Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-2/ఏకాంకికలు/కేశరక్ష సంప్రదాయాలు

వికీసోర్స్ నుండి

కేశరక్ష సంప్రదాయాలు

1

బుధాదేవి : (ప్రవేశిస్తుంది - సామంతులు - అమాత్యులు లేచి ప్రత్యుత్థానం చేసి నిలవబడతారు. రాణి సింహాసనము మీద కూర్చోగానే..)

అమాత్యవర్యా! తామిక ప్రారంభించవచ్చును.

సామంతుడు: ప్రజాసభాభవనమున మాకంటె కులీనుడు గాని అమాత్యుడు ప్రసంగించుటకు అంగీకరింపమని సవినయంగా చక్రవర్తిని బుధాదేవికి మేము మనవి చేయుచున్నాము.

బుధాదేవి : సామంత రాజ్యానికి నేను ఈ దేశానికి నూతనంగా చక్రవర్తిని నైనానని తెలిసిన విషయమే కదా! సభామర్యాదలకే విధమైన వ్యతిరేకాలు జరుగుతున్నా నాకు ముందుగా తెలియపరచవలసిందని నా కోరిక.

(సామంత రాజుతో) అయితే మీరు మాట్లాడవచ్చు.

సామంతరాజు: మా రాజవంశము బహు ప్రాచీనకాలమునుండి ప్రసిద్ధి వడసినదని తమకు నివేదించుకొనుట తప్ప తదితరమున మేము ప్రస్తుతము ప్రసంగింపవలసిన విశేషాంశమెయ్యదియును లేదని దేవేరికి మనవి చేయుచున్నాము.

(ప్రజానాయకులు - గుసగుసలాడుతారు)

బుధాదేవి : అమాత్యవర్యా! తదుపరి కార్యక్రమం నడిపించండి.

అమాత్యుడు : మహారాజ్ఞీ! చండస్కంధ చక్రవర్తులవారి అస్వస్థత కఖిల సామ్రాజ్య ప్రజ చింతాక్రాంతమైనదని ప్రప్రథమమున తమకు అమాత్యముఖమున విన్నవించుకొన వచ్చింది. ఈ యల్ప మానవుడు తమ పాద పర్యారాధకుడై యింత కాలము మనినానని తమకు సువిదితము. భృత్యభావమున నీ సభాభవనమునకు విచ్చేయుడని సమస్త రాజ్య ప్రజానీకమునకు తమ యాజ్ఞానుసారముగా పాలించితిని. ఐన నిట్టి విషమ పరిస్థితియందీ జనసామాన్య మెట్టి సదుపదేశమును తమతమ యమాత్యవర్గమునకు నీ సామంత లోకమున కీయగలదోయని మాత్రము నామానసమించుక సంకోచింప సాహసించినది.

(జనసామాన్యము వైపు అమాత్యులవైపు చూస్తాడు)

బుధాదేవి : అమాత్యవర్యా! మా జన్మదేశం కృత్రిమత్వం ఏమాత్రము లేనిది. మీ దేశంలో అమాత్యులూ, సామంతులూ స్వామికి క్లిష్ట పరిస్థితులలో సదుపదేశ మివ్వలేనప్పుడు జనసామాన్యాన్ని ఆహ్వానించి వారి యిష్టానుసారం వర్తించటం అలవాటు.

అమాత్యుడు : అయిన నీ నూతనోపదేష్టలతో తమ యిచ్చవచ్చినరీతి బ్రసంగించ వలసినదని ఈ సేవకుడు మనవి చేయుచున్నాడు -

(మళ్లీ జనసామాన్యం వైపు చూస్తాడు)

బుధాదేవి : అమాత్యా! నేను మీ అనుజ్ఞ లేనిదే చక్రవర్తిని చూడడానికి అవకాశము లేదు. వారిని దర్శించి చాలాకాలమైనది. ప్రస్తుతము వారెటువంటి మానసిక స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. నేనీ జనసామాన్యంలోకి ప్రసంగించడానికి పూర్వం చక్రవర్తి శరీర స్వస్థత ఏరీతిగా ఉందో ఒకసారి నివేదించమని కోరుతున్నాను-

అమాత్యుడు : మహారాజ్ఞీ! ఈ పాలకవర్గము మహాప్రభువు శరీర స్వాస్థ్యమును గూర్చి బహు విశదముగా నెఱింగి యేయున్నది - గాని

బుధాదేవి : ఔను! నిజమే. కానీ ఈ మహాసభలో అనేకమంది నూతనోపదేష్టలున్నారని మీరు ప్రథమంలోనే నివేదించారుగదా? - వారికి చక్రవర్తి స్థితిగతులు తెలియనవసరం లేదా?

అమాత్యుడు : మహారాజ్ఞీ! వారి సంఖ్య అత్యల్పము. అయిన మహాప్రభువు శరీరస్వాస్థ్యము వారెరిగినను, నెరుగకున్నను మన రాజ్య చక్ర భ్రమణమునకు విశేష ప్రమాదము లేదని ఈ రాజసేవకుని మనవి.

(జనసామాన్యం వైపు చూస్తాడు)

బుధాదేవి : ప్రమాదమున్నదో లేదో అది మరో విషయం -

(ఒక భూర్జపత్రం చేతపుచ్చుకొని విప్పి)

అమాత్యవర్యా! రాజవైద్యుని ప్రభువు వారి శరీరస్థితిని గూర్చి ప్రజలకు నివేదింపమని

ఆజ్ఞాపింపకోరుతున్నాను.

అమాత్యుడు : భృత్యశ్రేష్ఠా! రాజభిషగ్వరుని రావింప యోగ్యుడగు రక్షకభటుని కాహళ పూరింప నాజ్ఞాపింపుమని రాజు అంగరక్షకులని మహారాజ్ఞి అనుశాసించుచున్నదని నివేదించిరమ్ము -

బుధాదేవి : రాజవైద్యులు మీ కుడిప్రక్కనే ఉన్నారు గదా అమాత్యవర్యా!

అమాత్యుడు : అయిన మన అనుస్యూతములైన సంప్రదాయ మర్యాద లనుల్లంఘనీయములు గదా దేవీ!

బుధాదేవి : ఇట్టి విషమ పరిస్థితులలో, ఇంకా సంప్రదాయాలూ, మర్యాదలను పాటింపనవ సరం లేదని నేను ప్రకటిస్తున్నాను.

అమాత్యుడు : అయిన నిక సంప్రదాయానుసారం నియోజితులైన రక్షకభటులు -

బుధాదేవి : ఎక్కడివారక్కడనే ఉండాలి. ఇది ప్రత్యేకంగా నేను ఏర్పరచి నడిపించ పూనుకొనే కార్యాలోచన వర్గము - దీనికి మీ పాలక వర్గంతోనూ మీ అమాత్యాది భృత్య వర్గంతోనూ ఏ విధమైన సంబంధము లేదు. మీ సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాలతో నాకు కొంత పరిచయం కలిగిందని మీరు ఇప్పటికే గ్రహించారను కుంటాను.

