Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-2/ఏకాంకికలు/నాలుగు దారులు

వికీసోర్స్ నుండి

నాలుగు దారులు

1


మాళవగౌడరాగంలో ఏకతాళంలో
"సజి హో కేశిమధన ముదారం రమయ మయా సహ
మదన మనోరథ భావితయా సవికారమ్
కిసలయ శయన నివేశితయా చిర మురసి మమైva శయానమ్
కృత పరిరంభణ చుంబనయా పరిరభ్య కృతాధరపానమ్”


అన్న అష్టపదిని రాధమ్మ పరవశురాలై పాడుతూ నృత్యం చేస్తుండటం వినిపిస్తుంటుంది. చుట్టూ ఉన్న భక్తులు, భక్తురాండ్రు 'ఓహో! ఏం పారవశ్యం!! ఏం తన్మయత్వం!! సాక్షాత్తు గోలోకంలోని రాధాదేవే మనకోసం మళ్ళీ అవతరించింది. ఓహోహో...', 'చూడు, చూడు ఆ ముసి ముసి నవ్వులు. ఏమబ్బా! అంతలోనే అలా చిన్నబుచ్చుకున్నదేం’ అన్నమాటలు వినిపిస్తుంటవి)

రాధమ్మ: (దీనంగా) కృష్ణా! కృష్ణా!! మోహన కృష్ణా!! మురళీ కృష్ణా!! మరపించి మాయమై పోతున్నావా! నా పాట బాగులేదా! నా ఆట బాగు లేదా! దొంగవు వెళ్ళి పోయావా! మానసచోరా! మళ్ళీ రావూ! చిన్ననాడు మీ అమ్మ నిన్ను రోటికి కట్టేసినట్లు గట్టిగా పట్టెమంచానికి కట్టేస్తాను... ఆఁ... ఏమన్నాను... కృష్ణా! అపచారం చేశాను. నిన్ను కట్టివేస్తానన్నానా? నీ భక్తురాలిని. చరణదాసిని. ప్రియరాలిని. క్షమించు. కృష్ణా! కృష్ణా!!

(ఇష్. నిశ్శబ్దం. ఆటవల్ల అలసిపోయింది. సంకీర్తన ప్రారంభించండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అన్న భక్తుల భజన వినిపిస్తుంది)

రాధమ్మ: (అలసిన గొంతుకతో, కూనిరాగంతో)


నీ మురళి పాటలో, నే కలిసిపోయెదను
నీవె నా గతి వోయి నీవె నా పతి వోయి

(నెమ్మదిగా భక్తులు భజన చేస్తుంటారు. 'రాధాదేవీ!! రాధాదేవీ!' అన్న పిలుపులు

వినిపిస్తుంటాయి)

జోగన్న: (ప్రవేశిస్తూ) వెంకా!! ఓరి వెంకా!! బాగుంది తంతు. బ్రహ్మాండమైన మా అన్నగారి యజ్ఞశాల భక్తుల భజన కూటంగా మారిపోయిందన్నమాట. మహాభక్తా గ్రేసరులారా! ఒక్క మనవి. యజన యాజన పరులు, తపస్సంపన్నులు, మహాజ్ఞానులు పుట్టిన మా యింట్లో మళ్లీ ఎన్నడూ ఇలాంటి భజనలు జరగవు. దయ ఉంచి తామంతా ఇళ్ళకు దయచేయండి. వెంకా!! ఓరి వెంకా!! (భక్తులు వెళ్లుతున్న కోలాహలం)

వెంకడు: (ప్రవేశిస్తూ) చిన్నబాబుగారా! దేశంలోకి ఎప్పుడు వచ్చారు బాబయ్యా! ఇక్కడ సంగతులన్నీ తమకు ఎన్ని ఉత్తరాలు వ్రాయించాను బాబయ్యా! మీరూ లేరు. ఉత్తరం లేదు.

జోగన్న: అలా సంచారం వెళ్ళానోయ్. అన్నగారు సన్యసించారని తెలిసి అతడ్ని చూసి వెళ్ళి వస్తున్నాను.

వెంకడు: ఎవరు? పెద్దబాబుగారా బాబయ్య! సన్యసించారా! వారు చెప్పుకొన్న వేదమంతా ఏం చేశారు బాబయ్యా! ఎన్ని దానాలు ఎన్ని ధర్మాలు. ఆయన మహదొడ్డ దొర బాబయ్యా! వారు వెళ్ళిపోయినప్పటినుంచీ ఈ ఇల్లంతా గల్లంతు అయింది బాబయ్యా! అమ్మాయిగారు ఎప్పుడూ ఇలాగే ఒళ్ళు తెలియకుండా ఏమేమో పాడి, ఆడి స్మృతి లేకుండా పడి పోతున్నారు బాబయ్యా! అబ్బాయిగారు...

జోగన్న: ఈ శ్యామలకు ఈ పిచ్చి ఎన్నాళ్ళనుంచిరా వెంకా!!

వెంకడు: బాబయ్యా! నాలుగు నెలలకు పూర్వం ఎవరో నారాయణమ్మ గారట, మహాభక్తురాలట, వచ్చి మన ఇంట్లో 'నాలుగు దారుల'ను గురించి ఏవో గీతోపన్యాసాలిచ్చి భజనలు చేయించింది. అమ్మాయిగారికి రాధాదేవి అని పేరు పెట్టింది. అప్పటినుంచీ అమ్మాయిగారు...

జోగన్న: ఈ వెఱ్ఱిలో పడ్డదన్నమాట!

వెంకడు: ఒకప్పుడైతే రెండు మూడు రోజులు అన్నం కూడా లేకుండా అలాగే మైకంలో ఉండిపోతుంటుంది బాబయ్యా! అదుగో అమ్మాయిగారికి తెలివి వస్తున్నట్లుంది.

జోగన్న: శ్యామలా! శ్యామలా!!

వెంకడు: బాబయ్యా! అలాగే ఏవో ముసి ముసి నవ్వులు నవ్వుతుంటుంది. జోగన్న: శ్యామలా! శ్యామలా!!

