Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-2/ఏకాంకికలు/శివాజీ అఫ్‌జల్ ఖాన్

వికీసోర్స్ నుండి

శివాజీ అఫ్‌జల్ ఖాన్


శివాజీ: గురుదేవ్, రామదాస స్వామీ, హైందవ సామ్రాజ్యాన్ని నిర్మిస్తానని మీ పాదాలకు వందనం చేసి ప్రతిజ్ఞ గైకొన్నాను. మానవ యత్నమంతా చేస్తున్నాను. కానీ దైవం... మాయీ భవానీ! నీ దయవల్ల శత్రువులకు చేజిక్కకుండా ఇంతవరకూ ఎన్నో ఆపదలను గడిచి వచ్చాను. కష్టాలమీద కష్టాలను తెచ్చిపెట్టి నన్నింతగా అగ్నిపరీక్ష చేయదలిచావేమ్మా!

జిజియాబాయి: శివా! (లోపలినుంచి వస్తూ వున్నట్లు) మళ్ళీ ఏం మార్పు వచ్చింది నాయనా! నీ ఇష్ట భృత్యులెవరైనా నిన్నా మొన్నట్లో శత్రువులతో చేరిపోయినారా?

శివాజీ: అదొక విశేషమే కాదు. అయినా అటువంటి దేశద్రోహులు మన మహారాష్ట్ర జాతిలో మరింతమంది లేరు.

జిజియాబాయి: అయితే నీవు కళ్యాణదుర్గాన్ని కొల్లగొట్టావని నిన్ను సాధించేటందుకు మీ నాన్నగారిని చెరసాలలో ఉంచి చిత్రహింసలు పెడుతున్నారట?

శివాజీ: ఇప్పుడు నన్ను సాధించటానికి బీజాపురం వారికి ఇటువంటి పిరికి పనులతో పనిలేదు. కాలం ఎంతో అనుకూలంగా వారికి కలిసి వచ్చింది. ఢిల్లీ రాజ్యం కోసం మొగలాయీ రాజు కుమారుల మధ్య అంతః కలహాలు చెలరేగాయి. దేవగిరి ప్రాంతం నుంచి నాకు మిత్రుడుగా ఉంటాడన్న మొగలాయీ రాకుమారులు ఢిల్లీకి సైన్యాలను తరలించికోవెళ్ళారు.

జిజియాబాయి: అయితే ఇక వారి దృష్టి అంతా నిజంగా నీమీదనే నిలిపి బీజాపురం వారు వ్యవహరిస్తారన్నమాట!... అక్కడికి వెళ్ళిన విశ్వాసరావు వచ్చాడా?

శివాజీ: లేదు. ఫకీరు వేషంతో బీజాపురం కోటలో అతడు ప్రవేశించటాన్ని చూచి, మోరే, ఎన్నాళ్ళకూ అతడు తిరిగి రాకపోవడం వల్ల విసుగు వచ్చి తిరిగి వచ్చేశాడు. బహుశః అతడు చిత్రవధకు గురై ఉంటాడేమో!

జిజియాబాయి: అలా ఊహించటానికి వీలు లేదు. అతడికి ఏ ఆపదా కలగదు. అతడు దీర్ఘాయుష్మంతుఁడని దాదాజీ వెనక జోస్యం చెప్పారు. విశ్వాసరావ్: మాయీ, జిజియా మాయీ!! ప్రభూ! శివాజీ ప్రభూ!!

జిజియా: రా, నాయనా నీకు నూరేండ్లు.

శివాజీ: కోటలో ప్రవేశించటానికి ఎంతో కష్టపడ్డావని విన్నాను. మోరే చెప్పాడు. నీ ఋణం ఎన్నటికీ తీర్చుకోలేను.