అమాత్యుడు : అయిన మీ పాలకవర్గము వారి సంపూర్ణామోదమును బొందకయే మహారాజ్ఞి జనసామాన్యముతో ప్రత్యేక కార్యాలోచనావర్గము నేర్పరచరాదని నేను సవినయంగా మనవి చేయుచున్నవాడను.

బుధాదేవి : అమాత్యవర్యా! మీరంతగా పట్టుపట్టినప్పుడు నేనీ జనసామాన్యంలో కొందరికి రాజ్యమిచ్చి ప్రభువులను చేసిన తరువాతనే, ప్రస్తుత స్థితిని గూర్చి నాకు సదుపదేశాలివ్వగల కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పరచుకుంటాను

అమాత్యుడు : ఇట్టి విషమ పరిస్థితుల యందా జనసామాన్యమునందున్న వారిలో కొందరికి ప్రభువర్గముగా రాజ్యాధిపత్యమిచ్చి గౌరవస్థానముల నభివృద్ధి నొందింపదగదు. అది దేశమునకును, మన సామ్రాజ్యమునకు మహారాజాధి రాజశ్రీ చండస్కంధ చక్రవర్తికిని ప్రమాదమని మీ భృత్యుడు సవినయముగా బుద్ధిబలము నుపయోగించి, ఆలోచించి విన్నవించుకొనుచుంటిని. బుధాదేవి : అమాత్యవర్యా! ఆ విషయమును గూర్చి తరువాత చర్చించవచ్చును. ప్రభువువారి శరీరస్థితిని రాజవైద్యుడు సభామధ్యంలో అందరికీ నివేదింప కోరుతున్నాను. సభవారి కాలమతి అమూల్యమైనది. అనవసర ప్రసంగం ఏమాత్రం రాకూడదని ముందుగా అతడు అర్థంచేసుకోవాలి.

రాజవైద్యుడు : (అమాత్యుల ప్రక్కనున్న ఆసనం మీది నుంచి లేచి) మహాచక్రవర్తి శ్రీ చండస్కంధశ్రీ వారి యారోగ్య స్థితి యీ సామాన్య మానవులు గ్రహింపవలయు నన్న యయ్యది సామాన్య కార్యంబె. అయినను నేను నేర్చుకొలది విశదీకరింప యత్నింతు - భిషగ్ర్బహ్మయగు చరకాచార్యులు మతాను సారంబున మానవకోటి యందు బ్రధానముగా నున్న ధాతుతత్వములు ముత్తెరంగులు - వాత, పిత్త, ఉష్ణములు ఇమ్మూడింట పిత్తతత్వము మహా భయంకరమైననది. ప్రభువు వారీ పిత్తతత్వముచే ఋజాగ్రస్తులై రాజ్యపాలనా కాంక్ష యే మాని, మానసిక వేదననొందుచున్నారని అస్మదీయ ప్రసిద్ధ మతంబు-

బుధాదేవి : అమాత్యవర్యా! చక్రవర్తి వారి దుస్థితికి ప్రారంభం వారు విశేషంగా ఎవరితో కలిసి కాలం గడిపేవారు?

అమాత్యుడు : రాజవిదూషకుడు దక్క సామ్రాట్టెట్టి యిక్కట్లు సంభవించినను అన్యులతో బ్రసంగించిన తరువాత అవకాశ మొండొరుల కీయనే లేదు.

విదూషకుడు : (ఒక పెద్దపెట్టున కాండ్రించి దగ్గి) మీ, మి మ్మీ మ్మీ - వ వ వ వంశంలో మ్మా మ్మా వాళ్ళు చెప్పినవి న.... న... నవ్వించటానికి ము... మ్మీ...మన్నాడు.... కి... చ కిచలున్నైనై... ఎ....ఎ.... ప్పుడు ర... రాజు గారికి వి....నిపిస్తాను”

అమాత్యుడు : ఈ సుప్రసిద్ధ సమయంబునం దమాత్యుండు దేవేరి కొక అమూల్యమైన విన్నపము గావించవలసి యున్నది. (రాణి అమాత్యునివైపు చూస్తుంది) అదెట్టిదన యావద్భారతంబునందున్న విదూషక వంశ శ్రేష్ఠులలో భుజంగుని వంశంబు విశేష ఖ్యాతి గడించె - నట్టి కులంబున జనించిన విదూషక మూషికంబగు బుజంగుడనవరతము రాజకార్య నిర్వహణా విధానాలను యందే నిమగ్నమగు నన్నే యితండు ద్వాత్రింశద్వత్సరంబులకు నాచే నొక్కపరి చిరునవ్వు నవ్వించె -

బుధాదేవి : మానసికఋజకు రాజవైద్యం పనికిరాదే. భూతవైద్యులను పిలిపించమని మీ అభిప్రాయమా? రాజవైద్యుడు : మహాచక్రవర్తి కెట్టి భూతసంబంధము లేదు. పిత్త ప్రకోపము వలననే వారికి దేహద్రఢిమతగ్గీ మానసిక పరివర్తనమేర్పడియె - హృదయమున కానంద కరములగు బ్రయోగముల వెదకి చక్రవర్తి కానందము గల్గింప కలిగినచో పిత్త ప్రకోపనము వ్యత్యస్తమై మానసిక రోగమెడ బాయునని భాభ్రవీయుల మతము

బుధాదేవి : చరకము, భాభ్రవీయుల మతము తప్ప దేశీయమైన మార్గమేదీ మరొకటి దేశంలో లేదా?

రాజవైద్యుడు : వేరొండు మతముననుసరించి రాజరోగముల నయమొనర్చుకొనుట మనకెన్నడును సంప్రదాయము కాదని ఈ రాజభిషగ్వర్యుండు దేవేరికి సవినయముగా మనవి యొనర్చుకొనుచున్నవాడు

బుధాదేవి : (జనసామాన్యం వైపు తిరిగి) దీనికి మీ ప్రజావైద్యులేమని సమాధానం చెప్పదలచుకున్నారు?

ఒక వైద్యుడు : (ప్రజలలోనుంచి వచ్చి) మహారాజ్ఞీ! వెనుక నవ్వుతో ఉన్న మహారాజు అమాంతంగా ఒకమాటుగా ఈ దుస్థితికి వచ్చారు. ఇటువంటి క్లిష్టస్థితి అకారణంగా కలుగదు. వీటిని గురించిన నివేదన వింటేగాని మేము వైద్యము చేయటము చాలా కష్టము.

(రాజవైద్యుడు చెవులు మూసుకుంటాడు. వినటానికి ఇష్టము లేనట్లు)

సుమిత్రుడు : నా పేరు సుమిత్రుడు - మహాదేవీ! మీరు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానమంపి పిలిపిస్తే వచ్చాను గాని యీ బుద్ధిహీనుడైన అమాత్యుని చేత అల్పబుద్ధినని అనిపించుకోవటానికి రాలేదు.