రాధమ్మ: ఎవరు? నీవా? వచ్చావా? శ్యామ సుందరా! (కూనిరాగంతో)


నన్ను వలచి వచ్చితివ
నందసుతా! సుందరుడా!!


జోగన్న: ఇటువంటి ఇంట్లో పుట్టిన నీకు ఏం ఖర్మ పట్టింది తల్లీ! శ్యామలా!

రాధమ్మ: కృష్ణా! కృష్ణా!! వచ్చావా!!

జోగన్న: కృష్ణుణ్ణి కాదమ్మ! నీ బాబయ్యను జోగన్నను వచ్చాను.

వెంకడు: అమ్మా! రాధమ్మగారూ! మీ బాబయ్యగారు, చినబాబుగారు వచ్చారమ్మా! పెదబాబుగారిని చూచి వచ్చారుటమ్మా!

రాధమ్మ: ఎవరు? వెంకా!!

జోగన్న: వెంకా! ఇక నువ్వు వెళ్ళి నేను వచ్చానని చెప్పి అబ్బాయిని ఎక్కడున్నా సరే తీసుకురా! ఉఁ వెంటనే వెళ్లు.

రాధమ్మ: ఎవరది? బాబయ్యా! ఎప్పుడు వచ్చావు?

జోగన్న: పది నెలలు సంచారం చేసి మొన్ననే ఇంటికి వచ్చాను. వెంకడు వ్రాయించిన ఉత్తరాలు చదువుకొని గుండె నీరై వెంటనే ఇలా కొట్టుకో వచ్చాను. ఈ భక్తులేమిటి? ఈ భజనలేమిటి? ఎంత పిచ్చిలో పడ్డావమ్మా?

రాధమ్మ: సర్వజన ప్రియుడైన కృష్ణ పరమాత్మను భక్తితో సేవించటంలో పిచ్చేముంది బాబయ్యా! నాన్నగారు వెళ్ళిపోయిన తరువాత మహాభక్తురాలు నారాయణమ్మ ఇంత కృపావీక్షణం నామీద ప్రదర్శించింది. 'నాలుగు దారుల్లో' సర్వోత్కృష్ట మైంది భక్తని తెలుసుకున్నాను.

జోగన్న: భక్తితో భగవంతుణ్ణి సేవించటం చెడ్డ మార్గమని ఎవరంటారు? కానీ అమ్మా! శ్యామలా! నా కడుపున పుట్టిన మాణిక్యం కంటే నీవంటే నాకెంతో మమకారమమ్మా! అర్థరహితంగా చిన్నతనంలోనే ఆత్మహత్య చేసుకొని మా అల్లుడు నిన్ను నట్టేటిలో ముంచినప్పుడు నమ్ము శ్యామలా నేను నాలుగు రోజులు అన్నం కూడా ముట్టలేదు. రాధమ్మ: వారు నట్టేటిలో ముంచటం వల్లనే నాకు గట్టి మార్గం దొరికింది. అర్చావతారుడు భక్తలోక మందారుడు అయిన ఆ కృష్ణ పరమాత్మ యందు అన్యచింతలన్నీ విడిచిపుచ్చి మనస్సును, బుద్దిని లగ్నం చేశాను. గోపిక నైనాను. రాధనైనాను. 'మయ్యర్పిత మనో బుద్ధి ర్యోమే భక్తః సమే ప్రియః' అన్న గీతా వాక్యాన్ని తరిచి చూచాను. భక్తి మార్గమే నాలుగు దారుల్లో సర్వశ్రేష్ఠమని బోధపడింది.

జోగన్న: నిర్వహించవలసిన లోక ధర్మాలను, నిత్య నైమిత్తిక కర్మలను విడిచి పుచ్చి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించటం ఉత్తమ మార్గం కాదమ్మా! ఉత్తమ మార్గమే కాదు గీతా మార్గం కూడా కాదు. అదీకాక నీ మధురభక్తి మహా ప్రమాదకారి కూడాను. ఇది పరిణత బుద్ధులకు గాని నీకు మార్గం కాదమ్మా!

రాధమ్మ: 'సర్వధర్మాన్ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ' - అన్న గీతా వాక్యాన్ని స్త్రీనైన నా పరంగా సమన్వయించుకొంటే మధురభక్తి మార్గమే మార్గమని నాకు నిర్ణయమైంది. నాలుగు దారుల్లో భక్తి ఉత్తమమైంది. అందులో మధురభక్తి మహోత్కృష్టమైంది.

జోగన్న: అమ్మా శ్యామలా! నీవు చెప్పేదంతా అపసవ్యంగా ఉంది. తెలిసీ తెలియని వాళ్ళందరూ ఈనాడు గీతకు అర్థాలు చెప్పటం ప్రారంభించారు. అందువల్లనే అపమార్గాలు బయలుదేరాయి. గీత కీకారణ్యం వంటి గ్రంథం. సంప్రదాయ సిద్ధమైన భాష్యం వినాలి. అది కర్మత్యాగం చెయ్యమని ఎక్కడా చెప్పలేదు. కర్మమార్గం కష్టసాధ్యమైంది కనుక అలస స్వభావులు సులభమైన అన్య మార్గాలను అన్వేషిస్తుంటారు! 'స్వధర్మ నిర్వహణ శ్రేయం పరధర్మం భయావహమ్' - అన్న మకుటాయమానమైన గీతా వాక్యాన్ని బహుకాల కర్మాచరణంతో అనుసంధించి తరిచి చూడటం నేర్చుకో. మన పెద్దల మార్గాన్ని అనుసరించు.

రాధమ్మ: మీరన్న వాక్యంలో స్వధర్మ శబ్దానికి మనోధర్మమని అర్థం. మన పూర్వులు వారి వారి మనోధర్మాలను అనుసరించారు. 'ప్రణయదాస్యం' నా మనోధర్మం. సమస్త దాస్య భావాలల్లో సత్వర మోక్షసిద్ధికి సాధనం. అందువల్ల నేను దానిని అనుసరిస్తున్నాను. లౌకికాలైన రాగద్వేషాలను, కామ క్రోధాలను త్రెంచుకొన్న నన్ను మళ్ళీ కర్మబంధాలతో సంసార చక్రానికి కట్టి పడేయవద్దు.

