Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-2/ఏకాంకికలు/ఉత్పల

వికీసోర్స్ నుండి

ఉత్పల


(మగధ దేశంలో ఒక సంఘారామం. ప్రశాంత వాతావరణం)

నందుడు : (వీణ తంతులు 'టింగ్ టింగ్' మని సవరిస్తూ రాగాలాపన చేస్తుంటాడు)

అమితావి : తమ్ముడూ! ఈ దినం బుద్ధ పూజానంతరం ప్రత్యేకంగా ఉపాసికల కోసం 'ఖేమా భిక్కుని' కథ చెప్పి కొన్ని ధర్మ ప్రవచనాలు వ్యాఖ్యానం చెయ్యమని భదంతు సెలవిచ్చారు.

నందుడు : (వీణ తంతులు మ్రోగిస్తూ) అయితే కానివ్వనా.

అమితావి : అది... ఆ తీవలు సవరించటం కొంతసేపు ఆపలేవూ?

నందుడు : క్షమించు. నెమ్మదిగా శ్రుతి చేస్తానులే.

అమితావి : (నిశ్చలంగా జ్ఞప్తి చేసుకుంటూ)


'నగామ ధమ్మో నో నిగమస్స ధమ్మో
నచాపియం ఏకకులస్స ధమ్మో
సబ్బలోకస్స సదేవ కస్స,
ఐసేవ ధమ్మో యదిదం అనిచ్ఛతాతి'


నందుడు : తంతులు మ్రోగించటం నెమ్మదిగా ప్రారంభించి పారవశ్యంలో క్రమక్రమంగా గొంతు కెత్తి ఆలాపన చేస్తాడు.

అమితావి : (కొద్ది కోపంతో) తమ్ముడూ!... నా పని అణుమాత్రం సాగటం లేదు. ఒక్కమాటు కొన్నైనా ప్రవచనాలు జ్ఞప్తి చేసుకుంటే గాని ప్రస్తుతానికి భిక్షాటనానికి వెళ్ళటం పడదు. అయినా! ఇప్పుడా పాత వీణ సవరించక పోతేనేం.

నందుడు : బుద్ధ పూజా సమయంలో నగరం నుంచి వచ్చిన ఆమె పాడటానికి అంగీకరించింది.

అమితావి : తమ్ముడూ! ఎవరామె? నేను చూడలేదే? నందుడు : అన్నా! నీవు కేవలం పుస్తకాలల్లో పురుగువై పోతున్నావు - అతిథిగా వచ్చిన బుద్ధోపాసికను గురించి అంత శ్రద్ధ వహించావన్నమాట!

అమితావి : ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది?

నందుడు : అపర శైలం మీద ఉన్న అమితాభ దేవాలయాన్ని చూపించ టానికని ఆమెను ఆనంద భిక్షువు తీసుకోవెళ్ళాడు.

అమితావి : అలాగా! ఆమె ఎలా ఉంది?

నందుడు : చాలా చక్కంది. బుద్ధ భగవానుని తపోభంగం చేయటానికి వచ్చిన మారకన్యలా ఉంది. మన ఆరామంలో ఉన్న పారావతాలతో ఇందాకటి నుంచీ ఆడుకొని ఆట నేర్పిందన్నా!

అమితావి : నేను పెంచే వాటితోనేనా!

నందుడు : అన్నా! ఆమె పాములను పెంచుతూ ఉందట!

అమితావి : పాములే! బాబో! - మతి పోలేదు గదా?

నందుడు : అయితే సంగీతం ఎలా పాడుతానంటుంది? అడగంగానే అంగీకరించింది.

అమితావి : అతిథులు ఎవరు వచ్చినా సంగీతం పాడుతారో లేదో ఆలోచిస్తావు తమ్ముడూ!

నందుడు : తప్పేముందన్నా - సంగీతం మీద అపేక్ష ఉంటే ప్రజ్ఞ పారమితుడి అపాంగ వీక్షణం ప్రసరించదా ఏం?

అమితావి : కళలంటే - అందులోనూ సంగీతమంటే - మన భిక్షుకులకు ఇంత ఆసక్తి మంచిది కాదు.

నందుడు : అయితే నాకు 'నిర్వాణం' పొందే యోగ్యత లేదనేనా?

అమితావి : నిష్ఠతో కొంతకాలం ప్రణిధాన చర్య నడిపితే

నందుడు : సంగీతంమీద ఆసక్తి తగ్గిపోవటానికే -ఉఁ - మరి పెంపుడు పక్షుల మీద అభిమానం పోగొట్టమని ఎన్నడైనా భగవానుణ్ణి అర్థించావా?

