Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-1/ఉపాయనలు

వికీసోర్స్ నుండి
అంకితము

మహావిద్వాంసులు, పుణ్యమూర్తులు, గురుతుల్యులు ఆప్తమిత్రులు, స్వర్గీయులు శ్రీ ఓరుగంటి నీలకంఠశాస్త్రి మహాశయులకు “యాదేవీ సర్వభూతేషు స్వరరూపేణ సంస్థితా

నమస్తస్యై సరస్వత్యై నమస్తస్యై నమోనమః!

శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస

ప్రశంస

సీ|| అభ్రగంగాపగాశుభ్ర శీతలధార కుపమ నీకవితయొక్కొక్క చోట
ప్రావృట్పయోధర ప్రబలగర్జనభాతి గంభీరమౌచునే కవితవెల్గు
మందారమకరంద మత్తషట్పదగీతి సదృశ మెవ్వని పదజాలమొప్పు
వాణీసతీమంజు వీణాస్వనద్గీతి వలెనే మహామహు వాణివెలయు


తే॥గీ॥ అష్టభాషావిశారదుడయ్యె నెవడు?
"హరికథా పితామహుడంచు" బరగె నెవడు
అట్టి శ్రీ ఆదిభట్ల వంశాబ్ది చంద్రు
మాన్యు, నారాయణాఖ్యు, నమస్కరింతు.


ఉ|| కాలికి గండపెండెరము, కంఠమునందు సువర్ణహారమున్
వ్రేళ్లకునుంగరంబులును, వీరరసంబునుజూపు మీసముల్
ఫాలమునందుబొట్టు, తలపాగయునొప్పగ, కంకణంబులం
దాలిచియున్న పూజ్యు హరిదాస శిఖామణి సన్నుతించెదన్.


తే॥గీ॥ సకలశాస్త్రంబులనియెడి సాగరాన
గలజలముద్రాగినట్టి యగస్త్యుడితడు
సకల హరిదాస జీవనాధార మితడు
ధాత్రి "పుంభావవాణి" యీ దాసుగారు.


మ॥ ధరనారాయణ పాదపద్మ మకరందాస్వాదనానంద సం
భరితాంతః కరణుండు, భవ్యకవితాపారీణుడున్, విప్రశే
ఖరుడున్, యోద్ధ, మహర్షి, సర్వలోకస్తుత్య సామ్రాట్టు శ్రీ
వరనారాయణదాసవర్యుగొలుతున్, వాణీస్వరూపున్, మదిన్.

తే॥గీ॥ పండితులందు నుద్దండపండితుండు
            విశ్వవిఖ్యాతచరితుడై, విజయనగర
            వాసియై, వైణికుండునై వాసిగాంచు
            హరికథాతాపితామహుడుగు గురుని దలతు ॥

రచయిత, కవిశేఖర, భాషాప్రవీణ

పంతుల సూర్యప్రకాశరావు,

రిటైర్డు-తెలుగు పండితుడు

చాపర శ్రీకాకుళం జిల్లా-23-3-91

“ఉపాయనలు” కావ్య ముద్రణద్రవ్య ప్రదాత

-శ్రీ కూనిశెట్టి ఆత్మానందం

ప్రశంసా దశకం

“మద్దినా” రల్లుడవు అత్యమంద బుద్ధి
విద్య లార్జించి “ఆనంద”! విమల చరిత !!
పేరు ప్రఖ్యాతులను పొంది పిన్ననాడె
ఆర్యవైశ్య శిఖామణి వైతి నీవు.

నీవు "భారత వాణిజ్య నిలయ” మునకు +
రెండు మారులు పెద్దవై యుండునపుడు
పాలనా దక్షతన దాని బాగుపరచి
నడుపుటే సాక్షి విన్నాణ విజయములకు.

సరస మోహన రమణీయ సరణి నడుప
నీ కలంజ + వాణిజ్యమ్ము నిస్తులముగ
పెరిగి యొనరించె చిన్ని కుబేరు నిన్ను
గుప్తదాతవు ఎందరి కోరికలకొ !

సజ్జనుండవు “ఆనంద”, సదయహృదయ !!
వ్యసన రహితత, పరమ దుర్వారశక్తి,
స్వేచ్ఛ, ప్రజల క్షేమమ్ము వాంఛింతు వీవు
ప్రౌఢ సాహిత్యవరు లన్న భక్తి నీకు.

ఆ రసాయనశాస్త్ర విద్యాధికుడవు[1]
అయ్యు వ్యాపారరంగ మధ్యమ్ము నుందు

_____________________________________________________________ “ఇందియా కామర్సు ఇనిస్టూట్ + పొగాకు వ్యాపారము కలంజము= (ధూమపత్రానికి) పొగాకుకు పురాతనకాలంలో ఉపయోగించిన సంస్కృత పదము - చూ. భార.

_____________________________________________________________


ధ్రువుని[2] పోలిక వెల్గొందు తొలిదినాల
యందె మిత్రుల మైతి మత్యంత రక్తి.

గొప్పకవి “వావిలాల”ను “కూనిశెట్టి”
గౌరవించెడు శిష్యత, గాఢ శ్రద్ధ
నీ “ఉపాయన" ముద్రణ కీ వొసంగు
నీ సహాయము నాకు సంతృప్తి నొసగె

నీపు పట్టాభిపురమున నెగడి యున్న[3]
సత్యనారాయణ స్వామి సదనమందు
వరలు నగరాజ పుత్రి పార్వతిని ప్రీతి
దత్తు గొంటివి దేవతా ధర్మకార్య.

కీర్తి నిష్కాముడవు నీవు కెరలు కాంక్ష
భాజనల, పాత్రలను సమర్పణము చేసి,
నగల, వసనాల సమ్మోహనగ నొనర్చి,
అర్చ నాదులు జరిపింతు వమ్మ కీవు.

మాఘ పూర్ణిమ న్నీవు సుమాన్య గతుల
భావ వైభవ సంపత్తి, ప్రగతి భక్తి
అంబ పార్వతీ దేవి కళ్యాణ కృతిని
సలుపు టీక్షింత్రు శంకర స్వామి సతులు -

కనకదుర్గాంబ, భ్రమరాంబ, కాశిలోన
'వజ్రభైసిక' హస్తాన వరలు తల్లి,
అందరకు భుక్తి నిచ్చు నా అన్నపూర్ణ
పరమ శుభములు నీకు సంప్రాప్తమౌను.

2-14-130/2, శ్యామలానగరం గుంటూరు - 522006 (ఏ.పి.)

కర్రా ఈశ్వరరావు, శ్రీ "హరికథా పితామహ” సామాన్య ప్రచారక మాననీయుడు

________________________________________________________________________________ వజ్ర భైసిక - కాశీ అన్నపూర్ణాదేవి హస్తాన ఉన్న గరిటె (దర్వి, చమనం)ను మనపూర్వులు 'వజ్రభైసిక' అని నామకరణచేసి వ్యవహరించారు. -చూ. మల్లంపల్లి వ్యాసాలు.

________________________________________________________________________________

ప్రస్తావన

ఇయ్యది “మధురకవి”, “కుమార ధూర్జటి”, శ్రీ వావిలాల సోమయాజులుగారు, శ్రీ "శారదావతారమూర్తులు”, “హరికథా పితామహులు", శ్రీమ దజ్జాడాదిభట్ట నారాయణదాస మహోదయులకు సమర్పించిన "ఉపాయనాలు” అను నృత్య, గేయ ప్రబంధము.

శ్రీ వావిలాలవారు విమర్శకాగ్రేసరులు, గురుతుల్యులు, ఆప్తమిత్రులు, నేను 1967లో గుంటూరు వచ్చినప్పటినుండి, ఆచార్య ఎస్.వి. జోగారావుగారు, మహావిద్వాంసులు, గురువులు, స్వర్గీయులు అయిన శ్రీ ఓరుగంటి నీలకంఠశాస్త్రిగార్ల ద్వారా, సోమయాజులుగారు నాకు చాలసన్నిహితులైనారు. నేను దాసభారతీ ప్రచురణల మహాయజ్ఞములో, శ్రీ జోగారాయ మహాకవి, పర్యవేక్షణలో, వెలువరించిన 25 పుస్తకప్రచురణలలో, వావిలాలవారి చేయి కూడ వుంది. ముఖ్యంగా, శ్రీ నారాయణదాసు గారి “నా యెఱుక” అను గ్రంథమునకు సోమయాజులుగారు చక్కని పీఠిక, సోదాహరణముగా, చక్కని ఉపపత్తులతో వ్రాయగా, అది శ్రీ జోగారావుగారి “ఆదిభట్ట నారాయణదాస సారస్వత నీరాజము" అను బృహద్గ్రంథములో వ్యాసముగా ప్రచురింపబడినది. నేను, అప్పుడప్పుడు, వావిలాలవారు అస్వస్థులుగా నున్నపుడు, నీలకంఠ శాస్త్రి గారితో వారింటికి వెళ్ళడము, వారి సాహిత్య సమాలోకనము వినడము తటస్థ పడేది. శ్రీశాస్త్రిగారు కూడ దాస భారతీ గ్రంథములకు, అనేక పర్యాయములు పీఠికలు, వ్యాసములు (సంస్కృతములో, తెలుగులో) వ్రాసి ఆ గ్రంథములు పటుత్వమునకు దోహదము చేసిరి. శాస్త్రిగారి నిర్యాణము తరువాత గూడ వావిలాలవారి యోగక్షేమములు తెలుసుకొనుటకై వారింటికి వెళ్ళడము జరిగేది. అప్పుడు వారంతట వారు "మీరు ప్రచురించే గ్రంథములకు నా సహాయము కావలె నన్న నేను తప్పక సహకరించెదను” అని చెప్పేవారు.

అలాగే, వారి ప్రోద్బలము, ప్రోత్సాహమే హేతువులుగా ఇటీవల శ్రీ నారాయణదాసు గారి “స్వయంలేఖనము” అనేక ప్రముఖుల అభిప్రాయములతో ప్రచురించడం జరిగింది. 17 సంవత్సరములు వెలుగుచూడని "ఈ గ్రంథము, వీరు చూసి అచ్చు వేయవచ్చును” అని అభిప్రాయము వెల్లడిచేసినదే తడవుగా దాని ముద్రణము ప్రారంభించి క్రిందటి సంవత్సరమే పూర్తి చేయబడినది. ఆ సందర్భములో వావిలాలవారు గూడ వ్యాసము వ్రాయ సంకల్పించి, చివరకు 'గేయ' రూపకంగా వ్రాయుటకు నిశ్చయించిరి. నేను అచ్చువేస్తున్న ప్రతి ఫారము వారికి ఇవ్వడము, వారు వాటిలోని విషయములు సేకరించి గేయంలో నిబద్దం చేయడం జరుగుతుండేది. అలాగ వ్రాస్తూ, వ్రాస్తూ ఈ “ఉపాయనాలు” చాలా పెద్ద గ్రంథమై అచ్చులో 70 పేజీలు ఆక్రమించినది. అందువలన, వారి అనుమతితో "స్వయంలేఖన" గ్రంథములో 8 పేజీలు మాత్రమే వేయుదును - తరువాత సావకాశముగా దీనిని వేరే పుస్తకముగా ప్రచురించెదను” అని చెప్పగా వారు సరేననిరి. ఇది, ఈ గేయప్రబంధము యొక్క ఆవిర్భావ స్వరూపము. వారు దానికి సంబంధించిన మాత్రా ఛందస్సులో, నృత్యాభినయముకు అనుకూలముగా ఈ గేయము సాగినది. ఈ వినూత్నమైన ప్రక్రియ ద్వారా “దాసభారతి”కి వన్నె తెచ్చినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు సమర్పించుకుంటున్నాను.

అనుకోకుండా, వెల్కమ్ ప్రెస్లో తరచు శ్రీ వట్టిపల్లి మల్లినాథ శర్మగారిని కలుసుకోవడం తటస్థపడేది. నేనూ, వారు ఇంచుమించు ప్రతిరోజు, ప్రెస్ ప్రూఫులు దిద్దుకొనుటకు కలుస్తూ ఉండేవారము. "స్వయంలేఖనం" అచ్చు అవుతున్నపుడు వారిని కూడ, అది చదివి అభిప్రాయమును వ్రాయవలసినదిగా కోరగా, వారు చదివి చక్కని వ్యాసము వ్రాసిఇచ్చిరి. తదుపరి వారికి గూడ ఆటోరైటింగ్లో ప్రవేశమున్నదని తెలసుకొని ఆ సాహిత్య ప్రక్రియ మీద కూడ వ్యాసము వ్రాయమనగా రెండవ వ్యాసము వ్రాసిరి. ఇవి రెండు "స్వయంలేఖనం"లో ప్రచురిత మయేయి. ఆ సమయములో వావిలాల వారి "ఉపాయన”లు ఫెయిర్చేసి నాకు అందించగా అది వట్టిపల్లి వారికి చూపి దాని మీద వారి అభిప్రాయము కోరగా “దిక్సూచి” అని పేరుపెట్టి ఒక విపులమైన వ్యాసమును వావిలాలవారి గ్రంథమునకు అనుబంధుగా ఉండేటట్టు అనేక విషయములు ప్రస్తావిస్తూ వ్రాసిరి. అది అసలు గ్రంథమును విశదీకరించేదిగా వ్యాఖ్యానముగా ఉన్నందువల్ల పాఠకుల ఉపయోగార్థం గ్రంథములో పాటు వెనుకను అచ్చు వేయడం జరిగినది. ఈ వ్యాసము అసలు గ్రంథమునకు వన్నె తెచ్చినది. శ్రీ వావిలాలవారు అది చదివి బ్రహ్మానందభరితులైనారు. శ్రీ వట్టిపల్లి వారు, పాఠకులకు ఉపయోగపడేటట్టు చక్కని, చిక్కని వ్యాసము అనేక ప్రమాణములతో వ్రాసి మాకు ఇవ్వడం ఈ గ్రంథమునకు భూషణమువలె ప్రకాశించినది. వారికి నా నమస్సుమనస్సులు. ఇంకొక విశేషం శ్రీ వావిలాలవారికి, వట్టిపల్లి వారికీ, నాకునూ అత్యంత సన్నిహితులు, ఆప్తమిత్రులు, హితులు, పరమపూజ్యులు, సత్యధర్మ రతులు, ఉపనిషద్మార్గ ప్రవర్తకులు అయిన బ్రహ్మశ్రీ ఓరుగంటి నీలకంఠశాస్త్రి గారికి ఈ కృతిని అంకితము చేయటం చాలా సముచితంగా ఉంది. శ్రీ నారాయణదాస అభిమానులు, దాసభారతీ సేవలో అనేక సూచనలిచ్చి, వ్యాసములు వ్రాసి మమ్ముల నందరను ముందుకు నడిపించి ప్రోత్సహించిన మహనీయులు శ్రీ శాస్త్రి గారు. అట్టివారికి ఈ కృతిని అంకితము చేయవలెనన్న కోరిక శ్రీ వావిలాల వారికి కలగడం చాల ముదావహమైన విషయము.