జోగన్న: తీర్చి దిద్దుకోబోయే పెద్దలు ఇంట్లో లేకపోవటం వల్లా, తీరని కోర్కెలు తికమక పెట్టటం వల్లా నిరాశను పొంది నీవీ అపమార్గాన్ని పట్టావు. మోక్షం ఇంత చులకనగా ఇట్టే చేజిక్కేదా? అయితే అందరికీ మోక్షం వచ్చి జీవులకు సమాప్తి కలిగి ఉండేది. 'మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే' అన్న గీతా వాక్యంలో ఎవ్వడో ఒక్కడే ఎప్పుడో ఒకప్పుడే కైవల్య మోక్షాన్ని పొందుతాడని గీతాకారుడు చెప్పలేదూ? సన్యసించిన అన్నగారు సర్వజ్ఞులు. వారిని అబ్బాయి వివాహ సమయానికి మన ఊరు రమ్మని ప్రార్థించి వచ్చాను. వారివల్ల సన్మార్గమేదో తెలుసు కొందువుగాని అమ్మా!...

రాధమ్మ: ఎవరెన్ని చెప్పినా బాబయ్యా మళ్ళీ నా మనస్సును మార్చలేరు. కర్మాచరణంతో నన్ను కట్టి పడవేయలేరు.

జోగన్న: మీ అమ్మగారు చనిపోవటం, నాన్నగారు సన్యసించటంతో గృహనిర్వహణ భారమంతా నీమీద పడింది. శ్యామలా! నీవు ఇలా అయిపోతే తమ్ముడు చెడ్డ సహవాసాలకు పూనుకుంటున్నాడు. ఇంకో చెల్లెలికి పెళ్ళి కావలసి ఉంది. నేను అనేదంతా ఏకాంతంగా ఆలోచించుకో - అబ్బాయి కోసం వెళ్ళిన వెంకడు ఇంకా రాలేదు.

రాధమ్మ: వాడు స్వర్ణయోగం కోసం కొన్నాళ్ళబట్టీ ఒక యోగిని సేవిస్తున్నాడు. బహుశః ఊరుబయట పాడుపడ్డ శివాలయం దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అబ్బాయి కూడా అక్కడే ఉండవచ్చు.

జోగన్న: వాడు కూడా ఆ యోగిని సేవిస్తున్నాడా ఏమిటి? కర్మిష్ఠుల కుటుంబానికి ఎట్టి కష్టకాలం వచ్చింది. సరే! నా దేవతార్చనకు యత్నం చేయించు. అక్కడ బల్లమీద ఉన్న మడి సంచిలో నా అంగవస్త్రం ఉంది. మడికి ఆరేయించు. నేను అబ్బాయి సంగతి ఏమిటో కనుక్కొని వస్తాను.

2


"శివ శివాయన మేలు తుమ్మెదా!
నీకు
శివయంటె విన మేలు తుమ్మెదా నీకు!!
చిత్తమేకాగ్రతకు
చేర్చి నిల్చిన నీకు
సిద్ధి చేకూరునే తుమ్మెదా నీకు!


నీకు
శివలోక మబ్బునే తుమ్మెదా!!


అన్న పదాన్ని శంకరం వెంకడు పాడుతుంటారు.

శంకరం: వెంకా! నెగడు ఎగసన తొయ్యి! నేను ఈ చిలుము బాగు చేసి గురువుగారు కన్నులు తెరిచేటప్పటికి సిద్ధం చేస్తాను. (కూనరాగంతో 'సిద్ధులను సేవింప తుమ్మెదా నీకు సకలార్థ సిద్ధి యొడగూడునే తుమ్మెదా!' అని పాడుతూ) వెంకా! యోగివారు క్రొత్త శక్తులేమైనా చూపించారా?

ఆయన కెన్ని శక్తులుంటే ఏం బాబూ! ఇన్నాళ్ళబట్టీ కొలుస్తున్నాం కదా. ఇంత బంగారం చెయ్యటమన్నా మనకు చెప్పలేదు. చెప్పలేదంటే జ్ఞప్తికి వచ్చింది బాబూ! నిన్న మీ బాబయ్యగారు మన ఊరికి వచ్చారు. మిమ్మల్ని వెంటనే పిలుచుకురమ్మన్నారు. చెప్పటం మరిచి పోయాను బాబూ!!

శంకరం: ముంచుకో పోయింది ఏమీ లేదులే. చెప్పినా వెళ్ళేవాణ్ణి కాదు. ఈ మాటు గురువుగారిని కొన్ని ప్రశ్నలడిగి కాని ఇంటికి వెళ్ళదలచుకోలేదు.

వెంకడు: ఆయనగారికి కోపం వస్తుందేమో బాబూ!

శంకరం: సంసారాన్ని వదులుకొన్నవాడిని ఆయన కోపం నన్నేం చేస్తుందిరా! వెంకా! గురువుగారు సమాధి చాలించేటట్లున్నారు చూడు!

వెంకడు: అవును బాబూ! లక్షణం అలాగే ఉంది. మనం పంచాక్షరి చేస్తుందాము. (ఇద్దరూ 'ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ' అంటుంటారు)

శంకరం: ఓం నమశ్శివాయ... జై సదాశివ యోగీంద్రులకు జై. (వెంకడు 'జై' అంటాడు.)

సదాశివయోగి: మహదేవ్! మహదేవ్! శంభో శంకర్!! సదాశివ శంకర్!! శంకర యోగీ! వెంకటయోగీ! కైలాసంలో పార్వతీ పరమేశ్వరులను సందర్శించి వచ్చాను. వారు ఎంతో ప్రేమతో మీ పేర్లు చెప్పి క్షేమంగా ఉన్నారా అని ప్రశ్నించారు. పరమ శివుడు మీకు ఈ విభూతిని పార్వతి ఈ కుంకుమను ఇచ్చారు.