విశ్వాసరావ్: మీ కృప నా మీద ఉంటే అంతే చాలు. అవన్నీ ఒక కష్టాలా. కానీ వెనుకటి బీజాపురం కాదు. లంచాలు అణుమాత్రం పనిచెయ్యటం లేదు. ఎటువంటి అంతఃపురం వారైనా అట్టే బయటపడేది పూర్వం. ఇప్పుడు ఎంత భూమి ఎర చూపించినా ఇంత రహస్యం కూడా బయటికి రావటం గగనంగా ఉంది. పసిబిడ్డను రాజ్య సింహాసనమెక్కించి రజియాబేగం బలే పకడ్బందీగా పాలిస్తున్నది.

శివాజీ: ఆమె మహా సమర్థురాలన్నమాట!

విశ్వాసరావ్: సమర్థురాలే కాదు. చండశాసనురాలు. రెండు కళ్ళూ విప్పి చక్కగా చూచిందంటే చచ్చినంతపని గాని సర్దారంటూ కనిపించటం లేదట! మొగలాయీ రాజకుమారులు సైన్యాలతో ఉత్తరానికి వెళ్ళిపోయారన్న వార్త వచ్చిన మరుక్షణంలోనే సర్దారులు నందరినీ పిలిపించి సభ తీర్చింది. ఉత్సాహంతో ప్రసంగించి వాళ్ళ రక్తాన్ని ఉడుకెత్తించింది. తమ రాజ్యాన్ని సామ్రాజ్యం చేసి గాని నిద్ర పోనన్నది. అందుకు ముందుగా మహారాష్ట్ర శివాజీని మసిచెయ్యాలట.

జిజియాబాయి: అంతేనా?

విశ్వాసరావ్: క్షమించాలి. అతడి శిరస్సును తెచ్చి ఇచ్చినవాళ్ళకు ప్రస్తుతానికి ఒక పరగణా బహూకరిస్తుందిట! మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన తరువాత మున్సబ్దారును చేస్తుందిట!!

జిజియా: మరి సభలో “ఆ పని నేను చేస్తా"నని ఎవరైనా ముందుకు వచ్చారా?"

విశ్వాసరావ్: ఆఁ ఆమె సోదరుఁడు. అప్జల్‌ఖాన్ ఆ పనికి తాను పూనుకుంటానని అల్లామీద ప్రతిజ్ఞ చేశాడు.

శివాజీ: అప్జల్‌ఖానా! అతఁడు ఆప్ఘన్ వీరుడు కదూ! మొగలాయీలతో బీజాపురం చేసిన యుద్ధాలల్లో పేరు గన్నాడని విన్నాను. విశ్వాసరావు: అవును అతడే. మహాబలశాలి, చూచాను చాలా ఎత్తైన వాడు. మనమీద ఎప్పుడో హఠాత్తుగా విరుచుకు పడటానికి సైన్యాలను సమకూర్చుకుంటున్నాడట! అతడు వెంట తీసుకో రావటానికి ఒక టర్కీ ఫిరంగి దళాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

జిజియా: అయితే మన శివాజీని ఎదుర్కోవటానికి ఇప్పుడు మంచి ఉజ్జీ దొరకడన్నమాట!

శివాజీ: అమ్మా! నీ కుమారుడు అంతటి బలశాలి అని నీ విశ్వాసమా?

జిజియా: నీ పౌరుష పరాక్రమాల విషయంలో నాకు అణుమాత్రమైనా అనుమానం లేదు. భవానీమాత నీ భక్తికి మెచ్చింది. ఆమె కృప వల్ల రాబొయ్యే పోరాటంలో విజయం నీదే. ఇదిగో ఈ ఖడ్గాన్ని అందుకో.

శివాజీ: మహాప్రసాదం. ఓ ఖడ్గమా! భవాని అపరావతారమైన మాతృశ్రీ నిన్ను నాకు ప్రసాదించింది. ఇక నీవు నా చేతిలో నిల్చి వీర విహారం చెయ్యి. విశ్వాస్! నీవు కూడా మనకు అవసరమైన సైన్యాలను సమకూర్చు.

