Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-2/ఏకాంకికలు/మధుర ప్రియ

వికీసోర్స్ నుండి

మధుర ప్రియ


(చిత్తూరు రాజమందిర ప్రాంగణము. గిరిధరగోపాల పూజామందిరము ముందు వితర్దిక మీద శిలావిగ్రహము. గోసాయిలు ముందు వచ్చి కూర్చుంటారు. సేవకురాలు పూజాద్రవ్యాలు పట్టుకోవస్తుంటే వెనుక అర్ధనిమీలిత నేత్రాలతో మీరా ప్రవేశిస్తుంది. ఒకవైపునుంచి. సూర్యాస్తమయానంతరమూ మీరాబాయి రావటాన్ని జూచి)


గోసాయీలు: జై! చిత్తూరు మహారాణీ మీరాబాయికి జై!
                 జై! చిత్తూరు మహారాణీ మీరాబాయికి జై!!


మీరా: (దగ్గరకు వచ్చి) ఓహో! ఈనాడు కృష్ణాష్టమి. నా ప్రభువు జన్మదినము. అందుకనే కాబోలు పూజామందిరము కిక్కిరిసిపోతున్నది. గోసాయీలతో... అబ్బా! ప్రభుతుల్యులు, ఎంతమంది గోసాయీలు... భక్తబృందానికి వందనాలు!


గోసాయీలు: జై! చిత్తూరు మహారాణీ మీరాబాయికి జై!
                 జై! చిత్తూరు మహారాణీ మీరాబాయికి జై


మీరా: (నాలుగు దిక్కులు కలయజూచి) మహానుభావులారా! ఎవరా చిత్తూరు మహారాణీ! ఏది? ఎక్కడ?... (నవ్వుతూ) మీరా చిత్తూరుకు మహారాణీ కాదు. ఆ మహారాణీ పుట్టలేదు... మాయారహితుడు, మహాప్రభువు. గిరిధర గోపాలుడికి ఈ మీరా ఆత్మను అంకితం చేసిన ప్రేయసి... కాదు... కాదు... పాదదాసి.


గోసాయీలు: జై! మీరామాయికీ జై!
                జై! మీరామాయికీ జై!


మీరా: అతిథులారా! నా మనోహరుని పుట్టినరోజని దేశదేశాలనుంచీ సంకీర్తనకోసం వచ్చిన మిమ్మల్ని చూస్తే నా హృదయం ఉప్పొంగిపోతున్నది! ఎందరు వైష్ణవభక్తులు... నా కళ్ళు చూడలేక పోతున్నవి. జయ పెట్టవలసింది నాకు కాదు... (విగ్రహం కేసి చూపిస్తూ, సమీపిస్తూ) అడుగో ఆ మోహనమూర్తికి... నా మనోనివాసికి... కాదు నా మనోహరుడికి...

(దగ్గరకు చేరి కూర్చొని విగ్రహ పాద పద్మాలను నిమీలితలోచనాలతో దర్శిస్తూ)


జయ జయ జయ జయ గిరిధర గోపాలా!
జయ జయ జయ జయ గిరిధరగోపాలా!
     అలికుల గానోద్భూతామృతరస
లలితమాలపదాంబుజయుగళా, గోపాలా!

  (తల ఎత్తి కేకిపింఛాన్ని నిరూపిస్తూ)

మకుట ఘటిత కేకిపింఛరుచి శబలిత
సకలాశాపరిపూరిత దివ్యతేజ, గోపాలా!

  (కన్నులదగ్గరకు లేచి కలయజూస్తూ)

       అక్షయ గోపీతరళ కటాక్షా
క్షీణ మనోహరా రాజీవాక్షా, గోపాలా

  (మురళీగానాన్ని అభినయిస్తూ)

    రాధాధర మధుర సుధారస ధా
రారంజిత బింబాధర వంశీరవ గోపాలా

           (చక్రభ్రమణంతో)

   జయ జయ జయ గిరిధర గోపాలా!
జయ జయ జయ జయ గిరిధర గోపాలా!