శంకరం: మహా ప్రసాదం! వెంకా పుచ్చుకో!! శంకరం ఇదుగో గురువుగారికీ చిలప అందించు. యోగి: (గంజాయి పీలుస్తున్న చప్పుడుతో) జయ్‌శంకర్! (గాలి విడుస్తూ) జయ్ మహదేవ్!!

వెంకడు: స్వామీ! తాము ఇక్కడనే ఉన్నారు గదా తెలియకడుగుతున్నాను, కైలాసానికి ఎలా వెళ్ళి వచ్చారు?

యోగి: (నవ్వుతూ) వెంకట యోగీ! ఆత్మశక్తి చేత మేము అణిమాద్యష్ట సిద్ధులను సంపాదించాం. 'ఖేచరీ విద్య'తో ఒక కైలాస మేమిటి, ఇంద్ర, మహేంద్ర, బ్రహ్మలోకాలన్నీ తిరిగి క్రీడించి వస్తుంటాము.

శంకరం: గురుదేవా! ఇదంతా వేటి సహాయంతో...

యోగి: (చిఱు కోపంతో) వేటి సహాయంతోనా! పవమాన రూపంలో. అంగరూపాలైన మనస్సుతో, ఇంద్రియాలతో... సరి. చిత్తనిరోధం చెయ్యటంలో మీ రెంతవరకు వచ్చారు? గురుదేవులే మీకు సర్వమని భావించగలుగుతున్నారా? ఇవి మీకు కుదిరితే సమాధి నిమగ్నులై తేజోమయమైన ఆత్మ స్వరూపాన్ని దర్శించటం మీకు నేర్పుతాను. సంశయించటం మాని వేశారా?

వెంకడు: స్వామీ! తాము వెనక చెప్పింది నాకేమీ తలకెక్కలేదు. నిత్యమూ మీకు పాలు తెచ్చి యివ్వటం, మీ దర్శనం చేసి ఇంత చిలుము పట్టటం తెలిసింది.

యోగి: అయితే ఇప్పుడిప్పుడే గురుభక్తి కుదురుకొంటున్నదన్నమాట!

శంకరం: గురుదేవా! గీతలో పరమాత్మ 'సంశయాత్మా వినశ్యతి' అని చెప్పినా సంశయించటం మానవ స్వభావమై పోయింది. అందులో చెప్పిన నాలుగు దారుల్లో 'ధ్యాన యోగం' సర్వోత్తమమైంది.

ఇలా తమకు కోపం వస్తే నేనేమీ అడగనులెండి.

యోగి: (నవ్వుతూ) మీకు శిష్యులై ఉండి చిత్త నిరోధం చెయ్యలేక సంశయించినప్పుడు మాకు కొంత కోపం రావటం కద్దు. అంతటితో భయపడవద్దు. శంకర యోగీ! అడగలదలచిందేమిటో కానీ...

శంకరం: గీతలో చెప్పిన భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞానాలనే నాలుగు మార్గాలల్లో...

యోగి: 'ముక్తిమార్గం ధ్యానమొక్కటే' భగవంతుడు వేరు - జీవుడు వేరు, ఆయనకు దాస్యం చెయ్యటమే ముక్తి అని చెప్పే భక్తిమార్గం ఉపాసకుడికి ఆరంభ దశలో కొంత ఉపకరిస్తుంది. కర్మత్యాగం చేస్తేగాని సమాధిస్థితి రానప్పుడు, అందుకు కామక్రోధాలను చంపుకోవలసి ఉండగా, భోగాసక్తిని పురికొల్పే శ్రౌత కర్మలను ఆచరించమని చెప్పే కర్మమార్గం అర్థం లేనిది. యోగకర్మా చరణం వల్ల బ్రహ్మజ్ఞానానికి అధికారం లభిస్తుంది.

శంకరం : అప్పుడీ జ్ఞానంతో జీవుడు ధ్యానయోగాన్ని అనుసరించి సమాధి స్థితిని పొంది, చైతన్యరూపాన్ని దర్శించి, సంసారబంధం వల్ల కలిగిన అజ్ఞానం చేత - అంటే మాయ చేత - లోపించిన సర్వజ్ఞత్వ సర్వశక్తిత్వాదులను సంపాదించి యోగీశ్వర సార్వభౌముడైన మహాదేవుడిలా అష్టసిద్ధుడౌతాడన్నమాట!

యోగి: (నిష్కర్షగా) అంటే. శంకరయోగీ! ఇప్పుడు నీకు సన్మార్గం బోధపడింది. ఇక సంశయించటం మానివెయ్యి!

వెంకడు: ఇదంతా నాకేమిటో అయోమయంగా ఉంది. స్వామీ! నాకు మీరు చెప్పదలచుకొన్న విద్య ఆ 'స్వర్ణయోగం'తో ఆరంభించండి. ఇంత బంగారం చేసి ఇంట్లో పడేసి వస్తేనే గాని నేను చిత్త నిరోధం చెయ్యగలిగేట్లు లేదు. అందాకా మిమ్మల్ని భక్తితో సేవిస్తాను.

యోగి: (నవ్వుతూ) వెంకట యోగీ! అలాగే చేద్దాం. ఇదుగో! ఈ చిలప పుచ్చుకో!

వెంకడు: స్వామీ! కైలాసానికి వెళ్ళి వచ్చానంటున్నారు, మీ కాళ్లెంత నొప్పులు పెడుతున్నాయో! అనుగ్రహిస్తే పిసుకుతాను.

శంకరం: నన్ను కూడా అనుగ్రహించండి!!

యోగి: జయ్ మహాదేవ! శిష్యుల కోర్కెలను కాదనటం మా మతం కాదు. కానివ్వండి. (శంకరం, వెంకడు, యోగి కాళ్ళు పడుతుంటారు. యోగి 'ఓం నమశ్శివాయ అంటూ 'గురునకు హరునకు తుమ్మెదా! అంతరువు లేదు నిజము తుమ్మెదా!' అని పాడుతూ మధ్య మధ్య 'అబ్బ' అంటుంటాడు.)