(జై జిజియా బాయికి జై, జై భవానికి జై)

2

అఫ్జల్ ఖాన్ : హుఁ హుఁ హుఁ కలలట కలలు. దయ్యాలట, భూతాలట! నేను నిఖ్ఖా కట్టిన బీబీలు ఇంత పిరికివాళ్ళని ఎన్నడూ అనుకోలేదు. అయినా 'శివాజీ' అనే ఆ కొండ ఎలుక అంటే అంత భయమేమిటి? మొగలాయీ మహావీరులను పారద్రోలిన మహా పరాక్రమశాలిని.

కృష్ణజీ: తాము వీరాగ్రేసరులన్న విషయం ఎవరు కాదంటారు. కానీ తాము బీబీల భయానికి కూడా కొంత...

అప్జల్ ఖాన్: కృష్ణజీ! నా బీబీలందరూ నాశనమైపోయినా సరే నేను మాత్రం శివాజీ శిరస్సు తీసుకోరావటానికి వెళ్ళి తీరుతాను. వాళ్ళను అలాగే కలలతోనే కాలం చెయ్యనివ్వండి. కావలసి వస్తే గట్టివి గోరీలు కట్టిస్తాను. రజియాబేగం: సోదరా! నీకు మాత్రం అంత పట్టుదల ఎందుకు? నీ వంశాన్ని నాశనం చేస్తున్నానని నీ బీబీల చేత నన్నెందుకు తిట్టిస్తావు. శివాజీపని పట్టడానికి మరో వీరుణ్ణి పంపిద్దాము.

అప్జల్‌ఖాన్: సోదరీ! రజియా! ఆఫ్‌ఘన్ పుట్టుక పుట్టి, అనేక యుద్ధాలు చూసి, నా చేత అనేక యుద్ధాలు చేయించిన నీవే ఇలా మాట్లాడుతావను కోలేదు. నా శక్తి మీద నీకు నమ్మకం లేదా?

రజియా: లేక కాదు. శత్రువు అంత సామాన్యుడు కాడని.

అఫ్జల్‌ఖాన్: ఏమిటి? ఆహవం అంటే ఏమిటో ఎరక్క అరణ్యాల మధ్య పెరిగిన ఆ ఆటవికుడు శివాజీ ఒక వీరుడనేనా? అతడు నాకంటే బలవంతుడనా నీ అభిప్రాయం?

రజియా: నిత్యమూ మన చారులు తెచ్చే వార్తలు వింటుంటే అలాగే అనిపిస్తున్నది.

అఫ్జల్‌ఖాన్: అయితే నేను అతణ్ణి తప్పక ఎదురించి తీరుతాను.

కృష్ణజీ: అక్కగారు చెబుతున్నా మీరు అంత గట్టి పట్టు పట్టటం అట్టే బాగాలేదు.

రజియా: చిక్కించుకొని పులిని అతడు చేతులతో చీల్చి వేస్తాడట! అతడికి నీవో లెక్కా? నీ ఉబలాటం మానేయ్.

అఫ్జల్‌ఖాన్: అది మానేయటమంటే మరి నన్ను నేను హత్య చేసుకోవటానికి నీవు అంగీకరిస్తావా?

రజియా: అయితే నీవు అతణ్ణి మోసం చేసి ఎదుర్కోటానికి ఒప్పుకుంటే నీవే అతని మీదికి వెళ్ళటానికి ఒప్పుకుంటాను.

అఫ్జల్‌ఖాన్: సాటి వీరుణ్ణి మోసగించటమా... పోనీ, అలానైనా ఒక మారు అతడితో పోరాడే అవకాశం లభిస్తుంది. సరే మోసగించటానికి ఒప్పుకుంటాను. ఇక ముందు జరగవలసింది.

రజియా: కృష్ణజీ! ఏమంటారు?

కృష్ణజీ: బాగుంది. మోసాన్ని తలపెట్టకుండా ఆ మహారాష్ట్ర సింహాన్ని పట్టుకోవటం సాధ్యమైన పని కాదనే నా అభిప్రాయం. అప్జల్‌ఖాన్: ఒక మహావీరుడి చేతులలో మరణించానన్న ఖ్యాతి నాకు దక్కనీయండి. మోసగించి ఎదుర్కోవటం నాకు ఇష్టం లేదు.

