వావిలాల సోమయాజులు సాహిత్యం-2/డాక్టరు చైతన్యం
తర్పణము
(స్వర్గలోకవాసులు పితామహులకు, మాతామహునికి,
శ్రీ వావిలాల కాశీనాథ సోమయాజి,
కృష్ణ సోమయాజి, రామేశ్వర శర్మ,
శ్రీ చతుర్వేదుల వేంకట నరసింహయ్యలకు)
"ఎపుడున్ వైదికకర్మనిష్ఠితులు మా
హేశుల్ మనోజ్ఞుల్ మహ
ద్విపులామ్నాయ రహస్యకోవిదులు ను
ర్వీదేవు లస్మన్మహుల్
కృపతో నీ కృతి స్వీకరింప దీవి - వి
క్రీతుండ దాసుండ నా
యపరాధంబుల సైచి - చాచెద రిదే
హస్తాబ్జముల్ తృప్తులై”
ఆముఖము
నా ప్రథమ రూపక రచన 'నాయకురాలు' మీద ఆంధ్రంలోని వివిధ నగరాలల్లో
ప్రేక్షకలోకం, విమర్శక మహాశయులూ చూపించిన ఆదరాభిమాన దోహదం వల్ల
విజ్ఞులిచ్చిన వాత్సల్యపూర్వకమైన సలహాలను పురస్కరించుకొని రూపక వ్యవసాయం
సాగించాను. తత్ఫలితంలో కొంతభాగాన్ని 'వసంతసేన', 'డాక్టరు చైతన్యం' రూపంగా
నేడు ప్రదర్శిస్తున్నాను.
డాక్టరు చైతన్యాన్ని సృష్టించి నాలుగు సంవత్సరాలకు పైబడ్డది. అయినా ఇంతకంటె ముందుగా దీనిని ఆంధ్రనాటకరంగప్రియులకు నేను అందించలేక పోయినందుకు చింతిస్తున్నాను.
సేవాభినిరతులుగా పైకి కనిపిస్తూ స్వార్థంకోసం అన్ని అన్యాయాలతో బాటు ఎట్టి సాహసకృత్యాలకైనా వెనుదీయక ప్రవర్తించే 'భుజంగం' వంటి వ్యక్తులు సంఘం బలహీనంగా ఉన్న దినాలల్లో విరివిగా కనిపిస్తారు. వారి బాహ్యజీవితానికీ, ఆంతరంగిక జీవితానికీ సమన్వయం ఎక్కడా గోచరించదు. అటువంటివారిని స్వప్రయోజనాలకోసం మణెమ్మ, చంద్రశేఖరం, పుణ్యకోటి వంటి వ్యక్తులు అండ చేసుకొని ఉపజీవించటం సహజం. ప్రయోజనాలు నెరవేరిన తరువాతనో లేక ప్రమాదం సంభవిస్తుందన్న భయం కలగటం పొడకట్టిన మరుక్షణంలోనో దయ్యాలకొంపను వదిలేసినట్లుగా వారు తామాశ్రయించిన వారిని వదలివేస్తుంటారు. మణెమ్మను పోలిన ఏ ఒక స్వేచ్ఛా సంచారిణినో చూచి నవనాగరక స్త్రీ లోకం ఇలా ఉందని భ్రమపడటానికి అవకాశం లేదు.
డా. చైతన్యం వంటి మహాపురుషులు లోకంలో అరుదుగా కనిపిస్తారు. వారిని లోకం క్రమంగాగాని అర్థం చేసుకోలేదు. సత్యమూ, సత్పురుషులూ దాగదు, దాగరు. సత్యప్రియులు రేణు, జయమ్మలవంటి స్వచ్ఛహృదయాలను ఆకర్షించి చైతన్యంవలె మహత్తర కార్యసాధకులౌతారు. అటువంటి వారివల్లనే సంఘానికీ, దేశానికీ శక్తి, ముక్తి. ఈ సాంఘిక నాటకంలోని పాత్రలూ, సన్నివేశాలూ కేవల కల్పితాలు. వ్యక్తులను గాని, సమాజాలను గాని ఉద్దేశించినవి కావు. ప్రదర్శనానుకూల్యతకు కొన్ని 'ప్రథమయవనిక'లను (Curtain Risers) ప్రవేశపెట్టాను. ఇవి ప్రాచీన సంస్కృతనాటకాలల్లోని విష్కంభాల వంటివి. గురజాడవారి కన్యాశుల్కంలో గూడా పద్యాలను ప్రవేశపెట్టి ప్రదర్శించాలన్న కుతూహలంగల నటకులూ, నాట్యసమాజాలూ నేటికీ విరివిగా దేశంలో కన్పిస్తున్నప్పటికీ అనుచితమనే గాఢనమ్మకంతో ఈ సాంఘిక రూపంలో పద్యాలకు స్థానం కల్పించలేదు.
'బుడే' ప్రసంగాలలోని అసంబద్ధము, వ్యాకరణవిరుద్ధము ఐన భాష వల్ల రసస్ఫూర్తి కలుగుతుందని ఆశించాను. నేనెంతవరకు కృతకృత్యుడనైనానో రసజ్ఞులు నిర్ణయించెదరుగాక!
ఈ నాటక రచనలోను, ముద్రణలోను నాకెంతయు తోడ్పడిన నా మిత్రులకు నమోవాకములు.
ఉమాసదనము: బ్రాడీపేట
వాఙ్మయ కళోపాసి
గుంటూరు: 5 మే, 1953
వావిలాల సోమయాజులు
పాత్రలు
పురుషులు
భుజంగం : సంఘసేవానిరతిని ప్రకటించే స్వార్థపరుడు
చంద్రశేఖరం : భుజంగానికి సహాయకుడు
పుణ్యకోటి : భుజంగానికి కాదలచుకున్న అల్లుడు
రావు : పత్రికా విలేఖరి
బుడే : భుజంగం సేవకుడు
డా. చైతన్యం : ఆడంబరము లేని సంఘసేవకుడు
ముసలయ్య : చైతన్యం ఆరోగ్యశిబిరంలో సహచరుడు
రంగడు : డా. చైతన్యం శిక్షణవల్ల మార్పు పొందిన త్రాగుబోతు
స్త్రీలు
రేణు : డా. చైతన్యం సహచరి
జయ : భుజంగం కుమార్తె, సహజహృదయ
మణెమ్మ : భుజంగం స్నేహితురాలు
ప్రథమ దృశ్యం
(భుజంగం ఇంటి ముందుభాగంలో అతిథి గృహం - సాయంత్రం 5 గంటలవేళ
భిక్షుకుడు ఒకడు)
మానవసేవ!
మన ప్రభుసేవ!!
స్వర్గసీమ కదె,
చాలినబాట -
పుట్టెడు, గిట్టెడు
పూవువు నీవు
దినమో సగమో
తెరువెదొ కనుమా
మానవసేవ!
మన ప్రభుసేవ!!
భోగభాగ్యములు
బుద్బుదములురా,
ధనమదాంధులకు
తలుపు విడదురా!
మానవసేవ!
మన ప్రభుసేవ!!
అని పాడుతుంటే వినిపిస్తుంది)
బుడే : (ఒకవైపు నుంచి ప్రవేశించి) అరె! మీకీ తమాషా హుందీ. హింటిలోకి హెక్కడ్కీరా... జా యాహాసే, జాన్వర్ (గుడ్డతో బల్లలు తుడుస్తూ మధ్యమధ్య) హరె హల్లా! హరె హల్లా!! (మరపు నటిస్తూ) మైనే క్యా కరూఁ!! బూజుహంగంసాబ్ కా ఘర్మే ధర్మం ఘిర్మంనహి హంటే నాకీ పాణం తీస్తార్.
(అయిదు గంటలు వినిపిస్తవి)
(నిష్క్రమిస్తాడు)
జయమ్మ : (తెరచివున్న ద్వారంగుండా ప్రవేశించి చేతిలో ఉన్న పూలదండను మహాత్మాగాంధీ విగ్రహం మెళ్లో వేసి నమస్కారం చేసిన తరువాత)
జయ జయ జయ జాతిపితా!
జయ భారత హృదయనేత!
జగమంతా కాళరాత్రి
పగలే ఇక లేనిదిగా
ఆరని ఓ జ్యోతి! నీ
అమరకాంతి మా కిమ్మా జయ జయ
కరదీపికల న్జగమే
పరిణమింప పున్నమిగా
వెలిగింతుము వెడలెదము
దీవింపుము దివ్యఋషీ! జయ జయ
జయ జయ జయ జాతిపితా!
జయ భారత హృదయనేత!
బుడే: (దగ్గిరకు వచ్చి జంకుతూ) హమ్మాయిగార్!
జయ : బుడే! ఇల్లు ఎగిరిపోయేటట్లు ఏమిటా అరుపులూ నువ్వూ.
బుడే: హర్పుల్ కావ్ హమ్మాయిగారు! హాళ్ళ పీకల్ కోషి హాకాశాన్కి హెగ్రేషేవాణ్ణి, నాకీ మాట తక్వాషేస్తే హూరుకోటం హుందీ లేదు.
జయ : బిచ్చగాళ్ళమీద ప్రతిదినం నీ గొడవేం బాగాలేదు.
బుడే : ఘొడ్వా!! బల్ షెప్పారండీ! హమ్మాయిగార్! నాకీ నాన్నగారి మాట్కీ హంగుళంకీ హోక్టీ తప్పేద్లేద్. హం నమ్మఖరామ్ నై హమ్మాయిగార్... హుజూర్కు మాకీ బుర్రల్ తీసి యిస్తాం (సంతోషంతో) హమ్మాయి గార్! మీకీ ఏదో కాగజ్ హొచ్చింది హేమిటండీ!
జయ : (ఆలోచించి) ఏదీ?
బుడే : జరూర్ సద్వుకోని నజర్ షేసి నాకీ మంచి హీనాం హివ్వాలమ్మాయి గార్.
(డ్రాయర్లో పెట్టి ఉన్న 'ఇండష్ట్రీ' పత్రిక తీసియిస్తాడు)
నటించిన తరువాత) అఁ, ఇదేనా ? మర్చిపోయినాను.
బుడే : హెప్డూ మర్సిపోతూ హుంటార్... నాకీ బీబీ హుందే హల్లాబీ దాన్కి మస్తాన్ సాహెబ్ హుర్సుకు మళ్ళీ ముప్ఫై హేల్ళూ హెళ్ళిపోతుండాయ్ హోక్టీ మాటూ మర్పూ గిర్పూ జాన్తీనై. మీకీ షూస్తే హిర్వైహేళ్ళూ భీ నై హై మళ్ళీ షేస్తే హెంతా మర్పూ హండీ!
జయ : అధిక ప్రసంగం చెయ్యగూడదని ఎన్నిమాట్లు చెప్పాను.
బుడే : (భయాన్ని ప్రకటిస్తూ) మళ్ళీ రోజ్ రోజ్ హోక్టీ రెండూ సార్లు షెప్పారుగా.
జయ : ఇందాక పోష్టువాడు మస్తాను నీ చేతికేదో పాకెట్ యిచ్చినట్లున్నాడు.
బుడే : పైకట్ కతో! (తెలిసినట్లు) హాయ్ పై కట్. అది నాన్నగార్కి షెన్నపట్నం నుంచి వచ్చిందట్గ హమ్మాయి గార్.
జయ : నోరుమూసుకొని తక్షణం పట్టుకురా!
బుడే : తచ్ఛనం! (నోరు మూసుకొని వెళ్ళుతుంటాడు)
జ : బుడే!
బుడే : (మూసుకొన్న నోటితో వెనక్కు తిరుగుతాడు)
జయ : ఛీ! చెయ్యి తియ్యి
బుడే : హరె హల్లా! మూస్కోమంటార్, మల్లి తియ్యమంటార్, మల్లి మూస్కోమంటార్. హన్నీ మీరే షెప్తార్ హేమ్టీ హండీ!
జయ : నీతో ఏమన్నా చావుగానే ఉంది. హోటల్ వాడితో అన్ని సిద్ధంగా ఉంచమని చెప్పావా?
బుడే : ఆఁ బల్‌మాట షెప్పారండీ హమ్మాయిగార్. నాకీ దివానాకాను హుండీ. హైనా హాడ్కీ షేషేదీ మళ్ళీ హొక్టేగా
జయ : బజారునుంచి తెమ్మన్న వస్తువులు తెచ్చావా?
బుడే : మేఘాల్మే హెగ్రీపోయి హోక్టీ గంటాకే హన్నీ తెచ్చాన్గా మల్లీ!
జయ : తెచ్చావ్? బుడే : ష్వయం హెళ్ళీ. హాయ్ హేమ్టీ హదీ (జ్ఞప్తిచేసుకుంటూ) బిచ్చికోత్ హోక్టీడబ్బా. మళ్ళీ షెక్కర్ కేళీ హోక్టీగేలా, డిర్రింగు హోక్టీ డజన్, తెచ్చానుగా హమ్మాయ్‌గార్!
జయ : ఉఁ - పుస్తకం తెచ్చి యిచ్చి విందుకని వచ్చినవాళ్ళందరినీ మర్యాద చెయ్యి.
బుడే : పుస్తకం (తెలిసినట్లు) పేకట్ హమ్మాయిగార్!
జయ : ఆఁ (బుడే అక్కడేవున్న పాకెట్ ఇస్తాడు. అది చైతన్య వ్రాసిన 'సేవాగీతికలు)'
కవీ : చైతన్యం” - సేవాగీతికలు! బుడే! ఇదిగో నీకు నజరానా? వెళ్ళు.
బుడే : (సంతోషంతో తీసుకొని సలాం చేసి వెళ్ళిపోతాడు)
జయ : (పుస్తకం తిరగవేస్తూ) అన్నీ విన్న పాటలేనే! (హార్మోనియం దగ్గరకు వెళ్ళి) ఇది కూడా చైతన్యందేనా?
ఆపకం డీరథము
స్వాతంత్ర్య రథమూ
జహ్వారే సారథై
సాగించు నీ రథము ఆపకం డీరథము....
వెలుగుకాగడ తోడ
వెడలుచున్నాడడుగొ!
పొడుపుమలదెస కింక
పొలచు నూతనజ్యోతి ఆపకండీరథము....
పుణ్యకోటి : (ప్రవేశిస్తూ) హల్లో మీ ఆనందానికి అడ్డు వస్తున్నందుకు క్షమించాలి.
(చేతిలో ఉన్న 'సేవాగీతికలు - చైతన్యం' మీద దృష్టి ఉంచి) పాటలా ఏమిటి? ఈ పాట ఎవరిది చెప్మా! ఎక్కడో విన్నట్లుంది?
జయ : చైతన్యంగారివి.
పుణ్యకోటి : అతడు మంచి కవే! కానీ
జయ : (అనుమానంతో) కానీ....
పుణ్యకోటి : వేపకాయంత కొసవెర్రివాడు.
జయ : ఆలోచిస్తే వెర్రిలేనిదెవరికి? - మీకు లేదా - నాకు లేదా? పుణ్యకోటి : అవునవును. అందుకనే కదండీ! షేక్స్పియర్ అన్నాడు 'కవి, ఉన్మత్తుడు, ప్రియుడు ఏకశ్రేణివా'రని. ఔనా.... మీ నాన్నగారు లేనట్లున్నారు. పుట్టినరోజైనా తీరుబడి లేదు.
జయ : తిమ్మాపురంలో ఏదో సభ ఉందట. వెళ్ళారు. పన్నెండు గంటలకే వస్తామన్నారు. రాలేదు.
పుణ్యకోటి : స్వంతకారు కనక వచ్చేస్తుంటారు. అక్కడ భోజనం చేస్తే గాని వెళ్ళనివ్వలేదేమో!
జయ : పుట్టినరోజుకని చిన్న పార్టీ ఏర్పాటు చెయ్యమన్నారు. ఏదో 'ఇండియన్ పంక్చువాలిటీ' కాబట్టి సరిపోయింది. లేకపోతే అందరూ వచ్చి సిద్ధంగా ఉండేవారు.
పుణ్యకోటి : (నవ్వుతూ) పెళ్ళికొడుకులేని పెళ్ళి అయ్యేది...
జయ : ఏమిటండీ విశేషాలు. మా ఆహ్వానం వచ్చేటప్పటికి ఊళ్ళో లేరటగా బుడే అన్నాడు.
పుణ్యకోటి : ఈ మధ్య 'మట్టిగుంటలో' మహావైభవంగా నాలుగు దినాలు 'గాంధీజయంతి' చేశాము. ప్రతిదినం ఉదయం 2 1/2 గంటలూ, సాయంత్రం 2 1/2 గంటలూ బ్రహ్మాండంగా సూత్రయజ్ఞం సాగించాము. ఇదే ప్రత్యేకాకర్షణ.
జయ : పత్రికల్లో రిపోర్టు బహుజాగ్రత్తగా అనుసరించాను. ఇటువంటి కార్యక్రమం మన రాష్ట్రంలోనే ఎన్నడూ జరగలేదని ఏదో పత్రిక సంపాదకీయం వ్రాసినట్లుంది. దానికి ప్రచారం బాగా ఉందా ఏం?
పుణ్యకోటి : చచ్చుబొక్కుగా అమ్మినా అయిదువేల కాపీలు పోతున్నవి. పుట్టి పురుడైనా వెళ్ళలేదు. దానిమాటకేం గాని మొన్న నేను జరిపించిన కార్యక్రమాలను గురించి యు.పి.సి.పి రాష్ట్రాలనుంచి నాకు ప్రత్యేకంగా అభినందన లేఖలు వచ్చినవి. పోయిన సంవత్సరం మన సభలకు అధ్యక్షుడుగా వచ్చాడు ఆ సేవాసమితి సభాపతి...
జయ : (జ్ఞప్తి చేసుకుని) తార్కుండే...
పుణ్యకోటి : ఔను తార్కుండే... మిమ్మల్ని మరచిపోలేదు. ప్రత్యేకంగా అడిగానని చెప్పమని వ్రాశాడు.
జయ : సమాధానం వ్రాసేటప్పుడు 'నా కృతజ్ఞత' వ్రాయండి. పుణ్యకోటి : తప్పకుండా మట్టిగుంటలో మహాసభలు జరిగిన తరువాత మన నగరంలో పెద్ద ఎత్తున ఒక సప్తాహం తలపెట్టి తలకాయ ఉన్న పెద్దవాడినల్లా పట్టుకువచ్చి గద్దె ఎక్కించాలని నాకుంది. మీరేమంటారు?
జయ : తప్పకుండా అటువంటి సమ్మోహనాస్త్రాలు చాలా బాగా పనిచేస్తవి... కానివ్వండి.
పుణ్యకోటి : 'కానివ్వండని' ఏమిటాతప్పుకోటం. స్వాతంత్య్రం వచ్చిందన్న మాటే గాని, స్వాతంత్య్రనేత బాపూజీ తత్వం దేశానికి జీర్ణం కాలేదు. నిర్మాణ కార్యక్రమ ప్రణాళికలతో కాగితాలు నిండిపోతున్నవి. కాని ఒక్క పనీ కార్యరూపం దాల్చటం లేదు. “దేశంలో నాలుగుమూలలా ప్రజానాయకుల జీవితచరిత్రలు, కట్టుకథలుగానూ, హరికథలుగానూ, బుర్రకథలుగాను చెప్పించి, ప్రజల్లోకి చొచ్చుకోపోయి చైతన్యం రేకెత్తించి”...
జయ : (నవ్వుతూ) క్షమించాలి ఉపన్యాసధోరణిలో పడిపోతున్నారు.
పుణ్యకోటి : ఒహ్ ఎక్సూజ్ మి... మరి మీరు నాకు ఈ సందర్భంలో ఏమి సాయం చేస్తారు?
జయ : ఎదురు చెప్పకుండా చెప్పింది విని ఊరుకుంటాను.
పుణ్యకోటి : అలాగేం పాపం!! తప్పించుకుందామనుకుంటున్నారుగామాలి. టౌన్ హాల్లో ఒక సంగీతసభ ఇవ్వాలి. కార్యక్రమం అచ్చు వేయించడానికి కూడా మనదగ్గర 'చేతన్ లేదొక చిల్లిగవ్వయును'
జయ : (ఆలోచించి) పాటకచ్చేరీ అని అన్నిటికీ మాటిమాటికీ నేనే తయారైతే ఏం బాగుంటుంది?
పుణ్యకోటి : ఎన్నోమాట్లు ప్రజలు మిమ్మల్ని వినటమూ (చిరునవ్వుతో), అంతకంటె అధికంగా చూడటమూ వల్ల మాకు టిక్కెట్లు అమ్ముకోటానికి అంత తికమక లేదు. కాలేజీలు అన్నీ రీ ఓపెన్ అయినవి. స్టూడెంట్సు దగ్గిర డబ్బు పుస్తకాలకనీ బుగ్గికనీ తెచ్చుకున్నది పుష్కలంగా ఉంటుంది. మంచివి రెండు మూడు పులుముడు భావగీతాలు అభ్యుదయపంథాలో విసిరిపారేశారంటే అంతా డబ్బే!... మరి అచ్చు గుద్దిస్తాను.
జయ : ఆలోచించిగాని వాగ్దానం చెయ్యలేను.
పుణ్యకోటి : (ఉపన్యాసధోరణిలో) జయమ్మగారూ! మీరు గమనించటం లేదు. మన సంఘం సమస్తవిధాలా అధోగతి పాలైపోతున్నది. 'స్త్రీజాతి' అభ్యుదయం విషయమాలోచిస్తే ఆపాదమస్తకం కంపిస్తున్నది. దీనహరిజన సోదరుల ఆక్రందనాలూ, అన్యాయకథనాలు ఇంకా చెవులల్లో మార్ర్మోగు తున్నవి. యోధాన యోధులైన స్వాతంత్య్ర భారతయుద్ధ కురువృద్ధు లందరూ అలసిపోయినారు. యువకలోకం మేల్కొంటేగాని విముక్తి లేదు.
జయ : ఔను...
పుణ్యకోటి : ఔనంటే చాలదు. సామాన్య ప్రజలకూ, శ్రామికవర్గాలకూ ధనికవర్గాలతో బాటు సమాన ప్రతిపత్తి కల్పించి గౌరవించే విప్లవం, సాంఘికవిప్లవం, నిరాయుధ విప్లవం, అహింసాత్మక విప్లవం నడిపించే నాయకమణులు అనేకమంది కావాలి. మీది స్త్రీ హృదయం, సోదరీ హృదయం, మాతృహృదయం. రండి! లేవండి!! ఈ రథాన్ని నడిపించటానికి నడుం కట్టుకోండి. మీవల్ల మాకు శక్తి మీకు ముక్తి ప్రజకు భుక్తి జయమ్మగారూ.
జయ : మహానుభావా! ఇది ఉపన్యాస వేదిక కాదు. మాటి మాటికీ మరచిపోతున్నారు.
పుణ్యకోటి : నాలో నిద్రితశక్తి ఎలా మేల్కొంటున్నదో మీరు గమనించాలి. పతితప్రజాసేవకు, పీడిత జనోద్ధరణకు బద్ధకంకణులు కావలెనని మిమ్మల్ని అర్థిస్తున్నాను. (వంగి నమస్కరింపబోతాడు)
జయ : (వారిస్తూ చిరునవ్వుతో) ఇంతకూ టౌన్‌హాల్లో నన్ను ఒక పాటకచ్చేరీ చేయమంటారు, అంతేనా?
పుణ్యకోటి : నిశ్చయంగా! మాట ఇవ్వక తప్పదు.
జయ : సరే కానివ్వండి. (తప్పనిసరిగా అంటుంది)
పుణ్యకోటి : జయ్, జయమ్మగారికీ జై... ఇలా రేపు కోటి కంఠాలు మిమ్మల్ని జయవెట్టుతూ ఉంటే మీ మనస్సుకు ఎంత ఆనందం కలుగుతుందో...
బుడే : (గాభరాగా ప్రవేశించి) హమ్మాయిగార్! హన్నీ నాకీ షిద్ధం షేస్తే పిల్లీ మీద బల్లాఎక్కి... మళ్లీ హెగ్రీ మల్లీ హెగ్రీ మల్లీ మల్లీ హెగ్రీ హెగ్రీ...
జయ : ఏమన్నా పగలగొట్టిందా, త్వరగా ఏడు?
బుడే : హాయ్ హమ్మాయిగార్ (ఏడుస్తాడు)
జయ : పోనీలే. త్వరగా మరొకటి పట్టుకురా. బుడే : (నవ్వుమొగంతో) మేఘాల్మే హెగ్రీపోయి తెస్తా...
(కొంతదూరం నడిచి) నాకీ దిమాగీమే దెయ్యం హెక్కింది. ఓ క్యా హదిహేమ్టీ హమ్మాయిగార్! (నిష్క్రమిస్తాడు)
జయ : ప్రతినిమిషమూ వీడు నా ప్రాణాలు తోడేస్తున్నాడు. నాన్నగారితో చెప్పి మరొకణ్ణి కుదుర్చుకోకపోతే బ్రతికేటట్లు లేదు.
పుణ్యకోటి : ఓ, నొ, నో! వీడికి నౌకరీ ఇచ్చి భుజంగంగారు గొప్ప రాజకీయవేత్త అనిపించుకున్నారు. జాతీయ ముస్లింలల్లో పలుకుబడి వీడివల్ల బ్రహ్మాండంగా వృద్ధౌతుంది.
జయ : (నవ్వుతుంది - పుణ్యకోటి ప్రతిగా నవ్వుతాడు)
చంద్రశేఖరం : (మరొకవైపు నుంచి ఒక కట్ట వార్తాపత్రికలతో ప్రవేశిస్తూ భజనసరణిలో) 'ఎన్నాళ్ళకెన్నాళ్లకూ రామయ్య రామా, సీతమ్మతల్లీ'
జయ : ఏం మామయ్యా! ఏదో కొంపమునగబోతున్నట్లుంది?
చంద్రశేఖరం : మునగబోవటమేమిటి - మునిగింది బ్రహ్మాండంగా పైకి తేలింది.