(తన్మయురాలైన గోసాయీల మధ్యకు చేరి)


అడుగో నా ప్రియుడు నవ్వుతున్నాడు. మన పిలుపు అందింది. ఓహో! ఎంత రసికుడు... పల్లవీ కన్యలమధ్య పిల్లనగ్రోవి మౌని... నా కంఠాన్ని అనుకరిస్తున్నాడు. కనికరం కలిగింది కాబోలు. అదుగో నీల మేఘం అదేమిటి... అబ్బా! ఏమిటా మెరుపు దానికి పైగా... (అనుమానించినట్లు పరికించి మిలా మిలా కళ్ళార్పి) ఔను... ఔను తెలిసినది... అంతే నా మనోనాథుడు గోలోకం నుంచి బయలు దేరి వస్తున్నాడు... ఆ ఆషాఢమేఘచ్ఛాయలు ఆయన దేహకాంతులు... ఇదిగో మనమంతా నీలనీలంగా మారిపోతున్నాము. అయ్యో! కాంచనాభరణాలను త్యజించిన నా ఒంటిమీద బంగారపు రుద్రాక్షల జపమాలలు నిలుపుతూ నిమిషంలో మటుమాయమై నిమిషంలో జ్యోతిష్మతులను వెలిగించే ఆకాంతులేమిటో తెలుసునా? నా హృదయవతి కేకిపింఛసంకాశం. నెమ్మది నెమ్మదిగా... నాకోసకు. ఔను నాకోసకు దిగి వస్తున్నాడు. ఎందుకు రాడు, వస్తాడు. ఇద్దరమూ చిన్ననాటినుంచీ స్నేహితులము. మా అమ్మ పక్కలో నేను. నా పక్కలో నా హృదయపతి... అడుగో మరీ మరీ దగ్గిరికి వస్తున్నాడు. (గోసాయీల కేసి చూస్తూ) మీరేమీ చూడటము లేదూ! అలా బిక్కమొగాలు వేసుకొని కూర్చున్నారేమిటి? (ఒక గోసాయి దగ్గిరకు వచ్చి) స్వామీ! నా మనోహరుడు మీకు కనబడటం లేదూ?

గోసాయీ: (లేదన్నట్లు తల తిప్పుతాడు.)

మీరా: (మరొక గోసాయిదగ్గరకు వచ్చి) మహాత్మా! మీకో?

గోసాయీ: ఏడమ్మా తల్లీ, ఎక్కడ! నీది వట్టి భ్రాంతి!

మీరా: అదేమిటి స్వామీ, కళ్ళ ఎదుట అలా కనిపిస్తూ ఉంటేనే!

గోసాయీ: ఇదేమిటమ్మా! ఎన్నడూ కనీ వినని దీచిత్రం... నీది వట్టి భ్రాంతి. ప్రభువేమిటీ? మనదగ్గిరికి రావడమేమిటి? రూపగోస్వాములు ఎన్నడూ చెప్పలేదే. దేహయాత్ర చాలించి మనమే గోధామంలో ప్రభువును కలుసుకుంటాము. గాని ఇదేంమాట! ఎన్నడూ వినలేదు...

మీరా: చాలులే మహాత్మా, చాలులే! అబ్బా! ఎక్కడేమిటయ్యా? స్వామి! (జరిగిపోతూ మరొక గోసాయితో) తేజోమూర్తులు తమకు తప్పకుండా కనిపిస్తూంటా డనుకుంటాను.

గోసాయీ: తల్లీ! దూరంగా ఏదో లీలగా కనిపిస్తున్నది.

మీరా: కాదు కాదు మీ కన్నులు ఆయన వెలుగును భరించలేక పోతున్నవి... అడుగో ఆయన వచ్చేస్తున్నాడు. నేను ఏం చేసేది స్వామీ! ఏమి చెయ్యమన్నారు? ఆయన వచ్చేదారిలో దుమ్ము అంటుకుంటుంది కాబోలు. పూవులు చల్లిరానా? వద్దు వద్దు. పమిట పరిచి వస్తాను. అర్ఘ్యానికి జలం సిద్ధం చేసుకోనా? అవసరం లేదు. హర్షాశ్రు వు లున్నవి కదా! వస్తున్నాడు కదూ నామనోనాథుడు!

గోసాయీ: అవునమ్మా! తల్లీ, ఏదో తేజోవిగ్రహం. మనవైపుకే కదిలివస్తున్నది.... (తన్మయుడై) తల్లీ! (మెడలో చెయ్యి పెట్టి హారం బయటికి తీసి) ఇదిగో ఈ హారం వేసి అర్చించు... (చేతికి అందిస్తాడు).