కృష్ణజీ: మీరు అటువంటి సాహసానికి పూనుకుంటే ఇక బీజాపుర రాజ్యం పని ఏం కావాలి? మళ్ళీ మీరు మనస్సులో గిలి పెట్టుకోవద్దు.

రజియా: ఉపాయం ఏదైతేనేం శత్రువును చేజిక్కించుకోవటం ప్రధానం. అప్జల్! అనుభవశాలి, మన కృష్ణజీనే శివాజీ దగ్గరికి దూతగా పంపిద్దాము. మనం అతని స్నేహాన్ని కోరుతున్నట్లు, అందుకు నిదర్శనంగా అతడు గెలుచుకొన్న దుర్గాలను అతని కిచ్చేటట్లు చెప్పి పంపుదాము. అతడికి మన ఎడ మైత్రి ఉన్నట్లు ప్రదర్శించటానికి ప్రతాపగడంలో లేక మరెక్కడైనా సరే ఒంటరిగా మనను కలిసుకోవలసిందని చెప్పిద్దాము.

అప్జల్‌ఖాన్: అప్పుడు అతణ్ణి బందీ చేసి ద్వంద్వ యుద్ధం యిమ్మని కోరుతాను సోదరీ! మంచి పథకం ఆలోచించావు.

కృష్ణజీ: అప్జల్! మీ సోదరి అసామాన్య బుద్ధిబలం కలది. ఆ ఢిల్లీకి సుల్తానా కాదగ్గది.

రజియా: కృష్ణజీ మీరు సాధ్యమైనంత త్వరలో శివాజీని కలుసుకుని ఆహ్వానించి రావాలి. మనపని తప్పక సానుకూలంగా చేసుకో రావాలి.

3

శివాజీ: విశ్వాసరావ్! ఈనాడు చారుడు తెచ్చిన వార్త ఎంతో వింతగా ఉంది. సంధి చేసుకుంటారటనా? బీజాపురం వారు మనతో సంధి చేసుకుంటారటనా? ఉన్న మొగలాయీల అండ కాస్తా ఊడిపోయిన ఈ స్థితిలో వారికి మనతో సంధి ఎందుకు? సఖ్యమెందుకు?

విశ్వాసరావ్: తమ బలపరాక్రమాలకు భయపడి సఖ్యం కోరుతున్నారేమో! కానివ్వండి. సంధే జరగనివ్వండి. పోయిందేముంది? బహుకాలం నుంచీ మన యోధులకు కంటికి నిద్రలేదు. కొన్నాళ్ళ పాటు సుఖపడతారు.

జిజియాబాయి: నాయనలారా! పొరపడకండి. దక్షిణ దేశమంతటా తమ కత్తికి ఎదురు కత్తి లేని యీ సమయంలో వాళ్ళు మీతో సంధిని కోరుతున్నారంటే ఇందులో ఏదో తప్పక మోసం ఉండి తీరుతుంది. విశ్వాసరావు: మాయీ! మీరు అన్నది ఆలోచించవలసిన విషయమే. శివాజీ సూటి ఐన యుద్ధంలో మనం వాళ్ళకు చేజిక్కమని స్నేహాన్ని నటించి మనను చెరసాలలో పెట్టదలచి ఉంటారు.

(ప్రభూ! బీజాపురం నుంచి ఎవరో దూతలు వచ్చారు అన్న వాక్యం వినిపిస్తుంది)

శివాజీ: సగౌరవంగా ప్రవేశపెట్టు. దూతను కూడా పంపించారు. ఒకవేళ వారు ఏనాటికైనా బలవంతుల మౌతామనీ, మనతో మంచిగా ఉండటం వల్ల మంచే జరుగుతుందని కూడా వాళ్ళు ఊహించి ఉండవచ్చు.

విశ్వాసరావు: మన ఊహే నిజమైతే బీజాపుర పాలకులను భారత సామ్రాట్టులను చెయ్యగలం.

కృష్ణజీ: (ప్రవేశిస్తూ) శుభమస్తు! శివా! శుభమస్తు!! మాయీ నమస్కారము.