పుణ్యకోటి : ఏం భాయీసాబ్! మీ తరహా చూడబోతే బజారుల్లో ఇంకా పేపర్లు మిగిల్చినట్లు లేదే!
చంద్రశేఖరం : పట్టుకోటం తెలియని ప్రతిగాడిదా పేపరు కొని ప్రయోజనమేముందోయ్, దుష్ప్రచారం చెయ్యటం తప్ప! ఇవాళ పేపర్లో అత్యద్భుతకరమైంది ఒకటి పడ్డది.
పుణ్యకోటి : (ఆశ్చర్యంతో) ఆఁ!
చంద్రశేఖరం : ఇక అంతా ఐకమత్యం అభ్యుదయం చైతన్యం...
జయ : ఇంతకూ సంగతేమిటో బయటపెట్టండి.
చంద్రశేఖరం : తెలుగు ప్రతి చదువుతున్నాను... న్యూఢిల్లీ 24 జులై, ప్రతి పట్టణంలోనూ ఏర్పడ్డ సేవాసమితుల మూలధనానికి పదిరెట్లు అఖిల ఇండియా సేవాసమితి వారు ఇచ్చి గ్రామోద్ధరణ జరిపించటానికి తీర్మానించిరి. అప్లికేషనులు వారముదినాల్లో ధన్యం భాయీకి చేరవలెను.
జయ : ఉస్... ఇంతకేనా, ఇంత హంగామా చేశారు? చంద్రశేఖరం : అర్థంకానివాళ్ళకు మరి హంగామా.
పుణ్యకోటి : భాయీసాబ్ - కోపం తగ్గించి కాస్త వ్యాఖ్యానిస్తే గాని బోధపడేటట్లు లేదు.
చంద్రశేఖరం : (ప్రవచనముద్రతో) మీబోటి సామాన్యులకు అర్థం కాక పోవటంలో ఆశ్చర్యమేముంది? బ్రహ్మాండం బ్రద్దలయ్యేటట్లు విమానాలమీద విదేశాలన్నీ తిరిగి వచ్చి ఏ బి సి డీలు మూరెడు పొడుగు ఘనజటా వేసినన్ని డిగ్రీలు పెట్టుకున్న ముత్తైదుసంపాదక మహాశయులకే అర్థంకాలేదు. ఒక విషయం జరిగితే దాన్ని భూతభవిష్యద్వర్తమానాలకు అనుసంధించి వ్యాఖ్యానించటం. 'తెల్వొకరి సొమ్మా తొండపి సుబ్బమ్మా!!
పుణ్యకోటి : వ్యాఖ్యానం కానివ్వండి తీర్మానం మీద.
చంద్రశేఖరం : సంఘం ఓ రాతిరథం. ఈ ప్రకటనవల్ల కదలని ఆ హంపీ రాతిరథం కదులుతుంది. స్లోగన్ దొరక్క తన్నుకొంటున్న రాజకీయవేత్తలకు మళ్ళీ కొంత ప్రాణం పోసింది. గాంధీయిజాన్ని గ్రామగ్రామాన ప్రజాహృదయానికి హత్తుకొపోయేటట్లు ప్రచారం చేసి సోదరులారా! మీరు...
జయ : మామయ్యా! నీవు కూడా ఉపన్యాసధోరణిలో పడి పోతున్నావు. లోపల ఆ బుడేగాడు ఎంతవరకు వచ్చాడో చూసివస్తాను. (నిష్క్రమిస్తుంది)
చంద్రశేఖరం : (తాపీగా) నగరంలో 'సేవాసమితి' అంటూ ఒకటి స్థాపిస్తే సమస్తమూ మనము నడిపించవచ్చు.
పుణ్యకోటి : భేష్ ! బాగుంది. ప్రస్తుతం మనకొక ఆర్గనైజరు కావాలన్నమాట!
చంద్రశేఖరం : ఇంత శాస్త్రోక్తంగా నడిపిస్తే ప్రమాదసీమలో పడతాం. సమస్తమూ, డైరెక్టరు అయినా అందరూ మనవాళ్ళే...
పుణ్యకోటి : అయితే మరి.
చంద్రశేఖరం : ప్రసిడెంటు పలుకుబడి ఉన్నట్లు నటిస్తూ కొంత స్వార్థం కోసమో పరార్థంకోసమో పెట్టుబడి పెట్టగల పెద్ద మనిషి ఉండాలి.
పుణ్యకోటి : తప్పదు భుజంగం ఇందుకు తగ్గ వ్యక్తి. చంద్రశేఖరం : యు ఆర్‌రైట్. ఒక్క షేక్‌హాండు ఇలా పారెయ్యి. ఇద్దరు కార్యదర్శులు. ఒకరు ప్రధాన రెండవవారు సహాయ.
పుణ్యకోటి : నీవు ప్రధాన
చంద్రశేఖరం : ఉః నీవు ప్రధాన - మరి చెప్పినట్లు వినాలి. సహాయ కార్యదర్శిని ఎన్నుకోటంలో ఒక్క మాట మరచి పోకూడదు సంఘం కాస్త పచ్చపచ్చగా ఉండాలి. అర్థమైందనుకుంటాను.
పుణ్యకోటి : పడతి అని తమ భావమా గురుదేవా?
చంద్రశేఖరం : (విచిత్రకంఠంతో) ఔను శిష్యశేఖరా?
పుణ్యకోటి : (రెండు వేళ్ళు చూపించి) మీ ఇష్టం వచ్చినది కోరండి.
చంద్రశేఖరం : (ఒకవేలు కోరుతాడు) ఉఁ సహాయ కార్యదర్శి జయా! మణెమ్మా!
పుణ్యకోటి : జయను ఎన్నుకుంటే మణెమ్మకు కోపంరాదూ?
చంద్రశేఖరం : ఆమె మాట ఎలా ఉన్నా భుజంగానికే రావచ్చు. అయినా ఉపాధ్యక్షపదవి ఉందిగా అది పారేద్దాం.
పుణ్యకోటి : మరి నీవో?
చంద్రశేఖరం : (నవ్వి) మనను అలా దూరంగా ఉజ్జీ. బాపూజీ కాంగ్రెస్‌లో పావలా మెంబరైనా కానట్లు. ముహూర్తం ఈ క్షణానే. భుజంగం రాగానే ఆయన వెంట పత్రికా విలేఖరి తప్పనిసరిగా ఉంటాడు గనుక సమితి స్థాపనను గురించి గట్టిగా పత్రికల్లో గుద్దిచ్చామంటే దేశంలో కావలసినంత కళవళం బయలు దేరుతుంది.
పుణ్యకోటి : జయమ్మ అంగీకరిస్తుందా, నాతో కార్యదర్శిగా ఉండటానికి?
చంద్రశేఖరం : అనుమానం ఎందుకు రావలసి వచ్చింది? మహ చక్కగ అంగీకరిస్తుంది. ఆ భారం నామీద పారెయ్యి. లోపలికి వెళ్ళి జయతో మాట్లాడి చిన్న పార్టీ ఇక్కడికి సిద్ధం చేయించు. భుజంగంగారి విందుకు ముందే సమితి స్థాపన జరిగిపోవాలి. జయతో మాట్లాడి ప్రస్తుతం అక్కడున్నవి తినటానికి పట్టించుకోరా?
చంద్రశేఖరం : (కాసేపు పేపరు తిప్పి పారేసి - చెష్టుమీద ఉన్న 'గీత' తీసి ఒక శ్లోకం
చదువుతాడు)
'ఆపూర్య మాణ మచల ప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్
తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే
సశాంతి మాప్నోతి నకామకామీ'
తస్సదియ్యా మంచి మాటన్నావయ్యా మహాప్రభూ! అన్నీ నిన్ను చేరితీరవలసిందే?
లేకపోతే మాకు ముక్తేముంది? (భుజంగం కారుచప్పుడు) వచ్చినట్లున్నారే! (లేచి తన
సీటులో కూర్చుంటాడు)
భుజంగం : (మణెమ్మతో) మణీ! మహాగొప్పగా నడిపించాము. మన సంగతి ఇప్పటికి బాగా గ్రామంలో అర్థమై పోయి ఉంటుంది. లేకపోతే...
మణెమ్మ : వండర్‌ఫుల్‌గా నడిచింది బండి. ఏమంటారు! రావుగారూ!
(వాళ్ళ వాళ్ళ స్థానాలల్లో కూర్చుంటారు)
మణెమ్మ : ఏమండీ, చంద్రశేఖరంగారూ!
చంద్రశేఖరం : క్షణమాగండి. అంతా అర్థమౌతుంది. సేవాసమితి అంటూ ఒకటి స్థాపిస్తున్నాం నగరంలో.
భుజంగం : మణీ! ఇటువంటి సంస్థ అత్యవసరం కూడానేమో.
మణెమ్మ : నిజం! అద్భుతంగా ఉంది. అప్పటికి అన్ని భూములు మన వౌతవి.
పుణ్యకోటి : (ప్రవేశిస్తూ) మీరు వచ్చేశారే! సభలు బాగా జరిగినట్లేనా?
భుజంగం : అద్భుతంగా - మీరు ఏదో సమితి స్థాపిస్తున్నారు?
(జయ టీపార్టీ సన్నాహంతో బుడేను తీసుకొని వస్తుంది. బుడే అన్నీ అమరుస్తూ ఉంటాడు)
పుణ్యకోటి : అయిదునిమిషాలు మీరు నేను చెప్పినట్లు నడుచుకోవాలి.
చంద్రశేఖరం : ఇటువంటి సందర్భంలో మనకు రావుగారుండటం గొప్ప అదృష్టం!
రావు : భుజంగంగారితో ఉండటమంటే మాకు షీర్ ఫ్లెషర్ అప్పా!
పుణ్యకోటి : వర్గమతవిభేదాలూ వర్ణవ్యవస్థలూ లేవుగనుక బుడేసాహెబును కూడా సభ్యుణ్ణిగా స్వీకరిద్దాం. చంద్రశేఖరం : జాతీయ ముస్లిం ప్రాతినిధ్యం.
మణెమ్మ : మా మహిళాలోకం సంగతి మరిచిపోవద్దని మనవి.
పుణ్యకోటి : అందుకనే సగానికి సగం. ఒక కార్యదర్శి, ఉపాధ్యక్షపదవులు రెండూ మీ స్త్రీ లోకానికిచ్చాం.
రావు : మా రిపోర్టులో ఈ విషయం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తామప్పా!
భుజంగం : ఈ సంగతంతా ఏమిటో నాకు ఇంతవరకూ అర్థం కాలేదు.
పుణ్యకోటి : నగర సేవాసమితికి అధ్యక్షులుగా ఉంటున్నారని తెలిస్తే చాలును. (రిపోర్టు చూపిస్తే ఇద్దరూ చూస్తారు)
చంద్రశేఖరం : (పుణ్యకోటివంక చూస్తాడు - పుణ్యకోటి నీవే కానివ్వమన్నట్లు సంజ్ఞ చేస్తాడు)
నగర సేవాసమితికి భుజంగంగారిని అధ్యక్షులుగానూ, మణెమ్మగారిని ఉపాధ్యక్షులు గానూ ఎన్నుకున్నాము.
(కరతాళధ్వనులు)
జయమ్మ సహాయ కార్యదర్శి పుణ్యకోటి కార్యదర్శి.
(కరతాళధ్వనులు)
జయ : మామయ్యగారూ క్షమించాలి నేను అంగీకరించలేను.
మణెమ్మ : అల్లా వీల్లేదు. నీవు తప్పకుండా అంగీకరించాలి. పుణ్యకోటిగారితో కలిసి పని చెయ్యటానికి వెనుకాడడ మెందుకు?
పుణ్యకోటి : అధ్యక్షులూ, ఉపాధ్యక్షులూ ఈ ఆసనాలు అలంకరించాలి.
(కూర్చున్న తరువాత మెళ్ళో దండలు వేసి కార్యక్రమం చేతికిస్తారు)
భుజంగం : 'ప్రార్థన’
పుణ్యకోటి : (జయమ్మవైపు చూస్తాడు)
జయ : (తప్పనిసరిగా లేచి నిలబడుతుంది)
బుడే : (వెళ్ళిపోబోతాడు) చంద్రశేఖరం : బుడే! నీవు కూడా సమితి సభ్యుడివి, అక్కడ కూర్చో.
బుడే : క్యా మై భీ షభ్యుడూ? (భుజంగాన్ని చూచి భయం నటిస్తూ) ఆదాబరస్!
జయ : (లేచి)
జోహారు జోహారు ఓ భరతమాతా!
జోహారు జోహారు వీర ప్రసూతా!!
రమ్యమూర్తివి నీవు. రత్నగర్భవు నీవు
తల్లులకు తల్లివే ఓ తల్లి నీవు? ॥జోహారు॥
ఋషి వాటికాధాత్రి రాజర్షినేత్రి
అందుకో అందుకో మావందనమ్ము. ॥జోహారు॥
జోహారు జోహారు ఓ భరతమాతా!
జోహారు జోహారు వీరప్రసూతా!!
(అంతా కరతాళధ్వనులు చేస్తారు జయ తిరిగివచ్చి తన స్థానంలో కూర్చుంటుంది.
పుణ్యకోటి ప్రేమార్ద్ర నేత్రాలతో ఆమెనే చూస్తుంటాడు)
భుజంగం : (పుస్తకంలోనుంచి చూచి ఒక చిన్న ఉపన్యాసం చదువుతాడు - కరతాళధ్వనులు, చంద్రశేఖరం ధన్యవాదాలు చెప్పటం అయిపోయిన తరువాత)
భుజంగం : మరి ఫండ్సు విషయం ఏమిటోయ్ పుణ్యకోటీ!
పుణ్యకోటి : అన్నిటికీ మాకు మీరే ఉన్నారనుకున్నాము.
భుజంగం : నేనుమటుకు ఎన్నిటికని. మహిళాసంఘానికని మణెమ్మగారూ, నికేతనం పేరు పెట్టుకొని నీలమ్మగారూ, గ్రంథాలయం పేరుతో కామావధాన్లూ. మరో పేరుతో మన మరిడియ్య. - ఇలా ఇవ్వటం ప్రారంభిస్తే కుబేరుడు కూడా కొల్లబోతాడు.
మణెమ్మ : మీరామాటంటే మా మహిళామండలి ఇస్తుంది. ప్రస్తుతం డబ్బులేదని చూస్తున్నాను గాని.
భుజంగం : మీకేం మీరు వెళ్ళితే ఎక్కడైనా డబ్బు పుడుతుంది.
చంద్రశేఖరం : నాకోమంచి ఊహ తోస్తున్నది. మన అధ్యక్షులకూ, ఉపాధ్యక్షులకూ వేసిన దండలు వేలంవేస్తే వచ్చిన డబ్బు మూలధనంగా చేసుకుందాం.
(భుజంగం, మణెమ్మ దండలు తీసి ఉంచుతారు)
మణెమ్మ :మహిళాసంఘం పాట రెండువేల అయిదు వందలు.
చంద్రశేఖరం : (భుజంగం అనుమతితో) భుజంగంగారి పాట మూడువేలు.
పుణ్యకోటి : జయమ్మ సంగీత ప్రదర్శనంపాట మూడువేల అయిదు వందలు.
చంద్రశేఖరం : మణెమ్మగారు వెనక్కు తీస్తున్నారు.
మణెమ్మ : మా పాట నాలుగువేలు.
చంద్రశేఖరం : భుజంగంగారి పాట అయిదువేలు.
భుజంగం : ఇంతటితో ఆపితే బాగుంటుంది.
పుణ్యకోటి : భుజంగంగారిపేర పాట కొట్టేశాం అయిదువేలు.
మణెమ్మ : మహిళాసంఘం చేతగానీ, ఉద్యోగసమితి చేతగానీ కొంతడబ్బు చందా వేయిస్తాను. సమితికి పదివేలు పోగు చెయ్యాలి.
రావు : అద్భుతంగా ఉందప్పా!
చంద్రశేఖరం : మణెమ్మగారి పాటతో ఈ మన కార్యక్రమం ముగిసి పోతుంది.
మణెమ్మ : సమయానికి సంబంధించినదే కానీ ఓ పాట అంటాను.
పుణ్యకోటి : ఆలోచిస్తే అన్ని పాటలూ అన్ని సమయాలకు సరిపోయి ఉంటవి.
మణెమ్మ : (గొంతు సవరించుకొని ఇంగ్లీషు డాన్సులాగా ఫాక్సు ట్రాట్‌లో)
లే, లే! లే, లే! లే, లే! లే, లే!!
కాలం స్వల్పం భోగ్యమోయ్
సౌఖ్యం సర్వం సాధ్యమోయ్!! లే, లే,
నిన్న లేదు రేపురాదు.
నేడే నేడే. నేడే, నోయ్!
లే, లే! లే, లే! లే, లే! లే, లే!!
బుడే : అచ్ఛా, బహుత్ అచ్చీ అచ్చీ బాత్ హై (భుజంగాన్ని చూచి భయపడి)
(తెర)
★ప్రథమ యవనిక★
చంద్రశేఖరం : ఒరేయ్ పుణ్యం! ఇప్పుడీ భుజంగంగాడి దగ్గిర ఏ పాచికైనా పారుతుంది.
పుణ్యకోటి : అందుకనే అప్పుడప్పుడూ వచ్చి రవ్వంత స్తోత్రపాఠం ఘాటుగా పారెయ్యటం - నీ గురుత్వం అబ్బింది.
చంద్రశేఖరం : భేష్! ఐ యామ్ ఎ బిలీవర్ యిన్ కోల్డు ఫ్లాటరీ. ప్రసిడెంటుగిరితో మనిషి ఢిల్లీదర్వాజా అయిపోయినాడు కనిపెట్టావా? 'మంత్రాధీనాస్తు దేవతా' అన్నారు పెద్దలు.
పుణ్యకోటి : ఇందాక నీతో చెప్పానే ఆ ఆయన శిలావిగ్రహంతో మనిషి చిత్తై పోవాలి - అయితే జయ కొంత ఆలోచన ఉన్న మనిషిలా ఉంది?
చంద్రశేఖరం : 'స్త్రీణాం ద్విగుణ ఆహారో బుద్ధిశ్చాపి చతుర్గుణా' అన్నారు పెద్దలు. అందులో కొత్తగా కళాశాల నుంచి వచ్చిన గరల్ కావటం వల్ల ఇంకా కాస్త ఆలోచిస్తున్నది. అయితేనేం? బ్రదర్! స్త్రీ ఎన్నడూ పురుషుడు కాలేదంటే నమ్ము!
పుణ్యకోటి : నిజము. (చిత్రంగా చూస్తూ) ఏ పురుషుడైనా నీబోటి పురుషుడు చస్తే కాలేదు. మరి, నా మనవిమాట ఏం చేశావు?
చంద్రశేఖరం : ఇన్నిమాట్లు నాతో చెప్పటమంటే నన్ను శంకించటం మన్నమాటనేనా మరి?
పుణ్యకోటి : బుద్ధి, బుద్ధి! ఎంతమాట! చచ్చుపీనుగను నిన్ను శంకించటం బ్రతకటానికేరా భాయీ?
చంద్రశేఖరం : ఈ స్వల్పానికే ఇంత బాధపడతావనుకోలేదు.
పుణ్యకోటి : ఓ, నో నో! ఐ యాం ఓ.కె మరి మరచిపోవుకదూ?
చంద్రశేఖరం : ఇదిగో, అభయమిస్తున్నాను! ఇప్పటికి మూడోనెల తిరక్కముందే నీ యింటిముందు పెళ్ళికని కూష్మాండం కట్టించకపోతే అప్పుడడుగు. నేను బ్రహ్మయ్యశాస్త్రి కొడుకునే కాను. నిన్ను వాడి దశమగ్రహాన్ని జామాతను చెయ్యకపోతే... పుణ్యకోటి : ఇక మనం ఆ విషయం మానేద్దాము. నీవు అనుగ్రహించావంటే నాకు చాలు. సేవాసమితికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నట్లే కనుపిస్తున్నది.
చంద్రశేఖరం : మనమంతా పట్టి మోసేస్తుంటే ఉండ కది ఏం చేస్తుంది?
పుణ్యకోటి : ఏదో ప్రజాసేవ అంటూ ఆ చైతన్యంగాడు ఇన్నాళ్ళబట్టి పాకులాడుతున్నాడు. వాడివల్ల...
'చంద్రశేఖరం : వాడి మొఘం - అయితే ఈ మధ్య ప్రాక్టీసు కూడా కొంత బాగున్నట్లుంది?
పుణ్యకోటి : డాక్టర్లకు ఎప్పుడూ ప్రాక్టీసుకు లోపం ఉండదు. ప్రతి వైద్యుడి ఇంటిముందూ తీర్థప్రజల్లా జనం ఎలా పుచ్చిపోతున్నారో చూడటంలేదూ. ఇసుకేస్తే రాలటం లేదు.
చంద్రశేఖరం : అది వాళ్ళ ప్రజ్ఞ అనటంకంటే, జనం అప్రయోజకత్వం అనటం సమంజసం. వాళ్ళకెప్పుడూ అసాధ్య రోగాలున్నవాళ్ళ వల్ల లాభిస్తుంది. అలాంటివాళ్ళు దొరక్కపోతే వాళ్ళే తయారుచేస్తారు కూడా! జలుబు చేస్తే చచ్చిపొయ్యేటంత హడావిడి చేసేవాళ్ళంటే వారికి మనస్సులో అపరిమితా నందం. ఆరోగ్యవంతులంటే పైకి ఆనందం.
పుణ్యకోటి : చైతన్యంగాడి ప్రాక్టీసు అంతా అటువంటిదే. అందువల్ల ఊళ్ళో కొంత ప్రభావం సంపాదించాడు.
చంద్రశేఖరం : బ్రదర్! ఒకమాట మరచిపోయినావు. డాక్టర్ల ప్రభావం అంతా ఉద్యోగస్థుల ఊసులాగా రోగంలో ఉన్నంతసేపు జబ్బునయమై స్నానం చేస్తే చాలు ఇంటికి వచ్చినా ముఖం జూడరు. చైతన్యం డబ్బు సంపాదించా డంటే ఒప్పుకుంటా! వైద్యానికని కొంత, ఖర్చులకని కొంతా బహుమానం క్రింద కొంతా ఇలా పోగు చెయ్యటం వాళ్ళకు పరిపాటి. వాళ్ళకారు పేషంట్లున్న ప్రతి అరఫర్లాంగుకు లెక్కకు గ్యాలన్ పెట్రోలు తాగుతుంది.
పుణ్యకోటి : ఎప్పుడైనా డాక్టర్లపని హాయైంది. జబ్బు నయమైతే తన ప్రజ్ఞనేయ వొచ్చు, రోగి చస్తే మందులు మంచివి రావటం లేదనో, మాచేతనైంది చేశాం వాడికి అదృష్టం లేదనో అనేయవచ్చు. అయితే ఇంతకూ చైతన్యంగాడి వల్ల సేవాసమితికి ఏమీ భయం లేదంటావు. చంద్రశేఖరం : అబ్బే! వాడిని చూచి భయపడటమంటే అత్తను చూచి ఆధునిక అప్ టుడేట్ కోడలు హడలిపోవటం వంటిది. కేవలం అనాక్రానిజమ్ - సరే ప్రొద్దుపోయింది. మళ్ళీ ఒకమాటు కలుసుకొని భవిష్యత్కార్యక్రమం ఏర్పాటు చేద్దాం.
పుణ్యకోటి : మన సంగతి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా!
చంద్రశేఖరం : జయను నీ యింట్లో నడిపించి నీ చేత నాట్యం చేయించకపోతే నేను... వెనక చెప్పానే... ఉఁ
(నిష్క్రమణ)
ద్వితీయ దృశ్యం
(డాక్టరు చైతన్యం ఆసుపత్రి, మిస్ రేణు ముందుగా వచ్చి చిన్న చిన్న కేసులు చూస్తూ
వస్తువులను సర్దుకుంటూ ఉంటుంది. దూరంనుంచి క్రింద జానపదగీతం ఉదయవేళ
వినిపిస్తుంది)
ఆడగొంతు :
'అప్పుడె మరిశావె మామా! న
న్నప్పుడె మరిశావె మామా!!
అద్దరేతిరియేళ
ఆకు తోటలకాడ
చందమామతొ మనము
సరసాలాడాము ...అప్పుడె....
మొగగొంతు :
ఎప్పుడు మరిశానె పిల్లా! ని
న్నెప్పుడు మరిశానె పిల్లా!!
చింతతోపుల్లోన
వంతపాటను పాడి
పులకరింతల వలపు
పొంగుపోశా నోసి .......ఎప్పుడు......
ఆడగొంతు :
అప్పుడు మరిశావె మామా! న
న్నప్పుడె మరిశావె మామా!!
రంగు గుడ్డలు కట్టి
కొంగు కొంగూ చుట్టి
చిలిపి నవ్వుల తోటి
సిరిశైలమెక్కాము కామా?... .....అప్పుడె.......
మొగగొంతు :
ఎప్పుడు మరిచానె పిల్లా! ని
న్నెప్పుడు మరిచానె పిల్లా!!
ఏరు మన్నిద్దర్ని
వేరు చేస్తే యేమి?
గుండె గుండే చేరి
నిండుకున్నా యమ్మి .....ఎప్పుడు......
ఆడగొంతు :
అప్పుడు మరిశావె మామా! న
న్నప్పుడె మరిశావె మామా!!
గుమ్మడీ పూవంటి
కొడుకు నియ్యామంటు
కొండదేవరవోరి
కోరుకున్నా మోయి! .... అప్పుడె.....
మొగగొంతు :
ఎప్పుడు మరిచానె పిల్లా! ని
న్నెప్పుడు మరిచానె పిల్లా!!
మబ్బు పట్టిందంటె
మనసు నీకోసమ్ము
గునిసి గునిసీ యెంత
కోరాడు తుందోను ......ఎప్పుడు.....
(రేణు చేతితో సంజ్ఞ చేసి వారిని ఆపుతుంది. డాక్టరు చైతన్యం ప్రవేశించి ముసలయ్య
సహాయంతో మందుల పెట్టె సర్దుకుంటాడు)
రేణు : నమస్తే, డాక్టర్‌సాబ్! చైతన్యం : నమస్తే రేణూ!
