Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-2/గేయనాటికలు/యమ-యమి

వికీసోర్స్ నుండి

యమ - యమి

(ప్రస్తావన)

కథాకథనం


నటీనట స్వరమేళ

స్త్రీ పురుషులు ఉభయులు


సృష్టి చేసినాడు బ్రహ్మ
సృజన కళాకుశలతతో
నారాయణ శుభనాభీ
నవసరోజ సంజాతుడు
స్వీయాస్తిత్వుడు సృష్టిని
సృజయించెను స్రష్ట, బ్రహ్మ.
                   ....సృష్టి చేసి..

ఆదియందు అణుమాత్రము
ఆ శూన్యమె లేనపుడు
అది అఖిలం గాఢమైన
అంధకారమైనప్పుడు
                     ....సృష్టి చేసి...

అమృతత్వం, ఆమరణం
అదిగానీ, ఇది గానీ
ఏ ఒక్కటి లేదప్పుడు,
ఎవరు లేరు దర్శింపగ
                      ...సృష్టి చేసి...

పంచభూత కోటి, జగ
త్ప్రాణిలోక సముదాయము
విపులౌషధి వనచయముల
విశ్వకర్త నిర్మించెను
                      ....సృష్టి చేసి...

దివ్యశక్తి శోభితులను
దేవతలను ఋషివరులను
జనియింపగ జేసి చూచె
జనితుల ఘనహర్షముతో
                      ...సృష్టి చేసి...

అవనిపైన నగ్నిదేవు,
పనవవీథి వాయువును,
రవివరు - శుభతేజస్విని -
గ్రహతారలలోన నిలిపె
                      ...సృష్టి చేసి..

స్త్రీలు

అందాలకు పుట్టినిల్లు
అమరశిల్పి, విశ్వకర్మ
సర్వాలంకరణ స్రష్ట
సంజ్ఞాసుకుమారి తండ్రి

పురుషులు


శుభశోభావతి సంజ్ఞను
సూర్యుడు పరిణయమాడెను
విశ్వసర్వ సౌందర్యను
విశ్వకర్మ పుత్రికను


ఒక స్త్రీ


సూర్యుని సంయోగమ్మున
సుదతికి సంజ్ఞాదేవికి
ఒక్కమారె జనియించిరి
బాలుడొకడు, బాలి కొకతె.


ఒక పురుషుడు


ఆ బాలుడు యముడు, యమి
ఆ బాలిక - అతి సుందరి
పెరిగి రొకట కలిసి మెలసి
ఇరువురు - యమి,
                ఆ యముడును.


ఒక స్త్రీ, ఒక పురుషుడు


ఆ బాలుడు, ఆ బాలిక -
యముడును, యమి ఏనాడును
తాబుట్టిన లోకమ్మును
దాటియెఱుగ రేలోకము.

వారి తండ్రి దివ్యకాంతి
నీరమ్మున స్నానమాడి
కాళిందీశైలోత్సం
గములలోన చరించారు.


స్త్రీలు, పురుషులు


ఆడారు యముడు ఆ యమియు
అలసటల నెఱుగకే -
ఆనంద పథములలో
ఆడారు యమియు,
                   ఆ యముడు.
ప్రతి తరంగము మీద
పరువెత్తు నవ్వులతో,
గిరిశిఖరి మెలిదిరుగు
చిరునదులు దూకులతో.
                        ॥ఆడారు॥
చారుతర మృదుశిలా
శయ్యలను మదముతో
రమ్యాతి రమ్యస్వ
రాల జల్పాలతో..
                       ॥ఆడారు॥
స్వాదు మృదుభంగిమల
వన తరుస్కంధాల,
శాఖలతో, ఛాయలతో
శబలతతో మెలి తిరుగుచు.
                         ॥ఆడారు॥
హసనమ్ముల సొగసులతో
హ్రా హ్రిం హొం నినాదాల,
ప్రతిశబ్ద స్వనసంతతి
ప్రీతితోడ శ్రవణించుచు
                        ॥ఆడారు॥