అమితావి : అది స్నిగ్ధమైన అహింసాచరణానికి సాధనం.

నందుడు : సృష్టి రహస్య విజ్ఞానానికి సంగీతం సర్వోత్తమమైన సాధనం అమితావి : తమ్ముడూ! నీకేం తెలియదు.

నందుడు : అన్నా! నీకు అంతకంటే తెలియదు.

అమితావి : (ప్రశాంతంగా ధర్మ ప్రవచనం చదవటం ప్రారంభిస్తాడు) 'న గా మ ధమ్మో నో నిగమస్సధమ్మో

నందుడు : బాబో! ఈ రొద భరించలేను (వీణ తంతులు 'టింగ్ టింగ్' మనిపిస్తూ నెమ్మదిగా రాగాలాపన చేస్తూ వెళ్ళి పోతాడు)

అమితావి : అమ్మయ్య! 'నచా పియం ఏక కులస్యధమ్మో (ఒక నర్తకి నడుస్తూ వస్తున్న కాలిగజ్జెల చప్పుడు)

ఉత్పల : మీ ఏకాంతతకు భంగం కలిగిస్తున్నాను, క్షమించాలి.

అమితావి : అమ్మా! ఇది అతిథి గృహం. మీ సత్కారం కోసం భదంతుల వారు నన్ను ఇక్కడ ఉండమని ఆజ్ఞాపించారు. అదుగో ఆ వేదిక మీద కూర్చోండి - కొంచెం దాహం తెచ్చి ఇవ్వ మంటారా?

ఉత్పల : అవసరం లేదు. (వేదిక దగ్గిరకు నడిచి వెళ్ళిన కాలిగజ్జెల చప్పుడు)

అమితావి : అమితాభ దేవాలయానికి వెళ్ళి రావటంలో శ్రమ పడినట్లున్నారు?

ఉత్పల : అలవాటు లేక కొంచెం శ్రమ అనిపించింది. శ్రావకా! ఇంత నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా ఉండటం మీకు కష్టమనిపించటంలేదూ?

అమితావి : అమ్మా బుద్ధ పూజలో కాలం గడిచిపోతుంది.

ఉత్పల : ఏదో చదువుకొంటున్నట్లున్నారు?

అమితావి : సాయంత్రం 'ఖేమా' భిక్కుని గాధ చెప్పవలసిందని అగ్రశ్రావకులు సెలవిచ్చారు, ఒకమాటు చూస్తున్నాను.

ఉత్పల : ఈ ఆరామంలో చిలుకలనూ, గోరువంకలనూ పెంచి ఆట నేర్పింది మీరే కదూ?

అమితావి : (సంతోషంతో) అవును నేనే.

ఉత్పల : పాటలి నుంచి ప్రస్తుతం నేను వచ్చింది మీ పారావతాల, చిలుకల ఆట చూచిపోవాలనే. అక్కడ వీటికి ఎంత పేరు ఉందో మీకు తెలియదు. అమితావి : అలాగా అమ్మా! బుద్ధభగవానుని హయరత్నం పేరు వీటికి పెట్టుకున్నాను. - మీరు పాములకు ఆట నేర్పారట!

ఉత్పల : ఎందుకా ఆశ్చర్యం? వాటిని పెంచటం చాలా సులభం.

అమితావి : మొన్న ఆరామానికి ఒక ఉపాసిక శ్రావస్తి నుంచి వచ్చింది. ఆమె పులులను పెంచిందట!

ఉత్పల : ఆమె చపలా ఏమిటి చెప్మా!

అమితావి : ఆమె ప్రాకృతంలో కవిత్వం కూడా చెప్పుతుంది.

ఉత్పల : అయితే సుజాత ఐ ఉంటుంది. ఓ సుప్రసిద్ధ రాజనర్తకి.

అమితావి : ఆమె పెంచే పులులు... అమ్మా! అరుగో భదంతులు.

భదంతుడు : అమ్మా! పూర్వ శైలం మీద ఆనందభిక్షువుతో మాటాడి రావటంలో ఆలస్యమైంది.

ఉత్పల : భదంతా! ఇక్కడ నాకే లోపమూ జరగలేదు.

అమితావి : భదంతా! కొన్నాళ్ళ క్రితం ఒక నర్తకి వచ్చిందే ఆమె పులులను పెంచుతుందట విన్నారా?

