వావిలాల సోమయాజులు సాహిత్యం-2/గేయనాటికలు/సంక్రాంతి (నృత్య నాటిక)
సంక్రాంతి (నృత్య నాటిక)
కథకుడు:
తంధాన తాన తంధాన
భాయి భళానోయ్ - భాయి భళానోయ్
తంధాన తాన తంధాన
పంటల కథ విన రారండయ్యా
రండయ్యా మీరు రైతుల్లారా!
వేసగి యెండల పెనుగాడ్పులకు
విర విర పోతుందండీ లోకం
గుండెలదాకా బీటావారి
ఎండీపోతుందండీ నేల
అడవులు కార్చిచ్చుల కయ్యయ్యొ
ఆహుతియై పోతాయండీ
ఏరువాక పున్నమి కోసం
ఎదురులు చూస్తుంటారండి మీరు
తంధాన...
పురుషులు:
పున్నమివచ్చిందీ - ఏరువాక
పున్నమి వచ్చిందీ!!
ఉన్న ఊరంతాను ఒకటై
కన్నె నేలలు దున్నమంటూ
పున్నమి వచ్చిందీ...
కొరముట్లన్నిటి సరిచేయించాం
ఆనందంతో అరకలు కడదాం
అన్నల్లారా చెల్లెళ్ళారా
అంతా ఒకటై పొలాలకెడదాం
పున్నమి వచ్చిందీ...
స్త్రీలు:
ఎద్దుల కడిగీ పసుపులు దిద్దీ
నిద్దాతళుకుల కుంకుమ లద్దీ
మెళ్ళో మువ్వల పట్టెడ కట్టీ
కాళ్ళకు గజ్జెల పట్టా కట్టీ
ఆనందంతో అరకలు కడదాం
అంతా ఒక్కటై పొలాని కెడదాం
పురుషులు:
పెందలకడనే లేవండీ
ముందూ వెనకల చూడండీ
గుళ్ళో గంటలు మొరయిస్తాం
గుడి ముందందరు చేరాలండి
పున్నమి వచ్చింది...
స్త్రీలు:
ఆడోళ్ళంతా దుత్తల నిండా
ఆరని పొంగుల పాలను తెచ్చి
తీయని కోర్కెల పాయస మొండి
తీపి తినిపించాలి ముందుగ
పున్నమి వచ్చింది...
కథకుడు:
వచ్చిన పున్నమి పొలముల దున్నిన
వానలు కురియవు వడసుడి తరుగదు
తంధాన...
ఊరు విడిచి వెళ్ళాలంటూ
ఒకటే పోరౌతుందింటింటా
కులదేవతలకు కొలువులు చేసి
వానా దేవుని భక్తితో కొలిచి
తంధాన...
ఒక రైతు భార్య:
ఉత్తర జూశాం కామా... మన...
మెత్తాలి గంపిక మామా!!
ఇంకా ఎక్కడి వాన - నీ
తెలివంతా ఇది ఏనా
ఉన్నవి పెట్టుకొ తిన్నాం
ఊళ్ళో అప్పులు సున్న
పుస్తెల నమ్ముకున్న ఇక
పస్తులు తప్పవు మామా
ఉత్తర జూశాం...
రేపే బస్తికి పోదాం
రేవుల మూటలు మోద్దాం
కూలో నాలో చేద్దాం
ఈలో వానలు చూద్దాం
ఉత్తర జూశాం.
ఇక్కడె ఉందా మంటావ్ నీ
రెక్కల్లో సత్తువ ఏదోయ్
చిక్కదు కమికెడు కూడు - నా
డొక్కలు చూడోయ్ మామా
ఉత్తరజూశాం...
చెపుదామంటే సిగ్గు
చిట్టికి గుక్కెడు లేవు
ఇట్టే కూకున్నావా
చిట్టిక దక్కదు మామోయి
ఉత్తర జూశాం...
ఒక రైతు:
కంటనీరు పెట్టుకోకె
గుండె కలత పెట్టబోకె
ఊరు విడిచి రాలేనే
ఓర్చుకోవే పిల్లదానా
కంటనీరు...
తాతతండ్రులున్న ఊరు
దానధర్మం ఉన్న ఊరు
కష్టాలెన్నో వస్తు ఉంటయ్
కంటనీరు....