జోగన్న: (ప్రవేశిస్తూ “సాధుకారీ సాధుర్భవతి. పాపకారీ పాపోః భవతి. పుణ్యం పుణ్యేన కర్మణా భవతి పాపః పాపేన" అన్న శ్రుతి పాఠాన్ని హఠాత్తుగా ఆపి) శంకరం!! శంకరం!! ఆరి భ్రష్టుడా!! సదాచార సంపత్తి గల సత్కుటుంబంలో పుట్టావు. స్వాధ్యాయం చేశావు. ఈ దొంగ యోగి కాళ్ళు పట్టటానికి నీకేం ఖర్మ పట్టిందిరా! పాడుపడ్డ ఈ శివాలయమేమిటి? ఈ గడ్డాలు, మీసాలు ఏమిటి? బాగుంది. కడుపు నిండేటట్లుంది. అది అలా!! నీవు ఇలా!!... పద ఇంటికి. అబ్బాయిని పిలుచుకో వస్తానని నిన్న వచ్చినవాడివి నీవూ ఇక్కడే చచ్చావు? ఇక్కడున్నట్లుగా వాణ్ణి ఇంటికి తీసుకోరా. లేకపోతే నీ తాట వొలిపిస్తాను.

స్వామి: అయ్యా! తామెవరో కాలాగ్ని రుద్రుల్లా వచ్చారు. కానీ వీళ్ళిద్దరూ ధ్యాన యోగసిద్ధిలో ఎన్నో భూమికలు గడిచినవాళ్లు. బలవంతపెట్టి సంసారంలో పడేయకండి. ఇది పాపం !!

జోగన్న: అయ్యా! దొంగ యోగీ!! నిన్ను గురించీ నీ ధ్యానయోగాన్ని గురించీ ఎంతో విన్నాను. నీ గారడీలతో తెలిసీ తెలియనివాళ్ళను ఇలాగే వశం చేసుకొని కర్మభ్రష్టులను చేస్తున్నావట! నీవల్ల కమ్మని సంసారాలు పాడౌతున్నవి. నిన్ను చేరినవాళ్ళకు మోక్షం కలగటం మాట ఎట్లా ఉన్నా నీకు మాత్రం నరకం తప్పదు.

యోగి: (నవ్వుతూ) అజ్ఞానం! అష్టసిద్ధులను సంపాదించిన మాకు నరకమా! అర్థరహితమైన కర్మిష్ఠులు ఇలాగే అంటారు. యోగమార్గంలో...

జోగన్న: యోగం లేదు జోగం లేదు. ఇక కట్టిపెట్టు. నేను నీ దగ్గరికి జ్ఞానోపదేశం కోసం రాలేదు. పిల్లవాణ్ణి పిలుచుకో పోవటానికి వచ్చాను. ఓ కపట యోగీ! మంచి మాటలు చెప్పి మావాణ్ణి ఇంటికి పంపించు. లేకపోతే నీకు ఈ ఊళ్ళోనే జీవసమాధి చేయించకపోతే నా పేరు జోగన్నే కాదు. నేను యజ్ఞ నారాయణ దీక్షితుల తమ్ముణ్ణి కాదు.

స్వామి: (పెద్దపెట్టున నవ్వుతా) ఇది అన్యాయం! దౌర్జన్యం!! అజ్ఞానం.

జోగన్న: ఏడిచావు నీవు మహాజ్ఞానివి! మేము అజ్ఞానులం!!! ఒరేయ్ శంకరం ఇంకా బయలుదేరవేం ఇంటికి... ఓరి వెంకా! వాణ్ణి వెంట బెట్టుకోరా!

శంకరం: నేను రాను బాబయ్యా! ఆ చయనులగారి అమ్మాయిని పెళ్ళి చేసుకోను.

జోగన్న: (కోపంతో) చేసుకోవు. యజ్ఞోపవీతం కూడా తీసేసి ఘోటక బ్రహ్మచారిలా ఉండి ఈ కపటయోగి కాళ్ళు పడుతుంటావు. ఎలా చేసుకోవో చూస్తాను. భ్రష్టుడివైన నీకు ప్రాయశ్చిత్తం చేయించి బలవంతాన్నయినా సరే చయనుల గారి పిల్లనిచ్చి పెళ్ళి

చేయిస్తాను. యోగీ!! పిల్లవాణ్ణి పంపించు. వెంకా!! వాణ్ణి వెంట బెట్టుకురా!!

3


చయనులు: (శిష్యుల చేత అగ్నికార్యం చేయిస్తూ “స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహిమే హవ్యవాహన, శ్రియం దేహిమే హవ్యవాహన" అన్న మంత్రాన్ని తాను చెపుతూ బ్రహ్మచారులచేత అనిపిస్తుంటాడు).

సూరమ్మ: ఏమండోయ్ మిమ్మల్నే. మీ కర్మలేమో మీరేమో! కాస్తయినా ఇంటి సంగతి పట్టించుకోకపోతే ఎలా చచ్చేది?

చయనులు: అగ్నికార్యం చేయించి వచ్చే ఇంతలోనే అంత ముంచుకోపోయేది. ఏం వచ్చి పడ్డది.

సూరమ్మ: ఇంకా ఏం వచ్చి పడాలి. పెద్ద మనిషి అయిన పిల్లను ఏడాది దాటినా ఇంకా ఇంట్లో పెట్టుకొని కూర్చున్నామా? అమ్మలక్క లేమంటున్నారో యజ్ఞశాల దాటిరాని మీకేం తెలుస్తుంది. వినలేక చెవులు చిల్లులు పడిపోతున్నవి. తాంబూలాలు పుచ్చుకొని కూడా ఏడాది దాటి పోవస్తున్నది.

