వావిలాల సోమయాజులు సాహిత్యం-2/గేయనాటికలు/నిర్ణేత
నిర్ణేత
స్వరమేళ
పడతుల నిరువుర నెవ్వరు
పరిణయమాడగ రాదని
నారీజన గౌరవమున
నరపతి శాసించె గదా!
అచ్చరలను తలదన్నిన
మచ్చెకంటి యొకతె వచ్చి
విచ్చిన తన పతి మెచ్చక
తెచ్చెను నే డభియోగం
న్యాయసభా నిర్ణయ మీ
నాడు జరుగు వినరండీ!
నిశిత బుద్ధి కుశలత గల
నిర్ణేతను గనరండీ!
అదిగో, ఆలయ ఘంటిక
పది దిక్కుల మార్ర్మోగెను,
సర్వేశ్వరు సన్నిధి ఇది
సభ మొదలిడ సమయమయ్యె!
పరిషజ్జన వరులారా!
పరమ న్యాయవిదులారా!!
కోవిదు లౌ మీ రెల్లరు
కోప మడిగి వినుఁడయ్యా!!
ఆశా భయ భావములతో యుగళి
అరుదెంచిరి వీరిచటికి
వాది, ప్రతివాది - వీరి
వాదములం దెది సత్యమొ!
అవినీతికి తావీయక
అంతరంగ సుపరీక్షల
రవిచంద్రులె సాక్షులుగా
లలితమతులఁ బరికింపుఁడు
రాగద్వేషముల విడిచి
రాజశాసనోచితముగ
న్యాయ నిర్ణయమ్మే మీ
ధ్యేయముగా మెలగుడయ్యా। (వలయు)
రాగద్వేషముల విడిచి
రాజశాసనమును వలచి
నిర్ణయమును చేసి మీరు
నీతి నిలను నిలుపవలయు
దేవారికుడు
గద్గద కంఠమునతో నీ
కాంత - వాది - ఎటు పలికిన (ఎది)
కాదని ఈ మొప్పెవాడు
కఠినోక్తుల బెదరించునొ
ప్రతివాది
న్యాయ నిర్ణయము చేసే చేసెడి
ఆయతన మ్మిదియేనా?
ఇదియే ఆ ఆయతనము
అదె నిర్ణేతల పరిషత్తు
ప్రతివాది
(స్వగతము)
పొడుచుకొని తిని బ్రతికిన ఓ
పోట్లమారి కుక్కుటమా!
అహము విడిచి మెలగుము నీ
గ్రహబలమ్ము మారెనులే (మారిపోయె)
అందరు
ఎవరవు నీ విచటి కిప్పు
డేమి కోరి వచ్చితివి!
ప్రతివాది
పడయగ నే న్యాయ మ్మిట
ప్రతివాదిని వచ్చినాను
పరిషత్స్వర మేళ
పరిషత్తున కీ వెవర. వో
పరిచయమై పోయెనులే
బుద్ధి
దుష్టాత్ముడు నీ వంచును
తోచె మున్నె మా కెల్లరకును
ఓరి ఓరి పాపిష్ఠీ!
ఉవిదను శ్రమపెట్టితివా?
క్రూరశిక్ష తప్పదు మా
కోపాగ్నికి బెగ్గడిలుము
ప్రతివాది
చిత్రముగా నన్న దపుడె
చేసితిరా నిర్ణయమును
సావధాన చిత్తముతో
సర్వము విని సెలవీయుడు
ఇందలి ప్రతివాదమ్మెదొ
ఎరుగరు మీ రందరు మాత్రము
ఏకపక్ష వాదము విని
ఏల నిర్ణయించెద రిటు
పరిషత్స్వర మేళ
నిజము! నిజము!! ప్రతివాదీ!
నీ వాదము వినియెద మిదె
వివరముగా వినిపింపుము
విని చేతుము నిర్ణయమును
ప్రతివాది
జయ మదనా! యువజన మన
ఘన సదనా!! జయ మదనా!!