ఉన్నవాళ్ళ బాగోగులు
ఊరి పెద్ద చూస్తాడోసి
దేవుడిదయ లేదనకే
తిరుగుతుంది రేపొ మాపొ
కంటనీరు...
కొలుపుల కని ఊరంతా
గుడిముందుకు చేరుతోంది
వాన కురిసే వాగులొస్తే
వరిచేలన్నీ పండుతాయి
కంటనీరు...
లే లే లే పిల్లదాన!
మేలౌ నీ కన్నులాన!!
చిట్టిదానిని చంకేసుకో
ఇట్టగే గుడి కెడదాము
కంటనీరు...
స్త్రీలు - పురుషులు:
చక్కనైన సామి నీవు వానదేవుడా!
చల్లనైన సామి నీవు వానదేవుడా!
స్త్రీలు:
మ్రొక్కుకొందుమయ్య నీకు
మోకరిల్లినాము నీకు
కోపమింక మానవయ్య వానదేవుడా!
కురియవయ్య కుండపోత వానదేవుడా!
పురుషులు:
వానలు కురిసి వరదలొచ్చి వానదేవుడా!
పంటలు పండి ఇంటికొస్తే వానదేవుడా!
పప్పు పాయసాలు నీకు వానదేవుడా!
గొప్పుత్సవాలు నీకు వానదేవుడా!
స్త్రీలు:
పిల్లజెల్ల సల్లంగుంటె వానదేవుడా!
పిండివంటలు చేసి తెచ్చి వానదేవుడా!
గొండ్లిపాట పాడుతాం
గొబ్బి ఆట ఆడుతాం
పురుషులు:
కాటకాన్ని దాటయేస్తె వానదేవుడా!
మాట కాదు ఒట్టు సామి వానదేవుడా!
పేట పేరు నీ పేరె వానదేవుడా!
పెద్ద పేరు నీ పేరె వానదేవుడా!
కథకుడు:
తంధాన తాన తంధాన
భాయి భళానోయ్ తంధాన..
కారు మొయిళ్ళు కనిపిస్తాయి
కర్షకలోకం హర్షిస్తుంది.
వర్షాదేవికి స్వాగతమిచ్చీ
ఆశాజ్యోతులు వెలిగిస్తారు
తంధాన...
స్త్రీలు - పురుషులు:
అవిగో అవిగో అల్లవిగో
నల్లని చల్లని మేఘాలు
సంద్రాలెన్నో చక్కగ త్రాగీ
చిక్కని కడుపుల త్రేణుస్తూ ఆమె అవిగో..
పురుషులు:
ఉరుముల గర్జతో మెరుపుల విండ్లతో
ధారాశర సంపాతముతో
వర్షదేవతా సైన్యంలాగా
గ్రీష్మవిరోధి జయింపగ నవిగో
అవి...
తొలి చినుకుల పడ తోచిన తావికి
పరువులు తీస్తున్నయ్ లేళ్ళు,
గిరి శిఖరమ్ముల కురిసిన వానకు
జలజల వస్తున్నయ్ సెలయేళ్ళు
అవిగో...
స్త్రీలు:
ఆశాదీపిక లెద వెలిగింపుడు
అబ్బెడి నూతన జీవిత మిలకిక
అవె వినరయ్యా ఎద లుప్పొంగెడి
ఆటకు నిలిచిన నెమిళ్ళ కేక
అవిగో....
వనితలు:
ఎటకో పోయినవని తలపోసితి
మిటెచేరెను మన ప్రాణాలు
బొరియల నిద్దురు మేల్కొని నిలవక
చరచర విహరించెడి నాగాలు అవిగో...
స్త్రీలు - పురుషులు:
చిటపట చిన్కుల చిందులు ద్రొక్కుచు
సురలోకమ్ముల సిరిసంపదలతో
వర్షాలక్ష్మీ వచ్చావా, హర్షమ్మిల కిదె తెచ్చావా!
స్వాగతమమ్మా స్వాగతము
స్వాగతమిదె సుస్వాగతము
పురుషులు:
నిర్జరణీఘన మంజీరోజ్వల
నినదమ్ములె నీవంది జనమ్ముగ
వర్షాలక్ష్మీ వచ్చావా, హర్షమ్మిల
కిదె తెచ్చావా!
