వావిలాల సోమయాజులు సాహిత్యం-2/ఏకాంకికలు/కజ్జల
కజ్జల
పూర్వార్ధము
ప్రథమ దృశ్యము
(రాజాంతఃపుర సౌధోపరిభాగం. సౌధం చుట్టూరా నగర ప్రజలంతా 'యువరాజ'
ముఖ దర్శనార్థం నిరీక్షిస్తూ హర్ష ధ్వనులతో, కేరింతలతో, గుమికూడి ఉంటారు.
సౌధోపరి భాగంలో కాబొయ్యే యువరాజుకు నీళ్ళు పోసి, అగరు ధూపాలతో
కురులారుస్తూ స్త్రీలు మంగళహారతు లెత్తు తుంటారు. అతడు అక్క సారంగదేవి
చేతుల్లో హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఒక మూలన బంగారు గొలుసులు ఉయ్యెల.
రెండువైపులా దీపపు సెమ్మెలు - కర్పూరపు వాసనలు - అగరుధూప పాత్రికలు
ప్రస్తుతము మహారాణి అనే పేరుతో వ్యవహరిస్తూ ఉన్న కజ్జల (దేశాధిపతి ఉంపుడు
కత్తె) రాజసంతో ఒకమాటు పసిబిడ్డనూ, మరొకమాటు జన సమూహాన్ని చూస్తూ
మంగళగీతం వింటూ ఆనంద పరవశురాలై అలసటవల్ల నిట్టూరుస్తూ ఉంటుంది.
సారంగ దేవి చేతుల్లో నుంచి పిల్లవాడిని ఉయ్యాలలో నిద్రపుచ్చుతూ జోలపాట
పాడుతుంటారు. చత్వర నుంచి సౌధం ముందు గుమిగూడి "కజ్జల మహాదేవికీ జై”
అనే సంతోష సూచక ధ్వనులతో ఉప్పొంగిపోతూ ఉన్న ప్రజలను చూస్తూ నిలుచున్న
కజ్జల మంగళగీతం పూర్తికాగానే ఒక మాటు హఠాత్తుగా వెనకకు తిరిగి కుమార్తె
సారంగదేవితో)
కజ్జల : ఒకమాటు కుమారుణ్ణి ప్రజలకు చూపించు.
సారంగదేవి : (పసిబిడ్డను కంచుకి చేతికిస్తుంది)
కజ్జల : అమ్మాయీ! నీవే తమ్ముణ్ణి ప్రజకు చూపించు.
సారంగదేవి : (అనుమానిస్తూ) నేనా!
కజ్జల : అవును నీవే. ఈ దినంకూడా నిన్ను చూడటానికి ప్రజ తహతహ పడుతూ ఉంటుంది. సారంగదేవి : (కొంతదూరం పసిబిడ్డను అందుకొని నడుస్తుంది. ప్రజ "కుమార మహాప్రభువుకు జై" అని కేకలు వేస్తూ ఉంటారు)
కంచుకి : (సారంగదేవిని అనుసరిస్తూ) అమ్మాయీ! సారంగదేవి, అటు చూడు. ఎంత ఆనందకరమైన దృశ్యమో చూడు. సమస్త కాశ్మీర ప్రజానీకం నీ తమ్ముణ్ణి దర్శించటానికి వచ్చారు. ఉత్కంఠతో ఎంత ఉత్సాహాన్ని ప్రకటిస్తున్నారో చూడు. నీ అదృష్టాన్ని ఏమని కొనియాడాలో తల్లీ ... అమ్మా ఎప్పుడూ ఏమిటా అర్థం కాని అయోమయ చింతారేఖలు నీ ముఖం మీద.
సారంగదేవి : (పసిబిడ్డను చత్వరం దాకా తీసుకు పోయి పెద్ద పెట్టుగా) అబ్బా బాధ - కంచుకీ - నీవు చూపించు.
(వెనుకనే నిలుస్తుంది)
కంచుకి : (పిల్లవాణ్ణి తీసుకుపోయి చూపిస్తుంటే ప్రజలు జయఘోషలు చేస్తారు - కజ్జలా దేవితో)
అమ్మా! ప్రజలెంత ఆనందంతో అబ్బాయికి జయపెడు తున్నారో వింటున్నారా! వాళ్ళకు ఆయనమీద ఎంత అనురాగమో చూస్తున్నారా. అదుగో! ఆవైపు చూడండి ఉత్సాహాధిక్యంలో ఉత్తరీయాంశుకాలు ఎలా ఎగుర వేస్తున్నారో! ఆ కుంకుమ కేసరాలు చల్లుకోటం చూస్తున్నారా? చిందులేసి నృత్యం చేసే ఆ చిన్నవాళ్ళ గుంపును చూడండి. ఆబాలగోపాలమూ ఎంత అనురాగాన్ని ప్రకటిస్తున్నారో మీకు అవగతమౌతున్నదా? ఏ రాజకుమార దర్శనానికి...
కజ్జలాదేవి : ఇంకా నా మనస్సుకు సంతృప్తి కలుగలేదు కంచుకీ - మా రాజమహిషి బంధులుణ్ణి కన్నప్పుడు ప్రజ చూపించిన అతిశయానురాగానికి ఇది సాటి వస్తుందా? ఒక వసంత మన్నా బ్రతకకపోయినా ఆ బంధులుడు అతని దర్శనార్థం విచ్చేసి ప్రజలు చూపించిన ఆనంద రసావేశం నా జీవితంలో మరచిపోలేను. వారి సంతోష సూచకధ్వనులు ఈనాటికీ నా చెవుల్లో రింగుమని మార్మోగుతూనే ఉన్నవి - కంచుకీ! ఈ ఉత్సాహంతో నా మనస్సు శాంతి పడటం లేదు. సంతృప్తి కలగటం లేదు. బిడ్డను నా చేతికిచ్చి ఒక్కమాటుగా ఆ బొక్కెనలు విప్పి రౌప్యఖండాలను ప్రజల లోకి వెదజల్లు - ఆ కాంచన కుంభాలలో పన్నీరు చిలకవోయ్ - ఆ గులాబీ కుంకుమతో ఒక్కమాటు వాళ్ళందరినీ గప్పివేయ్. కంచుకి : (కుమారుణ్ణి కజ్జలాదేవి చేతి కందిచ్చి చెప్పినట్లు చేస్తాడు. మాటిమాటికీ ప్రజలలో హర్షధ్వనులు చెలరేగుతూ వినిపిస్తవి. కజ్జలాదేవి పట్టరాని సంతోషంతో దీర్ఘంగా నిశ్వాసిస్తూ కొంతసేపు నిలవబడి పసిబిడ్డతో వెనకకు వచ్చి పర్యంకం మీద కూర్చొని)
కజ్జల : అమాత్య కంచుకీ - ఆమె ఇంకా పిల్లవాణ్ణి చూచిపోవటానికి రాలేదు.
కంచుకి : ఆమె ఎవరు? తల్లీ -
కజ్జల : మన మహారాణి.
కంచుకి : మొగం చెల్లలేదేమో.
(మహారాణి వస్తూ ఉన్నట్లు సూచించే ప్రాసాద ఘంటికలు వినిపిస్తవి)
(ప్రవేశము రాణి. కంచుకి తదితరులూ ప్రక్కకు తప్పుకుంటారు. కజ్జల లేచి సగౌరవంగా అర్హాసన మిచ్చి, గౌరవించిన తరువాత)
రాణి : కజ్జలా! నిన్న సాయంత్రం నిన్ను గురించి ఎంత ఆదుర్దా పడ్డానో విన్నావా? ఇంకేముంది అయిపోయిందన్న వార్త వినేటప్పటికల్లా నా గుండె గుభేలు మన్నది. ఇంతకు పరమశివుడి కృప నీ మీద ఉన్నది. యముడి నోట్లో గడ్డకొట్టి బ్రతికావు. అంతటి క్రితం రాత్రి నీ మీద పీడకల కూడా వచ్చింది సుమా.
కజ్జల : మీ ఆదరానురాగాలకు ఎంతో కృతజ్ఞురాలను. అనవసరమైన పీడకలలతో మీ నిద్రకు నావల్ల ఏమీ భంగం రాలేదు కద.
రాణి : ఉహూ - బలే మంచి సందేహమే కలిగింది కజ్జలా! లోకమంతా ఒక్కమాటుగా తారుమారైనా ప్రస్తుత స్థితిలో నా నిద్రకు ఏ విధమైన భంగమూ కలగదు. పట్టుపట్టి ప్రయత్నించినా ఏ పరమ దౌర్భాగ్యుడూ పంతం చెల్లించుకోలేడు.
(కజ్జల ముఖం కేసి చూస్తూ)
అయినా ఒకప్పుడు మాత్రం ప్రతినిత్యమూ నా పర్యంకం దుఃఖభాష్పాలతో పంకిలమైపోయినమాట వాస్తవము. అయినా ఏం ప్రయోజనం... నిద్ర పట్టించుకొనక తప్పింది కాదు. తరువాత క్రమక్రమంగా అలవాటు పడ్డాను. ఆ కజ్జల జలమూ ఇంకి పోయింది. నా పర్యంకం పంకిలం కావటమూ మానివేసింది. (ఆ ప్రసంగాన్ని తుడిచివేసినట్లుగా చప్పరించి) కజ్జలా, ఏదీ ఒకమాటు ఇలారా. (తానే దగ్గరికి పోయి) ఒక్కమాటు నీ ముఖం చూడనీ - (ముఖం చిట్లిస్తూ) శరత్కాల చంద్రుణ్ణి పరిహసించే అంత చక్కని నీ ముఖం ఇలా అయిపోయిందేం కజ్జలా. ఎంత పాలిపోయింది నీ శరీరం. కామదేవుణ్ణి తప్ప కొలవలేనన్న నీవు నీకు తెలియకుండానే విభూతి ధారణం చేసి శివదీక్ష పుచ్చుకున్నావనిపిస్తున్నదే నీ దేహం. ఏదీ నీ చెయ్యి (అందుకొని) కాక తగిలినట్లున్నది... ఎందుకో నీవు బాగా లేవు. నీ మనస్సు బాగా లేదా?
కజ్జల : తాము నా ఆరోగ్య విషయంలో అతిశ్రద్ధ వహిస్తున్నారు. నాకేమీ జబ్బులేదు. ఈ ప్రజల సంతోష కోలాహలము కనులార చూచి ఆనందిస్తూ ఉన్న నా మనస్సు బాగా లేకపోవటానికి అవకాశం కూడా లేదు.
రాణి : కజ్జలా! ఏ విధమైన అనుమానం ఉన్నా దాచిపెట్టవద్దు. నాతో చెప్పటానికి నీకేం దాపరికం గనుక... ఈనాడే నా దగ్గరికి ఒక మానస శాస్త్రవేత్త వచ్చాడు. పంపనా! భూతవైద్యులలో ప్రఖ్యాతి గన్న పశుపతినాథుడు ప్రస్తుతం మన శ్రీనగరములోనే ఉన్నాడట - ఎందుకు వృధాగా రోగాన్ని కప్పిపెట్టి తరువాత ఎందుకు అపమృత్యువును ఆహ్వానిస్తావు కజ్జలా! నీ వియోగాన్ని నేను భరించగలుగు తానా? ఎలా భరించటం. భరించలేను కజ్జలా!
కజ్జల : (వ్యంగ్యోక్తిగా) తమ సేవకు నా బ్రతుకు ఇంత అత్యంతావశ్య కమని ఎన్నడూ గుర్తించలేకపోయినాను. తాము క్షమించాలి.
రాణి : అదే కాదు నేను అలవాటుపడ్డ వాళ్ళలో తప్ప మెలగలేను. అయిష్టమైన వాళ్ళను ఆదరించగలుగుదును గాని కొత్త మొగాలతో పరిచయమంటే నాకేమిటో భయమేస్తుంది కజ్జలా! - చూడలేను.
కజ్జల : (రాణి మాటలను జాగరూకతతో అవగతం చేసుకుంటున్నట్లు వర్తిస్తుంది)
రాణి : నీకూ నాకూ ఉన్న అనుబంధం ఈనాటిదా అలా అనుకోగానే తెంచి వేసుకోటానికి. నీ ప్రాణానికి ఏదైనా అపాయం కలిగితే అది నా ప్రాణానికీ అపాయమే. నా మంచికోసం, ఆత్మరక్షణ కోసం నిన్నర్థిస్తున్నాను కజ్జలా! నీవు ఈ విధంగా బాగా లేకపోవటానికి కారణమేమిటో బయటపెట్టు. ఎంత ఆదరానురాగాలతో ప్రజలు నీకు జయపెడుతున్నారో వింటున్నావా? ఆ జయఘోషలవల్ల నీకు వెర్రెత్తటం లేదూ?
కజ్జల : అది నాకు సంతృప్తి కలిగించలేదు. సంతృప్తికి మించిన తరువాత గదా ఉన్మాదం - ఉత్తమాత్మలకు తను యూహాగానం వినటం కన్నా వేరే సంగీతమే లేనప్పుడు... రాణి : నేను బంధులుణ్ణి ప్రసవించినప్పుడు కూడా ప్రజలు ఇంత ఉత్సాహాన్ని ప్రకటించలేదు. అయినా అది మాకు అనవసరం కూడాను.
కజ్జల : కారణం.
రాణి : ప్రజ ప్రేమించినా ప్రేమించకపోయినా వాడు యువరాజు కాక తప్పకపోవటం. అతని ఆజ్ఞానుసారంగా వాళ్లు నడవక తప్పకపోవటం.
కజ్జల : దేవీ! రాజ్యార్హత కేవలం పుట్టుకతోటి వచ్చే శాశ్వత భోగం కాదు. ప్రేమ మూలకంగా రాజ్యాన్ని సంపాదించుకొని ప్రజలను సంతుష్టి పరచిన రాజులదే ప్రజ్ఞ. చరిత్రల్లో వన్నె కెక్కిన రారాజు లందరూ ఇటువంటివారే.
రాణి : నీవన్నమాట సత్యమే కజ్జలా! ఈ విషయం నాకిప్పుడు కాదు, ఈ కాశ్మీరంలో కాలు పెట్టినప్పుడే తెలిసింది. సీతాకోక చిలుకల్లా చిందులేసే చేటికలకే ఈ దేశంలో పరమ పతివ్రతలకన్నా ప్రాభవం, విస్తారం. గౌరవం అత్యధికము. మొదట మొదటా నా మనస్సుకు ఎంతో కష్టం వేసేది. కాని తరువాత తరువాత మెట్టిన చోటు ఎంత నికృష్టమైనదైనా ఆ దేశాచారాన్ని మన్నించక తప్పదని మనస్సును సమాధాన పరిచాను.