నా పూర్వ ప్రేయసి ఈ
నళినలోచనను చూచితి
దివితారక నాకొరకై
దిగివచ్చిన దనుకొంటిని
ఉపమీపగ నీ జగాన
నోపెడునది కననైతిని
కడువిరాళి వివశుడనై
కామార్తికి లోనైతిని
ప్రణయరుజా జుర్జరితుడ
పద సరోజముల వ్రాలితి
సర్వసంపదలు కాన్కగ
చరణాంతికమున నిలిపితి.
నవవసంత శోభలతో
నడిచె కొంత జీవితమ్ము
నెచ్చెలితో బ్రతుకు నాకు
అచ్చపు వెన్నెల యైనది
నిత్యసౌఖ్య మొదవిన నది
నిస్సారమ్మగును గదా!
ఏ మార్పును లేని వలపు
ఎడద కరుచి నొసగు కదా!
ప్రకృతి నేర్పె పాఠము - నా
ప్రణయబంధ మెటూ సడలెను
తొలుతటి యీ నా ప్రణయిని
తోచసాగె పెను పీడగ
జిగి మెరపుల నిగనిగలతో
చెలియ యొకతె చేరి నవ్వె!
వెలిగెదు నా యెద (మది) లో నొక మరి
జిలుగు వెలుగు వలపు దివ్వె!!
తొలుత తొలుత కళవళ పడి
మ్రొగ్గకి నే సిగ్గిలి తిని
కాము డెంత ధూర్తుడొ - నను
కరుణ వీడి వేధించెను
నిశిత కుసుమ శర పీడకు
నిలువలేక దిగజారితి
తుద కే నొక యదయమ్మున
తొయ్యలి కౌగిలి నొదిగితి!
అపుడీయమ నా ప్రణయిని
ఇపు డాయమ నా ప్రేయసి
ఎవరి తలపు గైకొందును!
ఎవరి వలపు కాదందును!!
-జయమదనా!
పరిషజ్జన స్వరమేళ
(ఒక పారిషదుడు)
యువకుడనై యున్నవేళ
ఉన్నవాడ నే నిటులే!
ప్రతిదినమును నవ యువతీ
ప్రసవరసము సేవించితి
కామాంధ్యము గ్రమ్మిన యా
కాల మెపుడొ గడచిపోయె
ఇపుడు నేను సుచరిత్రుడ!
ఎల్లరకును 'పూజార్హుడు'!!
కరుణ యించుకయు నా మది
కలుగదు ప్రతివాది మీద
భయభావముతో నాతఁడు
పరికింపగ వలయు మమ్ము!!
ఒయ్యారపు నడకలతో
నోలగమున పాడెదేల?
న్యాయమ్మే మా ధ్యేయము
న్యాయమె మా నిర్ణయమ్ము!
న్యాయసభా మర్యాదల
నయమున పాటింపవలయు
నిశ్శబ్దము! నిశ్శబ్దము!!
నిర్ణేతకు నతు లిండు!!
(సభా నిర్ణేత వచ్చువేళ నందురును
గౌరవముతో లేచెదరు)
స్వరమేళ
జై నిర్ణేతా!
ధర్మ త్రాతా!!
ఈర్ష్యా ద్వేషము
లెరుగము నీపై
సత్యరధానికి
సారధి వీవు
నిను స్తుతియింపగ
వెనక యెరుంగము!!
శాస్త్రము లెరిగిన
చదువరి వయ్యా!
ఆచారమున నీ
హస్తామలకము!!
నిర్ణేత
(ప్రవేశిస్తూ)
విజ్ఞుడనో, అజ్ఞుడనో
నిలిపెను విధి నిర్ణేతగ
ఆశీస్సులు గాగ వీని
నార్యులార గ్రహియించెద!
వైవాహిక విషయమ్మున
వాగ్దానము చేసి యొకడు
భయము గావించినాడు
పరికింపగ వలయు మనము!
కాని తొలుత మీరెల్లరు
కాలహరణ మనని యెడల
ఎటు నిర్ణేత నైతినొ
ఎరిగించెద తొలుత సుంత!
