వాడుకరి:Bhavya ECE/sand box

వికీసోర్స్ నుండి

శ్రీ ర స్తు

వాఙ్మయసూత్ర పరిశిష్టం.

ద్వితీయాధ్యాయం.

నేటికాలపు కృతిరచన

1. నేటి కాలపుకృతుల్లో పద్యం విచారితపూర్వం తక్కిన దేశేతిహాసం పత్రికారచనలు మొదలైనవాట్లో ఉపజ్ఞవిరళం.

2. చౌర్యం బహుళం.

3. అంగాంగి వివేకం మృగ్యం.

4. విచార్యమాణ విషయానబిజ్ఞత తరుచు.

5. తర్జుమాల అమార్గగామిత్వం ప్రాయికం.

6. నేటికాలపుకృతుల్లో వ్యుత్పత్తి వికసితమైన ప్రతిభ అరుదు.

7. భాషావ్యతిక్రమం అసౌష్ఠవం, ఛాందసాలు నేటికాలపుకృతులను వికృతం ఛేస్తున్నవి.


అని శ్రీ - ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర పరిశిష్ఠంలో ద్వితీయాధ్యాయం

"శ్రూయతే చ కువిన్దో నామ రాజా తేన పరుషసంయోగాక్షర వర్జం అన్తఃపుర ఏవేతి."

(కావ్యమీ)

1. కున్తలదేశంలో సాతహహనుడనేరాజు అంతఃపురంలో మాత్రం ప్రాకృతశబ్దాలు తప్పమరి అన్యం మాట్లాడగూడ దని నియమం చేశాడు.

2. మగధదేశంలో శిశునాగు డనేరాజు స్వాంతఃపురంలో మాత్రం ఉచ్చారణకు కటువైన ట. ఠ. డ. ఢ. లను శ. ష. హ. క్ష లను తప్పించి మాట్లాడవలె నని నియమం చేశాడు.

3. శూరసేన దేశంలో కువిందుడనేరాజు అంతఃపురంలో మాత్రం పరుష సంయోగక్షరాలను మాని మాట్లాడవలె నని నియమం చేశాడు.

అని రాజశేఖరుడు చెప్పుతున్నాడు ఇట్లా యీకట్వక్షరరహితమైన పదఘటన ఆడవాండ్ల అంతఃపురంలోనేగాదు కావ్యమార్గంలో గూడా యీకటుశబ్దాలు లేనిమార్గాన్ని బారతీయులు వినిపించారు

"చిత్తద్రవీభావమయో హ్లాదో మాధుర్యముచ్యతే, సంభోగే
 కరుణే విప్రలంభే శాంతేఃధికం క్రమాత్

                                                     

(సాహిత్య)

(చిత్తద్రవీభావమయమైన హ్లాదం మాధుర్యమనేగుణం సంభోగశృంగారంలోను కరుణంలోను విప్రలంభంలోను శాంతంలోను క్రమంగా ఈమాధుర్యమనేగుణం హెచ్చుగా వ్యక్తమవుతుంది.) అని సాహిత్య వేత్తలు చెప్పుతున్నారు. అంతేగాదు ఫలానిఫలాని అక్షరాలుగలపదాల సంఘటనవల్ల యీగుణం సిద్దిస్తుందని కూడా తెలిపినారు.

"మూర్ద్ని వర్గాంత్యవర్ణేన యుక్తాష్టఠడాన్ వినా
 రణౌ లఘూచ తద్వ్యక్తౌ వర్ణా। కారణతాం గతాః"
"అవృత్తి రల్పవృత్తిర్వా మధురా రచనా తధా"

(సాహిత్య)

(ట, ఠ, డ, ఢ,లు తప్ప "కా" మొదలు "మా" వరకు వుండే అక్షరాలు వర్ణాంతర యోగ రహితమైన ర, ణ లు ఈ మాధుర్యమనే గుణాన్ని వ్యక్తం చేస్తవి. రచన సమాసంలేకుండా గాని అల్పసమాసాలతో గాని వుండ వలెను) అని వివరించారు కనుక మీరనే గుణం కొత్తది గాదని దానివల్ల యిప్పటికవిత్వం నూతనమని అనడం అసంగతమంటున్నాను.

ఆక్షేపం

అవునుసరే, యీగుణం పూర్వకాలంలో గూడా వుంటే వుండవచ్చు మేమనేది అదిగాదు.