కజ్జల : పాతివ్రత్యం బహూకృతి కోరదుగదా! ఒక వేళ వాంఛించినా అది అందులోనే ఉంది.
రాణి : అదొక్కటే సంతృప్తి పతివ్రతలకు. కానీ ప్రాభవం కోసం ఒకప్పుడు కొందరు పతివ్రతలు తమ పాతివ్రత్యాన్ని కూడా బలి ఇవ్వటానికి వెనుకాడరు.
కజ్జల : బలి ఇవ్వటమనటంలో మీ అభిప్రాయం?
రాణి : (అర్ధోక్తిగా) కజ్జలా! మనకెందుకిప్పుడీ అనవసర ప్రసంగం. ఆ విషయాన్ని ఇకపోనీ - అనవసరంగా తరచకు. మన సంభాషణ విషయాలు ఎన్నడూ శివదేశికుల చెవిన పడ నీయకు - మన వయస్సులో ఉన్నవాళ్ళు మభ్యపెట్టి ఇంకొకళ్ళ మనస్సును ఆకర్షించాలని పూనుకోటం ఎంత పొరబాటు. ఇన్నేళ్ళు వచ్చిన తరువాత మనకు మదనుడు ఏ ఊహలు ప్రసాదిస్తే ఏం ప్రయోజనం. పతివ్రతలంగా ఉండటం తప్ప మరొక పని చెయ్యలేం గదా! ఆ మాటని ఊరుకుంటామా అంటే ఊరుకోనూ లేము. మధ్య మధ్యా మన్మథ బాణాలకు గురికావటం తప్పించుకోలేము. అటువంటి సమయాలల్లోనే మనం జాగరూకత వహించాలి. చిత్త చాంచల్యానికి చోటివ్వకూడదు. చితిమంటలు ఎక్క వలసి వచ్చినా శీలం కాపాడుకోవాలి. కజ్జల : దేవీ! మీరేమి మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు.
రాణి : పాపం! పిచ్చిదానివి. నీ చుట్టూ ఎన్ని కుట్రలు జరుగుతున్నవో నీకేం తెలియటం లేదు? మహారాజు మాటమాత్రం నీ చెవిలో వేయలేదూ?... (అటూ ఇటూ చూస్తూ) ఎప్పుడైనా సరే జ్ఞప్తికుంచుకో... చుట్టూ మాంత్రికులు. మధ్య మనం. వాళ్ళ తంత్రాలల్లోనుంచీ ఎవరూ తప్పించుకోలేరు. కాల్చినా మళ్ళీ పుట్టుకువచ్చే వీళ్ళను కాలుడే జయించలేకపోతున్నాడు. ఒక్కొక్క మాంత్రికుడి చేతిలో ఎన్నెన్ని పిశాచాలున్నవో నీకు తెలియలేదన్నమాట! ఎంత మంది రాజులు వాటి కాహుతై పోతున్నారో నీవు ఎరగవన్నమాట!! - అదేం కజ్జలా అలా చల్లబడిపోతున్నావు?
కజ్జల : లేదు దేవీ. కానివ్వండి మీరు దయ ఉంచి మరికొంత ప్రస్ఫుటం చెయ్యాలి మీ ప్రసంగం.
రాణి : ఆ పిశాచాలు మన ఆస్థానమంతటా వికృతనృత్యం చేస్తున్నవి. ధనార్జనకోసం కొందరూ, గౌరవవాంఛతో కొందరూ, ప్రేమ పేరుతో మరికొందరూ వాటికి తమ పవిత్రాత్మలను అమ్మేసుకుంటున్నారు. పాపం! అభీరుడు ఎంత మంచివాడో నీవు ఎరుగుదువా? ఎరక్కపోవటమేమిటి? తన భార్యను ఒక పురుష పిశాచానికి ప్రీతిపూర్వకంగా అర్పించాడు. ఆ పిశాచాలల్లో కల్లా నాయకురాలు తనను ప్రేమించిన మహారాజుకు విషమిచ్చి చంపేసిందట. విషము! అమ్మయ్యో విషము!! ఏది ముట్టుకోబోయినా విషం - ఏది తాగబోయినా విషం. దాని చెల్లెలు మళ్ళీ పెళ్ళి చేసుకోటానికి అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్తకు పాషాణం పోసింది. పురుషుల్లో క్రౌర్యముంటుందంటే వెనక నమ్మేదాన్ని. స్త్రీలల్లో క్రౌర్యం. కుసుమ కోమలులా! గండశిలా కర్కశలు! స్త్రీలు! స్త్రీలు కూడా విషప్రయోగం.
కజ్జల : మీరు ఇంతగా ఎందుకు ఆశ్చర్య పడుతున్నారో నాకవగతం కావటం లేదు.
రాణి : అంటే స్త్రీలు కూడా విషప్రయోగం చేస్తారన్నమాట.
కజ్జల : ఎందుకు చెయ్యరు, కోరికలు సిద్ధించటమే ప్రధానంగా పెట్టుకున్నవాళ్ళు. కోమలాంగులయితే ఆ సాధనను స్వీకరించటానికి మరీ త్వరగా లొంగుతారు.
రాణి : నరకం మాటే మరచిపోతారా ఆ సమయంలో.
కజ్జల : మరవకు రానూవచ్చు - రాకపోనూ వచ్చు. అయినా క్రౌర్యానురాగంతో పోలిస్తే నరకం ఏపాటిది? రాణి : క్రౌర్యంగానీ, అనురాగం గానీ కలకాలం అనుభవించేది కాదుగా - అందుకోసమని కలకాలం యుగయుగాలు, తరతరాలు గౌరవాది నరకాలల్లో రాక్షసబాధలనుభవిస్తారా?
కజ్జల : (ఉద్వేగంతో) ఒకనాటి దైతేనేం - ఒక క్షణకాలానిదైతేనేం విజయం విజయమే - దోషానికి మొగ్గలేక జీవితాన్ని తొలగదోసుకోబోయే పిరికిగుండె ఎవరికో గాని ఉండదు. అందులో ప్రేమకోసం క్రౌర్యం - ఈర్ష్య ఎంత గొప్ప విశేషాలు. ఎన్ని జన్మలకైనా సాధించతగ్గవి. దేవీ - ప్రేమించ లేని ఆత్మ జీవించటమే లేదన్నమాట. ప్రేమించిన తరువాత సాధించలేకపోవటం మరీ చవటతనం. నా దృష్టిలో ప్రేమ విజయమే ప్రధానం గాని పరమపాపిష్ఠి నరకమన్నా భయంలేదు. ఆ సాధనలో చరమ సోపానాన్ని చేరుకొని పడిపోయినా భయం లేదు. ఆ సాధనలో ప్రాప్తించిన నరకంలోనే స్వర్గ సౌఖ్యమున్నదని నా ఆశయం.
రాణి : కజ్జలా! ఎందుకంత ఆవేశం. ఏమిటా దీర్ఘ నిశ్వాసాలు. ఉం... ఆ పిశాచాలను పూజించేవారంటే నీకూ అభిమాన మన్నమాట. ఈ మాటకు అంగీకరిస్తావా?
కజ్జల : అంగీకరించటమూ కాదు. అంగీకరించకపోవటమూ కాదు. వారి మనస్సులను అర్థం చేసుకొని వాళ్ళ దైన్యానికి చింతిస్తున్నాను. కాదు కాదు. వాళ్ళ సాహసాన్ని అభినందిస్తున్నాను. పాపం చెయ్యడానికి ప్రయత్నించాడని రుజువు కావాలనే పరమ దౌర్భాగ్య దండన విధించుటకేనా? పాపం చెయ్యటానికి ఎంతటి వీరగుణం కావాలో ఆలోచించాలి. అంత సాహసానికి పూనుకోవలసిన అగత్యమేమిటో అవగతం చేసుకొని దోషి అని తోస్తే దండన విధించడం ఎంత సమంజసము!
రాణి : కజ్జలా! నేను ఎవరినీ ఉద్దేశించి ప్రసంగించటం లేదు. దూషించటం లేదు. ఏమిటీ ఉద్వేగం. నా మాటలు నిన్ను ఇంత కలవరపెడుతవని కలలో కూడా భావించలేదు - వృధాగా ఎందుకు శరీరానికి అలసట తెచ్చి పెట్టుకుంటావు. పచ్చి వళ్లు బహు జాగ్రత్తగా పథ్యం చేయాలి సుమా! ఇంత లోనే ఎంత చెమట పోసింది - అంత ఇష్టం లేకపోతే ఆ ప్రసంగం నేనుమటుకెందుకు చేస్తాను - కజ్జలా! నా పతకాన్ని ఏం చేశావు?
కజ్జల : మీ పతకము?
రాణి : అవును. నా పచ్చల పతకము.
కజ్జల : మీ అభిప్రాయము? రాణి : మహారాజు రాత్రి నన్ను అడిగి పుచ్చుకొని వెళ్ళారు. నీకోసమే ననుకున్నాను కజ్జలా! ఎంత సంతోషంతో తీసి ఇచ్చానను కున్నావు. అయితే ఆ కానుక నీకు కాదన్నమాట. ఇంకెవరికిచ్చి ఉంటారబ్బా (యోచన) ఉఁః... నమ్మలేను. ఉఁ నమ్మలేను.
కజ్జల : వారి మెడలోనే ఉండి ఉండవచ్చు. వచ్చి కొడుకును ముద్దాడి నా కంఠసీమను అలంకరించవచ్చు.
రాణి : ఆ కంఠసీమను అలంకరించటం గత రాత్రే జరిగిపోయినది. నీ కంఠసీమను కాదని ఇప్పుడు నాకు అవగతమౌతున్నది. - మీరిచ్చిన బహూకృతికి ప్రియ సంతోషించిందా అని ప్రశ్నిస్తే మహానందపడ్డదని ప్రభువు సమాధానం చెప్పి నప్పుడు నాకెంత ఆహ్లాదం కలిగింది కజ్జలా! నీవంటే నాకు మొదటినుంచీ అదేదో అర్థంకాని అనురాగమూ, అనుబంధమూ ఏర్పడ్డవి... పోనీలే దిగులు పడవద్దు. నేను ప్రత్యేకంగా నీకివ్వమని మరొక పతకం - అంతకంటే చాలా విలువగలది - మా తండ్రిగారు నాకు వివాహ సమయంలో బహూకరించింది - ప్రభువుచేత పంపిస్తాను దిగులు పడకు.
కజ్జల : నాకేమీ అవసరం లేదు.
రాణి : నేను తప్పకుండా పంపిస్తాను. నీవు ఇంత చిన్నబుచ్చు కోవటం వల్ల నా మనస్సుకు ఎంత బాధగా ఉన్నదో నీకేం తెలుసు... ఉఁ ఇంతకూ మహారాజు నిన్ను మోసగించారన్న మాట - ఇక బయలుదేరనా... వెంటనే పతకం పంపిస్తాను. (లేవబోతుంది)
కజ్జల : (యోచనాపూర్వకంగా) దేవీ - మీరు పంపవద్దు. నాకు అనవసరం. ముమ్మాటికీ నేను స్వీకరించను.
రాణి : స్వీకరించవూ? ఏమిటా కలవరము కజ్జలా? ఈ దినము ప్రతి చిన్న విషయమూ నిన్నింతగా కలతపెడుతూ ఉన్నదేం? పోనీ. పంపనులే. నీ మనస్సుకు అంత కష్టంగా ఉంటే నేనుమాత్రం బలవంతం చేస్తానా. ఎందుకీ బాధ పడటం. ఏం ప్రయోజనం. మహారాజు చిత్తవృత్తి ఎరుగని దానివి కావుగా... ఆయన ఎప్పుడూ కొత్త కొత్త సీతాకోక చిలుకలను వెతుకుతూ ఉంటాడుగదా. నూతన ప్రియుడు ఈ పతాకాన్ని తన్నుకుపోను పరసీమనుంచి ఏదో ఒక సీతాకోకచిలుక మన రాజు సౌధాగ్రం మీద వ్రాలిందన్నమాట.
కజ్జల: (దీర్ఘ నిశ్వాసంతో) దేవీ నేను అలసి పోయినాను. క్షమించాలి. రాణి : అవును. అవును. నీ ముఖ వర్చస్సును బట్టే అవగతమౌతూ ఉన్నది. కొంచెం విశ్రాంతి తీసుకో - నేనూ బయలుదేరనా (రెండడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనుకకు వచ్చి ఆప్యాయంగా) నీ రూపం ఎంత చెడి పోయింది కజ్జలా! గుర్తుపట్టలేకుండా ఎలా మారి మారి పోయినావు. ఆరోగ్య విషయంలో అతిశ్రద్ధ వహించు సుమా! ఇది నాకోసం చెపుతున్నమాట. మనం వయస్సులో ఉన్న వాళ్ళము. బహు జాగ్రత్తగా ప్రవర్తించాలి. ధైర్యం పోగొట్టు కోకు. మహారాజు మన్ననా మళ్ళకేం చేస్తుంది. పుష్టిగా తిను. ప్రసవాసవాలు సేవించు, దీర్ఘ నిద్ర అవసరం. దేన్ని గురించీ అట్టేసేపు ఆలోచించవద్దు.
(కజ్జల వాడిపోయిన ముఖంతో లేచి వణికిపోయే చేతులతో రాణికి
నమస్కరిస్తుంది. రాణి నిష్క్రమిస్తుంది.)
కజ్జల : కంచుకీ!
కంచుకి : (ప్రవేశించి) అమ్మాయీ!