బుధాదేవి : సుమిత్రా! త్వరపడవద్దు - ప్రజా వినోదాలు నీవు పరిపూర్ణంగా ఎరుగుదువని గ్రహించి పిలిపించాను. కొంచెము సేపు ఓపిక పట్టితే నీతో ప్రసంగిస్తాను - పాలకవర్గ మర్యాదలూ, సంప్రదాయాలూ ఈ సభకు వర్తించవని నేను అన్నంతమాత్రాన నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించమని నా అభిప్రాయము కాదు. అమాత్యవర్యా! ఆస్థాన గాయకుడెక్కడ

గాయకుడు: (లేచి నిలవబడతాడు)

బుధాదేవి : మీరు మహారాజు కానందం కలిగించటానికి అవకాశాలింకా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారా? గాయకుడు : లేదు

బుధాదేవి : 'ఆస్థానకవి' - మీరింకా నూతన కావ్యాలు వ్రాసి చక్రవర్తికి సంతోషం కలిగించగలరనేనా?

కవి : "లేచి”


"A poem which has no beginning nor end - Must be written
"కవికి సుమిత్రుడికీ కొంత ప్రసంగం”
"పులిని”
లేదు లేదు.


అది యిట్లుండగని ప్పట్టున నీ సభాభవనము నందొక్కరుడైన మహాచక్రవర్తి యట్టి విషమస్థితియందుండ చిరునవ్వైన నవ్వరాదని యట్లొనర్చిన రాజదండనకు బాత్రులగుదురని పాలక వర్గాభిప్రాయమున నేర్పరుపబడిన ధర్మ శాస్త్ర సూత్రార్థమును విశదపరచవలసిన యగత్యము తోచి వక్కాణించుచుంటి”

సుమిత్రుడు : (హటాత్తుగా జనంమధ్యలోనుంచి లేచి) తల్లీ! దేశాన్ని యింతకంటే పిచ్చివాళ్ళు మూర్ఖులు పరిపాలిస్తే ఎంతో బాగుంటుంది.

అమాత్యుడు : (కోపంతో) దేశం క్లిష్టపరిస్థితులలో నున్నదియో గ్రహించలేని యల్పబుద్ధియగు నీకు మహా సభామధ్యమున బ్రసంగింప నెవ్వడనుజ్ఞ నొసంగె - మహారాజ్ఞీ - ఇట్టి అల్పబుద్ధులను దమయభిప్రాయము లొసగ నవకాశమిచ్చినచో -

బుధాదేవి : ఇప్పుడేమి జరిగింది?

అమాత్యుడు : (కోపంతో) నీవెవ్వండవు? చండస్కంధశ్రీ వారి రాజ్యంబునందే మొనర్చు చుంటివి?

సుమిత్రుడు : త్రిగర్త దేశంలో వింత వింత గాయకులూ, రాజవినోదులూ ఉన్నారు. ప్రభువు వారిని సేవించే సదవకాశం నాకు ఇప్పిస్తే వారిని వెంటనే పిలుచుకో వస్తాను. ఈనాటికి మూడోదినానికల్లా చక్రవర్తి కోలుపోయిన ఆనందాన్ని సంపూర్ణంగా సంపాదించ గలిగేటట్లు చేయగలనని నా విశ్వాసం.

బుధాదేవి : అమాత్యవర్యా! కావలసిన సమస్తావకాశాలూ వెంటనే ఇప్పించ గోరుతున్నాను. అమాత్యుడు : మహారాజ్ఞీ! ఇట్టి సాహస చర్యలకు బూనుకొన్నయెడ నట్టివారు తామొనర్చిన శపథముల నెరవేర్పనియెడ నెయ్యదియోయొక దండము వారి కిప్పించుట బహు ప్రాచీన కాలంబునుండి మన యాచారమై యున్నదని నేనియ్యెడ సవినయముగా మనవి చేయక తప్పదు. మమ్ము బోలిన మహామాత్యులు మేధావిశేషమును తారు మారొనర్చిన శాత్రవ కంఠీరంబగు చండస్కంధ శ్రీవారి ఋగ్మతను తొలగింతునని విశ్వసించు నీయల్పబుద్ధి నయ్యది నెరవేర్వజాలనిచే యాతని దక్షిణ కరపల్లవంబుల ఖండింపదగు.

బుధాదేవి : అమాత్యవర్యా! మీ అభిప్రాయం ఎంతో సమంజసంగా ఉన్నది.

సుమిత్రుడు : ఇందుకు నేను... అం.... గీక.... రింపను.

బుధాదేవి : ఇందాకటి మాటలన్నీ ఏమైపోయినవి? అమాత్య శేఖరా సుమిత్రుని దక్షిణ కరపల్లవాలు వెంటనే ఖండించమని రాజభటులకాజ్ఞాపించు.

బుధాదేవి : సభా అస్థానంలో మరెవరైనా ప్రభువువారికి సంతోషం కలిగించడానికి మార్గాలను ఆలోచించారా? మీరు - భౌమా!

భౌమా : మహారాజ్ఞీ! నాది ఒకటే అభిప్రాయం - ప్రభువు ఏ దేశంమీదనైనా ఒక్కమాటు యుద్ధం చేసి శత్రువులను చీకాకు పరిచివస్తే వారి కండూతితీరి మనస్వాస్థ్వం చేకూరుతుంది.

అమాత్యుడు : అట్టి అమోఘమగు ఊహ నా బుద్ధి కెన్నడో పొడమినది. చక్రవర్తికి నివేదించుకొంటి గాని వారించుకయైన రణభూమిపై నభిమానమును ప్రకటింపలేదు. ప్రభువువారికి బ్రస్తుతస్థితిని మనోల్లాస ప్రదంబగువస్తు వెద్దియన నొక మాంత్రికుడు -

బుధాదేవి : ప్రభువువారి శుభాన్ని కోరి వారికి ఆహ్లాదం కలిగించటానికి మార్గాన్వేషకులైన ప్రజనొక్కరినే ఆహ్వానిస్తాను. - సుమిత్రుడు

సుమిత్రుడు : (లేచి) అనాదికాలమునుంచీ వస్తూ ఉన్న రాజ వినోదాలన్నీ ప్రభువుకు మనోల్లాసం కలిగించడం లేదు. వారికొక నూతనమూ, అధునాతనమూ అయిన క్రొత్త వినోదాన్ని మనం శ్రమపడి సృజిస్తేగాని వారికి ఆహ్లాదం కలుగదని నా అభిప్రాయము.