రేణు : ఒక పేదరైతుకు పాతర తీస్తుంటే కట్లపురుగు కరిచిందట! అతనికి మందు వేసి వస్తున్నా.
చైతన్యం : మంపులు ఎక్కువగా ఉంటే మళ్ళా చెప్పమను. పాపం ఇంజక్షన్ ఇకటి ఇద్దాము. (థర్మామీటరు అందిస్తూ) ఆ ఎల్లయ్యకు టెంపరేచర్ ఎంతుందో చూడు. జబ్బు అర్ధం కావటం లేదు. థౌజండ్ అండ్ ఒన్ కంప్లై యింట్లు.
రేణు : బ్రహ్మయ్య కళ్ళు బాగా నయమైనై. పనిపాటలు చేసుకుంటున్నాడు. మీకు ఏదో బహుమానమిస్తాడట!
చైతన్యం : పేదవాడు గామాలి?
రేణు : చెప్పినా వినేటట్లు లేడు.
చైతన్యం : ఉఁ అంతవరకూ వస్తే నేను నచ్చచెపుతాలే.
(చీటీలు చూచి) బొర్రయ్య!
(రేణు నిష్క్రమిస్తుంది)
బొర్రయ్య : (వచ్చి నిలుచోని దణ్ణం పెడతాడు)
చైతన్యం : (పరీక్షించి) జబ్బేమిటి?
బొర్రయ్య : పోయిన తీర్థానికి చొళ్ళంగిపోతే ఆడ ఓ గోసాయి ముండావాడు నన్ను రాయిలా సేత్తానని మందెట్టుండు బాబయ్యా!
చైతన్యం : (పెదవి విరిచి) మీరు వట్టి వెర్రిబాగులవాళ్ళోయ్ ! అందర్నీ నమ్మి దెబ్బతింటుంటారు.
బొర్రయ్య : సిత్తం, బాబయ్యా!
చైతన్యం : నెలదినాలు గట్టిగా మందు పుచ్చుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదం.
బొర్రయ్య : జబ్బు నయమైతే నా కొడుక్కు నీ పెరెట్టుకుంటా బాబయ్యా!
చైతన్యం : ( చీటి వ్రాసియిస్తూ) కొడుకు పుడతాడని గట్టి నమ్మకమే నన్నమాట! సీసా లేకపోతే కంపోండరు నడిగి తీసుకోపో.
(బొర్రయ్య డాక్టరు ఛలోక్తికి నవ్వి నిష్క్రమిస్తాడు)
చైతన్యం : 1060. క్షణానికొక రకంగా ఉంటున్నది, ఇతని తత్వం. నెత్తిన ఐస్‌బాగ్ పెట్టి టెంపరేచర్ నోట్ చెయ్యి.
(రేణు ఐస్‌బాగ్‌త్ నిష్క్రమిస్తుంది)
(బాబోయ్, అమ్మోయ్, అనే కేకలు వినిపిస్తవి)
ముసలయ్య : (ప్రవేశించి) సారాయికాపు ఊళ్లో మోపైంది సామీ! తాగి తందనాలు వేసి తలకాయలు బద్దలు కొట్టుకుంటున్నారు.
చైతన్యం : గ్రామాల్లో ఇది ఇంకా ప్రబలంగా ఉంది. అవినీతి ఇంతగా ప్రబలిపోతే ప్రభుత్వం మాత్రం ఎన్నింటికని - వీళ్ళను ఊళ్ళో పెద్దమనుష్యులు పట్టించకూడదూ?
ముసలయ్య : అంతా అలాగే ఉంటారుగాని పట్టించే అయ్య ఎవరో బయటపడలేదు. పట్టిస్తేమటుకు బయమేముంది? మర్నాడే బయటికొస్తారు.
చైతన్యం : ఎలా వస్తారు?
ముసలయ్య : అది మాకేం ఎరుక? ఏదో నల్లబజారుందిట బాబూ!
చైతన్యం : (నిట్టూర్చి) నిజం, దొంగెవరో, దొరెవరో ప్రభుత్వం గుర్తించటం చాలా కష్టంగా ఉంది.
ముసలయ్య : ఆఁ. అన్నిందాలా మా పాణాలు పొయ్యాక అది గుర్తించేం. లేకపోతే ఏం? ఎటు చూసినా బీదోళ్ల బ్రతుకు నరకంగా ఉంది బాబయ్యా!
చైతన్యం : రోజుకూలీలు పెరిగినవిగా....
ముసలయ్య : ఏం ప్రయోజనం సామీ! అడ్డెడమ్మే ధాన్యం అరసోల తక్కువ మానెడు, సోల తక్కువ మానెడు. మళ్ళా మాట్లాడితే మూడు అరసోల్లు. ఉప్పు, మిరపకాయ, చింతపండు, ప్రతిదాని ఖరీదు సుక్కలు సూపిస్తున్నవి. (లోపలనుంచి 'గాంధీ పేరూ చెప్పి కల్లుముంతా వేసి' మొదలైన పాట ప్రారంభిస్తుంది)
చైతన్యం : అదేమిటి?
రంగడు : (ప్రవేశించి)
గాంధీ పేరూ చెప్పి
కల్లుముంతా వేసి
పిల్లతో ఆటకు
పోరోయ్ బాబయ్య - అహఁ పోరోయ్ బాబయ్య -
చైతన్యం : మోకాళ్లు బ్రద్దలైనా వీడికి కైపు తగ్గినట్టు లేదు.
రంగడు : కైపు. కాఫీ కైపు కాదంటయ్యా! నేను మంతిరినైతే హోటల్లు మూసేయించి పేదోళ్ళకోసం సారాయి షాపులు, కల్లుకొట్లూ కావాల్సినన్ని తెరిపిస్తా.
కాఫీ కంటె నిజము
కల్లు మంచిదండి!
చలవచేసి ఒళ్లు
సత్తు వొస్తుందండి!
చైతన్యం : రేణూ!... ఒక గ్లాసు ఇలా పట్టుకోరా?
రేణు : (సిరప్‌గ్లాసు తెస్తుంది)
చైతన్యం : (రంగడుదగ్గరకు వెళ్ళి) ఇంకా త్రాగుతావా?
రంగడు : తాగుతావా? తాగుతా, మళ్ళీ మళ్ళీ తాగుతా -
ఓరు నువ్వు? రంగణ్ణే ఎరగవ్ -
రంగ డంటె ఓరు?
రాజోయ్ రాజోయ్!!
రంగడంటె ఊరి
రాజోయ్ మోజోయ్!!
ఊరిపెద్ద లంత
వొంగి దణ్ణమెట్టి
దొంగలల్లె మల్లి
తొల్గిపోవాలోయ్! రంగడంటె...
ముసలయ్య : (కోపంతో) ఏడిశావు -
రంగడు : (కోపంతో చూస్తాడు) చైతన్యం : అలాగే ఒప్పుకున్నాం.
రంగడు : ఓరికి బాకంట!
చైతన్యం : ఇదుగో ఇది పుచ్చుకో.
రంగడు : 'ఓవ్' (తాగి తృప్తి నటిస్తూ)
ఎంత చక్కనిదానివే రంగిరీజు పిల్లా! ని
న్నే తల్లి గన్నదే రంగిరీజు పిల్లా!!
వంగపూవు కొప్పులోన,
వాలిపోయె సొగసు చూస్తె
ఒళ్ళు ఝల్లుమన్నదే
కళ్ళు చల్లనైనవే! ఎంత చక్కని....
పిల్ల అంటె పిల్లవా?
కల్లువంటి పిల్లవే!
ఒళ్ళు పనస తోటలే
కళ్లు మంచుతునకలే! ఎంత చక్కని....
కళ్లుకళ్లు కలిపి నీవు
ఒళ్లువిరిచి చూస్తివంటె
బాటలోన వెలుతురూ
తోటలోన తొలకరీ. ఎంత చక్కని.....
చైతన్యం : (గట్టిగా) రంగడూ!
రంగడు : ఆఁ
రంగడు : ఓరు - చైతన్యం బాబయ్యా! బుద్ధి, బుద్ధి సామీ! మళ్ళీ తాగితే ఒట్టు బాబయ్యా, ఆడు పోయించాడు!
చైతన్యం : ఉ. పానపిశాచానికి ఇంత లొంగిపోయినావన్నమాట! మీవల్ల ఎవరికి ఉపకారమో ఆలోచించావా?
రంగడు : లేదు బాబయ్యా! ఇక తాగితే నామీద ఒట్టు. నా బిడ్డమీద ఒట్టు. చైతన్యం : తాగుబోతులకు పెళ్ళాంబిడ్డ లున్నారటోయ్! (దీనంగా రంగడూ, నీవే తాగితే ఇంకేముంది. ఊరి పెద్దల్లో నీవూ ఒకడివి గదా? - మహాత్ముని విగ్రహం ముందు ఇక తాగనని ప్రమాణం చెయ్యి. మీ ఊళ్ళో కరణం మునసబుల తగాదా పరిష్కారం చేశాను. వాళ్ళు రంగడు సాయం చేస్తే మళ్ళీ గ్రామాన్ని సక్రమంగా నడిపిస్తారు.
రంగడు : తప్పక చేస్తా బాబూ!
ముసలయ్య : ఊరు చెడ్డదే వాళ్ళ తగాదావల్ల బాబూ! ఒకర్ని విడిచి ఒకర్ని పట్టుకొని భుజంగంగారు మా పొట్టలు కొట్టి పెట్టెలు నింపుకుంటున్నారు.
పుణ్యకోటి : (ప్రవేశించగానే ఇతరులు నిష్క్రమిస్తారు) హల్లో డాక్టరు!
చైతన్యం : (ఆసనం చూపిస్తూ) రండి. పుణ్యకోటిగారా?
పుణ్యకోటి : (కూర్చుంటూ) రేణు మా క్లాస్‌మేట్. ఏవో రెండు మాటలు మాట్లాడిపోదామని వచ్చాను.
చైతన్యం : స్త్రీ వార్డులో ఉన్నట్లుంది. (ముసలయ్యతో) నీ నాలుకేది? - మందడిగావు గదూ? (ముసలయ్య నాలుక చూపిస్తాడు) ఈ చీటి తీసుకుపో! (కలం క్రింద పెట్టి విశ్రాంతి నటిస్తూ) ఏమిటండి విశేషాలు?
పుణ్యకోటి : అన్నీ పేపర్లలో చూస్తున్నారు.
చైతన్యం : ప్రతి పత్రికా పార్టీతత్వంతో పనిచేస్తున్నట్టు కనిపించటం వల్ల ఈ మధ్య పేపరు చూడటము చాలావరకు మానేశాను. ముఖ్యవార్తలు చూచి అవతల పారవేస్తున్నాను. ఈనాటిలోకం చూస్తున్నకొద్దీ నాకు మహాత్ముని మాట ఎప్పుడూ జ్ఞాపకం వస్తుంది.
పుణ్యకోటి : ఏమిటది?
చైతన్యం : యుద్ధానంతరం ఏర్పడ్డ మొదటి నష్టం సత్యం అని.
పుణ్యకోటి : మహాత్ముడు! ఆయన ఏదన్నా అంత బాగుంటుంది? మన భుజంగంగారు కూడా అలాగే మహాత్ముడిలా మహాత్యాగి. దేశంలో నేడు జరుగుతున్న ప్రచార ప్రబోధాలకు ఆయనే కారకుడు. ఆయనకు ఆల్ ఇండియా ఫేమ్ వచ్చేస్తున్నది.
చైతన్యం : వరల్డు ఫేమ్ కూడా వస్తుంది. ప్రస్తుతకాలంలో డబ్బుంటే సరి? పుణ్యకోటి : కేవలం ఆయనలో మీరన్న డబ్బొక్కటే కాదు. విద్య, ధనం, దానం, త్యాగం, భోగము - అన్నీ ఒక్కచోట రూపొందినవి. మొన్నటి వారపత్రికలో ఆయన సంపాదకీయం చదివారా?
చైతన్యం : 'ప్రగతి' మాటేనా? అది వారి పెట్టుబడిలో నడిచే పత్రికేగామాలి. పత్రికావిలేఖరులను కూడగట్టుకుంటే ప్రతిష్ఠకేమి లోటండీ!!
పుణ్యకోటి : అలా అనటం సాహసం.
చైతన్యం : అయితే ఇన్నాళ్ళబట్టీ ఏదో ఉడతాభక్తిగా ఉచితవైద్యం చేస్తూ ప్రపంచమంతా మెచ్చుకుంటున్న ఆ గాంధీతత్వాన్నే ప్రచారం చేస్తున్నాను గదా, నన్ను గురించి నాలుగు మంచిమాటలు ప్రగతి ఎప్పుడూ పలికినట్లు కనిపించదు?
పుణ్యకోటి : దానికి కారణ మేమిటంటారు?
చైతన్యం : అందరూ లక్ష్మీపుత్రులు కాకపోవటమూ, మణెమ్మలతో పరిచయం లేకపోవటము.
పుణ్యకోటి : మణెమ్మగారిని గురించి మీరు మహాపొరబాటైన అభిప్రాయం పడుతున్నారు. మన సంఘంలో ఉన్న దుర్గుణం అది. కాస్త ముందుకువచ్చే స్త్రీని చూస్తే కళ్ళల్లో దుమ్మోసుకుంటారు. అపనిందలు అంటగట్టుతారు - ఆమెలో ఏ గుణం లేకపోతే అంత ఇన్ఫ్లుయన్సు అందరిలో ఎలా వచ్చిందంటారు?
చైతన్యం : ఏమి ఇన్ఫ్లుయన్సు?
పుణ్యకోటి : ఏమి ఇన్ఫ్లూయన్సు అంటే చెప్పేదేమిటి? ఊళ్ళో ఉద్యోగులూ, ఉద్యోగేతరులూ ఆమె మాటకు అంతా అడుగుదాటటానికి వీలుందా?
చైతన్యం : అలాగేం? - ఆమె మీ సమితి ఉపాధ్యక్షురాలు గామాలి.
పుణ్యకోటి : మహిళామండలి అధ్యక్షురాలుకూడాను. సమితికి గొప్ప సాయం చేస్తున్నది.
చైతన్యం : నిర్మాణ కార్యక్రమం సాగించారా ఏమైనా?
పుణ్యకోటి : పార్టీని బలపరచటానికి పైకికొట్టిన టెలిగ్రాముల్లో ఆమె ఇంతంత పనిచేసిందని చెప్పలేము. - వారం దినాలల్లో క్రొత్త ఎన్నికలు వస్తున్నవి. మిమ్మల్ని సభ్యులనుగా జేసి అధ్యక్షుణ్ణిగా చెయ్యాలని భుజంగంగారూ, మణెమ్మగారూ ఏకాంతంగా ఆలోచించారు. చైతన్యం : సారీ! నేను ఏ సంస్థతోనూ సంబంధం పెట్టుకోదలచలేదు.
ముసలయ్య : (ఆతురతతో ప్రవేశించి) భుజంగంగారి నోటు బాకీ ఇవ్వలేదని బుడేసాహెబు దౌర్జన్యం చేసి సన్యాసయ్య తలబద్దలు కొట్టి వెళ్ళిపోయినాడు - నెత్తురు వరదలై పోతున్నది. కట్టుకట్టించాలి బాబూ!
చైతన్యం : నేను వస్తున్నాను. సుబ్బయ్యను ముందుగా వెళ్ళి లోషను పెట్టి గాయం కడుగుతుండమను (పుణ్యకోటితో) ఇదండీ, ఈ గొప్పవారు చేస్తున్న ప్రజాసేవ. తాము చిక్కకుండా తప్పించుకోగలరు.
పుణ్యకోటి : వీళ్ళెంత మూర్ఖులో మీరు గమనించలేదు. ఆమాత్రం భయపెట్టకపోతే ఆయనమటుకు ఎన్నిటికని కోర్టెక్కుతాడు.
చైతన్యం : వాళ్ళు మూర్ఖులు కాకపోతే అన్ని ఐశ్వర్యాలు అనుభవిస్తున్న భుజంగంగారు మూర్ఖుడౌతాడా? - ఈ నాగరికత ఇలా నడిచేటంతవరకూ వారికేం ప్రమాదం లేదు - సెలవు.
(నిష్క్రమిస్తాడు)
పుణ్యకోటి : (చైతన్యాన్ని ఉద్దేశించి) పాపం ! బాగుపడలేని పెద్దమనిషి! ముసలయ్య వచ్చి అవీ ఇవీ సర్దుతూ ఉంటాడు) ఏమోయ్ నీవు డాక్టరుగారి దగ్గిర పనికి కుదిరావా ఏం?
ముసలయ్య : ఆయన నాకు ప్రాణాలిచ్చారు బాబూ!
పుణ్యకోటి : (నవ్వుతూ) ప్రాణాలివ్వటమే! చంపేశావు!! ఆయన్ను అమాంతంగా దేవుణ్ణి చేసి కూచోపెడుతున్నావే? ఉఁ. డాక్టరుగారి సంపాదన జోరుగా ఉన్నట్లుంది?
ముసలయ్య : పేదోళ్ళదగ్గిర కానీ పుచ్చుకోని అయ్యకు సంపాదనే ముంటుంది? మోతుబరి రైతులేమైనా ఇస్తే అదీ మాకు మందుకోసం ఖర్చు పెడుతుంటాడు.
పుణ్యకోటి : సంసారమదీ ఏమీ లేదనుకుంటాను. ఇంకేం చేస్తాడులే.
ముసలయ్య : ఈ దొరలేకపోతే మొన్నటి మారెమ్మకు ఊరంతా తుడుచుకు పొయ్యేది.
పుణ్యకోటి : (నవ్వి) పిచ్చివాళ్లు! తెలివితేటలంటే ఇలా ఉండాలి. పెట్టెలమీద పెట్టెలు ఈయనకు మందు సప్లై చేసిన మహాత్ముడు భుజంగంగారు పోనేపోయినాడు.
ముసలయ్య : ఆయన బాబుగారి ఇల్లు తాకట్టు పెట్టుకొని ఇచ్చారటగా బాబూ! పుణ్యకోటి : ఆ తాకట్టు మరో అందుకు. ఈ అయ్యగారిని సీమకు పంపించి చదువు చెప్పించిందే ఆయన.
(రేణు ప్రవేశిస్తుంది)
పుణ్యకోటి : హల్లో రేణూ! ఒకమాటు మీ ఇద్దరి సేవనూ ప్రశంసించి పోదామని వచ్చాను.
రేణు : (చిరునవ్వుతో) మాకు అన్నివైపులనుంచీ వట్టి ప్రశంసలు గట్టిగా వర్షిస్తూ ఉన్నవి.
పుణ్యకోటి : మావి గట్టి ప్రశంసలు! భుజంగంవంటి పుణ్యాత్ముడు ఊళ్ళో ఉంటే వృధాగా మీరు ఇంత శ్రమపడటమెందుకు?
రేణు : ప్రతిఫలం లేని ఉపకారం ఆయన చెయ్యడేమో!
పుణ్యకోటి : పొరపాటు! ఆయన త్యాగం ఇంకా ఎవరికీ అర్థం కాలేదు. మీరు తలపెట్టిన కార్యక్రమం పెద్దఎత్తుమీద భుజంగంగారు సేవాసమితి తరపున చేయించదలచుకున్నారు. అందులో అనేకమంది నర్సులమీద వైద్యం తెలిసి అజమాయిషీ చేసే నర్సుకు, నెల 1కి 400/- జీతం ఇవ్వటానికని నిశ్చయించు కున్నాడు.
రేణు : అయితే అనేకమంది దొరుకుతారు.
పుణ్యకోటి : ఠాలారోలీ వాళ్ళవల్ల ప్రయోజనం! నీబోటి అకలంకమైన దేశభక్తురాలు కావాలి. భుజంగంగారికి - నేను నీ పేరే సజష్టు చేశాను.
రేణు : థాంక్సు! - కానీ నేను ఆ ఉద్యోగాన్ని స్వీకరించలేను.
పుణ్యకోటి : సమితి ఫండ్సులోనుంచి ఇంకా కావలెనంటె ఎక్కువ జీతం కూడా పుచ్చుకోవచ్చును.
రేణు : చైతన్యంగారిని ఒదిలిపెట్టి నేను ఒంటరిగా ఎక్కడికీ రాలేను.
పుణ్యకోటి : మీరు ఇద్దరూ సమితిలో సర్వీస్ చేస్తే మరీ సంతోషము.
రేణు : ఆయన భుజంగంగారితో ప్రజాసేవలో ఎటువంటి సంబంధం పెట్టుకోరను కుంటాను. పుణ్యకోటి : అబ్బో! అగ్రశ్రేష్ఠుడు గామాలి. (లేస్తూ) బాగా ఆలోచించండి. భుజంగంగారితో వైరం ఏమాత్రమూ మంచిది కాదని మా సలహా. (చిరుకోపాన్ని ప్రకటిస్తాడు)
రేణు : ఇందులో వైరమేముంది?
పుణ్యకోటి : ఏముందంటే సరా. ఉంది. మరి మంచిది (నిష్క్రమణ)
ముసలయ్య : (ప్రవేశిస్తూ) అమ్మా! పాపం చాలా బాధపడుతున్నాడు. మీరు ఒక్కమాటు ఆయల్లమంద దగ్గరకు వెళ్ళిచూడాలి.
రేణు : అలాగా (నెమ్మదిగా ఏదో ఆలోచిస్తూ వెళ్ళుతుంది)
ముసలయ్య : సాయంత్రం సభలో సంగతేమిటో చెప్పించాలిసిందే డాక్టరు బాబయ్యగారిచేత - మారెమ్మొచ్చినప్పుడు మందిప్పించి రక్షించినవాడు గూడెంలో గడ్డివాములు తగలేయించటమెందుకు? -
చైతన్యం : (ప్రవేశిస్తూ) పాపం! చాలా గట్టిదెబ్బ తగిలిందోయ్! (ముసలయ్య అందించే ఉత్తరం చూసి) సరే. సాయంత్రం మీటింగు పెట్టి అన్ని విషయాలూ మాట్లాడుతాను. మీ అందరి అండా నాకు ఉంటే ఇటువంటి భుజంగాలెంతమంది మన్నేం చేస్తారు.
ముసలయ్య : మారెమ్మకు మందు సప్లై చేశాట్టగా బాబూ, భుజంగంగారు.
చైతన్యం : పుణ్యకోటి చెప్పాడా? (ముసలయ్య తలూపితే) ఇతడు వాడి ఏజంటు. ఇప్పుడు వెనుకటిమాదిరిగా కాదు కొత్త ప్రభుత్వంలో ప్రతివాడికీ ఓటు ఉంది - దానివల్ల అన్నీ మారిపోతున్నవి.
ముసలయ్య : మాకు కూడాన బాబయ్యా?
చైతన్యం : మీకేమిటి! మైనారిటీ తీరిన ప్రతివాడికీ. అందుకోసమే ఈ ప్రచారమంతా?
ముసలయ్య : మళ్ళీ భుజంగం వంటివాళ్ళు పెబుత్వానికి రావటం కల్ల బాబయ్యా.
చైతన్యం : అంత చులకనకాదోయ్ ముసలయ్యా! అవసరమైతే సంచులు కుమ్మరిస్తారు మీలో కొందర్ని చీలదీసి కొనేస్తారు. వాళ్ళకు ఎన్ని నాటకాలైనా చేతౌ.
చంద్రశేఖరం : (ప్రవేశిస్తూ ఉంటాడు. చైతన్యం నమస్కరిస్తాడు) శతమానం భవతు శతాయుః పురుషశ్శతేంద్రియ ఎట్సెట్రా. చైతన్యం : నిష్ప్రయోజనంగా ఎందుకంత దీర్ఘమైన దీవెన వృథా చేస్తావు బ్రహ్మచారిముండావాడిమీద?
చంద్రశేఖరం : అమ్మయ్య (కూర్చుంటూ) - ఘోటక బ్రహ్మచారులుగా ఉండిపోతామని ఘోరమైన శపథాలు చేసిన బ్రహ్మచారి ముండావాళ్లే పెళ్ళిళ్ళమీద పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల తండ్రులై ఇండియా జనసంఖ్య ఊరికే పెంచేస్తున్నారు - ఉఁ. ప్రాక్టీస్ అద్భుతంగా ఉందిటగా -
చైతన్యం : ఏదో బండి నడిచిపోతున్నది. ఎక్కడినుంచి?
చంద్రశేఖరం : సమితి చందాలకని గ్రామగ్రామమూ ప్రచారం చేసుకుంటూ ఊళ్ళో ఉన్నావని ఇలా వచ్చాము.
(చంద్రశేఖరం వెంటవచ్చిన ప్రచారకులు పాడుతూ ఉన్న క్రిందిగీతం లోపలనుంచి వినిస్తుంటుంది)
రైతు కూలి రాజ్యమేను
రామ రాజ్యమూ అహ - రామరాజ్యమూ
కల్ల కపట మెరుక పడని
చల్లనైన రాజ్యము
సాగిరమ్ము రైతుబాబు
చక్క రమ్ము కూలిబాబు ......రైతుకూలి......
ధర్మపథము పట్టినడచి
ధైర్యమూని గడచి గడచి
సౌఖ్యహేతువైనభూమి
స్వర్గసీమ చేరుదాం ..రైతుకూలి....
చైతన్యం : డబ్బాలు నిండుతున్నవా? హడావుడి జాస్తిగా ఉందే!
చంద్రశేఖరం : ఒరేయ్! ఇదంతా ప్రచారపు స్టంటుగానీ డబ్బెవడికి కావాలోయ్. తలచుకుంటే పట్టణంలోనే వసూలు చెయ్యలేమూ - ఆయన చందాలు వసూలు చెయ్యటమంత బాఢకో పని మరొకటి లేదంటే నమ్ము
చైతన్యం : ఏదో ప్రతిఫలం చూపించేశక్తి ఉండాలనుకుంటాను? చంద్రశేఖరం : అందులో పడతి పాశుపతాస్త్రం!
