వావిలాల సోమయాజులు సాహిత్యం-1/శివాలోకనము/సమీక్షణం
సమీక్షణం
నేను మెడపైకెత్తి చూచేటంత ఎత్తైన వ్యక్తిత్వం గల మనీషి శ్రీ వావిలాల సోమయాజులుగారు. ఆయన సుహృదయ స్పందన నుండి, ప్రౌఢధిషణ నుండి ఆవిర్భవించిన ఈ పద్యకావ్యానికి నేను నాలుగు మాటలు సమీక్షారూపంలో రాయటం కేవలం విద్యావయో వృద్ధులైన మా ఊట్ల కొండయ్యగారి మెత్తని ఆజ్ఞవల్లనే:
ఈ కావ్యాన్ని "శివాలోకనము” అనటంలోనే కావలసినంత కవిత్వం వుంది. కావ్య ప్రయోజనాన్ని వివరిస్తూ మమ్మటుడు
"కావ్యం యశసే౽ర్థకృతే వ్యవహార విదే
శివేతరక్షతయే సద్యః పర నిర్వృతయే
కాంతా సమ్మిత తయోపదేశయుజే”
అని వక్కాణించాడు. ఈ నిర్వచనంలోని శివేతరక్షతే యీ కావ్యానికి శివాలోకన
మయ్యింది. అంటే అమంగళ పరిహారార్థమన్న మహత్తర కావ్యప్రయోజనం కాస్తా
"మంగళ ప్రదమైన చూపు" అయ్యింది.
ఈ రకమైన అంటే “విశ్వశ్రేయః కావ్యమ్" అనే లక్ష్యంతో కూడిన శివాలోకనం గల కవే జగత్కల్యాణాన్ని సాధించగలడు. అయితే అటువంటి 'చూపు' కలగాలంటే చిత్తసంస్కారం చాలా అవసరం. కవుల స్థానం ఈ చిత్తసంస్కారాన్ని కలిగించటంలోనే నిర్ణయించబడుతుందనే సత్యాన్ని Emerson అనే పండితుడు, "Great Poets are judged by the frame of mind they induce in us" అంటూ చెప్తాడు. ఈ కావ్యాన్ని చదివి ఆలోచనామృతాన్ని ఆస్వాదించిన తర్వాత, సోమయాజులు గారి మహాకవి అనని సాహిత్యాభిమానులుండరని నా విశ్వాసం.
మానవుని దుష్టప్రవృత్తిని క్షాళనం చేసి, ఉత్తమ సంస్కార బీజాల్ని అతని హృదయ క్షేత్రంలో నాటగల మహత్తర కావ్యాలు భారత, భాగవత రామాయణాలు. ఈ కావ్యంలోని “ఆత్మార్పణము”, “బృహన్నలాశ్వాసము” అనే ఖండికలు భారతానికి, 'వాత్సల్యప్రియ” అనే ఖండిక భాగవతానికి, “పరివర్తన" అనే ఖండిక రామాయణానికి అనుబంధాలు కాగా, “భ్రష్టయోగి” అనే కవిత కూడా మేనక అంటిన విశ్వామిత్రుణ్ణి గుర్తుకు తెస్తూ రామాయణ స్పర్శతోనే వున్నట్టుగా కనిపిస్తూ వుంది.
పౌరాణిక ఇతివృత్తమైన కుమార సంభవం ప్రతిధ్వనించే కవితాఖండిక “ఉజ్జీవనము”. శివుని మీదికి దండెత్తి వెళ్లి, తన అశక్తతని అర్థం చేసుకొన్న మన్మథుని ఆంతర్యం ఉజ్జీవనంగా పొంగులెత్తింది. ఇలాగే, శివునికి ముడిపడ్డ మరో కవిత ధూర్జటి మహాకవి ఆంతర్యాన్ని నివేదించే “విన్నపము”. ఈ “ఉజ్జీవనము” “విన్నపము” - అనే రెండు కవితలూ నిజంగా శివాలోకానికి సంబంధించి, కావ్యశీర్షికని సార్థకం చేస్తూ ఉన్నాయి.
ఇంక, ఈ కావ్యంలోని "మాచలదేవి”, “కర్తవ్యము" - అనే రెండు కవితలు కాకతీయ చరిత్రకు సంబంధించినవి. ఈ రెండింటిలో శృంగార, వీరరసాలు తరంగితమవ్వడాన్ని సహృదయులు గమనించగలరు. అలాగే "వాత్సల్యప్రియ"లో వాత్సల్యరసం, "ఉజ్జీవనం”, “పరివర్తన", “విన్నపము”, కవితల్లో కరుణరసం. “భ్రష్టయోగి"లో శృంగారరసం, “ఆత్మార్పణం”, “బృహన్నలాశ్వాసం"లో వీరరసం - మనకి కనిపిస్తాయి.