స్త్రీ పురుషులిరువురు


ఉన్నవారు కొంత పెరిగి
మిన్నలైన సౌఖ్యాలతో
పుష్పగుల్మ గహనమ్మున
ఫుల్ల కుసుమ సముదయములు
సీతాకోకల శోభలు
చెలగి వెలుగు కలుపు కడను
                            ॥ఉన్న॥
శాఖల ప్రసరించి విరియు
చారు తరుల క్రింద వారు
పండి వ్రాలు పండ్ల నేరి
పక్షులచే తినిపించుచు ॥ఉన్న॥

చంద్రకాంతి శోభలతో
చారు రమ్య స్వచ్ఛతలతో,
గంధర్వ మహానగరుల
కనుచు ప్రీతి చరియించుచు
                           ॥ఉన్న॥
వన్యౌషధి పరిమళాలు
వలపులతో చెలరేగుచు
మధు వసంత ఋతువేళల
మంజుగతుల మెలగుచోట...
                          ॥ఉన్న॥


ఒక స్త్రీ


తేజ : పతి - రవి పుత్రిక
తేజస్విని - పరిధానము
దోహదముగ, సుఖదముగా
తొలి యుషస్సువలె తోచును


ఒక పురుషుడు


విశ్వశిల్పి దౌహిత్రికి
వెలయగ నవి లోపమేమి?
ఆ యమి - అభరణమ్ములు
అద్భుతములు, రమ్యమ్ములు.


మరొక స్త్రీ


యముని దేహవర్ణమ్మది
హరిత ముగ్ద మోహనమ్ము
అతని వసన సౌభాగ్యము
అరుణారుణ రమణీయము.


మరొక పురుషుడు


యముడును యమియును
అడవుల తిరుగుతు
ఆటలు ఆడే
టప్పుడు తమియమి -

యమ సోదరు - యెడ
హస్తము నిల్పును,
కరతలమున 'కర
కమలము నిల్పును.


మరొక స్త్రీ


వెంటనె మందుకు
విరియుచు వచ్చును
ఉపగూహనమును
నొనరించును తమి

ముద్దిడ పెదవుల
మోహన వైఖరి


కమ్రకపోలము
కడమెడ జేర్చును

విరవిరలాడెడి
తిరుగుడు లొదవగ
చిరునవ్వును సు
స్మితముగ మార్చును.


స్త్రీలు, పురుషులు


ఆటలెన్నో నేర్చి
ఆ పిల్లలాడారు,
ఆటలల్లో వయసు
అధిగమించింది.

అట్టి సమయాలలో
ఆయముని మనసులో
వింత భావాలెన్నో
విచ్చేసి మురిసినవి... ॥ఆటలెన్నో!॥

అతడు వెనువెంటనే
అవమాన భరితుడై
దూరముగ యమిని తా
త్రోసిపుచ్చెడు వాడు...॥ఆటలెన్నో!॥

వదనాన వైవర్ణ్య
వర్తనము గని యముడు
నవ్వగా నా యమియు
నవ్వెడిది కలతపడి ॥ఆటలెన్నో॥

అనురాగ భావ మెద
పెనవేసినది యిపుడు
ఉల్లసిత ప్రణయరస
మొనరి ఏపారినది. ॥ఆటలెన్నో!॥


ఒక స్త్రీ, ఒక పురుషుడు


ఈ అవస్థను పితరు
లెరుగుదురొ, ఎరుగరో
వారేమి ఒనరించు
వారుగా కనబడరు.

పురుషత్వ విస్ఫూర్తి
పొల్పారె యమునిలో
పుష్పవతియైన యమి
పొలిచె నొక ఉవితగా.

ప్రణయ, మున్మత్తమ్ము
పరిపూర్తి కాశపడె
సమయ మేతెంచినది
చలియించె శోణితము.


అంతర్దృశ్యము = యమి


ఉజ్వల ప్రణయినిని
ఓ సఖా! ఓ సఖా!!
ఉత్తమ ప్రేయసిని
ఓ ప్రియా! ఓ ప్రియా!!


యముడు


ఇటు పిలిచెదవు నీవు
ఇది ఏమి పిలుపె'యమి'?
ఇనుని పుత్రివి నీవు
ఇనుని పుత్రుడ నేను


యమి


ఉజ్వలరస కాంక్ష కలిగి
ఉల్లసించుచున్నదాన!