ఇక, శ్రీ నారాయణదాస సాహిత్యమును ఆపోశనపట్టి, ఆచార్య జోగారావుగారి వద్ద శుశ్రూష చేసి వారి పిహెచ్.డి. కొరకై శ్రీ నారాయణదాస వైభవమును అనేక కోణములనుండి దర్శించి "శ్రీనారాయణదాస దర్శనము” అని ఒక పరిశోధన గ్రంథమును, ఏ విషయము వదలక ప్రచురించిన, సాహితీ పోషకులు శ్రీ గుండవరపు లక్ష్మీనారాయణగారు శ్రీ వావిలాల వారి "ఉపాయనలు" మీద అభిప్రాయము వ్రాయవలెనని పట్టుబట్టగా, వారు అనేక కార్యభార వ్యగ్రులై ఉన్నప్పటికిని వారి వ్యాసమును మాకు అందజేసి నందుకు వారికి కూడ సాంజలి బద్దుడనై నా ధన్యవాదములు సమర్పించుకొనుచున్నాను.

అలాగే, శ్రీ నారాయణదాస స్వరూపమును, ఆకలింపు చేసుకొని, వారికి ఒక విధముగా భక్తులు అనిచెప్పుకోదగిన వ్యక్తి “సాహిత్య సార్వభౌములు”, “వ్యాకరణ ప్రవీణులు”, “విమర్శకాగ్రేశ్వరులు” నాకు ఆప్తమిత్రులు, అయిన శ్రీ కోగంటి వారిని, వారి అభిప్రాయ మిమ్మని కోరగా వెంటనే మాకు వారి వ్యాసము వ్రాసి ఇచ్చి నందుకు నా సంతోషమును వ్యక్తముచేస్తూ వారికి నా ప్రణామములు అర్పిస్తున్నాను.

చివరకు, “మహానటులు,” పద్యములు చక్కని రాగములతో పాడగల సమర్థులు “సాహితీ ప్రియంభావుకులు”, ఉపాధ్యాయవృత్తి నుండి ఇటీవలనే విరమించి విముక్తుడై విశ్రాంతి తీసుకొనుచున్న శ్రీ అన్నపర్తి సీతారామాంజనేయులుగారు కూడ వారి అభిప్రాయమును ఇచ్చి, ఈ గేయ ప్రబంధమునకు వన్నె తెచ్చిరి, వారికి నా నమస్కారములు.

ఇక చివరి మాట - నేను దాసభారతీ ప్రచురణలకు నా ధనమును వ్యయపరచి అనేక పుస్తకములు శ్రీ జోగారాయ మహాకవి సహకారంతో వెలుగులోకి తేగలిగితిని. ఈ “ఉపాయనల" ముద్రణ భారము వహించడం ఎలాగ అని ఆలోచిస్తూ వుంటే, నా స్మృతిపథంలో ఒక వెలుగు వెలిగినట్టుగా, నాకు అత్యంత సన్నిహితుడు, ప్రియమిత్రుడు, అయిన ఒక వణిక్ ప్రముఖుడు మెరిసినాడు. ఆయన హిందూకళాశాలలో శ్రీ వావిలాలవారి శిష్యులు, భక్తులు, వారి ఉపన్యాసధోరణికి ముగ్ధులై, నాతో పదేపదే చెప్పుతుండేవారు. వారిని కోరగా అలాగే అని దీని ముద్రణభారము వహించి నా పనిని తేలిక చేసినందుకు వారికి నా కృతజ్ఞత తెలియచేయు చున్నాను.

ఈవిధంగా ఇంతమంది సహకారంతో ఈ గేయ ప్రబంధం వెలువడి, దాసభారతికి, సాహిత్య సరస్వతికి తలలో ఒక పుష్పముగా వెలుగొంది, పాఠకులు దీనిని ఆదరించి స్వీకరిస్తా రని నమ్ముతూ ఈ ప్రస్తావన ఇంతటితో ముగిస్తున్నాను.

బుధజన విధేయుడు

కఱ్ఱా ఈశ్వరరావు

(దాసభారతీ ప్రచురణ కర్త)

గీతాంజలి

'మహావిద్వాంసులు', 'సంస్కృతాంధ్రకవీంద్రులు

'పరమపౌరాణికులు'

శ్రీ కోగంటి సీతారామాచార్యులు

“కుమార ధూర్జటి" శ్రీ వావిలాల సోమయాజులుగారు “ఉపాయనలు" అనే ఒక గీతమాలికా రూపంలో నారాయణదాస స్వరూపాన్ని మొత్తాన్ని సంగ్రహంగా దర్శింపచేసే గ్రంథాన్ని వ్రాశారు. సాధారణంగా నారాయణదాస సంబంధి గ్రంథాన్ని శ్రీ కఱ్ఱా ఈశ్వరరావుగారు అచ్చు వేయిస్తారు గావున ఈశ్వర, సోమయాజుల హృదయ ధర్మాలు రెండూ కూడా పాఠకలోకానికి విదితచరములే!

ఈ సోమయాజులుగారిని నేను “అన్నగారూ” అని పిలుస్తాను. వారు నన్ను సోదర వాత్సల్యంతోనే చూస్తారు. ఈశ్వరరావుగారు, సోమయాజులుగారు కూర్చుని మాటాడుతుంటే రెండు కైలాసపర్వతాలు సూక్ష్మాకారంతో మాటాడు తున్నట్లే అనిపిస్తుంది నాకు మాత్రం, వీరి హృదయాలకు రెంటికీ ఆత్మసంబంధమైన శ్రీమన్నారాయణదాసు మాత్రం మధ్యలో మహామేరువువలెనే భాసిస్తాడు. ఆకారంలో వర్ణంలో ధైర్యంతో మాత్రం పోలికగాని, విద్యావిశేషాల్లో ఏమీ పోలికలేనే లేదు. ఆ మేరువు చరంగాదు. ఈ నారాయణదాస మేరువు జంగమం. ఆ మేరువు నాశ్రయించినట్లే సమస్త దేవతా సమూహం ఈ మేరువును కూడా ఆశ్రయించుతారు. ఆ పర్వతం మీద దేవతలు విహారం చేస్తారు. ఈ పర్వతం యథేచ్ఛాసంచారం చేస్తూ నానావిధ నృత్యభంగిమలను ఒలకపోస్తూంటే దేవతలు విధేయులై ఒదిగి ఉంటారు. అంతే తేడా.

ఆ మేరు పర్వతం ప్రక్కన ఉన్న ఈ చిన్న కైలాసాలు మనస్సులోకి వస్తే ఎంతో మైమరపించే ఆనందం పొంగి పొరలి తరంగాలుగా తూగి వస్తూంటుంది. మనస్సుతో చూచే అలవాటు ఉంటే ఆ దృశ్యాన్ని దర్శించాలిగాని వర్ణించలేము. మన మేమన్నా కాళిదాసులమా!

ఈ మువ్వురితో బాటుగా మరొక రున్నారు. ఆ మహానుభావుడు అందరికీ కూడా గురుస్థానం. అజాతశత్రువు. తనను తిట్టినా కోపం తెచ్చుకోని శాంతమూర్తి. వారు బ్రహ్మశ్రీ కీ.శే. ఓరుగంటి నీలకంఠ శాస్త్రిగారు. ఈ గ్రంథానికి కృతిపతి వారే! ఈ నలువురూ కూడా నాకు ఆప్తులే వీరిలో ఈశ్వర సంబంధం నాకు మెండు. శ్రీ మన్నారాయణదాస సంబంధం నాకు ఆత్మ సంబంధం. కాబట్టి నా అంజలి ముఖ్యమే!

దాససాహిత్యాన్ని మొత్తాన్ని సమీక్ష చేయించి హేమా హేమీలచేత పెద్ద పెద్ద వ్యాసాలు వ్రాయించి అన్నింటినీ ప్రచురించి శ్రీ ఈశ్వరరావుగారు తెలుగు భాషకు, తెలుగు వారికే కూడా మహోపకారం చేసాడు. ఈ మొత్తానికి “మహాచార్య” శ్రీ జోగారావుగారు సారథ్యం వహించారు. కాబట్టే వైవిధ్యంతో పాఠక మనస్సులకు మహానందాన్ని కలిగిస్తూ ఆ సారస్వత ప్రపంచం అవతరించింది.

ఈ మధ్యకాలంలో "స్వయంలేఖనం” అనే ఒక అంశం మనదేశంలో అక్కడక్కడా వెలిసింది. "స్వయంలేఖనం” అంటే తమ చరిత్ర రహస్యాలను తామే వ్రాసుకోవటం, మరణించిన తర్వాత తామే వ్రాసుకోవడం ఎక్కడ జరుగుతుంది? అంటే ఆత్మశక్తి తమకు అనుగ్రహం కలిగిన వారి యందావహించి వారి కథనే వారే చెప్పుకోవటం లేదా వ్రాసికోవడం జరుగుతుంది. దాన్నే స్వయం లేఖనం అంటారు. ఈ మాట అనువాద రూపంలో వచ్చిందికాని స్వతస్సంభవం కాదు. "ఆటో రైటింగు” దీనికి మూలం.

కొందరు ఇది మాత్రం కుదురుతుందా? అనవచ్చు. కుదురుతుంది. మహాభారతంలో గాంధారీ, ధృతరాష్ట్రుడు మొదలైనవారు వ్యాసభగవానుణ్ణి దుర్యోధనాది బంధువర్గాన్ని చూపుండని కోరితే వ్యాసులవారు వారికి బంధువర్గాన్ని మొత్తాన్ని చూపించారు. అంతేకాదు. శ్రీ రామాయణంలో కూడా దశరథుడు పరమేశ్వర విమానంలో వచ్చి దర్శనమిచ్చి రామునితో, మాటాడటం మనకు తెలుసు. అదెలా కుదురుతుందో ఇదీ కూడా అంతే!

అందరికీ ఇలా రావటంలేదే అనవచ్చు. అందరికీరాదు. ఆ అపూర్వయోగశక్తి ఉండాలి. అప్పుడు రావాలి. యోగం అంటే తెలియనివారు స్వయం లేఖనం చేయలేరు. మన కందరికీ పూర్వజన్మస్మృతి ఉందా? మన కున్నది చేతనైనంత పాపం చేసి ఆ ఫలాన్ని గట్టిగా పట్టుకొని పుట్టి నానాబాధలు పడటం తప్ప ఇంకేమున్నది. ఉత్తమశక్తి ఒక్కటికూడా లేదు. ఉత్తమ విద్య లేదు. అందువల్ల మనకు అంతా చిత్రంగా విచిత్రంగా ఉంటుంది. పూర్వకాలంలో దూరదర్శన దూరశ్రవణాదులుండేవి. ఇప్పుడు లేవు అంత మాత్రంలో ఆ విద్యలు లేనేలే వంటామా? అంటే లోకం ఒప్పుతుందా? విద్యారూపం ఎప్పుడైనా ఎక్కడైనా మారితే మారుతుందేమో కాని నశించడం మాత్రం ఉండదు. అలాగే ఈ స్వయంలేఖనవిద్య కూడాను.

ఆ దాసస్వయంలేఖనాన్ని ముద్రించే విషయంలో ఎంతో ప్రోత్సాహం చేసినవారు శ్రీ సోమయాజులుగారు. వారు బహుభాషావేత్తలు కావటంలో వారి మాట రూపం ధరించి. కొందరు పండితులు, కవులు ఆస్మాదృశులు చెప్పినా దాన్ని అంత పాటికివట్టకపోవటం లోకంలో ఉన్నమాట! కాబట్టి శ్రీ సోమయాజులుగారి ఒక మాట ఒక విలక్షణమైన గ్రంథాన్ని వెలువరిస్తుందన్న మాట!

నారాయణదాసు శారద అని అందరిమాట. అసలు దాసుమాట కూడను కాని మా జోగారావు పద్యం ఈ మాటను కాదంటుంది. వారి పద్యం మాత్రమే కాదు. నా మనస్సు కూడాను. ఈ పద్యాన్ని చిత్తగించి నట్లయితే తమకే తెలుస్తుంది.

ఉ. “నాయవి నాల్గు మోము లవునా? యెటు ముద్దిడె దంచు నల్వ యా
    ప్యాయముగా హసింపగ ననంతముఖన్ నను నెట్లు ముద్దిడం
    బోయెదొ యంచుఁ జెల్వ నగ ముద్దిడెదన్ గనుమంచు నల్వ నా
    రాయణదాసుగాగఁ ద్రపనందు సరస్వతికిన్ నమస్కృతుల్”

సెబాసు జోగారాయా! దాసుకంటే ఘనత దక్కించుకున్నావుగదయ్యా! నలువ నారాయణదా సైతే దాసు కేమీ లేదు. తన అసామర్థ్యానికి సిగ్గుపడుతూ నుంచున్నది సరస్వతి. అననుభూత పూర్వశృంగార విలాస వైభవం సరస్వతీ స్వరూపంలోనుండి మందాక్ష మందాక్ష మధురంగా తన అపజయాన్ని అంగీకరించక తప్పని యిరకాటంలో త్రపనందుతూన్న సరస్వతి సాక్షాత్కారం మా జోగారావుది. స్వాపజయసూచక శృంగార మందహాస సంవలిత త్రపోద్భుతమధుర వీక్షణముల తిర్యగ్వలనములు అంతంతమాత్రమువాళ్ళకు అందవు. ఇప్పుడు మీరు దాసదర్శనం చేయండి. మా ఈశ్వరరావుగారికి ఈ పద్యంలో అందచందాలు చాలా సార్లు వినిపించాను అంతా విని నాకేమీ తెలియదు అంటారు. అలాగే అన్నారు. "పుంభావ సరస్వతి” అంటే చాల గొప్ప అని అందరి అభిప్రాయం. ఈ పద్యం వచ్చిం తర్వాత నా అభిప్రాయం మారింది. ఒక పద్యం చెప్పితే పుంభావ సరస్వతి. ఈ విధంగా సరస్వతీ శబ్ద సంఘటనంతో ఎవరి ముచ్చటను వారు తీర్చుకుంటున్నారు. సంతోషం. అలాంటి మహామహులైన సోమయాజులు గారు దాసుచరిత్రను గేయధర్మిగా వ్రాసారు. శ్రీ సోమయాజులుగారు ఎన్నిపోకడలైనా పోగలవారు. ఎన్ని నడకలైనా నడవగలవారు. ఇది పద్యంగాక, ద్విపదగాక, ద్విపదధర్మగా వ్రాసారు తాళానికి సర్దుకొని, శ్రుతి పెట్టుకొని, తగినవాడు గానంచేస్తే సభ సభంతా తన్మయత్వం చెందుతుంది. ఈ విషయంలో ఏమీ సందేహం లేదు. సోమయాజులు గారి ప్రసంగం గాని, కవితాగోష్టిగాని ఎంతో ఉజ్జ్వలంగా ఉంటుంది. మా "సాహితీ సమితి” ఉత్సాహశక్తి సోమయాజులుగారే! విద్యార్థులకు నోట్సులు వ్రాసే అభ్యాసం బాగా ఉన్నందువల్ల శ్రీ సోమయాజులుగారు ఎంత క్లిష్టవిషయాన్ని అయినా సరే! చాలా సుఖబోధం చేస్తారు. మళ్ళీ యిదేమి అనే ప్రశ్న రాకుండా వివరించడం వారి అపూర్వశక్తి.

ఆకార సదృశమైన ప్రజ్ఞ. ప్రజ్ఞా సదృశమైన ఆగమం. ఆగమ సదృశమైన కార్యారంభం. ఆరంభ సదృశమైన ఉదయం కలవారు మా అన్నగారు. వారు చాలా విధాల సాహితీరంగాల్లో వినూతన ప్రక్రియల్ని సూచించి ప్రయోగంలో సహృదయా నందాన్ని వెల్లివిరియించినారు. ఎందరెందరో దాసచరిత్ర విశేషాల్ని చెప్పితే వాని నన్నింటినీ ఒక సూత్రంలో తార హారంగా కూర్చిన మహాశిల్పి.

