Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-1/శివాలోకనము/వావిలాల వారి సాహిత్య జీవనం

వికీసోర్స్ నుండి

వావిలాల వారి సాహిత్య జీవనం

శ్రీవావిలాల సోమయాజులు గారి సాహిత్యచరిత్ర అంటే - అర్ధశతాబ్ది గుంటూరు సాహిత్యచరిత్ర అన్నమాట. యాభై యేండ్ల పాటు రేయింబవళ్లు, అధ్యయన, అధ్యాపన, రచనా, ఉపన్యాస వ్యాసంగాలతో గడచిందాయన జీవితం. సాహిత్యం వినా మరొకటి ఆయన పట్టించుకోలేదు. పోనీ, గృహస్థయి వుండి, ఇల్లూ వాకిలీ అయినా పట్టించుకొన్నారా అంటే అదీ లేదు. బలిష్ఠమూ, సుందరమూ అయిన తన శరీరారోగ్యాన్నీ లక్ష్యపెట్టలేదు. సాహిత్య మొక్కటే పని అదే లక్ష్యం, అదే జీవితమూ, జీవనమున్నూ.

గేయాలు వ్రాశారు, పద్యాలు వ్రాశారు, సాహిత్యవిమర్శలు వ్రాశారు. చరిత్ర పరిశోధనలు వ్రాశారు సభల్లో మహోపన్యాసాలు చేశారు. మృదుమధురంగా వ్రాసి, ఊరూర కమ్మగా పాడారు. సాహిత్య సమావేశాల్లో, రేడియో నాటికలూ, ప్రసంగాలూ వ్రాశారనేకం. సంగీత, నృత్య రూపక రచనకు ఒరవళ్ళు పెట్టారు. జయదేవుని 'పీయూష లహరి' అనే సంగీత నృత్య నాటికను తొలుదొల్త తెలుగువారికి పరిచయం చేసినవారు సోమయాజులుగారే. దాన్ని తెనుగు చేశారు కూడ, జయదేవుని ఇంపుసొంపులు తగ్గకుండా.

విశ్వనాథ తర్వాత అంత పెద్దయెత్తున వివిధ సాహిత్యరీతులలో రచనలు చేసినవాడూ, దేవులపల్లి తర్వాత, ఆంధ్ర దేశమంతటా సాహిత్యసభల్లో జనరంజకంగా ఉపన్యాసాలు చేసినవాడూ, వాసిలోనూ, రాశిలోనూ శ్రేష్ఠుడనిపించుకొన్నవాడూ శ్రీవావిలాల సోమయాజులుగారే. విద్వత్తుకు విద్వత్తూ, ప్రతిభకు ప్రతిభా, బహుముఖప్రజ్ఞా, అనంత సృజనాశక్తి కల వాడాయన. విశ్వనాథ, దేవులపల్లిలలో లేని సాహిత్యవిమర్శా, చరిత్ర పరిశోధనలనే విశేషకౌశలం వీరికి కైవసమైంది.

ఆంధ్రదేశంలోని సంగీత నాట్యరీతులపై వారి పరిశోధనవ్యాసం చాలామందే వ్రాసినా, 1948 సెప్టెంబరు భారతి సంచికలో వెలువరించారు. అలాగే వాత్స్యాయన కామసూత్రాలపై వ్యాఖ్యానవ్యాసం 1947లో అమరావతిలో జరిగిన ఆంధ్ర సామ్రాజ్య మహోత్సవ సభల సందర్భంలో వెలువడినా, 1950లో ప్రకటింపబడిన సాతవాహన సంచికలో దర్శనమిచ్చింది. ఇవి ఆ నాటి పండిత పరిశోధకుల మన్ననలందుకొన్నవి.

1940 నుంచిన్నీ ఆయన ఎన్నెన్ని సాహిత్య సంఘాల వ్యవహారాలు నిర్వహించారో లెక్క లేదు. కార్యదర్శిగా సాహితీ సమితిలోనూ, 'ప్రతిభ'కు ఉపసంపాదకుడిగానూ, సహకార్యదర్శిగా నవ్య సాహిత్య పరిషత్తుతోనూ తనకున్న సాన్నిహిత్యం అలా వుండగా, హిందూ కాలేజీ నాటక సమాజానికి, "శారదాధ్వజ" సభకూ, "సుధర్మ” సభకూ కార్యదర్శిత్వమూ, నిర్వహణమూ ఆయనదే. పిల్లలమఱ్ఱి హనుమంతరావు గారధ్యక్షులుగ వున్న జ్యోత్స్నా సమితికి తొలుదొల్త తాను కార్యదర్శి, అనంతరం అధ్యక్షుడు. డాక్టర్ మారేమండ రామారావు గారధ్యక్షులుగా వున్న ఆంధ్రేతిహాస పరిశోధక మండలికి కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో 1963 నుంచీ 73 వరకూ 10 ఏండ్ల పాటు సభ్యుడు - ఇలా ఇంకా ఎన్నెన్నో!