కజ్జల : (అతనిచేయి ఊతగా తీసుకొని మయూరాసనం మీద విశ్రమిస్తూ) విన్నావా? మహారాజు నన్నెలా మోసగిస్తున్నాడో. ఇంకొతెను ప్రేమిస్తున్నాడు. అనన్య సాధ్యమైన నా స్థానాన్ని మరెవరో ఆక్రమించారు... నా పారితోషికాలు మరొకతె స్వీకరించి అలంకరించుకుంటున్నది. ఇంత వరకూ ప్రభువు ఇక్కడికి రాకపోవటానికి ఇదే కారణం. పసిబిడ్డను చూడకుండా ఆ పాపిష్ఠి కళ్ళు ఎలా ఉండగలిగాయో? సౌధాలల్లో తిరిగేటప్పుడు నాకంటపడి కూడా చూడనట్లు తప్పించుకు తిరుగుతున్నాడు. ఛీ! అన్యాయంగా ఆయనమీద అపనిందలు వెయ్యటమెందుకు? రాణి చెప్పిన మాటల్లో సత్యమెంతో... ఈర్ష్యాపరురాలు! అలా జరగటానికి అవకాశమెక్కడిది? ఇదంతా నా ప్రాభవాన్ని చూచి ఓర్వలేని ఈ కుతంత్రురాలు పన్నిన పన్నాగమై ఉంటుంది. ఈ ఉత్సాహ సమయంలో కాసేపైనా నన్ను బాధపెట్టి మనస్సులో సంతోషించటానికి. అబ్బా! ఇది ఎంత కథ పన్నింది!
కంచుకి : అమ్మాయీ! ఆమె చెప్పిన మాటల్లో అణుమాత్రం అసత్యం లేదు. నీకు నిజంగా ఎవరో శత్రువు మొలకెత్తింది.
కజ్జల : ఓరి సాహసీ! నీకు తెలుసునన్నమాట. ఇన్నాళ్ళబట్టీ నాకెందుకు ఎరుక పరచలేదు పాపీ. కంచుకి : అమ్మాయీ! మరొకమాట రానియ్యకు. నేను వెళ్ళిపోతాను. (బయలు దేరతాడు)
కజ్జల : ఆగక్కడ. ఎవరా వ్యక్తి? ఇంతకు ముందెందుకు చెప్పలేదు?
కంచుకి : నీవే తెలుసుకుంటావని. నీవు గ్రహించలేకపోవటం నా దోషమా?
కజ్జల : నమ్మి నా గుట్టంతా నీ చేతుల్లో పెడితే నీవు చూపించవలసిన కృతజ్ఞత ఇదేనా? కోరుకున్నదల్లా ఇచ్చి నిన్ను సంతృప్తి పరిచానే - ఇదేనా నీ సానుభూతి?
కంచుకి : నామీద నీ నేరము. నీవీ స్థితికి రావటానికి కారకులెవరో మరిచిపోయి మాట్లాడకు. పదిహేను వసంతాలపాటు మహారాజు మనస్సు నీకిప్పించిన నా మీదనా నీ నేరము.
కజ్జల : (తప్పిదాన్ని గ్రహించినట్లు) అవును నిజమే. అందుకు నేను కృతజ్ఞురాలను. కానీ కంచుకీ, నా జీవితంలో నిమిషం సుఖం లేదు. ప్రతి దినమూ ఏదో ఒక ప్రళయము. మిన్ను విరిగి మీద పడటము. చిట్టచివరకీ మోసము. నా విజయశ్రీ ఎంత చంచలమైంది కంచుకీ - జయించి సుస్థిరమనుకున్న విజయం ఇన్నిమార్లు చేయి జారిపోతుంటే ఎన్ని ప్రయత్నాలు చేసేది.
కంచుకి : రూపంతో మురిపించి నన్నాళ్ళు మురిపించావు తల్లీ - ప్రణయ సామ్రాజ్య జయపతాకవైనావు. ఆ రూపం అనిత్యం. అందువల్ల చేకూరే విజయమూ అనిత్యం. నిన్ను మించిన సౌందర్యం నిన్ను త్రోసి రాజన్నది. అది పరిపూర్ణ విజయం పొందటం భావ్యం కూడా. నీవు అనుసరించే మార్గము ఇంత కంటే సుస్థిరమైన విజయాన్ని ప్రసాదించలేదని చెప్పిన నా మాటలు నీకు వెనుక నచ్చినవా?
కజ్జల : ఆ శాశ్వత విజయానికి మార్గమేమిటో?
కంచుకి : (చిత్రంగా కజ్జల కళ్ళల్లోకి చూస్తూ) వెనుక విన్నవించిందేగా నీకే తెలుసు.
కజ్జల : (కోపంతో) ఛా! నోరు ముయ్.
కంచుకి : నేను ఎవరి క్షేమం కోరి మాట్లాడుతున్నానో గ్రహించావా? అతి స్వల్పతంత్రం.
కజ్జల : ఆ ప్రసంగం మరొకమాటు రానిస్తే మన్నించను కంచుకీ! కంచుకి : కజ్జలా! కోపం తెచ్చుకోకు. శాక్తేయపంక్తి కంఠస్వామి ప్రజ్ఞ - అసామాన్యంలో యావద్భారతంలో ప్రఖ్యాతి పొందింది. అంతటి మహాత్ముడి అండ ఉండి కూడా ఆశ్రయలోపం వల్ల ఆశయ సాఫల్యం పొందలేకపోవటం మన దురదృష్టం - అవ్యక్తత.
కజ్జల : సమస్త శక్తులూ నాకరాగతాలౌతవా?
కంచుకి : ఇంకా సందేహమా?
కజ్జల : (యోచనాపూర్వకంగా) నా ఆత్మ మహారాజుది. పంక్తికంఠ స్వామి నీచ కైంకర్యానికి కాశ్మీర రవికిరణ సంఫుల్ల కైరవం - ఈ దేహాన్ని ఉపహారం చేయగలుగుతానా?
కంచుకి : మనస్సులో మహారాజును స్మరించుకుంటూ, కాసేపు కళ్ళు మూసుకొని...
కజ్జల : నగ్నంగా... శక్తి ముందు నేనూ నా మీద భయంకర శాక్తేయకరాళ హస్తాలు - నా జీవధనాన్ని నిమిషంలో దోచుకుంటాడా... బాబో మనస్సు అంగీకరించటంలేదు.
కంచుకి : ఆశయంతో పోలిస్తే నీ త్యాగమెంత? శక్తికి దేహాన్ని ఉపహారంగా ఇవ్వలేని నీకు మహత్తరమైన ఈశ్వితశక్తి ఎలా వస్తుంది. సాధనను బట్టే గదా సిద్ధి.
కజ్జల : కంచుకీ! నన్నేదో మోహ మహాసముద్రంలో ఈదించబోతు న్నావు. ఉంః... విజయం హస్తగతం కాకపోయినాసరే. ఈ నీచమార్గాన్ని అనుసరించలేను కంచుకీ. నా పవిత్రదేహాన్ని బలిపీఠం ఎక్కించలేను కంచుకీ
(రెండు చేతులతో తల పట్టుకుంటుంది)
కంచుకి : శుభాశుభాలనే అవధులందని జలధుల్లో మానవులు తట్టాడుతుంటారు. ఎవరో సాహసికులు కాని ఆ మహా సాగరాన్ని తరించి బయటపడలేరు - తరించినవాళ్ళకు ఈశిత్వమూ! వశిత్వమూ! త్రిలోక ప్రాభవమూ! కజ్జలా! కరతలామలకాలు కాబోతూ ఉన్న మహత్తర సౌఖ్యాన్నీ విజయాన్ని చేతులార చెడగొట్టుకోవద్దు. ఆలోచించుకో!
కజ్జల : రుగ్మత నా గుండెలు బ్రద్దలు చేస్తున్నది. ఈ క్రూర కర్మకు ఎదురు నిల్చే ధైర్య సాహసాలు దానికి లేవు. కంచుకీ - ఆ ప్రసంగమిక చాలించు. అనుభవించిన సౌఖ్యం చాలు. వెనక హస్తగతమైన విజయం చాలు. మోహానికి నిముషం లొంగానా నా జీవనావ మునిగిపోతుంది. కంచుకి : ఆ నిమిషమే నిన్ను జగజ్జేతను చేస్తుంది. నీ పతనానికి నీవే కారణభూతు రాలవు కావద్దు కజ్జలా! ఆలోచించుకో -
(వెళ్ళబోతాడు)
కజ్జల : (నీరస కంఠంతో) కంచుకీ! కోపం వద్దు. నన్ను ఒంటరిగా విడిచిపోవద్దు. ఈ జబ్బు నన్ను పీల్చి పిప్పి చేసి సగం చేసింది. నాలో శక్తి ఏదో నన్ను వదలి పెట్టిపోయింది. స్వయంగా ఆలోచించలేను. కన్నబిడ్డలా చూస్తూ ఉన్న నీవే నన్ను కాపాడాలి. ఆ భారం నీది... కంచుకీ - కాసేపు నన్ను విశ్రమించనీ. - (కంచుకి చేయి ఊత ఇచ్చి పాన్పు మీదికి చేరుస్తే ఆమె పవళిస్తుంది.)
ద్వితీయ దృశ్యము
(రాజసౌధంలో కజ్జలాదేవి మందిరం. కజ్జలాదేవి గాఢంగా నిద్రిస్తూ ఉంటుంది. కుమార్తె సారంగదేవి ఒక ప్రక్కన వీణా నాదం చేస్తూ ఆలోచనా నిమగ్నురాలై ఉంటుంది.)
షట్పది : అమ్మాయీ! కజ్జలాదేవి గాఢనిద్రలో ఉన్నది. మనం ఇక్కడ పాడుకుంటూ ఆమె సుషుప్తికి భంగం కలిగించటం భావ్యం కాదు. ఎప్పుడూ ఏదో అవ్యక్తమైన బాధ అనుభవిస్తూ ఉంటుంది. ఈ దినం చాలా నీరసించిపోయింది.
సారంగదేవి : నిజమే! షట్పదీ - తోచక ఏదో పాట పాడుతున్నాను గాని, ఆమె నిద్రకు అంతరాయం కలిగించటము ఏమాత్రమూ నాకు ఇష్టం లేదు. నీవన్నట్లు ఆమె ఎప్పుడే ఏదో అవ్యక్తమైన వేదన అనుభవిస్తూ ఉన్నది. నేను పుట్టినది మొదలు చూస్తూనే ఉన్నాను. ఆమె జీవితంలో సుఖంగా గడిచిపోయింది ఒక దినమూ నాకు కనిపించలేదు.
షట్పది : (పెదవి విరుస్తూ) పాపం! ఆమె ఎన్నడూ సుఖంగా లేదు. అందులో ఈ ఉదయం.
(వాతాయనంవైపు నడిచి చూచి వచ్చి దీర్ఘంగా నిశ్వాసిస్తుంది)
సారంగదేవి : ఎందుకో దీర్ఘంగా నిశ్వాసిస్తున్నావు షట్పదీ!
షట్పది : కజ్జలదేవి జీవితంలో ఇది ఎంత మహోత్సాహసమయం. సమస్త కాశ్మీరమూ సాదర గౌరవం చూపించటానికి ఈనాడు ఆమె సౌధం చుట్టూ చేరింది. మహారాణి స్వయంగా ఎవరి సౌధానికి వచ్చి ఆదరించింది? అమ్మాయీ! ఇది నీకూ కజ్జల దేవికి ఎంత శుభదినం... ఎందుకో నీవు కూడా సంతోషంగా లేవు తల్లీ -
సారంగదేవి : నా ఆనందాన్నంతా నీకిస్తాను, మనః పూర్వకంగా అనుభ వించి ఆనందించు. పరమాత్మను నా పునర్జన్మలోనైనా ఇటువంటి శుభదినాన్ని నాకు ప్రసాదించవద్దని ప్రార్థిస్తు న్నాను. నా పరిస్థితిలో మీరుండి ఈ ఆనంద సమయాన్ని అర్థం చేసుకుంటే నేను సంతోషంగా లేకపోవటానికి కారణం అవగతమౌతుంది.
షట్పది : అంటే - నీ అభిప్రాయము.
సారంగదేవి : (కంట తడితో) ఏమీ లేదు.
షట్పది : అమ్మాయీ! ఏమీ లేకపోతే ఏమిటా కంటతడి.
సారంగదేవి : ఏమీలేదు షట్పదీ. (కంటతడి తుడుచుకుంటుంది)
షట్పది : అమ్మాయీ! నీవు కూడా కొన్నాళ్ళనుంచీ ఏదో అర్థంగాని బాధ అనుభ విస్తున్నావు. నేను వినగూడని అంశమేదన్నా నిన్ను కలవరపెడుతున్నదా?
సారంగదేవి : నీవు వినగూడనిది నా జీవితంలో ఏదన్నా ఇంతవరకూ ఉన్నట్లు విన్నావా?
షట్పది : కానప్పుడు నీ చింతకు కారణమేమిటో నాకు బోధపడటం లేదు - చెప్పు తల్లీ! అనవసరంగా మనస్సులో పెట్టుకొని ఎందుకు కృశిస్తావు. నేనంటే నీకు అనురాగం తప్పి పోయిందా? అయితే బ్రతిమాలనులే.
సారంగదేవి : షట్పదీ ఏమిటా నిష్ఠూరం. నన్ను మళ్ళా అనవసరంగా ఏడిపించటానికి ప్రయత్నించవద్దు. నేను ప్రస్తుతం మాట్లాడకుండా ఉండటం తప్ప మరొక పని చెయ్యలేను.
షట్పది : ఇప్పుడు దుఃఖించావన్నమాట. సంగతేమిటో బయటపెట్టు తల్లీ! అంత దుఃఖించవలసిన అగత్యమేమి వచ్చింది - నీ ప్రియుడేమైనా నిన్ను మోసగించాడా?
సారంగదేవి : (దుఃఖంలో నవ్వుతూ) లేదు.
షట్పది : మరి -
సారంగదేవి : నే నీ నీచమైన బ్రతుకు గడపలేకుండా ఉన్నాను.
షట్పది : అంటే నీ అభిప్రాయం సారంగదేవి : నే నీ పాపాన్ని భరించలేను. ఈ పాపంలో బ్రతకలేను. ఈ పాపవాయువు క్రమక్రమంగా నా ప్రాణాన్ని హరిస్తున్నది. అనేక రాత్రులనుంచీ నాకంటికి కునుకు లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్తంభించినా బ్రతుకుతున్నాను. నా ఇంట్లో ఏ వస్తువును ముట్టుకున్నా కళంక భూయిష్ఠం పాప పంకిలము. ఎన్నాళ్ళబట్టో మృత్యువును ఆహ్వానిస్తున్నాను. కొలది కాలం క్రితం దర్శనమిచ్చింది. ఆనాటినుంచి ఆమె వికట నృత్యాన్ని దర్శిస్తూ ఆనందిస్తున్నాను. చివరకు ఆమె చిన్మయహాసంలో నురుగునై పోవటానికి నిశ్చయించుకున్నాను. ఇక జీవించ లేను షట్పదీ! జీవించను -
షట్పది : అమ్మాయీ! ఏమిటా లేనిపోని పిచ్చి ఊహలు. నీకేం శరీర స్వస్థత లేదా?
