వ ప్రయత్నం మీద అంగీకరించారు. ఉఁ అయితే...
(బ్రహ్మన్న కొమ్మరాజు కన్నమ చెవులు రిక్కించి వినటం అభినయిస్తారు)
అన్నదమ్ములందరూ ఏకమై రాజ్యాన్నంతా ఏకచ్ఛత్రాధిపత్యం కింద పరిపాలించుకుంటే ఎలా ఉంటుంది?
బ్రహ్మన్న : (పరమానందంతో) అది నాకు మరీ సంతోషం.
కన్నమ : (అసంతృప్తితో గద్గదకంఠుడై) తండ్రీ!
బ్రహ్మన్న : కన్నమా... అడ్డు రావద్దు.
కేతరాజు : సంధి పత్రిక ఇప్పిస్తారా? బ్రహ్మన్న : (తలమీద చేయి పెట్టుకుని ఆలోచిస్తున్న కొమ్మరాజుతో)
బావా! మీకు అంగీకారమేనా?
కొమ్మరాజు : అలరాజు మరణించిన తరువాతనైనా అన్నదమ్ములు తిరిగీ ఆత్మబంధువులవుతున్నారు. తాత్కాలికంగా పౌరుషవాక్యాలు పలికినా దేశాన్ని యుద్ధప్రళయంలో దింపమనడీ కొమ్మరాజు.
కేతరాజు : (త్వరగా తీసి తాళపత్రం అందిస్తూ బ్రహ్మన్నతో) ఇక సంధి పద్ధతి వ్రాయించండి. మలిదేవ మహారాజెక్కడ?
బ్రహ్మన్న : అవతల గొల్లెనలో నిద్రపోతున్నారు. వారి అంగీకారం నేను ఇప్పిస్తాను బావా! పత్రం తీసుకోండి అదిగో ఘంటం.
కొమ్మరాజు : (కేతరాజు చేతిలో పత్రం అందుకొని బ్రహ్మన్న చూపిస్తున్న ఘంటం తీసుకొని వ్రాయటాని కుద్యుక్తుడై) ప్రారంభించండి.
బ్రహ్మన్న : రాజాధిరాజ
కొమ్మరాజు : ఉ!
బ్రహ్మన్న : రాయవేశ్యాభుజంగ
కొమ్మరాజు : ఆఁ!
బ్రహ్మన్న : విభవ దేవేంద్ర వీరకామ నరేంద్ర రాజేంద్రులవారికి
కొమ్మరాజు : ఉఁ!
బ్రహ్మన్న : హై హయ వంశ పారావార విజ్జలదేవీ గర్భశుక్తి ముక్తా ఫలం శ్రీమలిదేవమహారాజు వ్రాయించి ఇచ్చిన... (పెద్ద గొంతుతో) సంధి పత్రం...
బాలచంద్రుడు : (వీరాకృతితో సాటోపంగా ప్రవేశించి వీరముద్రికతో నమస్కరిస్తూ) సంధిపత్రం... ఎవరితో సంధి, ఎందుకు సంధి.... ఎలా సంధి?
(కోటకేతు, కన్నమ, బ్రహ్మన్న బిత్తరపోయి చూస్తుంటారు)
కొమ్మరాజు : బాలుడూ ఏమిటిది?
బ్రహ్మన్న : నాయనా! నీవేమన్నా చెప్పదలచుకున్నావా? లే! బాలచంద్రుడు : (లేస్తూ) అవును సంధి పనికిరాదని చెప్పదలుచుకున్నాను.
బ్రహ్మన్న : కారణం నాయనా?
బాలచంద్రుడు : అర్ధరాజ్యం ఇస్తారటనా?
బ్రహ్మన్న : ఆఁ!
బాలచంద్రుడు : గోవులు వదిలి పెడతారా?
కొమ్మరాజు : ఆఁ!
బాలచంద్రుడు : పుల్లరి చెల్లిస్తారా?
బ్రహ్మన్న : ఆఁ!
బాలచంద్రుడు : (జ్ఞప్తికి తెచ్చుకుంటూ) ఇంకా!
బ్రహ్మన్న : అన్నదమ్ములు అందరూ ఏకమై గురిజాల నుంచి పరిపాలించు కుండేటట్లు సంధి.
బాలచంద్రుడు : అదీ, కావలసిన సంగతి. రాజ్యచక్రం త్రిప్పించేది మహామంత్రిణి నాగమ్మేనా?
(కోటకేతరాజు తెల్లబోయి ముఖం తేలవేస్తాడు)
బ్రహ్మన్న : అయితే ఏం నాయనా?
బాలచంద్రుడు : అది పనికిరాదు. యుద్ధం జరిగి తీరవలసిందే రాబొయ్యే ఈ ఆహవజనమేజయ సర్పయాగాగ్నిజ్వాలల్లో కాలకూట విషం కక్కుతూ నాగమ్మ, మహానాగం, మండి మారణహోమం కావలసిందే. ఆమె ఉన్నంత వరకూ దేశంలో అంతఃకలహాలు తప్పవు.
బ్రహ్మన్న : (ప్రశాంతముగా) సంధి పడగొట్టకు తండ్రీ! అంతటి నాగమ్మ ఇంతవరకూ వచ్చిందంటే ఏదో మార్పుంటుంది.
బాలచంద్రుడు : మార్పా? మళ్ళీ కోడిపందాలాడించటం.
కొమ్మరాజు : యుద్ధం దేశానికి ఉపద్రవం తండ్రీ!
బ్రహ్మన్న : కలుషాలకు నిలయం. కాటకానికి కారణం... పుంస్త్వానికి వేరుపురుగు. బాలచంద్రుడు : యుద్ధం వీరక్రీడ. స్వర్గప్రస్థానానికి ప్రథమ సోపానం. వీటన్నిటికీ కారణం యుద్ధం కాదు. ఉవిద నాగమ్మ,. పెద్దవాళ్ళై యుద్ధం చెయ్యలేక మీరు పిరికి పడిపోతున్నారు. ధర్మయుద్ధానికి తరలి రాలేని మీ బిరుదులు తరవాత తగలెయ్యనా? మగకాశకట్టి సంధికి ప్రాకులాడటం...
కన్నమ : ఆఁ! ఆఁ! తండ్రికపనింద. మామకమర్యాద. వారి దండిమగటిమి నీకేం తెలుసు బాలుడూ. నీవు నిజంగా బాలుడివి. మరొకమాట రానియ్యకు. (కత్తి జళిపిస్తాడు)
బాలచంద్రుడు : పోతులా చియ్యబట్టినా పోరు పనికిరాదన్న ఈ పెద్దవాళ్ళ పక్షం పలికే యీ బాహుబల సంపన్నుడెవరు?
కన్నమ : ఇక సహించను, బాలుడూ!
బ్రహ్మన్న : శాంతించండి నాయనా! శాంతించండి. అన్నదమ్ముల మధ్య అంతఃకలహం పనికిరాదు.
బాలచంద్రుడు : ఇతడు నాకు అన్నా?
కొమ్మరాజు : అవును తండ్రీ... ఇతడు కన్నమ. వీర కన్నమ. సర్వసేనాధిపతి కన్నమ... బ్రహ్మన్న మహామంత్రి జ్యేష్ఠపుత్రుడు.
బాలచంద్రుడు : (ముందుకు నడిచి వీరముష్టితో నమస్కరించి) అన్నా క్షమించు... నీవు వీరకన్నమవని తెలియక తప్పిదం చేశాను.
కన్నమ : (బాహువులు చాచి) అర్ద్రంగా తమ్ముడూ! (ఇద్దరూ కౌగిలించుకుంటారు)
బ్రహ్మన్న : (కేతరాజు వైపు తిరిగి) బాలుడన్నది విచారింపవలసిన విషయమే. ఆ నాగమ్మ మంత్రిణిగా వుంటే భవిష్యత్తులో విపత్తు మళ్ళీ సంభవించకుండా ఉంటుందా అనే సందేహం కూడా సమంజసమైనదే.