చయనులు: అమ్మా! అలా తొందరపడితే ఎలా. ఆ యజ్ఞేశ్వరుడి కృప ఎప్పటికుందో అప్పటికి గాని ఏ పనీ జరగదు. ఆమె పోయిన తరువాత యజ్ఞ నారాయణ ఎక్కడికో వెళ్ళి సన్యాసం పుచ్చుకున్నాడు. అతని తమ్ముడు జోగన్న సంచారానికి వెళ్లి తిరిగి వచ్చినట్లు తెలిసి ముహూర్తం పెట్టించుకొని రావల

సిందని ఉత్తరం వ్రాయించాను. ఇవాళో రేపో అతగాడు రానే వస్తాడు. ఎవరో మన ఇంటికోసం వెతుకుతున్నట్లున్నారు?

జోగన్న: అమ్మా! నారాయణ చయనులగారి ఇల్లు ఇదేనా? ఇంట్లో ఉన్నారా?

సూరమ్మ: ఇదే. రండి. కాళ్ళకు నీళ్ళు తీసుకొస్తాను.

జోగన్న: ఏమిటి? బావగారూ? అలా చూస్తున్నారు గుర్తు పట్టలేదా ఏమిటి? నేను జోగన్నను. యజ్ఞనారాయణ దీక్షితులుగారి తమ్ముణ్ణి.

చయనులు: అరె నీ తస్సదియ్య! ఎంతవాడివైనావోయ్! నిన్ను ఎప్పుడో చిన్నప్పుడు మీ నాయనగారి యజ్ఞమప్పుడు చూచాను... రా నాయనా! కూర్చో మంగళం పల్లిలో మనవాళ్ళంతా కుశల మేనా? నా ఉత్తరం అందిందా? జోగన్న: మంగళంపల్లినుంచే వస్తున్నా.

చయనులు: మరి ముహూర్తం పెట్టించుకోవచ్చావా?

జోగన్న: లేదు బావగారు! మంచిచెడ్డలు ఒక్కమాటు మీతో మాట్లాడి వెళ్ళుదామని వచ్చాను.

చయనులు: అబ్బాయీ! జోగన్నా! ఈ లౌక్యాలన్నీ కట్టిపెట్టు. కట్నాలు కానుకలు చూచుకోకు. సంప్రదాయం చూచుకో. తరతరాలుగా మాది ఆహితాగ్నుల వంశం.

సూరమ్మ: (లోపలినుంచి వస్తూ) అన్నగారూ! కట్నాలూ కాన్కల సందర్భాలన్నీ ఇదివరకే అన్నగారితోటీ, వదినగారితోటీ మాట్లాడుకున్నాం. మీ బావగారు అన్నవాటి విషయంలో తిరిగిపోయేవారు కాదు. కానీ ఈ సంబంధం ఇప్పుడు అబ్బాయికి ఇష్టమేనా?

చయనులు: అదేమిటి? అలా అడుగుతున్నావు?

సూరమ్మ: ఆఁ ఏమీ లేదు. నిన్న మా చెల్లెలు మహలక్ష్మమ్మ చేత కబురు చేసింది. ఆ అబ్బాయి అక్క శ్యామల భక్తురాలైపోయి ఇంట్లో దొంగలు పడ్డా పట్టించుకోలేని స్థితిలో ఉందట. ఎవరికి చిక్కింది వాళ్ళు ఎత్తుకోపోతున్నారట! ఆమె రాధాదేవని పేరు కూడా మార్చుకున్నదట! జనమంతా పిచ్చెక్కిందనే చెప్పుకుంటున్నారుట!

చయనులు: మన అమ్మాయి వెళ్ళితే అన్నీ చక్కబడతాయి. కుఱ్ఱవాడు చక్కనివాడు. స్వాధ్యాయ పరుడు.

సూరమ్మ: అతడు కూడా మనిషి చాలా మారిపోయినాడట! వెనుకటి కథ కాదట. స్నాన సంధ్యలు కూడా లేవట. పిల్లకు మరో మంచి సంబంధం చూచుకోవటం మంచిదని మా చెల్లెలు చెప్పి పంపించింది.

చయనులు: అదేమిటోయ్! జోగన్నా!! ఏదో అన్యాయం చేసి పోదామని వచ్చినట్లున్నావు?

జోగన్న: కోప్పడకండి బావగారూ! నేను ఏ దురుద్దేశంతోటీ రాలేదు. మీ సహాయంతో జరిగిన సమస్తాన్ని చక్కదిద్దుకుందామని వచ్చాను. బేరమాడి ఎక్కువ కట్నాలు పుచ్చుకుందామని రాలేదు.

చయనులు: అయితే మరి మా ఆవిడ చెప్పే విషయాలు?

జోగన్న: నిజమే బావగారూ పది నెలల పైచిలుకుగా నేనీ ప్రాంతంలో లేకపోవటం వల్ల మా అన్నగారి ఇంటి పరిస్థితులు కొంత తారుమారైనాయి. శ్యామలకు నచ్చచెప్పి దాని అపమార్గాన్ని మాన్చగలిగాను. కానీ కుఱ్ఱవాణ్ణి సరిదిద్దటం నాకు కష్టమై పోయింది. ఇందుకు అన్ని సంపత్తులూ కల మిమ్మల్ని అర్థించటానికని వచ్చాను.

చయనులు: అసలు విషయ మేమిటి?

జోగన్న: కుఱ్ఱవాడు శంకరం ఒక కపటయోగి వలలో పడ్డాడు. వాడు ధ్యానయోగమని కొన్ని గారడీలు చూపించి ఇంటిమీద బుద్ధి లేకుండా కుఱ్ఱవాణ్ణి అరికట్టేశాడు.

చయనులు: ఇంతకూ కుఱ్ఱవాడు కర్మభ్రష్ఠుడైనాడన్నమాట! పెళ్ళి అయిన కొద్ది రోజుల్లోనే వాడికి యాగదీక్ష ఇప్పిద్దామనుకున్నాను. చెప్పుకున్న శ్రౌతమంతా గుంటలో పెట్టి గంట వాయించాడన్న మాట!

