Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-2/గేయనాటికలు/ధర్మ ఘంటిక

వికీసోర్స్ నుండి

ధర్మ ఘంటిక

1

(కాంచీ నగరము - అర్ధరాత్రము - రాజసౌధము)

మనునీతి


అవిగో ఆకాశంబున అపసూచన లెన్నెన్నో!
రూపరిపోవుచు నున్నవి రూఢిలేక ఋక్షంబులు!
పడిపోవుచు నున్న వవే పలురిక్కలు నిముసములో!
రాకాయామిని వేళల రానేలా యంధతమము!
వేచెడు నా మానస మీ విధికృత్యము లీరోజున
ఈయపదర్శసములు నా కేమపకీర్తిం దెచ్చునొ!
ఏవిలయము రానున్నదో ఈ చోళధరాలతలమున!
కాశబ్దం బేమి యగునొ! అంబాకృప యెట్లున్నదొ!


సౌవిదల్లుడు


న్యాయమును కాంక్షించి నరనాథ! ఎడతెగక
అర్ధరాత్రమునందు అచలములు మార్ర్మోగ
ధర్మఘంటిక నెవరొ తట్టుచున్నా రచట.


మనునీతి


కర్ణంబులు చిల్లులువడ కలకల మాకర్ణించియు
తలపోయగ లేనై తిని ధర్మఘంటికా రవముగ!
నాకనులకు కనుపించిన నానా యశుభంబులు నా
మతి యంతయు కళవళించి మార్పేమియొ చేకూర్చెను!
ఈ నిశీధి నీవిధమున నెంత ప్రబలకారణంభ
ఆగ్రహణం బనరింపగ నతని, కేమిచేటయ్యెనొ!


కనుల నేమొ చీకట్లిట కప్పివేయు చున్నవకట!
సౌవిదల్ల! పాలకునకు సౌఖ్యము మృగ్యమ్ము కదా!


సౌవిదల్లుడు


ఆయాసము జెందనేల అకాండమ్ముగా దేవర,
అనుమానము పోద్రోలుం డాధిపాలు కాబోకుడు!


మనునీతి


అయ్యో! ఇది యేమి వింత అపరాధిగ నా మ్రోలను
కనుపించును కన్నుగవకు కన్నకుమారుని మూర్తియె!


సౌవిదల్లుడు


స్వామీ! అనుమానంబులు చాలమిమ్ము బాధించెడు
తడవుచేయ నేల ప్రభూ! ధర్మఘంటిక గడ కేగగ?


మనునీతి


స్వానుభవం బంతయు నను చలియింపగ చేయుచున్న
దేమి వినగ నున్నాడనో! ఏమి విధింపగ వలెనొ!
అనెడు భీతి నామనమును అలముకొనగ నేనిప్పుడు
కాలంబును కొంతయైన గడప దలచి యీరీతిగ
ధర్మఘంటి కడ కేగక తట్టాడుచు నున్నవాడ!


సౌవిదల్లుడు


ధర్మమూర్తులౌ మీరలు తారాడిన నేమి ఫలము
తప్పదుగా దేవ, మీకు ధర్మఘంటి కడ కేగగ.
చోళులపై ప్రేమయె మిము స్రుక్కించుచు నున్న దిట్లు
సదయ హృదయు లౌ ప్రభువుల సౌజన్యం బే రెరుగరు?
అపరాధిని శిక్షించుట ఆర్యా, మీ విధి కాదే!
వెడలుదమా అచ్చోటికి వేళ చాల అయ్యె ప్రభూ!
శాస్త్రకారు లే విధిమిము శాసింతురో ఆవిధినే


ధర్మ ప్రతిపాలనకై దేవసాక్షిగా మీరలు
భగవ న్మనునీతిరీతి పాలింపగ పంతముగద!
కాలహరణ మేల స్వామి! కలత పడక విచ్చేయుడు.


మనునీతి


ఏ విధినో నా మన మిపు డిచ్చగింపకున్న దార్య!
తమరే యా తప్పిదమును ధర్మామాత్యుల తోడను
విని శిక్షింపంగ దగును విధి పూర్వక మపరాధిని.


సౌవిదల్లుడు


ఆచారము విడువకయే అపరాధిని శిక్షించుట,
నయమటంచు నే ననియెద న్యాయమూర్తు లౌ మీరలె.


మనునీతి


ఎన్ని మహాపాపంబులు ఏను పూర్వజన్మంబున
చేసితినో పుట్టినాడ జీవహర్తగా భూస్థలి!