సారంగదేవి : షట్పదీ! ఎందుకు నాచేత చెప్పించటము. ఇందులో నీవెరుగని దేమున్నది. నా అవమానపు బ్రతుకును చూస్తుంటే నీకు అసహ్యం కలగటం లేదూ. నాతో మాట్లాడేటప్పుడు నాచుట్టూ ఉన్న వ్యభిచార వాయువు మీమీద సోకటం లేదూ? (కంటికి గుడ్డ అడ్డం పెట్టుకొని దుఃఖిస్తుంది)
షట్పది : తల్లీ! సారంగీ! సారంగీ!
సారంగదేవి : షట్పదీ! (నిద్రలో ఉన్న కజ్జల దేవిని చూచి) నా మాటలన్నీ అమ్మ విన్నదా? లేదు. ఇంకా దీర్ఘనిద్రలోనే ఉన్నది. ఆమె వినకూడదు. నా హృదయంలో ఏమున్నదో ఆమెకు తెలియ కూడదు. తెలిస్తే నేను బ్రతకను. అప్పుడు నా దుఃఖమే నాకు దహనాగ్నిగా మారిపోతుంది. (కజ్జలను చూపిస్తూ) ఆమె వివాహిత. వితంతువైనా మహారాజు అనేక వివాహాలు చేసుకున్నాడు. ఇద్దరికీ సంతానం ఉన్నది. కానీ వీరి వ్యభిచారం లోకంలో ఏ మహాభావమూ ఆపలేకపోతున్నది. వృద్ధాప్యానికి చేతగానప్పుడు... ఈ పాపపంకిలంలో ప్రాణాలు ఉగ్గబట్టుకొని బ్రతుకుతూ ఉన్న నేను చాలక - ఈ పాప కారాగారంలో ఈ పాపకూపంలో నాకు తోడుగా మరొక ప్రాణిని పంపించాడు బ్రహ్మ. అమాయక ప్రజ! దానికేం తెలుసు, తమ్ముణ్ణి పొగడటానికని వచ్చారు. కజ్జలా దేవి మహారాణి అని వారి విశ్వాసం. కాబొయ్యే యువరాజని తమ్ముడికి జయ పెట్టవచ్చారు. ప్రజదేముంది, అమాయక ప్రజ. ప్రజలకు తమ్ముడు యువరాజు, అమ్మ మహారాణి నేను రాజకుమార్తెను, ప్రభు వర్గంలో అమ్మ... చెప్పలేను - మేము తొత్తు సంతానము, (ఏడుస్తూ) నా యీ దేహం, దానికి సంబంధించిన సమస్తమూ పాపానివి, మహా పాపానివి, నా తండ్రి వ్యభిచారి, తల్లి వ్యభిచారణి. ఈ కళంకాన్ని కడిగి వేసే దివ్యహస్తాలు ఏ దేవతాలోకంలో ఉన్నవో!
(కజ్జల నిట్టూరుస్తుంది)
సారంగదేవి : (కజ్జలాదేవిని చూస్తూ) కలలు కంటున్నావా తల్లీ! నీ స్థితిని నీవు అర్థం చేసుకోలేని దుస్థితిలో పడ్డావు. నీ లోపాలను చెప్పే పెద్దలెవరూ నీకు లేరు. అందరూ నిన్ను జూచి అడుగులకు మడుగులొత్తే వారే. అమ్మా! నీ చుట్టూ ప్రసరించే గాలి, వెలుతురు, పాపభూయిష్ఠం! పాపభూయిష్ఠం నీవల్ల కాశ్మీరంలో నీతి అవినీతి - అవినీతి నీతిగా మారిపోతున్నది. అమ్మా నేనీ సౌధంలో విశేషకాలం సంతోషంగా బ్రతకలేను.
షట్పది : సర్వసంగ పరిత్యాగం చేసుకొని భిక్షుక సంఘంలో చేరిపోవాలని నీకు ఎన్నడైనా కోరిక కలిగిందా ఏమిటి?
సారంగదేవి : ఎందుకలా ప్రశ్నించావు షట్పదీ. నా హృదయం ఎపుడో నీకు అర్థమైనట్లు మాట్లాడావు. ఈకోరిక ఎప్పుడో ఒకప్పుడు కాదు. అనేకమార్లు కలిగింది. మన జీవితాలకు శాంతి మహాయానంలో తప్ప దొరకదని అమ్మకు ఎన్నోమాట్లు మనవి చేశాను. ఆమె ఈ సౌధాన్ని వదలిపెట్టలేదు. భ్రమ పడ్డా ఈ సౌఖ్యాలకు స్వస్తి చెప్పలేదు. అందుకు ఎన్నడూ అంగీకరించింది కాదు.
షట్పది : అందులో ఆమె దోషమేమీ లేదు. నీ మేలుకోరి చేసింది ఆ పని.
సారంగదేవి : ఇకముందు నేను పరిపూర్ణానందాన్ని అనుభవిస్తానన్నమాట కల్ల. ఆమె మటుకు ఏమి సుఖపడుతూ ఉన్నది. ఎప్పుడూ కన్నీళ్ళలో కరిగిపోతున్నది. ఆమెకు బ్రతుకులో సుఖస్వప్నం వంటి ఒక్క నిమిషమైనా ఉన్నదెప్పుడో చెప్పు షట్పదీ!
షట్పది : ధర్మాధర్మాలు నీ వనుకున్నంత నిశ్చితాలు కావు తల్లీ! ఒకరి నొకరు ప్రేమించుకోవటం పాపం కాదు. ప్రేమ అమృతం వంటిది. రాహు కేతువులు ఆ అమృత పానం వల్లనే కదా దేవతలను క్షణకాలమైనా జయిస్తున్నారు. ఆ ప్రేమ ముగ్ధ. యౌవనంలో ఉన్నప్పుడు వ్యక్తి ఒక పాపమైనా చేయలేక పోవటం పాపము!
సారంగదేవి : షట్పదీ వెనుకటినుంచీ నీకూ ఈ వెర్రి సిద్ధాంతాల మీద అభిమానం ఉన్నదా?
షట్పది : పురుష హృదయాలను చేత జిక్కించుకొని వాటికి అధిష్ఠాన దేవతలమై పాలించటం! కీర్తితో లోకాన్ని వ్యామోహ పెట్టటం!! కాంక్షలో కైపు!!! ప్రణయ కోపాలతో ఎంతంత మహాప్రభువులను పాదదాసులను చేసుకోవటం ఉజ్జ్వల యౌవనానికి లక్షణాలు. ఎంత అదృష్టవంతులకో గాని, పూర్వజన్మలో ఎంతో మహాపుణ్యం చేసుకున్న వాళ్ళకు గాని లభించని లక్షణాలు! అందుకోలేని ఆశయాలు! ప్రభువులను ప్రేమించి వారు ప్రణయ భుజ పంజర కీరాలై శుకానువాదం చేస్తున్నప్పుడు కలిగే పరితృప్తీ, మహాప్రభువులు మనసారా ప్రేమిస్తే వారి ఆజానుబాహువులను ఆధారం చేసుకొని అల్లుకుపోయే ప్రణయ లతికలమై ఆనందరసోన్మత్తతలో 'ప్రభూ' అని పలవరించుటము ఒక జీవికి ఎన్ని జన్మలకో!... మహాప్రభువు కలశ భూపతిది ఎంత జాలిగుండె తల్లీ - ఆయన ఎంత చక్కనివాడు ఎంత రసికుడు.
(తన మెడలో ఉన్న హారాన్ని చూచుకొని సవరించు కుంటుంది)
సారంగదేవి : షట్పదీ! నీ ప్రసంగం ఇక చాలించు. నా మనస్సుకు బాధ కలిగిస్తున్నది.
షట్పది : అమ్మాయీ! మీ తండ్రిని ప్రేమమూర్తి అని అభినందిస్తుంటే నీకు బాధెందుకు తల్లీ!
సారంగదేవి : ఆయన ప్రేమమూర్తి కాడని కాదు. ఆయన ప్రేమమూర్తని ఎరగక కాదు ఆయన ప్రేమమూర్తని నీవు చెప్పే లక్షణం నాకు నచ్చలేదు. నాకు మహా బాధ కలిగించింది.
షట్పది : (సారంగదేవి చేతులు స్పృశిస్తూ) అమ్మాయి! వెర్రిదానా. నీమీద అనురాగం లేకనా ప్రభుహృదయాన్ని గురించి నీతో ప్రసంగించటం.
సారంగదేవి : (బిగ్గరగా) షట్పదీ. నా కోపం అధికమౌతున్నది. మరొక మాటు మహారాజు ప్రశంస రానిచ్చావా నీకు మర్యాద దక్కదు... (షట్పది మెడలో హారాన్ని నిర్దేశిస్తూ) నీకెక్కడిదా హారము? ఎవరిచ్చారు? ఇదివరకు నీ మెళ్ళో లేదే! - ఇది మహారాణిది కదూ. నీకెలా వచ్చింది. చెప్పవూ?
(కజ్జలాదేవి ఈ సంభాషణ వింటూ ఒక్కమాటున కదిలి లేస్తుంది)
చెప్పవూ?
షట్పది : చెప్పకూడదు.
సారంగదేవి : నాదగ్గిర దాపరికమా షట్పదీ! ఉఁ హారమెవరిచ్చారు?
కజ్జల : మహారాజు! మహారాజు!! షట్పది : (ఉక్కిరి బిక్కిరైపోతూ మొగం ప్రక్కకు తిప్పుకొని వెళ్ళిపోబోతుంది)
కజ్జల : షట్పదీ! ఆగక్కడ. సారంగీ నీవు బయటికి వెళ్ళి జనసమూహాన్ని చూచి ఆనందించు. వారిని తృప్తి పరచటము మన కర్తవ్యము.
(సారంగదేవి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతుంది. షట్పది తలవంచుకొని నిలవబడుతుంది)
కజ్జల : ఒకమాటు మొగం పైకెత్తి నన్ను చూడు షట్పదీ!
షట్పది : (మాట్లాడదు)
కజ్జల : నా ఆజ్ఞ పాలించవన్నమాట షట్పదీ!
షట్పది : దేవీ! నన్ను బాధపెట్టవద్దు.
కజ్జల : ఉఁ....
షట్పది : (కొంచెం పక్కకు పోయి ఆలోచనచేసి) కజ్జలా! మహారాజు నాకీ హారమిచ్చి గౌరవించారు.
కజ్జల : (ఆవేశంలో) ఎప్పుడు? ఎక్కడ?
షట్పది : (ఠీవితో) నిన్న సాయంత్రం. తామ్రస్వామి ఆలయంలో.
కజ్జల : రాజు నిన్ను ప్రేమిస్తున్నాడన్నమాట!
షట్పది : అవును.
కజ్జల : నీకెలా తెలుసు?
షట్పది : నాతో చెప్పారు.
కజ్జల : రాజు! నీతో చెప్పాడా?
షట్పది : అవును నిన్న రాత్రి శంపా ప్రాసాదంలో.
కజ్జల : (దీర్ఘంగా నిట్టూర్చి వెనకకు పోయి పర్యంకం మీద వెన్నువాల్చి మళ్ళా లేచి కూర్చొని) ఉఁ ఇంతకూ నిన్ను ఆయన ప్రేమించాడన్నమాట.
షట్పది : (తలవంచి సగర్వంగా ) ఔను.
కజ్జల : ఎప్పటినుంచి? షట్పది : గత వసంతారంభంనుంచి.
కజ్జల : నాకు ఋగ్మత ప్రారంభించినప్పటి నుంచీ - మీ ఇద్దరికీ ప్రథమ పరిచయం ఎలా జరిగింది?
షట్పది : (మాట్లాడదు)
కజ్జల : చెప్పవా? చెప్పలేవు. మోసము. అతడు నిన్ను మనసిచ్చి ప్రేమించలేదు. కేవలం ఆటవస్తువుగా గ్రహించాడు.
షట్పది : ప్రేమించటంలేదూ? శుద్ధ అబద్ధం. ప్రథమ పరిచయంనాడు నీమీద చూపించిన అనురాగం చాలదని చెప్పాడు మహారాజు. నీ కళ్ళను మించిన కాంతులు నా కళ్ళల్లో తొణికిస లాడుతున్నవని పొగిడాడు. కన్నీటితో నా చేతులు కడిగి వేశాడు. పాదదాసుడై ప్రణామం చేశాడు.
కజ్జల : (రాని నవ్వు తెచ్చుకుంటూ) షట్పదీ రాజు నిన్ను మోసగించాడు. నీవు మోసపోయినావు. ఎవరైనా మోసగించే వాళ్ళు ప్రేమించటంలేదని చెపుతారా? కన్నీళ్ళతో కడి గేయరూ? కేవలం పాదదాసు కావటమే కాదు. పాద దాసానుదాసు లౌతారు ఆ సమయానికి. షట్పదీ వెర్రిదానా ఎంత మోసపోయినావు. పాపం! వృద్ధాప్యం రాజ్యమేలుతూ ఉన్న ఆ ముదనుగ్గు హృదయంలో ఇంకా ప్రేమకు స్థాన మున్నదా? మనసారా నీకు పాదదాసుడైనాడనేనా నీ భావం. ఆ కన్నీళ్ళు కాలుష్యం లేనివనేనా నీ ఆనందం - వెర్రిదానా? పోనీ... ఆ పుంజును ఏ మదనమంత్రంతో బుట్టలో వేశావు షట్పదీ.
షట్పది : కామదేవాలయములలో, ఉద్యానవనాలల్లో నీమాదిరి కన్నులు కలుపలేదులే - మహారాజును నేనేమీ కవ్వించలేదు. మనఃపూర్వకంగా ఆయనే ప్రణయార్థిగా నా కన్యాప్రణయాన్ని అర్థించాడు.