చైతన్యం : భుజంగంగారి దగ్గిర రెండూ ఉన్నట్లున్నవి.
చంద్రశేఖరం : ఆయనకేమోయ్, అదృష్టవంతుడు!... లక్ష లార్జిస్తున్నాడు. లక్షలు ఖర్చు చేస్తున్నాడు. టక్కుటమార గజకర్ణ గోకర్ణ లంబవిద్యలన్నీ ఆయనకు వెన్నతో పెట్టినవి.
చైతన్యం : అయితే నీకు కోపం రాకుండా ఉంటే ఒక మాట అడుగుతాను. ఆయన ప్రస్తుతం ప్రజకోసం వెలగబెడుతున్నదేమిటోయ్!
చంద్రశేఖరం : ఇంకోరు మటుకు? పట్టణం రాజకీయాలన్నీ ఒక్క చేతిమీదుగా ఐకమత్యంతో నడిపిస్తున్నాడు. అందరికీ మంచిగా ఉండి, అంతవాడు లేడనిపించుకుంటున్నాడు.
చైతన్యం : ఎంత తెలివిగలవాడు కాకపోతే ఇంట్లో ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క పార్టీలో సభ్యులుగా చేర్చి నాటకమాడగలుగుతాడు? తమ్ముడు సోషలిస్టు, కూతురు మరొక ఇష్టు. తాను కాంగ్రెసు. గాంధీజం పేరు చెపుతాడు. ఖద్దరు కట్టడు. హరిజన సేవంటూ వాళ్ళమధ్య పుల్లలు పెట్టి పోట్లాటల్లో ఇద్దరికీ పెట్టుబడి పెడుతుంటాడు, ప్రాపకంకోసం.
చంద్రశేఖరం : ఇంతేనా?
చైతన్యం : కులతత్వాలు నశించాలని స్లోగన్. తనవాడైతేనే గాని ఫ్యాక్టరీ కూలికైనా ఒప్పుకోడు. అంతదూరమెందుకు? తాను కట్టించిన ధర్మఫండు సత్రంలో తలకూడా దాచుకోనివ్వడు.
చంద్రశేఖరం : భాయీ! అంత చెడ్డవాడు కాడు. నీవు చాలాదూరం వెళ్లుతున్నావు.
చైతన్యం : నిన్ను గురించి నా అభిప్రాయం చెప్పనా? (ఉఁ అన్నట్లు చంద్రశేఖరం తలఊపితే) నీవు అతని ఏజంటువు. చంద్రం! మీబోటివాళ్ళవల్ల ఇతరులకు ఎంత ప్రమాదం కలుగుతున్నదో ఆలోచిస్తే నిమిషం ఆ పని చెయ్యలేవు.
చంద్రశేఖరం : (అంగీకరించినట్లు) నిజం! మనం అలా బతకవలసి వచ్చిన కాలం వచ్చింది. బుర్ర ఉంది పూర్తి అవకాశాలు లేవు. బ్రదర్ చాలా టైమైంది. నాకోసం సత్రంలో మణెమ్మ వెయిట్ చేస్తున్నది - మరి భుజంగం నీ మెడికల్ స్టోర్సు బాకీ గట్టిగా అడిగి రమ్మన్నాడు - నెల దాటక ముందు డబ్బు రాలేకపోతే కోర్టులో కేస్ ఫైల్ చేస్తానని చెప్పమన్నాడు. ఇవాళ 27వ తారీఖు. చైతన్యం : చేస్తే మటుకు చేసేదేముంది?
చంద్రశేఖరం : ఒరేయ్, కాలం మారిపోయింది. ఒక్కమాటు భుజంగం దర్శనం చేస్తే - మొత్తం పద్దు ఎత్తేసే ఏర్పాటు చేస్తాను.
చైతన్యం : చంద్రం! ఈ గొంతులో ఊపిరి ఉండగా చేయలేను.
చంద్రశేఖరం : ఇక చెప్పేదేముంది? సరే! (నిష్క్రమణ)
చైతన్యం : (పంపించివచ్చి నిట్టూర్చి తీక్షణంగా గాంధీ బుద్ధవిగ్రహాలవైపు చూస్తూ ఉండగా రేణు ప్రవేశిస్తుంది)
రేణూ! మా సంభాషణ విన్నావా ఏం?
రేణు : విన్నాను - (బుద్ధదేవ, మహాత్మాగాంధీ విగ్రహాలను చూపిస్తూ) ఈ మహాత్ముల అనుగ్రహం తప్పకుండా ఉంటే కాలం అదే కలిసివస్తుంది - ధైర్యం వహించాలి.
రేణు :
ఓహో జగద్గురువులారా!
ఓహో, జగజ్జ్యోతులారా!
చైతన్యం :
నీరు పోసి పెంచిన మీ
కోరికలను వల్లికలము -
దెసదెసలను మసలుటయే
తీయని మా కోరికలూ ఓహో, జగద్గురువు లారా!:
రేణు :
క్రూరార్కుని కిరణములకు
కొంత కొంత వాడితిమి
జడిగా దయ వర్షింపుడు
బడలికెదల వికసింతుము
ఓహో, జగద్గురులారా!
ఓహో, జగజ్జ్యోతులారా!
(తెర)
★ప్రథమ యవనిక★
(ప్రవేశము : రంగడు దూరంగా పోతూఉన్న రావును చూచి)
రంగడు : ఇదుగో! నిన్నేనయ్యోవ్!.... ఓ టోపీ ఆయనా?
రావు : (దగ్గిరకు వచ్చి ఉరిమి చూస్తుంటాడు) ఏం? బ్రూట్‌లా వున్నావు?
రంగడు : కాందెందుకు పిలుస్తాను. అలా సూస్తావేమయ్యా! తెల్లోడి తొడలోనుండి వూడిపడ్డట్టు! మేమూ మనుష్యులమే.
రావు : కారని ఎవరన్నారు? మర్యాద తెలియవద్దూ.
రంగడు : ఇందులో తప్పేముందయ్యా నాయాల్టిది అప్పుడే అంత పొడుచుకోవచ్చింది. 'పేరు తెలియక టోపీ ఆయనా' అంటే అంత మండిపడతావు. - సరేగాని నీవు పోర్టరువు గదూ?
రావు : నాన్సెన్సు! నేను కరస్పాండెంటును.
రంగడు : అదికాదయ్యా! పేపర్లకు రాసేవాడివి నీవు కాదటయ్యా!
రావ^ : అవును.
రంగడు : మరి నా పేరు వేయిస్తానని వెనక వచ్చినప్పుడు చెప్పావు. ఇంతవరకూ పడలేదటగా మా కరణమన్నాడు.
రావు : ప్రతివాళ్ళ పేరు పడుతుందనుకున్నావా ఏం? పెద్ద పెద్దవాళ్ళ పేర్లు దేశసేవ చేసినవాళ్ళవి గాని పడవు.
రంగడు : అయితే నన్ను తీసిపారేశావన్నమాటే! ఇదిగో నాయెంట పొలిమేరల్లో ఉన్న ఊళ్ళన్నిటికీ రా, ఎవరు గొప్పో తెలుస్తుంది.
రావు : నాకేం పని? నా యిష్టం వచ్చింది రాసుకోపోతాను.
రంగడు : ఆఁ, రాసుకోపోతావు, రాసుకోపోవూ మరి? నీయిట్టమేటయ్యా! ప్రతినాయాలు వచ్చేది, ఏందో రాస్కపొయ్యేది, మా తాడు తెగేది, ఇక్కడ ఏం రాశావో సదివి యినిపిచ్చి మరీ వెళ్ళకపోతే సూడు నా దెబ్బ. రావు : మీరంతా వట్టి మొరటువాళ్లు. మీరు పట్టిన పట్టే గాని మంచీ చెడ్డా తెలియదు.
రంగడు : మాకు తెలియదంటావు. ఉఁ. అబ్బో! మీకంతా తెలిసింది. నాలుగు ఇంగ్లిపీసు ముక్కలు నేర్చుకోంగానే సరేనంటయ్యా! - ఏదీ సదువు సూద్దాము, ఏం రాశావో,
రావు : ఏముందీ! నేనేం రాయలేదు -
రంగడు : ఆ చెట్టుకింద కూర్చోని అన్ని కాగితాలు పాడుసేస్తివి గదయ్యా!
రావు : అది నా డైరీ లే.
రంగడు : అందులో నన్నా నా పేరు రాయవంటయ్యా ఎండలో ఎన్నాల్లో కట్టపడ్డాను.
రావు : నీవు చైతన్యంగారి మనిషివా?
రంగడు : (సంతోషంతో) అవును. ఆ అయ్య యేం సెయ్యమంటే అది సేస్తాను.
రావు : అందుకోసమనే నీ పేరు పేపర్లో పడలేదు.
రంగడు : (ఆశ్చర్యం చూపుతూ) అదేంటయ్యా! ఆ దొర మాలావుదొడ్డాడే! అందుకని నా పేరు పడకపోతే ఆసుపత్రికెందుకయ్యా?
రావు : మీకేం తెలుసు?
రంగడు : తెలియకే గదూ అడగటం - తెలిస్తే అడగటమెందుకు?
రావు : మా 'పత్రిక' ఎప్పుడూ ఒకే ఉద్దేశం పెట్టుకొని పని చేస్తుంది.
రంగడు : ఔను! ఆ సంగతి తెలుస్తూనే ఉంది. ఆ భుజంగం వంటివారిని గురించి మంచిగా రాస్తుంది. - మీరంతా గుడ్డివాళ్ళా ఏమయ్యా! చైతన్యంగారు మాకోసం ఇంత శ్రమపడుతూ ఉంటే ఆయన్ను గురించి ఓ మాటైనా వ్రాశారు గాదట, మావోళ్ళంటున్నారు.
రావు : మా ఇష్టం వచ్చినట్టు వ్రాయటానికి వీలుండదు. ఓ పాలసీ వుంటుంది. దాన్నిబట్టి వ్రాయాలి. లేకపోతే మా ఉద్యోగం పోతుంది.
రంగడు : పాలసీ ఆ - బోలెసీ ఆ! నిజం వ్రాస్తే ఉద్యోగం పోతే దానమ్మ నాయాల్టిది పోతే పోయింది. ముష్టెత్తుకోవచ్చుగదయ్యా! మీ సదువుకున్నాళ్ళే అబద్ధాలు చెపుతుంటే మమ్మల్ని తప్పట్టటమెందుకు? రావు : నిజమే మరి? అది మన ఇష్టంలో లేదు.
రంగడు : అయితే మీరంతా సేతగానోళ్ళు. మా వూళ్ళో ఒక్క యెదవ అబద్ధం సెప్పిండో ఆడికి మళ్ళీ కూడుపుట్టకుండా సెయ్యంటయ్యా! మీకు కూడా అట్టా సేస్తే మర్నాటికల్లా మాటినరండి. సరేగానీ భుజంగం వంటి డబ్బున్నోళ్ళంతా మిమ్మల్ని కొనేస్తారంటగా?
రావు : మమ్మల్ని కాదుగానీ మా పేపరు పెట్టినవాళ్ళనే కొనేస్తారు.
రంగడు : అంటే అదే గదంటయ్యా! వాళ్ళనుకొంటే మిమ్మల్ని కొన్నట్లేగా. బర్రెను కొంటే దూడను కొన్నట్లే. ఓరి ముసలయ్యా!
(ప్రవేశము ముసలయ్య) ఈనెవరో పేపరాయనంటగాని, పట్టుకో బోదాంపా! ఏందేందో రాసుకోపోతున్నాట్ట!
రావు : (భయపడుతూ) నన్ను పట్టుకుపోతే ఏముంది? మావాళ్ళు ఎలా వ్రాయమంటే అలా వ్రాస్తాము.
ముసలయ్య : (దగ్గరికి వస్తాడు) మిమ్మల్ని పట్టుకుంటే యిడిపించను మీవాళ్లు వస్తారు. - వాళ్ళతో మాట్లాడి అప్పుడు ఇడిపిస్తాములే. ఆఁ
రావు : ఇది చాలా ప్రమాదం!
రంగడు : అవును నీకు ప్రమాదం కాదంటయ్యా మరి -
రావు : మాకు ప్రమాదమైతే నాలుగురోజులు జైల్లో పెడతారు. అంతేనా?
ముసలయ్య: పోనీ అబద్ధాలు రాయనని ఒట్టెట్టుకో నిన్ను ఒదిలిపెడతాము.
రావు : (తప్పనిసరైనట్లు నటించి) అబద్ధాలు వ్రాయను.
ముసలయ్య : చైతన్యంగారిని గురించి మంచిగా వ్రాస్తామని మా ముందు దణ్ణం పెట్టి చెప్పు.
రావు : తప్పకుండా! (దణ్ణం పెడుతూ) నా దేవుడి సాక్షిగా చైతన్యంగారిని గురించి అబద్ధం వ్రాయను అబద్ధం వ్రాయను.
రంగడు : మహానుభావుడని వ్రాస్తాను. రావు : మహానుభావుడని వ్రాస్తాను.
రంగడు : మమ్మల్ని గురించో?
రావు : (మీరిద్దరూ నిలవబడండి) ఫొటోతో సహా గ్రామాలల్లో మీ సేవను గురించి వ్రాస్తాను. (ఫొటో తీసినట్లు నటిస్తాడు)
రంగడు : అయితే ఇక వెళ్ళు. ఇదుగో ఈ తడవ పొలిమేరల్లో అబద్ధాలు వ్రాసి కాలుపెట్టేవో కట్టేస్తాము -
రావు : నన్ను మరి నమ్మాలి. నేను కూడా పేదవాణ్ణి కదూ!
ముసలయ్య : అయితే పో బాబూ! - రంగడూ - ఆయనా మనంటి మారాజే! (రావు నిష్క్రమిస్తుంటాడు)
రంగడు : మనంటివాడైతే మనమంటే మండిపడతాడేమంట - ఇదిగో, ఇలా ఒక్కొకళ్ళకు బుద్దిచెపితేగాని మంచి బయటికి రాదురా? - ఈ తెలివిగలవాళ్లు ఎంత దొంగలో నీకు తెలియదు.
(నిష్క్రమణ)
తృతీయ దృశ్యం
(భుజంగం ఇంట్లో ఒక భాగం - సేవాసమితి ఆఫీసుగది. జయమ్మ ఒంటరిగా
కూర్చొని ఉంటుంది. చైతన్యం వ్రాసిన గీతానికి ట్యూన్ వేసుకుంటూ ఉంటుంది)
కలకందని ఆ లోకం!
కనినారా! కనినారా !!
కలకందని ఆ లోకం
కాంచన ఘన నవలోకం
కదలిందీ, కదలిందీ
జాతిరథం! రాతిరథం కలకందని.....
ప్రభువులమే మేము
బానిస లిక లేరు
చైతన్యం! నవచైతన్యం
సుప్తోద్ధృత నవచైతన్యం
కలకందని ఆ లోకం!
కనినారా! కనినారా !!
రేణు : (ప్రవేశించి) ఏం జయా! డాక్టరు చైతన్యంగారి పాటే!
జయ : ఏం వారిపాట నేను పాడకూడదా ఏం? - రా రేణూ ఇలా కూర్చో.
రేణు : ఏం జయా! ఒంటరిగా కూర్చున్నావు. మీ సమితి సభ్యులు ప్రచారగీతాలు పాడుకుంటూ కనిపించారే, ఇందాక, అగ్రహారంలో.
జయ : నీవు ఇలా దారితప్పి వస్తావని కూర్చున్నా!
రేణు : నీవూ నిన్న మండలిలో దారితప్పి మహోపన్యాసం చేశావని విని అభినందించి పోదామని వచ్చాను. జయ : నో మెన్షన్ రేణూ! ఊరంతా గగ్గోలుగా ఉందిటగా? లేకపోతే ఎంతకాలమని వెధవ నాటకాలు! హృదయమున్నవాళ్ళు ఎక్కువకాలం ఆడలేరు.
రేణు : అందుకనే నీవు బయటపడ్డావు.
జయ : ఊళ్లో పెద్దమ్మలంతా గూడుపుఠాణీ చేశారట రాత్రి. నన్ను కార్యనిర్వాహకవర్గంలో నుంచి తీసేస్తారట!
రేణు : లేకపోతే అంతంత ఉద్యోగస్తుల పెళ్ళాలను పట్టుకొని ఛాలెంజి పారేస్తే ఊరుకుంటారా మరి.
జయ : గ్రామగ్రామానికీ వెళ్ళి రాష్ట్రభాష, వయోజనవిద్య ప్రచారం చేద్దామన్నాను.
రేణు : పనిమనుషుల నెత్తిమీద పిల్లలను ఒదిలిపెట్టి పచార్లు చేస్తూ క్లబ్బుల్లో కాలక్షేపం చేసేవారికి ఒళ్ళు వంగవద్దూ.
జయ : ఆ పని చేయలేనప్పుడు పెద్ద కబుర్లు చెప్పటం మానెయ్యాలి.
రేణు : మొగవాళ్ళ ఉద్యోగాలకు మేలుచేసే మాటలు మాట్లాడుతుంటే ఉపయోగం ఉంటుందని చేసే పనులు గాని, ప్రజమీద ప్రేమంటావా?
జయ: అందుకనే మనం చెప్పేమాటలన్నీ చిలుకపలుకులన్నాను. - నిన్నటి నా ఉపన్యాసం ఒకనాడు హఠాత్తుగా పుట్టుకొచ్చిన ఊహకాదు. అల్లరికోసం అన్న మాటలూ కావు. మథనపడి బయటపెట్టాను.
రేణు : విన్నవాళ్ళను అందుకనే అంత కలతపెట్టడమూ, ఆకర్షించటమూ జరిగింది. మీ మండలి సామాన్యసభ్యులు ఎంతో హర్షించారు. నీలో మార్పు వచ్చిందన్నారు.
జయ : నిజమే. నాలో బ్రహ్మాండమైన మార్పు వచ్చింది. నాకు ఈ వాతావరణం నచ్చటం లేదు. - రేణూ! నిజంగా నీవు ధన్యురాలివి. చైతన్యంగారితో బాటు ప్రజాసేవ చేసే భాగ్యం నీకు అబ్బింది.
రేణు : జయా! మీ తండ్రిగారు సేవాసమితికి అధ్యక్షులు కావటమేమిటి? నీవు నా అదృష్టాన్ని పొగడటమేమిటి? నీవు ఏ పని తలపెడితే అది జరిగిపోతుంది.
జయ : పొరబాటు! కొన్ని సంస్థలు వాటి ఖర్మవశాత్తు కొందరు వ్యక్తుల చేతుల్లో పడుతవి. 'పని చేస్తున్నట్లు కనిపించటమే' గాని ప్రయోజనం ఉండదు. రేణు : ఔనౌను. నిన్న నిలయంవారి వార్షికనివేదిక విన్నాను. అంతవరకూ స్త్రీ జనోద్ధరణకోసం కొన్ని లక్షలు ఖర్చుపెట్టారట! ఆ సంస్థకు సంబంధించిన యువతి ఒక్కతే దేశంలో ఏ మంచి అంశంలోను పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నట్లు వినిపించదు కనిపించదు.
జయ: సాంఘికంగా రాకపోవచ్చు.
రేణు : రాజకీయంగా వచ్చిందా ఏమిటి?
జయ : రేణూ! ఒక్కమాట చెపుతాను. నేటి సంస్థలున్ను వ్యక్తులకు కీర్తిధ్వజాలుగా నిలుస్తున్నవి గానీ సంఘాభివృద్ధికోసంగా కనపడటం లేదు.
రేణు : (రిష్టువాచి చూచుకొని) జయా! క్షమించాలి, చైతన్యంగారు ఊళ్లో కేసులు చూచుకొని ఆసుపత్రికి వచ్చే వేళైంది.
జయ : పాపం! చైతన్యంగారు చాలా శ్రమపడుతున్నట్లున్నారు. అనేక మాటలు చెప్పాను గానీ సాయం చెయ్యలేకపోయినాను.
రేణు : ఆయన పడుతున్న శ్రమ ఒకవిధంగానా? - శారీరకంగానూ, మానసికంగానూ, అప్పుతెచ్చి ఉచితవైద్యం చేస్తున్నారు. నీలాపనిందలు మోస్తున్నారు.
జయ : రేణూ! లోకం ఎవరెరుగనిది. నింద ఎప్పుడూ మంచివాళ్ళమీదనే పడుతుంది. వ్యక్తులు నమ్మిచేసే పనికే స్వార్థపరులు కొందరు అపనిందలు కల్పించి కూలదోస్తుంటారు.
రేణు : (లేస్తూ) ప్రయోజనం?
జయ : తమను తప్ప మరెవ్వరినీ లోకం చెప్పుకోకూడదు. అందరూ తనకు ఉపగ్రహాలుగా చుట్టూ తిరుగుతుండాలి.
రేణు : (సాభిప్రాయంగా) అవును, అవును.
జయ : (లేచి కొంతదూరం పంపించి మళ్ళీ వచ్చి కూర్చొని పాపం! చైతన్యంగారు బాధపడుతున్నాడట! ఎవరినైనా చూస్తే చూడటానికి బుద్ధి కలగదు (సాభిప్రాయంగా) ఇటువంటివాళ్ళను చూచే
'లాంగూల చాలన మధ శ్చరణావఘాతం
భూమౌ నిపత్య వదనోదర దర్శనంచ
శ్వాపిండ దస్య కురుతే గజపుంగవస్తు
ధీరం విలోకయతి చాటుశతైశ్చ భుంక్తే"
అన్నాడు భర్తృహరి.
నిజం! కవి అన్నట్లే నీచజాతిదైనా కుక్క తిండిబెట్టే వాడి దగ్గిర సకలావస్థలు పడుతుంది. కానీ ఏనుగు మాత్రం మావటోడు ఆహారం తీసుకోవచ్చి బుజ్జగించి బతిమాలినా నోరు చాపదు. గొప్ప ఆశయాలు గలవాళ్ళ ప్రవర్తన ఎప్పుడూ ఇలాగే ఉంటుంది!
(దూరం నుంచీ రైతుకూలి రాజ్యమేను, రామరాజ్యమూ' వినిపిస్తుంది) (నవ్వుతూ) పట్టణాలల్లో ఈ ప్రచారం చేసి ప్రయోజనం? పిల్చ్! - (బోలో మహాత్మాగాంధీకి జై, పండిత్ జహ్వరులాల్ నెహ్రూకు జై, సర్దార్ భుజంగంగారికి జై, సేవాసమితికి జై (నానా రకాల ప్లేకార్డులతో పుణ్యకోటి ప్రవేశించి అన్నీ వరసగా ఆఫీసులో పెట్టిస్తాడు) (జయ, పుణ్యకోటిని లెక్కచేయనట్లుగా ఒకవైపుకు తిరిగి కూర్చుంటుంది. (పుణ్యకోటి రు. 5/- ఇచ్చి చాలకపోతే ఇదిగోనంటూ
రు. 10/- కాగితం విసిరివేస్తాడు కుర్రవాళ్ళకు - వాళ్ళు జై పుణ్యకోటిగారికి జై అని వెళ్ళిపోతారు. పుణ్యకోటి మెళ్ళో పూలదండను తీసి చెమట తుడుచుకొని దండ బల్లమీద పెడుతూ)
పుణ్యకోటి : జయా! నీవు సభలవైపు రాలేదు.
జయ : రా దలచుకోలేదు. - అయినా వస్తే సభలో ఏ అభాసు ఔతుందో నని భయపడ్డాను కూడా.
పుణ్యకోటి : అదేమిటి? నీ ధోరణి క్రొత్తగా ఉంది.
జయ : ఈ నటనంతా ఎందుకు? నన్ను గురించి నీవు ఏమీ వినలేదూ?
పుణ్యకోటి : క్లబ్ ప్రసంగం విషయమేనా?
జయ : నిన్నటి రాత్రి బడి విషయంగూడాను.
పుణ్యకోటి : అదేదో పాలసీకోసం నాన్నగారి ఇష్టంమీద మాట్లాడావను కున్నా. రాత్రిబడి నాన్నగారే నడపమని మొన్న అన్నట్లున్నారు? - అందరం ఒకేరకంగా మారితే కాలం మారినప్పుడు చెలామణి ఉండకపోవచ్చు. జయ : అందుకే గామాలి, మీరు మహజాగ్రత్తగా గోడమీద పిల్లివాటంగా మాట్లాడి తప్పించుకుంటుంటారు - నాకు అలా వేషాలు వేయటం చేతగాదు.
పుణ్యకోటి : అయితే ఆ ఉపన్యాసం మనస్ఫూర్తిగా ఇచ్చిందన్నమాట!
జయ : ఔను, మహాత్ముని నిర్మాణ కార్యక్రమానికి నాచేతనైనంతగా తోడ్పడదామని నిశ్చయించుకొన్నాను. ఇంకా ఈ పాశ్చాత్య వ్యామోహపిశాచం మన్నెంత కాలం పట్టి బాధించటం!
పుణ్యకోటి : మీ నాన్నగారి అధ్యక్షతక్రింద మేము చేస్తున్నదేమని నీ అభిప్రాయం?
జయ : కాగితాలమీద తీర్మానాలు, ఇష్టం వచ్చిన వాళ్ళను నాయకులను చేసి సన్మానాలూ, పైకి తంతితపాలాలూ, మీలో ఒక్కరికీ హృదయమున్నట్లు నాకు కనుపించటంలేదు.
పుణ్యకోటి : అయితే మావల్ల మహాత్మునికి అపకీర్తేనని నీ నమ్మకమా?
జయ : నిశ్చయంగా. మాటలు చూడబోతే సేవా, త్యాగము, స్వేచ్ఛ, సౌఖ్యము, సర్వసమత్వము, అభ్యున్నతి, జాతీయత, అంతర్జాతీయత.
పుణ్యకోటి : (పెద్దపెట్టున నవ్వుతూ) జయా! వృథాగా ఈ కోపం ఎవరిమీద?