దాసుగారిని గూర్చి, శ్రీ ఈశ్వరరావుగారిని గూర్చి, నీలకంఠశాస్త్రుల వారిని గూర్చి, శ్రీ సోమయాజులుగారిని గూర్చి తెలియని వార్వెరూ లేరు. ఇంకా మద్విశిష్టులు చాల మంది అభిప్రాయాల్ని శాస్త్రపద్ధతిలో, లోకపద్ధతిలో, కావ్యపద్ధతిలో అందించారు. కాని నాకు కూడా ఆ పెద్దలతో పాటుగా ఒక పీటవేసి గౌరవాన్ని అనుభవింపచేస్తున్నారు శ్రీ ఈశ్వరరాయ సోమయాజులుగారలు.

శ్రీ సోమయాజులుగారు నిరంతర సారస్వత - వ్రతి. ఎప్పుడూ గ్రంథపఠనం. ఎప్పుడూ లేఖనం. ఎందరెందరికో 'కవిసామ్రాట్', శ్రీ పైడిపాటి సుబ్బరాయశాస్త్రి వంటివారలకు ఎన్నో ఎన్నో విషయాల్ని అందించడం నేనెరుగుదును. వారిని ఒక విధంగా పీఠాధిపతి అనవచ్చును. ఆ వారికి నా పాదాభివందనాలు. ఆ వారి యీ దీర్ఘగీతమునకు నా ప్రణామాంజలి. దానిని గురించిన అంజలి గాబట్టి ఇది “గీతాంజలి” అయింది. ఈ గీతంలో పాటు నా యీ అంజలి కూడా ఉంటుంది. అదంతా ఈశ్వరేచ్ఛ.

'జయన్తి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః'

ఆనందతీర్థాగ్రహారము

కోగంటి సీతారామాచార్యులు

గుంటూరు - 522004

త్రికళోపహారము


“కవితా కళానిధి”, “నటశేఖర”, “కావ్యమర్మజ్ఞ”

శ్రీ అన్నపర్తి సీతారామాంజనేయులు

   'బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
    ఒకరి నొకరు ఏకీ భావ
    వమ్ము తోడ వీక్షిస్తూ
    ఉండగా వారి చూపు
    లకు పుట్టెను ఒక కన్నియ

    అందగత్తె, మహామాయ

పేరు త్రికళ...

(ఉపాయనాలు పుట.)

విధాతృ స్థానీయులు బ్రహ్మశ్రీ వావిలాల సోమయాజులుగారు, నామరూపాభ్యాం నారాయణు లైన హరికథా పితామహులు శ్రీ ఆదిభట్ట నారాయణదాసుగారు. శ్రీ నారాయణ దాస అవతార వైభవ ప్రకాశన మహాయోగ నివిష్టులు శ్రీ కఱ్ఱా ఈశ్వరరావుగారు 'ఒకరి నొకరు ఏకీభావంతో వీక్షిస్తూ ఉండంగా వారి చూపులకు' పుట్టిన 'త్రికళ' యీ ఉపాయనాలు అనే కృతి.

సంగీత, సాహిత్య, నృత్యములనే మూడు కళలూ ముప్పిరి గొన్న హరికథా వైభవ ప్రతిపాదకము గనుక ఇది 'త్రికళ'.

ఈ త్రివేణీసంగమంలో అంత స్స్రోతస్విని యైన 'సరస్వతి' సరస్వత్యవతారమే! ఆ అవతరించటంలో శారదామాత తాను భూలోకానికి అనుగ్రహింపదలచిన ఒక విశిష్ట కళా స్వరూపానికి ప్రాచుర్యం కలిగించటానికి అనువుగా పురుషాకృతి వహించింది.

స్వీకరించింది పురుషాకృతి అయినా, స్త్రీపాత్రారోపణంతో అభినయించే వేళ ఆ నడబెడంగులు, ముంగురులు మురువులు, విలోచన విలాసాలు అతివలకు సైతం అందరానివి. అవతరించిందేమో వాగ్దేవి ధరించిందేమో 'నారాయణ' నామం! ఇందేమి ఔచిత్యం ఉన్నది? ఉన్నదని విద్యావారథులైన శ్రీ వావిలాలవారు వెల్లడిస్తున్నారు.

.............శబ్దమ్ములు
ఎవని వలన బయలుదేరు
అతడు 'రాయణుండు' అతడు
గానివాడు 'అరాయణుండు”
అరాయణుండు గానివాడు
'నారాయణు' డందుచేత
తనవలననె శబ్దమ్ములు
బయలు వెడలు చుంట వలన

'నారాయణు' డయ్యె

(ఉపాయనాలు పుటలు)

నారాయణ శబ్దం వాగ్దేవికి కూడా అన్వయిస్తుందన్న మాటే కదా!

ఇలా పొడిమాటలతో వాచ్యం చెయ్యటం వావిలాలవారి పద్దతి కాదు. వారీ విషయాన్ని వివరించిన తీరుసౌరు గమనించండి.

'దేవదాసి ఒకతెకు ఆ
దీక్షాగుణ లక్షణాన్ని
అవసరమౌ జ్ఞానమ్మును
అభినయ సంక్లిష్టతలను
నాట్య గాన క్లేశాలను
అవగతమ్ము గావింపగ
అభ్యర్థన చేసినపుడు
దృఢతర సద్భావనతో
శిష్యురాలిపై ప్రేమతో
దేవదాసి రూపంతో
స్వయంగాను అభినయిస్తు
చూపి నేర్పగా - వలె నని
.............….........

............................
'నన్ను కనుము, నన్ను వినుము'
ఆదేశము జ్ఞప్తిచేసి
.......................…....

............................
నవ విధ శృంగారమ్ముల
నభినయింప నేర్చు వరకు
శిష్యురాలి విద్య పరా
కాష్ఠ నందుకొనెడి వరకు (ఉపాయనాలు పుటలు)

శ్రీ కృష్ణ ఆలయంలో నిత్యమూ తాను అభినయిస్తూ, ఆమె చేత అభినయింప
జేస్తూ ఉంటే, స్త్రీ పురుషులనేకులు అది చూడటానికి వచ్చేవారు.

దాసుగారు తా నభినయించే టప్పుడు -

….…..…...…...సభను ఉన్న
సర్వజనుల - స్త్రీ పురుషుల
నందరినీ కొంతవరకు
తనవలెనే స్త్రీల జేస్తు' (ఉపాయనాలు పుట)

తాను స్త్రీగా నటిస్తూ ప్రేక్షకులందరూ స్త్రీవద్భావాన్ని భజించేటట్లు చేయడం
కంటె అభినయానికి పరాకాష్ఠ వేరే ముంటుంది.

మరొక విశేషం :

"దేవదాసి కాదలచిన
ఆ గణికా కన్యను తమ
ప్రియురాలిని చేసుకొనగ
మనసుపడుతు ఉన్నవారు
ఆమె నేర్చు విద్య చూడ
ప్రీతితోడ ఆలయాన్కి
అప్పుడపుడు వచ్చి వచ్చి
ఆమె పరాకాష్ఠ నొంది
అభినయించు వేళ చూచి


ప్రేమభక్తిగా మారగ
అపుడు నిల్వలేక ఇర్వు
రీమె మహాదేవు పత్ని
పరమ పుణ్యవతి యయ్యె
...................…..
...............…......
అని అందరు చూచుచుండ
ఆమెకు నతు లర్పించిరి

ఇది దాసుగారి అధ్యాపన అభినివేశానికి, భక్తి ప్రచారార్థంగా తాల్చిన ఆయన
అవతారవైభవానికి అర్పించిన ఒక మహాద్భుతోపాయనం.

శ్రీ దాసుగారి మూర్తికి 'కుమార ధూర్జటి' శ్రీ వావిలాలవారెలా అద్దం పట్టారో
చూడండి.

పెద్ద దయిన తలకొప్పును
దానిపైన రమ్య పుష్ప
గుచ్ఛమ్ములు, ఫాలభాగ
మున కుంకుమ బొట్టు, కనుల
దిద్దుకొన్న కడు నల్లని
కాటుకయును, దేహముపై
లేపనాలు, చందనాది
గంధమ్ములు, అన్యమైన
అంగరాగ భోగమ్ములు
ఆభరణాలును ధరింప
కడు నపేక్ష పురుషుల, సై
తమ్ము మోహపరచు నట్టి
నైజ రమ్య లక్షణాల
...............…......

వ్యాప్తినొందు సురభిళాల
తో నొప్పెడు వేషము”

ఇది ఇలా ఉంచండి. మొదట్లో - త్రికళావిర్భావాన్ని గురించి ముచ్చటించు

కున్నాం. అక్కడ శ్రీ వావిలాలవారు, శ్రీ ఆదిభట్టు వారు శ్రీ కఱ్ఱావారు - ఈ మువ్వురి చూపులకలయిక వల్ల ఈ కావ్యం ఆవిర్భవించింది అనుకున్నాం. శ్రీ వావిలాలవారు శ్రీ కఱ్ఱావారు - వారిరువురి చూపులు కలసినవనటంలో సామంజస్యం ఉన్నది గాని 'హరికథాపితామహుల' చూపు కలిసిందనటంలో సామంజస్య మేమిటి? ఇది ఎలా సంగత మౌతుంది అనే శంక కలుగవచ్చును.

"ఈ సర్వమూ శ్రీ దాసుగారిని గురించే కదా!" అని నే ననబోవటం లేదు.

“స్వయంలేఖనము” అనే ప్రక్రియ ఒకటి ఉన్నది. దానిని ఇంగ్లీషులో 'ఆటో- రైటింగ్' అంటారు.

స్థూల శరీరాన్ని విడిచి గతించిపోయిన జీవాత్మ ఒక మానవుని మీదికి ఆవాహన చేసినప్పుడు, ఆ మానవుణ్ణి ఆవహించి అతనిచేత తాను చెప్పదలచుకొన్నది వ్రాయింప జేస్తుంది. వ్రాసేవాడు ఒట్టి సాధనం మాత్రమే! అతని చేయి, ఆ చేతిలోని కలం కదులుతుందే తప్ప, ఆ వ్రాసే వ్రాతతో అతని కెట్టి సంబంధమూ ఉండదు. వ్రాసేదంతా అతణ్ణి ఆవహించిన జీవాత్మయే. ఇలా గతించిన జీవాత్మకు సాధనంగా ఉపయోగపడేవారు పురుషులూ కావచ్చు స్త్రీలూ కావచ్చు. అయితే అందరూ ఇందుకు పనికిరారు. ఇందుకు సాధనంగా పనికివచ్చే వారు కొందరే ఉంటారు. శ్రీ దాసుగారి స్వయంలేఖనానికి శ్రీ కఱ్ఱా ఈశ్వరరావుగారి ప్రథమ పుత్రిక చి||ల||సౌ|| రాజేశ్వరి సాధనమయింది.


..........ఎపుడో శరీరాన్ని
విడిచి నట్టి దాసుగారు
తనదు జన్మరహస్యాన్ని
ప్రపంచాన్కి బహిర్గతము
చేయటాన్కి శ్రీ ఈశ్వర
రావుగారి ప్రథమపుత్రి
ని చిరంజీవి లక్ష్మీసౌభాగ్యవతిని రాజేశ్వరి
దేవి నొక్క ఉపకరణము
గా గ్రహించి తన అదృశ్య

వాణి నామె కందజేసి

ఆమె మూలముగను తనదు
జన్మరహస్యాన్ని తెలియ
జేసెడు నా స్వయంలేఖ
నాన్ని లిఖింపగజేసిరి.”

(ఉపాయనాలు:పుటలు)

ఆ స్వయంలేఖానాన్ని ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు శ్రీ కఱ్ఱా ఈశ్వరరావుగారు 'భట్టు - విద్యలకే భట్టు ఆది భట్టు- నారాయణదాసు' అన్న పేరుతో ఒక గ్రంథంగా అచ్చు వేయించారు.

ఈస్వయంలేఖన ప్రక్రియను గూర్చి ప్రముఖులనేకులు చర్చించారు. కొందరు దీన్ని విశ్వసించారు. కొందరు విశ్వసించలేదు. కొందరు అవైదికమన్నారు.

ఈ స్వయంలేఖనంలో శ్రీ దాసుగారు తమను శారదావతారంగా ప్రకటించుకొన్నారు. పెద్దలనేకులు ఈ అంశాన్ని విశ్వసించి ధృవీకరించారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన ప్రసిద్ధ పండితులనేకులు, శ్రీ దాసుగారి సాహిత్యపాండిత్యాన్ని, కవనవైశిష్ట్యాన్ని, గానవైదుష్యాన్ని, నృత్యనిష్ణాతృత్వాన్ని, ఆయన అవతారవైభవాన్ని పలురీతుల ప్రశంసించి, నివాళులర్పించారు. ఇవన్నీ 'భట్టు - విద్యలకే భట్టు ఆదిభట్టు - నారాయణదాసు' అనే ఈ స్వయంలేఖన గ్రంథంలో చోటు చేసికొన్నాయి.

ఆ సందర్భంలో చేయబడ్డ రచన ఈ 'ఉపాయనాలు'. ఇది సుదీర్ఘంగా ఉండటంచేత ఇందులో ఎనిమిది పేజీలు మాత్రం పైన పేర్కొన్న గ్రంథంలో అచ్చువేసి, ఈ 'ఉపాయనా'లను ప్రత్యేక గ్రంథంగా ప్రకటించే సంకల్పాన్ని అందులో వెల్లడించారు. శ్రీ ఈశ్వరరావుగారు. ఆ సంకల్పం ఇప్పటి కిలా కార్యరూపం ధరించింది.

ఆ స్వయంలేఖనంలో సాక్షాత్కరించిన పుంభావసరస్వతి వీక్షాప్రసారం గూడా ఈ కృత్యావిర్భావానికి లభించినట్లే గదా!

శ్రీ వావిలాల సోమయాజులుగారు బహు సహస్ర సంఖ్యాకంగా ఏకలవ్య శిష్యసంతతిని సమకూర్చుకొన్న గురుపీఠ సమధిష్ఠితులు. మూడు దశాబ్దుల క్రిందటివరకు ఇంటర్మీడియెట్, డిగ్రీతరగతుల్లో చదువుకొనే విద్యార్థులలో తెలుగు భాషాపరీక్షకు వారు వ్రాసిన నోట్సులు చదువనివారు లేరంటే అతిశయోక్తికాదు. ఆ నోట్సులో ఆయా ప్రశ్నలకు వారు వ్రాసిన సమాధానాలు పరీక్షదృష్ట్యా తేలికగా ముక్కునపెట్టుకోటానికే ఉద్దేశించిన చౌకబారు సమాధానాలు కావు. అవి సాహిత్యదృష్ట్యా విలువైన వ్యాసాలు. ఆయా పద్యాలకు వారు వ్యాఖ్యలు గభీర సాహిత్య విశేష సమన్వితాలు అవన్నీ ఇప్పుడెవరైనా క్రోడీకరించుకొంటే పిహెచ్.డి. పట్టం పొందవచ్చు.

వావిలాలవారి లేఖిని నుండి జాలువారిన రచన ఏదైనా కానివ్వండి ఒక వైలక్షణ్యం ఉంటుంది.

నాలుగు దశాబ్దుల క్రితం వారు వెలువరించిన 'మణిప్రవాళము' అనే వ్యాససంపుటి తెలుగులో వ్యాసరచనకు మార్గదర్శకంగా ఉన్నదనటం పెద్ద లంగీకరించిన విషయం. ఒక్కొక్క వ్యాసంలో ఎన్నెన్ని విషయాలు చెప్పబడ్డాయి! అన్ని విషయాలు సేకరించటానికి ఎంత చదివి ఉండాలి! ఆ సేకరించిన విషయాలను పొందుపరచటంలో ఎంత అందం! ఆ శైలిలో ఎంత హొయలు!