మీరా: (చేతికి హారం తగిలేటప్పటికి స్మృతికి వచ్చి) ఏమిటిది? నేను ఇందాకటినుంచీ. ఏ లోకంలో ఉన్నాను? ఈ పూజామందిరానికి ఎలా వచ్చాను? ఇదుగో వీరంతా గోసాయిలే.. అయితే నా మనోనాథుడు ఏడీ... తిరిగి వెళ్ళిపోతున్నాడు (కన్నీటిలో) వెళ్ళిపోతున్నావా నాథా! (గోసాయిని చూచి) నీవు గోస్వామివి కాదు. ప్రేయసీ ప్రియుల మధ్య అడ్డుపడే పిశాచానివి! మ్లేచ్ఛుడివి! పో! అవతలికి పో! ఇక్కడ ఉండవద్దు!

గోసాయీ: కోపించకు తల్లి! మహానుభావుని లీలలు అతిమానుషాలు. నన్ను హారం ఇవ్వమన్నట్లు సైగ చేశాడు. తాను తిరుగు మొగం పట్టాడు. నా తప్పు ఏముందమ్మా?

మీరా: (తగ్గి) నిజమే! స్వామీ! నన్నే ఇల్లా అనేకమాట్లు మోసగించాడు. క్షమించండి మహాత్మా! ప్రేమోన్మాదంలో ఏదో పిచ్చిగా మాట్లాడాను.

గోసాయీ: తల్లీ! నీమనస్సు నాకు తెలుసును. చింత పడకు.

మీరా: చింతపడకుండా ఎలా ఉంటాను? (విగ్రహానికేసి చూచి) మోసగించా నన్నట్లుగా మొలకనవ్వులలో ఈ విగ్రహం చాటున... లోపల... దాక్కొని నవ్వుతున్నాడు. ఈ హారము మెడలో వేసి మళ్ళీ రమ్మని మొర పెట్టుకుంటాను. (విగ్రహం వైపు నడుస్తుంటుంది).

(ప్రవేశము సేవకురాలు... చేతులో పూలబుట్ట... గంట కొట్టుతుంది... మీరా వెనక్కు తిరిగి) ఎవరు? గిరిజా?

గిరిజ: (వంగి నమస్కరిస్తూ) దేవీ! శ్రీ శ్రీ కుంభరాణావారు ఈనాడు గిరిధర గోపాల దేవుణ్ణి వనమాలికలతో కాదట. ఈ సెజ్జలో పూలమాలికలతో అలంకరించమని దేవేరిని ప్రార్థిస్తున్నామని విన్నవించి రమ్మన్నారు.

మీరా: (ఉద్వేగంతో) గిరిజా! గిరిజా! ఏమిటిది? సత్యమేనా? కుంభ రాణా మాటలేనా ఇవి? ఇలా “గిరిధర గోపాల" నామం రాణా నోట ఉచ్చరించాడా... 'వనమాలికా' నీవు కల్పించింది కాదు కదా! నన్ను ఉద్దేశించి ప్రార్థిస్తున్నా నన్నాడా?

గిరిజ: (చెప్పలేక చెపుతూ) ఆ... అ... అ......వు.....వు.....ను......దేవీ...

మీరా: ఏమి టాతడబాటు?

గిరిజ: ఏమీలేదమ్మా! అది నా సంతోషము. (సెజ్జ అందిస్తుంది)

మీరా: (అందుకుంటూ) మహాత్ములారా! మీరాకవల్ల నేడు చితోడు నిజంగా వైష్ణవభక్తలోకంగా మారిపోతున్నది. కుంభరాణావంటి భూతేశ శిష్యుడు

గోధామదర్శనాన్ని కోరుతున్నాడు.


గోసాయీలు: జై కుంభరాణా మహారాజుకు జై!
                 జై కుంభరాణా మహారాజుకు జై!


మీరా: (విగ్రహాన్ని చూస్తూ) ప్రభూ! ఇదిగో వస్తున్నా. నిన్ను అలంకరిస్తా. గిరిజా! వెంటనే వెళ్ళి కుంభరాణావారిని సంకీర్తనానికి రమ్మని దేవి పున: ప్రార్థిస్తున్నదని చెప్పు! త్వరగా పోయి విన్నవించు.