(మెళ్ళో హారాన్ని సవరించుకుంటుంది)
కజ్జల : (శయ్య మీదనుంచి లేచిపోయి షట్పది మెళ్ళో హారాన్ని గుప్పిటితో పట్టుకొని) ఇది నాకు ఇచ్చేయ్!
షట్పది : ఇవ్వలేను.
కజ్జల : నాకు కావాలి.
షట్పది : ఇది నాది (పెనుగులాడుతూ తెగిపోతుందేమో నన్న భయంతో) నేను నీకివ్వను. కజ్జల : నీ చేతులు విరిచేస్తాను. (ఎడం చేతితో షట్పది చెయ్యి మెలి త్రిప్పుతుంది)
షట్పది : ఏమిటీ దౌర్జన్యం... ప్రభువుతో చెప్పి.
కజ్జల : (ఈర్ష్యతో) శిక్ష వేయిస్తావా! (హారం తెంచి) కృతఘ్నురాలా! ఇదిగో హారం - బలవంతంగా తీసుకున్నావు. ఎవరితో చెప్పుకుంటావో.
షట్పది : నా హారం నాకివ్వు.
కజ్జల : నా సౌధంలో నుంచి బయటికి కదులు.
షట్పది : నీవు దొంగవు... అందరికీ చెపుతాను. బలవంతంగా నా హారాన్ని కాజేశావు.
కజ్జల : నిజంగానా, దొంగనా. ఇదిగో నీ హారం తీసుకో... ఇచ్చే స్తున్నానుండు.
(హారాన్ని తెంచి దానిలో పచ్చరాయిని బల్లమీద పెట్టి చిన్నరాతితో ముక్కలు ముక్కలుగా కొట్టేస్తుంది)
షట్పది : ఆఁ... ఆఁ ఘనకార్యం చేశావు. అశక్తురాలవు. అంతకంటె నన్ను ఏం చేస్తావు పాపం! నీ కళ్ళమంట తీరిందా. ఎంత అఘాయిత్యమే జంతువా? మహారాజు యిలాంటి నిన్ను ఇంకా ఎలా ప్రేమిస్తాడు? నాతో ఏమని చెప్పాడో చెప్ప మన్నావా?
కజ్జల : (ఉరోభాగాన్ని నిక్కించి రాజసంతో) నోరు ముయ్యి.
షట్పది: నాకేం అవసరం. నువ్వే ముయ్యి. నిన్నూ నీ దురవస్థనూ చూచి రాజూ నేనూ ఇప్పుడే నవ్వుకుంటాము. ఆయన నన్ను మనసారా ప్రేమిస్తున్నాడు. నాకు యౌవనముంది నీవు ముదివగ్గువు. నీలో ఈర్ష్య చావలేదు యౌవ్వనం చచ్చినా -
కజ్జల : (కలవరపాటుతో) (లేచి పక్క గుడ్డలు అటూ ఇటూ విసరి పారేసి తలగడ క్రింద కత్తి తీసి) ఏదీ మళ్ళీ అను ఆ మాట (షట్పది మీదికి పొడవటానికి వస్తుంది)
షట్పది : (భయంతో) అమ్మయ్యో! రాక్షసీ! రజా, రుజా, కజ్జా!!
కజ్జల : ఒళ్లు దగ్గిర పెట్టుకొని బ్రతుకు. నాతోనా నీకు. జాగ్రత్త తులువా!
(కత్తి విసరి క్రింద పారవేయబోతూ) ఈటిముండ - మెడబెట్టి గెంటిస్తాను. పాలుపోసి పెంచినందుకు పాము వనిపిస్తున్నావా జాగ్రత్త (తలుపులలోనుంచి రజా, కజ్జా తొంగి చూస్తారు. “ఎవరా పక్షులు" అనే కజ్జలాదేవి ఉన్మత్తకంఠం విని, బయటికి వెళ్ళిపోతారు) కదలు అవతలికి. (షట్పది నెమ్మదిగా కన్నీటితో వెళ్ళిపోతుంది) పాపిష్ఠిముండ - బంధకి
(కత్తి నేలమీద పారేసి పర్యంకం మీద వాలిపోతుంది) చతుర్థ దృశ్యము
(కజ్జలాదేవి తన మందిరంలో నిద్రిస్తుంటుంది. సారంగదేవి, షట్పది
మాట్లాడుకొంటుంటారు)
సారంగదేవి : ఔను! నిజమే. మనోవేదనను ఎన్నాళ్ళు దాచుకోవటం. బయట పెట్టవలసిందే. లేకపోతే బ్రతకటం కష్టం. షట్పదీ! నాకెందుకీ కంపం! ఎందుకీ భయం!! అమ్మా!... అబ్బా! (నెమ్మదిగా నేలమీదికి ఒరిగిపోతుంది)
కజ్జల : (మేల్కొని, వేగంతో) అమ్మా! సారంగీ! సారంగీ!!
సారంగదేవి : (తెప్పరిల్లి నెమ్మదిగా తల్లి దగ్గరకు చేరి) 'అమ్మా!' అని పిలుస్తూ ముట్టుకో బోతుంది.
కజ్జల : నన్ను ముట్టుకోవద్దు. సారంగీ! తల్లీ నా ముఖాన్ని చూడలేక పోతున్నావా? ఏమిటి నీకీ భయం. కళ్లెత్తు - ఒక్కమాటు నీ కన్నీళ్ళను తుడవనీ -
సారంగదేవి : వద్దు - నేను చూడలేను తల్లీ - నా దగ్గిరికి రావద్దు. ఒంటరిగా నన్నిలానే బాధపడనీ. మీరంతా వెళ్ళిపోండి. ఏకాంతంగా కాసేపు నన్ను శ్రమ తీర్చుకోనీయండి.
కజ్జల : (నాలుగు దిక్కులూ పరిశీలిస్తూ) సారంగీ, ఒక్కమాటు నావైపు కన్నెత్తి చూడు తల్లీ!
సారంగదేవి : అమ్మా నన్ను మాటాడించవద్దు - పోనీ నన్ను వెళ్ళిపోనీ. నిన్ను చూడలేను.
కజ్జల : తల్లీ! నీ కంటికి నేనంత వికృతంగా కనిపిస్తున్నానా! అసహ్యించు కుంటున్నావా? నిజమే కావచ్చు - తప్పులేదు. నన్ను నేనే అసహ్యించుకుంటున్నాను. నాకంటే నీవు నన్ను అసహ్యించుకో లేవు. దీనికి నీకు భయం అవసరం లేదు. అమ్మా! కలశరాజు నీచుడు - నన్నీ నీచకృత్యానికి పురి కొల్పాడు.
(దగ్గరకు వచ్చి సారంగదేవి తల పైకెత్తమని కోరుతుంది)
సారంగదేవి : (వేదనతో) అమ్మా! నన్ను ఒక్కసారి మనసార కౌగలించుకో - తాపం! బాధ! అబ్బా!
కజ్జల : తల్లీ! ఈ పాపి నిన్ను ముట్టుకోదు. నా స్పర్శవల్ల ప్రతిదీ పంకిలమై పోతుంది. దూరంగా ఉండనీ. ఈ అపవిత్ర దేహాన్ని ఏమి చేయటమో! పాపిష్ఠి పంక్తి కంఠుడి హస్తాలకు లొంగిపోయింది ఈ దేహం. ఆ కుహనా గురువు కరకు చూపులకు గురై పోయింది. ఈ దేహం... అబ్బా! బాధ - ఉఁ.
సారంగదేవి : అమ్మా! నీవీ పని ఎలా చేయగలిగావు
కజ్జల : తల్లీ! నాకిప్పుడు అర్థం కావటం లేదు. నేనేం చేశానో నాకు తెలియటం లేదు. అమ్మా! నేనిప్పుడెక్కడున్నాను. నా సౌధంలోనేనా... అమ్మాయీ ఇప్పుడిక్కడి కెందుకు వచ్చాను. మతి భ్రమిస్తున్నది. నేను పిచ్చిదాన్నై పోతున్నాను.
సారంగదేవి : అమ్మా! నీవు సంపాదించిన సౌఖ్యం, ఇదేనా?
కజ్జల : సౌఖ్యం! శక్తి!! జగత్తులో ఈ రెంటికే స్థానము లేదు. పాలనా కాంక్షలో సౌఖ్యం ఎక్కడుంది తల్లీ! - అయినా పాలించలేనిది బ్రతకలేం. - ఇదంతా నీకు అర్థం కాదు. ఎందుకు పాలించాలో నీవు అవగతం చేసుకోలేవు. భిక్షుకుల మధ్య బ్రతక వచ్చు. కానీ ప్రభువులూ, పశువుల సాంగత్యంలో ప్రాణాలు నిలుపుకోలేము. మన కులం మానవ సౌఖ్యమనే కసాయి కత్తులకు కంఠాలర్పించే కంచి మేకలం. జనసామాన్య జీవితంలో శాంతి సౌఖ్యాలు దొరకవని భ్రాంతి పడ్డాను. ప్రభుసౌధ పర్వతాగ్రమెక్కి పదిహేనేండ్లు పరిపాలించాను. ఈనాటికి, ఈ వయస్సున నాకు పతనం! భరించలేను. మళ్ళీ సామాన్య జనసాంగత్యం! అబ్బా బాధ భరించలేను.
సారంగదేవి : సామాన్య జనజీవిత మెంత సౌఖ్య ప్రదమయిందో నీవు గుర్తించలేదు తల్లీ. వారి ఆనందం మనకు అనంత లోకాలు వెదికినా దొరకదు.
కజ్జల : కాదు! కాదు పొరబాటు!! అమ్మాయీ! వాళ్ళు పాలింపబడటానికి పుట్టారు. నేను పాలించటానికి జన్మించాను.
సారంగదేవి : నీవు పాలించటానికి ఎవరవని తల్లీ! లోకంలో ఒకరిని ఒకరు పాలించలేరు. పాలిస్తున్నామని భ్రమపడతారు. కాని - పాలించేది పరమ శివుడొక్కడే.
కజ్జల : తల్లీ! జనసామాన్యం కెంధూళి. నాబోటి ఉత్తమ జన్మలు తారాపథ మంటేటట్లు దాన్ని తరిమివేసే జంఝూమారుతాలు.
సారంగదేవి : అమ్మా! పాలనాకాంక్ష ఆత్మను పతితం చేస్తుంది.
కజ్జల : అది వట్టి భ్రమ. పతితం చేయదు. పవిత్రం చేస్తుంది. మలినం చేసేది మనస్సులుగాని మరేమీ కాదు. పాలకులతో భ్రమపడి సంధి చేసుకుంటే ఆత్మ పతితమౌతుంది. లోకంలో ఉన్నదల్లా ఒకటే పాపం! ఆత్మను గుర్తించలేకపోవటం. అది మహాపాపం!! జన్మతః కొందరు ప్రాభవం సంపాదించ కుండానే అసహ్యించుకొని, నేను విశ్వప్రయత్నం చేసి విజయం పొంది అనేకమంది వ్యక్తులను పాలించాను. సాధనలో నాకు ప్రతి మెట్టునా ప్రత్యర్థులే! నాతో ఏ కోశానా సాటిరాలేని ప్రతిభా శూన్యులే నాకు ప్రత్యర్థులు!! నా సేవకురాలు గాయనే నాకొక ప్రత్యర్థురాలు. నా మహోన్నత పదవిని ఊపిరి ఉండగానే దానికి కరస్థం చేసి నేను ఎలా జీవించ గలుగుతాను, దక్కించుకొని తీరవలసినదే.
సారంగదేవి : (దీనంగా) నీ వనుసరిస్తూ ఉన్న మార్గాలు నిన్ను ఏ లోకాలకు నడిపిస్తున్నవో గుర్తిస్తున్నావా?
కజ్జల : అదంతా మరొక జన్మం మాట! మరొక లోకం మాట!! ఈ జన్మలోనే అపజయం పొందుతూ ఉన్నప్పుడు ఎప్పటి మాటో నాకెందుకు? ఈ అపజయాన్ని భరించలేను - ఇక మృత్యువు మాటా? అది నాకు ఎంతో దూరాన ఉంది. దాన్ని గురించి ఇప్పుడు నేను ఆలోచించవలసిన ఆగత్యమే లేదు.
సారంగదేవి : ఆ వేయి కళ్ళ తల్లి ఎప్పుడూ మనను వెన్నాడే ఉంటుంది. కాలం గడిచి పోతున్నది. వయస్సు ముదిరి పోతున్నది. ఇంకా మృత్యువు ఎంతో దూరాన ఉన్నదని ఎందుకు భ్రమపడతావు తల్లీ!
కజ్జల : (తన శరీరాన్ని ఒక్కమాటు కలయ చూచుకుంటూ) వృద్ధాప్యము! మానవ లోకానికి ఎంత దారుణమైన శిక్ష! నరకము లేదు. ధైర్య స్థైర్యాలు లేని దద్దమ్మల సృష్టి - అసహజము అసత్యము! కానీ యౌవన సౌందర్యానికి ఇన్నాళ్ళు మురిసిపోయిన యీ కళ్ళు సడలిపోతూ ఉన్న ఈ శరీరాన్ని ముందు ఎలా చూచి భరించగలుగుతవో!
ఒకప్పుడు అలంకారం చేసుకున్న నన్ను నేనే అద్దంలో చూచికొని మురిసి పొయ్యేదాన్ని - నేనే పురుషుడనై నా యౌవనాన్ని అనుభవిస్తే ఎంత ఆనందముంటుందోనని ఊహించేదాన్ని. అటువంటి యౌవ్వనం ఏమైపోతున్నట్లు? ఎక్కడికి పోతున్నట్లు!! సౌందర్యం ముదిమి చేతుల్లో ఏనాటి కైనా ముక్కి పోవలసిందేనా? తప్పదా- తప్పదు. జరామరణ భయాలు ప్రాణికి సహజం - తప్పదు. ప్రప్రథమంలో పలితకేశాన్ని చూచినప్పుడు నా పంచప్రాణాలు పోయి నట్లైంది. అయినా ఈ ముసలితనం ఏం జేయగలుగుతుందో చూస్తాను. దాన్నీ జయించటానికి ప్రయత్నం చేస్తాను.