దాదాపు 35 ఏండ్ల పర్యంతం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలలోనూ - కోస్తా, రాయలసీమ, తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ, ఇంచుమించు అన్ని కళాశాలల్లోనూ అన్ని హైస్కూళ్ళలోనూ సాహిత్యం పైననే గాక, ఇంకా అనేకానేక విషయాలపై సోమయాజులుగారి ఉపన్యాసాలు మారు మ్రోగేయి.

సోమయాజులుగారు ఉత్తమరచనల్ని చాలా అనువాదం చేశారు. మహాకవి జయశంకర్ ప్రసాద్ 'కామాయని'నీ, అంసూ'నూ హిందీనుండీ, షేక్‌స్పియర్ నాటకాలు - జూలియస్ సీజర్, మేక్బెత్, ఆంటోనీ క్లియోపాత్రాలను బహాఈ మతానికి చెందిన అనేక గ్రంథాలనూ, కేథలిక్ క్రయిస్తవుల మతసాహిత్యాన్ని ఇంగ్లీషు నుండీ మనోహరంగా తెలిగించారు. బాల సాహిత్యం కూడా చాలా రచించారు ప్రీ యూనివర్శిటీ, ఇంటర్, బి.ఏ., బి.ఎస్సీ, బి.కాం. తరగతులకు నోట్సు వ్రాశారు అసదృశంగా అనేక సంవత్సరాలు. భువనవిజయ ప్రక్రియ నారంభించడంలోనూ, దాన్ని రూపొందించడం లోనూ, దాని ప్రదర్శనలలో పాల్గొని విజయవంతం చేయడంలోనూ వావిలాలవారు అమోఘమైన పాత్ర నిర్వహించారు.

భువనవిజయం సభల్లో ప్రియదర్శనుడైన తాను ధూర్జటి పాత్రలను పోషిస్తూ వుంటే, నిజంగా ధూర్జటియేనేమో ఈయన అనిపించేవాడు. అంతగా ఆ పాత్రలో ఐక్యమైపోయేవారీ కుమార ధూర్జటి. ప్రకాశం జిల్లా మద్దిపాడులో జరిగిన భువన విజయం సభలో, మహామంత్రి తిమ్మరుసు పాత్ర నిర్వహిస్తున్న జమ్మలమడక మాధవరామశర్మగారు -


“స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గె నీ
యతులిత మాధురీమహిమ...?"


అంటూ పృచ్ఛ చేస్తే - ధూర్జటి పాత్రనభినయిస్తున్న సోమయాజులు గారు వెంటనే అందుకొని,


"..................ఔ. తెలియందగు లోకమోహనో
ద్దత సుమసాయక ప్రబలతాప మహోజ్జ్వల పూజ్యపార్వతీ
పతిపద మంజులాబ్జ మధుపాన మధువ్రతుడై చెలంగుటన్”


అంటూ ఆ పద్యం పూరించారు సభికుల కరతాళధ్వనుల నడుమ 1956 జులై 12 నాటి ఉదంతమిది.

.............................

స్వాతంత్ర్యోద్యమ దీక్షతో, జాతీయ విద్యాభిమానంతో, మహిళాభ్యుదయాభిలాష తో, ఉన్నవ వారి శారదానికేతనానికి ప్రిన్సిపాలై త్యాగబుద్ధితో పనిచేశారు. స్వాతంత్ర్యం మన ప్రాంగణం చేరేవరకు ఖద్దరు తప్ప కట్టలేదు. 'మణిప్రవాళం' (1952) వంటి ఉన్నత సాహిత్య ప్రమాణాలు గల అపురూప పాఠ్యగ్రంథాన్ని విద్యార్థుల కందించారు. 'నాయకురాలు' (1944) వంటి గొప్ప నాటకాన్ని సృష్టించారు. తన విద్వత్తుచేత ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి వంటి సాహిత్యమహోపాధ్యాయుని మెప్పు పొంది, కట్టమంచి రామలింగారెడ్డి గారివంటి మహనీయుని వలన, పండిత - లెక్చరర్ పదవీ నిర్వహణకై ఎగ్జెంప్షన్ పొందగలిగారు. గుంటూరు హిందూ కళాశాలలో 30 ఏండ్ల కాలం సాహిత్యాధ్యాపకులుగా వుండి, ఎందరెందరో విద్యార్థులు విద్వత్కవులుగా, సాహిత్యాచార్యులుగా రూపొందడానికి దోహదం చేసిన గురుదేవుడు సోమయాజులు గారు. చూచేవాళ్లకు కళ్లు చెదిరే రూపలావణ్యం కలిగిన్ని, ఎన్నడూ తన కన్ను చెదరనీయని శీలసంపద నిండుకొన్న నిష్టాగరిష్ఠుడాయన. ఆచార్యుడై, కవియై, ఋషియై మహామానవుడైనా డాయన.