అరుణోదయ మొందె మనసు,
మరుజలనిధి దాటినాను
రాగసార మభిలషించి
రమ్మనుచున్నాను సఖుని...
                     ॥ఉజ్వల॥
నాదు గర్భధారణాన
'నాన్న' అంటు నిన్ను పిలుచు
సుందరుండు, నందనుండు
శుభయుతుఁడు కలుగవలెను....
                     ॥ఉజ్వల||
సఖుడా! మనపుత్రునకౌ
సర్వశక్తులబ్బుగాక!
సకల సంపదలు అతనికి
సంప్రాప్తం ఔనుగాత! ॥ఉజ్వల॥


యముడు


ఏలనో నవఫణితి
ఇటు పల్కుచున్నావు
ఎద తోచుచున్నయది
ఇది ఏదో వింతగా


యమి


తెలుపనా ఈనాటి
పలుకులకు హేతువేదో!
కడు రమ్య ముజ్వలము
కాంక్షయే కారణము... ॥ఉజ్వల॥


యముడు


ఈ కోర్కె ఈ చెలిమి
ఇచ్ఛయించుట తగదు
ఇరువురకు మూలమ్ము
ఏకమ్ము - సోదరివి ॥ఉజ్వల॥

దేవర్షులును సురలు
తిలకించుచున్నారు
ఒప్పరవ్వారు మన
తప్పిదపు నేస్తాన్ని

ఏదొ దూరమునుండి
ఈక్షింపగా నేమి?
వారు నీ ప్రక్కనే
వరలుదురు నా వలెనె.


యమి


త్రిదశులా! వారు నను
తిలకించుచుందురని,
చక్కగా విందురని
సంతోష పడుచుంటి ॥ఉజ్వల॥

మన సఖ్యమును బోలు
మధురైక్యతను మొచ్చి,
ఆసక్తి వహియింతు
రనుట లెపుడెంతగనొ ॥ఉజ్వల॥

బ్రహ్మ, సుత భారతితో
పరమ స్నేహము చేసి
సంయోగమొంచి తా
సంతతిని వడయడే? ॥ఉజ్వల॥

ఏ నివారణ మనల
ఏల ఆపగవలెను?
రావోయి, రావోయి,
రంజిలగ నోసఖా! ॥ఉజ్వల॥


నీ మనసు నివ్వేళ
నా మనసుతో గలుపు
నా శరీరము నొంది (వలన)
నాక భోగము గొనుము ॥ఉజ్వల॥


యముడు


అమృతత్వమును గొన్న
ఆ నాకజనగతిని
ఎటుల వర్తింపగల
మీ భువిని ఓ యమీ!

స్మరియింపు మనగోత్ర
సంబంధమును యమీ!
స్మరియింపు మాదిత్యు
మన పితరు - భాస్కరుని.


యమి


బహురూప జనకుండు
భవ్యుండు, దివ్యుండు
త్వష్ట్ర నెఱుగుదు వీవు
పుష్టిగల రసశిల్పి.
మనకు జన్మమ్మిడిన
మహిత గర్భమునందు
మలచెనారస శిల్పి
మనల పతిపత్నులుగ.

అతడు గావించినది.
ఆపలే డెవ్వండు
మనసఖ్యమైకమ్ము
కనియె భూదివములకు.

ఆసక్తి విషయాన
ఆశ నెఱుగనిదాన
ఈరటి ఏడ్పింప
ఇచ్చగించెద వేల?


యముడు


ఆపుమింక దాని చెల్లి!
ఆ అపేక్ష కాశపడకు
కామమాంధ్య మొనరజేయు
కలతపరచు బుద్ధిగరిమ

నన్ను క్రూరుడంచు మదిని
ఎన్నుకొందువేమొ నీవు
గాఢరీతి యోజసేయ
కనుగొందువు సత్యమెదో.

ఆ నిరుద్ధ ఫలము వలచి
నట్టి దుష్టురాలవంచు
నిన్ను తెలుసుకొందు వీవె
మిన్నవై చరింతు వంత.

సోదరుండు కానివాని
చూచుకోని పతిగ, తరుణి!
వలచునట్టి కాలమింక
వచ్చు సోదరీమణిరో!

కాన భిన్ను నొకని నీవు
కనుము సఖుని, కాంతియతుని
నిర్మలోపధానముగా
నీ బుజమ్ము నిమ్మతనికి

యమి


అన్నకు సతి నీయలేని
అతివ తగిన సోదరియా?
వరు నొసగక సోదరికై
వరలునతడు సోదరుడా!