సౌవిదల్లుడు


ఎంతమాట! మహారాజ! ఈ విధాన ధర్మమూర్తు
లౌట యెన్ని జన్మలలో నాచరించు పుణ్యమ్మున.


మనునీతి


పూర్వపుణ్యసంచితంబ పూర్వపాపకర్మఫలమొ,
వేలారహితం బగుచును వెర్రియెత్తు చున్నది మది.
కనులు తిరిగి పడిపోదునో కాచియుండు డధ్వమ్మున
బయలుదేరు డింక ఆర్య! వరదరాజనుతి తోడను.


సౌవిదల్లుడు


జయ, జయ, మనునీతిచోళ, జయ, జయ, మనుధర్మపాల!
జయ, జయ, శ్రీన్యాయమూర్తి, జయ, జయ, హృతప్రజార్తి!

2

(ధర్మఘంటికా ప్రాంగణమున)

మనునీతి


న్యాయము నాకాంక్షించుచు నా ఘంటిక మ్రోయించిన
యాతని నన్వేషింపుం డచిరముగా సౌవిదల్ల!


సౌవిదల్లుడు


ఈ పున్నమి వెన్నెలలో ఎటనుండెనొ కానరాడు
ఏడీ ప్రభు! వాడెటనో ఇరులలోన నుండి యుండు.
కాన్పించును వెదకినచో కంచుకాగడాలతోడ.
(ప్రక్కకు దృష్టి మరల్చి)
ఓ బోయీ! ఇటు రమ్మా ఉన్నాడో చూడవలయు
మర్రిచెట్టు క్రీ నీడల మాటుననే ఉన్నాడో!

(బోయీతో సౌవిదల్లుడు నిష్క్రమించును)


మనునీతి


చిత్తక్షోభ మ్మింతట చిన్నమైన తరుగలేదు.
ఏను ప్రజాపాలనంబు నెంతో ధర్మరీతితోడ
సల్పుచున్నవాడ నన్న సంతసంబు క్షీణించెను.
జీవితాస్త మయమునందు చెడు సంప్రాప్త మ్మగునో
నిలువ లేకయున్నాడను నే నీ ప్రాంగణమునందు.
దేశంబున ధర్మజ్యోతి దీపించుట కే తలచితి.

నాయౌవన కాలంబున నాటుకొనెం జిత్తుములో
హర్మ్యోపరిభాగంబున నిర్మింపగ ధర్మఘంటి.
వర్ధిల్లెను నా కోర్కెయు వరియించగ రాజ్యలక్ష్మి
శాసించితి నంతటనే స్థాపింపగ ధర్మఘంటి.


నడచెను నా దేశంబున నాల్గు పాదముల ధర్మము,
ఈ యుద్దమరేయివేళ యెట్టి తీర్పు చెప్పవలెనొ!
వరదరాజదేవకరుణ వర్దిల్లుత నా మీదను!
(క్షణమాగి)
చాల సేపు గడచినదే సౌవిదల్లు డేలరాడు.
ఎంతకాల మీరీతిగ నిచట నిలువ వలెనోగద!

(ప్రవేశము సౌవిదల్లుడు, గోపకుడు)


సౌవిదల్లుడు


ఇతడు దక్క నీ భూమిని ఎవడు కానరాడు నాకు,
ధర్మకాంక్ష క్ష్మాచంద్రుని దర్శన మర్థించు వార
లెవ్వరంచు మే మడిగిన నేడ్వ సాగె నెందులకో!
అంత అడిగినార మతని అరుదేరగ మాతోడను.
అధిపా, ఈనాటి కథన మాశ్చర్యము కొల్పు గదా!


మనునీతి


ఘంటాస్వన మొనరించుచు కార్యదీక్ష నున్నయట్టి
వాడెవ్వడొ తెలియు నేని వచియింపుము గోపాలా!


గోపకుడు


మడిసి కాదు మాబాబూ, మా భల్లావయ్య పెబూ!
వాయించిన దయ్య సామి, వరసంగా శానసేపు.


మనునీతి


కారణ మద్దాని కేమొ కనిపెట్టితె గోపాలక!
నీ వెరింగి నంత వట్టు నిర్భీతిగ జెప్పవచ్చు.


గోపకుడు


ఏమొ సామి, ఏమొ సామి, ఏమి యెరక నాకు పెబూ!
కల్లయెంట నీరు కార్చి కదలిరాదు మా రాజా!