స్వాగతమమ్మా! స్వాగతము, స్వాగతమిదె
సుస్వాగతము!!
స్త్రీలు:
వనముల నందన వనముల జేయగ
నదులన్నిటి సురనదులను జేయగ
వర్షాలక్ష్మీ వచ్చావా! హర్షమ్మిల
కిదె తెచ్చావా!
స్వాగతమమ్మా స్వాగతము, స్వాగతమిదె
సుస్వాగతము
పురుషులు:
మా మొర వినగా, మనసుల నిలుపగ
వరుణుని యొడివిడి పరుగున తల్లీ
వర్షాలక్ష్మీ వచ్చావా! హర్షమ్మిల కిదె
తెచ్చావా!
స్వాగతమమ్మా స్వాగతము
స్వాగతమిదె సుస్వాగతము!!
స్త్రీలు:
ఆనందం మాకానందం..
అభిలావని కిక ఆనందం
వర్షాలక్ష్మీ వచ్చావా! హర్షమ్మిల
కిదె దెచ్చావా!
స్వాగతమమ్మా స్వాగతము స్వాగతమిదె
సుస్వాగతము!!
లేవండోయ్, మరి, మేల్కొండోయ్
పోవాలండోయ్ మీమీ పనులకు
పురుషులు:
సందుల త్రోవల సన్నని బాటల
కొండలకోనల నిండిన నడకల
గొడ్డలి పట్టీ కొమ్మలు కొట్టీ
దొడ్డౌ వీపుల తేవాలోయ్
లేవండోయ్...
స్త్రీలు:
కుడితీ పట్టీ వీపుల తట్టీ
అదుపున పెట్టీ పొదుగులు పట్టీ
దూడల చేపగ త్రావా నిచ్చీ
దుత్తల పాలను పిదకాలోయ్
లేవండోయ్...
పురుషులు:
పలుగులు పారలు పట్టుకొనీ
కలుగులు బాళ్ళూ నీళ్ళజాళ్ళూ
గట్టుల మిట్టల సరిజేయాలోయ్
గడ్డల తిరగావేయాలోయ్.
లేవండోయ్...
స్త్రీలు:
చిన్నవి కడవలు చంకాసెట్టి
పెద్దా బానాల నెత్తీకెత్తి
మామిడి తోపులో కొలనుల కెళ్ళి
మంచినీళ్ళను తేవాలోయ్
లేవండోయ్...
కథకుడు:
కడుపులు నిండా నీళ్ళను తాగీ
కళకళ లాడుతాయి చేలు,
నవ్వుతు పాలేళ్ళూల్లో మంచి
నాట్లు కూలికి వస్తుంటారు
తంధాన...
మురిపెపు పాటల నాట్లల్లోను
మునిగుంటారు రైతులూ
తంధాన...
స్త్రీలు - పురుషులు:
నారు పీకి ఓలో ఓలి
నాటుదాము ఓలో ఓలి
అన్నలారా ఓలో ఓలి
తమ్ముళ్ళారా ఓలో ఓలి
పురుషులు:
మళ్ళన్నిటినీ ఓలో ఓలి
మంచిగ దున్నీ ఓలో ఓలి
వదులుగ మట్టిని ఓలో ఓలి
పదునులు, చేశాం ఓలో ఓలి
నారు పీకి...
స్త్రీలు:
చక్కని విత్తుల ఓలో ఓలి
చల్లినాము ఓలో ఓలి
ముచ్చటగా నా రోలో ఓలి
మొలిచున్నాది ఓలో ఓలి
నారు పీకి...
పురుషులు:
పైరులు నాటగ ఓలో ఓలి
పంట పొలాలను ఓలో ఓలి
కమ్మని నీళ్ళతో ఓలో ఓలి
దమ్ములు చేశా మోలో ఓలి
నారు పీకి...
స్త్రీలు:
పశువుల యెరువుల నోలో ఓలి
పచ్చని యెరువుల నోలో ఓలి
బాగుగ చల్లి ఓలో ఓలి
మాగేశాము ఓలో ఓలి
నారు పీకి...