బుధాదేవి : నిజమే - చక్రవర్తి ముఖమండలము నేమాత్రమైన హాస రేఖలు ద్యోతకములు కాకున్నా, సభికులెవ్వరామోదములను సూచింపరాదనియు, సామ్రాట్టు వదనసీమ దుఃఖరేఖ మేమాత్రము పొడసూపినను వెంటనే సభాఘంటికను మ్రోయింప వలయుననియు, అట్టి సందర్భమున నీవిదూషక శేఖరుడు సభామధ్యము నుండి తొలగింపవలయుననియు నమాత్యవర్యుడు అంగరక్షాధిపతియగు వర్మ కనుశాసించెను.

2

(సభావనంలో - రాజు, రాణి Enthroned guards stand between the thrones. a careful observer with note book on hand ప్రవేశము, సుమిత్రుడు, అమాత్యుడు)

అమాత్యుడు : (రహస్యంగా) సుమిత్రా! నీ ప్రతిజ్ఞ నిర్వహింపగలవనియే హృదయపూర్వకము విశ్వసించుచుంటి సుమిత్రా!

సుమిత్రుడు: (ముందుకువచ్చి) తిరుహత్తి! ఇతడు మహాగాయకుడు - అతని దేశంలో తిరుహత్తి కంఠస్వరము వినటానికి కోటానుకోట్లు తహతహపడిపోతుంటారు.

అమాత్యుడు : (ముందుకు వచ్చి) అలా అయితే నేను మరికొందరు వైద్యులు వచ్చి ప్రభువారికి నాడీపరీక్ష చేస్తే బాగుంటుంది.

బుధాదేవి : మీరెవరైనా వైద్యులను పిలుచుకోరావాలి.

సుమిత్రుడు : వెంటనే ఎక్కడనుంచి వైద్యుణ్ణి తీసుకోరాను? నాకొక ఘడియ కాలం ఇప్పించాలి.

బుధాదేవి : అయితే మన కార్యాలోచనా సభను ప్రస్తుతం ముగిద్దాము.

(తెర - సంగతులు)

కథకుడు : అంతనొక నాటి మధ్యాహ్న సమయమందుదయ వేళ చక్రవర్తిని సంతోషాంబుధుల నోలలాడింతునని శపథమొనర్చి వెడలిన సుమిత్రుడు సాధన సంపత్తితో పట్టణమును చేరుకొనెనని రాణికి వార్త వచ్చినది. అల్పకాలములోనే మంత్రులు, సామంతులు, జనసామాన్యము, సభాభవనమునకు విచ్చేసిరి. సభయంతయు నిశ్శబ్దముగా యుండెను. అంతటి పెద్ద సభయందొక్కడైన తలయాడింపలేదు. మహాచక్రవర్తి ముఖ విన్యాసములలో నీషధ్భేదము కనుపట్టెనని పరిశీలించుట కమాత్యులవారు నియమించిన పారిపార్శ్వకులు తప్ప నన్యులెవ్వరచ్చట నవయవచాలనమొనర్చు వారు లేకుండిరి. సుమిత్రుడు : “విదూషకులు" రీతి, అరీతి (ప్రవేశిస్తారు - రీతి - అరీతి)

చండశ్రీ : అమాత్యా! వీరుకూడా మిత్రరాజ్యాలవారేనా?

అమాత్యుడు : ఈ రీతిఅరీతులు మిత్రరాజ్య సంబంధులని మనవి చేయవలసి వచ్చినందులకు హృదయమించుక భయంబొందుచున్నది ప్రభూ!

చండశ్రీ : వారు ప్రయోగించిన కిచకిచ లెంత పాతవి -

(తిరుహత్త ప్రవేశించి రాజుకు నమస్కరించి ఒక పాట పాడతాడు మందస్మితంతో)

చండశ్రీ : రక్షామాత్యా!

రక్షామాత్యుడు : ప్రభూ! (సవినయంగా మోకరించి)

చండశ్రీ : ఆ రోదించే వ్యక్తికి శిరచ్ఛేదనం

(భటులు తిరుహత్తను బంధిస్తారు)

అమాత్యుడు : (నెమ్మదిగా) ప్రభూ! అతడు మన మిత్ర రాజాస్థాన గాయకుడు

చండశ్రీ : అయితే - ఆ రాజు మీద యుద్దాన్ని ప్రకటించు

అమాత్యుడు : (నెమ్మదిగా) ప్రభూ! ఇట్టి సాహసకృత్యమిప్పట్టున మన రాజ్యమునకెట్టి ఇక్కట్టు వాటిల్ల జేయునోయని డెంద మారాట పడుచున్న...

చండశ్రీ : భయంలేదు - రక్షామాత్యా! శిరచ్ఛేదనం

(తిరుహత్తిని తీసుకోబోతారు)

అమాత్యుడు: ప్రభూ! తాప్పట్టున నున్న సంతోష దాయకుల జూచు, మానసిక స్వాస్థ్యము గలిగియున్నవారే

చండశ్రీ : నాకే అభిప్రాయమూ లేదు.

(గంట తొలగింపు)

(రాజు పెద్దగా మూలుగు)

అమాత్యుడు : రక్షక భటులారా! సుమిత్రుని పట్టున పట్టి బంధించి పెడరెక్కలు విరిచి కట్టుడు

(పట్టుకోబోతారు)

సుమిత్రుడు: తల్లీ బుధాదేవీ - నీవు నాకిచ్చిన అభయం మరిచిపోయినారా? నా

వైద్యుణ్ణి పరీక్షించకుండానే - నాకీ కఠోర దండన? మహాప్రభువును శాస్త్రవేత్తలైన వైద్యులెవరూ పరీక్షించలేదు.

(విసుక్కుంటాడు)

అమాత్యుడు : ప్రభూ! ఇట్టి సందర్భమునందీ సుమిత్రుని మీద రక్షకభటులేల బంధింపరాదని నా బుద్ధికే దోచుచున్నయది

సుమిత్రుడు : (రాజు దగ్గరికి చేరబోతూ) ప్రభూ! మా రాజవైద్యుడే మీ ఋగ్మతలవంటి వెన్నో నివారించాడు.

సుమిత్రుని వైద్యుడు : ప్రభూ! నేను మీ ఋగ్మతలను నివారించి పారితోషికాలు పొందగలననే నా విశ్వాసము.

అమాత్యుడు : అయ్యవెంత ప్రాచీనత నోచుకున్నవో యెవ్వడెరింగింప సాహసించు ప్రభూ! మీమతంబున నయ్యవి వేదకాలమునాటివని విన్నవింపదలచితి -

చండశ్రీ : (అసహ్యించుకుని) దుహ్ఁ (దూరంగా తొలగించమని హస్త సంజ్ఞ చేస్తాడు)

(తీసుకోబోతారు భటులు).

సుమిత్రుడు : "గూభి దోభి” నర్తకులు

రాగానే నాట్యము

అమాత్యుడు : "సుమిత్రా! ప్రాచీన మార్గానుయాయులై గానమొనర్పగల వారున్న ప్రవేశపెట్టుము. లేదా వృధాగా శ్రమించి నీ దక్షిణ కరపల్లవములు గోల్పోవుదువని యస్మదీయంబైన హితవు.