యముడు


పుట్టుక నొసగిన గర్భము నందే
పుట్టితిమా మరి పతిగా పత్నిగ?
అందున బీజము పొందింపబడు
ఆ క్షణ మెట్టిదొ ఎవ్వరి కెఱుక?
అస్తిత్వము ప్రభవించిన వేళను
ఆది దినోషస్విని కాలమ్మున
అస్తిత్వము నస్తిత్వము కలిసిన
ఆ క్షణమెట్టిదో ఎవ్వడెఱుంగును?

ఎవ్వడు దానిని చూచిన యాతడు?
ఎవ్వడు వెల్లడి చేసిన యాతడు?
రాత్రింబవళుల ఆవిష్కరణలు
ధాత్రిని సాగుననంతగణమ్ముగ!

ఊహాకల్పిత భ్రాంతికి లోనై
ఉల్లాసంతో బడలెఱుగక యిటు
ఓసి విలాసిని, నీచుల పోలిక
ఊరక సత్యము పలికెదవేలా?


యమి


చిక్కబట్టుకొనంగ
చెల్లు నిను నీవు సఖ!
ఏమిటిది కోపింతు
వేల ఓ నా సఖా!

స్నిగ్దమ్ము, స్వచ్చోష్ణ
శీలమ్ము, మోహనము
యమశక్తిని విచ్చేసె
యమినైన నా కడకు.

భార్య నిజదేహమును
భర్త కర్పించునటు
నా తనువు నీకిచ్చి
నాతి నౌదును సఖా.

రాగైక్యమును పొంద
రథచక్రముల జంట
అవుదాము మనమిపుడె
అర్థింతు ఓ యమా!


యముడు


సిగ్గు, సిగ్గు, విధ్వంసిని!
జిజ్ఞాసాశూన్య వీవు
దేవచారు లెవ్వేళల
తిరుగుచుంద్రు లోకాలలో
వెదకి కొనుము వేగముగా
వేరొక్కని చేరుమతని
రథ చక్రద్వయము పోల్కి
రాగైక్యత నొందవమ్మ


యమి


ఎంత క్రూరుడవోయి యముడా!
దేవుడవె, కాని నీ
వెంత క్రూరుడనోయి యముడా!!
రాత్రింబవళ్లు నీ
గోత్రనామాలతో


అర్పింత్రుగాక ఉప
హారాలు పూజకులు ॥ఎంత...॥

సూర్యదేవుని కనులు
సొగసుల - ప్రభాసాల
నీపైన నెవ్వేళ
నిలచి ఉండు గాక! ॥ఎంత...॥


యముడు


నాతో సంగమించటమ్ము
నమ్ముచుంటి వుచితమ్మని
భ్రాంతితోడ వర్తిస్తూ.


యమి


అప్పుడే మరచితివి యముడా!
ఎంతొగా, వింతగా
అప్పుడే మరచితివి యముడా...

అడుగులో అడుగేస్తు,
చేతిలో చెయిగలిపి,
ఆటలాడాము మన
మా వనచ్ఛాయలలో ॥అప్పుడే...॥

ప్రసవకర్తన కేళి,
ఫలసమార్జన హేళి
బహు కళిందా నితం
బాళిలో తిరిగితిమి ॥అప్పుడే...॥

ఉరువేగముగ నీవు
మరచితివి సర్వమ్ము !
యముడి వర్తన నెల్ల
యమియె భరియింపవలె...
                       ॥అప్పుడే...॥

మరల నే శోకింప
పరికింపదలచితివె?
ఎన్నియో రీతులుగ
ఏ నిదే రోదింతు ॥అప్పుడే...॥


యముడు


ఏమి, ఏమి ఓసి యమీ!
ఏమి చేసినాను నేను
ఈవు ఏడ్వ నేనిప్పుడు
ఏమి చేసినాను యమీ!

తండ్రి కోరినయపుడు
తల్లి సంజ్ఞాదేవి
ప్రజ్వలన తేజాన్ని
భరియింపగా లేక
దాసి ఛాయను పంపి
తపమునకు తావెడలె.