పురుషులు:
తిన్నని వరుసల నోలో ఓలి
తెరపిగ నాటం డోలో ఓలి
మొక్కకు మొక్కకు ఓలో ఓలి
మ్రొక్కుతు నాటం డోలో ఓలి
నారు పీకి...
స్త్రీలు:
కుదరొక్కంటికి ఓలో ఓలి
తెరపిగ నాటం డోలా ఓలి
మొక్కకు మొక్కకు ఓలో ఓలి
మ్రొక్కుతు నాటం డోలో ఓలి
నారు పీకి...
స్త్రీలు:
కుదరొక్కంటికి ఓలో ఓలి
కుంచెడు ధాన్యం ఓలో ఓలి
కొలవగ పండా లోలో ఓలి
కోర్కెలు తీరా లోలో ఓలి
నారు పీకి...
కథకుడు:
తంధాన తాన తంధాన
భాయి భళానోయ్, భాయి భళానోయి
తంధాన...
కళకళ లాడుతు పంటలు పెరిగే
కన్నుల పండువగా చేలుంటే
మంచెపై భార్యతో రైతు బాబయ్య
మహదానందంతో సరసాలాడు
తంధాన...
ఒక రైతు:
మొలకెత్తి నది పత్తి ఓ భామా!
తల చూడవే ఓ భామా!!
రైతు భార్య:
కనవిచ్చి చూడకోయ్ ఓ మామా!
కలుగునేమో దిష్టి ఓ మామా!!
ఒక రైతు:
దబ్బాటు వానలకు ఓ భామా!
దెబ్బతిన కుండాలి ఓ భామా!!
దిగులు పడకోయ్ నీవు ఓ మామ!
దేవుడే కాస్తాడు ఓ మామా!!
ఒక రైతు:
బుడతడంతై పెరిగి ఓ భామా!
పొలము గుబురేస్తుంది ఓ భామా!
రైతు భార్య:
పూలేస్తే వస్తాయి ఓ మామా!
పోకిరీ తుమ్మెదలు ఓ మామా!
ఒక రైతు:
గడలు పాతిస్తాను ఓ భామా!
గంట లెత్తిస్తాను ఓ భామా!!
రైతు భార్య:
క్రొత్త సంచులు కుట్టి ఓ మామా!
కొడి కొడికి తొడుగుతా ఓ మామా!!
ఒక రైతు:
కంచె పాతిస్తాను ఓ భామా!
మంచె వేయిస్తాను ఓ భామా!
రైతుభార్య:
మంచెపై వడిసెలతో ఓ మామా!
నుంచోని కాస్తాను ఓ మామా!
ఒక రైతు:
నక్క కూతలు వింటె ఓ భామా!
అక్కడే ఉంటావ ఓ భామా!
రైతు భార్య:
ఒక్క కేకెడతాను ఓ మామా!
ఉలుకుతూ వస్తావు ఓ మామా!
కథకుడు:
కోతల్రోజు లొచ్చే తల్కి తంధాన!
కొత్త జీవితమ్ము వచ్చు తంధాన!!
చిన్న పెద్దలంతా వెళ్ళి తంథాన!!
చేల కోతలు కొస్తారు తంధాన!!
కొందరు:
ఏలే మాలి, జంబైలోలె
జోతులంగురు ఏలెమాలి!
స్త్రీలు - పురుషులు:
కోద్దాము కోద్దాము వరిపంట
గంపలన్నిటి కెత్తి గాదెల్లో పోద్దాము
కోద్దాము...
పురుషులు:
కొండలను మించేటి
కుప్పలు వేయగా
కోరికలు తీరగా
కొడవళ చేపట్టి
కోద్దాము...
పురుషులు:
ఏలే మాలి జంబైలోలె
జోతులందరు ఏలె మాలె!
అన్న వస్త్రాలకు
అన్ని వస్తువులకూ
ఆధారమైంది ఈ
అమృతాల పంటా
కోద్దాము...
కొందరు:
ఏలే మాలి జుంబై లోలె
జోతులంగరు ఏలేమాలి
పురుషులు:
కొద్దిరైతుల కైన
పెద్ద రైతులకైన
మంచి రోజులు తెచ్చు
మహ తల్లి యీ పంట
కోద్దాము...
