వావిలాల సోమయాజులు సాహిత్యం-1/శివాలోకనము/ముందుమాట
ముందుమాట
అభిజ్ఞ రసజ్ఞుల కరకమలాలను అలంకరించిన ఈ కావ్యం పేరు “శివాలోకనము”. దీనిని రచించినవారు "కుమార ధూర్జటి" బిరుదాంకితులు శ్రీవావిలాల సోమయాజులు గారు.
ఉ. కలువలు పూచినట్లు, చిరుగాలులు చల్లగ వీచినట్లు, తీ
వలు తల బూచినట్లు, పసిపాపలు చేతులు చాచినట్లు, క్రొ
వ్వలపులు లేచినట్లు, చెలువల్ కడకన్నుల చూచినట్లు ఆ
త్మలు పెనవైచినట్లు కవితల్ రచియింతురహో మహాకవుల్!!
సుమారు నలభై సంవత్సరాలకు పూర్వం కవితాసరస్వతి స్వరూపాన్ని
నిరూపించుతూ నేను వ్రాసిన పద్యమిది. ఇటువంటి కవివరేణ్యుల కోవకు చెందినవారు
శ్రీవావిలాలవారు.
సహృదయ బంధువూ, సారస్వత సింధువూ, సౌజన్య నీరధీ, సౌహార్ద సారథీ అయిన శ్రీవావిలాలవారు తమ కవితా సంపుటికి “శివాలోకనం” అని పేరు పెట్టారు.
శివాలోకనం! ఎంత చక్కని పేరు? ఎంత చిక్కని పేరు? "శివ" శబ్దానికి ఈశ్వరుడు అనీ, శుభం అనీ అర్థం. “శివా” శబ్దానికి పరమేశ్వరి అని అర్థం. “శివాలోకనం" అని తన కావ్యానికి పేరు పెట్టటం వల్ల పైన చెప్పిన మూడింటి ఆలోకనం అనీ, కవి హృదయం అవగతమవుతున్నది.
ఈ కావ్యంలో మొత్తం ఎనిమిది కవితా ఖండికలు ఉన్నాయి. అవి, వాత్సల్యప్రియ, ఉజ్జీవము, పరివర్తన, భ్రష్టయోగి, మాచలదేవి, ఆత్మార్పణము, విన్నపము, బృహన్న లాశ్వాసము అనేవి. శివాలోకనంలోని ఈ అష్ట ఖండికలూ అష్టమూర్తి అయిన పరమశివుని స్వరూపాన్ని స్పురింపజేస్తున్నాయి. ఇలా తన కావ్యం ద్వారా ఆ "ధూర్జటి”ని, ఈ "కుమార ధూర్జటి” మనకు ప్రత్యక్షం చేయించటంలో ఎంతో ఔచిత్యం ఉంది.
“వాత్సల్య ప్రియ”లో చిన్ని కృష్ణుని అల్లరి పనులు మానమని అనేక విధాలుగా బోధిస్తున్న మాతృమూర్తి యశోదాదేవి అంతరంగ తరంగాలు పొంగిపొరలాయి. “ఉజ్జీవం”లో తానే దేవతలకు రక్షకుణ్ణి కాగలిగాననే దుర్గర్వంతో దూసుకువచ్చి శివ తపోభంగానికి తలపడిన మన్మథుని మనోమథనం మూర్తి గట్టింది.
“పరివర్తన"లో వల్లమాలిన అహంకారంతో తమ్మునితో తగాదాకు దిగి, రామబాణం తగిలి నేల కూలిన వానరరాజు వాలి వ్యాకుల హృదయం వ్యక్తమయింది.
“భ్రష్టయోగి"లో పరమతపోనిష్ఠకు ప్రయత్నించినప్పటికీ ప్రకృతిని జయించలేక పోయిన ఒక యోగివరుని తలపులు తేటతెల్లమైనాయి.
ఇక కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుని ఉపపత్నీ, సంగీత నాట్యకళా విశారదా అయిన మాచలదేవి ఔన్నత్యమూ, ప్రత్యేకతా "మాచల దేవి” అన్న కవితలో కళ్ళకు కట్టించబడినాయి.
“ఆత్మార్పణం” అన్న కవితలో కర్ణుని స్వామిభక్తీ, మైత్రీ మాధుర్యమూ, ధర్మాధర్మ విచికిత్సా, ఉచితజ్ఞతా, పరాక్రమ ప్రదర్శనాభిలాషా, కృష్ణభక్తి, అచంచల స్వభావమూ. ఆత్మాభిమానమూ, సత్యసంధతా స్పష్టమైనాయి.