ఇప్పటి కావ్యాలు

"హృదయ మోహనమై ప్రేమ మృదులమైన
 తావకీన లీలాసుధాదళపుటంబు
 మామకీన ప్రణయభంగ మధుకణాళి
 విడిచెడు విరక్తిభాష్పముల్ విడుచుపోల్కి"
                                                 (తృణకంకణం)
 
"తనగుణ లతలుపూచిన శోభలో యన
      చిరునవ్వు వెన్నెల చెండ్లు విసరఁ
 దన మనోలీలగాంచిన రాగమధువనఁ
     బలుకు బంతులుపూలపాలనీయ"
                                                 (తృణకంకణం)

అని యిట్లా మెత్తమెత్తగా రచిస్తున్నారు.
  
"విశ్వమోహనం మృదులం
 పూలపాలు వెన్నెలచెండ్లు తియ్యములు జింకపడతి"

అని యిట్లాటి మెత్తమెత్త అర్ధంగల మెత్తటిమాటలతో యిప్పటి కావ్యాలున్నవి. ఇట్లాటివి వెనకటి కావ్యాల్లో లేవు. ఇదే నూతనత్వం. అని అంటారా?

సమాధానం.

చెప్పుతున్నాను అది అసంబద్ధం

"సంచారిణి పల్లవినీ లతేవ" (కుమార)
"పుంస్కోకిలో యన్మధురం చుకూజ" (")
"తాంబూలవల్లీ పరిణద్ధపూగా (")

శ్వేతాలతాలింగిత చందనాను" (రఘు)
"మధు ద్విరేఫః కుసుమైకపాత్రే" (కుమార)

"చెన్నగు నన్నదీవులిన సీమల దాగిలి మూతలాడుచున్
 వెన్నెల రేలు కప్పురపు విప్పు టనంటుల నీడనీగు ా
 కన్నెలరోయు నన్నులకుఁ గన్నులుమూయు తదీయవాసనల్
 మన్ననగాంచికప్రపు దుమారము రేచు సమీర డింభముల్"
                                                                 (వసు)

"నాథచివులురంజిల్లె ననలు మొలిచె
 నలరె విరులెల్ల పూపలు దలలుసూపెఁ
 బసిమి నిరవొందెఁ బిందియల్ బలసెనవశ
 లాటువులు సాంద్ర రుచుల ఫలంబు లెసంగె" (వసు)

"తీవ ముత్తైదువచాలు" (వసు)

"కెంపుల పళ్లెరంబులన్" (వసు )

"మొగ్గలు ముత్తెపు మ్రుగ్గులీనగన్" (వసు)

"కన్నెమావిగుంపునం బెనగొన్న మల్లియలం బూచిన కోనలు " (వసు)

"కనుగొంటి లతకూన ననిడాయు" (వసు)

"హృదయమోహనశక్తి నీయిందువదన
 యంచితభ్రూలతారేఖ కైనయపమ" (నై. 3ఆ)

"శ్రుతపూర్వంబగువిశ్వమోహనకళాశోభావిశేషంబు" (నై. 3ఆ)

"చిన్ని వెన్నలకందు వెన్ను దన్ని సుధాబ్ది.
 బొడమిన చెలువ తోఁబుట్టుమాకు" (మ)

"పూఁత పసిండివంటి వలపుంబచరించు కులంబునీతికిన్" (మ)

"పసమీరు సెలయేరు లిసుకవెట్టెడు చోటఁ.
 జిగురుమాపుల సంజ నెగడు చోట" (మ)

అవి యిట్లా మెత్తటి అర్ధంగల మెత్తటిమాటలు మన కావ్యాల్లో చిరకాలంనుండి వున్నవి.

ఆక్షేపం.

అవునయ్యా యిట్లాటివి వెనకటికావ్యాల్లో వుంటే వుండవచ్చును కాని అవి ఆకావ్యాల్లో కొన్నిచోట్ల మాత్రేమే వున్నవి. యిప్పటి కావ్యాలనేకాలు అంతటా మెత్తటి అర్ధంగల మాటలతో నిండి ఆద్యంతం మెత్తగా వుంటున్నవి ఇది కొత్త: అని వాదిస్తామంటారా?