ఉడ్డీనము నందు చదివి
యువకుడనై యున్నపుడే
నరపతి నగరమున నేను
న్యాయవాది గా వచ్చితి
ధనహీనుడ నగుట చేత
ధరియింపగ జాలనైతి
కలవారలు నను జేరగ
పలు వన్నెల జిగివలువలున
తారహార. దీప్తులతో
తనుపదు నా వెడద యురము
మణికంకణ కింకిణి కురరు
కరరు లెరుగదు నా కరము!
తలపాగకు చుట్టనైతి
నెలవంకల చిరుబేరులు
ఎంత చదువు కొన్న నేమి?
ఇటు నడచె నా తీరులు!
నాలుగేండ్లు సభ కేగిన
న న్నెవ్వరు చేరరారు
నా వలెనే యువకులచట
నలిగిపోవుచున్నారు.
చేరక చేరక యొక పరి
చేరినాడు సెట్టి యొకడు
అభియోగ మ్మతని కెంతో
అనుకూలముగా నున్నది
మరల నొక్క యవకాశము
దొరుకునొ లే దోయని నే
నేరము తప్పించుటకై
వీరవిహారము చేసితి.
న్యాయభలో దశదిశలను
నా కంఠమె మార్ర్మోగెను
కోవిదు లాశ్చర్యమొదవ
గొప్పగ నను పొగడినారు!
ఐన నేమి ఫలమున్నది
అభియోగము వీగినది.
మ్రగ్గి మ్రగ్గి సిగ్గిలితిని
మరణమె మేలను కొంటిని!
నాల్గు నాళ్లు గడచిన యెడ
నాకును నీ లోకమునకు
తీరిపోయెడిదొ యేమో
మారిపోయినాను నేను.
పెండ్లి కాక తండ్రి యింట
పెరుగుచున్న దా కురూపి
నా కన్నను వయసున పదు
నాలుగేడు లైన మిన్న.
రాజవాది నందన కడు
రసిక ప్రియ యని వింటిని
కలిసి - కనులు కలిపి చూచి
“కంజాక్షివి నీ” వంటిని.
పల్లకి బోయీల కేక
పడినది చెవి మరునాడు
చేరనీని ఆమె తండ్రి
దారి వెదకి వచ్చి అనియె
“అల్లుడ వై నంతనె నీ
వగుదువోయి ధనికుడవు!
ఆమె రూపమూ అది నీ
కలవాడై పోవును లే!
పెద్ద యనెడి సంశయమును
వద్దు నీకు మానసమున
పదునారేడుల కన్నియ
పగిది తోచు మునిమాపున.
ఆశ నన్ను నడిపించెను
అంగీకారము తెలిపితి
ఆమెకు నాకును పరిణయ
మతివైభమున జరిగెను.
అన్నమాట నిలువ బెట్టి
నధికముగా రాజవాది
ఏ మొనర్చినాడో మరి
ఎరిగినవా డా దైవమె.
అభియోగము లిచ్చుకొరకు
అందరు నా కడ మూగిరి
నను మించిన న్యాయవాది
నగరమ్మున లేడాయెను.
అన్నివేళలందుననా
ఆరభటీ ముక్తకంఠ
నినదమ్ముల ప్రతిరుతులే
నిండె న్యాయ మందిరాన.
బందిపోటు దొంగలకును
బహువిధ నరహంతకులకు
కాంతాజన మానహరణ
ఘనధూర్తుల కైతి ప్రాపు
ఓపి నాకు శుల్క మొసగ
ఉరిశిక్షలు కరవైనవి
కారాగృహ బంధనములు
దూరములై పోయినవి.
కొలది కాలమునకు నేను
కోటికి పడగెత్తి నాను
భోగభాగ్యముల పురమున
పోలరైరి నన్నెవ్వరు.
నా పాండితి చెవి కెక్కిన
నరనాథుడు మెచ్చి నన్ను
నిఖిల రాజ్య న్యాయసభకు
నిర్ణేతగ నియమించెను.
ఆ కురూపి, పెద్దదాని
అవల కెటులో గెంటివైచి
స్వర్గసౌఖ్య మబ్బినటుల
సంతసించినాను నేను.
అపకీర్తిని గల్పింపగ
అపుడు రాజువాది యెన్ను
పన్నెను నరామీద కాని
ఫలము శూన్యమై పోయెను
అభియోగము నే డెదొ మీ
కందరకును తెలిసినదే!