భదంతుడు : ఆమె కవయిత్రి అని మాత్రం నాకు తెలుసు. అమ్మా, నీకామె తెలుసునా? ఇప్పుడెక్కడుంది?

ఉత్పల : ఔను! ఇప్పుడామె ఊరూపేరూ లేదు. పాపము కాలగర్భంలో కలిసిపోయి ఉంటుంది

(పక్షుల కిచకిచలు, కూతలూ దూరంనుంచి వినిపిస్తవి)

అమితావి : అదిగో! కంటకాలు. ఆకాశం నుంచి దిగి వచ్చినట్లున్నవి. దాహం ఇచ్చి వస్తాను. ('గు'గ్గూ అంటూ నిష్క్రమణ)

భదంతుడు : అమ్మా! జ్ఞప్తికి రావటం లేదు, ఆమె పేరేమిటన్నారు?

ఉత్పల : సుజాత...

భదంతుడు : ఔను సుజాత... ఈ అతిథి గృహంలో ఆమె వ్రాసిన గీతం ఒకటి చెక్కించింది. అదిగో. ఉత్పల : కొంతకాలం క్రితం ఈ గీతాన్ని నగరంలోని ఓ గోష్ఠిలో పాడి వినిపించింది.

భదంతుడు : అమ్మా నీవు అది పాడగలవా?

ఉత్పల : పాడగలను...


నావికా!
బ్రతుకన ఆశయె లేదిక!
కడలిని తడబడి
కానను దారెదొ
పెనుజడి అలజడి
ననుగన రావో - ॥నావికా॥


భదంతుడు : చాలా చక్కని కంఠమమ్మా నీది! గీతం వింటున్నంతసేపూ ఏవో అవ్యక్తానుభవాలు లీలగా ద్యోతకమైనవి.

ఉత్పల : మీరు ఎన్నడైనా కొంతకాలం పాటలిలో ఉన్నారా?

భదంతుడు : అనేక మారులు మేము అక్కడనే బుద్దపూజ ఆచార్య సమితావ్రీలతో కలిసి జరిగించాము.

ఉత్పల : ఎప్పుడైనా 'ఉత్పలపర్ణ' పేరు విన్నారా?

భదంతుడు : లేదమ్మా! ఆమె అంత ప్రసిద్ధురాలా ఏం?

ఉత్పల : రాజలోకంలో ఎప్పుడూ ఆమె పేరు చెవినబడుతూ ఉంటుంది. నాగరకుల మాట చెప్పనవసరంలేదు. వారికామె దేవతామూర్తి.

భదంతుడు : (ప్రశ్నపూర్వకంగా) ఆమె....

ఉత్పల : నర్తకి... గాయని కూడాను.

భదంతుడు : నీకేమైనా స్నేహితురాలా?

ఉత్పల : కాదు గర్భశత్రువు... అయితేనేం ఆమె అంటే నాకో వెర్రి అభిమానం. ఆమె దుస్థితిని చూస్తే నాకో కనికరం!

భదంతుడు : దుస్థితా? ఉత్పల : రాచలోకాలల్లోనూ, నాగరకుల్లోనూ దేవతామూర్తి కావటమే ఆమె దుస్థితి - జీవితారంభంలో ఆమె అతి పవిత్రురాలు... దారిద్ర్యము, దాస్యము! శరీరము అమ్ముకోవలసి వచ్చింది.

శీలభద్రుడు : పాపం!

ఉత్పల : ఈనాడో ఆమె పట్టింది బంగారం. ఆమె అపాంగ వీక్షణాన్ని అర్థించే ప్రభులోకం అపరిమితం. ఒకనాడు దాహం వేస్తే మంచినీరు త్రాగటానికి మృణ్మయపాత్ర లేని ఆమె ఈనాడు హేమ చషకాలల్లో మధువు క్రోలుతున్నది.

శీలభద్రుడు : కష్టాలు కలకాలం ఉంటవా అమ్మా!

ఉత్పల : భదంతా! ఆమె అనుభవిస్తూ ఉన్న ఐశ్వర్యానికి నేను చెప్పింది అతి స్వల్పమైన ఉదాహరణ.

శీలభద్రుడు : అమ్మా! కోపగించుకోకుండా ఉంటే నేను ఒక మాట అంటాను. ఆ ఉత్పలవు నీవు కాదు గదా?

ఉత్పల : (చకిత కంఠంతో) ఎందుకలా ప్రశ్నించారు?