కొమ్మరాజు : ఈ బ్రహ్మన్న కాబట్టి ఇంతవరకైనా యీ తడవ నెగ్గగలిగాడు.
బ్రహ్మన్న : కేతరాజూ... ఈ మాటకు నాగమ్మ ఏమంటుందో!
కేతరాజు : మంత్రిత్వాన్ని త్యజించటానికి అంగీకరించదు.
కన్నమ : ఆ పక్షంలో యుద్ధం సాగవలసిందే. బాలచంద్రుడు : అన్నా! మనం యువకులం. భావి రాజ్య భారం మన బాహువుల మీద పడుతుంది. మేలుకోవలసింది మనం. ఈ బాలుడిక ఆగలేడు. బలంతో ముందు దూకబోతున్నాడు.
బ్రహ్మన్న : యువక జనోత్సాహానికి అడ్డు చెప్పటం అంత మంచిది కాదేమో కేతరాజూ!
కన్నమ : (త్వరగా ప్రక్కకు నడచి) వీరాగ్రేసరులారా! ఇక వీరవసంతం చల్లుకోండి. వీరపూజలు చెయ్యండి. కడుపు నిండా కల్లుకుండలు నింపండి. శక్తి జాతరలు చేసుకోండి.
(ముందుకు నడుస్తూ నిష్క్రమిస్తాడు)
బ్రహ్మన్న : తండ్రీ, కేతరాజూ! ఇక నిష్ప్రయోజనం! కల్లుకట్టలు తెగిపోతున్నవి. ఈ కడలిని బ్రహ్మన్న బాహువు లొడ్డి ఆపలేడు. సుపవిత్రమైన యీ పలనాటిసీమ... రక్తపు వరదకు గురికావలసిందే... కొన్ని వత్సరాలు పిశాచాలు పండవలసిందే.
కేతరాజు : అయితే ఇక బయలుదేరుతాను... సెలవా?
బ్రహ్మన్న : అవశ్యము నాయనా... భగవదనుగ్రహం ఎలా వుందో!
(దారి చూపిస్తాడు. కోటకేతరాజు నిష్క్రమిస్తాడు)
బాలచంద్రుడు : తండ్రీ! నాకు సెలవా?
బ్రహ్మన్న : నాయనా! యుద్ధరంగంలో దూకబోతున్నావు. నేను మటుకు కత్తి పట్టను.
భ్రమతో నేగుచునుంటివో రణమునన్ పాండిత్యమే యున్నదో,
సమరోదగ్రులు శాత్రవుల్ కరుణకున్ స్థానమ్ము శూన్యమ్ము, స
ర్వము కాలానల భైరవ ప్రళయ మోర్వంజాలినన్ పొమ్మునే
నమరుల్ సాక్షిగ కత్తిపట్టను, విజయైకాంక్ష నో బాలుడా
బాలచంద్రుడు : పేరు బాలుడే కాని బిరుదు మగణ్ణితండ్రీ! మీరు కత్తి పట్టడం ఎందుకు
భవిష్యద్భారాన్ని మోయవలసిన మీ యువక లోకాన్నే పరదళాల మీదికి పంతం
తీర్చటానికి పంపండి. ఈ బాలుడు చిల్లర దళాల మీద చెయ్యి చేసుకోడు.
బ్రహ్మన్న : (బుజం తడుతూ) అనేక యుద్ధాలల్లో ఎదురు నిలవలేక చిక్కి చెప్పినట్లు శిరసాడించిన రాజులందరూ పగర పక్షంలో బారులు తీర్చారు. జాగ్రత్త! బాలచంద్రుడు : మామా! సెలవు.
కొమ్మరాజు : నాయనా! నాగమ్మ వ్యూహాలు పన్నటంలో భూనభోంతరాలు చాపచుట్ట చేసే ప్రజ్ఞ కలిగింది. కనిపెట్టి కదనరంగంలో కత్తి జళిపించు.
బాలచంద్రుడు : (బ్రహ్మనాయునివైపు సాభిప్రాయంగా చూస్తాడు)
బ్రహ్మన్న : సవ్యసాచివై, శరపరంపరలతో శత్రుసైన్యాల మీద చాంపేయాన్ని సృజించు తండ్రీ! పద్మవ్యూహాలను పటాపంచలు చెయ్యి.
బాలచంద్రుడు : (వీరావేశంతో)
ఏ ఘోరంబుగ వైరి వాహినులపై నింకింప బాణాసనా
మోఘాస్త్రంబుల భీష్మగ్రీష్మ కుతపంబుల్ తృప్తికాయింపగా
నాఘోషించెడు భుగుృగ ధ్వనుల కన్నా! మిన్ను మన్నేక మై
నన్ ఘూర్ణిల్లవె సప్తసాగరములున్ నర్తించి కల్లోలమై.
(వీరముష్టితో కూర్చుంటాడు-బ్రహ్మన్న దీవిస్తాడు. లోపల నుంచి జై బ్రహ్మన్న తండ్రికీ
తొమ్మిదో దృశ్యం
(యుద్ధభూమి, బాలచంద్రుడు తన బలాన్ని ఉద్దేశించి)
బాలుడు : అన్నా! దోర్నీడూ! ఆ గజబలానికి అధిపతివి నీవు. తమ్ముడూ చందూ! అశ్వబలాన్ని నీవు నడిపించు. మల్లూ! దక్షిణ ముఖంగా ఆవృతం కొట్టి ఆ విలుకాండ్రను నీవు నడిపించుకోరా. గజ్జల బొల్లణ్ణి కదనుత్రొక్కించు కుంటూ నీ వీపులమీద వస్తాను. వెన్నిచ్చి పారిపోవటం వెలమ వీరుల లక్షణం కాదు. పల్లరగండ గాయగోవాళ బ్రహ్మన్నపట్టి నవ్యవీరాభిమన్యుడై, మిమ్మల్ని నడిపిస్తుంటే ప్రళయ భైరవమూర్తి ప్రత్యక్ష తాండవం కూడా మిమ్మల్ని ఆపలేదు. మీ సింహనాదం శత్రుగజబలానికి గర్జానినాదమై గుండెలవిసి నేల వ్రాలాలి. క్రూర నారాచ, పరంపరలతో మహాప్రళయ కాల జంఝా మారుతాలు చెలరేగించి శాత్రవారణ్యాలను చెల్లాచెదరు చెయ్యాలి. అజానేయ పాద పరిన్యస్త మంజు మంజీర ఘళ ఘళంఘళార్భటులతో శాత్రవ శిరఃకందుక క్రీడావినోదులై వీర పల్నాటి విజయగాథలు భవిష్య ద్వీరయువకోద్రేక గాథాపరంపరలు కావించండి. ఆశ్రితరక్షా పరగండ భైరవుడు అరివీర మృగరాజ భయంకరుడూ, శత్రు శార్దూల శరభేంద్రుడూ సర్వసేనాధిపతి మా అన్న కన్నమ. అతడే సమస్తాన్ని అనువర్తింపచేస్తాడు. అందరినీ అంచెలంచెలుగా కనిపెట్టి చూస్తుంటాడు. పదండి! ముందుకు సాగండి!!
పిరికి తనమ్ము శాత్రవుల వీపుల కెత్తుడు, పోటు బంటులై
కరుకు తనమ్ముతో పరుల కండలచీల్చి కవోష్ణరక్తమున్
చరచర త్రావి కత్తులను చాదుడు వారి కపాలపాళి, ఈ
తరుణము తప్పెనా మనకు తప్పదు దాస్యము జన్మజన్మలన్.
(జై బ్రహ్మన్న తండ్రికీ జై, జై బాలచంద్రుడికీ జై అని సైన్యకోలాహల ధ్వనులు వినిపిస్తవి.
బాలచంద్రుడు వెనుకకు తిరిగి అప్పటికే ప్రవేశించి నిలిచిన కన్నమదాసుతో)
అన్నా! నీ అనుజ్ఞకోసమే.