శివాజీ: మా తండ్రి షాజీవారికి కుశలమా? రజియాబేగంల వారికి క్షేమమా? మిగిలిన వారందరికీ శుభమా?

కృష్ణజీ: అక్కడ మీ తండ్రి షాజీవారికి కుశలం. వారిని బేగం మహా గౌరవంతో చూస్తున్నది. బేగం వారికి క్షేమం. చారుల వల్ల విన్నదట, ఎప్పుడూ నీ పౌరుష పరాక్రమాలను గురించి మాకు చెపుతుంటుంది. ఆమెకు నిన్ను తనవాణ్ణి చేసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంది.

జిజియా: అంతకంటే మాకు మాత్రం కావలసిందేముంది?

విశ్వాసరావు: మరి మా శివాజీ జయించుకొన్న దుర్గాల మాటేమిటి?

కృష్ణజీ: వాటితోబాటు మరికొన్ని కూడా ఇచ్చి అతణ్ణి పాలించమని చెప్పదలిచింది.

జిజియా: అయితే సంతోషం. ఇందుకు ప్రతిగా మా శివాజీ చేయవలసింది ఏమో సెలవిచ్చారు కాదు.

కృష్ణజీ: ఏమీ లేదు. ఒక్కమారు వారి సోదరుడు అప్జల్‌ఖాన్‌ను ఏకాంతంగా కలుసుకోవటం. ఒకరికొకరు పారితోషకాలిచ్చుకోవటం.

శివాజీ: అతడున్న చోటికి నేను రాలేను.

కృష్ణజీ: అయితే మరి? శివాజీ: ఇరువురం ఏ ప్రతాపగడం దగ్గరో ఒకరి నొకరు కలుసు కుంటాము.

కృష్ణజీ: అతడు తన వెంట ఇరువురిని తెచ్చుకొంటాడు. నీవూ ఇరువురిని తెచ్చుకోవచ్చు. వచ్చే పంచమినాడు మీ సమావేశం. మరి అంగీకారమిస్తే నేను సెలవు తీసుకుంటాను.

శివాజీ: అమ్మా! ఇందుకు మీ అనుజ్ఞయేనా?

కృష్ణజీ: శివా! కష్టసుఖాలు ఎరిగిన నీవు బీజాపురంతో సఖ్యం చేసుకొంటానంటే వారు కాదంటారా?

జిజియా: కాదనను. కానీ ఆ జాతి నమ్మదగ్గది కాదు. అందులో తాము అఫ్జల్‌తో 'ఏకాంతంగా మా శివ' కలుసుకోవాలని కోరుతున్నారు. ఇందులో ఏమైనా మోసం ఉందా అని ఇంచుక సందేహంగా ఉంది.

శివాజీ: అమ్మగారన్నమాట అంత త్రోసివేయదగ్గది కాదు. కృష్ణజీ! మీరు సజ్జనులు. ఈ సంధి యత్నంలో ఏమీ మోసం లేదంటారా?

కృష్ణజీ: మోసం ఏమీ ఉండదనే నా అభిప్రాయం.

జిజియా: మీ కంఠధ్వనిని బట్టి నా అనుమానం అధికమౌతున్నది.

కృష్ణజీ: అనుమానించకండి. సఖ్యానికి అంగీకరించండి. సర్వం సాగిపోతుంది.

విశ్వాసరావ్: కృష్ణజీ! తాము బ్రాహ్మణోత్తములు.

శివాజీ: తాము గాయత్రి సాక్షిగా ఇందులో మోసం లేదని సెలవివ్వండి. నేను ఒంటిగానైనా ఆ ఆప్జల్‌ను కలుసుకోవటానికి ప్రతాపగడం దగ్గరకు వస్తాను.

