వావిలాల సోమయాజులు సాహిత్యం-1/శివాలోకనము/బృహన్నలాశ్వాసము
'బృహన్నలాశ్వాసము'
(ఉత్తర గోగ్రహణవేళ కౌరవసైన్యములు గెల్చి గోవులను మరలించుకొని వత్తునని వచ్చి శత్రువ్యూహముల తిలకించినంతనే భీతివడి పారిపోవుచున్న ఉత్తరునితో బృహన్నల)
చ. "కురుపతి సైన్యముల్ వెలుచ క్రొవ్వెనె! గోవులఁ బట్టి యేగెనే
యరమర లేక! వారు వివిధావదోహలు నైన నన్నునున్
బరిగణనంబు సేయరె! శుభస్థితి వారికి జెల్లె నింక స
త్వరముగఁ బూన్చుడీ రథము దారుణచాపశిలీముఖాదులన్.
చ. "అనిమిషకోటి నాజి విబుధాద్భుతవిక్రముడై జయించి య
త్యనుపమకీర్తియై వెలుగునట్టి పృథాసుతు కెందునైన నే
నెనయగువాఁడ - కౌరవుల కెల్లి రణాంగణమందుఁ జూపి నా
ఘనతర యుద్ధకౌశలము క్రమ్మర దెచ్చెద గోధనంబులన్.
శా. "కల్లోలంపడఁ గ్రీడి వచ్చె నని సంగ్రామక్రియాశ క్తి సం
పల్లాభుల్ కృప ద్రోణ భీష్ములె ఘనభ్రాంతిన్ ననుఁ జూడ వి
ద్యుల్లోకోజ్జ్వలకాంతుల న్మెరసి శత్రువ్రాతమున్ గెల్చి యో
చెల్లీ! తెచ్చెద బొమ్మ పొత్తికల నీ చిత్తంబు రంజిల్లగన్.
చ. "కొని యిదె వత్తు గోవుల నకుంఠితశక్తి" నటంచు నంగనల్
మనమున నుత్సహింప పలుమాటలు, మేటిగ బల్కి వచ్చి నీ
వనిమొనఁ జేరలేదు, రిపునైనను గల్గొనలేదు, వారు ని
న్గన రిసుమంత యైనఁ నిటుభీరుడవై పరువెత్త బాడియే?
మ. "అకృతాస్త్రుండను బాలుఁడన్ కదనవిద్యాప్రౌఢి పొల్పారు న
య్యకలంక ప్రతిభా సమగ్రు లగు భీష్మాచార్యద్రోణాధి నా
యక సంలక్షిత శత్రుసైన్యముల మారై నిల్చి పోరంగ నే
నకటా! చాల, బృహన్నలా! విడువు మం చర్ణించుటల్ క్షాత్రమే!” 5
ఉ. శ్వాపదమేదుర మ్మయిన చండమహాటవి జొచ్చుతీరునన్
భూపకుమార! భీతివడిపోయెదు, మత్స్యకులోద్వహా! ఇటుల్
తాపముఁ జెంద నేమిటికి? తాల్మిమెయిన్ రణకాణయాచి యై
యీపృథివిన్ సుకీర్తి వెలయించిన వంశయశమ్ము నెంచుమా!
ఉ. ధూర్తులు ధార్తరాష్ట్రులిటు తోయధులై మనపైబడంగ స
త్కీర్తి గడించు కాల మరుదెంచిన తృప్తిని వీరపాణివై
వర్తనకేళి సల్పి, యట వచ్చి నిజప్రజ మెచ్చ - నిట్టుల
త్యార్తిని మున్నె వెన్దిరుగు టయ్యొయు! యారయ నాత్మహత్య యౌ!
ఉ. ఉత్తర కేను లాస్యము, లయోచితరీతుల నేర్పువేళలన్
గ్రొత్తవి చెల్లి యేమి యనుగుంగతులం దగ నేర్చె వాని నీ
చిత్తము కెక్క ఁ జూచి పటుశేముషి నా కట వీరనర్తనో
ద్వృత్తగతుల్ నటించి మురిపించిన నెమ్మది నెంత మెచ్చితిన్!