(వీరముష్టితో నమస్కరిస్తాడు)
నీతో నాలుగు మాటలు చెప్పటానికని వచ్చాను... ఉడుకు రక్తాన్ని ఊరికే పొంగనీయకు, ఉన్మత్తుడవైపోతావు., ముందు వెనుకలు చూచుకోలేవు.
నాగమ్మ విషయం జాగ్రత్త! జ్ఞప్తికుంచుకో!! నాలుగు కళ్ళ కనిపెట్టు.
బాలుడు : (స్వోత్కర్షగా) అన్నా! నీ తమ్ముడు గారుడాస్త్ర ప్రయోగంలో గట్టివాడు తెలుసునా? ఈ కొనగోటి గీటుకు ఎన్ని మాహానాగాలైనా చరచరా చుట్టుకొని గిలగిలా కొట్టుకొని భుగభుగలతో విషవహ్నులు క్రక్కి విరిసి పోవలసిందే!
కన్నమ : (బుజం తడుతూ) నీ పౌరుష పరాక్రమాలు ఎంతటి బాహుబల సంపన్నులనైనా పిరికి పందలను చేస్తాయని తెలుసును. అయినా, నాగమ్మ కుటిలనీతి విశారదురాలే కాదు. కుటిల యుద్ధవిశారద కూడాను. అందువల్లనే ఇంతగా చెప్పవలసి వస్తున్నది. అలరాజు ప్రజ్ఞావంతుడూ, పరాక్రమ వంతుడూ కాడు? ఆ తంత్రజ్ఞురాలి చేతిలో ఏమైనాడో జ్ఞప్తి లేదూ?
బాలుడు : అన్నా! ఇక నిమిషం ఆగలేను. అలరాజు హత్యకు తగ్గ ప్రతీకారం... అబ్బా! వట్టి మాటలెందుకు? చేసినప్పుడు కాని, తెలియదన్నా! ఆ నరసింహుడి తల తరిగి మామకు కానుకిచ్చి ఆయన దానిని మట్టిలో పొర్లించి చటులాట్టహాసం చేస్తుంటే కాని ఆగలేను. అన్నా! అనుజ్ఞ!!!
కన్నమ : (దీవిస్తూ) విజయవంతుడివి కా నాయనా!
బాలుడు : సెలవు.
(నిష్క్రమిస్తాడు)
కన్నమ : (వ్యూహాలను పరీక్షిస్తూ) నాగమ్మ, దక్షిణ బలాన్ని కదిలిస్తే నేను నా ఉత్తర బలాన్ని ముందుకు నడిపించాలి. వాటికి ప్రస్తుతం ప్రబోధం అవసరం. బాలుడు చిచ్చర పిడుగు. వెయ్యికళ్ళతో కనిపెట్టి ఉండాలి. ప్రస్తుతం చూస్తూ ఉండమని మామతోనూ తండ్రితోనూ చెప్పి వెళ్ళుతాను... మామా! మామా!!
(శిబిరములోకి నిష్క్రమిస్తాడు)
పదో దృశ్యం
(కారెంపూడి యుద్ధభూమి బ్రహ్మనాయుడూ కొమ్మరాజూ తమ శిబిరాలముందున్న
ఉన్నత ప్రదేశం మీద నిలవబడి యుద్ధరంగాన్ని పరిశీలిస్తూ ఉంటారు)
బ్రహ్మన్న : బావా! ఆ గుర్రపుదళం ఎలా దూకుతూ వెడుతున్నదో చూస్తున్నారా?
కొమ్మరాజు : ప్రళయ కాలంలో సముద్రపు కెరటాలల్లే కేరింతలు కొడుతున్నది.
బ్రహ్మన్న : కాల్బలంలో ఒక్కొక్క శ్రేణికి ఒక విధమైన దుస్తులతో చూడటానికి ఎంతో ఇంపుగా యుద్ధదేవత మగ్గాలశాలలా ఉన్నది కదూ?
కొమ్మరాజు : ఉభయ సైన్యాల మధ్యా నాగులేరు నాగమ్మ బుద్ధిలా కుటిలంగా ఎలా ప్రవహిస్తున్నదో గమనించారా? ..... ఏమిటా కోలాహలం? బాలుడు రంగ మధ్యంలో ప్రవేశించాడు.
బ్రహ్మన్న : (సంతోషంగా) ఎప్పుడూ బొంగరాలాడుకునే వాడు వీడు ఇంతగా యుద్ధం చేయటం ఎప్పుడు నేర్చుకున్నాడయ్యా?
కొమ్మరాజు : (సాభిప్రాయంగా) సింహపు పిల్లకు వేటాడటం ఎవరు నేర్పితే వచ్చిందంటారు?
బ్రహ్మన్న : (వినిపించుకోనట్లుగా) బావా! అటుచూడండి రెప్పపాటులో మెరపు మెరసినట్లుగా దక్షిణ మండల ప్రచారం చేశాడు. అవతల వీరుడూ, ఎవరో గట్టివాడు సవ్యప్రచారం చేసి తప్పించుకున్నాడు.
కొమ్మరాజు : చంద్రుడి యుద్ధ ప్రారంభం రణగండ్లలో తమ వీరవిహారాన్ని జ్ఞప్తికి తెస్తున్నది.
బ్రహ్మన్న : శత్రుపక్షంలో వీరులు బాలుడి ధాటికి ఆగలేక పారిపోతున్నారు... బావా! ఎందుకో ఇప్పుడు బాలుడు చేసే యుద్ధం నేను చేస్తున్నట్లున్నది.
కొమ్మరాజు : బాలుడు సరిగా మీ యౌవనరూపమే. అచ్చుగుద్దినట్లుంటాడు. బ్రహ్మన్న : (బిగ్గరగా, మైమరచి) యశస్విని కా నాయనా, బాలుడూ! తండ్రి పేరు నిలువబెట్టు. హృదయానికి పట్టరాని సంతోషం కలుగుతున్నదోయ్ తండ్రీ.... బావా! బాలుడి యుద్ధం నా చేత కూడా కత్తి పట్టించే టట్లున్నది.
కొమ్మరాజు : తమకు బాలచంద్రుడి వల్ల కూడా సత్కీర్తి.
బ్రహ్మన్న : బావా! అలరాజు త్యాగాన్ని ఆంధ్రలోకం మరచిపోలేదు. అతని మూలకంగా మీకు లోకోత్తరతమైన కీర్తి ఏనాడో ప్రాప్తించింది.
(కొమ్మరాజు పుత్రదుఃఖంతో శిరస్సు వంచుకుంటాడు)
బ్రహ్మన్న : (ఉద్వేగంతో) ఉన్నట్లుండి బావా, బాలుడెందుకో ఆవైపు వెళ్లుతున్నాడు.
కొమ్మరాజు : (పరికించి) నరసింహరాజు మీదికి తలపడ్డట్లున్నాడు.
బ్రహ్మన్న : నిజమే. ఆ మూల తుములయుద్ధం ప్రారంభమైంది. బాలుడి మిత్రులందరూ ఆ వైపు చేరుతున్నారు.
బాలచంద్రుడి గొంతుక : పిరికి పందల్లా పారిపోవద్దు.
ఒక యోధుడి గొంతు : నీ మొగతనానికేనా?
బాలచంద్రుని గొంతుక : కాచుకోండి. యముడి వంటింటికి చేరుకోవాలి.
(కత్తుల కణకణలూ, హాహాకారాలు వినిపిస్తవి)
కొమ్మరాజు : అదీ దెబ్బ! కుమ్ముడు తగరు త్రిప్పు. ఢాక కొట్టు.
బ్రహ్మన్న : (సోద్వేగంగా) బాలుడేడి బావా?