వారి 'నాయకురాలు' నాటకం పలుమార్లు, ఆంధ్రదేశంలోను, ఆంధ్రేతర ప్రాంతాల్లోను ప్రదర్శింపబడి బహుజనరంజకమయినది. వారు రచించిన 'కజ్జల’ 'వసంతసేన' నాటకాలు వైలక్షణ్య రమణీయాలు. అయితే 'నాయకురాలు వలె ఇవి పలుప్రాంతాల్లో ప్రదర్శితాలు కాలేదు.

1950 ప్రాంతంలో వాత్స్యాయన కామసూత్రాలను మథించి, శాతవాహన సంచికలో వారు ప్రకటించిన వ్యాసం పరిమాణంలోనే కాక, విషయ విన్యాసంలో కూడా గొప్పది. ఎన్నో అపూర్వములూ, ఆసక్తికరములూ అయిన విషయాలు అందులో ఉన్నాయి.

వారి పద్యశిల్పానికి ముగ్ధులై డా॥ శ్రీ సి. నారాయణరెడ్డి గారు వారిని 'పద్యవిద్యాధరు' అని సంభావించారు. ఇంక వారి పద్యశిల్ప రామణీయకాన్ని గూర్చి వేరే చెప్పవలసిన దేమున్నది.

బహుభాషావేత్తలైన శ్రీ వావిలాలవారి అనువాద సాహిత్యం కూడా అనల్పమే!

మహాకవి శ్రీ జయశంకర్ ప్రసాద్ గారి 'కామాయని' హిందీ కావ్యానికి శ్రీ వావిలాల సోమయాజులు గారు తేటగీతి ఛందస్సులో తెలుగు అనువాదం సంతరించారు. ఇదొక విశిష్ట రచన. వేమన్న రసనపై ఆటవెలది నృత్యం చేసినట్లు సోమయాజులుగారి లేఖినిలో తేటగీతి కదను త్రొక్కింది. సుదీర్ఘ సంస్కృత సమాసగ్రథనానికి కూడా ఒదుగుబాటు చూపించి హొయలు గుల్కింది. ఈ కావ్యం తెలుగు భాషాయోష కొక వినూత్న భూష జయదేవుని 'పీయూషలహరి' గోష్ఠీరూపకానికి వావిలాలవారి ఆంధ్రానువాదం అంత మృదువుగానూ, అంత మధురంగాను, అంత మనోహరంగాను ఉన్నది.

'ఆంటోనీ క్లియోపాట్రా', 'జూలియస్ సీజర్', 'మేక్బెత్' మున్నగు షేక్స్పియర్ ఆంగ్లనాటకాలకు వావిలాలవారి అనువాదాలు ఆంధ్రాంగ్ల సాహిత్యవేత్తల మెప్పుదలకు పాత్రమైనాయి.

ఈ 'ఉపాయనాలు' కూడా ఒక ప్రత్యేకతతో కూడిన కృతియే!

ఇది శారదావతారులైన నారాయణదాసుగారి కథాకథన వైభవ ప్రశస్తికేర్పడిన రచన. సాధారణంగా ఇలాంటి రచనలు వచన రూపంలో ఉంటాయి. పద్యరూపంలో కూడా ఉండవచ్చు గాని నాతి దీర్ఘంగా ఉంటాయి. ఇది విజయమంగళరగడ మాత్రాఛందస్సులో సాగిన సుదీర్ఘరచన. శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారి ప్రతిభావైదుష్యాలను 'కొండ అద్దమందు'.. అన్నట్లు ప్రతిఫలించే రచన.

అసలు 'ఉపాయనాలు' అన్న పేరే చమత్కారంగా ఉన్నది. ఇది 'ఉపాయనము’ కాదు. బహువచన యుక్తము, 'ఉపాయనాలు'.

ఇది శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు శారదావతారమే అన్న విశ్వాసానికి సంస్ఫోరకము.

ఎంత మహామహిముడైనా మానవమాత్రు డైతే అభినందిస్తాము. ప్రశంసిస్తాము, తత్ప్రజ్ఞాపాటవాలను, వైదుష్యాన్ని విమర్శిస్తాము, వ్యాఖ్యానిస్తాము. ఇది దేవతావిషయం కాబట్టి 'ఉపాయనము' సమర్పిస్తున్నారు శ్రీ వావిలాలవారు. అయితే 'ఉపాయనము’ కాక, 'ఉపాయనాలు' ఎందుకైనది?

"విపులమైన లోకంలో
మిమ్ము ప్రశంసించు రీతి
మీ విజ్ఞా నాధిక్యత
మీదు కళాపాండిత్యము
ఇత్యాదుల గూర్చి ఏమి
చెప్పుకుంటు ఉన్నారో
వానిలోని కొన్ని భావ
ములను సేకరించి, వాని

లోన కొన్ని సంగ్రహించి
భక్తజనావళి కొరకును
మా కొఱకూ, మీ కొఱకూ
గాన యోగ్య ఛందస్సులొ
నేను తెలుప బూనుకొంటి”

(ఉపాయనాలు: పుట)



అంటున్నారు శ్రీ వావిలాల.

ఈ విధంగా సుప్రసిద్ధులైన మరెందరో పెద్ద లర్పించిన కానుకలు కూడా ఈ
కృతిలో చోటు చేసుకొన్నవి. ఇందుచేతనే ఇది 'ఉపాయనాలు' అయినది.

శ్రీ దాసుగారికి శ్రీ నావిలాలవారర్పించిన ఉపాయనాలలోని వైవిధ్యం చూడండి:
వావిలాలవారు నారాయణ దాసుగారిని వ్యాసభగవానునిగా సంభావించారు.

“జన సంక్షేమం కోసం
వ్యాసుడు బోధించినట్టి
వైదిక పౌరాణిక వి
జ్ఞానపు రుచి చూపినారు”

(ఉపాయనాలు : పుటలు )



"మీరు వ్యాసభగవానులు
..........…..........

...............….....

వ్యాసుడు ఏ కారణాన
లిఖియించెనా భారతాదు
లా కారణముననె మీరు
హరికథల లభించినారు”.

(ఉపాయనాలు : పుటలు )



శ్రీ దాసుగారి శీలసంపదకు వావిలాల వారి నివాళు లివి:

'జగము నందు పుట్టినట్టి
జను లంతా మీ బిడ్డలె,
కుల మత భేదాలు లేవు,
కోర్కెల దోషాలు లేవు,



నిత్యములౌ మీ చేష్టల
నిర్లక్ష్యం కనుపించదు.’
'క్రీడగ నైనాను మీరు
కించపరచ రెవ్వరినీ' (ఉపాయనాలు : పుట )

శ్రీ ఆదిభట్ల లోకహిత వర్తనను వావిలాలవారిలా ఉగ్గడిస్తున్నారు:

"భయరహితత, ఓ భట్ట!
కీలకరంగాల కేగి
దుష్టులలో పరివర్తన
కల్గింపను, దళితులకును
బాధితులకు ఉపశమనం
చేకూర్పను కృషిచేతురు.” (ఉపాయనాలు : పుట )

స్త్రీ విద్యపట్ల, స్త్రీ జనోద్ధరణ పట్ల శ్రీ దాసుగారికి గల ఆసక్తిని, ఆ రంగంలో
వారి కృషిని వావిలాలవారిలా వెల్లడిస్తున్నారు.

"కాంతలలో నొక కొందరు
మీ ప్రోత్సాహం వల్లను
మేటి కథాకథన లైరి” (ఉపాయనాలు : పుట )

"అందం కోసమ్ము స్త్రీని
ఆరాధించారు గాని
భోగము కోసమ్ము కాదు” (ఉపాయనాలు : పుట )

'హరిదాస జగద్గురువులైన శ్రీ నారాయణదాసుగారు, 'హరికథలను నేర్పు నట్టి
హరిదాసులె కారు. జీవితాన్కి, శీలానికి శ్రేయానికి చెందినట్టి ఎన్నో నేర్పిన గురువులు.
శ్రీ దాసుగారు ప్రగతి శీలురు

“ఎట వసించుచున్న నేమి?
ఏ మొనర్చుచున్న నేమి?
ఉత్సాహము కల్గించుట
ఉత్తేజితులను జేయుట


     మీకు జన్మలక్షణమ్ము!
     నే నన్నది సత్యమ్ము” (ఉపాయనాలు : పుట )

అంటారు వా.సో.

ఈ గ్రంథంలో సోమయాజులు గారు, 'మధురభక్తి, నవవిధ శృంగారాభినయాలు, తమ బాల్యంలో గుంటూరులో జరిగిన శ్రీ దాసుగారి హరికథా గానసభను పూర్వోత్తరరంగాలతో విపులంగా రసవత్తరంగా వర్ణించడమే కాక, ఆనాడు హరికథాపితామహులు గానంచేసిన పార్వతీకల్యాణగాథను కూడా వివరించారు. సామాన్యంగా వాడుకలో లేని కొన్ని పదాలను ప్రయోగించి, వాటి అర్థాలను తెలియజెప్పారు. అనేక పౌరాణిక గాథలను వివరించారు. యక్ష రాత్రిని గూర్చిన విపుల వర్ణన, 'అవిజేత' అనే బిరుదు నందుకున్న 'మెస్సాలిని' అనే రోమక వనిత వృత్తాంతం, సురసా కశ్యపుల కూతురైన 'అజముఖి' వృత్తాంతం మొదలైన ఎన్నో ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. శ్రీదాసుగారి ప్రజ్ఞాపాటవాలను ప్రశంసించే కృతిలో ఇవన్నీ చెప్పవలసిన అవసరమేమిటి? అనే శంక కలుగుతుంది.

శ్రీ దాసుగారు 'జ్ఞానభూమి గోలోమి', 'అజ్ఞులయెడ దాక్షిణ్యత విజ్ఞుల జేసెద' రట వారిని.

అందువల్ల సామాన్యపుచదువు చదువుకొన్నవారికి తెలియని అనేక విషయాలను ఈ గ్రంథంలో తెలియజెప్పడం కూడా శ్రీ దాసుగారికి సమర్పించే ఒక గొప్ప ఉపాయన మౌతుందని వావిలాలవారు భావించారనుకుంటాను.

హరికథాపితామహులు పలికిన సుభాషితములను పెక్కింటిని సోమయాజులు గారు ఈ కావ్యంలో పొందుపరచారు.


    'అల్పముగా మాటాడుము
     అధికముగా కృషిచేయుము' ( పుట )

     'క్రమము తప్ప కెపుడు గడి
     యారమువలె ఉండవలయు' (పుట )

    'జ్ఞానము ప్రేమల కలయిక
     యే పూర్ణత ఆనందం' (పుట )


'ఆధ్యాత్మిక తనియెడు నది
కారణాన్ని తిరస్కరణ
చేయునట్టి దెపుడు కాదు,
దాని నధిగమించునది' (పుట)

'నారి లేని ఇల్లు వృథా
నారి లేని విల్లు వృథా' (పుట)

ఇవి మచ్చుకు కొన్ని. వారు ఇలాంటి సూక్తులను పొందుపరచడం కూడా
పాఠకులు విజ్ఞానాన్ని పెంచడానికే! ఇదిన్నీ శ్రీ దాసుగారికి ఒక గొప్ప ఉపాయనమే!

శ్రీ దాసుగారిని

'ఆంధ్రావని అవతరించి
నట్టి ఒక్క గంధర్వుడు' అని -

'పుష్టిమంత మై కదలిన
ఒక్క కళాపర్వతమ్ము' అని -

'సంవిత్తుకు, సంస్కృతికిని
సంగమ సుస్థానము' అని -

పలువురు పలు విధాల ప్రశంసించారు.

ప్రథమాస్థాన కవీంద్రులు శ్రీచెళ్ళపిళ్ల వేంకటశాస్త్రిగారు

'నారాయణదాసు ప్రజ్ఞ
ఆ అనన్వయాలంకా
రానికి తొలి లక్ష్యమ్ము'

అని, దాసుగారికి సాటి దాసుగారే అని ప్రశంసించారు.

ఇలా ఎంద రెన్ని విధాల భావించినా, శ్రీ వావిలాలవారికి మాత్రం
శ్రీ నారాయణదాసు గారు శారదామాతయే!

"విచ్చలవిడి తిరుగునట్టి
పుంగవ మన్నట్లు పోవు
దాసుగారి మూర్తి ఎంత



పౌరుషవంత మ్మయినను
ఆలోచింపంగ “అమ్మ”
మూర్తిగానె గోచరించు
టద్భుతమ్ము మీసాలీ
భావన కేమాత్రమ్మును
అడ్డురావు.... (పుట 34)


అట్టి శారదామూర్తికీ,
    తద్వైభవాన్ని మన కట్టెదుట నిల్పిన శ్రీ వావిలాల సోమయాజులుగారికీ
    త దవతార వైభవ ప్రకాశయిత శ్రీ కఱ్ఱా ఈశ్వరరాయ మహోదయులకు
    ఇది 'త్రికళాత్మకోపహారము”

దిక్సూచి

వట్టివల్లి మల్లినాథ శర్మ-

శ్రీ శివాయ గురవే నమః

"ధారుణి నారాయణుఁడై
శారదనారాయణకథ శం, భో యనఁగా
నా రవము వినిన నలువ ప్ర
సారించిన నభయకర మొసంగుత సుఖముల్”

“శ్రీమ దజ్జాడ ఆదిభట్ట నారాయణదాసుగారు శ్రీ శారదావతార మూర్తులు హరికథా పితామహులు" అను పలుకును విన్నను, ఎచటనైనను చదివినను, ఛాయా చిత్రములలో వారి మూర్తిని ఒక్కసారి చూచినను వీరికి, పై రెండు విశేషణములేనా, ఇంకను ఉన్నవా! అను విషయములను దెలిసికొన వలయు నను జిజ్ఞాస సహృదయుల హృదయములలో వెంటనే కలుగును. ఆ మూర్తిస్ఫూర్తి అట్టిది. శ్రీ దాసుగారినిఁ గూర్చిన చిత్రలు, విశేషములు పలు విధములు. అవి యన్నియు జిజ్ఞాసువులకు ఒక పుస్తకమునందే దొరకవు. ఎందఱు ఎన్ని విధాలుగా ఎన్ని అంశములు వారినిఁగూర్చి వ్రాసినను లేక ఉపన్యసించినను పుస్తక రూపమున ముద్రించుచున్నను అవి అన్నియు అసమగ్రములే అనిపించుట జగమెఱిఁగిన సత్యము. - అయినను 'సంస్కృతి సమితి చీరాల' 1967 ఏప్రియలులో ప్రకటించిన "హరికథాపితా మహ. శ్రీమదజ్జాడ ఆదిభట్ట నారాయణదాస జయంత్యుత్సవ సంచిక"లో దాదాపు 70 మంది సకలకలానిష్ణాతులైన పండితులు శ్రీ దాసుగారి జీవితచరిత్ర సంగ్రహము, వారి సర్వంకషా పాండితినిఁ గూర్చిన విశేషములు వ్యాసరూపములలో, బ్రకటించియున్నారు. ఈ సంచిక శ్రీ దాసుగారి చరిత్ర సర్వస్వముగా నున్నది. ఒక్క హరికథకులు, గాయకులే కాదు. వివిధ శాస్త్ర పండితులును దానిని జదుపవలసినదే. మఱియు, నెల్లూరు వాస్తవ్యులు, శ్రీ వాడరేవు సీతారామాంజనేయ భాగవతులు

రచించిన "హరికథావాఙ్మయము”లోను పండితులు. విద్వాన్ శ్రీ వేదము చంద్రశేఖరయ్య

(ఎగ్మూరు, మద్రాసు గారు) వ్రాసిన “భారతభారతి" అను గ్రంథమున “మహాపురుషులు” అనుశీర్షిక క్రింద శ్రీ నారాయణ దాసుగారిని

     “ఆదిభట్ల నారాయణాఖ్య కవివరుడు
      హరికథా పితామహ బిరుదాంచితుండు
      అతఁడు చెప్పెడు కథ లాలకింత్రు
      ప్రజలు తిండి, నిద్రమాని పరవశులయి” (252)

అనియు కీర్తించియున్నారు. ఇది గాక, శ్రీమదజ్జాడ, ఆదిభట్ట శ్రీనారాయణ దాస జీవిత చరిత్రను, 'యక్షగానరూపమున' కవి “కథకరత్న" శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసుగారును (1967) ముద్రించియున్నారు.