పరిణయ వాగ్దానమునకు
భంగపాటు జరిగినది
వైవాహిక బంధమునకు
భంగము కల్పించితి గద!
నిర్ణేతగ నే తగుదున
నిశ్చయింతు శిక్షయెదో!
పరిషత్సభ్యులు
తగుదు నీవె నిర్ణేతవు!
తగ తీర్పును ఈ వ్యాజ్యము!!
నీవె నీవె నిర్ణేతవు
నీ వుత్తమ నిర్ణేతవు!!
నిర్ణేత
ఏనే నిర్ణేతనైన
ఎక్కెద నీ గద్దియపై
స్వరమేళ
అగుదు నీవె నిర్ణేతవు
అత్యుత్తమ నిర్ణేతవున
న్యాయమ్మేదో నిర్ణయింప
నా గద్దియపై నెక్కుము!
నిర్ణేత
వంచనయే నా న్యాయము - ఐన
వ దలను నే నీపదవిని
నిర్ణేతగ జీవించెద!
నిర్ణేతగా మరణించెద
వాది వాది
(పరిషత్తులో)
విబుధావర్యులారా! ఏది
వినిపింపుడు మీ శపథము
అధమాధిక వర్గంబుల (అధికాధమ)
కభియోగము లొదవు నిచట!
ధనవంతులు, ధనపిశాచులు
మనను న్యాయ మడిగెదరు.
జంకకయ యెదలోన దుడుక
సంకోచము వీడి మీరు పక్షపాత
రహితముగా
పలుకవలయు న్యాయమేదో!
పరిషత్తు
ఎవరిదైన నభియోగము
రవిచంద్రులె సాక్షలుగా
తీర్పు నిచ్చి దుఃఖమ్ములను
తీర్చెద మిది మా శపథము!
వాదివాది
వాది యెచట! వనితగదా!!
వచ్చినదా న్యాయసభకు
దేవారికుడు
జలజనయన! జలజ నయన!!
సభలోనికి రావమ్మా!
వాది చెలికత్తెలు
భాసురసుమవల్లి యీమె
బహువంచన పాలైనది
జలజ నయన రావమ్మా!
సభలోనికి రావమ్మా!!
చిరుత గాలివాన యైన
చెదర మేఘ గర్జలతో
అపరూపము నీ యందము
అయిన వీని గైకొనుము
(పూలగుత్తు లందింతురు)
హసనమ్ముల భ్రమలు గొలుపు
ప్రసవ వల్లికల గెలవుము - జలజనయన
వాడి వత్త లగువరకును
వల్లి! వీనిధరియింపుము
జీవితమ్ము సుఖమయముగ
చెలగుగాత నీకు చెలీ!
వాది
కాలమనెడి రాజ రాజు
కడు గడుసరి క్రూరాత్ముడు
ఏ ఋతు సామంతునైన
ఇల నిలువగ నీడు సదా!
అవకుంఠన పాలు సేసి
అవధులు దాటించి తరుము
అతని కట్టి దొక లీల!
అతనితో మనకేలా!
నితరమ్మును అతపమే
నిత్యమగుటయునుమేలా?
ప్రసవంతతుల కయ్యది
పరమదుఃఖ హేతువు కద!!
వెలుగునీడ లొకటొకటిగ
వెనువెనుకల వచ్చినపుడె
ప్రసవవల్లులకు జగమున
పరమసుఖద జీవనము
శీతల హృదయుండైనను
శిశిరుడు కడు నందగాడు.
అతని యంద చందములవి
అనవరత మ్మాతనివే
ఛాయా తప కలితముగా
సాగు బ్రతుకె సుఖమయము!
జీవితమిటు మారెననుచు
చింతలేదు ఆవంతయు!!
కాలమనెడి రాజరాజు
కడు గడుసరి, క్రూరాత్ముడు!
ఏ ఋతు సామంతుడైన
నిల నిలువగ నీడు సదా!