సుమిత్రుడు : నిమిష మాగండి, పాత సరుకు మా దగ్గర దొరకదు
                  'కథకుడు ప్రవేశించి గొంతు ఎత్తగానే తోసేస్తారు -'గంట'-

సుమిత్రుడు : రేవుడు "హాస్య గాయకుడు"
                 (హాస్యంగా పాడుతాడు) - 'పాట' -


వైద్యుడు : మీకు నిత్యమూ కలిగే కలలూ, చిన్నతనపు జీవితమూ, మీ తల్లిదండ్రులూ వారి జీవిత చరిత్రలూ నాకు బాగా పరిచయముంటే గాని మీ వ్యాధి ఇదమిత్థమని నేను నిరూపించలేను. అమాత్యుడు : ప్రభువు వారొసంగిన క్షణకాలమయిపోయినది. మీరు మాంత్రిక ప్రయోగ మెరుగుదురా?

వైద్యుడు : ఔను.

అమాత్యుడు : ప్రయోగింపుడు.


వైద్యుడు : "ఒక భయంకర ఖడ్గాన్ని చదివి
              పలుకు పలుకు
              అంబ పలికింది


అమాత్యుడు : ఆఁ పలికిన మాట సత్యంబౌ దేవి ఏమనినయది

వైద్యుడు : రాజు ఋగ్మత దేశమునందున్న “నిత్యానందుని” కేశములతో నొక రక్షతాయెత్తు కట్టించుకొనిన నయమవుతుందని -

చండశ్రీ : నేను తప్ప నా రాజ్యమున సమస్త జనాలును నిత్యానందులే -

అమాత్యుడు : మేమతి శ్రద్ధ వహించి యట్టి నిత్యానందుడుకై అన్వేషణ మారంభించెదము -

అమాత్యుడు : ఈ అల్పబుద్ధికి ప్రజ్ఞ యున్నదాయని సందేహము

సు. వైద్యుడు : మహా మాత్యవర్యులు తమరేనా? మీ శరీరంలో పాలనాతత్వం (Power complex) విశేషంగా ప్రకోపించినట్లున్నది. మీ ఋగ్మత కూడా నయం చేస్తాను.

అమాత్యుడు : అప్రస్తుత ప్రశంసమాని ప్రభువువారి విషయము ఆలోచింపవలయునని అస్మదీయా దేశము

సు. వైద్యుడు : (రాజును పరీక్షించి) ప్రభూ! మీరు మేధా ప్రభావం వల్ల బాధపడుతున్నారు.

చండశ్రీ : ఏమిటీ?

అమాత్యుడు కుద్దా. మన రాజకుటుంబాలకు యుగయుగాలనుంచీ వస్తూ ఉన్న దేవత మహాప్రభూ! విదూషకులకేరీతి బ్రాచీన హాస్యము గొనివచ్చిరో యిట్టి విధముననీ రాజవైద్యుడు - ప్రాచీన భైరవమూర్తిని బేర్కొనుచున్నాడు. వైద్యుడు : కుద్దా దేవత కాదు అమాత్యా! ప్రభువువారి మృత్యువు. "ముదిమి ఈ రెంటి మూలకంగా మానసికా వేదన పొందుతున్నారని మా అభిప్రాయం”

అమాత్యుడు : రక్షకాధికృతులారా?

చండశ్రీ : క్షణంలో నా మానసిక వేదనను పోగొట్టే ఔషధాన్ని నిరూపించాలి.

బుధాదేవి వారు దయచేయుచున్నారు -

(రాణిప్రవేశము సభ ప్రత్యుత్థానం చేసి నిలవబడుతుంది)

అమాత్యుడు : మహారాజ్ఞి వారికి పాదపద్మారాధకుడు సవినయముగా

బుధాదేవి : అమాత్య! ఈ సంప్రదాయాన్నిక చాలించి - అధిక సంతోషి మన రాష్ట్రములో ఎవ్వరో కనుక్కున్నారా?

అమాత్యుడు : అట్టి యుత్కృష్ట గౌరవమన్యుల కేల దక్కవలయునను నభిప్రాయమున నట్టి 'సంతుష్టి' మనలో నెవ్వరా యను విచారణమున పాలకవర్గమువారు అధిక శ్రద్ధ వహించి పర్యాలోచన మొనర్చు...

బుధాదేవి : ఆ ఆది సంతోషిత్వము మీకే తక్కువేమో!

అమాత్యుడు : మహారాజ్ఞీ! ఎంతమాట! అట్టిదెట్టి పట్టునను వాటిల్లదని నా మనవి. కారణమేమన ఈ మహాసామ్రాజ్య భార మస్మదీయ బాహువుల పైనుండ నేనెట్లు సంతుష్టస్వాంతుడను గాగలను -

బుధాదేవి : సరే - అట్టివాణ్ణి వెదకటంలో మీ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమైనవి?

చండశ్రీ : అట్టివాణ్ణి చూచేటంతవరకు నన్ను మళ్ళీ బాధపెట్టవద్దు

అమాత్యుడు : చిత్తంప్రభూ! నిత్యానందుని "దీర్ఘకేశము”తో తాయెత్తు!!

3

(సభా భవనము - అమాత్యుడు)

అమాత్యుడు : ఈ నామపట్టిక తయారొనర్చిన వారెవరు?

కార్యనిర్వాహకుడు : రక్షకభటాధికారి అమాత్యవర్యా! వీరందరును నధిక సంతోషావిష్టులైన మన రాష్ట్ర ప్రజలు. అమాత్యుడు : మీరిట్టి పట్టికల సేకరించుట యందు చక్రవర్తి కోరు సేవకంటే యధికముగా ఇప్పట్టున నిట్టి నాయప్పటి కలతో చక్రవర్తికెట్టి ప్రయోజనమును జేకూరదని నా యభిమతము. వీటినెల్ల పరశురామప్రీతి గావించుటయే మదీయాభీప్సితంబు మీరిందెట్టి జోక్యమును గలుగ జేసుకొనరాదు. ఈ విషయమున పరిపాలకవర్గమువారు నియోగించిన 'ప్రత్యేక సభ'వారే యట్టి సంతోషావిష్టుల గూర్చి యోజించి కొని రావలసి యున్నారని మీకు ఎరుక పరుచుచున్నాడను - ఈ నామపట్టిక యందున్నవారిలో అధిక భాగము మీ బంధువర్గము కాదుగదా!

(ప్రవేశము - ఒక కన్య)

నేను సవినయముగా మనవి చేయగలుగుచున్నాను. ఈ దినమే యొక ప్రత్యేక నివేదిక పాలకవర్గమువారి కార్యాలయమునకు రాగలదని నేను విశ్వసించుచుంటిని.

బుధాదేవి : మంచిది - సంతోషావిష్టులెంతమందిని ఇంతవరకు పరీక్షించారు?