సారంగదేవి : అమ్మా! ఎంత వెర్రిన పడుతున్నావు. జర మానవలోకానికి - కాదు సమస్త ప్రాణి లోకానికీ సహజధర్మం. దానిమీద విప్లవం చెయ్యలేము. కజ్జల : సహజ ధర్మం కాబట్టే విప్లవం. నేను సహజ ధర్మాలకు లొంగలేదు. ఎదుర్కొనలేని సామాన్య జనాన్ని జరామరణా లకు స్వాగతమిచ్చి ఆహ్వానించనీ - నేను మాత్రం జయించటానికి ప్రయత్నించవలసిందే.
సారంగదేవి : అమ్మా! ఈ ప్రపంచ పరిణామంలో ఏదీ స్థిరమైంది కాదు. సమస్త వస్తువూ నశించేదే - అలాగే వృద్ధాప్యం కూడా.
కజ్జల : అమ్మాయీ! నీవు చెప్పేది నాకేదీ తలకెక్కదు. నేను అదంతా నమ్మలేను.
సారంగదేవి : నమ్మనంత మాత్రంలో అవేవి సత్యాలు కాకపోవు.
కజ్జల : భగవంతుడు కూడా సత్యమేనా?
సారంగదేవి : భగవంతుడుంటే ఏమిటో గ్రహించే స్థితికి వచ్చిన తరువాత సత్యమే -
కజ్జల : నా అభిప్రాయమేమిటో చెప్పమన్నావా? భగవంతుడనే ఒక నపుంసకుణ్ణి సృజించి యీ ప్రవక్తలందరూ లోకాన్ని మోసపుచ్చుతున్నారు. మభ్య పెడుతున్నారు. నా దృష్టిలో అతడు ఎంతో నీచుడు. హృదయం లేని జంతువు! అమాయకమైన ప్రాణాలకు దేహం కల్పించి అవి జీవయాత్రలో అల్లట తల్లటై పోతుంటే చూచి లీలగా ఆనందిస్తాడట! ఎంత అభూత కల్పన! సౌందర్యమంటే ఎరగని ఆ రసికుడు ప్రపంచంలో ఎన్నెన్ని ఏహ్య వస్తువులు సృజించాడు. యౌవనాన్ని సృజించిన చేతులతోనే వృద్ధాప్యాన్ని ఎలా సృష్టించాడు. సుందర మూర్తులను ఊహించిన మేధాశక్తితో అందవికారుల రూపకల్పన మెలా చేయగలిగాడు. ఆ భగవంతుడు ప్రేమ ఎరుగని పీనుగ. కేవలం సృష్టిలో కదల మెదల లేని భయంకర జడవస్తు సమూహంలాగానే అతనూ ఒక అవ్యక్త, అద్వైత, అనంత, జడపదార్థం. అంతేనా?
సారంగదేవి : అమ్మా! నీ మాటలు నా గుండెలు బ్రద్దలు చేస్తున్నవి. (తల్లి నోరు చేత్తో మూయబోతుంది)
కజ్జల: (వారిస్తూ చిరునవ్వుతో) అమ్మాయీ! నీ యౌవనరూపం ఎంత నయనానంద కరంగా ఉంది. నేనే అనుభవిస్తే...
సారంగదేవి : అమ్మా! నిన్ను చూస్తుంటే నాకేదో భయం వేస్తున్నది. అలా ఆకలిడేగ కళ్ళతో నన్ను చూచి భయపెట్టకు. నామీద కలిగే ఈర్ష్యకు మనస్సులో స్థానం కల్పించకు కజ్జల : అమ్మాయీ! నీ ఉజ్జ్వలరూపాన్ని నాకు ప్రసాదిస్తావా! మరికొంత కాలం లోకాన్ని పరిపాలిస్తాను.
సారంగదేవి : అవకాశం ఉంటే అవశ్యం ఇచ్చేస్తాను. నాకు ఎంత అసహ్యంగా ఉన్నదో నీకు అర్థంకాదు ఈ సుందరరూపం, ఈ యౌవన నవకం నా ఆత్మకు ఎంతో భారమనిపిస్తున్నవి.
కజ్జల : అమ్మాయీ! జీవమధువు నీకు విషప్రాయమైపోయిందా? ఆనందించలేకుండా ఉన్నావా?
సారంగదేవి : మహావెగటుగా ఉంది తల్లీ!
కజ్జల : దానికి నేనే కారణం!
సారంగదేవి : నీవొక్కతెవే కాదు.
కజ్జల : ఏమిటి? "నీవొక్కతవే కాదు”
సారంగదేవి : (పొరపాటున నోటివెంట జారి రానిచ్చినట్లుగా) ఆఁ ఆఁ అది కాదు.
కజ్జల : (దీనంగా) తల్లీ! నేను నీ మనస్సును బాధ పెడుతున్నానా?
సారంగదేవి : (నేలమీద చూస్తూ) ఔను.
కజ్జల : నీ మనస్సులో ఏమున్నదో ఒక్కమాటుగా నన్ను అర్థం చేసుకోనీ తల్లీ!
సారంగదేవి : నేను చెప్పలేను. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త వస్తువుల కంటే విశేషంగా అన్యోన్యం ప్రేమించుకుంటూ ఉన్న మనం దూరమైపోతాము.
కజ్జల : (యోచనా పూర్వకంగా) మంచిది.
సారంగదేవి : (మాట్లాడదు. కొద్దిసేపు నిశ్శబ్దం)
కజ్జల : అమ్మాయీ! ఏమిటీ మూకీభావం! ఇది నాకు బాకుకంటే కఠోరంగా...
సారంగదేవి : అమ్మా! పొరబాటు పడవద్దు. నిన్ను ప్రేమించినట్లు ఈ ప్రపంచంలో నేను ఎవరినీ ప్రేమించలేదు.
కజ్జల : నీ మనస్సును సంక్షుభితం చేసే నన్ను ప్రేమిస్తున్నావా!
సారంగదేవి : మనఃపూర్వకంగా - ఆత్మసాక్షిగా కజ్జల : ఎలా ప్రేమించగలిగావో నాకు అర్థం కావటం లేదు. నిన్ను నే నెన్నడూ ప్రేమించలేదు. నీకోసం నేనేమాత్రమూ శ్రమపడలేదు.
సారంగదేవి : నా బాల్యావస్థలో నీవు నాకోసమేమి శ్రమపడ్డావో నేను చూడలేదు. నన్ను నీ దగ్గర లేకుండా మరొకచోట ఉంచినా నీ చిత్రపటాన్ని చూచి కలలు కంటూ ప్రేమించి అర్పించే దాన్ని.
కజ్జల : నీకు నన్ను దూరంచేసి నిన్ను ఎంతో బాధపెట్టాను.
సారంగదేవి : నీవు నన్ను చూడటానికి వచ్చేదినం నా మనస్సుకు పట్టరాని సంతోషం కలిగేది. కాని నీ ప్రక్కన నిలువబడితే నాకే భయమేసేది. ప్రతివాళ్ళూ నిన్ను ప్రేమిస్తుంటే నాకు ఎంతో ఆనందం వేసేది. లోకానికి నీమీద అంత ఆదరం, ప్రేమా ఎందుకో అర్థమయ్యేది కాదు. అప్పుడు నేను ఇంకా చిన్నదాన్ని. పూలమొక్కలతో తోటలో ఒక దినం ఆడుకుంటుంటే ఇద్దరు పెద్ద మనుష్యులు నిన్నుగురించి ఏమేమో చెప్పుకున్నారు. వాళ్ళు మనకు ఆప్తులనుకుంటాను.
కజ్జల : (ఆపుకోలేక) ఏమని చెప్పుకున్నారు?
సారంగదేవి : నాకు జ్ఞాపకం లేదు.
కజ్జల: వాళ్ళిద్దరూ సూర్యచంద్రులు కాదుగదా!
సారంగదేవి : కాదు. ఎవరో చెప్పలేను. వాళ్ళేదో నిన్ను గురించి అసహ్యమైన సంభాషణ చేశారు. ఆనాటినుంచీ నాకు జీవితమంటే సహించరానిదై పోతున్నది. ఏకాంతంగా నీవు కార్చే కన్నీటికి ఆ పెద్దమనుష్యుల సంభాషణకు ఏదో సంబంధమున్నట్లు నాకు మధ్యమధ్యా అర్థమయ్యేది. అమ్మా! లోకం రకరకాలుగా నిన్ను గురించి చెప్పుకుంటుంటే వింటూ ఉన్న నేనే భరించ లేకపోతున్నాను. ఇంత గర్వివికదా ఎలా బ్రతక గలుగుతున్నావు?
కజ్జల : అయితే నన్నేమి చెయ్యమంటావు తల్లీ!
సారంగదేవి : ఈ రాజ బాంధవ్యాన్ని త్యజించు. ఈ లోకాన్ని ఈ నిమిషం నుంచీ మరిచిపో. మనమిద్దరమూ 'మహాయానాన్ని' స్వీకరించి బౌద్ధారామాలలో ప్రశాంతంగా పునీతులైన 'భిక్కుణీ' సంఘమధ్యంలో జీవిద్దాము. సంఘసేవలో నిన్ను భయపెట్టే ముదిమి లేదు. ఆత్మ నిర్వాత దీపాంకురంలాగా భాసిస్తుంది. మనను ఏకోశానా మోసగించని ప్రేమ లభిస్తుంది. నాగరిక లోక వాసనే లేని ఆ ప్రపంచం ఎంత మధురమైనదమ్మా! దివ్య సుమగంధాలతో వాసించే ఆ కళ్యాణభవనాలను ఒక్కమాటు ఈ రాజభవనాలతో పోల్చి చూచుకో - గుండె చెరువైపోవటం లేదూ!
కజ్జల : ఎంత అమాయకురాలివి తల్లీ. నీవన్నీ వట్టి పిచ్చికలలు. వెర్రిదానా! నీ ప్రేమ సత్యం. నీ కన్నీరు సత్యం. నీ కలలు అసత్యాలు, నీ ఆదర్శాలు అసత్యాలు - కానీ నీ సరస హృదయం నన్నొక రసస్రవంతిని చేస్తున్నది. ఒక్కమాటు నాదగ్గిరకి ఇలా రా తల్లీ! నిన్ను మనసార ఈనాడైనా ఈ పాపిని ప్రేమించు నీ - (స్పృశిస్తూ) నీ సర్వాంగాలు శతపత్ర కోమలాలు తల్లీ! ఈ ముదివగ్గు కన్నీటిని వాటిమీద హిమ బిందువులుగా వెలువనీ - నాకిప్పుడు నీవంటే ఈర్ష్య చచ్చిపోతున్నది - ఈ భిన్న హృదయానికి ఎన్నాళ్ళకు నీదగ్గిర ప్రశాంతి దొరికింది సారంగీ! చింతాజడం కాబోకు. కిలకిలా నాతోబాటు నవ్వుతూ ఉండు. ఇతరులను నవ్వించు. ఆనందించు. నీలో ప్రతిబింబిస్తూ ఉన్న నా యౌవనరూపాన్ని చూచి ఆనందిస్తూ కాలం వెళ్ళబుచ్చుతాను తల్లీ!
సారంగదేవి : నా కోరికను అనుసరిస్తావా?
కజ్జల : రేపే బయలుదేరుదాము.
సారంగదేవి : (పట్టరాని సంతోషంతో) అమ్మా!
కజ్జల : (ప్రగాఢంగా) తల్లీ!
(ఇద్దరూ ఒక కౌగిలిలో ఒదిగిపోతారు)
(బయట కలకలం 'పట్టుకొండి' 'తన్నండి')
సారంగదేవి : ఏమిటది? కజ్జల : అమ్మాయీ! నీవు త్వరగా ఇక్కడనుంచి వెళ్ళిపో.
సారంగదేవి : (కదలదు)
కజ్జల : ఊఁ త్వరగా
సారంగదేవి : నీవో!
కజ్జల : నాకేమీ భయం లేదు. నేను ఒంటరిగా ఉండగలను.
కంచుకి : (వణికిపోతూ ప్రవేశించి) సంగతి బయటపడ్డది తల్లీ! కజ్జల : ఏమిటి?
కంచుకి : మనకోసం రక్షకభటులు వచ్చేస్తున్నారు. ఈనాటితో మన జీవితాలు అయిపోయినట్లే!
కజ్జల : నీవిక్కడికి రావటం రక్షకభటులు చూచారా?
కంచుకి : చూడలేదు.
కజ్జల : అయితే భయమెందుకు?
కంచుకి : పంక్తి కంఠస్వామి పట్టుబడ్డాడు. ఆయన పళ్ళు ఊడకొడతారట. అప్పుడు మన సంగతి కూడా బయట పెడతాడు - ఇక మనం బ్రతకము.
కజ్జల : ఓరి పాపిష్ఠి పక్షీ! చివరకు నా బ్రతుకు నిలా చెడగొట్టావు. ఇందుకేనా నన్ను పంక్తి కంఠస్వామి పాదదాసిని చేసింది! శక్తి!! నా దేహానికి తీరని కళంకాన్ని తెచ్చి పెట్టావు. నీ మూలకంగా... ఛీ నీ మొగం చూడకూడదు వెళ్ళిపో!
కంచుకి : అమ్మాయీ! ఇంకా నన్ను నిందిస్తావేం. నీ మూలకంగా నాకు ప్రాణాలు పోవటానికి సిద్ధంగా ఉన్నవి.
(తెరలో 'పొడవండి', 'రాళ్ళు రువ్వండి' అని కేకలు)
కజ్జల : (లేచి వాతాయనం నుంచి తొంగిచూస్తూ) చంపండి ద్రోహి! పాపి! చండాలుడు చంపండి.
కంచుకి : ఆఁ ఆఁ
కజ్జల : నీ పాపాలకు ప్రతిఫలం! కూలిపో!!
కంచుకి : (దూరంనుంచి) ఏమైంది తల్లీ!
కజ్జల : (కోపంతో) మీ గురుదేవులు నరకస్థులౌతున్నారు.
కంచుకి : ఆఁ ఆఁ - పంక్తి కంఠస్వామి ప్రభూ! (నేలమీద ఒరిగి పోతాడు)
కజ్జల : ఈ కలకలానికి రాజు నిద్ర మేల్కొంటాడు. అంతా తెలుసుకుంటే గాయనీ షట్పదీ తెల్లవారి నేను లేని నీకు పండుగ - మహాపండుగ
(కంచుకి దగ్గరకు వచ్చి) కంచుకీ! నీ చేతిలో ఇంకా మాంత్రికులున్నారు గదా! తప్పించుకోవటానికి మరేమైనా తంత్ర క్రియలు చేయిద్దామా? కంచుకి : గురుస్వామి సిద్ధిపొందిన తరువాత ఇంకా మన మాట ఎవరు వింటారు? ప్రయత్నం నిష్ఫలం. మన దేహాలమీద మమతను వదులుకోవటమే మంచిది.