జయ : దేశద్రోహులమీద. అజ్ఞానాంధకారంలో అల్లటతల్లటౌతూ నిత్యయాత్రకు యాతనపడుతూ ఉన్న సామాన్య మానవుడి పేరు చెబుతూ ముందు ప్రాపకం, తరువాత డబ్బు సంపాదించుకొనే పాషండులమీద - ప్రజాసేవ పేరుచెప్పి సమితి ఏమి చేసిందో చెప్పండి.
పుణ్యకోటి : అలా అడుగు - సమితి లేకపోతే మద్యపానం నిషేధం అమలులోకి వచ్చేదే కాదు.
జయ : (వికటంగా) మద్యపానాన్ని నిర్మూలించారు.
పుణ్యకోటి : హరిజన దేవాలయ ప్రవేశం
జయ : గృహప్రవేశానికి మనస్ఫూర్తిగా అంగీకరించని మనం దేవాలయ ప్రవేశం చేయించాము.
పుణ్యకోటి : సంఘంలో ప్రచారం మూలాన అనేక విషయాలలో నిశ్శబ్ద విప్లవం తెచ్చాము. జయ : తెచ్చాము. (వేళ్ళు లెక్కపెట్టటం మానేస్తుంది)
పుణ్యకోటి : జయా! ఇంతవ్యంగ్యం అనవసరం. చేయవలసిన పని చాలా ఉన్నదనే భయంలో నీవు నిరుత్సాహపడి 'పెసిమిష్టు' వౌతున్నావు.
జయ : ఇదుగో మీ దగ్గర ఉన్న దుర్గుణమే అది. ఎవరైనా ఎదురు మాట్లాడితే మంచిచెడ్డలు ఆలోచించకుండానే వాళ్ళమీద ఒక ఇష్టు పారేసి నోరు మూయించటం - ఈ ఆటలిక సాగవు.
పుణ్యకోటి : నీవు వచ్చే సంవత్సరం ప్రధాన కార్యదర్శివై నీ యిష్టానుసారం కార్యక్రమం సాగించు.
జయ : ఇక ఈ సమితి పనిచేస్తుందనుకోటం పొరబాటు. ఇది ఎలాపోతే నాకెందుకు?
పుణ్యకోటి : (లోపలనుంచి పుణ్యకోటి, పుణ్యకోటి అని చంద్రశేఖరం గొంతు) (లేస్తూ) ఉద్వేగంలో అంతత్వరగా ఒక నిశ్చయం చెయ్యటం అట్టే క్షేమకరమైన పనికాదు.
జయ : డబ్బాలల్లో డబ్బు లెక్కకోసం గామాలి. వెళ్ళిరండి. - మణెమ్మగారు దర్శనమిప్పించలేదు.
పుణ్యకోటి : (నడుస్తూ) మీ నాన్నగారూ ఆమె అలా మీదుగా వస్తామన్నారు
(వెళ్ళుతూ ఉంటే)
జయ : (చిత్రమైన గొంతుకతో) ఓహో, అలాగేం! (పుణ్యకోటి నిష్క్రమించిన తరువాత, విగ్రహంతో) బాపూజీ! చూస్తున్నావా! నీ పేరుమీద లోకంలో ఎంత మోసం, అన్యాయం అక్రమం పెరిగిపోతున్నదో చూస్తున్నావా? అలా బోసినోరు విప్పి నవ్వుతావు బాపూజీ! నీ సిద్ధాంతాలన్నీ నీటగలసిపోతున్నవి.
బుడే గొంతుక : హిందూ - ముస్లిం హేక్ హో హంటు
హెగ్రీ హేషేషాన్
(ప్రవేశించి) షిన్న, పెద్దా హోక్టీ హంటూ
షెప్పీ హేషేసాన్ హిందూ....
హరేక్ హాద్మీ ఖుషీకోషం,
షరత్ హుండాలి,
మల్లీ హిస్సా హుండాలి
ఔర్ హిమ్మత్ హుండాలి హిందూ...
మతంకోషం ఖొట్టుకుంటే
మందిదేషం మాడిపోద్ది
సునోభాయీ, దేఖో భయ్యా
లడైనైహై, భాయీ, భాయీ హిందూ...
జయ : లోకంలో ప్రస్తుతం జరుగుతున్న మాయానాటకంలో వీడు హాస్యరసాన్ని
పూర్తి చేస్తున్నాడు.
బుడే : (వెనక్కు తిరిగి) హమ్మాయిగార్! - నాకీ మల్లీ హెట్టాహుండాన్ హమ్మాయ్‌గార్!
జయ : రాబొయ్యే మా కల్కి అవతారంగా ఉన్నావు -
బుడే : (సంతోషంతో) గల్గిహవతారం! (తృప్తితో హమ్మాయిగార్! - నాకీ హది హంతా. తెల్దుగాని, హంతా నాకీ షద్వూకొని హరేక్ హద్మీ హీనేటట్టూ షెప్పి హేషేషాన్గా, నాకీ -
జయ : ఏం చదువుకున్నావు?
బుడే : షంద్రంబాబూ కాగజ్ మే వ్రాషి షెప్పిందంతా హొప్పషెప్పి... బహుత్ ష్రమా హైందీ హమ్మాయి గార్! - షేవా హంటే యహీ హైతో మాకీ దిల్ మేఘాల్మే హెగ్రీపోద్ది.
జయ : ఏమేం చెప్పావేమిటి?
బుడే : హేమేం షెప్పావ్? 'బీదల్ సాదల్ హోక్టీహుందీ, బూజహంగం సాబ్ మన్కీ బహుత్ ఫాయిదాషేస్తాడ్. ముందుముందు ఖుసీ హుందీ' హంటూ నాకీ జండాపట్టి షిందూ వేస్తూ షెప్తాహుంటే, హమ్మాయిగార్ పాట నాకీ పాడే తల్కీ మల్లీ మల్లీ పాడమంటూ - నవ్వలేక షచ్చి పొయ్యార్‌గా ఝనం మల్లీ!
జయ : భేష్! నిన్ను పెట్టి ఈ మాటు ఒక కొత్త నాటకం ఆడారన్నమాట!
బుడే : నాట్కం? బలే బరమాహండం హైనా నాట్కం, హమ్మాయిగార్ మీకీ వచ్చి చూస్తే నాకీ హీనాం మీద హీనాం హిచ్చేవార్గా మల్లీ?
జయ : (తీక్షణంగా) ఇప్పుడు నీవు చేసిన పనిని గురించి ఏమైనా ఆలోచించావా? బుడే : హది నాకీ హెంద్కు హమ్మాయగార్! షేకహరం బాబూ షెయ్యామందీ షేష్తాం. సాబ్ బూజుహంగం హివ్వమంది హిస్తాడ్ మాకి. బీబీ బిడ్డల్ బత్కుతుంటే పాచ్చామల్లే పాణం హుంటే.
జయ : బుడే! వీళ్ళెవరికైనా పేదవాళ్ళంటే దయ ఉందంటావా?
బుడే : హమ్మాయిగార్! హంతా మీకీ కొత్త షేషి కుంటారేమి - నాన్నగార్కి ధర్మం నైతో పేదల్ సాదల్ షచ్చిపోర్!
జయ : మాకు ఇంత డబ్బు ఎట్లా వచ్చిందో ఆలోచించావా? (లేదన్నట్లు తలూపితే) మీబోటి పేదవాళ్ళను కోటిమందిని పొట్టలు కొడితే వచ్చింది. మా నాన్నగారు మిమ్మల్ని పశువుల్ని చూచినట్లు చూస్తున్నాడు పట్టి పాలిస్తున్నాడు.
బుడే : మాకీ కూడా ష్వతంత్రంకీ హొచ్చిందిగా!
జయ : ఔను. మీ అజ్ఞానం ఇలా ఉన్నంతకాలం స్వతంత్రం కాదు స్వర్గం వచ్చినా లాభం లేదు. పోస్టాఫీసుకు వెళ్ళి ఉత్తరం పోస్టులో వేసిరా, చైతన్యం గారికి త్వరగా రేపే చేరాలి.
బుడే : చైతన్యంగార్కి? (ఔనన్నట్లు చూడగానే) అచ్ఛా! హమ్మాయిగార్ ! ఔ (నిష్క్రమిస్తూ) హమ్మాయిగార్! నాదీ పేరు ఫేఫర్లోన పడ్తుందంట మల్లీ - షాంకు హింట్కీ హెళ్తే బీబీ షూషీ షంతోషంతో
జయ : త్వరగా వెళ్ళిరా - నేను ఇంట్లో చిన్న పని చూచి వచ్చేటప్పటికి తిరిగి రావాలి నీతో పనుంది. మనం ఒక చోటికి వెళ్ళిరావాలి.
బుడే : మేఘాల్మే హెగ్రీ రానూ! (నిష్క్రమిస్తాడు)
(జయ నెమ్మదిగా నిష్క్రమిస్తుంది. భుజంగం వచ్చి కూర్చొని 'చంద్రశేఖరం గారూ' అని పిలువగానే 'వస్తున్నా' అనే సమాధానంతో ధర్మడబ్బాలు, లెక్క తీసుకొని చంద్రశేఖరం ప్రవేశిస్తాడు.)
భుజంగం : ఏమండీ! సమితి చందాలు సన్నగిల్లిపోతున్నట్లున్నవి?
చంద్రశేఖరం : ఆహా! అనుమానం లేకుండా, వందరూపాయలకు మించి ఒక్క కానీ పడటం లేదు డబ్బాల్లో -
భుజంగం : పోయిన నాలుగు నెలలు లెక్కా చదవండి. చంద్రశేఖరం : మార్చి 99-12-9 ఏప్రియల్ 95-10-6 మే 90-14-3 జూన్ 80-14-5 జులై 60-5-3
భుజంగం : నెలచందాలు వసూలు కావటం లేదు.
చంద్రశేఖరం : నెలంతా తిరిగి నాలుగిళ్ళల్లో వసూలు చేసేటప్పటికి నా తల ప్రాణం తోకకు వస్తున్నది. ఏ ఇంటికి వెళ్ళినా ఎందుకివ్వాలి? భుజంగం గారు లక్షాధికారి కాలేడనా! సమితి ఏం చేసింది? అని అడుగుతున్నారు. చాలా అసహ్యంగా ఉంది ప్రజల ప్రవర్తన.
భుజంగం : ఏడిచారు! ఇటువంటి అవాకులు చెవాకులు మాట్లాడకుండా మర్నాటికల్లా ఆర్డినెన్సు పుట్టిస్తాను.
చంద్రశేఖరం : రోగం కుదురుతుంది.
భుజంగం : నేను మటుకు డబ్బు ఎక్కడనుంచి తెచ్చి పెడతాను?
చంద్రశేఖరం : మూలధనం మొన్న మీకు కావలసి వాడుకున్నట్లున్నారు కూడాను. అయినా అడిగే సత్తా ఉన్న సభ్యుడు కూడా లేడులెండి.
భుజంగం : ఆ భయం ఎన్నడూ లేదనుకోండి - అఁ మరచిపోయినాను. నిన్న ఢిల్లీనుంచి ఒక మిత్రుడు వచ్చాడు. ఆలిండియా సేవాసమితివారు ఈ సంవత్సరంనుంచీ గ్రాంట్లు ఆపివేయటానికి తీర్మానించుకున్నారట!
చంద్రశేఖరం : ఇది జరుగుతుందని వెనుక మీతో నేను అనలేదూ?
భుజంగం : ఊళ్లో నుంచి మనమీద పిటీషన్లు వెళ్ళినవట! ఎంక్వైరీ కమీషన్ ఒకటి వేస్తారట! - కొంచెం లెక్కలు సరిచెయ్యాలి.
చంద్రశేఖరం : నా మొఖం - ఏం సరిజేసేది? అంతా లెక్క గైరుహాజరుగా ఉంది.
భుజంగం : మరి, ఎలాగో సర్దాలి, లేకపోతే మనిద్దరి పీకలమీదికి రావచ్చు.
చంద్రశేఖరం : మీరేమన్నా చెప్పండి. జైలుకైనా వెళ్ళవచ్చునుగాని చిత్తులేని లెక్క సరిజెయ్యటం నాచేతగాదు చాలాకష్టం!
భుజంగం : కష్టం కాబట్టే చూడమనటం - వెధవ దేశం ఎవడైనా బాగు పడుతుంటే ఇంత వోర్చలేదేమండి? వట్టి ఈర్ష్య. ఇందువల్లనే ఇన్ని కష్టాలు వస్తున్నవి. మనకు ధర్మం తప్పింది. చంద్రశేఖరం : మన కష్టమంతటికీ వెనక ఒక వ్యక్తి ఉన్నాడన్న సంగతి మీరు గమనించారా?
భుజంగం : ఆ చైతన్యంగాడేనా? వాడిమొఖం! - మనను దెబ్బకొట్టటం వాడి తాతతరం కాదు. అనవసరంగా వాడికి ఖ్యాతి తెచ్చిపెట్టవద్దు.
చంద్రశేఖరం : తెరవెనుకనుంచి మనమీద నాటకమాడిస్తున్నది వాడే.
భుజంగం : పుణ్యకోటిని కౌంటరు ప్రాపగాండాకు పెట్టాముగా.
చంద్రశేఖరం : బ్రహ్మాండంగా కష్టపడుతున్నాడు. ప్రయోజనం కనిపించటంలేదు.
భుజంగం : 'జయని’ ఇస్తానని ఆశపెట్టలేదు. ఆ మాటంటే ఇంకా ఒళ్లు విరుచుకొని పనిచేస్తాడు.
చంద్రశేఖరం : అందువల్లనే అంత కష్టపడటం! మీరు ఇస్తారనే ఆయన నమ్మకం. అయితే జయ మారిపోతున్నది. పుణ్యకోటి మాట చెపితే మండి పడుతున్నది - చైతన్యమంటే కించిత్తు అభిమానం కూడా ఆమె మనస్సులో ఏర్పడుతున్నట్లుంది మీ శత్రువుకు ఆమె హృదయంలో స్థానం దొరుకుతున్నది.
భుజంగం : చిన్నపిల్ల! దానికో నిశ్చితాభిప్రాయమేమిటి?
చంద్రశేఖరం : ఎలాగైనా చైతన్యం ప్రజాదరణ పొందుతున్నాడు. మన డబ్బు తినేవాళ్ళే మనగుట్టు వాడికి మోసేస్తున్నారు. లేకపోతే మన మెడికల్ హాల్ తరఫున బోర్డుకు సప్లై చేసిన మందుసీసాలల్లో శివుడుబావి నీళ్ళని వాళ్ళకెలా తెలిసింది - నిన్ననే ప్రభుత్వానికి ఊళ్ళోనుంచి పిటిషన్ వెళ్ళిందట! మీ పేర ఎన్ని దొంగసంస్థలున్నవో అందులో వ్రాశారట!
భుజంగం : అయితే చైతన్యం నాకు ప్రబలంగా ప్రత్యర్థి అవుతాడన్నమాట!
చంద్రశేఖరం : ఇంకా సందేహిస్తారేం? ఎన్నడో అయినాడు.
భుజంగం : మెడికల్ హాల్ బాకీకి నోటు వ్రాసి ఇచ్చి ఇల్లు తాకట్టు పెట్టినట్లున్నాడు? దావా చేసి కొంప వేలం వేయిస్తాను, రిమ్మ అణుగుతుంది.
చంద్రశేఖరం : మీతో పగంటే పాము పగని వాడికి తెలిసి రావాలి. మనమూ ఒక
పిటీషన్ పారేద్దాము. డాక్టర్లను జాతీయం చెయ్యమని, లేకపోతే చైతన్యం వంటివాళ్ళ
దోపిడీకి ప్రజలాగలేరని. ఎంక్వయిరీ వస్తుంది. మన కాళ్ళమీద పడతాడు. భుజంగం : ఓ వెయ్యి రూపాయలు మనవి కాదనుకుంటే మద్రాసులో మనపని
జరిగిపోతుంది -
చంద్రశేఖరం : పోనీ ఎవడికో మందుపెట్టి చంపినట్లు వైద్యుడు కదూ ఎవడో చావకుండా
ఉంటాడా అతని చేతిలో.
భుజంగం : మహజరు వెనక మరిన్ని సంతకాలుంటే కఠినశిక్ష చెప్పించవచ్చు కూడా.
మోతుబరీ సాక్ష్యం బనాయిద్దాము.
చంద్రశేఖరం : మిల్లుదగ్గిర రైల్వేస్టేషను పెట్టించాలని అప్లికేషను వ్రాసి సంతకాలు
పుచ్చుకుంటాను. ఓ నాలుగువేలు అయిన తరువాత దానికి ఈ మహజరు టైపుచేసి
గుచ్చుదాము.
భుజంగం : భేష్ ! ప్లాను బ్రహ్మాండంగా ఉంది.
(సేవాసమితి ఆఫీసుముందుగా చైతన్యం, ప్రజాసేవకులతో పాట పాడుతూ వెళ్ళుతుంటాడు)
భారత జయఘంటా! ఓహో
భవ్య విజయ ఘంటా!!
గణ గణ గణ గణ,
క్వణియింపుమురా! భారత జయ....
మానవ మానస -
మహిమ జలేజము
మధుధారలతో
తిలకింప గణ, గణ....
ఋషిగణవాటీ
తుషితప్రశాంతి
కమ్రహాసముల
కుళుకుల నీన గణ, గణ.....
విశ్వహృదంతర
విమలాలయముల
వేదమహార్థమె
వినిపింప గణ, గణ.....
దిశాదేవతల
దివ్యగృహమ్ముల
కలహిందోళము
క్రమ్మి స్వనింప గణ, గణ....
చంద్రశేఖరం : వింటున్నారా? (కిటికీలోనుంచి చూచి) ఎంత ఉత్సాహంతో వస్తున్నాడో
చూడండి! చైతన్యం.
భుజంగం : కడుపులో దావాగ్ని మండుతున్నది. చంద్రశేఖరుగారూ! వాడి విప్లవతత్వం ప్రజాశాంతికి భంగకరంగా ఉన్నదని మన సంతకాలతో కాకుండా మరో రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వాళే పోష్టు చెయ్యండి. కొంచెం కమ్యూనిస్టు వ్యవహారం వీడికి ఉన్నదా అనే అనుమానం కూడా పైవాళ్ళకు కలగాలి.
చంద్రశేఖరం : తప్పకుండా (భుజంగం లేవబోతుంటే) మరి నా రిక్వెష్టు ఏం చేశారు?
భుజంగం : ఇంటిమాటేనా? పాతాళగృహం కడుతున్నావా ఏమయ్యో! అప్పుడే పదివేలు మింగేసింది?
చంద్రశేఖరం : ఏదో మీ అనుగ్రహంవల్ల కొంచెం గట్టి కొంప వేద్దామని ప్రారంభించాను. ఇంతౌతుందని అనుకోలేదు.
భుజంగం : ఉఁ ఎలాగైనా త్వరలో పూర్తికావాలి. ప్రస్తుతం...
చంద్రశేఖరం : నాలుగువేలు చాలు.
భుజంగం : అంతులేదు. మూడువేలలో సర్దండి. ప్రస్తుతం నా దగ్గిర కూడా డబ్బులేదు. (డ్రాయిర్లోనుంచి బుక్కుతీసి చెక్కు వ్రాసి యిస్తాడు)
చంద్రశేఖరం : నా సహాయాలన్నీ మీరు మరచిపోయినట్లున్నారు.
భుజంగం : ఆ వెయ్యి కూడా రేపు తీసుకుందువుగాని లేవయ్యా! (లేచి) ఎలాగైనా వీటిల్లో నుంచి మనం గట్టెక్కాలి. లెక్క సరిచేయటం మరిచిపోవద్దు.
చంద్రశేఖరం : నిస్సంశయంగా (నిష్క్రమిస్తాడు) భుజంగం : (అటూ ఇటూ పచారు చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. బుడే కాఫీ ట్రేలో పట్టుకొని తీసుకోవస్తాడు (కాఫీ త్రాగుతూ) బుడే!
బుడే : జీ హుజూర్! (కప్పు అందుకుంటూ ) సాబ్, షైతన్యం బాబు మాకీ హిళ్ళకాడ్కి హొచ్చీ హేమో హేమో షెప్పీ హేశాడంట్గా సాబ్! హింటిక్కిపోతే మా సాహెబ్లంతా హేమో హేమో హడ్గేషేష్తారంట!
భుజంగం : (నిర్లక్ష్యంతో) ఏడ్చారు, వెధవలు - ఆ భటాచోర్ చెప్పేవాడూ, వీళ్లు విని అడిగేవాళ్లునా?
బుడే : గూడెం హంతా మన్కీ వ్యత్రేకంగా తిప్పేశారంట సాబ్! మన్కీ పానీ భీ పుట్టదంట!
భుజంగం : నీవు వెళ్ళి సాయంత్రం మీటింగు పెట్టి అన్ని సంగతులూ చెప్పేయి - పిచ్చి చేష్టలు చేస్తే పీల్చి పిప్పి చేస్తానన్నానని చెప్పు.
బుడే : (భయపడుతూ మాట్లాడడు)
భుజంగం : నీకు భయమైతే నన్నే బబ్బేలను తీస్కోపో దబాయించి చెపుతారు.
బుడే : హాసాబ్! హాళ్ళషేత షెప్పిస్తాన్, మళ్ళీమళ్ళీ షెప్పిస్తాన్.
భుజంగం : నెత్తిన దమ్మిడీ పెడితే గానీ చెయ్యలేని వెధవలంతా ఏవో ఆలోచనలు - మన సంగతి మళ్ళీ ఊళ్ళో తెలిసిరావాలి.
బుడే : మంచి షేస్తే మడ్సుల్ కారు షాబ్!
భుజంగం : (జేబులోనుంచి కొంత డబ్బిచ్చి) ఉఁ తీసుకోపోయి జల్సా చేసుకొండి, - జ్ఞాపకం ఉంచుకోండి.
బుడే' : (నిష్క్రమిస్తూ) మాకీ షచ్చిపోతే మడ్సిపోతాం.
భుజంగం : (దూరంనుంచి వస్తున్న మణెమ్మను చూచి) మణీ! నీకు నూరేళ్ళు - ఇప్పుడే మనస్సులో నిన్ను గురించి అనుకుంటున్నాను.
మణెమ్మ : (ప్రవేశించిన తరువాత) నూరేళ్ళేమి ఖర్మం - ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టి గంట కూడా కాలేదుగా భుజంగం : గంటసేపే! మై గుడ్ గాడ్! (సానురాగంగా) నిమిషం నీవు లేకపోతే యుగంగా ఉంటున్నది మణీ!
మణెమ్మ : నిన్న మండలిలో జయమ్మ ఇచ్చిన అవకతవక ఉపన్యాసంమీద రియాక్షన్సు ఎలా ఉన్నవోనని వాకబ్ చెయ్యటానికి వెళ్ళి వస్తున్నా -
భుజంగం : ఏదో విప్లవం గిప్లవం అన్నదిటగా -
మణెమ్మ : ఒకటేమిటి అనేకం పేలింది. అన్ని సంస్థలనూ తూర్పారపట్టింది. ప్రజాసేవకుల మాట అలా ఉంచండి ప్రభుత్వాన్నీ, ఉద్యోగస్థులనూ, వారి భార్యలనూ విపరీతంగా దూషించింది. మనం చేసేది సేవ కాదట! వ్యక్తిగత వ్యాపారమట!
భుజంగం : దానిమాటలు విశేషంగా లక్ష్యపెట్టదగ్గవి కావు. కొత్తగా కాలేజీలో ఎకనమిక్సు చదువుకోని వచ్చింది.
మణెమ్మ : మీ అమ్మాయని మర్యాద దక్కింది. లేకపోతే - ఏమిటా వెర్రికేకలు - వికేంద్రీకరణట! వికేంద్రీకరణ!! - పోనీ లెమ్మనుకున్నా సభ్యుల్లో ఈమెకు తోడుబోయిన వాళ్ళందరూ ఎకౌంట్లు చెప్పమనీ, కొత్త ఎలక్షన్లు పెట్టమనీ నామీద వెర్రికేకలు వేశారు.
భుజంగం : ఓస్, ఎలెక్షన్లే గదా? మనపక్షం గెలిచేటట్లుంటే పెట్టించు, లేకపోతే కరపత్రాలు వేయించి ఏదో కారణం చెప్పి వాయిదా వేయించేది. నెమ్మదిగా కాలం సాగుతుంటే అన్నీ సర్దుకుంటవి.
మణెమ్మ : భయపడతానని గాదు. సుఖంగా సాగిపోతున్న సంస్థలో చావుగంట కొట్టింది.
భుజంగం : అయినా ఆ మండలిలో ఉండకపోతే నీకు ప్రాపకం లేదా? - అది నీకు వ్యక్తిగతమైంది గాని సంస్థవల్ల వచ్చింది కాదే?
మణెమ్మ : పోనీ తెలివిగా మాట్లాడాననుకున్నదిగాని, అంత సభలో బహిరంగంగా చైతన్యాన్ని పొగిడితే ప్రజలు ఆమె శీలాన్ని గురించీ, మిమ్మల్ని గురించీ ఏమనుకుంటారో ఆలోచించలేదు.
భుజంగం : (సాలోచనగా) చైతన్యాన్నే!!
మణెమ్మ : అవును. మీ గర్భశత్రువు - చైతన్యాన్నే!!
భుజంగం : తల్లి లేని పిల్లగదా అని తాచేత చేస్తున్నాను. మణెమ్మ : విషం పోస్తూ పాలిస్తున్నా ననుకుంటున్నారన్న మాట! నిజం దేవుడి కెరుక. అతనితో చాటుగా (గొంతుక తగ్గించి) స్నేహం చేస్తున్నదని జనం చెప్పుకుంటున్నారు.
భుజంగం : స్నేహమే!
మణెమ్మ : భుజంగం! దిస్ ఈజ్ ఎ పబ్లిక్ సీక్రెట్
భుజంగం : (దుఃఖభావంతో) మణీ! ఇన్నాళ్ళూ నాకెందుకు చెప్పలేదు.
మణెమ్మ : బాధపడతావని.
భుజంగం : శత్రువుకు నా యింట్లోనే స్థానం చిక్కుతుందన్న చంద్రశేఖరం మాట ఇప్పుడర్థమౌతున్నది.