“ఉపాయన”లు అను శీర్షికగల యీ గ్రంథమును శ్రీ వావిలాల సోమయాజులుగారు వ్రాసిరి. విషయము, విషయవైవిధ్యము పైసంచికలోనిదేగాక, మఱికొన్ని గ్రంథములనుండియు గ్రహించిరి. అయినను “గానయోగ్య చ్ఛందస్సు” లో వ్రాయుటయే శ్రీ సోమయాజులుగారి ప్రశంసనీయ కృషి.

సహృదయపండిత మిత్రులు శ్రీ కర్రా ఈశ్వరరావుగారు ఈ "ఉపాయన”లను ముద్రింపఁదలపెట్టి, దీనిపై “ఒక పీఠిక వ్రాయుడు" అని నన్నుఁ గోరిరి. విషయము సర్వజ్ఞులైన హరికథా పితామహులను గూర్చినది. రచయితలు పండిత ప్రకాండులు శ్రీ సోమయాజులుగారు. దేనియందును సామర్థ్యము లేని నేను దీనికి పీఠిక వ్రాయుటకు సాహసింపలేక, శ్రీ ఈశ్వరరావుగారి మాటను ద్రోసి వేయను జాలక వ్రాసియిత్తు నని మాట యీక, వారిచ్చిన వ్రాఁత ప్రతిని ఇంటికిఁ దెచ్చి చదువ మొదలుపెట్టఁగాఁ దొలుతనే ఈ “ఉపాయనలు" శ్రీ నీలకంఠశాస్త్రిగారికి అంకితము అనుపంక్తినిఁ చూచి, ఆ త్రిమూర్తులపై భారముంచి చదువ మొదలు పెట్టితిని.

శ్రీ సోమయాజులుగారు “ఉపాయన”లను గొన్ని భాగములుగా విభజించినట్లు ఊహించుకొని, ఆ భాగములకు నా సౌలభ్యము కొఱకు క్రమసంఖ్యను గూర్చితిని. ఈ నా చొఱవను శ్రీ సోమయాజులుగారు మన్నింతురని వారి సహృదయతపై నా విశ్వాసము.

“శ్రీనారాయణదాస.... నారాయణదాససుకవి. సంచిత బహుశాస్త్రభట్ట" - అను రీతిలో విశేషణములు సంబోధనములు

ఉండుట, వానిలో పూర్వాపరవైవిధ్యము కనఁబడుటచే పైరీతిగా ఊహించితిని.


శ్రీ నారాయణదాసుగారి చరిత్రను చాలమంది వ్యాసరూపములలో వ్రాసి యుండఁగా, వానిలోని యంశములచే ముక్తాహారముగా వీరు గేయరూపమున రచించుట యిందలి విశేషము. గేయములలోని భాషయు చాల సులువుగా నున్నది. నా గ్రుడ్డిలెక్క ప్రకారము ఈ గేయపంక్తుల సంఖ్య దాదాపు మూఁడువేలకు మించి రెండువందలున్నవి. - విషయము స్వకపోలకల్పితమైనచో ఇట్లు గేయఛందస్సులో వ్రాయుట ఒకశ్రమ. ఇందలి విషయము శాస్త్రములు, అందలి పంక్తులు కొన్ని యధా తథముగా చొప్పించుట, సంచికలోని వ్యాసకర్తల వాక్యములను కొన్నిటిని అట్లే యిముడ్చుట అనునది కష్టతమము. వీరి రచనను చదివినవారి కెవరి కైనను రచనలో, అందులో గేయఛందస్సులో వారికిఁ గల నైపుణ్యము పాండితి రచనాసారళ్యము మనసునకు రాఁగలవు. ఇట్టు శ్రీ దాసుగారి చరిత్రాంశములను గేయ రూపమున రచించి జిజ్ఞాసు సమాజమున కందించుటయేగాక యీ కృతిని శ్రీ నీలకంఠ శాస్త్రిగారికి అంకితమిచ్చుట అను రెండు కార్యములను ప్రశంసార్హములే కాదు నమస్కారార్హములును, వీరికి నా కృతజ్ఞతాంజలులు.

ఈ గ్రంథమును గూర్చిన నా వ్రాఁతకు 'పీఠిక' అనుట నా చేతగాని చేఁత మఱియు ఈ “ఉపాయనలు" నా దృష్టిలో ఒక రత్నాకరము. ఇందు పిపఠిషా (చదువఁగోరిక) నౌకలో పయనించువారికి ఇందు ఏ భాగమున ఏ విషయమున్నదో తెలుపు విషయసూచిక వంటి ప్రక్రియ “దిక్సూచి” అనుటయే తగినదని ఆపేరే ఉంచినాను.

శ్రీ సోమయాజులుగారు దీనిలో దాదాపు 12 మంది ప్రముఖుల యభిప్రాయాలను సంగ్రహించి, శ్రీ చెళ్లపిళ్ల వారితో ఆరంభించి శ్రీ విశ్వం గారి ఆశీస్సులతోఁ బూర్తిచేసిరి. స్వాభిప్రాయములను సైతము ఇందుఁ జేర్చి యున్నారు. ఈ గేయపద్ధతిలోని సౌలభ్యము పాటగా పాడుకొనుటకు వీలగుట సంగీతమును పద్యములకును జోడింపవచ్చును. కాని 'లయ' అవసరములేదు. గేయములు అట్లుకాదు. "హృద్యాహీ వాద్యకలయా కలితేవ గీతిః" (భోజచంపువు) అన్నట్లు వాద్యసహకారముతో లయబద్ధమైన సంగీతముతో గేయమును గానము చేసినపుడు 'హృద్యము', వినువారికి ఆనందము. ఈ గేయములు అన్ని భాషలందును గలవు. గేయముగాఁ బాడఁదగినవానిలో పద్యభేదములైన ద్విపద, మంజరి, సీసము, పంచచామరాదులు కొన్ని గలవు. సంస్కృతశ్లోకములును కొన్ని వాల్మీకి రామాయణము, శ్రీశంకరాచార్య షట్పది, భజగోవింద శ్లోకములు, కొన్ని ఆర్యావృత్తములు మున్నగునవి కలవు. ఇవిగాక అప్పకవి తన గ్రంథము అశ్వాసము (4)లో 'శ్రీవృత్తము' (178) అనిప్రారంభించి యిచ్చిన ఛందోభేదములలో (ఉదాహృతికై) మదరేఖ ఆదితాళము, విద్యున్మాలా, తోటకములు, ఆది, లేక ఏకతాళములలో లయతోపాటు గానముచేయ వీలగున్నట్లున్నది. మఱియు అచ్చటనే

1) 'బింబము' అను వృత్తలక్షణమును -
   "ఇమ్మహిలోఁ గ్రమ్మిభగల్ - బింబమునం గంబుధరా (భ+గ) 4పా 'చిత్రపదము’
    అను వృత్తలక్షణమును -

2) చిత్రపదం బనువృత్తం బత్రిముని స్తుతశౌరిన్
    స్తోత్రము సేయఁగనొప్పున్ - ధాత్రిని భాగగ యుక్తిన్ (భ+భ+గగ) (4పా) అని
    క్రమముగా "భ, భ, గ, బింబములోని గణక్రమమును, భ, భ, గగ. అను
    గణక్రమమును దెలిపి ప్రాసయతినిఁ గూర్చి రచించినట్లు వ్రాసిరి.

ఇందలి (ఉపాయనలు) ఛందస్సు పోలికను నడకను బట్టి పైరెంటివలెం గన్పట్టినను యతి ప్రాసలు పాటింపఁబడక రచింపఁబడుటచే కేవలము మాత్రాచ్ఛందస్సుకే ప్రాధాన్యమిచ్చినట్లు తోఁచుచున్నది. అయినను శ్రీ సోమయాజిగారి కలము పరిపాటిచేఁ గొన్నిచోట్ల యతులను అంత్యానుప్రాసములను గూడ పాటించినది. ఈ నా యూహలో నా యజ్ఞతయు నుండవచ్చును.

శ్రీ దాసుగారి సర్వతోముఖపాండితిని, గానకళను హరికథాకథనదక్షతను, కవితా నైపుణ్యమును బట్టి శ్రీదాసుగారు “శారదావతారము” అనుట ఆయా పండితుల యూహలు కల్పనలుకావు. వారు యథార్థముగా శ్రీశారదావతారమే అనుటకు ఆధారము ప్రత్యక్షసాక్ష్యము, శ్రీ నారాయణదాసుగారి స్వయం లేఖనము. ఈ స్వయం లేఖనము ప్రమాణము అనుట యెట్లు అను సందేహము కొందఱకుఁ గలుగవచ్చును. ఇందులకు ఈ అంశముపై చక్కని వ్యాసము వ్రాసిన శ్రీవేమూరి వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారి సమాధానమును ఇందే చూడఁగలరు.


ఈ విషయమును మొట్టమొదటఁబ్రస్తావించి, మరల

     “విద్యావతి మీరు గాఢముగను ప్రేమతోడ పిలిచి
      వారసురాలవుటచేత. "స్వయంలేఖ” నాన్ని లిఖిం
      పగఁజేసిన లేఖకురా లౌ శ్రీమతి రాజేశ్వరి
      ఒక సందర్భమునందు మిమ్ముగూర్చి తెలిపిన వివి" అని వ్రాసిరి

ఈమెచేత శ్రీదాసుగారు స్వయముగా వ్రాయించి “స్వయంలేఖనము”నే తొలుతగా-

      “శ్రీనారాయణదాస - స్వయంలేఖనమ్ము ఇద్ది
       ఈ నూతన సాధనమ్ము-నవ్యమార్గగామి అయిన
       ఆమహనీయునిజీవిత - పూర్వరంగమును దెలిపెడి
       సమ్మోహన పరికరమ్ము" అని ప్రారంభించిరి.

అనఁగా శ్రీదాసుగారినిఁగూర్చి ఏయే అభిజ్ఞులు ఎట్లు ఉగ్గడించి వ్రాసినను, అవి యన్నియు ప్రత్యక్షరసత్యములే అనుటకై గ్రంథకర్తగారు ఇట్లు ప్రారంభించుట సముచితము, సత్యమును.

రెండవ భాగములో “నారాయణదాసద్రష్ట” అనిరి. అట్లు ఏల అనిరో దానిని:

      "గానకళా ప్రావీణ్యము -ముగ్ధ నృత్య రమణీయత
       కథాకథన కమనీయత - కవన మహావైదుష్యము
       సురగురు విజ్ఞానగరిమ వికసిల్లగ విలసిల్లగ
       చేరినట్టి సర్వజ్ఞుడు - నారాయణదాస - ద్రష్ట”

అని యిట్లు 5 ఉపపత్తులచే దెలిపిరి. అనఁగా పై అయిదు విధములయిన అంశములకు శ్రీ నారాయణ దాసుగారు 'ద్రష్ట' అనుట. 'ద్రష్ట' అనునది చాల ఉదాత్తమైన పదము. ఏదో ఒక కళలోనే నేర్పుగలవారిని ద్రష్ట అనుటకు వీలులేదు. వేదములలోఁ గొన్ని సూక్తములకు ముందు ఒక ఋషిపేరు వినిపించును. ఆ సూక్తమునకు ఆ ఋషి ద్రష్ట అని అర్థమును పెద్దలు చెప్పుదురు. ద్రష్ట అనఁగనే 'చూచువాఁడు' అను నర్థమే సామాన్యముగా స్ఫురించును. ఇచట వినినవారు, లేక తెలిసికొనినవారు అని వారి యభిప్రాయము.


      "అన్యత్ర ధర్మా దన్య త్రాధర్మాత్ అన్యత్రాస్మాత్కృతాకృతాత్
       అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్త త్పశ్యసి తద్వద" కఠ 2/14

ఇచ్చట 'పశ్యసి' అనగా :- (యది ఈదృశ్యం వస్తు సర్వవ్యవహారగోచరాతీతం పశ్యసి = జానాసి తెలిసికొను చున్నావో తద్వదీ = దానినిఁ జెప్పుము) అని. శాంకర భాష్యము. యజుశ్శాఖీయుల స్మార్తకర్మలలో "జాతకర్మ" అను ప్రకరణమునందు 'జాతం వాత్సప్రేణాభిమృశ్య' (పురిటి బిడ్డను ‘వాత్సప్ర' అను సూక్తముతో తాకి) అనుసూత్రముతోఁ జెప్పఁబడిన సూక్తము 'వాత్సప్రసూక్తము. “దివస్పరి ప్రథమం జజ్ఞే” అను ఋక్కుతో ప్రారంభింపఁబడునది. ఇట -వాత్సప్రేణ = వత్సప్రఋషిణా దృష్టేన = (వత్సప్ర అను పేరుగల ఋషిచేతఁ దెలిసికొనఁబడిన, వినఁబడిన) అని హరదత్తభాష్యము. ఈ ఋషులను శ్రుతి గోచరమైన దానినే) 'ద్రష్ట' అను శబ్దముతో సూత్రకారులు వెల్లడించిరి.

       “ప్రలయే-ంతర్జితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయఁ"
        తపసా లేబిరే పూర్వమనుజ్ఞాతాఁ స్వయంభువా”

అనుస్మృతి ననుసరించి 'ఋషులు' అనఁగా - మహాప్రళయమునకు ముందు, ఏయే వేదములు, ఏ యే ఇతిహాసములు ఉండి, ప్రళయ సమయమునందు ఆ వేదపురుషుని యందే లీనములై యుండినవో మరల సృష్టి ప్రారంభమైనపుడు, ఆయా వేదాదులు బ్రహ్మయొక్క ఆజ్ఞచేత ఏ యే మహాత్ముల చెంతకుఁ దమంతకుఁ దామే వచ్చి శ్రవణరూపమున వారినిఁ జేరినవో (వారికి వినఁబడినవో) ఆయా భాగములు ఆయా ఋషుల పేళ్లతో ప్రసిద్ధములైనవి. ఈ భావమునే దెలుపు నట్టిది " -ప్రళయే అంతర్హితావేదాః యాన్ 'ఆర్షంతి' తే ఋషయః” యీ వాక్యము.