అమాత్యుడు : అట్టి వారెందరైరో నేనిప్పట్టు సంఖ్యాపూర్వకంగా చెప్పలేను. గణకుని పిలిపింతును. రక్షకా!

రక్షకా : చిత్తము

రక్షకుణ్ణి తోసుకుంటూ రాజపుత్రులు, సామంతులు కొందరు కత్తుల కణకణలతో ప్రవేశిస్తారు - రాణిని చూచి భయపడి కరవాలముతో నమస్కరిస్తారు.

అమాత్యుడు : రాజపుత్రులారా! మహారాజ్ఞి యిందు కొలువు దీర్చియున్నవారు. మీరెల్లరు నాకౌక్షేయకములను దూరముగా నుంచి ప్రణామ మొనర్చుడు.

బుధాదేవి : రాజసభలో యుద్దం చేయకూడదనే నిషేధం పూర్వంలేదా?

అమాత్యుడు : అట్టి నిషేధమున్నయది. అయిన

బుధాదేవి : వీరంతా సంతుష్టమనస్కుని అన్వేషించటానికి ఏర్పడ్డ ప్రత్యేక సభలో వాళ్ళేనా?

అమాత్యుడు : తాము పాలకవర్గమువారు నియోగించిన ప్రత్యేక సభవారీ విషయమున వహించు జాగరూకతలను, వారొనర్చిన మహోత్కృష్ట పరిశ్రమను వినుటకుద్యుక్తులు కావలసినదని సవినయముగా మనవి జేయుచున్నాను బుధాదేవి : 'ప్రత్యేక సభ' వారీ విషయమున నేమాత్రమన్వేషణాన్ని సాగించినా అల్ప సంతుష్టి మనలో ఎవరా అనే ప్రశ్న మీలో ఉదయించేది కాదని నా అభిప్రాయం.

అమాత్యుడు : ప్రతి విషయమును కడు శీఘ్రగమనమున నడచుచున్నది. ఇంత వేగముతో నడచిన రాచకార్యమే మంత్రిత్వము వహించిన తదుపరి నెన్నడేనియు జరుగలేదని మహారాజ్ఞి కస్మదీయంబైన వినయపూర్వక ప్రకటనము. ప్రస్తుతమున ప్రత్యేక సభవారొనర్చిన విశేష పరిశ్రమ కొకరీతి నా మనము నందానందము పొరిలివచ్చుచున్న - నొక్క విషయమునకు ఈ భృత్యుడెంతయో చింతపడుచున్నాడు.

బుధాదేవి : మనం సంతోషావిష్టుని వెతకటంలో ఎంతవరకు వచ్చామో వినగోరుతున్నాను.

అమాత్యుడు: తాము సర్వమును కొలది కాలములోగా చూడగలరని భృత్యుడు మనవి జేయుచున్నాడు. అట్టివాని నన్వేషించుటకై మా పాలకవర్గమొక ప్రత్యేక సభ నీనాటికి నియమింపగలిగినది.

గణకుడు : అన్య రాష్ట్రమున దొరుకదనియే మా నమ్మకం. అట్టి అనన్య సామ్రాజ్య సంతుష్ట స్వాంతము మన పాలకవర్గ సభ్యులలో నెవ్వరికైన నుండక మానదనియే మా విశ్వాసము.

బుధాదేవి : పాలకవర్గ సభ్యులలో నొకడు అటువంటి వాడు ఉండటానికి అవకాశము లేదని నా నమ్మకం -

గణకుడు : పాలకవర్గమున సంతుష్ట స్వాంతుడు లేకున్న నీ దేశమునందెట్టి స్థలమునందైన నట్టివాడు దొరకునా?

బుధాదేవి : మంచిది. రాజపుత్రులారా! మా దారిని మమ్మలిని ఒదిలి పెట్టండి. మీ ప్రాచీన సంప్రదాయాన్ననుసరించే అట్టివాణ్ణి వెతికి పట్టుకోండి.

(ప్రత్యేక సభ వెళ్ళిపోయింది. వారు వెళ్ళిపోతుంటే రాణివారు చూస్తూ ఉంటుంది)

బుధాదేవి : అమాత్యా! నన్నొకమారు ఆ పట్టికలను చూడనీయండి.

అమాత్యుడు : మహారాజ్ఞీ! మేము సంతుష్ట హృదయులమని జెప్పుకొను వారెందరో యున్నారు. అట్టివారిలో బరీక్ష కనర్హులగు వారి పట్టికలకై వార్తనంపితిని కార్యవాహకా! బుధాదేవి : (పట్టిక చేతిలో గ్రహించి) మనము మొదట వర్తక శేష్ఠులతో పరీక్ష ప్రారంభిద్దాము.

అమాత్యుడు : వీరెల్ల నా 'ప్రత్యేక సభ'లో నున్న రాజపుత్రులేనని సంతోషపూర్వకముగా మనవి చేయుచున్నాను.

బుధాదేవి : రాజగణకు డెంతమంది పరీక్షింపబడ్డారో మనవి చేయగోరుతున్నాను.

గణకుడు : ఇంతవరకొక్కరుడైన పరీక్షింపబడలేదని నేను మహారాజ్ఞికి సవినయంగా మనవి చేయుచున్నాను.

బుధాదేవి : ఎందువల్ల?

గణకుడు : అమాత్యుల వారింతవరకూ 'సంతుష్ట” శబ్దమున కర్ధనిర్ణయమొనర్చుట పూర్తిగావింపనందున నింతవరకెవ్వరిని పరీక్షించుట కవకాశము దొరకక నేను సవినయముగా మనవి చేయుచున్నాను.

బుధాదేవి : ఈ అర్థనిర్ణయ విషయంలో ఎన్ని మతభేదాలేర్పడ్డవో చెప్పగలవా?

గణకుడు : ఇంతవరకా శబ్దార్థ నిర్ణయమును గూర్చి కలిగిన మతభేదములు పంచాశత్తు (పొరబడి) నూన పంచాశత్తు - నిన్నటి సాయంత్రమున శబ్దార్థ నిర్ణయయుగములో నొకడు మరణించెనని స్థానమునకు వార్త వచ్చినది.

బుధాదేవి : ఆ పోనీ. అర్థ నిర్ణయం జరిగిన తరువాత అట్టి సంతుష్ట స్వాంతుడెక్కడ చిక్కుతాడని?

(మరొక వర్తకుడు ప్రవేశము)

బుధాదేవి : నీవు నవద్వీపాలతో వ్యాపారం చేస్తున్నావు కదూ.