శీలభద్రుడు : జీవయాత్రలో పడుతూ ఉన్న యాతనలను చెప్పుకొను ఆత్మబంధువులు లేని అనేకమంది అతిథులు మొదట అన్యాపదేశంగా ప్రారంభించి మాతో చెప్పుకోవటం పరిపాటి.

ఉత్పల : భదంతా! ఒకమాటు ఆమె విషాదాన్ని అపనయించుకోలేక ఇలా అన్నది ఒక గాథలో


'ఆణత్తం తేణ తుమం పయితో పహా ఏణ పడహ సద్దేణ
మల్లిణ లజ్జసి ణచ్చసి దోహగ్గే పా అడిఙ్జన్తే' -


అయితేనేం? నా ఘోర దుఃఖాన్ని ఆమె చవైనా చూడలేదు.

అమితావి : భదంతా! బుద్ధ పుష్పులవారు మిమ్మల్ని వెంటనే ఒక్కమాటు వచ్చి పొమ్మన్నారు.

భదంతుడు : అమ్మా! మళ్ళీ మాట్లాడుకుందాం.

(నిష్క్రమిస్తాడు)

ఉత్పల : మీరు నాకా గ్రంథం ప్రతి ఒకటి వ్రాయించి పెట్టాలి. ఉదయం కొన్ని

గాథలు చదివాను. చాలా బాగున్నవి.

అమితావి : తప్పకుండా.

ఉత్పల : మీరు సాయంత్రం ఖేమా కథ చెప్పవలెనన్నారు కదూ?

అమితావి : ఔను! ఆమె, సామ్రాట్టు బింబిసారుని అగ్ర మహిషి. సౌందర్య గర్వి. బుద్ధ దర్శనానంతరం సమస్తాన్నీ త్యజించి భిక్కునీ వ్రతదీక్ష స్వీకరించింది.

ఉత్పల : జీవితాంతం వరకూ దీక్ష పాలించిందా?

అమితావి : అతినిష్ఠతో.

ఉత్పల : అనాలోచితంగా దీక్ష పుచ్చుకున్నానని తరువాత చింత పడలేదుగా?

అమితావి : లేదు. ఆమెను భిక్షుక గణం అగ్రశ్రావికగా పరిగణించింది. ఉపాసికా! ఆమె జీవితాంతంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది.

ఉత్పల : ఏమిటది?

అమితావి : ధర్మ ప్రచార యాత్రలో అరణ్య మధ్యంలో దిక్కు తెలియక వెళ్లుతూ ఉంటే కార్చిచ్చులో చిక్కబడ్డది. భగవానుణ్ణి స్మరించింది. వెంటనే ఆయన లీలగా ఆమెను నడిపించి బయటపడవేశాడు.

ఉత్పల : సత్యమేనా?

అమితావి : థేరీ గాథలు నీవు నమ్మవా? తల్లీ!

ఉత్పల : అయితే భగవానుడు కార్చిచ్చులో చిక్కిన వాళ్ళందరినీ అలాగే కనికరిస్తాడా?

అమితావి : తప్పక అమ్మా! కంటకాలు రెండూ పోట్లాడుకుంటున్నవి, చిక్కు వదిలించాలి. (గు, గ్గూ, గూ, గుగ్గూ అంటూ నిష్క్రమిస్తాడు)

ఉత్పల : (విషాదాన్ని వ్యక్తం చేసే రాగాలాపన చేస్తుంటుంది)

నందుడు : (టింగ్... టింగ్ వీణ తీగలు మోగిస్తూ) అమ్మా! నీవు సంగీతము పాడతావట! నాట్యము చేస్తావట!!

ఉత్పల : అత్యవసరమైనప్పుడు... ఇందులో మీకేది ఇష్టం? నందుడు: సంగీతమంటే మహానందము. ఆరామంలో సంగీత సాధన లుండకూడదని అగ్రశావికులు శాసించారు.

ఉత్పల : మరి ఈ వీణ...

నందుడు : ఇది లేనిది నేను బ్రతకలేనని గుర్తించి నా ఒక్కడికే అనుజ్ఞ ఇచ్చారు. అతిథులు యధేచ్ఛగా పాడుకోవచ్చును.

ఉత్పల : మీ వీణ చాలా పాతదే!

నందుడు : (దైన్యంతో) చాలా పాతది. పదేళ్ల క్రితం పాటలిలో ఒక ఉపాసిక నా చేత పాడించి సంతోషంతో ఇది సమర్పించింది. అమ్మా! అయితే నీవు ఈ పాతవీణ మీద పాడలేవా?