రసస్థాయినిబట్టి రచన చేయటం మహాకవి లక్షణం. శృంగారరస శృంగాన్ని అధిష్ఠించిన ఈ క్రింద పద్యాన్ని చూడండి :-
"హాసౌజ్జ్వల్య రసోల్బణ ప్రథితమై ఆరగ్వధ ప్రక్రియన్
వాసించున్ సకలాశలందు ధరణీ పాలావతం సోన్నత
ప్రాసాద ప్రమదా వనాంత లతికా వాల్లభ్య పుష్టాళిలో
నీ సమ్మోహన ముగ్దరూప సుమ మో నీరేజపత్రేక్షణా!!”
ఇటువంటి పద్యాల్ని, కవుల ఱొమ్ముల్ని కాల్చి విడిచిన ఏ శ్రీనాథుడో గానీ
రాయలేదు. ఆ భావాలు, ఆ పద్యగమనాలూ అలాంటివి. భవభూతి తన ఉత్తర
రామచరిత్రలో అంటాడు.
"లౌకికానాం హి సాధూనా మర్థం వాగనువర్తతే
ఋషిణాం పునరాద్యానాం వాచ మర్థో౽నుధావతి”
ఋషుల మాట వెంట అర్థం వస్తుందట. అందుకే “నా నృషిః కురుతే కావ్యమ్”
అన్నారు. ఋషిహృదయులకు తప్ప శివలోకనం ఏర్పడదు. ఎందుకంటే,
ఈ కావ్యఖండికలన్నిట మనస్తత్త్వశాస్త్రం నిండివుంది. ఆ మనస్సు కొక రూపచిత్రణ వుంది. "The Poet's main glory is the power of Pictorial expression" అని.
ఈ మానసిక చిత్రణాభివ్యక్తి వల్లే కవికి సుస్థిరప్రతిష్ఠ కలిగేది.
ఎవరకే మాట కొసమెరుపో అచ్చమైన కవికి తప్ప తెలియదు. చూడండి - విల్లు పట్టుకోలేనివాడు యుద్దమేం చేస్తాడు? ఉజ్జీవనంలో - "జారి పోయె నీ ననవిలు నిల్వనోపకను నా కరకంజము నుండి" అని అనుకుంటాడు మన్మథుడు. చేతికి చెమట పట్టిన మాట - 'కర కంజము' అనే శబ్దం చెబుతోంది. ఇది శబ్దశిల్పరహస్యం.
“భ్రష్టయోగి”లో “ఈ సకలము 'కాదు కా' దను వచస్సున లేదటె కాంక్ష గుప్తమై” అనే మాటవల్ల భ్రష్టత్వానికి పరాకాష్ఠని చూపించిన ఈ కవి, "ఆత్మార్పణం”లో - “నా ప్రాయం బిచ్చితి రాజరాజునకు నీ పాలోయి నా ఆత్మయే” అని, కర్ణుని మహాత్మని ఆవిష్కరించటంలోని ఔచిత్యాన్ని గమనించండి. ఇలా ఎన్నని ఎన్నిక చేసి చూపించేది? ఒక్కొక్క పద్యం ఒక్కొక్క రస గుళిక!
“కావ్య స్యాత్మా ధ్వనిః” అన్నాడు ఆనందవర్ధనుడు. కావ్యగత రసధ్వనిని ఆత్మతః వినగలగడమే రసజ్ఞత. భ్రష్టమైన సమాజంలో పరివర్తన చెంది, ఉజ్జీవనమై, కర్తవ్యాన్ని గ్రహించి, భావితరాల మీద వాత్సల్యంతో ఆత్మవిమర్శని విన్నవించుకుంటూ, మానవత కోసం లలిత జీవనం కోసం ఆత్మార్పణకైనా సిద్ధపడాలనే ధ్వని యీ శివాలోకనంలో ప్రవహిస్తోంది.
ఇంతటి ఉత్తమ కవితా సంపుటిని మా 'పింగళి - కాటూరి సాహిత్య పీఠం' అందించగలగటం ఒకానొక భాగ్యవిశేషం.
మహాకవులైన సోమయాజుల వారికి హృదయపూర్వక నమస్సులర్పిస్తున్నాను.
- ఆచార్య తిరుమల