శ్రేష్ఠి : యాడిదీ తొమ్మిది దీపాలతోనేగా... మా బుచ్చిచెట్టి పదకొండు దీపాలతో వర్తకం -

మరొక శ్రేష్ఠి : ఎంత యాపారం ఏడిస్తే ఏం - పిల్లలో పిల్లలు -

మరొక శ్రేష్ఠి : అజీర్ణం. కడుపుకు తిని సచ్చిందాడుంది. అరుగుద్దా - ఎప్పుడూ సబ్బుల్లిపాయ. పచ్చిపుల్సు ఇంతేగా - తిండో తిండి. బుధాదేవి : అమాత్యా! ధనమున్నంత మాత్రాన సంతోషం ఉండనవసరం లేదని అర్థమైపోయింది. అంతకంటే ధనికులు సుఖంగా ఉండలేరందాము - సరే - సరే పనిపట్టికలో వ్యక్తులను పూర్తిచేయాలి.

కొన్ని గొంతుకలు :


(వేగంగా) సంతోషంతో ఉండటం పాపం

(నెమ్మదిగా పీల గొంతుతో) పూర్వం సంతోష ముండేది.

(గట్టిగా) నాకు పిచ్చి

(కోపంతో) నా కూతురు అన్నం పెట్టలేదు.

(నెమ్మదిగా) మా అత్తగారింట్లో బాధలు

(నిర్నివేశంగా) పెళ్ళాం చెప్పిన మాట వినదు

(నిశ్చలంగా) ఉద్యోగం లేదు


అమాత్యుడు : రక్షభట శ్రేష్ఠా!

బుధాదేవి : ఇప్పుడు ఘంటిక మ్రోగించుట మన అవసరము.

అమాత్యుడు : పనియతి త్వరితముగా గావలయును.

(కార్యవాహకుడు నిష్క్రమిస్తాడు)

బుధాదేవి : ఈ కోటానుకోట్ల వర్తక శ్రేష్ఠులు సర్వవిధ సంతుష్ట మనసులని నేనూహిస్తున్నాను.

భటుడు : రక్షకభటా!

భటుడు : చిత్తము - “వర్తక శ్రేష్ఠుల ప్రవేశపెట్టు -

(ప్రక్కవాకిలినుంచి నిష్క్రమించి ఒక వర్తకుడితో ప్రవేశిస్తాడు)

బుధాదేవి : (వర్తకుణ్ణి చూచి) ఇతడు బాగా చియ్యపట్టి సంతోషంతో ఉన్నట్లున్నాడు.

శ్రేష్ఠి : "నేను అసంతృప్తితో లేని మాట వాస్తవమేకాని, యాపారముందే యాపారం ఒడుదొడుకులతో కూడింది. లాబాలో లాబాలు - యాడవి అన్నీ ఏ పన్ను లే పన్ను చంతోషమే - చంతోషమే యాడిది. బుధాదేవి : చాలు, చాలు అతడిని బయటికి పంపించండి - (భటుడు రెక్క పట్టి బయటకు లాగుతాడు)

బుధాదేవి : మనరాజ్యంలో సంతోషావిష్టు డొక్కడైనా ఉండకపోడు. నేను అటువంటి వాణ్ణి వెదికి పట్టుకోవటానికి ప్రయత్నిస్తాను. చిన్న చిన్న వ్యాపారస్తులను, ఉద్యోగులనూ పరీక్షించి ప్రయోజనం లేదు. వాళ్ళు అనునిత్యమూ కష్టాలకు గురి కావలిసిందే. కర్షకులు వారికంటే సుఖంగా జీవిస్తుంటారు. మనపట్టణంలో సమస్త విధాలా సుఖానికి స్థానం లేదని గ్రహించి నేను పల్లెదిక్కులో తిరిగి సంతోషావిష్టుని వెదికి పట్టుకోదలచుకున్నాను.

అమాత్యుడు : మహారాజ్ఞీ! నేనును రాజనగరమును వీడి తమ సహాయార్థమా పల్లెటి దిక్కునకు రావలయునా? యని సంతోషముతో ప్రశ్నించుచుంటి.

బుధాదేవి : అవసరము లేదు. నా వెంట కవినీ, రక్షక భటాధిపతిని కొంత సైన్యాన్ని తీసుకువెళ్ళుతాను. మీరు రానవసరము లేదు.

(తెర - ప్రవేశము - కథకుడు)

కథకుడు : రాణి సంతోష స్వాంతుని యన్వేషించుటకై కొలది సైన్యముతో బయలుదేరి పట్టణము నుండి బయలుదేరిన కొంత కాలము వరుకామె సమాచారమేది రాజనగరమునకు చేరలేదు. ప్రభుత్వ వర్గము వారేర్పాటు గావించిన 'ప్రత్యేక సభ’ వారింకను - సంతుష్ట శబ్దార్థవిమర్శనము తేలలేదు. సంతోషము “మానసికమని” కొందరు, శారీరకమని కొందఱు వాదోపవాదనముల మధ్యన విషయమింకను నిర్ణీతము కాలేదు. వీరి వివాదము నమాత్య శేఖరుడు ప్రత్యేకముగా నిరువాదముల వారు

(గట్టిగా)

ఆకలి -

తెలివిగలవాడు సుఖంగా ఉండడు -

స్నేహితుల మోసం -

పళ్ళు లేక

కన్ను లేదు

కాలు లేదు

దగ్గు ఉబ్బసం

క్షయ -

రోగం -

బట్టతల -

ముట్టుకుట్టు -

(మాటలు వినిపిస్తవి - మళ్ళీ వెలుతురు)

అమాత్యుడు : మన పట్టికయందున 105వది

బుధాదేవి : అందులో వారంతా సంతోషస్వాంతులేనా?

అమాత్యుడు : మీరు ప్రశ్నించు వరకు వారెల్ల నత్యధికానందము ననుభవించెదరనియే నేను భావించుచున్నాడనని మనవి చేయుచున్నాను

బుధాదేవి : అయితే ఈర్ష్య, కక్ష, కార్పణ్యం ఇత్యాదులు లోకంలో ప్రబలిపోవడంలేదా? ఇక ప్రేమకు స్థానమెక్కడ ఉంటుంది?

అమాత్యుడు : అయితే మీరు ఇట్టి ప్రశ్నలు నుడువవలసినదేనా? వలసినదేనా యని నేను సంశయించుచుంటి -

4

సభాభవనము

(ప్రవేశము - రాణి - వెంట భిక్షుకుడు)


అమాత్యుడు : స్వాగతము. మహారాజ్ఞీ స్వాగతము - తామంత వేగముగ పట్టణమునకు దిరిగి రాగలిగినందులకు దేశమెల్లరి పక్షమున నీయమాత్యుని నమస్కారములు - “సంతుష్టస్వాంతుని దేవేరి యింత యనతికాలమున గనుగొనగలిగినదే... యని మేమాశ్చర్యాయున్మత్తులమగుచున్నామని దేవేరికి సవినయముగా నమాత్యుడు మనవి చేయుచున్నాడు బుధాదేవి : లేదు - మీ ప్రత్యేక సమితి ఎంతవరకట్టి ప్రయత్నంలో కృతకృత్యత వహించింది.

అమాత్యుడు : ఈనాటి ఉదయముననే “యుర్ణముఖమున" శబ్దార్థము నిర్ణీతమైనది.