జోగన్న: అంతటితో ఆగితే చాలు. ససేమిరా నాకు పెళ్ళి వద్దంటున్నాడు.

సూరమ్మ: అన్నగారూ! అటువంటివాడికి బలవంతాన పిల్లనిచ్చి అంటగడితే తరువాత అది మన జీవానికి ఏడవవలసి వస్తుంది. ఏమండోయ్! ఈ సంబంధం నాకేం నచ్చలేదు. ఇంత ఉన్న వాళ్ళం. అవసరమైతే మరో ఎకరం మాగాణి ఇచ్చి ఐనా సరే ఎక్కడైనా మరో సంబంధం చూడండి.

జోగన్న: అక్కగారూ! మీరు తొందరపడవద్దు. బావగారు కర్మిష్ఠులు సద్వంశంలో పుట్టిన కుఱ్ఱవాడు చెడిపోతుంటే సహించి ఊరుకోరని నా నమ్మకం.

చయనులు: ఊరుకుంటే మహా పాపం కదుటోయ్ జగ్గన్నా! ఏమైనా సరే! వాణ్ణి సన్మార్గానికి త్రిప్పి తీరాలి. మంగళంపల్లిలో నీ మాటంటే కాదనేవాడు ఎవడున్నాడు?

జోగన్న: సంతోషం బావగారు!

చయనులు: నేను ఇంత కష్టపడి కుఱ్ఱవాణ్ణి ఒకదారికి తెచ్చిన తరువాత నీవు మళ్ళీ ఏదో అడ్డుపుల్ల వేసి కట్నం విషయంలో పేచీ లేవదీయకూడదు సుమా! కానుకల విషయంలో కూడా అంతే.

జోగన్న: సర్వం మీ ఇష్టానుసారంగానే సాగిస్తాను. వాగ్దానం చేస్తున్నాను. మీ బోటి లౌకికుల వాగ్దానాలు చెల్లించేవి కావంటారా. ఈశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

చయనులు: ఇంతకూ కుఱ్ఱవాడు ప్రస్తుతమేమంటున్నాడు.

జోగన్న: గీతాకారుడు చెప్పిన కర్మ-భక్తి-జ్ఞాన-ధ్యాన మార్గాలల్లో కర్మమార్గం అధమాధమమట! వైదిక కర్మలన్నీ ఇంద్రలోకంలో నందనవనంలో ఇతర లోకపాలక లోకాలల్లో భోగాలను అనుభవించటానికేనట! కర్మత్యాగం వల్ల తప్ప చివరకు గురుభక్తి కూడా కుదురుకోదట!

చయనులు: ఆరి పుండా కోర్! కష్టసాధ్యమైన కర్మమార్గం అధమస్తుల దృష్టిలో అధమంకాక ఏమౌతుంది. యజ్ఞ యాగాలల్లో కర్మిష్ఠులు కొలిచే దేవతలంటే మంత్ర శక్తులనీ, యజ్ఞాలంటే కామధేనువులనీ ఎరగని యంబ్రహ్మలు ఏవేవో చెపుతుంటారు. మంచి చెడ్డ ఎఱగని పసి మనస్సులను అవి పట్టుకుంటాయి. అందాకెందుకు ఈ మధ్య జ్ఞానవాదులంటూ ప్రత్యేకంగా బయలు దేరారు కొందరు. ఈ అలస స్వభావులు పుట్టుకనుంచే బ్రహ్మజ్ఞానుల్లా "ఓ మిత్యే కాక్షరం బ్రహ్మ, తత్త్వమసి, అహం బ్రహ్మాస్మి, సోహం” ఇత్యాది ఉపనిషద్వాక్యాలకు విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈనాడు గీతకు ఎవరి ఇష్టం వచ్చిన వ్యాఖ్యానం వారిది. అన్నీ యోగాలే. అంతా జోగులే. కర్మ భ్రష్ఠులు!! యోగులట! జ్ఞానులట!! అన్ని అపమార్గాలూ గీత పేరుతో చెల్లిపోతున్నవి.

జోగన్న: బావగారు! మీరు ఎలాగైనా మా శంకరాన్ని మంచి మార్గానికి త్రిప్పి మీ అల్లుణ్ణి చేసుకోవాలి సుమా! వాడిచేత మీరు బ్రహ్మగా మహనీయమైన ఒక మహా యజ్ఞం చేయించాలి.

చయనులు: తప్పక చేయిస్తాను. మర్నాటికల్లా ఆ యోగిగాడిని మంగళంపల్లి పొలిమేరలలో లేకుండా తరిమేయిస్తాను. జగ్గన్నా! ఇది యజ్ఞేశ్వర సాక్షిగా చెపుతున్నమాట! మంచిది ఇక నీవు లోపలికి వెళ్ళి స్నాన సంధ్యాద్యనుష్ఠానం పూర్తి చెయ్యి. ఇదిగో! అమ్మాయితో మామగారికి నీళ్ళు తోడి ఇవ్వమని చెప్పు.

జోగన్న: బావగారు మరి సెలవా!

చయనులు: ఇదుగో అమ్మీ! మనం మటుకు అంత తొందరపడితే ఎలా! ఏదో చెడిపోయిన వాడిని బాగు చేసుకొని అల్లుణ్ణి చేసుకొంటే తరువాత అతగాడు చెప్పినట్లు వింటాడు. అటువంటివాళ్ళ వల్లనే ఇచ్చుకున్న పిల్లలకు ఎంతైనా సౌఖ్యం ఉంటుంది.

4

(సర్వం శ్రీయజ్ఞేశ్వరార్పణ మస్తు... అమ్మా మంగళహారతి కానివ్వండి. అన్న పురోహితుడికి వాక్యాల తరువాత 'శ్రీరామచంద్రునకు సీతా సమేతునకు' మంగళం, మంగళంపల్లిపుర మహిత రాజేంద్రుడు మంగళం నిత్య శుభమంగళమ్' అన్న హారతి వినిపిస్తుంటుంది.) రాధాదేవి: బాబయ్యా! నీవు స్వామివారి దగ్గర ఉండు. అబ్బాయి వాళ్ళ అగ్నికార్యం పూర్తి అయినట్లుంది. వాళ్ళను తీసుకోవచ్చి స్వామి వారికి వందనం చేయిస్తాను. అత్తగారూ! మీరు కూడా రండి, అమ్మాయిని వెంటబెట్టుకోవద్దురుగాని.