పరిషత్యభ్యుడు
ఇంత అందమౌ మోమును
ఏ నెన్నడు చూడలేదు
పరిషత్తు
చూడలేదు మున్నెన్నడున
సుందరి నిటువంటిదాని
ఓరి ఓరి మొప్పెవాడ
ఉవిద నీమె విడిచెదవా?
నిర్ణీత
(పరిషత్తులో)
బలవంతముగా నైనను
పరిణయమాడగ నీమెను
ఆ విధాత తీర్చిదిద్ది
అవని జనుల కొసగ లేదె?
పరిషత్తు
ఏకగ్రీవముగ దీని
కెల్లరమును నొప్పుకొందు
వెల్లరమును జితులమైతి
మీ చేడియ యందమునకు
వాది
జాలికి లోనై మీరులు
చాలదూర మేగినారు
పరిషత్తు
నీ మీదను జాలి (కరుణ) మాకు
నిండియున్న దీ యెడదల
వాది చెలికత్తెలు
(పరిషత్తులో)
ఎత్తులపై నెత్తు లేయు
జిత్తుల నక్కలు వీరలు
వాది వాది
శపథమ్ములను త్రోసిపుచ్చి
చాలగ నెద తను నమ్మిన
నాతి మోసగించుటలో
నరుడింతటి నీచజనుడె!
ఎరుగక నే మున్నియ్యది
ఏదో యుద్వేగమ్మున
ఆర్యులార! వాదింపగ
నభియోగము చేపట్టితి!!
వాగ్దానము త్రోసిపుచ్చి
శపథమ్మును త్రోసిపుచ్చి
వనిత నితడు మోసగించె
సతి నీతడు మోసగించె!
వాది వాది
(వాది వాది వాది యెదపై దుఃఖించుచు
వాలును)
కనుడు వాది నార్యులార!
కన్నీ రిదె మున్నీరు
ఎద యెరుగని క్రౌర్యమునకు
ఎంతగ బలి యై పోయెనొ!
త్రోసి పుచ్చి వాగ్దానము
ద్రోహి, అదే ప్రతివాదెట
చేదునవ్వు భయ మెఱుగక
చిలుకుచున్నాడు కనుడు
సిగ్గు దొంతరల తెరలతో
చెలి యాతని పిలిచె తొలుత
మందహాస మకరందము
లందించిన దామెతలుగ
అందరు
సిగ్గు దొంతరల తెరలతో
చెలి యాతని వలచె తొలుత
మందహాస మకరందము
లందించిన దామెతలున
వాది వాది
మాట నిలుపజాలని యీ
మగవానితో మా వాదికి
మకరంద క్షణము లెన్నో
మహిత వేగముగ గడిచెను
పూరిళ్ళే పొదరిళ్ళుగ,
పురతరులే నందనముగ,
వేసగి మధ్యాహ్నమ్ములు
విరివెన్నెల వెలుగులుగా
శపథమ్ములను చెల్లింపని
జను డీతనితో వాదికి
మకరంద క్షణము లెన్నో
స్మరసేవనలో గడిచెను.
అందరు
పథితరులే నందనముగ
పర్ణకుటులె సౌధములుగ
మకరంద క్షణము లిటులె
మాకెల్లరకును గలుగుత
వాది వాది
గాంధర్వమ్మున నీమెను
గాంధర్మమ్మున నితడీ
కడగి పెండ్లి యాడినాడు
కనకాంగిని పొందినాడు
పలుమారులు వలపు తెలిపి
పడతీ! పతి ననినాడు!
పదిమందికి నెఱుక పరుప
పరిణయదిన మెదొ తెలుపగ
పట్టుపట్టి వాది యడిగె
పరమదీన హృదయముతో
భావింపుడు ప్రతివా దెవొ
పలుకుచు చిరు
సాకులు కడు
దూర దూరముగ కాలము
త్రోసిపుచ్చి మోసగించె
దోషమ్మది ప్రబలమయ్యె -
వసనమును విలిచి, ఎల్ల
వారి కెరుక పరిచినంత
కనబనడుటే మాని అన్య
వనిత నొకతె గైకొనియెను.
అందరు
పెండ్లి చెరచినాడా ఇది
పెద్ద దోష మౌను గదా!