ఇంతటి మహనీయ సాహిత్యమూర్తి కావడం చేతనే ఆంధ్రసాహిత్య లోకం ఆయన్ని మహదానందంతో అభిమానించి, ఆదరించి, ఎన్నెన్నో సన్మానాలు జరిపింది సాహిత్యాచార్య, సాహిత్యరత్న, సాహిత్యబంధువు, మధురకవి, కవిభూషణ, కుమార ధూర్జటి - ఇత్యాదిగా ఎన్నో బిరుదులిచ్చి సత్కరించింది. అందుచేతనే సాహిత్య, నాటకరంగాలలో హేమాహేమీలందరూ ఆయన కాత్మీయులూ, సహవ్రతులూ ఐనారు. విస్సా అప్పారావు, త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, కురుగంటి సీతారామ భట్టాచార్య, నోరి నరసింహశాస్త్రి, జమ్మలమడక మాధవరామశర్మ, మల్లంపల్లి సోమశేఖరశర్మ, తెలికిచెర్ల వేంకటరత్నం, వల్లభజోశ్యుల సుబ్బారావు వంటి పెద్దలాయనకు సాహిత్య సహవ్రతులైతే, డాక్టర్ మారేమండ రామారావు, ఓరుగంటి నీలకంఠశాస్త్రి, శ్రీసదన ప్రస్తుత పీఠాధిపతులు నృసింహభారతీస్వామి వారు (పూర్వాశ్రమంలో ఘట్టి నరసింహశాస్త్రి), టేకుమళ్ల అచ్యుతరావు, కామేశ్వరరావు వంటి వారు చారిత్రిక సహవ్రతులైనారు. స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, కూర్మా వేణుగోపాలస్వామి, మాధవపెద్ది వెంకట్రామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు ప్రభృతులు నాటకరంగంలో సహవ్రతులు కాగా, ఆయన వలన సాహిత్య భాసురులైన వారిలో కె.వి.యల్. నరసింహారావు, ఎక్కిరాల కృష్ణమాచార్య, జూలూరి హనుమంతరావు, బూదరాజు రాధాకృష్ణ, బండ్లమూడి సత్యనారాయణ, బొడ్డుపల్లి పురుషోత్తం, కేతవరపు రామకోటిశాస్త్రి, పేరాల భరతశర్మ, యామర్తి గోపాలరావు మొదలైన యశస్వులెందరో వున్నారు. ఇంతటి విస్తార - సాహిత్య నాటకరంగ బంధువర్గాన్ని బట్టే మనం ఊహించుకోవచ్చును సోమయాజులుగారి అర్థశతాబ్ది సాహిత్య జీవితం ఎలాటి నిరంతరాయయోగ సమాధియై సిద్దించిందో! ఈ యోగసిద్ధి వెనుక, అజ్ఞాతంగా, కృతజ్ఞత కూడా ఆశించని ఒక వ్యక్తి త్యాగ మహిమ అండదండలుగా వుంది ఆ వ్యక్తే ఆయన ప్రియధర్మపత్ని, నా చెల్లెలు - చిట్టెమ్మ. తొణుకు బెణుకు లేకుండా, సంసారాన్ని అహర్నిశలూ కంటికి రెప్పలాగా కాపాడగలిగిందామె పుణ్యమే. ఆయన ఇంతటి సాహిత్య పారిజాతమై వికసించడానికి గృహరంగంలో ఈమె సాహచర్యమూ, సాహిత్యరంగంలో శ్రీశివశంకరుల సాహచర్యమూ దోహదం చేశాయి.