ఉ. “కీచక కాలమేఘ మపకీర్తుల లొనరింప క్రమ్మి య
త్యాచరణాళి రాజ్యమున కంతటికిన్ పెనుభీతి నిచ్చు, సం
కోచము మాని బంధు వని క్రుద్ధమహానిలలీల త్రోలి ధ
ర్మోచితరీతి దేశమున నొప్పఁగ నిల్పెద నన్న పొంగితిన్.
చ. "కురుబల మెత్తి వచ్చి మనగోవులఁ బట్టిన దాని గెల్చి క్ర
మ్మరఁ గొనితేర శౌర్యమహిమంబున నెక్కటి వీరమూర్తినై
యరిగెడివేళ తేరికి బృహన్నల సారథియైన జూచువా
రం! పురిలోన నింతకరవా రథచోదకు లంచు నవ్వరే!”
చ. అని మును మాలినీరమణి యయ్యెడ సారథిగాఁగ నన్ను గై
కొని యని కేఁగు మంచు తనకుం గల సూచనఁ జెప్పినం నీ
వనినటు వింటి - నందుకు నృపాత్మజ! నా యెద నవ్వుకొంటి - నై
నను నిటు భీరుతాగుణగణ ప్రబలార్హుడ వం చెరుంగబో! 11
ఉ. ఆహవ మన్న భీతిల జనాధిపనందన! నీ కి దేల? సో
త్సాహుఁడ వై వినీలజలదక్రియ నిల్చి రణానఁ గౌరవ
వ్యూహముల న్నిశాతవి శిఖోజ్జ్వలవృష్టిఁ దపింపఁజేయ స
మ్మోహనసాంపరాయచణభూరిరిరంస వహింపఁగాఁదగున్.
చ. అనయముఁ గోరి 'అల్లుడ నయో, యల పార్థున కే' నటంచు నీ
వనియెడు మాటలం దలఁచి, యంతిపురమ్మున క్షాత్రమూర్తివై
చనియెడు వేళఁ జూచి పదచాలనవైఖరి, మేనమామ చా
లనుకొని యెంత సంతసము నందితి నుత్తర, నా మనమ్మునన్,
ఉ. "ఆటకొ, పాటకో కడఁగు మన్నఁ దగున్ రిపుఁ గెల్వఁగోరి యి
ప్పాటునఁ పోటుబంట వయి భండనభూమికి నేఁగువేళ వై
రాటి! రథంపు సారథిగ రమ్మని పిలువు, పేడి నైన నే
నేటికి నీకు సాటి యగు నెవ్వని నైనను బిల్వ యోగ్యమౌ”
చ. అని మును నేను వల్కినపు డద్భుతవీరరసాతిరేకతన్
గని జగదేకవీరుఁడవుగా నెది వల్కితొ దాని నెల్ల నీ
మనమున నెంచి, కాని యనుమానములన్ దిగబుచ్చి, లెమ్ము, నీ
కెనయగు వీరమాని జనియించునె కొన్ని యుగాల కేనియున్?
ఉ. గోధనమున్ గ్రహించి తమకుం జిరకీర్తిగ శాత్రవాళి ని
ర్బాధితులై చనంగ, సమరక్రియ కీవు జనించి, యస్త్రవి
ద్యాధనసంపదన్ గొని, మహత్తరవీర పరిశ్రముండ వై
యో ధరణీశనందన! మహోద్ధతిఁ జూపకయుంట పాడియే?
ఉ. ప్రాణము లింత తీపయినఁ బైకొను మృత్యు వనుక్షణమ్ము - ని
ద్రాణములై నశించు శుభదంబులు శక్తు లవెల్ల - యుద్ధపా
రీణుఁడ వోయి నీవు, నిటలేక్షణవీక్షణ నీకు నౌ తను
త్రాణము, భావిమత్స్యజనతాపతి నీవు విరాటనందనా! 17
ఉ. చచ్చిన వచ్చు స్వర్గ మిట సంగరభూమిని గెల్పుగొన్నచో
వచ్చు ననంతగౌరవము, బంధురకీర్తియుఁ - గాఁన, పూని వి
వ్వచ్చుఁడ వై, రిపువ్రజము పైఁ బడి, సింహకిశోరలీలల
న్మెచ్చఁగ శాత్రవేయు అనిమేషమహత్త్వముతోడఁ బోరుమా!