యమి


సావర్ణి, తపతి, శని
ఛాయసంతతి యైరి
అధిక తత్పరత ఆ
అతివ తన సంతతితిని.

పెంచుటను కోపించి
పిలిచి తన్నితి వీవు
గాయపడి బాధపడ
ఛాయ శపియించె నిను

ఆ వేదనకు నీవు
అలసి శోకించావు
సాయపడినది ఎవరు?
కాయసే వెవ్వరిది?


ఎవరు పూసిరోలేహ్య,
మెవరిచ్చిరో మందు
ఎవరు నీ కొఱకపుడు
ఏడ్చిరో మరచితివి.

కామాక్రమణమ్ము వలన
కలుగదెట్టి శక్తి నాకు
నమ్రతతో నర్దించెద
నా కోర్కెను తీర్చుమయ్య.

సంపన్నుడ వీవుయమా!
సర్వమిత్తు వన్యులకును
నా కవోష్టరక్తమునను
నా పతికడ కిదె నడిపెను.

నా నిచోళ మిదె సడలెను,
నా మేఖల మొల నిలువదు
నా శరీరమును యముడా!
నీ శరీరమున గలుపుము.


యముడు


నా దేహమును నేను
నీ దేహమున జేర్ప!
ద్రోహమిది దౌష్ట్యమిది
ఊహ చేయవె యమీ!


యమి


వేగిరపడకోయి సఖుడ!
ఆగవోయి నా సఖుడా!!
కోపపడకు మయ్యా, నా
తాపము గమనింపవయ్య!

ఇరువురి యెద లేకమై
పరుగు పరుగులతో కదులుతు
మన ముదయించిన కడుపున
బనరగ స్పందించె కలిసి!

ఇరువురి చెవి జతలు కలిసి
ఏ స్వనమైనను వినినవి!
కలిసె చెక్కిలిని చెక్కిలి
కరము నగ్నకరము చేరె.

పత్నినిగా నేను నీకు
పతి రీతిగ నీవు నాకు
మన బాల్యమ్మెల్ల నిటులె
ఘనతరముగ సాగినది.


యముడు


అర్థించెద సోదరి, నిను
ఆపు మాపు మీ కథనము
కాముకుడై సోదరితో
కలియువాడు మహాపాపి!

అన్యునితో పొందుమునీ
వానందము - దైహికమ్ము
సోదరుడను, పొందనట్టి
సుఖమును నే పరిశుద్ధుడ!


యమి


అంత శక్తిరహితుడవా|
అయ్యో! ఓ దుర్బల, యమ ॥

అయినను నీ కన్నులలో
అదిగో మృదు మధులాహిరి!


కదలుచున్నయవి నిరతము
కరములు కోమలవైఖరి...
                     ॥అంతా॥
నేను కాని తరుణిపైన
నిలచి ముగ్ధమధు మత్తత,
ప్రణయభావ నీ హృదయము
భ్రమియిస్తూ ఉన్నదిపుడు.
                      ॥అంతా॥
మావిగుఱ్ఱమును వారువు,
తీవియ తరుకాండము వలె
ఆ యౌవని వలచి నిన్ను
ఆలింగన మొనరించును


యముడు


వేగముగా సఖునొక్కని
వెదకికొనుము నీవు చెల్లి!
అతని ప్రణయమును పొందుము!
అతడు పొందు నీ ప్రణయము.

అతని, నో యమి, ప్రేమతో
ఆలింగన మొనరింపుము
మావి గుఱ్ఱమును వారువు,
ప్రాకాండములతను వోలె.


యమి


ఏల ఇటుల పలికెదీవు?
జాలి యింత శూన్యమ్మా!


యముడు


చెందుత మీ ఐక్యతచే
శ్రేయము సర్వమ్ము మీకు!
పలుకజాల నెయ్యది ఇక!
వాచంయమి నైపోయెద!!


యమి


ఈవు నేత్రజలమ, రమ్ము
ఎదలోతులక్షరమొందితి
భంజనకై వ్యధ నొందుతు
పలు తెఱగుల రోదింపుము.

పక్షమ్ములు మాయక మీ
లక్షణాల విడవక ఓ
చక్షువులారా! కనుండు,
జాగృతి వహియింపు డెపుడు.