ఉత్పల : శక్తి కొద్దీ యత్నించి మిమ్మల్ని సంతోష పెట్ట ప్రయత్నిస్తాను. శ్రావకా! నేను ఏ పాట పాడినా మీరేమీ అనుకోవద్దు.

నందుడు : నీ ఇష్టం వచ్చిన పాట కానీ అమ్మా!


ఉత్పల : 'నడిపింపవా ఓ ప్రభూ! నీవు నా నావ,
            భారాలను దేవ! బరువు మ్రోయగ లేను నడిపింపవా ॥
            పొడుపుమల నెత్తాన
            పొలిచి తడబడి కాంతి
            విడివడెడు పొలిమేర
            నేదూర తీరాలకో... ॥నడిపింపవా॥


నందుడు : వీణ మంచిదైతే పాట ఇంకా ఎంతో బావుండేది. ఎక్కడ నేర్చుకున్నావు తల్లీ ఈ పాట?

ఉత్పల : చిన్నతనంలో కోపం వచ్చి మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది.

నందుడు : పాపం!

ఉత్పల : బహుదూరం నడిచి నడిచి అలిసిపోయి ఓ సరస్సు దగ్గిర చెట్టు నీడన విశ్రమించాను. ఒక భిక్షువు అప్పుడు ఈ పాట పాడుతుంటే విని నేర్చుకున్నాను - ఈ గీతం ఈనాడు పాటలలో, మగధలో ఇంటింటా ధనికులైన తల్లులు పిల్లలకు నేర్పిస్తున్నారు. నందుడు : అంత ప్రసిద్ధమైన పాటా తల్లీ!

ఉత్పల : ఉత్పల నిత్యమూ రాజలోకాల్నీ, నాగరకులనూ, ఈ పాటతోనే ముగ్ధులను చేస్తున్నది. పాడగల వాళ్ళకు ఈ పాట బ్రతుకు తెరువు కల్పిస్తున్నది.

నందుడు : అమ్మా! ఏమిటా వెర్రిచూపులు - అన్నా... అన్నా!

ఉత్పల : నా హృదయభారాన్ని లోకం ఎలా అర్థం చేసుకోగలుగు తుంది. నా చుట్టున్న పిశాచాలు నన్ను బంధిస్తున్నవి.

అమితావి : పిశాచాలే, బాబో !

నందుడు : అన్నా! ఈమెకు మతిభ్రంశం కలుగుతుందేమో!

అమితావి : పాములు పెంచుతున్నది కదూ?

నందుడు : 'ఇస్' - ఆమెకు వినపడితే బాగుండదు.

అమితావి : మనకు అతిథిగా వచ్చింది. - అమ్మా!

ఉత్పల : ప్రణయము! దుఃఖం - ఆశ, నిరాశ! కరుణా క్రౌర్యాల అవధులు చూచాను. మహా పట్టణంలో కంఠం కమిలిపోయేటట్లు అమృతగాన మొలికించినా కమికెడన్నం దొరకని కాఠిన్యం! బాధ! అబ్బా!

నందుడు : ఉపాసికా! నీ పాట మహాద్భుతంగా ఉంది.

ఉత్పల : (ఉద్వేగంతో) 'తుందిలా! నాకు ప్రశాంతి గంగా గర్భంలో దొరుకుతుందన్నావు గదూ? చేత చిరుపాపతో నిస్సహాయనై, నిర్ధననై, నిరాహారనై నిన్ను పాదాలంటి వేడుకొన్నానే - డబ్బు! డబ్బు!

అమితావి : ఉపాసికా! ఉపాసికా!!

ఉత్పల : మాధ్వీ! కౌముదీ జాతరంలో నా నాట్యం! త్వరగా అలంకరించు. సభ ముగ్దమై పోవాలి... అబ్బా!

నందుడు : అమ్మా! మీకు దేహారోగ్యం సరిగా లేదా?

ఉత్పల : ఔను! దానివల్ల నాకేం లోపం. 'మహాజనులారా ఉత్పలకు ఈ దినం మన స్వాస్థ్యం లేదు. నాట్యం చెయ్యదు. ..... (పెద్ద పెట్టున నవ్వుతుంది) వెళ్ళిపొండి, వెళ్ళిపోండి. భదంతుడు : నందా! ఏమిటిది?

నందుడు : నేను పాడమంటే పాడుతుండగా ఉపాసికకు మతి భ్రమణం కలిగింది.

అమితావి : అన్నీ అర్థంగాని మాటలు మాట్లాడుతున్నది.