ఉ. ఏగతి బోధచేసినను నించుక యైన మరల్పవోయి నీ
భీగతచిత్తవృత్తి - నిఁకఁ బేడిని నాపయిఁ బడ్డ దెల్ల యు
ద్యోగము - పొంగి పొర్లి కడలొత్తెడు మామక శత్రుభంజనో
ద్వేగము నాపఁజాల, రిపువీరులపైఁ బడ నిశ్చయించితిన్.
ఉ. గోహరణమ్ము నొక్క యవకుంఠనగా గొని ధార్తరాష్ట్రు లు
త్సాహము నొంది పాండవులు సల్పెడి, మీకడ గూఢవృత్తి క
త్యాహితముం బొనర్ప నిటు లర్థిని దిక్కుల రెంట నొక్క మా
రూహ యొనర్చి పట్టిరి రయోద్ధతి మీదగు నాలమందలన్.
చ. అమితవిచిత్రరీతిఁ గనులందునఁ బ్రశ్న మెలర్పఁ జూతు వో
యమలినచిత్త! మత్స్యమనుజాధిపు గొల్చుచు నొక్క యేడు గా
సముచితదాస్యవృత్తిఁ గెలసంబునఁ బాండవు లున్నవారు ఆ
సమయము దీరె భాస్కరుడు చయ్యనఁ జేరఁగ నింగి నచ్చటన్.
ఉ. కారణజన్మమై తనువికార మ దించుక గల్గినన్ మహా
వీరుఁడ నయ్య నేను పృథివీవరనందన నాడు కోర్కె మైఁ
తేరు చరించెనేని కురుధీరులె కాదు, సమస్తవీరులున్
స్థిరమతి నిల్చినన్ జయము దెత్తును - తథ్యము రాజనందనా!
చ. ఇదె, కనుమా, బృహన్నలనె? ఏగతిఁ బుంస్త్వము నన్నుఁ జేరి తా
నుదితమనోజ్ఞమోహనత నున్నదొ యీ తనువెల్ల నిండి - నా
యెదకడలిన్ సుడుళ్లుగొని యెల్ల జగమ్ముల ముంచియెత్త నౌ
నదయత రేగు రౌద్రరసహారివిజృంభణ లేమి సెప్పుదున్? 23
చ. మతిపస, బాహుశక్తి, యతిమానుషవీరవిభూతి నొప్పి సం
తతఘనభైరవార్చనల దర్పితుఁడై వెలుగొందు నా జరా
సుతు, మురవైరి యీర్ష్యపడు శూరతమైఁ బ్రథనోర్వి సప్తవిం
శతిదినముల్ యెదిర్చి తుది జంపిన భీమున కేను తమ్ముడన్.
మ. అకలంకోజ్జ్వలబాహుదర్పమున నుద్యద్దైర్య హేమాద్రి యై
బక కిమ్మీర జటాసుర ప్రతతికిన్ బ్రాణాంతకుం డై తిరం
బొక విఖ్యాతి గడించి మా కొసఁగె నే యోధానయోధుల నితం
డొకఁడే కీచకుఁ గాముకున్ చదిపి ప్రాణోత్సర్గఁ గల్పించెఁబో!
మ. నతనానావనినాథ దివ్యమకుటన్యస్త ప్రభారత్నదీ
ధితు లెవ్వాని పదాబ్జకాంతులు సముద్దీపించి త్రైలోక్యవి
ద్యుతులై వెల్గెనొ రాజసూయమఖసంస్తుత్యక్రియావేళ నా
యతిలోకుం డగు ధర్మజప్రభుని రాజ్యం బెల్ల నా గెల్పె యౌ.