కృష్ణజీ: నాయనా! నా చేత ప్రమాణ మెందుకు చేయిస్తావు. మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని నిర్మించదలచుకున్నావు. నీవు నీ సైన్యాలతో ప్రతాపగడానికి రా. వాటిని చాటున నిల్పు. ఖాన్ కూడా సైన్యాలతో వస్తాడు. పోరాటానికి సిద్దపడే రా! అందులో విజయం చేకున్నావో నీకు మహత్తరమైన భవిష్యత్తు ఉంది. మహారాజువౌతావు. నీకు శుభమగు గాక! కానీ ముందుగానే నీ సైన్యాన్ని బయట పెట్టి నాకు చిక్కు తెచ్చిపెట్టకు. మరి మాయీ సెలవు.

జిజియా: కృష్ణజీ! సెలవు! శివా! విశ్వాస్!! ఇక సైన్యాలను చేకూర్చుకోవటంలో

త్వరపడండి. ప్రతాపగడానికి ప్రయాణం దగ్గరలోనే ఉంది.

4


శివాజీ: విశ్వాస్! ఈ ప్రతాపగడం ఎంత గొప్ప దుర్గమోయ్! ఇది ఇవాళ మన చేతికి చిక్కిందో బీజాపుర పాలకులనే కాదు, మొగలాయీ పాదుషాలను కూడా ఒక ఆట ఆడిస్తాను. సైన్యాలను తరలించుకో రమ్మని మోరేకు ఆజ్ఞ ఇచ్చి వచ్చావా?

విశ్వాస్: అదుగో ఆ గుట్టమీదుగా చూడు చీమల బారుల్లా వస్తున్నది మన సైన్యమే. వెంట జిజియా బాయి కూడా వస్తున్నది. ఈనాటి మీ పోరాటాన్ని చూడాలట. - నీవు ఇనప చొక్కా జాగ్రత్తగా వేసుకున్నావు కదూ! పులిగోళ్ళు జాగ్రత్త. పూర్తిగా ఆ ఆఫ్జల్ డొక్కలో దిగిపోవాలి సుమా!

శివాజీ: అదుగో దూరంగా ఎవరో ముగ్గురు ఆశ్వికులు గుఱ్ఱాలుదిగి నడిచి వస్తున్నారు.

విశ్వాసరావ్: ఇంకా అనుమానమెందుకు? అతడు అఫ్జల్. అదుగో దూరంగా అతడి సైన్యం చుట్టూ తిరిగి వస్తున్నట్లున్నది. లేకపోతే అటువైపు ఆకాశం అలా దుమ్ముతో ఎందుకు నిండిపోతుంది.

శివాజీ: అఫ్జల్ నా దగ్గరకు వచ్చేదాకా మన గుడారంలో ఉండిపోదాం. విశ్వాస్ నా శరీరం ఇవాళ ఎందుకో పొంగిపోయి తొడిగిన ఇనుప చొక్కాను బ్రద్దలు కొడుతుందా అనిపిస్తున్నది.

అఫ్జల్: పాపం! అమాయకుడు. మాట ఇచ్చినట్లుగా శివాజీ ఒంటరిగానే వచ్చినట్లున్నాడు. రజియా! నా పరాక్రమాన్ని ఈనాడు చూచి ఆనందించు. నాకు సాటి ఐన ఉజ్జీ దొరికాడు. నీకు నా శక్తిని చూపించటం కోసమే ఇలా పురుష వేషంతో నిన్ను పిలుచుకో వచ్చాను.

రజియా: అఫ్జల్, అతడి దగ్గరికి వస్తున్న కొద్దీ నాకేమిటో భయం వేస్తున్నది. పోరాడేటప్పుడు జాగ్రత్త సుమా!

అఫ్జల్: సోదరీ! నీవు ఇంత పిరికిదానివనుకోలేదు. చాలా దగ్గరికి వచ్చాము. అడుగో నాకోసం శివాజీ గుడారం ముందు వేచి ఉన్నాడు. ఇకనుంచి నీవు నా సేవకుడివిగా వెనక రావాలి! పోరాడుతున్నప్పుడు ఒకవేళ మొదట నాకేమైనా దెబ్బ తగిలితే బయటపడిపొయ్యేవు. ఏ ప్రమాదమైనా జరగవచ్చు.

శివాజీ: విశ్వాస్! మనం అఫ్జల్‌కు ఎదురు వెళ్ళి ఆహ్వానిద్దామా?