కాని చోబ సూసి పెబూ! దండా లెడుతాను పెబూ!
కాళ్లు కదల లేదు దొరా! కదలలేక కూకుంటిని!

(తరువాత చెప్పుటకు జంకును)


మనునీతి


వెరచె దేల ఈ రీతిగ వెర్రివాడ, నా మ్రోలను
విప్పి చెప్పు మే మైనదొ విందుము సంపూర్ణమ్ముగ!


సౌవిదల్లుడు


స్వామికి చెప్పక జంకెద వేలా,
ఏమిది గోపక, ఇంతటి జాలము
చేయక సర్వము చెప్పుము తెలిసిన.


గోపకుడు


గుండెలు దడదడ కొట్టు కొంటాయి!
రచ్చించుము సామీ! రాజు కొడుకు సామీ!


మనునీతి


ఏమి చేసెరా ఓరీ! ఎందుకింత ఆలస్యము?


గోపకుడు


దయ యుంచుం డోసామీ! దడ దడ మంటవి గుండెలు
ఎందు కయ్య పో నియ్యం డేదో మా పెబువులయ్య!


మనునీతి


(విసుగు కొనుచు)
ఏమి చేసెరా ఓరీ! ఎందుకింత ఆలస్యము
నీ విప్పుడు చెప్పవలయు నిజము దాచి పెట్ట వలదు.

గోపకుడు


సెప్పమంటె సెపుతుంటిని సిత్తగించ వలెను దొరా,
సిన్న బాబు గారు విన్న సందెయేళ
రాజయీదిలోన రదము మీదపోగ
రాజా, నా భల్లావుది రంగైనది సిన్న పెయ్య
రాలి పోయె నండి పెబూ! రచ్చించం డయ్యె పెబూ!


సౌవిదల్లుడు


ఇంత కేన నీవింతగ నెంతో ప్రభు కాలంబును
చెప్పి సోదె, వృధా చేసినావు గోపాలక!


మనునీతి


గోపాలక నీ వింతట గోవుతోడ భమ్మింటికి
చేసి న్యాయ విచారణలు శిక్షయేమొ విధియింతును.

(గోపకుని నిష్క్రమణ)


సౌవిదల్ల, స్వానుభవము సర్వంబును దెలిసెగదా!
ఇంతకుమును మన మిచ్చటి కేగుదెంచుటకును మున్నె
కనుపించెగదా కంటికి కన్న కుమారుని మూర్తియె!
శిక్షార్హుడు నా సూనుడు చేసినట్టి తప్పునకై.


సౌవిదల్లుడు


శిక్షయేమి నృపాల, చిన్న ఆ బెయ్య కై
శిక్షింపగా తగునె శ్రీకుమార ప్రభుని!


మనునీతి


శిక్షాస్మృతి యందరకును శిరసావహనీయ మగును
ప్రభుపుత్రుడె యైన గాని పాటింపరు ధర్మజ్ఞులు


జీవహంత యౌట చేత శిక్షార్హుడై మత్సుతుండు,
(క్షణమాగి)
వెడలుదమా నగళులకును వేళ చాలె అయ్యె నార్య!


సౌవిదల్లుడు


జయ, జయ, మనునీతి చోళ, జయ, జయ ఓ ధర్మపాల!
జయ, జయ, శ్రీన్యాయమూర్తి, జయ, జయ, హృతప్రజార్తి!


3

(యువరాజ సౌధము - ఉదయము)

మాధవాంబ


గాఢ నిద్రను మీరు కనుమూసి నంతటను
నిశ్చలంబైన నిశి నే నాలపించితిని
కృతిలోన క్రొంగొత్త కీర్తనాదులను.


యువరాజు


కాంతా, నే విన కౌతూహలమున
ఉన్నాడను నీ యూహా గీతిక.


మాధవాంబ


చిత్తగింపుడోనాథా! చేసిన మత్కావ్యంబును
కాంత కళాభిజ్ఞ యౌచు కాంతుని నాహ్వానించును
ఏతత్సమయోచితంబు లేనన్నవి గీతంబులు.
“దివిజకన్యక నౌచు దేవ, యాలాపింతు,
నవ మోహనమ్ముగా నటియింపగా రమ్ము.
“రచియించి యుంచితిని రమ్యరూపచ్ఛాయ,
చేయగా రావయ్య శిల్పనిర్మాణమ్ము.
"కృతికి నర్హమ్ములౌ గీతముల నెత్తితిని


పూరింప వేడెదను పూతమౌ భావముల.
“ఎదలోన చిరుతనౌ సొదపెట్టు భావంబు :
రూపంబు కల్పించి తాపంబు బాపరా!”