కాఁబట్టి, శ్రీదాసుగారు 'ద్రష్ట'. అనఁగా (గానకళా ప్రావీణ్యాదులు) నవ్యమార్గగామి = ఆయా గాన నృత్య తాళ అభినయ రచనలలోఁబయనించి భావితరములవారికి మార్గదర్శకులు అయిరి. అనఁగా, “దాసుగారికి ముందు ఆయా మార్గములు లేవని, వానిని దాసుగారు స్వోపజ్ఞతో రూపొందించిరి ఆయా కళాసమూహములు తమంతకు తామే దాసుగారి యొద్దకు అహమహమిక (నేను ముందు నేను ముందు) తో వచ్చి వారి ద్వారా లోకమునఁ బ్రసిద్ధిఁజెందినవి' అనుటచే 'ద్రష్ట' అనిరి.

20-లో నారాయణ శబ్ద నిర్వచనము చేసిరి.

     -నారాయణులైనారు “-శబ్దమ్ములు
      ఎవనివలన బయలుదేఱు - అతఁడు రాయణుండు, అతఁడు
      గానివాడు ఆరాయణుఁడు - ఆరాయణుడు గానివాడు
      నారాయణుడు అందుచేత - తనవలననె శబ్దమ్ములు
      బయలువెడలుచుండుటవలన నారాయణుఁడయ్యె”

అని యింకన పలువ్యుత్పత్తులు చెప్పియున్నారు.

21-లో-నారాయణదాసుగారు - బ్రహ్మశక్తి, త్రికళ - వృత్తాంతమును వర్ణించిరి.

22.) "నాలుగేండ్ల యీడుననే చదువు లన్ని వాటి అంత
      టనే మీకు అబ్బినాయి - లయకారుడు, మాటకాడు”.

మున్నగు విశేషములు చెప్పిరి. ఇచట లయకారుడు = తాళభేదములను సృష్టించినవాడు - "లయబ్రహ్మ" బిరుదు - నవరసతరంగిణి అను వీరి నూతన సృష్టి-

దీని వలన "లయకారుడు" అనుట సార్థకము

25) “ఆదిభట్ట” శబ్దనిర్వచనము

     “నారాయణదాసుగారి - గృహనామము ఆదిభట్ట
      భట్టశబ్ద మా పండిత - వాచకమ్ము ఆదిభట్ట
      వారిలోన అజ్జాడవారు - ఎంతో విశిష్టులు అంటూ
      తెలియనౌట "ఆదిశ్చాసౌ భట్టశ్చ ఆదిభట్ట"
      ఆదిభట్టవంశము నా-రాయణవంశమ్ము గాను
      కీర్తికెక్కుటకు నారాయణదాసుల కారణమ్ము

ఇచటనే వీరి విద్యాప్రాప్తి - హరికథాకథనము, గానము మొదలగు విశేషములు పేర్కొనఁబడినవి. మఱియు భావికాలమున భక్తులలో ప్రహ్లాదాదులవలె నారాయణునకు దాసుడు అయి తీఱును. ఇతని జన్మవంశమునకు జెందినట్టి జ్ఞాతుల కంటె, విద్యావంశానికి జెందినట్టి జ్ఞాతులె విస్తారంగా ఉంటారు. ప్రస్తుతాంధ్రలోకంలో హరికథచెప్పే ప్రతివ్యక్తియు - ప్రత్యక్షముగానో పరంపరగానో ఈయన శిష్యులు

అయితీరవలెను.

పై వాక్యములు "చెళ్లపిళ్ల వారివి

'అందగాండ్ర తలకట్టు*: -

మైసూరు దొరేను తోడాలను తొడుగుట, అంకినీడు కాలికి గండపెండేరము తొడుగుట, 18వ ఏటనే అరవము, మలయాళము, కన్నడం, బంగాలీ, తెలుగు సీమలందు మెప్పుపొందుట, 80వ యేట గూడ గజ్జెగట్టి కథచెప్పుట. వీరు రచించిన గ్రంథములు.. వివరించిరి.

15) శ్రీ దాసుగారి -మూర్తి విశేషము వారి అలంకారమును గూర్చి, తెలుపుచు :

    "శారదావతార మీరు - పెద్దదయిన తలకొప్పును
     దానిపైన రమ్యపుష్పగుచ్ఛమ్ములు, ఫాలభాగ
     మున కుంకుమబొట్టు కనుల - దిద్దుకొన్న కడు నల్లని
     కాటుకయును దేహముపై - లేపనాదులు...’

-

ఇచట, దాసుగారు కన్నులలో కాటుక పెట్టుకొనినారు, అనుటను గూర్చి కనుల- కాటుక స్త్రీలకే అనిపించును, అట్లుకాదు, స్మార్త కర్మలలో “స్నాతక వ్రతము” అను ఒక సంస్కారమున్నది. ఇది నేఁడు 30వయేట పురుషులు యాజ్ఞికులకొఱకు కన్యాదాతలనుండి పాదరక్షలు, గొడుగు కఱ్ఱ - అద్దము, మొదలగు వస్తువులను సంపాదించుటకు, “కాశీయాత్ర” అను నొక అభినయము జరుపుకొనుచున్నారు. ఈసంస్కారము ఎప్పుడు బ్రహ్మచారి చేసికొనవలెనో దానినిఁ గూర్చి ఆపస్తంబమహర్షి:

    "వేద మధీప్యస్నాస్యన్... (5 12 1 ఆపస్తంబ సూత్రము”) అని
     ప్రారంభించి "ఏవం ఉపనీత చరితబ్రహ్మచర్యః అధీత వేగ
     షడంగః యది ఆచార్యకులాత్ అన్య మాశ్రమం ప్రేప్సుః
     భవతి. తస్య స్నానం నామ కర్మ ఉపదిశ్యతే...”

ఉపనయనము నాఁటినుండి గురుకులముననే ఉండి బ్రహ్మచర్యవ్రతముతో షడంగములతో పాటు, మొదట స్వశాఖాధ్యయనమును చేసి, వీలున్నచో మఱొక వేదమును అధ్యయనము చేసిన తరువాత, బ్రహ్మచర్యాశ్రమధర్మములను వదలి, మఱొక ఆశ్రమము ప్రవేశింపఁదలఁచినచో (గృహస్థాశ్రమమును స్వీకరింపఁ దలఁచినచో) అట్టి వానికి “స్నానం” అను సంస్కారము ఉపదేశింపఁబడుచున్నది. ఇట్టి సంస్కారమును పొందినవాఁడు “స్నాతకుఁడు" అనఁబడును. వీఁడు చేయునదే స్నాతకవ్రతము. దీని తరువాత ఒకవేళ వెంటనే గృహస్థు కాలేక పోయినచో బ్రహ్మచర్యాశ్రమ ధర్మములను


వదలుకొనవచ్చును. అప్పుడు బ్రహ్మచర్యవ్రతములోపముఁ దద్ద్వారా ప్రాయశ్చిత్తము అవసరము ఉండదు అని అభిప్రాయము. ఈ సందర్భముననే బ్రహ్మచారికి తగని విలాసాదులు ఇచట సంస్కారపూర్వకముగా స్వీకరింపజేయుదురు. వానిలో -

“ఏవ ముత్తరైః యధాలింగఁ స్రజః (పూలమాల) శిరసి, అంజనం (కాటుక) ఆదర్శావేక్షణం (అద్దములో తన బింబమును చూచుకొనుట) ఉపానహే (చెప్పులు) ఛత్రం = (గొడుగు) దండః (కఱ్ఱ ధరించుట) అనునవి స్నాతకమునుండియే ప్రారంభము. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పై వస్తువులను ధరింపరాదు, అనుట.

కాటుకను గూర్చి :

      “యదాంజనం త్రైకకుదం జాతగ్ం హిమవత ఉపరి, తేన
       నామాంజే తేజసేవర్చసే భగాయ (బలాయ) చ"
                                            (ఏకాగ్నికాండ-2-9-11)

త్రికకుత్, లేక, హిమవత్పర్వతములందు దొఱకునట్టి ఓషధులచేఁ గల్పించిన కాటుకను స్నాతకుఁడు కన్నులలో పెట్టుకొనవలెను. దానివలన కంటికి దృష్టి శక్తియే గాక ముఖమునకు తేజస్సు గలుగునఁట!

ఈ రహస్యము నెఱిఁగినవారు కావుననే శ్రీదాసుగారు కంటికి కాటుక ధరించెడివా రేమో!

15) శ్రీ సోమయాజులవారి 11వ ఏట, శ్రీ దాసుగారు గుంటూరులో హరికథ చెప్పుటకై వచ్చి కథారంభమున దైవప్రార్థనాదులు పూర్తిచేసి :

     
     "చిత్రంగా హరికథవిం-టారా హరకథవిం
      టారా! అని సభవారిని ప్రశ్నిస్తే అప్పుడచట
      చమత్కారశీలి అయిన - ధనికు డొకడు దర్పంతో
      హరకథనే చెప్పండి - నేటిదాన్ని బట్టి రేపు
      హరికథ వింటామొ లేదొ తేలుస్తా మన్నాఁడు”

“మీరు కోరినట్లు హరకథనే చెప్పుతాను” అని పార్వతీపరిణయమును చెప్పినారఁట!


16) వారు నాడు చెప్పిన కథాసారాంశ విశేషములు.

"దక్షయజ్ఞవేళ విష్ణువునకు శివునకు యుద్ధము సంప్రాప్తించుటచే భద్రతకై సతీదేవిని బ్రహ్మ తనలో నిలిపెను. కాఁబట్టి తన శీలముపై అనుమానముతో తన భర్త తననుఁ (మన్మథుడు పుష్పాస్త్రము వేసినప్పుడు చూచియు) చేరదీయ మానెనేమొ అన్న ఊహ కలిగి పరమేశ్వరి తీవ్రతపము చేసినదఁట! తపఃఫలమును ఆమెకుఁ బ్రసాదించుటకై శివుఁడు బ్రాహ్మణవేషములో వచ్చి ఆహారము పెట్టమంచు అర్థించెను.

      నగపుత్రిక “నదిని స్నామాడిరండు" అని అడిగెను
      బ్రాహ్మణుండు నదిలో దిగి, “మొసలి ఒకటి నన్ను
      అంచు అరిచి లేవదీయు మంచు నామె వేడినాడు
      లేచి ఆమె నదియొద్దకు - వెళ్లె. కాని పరపురుషుని
      ముట్టు టెట్లు? అని సంకోచించుచుండె.
      అపుడు శివుడు నిజరూపము చూపినాడు" -
                                           (ఇది వరాహపురాణాంతర్గతము)

ఈ కథలో శ్రీదాసుగారు, వ్యాసుడు బోధించినట్టి వైదిక పౌరాణిక విజ్ఞానపు రుచిని చూపినారు. గాంధర్వకళానుభూతి, నారద తుంబురు జ్ఞానప్రావీణ్యము తండు మహానృత్యకేళి, నందీశ్వర నాట్యకళావైశిష్ట్యము మంజుల మహతీకచ్ఛపి తంత్రుల మహాత్మ్యములను దర్శింపజేసినారు. - గాంధర్వకళ = అనఁగా : - కాళిదాస మహాకవి రఘువంశమున వ్రాసిన,

    "మనో-భిరామాః శృణ్వం తా రథనేమిస్వనోన్ముఖైః -
     షడ్జ సంవాదినీః కేకాః ద్విధా భిన్నాః శిఖండిభిః
                                                     (1-39)

అను శ్లోకవ్యాఖ్యలో శ్రీమల్లినాథసూరిగారు 'షడ్జస్వరము' సరిగమపదని అను వానిలో 'స' అనునది "శుద్ధీ వికృత భేదన ఆవిష్కృతావస్థాయాం చ్యుతాచ్యుతభేదేనవా షడ్జ ద్వివిధః" అని వ్రాసిరి. పైఏడు అక్షరముల స్వరములలో షడ్జ పంచమ (ప)ములు సర్వభేదము కలవికావు. పంచమముతో సంబంధములేని రాగములు ఉన్నవికాని షడ్జముతో సంబంధము లేని రాగము లేనేలేదు. రాగ మేదియైనను షడ్జస్వరములో లీనము కావలసినదే ఈ స్థితిలో షడ్జముగూడ రెండు విధములు అనఁగా దానిని రెండు విధములుగా పలుకుట సాధ్యమే కాదనిపించుచుండఁగా, కాళిదాస మహాకవి

“ద్విరాభిన్నాః” అనుదానికి వ్యాఖ్యతలు వ్రాసిన వివరమునుబట్టి 'ఆ' స్వరభేదమును గంధర్వులకే పలుక సాధ్యమని మానవులకు సాధ్యముకా దని తెలుఁగు లిపి వ్యాఖ్యలో నున్నది. శ్రీదాసుగారు పలికి చూపించినను ఎవరో ఒకరిద్దఱు వారిశిష్యులు తప్ప తక్కిన వారికి కర్ణగోచరమే అయియుండదేమో!

17) కాళిదాస వాల్మీకుల కవితామహనీయతలతో, మనోభావమధురిమలతో కథను నడిపినారు. ఆనాఁటి శ్రోతలతో వేద శాస్త్ర పురాణేతిహాస విజ్ఞులు “కథాగానవాచస్పతి” అనిరఁట!

23) వ్యాసుఁడు వేదార్థప్రతిపాదకములైన భారతాదులు లిఖియింపఁగా వారిని “కారణజన్ములు” అనిరి. అట్లే శ్రీదాసుగారును అందలి కథలను హరికథలుగా రూపొందించి గానముచేసినారు. వారి శిష్యులును అట్లే చేయుచున్నారు.

24) ప్రాచేతసుడు తపసువల్ల వాల్మీకను బిరుదు పొందినాఁడు. శతకోటి ప్రవిస్తరమౌ మహాకావ్యమును రచించి కావ్యగుణములైన సౌందర్యాదులను వర్ణించి రససిద్ధిని పొంది, పఠితలను సైతము ఆచంద్రార్కము రససిద్ధులను గావించిన కావ్యశిల్పము అజరామరము. అట్లే శ్రీదాసుగారు ఆ ఋషి చంద్రుని యోగశక్తిచే కొల్చి అఘమర్షణ మంత్రస్నానము (పురుషులు, తమ తమ అన్ని విధుములైన పాపములను, తాము స్నానము చేయు నీటిలో ఉన్నా 'క్రూర - అమేధ్య- అశాంత' అను మూడు చెడ్డగుణములను పోగొట్టి శారీరకముగా మానసికముగా తమ్ము పవిత్రులను చేయుమని వరుణుని ప్రార్థించు మంత్రభాగము - దీనినే 'అఘమర్షణ సూక్తము' అందురు, 'సుడులలో త్రిప్పి చంపుట' అనునది వీటియందలి క్రూరగుణము. పాచినురుగు మొదలగు అపవిత్ర వస్తువులతో గల సంబంధమే అమేధ్యము- "వేడి, పైత్యమ్ము వాతము, శ్లేష్మము" అను గుణములు నీటిలో గల 'అశాంతము' అనునది) చే నిత్యపునీతులై వాచికము, ఉపాంశువు మానసికము అను మూడు విధములైన జపము. "స్వాధ్యాయము” అను వీని ఫలితమే శ్రీదాసుగారికి కవితాశక్తి గలిగించినది.

25) శ్రీదాసుగారి రచనలు సర్వప్రజాసంక్షేమమును. భక్తజనులకు మాంగల్యము (మేలును) గలిగించునవి.