“స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో అతులిత మాధురీ మహిమ?” అని ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలచే ప్రశంసింపబడిన శివభక్త శిఖామణి ధూర్జటి మహాకవి హృదయఘోష, “విన్నపం” అన్న ఖండికలో నిండుగా నింపబడింది.
"బృహన్నలాశ్వాసం” అన్న చిట్టచివరి కవితాఖండికలో ఆడవారి యెదుట బీరాలు పలికి ఆడంబరంగా కౌరవులతో యుద్ధానికి సిద్ధమైన ఉత్తర కుమారుడు, సమయానికి వెన్ను చూపి రథం దిగి పారిపోతుంటే, బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు అతనిని ఊరడించి ధైర్య స్థయిర్యాలను నూరిపోయటం వెల్లడింపబడింది.
ఈ విధంగా విభిన్నవ్యక్తుల హృదయాలలోకి పరకాయ ప్రవేశం చేసి, వారి వారి చిత్తవృత్తులను వివిధ రీతులలో చిరస్మరణీయంగా చిత్రించారు శ్రీసోమయాజులు గారు తమ “శివాలోకనం"లో.
చిత్రం ఏమిటంటే “శివాలోకనం” అనే పేరుతో ప్రత్యేకమైన కవిత లేకపోయినప్పటికీ కవితాసంపుటి మొత్తానికి ఆ పేరు పెట్టి తమ నామౌచిత్య పాటవాన్ని ప్రకటించుకున్నారు వావిలాలవారు. అన్ని కవితలలోనూ అంతస్సూత్రం "శివాలోకనమే” అన్న రచయిత క్రాంతదర్శనానికి అది నిదర్శనం. ఇక ఈ కావ్యంలోని సాహిత్య సౌందర్యాన్ని ఇంచుక పరిశీలిద్దాం. వీరి సుమసుకుమారమైన శయ్యాసౌభాగ్యాన్ని వెల్లడించడానికి ఈ క్రింది పద్యాలు చాలు.
"ఈ సెలయేటి కేమిటికొ యింతటి వేగము నీ వెరింగినా
వే సఖి! చేసెనే ప్రియుని యింటికి జేరగ ప్రొద్దు క్రుంకగా
బాసట అందుకౌ త్వర - త్రపారహితంబుగ నేగుచున్నదే
ఆ సెలయేటి మానసము నందలి కోర్కెల నూహ సేయుమా!”
“హాసౌజ్జ్వల్య రసోల్బణ ప్రథితమై ఆరగ్వధ ప్రక్రియన్
వాసించున్ సకలాశలందు ధరణీపాలావతంసోన్నత
ప్రాసాద ప్రమదావనాంతలతికా వాల్లభ్యపుష్పాళిలో
నీ సమ్మోహన ముగ్ధరూప సుమమో నీరేజపత్రేక్షణా!!”
వావిలాల వారి అలంకార సౌభాగ్యాన్ని ఔపమ్యరమ్యమైన ఈ క్రింది పద్యం
వ్యక్తీకరిస్తుంది.
"కనకపు కంబ మొండు స్ఫటికంపు సురమ్య విశాలహర్మ్యమం
దున లగియించి నట్టులుగ తోచెడి శర్వుడు యోగశక్తిచే
ననుచగ నాత్మతేజము మహోన్నత దేహమునందు మున్ను నే
ననుకొన నీశు డర్యమ సహస్ర కళాకలితుం డటం చెదన్.”
ఒయ్యారాన్ని ఒలకబోసే ఈ ఎత్తుగడలు చిత్తగించండి...
- అ) ఎన్నడులేని యీ యొదుగు లెచ్చట నేర్చినదీ పికంబు?
- ఆ) ఈడుకు తగ్గ చేష్ట లగునే వ్రజభామినులార!
- ఇ) కాకులమూక లోకము ప్రకారము వింతయె
- ఈ) కాళులు లేక చిక్కితిమె కాలవశంబున చిక్కినాము.
- ఉ) అవును నిజమ్మె కుంతి కనెన్నది నమ్మితి.
- ఊ) నేనొక తేపగాగ నవనీపతి దాటదలంచె.