యువరాజు


కవి కర్ణ రసాయనములు కాంతా నీ కావ్యంబులు,
అంతటితో నాపితేల అసమాప్తిగ నీకృతిని.


మాధవాంబ


అడుగ వలదు హృదయేశా, అటు పిమ్మటి కథనంబును.


యువరాజు


వెర్రిపిల్ల, నీకేలా వేదన నే నుండగనే
నిన్నటి నీ యనుభూతిని నేను వినగ వలతు మధూ!
పాలింతువు నా యాజ్ఞను పడతీ, నీ వెల్లప్పుడును.


మాధవాంబ


అటు చేసితి రేల నాథ, అజ్ఞాబద్దనుగా నను
వచియింపగ మొదలిడునెడ వణకెడు నా దేహవల్లి!


యువరాజు


రాజసంబు వీడె దేల రాకుమారి వయ్యు నీవు?


మాధవాంబ


(శరీరము బిగించి)
దైవముపై శ్రద్ధనిల్పి ధైర్యమ్మిదె తెచ్చుకొంటి!


యువరాజు


కానిమ్మిక మాధూ! నీ కథనమ్మును వివరింపుము.

మాధవాంబ


మీ ప్రక్కన తల్పంబున మేను వాల్చి రచన చేయు
కాలంబున కలత నిదుర కాంచినాను హృదయేశా!
(చెప్పలేక ఆపివేయును)


యువరాజు


ఇంత బేల వంచు మధూ! ఎరుక లేదు పూర్వమందు.


మాధవాంబ


స్వామీ! నా మానసంబు చర్వితమై భీతి జెందు.


యువరాజు


రాకుమారివి నీ వయ్యును రాజసంబు వీడెదేల?


మాధవాంబ


(ధైర్యము తెచ్చుకొని - పొరలివచ్చు దుఃఖముతో)
ప్రేమమయా, మీపై నే పీడకలను గాంచినాను.
శివ! శివ! మీ కేవిధిగా చెప్పనోరు తెరుపువడును!


యువరాజు


కానున్నది తప్పదుగద కలతజెంద నేల ప్రియా!
భావింపకు మెన్నడైన భావికాల కష్టమ్ముల.
(ప్రవేశము సౌవిదల్లుడు)


సౌవిదుల్లుడు


జయ, జయ, జయ, యువరాజా!
జయ, జయ, జయ, మాధవాంబ!
జయ, జయ, మనునీతిపుత్ర!
వెంట మిమ్ము గొనిరమ్మని విధియించిరి ప్రభువువారు.
దయ యుంచుడు నా మీదను దయచేయగ వలయు వేగ.

యువరాజు


తడవు చేయగరాదు తండ్రియానతి యైన.


మాధవాంబ


నన్ను విడచి మీరెన్నడు నాల్గడుగులు నడువలేదు
పోయెదరా, నాథా, పోయెదరా, నాథా!


యువరాజు


(శిరము ముద్దిడి)
అరుదెంతును శీఘ్రముగా అధైర్య మెందులకు దేవి!
తండ్రి యానతి యైన తడవు చేయగరాదు.


మాధవాంబ


(కష్టముగా)
పోయిరండు నాథా! పోయిరండు నాధా!


యువరాజు


(సౌవిదల్ల వైపు తన ముఖము త్రిప్పి)
వెడలుదమా ఆర్యా! వేళచాలనయ్యె
వేచి యుందురేమొ, వెడలుదమా ఆర్యా!


4

(రాజసభ - కాంచీనగరము - ధర్మామాత్యుడు - మనునీతి - సౌవిదల్లుడు, ఇతర భృత్యులు)

మనునీతి


తప్పిదంబు వింటిరిగద ధర్మవేత్తలగు మీరలు
శిక్షాస్మృతి యేవిధిగా చెప్పునొ వినిపింపవలయు.

ధర్మామాత్యుడు


గురుపత్నితో తుల్య గోవు ధర్మమనందు
వత్స హత్యకుగూడ వధయె సముచిత శిక్ష.
స్వామి, తమహస్తముల శాతఖడ్గమ్మునకు
బలి యీయగా వలయు పాపి నా హంతకుని


మనునీతి


సౌవిదల్ల, నా మారుగా శాసింపుము శిక్షావిధి.


సౌవిదుల్లుడు


స్వామి, నా ప్రాణములు చల్లబడి పోయినవి!
విని నంతనే శిక్ష వెర్రినై పోయితిని!
న్యాయమా నియమింప నన్నిట్టి కృత్యమున!