ఎనిమిదేండ్ల మా చిట్టెమ్మను 14 ఏండ్ల సోమయాజులుగారు 13-5-1932న పెండ్లాడారు. చిట్టెమ్మ తండ్రి రాయప్రోలు రామశేషయ్య గారు గుంటూరు వాస్తవ్యులు, గుంటూరులోనే నివసిస్తున్న - సోమయాజులు గారి పెదతండ్రి - వావిలాల రామచంద్రశాస్త్రి గారీ సంబంధం కుదిర్చి పెండ్లి చేశారు. సోమయాజులుగారి తండ్రి, సత్తెనపల్లి వాస్తవ్యులైన సింగరావధాని గారు తల్లి మాణిక్యాంబగారు. 18-1-1918 పింగళ నామ సంవత్సర పుష్యశుద్ధ సప్తమీ శనివారం నాడు సోమయాజులుగారు జన్మించారు. తాను పసిగుడ్డుగా వున్నప్పుడే తండ్రి స్వర్గస్థులు కావడంతో సోమయాజులుగారు నరసరావుపేట తాలూకాలోని విప్రులపల్లి అగ్రహారంలో మాతామహుల ఇంట పెరిగి, సత్తెనపల్లెలోని క్రైస్తవ ఎలిమెంటరీ స్కూలులోనూ, తరువాత నరసరావుపేట హై స్కూలులోనూ, పిమ్మట గుంటూరు ఎ.సి. కాలేజీలోనూ చదువుకొని, తెలుగు సాహిత్యం, దక్షిణ భారత చరిత్ర అభిమానవిషయాలుగా తీసికొని 1938లో పట్టభద్రులైనారు.

పట్టభద్రులైన తరువాత రెండేండ్ల కాలం గుంటూరులోని ట్యుటోరియల్ కాలేజీలలో అధ్యాపకులుగానూ, స్వాతంత్ర్య సమరయోధుడైన ఒక మిత్రునకు ప్రింటింగ్ ప్రెస్సు నిర్వహణలో సహాయకుడుగాను పనిచేశారు. 1940 నుండి 1947 వరకు శారదానికేతనం ప్రాచ్య విద్యా కళాశాలకు ప్రిన్సిపాలుగానూ, 1947 నుండి 1977 వరకు హిందూ కళాశాలలో ఆంధ్ర భాషాచార్యులుగాను పనిచేశారు. 1974, 1975, 1976 సంవత్సరాలలో - ఇంటర్, పి.యు.సి., బి.ఎ., బి.ఎస్‌సి., తరగతుల వారికి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కరెస్పాండెన్సు విద్యాలయంలో ఆంధ్రోపన్యాసకులుగా కూడా పని చేశారు.

శ్రీవావిలాల కవిశేఖరుల సంతానం నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, పెద్ద వాడైన ఛాయాపతిని, తన పెద తండ్రి నిస్సంతు కావడం చేత, ఆయన దత్తత తీసుకొన్నాడు. ఆ పుత్రుడు వివాహానంతరం కొద్ది కాలానికే, అందరి కడుపుల్లో చిచ్చుపెట్టి వెళ్ళిపోయాడు. పెద్దమ్మాయి భర్త కూడా అదే పని చేశాడు, సంతానమైనా కలగకుండానే. తక్కిన ఈ ముగ్గురూ ఆ ముగ్గురూ ఉన్నతవిద్యావంతులై ఆర్జిస్తూ, సద్గృహస్థులై సంతానవంతులై, తండ్రి కీర్తి నినుమడింప జేస్తూ ఉన్నారు.

'పూర్ణపురుషుడు' అనే మాట ఒకటి ఉన్నది కదా? సర్వతోముఖ నిష్కళంకమూ సుందరమూ శుభప్రదమూ ఆనందదాయకమూ ఐన మానవజీవితాన్ని తెలియజెప్పడాని కీ మాట వర్తించేట్లయితే, తప్పక శ్రీవావిలాల సోమయాజులుగారికి కూడా వర్తిస్తుంది. అయితే సాహిత్యంతో ప్రత్యక్షసంబంధం లేని మహాపురుషులకే ఈ మాట వాడకంలో ఉండడం చేత, సాహిత్య విశేషార్థం వచ్చేట్లు ఈయన్ని 'సాహిత్య పూర్ణపురుషుడు' అందాము. నా చెల్లెలు చిట్టెమ్మకు 'ఇంటాయన' కావడం చేత, ఈయన నాకు బావగారైనారు. 73వ ఏడులో నడుస్తున్న ఈ సాహిత్య పూర్ణపురుషుడు. మా బావ వావిలాల సోమయాజులుగారు, ఆంధ్ర సాహిత్యభాగ్యాన్ని ఇనుమడింపజేస్తూ, అందరినీ ఆశీర్వదిస్తూ నూరేండ్ల కాలాన్ని దాటి, హాయిగ సాహిత్య జీవయాత్ర కొనసాగించాలని త్రికరణ శుద్ధితో కోరుకొంటున్నాను.

పింగళి - కాటూరి

విధేయుడు

సాహిత్యపీఠం, హైదరాబాదు

ఊట్ల కొండయ్య