మణెమ్మ : నా ఇంట్లోనూ స్థానం చిక్కింది. మన స్నేహాన్ని సహించలేని వెధవలెవరో మా ఆయనకు పుల్లలెక్కించి మనస్సు తిప్పేశారు. మనం ఏం చేసినా మాట్లాడని 'ధర్మరాజు' నా నిత్యప్రవర్తనకు హిందూకోడ్ బిల్లంత గ్రంథం తయారుచేశాడు. కాలుతీసి కాలుపెడితే ఎక్కడికని అడుగుతున్నాడు.
భుజంగం : ఇదీ ఆ చైతన్యంగాడి పనే!
మణెమ్మ : వాడు చేసిన పనికి కలిగిన ఫలితం.
భుజంగం : మీ ఆయనదేముంది, ఒక చెక్కు పారేస్తే చెప్పినట్లు వింటాడు.
మణెమ్మ : అలాగే జరిగిద్దాం. అయినా వెనుకటివ్యక్తి అనుకొని పొరబాటు పడుతున్నట్లున్నావు. నాకోసం రెండు లక్షలు బ్యాంకులో దాచిపెట్టాడట. బంగళాకు ప్లాన్ వేస్తూ ఉన్నాడు. సినిమాహాలు కంట్రాక్టు పుచ్చుకున్నాడు.
భుజంగం : మన అంతస్తు దాటిపోయినాడన్నమాట - అయితే మరుక్షణం నుంచీ నీవు అతని ఇంటికి వెళ్ళటం మానివేసి ఇక్కడనే ఉండిపోతే.
మణెమ్మ : డామిట్! లోకమో!
భుజంగం : నో ఫియర్సు, యు ఆర్ వెల్‌కం. నాలుగు దినాలు చెప్పుకొని మరచిపోతుంది. లోకం.
మణెమ్మ : నాకాధైర్యం లేదు. ఏదో మనం ఫ్రండ్షిప్పుకు భంగం లేకుండా ప్రవర్తించగలను గానీ - అమ్మో! 8 గంటలైంది. వెళ్ళిపోవాలి. ఆయన ఇంటికి వచ్చేస్తాడు. భుజంగం : బుడే!
బుడే : జీ హుజూర్! (ప్రవేశించి సగౌరవంగా నిలబడతాడు)
భుజంగం : (తాళం చెవ్వి యిచ్చి) లోపల బీరువాలో రెండు సీసాలూ గ్లాసులూ పట్టుకోరా.
బుడే : (నిష్క్రమిస్తాడు)
భుజంగం : (ఆర్ధ్రంగా) మణీ! చెక్కు ఒకటి తీసుకోబోతే కాస్త శాంతిస్తాడేమో!
మణెమ్మ : తప్పక ప్రయోజనం ఉంటుంది. అయినా నీవు కొంతగా నన్ను మరచిపోవటం నేర్చుకోవాలి. లేకపోతే ఇద్దరమూ బాధపడవలసి వస్తుంది. ఇక ఇల్లు కదలి రాలేను.
భుజంగం : ప్రాణముండగా మరచిపోలేను. మణీ! నీవు రాలేనప్పుడు నేనే ఏదో నెపం పెట్టుకొని మీ ఇంటికి వచ్చి కాలక్షేపం చేసిపోతుంటాను.
మణెమ్మ : భుజంగం, వెరి మెనీ థాంక్సు!
బుడే : (సీసాలూ, గ్లాసులూ తెచ్చి పెట్టి నిలువబడతాడు)
భుజంగం : (వెళ్ళమని సంజ్ఞ చేసి బుడేను పంపిస్తాడు సీసాలల్లో పానీయం పోస్తాడు) మీ ఆయన నన్ను రావద్దంటే!
మణెమ్మ : మరో చెక్కు పారేద్దాం.
భుజంగం : (మణెమ్మ చేతికొక గ్లాసు అందించి) నా ప్రేయసి ఆరోగ్యానికి
మణెమ్మ : నా.........
భుజంగం : (తన్ను చూపిస్తూ) భర్త ఆరోగ్యానికి
మణెమ్మ : ఊఁః నా భుజంగం ఆరోగ్యానికి (గ్లాసులు కలిపి త్రాగుతారు)
మణెమ్మ : (ఉత్సాహంతో లేచి డాన్సు ప్రారంభించి)
ఈనా మీనా మైనా హో!
భుజంగం : రావే రావే వెన్నెలరాణీ!
ఈనా మీనా మైనా హో!! మణెమ్మ : రారా రారా వెన్నెల రాజా!
భుజంగం : నీవే ప్రణయిని వోహో మోహిని!
మణెమ్మ : నీవే ప్రియుడవు మోహనుడా!
(అన్యోన్యం ఆలింగనం చేసుకుంటారు)
బుడే : (చూచి కళ్లు చికిలించి వెళ్లిపోతాడు)
మణెమ్మ : (రిష్టువాచ్‌లో టైము చూస్తూ) భుజంగం! (నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది)
భుజంగం : మణీ! - పద!
(ఇద్దరూ నిష్క్రమిస్తారు)
బుడే : (మరొకవైపునుంచి ప్రవేశించి) క్యా, బూజుహంగం సాబ్ కా ఘర్మే షరాబ్! - ఔర్ ఔరత్! - బూజుహంగం భీ మోషం! వేషం!! జయమ్మ హోక్టీ హీ హై హచ్చీ లడ్కీ, హై. - అల్లాహో అక్బర్!
అల్లా షైతన్యం, హాయ్, అక్బర్ షైతన్యం
బూజుహంగం షాబ్ షర్బత్ పియా
ఔరత్ లియా, కోన్ హై - షైతాన్
బూజుహంగం సాబ్ హై హై షైతాన్
(నిష్క్రమిస్తాడు)
చతుర్థ దృశ్యం
(డాక్టరు చైతన్యం రాత్రి 12 గంటల సమయంలో టైపు చేస్తూ వుంటాడు. రేణు
నింపాదిగా క్రిందిగీతం పాడుకుంటూ ఉంటుంది)
ఓహో, కోయిల పాడుమురా!
ఉద్ధృత పావక జ్వాలామాలిక!
వసంతకాలం మారినది,
అనంత గ్రీష్మ మ్మమరినది
కవి వని నిన్నే కోరెదరా,
గళఘంటా నినదమ్ములతో ఓహో కోయిల...
వెగటైనవి చెలుడా! నీ
విమల పంచమశృతులే
మేల్కొనవలె నిదురించే
మేలివనము లీయిలలో
ఓహో, కోయిల పాడుమురా!
ఉద్ధృత పావక జ్వాలామాలిక!
చైతన్యం : అప్పుడే ఈ గీతానికి ట్యూన్ చేశావా ఏమిటి? రేణూ! ఇది కవులను
ఉద్దేశించి వ్రాశాను.
రేణు : రేపు తప్పక పాడుతాను సభలో - ఇంకా మీకు నిద్ర రావటం లేదా? పన్నెండయింది.
చైతన్యం : పన్నెండే? - అయిపోయింది. (పూర్తిగా చుట్టి కాగితం బయటికి తీసి పని అయిపోయినట్లు నిట్టూరుస్తాడు)
రేణు : (దగ్గిరకు వచ్చి) ప్రతినిత్యమూ ఇంతవరకూ మేలుకొని పనిచేస్తే చాలా దెబ్బతింటారు. చైతన్యం : నిజమే, తప్పటంలేదు. భగవదనుగ్రహంవల్ల ఇంకా మనకు మంచిదినాలు రాలేదు. - నిత్యం ఏదో నదికి ఎదురీదవలసి వస్తున్నది రేణూ!
రేణు : మళ్ళీ ఏదన్నా రిపోర్టు పంపవలసి వచ్చిందా ఏమిటి?
చైతన్యం : భుజంగం మనమీద పాముపగ పట్టాడు. మనం చేస్తున్న కించిత్తు ప్రజాసేవ కూడా ముందుకు సాగేటట్టు లేదు. పడగొట్టటానికి అతడు బ్రహ్మప్రయత్నం చేస్తున్నాడు.
రేణు : ఇవాళ ఏదో పెద్ద కవరు వచ్చినట్లుంది?
చైతన్యం : మొన్న ఈ గ్రామంలో ఎవరో రామన్న చనిపోయినాడట! అతని బంధువులు వారసత్వం కోసం మనకు లంచమిస్తే మందుపెట్టి చంపామని మనమీద కేసు బనాయించారు.
రేణు : అతడు మనదగ్గిరకు మందుకే రాలేదు. ఎవరో ఆచార్లుగారు మందు ఇస్తే రోగం నయం కాలేదట! చాలాకాలం తీసుకొని చచ్చిపోయినాడు.
చైతన్యం : ఇదంతా విచారించేవాళ్లెవరు? కావలసినంత డబ్బుంది. మంచి ప్లీడరును పెట్టుకొని వాదిస్తాడు. మనం కేసులోనుంచి బయటపడకపోతే ఎంతో ప్రమాదం. దేశంలో అపకీర్తి మాట అలా ఉంచినా నా డాక్టరు సర్టిఫికేటుకు మోసం రావచ్చు.
రేణు : అయినా వాళ్ళకు సాక్ష్యం దొరకవద్దూ. గ్రామమంతా మన పక్షం చెప్పుతుంది.
చైతన్యం : డబ్బు పారేస్తే ఏ సాక్ష్యం చెప్పమంటే ఆ సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎందరైనా దొరుకుతారు. ఆ పాపం తన వృత్తిది గాని తనది కాదనే నమ్మకంతో అబద్ధపు సాక్ష్యం చెప్పించటానికి పాఠం నేర్పగల ప్లీడర్లు ఎంతోమంది దొరుకుతారు.
రేణు : మన తాత్కాలిక వైద్యశాల స్థలాన్ని గురించి కలెక్టరుగారికి వెళ్ళిన రిపోర్టు ఏమైంది?
చైతన్యం : ఈ ఆఫీసుల్లో దేముడు వరమిచ్చినా పూజారి వరమివ్వటం లేదు. తిరిగి తిరిగి నిన్ననే మళ్ళీ ఒకేడాదిపాటు పర్మిషన్ పుట్టించుకో వచ్చేటప్పటికి తలప్రాణం తోకకు వచ్చింది. - చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ చిక్కుల్లో నుంచి ఎలా బయటపడటమో అర్థంకావటం లేదు.
రేణు : ఆ బెంగ పెట్టుకోకండి. నా పేర మా నాన్నగారు బ్యాంకులో వేసిన అకౌంటు ఆరువేల రూపాయలున్నవి.
చైతన్యం : రేణూ! నీ డబ్బు ఖర్చుపెట్టటం! రేణు : 'నా డబ్బుకూ - మీ డబ్బుకూ' భేదమేమిటి?
చైతన్యం : (ఆర్ద్రంగా) నీ ఔదార్యం, సేవానిరతి నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నవి, రేణూ! ఇటువంటి దేశసేవికలు ఎందరు ఉద్భవిస్తేనోగాని ఈ దేశం బాగుపడదు.
రేణు : మీరు నన్ను స్తుతిచేసి బాధపెడుతున్నారు. మీబోటి త్యాగమూర్తులు కంకణం కట్టుకుంటే ఎందరో సహృదయులైన యువతలు ముందంజ వేస్తారు.
చైతన్యం : రేణూ!
రేణు : డాక్టర్ బాబూ! (చైతన్యం 'అబ్బా' అనటం విని) మంచినీళ్ళు తెచ్చిపెట్టమన్నారా?
చైతన్యం : నేను తెచ్చుకుంటాను లే.
రేణు : (తీసుకోవచ్చి యిస్తుంది)
చైతన్యం : ఇంత తియ్యగా ఉన్నవేం? - మరో బావివా?
రేణు : ఈ తీపి మీ మనస్సులో ఉదయించింది. అదే బావివి.
చైతన్యం : ఔను - నీవు కూడా తాగిచూడు. నీకూ ఇంత తియ్యగా ఉంటవేమో
రేణు : (త్రాగి) నాకూ...
చైతన్యం : తియ్యగా...
రేణు : ఉన్నవి
(కిటికీవైపు నడుస్తూ)
ఓహో! శశికౌ జీవన వాసనలు
నెలరా, వన్నెల వెన్నెలలో
కలువకు వలపుల క్రొన్ననలూ
చైతన్యం : (రేణు నిలుచున్న చోటికి వచ్చి తల నిమురుతాడు)
కుముదిని ముగ్ధసుహాసములో
శశికౌజీవన వాసనలూ,
ఓహో! శశికౌ జీవన వాసనలూ -
(తలుపు చప్పుడు) రేణు : (వెళ్ళి తలుపు తీస్తుంది)
ముసలయ్య : (గుడ్డిలాంతరుతో ఒక ఉత్తరం తీసుకొనివస్తాడు) బాబయ్యా!
(అందించి నిలుచోని చూస్తుంటాడు)
చైతన్యం : (ఆశ్చర్యంతో ఉత్తరం చూసి) 'జయ'
రేణు : మొన్న వ్రాసిన ఉత్తరంలో ఆమె బాధలు చెప్పుకుంటానన్నది. అందుకోసం వచ్చింది కామాలి.
చైతన్యం : ముసలయ్యా! ఒంటరిగా వచ్చిందా?
ముసలయ్య : వెంట భుజంగంగారి బుడే ఉన్నాడు - నిద్రపోతున్నారని చెప్పినా ఉత్తరం ఇప్పుడే ఇవ్వమని దీనంగా అడిగింది బాబూ!
చైతన్యం : ఆమెను లోపలికి పంపించు.
ముసలయ్య : ఆ సాయబును కూడానా?
చైతన్యం : ఆమె ఇష్టం.
(రేణు చూస్తున్న ఉత్తరాన్ని మళ్ళీ 'ఏదీ' అని అడిగి పుచ్చుకొని).
'తమతో నా మానసిక వ్యథను ఏకాంతంగా చెప్పుకుందామని వచ్చాను. అర్ధరాత్రి శ్రమకల్గించినందుకు క్షమించండి' - 'జయ'
రేణు : కొన్నాళ్ళబట్టి ఏదో వ్యథ అనుభవిస్తున్నట్లే ఉంది. మణెమ్మతో ఇప్పుడు మాటిమాటికీ కనిపించటంలేదు -
ఆ దుర్గంధంలో బ్రతకలేని మనస్వి కామాలి. అయితే మరి నేను...
చైతన్యం : నీవూ వుండవచ్చు.
రేణు : ఆమె ఏకాంతం కోరినప్పుడు నేనుండి కష్టపెట్టడం నాకు ఇష్టంలేదు.
చైతన్యం : మరి నీవు మా సంభాషణ వినాలి.
రేణు : అలా వినను
చైతన్యం : అయితే నామీద ఒట్టే! రేణు : (వేలుతో వారిస్తూ) తప్పక వింటాను.
(నిష్క్రమిస్తుంది)
(చైతన్యం ఆలోచిస్తూ ఉండగా జయ ప్రవేశం)
జయ : (నమస్కరిస్తూ) క్షమించాలి, మీకు నిద్రాభంగం కలిగించినందుకు!
చైతన్యం : (కుర్చీ చూపిస్తూ) ఇంత ప్రొద్దుపోయిన తరువాత వచ్చారు?
జయ : ఈ లోపల రావటానికి అవకాశం లేక - మనస్సు ఒక వైపు మనుగడ మరొకవైపు
చైతన్యం : మీరు విస్పష్టంగా మాట్లాడవచ్చు.
జయ : విశేషాలు నాకేమీ లేవు. నేను ఓ నిర్భాగ్యజీవిని.
చైతన్యం : మీరు భుజంగంగారికి కూతురై కూడా నిర్భాగ్యజీవినని అనుకోవటమేమిటి?
జయ : ఆయన కూతురు కావటమే నిర్భాగ్యం.
చైతన్యం : అందువల్ల మీ ఆశయాలకు ఆటంకం కలిగిందా ఏమిటి?
జయ : అంతేకాదు ప్రస్తుతం నా బ్రతుకే అయోమయశృంఖలా బద్ధమైంది.
చైతన్యం : మీ తండ్రిగారు బాగా చదువుకున్నవారు కూడాను. అందులో మీరు ఒక్కరే సంతానమని విన్నాము. మీకే బాధ కలిగించటం వల్ల ప్రయోజనం?
జయ : చదువుకోటం వల్ల ఎక్కువ చాకచక్యంతో బాధపెట్టగలుగుతున్నారు. ఒక్కమాటలో చెప్పవలసివస్తే ఆయన కేవలం స్వార్థపరుడు. తన కీర్తికోసం ప్రాభవం కోసం ఎవరినైనా ఎంత నీచంగా నైనా బలి ఇవ్వటానికి వెనుదీయడు.
చైతన్యం : ఆయన దూరాలోచన ఉన్నవాడు. మీరు అర్థం చేసుకోలేక పోతున్నారేమో!
జయ : నా మంచి కోరితే ప్రతి విషయమూ నన్ను అంతగా నిర్బంధించవలసిన అవసరం లేదు.
చైతన్యం : ఏ విషయంలో నిర్బంధించారో అడగవచ్చునా?
జయ : అన్నిటికంటే ముఖ్యమైంది. నా వివాహవిషయం.
అణుమాత్రం నాకు స్వేచ్ఛ ఇవ్వదలచలేదు. అందులోనూ ఆయన స్వార్ధమే. చైతన్యం : భవిష్యత్తునాలోచించి తగిన వరుణ్ణి వివాహం చేసుకోమని సలహా యిచ్చి ఉంటాడాయన!
జయ : ఆ పుణ్యకోటికీ - నాకు ఎక్కడి సామ్యం?
చైతన్యం : అతడు మంచి పలుకుబడి సంపాదిస్తున్నాడు. ముందు వచ్చే ఎన్నికల్లో గెలిచి అధమం ఓ మంత్రైనా ఔతాడని అందరూ అనుకుంటున్నారు.
జయ : కావచ్చు. దానివల్ల మా నాన్నగారికి మరో వనస్పతి ఫ్యాక్టరీకో, ఐరన్ కంపెనీకో పర్మిటు రావచ్చు. నాకేం ప్రయోజనం?
చైతన్యం : మినిష్టరుగారి భార్య అనే గౌరవం దక్కటం! అనేక పురమందిరాలూ, బాలికాపాఠశాలలూ, సినిమాహాల్లు, ఓపెన్ చెయ్యటము, కళాశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో వార్షికోత్సవాలకు ప్రయిజ్ డిస్ట్రిబ్యూషన్ చెయ్యటం...
జయ : ఈ సాంఘిక గౌరవాలల్లో నాకు నమ్మకంలేదు. నాకా జీవితంలో ఆసక్తి లేదు. హృదయనైర్మల్యం లేని వ్యక్తి ఎంతవాడైనా నాకు గౌరవం లేదు. అటువంటి గౌరవాన్ని నాలో కల్గించలేని వ్యక్తిని లాంఛనం కోసం నేను వివాహం చేసుకోలేను.
చైతన్యం : మీ మనస్తత్వం మీకు వన్నె తెచ్చేదే. కానీ ఇది మీబోటి ధనిక గృహాలల్లో ఉండదగ్గ మనస్తత్వం కాదు.
జయ : అందువల్లనే నేను ఇమడలేకపోవటం!
చైతన్యం : మీరు ఎవరినైనా ప్రేమించారా?
జయ : ఆయన నాకిప్పుడు అలభ్యుడు. భవిష్యత్తులో నా ప్రవర్తనను చూచి నన్ను వివాహమాడవచ్చుననే ఆశమాత్రం ఉంది.
చైతన్యం : అతడెవరో చెప్పగలిగితే నాకు చేతనైనంత సాయం చేస్తాను.
జయ : క్షమించండి. ప్రస్తుతం నా మనస్సును విప్పలేను. మీ సానుభూతికి నేను ఏమి సమాధానం చెప్పవలెనో అర్థం కావటం లేదు - మీరు ఒక నా కోరికను అంగీకరించాలి.
చైతన్యం : ఏమిటది?
జయ : మీ సేవాశ్రమంలో ఉండి మీతోపాటు ప్రజాసేవ చేయటానికి అనుజ్ఞ ఇవ్వాలి. చైతన్యం : మీ నిశ్చయానికి నాకు చాలా సంతోషము. కానీ మీరు ఎంతో కష్టసాధ్యమైన భారం ఎత్తుకుంటున్నారు.
జయ : మీ మీద విశేషభారం ఉంచుతున్నానండి. నేను మీ ఆశ్రమంలో ఉండటంమంటే మా నాన్నగారికి మీరు పూర్ణశత్రువులవటమన్నమాట! - అయినా మీరు అన్నమాట తప్పరు.
చైతన్యం : ఏమైనా రానివ్వండి. మీ రాకవల్ల నాకు జయం కలుగుతుందనే నమ్మకముంది.
జయ : ఈ క్షణంనుంచీ ఇక్కడనే ఉండదలచుకున్నాను.
చైతన్యం : నాకే అభ్యంతరమూ లేదు. రేణూ! రేణూ!!
జయ : (మహాత్ముని విగ్రహం దగ్గరకు వెళ్ళి నమస్కరిస్తూ)
నడిపించి నావయ్య
ఓ దేవ! ఈ నావ
కడలిలో తడబడుచు
కానదేదారి యిది
పెనుజడుల నలజడుల
నన్ను గన నేతెంచి నడిపించి....
పొడువుమల నెత్తాన
పొలిచి తడబడు కాంతి
విడివడెడు పొలిమేర
నీదూర తీరానికై
నడిపించినావయ్య
ఓ దేవ! ఈ నావ
(చైతన్యం దగ్గరికి వచ్చి నమస్కరించి) మీరు మహాత్ములు. నన్ను దీవించండి.
చైతన్యం : (చేయి శిరస్సుమీద ఉంచుతాడు).
జయ : (అధికానందంతో) అబ్బ!
రేణు : (ప్రవేశిస్తుంది). చైతన్యం : జయమ్మగారూ!
జయ : నన్ను మీరు 'గారు' అని సంబోధిస్తే నా మనస్సు ఎంతో బాధపడుతుంది.
చైతన్యం : (చిరునవ్వుతో) అయితే జయ మన ఆశ్రమంలో ఉండి మనతోపాటు కష్టపడటానికి నిశ్చయించుకుంది. మీరిద్దరూ సోదరీమణులవలె ప్రవర్తించాలి.
రేణు : మేము ఇద్దరమూ క్లాసుమేట్సుము, మీకు తెలుసునో లేదో!
చైతన్యం : అలాగేం! మరీ సంతోషము!!
జయ : అక్కా!
రేణు : (లోపలికి పోదాం పదమన్నట్లు సంజ్ఞ చేస్తుంది).
చైతన్యం : పాపం! భుజంగం ఈ దెబ్బతో అల్లట తల్లటై పోతాడు - అయినా జయను త్రిప్పటానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఇందులో నా తప్పేముంది. జయకు సాయం చేయటం నా విధి. (కుర్చీలో కూర్చొని గీతతీసి క్రింది శ్లోకం చదువుతాడు)
'అనన్యా శింతయం తో మాం
యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహా మ్యహం'
(తెర)
★ప్రథమ యవనిక★
పుణ్యకోటి : మణెమ్మ : (రెండు దిక్కులనుంచి ప్రవేశిస్తారు)
మణెమ్మ : హాల్లో, పుణ్యకోటిగారూ? పుణ్యకోటిగారూ? (వెర్రాడు, జయ పెళ్ళి చేసుకుంటుందనే వీడి తహతహంతా? చైతన్యం వైద్యశిబిరం దగ్గరకు వెళ్ళి వస్తున్నాడు) -
పుణ్యకోటి : (ప్రవేశించి) ఏమండోయ్! క్లబ్ నుంచా ఏమిటి? - చేతులో బాట్ ఉంటే ఇంకా అడగటమెందుకు?
మణెమ్మ : వారెక్కడనుంచి?
పుణ్యకోటి : వెధవ పాపిష్ఠి పని ఒకటి ఉంటే వెళ్ళి వస్తున్నాను. మణెమ్మ : పాపిష్ఠిపనే! - పనులు పాపిష్ఠివైనా, మీ పేరులో పుణ్యం చాలా వుంది లెండి -
పుణ్యకోటి : జీవితంలో 'పుణ్యం' ఎక్కడా లేదని గ్రహించే పెద్దవాళ్ళు పేర్లోనైనా ఉంటుందని పెట్టినట్లున్నారు?
మణెమ్మ : ఏమిటా నిస్పృహ! మీరు నిరాశ పొందినట్లున్నారు.
పుణ్యకోటి : ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమౌతుంటే నిరాశ కాక ఏముంటుందండీ!
మణెమ్మ : ఔను 'నేటి జీవితమే అలా ఉంది. నాకూ అలాగే అనిపిస్తున్నది.
పుణ్యకోటి : మీకేమండీ! మాకుగాని - నడిచివస్తున్నారు, కారేమైంది?
మణెమ్మ : ఇవాళ అయ్యగారికి ఏదో పనిఉందని వెళ్ళారు. కాస్త నడిచినట్లు ఉంటుందని ఇలా బయలుదేరాను.
పుణ్యకోటి : అయితే మీరు వారికేమైనా బంధువులా ఏమిటి? ఎప్పుడూ వారి కార్లో కనిపిస్తుంటారు.
మణెమ్మ : ఓ, నో, నో! కేవలం స్నేహితులం. వారు బాగా చదువుకున్న వారండీ! - ఇంగ్లీషులో కవిత్వం చెప్పుతారు. ఛటోపాధ్యాయ, టాగూర్లు అద్భుతమైన అభిప్రాయాలిచ్చారు.
పుణ్యకోటి : అలాగుటండీ - పాపం! ఆయనకు భార్య లేదని విన్నాను.
మణెమ్మ : అందువల్లనే అంత అద్భుతమైన కవిత్వం వ్రాయగలిగింది - లేకపోతే -
పుణ్యకోటి : 'జయ' కూడా తెలుగులో కవిత్వం చెప్పుతుందట! మీరెప్పుడైనా విన్నారా?