27) సదా సంతో భిగంతవ్యాః యద్యవ్యుపదిశంతి నో
    యాహిస్వైరకథాస్తేషాం ఉపదేశా భవంతి హి”

అను పెద్దల సూక్తికి "శ్రీదాసుగారు ఉదాహరణభూతులు" అను విషయమునే (ఎప్పుడును) సహృదయయులైన పండితులకును, పెద్దలకును సేవచేయుము. వారు నీకు ఏదేని మంత్రోపదేశము చేయుటలేదు అని అనుకోవద్దు. వారు మాటలాడు మాటలనే నీవు వినుచున్నచో ఆ మాటలలోనే నీకు కొన్ని ఉపదేశమువలె మేలు కలిగించును. 26 అంశము నందలి, "ఓ బాబూ! కథచెప్పే నైపుణ్యం నేర్పు”డని ఒకశిష్యుడు చనువుతో అడిగెను. “ఒరే శిష్యా! నన్ను ఎపుడు చూస్తుండుము. నా మాటను నా తీర్పును చూస్తుండుము" అను మాటలే వానికి ఉపదేశముకాగా భ్రమరకీటకన్యాయమున 10 సంవత్సరాలు అట్లేచేసి ఆ శిష్యుడు శ్రీదాసుగారి అనుగ్రహ పాత్రు డైనాడు - ఇట్టివారెందరో, అను విషయము.

మఱియు

“-అభినయోచితముగ - లాస్య తాండవ ప్రజ్ఞల తెలిపినారు చూపినారు”

స్త్రీ చేయు నాట్యమును 'లాస్యము' అని, పురుషుడు చేయు నాట్యమును 'తాండవము' అని పెద్దలు అందురు. శ్రీదాసుగారు స్త్రీపాత్ర చేయు లాస్యమును, పురుషపాత్రము చేయు తాండవమును, కథాభాగము ననుసరించి వారు అభినయించుటయేగాక, వాని వాని భేదములను, ఆ ప్రక్రియల భంగిమలను లాస్య తాండవ భేదములను బట్టి శిష్యులకు నేర్పుట మరియొక ప్రతిభ. ఇది అనన్యసాధ్యము.

27) 'శంభో' అను ఆలాపన - 'గోవిందా' అను స్మరణం……”

'శంభో' అనువాఁడు 'శైవుడు' 'గోవిందా' అనువాడు 'వైష్ణవుడు' అని సామాన్యాభి ప్రాయము. హరిహరులందు భేదములేని భక్తులు 'హరిహరాద్వైతులు'. ఇది ఉన్నతస్థాయికి పోయినప్పుడు ఎట్లుందురు? ఆ భక్తియందలి అద్వైతము ఎట్టిది? అని ఆలోచించినచో, తిక్కయజ్వ మున్నగువారు కొందఱు చరిత్రలో నున్నారు. తిక్కయజ్వ "కిం కాలకూటః కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభో మే" అని స్తుతించెను. హరిహరనాథునకు అంకిత మిచ్చినందున ఈ స్తోత్రములోని విశేషణములు క్రమముగా హరిపరముగా హరపరముగానే అన్వయమునకు రావలసియున్నవి. కాని శ్లోకమునందు

     "ఓ ప్రభూ! నీకు ఆస్థిమాల (పునుకలమాల) ఇష్టమా? లేక కౌస్తుభ
      మణి యిష్టమా? అట్లే "నీకు కాలకూటవిషము రుచిగా నుండునా?
      లేక యశోద యిచ్చిన చనుబాలు రుచిగానుండెనా? తెలుపుము”

అనుటలో మొదట హరికే విశేషణములు ఉండవలెను.

కాని ఆస్థిమాల, కాలకూట పదములు మొదట నున్నవి. ఇవి శివునికి విశేషణములు, అట్లె “కౌస్తుభము, యశోదాస్తన్యము" అనునవి హరిపరమైనవి. అవి తరువాత నున్నందున శ్లోకమున హరిహరుల వరుస తప్పినట్లు అనిపించును. కాని హరియందు, ఆస్థిమాలను, కాలకూట పానమును, హరుని యందు కౌస్తుభమణిని, యశోదాస్తన్యపానమును దర్శించిన తిక్కయజ్వ హరిహరాద్వైతి కావుననే ఇట్టివారిస్థితినిఁ గూర్చి: -

       "హరేహరేతి నామ్నా వైశంభో చక్రధరస్య చ
        రక్షితా బహవో మర్త్యాః శివేన పరమాత్మనా"

అని పెద్దల సూక్తిని, ఇచట సమన్వయించు కొనవలెను.

హరే=ఓ విష్ణూ!, హర = ఓ శివా!, ఇతి, అని శంభోః=శివుని యొక్కయు చక్రధరస్యచ = విష్ణువు యొక్కయు, నామ్నా= పేరు (స్మరించుట) చేత శివేన = మంగలకరుఁడైన (తన నామస్మరణము చేయు వారికి మేలు గలిగించునట్టి) పరమాత్మనాః సర్వాంతర్యామి, సర్వాత్ముఁడును అయిన దైవము (హరిహరాభేదమూర్తి) చేత, బహవో మర్త్యాః = పెక్కుమంది మనుష్యులు (భక్తులు) రక్షితాః = కాపాడబడిరి. అనఁగా ఒక భక్తుఁడు శివుని ఓ విష్ణువూ, అనియు విష్ణువును, “ఓశివా” అనియుఁ బిలిచినను వారు భక్తులను కాపాడుదురు అని తాత్పర్యము. శ్రీదాసు గారి భక్తియు ఇట్టిదే.

28) శిష్యులను హరికథకులుగా తీర్చిదిద్ది వారిని తన దగ్గఱనుండి సాగనంపునపుడ "పుణ్యకార్యవిజయోపేతులు గండు" అని దీవించుట వారి పరిపాటి.

29) కులమత భేదాలను స్త్రీ పురుష భేదాలను పాటింపక వారిని దగ్గఱదీసి ఎవ్వరిని కించపరచక, సమయానుకూలముగ వారిని హెచ్చరించి, పీడితాళిబాధలు దీర్చు ప్రగతిశీలురు. ఇట్లే స్త్రీలను పెక్కుమందిని హరికథా కథనదక్షలనుగా చేసిరి. ఈ వివరమును పాఠకులు 34వ భాగములోను చదువుకొనవచ్చును. ఒకదాసిని


దేవదాసినిఁగా చేసిన కథ - ఈ కథలోనే

    “దేవదాసిరూపంతో -స్వయంగాను అభినయిస్తు”
     .. . . . స్తనవల్కల వసనమ్ములు - కడు రమణీయముగ దాల్చి॥
     . . . . . సర్వజనుల స్త్రీ పురుషుల- నందరినీ కొంతవఱకు
     తన వలెనే స్త్రీలజేస్తు - రజోభావ రాధికలుగ
     కృష్ణ భుజింగికల వోలె - భిన్నభిన్న గోపికలుగ
     పరివర్తనచేయటమ్ము...”

అను వర్ణనములో శ్రీ సోమయాజులుగారు “రజోభావరాధికలు” అనుటలోని సారస్యమును సహృదయరసికులు గమనింపఁగలరు. మఱియు గోపికలు “కృష్ణభుజింగికలవోలె” అనుటయు, ఆ గానమునకు గోపికలు పెంటి నాగుబాములవలె ఆనందమున మునింగిరి అనుట సామాన్యము. కాని 'విటుఁడు, నాయకుఁడు' అను అర్ధము నిచ్చు భుజంగ శబ్దమును గ్రహించి "కృష్ణుఁడుభుజంగుఁడుగాఁగలవారు” అను బహువ్రీహిని ఆశ్రయించినచో పఠితలు ఆ గోపికాకృష్ణుల చిత్రములను తమ మనఃపటములపై దర్శింతురు. ఇట్టి దాసుగారు "స్త్రీపురుషుల నందరినీ... తనవలెనే స్త్రీలజేస్తు" అను వాక్యమును చదువగానే శ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారు ఆముక్తమాల్యద పీఠికలో వ్రాసిన

    "గోవిందనందతనయా చ వపుఃశ్రియా చ
     మాస్మిన్ నృపే కురుత కామాధియం తరుణ్యః
     అస్త్రీకరోతి జగతాం విజయే స్మరః స్త్రీః
     ఇనః పునరనేన విధీయతే స్త్రీ”

(ఈ శ్లోకముగుర్తుకు వచ్చుచున్నది అనఁగా పురుష మూర్తి అయిన దాసుగారు వేషమును ధరించినపుడు పురుషులను మోహింపఁజేయగలట్లు తోఁచుట వారి వేషరచనలోని నైపుణ్యము అనవచ్చును. కాని స్త్రీలను సైతము మోహింపజేయుట యెట్లనిపించును. స్త్రీలకు అమూర్తి స్త్రీవేషధారిణి అని కనఁబడుచున్నను "దాసుగారు పురుషుండే" అను భావము వారి మనస్సులకు బాగుగాఁ దెలియు చున్నది కాఁబట్టి వారికి స్త్రీ వేషములో పురుష మూర్తియే మోహజనకముగా గనఁబడినట్లు మన మూహింపవలసియున్నది. ఉపాయనలు

791




27) శ్రీ దాసుగారు రచించిన “దశవిధరాగనపతికుసుమాంజలి" అను వీరి
    గ్రంథమునకు పీఠిక వ్రాసిన శ్రీ నూకల సత్యనారాయణగారు "విద్యార్థులకీ
    మాలిక బోధిస్తే మొదటి రాగమును నేర్చుకొనేటప్పుడు విద్యార్థిగ నున్నవాడు
    ఆ నూటెఎనభయ్యో రాగమ్ము చేర్చి పాడగలిగి నట్టివాడు విద్వాంసుడుగా
    రూపొందును అన్నది నిర్వివాదమౌ వంశము” అనిరి.

ఈ భాగమునందే దాసుగారి “పంచముఖీషణ్ముఖి" అను అపూర్వరాగ
తాళపంచముఖి విషయముగూడ కలదు.

29) దాసుగారు వ్రాసిన 'జానకీశపథః' హరికథ, ఇందలిపాటలకు దాసుగారి
    స్వరకల్పన అపూర్వము.

46) శ్రీ ఓరుగంటి నీలకంఠశాస్త్రిగారు దాసుగారినిఁ గూర్చి వ్రాసిన విషయమును
    శ్రీ సోమయాజులు చిత్రించిరి.

ఇట్లు వ్రాయుచుఁబోయినచో ఈ వ్రాఁతయే పెద్దదగుననియు, శ్రీ దాసుగారి
సూక్తులు ఎల్లరకు పాటింపఁదగినవిగాఁ దోచినందున వానిని సంగ్రహముగా
వ్రాయుచున్నాను.
47)
     1. ఎవ డధికముగా నెరుంగునో అతఁ డల్పముగా చెప్పును.
     2. వినతివల్ల ఎన్నండును ఏలోపము ప్రాప్తింపదు.
     3. ఆల్పముగా మాటాడుము అధికముగా గృషి చేయుము.
     4. ఉత్తమమౌ ధ్యానమ్మును నీవు విడిచిపెట్టకుము.
     5. ఆరోగ్యము ఘనభాగ్యము. క్రమము తప్ప కెపుడును గడియారము వలె
        ఉండవలయు.
     6. సంభాషణ సామర్థ్యానికి మౌన మలంకారమ్ము.
     7. జ్ఞానము ప్రేమల కలయికయే పూర్ణత, ఆనందము.
     8. సజ్జనులతో స్నేహము - పురాణశ్రవణము - దైవచింతనము మొదలైనవి
        జ్ఞానప్రస్థానంలో ప్రథమమైన మజిలీలు.



    

       9. నిద్రను స్వప్నాలచేత, స్త్రీలను ఆసక్తులతో, అగ్నిని చిదుగులచేతను
          దాహమ్మును మద్యంతో ఓడింపంగాలేము.

      10. కలియుగమ్ములోని దోషములలో శ్రీకృష్ణుని సంకీర్తన మొకటియె
          సుగుణము.

      11. వైరాగ్యము ప్రమిద, భక్తి తైలము, ఏకాగ్రతవత్తి, తత్త్వవిచారణ అనే
          అగ్నిగా జ్ఞానజ్యోతి చక్కగా వెలుగును.

             "సంసార విషవృక్షస్య ద్వే ఫలే అమృతోపమే
              కావ్యామృతరసాస్వాదః సల్లాపః సజ్జనై స్సహ” అను సూక్తికీ

      12. తెలుఁగుగా "సంసార మనే విషవృక్షమ్మునుండి సత్సాంగత్యమ్ము, సాహితి
          ఆరాధన అనియెడి రెండు సత్ఫలాలు లభ్యమౌతాయి” అనిరి.

48) "జ్ఞానరహిత మైన కర్మ నిష్ప్రయోజనమ్మైనది.” ఈ సూక్తితాత్పర్యముగా క్రింది
     శ్లోకము చూడదగును.

     "హతం జానం క్రియాహీనం హతాస్త్వజ్ఞానతః క్రియాః
      అపశ్యన్నంధకో దగ్గః పశ్యన్నపి చ పంగుకః" (మునిభావబోధిని)

ఒక యింటిలో ఒక కుంటివాఁడు, ఒక గ్రుడ్డివాఁడును ఉన్నారు. ఒకనాడు
హటాత్తుగా ఆయింటికి నిప్పు అంటుకొన్నది. కుంటివాఁడు (కర్మచేయుటకు
తెలియనివాడు. జ్ఞానముగల వాఁడైనను) నడిచిపోలేకయు, గ్రుడ్డివాడు (కర్మలు
చేయువాఁడైనను జ్ఞానము లేనివాఁడు) ఎటుపోవుటకుఁ దెలియనందున వీడును
మంటకు ఆహుతి అయిరి. కాన కర్మజ్ఞానములు రెండును ముఖ్యములే కర్మములను
నిర్వహించుచు చిత్తశుద్ధి ద్వారా జ్ఞానమును సంపాదించినను లోక సంగ్రహమునకైనను
ఆ జ్ఞానికి కర్మాచరణము తప్పదు, అను విషయమునే దాసుగారు సూక్తిగా వ్రాసిరి.

     “దీక్షతోడ సాగరమ్ము - లోన నెంత లోతు దిగిన
      అన్ని రత్నములు లభించు - అట్లె పురాణాలలోన
      విల్వగల్గు విషయమ్ములు - మనకు లభ్యమౌతాయి”

పై దాసుగారి వాక్యాలకు : Errors like straw upon the surface of the flow. He
would search for pearls he must dive below అను సూక్తికిఁ దెలుఁగుగానున్నది.
ఈ వీరి సూక్తులకు ఏ యే భాషలలో మూలములున్నవో శ్రీదాసుగారికే యెఱుక

శ్రీ సోమయాజులుగారు మొదటి అంశములో “స్వయంలేఖనమ్ము” అని ప్రారంభించిరి. ఈ స్వయంలేఖనమును గూర్చి శ్రీ వేమూరి వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు తమ వ్యాసములో పూర్వ పక్షసిద్ధాంతములను చక్కగా నిరూపించిరి. ".... ఈ పైవివరణమును దృష్టిలో ఉంచుకొన్నట్లయితే దాసుగారి వంటి మహాజ్ఞానికి తన నరజన్మ తీరినతరువాత కైవల్యము పొందినపుడు" "న సత్యప్రాణాః ఉత్క్రామంతి... అత్తైప సమవలీయంతే న స పునరావర్తతే" అను సూక్తులను బట్టి ఆలోచించితే వారికి సూక్ష్మశరీరమే మిగిలియుండదు. అమనస్కస్థితిలో ఉండే యోగికి లేఖనక్రియను నిర్వహించే అవకాశ మెక్కడిది? - మరొక అంశము. దాసుగారికి మానవదేహము లయించిన తరువాత వారి ఆత్మ సరస్వతియే యైనపుడు ఆ సరస్వతి గాని, లేక ఆమెయందు లీనమయిన నారాయణదాసు జీవాత్మ గాని మరల. "నేను నారాయణ దాసును, వచ్చి యీ నా అవతార వివరము వ్రాయుచున్నాను" అని చెప్పకొనుట యెట్లు పొసగును? అని ఒక పూర్వపక్షమును కల్పించి -

..."సరస్వతీ సాయుజ్య మందిన - లేదా సరస్వత్యైక మందిన దాసుగారి యాత్మ 'కామరూపత' అనే యిచ్ఛానుసార శరీరధారణ సామర్థ్యముతో దాసుగారి సూక్ష్మశరీరము నాపాదించుకొని సాధకుల హస్తము ద్వారా తన ఆశయాన్ని లిఖించడము అసాధ్యము కానేరదు" అని సిద్ధాంతమునుగా సముచితమైన సమాధానమును వ్రాసిరి. వీరి - వ్యాసము చాల పెద్దది. తప్పక చదువ దగియున్నది.