ప్రణయమ్మును తుదకు యముడు
పాదత లాహతమొనర్చె
హసియింపదు, ప్రణయమ్మిక!
హసియింపదు యమియు నింక !!


కథోపసంహారం నటీనట స్వరమేళ

స్త్రీ పురుషులు


ఆ శరణాగత రీతిని
అర్థభంగిమను నిలిచెను -
చలన మించుకయు నొందక
స్థబ్దత వహియించె నామె

"హసియింపదు ప్రణయమ్మిక
హసియింపదు యమియు నింక”
అన్న ఆమె రోదనమది
అంతట ధ్వనియించినది.

అన్య స్త్రీ పురుషులు


ఆ శోకము క్రమక్రమముగ
అఖిలమ్మును మందగించె
నైరాశ్యముతో నది మర
ణమ్ము నొందె దారిలేక

రెండగు వడగండ్ల వోలె
నిండి, నేత్రజలము, కరిగి
ఆమె చెక్కిళుల జారిన
అతివేతముగా నప్పుడు


తొలి స్త్రీ పురుషులు


ఆమ్లానము లైన శిలల
యట్టులయ్యె ఆమె కనులు
చేరి ఒకటి వెనుక నొకటి
జృంభించెను జలబిందుయు.

కనురెప్పల కొక కంపన
కలిగి అంతకన్నీరది
సాగి మహామృదు మృదువుగ
స్రవియించెను కడు స్వేచ్ఛగ.


ఒక స్త్రీ


శైలమ్ముల, తరువులపై
శాద్వలాల గుల్మమ్ముల
ఉంచబడిన దామె ముందు
ఒక తుషార పృథుయవనిక!


ఒక పురుషుడు


ప్రారంభమునందున్నటు
అర్థమ్మును రూపమ్మును
అణుమాత్ర మ్మెరుక పడని
అంతా ఒక మాలిన్యము.


ఒక స్త్రీ


మలచిన ఒక ప్రతిమ వోలె
మరియింకా మోకాళుల -
మరివినదెది, మరి వినదెది
మలిగి ఉండి ఉండెనామె!
ఒక పురుషుడు
చిన్ననాడు వారాడిన
సీమలోని ఔదుంబర
వనతరువైనను అడ్డెను
కనగ దాని ఆకారము


ఒక స్త్రీ


యము ప్రియ విస్ఫురణమ్ములు
అరుగువేళ నిస్వనములు
అతడి రెండు రేచులపుడు
అతి జడములు భయదమ్ములు.


ఒక పురుషుడు


నిలచి యున్నయది ఆయమ
చలన రహిత ప్రతిమరీతి
స్రవియించిన వొకటొకటే
శారీరక లక్షణాలు.


ఒక స్త్రీ


అస్తికలును, రక్తమాంస,
మాయె - తుములనయనవారి
కలిసి -నిత్య స్థిరతనొందె
కదలిన వొక సెలయేరై.

ఒక పురుషుడు


అనుపమ జలరజ్జు వొకటి
ఆ కళిందనుండి సాగె
అది స్రవంతి, స్రోతస్విని
అయి నదించె సమతలాన.


స్త్రీలు, పురుషులు


యమి పరివర్తనమొందెను
యమునా నది అయిపోయెను.

ఆదిత్యుడు కిరణమ్ముల
నాపివైచె రానీయక
సత్వరమే జనియించెను
సమ్మోహన మృదుల శోభ.

అతిశయ శోకాకులితయు,
అధికాధిక రమణీయము,
నైన శక్తి కదలించెను
అమిత శప్త నీరమ్ముల.

యమి పరివర్తన మొందెను
యమునానది అయిపోయెను.


"యమ యమి సంవాదం" ఋగ్వేద సంహిత దశమ సూక్తం. షష్ఠ అధ్యాయంలో షష్ఠ, సప్తమ అష్టమ వర్గాలల్లో ద్యోతకమవుతున్నది అని చెప్పి స్వతంత్ర పత్రికలో (సెప్టెంబరు 1948) శ్రీమతి మంజేరీ. యస్. ఈశ్వరన్ ఇచ్చిన వైదిక కథాకథనం ఆధారంగా జులై 1950లో వా. సో రచించిన "యమ - యమి" అనే వైదిక కథాగేయ శ్రవ్య దృశ్య నాటిక.


1950లో ముద్రితం

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.