మణెమ్మ : తెలుగులోనా? - తెలుగులో కవిత్వమేమిటి? ఉఁః - చైతన్యంగారి దగ్గిర చేరినతరువాత మీరు మళ్ళీ ఆమెను చూచారా? మనస్సేమైనా మారిందా?
పుణ్యకోటి : ఆమెకు అతడు దయ్యమైపట్టాడు.
మణెమ్మ : మంచివి నాలుగుమాటలు చెప్పి మందలించ లేకపోయినారు.
పుణ్యకోటి : నా తరం కాలేదు - మొన్న మీరు ఆమెతో మాట్లాడినప్పుడు నా విషయాన్ని గురించి ఏమంది? మణెమ్మ : ఏమందీ? పాయింట్ బ్లాంకుగా రెఫ్యూజ్ చేసింది.
పుణ్యకోటి : కారణం?
మణెమ్మ : ఆమె వివాహమే చేసుకోదట! అంతా 'స్పిన్స్టర్ ఫిలాసఫీ' మాట్లాడింది.
పుణ్యకోటి : చేసుకోక! పాపం, భుజంగంగారు ఆ కూతురువల్ల అపకీర్తి పాలౌతున్నాడు.-
మణెమ్మ : భుజంగంది కూడా కొంత లోపం ఉందిలెండి. ఆమె పేర కొంత ఆస్తి ఉంచాడు. అందువల్ల ఆమె స్వతంత్రంగా వ్యవహరిస్తున్నది.
పుణ్యకోటి : మళ్ళీ మీరు ఒక్కమాటు నాకోసం ఆమెతో మాట్లాడితే!
మణెమ్మ : ప్రయోజనం లేదు. మొన్నటిమాటల్లోనే తెలిసిపోయింది. అయినా ప్రస్తుతము ఆమెవల్ల నాకు ఎంతో దెబ్బ తగిలింది - మా మండలి ఎలక్షన్లలో ఓడిపోయినాను -
పుణ్యకోటి : అవునట, విన్నాను - అప్పటినుంచే నాకూ ఆమెంటే ఒక విరక్తి కలిగింది.
మణెమ్మ : అది నామీద అనురాగంగా మారలేదు గదా!
పుణ్యకోటి : స్యూర్! మీరు నాకెలాగైనా వివాహ విషయంలో సాయం చెయ్యాలి.
మణెమ్మ : (నవ్వుతూ) చేయగలిగినంత చేశాను. ఇక నా చేతనైంది, నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోవటమే - మరేమీ కనిపించటంలేదు, చెయ్యాల్సింది.
పుణ్యకోటి : నాకూ కావలసినంత డబ్బు ఏర్పడ్డది, మీ పుణ్యమా అంటూ, అనుభవించటానికి ఓ ఇల్లాలు మాత్రం కనిపించలేదు.
మణెమ్మ : అయితే మీకు మటుకు భార్య కావాలని అంత పట్టుదల ఎందుకు?
పుణ్యకోటి : తొందరలో జాగ్రత్త పడకపోతే భయమేస్తున్నది. ఎవరో ఓ అందమైన అమ్మాయి వలలో పడిపోయేట్టున్నాను. అందువల్లనే మిమ్మల్ని ఇంతగా బ్రతిమాలటం? - ఎక్కడైనా దయ ఉంచి ఓ మంచి సంబంధం చూచిపెడుదురూ?
మణెమ్మ : అయితే ఆ అమ్మాయికి ఉండవలసిన క్వాలిఫికేషన్సు?
పుణ్యకోటి : ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు. కాస్త దయాదాక్షిణ్యాలున్న ఒక హోం గ్రోన్ ఆర్టికల్ అయితే చాలు.
మణెమ్మ : నాకేమీ అర్థంకాలేదు. పుణ్యకోటి : ఏమీలేదు. దయాదాక్షిణ్యాలతో పేదసాదలను కనిపెట్టాలని నా భార్య -
మణెమ్మ : సరే! - మీ భార్య అందుకు అంగీకరిస్తుంది. మిగిలిన విషయాలల్లో నా స్వేచ్ఛకు వదిలిపెట్టాలి?
పుణ్యకోటి : తప్పకుండా?
మణెమ్మ : మళ్ళీ మాట తిరగకూడదు.
పుణ్యకోటి : అది నా జన్మలో లేదు. మీకు తెలియని విషయమా?
మణెమ్మ : నాకో మంచి స్నేహితురాలుంది. ఆమెతో మాట్లాడి చెపుతాను. ఆమె కూడా మా క్లబ్బు మెంబరు.
పుణ్యకోటి : (దగ్గరకు వస్తూ) ఆమెకు ఇంతకు పూర్వం వివాహం కాలేదనుకుంటాను.
మణెమ్మ : వివాహం కాలేదు. కానీ లోకంలో వివాహమైనట్లు కాలం గడుపుతున్నది.
పుణ్యకోటి : శాస్త్రోక్తంగా కాకపోతే సరి. ఈ ఆచారం కంటే నాకు శాస్త్రం ప్రమాణం. ఉఁ
మణెమ్మ : ఆమె పైకి కొంత కఠినమైన మనస్సుగా కన్పించినా హృదయం అమృతం.
పుణ్యకోటి : అమృతమే!
మణెమ్మ : అల్లా పైకి కనబడటానికైనా ఇంతకుపూర్వం ఆమెకు జీవితంలో ఆశించినంత మాధుర్యం దొరకకపోవటమే కారణం.
పుణ్యకోటి : అది నావల్ల తప్పకుండా ఆమె పొందకలుగుతుంది.
మణెమ్మ : ఆమె పేరుచెప్పిన తరువాత లోకంలో ఉన్న కీర్తిని గానీ అపకీర్తిని గానీ జ్ఞప్తికి తెచ్చుకొని మీరు అసహ్యించుకోకూడదు. ఆమె ఇంతకుపూర్వం అనేకమందిని ప్రేమించినట్లు నటించింది - అనేకులకు స్నేహితురాలని పించుకుంది.
పుణ్యకోటి : గొప్ప నటకురాలన్నమాట! ఇతరులకు స్నేహితురాలైతే నాకేం? మరీమంచిది.
మణెమ్మ : కీర్తికోసం ఎంతో తాపత్రయపడ్డది.
పుణ్యకోటి : నాకు కావలసిందే అది. నా భార్య కీర్తికాముకురాలు కావాలి. ఆమెవల్ల నా పేరు లోకంలో నిలిచినా ఈర్ష్యపడే స్వభావం నాలో లేదు. మణెమ్మ : ఈ మాట మనస్ఫూర్తిగా వచ్చిందేనా? మగవాళ్ళకిది అరుదు.
పుణ్యకోటి : నీవు సాక్షిగా - ప్రమాణం చేస్తాను -
మణెమ్మ : అయితే ఆమెను నీవు ఇదివరకే ఎరుగుదువు?
పుణ్యకోటి : ఎవరబ్బా!
మణెమ్మ : ఆమె ప్రస్తుతం నీ ఎదటనే ఉంది.
పుణ్యకోటి : (ఆర్ద్రంగా) మణీ!
మణెమ్మ : పుణ్యకోటీ! మన వివాహం మాట ఇప్పుడప్పుడే ఎవరికీ తెలియనివ్వకూడదు.
పుణ్యకోటి : అసలు ఎప్పుడూ తెలియనివ్వవద్దు. అయినా మన పెళ్ళి సంగతి ఇతరులకెందుకు? పెళ్ళి కేవలం పర్సనల్.
మణెమ్మ : మన ఇద్దరమూ -
పుణ్యకోటి : భార్యాభర్తలము (చేతుల్లో చేయి వేసుకొని) భేదాభిప్రాయాలు రాకుండా మనం జీవించాలి.
మణెమ్మ : పార్కు లోపలికి వెళ్ళుదాము.
పుణ్యకోటి : లేదు. సినిమాకు వెళ్లుదాము. ఏయ్ జట్కా!
(నిష్క్రమిస్తారు)
పంచమ దృశ్యం
(సేవాసమితి ఆఫీసులో హడావిడిగా అన్నీ విప్పి సర్దుతూ చంద్రశేఖరం 'నా గుండె
చీల్చిచూడన్నా అందులో నవభారతం బున్న దన్నా!' అనే పాట పాడుతూ భుజంగం
డ్రాయరు బద్దలుకొట్టి, జేబులో డబ్బు దాచిపెట్టి)
నాటకం! నాటకం!!
లోకమంత నాటకం!
పొద్దుకంటె ముందులేచి
పొడిచి పొలుచు బూటకం నాటకం...
ఎండ చూచి గొడుగు పట్టి
ఎప్పుడైన మారటం
రంగువేసి సింగరించి
రాజులాగ ఏలటం నాటకం...
తల్లక్రిందులైతె కొంత
తప్పుకోని జారటం
నాటకం! నాటకం!!
లోకమంత నాటకం!
పుణ్యకోటి : చంద్రంభాయీ! చంద్రంభాయీ!!
చంద్రశేఖరం : (తాపీగా) ఏం భాయిసాబ్, ఇలా కొట్టుకొచ్చావు, అర్ధరాత్రి!
పుణ్యకోటి : కొట్టుకోరావటమేమిటి? కొంప మునుగుతుంటే.
చంద్రశేఖరం : గబ్ రావో మత్ - మనం ఉమర్ ఖయ్యాము శిష్యులము. వెనక చెప్పాను కదూ, మన పాలసీ, మరిచిపోయినట్లున్నావు. మిన్ను విరిగి మీదపడ్డా మనం ఖుషీమైన్‌టైన్ చెయ్యాలి. పుణ్యకోటి : మన భుజంగంగారు ఏదో హైస్కూలులో మూగి మేష్టారును వేశాడటగా - డి.ఇ.ఓ అబ్జెక్షన్ చెప్పితే - 'చెపితే చదువు ఏం వస్తుంది, మేష్టరును చూస్తేనే రావాలి గాని' అని సమాధానం వ్రాసి పంపించాడట!
చంద్రశేఖరం : ఇంతే గదా! - మాట్లాడితే మధుసూదనమ్మను మార్చమని పెట్టిన పిటిషను డి.పి.ఐ దాకా వెళ్ళింది. దానిమీద ఎన్నో ఎంక్వయిరీలు -
పుణ్యకోటి : తనకు కొంచెం వ్యతిరేకంగా ఉన్నాడని ఆ చైతన్యం మీద కమ్యూనిష్టనీ, గ్రామాలల్లో దుష్టప్రచారం చేస్తున్నాడనీ, పేదలయిల్లు దోచమని బీదవాళ్ళను కొందరిని ప్రబోధిస్తున్నాడనీ రిపోర్టు పెడితే అది విచారణకు వచ్చి అందులో ఊళ్ళోవాళ్ళంతా వ్యతిరేకించారట!
చంద్రశేఖరం : వ్యతిరేకించరూ మరి, అన్ని దినాలూ అతనివౌతవా? నిన్న రాత్రి క్లబ్‌నుంచి ఒంటిగంటకు ఒళ్ళు తెలియని పరిస్థితిలో వస్తూ వుంటే అతని కారు క్రింద ఎవరో మనిషి పడ్డాట్ట - పోలీసు కేసులో చిక్కుకున్నాడని ఇప్పుడే ఇన్ఫర్‌మేషన్ వచ్చింది.
పుణ్యకోటి : తెల్లవారితే అరెష్టువారెంటు వస్తుంది.
చంద్రశేఖరం : ఓస్ ఇంతేనా! - ఏమిటా వెర్రి గాభరా - ఇవన్నీ ఆయనకు తెలియవనే? అందుకు ఆయన సిద్దపడే ఉంటాడు.
పుణ్యకోటి : అతడు ఎక్కడికైనా పరారైపోతే.
చంద్రశేఖరం : పాపం! మణెమ్మను వదిలిపెట్టలేడు.
పుణ్యకోటి : ఆమెకూడా చాలా మారిపోయిందట! ఊళ్లో టాక్ పడ్డది, ఇక మర్యాదగా భర్తతోనే కాలక్షేపం చేసి పెద్దమనిషి అని అనిపించుకుదామని నిశ్చయించినట్లు.
చంద్రశేఖరం : ఎప్పుడూ సీతాకోక చిలుకను ఎవరు చూస్తారోయ్! కాలం కలిసి రానప్పుడు దానికో కమ్మని ఫిలాసఫీ కల్పించి ప్రవర్తించటమే ప్రజ్ఞంటే.
పుణ్యకోటి : మండలి ఎలెక్షన్సులో ఓడిపోయినప్పటినుంచి మనస్సులో మనస్సు లేదుట! అంతమాత్రంలో ఆమె ఇన్‌ప్లుయన్సుకు భంగం లేకపోయినా-
చంద్రశేఖరం : అబ్బాయీ! ఒకమాట చెబుతాను విను. న్యూటన్ భూమ్యాకర్షణశక్తి సిద్ధాంతం ప్రకారం ఒక బిందువు తప్పితే అంతా తలక్రిందు లౌతుంది. మణెమ్మ వంటి జీవితాలల్లో అందంలో ఒక బిందువు అటైతే చాలు అంతా తారుమారౌతుంది. పుణ్యకోటి : పాపం! భుజంగం పడిపోతున్నాడు.
చంద్రశేఖరం : పడిపోయినాడు! పడిపోక తప్పదు!! పడవలసిందే!!
పుణ్యకోటి : శేఖరం! నీవు చాలా చిత్రమైనవాడివి. అంతవాడు పడిపోతుంటే నీకేమీ అనిపించటం లేదూ.
చంద్రశేఖరం : గుళ్ళో గంటపోతే నంబికేం లోటు అనిపిస్తున్నది.
పుణ్యకోట^ : నిన్ను చూస్తే భయం వేస్తున్నది.
చంద్రశేఖరం : భయమా! అనుభవం లేక. ఈ భుజంగం పోతే మరో జంగం. ఆకాశాన ఎన్ని తారలు పుట్టటం లేదు గిట్టటం లేదు. ఇది రాజకీయ మేదస్సుకు ఉండవలసిన తత్వం.
పుణ్యకోటి : అది నాకు నచ్చదు. నాకు హృదయముంది.
చంద్రశేఖరం : అయితే నీవు గొప్పవాడివి చస్తేకాలేవు.
పుణ్యకోటి : పోనీ, హృదయం మలినం కాకుండా ఉంటే చాలు.
చంద్రశేఖరం : దాన్ని మలినం కాకుండా దాచిపెట్టుకుంటూ లోక వ్యవహారాల్లో వ్యవహరించటం నేర్చుకోవాలి. సెయిల్ విత్ ది విండ్. సేఫెస్టు పాలసీ!
పుణ్యకోటి : ఏమో! నీవన్నంత చులకనగా నేను చూడలేను. భుజంగానికి కష్టాలు వస్తున్నవని నామనస్సెంత బాధపడుతున్నదో తెలుసునా?
చంద్రశేఖరం : ఎప్పటికైనా మామగా రౌతారేమోనని నీకు కొంత మమకారం ఉంది గనక అంత బాధపడుతున్నావు.
పుణ్యకోటి : అది కల్లని ఎప్పుడో నిశ్చయించుకున్నాను. వ్యర్థప్రయత్నాలు చేసి విరమించుకున్నాను కూడాను.
చంద్రశేఖరం : అయితే నా మాటవిను. ఎవడు నాలుగు డబ్బులు ముట్టచెప్పగలడో వాడే మనకు నాయకుడు, ఇంద్రుడు, చంద్రుడు, సత్యకాలం తప్పిన తరువాత సర్వం జగన్నాథం.
పుణ్యకోటి : నీవు భ్రాంతిలో పడుతున్నావు. చంద్రశేఖరం : నా భ్రాంతివల్ల నాకు లాభం - నీ భ్రాంతివల్ల నీకు మొప్పం. లెరన్ టు లవ్ అండ్ లేబర్.
పుణ్యకోటి : ఎవర్ని?
చంద్రశేఖరం : చైతన్యాన్ని?
పుణ్యకోటి : వాడు నాకు పరమశత్రువు.
చంద్రశేఖరం : నాకు పరమ మిత్రుడు. నేను తెల్లవారేటప్పటికి అతని క్యాంపుకు వెళ్ళి చేరిపోతున్నాను.
పుణ్యకోటి : ప్రాణం పోయినా నేను భుజంగానికి ప్రాపుగానే ఉండ దలచాను.
చంద్రశేఖరం : నీ మొఘం! నీబోటివాళ్లు కోటిమంది ఐనా అతగాణ్ణి రక్షించలేరు. - అతనికి వ్యతిరేకమయిన కాగితాలన్నీ అందినంతవరకూ ఇదివరకే చైతన్యం దగ్గిరకి చేరిపోయినవి. నేను అక్కడికి మరికొన్నిటితో చేరుతున్నాను. చెడిపోకు. నా మాట విను. - నీవూ నా వెంటరా!
పుణ్యకోటి : యూ ఆర్ ఏ రోగ్, స్కౌండ్రల్.
చంద్రశేఖరం : తెలుగులో ఏడవవోయ వెధవా?
(దెబ్బ కొడతాడు)
పుణ్యకోటి : (మళ్లీ తిరిగి దెబ్బకొడతాడు)
బుడే : (హడావిడిగ ప్రవేశించి) అరే లడాయ్ - క్యా అరెహల్లా బూజహంగం సాబ్, సాబ్ - (పిలుచుకుంటూ నిష్క్రమిస్తాడు)
చంద్రశేఖరం : జాగ్రత్త! (విపరీతంగా కొట్టి పారిపోతాడు)
పుణ్యకోటి : దొంగ! దొంగ!!
భుజంగం : (నెమ్మదిగా వచ్చి) పుణ్యకోటీ!
పుణ్యకోటి : (వెనక్కు వచ్చి) మీకు వ్యతిరేకమైన కాగితాలన్నీ పట్టుకొని చంద్రశేఖరం పారిపోతున్నాడు.
భుజంగం : (గాభరాతో వెతుకుతూ) డ్రాయరు బద్దలు కొట్టినట్లున్నాడు. పదివేలు కనిపించటం లేదు. పుణ్యకోటి : (చెవిలో ఏదో చెపుతాడు)
భుజంగం : (నిర్ఘాంతపోతూ) అరెష్టా! అది నన్నేమి చేస్తుంది. (పెద్దగా నవ్వి) బ్యాంకులో నాకు నాలుగు లక్షలున్నవి.
పుణ్యకోటి : అవి మిమ్మల్ని రక్షించలేవు.
భుజంగం : నన్ను అధైర్య పరచవద్దు.
పుణ్యకోటి : పైవాళ్ళకు పైవాళ్ళు వ్యవహారం నడిపిస్తున్నారు.
భుజంగం : వాళ్ళు పైవాళ్ళవంటివారు కారూ?
పుణ్యకోటి : కాదు. కాలం మీకు చాలా వ్యతిరేకంగా ఉంది. కాగితాలు చంద్రశేఖరం అన్నీ పట్టుకుపోయినాడు. రిపోర్టులు చాలా ఫ్రూవ్ అవుతవి.
భుజంగం : ఔను ఔతవి. (వెర్రిగా) అయితే!
పుణ్యకోటి : పారిపోండి.
భుజంగం : ఎక్కడికి ఎందుకోసం?
పుణ్యకోటి : ఎవరికి కనపడని చోటికి అపకీర్తి రాకుండా ఉండటానికి.
భుజంగం : అసంభవము - ప్రాణంమీద నాకు ఆసక్తిపోయింది.
పుణ్యకోటి : మీకు ఇటువంటి దుస్థితి కలుగుతున్నందుకు నాకెంతో బాధగా ఉంది.
భుజంగం : కారణం?
పుణ్యకోటి : నేటి నా స్థితికి కారకులు మీరు కావటం వల్ల.
భుజంగం : (ఆలోచించి) నీలో ఆ కృతజ్ఞత ఉన్నదన్నమాట!
పుణ్యకోటి : నిశ్చయంగా -
భుజంగం : అయితే నాకొక సహాయం చెయ్యాలి.
పుణ్యకోటి : తప్పక చేస్తాను.
భుజంగం : వాగ్దానం చేస్తావా?
పుణ్యకోటి : (చేతిలో చేయి వేస్తాడు) భుజంగం : (జేబులోనుంచి తాళం చెవి తీసి మరొక డ్రాయర్లో ఉన్న పిష్టలు తీస్తాడు) ఇదుగో! ఈ దుస్థితికి కారణం నా శత్రువు చైతన్యం, అతని మృతివార్త నా చెవిన పడాలి.
పుణ్యకోటి : (నిర్ఘాంతపోతూ) బావా!
భుజంగం : ఔను, ఖూనీ! - చేయలేవూ - చేతగాదన్నమాట!
పుణ్యకోటి : క్షమించాలి. నేను హత్య చెయ్యలేను.
భుజంగం : పిరికిపందవు. కృతఘ్నుడివి - శత్రువును హతమార్చేవాడే నా స్నేహితుడు!
పుణ్యకోటి : స్నేహితుణ్ణి కాలేకపోయినందుకు క్షమించాలి.
భుజంగం : ఈ హృదయంలో ఇక క్షమకు స్థానం లేదు.
పుణ్యకోటి : సెలవు (నిష్క్రమిస్తాడు)
భుజంగం : స్నేహితులు! రాస్కెల్సు - వీళ్ళ స్నేహితాలు! బాగున్నప్పుడు తాళంవేసి బాగుపడదలచిన వెధవలు! బుడే... బుడే!!
బుడే : (ప్రక్కనుంచి చూస్తూండటం వల్ల భయంతో ప్రవేశించి) జీ హుజూర్!
భుజంగం : చైతన్యం మన శత్రువు.
బుడే : జీ హుజూర్! షైతన్యం హంకీ షత్రువ్ హై
భుజంగం : ఇదిగో! దీన్ని చేత్తో పుచ్చుకో -
బుడే : (భయంతో ఆపాదమస్తకం కంపిస్తూ) ఏ క్యా హై సాబ్.
భుజంగం : పిస్టల్
బుడే : (అటూ ఇటూ త్రిప్పి చూచి) పిస్తోలూ! బహుత్ (కొంచెం ధైర్యంతో) అచ్చీ హై సాబ్ !
భుజంగం : ఈ మీట ఇలా నొక్కితే ఎవరివైపు త్రిప్పిలాగితే అతడు చచ్చిపోతాడు.
బుడే : షచ్చీపోతాడ్! - మర్గయా హై పోతాడ్!! దీన్కీ షేషిన ఆద్మి మల్లీ బల్ తెల్విహుందీ సాబ్! -
భుజంగం : దీనితో తెల్లవారేటప్పటికి చైతన్యాన్ని చంపివెయ్యాలి. బుడే : (పిస్టల్ క్రిందకు వదిలేస్తూ) అరె బాపురే!- మీకీ పాగల్ హైపోతుండార్?
భుజంగం : నేనా?
బుడే : ఆప్ హుజూర్ - నైతో?
భుజంగం : చీ గాడిదా?
బుడే : జీ హుజూర్! మై గధాహూఁ ఆప్?
భుజంగం : మాట్లాడితే నిన్ను పేల్చేస్తాను.
బుడే : హరె అల్లా మైక్యాకరూఁ (ఏడుస్తాడు)
భుజంగం : అది చేతికిచ్చి నీవు వెళ్ళిపో - ఈ సంగతి ఎవరికైనా తెలిసిందా నీ ప్రాణాలుతీసేస్తాను -
బుడే : (నిష్క్రమిస్తూ ఏడ్పుతో) జీ హుజూర్!
భుజంగం : (అద్దం దగ్గిరకి వెళ్ళి) భుజంగం, నీకు నమ్మిన స్నేహితుడు లేడు. సేవకుడు లేడు, ఏ బంధువులూ లేరు. ఏకాకివి.
మణెమ్మ : (ఆతురతతో ప్రవేశించి) భుజంగం!
భుజంగం : మణీ! - నీకూ తెలిసిందా ఏమిటి? - సాయం చెయ్యను వచ్చావా?
మణెమ్మ : నీకూ ముందుగా తెలిసిందన్నమాట?
భుజంగం : నేనూ అందుకు సిద్ధపడుతున్నాడను. (పిస్టలుతో మణెమ్మవైపు తిరిగి) ఇదుగో!
మణెమ్మ : ఇదేమిటి?
భుజంగం : నా శత్రువుకు మారణాస్త్రం - మణీ! నాకోసం నీకోసం - చైతన్యాన్ని హత్యచేస్తావా?
మణెమ్మ : హత్య! బాబో!
భుజంగం : నీవు కూడా కృతఘ్నురాలివి! లోకం మోసం. అంతా అంధకారం - మణీ! నీవు అతణ్ణి హత్య చెయ్యాలి. హత్య!
మణెమ్మ : చెయ్యలేను. చెయ్యను. భుజంగం : ఛీ! నీచురాలా! నీవు భర్తను చాటుపెట్టుకొని నాతో ఇంతకాలం కాలక్షేపం చేశావు. ఇప్పుడు కృతఘ్నురాలవౌతున్నావు.
మణెమ్మ : భుజంగం! మర్యాదగా మాట్లాడు.
భుజంగం : నీవంటి వ్యభిచారికీ మర్యాదా?
మణెమ్మ : (కోపంతో) భుజంగం!
భుజంగం : (వెర్రిగా నవ్వి) వ్యభిచారిణివి కావూ? కావు. పాపం, పతివ్రతవు, మహాపతివ్రతవు! - ఫో, అవతలికి ఫో నీ మొఖం చూడలేను! గెటవుట్.
మణెమ్మ : (వెళ్ళబోతూ) నీకు పిచ్చి ఎక్కింది?
భుజంగం : ఆగక్కడ? పిచ్చి! ఔను. నాకు పిచ్చే - అంతా మోసం, నటన! లోకమే నటన!! ప్రేమ - గౌరవం, త్యాగం - సర్వం స్వార్థం - మణీ! నీవంటి వ్యక్తులు లోకానికి సంఘానికి వేరుపురుగులు -
మణెమ్మ : (నడుస్తుంటుంది).