కొమ్మరాజు : అడుగో. అటువైపు. బల్లెపుయుద్ధం ప్రారంభిస్తూ
బ్రహ్మన్న : (వికసిత ముఖంతో) అవును బావా! శత్రుసైన్యానికి సుడిగాలై ఎండుటాకులలా గిరగిరా...
(జయ్ బాలచంద్రుడికి జై, జై బ్రహ్మన్న మంత్రికీ జై, జయ్ చెన్నకేశవా జై అనే హర్షధ్వానాలు వినిపిస్తవి
బ్రహ్మన్న : బావా! ఏమిటా కోలాహలం?
కొమ్మరాజు: నాకూ ఏమీ అర్థం కావటం లేదు. (నరసింహుడు కాదు, నరసింహుడు కాదు. తిరగండి. పట్టుకోండి. జై చెన్నకేశవా, జై చెన్నకేశవా అని కేకలు వినిపిస్తవి)
బ్రహ్మన్న : బావా! ఎవరా పారిపోయేది?
కొమ్మరాజు : నరసింగరాజు
బ్రహ్మన్న : నరసింగరాజా!
కొమ్మరాజు : బాలుడు అతనితో ద్వంద్వ యుద్ధానికి తల పడ్డాడు.
బాలచంద్రుని గొంతుక : ఏం నరసింహా వెనుదీస్తున్నావు?
నరసింహరాజు గొంతుక : ఆదిగొని నీ ప్రాణాలు హరించటానికి
బాలచంద్రుని గొంతుక : అబ్బా! (భీకర కంఠంతో)
ఆడునె చేయి యుద్ధములు ఆడిన దయ్యలరాజు చంప ని
నాన్నడగ జేయ నయ్యతివ నాగమ సిగ్గు శరంబు మాని నీ
వాడెడు కీలు బొమ్మవిటు లాహవ భూమిని నిల్వనేల పో
రాడగ వేశ్య లిండ్లను సరాగములాడగ పొమ్ము ధీరుడా!
ఇదుగో ఈ తోరహత్తాన్ని తప్పుకో.
(ఆయుధముల కణకణలు వినిపిస్తవి)
కొమ్మరాజు : (ఆనందంతో) బలే, బాలుడు తోరహత్తాన్ని కొట్టాడు మహామంత్రీ !
బ్రహ్మన్న : నరసింహుడు ధట్టనతో తప్పుకుంటున్నాడు.
కొమ్మరాజు : అయ్యో! బల్లెం డొక్కకు మోటించాడు, త్రిప్పు, నొక్కు, లొంగిపోతాడు.
నరసింహుడి గొంతుక : వెనుకడుగా, ఈ దెబ్బతో సబ్బాయి గుబ్బలమీద పడతావు. బొంగరాలాటట్రా?
బాలచంద్రుడి గొంతుక : ఆటే. నీ తలే బొంగరం. కాచుకో.
నరసింహరాజు గొంతుక : హాఁ (మరణ సూచక ధ్వనిగా వినిపిస్తుంది)
బ్రహ్మన్న : బాలుడూ అక్రమం, అన్యాయం, అధర్మం. కొమ్మరాజు : అడుగో బాలుడు విజయ ఘోషతో నరసింహుడి తల బల్లెపు కొనకు గుచ్చుకొని వచ్చేస్తున్నాడు.
(జై బాలచంద్రుడికీ జై, జై బ్రహ్మన్న తండ్రికీ జై అనే హర్షధ్వానాలు దగ్గరికి వస్తూ బిగ్గర బిగ్గరగా వినిపిస్తవి. బాలచంద్రుడు బల్లెపు కొనకు గుచ్చిన నరసింహరాజు తలతో నురుగులు కక్కుతూ ప్రవేశిస్తాడు)
బాలచంద్రుడు : మామా! ఇదిగో అలరాజును హత్య చేసిన దుర్మార్గుడి తల, కళ్ళతో చూచి కాళ్ళతో తన్ని శాంతించు.
బ్రహ్మన్న : చంద్రుడూ!...
శిరమిటు త్రుంచి తెచ్చితివి, చిత్తము నొచ్చెడి, పెంచినారమీ
నరపతి తమ్మునిన్ మనసు నన్ గల ప్రేమరసమ్ము వాసి, నీ
పరుసదనంపు వాదరకు పాల్పడె! జేసితె, నేను మామయున్
పరమసుఖానమెత్తు మను భావన ద్రోహమొనర్చినావురా!!
మామా, నేనూ మహోత్కృష్టకార్యం చేశావని మెచ్చుకుంటామను కున్నావా? ఇది
మహాద్రోహం!
బాలుడు : (నిర్ఘాంతపడి) ద్రోహమా?
బ్రహ్మన్న : (బిగ్గరగా) మహాద్రోహం! మహా పాపం!! బందీగా తేవలసిన వాడిని బల్లెపు కొనకుగుచ్చుకొని వచ్చావు. అతడెవరనుకున్నావు, పాపీ?
బాలుడు : పగ సాధించానని బ్రహ్మానందంలో వచ్చాను, పాపినా?
బ్రహ్మన్న : (నిష్కర్షగా) ముమ్మాటికీ.
బాలుడు : (కొమ్మరాజువైపు తిరిగి) నిజమేనా మామా!
కొమ్మరాజు : (నింపాదిగా) పాపమే నాయనా?
బాలుడు : (నిరుత్సాహంతో) పాపిని చంపటమూ మహా పాపమా!
పాపమె, పాపమే, పగరపైకొని ప్రాణము లాహరింపగా
పాపమె! చంప పాపి నిటు పాపమె! ఒక్కట తారుమారుగా
పాపము పుణ్యమిట్లు ఇక ప్రాణములన్ పనియేమి. ఇట్టి నా
పాపపు రూపుమాప నరిపైబడి నే నిక మాసి పోయెదన్.
(నిముషం నిలువలేకుండా వేగంగా నిష్క్రమిస్తాడు)
బ్రహ్మన్న: బాలుడూ!... బాలుడూ!!.... (బాలచంద్రుడు నేలమీద దొర్లించిన నరసింహుడి తల దగ్గిరకు చేరి) నరసింహా! నాయనా!! నీ చేతలే నిన్నింతకు తెచ్చినవి. అన్ని దినాలూ చెప్పినట్లు రావు. క్రోధాలు పెరిగిపోయినవి. కొట్లాట బలిసింది. (శిరస్సు చేతిలోకి తీసుకొని) నరసింహా ఒకనాడు తూగుటుయ్యాలలో సుఖనిద్ర పోయిన శిరస్సుకు ఈనాడు దుమ్ములో దొర్లాడవలసిన దుస్థితి వచ్చింది? చిన్ననాడు నీ బంగారపుటుయ్యాలను ఊపిన ఈ చేతులు చివరిసారి నీకు చిచ్చికొట్ట తలచుకున్నవి. పద, చిరనిద్ర పోదువుగాని తండ్రీ! (నడుస్తూ) చెన్నకేశవా! చెన్నకేశవా!! మహాప్రభూ!!!
(నిష్క్రమించే బ్రహ్మనాయని కొమ్మరాజు అనుసరిస్తాడు)
పదకొండో దృశ్యం
(కారెంపూడి యుద్ధరంగం. శిబిరంలో మనస్థిమితం లేని నలగామరాజు ఏకాంతముగా)
నలగామరాజు: అయ్యో! అయ్యో!! అన్యాయము. అత్యాచారము. మోసము. ద్రోహము. (వెకిలిగా) నరసింహా! నరసింహా!! నీ దురాశకు తగ్గ శాస్త్రి ఈనాటికి జరిగింది. నేను రణరంగంలో చచ్చిపోయే వాడినీ, నీవు శిలకొట్టుకొని నిల్చి రాజ్యమేలేవాడివీనా? అమ్మ నీ ఆశ కొరికెయ్య! ద్రోహీ! సంతోషించు. ఇప్పుడు సంతోషించు. బాలచంద్రుడు నిన్ను బల్లెపు కొన సింహాసనం ఎక్కించాడుగా. విశాల సామ్రాజ్యం వచ్చింది. విశ్వమంతా నీదే ఉఁ.... (వికట హాసంతో) ఇక ఏలుకోవటమే తరువాయి. ఓహో అక్కడ కూడా నాగమ్మ మహామంత్రిణి నీచేత రాజ్యచక్రం త్రిప్పిస్తుంది కాబోలు!