సమాధానం

చెప్పుతున్నాను మీ రన్నట్లు ఇప్పటికొన్ని కావ్యాల్లో పద్యాలన్నీ మెత్తమెత్తటిమాటలతో మెత్తగా వుండడం నిజమే కావచ్చును. అట్లా పద్యాలన్నీ మెత్తమెత్తటి అర్ధంగల మెత్తమెత్తటి మాటలతో మెత్తమెత్తగా వుండడం దోషమని భారతీయులు మాని వుండవచ్చును. మధురం తియ్యని మృదులం మోహనం యిట్లాటివి నిండుగా వుండడం శబ్దవాచ్యత అనే దోషమని ముందు వివరించబోతున్నాను. ఇక వెన్నెల చెండు పూలపాలు అనే యిట్లాటిమాటలె అసంగతం. లౌకికమైనట్టి లేదా భావరూపమైనట్టి సంబంధంమీద ఆధారపడి సాదృశ్యంగాని ఆరోపంగాని కల్పన చేయవలసివుంటుంది. లేకుంటే యోగ్యతా విరహంచేత ఆమాటలు అసంబద్దమే అవుతున్నవి. వెన్నెల చెండ్ల వంటివి యిట్టాటి అసంబద్ధపుమాటలే అవుతవి విస్తరభీతి చేత యీచర్చ ఆపి ప్రస్తుత విచారణకు వస్తాను వెన్నెల చెండ్లవంటివి మంచిమాటలే నని కొంతసేపు వొప్పుకొనే విచారిస్తాను. ఇట్లాటిమాటలు మంచివైతే దేశకాలపాత్రాల ఔచిత్యాన్ని పరిపాలించి సందర్భానుసారంగా వాడితే ఆకావ్యం యింపుగానే వుంటుంది కాని పాలు, పూలు, చెండ్లు, మధురం, శిరీషం, పేశలం, మృదులం, జిలుగుపూలు, వెన్నెల యిట్లాటి మాటలతోనే నింపి కావ్యమంతా మెత్తటి అర్ధాల మెత్తటిమాటలతో మెత్తగావుండే టట్లు చేయవలెనంటే తప్పకుండావెగటూ, భావసంకోచం తటస్థిస్తున్నవి. దశరూపక కారుడన్నట్లు ఉక్తరసాల్లోరమ్యం, జుగుప్సితం, ఉగ్రం, ప్రసాది, గహనం, వికృతం అయి అనేక రూపాలతో వున్న ప్రకృతిని వాచ్యం చేసేకవికి తద్దనుగుణాలైనభావాలూ శబ్దరూపాలూ యెన్నో స్వీకార్య "రసాలను రస్యమానావస్థకుతెచ్చే ఒకానొక ప్రతిరూపమైన నవదృష్టి" అని నవత్వప్రతిపాద కత్వాన్ని ఆనందవర్ధనుడు ప్రశంసిస్తాడు

"నవేతి క్షణే క్షణేనూత నైర్వైచిత్ర్యైర్జగన్త్యా సూత్రయన్తీ"

(ధ్వ.లో)

(నవఅంటే క్షణక్షణం నూతనవైచిత్ర్యాలవల్ల జగత్తులను చిత్రిస్తూ) అని పైపఙ్త్కులకు అభినవగుప్తపాదులు వ్యాఖ్యచేశారు. ఈ తీరుగా భారతీయులు కవిత్వంయొక్క నూతనత్వాన్ని ఆరాధిస్తున్నారు.

సంస్కృత సంప్రదాయాలను అనుసరించడంవల్ల నూతనత్వానికి అడ్దుగలిగి వాటిమీద ఇప్పుడాదరం తగ్గిందని భారతి సం- 3. సం- 3 లో ప్రకటితమైన వ్రాత అజ్ఞానమూలం భారతీయులు కవిత యొక్క నూతనత్వాన్ని ఆరాధించారని విశదపరచాను. ఆంధ్రకవిత్వంలో ఇప్పుడు నూతనత్వం సిద్ధించింది అని నూతనత్వాన్ని యిక విచారిస్తాను. భారతి మొదలయిన పత్రికల్లోవున్న ప్రణయపద్యాలు నారాయణమ్మ నాయుడు బావపాట, వెంకయ్య చంద్రమ్మపాట అనేకపద్యాల సముదాయ రూపమైన కృష్ణపక్షం వంటిపుస్తకాలు యేకాంతసేవ. కావ్యకుసుమావళి, వనకుమారి, యిటు వంటివన్నీ యిప్పటి నావిచారణకు విషయమన్నాను. ఆనందవర్ధనాదు లన్నట్లు వీటిలో నూతనత్వముండడం సాధారణంగా కవిత్వధర్మమేగాని విశేష మేమీలేదు. ఈ నూతనత్వమే కవికి ప్రాణం. కాళిదాసు భవభూతి మొదలైనవారి కవిత్వమంతా యెక్కడికక్కడ నూతనమే ఈనూతనత్వం ఇప్పటి కవిత్వానికి వుంటే కవిత్వధర్మం సిద్ధించిందనవచ్చును. గాని ప్రాచీన సంప్రదాయాలను తిరస్కరించడంవల్ల యీనూతనత్వం వచ్చిందని నూతనశకమని వెనక యెన్నడూ మన మెరుగని కొత్తకవిత్వమని అనడం అసంబద్దం.