కజ్జల : పోనీ మనమైనా తప్పించుకొని కాశ్మీరం నుంచి వెళ్ళిపోయే మార్గం ఆలోచించు.
కంచుకి : ఏం ప్రయోజనం? మనం రక్షకభటుల బారి పడకుండా బయటపడలేం... (ఏడుస్తాడు)
కజ్జల : ఏడ్చి ఏమి సాధిస్తావు?
కంచుకి : అమ్మా! రేపు ఉదయం నాకేమి శిక్ష విధిస్తారో నీవు ఊహించావా తల్లీ!
కజ్జల : దుఃఖిస్తే శిక్ష తప్పుతుందా? లే సాహసం వహించు.
కంచుకి : నీకేం ఏమైనా చెపుతావు తల్లీ! నాబోటి అల్పులకు ఆ సాహసమంటేనే అదురు.
కజ్జల : సాహసించక తప్పదు. ముందెన్నడో రాబొయ్యే శిక్ష కంటే వేయిరెట్లు శిక్ష అనుభవిస్తున్నాను. ఈ శిక్షవల్ల కలిగే బాధ కరకు కసాయికత్తి కూడా ఊహ చేయలేదు.
కంచుకి : తల్లీ! ఒకవేళ నీవు చిక్కినా దేశంలో నుంచీ వెళ్ళగొడతారు. నన్నో!
కజ్జల : నా అంతట నేను పారిపోను. పొమ్మంటే వెళ్ళేదాన్ని అంతకంటే కాదు. ఉండి సాధించంది వదలను. చనిపోవటానికైనా సిద్ధపడతాను గాని లొంగిపోను.
కంచుకి : ఈ మాటలకేంలే తల్లీ - దండనాయకుడు ముందు నిలబడితే అప్పుడు...
కజ్జల : నా సంగతి నీకింకా బాగా అర్థం కాలేదు. క్రొత్తవాడివి.
కంచుకి : ఈ సమయంలో ఏం జరిగితే మన దుఃఖం నశిస్తుంది
కజ్జల : ఆఁ ఆయన చనిపోతే.
కంచుకి : ఆయనెవరు?
కజ్జల : రాజు!
కంచుకి : ఘోరము - రాజు చనిపోవటమే!
కజ్జల : ఏం వణికి పోతున్నావు.
కంచుకి : తరువాత కారకులకు శిక్ష - చిత్రవధ. కజ్జల : తప్పించుకోవటానికి అనేక మార్గాలున్నవి.
కంచుకి : చంపటానికి మార్గమో!
కజ్జల : ఉదయమే రాజు లేస్తూనే ప్రసవాసవాన్ని సేవిస్తాడు. అది కలిపి ఇచ్చేది చిత్రరథుడు. అతన్ని నేను బాగా ఎరుగుదును. నా మాట జవదాటడు వెళ్ళు అందులో (దగ్గిరకి పిలిచి చెవిలో ఏదో చెప్పి) కలిపి ఇవ్వమను. బయలుదేరు. ఆలస్యం చెయ్యకు. మళ్ళీ నా మనస్సు యీ మాటకే వ్యతిరేకంగా తిరగవచ్చు - ఆశ కూడా పెట్టు.
కంచుకి : గాయని ఎక్కడ ఉంటుందో జాగ్రత్త.
కజ్జల : ఆమె విషయం నేను జాగరూకత వహిస్తాను.
కంచుకి : (నిష్క్రమిస్తాడు)
కజ్జల : ప్రభూ! నన్ను ఎక్కడికి నడిపిస్తున్నావో.
(తెర)
పంచమ దృశ్యము
(రాజాంతః పురములో ఒక ఏకాంత విశ్రాంతి మందిరము)
ధర్మాధిపతి : ప్రభూ! రాజద్రోహుల విషయం మీకు విన్నవించుకోటానికి...
రాజు : నేను స్వస్థ చిత్తంతోటే ఉన్నాను. నివేదించవచ్చు.
ధర్మాధిపతి : ప్రభూ! మా సాహసానికి క్షమించాలి.
రాజు : ధర్మవివక్షలో మీ సాహసమేముంది?
ధర్మాధిపతి : ఈనాడు మీకీ విషయం నివేదించటానికి నాకు భయం వేస్తున్నది.
రాజు : కారణం?
ధర్మాధిపతి : ధర్మద్రోహులూ, రాజద్రోహులూ, మీకు సన్నిహితులు కావటమే -
రాజు : న్యాయము న్యాయమే! బాంధవ్యము బాంధవ్యమే!!
ధర్మాధిపతి : ద్రోహులు రాజబంధువులైనా ధర్మశాస్త్రాన్ని వ్యతిక్రమించటానికి వీలు లేదన్న శ్రుతి ప్రమాణాన్ని అనుసరించే ఈ సాహసానికి పూనుకున్నాను. రాజు : ద్రోహులు తమ తప్పిదాన్ని ఒప్పుకున్నారా?
ధర్మాధిపతి : అర్ధ నిశా సమయంలో ద్రోహి కంచుకిని బందీ చేశాము ప్రభూ!
రాజు : కంచుకి రాజద్రోహాన్ని తలపెట్టాడా?
ధర్మాధిపతి : కంచుకి భయపడి రక్షకభటుల బాధలకు తాళలేక సమస్తమూ నివేదించాడు.
రాజు : ఏమని?
ధర్మాధిపతి : రాజద్రోహానికి తాను కేవలమూ ఉపాదాన కారణమని.
రాజు : మూలమెవరు?
ధర్మాధిపతి : (జంకుతూ) క... జ్జ.... లా... దేవి.
రాజు : కంచుకి నోటివెంట కజ్జల రాజద్రోహి అనేమాట వచ్చిందా?
ధర్మాధిపతి : ప్రభూ క్షమించాలి! ప్రస్తుతము కజ్జలాదేవి హృదయం వెనుకటివలె స్వచ్ఛమైనది కాదు. కలుషితమై పోతుందని కంచుకి మాటలవల్ల వ్యక్తమౌ తున్నది.
రాజు : సాధారణంగా ద్రోహం తలపెట్టి పట్టుపడ్డవాళ్ళు తమ నేరాన్ని ఇంకొకళ్ళ మీద ఆరోపణ చేయటానికి పూనుకుంటారు.
ధర్మాధిపతి : అతని మాటల్లో ఏవిధమైన అపనమ్మకానికి స్థానం లేదు ప్రభూ! తదితరులను కూడా ప్రశ్నించి కజ్జలాదేవి కలుష హృదయాన్ని గుర్తించగలిగాను.
రాజు : వారూ కంచుకి మాటలనే స్థిరపరిచారా?... కజ్జల చాలా కాలం నుంచి జబ్బుగా ఉన్నది. ఏ విధమైన ద్రోహానికీ ఆమె అనర్హురాలు.
ధర్మాధిపతి : గత మాసం నుంచి పంక్తి కంఠుణ్ణి ఆశ్రయించి ప్రభువారికి కళంక మాపాదిస్తున్నది. మాంత్రికుల చేత అభిచారిక క్రియలు చేయిస్తున్నది.
రాజు : ఎవరికీ వాటివల్ల బాధ కలుగనంతవరకూ ఆమె దోషి కాదుగదా?
ధర్మాధిపతి : మందుమాకులతో ప్రభువారి పానీయాలను మలినాలను చేస్తున్నది.
రాజు : ఎందుకోసమని?
ధర్మాధిపతి: తమను వశపరచుకోవటానికి...
రాజు : నేను నమ్మలేను. ధర్మాధిపతి : ప్రభూ! ఆమె అపకీర్తి దేశమంతటా వ్యాపించింది.
రాజు : ఏమో!
ధర్మాధిపతి : న్యాయ నిశ్చయం చేయబోయేముందు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాను. నా స్థితిలో ఉండి నీవే నిశ్చయం చేయమన్నాను. ఒక దివ్యవాక్కు నా నిశ్చయాన్నే ధ్రువపరిచింది. తమకా దేవనిర్ణయం వ్యతిరేకంగా ఉన్నా తప్పదు. దేవ వార్తాహరుడనైన నన్ను క్షమించాలి.
(పాదాభివందనము చేస్తాడు)
రాజు : (లేవదీస్తూ) నీ కీ మహారాజు అభయమిస్తున్నాడు.
ధర్మాధిపతి : ప్రభూ! నిజస్థితిలో అనేకమంది పైకి కనబడేటంత ఉదాత్తులు కారు. కజ్జలదేవి తమ ప్రాణాలకే అపచారం తలపెడుతుందని ఈ కాశ్మీరంలో ఏ ఒక వ్యక్తి అయినా చివరకు కలలోనైనా భావించాడా?
(దూరంగా వచ్చే కజ్జలను చూచి ధర్మాధిపతి నెమ్మదిగా నిష్క్రమిస్తాడు)
రాజు : (కోపంతో) కజ్జలా! పిలిపించందే అకారణంగా ఇక్కడికి ఎందుకు వచ్చావు?
కజ్జల : నా మనస్సు నన్నిక్కడికి వెళ్ళమని ప్రేరేపించింది.
రాజు : నీవు ఇక్కడికి రావటానికి నైతికాధికారం కూడా లేదు. తప్పిపోయింది.
కజ్జల : సమస్తాధికారాలు నాకు సంబంధించినంతవరకు నా హస్తగతమై ఉన్నవి. మీ అధికారం మీద నేను ఆధారపడను.
రాజు : నీ సమస్తాధికారాలు నేను పూర్వమిచ్చినవే కాని అన్యమైనవి కావు.
కజ్జల : మీరివ్వటమేమిటి? నేను జయించుకున్నాను. ఇప్పుడు నిలుపు కుంటాను.
రాజు : నీవెంత దుస్థిలో ఉన్నావో నీకు తెలుసునా? ఏమిటీ వెర్రి ధైర్యము?
కజ్జల : నా స్థితీ, మీ స్థితీ ఒకేవిధంగా ఉన్నది. నేను ఇప్పుడు నామీద జరిగిన నిందారోపణను తీర్చుకోవటానికి రాలేదు. మీమీద నాకున్న ప్రేమను ఒకమారు వెలిబుచ్చటానికని వచ్చాను... ప్రభూ! వృధాగా కోపించవద్దు. హృదయ స్వాస్థ్యం తెచ్చుకోండి. ఇతరులమాట నమ్మవద్దు. నా మనస్సును గ్రహించండి.
రాజు : కజ్జలా! నీ దోషాలు నాకు తెలియలేదనుకుంటున్నావా? కజ్జల : తెలిసినవా?
రాజు : అవును.
కజ్జల : మరీ మంచిది. నేను ఒప్పుకోవలసిన అగత్యం తప్పిపోయిం దన్నమాట.
రాజు : అయితే నా చెవినబడ్డ విషయాలన్నీ సత్యాలన్న మాటేనా? ఆ విష ప్రయోగాలూ, మాంత్రికులూ, తాంత్రికులూ...
కజ్జల : ఇవన్నీ నా నేరాలెలా ఔతవి? మీ నేరాలే.
రాజు : (కోపంతో) నీకేమైనా మతి పోయిందా?
కజ్జల : (దీనంగా) ప్రభూ! నా దోషాలన్నిటికీ మీరే కారణమని విన్నవించు కుంటున్నాను. మీ ప్రేమ, మీ మోహము, మీ స్వార్థమూ నన్నింతకు తీసుకువచ్చినవి. నన్ను మొదటినుంచీ ఒక చదరంగపు పావుగా భావించి ప్రవర్తించారు. మొదట మోసపోయి ఇప్పుడు గ్రహించాను. నా పూర్వస్థితిని నిలువ బెట్టుకోవటానికని అనేక అడ్డదారులు త్రొక్కుతున్నాను.
రాజు : నేను నీకు చేసిన మేలంతా మరిచిపోయి చివరకు నా ప్రాణాలకే... ఛీ నీ మొగం చూడకూడదు. ఎక్కడో పల్లెటి దిక్కున తిండిలేక మలమల మాడిపోతూ ఉన్న నిన్ను ప్రేమ పూర్వకంగా పిలుచుకువచ్చి మహారాణులకు కూడా దక్కని గౌరవమిచ్చి చూస్తుంటే - మనస్సులో పుట్టవలసిన బుద్దులు ఇవేనా? ఏమనుకున్నావో నీవనుభవించే వస్తువులలో చిన్నమెత్తు కూడా నీది కాదు - పాపీ, ఏమని నాతో మాట్లాడటానికని నిర్భయంగా ఇక్కడికి వచ్చావో నాకర్థం కావటంలేదు.
కజ్జల : నీ భార్యనని.
రాజు : నా భార్య ఛీ! నా భార్య మహారాణి కాంభోజ రాజపుత్రి.
కజ్జల : ప్రభూ! మీ నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దు. మీ భార్య కాంభోజ రాజపుత్రేనా? ఔను నిజమే. నిర్వంశం కాకుండా ఉండటానికని నేను అంగీకరించిననాడు మీ పర్యంకాన్ని చేరిన మహారాణి కాంభోజ రాజపుత్రి - మీ భార్య - నేను, మహారాణి! ఏనాడు మహారాణి. నేను మహారాణి. సకల కాశ్మీరాన్ని నా శాసనబద్ధం చేశాను. నీవూ, నీ మంత్రులూ, నా ఇష్టానుసారంగా పరిపాలన చేశారు. జ్ఞప్తి లేదా?
రాజు : ఆ మాట సత్యమే. కానీ నీకాస్థితి నేను కల్పిస్తే వచ్చింది. కజ్జల : ప్రభూ! మీ కీర్తి విశ్వవ్యాప్తం కావటానికి నేనెలా శ్రమించానో మరిచిపోవద్దు, మిమ్మల్ని మహోత్కృష్ట నాయకుణ్ణి చేయటానికి అహోరాత్రం నేనెంతగా అల్లట తల్లటైనానో మీకు తెలియనిది కాదు. నా వ్యక్తిత్వాన్నే మరిచిపోయి మీలో ఐక్యమై పోవటమే నా జీవిత పరమావధి అని నేను ఎంత భ్రాంతి పడ్డానో మీకు తెలియటం లేదు. సమస్త కాశ్మీరమూ మీ ఆజ్ఞానువర్తి కావటానికి ఈ కజ్జల మేధాబలం కారణం! ఈ కజ్జల అకలుష హృదయం కారణం! అమలిన ప్రేమ కారణం!!!