నన్ను హత్య చేయటానికి నీవు పంపించిన కింకరులు ఏమైనారో తెలుసునా? వారిని నా కరవాలం కాళీకైంకర్యం చేసింది. నీకంటే ముందు వీరస్వర్గం, కాదు వీర నరకం చేరుకున్నారు. నీకు ఆహ్వాన పత్రికలు పంచి పెట్టటానికి. తండ్రీ! అలరాజూ! నీబోటి ధర్మవీరుడు పదిజన్మలెత్తినా నాబోటి నరాధముడికి అల్లుడు కాడు. అమ్మా పేరిందేవీ, నీవన్నట్లే నా రాజ్యకాంక్ష నాకీ విపత్తు తెచ్చి పెట్టింది.
దేశంలో ప్రజలందరూ నా పక్షమట! నట్టేటిలో ముంచారు. ప్రజ ఎవరి పక్షమో ఒకమాటు బ్రహ్మన్న అన్న బలాన్ని చూస్తే తెలుస్తుంది. లెక్కకు నాకూ ఉన్నది సైన్యం ఎందుకు? తినటానికి, త్రాగటానికి, తాగితందనాలు వెయ్యటానికి. పౌరుషంతో పరబలాన్ని ఎదుర్కొనే వెధవ ఒక్కడూ లేడు. ప్రతివాడి హృదయం నీవు అధర్మంవైపు పోరాడుతున్నావని ఉద్బోధిస్తుంటే ఎందుకు ఎదుర్కొంటాడు. బ్రహ్మన్న అన్న బలంలో ప్రతి ఒక్కడూ చిచ్చుల పిడుగు. చండప్రచండుడు. ధర్మవీరంతో తాండవించే యోధుడు.
వికట మహాట్టహాసముల వెల్లువలైనవి రక్త వాహినుల్
ఒక పెనుభూతమై చెలగుచున్నది క్షామము మృత్యుమూర్తియై
అకటకటా మహాత్ము డతడాడిన మాటలు లెక్కసేయవౌ
యకుటిల చిత్తవృత్తి నిను నంతగ నమ్మితి మోసపోయితిన్
(కత్తివైపు వెర్రిగా చూచి ఆత్మహత్యకోసం మెడమీద సారించి జయ్ మహాదేవా మళ్లీ వెనుకకు లాగుకొని)
పాప మొనర్చితిన్, పరమబంధుల కానల పాలు చేసి పరి
తాపము నిచ్చితిన్, రుధిరధారల ముంచితి పుణ్యభూమి నే
నోపగ రాని దుఃఖముల నొంచితి భూప్రజ - వెర్రికీ
పాపికి తావు లేదిల కృపాణమ జాలి వహింప నేటికే
నాగమ్మా (ఏహ్యకంఠంతో) మహామంత్రిణీ! నీవు ఆ కడజాతి కన్నమదాసు కత్తికి
ఆహారమైతే చూచి ఆనందించి గాని ఆత్మహత్య చేసుకోను. హంతకీ! ద్రోహీ!! నాగమ్మా !
పాపినీ! చండాలినీ.
(ఒరనుండి లాగిన కత్తితో నాగమ్మ ప్రవేశిస్తుంది)
నాగమ్మ: ప్రభూ ఏమిటీ ఉన్మాదం?
నలగామ: (కోపంతో) ఆఁ. ఉన్మాదమా! జాగ్రత్తగా మాట్లాడు.
నాగమ్మ: మీలో ఈ మార్పుకు కారణం?
నలగామ: (నిష్కర్షగా) నీ ద్రోహము.
నాగమ్మ: (వికటంగా నవ్వి) నా ద్రోహమా! 'పాపినీ' 'చండాలినీ' ఇన్నాళ్ళు మీ సేవ చేసినందుకు మంచి బిరుదులు ప్రసాదించారు. పోనీయండి. పైన పరమశివుడే ఉన్నాడు. కనిపెట్టటానికి.
నలగామ : (వికృత కంఠంతో) కనిపెట్టడూ? ఇప్పటికే చాలా బాగా కనిపెట్టాడు. నాకు నీవు సేవ చేశావు కదూ. రాక్షసీ! నీ చెప్పుచేతల్లో పెట్టుకొని సేవ చేయించు కున్నావు. నా రాజ్యపాలనా కాంక్షను వృద్ధిచేసి దేశానికి తీరని ఉపద్రవం తెచ్చిపెట్టావు. నీ కోరికలన్నీ ఫలించినవి. నన్ను చంపించావు. నరసింహుణ్ణి పలనాటి రాజ్య సింహాసన మెక్కించావు. ఇక నువ్వు మర్యాదగా మరణించవచ్చు. దేశ మికనైనా బాగుపడుతుంది.
(సైన్యాలు పారిపోతూ ఉన్న కలకలం వినిపిస్తుంది)
నలగామ: పోయి అడ్డంపడి ఆపు.
నాగమ్మ: అయితే మీకు జయం అవసరం లేదా?
నలగామ: (నిశ్చయంతో) దేశ క్షేమం కోసం, ప్రజా క్షేమం కోసం నాకు అపజయమే కావాలి.
నాగమ్మ: (బెదిరింపుగా) సైన్యాన్ని ఆపరా?
నలగామ: (కత్తి ఒరనుంచి బయటికి లాగుతూ) నీ బెదిరింపులకు ఉలకను. విస్తారంగా మాట్లాడితే కరవాలానికి బలైపోతావు.
నాగమ్మ: (ప్రశాంతాన్ని నటిస్తూ) నాకు అంతకంటే ఏమి కావాలి. తమ మేలు కోరినందుకు చివరకు తమ చేతిలోనే మృత్యువు పొందటం ఎంత మంచి విషయం. కానివ్వండి. (కత్తికి క్రిందుగా తలవంచి నిలుపుతుంది)
నలగామ: (నెమ్మదిగా కత్తిరించి) నిన్ను నా కత్తికి బలి ఇచ్చి ఆ కడజాతి కన్నమదాసు కత్తికి అన్యాయం చెయ్యను. అది నిన్ను కడుపులో వేసుకొని ఆకలి తీర్చుకుందామని ఆశపడుతున్నది.
నాగమ్మ: ప్రభూ! అయితే తమ ఉద్దేశం?
నలగామ: నా ఉద్దేశమా? నీవు పాపివి. ద్రోహివి. హంతకివి. నరసింహుడు అమాయకుడు. రాజ్యాన్ని ఆశపెట్టి ఆడించావు. మోసగించావు. రుధిరధారల్లో ముంచెత్తి దేశానికి క్షామం తెచ్చిపెట్టావు. ఈ నలగాముడు ఇక నీకు దాసుడు కాడు. సర్వతంత్ర స్వతంత్రుడు. బ్రహ్మన్న అన్న పాదాలమీద పడి పవిత్రమైన వాటిని నా కన్నీటితో పంకిలం చేయటము తప్ప మరొక పని చేయలేను. నీ ఇష్టం. (అవేగంతో నిష్క్రమిస్తాడు)
నాగమ్మ: (ఏకాంతంగా శివ ప్రతిమను ఉద్దేశించి)
(మహాదేవా! మహాదేవా!! కథంతా అడ్డంగా తిరగటం మొదలు పెట్టింది. తిరగవలసిందే. లేకపోతే దీనికి అంతెక్కడ? నా ఆశాలతలు ఫలించినవి. స్త్రీ బుద్ధిబలాన్ని లోకానికి ప్రదర్శించాను. కానీ, నేను పాపినీ, హంతకినీ ఐనాను. కాక తప్పలేదు. భవిష్యత్తులో లోకం నన్ను మహాపాపి అని చరిత్రల్లో వ్రాసుకొని చదువుకుంటుంది కాబోలు! అబ్బా! ఆ వ్రాతలు నా ఆత్మ ఎలా వినగలుగుతుంది తండ్రీ! భరించలేను. నా హృదయ సౌశీల్యం నీ వొక్కడికి తప్ప మరెవ్వరికీ తెలియదు కదా!