వాది వాది
(దుఃఖించుచున్న వాదితో)
ఉత్సాహము వీడకు మో
ఉజ్వలరుస సుమసుందరి!
పరిషత్తు
ఎల్లర. కును నీపై వల
పేర్పడియెను -శోకమేల?
(వాది వాది వాదిని ప్రశ్నా స్థానము కడకు
నడిపించుచు గొనిపోయి నిలిపి
సెలవుగైకొని తన స్థానమునకు వచ్చి
నిలుచును. వాది వ్రాలిపోవుచుండును).
నిర్ణేత
కళవళ పడి వ్రాలిపోవు
గతితో చెడి నీ నెలంత!
వేత్ర హస్తుడు
నా యెదపై నాను మదే
నాతి! శాంతి నీ కొదువును
(వేత్ర హస్తుని ఎదపై వ్రాలి కొంత
తేరుకొని)
వాది
ఒంటరిగా నను విడిచిన
ఊరకనే లేరు కొందు
అందరు
(పిడికిళ్ళు చూపుచు ప్రతివాదితో
దోషినైన ఓ ప్రియుడా!
త్రోవ యేదో తెలుపుమోయి!
(తెలియు మీవు)
వేత్రహస్తుడు
పితరునివలె లాలించెద
భీతిగొన్న ఈ వనితను
(ఓదార్చుచున్నట్లు మోముపై
ముద్దిడుకొనును)
నిర్ణేత
(ముందుకు వచ్చి)
ఇచ్చగొన్న ఓ సుదతి
ఇట వ్రాలుము శాంతి కొఱకు (వక్షమును
జూపు)
(నిర్ణేత ప్రక్కకు చేరి అతని యెదపై
వాలును)
వాది వాది
నీరమ్మును గొన రండిదె నీరము గొని
రండీయెడ
నిలుపగ నీయమ ప్రాణము
అందరు
(ప్రతివాదితో)
భయద హత్య చేసినావు
పశ్చాత్తాపము నొందుము
పరిషత్తు
(ప్రతివాదికి పిడికిళ్ళు చూపించుచు)
ఉగ్రకోప మొదవెను మా
కో రాక్షస! ఓ రాక్షస!!
నిర్ణేతయతం డిచ్చట
నిలిచినాము పారిషదులము!!
శిక్ష నీకు ఘనమైనది
సిద్ధపడుము చేకొనగా
ఉగ్రకోప మొదలెను మా
కో రాక్షస! ఓ రాక్షస!
దౌవారికుడు
(నిశ్శబ్దమును కోరు ఘంటిక మ్రోయించి)
నిశ్శబ్దము! నిశ్శబ్దము!!
నిర్ణయమిక వెలువడును
ప్రతివాది^
వినుడు వినుడు ఎల్లరు నా
విన్నపమును శాంతముతో
మారెను నా మానస మీ
మగువపైన - ఒప్పుకొందు -
ప్రకృతి సేయు శాసనములు
పరమరక్తి ననుసరింతు - వినుడు
వినుడు
ప్రకృతి నిత్యమును మారును
పరిపరిరీతుల నెల్లెడ
శుక్ల కృష్ణ పక్షమ్ములు
వినుడు,
చూడ శశికె కలవు గదా! వినుడు
వినుడు -
ఏ ఋతువును నిలకడగా
ఇల నిలువదు చిరకాలము
పండుగ లిల నెయ్యవియును
ప్రక్కప్రక్కగా నుండవు.
ఇటులే ఈ మగువపైన
ఎద నిలచెను నేటివఱకు
రేపటివేళను మరియొక
రేరాణిని వలచె తలచి.
ధర్మమెదో గమనింపుడు
దయచేయుడు నిర్ణయమును
యువకు నొకని దుఃఖోదధి
యోజింపక త్రోయకుడు.
వాది చెలికత్తెలు
(ముందుకు వచ్చి పరిషత్తుకు
నమస్కరించి)
ధర్మమేదో గమనింపుడు
దయసేయుడు నిర్ణయమును
యువతి నొకతె శోకజలధి
యో జింపక త్రోయకుడు
ప్రతివాది
పర్యుషితము తృప్తి నీయ (నొసగు)
బలము కలది యా నిరతము
అది రుచింప కున్న యతడు
అడుగును గద ఉష్ణాన్నము!!