బుధాదేవి : "ఈ దేశ స్థితిని గురించి తెలుసుకోవలసిందంతా తెలిసిపోయింది. ఇక మీ దేశానికి వెళ్ళి పోతాను. రక్షకభటునితో ఈ మూకను దూరంగా నిలపమని ఆజ్ఞాపించండి.

అమాత్యుడు : రక్షకభటా

రక్షకభటుడు : చిత్తము

యుద్ధమొనర్చి గెలిచినవారు వాదమున గెలిచినట్లని తీర్మానమొనర్చెను”

(కథకుడు - నిష్క్రమిస్తాడు)

జయభేరీతో ఇరువురు భటులు

“అన్నా! చూడటానికి ఎంత చిత్రంగా ఉంది. యుద్ధభూమి దుమ్ము రవ్వంతైనా నేలమీద లేదు. అయితే ఆకాశపథంలో విహారం చేస్తున్నది. “మానసికులకు - శారీరులకు యుద్ధం ఎంత భయంకరంగా నున్నది.

(జన ఘోషలు) యుద్ధం ప్రారంభము జయభేరి మోగుతున్నది.

గొప్ప దెబ్బ వగైరా

భటుడు (జనాల్ని దూరంగా కొడుతూ ఉంటుంటే ఒక భిక్షుకుడు అతడి దెబ్బ లెక్క చేయడు)

బుధాదేవి : (రక్షక భటునితో ఆగక్కడ? ఎవరా మనిషి?

అమాత్యుడు : ఒక మలిన వస్త్రధారి. భిక్షువు మహారాజ్ఞీ?

బుధాదేవి : అమాత్యా! అతణ్ణి ఇక్కడికి పిలిపించు.

అమాత్యుడు : భటాధిపా! అతని కొరకొక భటశ్రేష్ఠుని నియమింప నాజ్ఞాపించుచున్నాను.

బుధాదేవి : అబ్బీ! ఇలారా! భిక్షువు : ఎవరు నేనా?

బుధాదేవి : అవును నీవే?

(భిక్షుకుడు దగ్గరికి రాగానే) నీవు బాగా పాడుతుంటావు కదూ! డబ్బు ఎంత సంపాదించావు -

భిక్షువు : నేను డబ్బుకోసం పాడటం లేదు - పాడకుండా నా కంఠం ఊరుకోలేదు. ఒకప్పుడు నాకు అపార ధనముండేది. అది నన్ను అన్ని విధాలా నా సంతోషాన్ని చెరిచిందని దాన్ని త్యజించాను.

బుధాదేవి : ఇప్పుడు నీవు సంతోషంగా ఉన్నావా?

భిక్షువు : సమస్త విధాలా?

బుధాదేవి : అయితే నీకు ఇప్పుడేమి కావాలి?

భిక్షువు : నాకేమీ అవసరం లేదు.

బుధాదేవి : నీ జీవనోపాధి

భిక్షువు : నేను దానిని గురించి విశేషంగా ఆలోచించకుండానే జరిగిపోతున్నది.

బుధాదేవి : అయితే నీవు గొప్ప బాధ్యతారహితుడవన్నమాట?

భిక్షుకుడు : లోకం నన్ను గురించి ఏమనుకున్నా, ఏమన్నా నాకవసరం లేదు.

బుధాదేవి : నీకు స్నేహితులూ, బంధువులూ, భార్యాబిడ్డలూ, ఎవరైనా ఉన్నారా?

భిక్షుకుడు : లేరు

బుధాదేవి : అయితే నీవు కేవలం స్వార్థపరుడవన్నమాట.

భిక్షుకుడు : మీ ఇష్టం వచ్చినట్లు భావించవచ్చు.

బుధాదేవి : అయితే నీకు రాజదర్శన మిప్పిస్తాను.

భిక్షుకుడు : నేను ఇక్కడినుంచే నా కుటీరానికి వెళ్ళిపోతాను.

బుధాదేవి : అయితే... నీవు సంతుష్ట స్వాంతుడవన్నమాట. భిక్షుకుడు : అవునని నేననుకుంటున్నాను.

బుధాదేవి : రక్షకభటా! ఇతణ్ణి వెంటనే రాజుగారి దగ్గరికి తీసుకోపద.

అమాత్యుడు : రక్షకభటా! రక్షకభటా!

(ప్రవేశిస్తాడు వేగంగా)

రక్షకభటుడు : (అసహ్యంతో) ఏయ్ అబ్బీ ఇలారా!

అమాత్యుడు : (గంభీర కంఠస్వరంతో) జాగ్రత్త - అతడొక్కడే నిక్కువముగ సంతోషస్వాంతుడుగ జీవితం సాగిస్తున్నాడు. కావున నతని నతిగౌరవముతో దేవరవారి సన్నిధికిం జేర్పవలయును -

(జనం - నవ్వుతారు - తెర)

కథకుడు : సంతోష స్వాంతుడు దొరకినాడు. ప్రతి స్వల్ప విషయమున నొక పండుగగుట ఆ దేశాచారము. రాజుగారికా భిక్షుకుని కేశములతో తాయెత్తు కట్టించుట యొక పండుగైనది. 'ప్రత్యేక సమితి'యును నట్టి సభకేతించినది - కాని యెవరి మొఖముననూ సంతోషమన్నది లేదు. చక్రవర్తి ముఖమున నవ్వు తొలకాడితే గాని యితరు లెవ్వరును నవ్వరాదు.)

5

సభ - రాజు రాణి సింహాసనము

అమాత్యుడు : (లేచి) మహాప్రభువు వారినీ సమయమున అత్యధిక సంతోష స్వాంతునితో పరిచయము చేసుకొనవలయునని దేశము అమాత్య ముఖమున కోరుచున్నది.

చక్రవర్తి - సంతోషము.

(భిక్షువును రాజభటులు ప్రవేశపెడతారు)

చక్రవర్తి : (భిక్షుకునితో) నీవు సంతోష స్వాంతుడవన్నమాట

భిక్షుకుడు : మానవుడెంత వరకు సంతోష మనుభవించటానికి వీలున్నదో అంతవరకు నేను సంతోష స్వాంతుడనే. చక్రవర్తి : అయిన నీవు నా ఋగ్మతను బాపుదువన్నమాట

భిక్షుకుడు : అది నా చేతకాదు.

చక్రవర్తి : నీవు సంతోష స్వాంతుడవైనచో నది చాల సులభమైన ప్రక్రియ. నీ దీర్ఘ కేశద్వయము నాకిచ్చినచో దానితో నొక తాయెత్తు జేయించుకొని నేను నా ఋగ్మత బాపుకొనియెదను.

భిక్షుకుడు : నిజమే కావచ్చును - మీకు నా దీర్ఘ కేశాలు ఏవిధంగా లభిస్తయాయని నేనాలోచిస్తున్నాను.

(అసంపూర్ణం)

అముద్రితం

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.