ప్రసవము నాయెడంద, మధుపాత్రల కోర్కెలు తీర్చలేదు, ఈ
కుసుమ సుగంధ చాలనలకున్ జగమెంత ప్రతీక్ష చేసెనో
పసదన మిచ్చి తృప్తి పరుపన్ తరిగాదు ఉమామహేశ! ఈ
ప్రసవము కాంక్షచేసి విషవాసనలన్ ప్రసవింప పూనుటన్
లోకానికి బహిర్గతం కాకపోతే విచారించను. ఇది నీ హృదయంలో హత్తుకుంటే చాలు జగద్రక్షకా! జగచ్చక్షూ!! విశ్వవ్యాపీ!! మహా దేవా!!!
తండ్రీ! నీ రక్త దాహం చల్లారిందా? చల్లారకపోతే మిగిలినది తీరుస్తాను. పారిపోయే సైన్యాలను ఆపి బ్రహ్మన్న మీద పడతాను. అతడినీ అతడి రాజకులాన్నీ అంత మొందించిగాని మరీ మృత్యువు వాతపడను. రౌరవాది నరకాలల్లో అనేక జన్మలు ఆవాసం చెయ్యవలసి వచ్చినా వెనుదీయను. ఇది తథ్యం. తండ్రీ!
స్ఫాయద్భీరక మంద్రగర్జ విపులాశా గర్భ నిర్భేదమై
మ్రోయన్, శాతశిలీముఖ ప్రకర సంబుద్ధేద్మ విద్యుద్యుతుల్
కాయన్ సంగర వీథిరక్త జలదాకారమ్ముతో శత్రురా
ట్కాయంబుల్ రుధిరాప్లుతంబులుగ రక్తాంబోధి వర్షించెదన్.
(నాగులేరు పొంగులు వారుతూ ప్రవహిస్తూ ఉంటుంది. చెల్లాచెదరై పారిపోతూ ఉన్న సైన్యాన్ని ఆపుచేసి నాగమ్మ ఉద్బోధ గీతం పాడుతుంది)
పొంగవే, పొంగవే ఓ నాగులేరా!
ఉప్పొంగి పొంగించు మా వీరహృదయాల
రుధిరారుణ ప్రభల
లోకాల ముంచెత్తి
ప్రళయకాల మహోగ్ర
భయద హేషార్భటుల - పొంగవే
పాతాళ లోకాల
పగిలించి పెఠిలించి
గగనముల చుంబించి
కడలిలో బింబించి - పొంగవే
ఉత్తుంగ భంగాల
క్రొత్త నడకలు నడచి
శత్రువీరుల గుండె
నెత్తురులతో నిండి
పొంగవే! పొంగవే ఓ నాగులేరా!
ఉప్పొంగి పొంగించు మా వీరహృదయాల!!
(ఆమె కంఠంతో శ్రుతి కలిపి అందరు సైనికులూ వంత పాడతారు)
పన్నెండో దృశ్యం
(యుద్ధరంగము, బ్రహ్మనాయుడు, కొమ్మరాజూ శిబిరము లోపల విశ్రమించి ఉంటారు. బయట కన్నమదాసూ, మలిదేవమహారాజూ రణరంగాన్ని పర్యవేక్షిస్తుంటారు)
కన్నమదాసు: ప్రభూ! అడుగో, బాలచంద్రుడు ప్రళయాగ్ని గోళాలను పగిలిస్తున్నాడు. అతని అగ్నిబాణ ప్రయోగానికి శత్రుసైన్యాలు ఎలా చెల్లాచెదరై పోతున్నవో చూస్తున్నారా?
మలిదేవుడు: అతని భీకర సింహనాదాలకు మహాసముద్ర మధ్యంలో ఉన్న కొండలూ ఏనుగులు ఘీంకారం చేసి ఎలా నేలవాలి మునిగిపోతున్ననో కన్నమా అటుచూడు.
కన్నమ: కాల్బలం మొలబంటి రక్తప్రవాహంలో ముందుకు వచ్చేస్తున్నది. (వెనుకకు తిరిగి శిబిరంలో ఉన్న కొమ్మరాజుతో) మామా! బాలచంద్రుడు మళ్ళీ పుట్టిన సవ్యసాచి ననిపిస్తున్నాడు.
మలిదేవుడు: భారతయుద్ధంలో పద్మవ్యూహాన్ని పటాపంచలు చేయలేక పోయినానన్న పౌరుషంతో బ్రద్దలు కొట్టడానికి ((బ్రహ్మనాయునితో) అన్నా! నీ కడుపున పుట్టిన వీరాభిమన్యుడే ననిపిస్తున్నాడు.
బాలచంద్రుడి గొంతుక: నాగమ్మా! పిరికి పందా!!
నాగమ్మ గొంతుక: ఈ నాగమ్మ నరసింహుడు కాదురా!
బాలచంద్రుడి గొంతుక: వాడి మొగతనం సహజం. నీది తెచ్చిపెట్టుకున్నది.
నాగమ్మ: బాలచంద్రా!
అరుదర నన్ను బోలు మహిషాసుర మర్దని ముజ్జగంబులన్
పురుషుడ నంచు పొంగెదవు పోరుకు వచ్చిన ఆడుదానికిన్
సరియగు పౌరుషంబు కనజాలను నీకడ గొప్పకోసమై
కరమున దాల్చి కైదువులు కయ్యమున్ నిలువంగ జోదువే.
డాస్ఫాలనాస్ఫోటమాన నిర్వక్ర నిశిత బాణాఘాత ప్రవిభిన్న మస్తకా! కాచుకో! (బాణ వర్షము కురిసిన శబ్దం వినిపిస్తుంది)
(బహ్మనాయుడూ కొమ్మరాజూ ప్రవేశిస్తారు)
కొమ్మరాజు: కన్నమా! అవతలి పక్షంనుంచి కొత్తబలం ఏదో కదిలి వస్తున్నది.
కన్నమ: అవును మామా! నాయకురాలు దక్షిణ బలంతో చంద్రుడి మీదికి వచ్చింది.
మలిదేవుడు: అన్నా! నేను వెళ్ళి ఆమెను అడ్డగిస్తాను.
బ్రహ్మన్న (వద్దన్నట్లుగా) నాయనా మీరా!!
మలిదేవుడు: లేదన్నా.
బాలుని యుద్ధ దర్ప విభవంబు ముదావహమై గభీరమై
ఆలము చేయగా పిలచు, ఆతురతన్ కరమేగి పట్టె నా
భీల కృపాణముష్టి, పరభీకర కాంతిరసప్రవాహ ధా
రాలవనంబునన్ మెరసి - రక్త సరితతులన్ సృజించనే.
ఆపకన్నా అనుజ్ఞ!!
బ్రహ్మన్న: (సవినయంగా) ఇది మీరు యుద్ధరంగంలో ప్రవేశింప తగిన సమయం కాదు... నీవు ఉత్తర బలాన్ని కదిలించు... ఉఁ (అనుజ్ఞా సూచకంగా హస్తసంజ్ఞ చేస్తాడు)
కన్నమ: (రెండడుగులు ముందుకు నడిచి తన సైన్యంతో) మంజినీడూ! గుర్రపు దళాన్ని నీవు నడిపించు. కేతయ్యా! నీవు కాల్బలాన్ని, నాగమ్మ బాలుని చుట్టుముట్టింది. జాగ్రత్త!