(అఫ్జల్ ఖాన్‌కు జై)

అఫ్జల్ ఖాన్: శివాజీకి జై! మిత్రుడా శివాజీ!

శివాజీ: నెచ్చెలీ ఆఫ్జల్!

అఫ్జల్: శివాజీ! నీ కంఠమెంత తీయనైంది. ఏదీ, రా ఒక్కమారు నా బాహువుల్లోకి వచ్చి మనఃపూర్వకంగా నన్ను కౌగిలించుకో.

శివాజీ: అఫ్జల్! నీవు మహావీరుడిలా వున్నావు, ఏదీ ఒక్కమారు నన్ను గాఢంగా కౌగిలించుకో

అఫ్జల్: ద్రోహి! రాజద్రోహి!! శివాజీ దేశాన్ని కొల్లగొట్టుతూ అరాజకం చేసే ద్రోహి... నా చేతుల్లో నలిగిపో... నలిగిపో...

శివాజీ: మిత్రద్రోహి! సఖ్యానికని పిలిచి... చంపటానికి పూనుకొన్న ద్రోహం... అబ్బా.

విశ్వాసరావ్: ప్రభూ! త్రిప్పికొట్టు.

శివాజీ: ఏదీ! ఇందాకేమన్నావో చెప్పు! ఈ పులిగోళ్ళు చూచావా? నీ జాతిని నమ్మకూడదనే జాగ్రత్త పడే వచ్చాను. ఇనుప చొక్కాను తొడిగాను. ఇవిగో పులిగోళ్ళు. నీ కడుపులో గుచ్చి చీల్చి వేస్తాను.

(ఇంతలో ఉభయసైన్యాలు అఫ్జల్‌ఖాన్‌కు జై, శివాజీకీ జై అని తారసిల్లిన ధ్వనులు)

(యుద్ధ దుందుభులు... యుద్ధం జరుగుతుంది) చీ! పాపీ! నిన్ను పూర్తిగా చంపదలచలేదు. విడిచి పెడుతున్నాను. పో పారిపో. అపకీర్తి వెన్నాడుతూ నీ వెంట వస్తుంది పారిపో.

అఫ్జల్: అబ్బా! బాధ!! నిన్ను మోసగించాను. నీ కత్తితో చంపు. నాకు కీర్తి దక్కుతుంది.

శివాజీ: విశ్వాస్ ! వీడిని మన సైన్యంలోకి తరుముకో పో!

విశ్వాస్: పద! తులువా పద!

శివాజీ: మోరే! వీరుణ్ణి చిత్రవధ చేయకండి. పాపం గొప్ప పుటక పుట్టాడు. (సోదరా ఎంత చెప్పినా వినక ఎంత ఆపద తెచ్చుకున్నావు)

విశ్వాసరావు: ప్రభూ! మోరే దుర్గపాలకులను ఓడించి ప్రతాప గడాన్ని పట్టుకుని మన భగవధ్వజాన్ని ప్రతిష్ఠించాడు. అదుగో అటు చూడు. జిజియా బాయి వందన సమర్పణం చేస్తున్నది. మన సైన్యం కోలాహలంగా ముందుకు వస్తున్నది.

(జై శివాజీ మహారాజుకు జై, జై జిజియా బాయికి జై)

జిజియా: నాయనా శివా! శత్రువును సంహరించి నాకు మహా సంతోషాన్ని కల్పించావు.

నీ పోరాటం సర్వం చూస్తున్నాను. ఇవే నా ఆశీస్సులు. భావి భారత సామ్రాట్టువి నాయనా!

శివాజీ: అమ్మ నీ ఆశీర్వాదబలం అమ్మ భవానీదేవి కృప వుంటే తప్పక భారత సామ్రాట్టు నౌతాను. జై భవానీ మాతకి జై, జై జిజియా బాయికి జై.

(సైనికులు జై భవానీ మాతకి జై, జిజియా బాయికి జై అని ప్రతిధ్వనిస్తారు)

ఎ.ఐ.ఆర్. విజయవాడ 28-11-1958

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.