గిరిజ: చిత్తము దేవీ! (నిష్క్రమణ)

మీరా: ఈ పూల మాలికలతో అలంకరించి స్వామిని తిరిగి రమ్మని ప్రార్థిస్తాను. (అని తత్తరపాటులో గోసాయి ఇచ్చిన హారం వేస్తుంది. సెజ్జకము మూత తియ్యకుండా అక్కడనే కింద పెట్టి ఆపుకోలేని ఉత్సాహంతో).


నిదుర ఎరుగనికనుల నీకొరకె! నీకొరకె!
ఒక్కతెనె యీరేయి చుక్కలలో ఓనాథ!
విశ్వమంతా నిదుర వెలిముసుగు వేసుకొనె
వెన్నెలల బయలులో! విరహినై నిలచితివి
పెంచుకొన్నా వోయి ప్రేమలత కన్నీట
బాధ యని ఎరుగ నిక పలుక ప్రేమించ మని
నావిరహగాథలను నడికి రేయికి చెపుతు
సగము రాతిరి నొక్క యుగముగా గడపితిని.


నాథా! ఇంతటికైనా దయ రాదా! ఈ దీప విరహిమీద మళ్ళీ ఒకమాటు నీ ఆసాయవీక్షణము ప్రసరించదా! అయ్యో! ఎన్ని యుగాలైనా రావు నాథా! దాసి మీరా ఈ విరహవేదనాగ్నికి ఇంధనమై కాగిలి కృశించి నశించిన వెనుకనా? వచ్చి ఏమి ప్రయోజనము? అబ్బా!

(నెమ్మదిగా నేలమీదికి ఒరుగుతుంది).

గోసాయీలు: (కలకలము)

ఒక గోసాయీ: నిశ్శబ్దము. అరవకండి... అద్వితీయ మహాభక్తురాలు భక్తి తన్మయత్వంతో మూర్ఛపోయింది. లేపవద్దు... చప్పుడు చెయ్యవద్దు... భయపడకండి.

మరొక గోసాయీ: కూర్చోండయ్యా, కూర్చోండి.

మరొక గోసాయీ: ఇస్! నిశ్శబ్దం. మీరా: (నెమ్మదిగా తెప్పరిల్లుకొని లేస్తుంటుంది)


గోసాయీలు: జై మీరా మాయికి జై!
                జై మీరామాయికి జై!


మీరా: (విభ్రాంతితో నే) ప్రభూ! ఎన్నాళ్ళని నిద్రాహారాలు లేకుండా వియోగంతో... ఇస్ (అలోచన అభినయించి) ఏమి తప్పు చేశాను... (దృష్టి రాణా పంపిన సెజ్జమీద ఉంచి) అవును.. నిజమే... తెలిసింది. తప్పు చేశాను. రాణా ప్రభుభక్తుడైనాడు. రాణా ఆజ్ఞను ధిక్కరించాను.. మొదట గోసాయీ యిచ్చిన హారంతో నాథుణ్ణి అర్చించాను... అబ్బా! ఎంత తప్పిదం చేశాను.. ప్రభో, క్షమించు. ఇదుగో నీ మెడలో వేసి కళ్ళార చూచి ఆనందిస్తాను. (సెజ్జ కాని దగ్గిరకు తీసుకొని తియ్యటానికి చెయ్యి పోనిస్తుంటుంది. చివరగోసాయి అతని మిత్రుడు లేచి వెళ్ళిపోతారు).

విరజ: (గంట కొడుతూ ప్రవేశించి ఆతురతతో) అమ్మా! అమ్మా! ముట్టుకోకు.. ముట్టుకోకు... తియ్యకు! తియ్యకు! అవి పుష్పమాలికలు కావు! సర్వాగ్ని జ్వాలామాలికలు. రాణా శివారాధకుడు అన్న సంగతి మరచిపోయినావా తల్లీ!

మీరా: (ఆశ్చర్యచకితయై) విరజా! ఏమిటీ తొందర?

విరజ: తొందర ఏమిటి తల్లీ! నిమిషము ఆలస్యమే ఐతే కొంపలు అంటుకో పొయ్యేవి.

మీరా: ఏమిటీ?

విరజ: అమ్మా! ఇందాకటినుంచీ తమ చేతులో హారమేదో ఉన్నదటగా

మీరా: అదిగో! నా స్వామిని దానితో అర్చించాను.. అయితే-

విరజ: దానిని రాణా ఎక్కడినుంచో మీ చేతిలో ఉండటము ... చూచాడు. ......... .అయితే దాంట్లో తప్పేముంది. ఈ గోసాయీ నాకిచ్చారు......... (గోసాయీలు కనిపించరు ఆశ్చర్యపడి) ఆఁ!