(జై బ్రహ్మన్న తండ్రికీ జై అనే ఘోషలు కొద్దిసేపు సైన్యంలోనుంచి వినిపిస్తవి. కన్నమదాసు నిష్క్రమిస్తాడు)
కొమ్మరాజు: (యోచనా పూర్వకంగా) సైన్యాల నడిపించవలసిన భారం ముది జోదులమైన మనదాకా వచ్చేట్లుంది.
బ్రహ్మన్న: కన్నమ రణరంగములో ప్రవేశించిన తరువాత మనం కత్తి పట్టవలసిన అవసరం ఉండదనుకుంటాను. కొమ్మరాజు: బాలచంద్రుడు ఇంకా ప్రచండ యుద్ధం సాగిస్తున్నాడు.
బ్రహ్మన్న: (ఆనని చూపుతో) బావా! నాగమ్మ బాలుని తప్పించుకొని వెనుకకు వచ్చినట్లున్నది.
మలిదేవుడు: అధర్మ యుద్ధానికి దిగుతుందేమో రాక్షసి! అన్నా! నాకేదో చెప్పరాని భయం వేస్తున్నది.
బ్రహ్మన్న: (తీక్షణంగా చూస్తూ) బావా! ఎటువైపునుంచో కొత్తదళాలు వచ్చి బాలుణ్ణి కమ్మేస్తున్నట్లున్నవి.
కొమ్మరాజు: కన్నమ ఇంకా అక్కడికి చేరుకోలేదు. మధ్యలోనే ఏదో చిల్లర దళానికి అడ్డుపడ్డాడు.
బ్రహ్మన్న: బావా! బాలుడు అలిసిపోతున్నట్లున్నాడు?
మలిదేవుడు: అవును అన్నా! అలిసిపోతున్నాడు.
కొమ్మరాజు: అదిగో నాగమ్మ వెనుకనుంచి బాలుడి మీద బాణప్రయోగం చేస్తున్నది.
(సైన్యాల ఆక్రందనధ్వనీ, పారిపోతూ ఉన్న సైన్యకోలాహలం వినిపిస్తుంది)
బ్రహ్మన్న: బావా! ఎందుకో సైన్యాలన్నీ చెల్లాచెదరైపోతున్నవి? ఏమిటా ఆక్రందన ధ్వనులు?
మలిదేవుడు: బాలుడేమైనాడు? ఏమిటబ్బా, ఈ కారుచీకట్లు. మూడమంచు కమ్మేస్తున్నట్లు కమ్మేస్తున్నవి. ఏడీ మన చంద్రుడు... అన్నా... ఏడీ...
కొమ్మరాజు: కళ్లెంత గుచ్చుకొని చూచినా కనపడడం లేదు. ఏడీ? ఏడీ?
(వీపుమీద గుచ్చుకొన్న బాణంతో రక్తసిక్తమైన తనుత్రాణంతో బాలచంద్రుడు ప్రవేశిస్తాడు)
బాలచంద్రుడు: (స్మృతి తప్పిపోతూ) అబ్బ... అధర్మ యుద్ధం... అన్యాయం... వీపుమీద బాణం... బాధ... బాధ (బ్రహ్మన్న కాళ్ళదగ్గరికి వ్రాలుతూ) తండ్రీ! మామా! సెలవు. (తుది నమస్కారం చేసి ప్రాణం విడుస్తాడు)
బ్రహ్మన్న: నాయనా, బాలచంద్రా! (అపరాని దుఃఖంతో బాలుని ముందుకు వచ్చి కూర్చుంటాడు) కొమ్మరాజు: జగదేక వీరుడు రాలిపోయినాడు. (బాలచంద్రుని చెవిలో బిగ్గరగా) నాయనా! అలరాజుతో నీ ప్రతీకార విషయం చెప్పు మరిచిపోకు.
మలిదేవుడు: (బాలచంద్రుని శరీరాన్ని చూస్తూ) నీ సుందర రూపాన్ని అధర్మంగా దెబ్బకొట్టటానికి ఆ పిశాచికి చేతులెలా వచ్చినవి తండ్రీ! ఉఁ పిశాచి కాబట్టే - నీ రణ నైపుణ్యం దూరం నుంచి చూచి జగదేకవీరుడ వౌతావనీ ఆశపడ్డాను. ఇంతలోనే నీకు మృత్యువా?
బ్రహ్మన్న: (ఎంత ఆపుకున్నా ఆగక పొర్లివస్తూ ఉన్న దుఃఖంతో) నాయనా! బాలచంద్రా!! నీమీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానోయ్, తండ్రీ! అన్నీ భగ్నం చేశావు. నా బహిఃప్రాణం అహింసా ధర్మం. దానికి నా జీవితంలో విజయం కలదని నిశ్చయించుకున్నాను. లోకంలో దాన్ని ప్రచారం చేసి ఈ మహాదాంధ్రదేశంలో ఆనందభవనాలకు పునాదులు వేస్తావనుకున్నాను. కానీ, నాకంటే ముందు నీకే పిలుపు వచ్చిందా?...
నీ చిన్ననాటి చేష్టలు ఒక్కొక్కటే తలుపుకువస్తున్నవి. ఒకనాడు ఏదో తీక్షణంగా ఆలోచించుకుంటున్నాను. నీవూ నీ మిత్రులూ బొంగరాలాట ప్రారంభించి గోల చేశారు. నేను గుడ్లురిమి నిన్ను బెదిరించాను. క్షోణీపాతంగా కంటి తడిపెట్టావు.
బ్రతకని బిడ్డ బారెడు. ఎంత అందగాడివైతే ఏం ప్రయోజనం? నీ అందాన్నంతా ఈ ఆహవరంగానికి అర్పణ చేశావా? కాదు, కాదు. అహింసా ధర్మౌన్నత్యాన్ని నీ ఆత్మబలితో అర్థం చేసుకోమని ఉద్బోధించావు. లోకానికి అది ఇక అర్థం కాక తప్పదు. లోకం అర్థం చేసుకోక తప్పదు. చంద్రుడూ! వెన్నెల తప్ప కాయలే వనుకున్న నీవు పగవారి సైన్యంమీద ప్రచండాతపాలు కాయిస్తున్నప్పుడు నా హృదయాని కెంత ఆహ్లాదం కలిగింది, తండ్రీ! భరించలేని సంతోషంతో ఈ పాడు కళ్లు ఒక్క పెట్టున నిన్ను చూచినవి. దృష్టిదోషం తగిలింది కాబోలు! ఆ చంద్రుడు సూర్యుడై రక్తారుణ కాంతులతో అస్తమించాడు. జయం కలుగుతుంది. రాజ్యం వస్తుంది. కాని నాబోటి అదృష్టహీనుడికి రాజువంటి రత్నాలబిడ్డ ఎలా వస్తాడు. రాడు... ఉహుఁ... రాడు (విచిత్రంగా, ఉన్మాదిగా కళ్ళు త్రిప్పి) ఏమిటి నాకీ పాడు మాటలు? పండులా తండ్రి కిలకిలా నవ్వుతుంటే ఏమిటి నా కీ పాడు మాటలు.
(నిద్ర లేపుతూ) నాయనా చంద్రుడూ! కొమ్మన్న మామ వచ్చాడు లే! ఇవాళ మన ఇంట్లో పండుగరా ఊరి పెద్దలంతా వచ్చేస్తున్నారు. ఆహ్వానించక అలా పడుకోటం ధర్మమా? ఏమన్నా తలనొప్పిగా ఉందా? అదిగో భయపడి నీకోసం మాంచాల వచ్చింది. లే నాయనా! అది చక్కని చుక్కరా తండ్రీ. ఇంత వరకూ ఒక్క తడవయినా దాన్ని కన్నెత్తి చూచావు కావు. అది నీబోటి ధర్మవీరుడికి తీరని కళంకంరా తండ్రీ! అయ్యో! పాపము! అటు చూడు దాని కళ్లలో నిరాశా జ్యోతులు ఎలా తాండవిస్తున్నవో నా గుండె భరించలేదురా తండ్రీ! ఇది నాకెంత కడుపుకోత. ఒక్క తడవ కన్నెత్తి దానిని చూస్తే నాకు కనకాభిషేకం చేయించినంత ఆనందం కలుగుతుందిరా నా జన్మ తరిస్తుందిరా!!