తిండిపో తటంచు వాని
తిండిపోతు వాడటంచు
తీర్పు చెప్పన్యాయమ్మా
ఐనను నే నొక సంధికి
అంగీకారము తెలిపెద! (నొసగద!)
పరిణయ మాడెద నీ
పడతిని నే నీదినమున
రేపు మీర లొప్పిన నా
రేరాణిని పెండ్లాడెద
వాది చెలికత్తెలు
(వెటకారముగ)
పరిణయ మాడును తమి నీ
పడతి నీత డీ దినమునన
రేపు మీర లొప్పిన తన
రేరాణిని స్వీకరించు
పెండ్లి యాడు, పాప, మ్మీ
పడతి నీత డీ దినమున
రేపు మీర లొప్పిన తన
రేరాణిని పెండ్లాడును!
నిర్ణేత
మంచి సూచనగా నియ్యది
మాకు తోచుచున్నది - మరి
ఇందుకు మీ వాది యిప్పు
డేమి చెప్పఁ దలచినదో!
వాది వాది
వినయముతో నే నీయది
విన్నవింతు నిర్ణేతా!
ఇరువుర పరిణయ మాడుట
ఈ దేశమ్మున చెల్లదు
(ధర్మ శాస్త్ర గ్రంథమును తెరచి చూపును)
అందరు'
కోవిదుడవు వాది వాది
కోవిదుడవు న్యాయవాది!!
నిర్ణేత
చిత్త శక్తి పట్టి చూచు
చిక్కు మనకు ప్రాపించెను
వాది వాది
ఇట్టి పరిస్థితిలో నిది
ఎటల తీరు మీవలన
ప్రతివాది
(ప్రశ్నా స్థానమునుండి)
ఎద నిలువని ఇంతిని నే
నిటుల పెండ్లి యాడినచో
భంగపాటు తప్ప దనుచు
భయపడు చున్నాడ నిపుడు.
ఇరువుర పరిణయ మాడిన
ఇతడు 'చోరు' డౌను గదా! (సుమా!)
అందరు
చిత్తశక్తి చూడ జాలు
చిక్కె మనకు ప్రాప్తించెను.
వాది ప్రతివాది
(ప్రతివాదిని ఒకరినొకరు గట్టిగా
పట్టుకుని)
ఇతనినె నే పూజించెద!
వలచినాను!
ఇతనినె నే సేవించెద!!
కొలిచెదను!!
ఎద దోచిన ఈతని నే
నెంత వలచితినొ కనుడు
ఈ తరుణుడు విడిపోయిన
ఎంతటి వ్యధ నాకగునో
ప్రణయ లాలనల ప్రౌఢుడు
ప్రసవ శరాసన సముడు!
విన్నపమును విని మీరలు
ఎన్ని రూప్యముల దండుగ
ఇతనికి విధియింతు మనుచు
ఎంచుచున్నవారు మీరు
ఇతనిని నే ప్రేమించితి
ఇతనినె నే సేవించెద
ఇతడు కాక యన్యుడైన
ఎంతగ కోల్పోవుదునో
ప్రతివాది
(వాదిని త్రోసివైచుచు)
మొప్పెవాడను, త్రారనగుబోతును
తిట్టెదను కొట్టెదను నిను
తప్పత్రాగిన వేళలందున
తన్ని పంపగ వెనుక చూడను
(పరిషత్తులో
చెడ్డవాడను, గడ్డువాడను,
చిత్తమందున నిలుపవలయును,
క్షణము కాపుర మీమె సేయగ
జాలునా ఈ మొరటువానితొ
దండుగెంతగ నీయవలెనో
దాని నిర్ణయ మీ రొనర్చెడి
తరుణమున నెద నిల్పుడియ్యది
తప్ను నిచ్చుట కొప్పుకొందును
(గాఢముగ కౌగలించిన దానిని
బలవంతముగ త్రోసిపుచ్చును)
పరిషత్తు
క్రమ నిర్ణయమును చేసెడి
కాలమందు మాకియ్యకది
కలిగినదే - ఎటు గనినను
తొలగని దే చీకాకిది
నిర్ణేత
మొరటువాడు నని పలుకుచు
మోసగింపదలచు నితని
మాట యెంత నిజమో మరి
మనము చూడ వలయు గదా!