మనునీతి


ఏమైనను మీరుదక్క ఎరుగ రతని నన్యు లెవ్వ
రిది మీరే చేయవలయు, ఇంగితజ్ఞ, మీరెరుగరె
ఎట్లుండునొ తండ్రి హృదయ మీ యాపత్కాలమందు?


సౌవిదుల్లుడు


ఎరుగుదును మీ మనము ఎరుగుదును మీ ప్రేమ,
అపరాధిని కారణంబు అడుగనగును మహారాజ!
అటుపిమ్మట నేమైనను ఆచరింప నే వేడెద.


మనునీతి


నైరాశ్యము చెందవలదు నా యానతి యైన వెనుక.


సౌవిదల్లుడు


ధర్మమాత్యా, తమ తీర్పునకై
ఉత్కర్ణులమై ఉన్నామార్య!

ధర్మామాత్యుడు


ఏలిక యాజ్ఞప్తిని మే మిచ్చగించి నారమార్య!


సౌవిదల్లుడు


(రుద్ద కంఠముతో)
ఎరుగుదువా, యువరాజా! ఈవెయిట్టి యపచారివి.


యువరాజు


(నిశ్చలముగా)
ఇచ్ఛా పూర్వకముగా నే నెన్నడిట్టి గోహత్యను
చేసినట్లు యించుకైన చిత్తంబున లే దార్యా!


ధర్మామాత్యుడు


శిక్ష యొక్కటే స్మృతిలో నున్నది
స్మృతి గలవారికి స్మృతి విహీనులకు.


యువరాజ


శిరసావహనీయ మగును శిక్షాస్మృతి యెవరి కైన


సౌవిదల్లుడు


జయ, జయ, మనునీతి పుత్ర!
జయ, జయ, శ్రీధర్మ గాత్ర!


యువరాజు


ఏ నెన్నడు చేసి నానొ ఎరిగింతురె సౌవిదల్ల!


సౌవిదల్లుడు


రాజవీధిలో రధ వాహ్యాళిని.

యువరాజు


ఆచరించి నానేమో అజ్ఞాతముగా గోవధ
తలదాల్చెద తాతపాద ధర్మార్ధము దండనమ్ము,


సౌవిదల్లుడు


సంతసంబు రాకుమార, సంతోషము ధర్మపాల!


మనునీతి


(కంపించి)
సాత్వికుడౌ నా సూనుని చంపజాల హస్తమ్ముల,
దయయుంచుడు నామీదను తామొనర్పు డా శిక్షను.


సౌవిదల్లుడు


చిత్తగింప వలయుదేవ, చేయజాల నీకార్యము!
అదరిపోవు హస్తమ్ములు ఆడినంత మీ రీగతి!


మనునీతి


ఏగుచు నున్నా నేమైనను సరె,
ఖడ్గమ్మిదిగో, కానిం డాపని!


సౌవిదల్లుడు


అధిపా, వధ నిక్కువంబు ఆజ్ఞాపించినచో నను.


మనునీతి


సాగిపోదును నేను సౌవిదల్లా, యింక.

(నిష్క్రమణ - మనునీతి, ధర్మామాత్యుడు)


సౌవిదల్లుడు


ఖడ్గమ్మా, ఈ కంఠము నరకుము!

యువరాజు


ఇదిగో, నా కంఠము ఎత్తుడు మీ ఖడ్గమ్మును.


సౌవిదల్లుడు


ఎత్తితి నే ఖడ్గమ్మును ఇదిగో వధ అయిపోవును!
                                                (పొడుచుకొని మృతిజెందును)


యువరాజు


(సౌవిదల్లుని కళేబరము యొద్దకు పోయి)
శాంతిరస్తు సౌవిదల్ల, శాంతిరస్తు పురుషవర!
ఆలస్యము చేసినచో నధిపు డరుగుదెంచు నేమొ,
కంఠమ్మా, నీ వింకను కౌగిలించు ఖడ్గమ్మును!

ధర్మపాలనంబునకై తడవుచేతు వేల నీవు,
వడక నేల హృదయంబా, వరియింపుము మృత్యుకన్య!
మంగళం బగు గాత మనునీతి జనపతికి!
చోళ మండలమునకు శుభము సమకూరుతన్!


(కత్తిని నిలువబెట్టి దాని పైబడి ప్రాణములు విడుచును)

ఆర్య వాచకం, సుందర రామ అండ్ కో.

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.