విరజ: అది ఢిల్లీ చక్రవర్తి అక్బరు పాదుషాకు కానుకగా ఇచ్చాడట! రాణా మిమ్మల్ని అనుమానించి.. (సర్పాల సెజ్జ చూపుతుంది)

మీరా: మహాగాయకుని తాన్సేనును వెనుక పాదుషా ఒకనాటి సంకీర్తనతో తన మందిరాన్ని పవిత్రం చెయ్య మని కోరి రమ్మని పంపించాడు. నేను అంగీకరించలేదు. పాపము సంకీర్తన వినటానికి గోసాయీ వేషంతో ఎంత దూరం నడిచి వచ్చాడు.. అబ్బా, ఎంత భక్తుడు.. ఎక్కువసేపుంటే బయట పడతానని కాబోలు వెళ్ళిపోయినాడు. విరజ! నీ మాటలు సత్యమేనా? అవి సర్పములేనా?

విరజ: తల్లీ! నీ కనుమానమైతే మొదట నన్ను తియ్యనిచ్చి చచ్చి పోనీ...

మీరా: ఏమైనా సరే! నా ప్రియుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఇదంతా ఏమిటో నాకు అర్థం కావటము లేదు. ఈ విచిత్ర వరపరీక్షలో నేనెందుకు వెనకపడి పోతాను? పడను ముమ్మాటికీ పడను. అవి సర్పమాలికలైనా సరే కృష్ణుని అలంకరించక తప్పదు. (కొద్ది గొంతుకతో చెయ్యి సెజ్జకము దగ్గరికి పోనిస్తూ)


జయ జయ జయ జయ గిరిధర గోపాలా!
జయ జయ జయ జయ గిరిధర గోపాలా!


(అంటూ నెమ్మదిగా మూత ఎత్తుతుంది. అందులో పూలమాలికలు కిల కిలా నవ్వుతవి. మీరా విరజ మొగం చూస్తుంది. ఆమె భిన్నవదనంతో తల వంచుకుంటుంది. పూలహారాలతో విగ్రహాన్ని అలంకరించి గోసాయీలు మీరా సంతోషాధిక్యంలో కొద్దిసేపు)

జయ జయ గిరిధర గోపాలా జయ జయ గిరిధర గోపాలా

(అని సంకీర్తన చేస్తారు. తరువాత నిశ్శబ్దము)

మీరా: ప్రభూ! పూలదండలతో కులకటమేనా? పూబోడిని మరిచి పోయినావా? ఇప్పటికైనా రావా? నాథా! నోట మాటే రాదుగదా! మూగి వాడవా? కావే! మురళీ మోహనమూర్తివే! నాయీ కష్టాలను ఎప్పటికి ఈడేరుస్తావో కదా! ఈ జగత్తుతో నాకు ఏ సంబంధమూ లేదు. ఇంక అసలే వద్దు తల్లీ, తండ్రి, రాణా అందరూ నాకు కాని వాళ్ళే... నిన్ను ప్రేమిస్తే ఏమో వచ్చి పడుతుందని ఉద్ఘోషించారే మహాత్ములు! ఏమి వచ్చింది నాకు... వచ్చింది.. ఆఁ ఏమిటి? వట్టివేదన... చిన్నతనంనుంచీ నీ రూపాన్నే స్మరిస్తూ పలవరిస్తూ ఉన్న దానిమీద ఇంత నిర్దయా ప్రభూ! నీ నామస్మరణకు శిలలు ద్రవిస్త వన్నారే నీ హృదయమింత పాషాణమే మరి? మెరుపు మెరసినట్లు కనబడి తప్పించుకొని నావే! నాథా! అవి ఎప్పటికైనా ఫలించేవేనా? ఎన్నాళ్ళకైనా ఊహా సౌందర్యామృత పావనమేనా మీ అధరామృతపానం నాకు లభించదా?