సూరమ్మ: ఇంక మాదేముందమ్మా! అమ్మాయి నీదే. అబ్బాయి ముందే నీవాడు. ఇద్దర్నీ నీవే నీవాళ్ళచేత నడిపించుకోరా!!

జోగన్న: అరుగో! సమయానికి చయనులు బావగారు కూడా వచ్చారు.

చయనులు: ఓహో! స్వామివారా! బాధానంద భారతీ స్వాములవారికి హరితసగోత్రో ద్బవుడయిన చయనుల పాదాభివందనాలు.

స్వామి: నారాయణ! నారాయణ!!

వెంకడు: చిన్న బాబుగారూ! ఆ కూర్చున్నది తమ అన్నగారు పెదబాబు గారు కాదు. ఓ పెద బాబయ్యా! దండాలు దండాలు. మీరు వెళ్ళిన తరువాత అంతా తలకిందులైంది బాబయ్యా! ఏమీ తెలియక ఆ దొంగయోగి పాదాల పట్టాను బాబయ్యా! ఎరగనోణ్ణి! క్షమించండి బాబయ్యా! ఇప్పుడు నాకు కడుపు నిండినట్లుంది బాబయ్యా! నాకేదన్నా మార్గం చెప్పండి (ఏడుస్తాడు).

చయనులు: వెఱ్ఱవాడు. కల్లాకపటం ఎఱగడు. స్వామీ! వీడికి తామేదైన తరణోపాయం సెలవియ్యాలి.

స్వామి : ఇటువంటి వారి కందరికీ నామస్మరణం, వారి వారి ధర్మాలను ఆచరించటమే తరణోపాయాలు. నారాయణ! నారాయణ!!

జోగన్న: వెంకీ! స్వామివారు చెప్పిందేమిటో నీకు నేను తరువాత విపులంగా చెపుతానులే. రాధమ్మ: మామగారూ! అత్తగారు అమ్మాయినీ అబ్బాయినీ స్వామివారి దగ్గరికి తీసుకోవస్తున్నారు.

జోగన్న: బావగారి అనుగ్రహం వల్ల మన శంకరం ఒక ఇంటివాడైనాడు.

స్వామి: నారాయణ! నారాయణ! చయనులూ మీరు పడ్డ శ్రమ సమస్తం జోగన్న వల్ల విన్నాను. అమ్మా! శ్యామలా! పరమ విజ్ఞాన సంపన్నులకు గాని పనికిరాని మధురభక్తి మార్గంలో నుంచి నీవు బయటపడి నందుకు సంతోషం. సామాన్యో పాసకుల విషయంలో అది మహాప్రమాదకారి. నీవు పరాభక్తి స్వరూపాన్ని తెలుసుకోటానికి యత్నించు. పరమేశ్వరుడి సర్వ శక్తిత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, భక్తానుగ్రహత్వాదులను భావించు. పరమేశ్వరార్చ నలలోనూ, తత్స్వరూపధ్యానా దుల్లోనూ చిత్తాన్ని లగ్నం చెయ్యి. ఇటువంటి ఉపాసనలవల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. జ్ఞానాన్ని ఆర్జించి క్రమంగా నీవు గార్గి మైత్రేయి మొదలైన బ్రహ్మవాదినులు పొందిన స్థితిని పొందుతావు.

ఇదుగో పిల్లలు వచ్చారు.

జోగన్న: స్వామీ! ఇదుగో దంపతులు. మీకు పాదాభివందనం చేస్తున్నప్పుడు మా శంకరానికి సన్మార్గాన్ని సెలవివ్వాలని మా ప్రార్థన.

స్వామి: నారాయణ! నారాయణ! శంకరం ముక్తిని కోరే ఏ ఉపాసకుడైనా సమస్త భూమికలను సక్రమంగా గడవవలసిందే. సమస్తమైన వర్ణాశ్రమ ధర్మాలను యధావిధిగా పాటించి తీరవలసిందే. లేకపోతే పరమేశ్వర జ్ఞాన సంపాదన విషయంలో యమనియమాదులు కుదరవు. వీటిని పాటించక పోవటం అతీత వ్యక్తులై కారణాంతరాలవల్ల పూర్వజన్మలో యోగభ్రష్ఠులైన కొందరు మహా పురుషుల విషయంలో చెల్లటం ఉంది కాని అది నీబోటి సామాన్యోపాసకుల విషయంలో పనికిరాదు. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞానాలు నాలుగూ నాలుగు విడి, దారులు కావు. యధావిధిగా అనుసరిస్తే మొదటి మూడు సోపాన క్రమంగా జ్ఞానానికి దారి తీస్తాయి. ప్రస్తుత స్థితిలో నీకు మీ మామగారైన చయనులే పరమ గురువు.

శంకరం: స్వామీ! తమ ఆదేశానుసారంగా వారు చూపించిన మార్గాన్ని అనుసరిస్తాను.

స్వామి: నారాయణ! నారాయణ!

చయనులు: స్వామీ! 'యజ్ఞ శిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః', 'తస్మాత్సర్వ గతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్' - అన్న గీతాకారుని వాక్యాలు భక్తి, ధ్యాన, జ్ఞాన, కర్మల్లో కర్మే సర్వోత్కృష్టమైందనీ, దానివల్లనే మోక్షం కలుగుతుందనీ తాము అంగీకరించారనుకొంటాను.

స్వామి: అంగీకరించము. 'జ్ఞానాదేవ మోక్షః' లోకాంతరాలలో భోగాలను.......

(అసంపూర్ణం)

అముద్రితం

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.