శ్రీ నారాయణదాసుగారి చరిత్రను దెలుపు "ఉపాయన”లు “ఒక రత్నాకరము” అని మొదటనే మనవిచేసియున్నాను. దానికి ఈ "దిక్సూచి" లవమాత్ర ముపయోగ పడినను అది శ్రీనారాయణార్చకులలో నొకడనై నే నర్పించిన ఒక చిన్నపూవు అని సహృదయులకు మనవి.

అజ్జాడ గ్రామమున రక్తాక్షి శ్రావణ బహుళ చతుర్దశి బుధవారము 31-8-1864 నాఁటి శుభదినమున శ్రీ లక్ష్మీనరసాంబా వెంకటచయనులకుఁ బుత్రరూపమున అవతరించిన శారదామూర్తి. తారణ పుష్యబహుళ పంచమి 2-1-1945 నాఁడు అవతారము చాలించినను ఆ స్పూర్తి ఆచంద్రార్కము భూలోకమున నిలిచియే యుండుననుట సత్యము.

1967 జయంత్యుత్సవసంచిక (123) లోని శ్రీ ఓ. నీలకంఠశాస్త్రిగారి:



"బాధాకరమగు విషయము భూతభవిష్యత్తులను గూడ వర్తమానస్థితికి గొనివచ్చి సకల జన ప్రత్యక్షముచేయగల శాస్త్రసంపద అనాడే మనకున్నను "ఈ రేడియోలు" - గ్రామఫోనులు "ఫోటోగ్రఫీ"లు అన్ని మహాత్ముల గానామృతమును నృత్యదృశ్యములను శాశ్వతీకరింప లేకపోవుట భారత దేశమున కెంతయో తలవంపు అనుటకెట్టి సందేహము లేదు. ఆనాటి యధికారి బృంద మట్టిది. వారలు విశ్వమునకు తత్రాపి భారతీయులకు మహాద్రోహము చేసినట్లు తలంపవలసియున్నది. ప్రకృత మేమనుకొనిన నేమి లాభము?

   "ముకుటే రోపితః కాచః చరణాభరణే మణిః
    న హి దోషో మణేరస్తి కింతు సాధో రవిజ్ఞతా”

"కిరీటమున గాజుముక్కను, అందెకు మణిఖండమును, పొదిగినచో అది వాని అజ్ఞతయే గాని మణిదోషము గాదు” అను నీవాక్యములును సత్యములే.

ఈ “ఉపాయన”లను కీ.శే. సహృదయ నిరాడంబర విద్వద్రత్నము శ్రీ నీలకంఠ శాస్త్రిగారికి అంకితము గావించిన కవివతంసులు, పండితశౌండులు శ్రీ వావిలాల సోమయాజులుగారు. వీరిని గుఱించి నేను ప్రత్యేకముగా వ్రాయుట కంటె ఈ “ఉపాయన”లలోని 10వ భాగమున చూడఁదగును.

ఈ “ఉపాయన”లను “గానయోగ్యఛందస్సు”లో వ్రాసినట్లు గ్రంథకర్తగారే చెప్పియున్నారు. ఇట్టి గేయాలలోని భేదములలో, తోహరాలు, మంజరులు, నర్తకి, మున్నగువానిని శ్రీదాసుగారే వారి మార్కండేయచరిత్ర, సావిత్రీ చరిత్రము అను స్వీయరచనలైన హరికథలలో ప్రవేశపెట్టి నట్లు జయంత్యుత్సవ సంచికలో శ్రీపంతుల లక్ష్మీనారాయణశాస్త్రిగారు వ్రాసియున్నారు. శ్రీ సోమయాజులుగారు ఇందు 48వ భాగములో మన్వాది స్మృతులలోని ధర్మములను భంగ్యంతరముగా తేలికయగు మాటలలో వ్రాసిరి.

“మానవుండు తన్ను తానె - రక్షించు కొనంగా వలె”

(ఆత్మానం సతతం రక్షత్) అని మొదలు పెట్టబోవుచు “సహనావవతు సహనౌ భునక్తు.. తేజస్వి - నావధీతమస్తు - మా విద్విషాపహై” అను శాంతిమంత్రమును గూడ సులభశైలిలో:

"భగవంతుడు మన నిర్వుర - రక్షించుత, పోషించుత
మన నిరువుర, ఇరువురమును - శక్తివంతులముగ నై

       శ్రమియింతముగాత మనము - మన అధ్యయనము తేజో
       వంతమ్మగుగాక - ఎప్పుడు - ద్వేషము లేకుండా ఇరు
       పురమును మనియెదముగాక" అని వ్రాసియున్నారు.
       "కృతతీర్థ పయసామి వాశయః - సతు తత్ర విశేష దుర్లభః”

“కాలువ, చెఱువు, లేక నీటిమడుగు మున్నగు వానిలో రాఁబోవువారికి స్నానము చేయుటకె దిగుటకు వీలుగా రేవును ఏర్పాటుచేయువాఁడు అరుదు. అతఁడే పొగడదగినవాఁడు" అనిన బాలకవిసూక్తి ననుసరించి యిట్టి గేయ భేదమును మొట్టమొదటగా శ్రీదాసుగారి చరిత్రలోఁ బ్రవేశపెట్టిన కీర్తి శ్రీ సోమయాజులవారిదే.

శ్రీ నారాయణదాసార్చకులు శ్రీ కర్రా ఈశ్వరరావుగారు. వారి యర్చనలో 'ఉపాయన'ల నీరాజనమిచ్చినవారు శ్రీ సోమయాజులుగారు. దానినిఁ గన్నుల నద్దికొనుటయే నా యీ కృత్యము. ఇందెంతమాత్రము కృతకృత్యుఁడనో భావికాలమున సహృదయులైన చదువరులే ప్రమాణము. నా కీ యవకాశమిచ్చిన మిత్రులు శ్రీ ఈశ్వరరావుగారికిఁ గృతజ్ఞత.

ప్లాట్ నెం. 21 అన్నపూర్ణనగర్

వట్టిపల్లి మల్లినాథశర్మ

అమరావతిరోడ్ గుంటూరు-34

8-1-1990

శుక్ల-పుష్యశుద్ధోపైకాదశి.




ఉపాయనలు


1. శ్రీ నారాయణదాస
   'స్వయంలేఖనమ్ము' ఇద్ది'
    ఈ నూతన సాధనమ్ము
    నవ్య మార్గ గామి అయిన
    ఆమహనీయుని జీవిత -
    పూర్వరంగమును దెలిపెడి
    నమ్మోహన పరికరమ్ము
    గాన కళా ప్రావీణ్యము,
    ముగ్ధ నృత్య రమణీయత,
    కథాకథన సౌభాగ్యము
    కవన మహావైదుష్యము,
    సురగురు విజ్ఞాన గరిమ
    విలసిల్లగ, వికసిల్లగ
    చేరినట్టి సర్వజ్ఞుడు
    నారాయణదాస ద్రష్ట

  

*


2. నారాయణదాస సుకవి
    భీరహితుడు, ధీచతురుడు,
    బహుముఖీన ప్రజ్ఞానిధి,
    నవ్య దివ్య పుంస్కోకిల,
    బ్రాహ్మీమయ భవ్యమూర్తి,
    వివిధకళా కోవిదుండు
    విద్య త్సంస్తవనీయుడు

    

*


    సంచితబహు శాస్త్ర భట్టు
    శ్రద్ధాయుత ఛాత్రగోష్టు
    కళలెన్నింటికి భట్టు
    ఆది భట్టు, పుంభావ స
    రస్వతి అని బహురీతుల
    అనురక్తితో, పూజ్యతతో
    కీర్తింపగబడుచు గ్రంథ
    రచన చేసి లోకానికి
    జ్ఞానమ్మును పంచియిచ్చి
    ధార్మిక జీవితము గడిపి
    అమరలోక మరిగినారు
    హరికథాపితామహుండు!

*


3. పిదప కొంతకాలానికి
    బంధు శిష్య భక్తాళికి
    సర్వ రసిక లోకానికి
    తా నెవరో తెలుపుకొనం
    గావలె అను ఆసక్తితో
    'స్వయంలేఖనమ్ము' అనే
    ఈ సాధన స్వీకరించి
    దీనిద్వార ఆదిభట్టు
    తన జీవిత పూర్వరంగ
    గాథను విన్పించినారు

      

*


4. శ్రీనారాయణదాసుని
   'స్వయంలేఖన' ప్రక్రియ
    మంజులమ్ము, మోహనమ్ము,
    చేతనత్వ సముపేతము,




ధార్మికశృంగారయుతం,
మహాభక్తి సంభరితం
భాస్వన్నవ విభవములకు
బంధుర సంశోధనలకు,
రమ్యరమ్య భావనలకు,
రజ్య[4] న్మధు భాషణలకు
చేతోభవ భావములకు
చిత్రచిత్ర వర్తనలకు
ప్రవిమల విశ్లేషణలకు
విదిత జనాకర్షణలకు
విలస న్నవ నిలయమ్ము
ఒక్క మహత్కార్యార్థం
ఒక్క నవ్య సృష్ట్యర్థం
మనసు నిశ్చయమ్ముచేసి
భారతి పుంరూపంతో
పుడిమిపైన ప్రవర్తింప
ఆదిభట్ట నారాయణ
మూర్తితోటి అవతరించి
అక్కార్యము నాచరించి
అద్భుతవిఖ్యాతి తోడ
తిరోగమన మొనరించిన
సత్య కథా కథనమ్ము!

—♦♦♦♦§§♦♦♦♦—

5   జన రంజన కర్మవీర
సర్వ దేశ పరీవార!![5]
సద్గుణగణ బహుభూషణ
ధర్మకర్మ రణభీషణ!!
ప్రౌఢ భక్తజన నేతా,
సజ్జనగణ సంత్రాతా!!
పరమభక్తి అగ్రగామి
జ్ఞానభూమి గోలోమీ[6]
అజ్ఞులయెడు దాక్షిణ్యత
విజ్ఞుల జేసెదవు వారి
క్షేత్రజ్ఞుడవైన నీకు
చిరు భక్తులపైన ప్రేమ
చేర్తు వారి వైకుంఠము
ఆదిభట్టు, వాగధిపతి,
అల్పజ్ఞుడ నైన నన్ను
విజ్ఞుని గావించెదవో!
మధురభక్తి సంభరితను
మానిని 'రాధను' జేతువా
నారాయణభట్ట! దిట్ట!!
నా నమస్సు లందుకొనుము
ఓహో, విజ్ఞానఖనీ!
ఆహహా! ఆనందవనీ
అమ్మా, ఓ వాగీశ్వరి!
అందుకొమ్ము వందనముల!
అందుకొమ్ము ఈ కాన్కల!

—♦♦♦♦§§♦♦♦♦—

6 . ఓ నారాయణ దాసా
ఓ దాసా! దాసదాస
నీవె స్వయంగాను వచ్చి
'స్వయంలేఖ' నాన్ని మాకు
వ్రాసి యిచ్చుకొన్నావు
శ్రద్ధతోటి, భక్తితోటి
నిష్ఠతో పఠియించినాను
అందు నీవు నిన్ను గూర్చి
శారదావతారుడ నని
తెలియ జెప్పుకున్నావు




నీదు స్వయంలేఖనాన్ని
నేను నమ్ముతున్నాను.
శారదగానే భావన
చేసి మ్రొక్కుతున్నాను.
నీవు 'స్వయంలేఖ' నాన
[7]అబ్జయోని జాయ ననీ,
[8]నాభీకమలుని సతినని
స్వయంజ్యోతి పత్ని ననీ,
శ్రీ జ్ఞాన సరస్వతి నని
శారద నని, భారతి నని
మృదులోక్తుల, మధుశక్తుల
చిత్ర చిత్ర విలసనలతో
తెలియ జెప్పుకున్నావు
'స్వయంలేఖ' నమ్ము నందు
స్ఫురియింపగ జేసి నట్టి
అంశమ్మును విశ్వసించి
శారదవను నమ్మికతో
అర్పించితినయ్య నీకు
సాష్టాంగ నమస్కారము.

—♦♦♦♦§§♦♦♦♦—

7  నారాయణదాస! నీవు
శారదావతారమ వని
నమ్మువారు నమ్ముతారు!
నమ్మువారు వేనవేలు!
నమ్మనివారా నమ్మరు
వారు ఎందరో ఉందురు!
ప్రతియుగాన లోకంలో
పరమేశ్వరు నవతారా
లను నమ్మిన యట్టివారు
నమ్మజాల యట్టివారు.
ఉంటూనే ఉంటారు.
శ్రీ హరి అవతారాల్లో
పరిపూర్ణమ్ములు రెండు
శ్రీరాముని అవతారం,
శ్రీ కృష్ణుని అవతారం!
ఈ రెంటినె నమ్మినట్టి
వారు జగతి నెంతొమంది,
నమ్మనివా రెంతొమంది
తొలుత నమ్మనట్టివారు
పిదప నమ్మువా రెందరొ
వాగీశ్వరివే నీ వని
నారాయణదాసు శార
దావతార మనీ జగము
నమ్మటములో నైనా
ఇట్టి అంతరాలుంటవి
అయితె, మీరు "శారదావ
తారు" లనెడివారి దేను
లోకంలో మేలు చేయి,

—♦♦♦♦§§♦♦♦♦—

8   సిరుల కాటపట్టు విద్య
లెల్ల పట్టినట్టి యిల్లు
[9]కర్మఠుల నివాసభూమి
జ్ఞాను లయినవారి కాల
వాలమ్మును, భక్తజనుల
కునికిపట్టు ముసీ క్షీర
నదీ గుండ్లకమ్మలు ప్రవ
హింపంగా, తృణజలకా
ష్ఠాది సమృద్ధిని వహించి

  1. ఆంధ్రవిశ్వవిద్యాలయ కెమిస్ట్రీ, ఎం.యస్.సి. పరమ పట్టభద్రుడు.
  2. ఉత్తర దిశన ఉండే సుస్థిర నక్షత్రము (పోలార్) పౌరాణికము
  3. అబ రవీంద్ర నగరమున నధివసించు - పాఠాంతరము.
  4. రజ్యత్ = శోభించుచున్న
  5. పరీవారుడు =సముదాయము కలవాడు
  6. గోవుల(పవిత్రమైన) తనూరుహములు (వెండ్రుకలు) గలవాడా
  7. అబ్జాయోని = పద్మమునందు పుట్టినవాడు
  8. నాభీకమలుడు = శ్రీమహావిష్ణువు నాభీ పద్మమైనవాడు - బ్రహ్మ
  9. కర్మఠులు = కర్మలనాచరించువారు