రాణా: (చేతిలో పాత్రతో ప్రవేశించి విచిత్ర కంఠంతో) ప్రేయసీ! మీరా! నీ పరిపూర్ణానురాగానికి మెచ్చుకున్నాను. ఇదిగో... అమృతపానం చెయ్యి... (విషపాత్రిక అందిస్తాడు) మీరా: నాథా... నాథా... గోధామమునుంచి వచ్చావా... ఎటునుంచి వచ్చావు... అమృతమా... నాకోసమా ప్రభూ... ఏది? ఏది? (విష పాత్రను అందుకోబోతూ)


దాసిమీరా పైన దయ కలిగెనా నేడు
అమృతపాత్రిక నీయ నరుదెంచినావా!
                         ఓనాథ, ఓనాథ!
తాళలేనోయి నే నాలసింపగ నేల?
అమృతపాత్రిక నిమ్ము. ఆరగించెద నోయి!
నీవె నేనై నాథ! నేనె నీవై నాథ!
మీరాకు జన్మమిక మిథ్యయేనా నాథ
ఓనాథ, ఓనాథ!


(అని అందుకొని గుటగుటా తాగి) అబ్బ... హాఁ హా.... (నెమ్మదిగా నేల మీదికి ఒరుగుతుంది)

వనజ: (పరుగెత్తుకుంటూ ప్రవేశించి) అమ్మా! అమ్మా! అప్పుడే తాగేశావా! నేను పరుగెత్తుకుంటూ వచ్చేలోపలనే ఎంతపని జరిగింది! అది కాలకూటవిషము తల్లీ... (రాణావైపు చూచి, చకితయై) ప్రభువే స్వయంగా వచ్చి ఇచ్చారా! అయ్యో! అయ్యో! (అని పక్కకు తొలగి ముఖము ఎదుటికి వచ్చి నిలువబడుతుంది)

రాణా: (మీరాతలవైపుకు వచ్చి నిలువబడతాడు)

ఒక గోసాయీ: (ఉగ్రుడై) రాణా! మహాభక్తురాలికి విషమిచ్చి పాతకానికి ఒడికట్టావు!

మీరా: (నెమ్మదిగా లేస్తూ) నానాథుడు నేను ఇద్దరమూ ఇప్పుడు ఇక్కడనే మాట్లాడుతుంటిమే! ఆయన ఏమైనాడు? ఎక్కడికి పోయినాడు? బృందకు పోవాలన్నాడు వెళ్ళాడా!

(పరికించి) ఎవరిది? గోస్వామి! ఇదెవరు! రాణా!

రాణా: (గద్గదకంఠంతో) దే...వీ!

మీరా: (నిశ్చేష్టురాలై) రాణా!

రాణా: దేవీ! నీభక్తి ఇంత మహత్తర మైన దని ఎరుగక అనుమానించి బాధపెట్టినవాణ్ణి. మీరా: కాదు, కాదు. పరమాత్మస్వరూపుని మనోనాథుని చూపించిన పుణ్యాత్ముడవు.

రాణా: క్షమాపణ అర్థిస్తున్నాను దేవీ! నిన్ను ఎన్నో బాధలు పెట్టాను. (మోకరిల్ల బోతాడు).

మీరా : కాదు, కాదు. (అని వారిస్తూ తానే మరీ వంగి నమస్కరించి) పొరబాటు, రాణా! నీరూపకంగా ప్రభువు నన్ను పరీక్ష చేశాడు నీలోపము ఇక్కడ ఏమీలేదు.

రాణా: దేవీ! మహారాజుననే భ్రాంతిలో మత్తెక్కిన నాకేదైనా తరణోపాయం చూపించి అనుగ్రహించమని ప్రార్ధన!

మీరా: గురు జ్ఞానము తప్ప వేరేమార్గము ఏమీలేదు. వెళ్ళి వస్తాను నాకు సెలవివ్వండి.

రాణా: దేవీ! ఎక్కడికి?

మీరా: ఎక్కడి కేమిటి? బృందకు. నా ప్రభువు బృందలో ఉంటాడు. పోయి ఆయన్ను కలుసుకోవాలి. ఇక నాకు అమృతత్వం తప్ప వేరేలోక యాత్ర లేదు.

రాణా: (నిశ్చేష్టుడై నిలువబడతాడు.)


మీరా: బృంద బృంద బృంద భక్తలోక మందారమే బృంద
         బృంద బృంద బృంద సాధులోక చంద్రికయే బృంద


(గోసాయీలు ఆమెను పాటలో అనుసరిస్తారు. రాణా కనుచూపుమేర వరకూ వంగి నిలుస్తాడు).

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.