కొందరు:
ఏలే మాలి జంబై లోలె
జోతులంగరు ఏలేమాలి
కథకుడు:
వస్తుంది సంక్రాంతి లచ్చి సంక్రాంతి
తెస్తుంది ఊరికి దివ్య సౌఖ్యాలు
తంధాన...
అంటు తల పోస్తును ఊరివారంతా
ఆనందంతో కుప్పలంనూర్చి
తంధాన...
బళ్ళామీద ఇళ్ళకు చేర్చి
పడవల మీద పంపిస్తారు
తంధాన...
స్త్రీలు - పురుషులు:
మనకు వచ్చు సంక్రాంతి సిరిసిరిమువ్వ
మంచి తెచ్చు సంక్రాంతి సిరిసిరిమువ్వ
పంటల్ల పండుగ సిరిసిరిమువ్వ
భాగ్యాల పండుగ సిరిసిరిమువ్వ
పురుషులు:
దూరవూళ్ళ నుంచి వచ్చి సిరిసిరిమువ్వ
బేరగాళ్ళు పంటకొంటె సిరిసిరిమువ్వ
ముంతలనిండా డబ్బేను సిరిసిరిమువ్వ
సంతలనిండా డబ్బేను సిరిసిరిమువ్వ
స్త్రీలు:
రంగవల్లి తీర్చిదిద్ది సిరిసిరిమువ్వ
సింగార మొలికించి సిరిసిరిమువ్వ
గొబ్బి పాట పాడుతాము సిరిసిరిమువ్వ
కోలాట మేస్తాము సిరిసిరిమువ్వ
పురుషులు:
హరీలో రంగంటు సిరిసిరిమువ్వ
హరిదాసు లొస్తారు సిరిసిరిమువ్వ
డూడూడ బసవన్నింటికి సిరిసిరిమువ్వ
ఏడాదికొస్తాడు సిరిసిరిమువ్వ
స్త్రీలు:
పుట్టింటి పడుచులకు సిరిసిరిమువ్వ
పుట్టింది సంక్రాంతి సిరిసిరిమువ్వ
వియ్యాలోరి విందుల కోసం
సిరిసిరిమువ్వ
వెయ్యాలి సువ్వి హా సువ్వి సిరిసిరిమువ్వ
ఒక రైతు:
నిరా నిరా బండి రా
నివ్వరోరి బండి - నిరా నిరా
చర చర రావాలి బండి
పరుగుల రావాలి బండి,
గిత్తలపొగ రణిగేట్టుగ
కొత్త ధాన్య మెత్తుకోని - చరచర
మువ్వల మ్రోతలు వింటె
దవ్వుల నిలవాలి జనం
ఎవ్వరి దని జనమంటే
మాదే నందాము మనం-చర చర
చెదరి చెదరి వస్తున్నయ్
చిలిపి చిలిపి మబ్బులవే
ధాన్యానికి తడుపు తగిలి
ధర పడిపోతుంది రోరి-చరచర
డొంకబాట చెడిపోతే
వంకలన్ని తిరిగేవ్ రోయ్
అడ్డదారి కొట్టుకొరా
గడ్డి కప్పి తట్టుకొరా చరచర
నిరా నిరా బండి రా
నివ్వరోరి బండి
స్త్రీలు - పురుషులు:
హైలేసా, హవ్వరి హవ్వ
లాగరోరి లంగరు తాడు
పురుషులు:
మేముంటేనే పంటుంటుంది
పంటుంటేను ప్రజలుంటారు హైలేసా
స్త్రీలు:
ప్రజలుంటేను రాజ్యం ఉంది.
రాజ్యం ఉంటే మనముంటాము హైలేసా
పురుషులు:
మనముంటేనే బెస్తుంటాడు
బెస్తుంటేనే పడ వుంటుంది హైలేసా
స్త్రీలు:
పడవుంటేనే సరుకులుంటాయి
సరుకులుంటేనే సౌఖ్యాలుంటాయి హైలేసా
స్త్రీలు పురుషులు:
హైలేసా హవ్వరి హవ్వ
లాగరోరి లంగరు తాడు
-ప్రజావాణి, ఆదివారం, సెప్టెంబర్ 30, 1962
This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.