త్రాగియున్న వేళయందు
తన్నెద నని పలుకు టెంత
సత్యమ్మో మన మీయెడ
సయిపవలయు సుపరీక్షను
తెప్పింతము మైరేయము
ఇప్పింతము వీని, వెటల (ఇతని)
మత్తుగొన్న సమయమ్మున
మసలు నొ మరి పరికింతము!
వాది వాది
ఇందుకు నే నొప్పుకొనను
ఇది సముదాచారమ్మా?
వాది
ఇది సముదాచారము కా
దిందుకు నే నొప్పుకొనను
ప్రతివాది
ఉన్న సత్యక మెరుక పడును
ఒప్పుకొందు నిందుకేను
సర్వ మెఱుక పడును గాన
సలుప వలయు మీ పరీక్ష
అందరు
సముదాచారము కానిది.
సలుపగా దీ పరీక్ష
నిర్ణేత
శాస్త్రాచారముల భయము
సకలము మిమ్మావరించె
బహుకాలము గడచె మాకు (మేము)
బయలుదేరి పోవలయును
శివపూజా సమయమ్మును
చేరికయ్యె నెల్లరకును
వెడలగ మీ మీ ఇండ్లకు
కడగుడు మధ్యాహ్నమయ్యె
దేవారిక! గ్రంథమ్ముల
తట్టి అరలలో నిలుపుము
సభ చాలింపగ సర్వము
సంసిద్ధము సేయవోయి!
ఇదిగో మా నిర్ణయమును
ఎల్లరు విన పలుకుచుంటి
ఎల్లరు కన వనితను
ఏనె వివాహమ్మాడెద
(ఆసనము నుండి దిగి వాదిని
చేరదీయును)
వాది
అమితానందయ్యొదవెను
అఖిల సంపదలు కలిగెను
దుఃఖతిమిరములు తొలగెను
తోచెను నవ్యోదయము -
వాది వాది
వలపు తలపు మిక్కుటముగ
కలికీ నిను గైకొనియెను
సర్వ సంపదలు సుఖములు
సరగున నిను జేరినవి
కనక సౌధ సీమలలో
కాముసేవ లభియించును
నీ మమ్మున నేజన్మ నొ
నీవు శివుని గొల్చితివి
ప్రతివాది
సతి పతులుగ నీ యిరువురు
సలుపుదురే జీవయాత్ర, పగలరె
మది సంశయ మొదవెను నా
కది తీరదు - ఇది సాగదు
దేవారికుడు
నెలత నీమె చూచినతరి
నిర్ణేతను తలచిన మరి
ఇతడు దొడ్డ నిర్ణేతని
ఇదె తోచెను నా మదిలో
నిర్ణేత
నిర్ణేతను నిర్ణేతను
నిర్ణేతను
అందరు
నిర్ణేతవు నిర్ణేతవు
నీవుత్తమ నిర్ణేతవు
నిర్ణేత
నిర్ణేతను నిర్ణేతను
నిఖిలరాజ్య నిర్ణేతను.
అందరు
నిర్ణేతవు నిర్ణేతవు
నీవు దొడ్డ నిర్ణేతవు
నిర్ణేత
నా న్యాయము మోసమ్మని
నలుదెసలలో మార్ర్మోగగ
తిరిగి యిండ్ల కేగునపుడు వేళ
తెలుపు డార్యులార మీరు
అయిన నేమి నిర్ణేతును
అత్యుత్తమ నిర్ణేతను
అందమునకు ఫలమేదో
అరసి తెలుపు నిర్ణేతును
అందరు
నిర్ణేతవు, నిర్ణేతవు
నీవు దొడ్డ నిర్ణేతువు!
అందమునకు ఫలమేదో
అరసి తెలుపు నిర్ణేతవు.
(1-1-1968)
అముద్రితం
This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.