భుజంగం : ఆగక్కడ (వెళ్ళుటకు అడుగులు లెక్క పెడుతూ)
మణెమ్మ : (ముందుకు నడుస్తుంది జాలిగా) భుజంగం! నీవు వెర్రివాడవైపోయినావు. ఏమిటీ ప్రవర్తన. నీలో ప్రేమ ఏమైంది? (దగ్గిరకు వెళ్ళగానే)
భుజంగం : ఇంకా మోసమా రాక్షసీ! నీవు చచ్చిపో, నేనూ చచ్చిపోతాను. ఇదిగో ఉఁ (పిష్టలు పేలుస్తాడు).
మణెమ్మ : (వెర్రికేకతో నేలమీద వాలిపోతుంది) భుజంగం!
భుజంగం : (వెర్రిగా చూస్తూ) ఆఁ ఏమిటీ! మణీ! మణీ!! హఁ హఁ హఁ దయలేదు - నా అంతఃశత్రువు చచ్చిపోయింది. బహిశ్శత్రువు చైతన్యం చచ్చిపోతాడు. ఒరేయ్, చైతన్యం! వస్తున్నా, నీ యముణ్ణి, నిన్నూ నన్నూ యమ భటులు ఒకేపాశాన పట్టుకోపోవాలి. ఏమిటి? ఇల్లంతా ఇల్లా తిరుగుతున్నది. ఇది విమానమై అతడి దగ్గిరకి చైతన్యం దగ్గిరికి తీసుకోపోతున్నది. నా కీర్తినీ, కుమార్తెను అపహరించావు కదూ? (వెర్రిగా నవ్వుతూ) రైటు ఓ.కె.
(పిష్టలుతో నిష్క్రమిస్తాడు)
మణెమ్మ : దాహం! - బాధ - అబ్బా! (కళ్ళుమూస్తుంది) భుజంగం!
బుడే : బూజుహంగం కాదు హమ్మ, బుడే సాహెబును - (చూచి) హోగయా - మర్గయీ - ముర్గీ మర్గయీ -
(లోపలనుంచి)
తాయ్ తోయ్ తక్కధిమి తోల్బొమ్మా
బల్ తమాష షేస్తాది తోల్బొమ్మా
మంచిరోజు లైతెచాలు
మళ్ళీ మల్లీ ఎగ్రుతాది
తల్లకిందులైతె ఎంతొ
తన్నుకోని ఒరుగుతాది తాయ్, తోయ్....
సాగిపోతు ఉంటె దాని
సంతసము చెప్పలేము
ముల్లుకుట్టిందంటె చాలు
మొత్తుకొని ఏడుత్తాది
తాయ్ తోయ్ తక్కధిమి తోల్బొమ్మా
బల్ తమాష షేస్తాది తోల్పొమ్మా.
బుడే : (మణెమ్మను చూచి తెల్వి తెచ్చుకొని) హిక్కడుంటే ఖూనీ నాకీ షేషానంటూ
షూసీ మల్లీ పోలీస్ ఫట్కాపోతే - రే అల్లా! రే అల్లా!! (అంటూ నిష్క్రమిస్తాడు)
(తెర)
★ప్రథమ యవనిక★
(చంద్రశేఖరం - రావు ప్రవేశిస్తారు)
చంద్రశేఖరం : ఏమండీ, రావుగారూ ఎక్కడనుంచి? నడిచి వస్తున్నారు?
రావు : మా వుద్యోగం కాదుగానీ తల ప్రాణం తోకకు వస్తున్నదండీ!
చంద్రశేఖరం : అదేమిటి మహాశయా! మీరే అలా అంటున్నారు. మాబోటివాళ్లం మీ చేతుల్లో ఉన్నాం. మీరు ఎక్కమంటే ఎక్కుతాం దిగమంటే దిగుతాం. రావు : అవన్నీ వెనకటి దినాలండీ - ఇప్పుడు ప్రజల ఇష్టానుసారంగా నడవవలసి వస్తున్నది. మా అవస్థ చెప్పేటట్టు లేదు. ఫలానవాడిని ఎత్తవల సిందని పైనుంచి తాఖీదులు, అయితే పల్లెల్లోనూ పట్టణాలల్లోనూ పరువు మర్యాదలు నిలచేటట్టులేదు.
చంద్రశేఖరం : సత్యం చెప్పటానికి అంత జంకెందుకు?
రావు : సత్యం చెపితే స్టంటు ఉండవద్దటండీ - లేకపోతే పేపరు ఖర్చు కాదు - నిజానికి చైతన్యంగారు చాలా శ్రమపడి ప్రజాసేవ చేస్తున్నాడు. ఆయనను గురించి వ్రాస్తే అక్కడ అచ్చుపడటం దుర్లభంగా ఉంది అలా అయితే మాకు భుక్తి గడవదు.
చంద్రశేఖరం : అయితే భుజంగంగారిని గురించి లేటెష్టు న్యూస్ ఏమైనా మీకు వచ్చిందా?
రావు : ఏమీ రాలేదు.
చంద్రశేఖరం : ఆయనకు పిచ్చి ఎక్కిందటగా? - నాకూ ఆయనకు నిన్నటినుంచి చెడ్డదిలెండి.
రావు : ఏమిటీ? ఒక షేక్‌హాండ్ ఇలా పారెయ్యండి. అద్భుతమైన న్యూస్ చెప్పారు. యావద్దేశానికీ - ఆయనకు పిచ్చే! - మీ ఇద్దరికీ చెడిందా?
చంద్రశేఖరం : దానికీ దీనికీ సంబంధం లేదనుకోండి.
రావు : మీరు అంటే మటుకు మేమెలా అంగీకరిస్తాము? రేపు న్యూస్ ఫ్లాష్ చేయిస్తాను. చంద్రశేఖరం - భుజంగం మనస్పర్థలు - భుజంగం ఉన్మాదం అని హెడ్లయిన్స్ ఇవ్వమని వ్రాస్తాను. మళ్లీ కొంత అలజడి ఉండాలి.
చంద్రశేఖరం : ఈ మధ్య మీరు గ్రామంలో లేరా ఏమిటి? ముఖ్యమైన అనేక విషయాలు మీ పత్రికలో లేనట్లు కనిపిస్తున్నవి.
రావు : ఔనండీ - చైతన్యం క్యాంపు - కమ్యూనిష్టుక్యాంపుగా మారిపోతున్న దని వెళ్ళిపోతున్నదని వెళ్ళిన రిపోర్టుమీద నన్ను ప్రత్యేక విలేఖరిగా పంపించాడు?
చంద్రశేఖరం : అయితే చూచి వచ్చారా? - మీ అభిప్రాయం!
రావు : సత్యం చెప్పవలసివస్తే ఆయనకూ కమ్యూనిజానికీ ధ్రువాల కున్నంత దూరం. కానీ రిపోర్టు అలా వ్రాయవలసిందని స్పెషల్‌గా ఎడిటోరియల్ స్టాఫ్ దగ్గిరనుంచి ఉత్తరం వచ్చింది. వాళ్ళకు పై ప్రషర్ ఉండి ఉంటుంది. చంద్రశేఖరం : అయితే ఇంత అన్యాయంటండీ! వచ్చే ఎన్నికల్లో ఎలాగూ చైతన్యం రావటం సత్యం. అప్పుడు మీరూ - మీ పేపరూ, ఏమైపోతుందో చూచుకోవాలి.
రావు : నిజంగానా?
చంద్రశేఖరం : మేమంతా అతని పక్షంలో పనిచెయ్యటానికి నిశ్చయించుకున్నాము - మరి ఈ న్యూస్ విన్నారా?
రావు : ఏమిటది? -
చంద్రశేఖరం : జయమ్మ చైతన్యం క్యాంపుకువచ్చి ప్రజాసేవ చేస్తున్నదని.
రావు : తెలిసింది. పంపిస్తే పడలేదు.
చంద్రశేఖరం : ఓహో! అది భుజంగానికి వ్యతిరేకమని కామాలి - ఇదిగో ఇంత అవస్థ ఎందుకుగాని, మీరు మా పేపరుకు సంపాదకులుగా వస్తారా?
రావు : మీరో పేపరు పెడుతున్నారా?
చంద్రశేఖరం : అవును 'క్షురా' - దేశంలో అనవసరంగా పెరిగిన కల్మశాన్నంతా ఒక్కమాటు తుడిచివెయ్యాలనుకున్నాము. మీబోటి అనుభవమున్న వారికి రు. 200/ - దాకా ముట్టచెపుతాము.
రావు : నాకు మావాళ్ళు రు. 250/- ఇప్పుడే ఇస్తున్నారండీ!
చంద్రశేఖరం : పడిపోయే పేపరు రు 250/- ఇవ్వటంలో గొప్ప ఏముందండీ రు. 500/- ఇవ్వవచ్చు - ఏ సంస్థయినా పడిపొయ్యేటప్పుడు విరివిగా ఇవ్వటం సహజం!
రావు : ఆలోచించి చెపుతాను, మీ పాలసీ?
చంద్రశేఖరం : ఎవరు పైకి వస్తుంటే వాళ్ళకు దోహదమివ్వటము, చైతన్యం అద్భుతంగా సేవ చేసి ప్రజాగౌరవం పొందుతున్నాడు. అతనికి మనం కూడా కొంత చేయూత ఇవ్వాలి.
రావు : నిజమండి. తప్పకుండా ఇవ్వాలి - సెలవు
(నిష్క్రమిస్తాడు)
చంద్రశేఖరం : బుడే, బుడే - ఈ వెధవ ఇలా పరుగెత్తుతున్నాడేమిటి? - జాగ్రత్త, నెమ్మదిగారా! బుడే : షేఖహరం బాబూ! (ఏడుస్తూ) షేకహరం బాబూ!
చంద్రశేఖరం : ఏమైందిరా?
బుడే : హోగయీ సాబ్. సబ్ హోగయీ!! రే అల్లా! మర్గయీ!
చంద్రశేఖరం : చనిపోయింది ఎవరురా?
బుడే : మణ్యమ్మా సాబ్! మణ్యమ్మా!!
చంద్రశేఖరం : మణెమ్మా! ఫో, ఊరికి ఫీడా వొదిలింది. నీవేడుస్తా వెందుకు?
బుడే : (వణికిపోతూ)బూజుహంగం సాబ్ పిస్తోల్ టూట్‌కియా - మర్గయీ!
చంద్రశేఖరం : భుజంగం చంపాడా? - ఒక దెబ్బతో ఇద్దరూ వదలి పోయినారు.
బుడే : హుజూర్ - షైతన్యంగార్కి షంపాలంటూ మల్లీ హెళ్ళినాడ్ సాబ్. (వణికిపోతూ) రేసాబ్ -
చంద్రశేఖరం : ఎంతసేపైంది?
బుడే : పాంచ్ మినిట్ హై సాబ్ - పాంచ్ మినిట్
చంద్రశేఖరం : పద పోలీస్ స్టేషన్ వైపు పద -
బుడే : చలో సాబ్, చలో! షష్ఠమ దృశ్యం
(చైతన్యం పరుపు పరిచిన క్యాంపుకాట్ మీద కూర్చొని పుస్తకం తీసి చదువుకుంటూ
ఉంటాడు, కొవ్వు వత్తి దీపం వెలుగులో దూరంనుంచి బుర్రకథ వినిపిస్తుంది)
బాపూజీ! మన బాపూజీ!
జయ బాపూజీ! జయ్ బాపూజీ!!
పెట్టా కుడవా ఉన్న ఇంట
పుట్టినాడోయ్! బాపూజీ బాపూజీ...
సత్యమె తానై పుట్టీ అహ,
త్యాగము తానై పుట్టి ఓహో,
నేలను నడిచిన దేవతయై
తా నిలిచాడోయీ బాపూజీ బాపూజీ...
సత్యాగ్రహమే సాధనమంటూ, అహ,
మానవసేవే మనమత మంటూ, ఓహో
స్వాతంత్ర్యము మనకిచ్చీ,
స్వర్గం చేరాడు, బాపూజీ బాపూజీ...
చైతన్యం : (గాంధీజీ విగ్రహానికి నమస్కరిస్తాడు. గీతలో నుంచి శ్లోకం క్రింది విధంగా
పఠిస్తాడు)
“ఉత్తమః పురుష స్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః
యస్మాత్ క్షరమతీతో౽హ మక్షరాదపి చోత్తమః
అతో౽స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః"
ముసలయ్య : (పూలసెజ్జతో ప్రవేశించి, బల్లమీద ఉంచుతాడు)
చైతన్యం : బాబూ! బాపూజీ కథ అయిపోయినట్లుందే. ఎవరో అద్భుతంగా చెప్పారు. ముసలయ్య : ఎవరో బాగా చదువుకున్న జట్టంట బాబయ్యా!
చైతన్యం : రేపు మన ఉత్సవంలో మరోకథ చెప్పిస్తే బాగుండేటట్లుంది.
ముసలయ్య : నేను ముందే అడిగాను బాబూ! ఒప్పుకున్నాడు. మన రంగడు అందుకోసమే ఊళ్ళోకెళ్లి రైతులతో మాట్లాడి ఏర్పాటు చేస్తానన్నాడు. - దండలకు కావలసిన పూలన్నీ తెచ్చాము. పందిట్లో తోరణాలు కట్టాము. అరుగూ అదీ సిద్ధం చేశాము.
చైతన్యం : మనవాళ్ళు ఇంకా రాలేదు.
ముసలయ్య : వాళ్ళ కేమీ భయంలేదు బాబూ. వెంట వెంకయ్య గోపయ్యా ఇద్దరూ ఉన్నారు.
చైతన్యం : పాపం! పేదవాళ్ళను చూచి వాళ్ళిద్దరి హృదయం ఊరికే కరిగిపోతున్నది. నిద్రాహారాలు లేకుండా పాటు పడుతున్నారు.
ముసలయ్య : నిజం బాబయ్యా! - అయితే జయమ్మగారు భుజంగంగారి కుమార్తెటగా బాబూ.
చైతన్యం : ముళ్లగులాబీ మొక్కకు ఎంతో చక్కని పూవు పూయటం లేదూ, ముసలయ్యా!
ముసలయ్య : అవును బాబూ! ఆ అమ్మలిద్దరికీ గూడెమంతా చెయ్యెత్తి మొక్కుతున్నారు. - మన రేణమ్మగారు మాలపిల్లటగా బాబూ!
చైతన్యం : ఇన్నాళ్ళబట్టీ నీవేమనుకుంటున్నావు?
ముసలయ్య : మీ భార్యగారనుకుంటున్నా?
చైతన్యం : (నవ్వుతూ) ఇప్పుడు కాదనుకుంటున్నావా? - కొద్దిరోజుల్లో నేను -
ముసలయ్య : పెళ్ళి చేసుకుంటారా బాబూ? - ఇప్పుడో మరి?
చైతన్యం : స్నేహితులము
ముసలయ్య : అంతేనన్నమాట అరుగోబాబూ! అంతా వచ్చేస్తున్నారు - మీ పెళ్ళినాటికి ఊళ్ళోవాళ్ళంతా కలిసి మీకు ఇల్లేసిస్తారు లే.
చైతన్యం : మా పెళ్లిగూడా మీరే చెయ్యాలి -
(ప్రవేశము - రేణు, జయమ్మ)
రేణు : (రిష్టువాచీ చూచి) ఇంకా పన్నెండన్నా కాలేదు. రోజూ మీరు చదువుకునేవేళ -
చైతన్యం : ఇందాకటినుంచీ ఇక్కడ మాకూ మంచి కాలక్షేపం. గాంధీ 'బుర్రకథ' చాలా బాగా చెప్పారు. అక్కడ బాగా నడిచిందా ఇనాక్యులేషన్.
(ముసలయ్య నిష్క్రమిస్తాడు)
రేణు : సాయంత్రానికే పూర్తి ఐంది. కాని చిన్న మీటింగు ఒకటి పెట్టారు తరువాత.
చైతన్యం : (జయను చూస్తూ) భోజనం చెయ్యండి. తరువాత మాట్లాడుకుందాం. చల్లారిపోయి ఉంటుందిప్పటికే.
రేణు : అందుకే ఇంత ఆలస్యమైంది. భోజనం చేస్తేగానీ పోనివ్వమని పట్టుపట్టారు.
జయ : ఊళ్ళో జనం ఎంత మర్యాద చేశారండీ. పట్టణాలల్లో అంతా వ్యాపారంగా ఉంటుంది - అక్కడివారు ఉపన్యాసకులంటే 'పనిలేని మంగలి' కింద భావిస్తారు. (తల మీద చెయ్యి పెడుతుంది తలకాయనొప్పి నిరూపిస్తూ)
చైతన్యం : నీవు కూడా చాలా శ్రమపడ్డట్టున్నావు జయా!
జయ : ఆ అమాయక ప్రజను చూస్తుంటే ఒకవంక దీనస్థితికి దుఃఖపడుతున్నా, సంతోషం కలిగింది.
రేణు : రేపు మరొకసభ. దానికి అధ్యక్షులు మీరు. మన సభలకు అడ్డులేకుండానే కార్యక్రమం నిర్ణయించారు. ఆ గ్రామ గ్రంథాలయంలో మీ ఛాయాచిత్రం ఆవిష్కరిస్తారట!
చైతన్యం : నా ఫొటో వారికెలా వచ్చింది?
రేణు : మీరు ఏ సందర్భంలోనో ఔషధసేవ చేస్తున్నప్పుడు తీసిన చిత్రాన్ని ఎన్లార్జి చేయించారట!
జయ : ఎన్లార్జిమెంటు అద్భుతంగా ఉంది. - మరి నీమాట చెప్పవు రేణూ!
చైతన్యం : కొంత దాపరికం కూడా ఉందా ఏం రేణూ!
జయ : రేణు నర్సు వేషంలో ఉన్న చిత్రాన్ని -
రేణు : జయచేత ఆవిష్కరింపజేస్తారు. చైతన్యం : ఈ రిపోర్టు పేపర్లో చూసి భుజంగంగారు మనమీద విరుచుకోపడతాడు
(అంతా నవ్వుకుంటారు)
రేణు : జయా! తలనొప్పి ఎలా ఉంది?
జయ : ఇప్పుడేమీ బాధలేదు.
చైతన్యం : ఒక మాత్ర వేసుకొని గుక్కెడు మంచినీళ్లు త్రాగి నిద్రపోతే
(క్యాంపు కాట్ వైపు చూస్తాడు)
జయ : అప్పుడే తగ్గిపోయింది.
చైతన్యం : మొఘమాటపడతావేం జయా! నా మాట విని ఆ కాట్ మీద పడుకో!
రేణూ - కాస్త ధర్మామీటరు చూడు.
రేణు : (ధర్మామీటరు అందిస్తే జయ నోట్లో పెట్టుకొని చూస్తూ ఉండగా చైతన్యం 'ముసలయ్యా! టెంపరేచరు చూచి మందు పెట్టె తీసుకోరా?' అంటాడు. ముసలయ్య ముందుపెట్టె లోపలినుంచి తెస్తాడు)
చైతన్యం : 1040. రేణు! ఆమెను క్యాంపుకాట్‌మీదికి చేర్చు.
(రేణు అలా చేరుస్తుంది. డాక్టరు మందుఇస్తాడు. జయ మంచంమీద వెన్నువాల్చి ఉంటుంది)
జయ : రేణూ! తెల్లవారిన తరువాత మన కార్యక్రమం విషయం డాక్టరుగారితో ఆలోచించు.
రేణు : నీ జ్వరం నెమ్మదికాన -
జయ : తెల్లవారేప్పటికి తప్పక తగ్గుతుంది. ఎండదెబ్బ తగ్గి వేడిచేసింది అంతే.
(ముసుగు పెట్టుకుంటుంది)
చైతన్యం : ఎక్కువ అలసట పడకుండా నిద్రపట్టించుకోవాలి. ముసలయ్యా! ఈ పెట్టె లోపలికి తీసుకోపో (ముసలయ్య పెట్టెతో నిష్క్రమిస్తూ, 'బాబూ! మీకు నా మంచం తెమ్మన్నారా' అని అడిగితే 'అవసరం లేదు' అని చైతన్యం సమాధానం చెప్పుతాడు) (రేణుతో) పాపం! పెద్ద వాడు, అతణ్ణి శ్రమపెట్టటమెందుకు? నీవు ఫిమేలు వార్డులో బల్లమీద నిద్రపో రేణు : మరి మీరో?
చైతన్యం : నేను పడకకుర్చీలో పడుకొని ఏదో ఆలోచిస్తాను.
రేణు : అయితే ఇది కప్పుకోండి (చీరె యిస్తుంది)
(జయవైపు చూస్తే జ్ఞప్తికి వచ్చినట్లు నటించి)
పక్కగ్రామంలో అమ్మవారు విపరీతంగా ఉందిట!
చైతన్యం : అవును. ఇందాకనే ఆ వూరి పెద్దమనుష్యులు వైద్య సహాయాన్ని అడిగిపోవటానికి వచ్చి వెళ్ళారు.
రేణు : జయ అక్కడికి వెళ్లి సేవ చెయ్యాలని చాలా ఉత్సాహపడుతున్నది.
చైతన్యం : రేపు నేను ఈ గ్రామం ఒదలిపెట్టి రావటానికి వీలులేదు. మీకు సహాయంగా రంగణ్ణీ ముసలయ్యనూ తీసుకోవెళ్ళవచ్చు.
రేణు : చాలు.
చైతన్యం : మరి మందు?
రేణు : జయ ముందే కొంత కొని జాగ్రత్త పెట్టింది.
చైతన్యం : ధనికవర్గంలో ఇటువంటి ఉదార హృదయాలు మరికొన్ని ఉంటే దేశం ఎంతో బాగుపడుతుంది. అనేకమంది ఉన్నారు. అవకాశాలు లేవు, సేవ చేయటానికి.
రేణు : ప్రొద్దుపోయింది. మీరు కూడా ఇంకా మేలుకోటమెందుకు?
చైతన్యం : జీవరత్నం కేసు కొంత సీరియస్ ఐంది. కొద్దిగా ఆలోచించాలి.
రేణు : అంతేనా? - దాచిపెట్టటం లేదుగదా?
చైతన్యం : నీదగ్గిర దాపరికమెందుకు? దేన్నిగురించి నేనాలోచిస్తానంటావు?
రేణు : భుజంగంగారు మనమీద బనాయించిన కేసులను గురించి ఆలోచిస్తారను కొంటాను. రేపు మీ యిల్లు వేలం అని విన్నాను. ఆయనే పుచ్చుకొని అందులో భుజంగంగారు తోళ్ళషాపు పెట్టిస్తారట!
చైతన్యం : (నవ్వుతూ) ఆ ఇల్లు ఏమైతేనేం? అతనికి వ్రాసి యిచ్చిననాడే పోయిందని నిశ్చయించుకున్నాను. ఇక దాన్లో తోళ్ళషాపు పెడితేనేం, మరొకటి చేస్తేనేం? ప్రొద్దుపోయింది. నీవు కూడా నిద్రపో. రేణు : (నిష్క్రమిస్తుంది)
(చైతన్యం లోపలికి వెళ్ళివస్తాడు - ముసలయ్య వచ్చి అవీ ఇవీ సర్ది వెళ్ళిపోతాడు. చైతన్యం కుర్చీలో ముసుగు పెట్టుకొని ఆలోచిస్తుంటాడు. తగ్గించిన దీపం, మరొకవైపునుంచి భుజంగం ప్రవేశించి చైతన్యాన్ని గుర్తుపట్టినట్లు నటించి)
భుజంగం : చైతన్యం! రాస్కెల్! (పిస్టల్ మోగించిన ధ్వని) అహ్హహ.... (పెద్దనవ్వు)... లే...... ఏడు! నాకా నీవు శత్రువువు.
జయ : నాకు శక్తిచాలదు. (ముసుగు తొలిగించి) అబ్బా! అబ్బా! (కేక)
చైతన్యం : జయా! జయా!... భుజంగం?
జయ : నాన్నా! బాధ!
చైతన్యం : (పిస్టల్ జారవిడిచి) అమ్మా!
జయ : బాధ!... రేణూ! (కళ్ళుమూస్తుంది)
భుజంగం : చైతన్యం ... అహ్హహ్హ. చైతన్యం నిన్ను చంపేశాను. మనస్సుకు సంతోషం... జయం... అహ్హహ్హ
(పోలీసు సిబ్బందిని బుడే తీసుకోవస్తాడు)
జయ : (రేణు ప్రవేశించిన తరువాత) నా సమస్తమూ మీది. నా పెట్టెలో ఒక విల్ ఉంది. చూడు. (ముందు డాక్టరు చేసిన శ్రమవల్ల వచ్చిన సత్తువతో) చైతన్యంగారూ రేణూ! మీరు వివాహం చేసుకోండి. నన్ను జ్ఞప్తి ఉంచుకోండి. నమస్తే... నన్ను దీవించండి. (ఇద్దరి చేతులూ కలుపుతుంది)
బుడే : (పోలీసులతో) షూస్తారేంసాబ్ పట్టుకోండి. యహీ షైతాన్
(పోలీసులు భుజంగాన్ని తీసుకొనివెళ్ళిపోతారు)
ముసలయ్య : (పూజకు తెచ్చిన పూలు తెచ్చి ఆమెమీద చల్లి దణ్ణం పెడతాడు)
రేణు : చైతన్యం, పూలు చల్లటంలో తరువాత అనుసరిస్తారు)
చైతన్యం : ఓ దేశసేవికా!
ఓ మహాసేవికా!! రేణుతో కలిసి : ఓ దేశ సేవికా! ఓ మహానేవికా!!
చైతన్యం :
నీ ఆర్తి నిత్యమై
నీ కీర్తి సత్యమై
కలకాలమోదేవి
వెలిగెదవు - తారవై - ఓ దేశ సేవికా!
రేణు :
కనువిప్పు నీ చరిత
కమనీయ మధుమూర్తి
చైతన్యమౌ లోక
చరితలో నోజయా!
ఇద్దరూ : ఓ దేశనేవికా! ఓ మహాసేవికా!!
చైతన్యం : జయా! నీవల్ల జయం కలిగింది. కానీ నీవు లేక పోయినావు. నవచైతన్యం కోసం నీవు బలిపీఠమెక్కిన వీరవనితవు. నమస్తే!
(అందరూ నిష్క్రమిస్తారు)
(తెర)

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.