నందుడు : భదంతా! ఇంత అందగత్తెకు ఈ కష్టం ఎందుకు వచ్చిందో - సంపన్నురాలి వలెనే కనిపిస్తున్నదే!

భదంతుడు : నాయనా! మీరు పూజా మందిరానికి వెళ్లిపోండి. ఉపాసికా!

ఉత్పల : భదంతా!

భదంతుడు : ఈ ఏకాంత ప్రదేశం నీకు క్రొత్త చేసినట్లుంది.

ఉత్పల : సుజాత గీతం వల్ల నా పూర్వ జీవితంలో కొన్ని ఘట్టాలు, స్మృతికి వచ్చినవి. అందువల్ల మనస్సు కొంత కళవళపడి ఉంటుంది తండ్రీ! ఏడేండ్ల నాడు ఎర్రని ఎండలో తిండిలేక మలమల మాడి చనిపోయిన నా ముద్దుబిడ్డ 'ఆకలి! ఆకలి' అని కంటిముందు రోదించాడు.

భదంతుడు : అమ్మా! అతణ్ణి గురించి ఆలోచించడం మానివెయ్యి. ఇనికిల స్వర్గంలో గంధర్వుడై అతడు యథేచ్ఛగా పాడుకుంటుంటాడు.

ఉత్పల : తండ్రీ! అతణ్ణి బ్రతికించుకోటానికే ఈ సంగీతం నాట్యం నేర్చుకున్నాను. కీర్తి గడించాను - ధనం ఆర్జించాను. ఇప్పుడు ఎవరికోసం?

భదంతుడు : ఇక నీకు పిల్లలు లేరా?

ఉత్పల : (వికటంగా నవ్వి) లోకంలో అందంగా కనుపించే పిల్లలందరూ నా పిల్లలే. దరిద్రురాలైనప్పుడు, పవిత్రురాలై నప్పుడు నే పాడిన పాట, ఆడిన ఆట ఎవర్నీ ఆకర్షించలేదు. దుర్వృత్తికి అలవాటు పడి నగర నర్తనశాలలో వేసిన గంతులన్నీ శాస్త్రార్థ వ్యాఖ్యానాలైనవి. లోకం గుడ్డిది. కళను అది అందుకోలేదు. లోకం కళకు శత్రువు! ప్రబల శత్రువు!!

భదంతుడు : అమ్మా! అంత ఉద్వేగివి కాబోకు.

ఉత్పల : భదంతా! లోకానికి ప్రేమ లేదు సత్యం లేదు శౌచం లేదు. భదంతుడు : అమ్మా! అందుకనే భగవానుడన్నాడు.


'యేవా గరత్తాను పతంతి సోతం
సయం కతం మక్కట కోవ జాలం
పతంసి చేత్వ నవజంతి ధీరా
అనపేర్ధినో సబ్బ దుక్‌ఖం పహాయ'


ఉత్పల : భదంతా మీతో వెనుక ప్రసంగించిన ఆ ఉత్పలను నేనే! కడుపులో బడబాగ్నితో నిత్యమూ నాగరకలోకానికి ఆనందా మృత ప్రదానం చెయ్యవలసిన ఆ ఉత్పలను నేనే!!

(ఆరామ ఆలయంలో నుంచీ ఘంటికలు వినిపిస్తవి)

భదంతా! ఈ ఘంటికా నాదంలో ఎంత శీతలత్వమున్నది.

భదంతుడు : బుద్ధ పూజకు పిలుపు వినిపించింది.

ఉత్పల : (సోత్సాహంతో) ఈ ఆశ్రమ వాతావరణం ఎంత తాపా పనోదకంగా ఉంది.

అమితావి గొంతుక :


'నసంతి పుత్తా తాణాయ నపితా నపి బాంధవా
అంతకే నాధిపన్నస్య నవీథి జ్ఞాతిషు తాణతా
ఏతమత్ ఖవసం జ్ఞాత్వా పండితో సీల సంబుతో
నిర్వాణగమనం మగ్గగం ధిప్పామేవ విసోధయె'


ఉత్పల : భదంతా! అది అమితావి గొంతుకేనా? ఎంత అనునయంగా ఉంది

నందుని గొంతుక :


'కర్మ స్య కారకో నాస్తి
విపాకస్య చ వేదకో,
శుద్ధ ధర్మం ప్రవర్తంతి
యే వేదం సమదర్శనమ్'


ఎ.ఐ.ఆర్. హైద్రాబాద్ 7-6-1949

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.