ఈ క్రింది పద్యాలలోని తెలుగు నుడికారాలు సుమనో మనోజ్ఞంగా ఉన్నవి.
'ఏగతి వచ్చి చేరితివి యింటికి వాకిట నిల్చియుంటి కా
దా గజదొంగ! మూసితివి అమ్మకు కన్నుల దొడ్డిగుమ్మమున్
నే గడివేసి వచ్చితిని నీ కెటు వచ్చెనొ! ఇట్టులైన నే
లాగున నిల్వగాగలమురా నిను పెట్టుకు ఊరిలోపలన్!"
“అడుగుల కడ్డువచ్చి తడియారని కన్నులతో కపోలముల్
వెడవెడ వెల్లనై సొగసు వీడగ వీడుట కొప్పుకోని నీ
యెడదను దిద్ద ఉన్నయటులే చనుదెండు యుగమ్ము కాదె మీ
కడ నిలువంగలేని క్షణకాలము నా కని యార్తవైతివే!”
చిన్ని కన్నయ్య అల్లరి అనిర్వచనీయం. చెరువుకు గండి కొట్టాడని ఒకరూ,
జింకల గుంపును పొలంలోకి తోలాడని మరొకరూ, అరకల కర్లు లాగాడని ఒకరూ,
మంచెలు విరగగొట్టాడని ఇంకొకరూ, గడ్డ పలుగులను కనపడనీయక మట్టిలో
కప్పెట్టాడని వేరొకరూ, చెట్టుమీద దాచుకున్న దుత్తలోని పెరుగన్నం ఖాళీ చేశాడని
కొండొకరూ - ఇలా గోపగోపికలు బాలగోపాలుడి చిలిపి పనులను యశోదాదేవికి
చెప్పుకున్న సందర్భం సహజసుందరం.
దండిగా కొండేలు చెప్పిన నందవ్రజం వారి పలుకులు. విని 'కృష్ణుణ్ణి పట్టుకుందామని పరుగెత్తిన యశోదకు కాళ్ళు "కండెలు కట్టాయి. 'ముత్తైదువ' లాగా ఏమీ ఎరగనట్లు నీతిగా కూర్చున్నాడు కృష్ణుడు. జన్మతోనే "నటకాగ్రగణ్యు"డైన ఆ పిల్లవాణ్ణి ఆమె ఏం చేయగలుగుతుంది? అవి "ఈడుకు తగ్గ చేష్టలగునే?” అని వాళ్ళను మందలిద్దామంటే, వెంటనే 'చిన్నబిడ్డ లీ యీడుకు కొండలెత్తుచు ఫణీశు లతో చెరలాట మాడిరే!' అని, వాళ్లెక్కడ అంటారో అని మెదలకుండా ఊరుకుంది యశోద.
"తల్లికి నాకు తీరినది ధర్మము వీడుచు గంగ చేతిలో నుల్లము రాయి చేసుకొని యుంచిన యప్పుడె” అనీ, "స్వామికి ఉపాయనమై ఋణమెల్ల తీర్చెదన్" అనీ, "అతని సుఖమ్మె నా సుఖము అతని దుఃఖమె నాదు దుఃఖమై మతు లొకటై చరించితిమి మంచికి చెడ్డకు" అనీ, "ఇహపరా లేమైన నాకేమి నా ప్రాయం బిచ్చితి రాజరాజునకు నీ పాలోయి నా ఆత్మయే" అనీ కృష్ణుడితో కర్ణుడు పలికిన పలుకులలో అతని ఆత్మాభిమానమూ, ధర్మబుద్ధి, స్నేహశీలతా, కృష్ణభక్తి, ద్యోతకమైనాయి.
“జగము సమస్తమున్ నవరసాలము పోలిక సాంధ్యరాగపున్ జిగిని వెలుంగ”
"ఎద నదియై స్రవింప”
"ఏనాడైన భువిన్ అసూయ కలుషం బీర్ష్యావ్యథాశాంతియే
కానన్ రావు సమత్వ మభ్యుదయ మగ్రామ్యంబు సౌఖ్యంబు”
"శిరమున నున్న గంగ శశిశేఖర: నా రసనాంచలమ్ము నన్
దిరముగ నిల్పుమయ్య”
“నా కొక జన్మమున్న భువి నన్ జనియింపగనిమ్ము స్వామి : నీ
వాకిట బిల్వవృక్ష మటు వత్సలతన్”
"భోగము లారగించు తలపుల్ కొని చంచల చంచరీక హృ
ద్వేగ గతిన్ చరించి భ్రమ తీరగ జేరితి నిన్ శివా!”