కొమ్మరాజు: (నెమ్మదిగా బుజం తడుతూ) మహాయుద్ధమధ్యంలో మహామంత్రులు తమరే ఇలా మతిని భ్రంశం చేసుకుంటే...
బ్రహ్మన్న: (తెప్పరిల్లి పాలభాగం గట్టిగా తుడుచుకుంటూ) నొసట వ్రాసిన వ్రాలు తప్పించను ఎవరి తరం? చెన్నకేశవ కృప చివరకు నామీద ఇలా ప్రసరించింది. ఇక చేసేదేముంది.
మలిదేవుడు: అన్నా! ఆ కటిక కసాయిని బందీచేసి పట్టుకో వస్తాను. అనుజ్ఞ.
బ్రహ్మన్న: ఎంత మాట! మీ శరీర రక్షణమే నేటి కర్తవ్యం పరమేశ్వర కృప అన్యథా పరిణమిస్తే ఈ రక్తపాతాలు ఎవరికోసం తండ్రీ?
మలిదేవుడు: నా పంచప్రాణాలలో ప్రముఖమైన రెండూ పోయిన తరువాత నాకీ బ్రతుకెందుకు?
(నలగామరాజు సోద్వేగంతో ప్రవేశించి బ్రహ్మన్న పాదాలమీద పడబోతాడు)
కొమ్మరాజు: (ఆశ్చర్యంతో) మహారాజులుంగారు!
(బ్రహ్మన్న నలగామరాజును వారిస్తుంటే)
నలగామ: అన్నా! ఈ మహా పాపిని ఒక్కమాటు నీ అమలిన పాదపద్మాల మీద వ్రాలి కన్నీటితో పంకిలం చెయ్యనీ. నా హృదయానికి శాంతి లభిస్తుంది.
బ్రహ్మన్న: జయాపజయాలు..
నలగామ: వాటితో నాకేం ప్రయోజనం. అవిగో నా సైన్యాలన్నీ నీవి. ఆ నీచురాలు కొద్దిబలంతో కన్నమదాసుకు చిక్కిపోబోతున్నది.
బ్రహ్మన్న: ఈ విచిత్ర సన్నివేశం నాకేమీ అర్థం కావడం లేదు ప్రభూ! నలగామ: 'ప్రభూ!' ప్రభు వెవరన్నా? మలిదేవుడు ప్రభువు. బ్రహ్మన్న మంత్రి మహా మంత్రి. రాజ్యానికి నాకు అర్హత ఉన్నదో లేదో. నేను దాని నాశించను. పరిత్యజిస్తున్నాను.
అన్నా! కన్నమతో నేను అతనిని కలకాలం జీవించమని దీవించునట్లు చెప్పండి.
మలిదేవా! (దగ్గరికి వస్తే) తమ్ముడూ! నా ద్రోహాలన్నీ మరిచిపో! అన్న ఆజ్ఞాపించినట్లు రాజ్యపాలన చేసి మన తండ్రి తాతల పేరు నిలవబెట్టు. నీ రాజ్యం రామరాజ్య మనిపించు. నేను తపోవనాలల్లో ప్రశాంతి నాశిస్తున్నాను.
మలిదేవుడు: (ఆశ్చర్యంతో, ప్రేమపూర్వకంగా) అన్నా! ఈ దారుణ మేమిటి?
లేడిత డేగినాడు సుఖలీలకునై సురలోక భూమికిన్
నీడగ నిల్వ కిట్లు అవనీభర మెల్ల వహింపు మంచు క్రొ
వ్వాడి తపంబొనర్ప చన పాడియె మీరలు లేకయున్న నా
పోడిమి చెల్లు నేగతిగ భూప్రజపాలన చేయనేర్తునో.
నలగామ: (ఉదాత్తముఖ విన్యాసంతో) తండ్రీ!
లేరని వారు వీరు మదిలేశము చింతయొనర్ప కయ్య నీ
వారిల నున్నవారు కన వాస్తవ బుద్ధి కసత్యమేను నీ
వీ రణభూమి మంటి మను టేనియు, సర్వము మిధ్య దేహి ఇ
ట్లూరక భ్రాంతి నొందు సమయోచిత మోహరస ప్రలుబ్దతన్
(బ్రహ్మన్నతో) అన్నా నాకు సెలవు. (కొమ్మరాజుతో) బావా! అనుజ్ఞ!!!
బ్రహ్మన్న: నన్ను గూడా తపోవనాలకు నిన్ననుసరించనీ నాయనా!
నలగామ: గురిజాలలో మలిదేవుడికి పట్టాభిషేకం చేయించి అతడు సుఖంగా రాజ్యపాలనం చేస్తున్న తరువాత మీరు వనాలకు రావచ్చును. ఇది నా ఆజ్ఞ. ఇప్పుడు నేను ప్రభువును.
(ఠీవితో నిష్క్రమిస్తాడు)
బ్రహ్మన్న: ప్రభూ!
(తెరలో కత్తుల కణకణలూ, సింహనాదాలు వినిపిస్తవి)
ఓరీ కన్నమ! పొంగెదింతటికె ఓహో, జోదువైనావె, ఈ
పోరాటమ్మున గెల్వలేవు ఆడిదంబున్ పట్టుటేలాగొ నీ
కేరా వచ్చునె? త్రిప్పుకొమ్మిదిగా ఏదీ? పారిపొమ్మింక లే
దా రక్తాంజలి నిల్పి నీ శరముతో నర్చింతు కాత్యాయనిన్
కన్నమదాసు గొంతు: (ప్రళయ భీకరంగా)
ఓసి పిశాచి, ప్రేలకిక ఊరక మాటలతోడ ఖడ్గవి
న్యాసము చేసెదేల? కదనంబున నిన్ హతమార్పలేక కా
దే సమయింతు తండ్రి కడ ఈ కరవాలము నాపలేక ఆ
యాసమె కల్గుచున్న దెటు లైనను నీ బ్రతుకింక చెల్లెనే.
ఈ ఢాక అందుకో!
నాగమ్మ: (ప్రవేశిస్తూ) ఇదిగో ఎదురుదెబ్బ - నాతోనా నీకు తులువా?
కన్నమ: (కత్తిమీద దెబ్బకొడుతూ ప్రవేశించి) నడు.
(గట్టిగా దెబ్బ కొడితే నాగమ్మ చేతిలో కత్తి కింది పడుతుంది. కన్నమ నాగమ్మ డొక్కకు కత్తి మోటించి నొక్కుతూ బ్రహ్మన్న పాదాల దగ్గరికి నడిపిస్తూ ఉంటాడు)
నాగమ్మ: (బాధతో) అబ్బా!
బ్రహ్మన్న: (బాధించటము మానమనే అభిప్రాయంతో) కన్నమా!
కన్నమ: తండ్రీ! ఈ పిశాచి కనికరించ దగ్గది కాదు.
బ్రహ్మన్న: మహా మేధావి! అనుపమ ప్రజ్ఞావంతురాలు!!
(కన్నమ కడుపులోకి కత్తి నొక్కుతాడు. రక్తము చిమ్మికొడుతుంది)
నాగమ్మ: (బ్రహ్మనాయుని పాదాల దగ్గిరకు వ్రాలి పొర్లాడుతూ) అబ్బా! క్షమించు బ్రహ్మన్న మంత్రీ! అపకారాలు ఎన్నో చేశాను... క్షమించు... అయ్యో..... రక్తం.... దాహం... నా తండ్రికి... మృత్యు... దండన.... జ్ఞప్తికుందా... (సోలి ప్రాణం విడుస్తూ) ఇది, ఇది ప్రతీ.... కా.... ర... ము
This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.