ఉ. ఊర్జితశక్తియుక్తి మహితోదయ శౌర్యరసప్రభావ వి
స్ఫూర్జితధైర్యధుర్యుల, విశుద్ధయశస్కుల, గాఢసాధనో
పార్జితభీమభైరవరణాంచితులన్ రిపుల స్థాయించు నా
'అర్జున' నామధేయుఁడను ఆ 'విజయుండ'ను నేనె ఉత్తరా!
చ. అదె యుపగూహనోజ్జ్వలత నా తపనీయజలేజకాంతి ను
న్నది పృథుసర్పదర్పమున గాండివ మా పెనుజమ్మిపైన - మ
త్కదనకఠోరబాహువులఁ దాండవమాడఁగ నద్ది, నిల్చి నే
నెదిరిన నింద్ర సైన్యముల నైన జయింతును రాజనందనా!
చ. కొలువునఁ గంకుభ ట్టనఁగఁ గ్రుమ్మరు నట్టిఁడె ధర్మజుండు - మీ
వలలుఁడు భీమసేనుఁడు, అపాకృతపౌరుషశక్తియుక్తిమై
లలితకళాగురుండ నయి లాస్యము నేర్పితి ఫల్గుణుండ - ను
జ్జ్వలులు కవల్ త్వదీయహయ శాసకగోగణదక్ష శిక్షకుల్. 29
చ. కనుఁగొన నగ్నికీల యను గౌరవభావ మెలర్పఁజేసి 'మా
లిని' యను పేర మిమ్ము నలరించుచు, మీకడ గట్టువాలుగా
మని, తుదిఁ గీచకాధము నమాన్యవిచేష్టలఁ జిక్కి స్రుక్కి, వా
నిని మడియింపఁజేసిన యనిందితదివ్యచరిత్ర 'కృష్ణ' యౌ.
ఉ. మోహముదీర నింక రథముం గొని ర మ్మిట కేను వైరిసం
దోహము నొంప సింహగతులన్ జన సారథి వౌట కీవు వ్యా
మోహపడన్ దగున్ - అధిపుపుత్రుఁడ! అల్లుఁడ! ధన్యుఁజేతు నే
నాహవభార మందుకొని యంతయుఁ దీర్తును సవ్యసాచి నై.
ఉ. సంతస మయ్యెనా? సమరసంభృతి కేను గడంగ ధీర ధీ
మంతుఁడ వైతివే? ఇపుడు మా రథసారథి వైతి నీవు - ని
శ్చింత రథమ్ము నెక్కి ననుఁ జేర్పు శమీకుజభూమి - వైరిరా
డంతకమూర్తి నై మెరయ నయ్యెడఁ దాల్చెద వీరవేషమున్.
మ. అవనీచక్రము తల్లడిల్లఁ, ద్రిదివం బాకంపమున్ బొంద, ది
గ్వివరమ్ముల్ చలియింప, నుద్గురకులోర్వీధ్రమ్ము లల్లాడ న
ర్ణవముల్ పెల్లు కలంగి ఘోష లిడ రుద్రప్రౌఢహాసోద్భటా
రవశంఖం బగు దేవదత్తమును దర్పంబొప్ప పూరించెదన్.
శా. చండీశోద్ధతకార్ముకోపమమహాచాపమ్ము, సంబుద్ధమ
ద్గాండీవమ్ము ధరించి, వీరగతి విక్రాంతిన్ రథం బెక్కి, యే
చండాంశుంబలె వెల్గుచు న్గదలి యా శత్రుక్షమానాథుకుం
గుండెల్ దల్లడిలంగ విన్చెదను జ్యాఘోషం బపూర్వంబుగన్.
ఉ. అచ్చట శత్రుమారణనయాంచితకేళి కుపక్రమింప నే
వచ్చెద - నాహవావని నవారణఁ జొచ్చెద, నా గురుండు వి
వ్వచ్చుఁడు వచ్చినాఁ డని కృపామతి మెచ్చఁగఁ, తాతయుం గడు
న్నచ్చిక దీవనల్ గురియ నాటెద వందనమార్గణద్వయిన్. 35
(అముద్రితం, 1965 జనవరి)