- మొదలైన పద్య పంక్తులలోని హృద్యానవద్యములైన భావాలు గమనింపదగినవి.
సందర్భ సముచిత సమాసవిన్యాసం వావిలాల వారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ సురుచిర సమాససంఘటనం చూడండి -
ప్రౌఢానంత వాసంత లీలాలాలిత్యము, అనంత విలాస శకుంత సంతతులు, మహోన్నత భక్తి రసప్రపూత, చండీశోద్ధత కార్ముకోపమ మహాచాపమ్ము త్వదీయ ధనురంచిత జంభర మంజు శింజినీ రసభర ఝాంకృతీ ధ్వని, ఐంద్రద్వీపోద్గళ ఘంటారవ పాటవోజ్జ్వల లసత్కావ్యంబు మొదలైనవి అనాయాససమాస లాస్యవిలాసాన్ని వ్యక్తం చేస్తాయి.
కాటికి కాళ్లు చాచుకొను, గంపెడు కోర్కెలు, మిన్నుల తన్ని పోరగల మేటి బలాఢ్యుడు, ఉప్పెన నవ్వు, కదనదోహలి, దురుద్యోగి, కనుచూపు వెన్నెలల తీరము, తడబడు గుండె, గాలి బుడతలు, ఎడద ఉయ్యాల వంటి జాతీయాలూ, శబ్దసంపుటులూ - వావిలాల వారి ప్రత్యేక ప్రతిబింబాలు.
ఈ విధంగా బహుముఖీన గుణగణమండితమైన “శివాలోకనం" సహృదయు లందరికీ సదా సదాలోకనమై, సాహిత్యజగత్తులో వ్యక్తిత్వం ముద్రాభద్రమైన స్థానాన్ని వావిలాల వారికి వాటిల్ల జేస్తుందని నా విశ్వాసం.
సోమయాజులు గారి వ్యాసాలు, కావ్యఖండికలు, నాటకాలు మొదలైన వెన్నో పుంఖానుపుంఖాలుగా సుప్రసిద్ధ సాహిత్య పత్రికలైన భారతి, ప్రతిభ, గృహలక్ష్మి, ఆనందవాణి మొదలైనవాటిలో ప్రచురితమై, పాఠకుల ప్రశంసల్ని అందుకున్నాయి. ఎన్నో గ్రంథాలు పాఠ్య గ్రంథాలుగా విశ్వవిద్యాలయాలలో కళాశాలలలో నిర్దేశింపబడినాయి. సోమయాజులుగారి వివరణ, వ్యాఖ్యానం, తాత్పర్యంతో కూడిన 'నోట్సు' చదవని కళాశాల విద్యార్థి లేడంటే అతిశయోక్తి కాదు.
వావిలాల వారిది వెన్నలాంటి మనస్సు. వెన్నెల లాంటి చిరునవ్వు. వేణువు లాంటి గాత్రం. వేదం లాంటి విజ్ఞానం. వేలుపు లాంటి రూపం. జీవితంలోని అందాన్ని, ఆనందాన్ని పదిలంగా ఆస్వాదించి, తోటివారికి పంచిపెట్టగల చరితార్థుడు రసవేది, రసవాది వావిలాల.
సోమయాజులు గారి శేముషీవిశేషం అంతా ఏండ్ల తరబడి విద్యార్థులకు 'గైడ్లు' వెలయించటంతోనే చెల్లింపబడిందనీ, రావలసినన్ని కావ్యాలు వారి చేతి మీదుగా రాలేదనీ తపనపడేవారిలో నేను మొదటివాణ్ణి. ఇప్పుడు ఈ విధంగా వారి రచనలు వెలువడటం అస్మదాదులందరికీ అపరిమితానందాన్ని కలిగిస్తున్నది.
కవిత్వం, పాండిత్యం, పరిశోధనం, ఆచార్యత్వం, వక్తృత్వం, మిత్రత్వం ఏకీకృతమైన రూపం ఆయనది. ఇతోధికమైన గ్రంథాలు ఆయన నుండి వెంట వెంటనే వెలికి రావాలని కోరుతూ నా “ముందు మాట" ముగిస్తున్నాను.
- డాక్టర్ కరుణశ్రీ