రాజు : కజ్జలా నీ గర్వపోతుతనం నిన్ను గ్రుడ్డిదాన్ని చేస్తున్నది. నేను లేనిది కజ్జలే లేదు. నిన్ను సృజించిన నాకే నీవు సహాయం చేశావా? పరమ దరిద్రులను భాగ్యవంతులుగా, భాగ్యవంతులను పరమ గర్భదరిద్రులునుగా తీర్చి దిద్దగల శక్తి నాకు న్నది. నేను జగజ్జేతను. నీవు నాకు కొంతకాలం సేవకు రాలివి. ప్రస్తుతం నాకు నీమీద ప్రేమలేదు.
కజ్జల : ప్రస్తుతం మీకు నామీద ప్రేమలేదా? నేను మిమ్మల్ని ఎన్నడూ ప్రేమించలేదు.
రాజు : స్పర్ధ నిన్ను పశువును చేస్తున్నది జాగ్రత్త. నీవు పూర్వం నన్నెలా ప్రేమించావో నేను ఎన్నడూ మరిచిపోలేను.
కజ్జల : నేను కాశ్మీరాధిపతిని. ప్రేమించాను గాని నిన్ను ప్రేమించ లేదు.
రాజు : ఈ ధైర్యం నీకు ఇప్పుడే వచ్చిందా?
కజ్జల : వంది మాగధ స్తోత్రాలలో మతి చెడిపోతుండే మీకు ఈ సత్యం ఎన్నడూ అవగతం కాలేదు. మీ అంత కురూపి ప్రపంచంలో లేడు. నేను ప్రేమించినా, మరొకతె ప్రేమించినా మీ అందచందాలకు కాదు - మీ రాచరికానికి.
రాజు : (ఉద్రేకంతో) ఇక సహించను. నోరుముయ్.
కజ్జల : ప్రభూ! ఒక్కమాటు ముకురం ముందుకు పోయి మీ అందాన్ని చూచుకోండి. అయితే వంది మాగధస్తోత్రాలు విని వినీ మీ మనస్సు మలినమై పోవటం వల్ల మన్మథాకారమేనని భ్రమ పుట్టవచ్చు. ఆ కమురు తొలగించుకొని చూడగలిగితే - మీమీద అసహ్యం కలుగకపోదని నా విశ్వాసం. బట్టతల, రాలిపోయే ఆ పళ్ళు (దంతాలు) మీ శూన్య హృదయం!... కొన్నాళ్ళు కజ్జలాదేవిని సంతోష పెట్టాననే భ్రాంతికూడా మీ మనస్సులోనుంచి తొలగిపోవాలి. నేను మీవల్ల ఏ నిమిషమూ సంతోషపడలేదు - మీ గాఢా లింగనం వల్ల నా పంచేంద్రియాలు బండబారి పొయ్యేవి. ఈ పదిహేను సంవత్సరాలూ మిమ్మల్ని ఎంతగా అసహ్యించు కొన్నానో అర్థమౌతున్నదా?
రాజు : అయితే... నీకు ధర్మాధికారి ఇవ్వదలచుకున్న శిక్ష సమంజసమైందే! నీ నిజ స్వరూపాన్ని ఇప్పటికైనా బయట పెట్టావు.
కజ్జల : నన్ను శిక్షిస్తే మిమ్మల్ని మీరే శిక్షించుకొన్నట్లు. లోకం మిమ్మల్ని నన్నూ ఎన్నడూ వేరు చెయ్యలేదు. చెయ్యదు. అయితే నా పిల్లలో?
రాజు : నిన్నే తప్ప మరొక వ్యక్తిని ప్రేమించలేని నీకు సంతానం కూడానా కజ్జలా!
కజ్జల : లోకానికి మీ పిల్లలూ నా పిల్లలూ? నన్ను శిక్షించి వాళ్ళనేం చేయదల్చు కున్నారు?
రాజు : చంపి గోతిలో పారేయిస్తాను. నా యిష్టం వచ్చినట్లు ఏదో చేస్తాను.
కజ్జల : నన్ను అన్యాయం చేసినట్లు వాళ్ళను కూడా...
(సారంగదేవి వెనుకనుంచి వచ్చి నమస్కారం చేస్తూ)
సారంగదేవి : ప్రభూ! మేమేమి అపచారం చేశామని మమ్మల్ని చంపి గోతిలో పారవేయ దలచుకున్నారు?
రాజు : తల్లీ సారంగీ (లేచి వచ్చి సారంగదేవి తల నిమురుతూ దగ్గిరకు తీసు కుంటాడు) కజ్జలా! సారంగి నీకోసం బలి కాబోతున్నది.
కజ్జల : మీ ఇష్టం. మీరు మహారాజులు.
రాజు : (సారంగదేవితో) అమ్మాయీ! నీవు చింతపడకు. నీవిక్కడకి ఎలా వచ్చావు తల్లీ!
సారంగదేవి : ప్రభూ! ఎందుకు మీలో మీకీ కోపాలు?
రాజు : అది నీ విషయం కాదు. సారంగీ నీవు ఇక్కడినుంచి వెళ్ళిపో!
సారంగదేవి : ఎక్కడికి వెళ్ళమంటారు. కన్నవారు మీరే వెళ్ళగొడితే నేను ఎక్కడికి పోయేది. మీ కౌగిలి తప్ప ఈ కాశ్మీరంలో నాకు గమ్యస్థాన మింకోటేముంది?
రాజు : (కన్నీళ్ళతో) తల్లీ! సారంగీ!
(దగ్గరగా తీసుకుంటాడు)
చితిమంటలు జ్వలిస్తవి. మోసపోకు. హృదయాన్ని అర్పించకుండా జగత్తును చూడటం నేర్చుకో. అది భయంకర వ్యాఘ్రం. మానవజాతి స్వభక్షణ చేసే పెనుబాముల కూటమి. జాగ్రత్త మోసపోకు.
రాజు : కజ్జలా! వృధాగా భయపెట్టి బిడ్డ భవిష్యత్తును పాడు చేయకు.
సారంగదేవి : అమ్మా! జగత్తు పెనుబాముల కూటమైతే దానికి ఒప్పచెప్పటానికేనా నన్నింతకాలం పెంచారు. మొదటే నా తనూలతను ఎందుకు గిల్లివేయ లేదు? మీరు మొదట ఒకరినొకరు ఎందుకు ప్రేమించుకున్నారు? మాకీ విపత్తెందుకు తెచ్చి పెట్టారు. మీ వినోదం కోసం అమాయకులను బలి ఇవ్వటము మీకు న్యాయమేనా?
(తండ్రి దగ్గరికి పోయి దుఃఖిస్తుంది)
కజ్జల : (సారంగదేవి మీద వ్రాలుతుంది)
రాజు : (సకరుణంగా సారంగదేవిని చూస్తూ బుజాలు తడుతూ) తల్లీ! నన్నిప్పుడేమి చేయమంటావు.
సారంగదేవి : మా అమ్మను క్షమించండి.
రాజు : మీ అమ్మ నేరస్తురాలు. నేను క్షమించినంత మాత్రంలో... రాత్రి ఏమి జరిగిందో నీకు తెలుసునా?
సారంగదేవి : తెలియదు... ఆ.... ఆ... తెలియదు.
(కజ్జల దూరంగా నిలవబడుతుంది)
రాజు : నా ప్రేమనైనా త్యాగం చేస్తాను గాని న్యాయానికి విరుద్ధంగా ప్రవర్తించలేను.
సారంగదేవి : తండ్రీ! మీరు తలచుకుంటే ఏది జరగదు? మీరు చెప్పిందే న్యాయమై తీరుతుంది.
రాజు : అమ్మాయీ! నీకోసం మీ అమ్మ ప్రాణాలు రక్షిస్తాను. కానీ, కాశ్మీరదేశంలో ఆమె ఉండటానికి వీల్లేదు.
సారంగదేవి : మీ ఆజ్ఞను మన్నిస్తే క్షమించి మళ్ళీ రానిస్తారా?
రాజు : ఈ గర్వి ఆ శిక్షను అంగీకరిస్తుందా? సారంగదేవి : అంగీకరిస్తుంది. కాశ్మీరదేశం వదలి పెడతానని నాకు వాగ్దత్తం చేసింది. (కజ్జలతో) కాదమ్మా!
కజ్జల : ఔను నిజమే. నా అంతట నేనే కాశ్మీర దేశం వదలిపెట్టి పోదామని నిశ్చయించుకున్నాను.
రాజు : న్యాయాధిపతి విధించిన శిక్షను పాలించినట్లు కూడ ఉంటుంది. కజ్జలా! నీ హృదయమెలా బండ బారింది?
కజ్జల : నా హృదయమా! ఎవరి హృదయం బండబారిందో మీ హృదయానికే తెలుసు.
సారంగదేవి : అమ్మా! కాశ్మీరాన్ని వదలివేయటము మీకు ఇష్టం లేదా?
కజ్జల : నీవు కూడా నా శత్రుపక్షంలో చేరావా తల్లీ! ప్రభూ! ఎలాగైతేనేం మీరే జయించారు. దీనికి కారణం సారంగి. దాని మాట త్రోసివేయలేను. దాని జాలికళ్ళు నన్ను కరిగిస్తున్నవి. కాని మీ ఆజ్ఞ శిరసా వహించి మాత్రం కాశ్మీరాని వదలిపెట్టి వెళ్ళటం లేదు.
రాజు : (కోపంతో) కాశ్మీరదేశాన్ని దాటి వెళ్ళిన తరువాత మళ్ళీ నీవు ఈ దేశంలో కాలు పెట్టవద్దు. ఇది రాజాజ్ఞ. సారంగి నీవెంట రావడానికి వీలులేదు.
సారంగదేవి : తండ్రీ!
రాజు : ఇది రాజాజ్ఞ! అమ్మాయీ ఎదురు మాటాడవద్దు.
కజ్జల : విధి ఏం చెయ్యదలచుకుంటే అది చేస్తుంది. కాని మానదు.
సారంగదేవి : నాన్నా! మా అమ్మ వెళ్ళిపోతుంది. మళ్ళీ కనుపించదు. మనఃపూర్వకంగా ఆమెతో ఒక్కమాట మాట్లాడండి.
రాజు : అమ్మాయీ నాకు ఆమెమీద ప్రేమ లేదు. ద్వేషమూ లేదు.
కజ్జల : నా ప్రేమకు వృద్ధాప్యం లేదు. అది పరిపూతమైంది.
రాజు : కజ్జలా! ఇక సెలవు.
(అని పానీయ పాత్రలున్న బల్లదగ్గరకు పోయి చషంక గ్లాసులో పానీయం పోస్తే కజ్జల తనకిస్తాడని చూస్తుంటుంది. రాజు ఇవ్వటానికి పూనుకోడు. నోరు తెరుస్తుంది. రాజు త్రాగబోతుంటాడు. సారంగదేవి త్వరగా వెళ్ళి) సారంగదేవి : ఆ పానీయాన్ని నన్ను త్రాగనివ్వండి.
రాజు : (సకరుణంగా) తీసుకో తల్లీ!
(కజ్జల ఒక వెర్రికేక పెట్టి సారంగదేవి అందుకొని త్రాగబొయ్యే పానీయ పాత్రను చేతితో తీసుకొంటుంది)
కజ్జల : (వెర్రిగా చూస్తూ ఉన్న సారంగదేవితో) సారంగీ ఏమిటది?
సారంగదేవి : ఏమిటమ్మా అలా వెర్రికేక పెట్టావు - (కజ్జల ఒక గుక్కలో పానీయాన్నంతా తాగేస్తుంది)
కజ్జల : వెర్రి కేకా... అమ్మాయీ.
సారంగదేవి : (భయోద్వేగంతో) అమ్మా.
కజ్జల : ఏ... విషమ... పరిస్థితులు వచ్చినా నన్ను మోసగించకు.
సారంగదేవి : అమ్మా! నీ కోరికను ప్రాణమిచ్చైనా పరిపాలిస్తాను.
రాజు : కజ్జలా! ఏమిటా ఆయాసం.
కజ్జల : ఏది చూచినా నాకు వ్యతిరేకం! భగవదిచ్ఛే నాకు వ్యతిరేకం! నేను బలికావలసిందే కాని ప్రయత్నం నిష్ఫలం. జీవితం నిష్ప్రయోజనం (తూలి పడబోతుంది).
సారంగదేవి : (దగ్గరకు పోయి) అమ్మా! అమ్మా!! (పట్టుకొని నేలమీద పడుకోబెడుతుంది)
రాజు : కజ్జల, ఏమిటా దుస్థితి?
సారంగదేవి : అమ్మను మృత్యువు పిలుస్తున్నది నాన్నా!
రాజు : నేను మొదట త్రాగబోయింది విషమన్న మాట! ప్రభో నన్ను బ్రతికించావు.
కజ్జల : ప్రభూ! మీరు నా దుస్థితి చూస్తూ కూడా స్వార్థపరు లౌతున్నారా?
సారంగదేవి : (ఏడుస్తూ) అమ్మా! అమ్మా!!
కజ్జల : ఏడవకు తల్లీ - ఏడ్చి ఏం ప్రయోజనం?
(సారంగదేవి చేతులు ముద్దాడుతుంది)
చేస్తున్నది.
కజ్జల : (సారంగదేవితో) తల్లీ నాకు మృత్యువు తప్పదుగానీ నీవు రాజదండన తప్పించావు. ఉరికంబాన్ని దర్శించటం తప్పించావు. పానీయపాత్ర నీవు అందుకోకపోతే...
(హఠాత్తుగా గాయని షట్పది ప్రవేశించి)
షట్పది : కజ్జలా! కజ్జలా!! ఏమిటా దుస్థితి?
కజ్జల : (వికటంగా) ఏమున్నది? మృత్యువు. యౌవనంలో ఉన్న వాళ్ళకు కూడా తప్పదు, షట్పదీ!... ఇది మృత్యువు... మృత్యువు... మృత్యువు...
(తెర)
(సమాప్తము)
ప్రజావాణి, 1963
This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.