ఆక్షేపం

ఈనూతనత్వంగాదు మేమనేది. అసలు శరీరం జీవం అవయవం ఇవన్నీ మారిపోయి ఒకవిశిష్టమైన కవితాకృతి వచ్చింది అందువల్ల నూతనశకం కొత్తకవిత్వం అని అంటున్నాము. అని అంటారా?

సమాధానం

వివరిస్తాను. ఈ కావ్యాల్లో వున్న శబ్ధాలు అర్ధాలు నూతనమంటే అది సరిగాదు. శబ్దాలు అనాదివృద్ధవ్యవహారపరంపరామూలాన వ్యవహృత మవుతున్నవి.

"ఘటేన కార్యం కరిష్యన్ కుంభకారకులం గత్వాహ కురు ఘటం కార్వమనేన కరిష్యామీతి న తద్వచ్చబ్దాన్ ప్రయుయుక్ష మాణో వైయాకరణ కులం గత్వాహ కురుశబ్ధాన్ ప్రయోక్ష్యఇతీ (మహా) అని పతంజలి అన్నట్లు శబ్దాల నెవరూ నిర్మించరు ఇక అర్ధాలుగూడా ఆశబ్దాలకు అనాది వృద్ధవ్యవహారంవల్లనే విదితమవుతున్నవి.

"నిత్యాః శబ్దార్థసంబంధాః సమామ్నాతా మహర్షిభి:" (వాక్య) అని వాక్యపదీయకారుడు చెప్పుతున్నాడు. మీమాంసకు లిట్లానే అంటారు. వాస్తవంగా అర్ధాలు శబ్దాలతో అవినాభావసంబంధంగలిగి వర్తిస్తున్నవే గాని వాటిని కొత్తగా కవులు యేర్పరచరు. నూతనంగా కవులు శబ్ధార్ధాలు నిర్మిస్తే వాటిని ఆ కవులే వివరించవలనుగదా వాటికి ప్రామాణ్య మేమిటి? కనుక ఇప్పటికవిత్వం శబ్దార్దాలవల్ల నూతన మనడానికి వీలులేదు.

కావ్యంలో కొన్ని యీకాలపురోడ్దు రైలువంటి కొత్తమాట లున్నమాత్రాన అవినూతనశకం ఆరంభిస్త వనడం అనుచితం భాషలో కొన్ని కొత్తశబ్దాలు వచ్చిన వనవచ్చును గాని కావ్యంలో యెట్లా నూతనశక మారంభమవుతుంది? కావ్యంలో రసభావాలు ప్రధానం.

ఆక్షేపం

అవునండీ ప్రణయం, లతకూన, చిగురు, లలితం, కన్నె, లేత, కలికికోయిల, కోమలం, దివ్యం, ఆనందం, చారు ఈమాట లీ కావ్యాల్లోవున్నవి. వెనుకటివాటిలో లేవు. ఇవిమీరన్నట్లు కావ్యంలో ప్రధానమైన రసభావాలను ఉపకారకాలు గనుక ఈ కాలపు కావ్యాలు విశిష్టం... అని అంటారా?

సమాధానం

చెప్పుతాను. మీరన్నమాటసరిగాదు. దివ్యం, ప్రణయం, లలితం మొదలైనవి వెనకటి కావ్యాల్లోను వున్నవి.

"దివ్య విషామృత ప్రకటనానాకావ్యధుర్యుండ"(భీమకవి చా)

"ఆనందో బ్రహ్మయటన్న ప్రాఁజదువు నంతర్బుద్ది నూహింపుమా" (మను)

"కరస్థదర్భ ప్రణయాపహారిషు" (కుమార)

"ప్రణయవిశదాం దృష్టిం దదాతి" (రత్నా)

"ప్రణయకుపితాం" (శ్రీముంజుడు దశారూపకంలో ఉదాహృతం)

"లలితైణాంక శిలాలవాల" (వసు)

"కన్నెమావిగుంపున" (వసు)

"లేఁగల్వ తూపునకు" (వసు)

"కలికి కోయిలగళగ్రహము సేయకమున్న" (వసు)

"నూతన లతికాలతాంగులను" (వసు)

"చూతాంకురాస్వాదకషాయకంఠః

పుంస్కోకిలో యన్మధురం చుకూజ" (కుమార)

"చరుణా మృరితేనాయ మపరిక్లతకోమలః.

పిపాసతో మమానుజ్ఞాం దదాతీవ ప్రియాధరః"" (శా)

ఈ తీరుగా ఇట్లాటి శబ్దాలన్నీ వెనకటి కావ్యాల్లోను వున్నవి. లతాంగనలు వసుచరిత్రలో వున్నారు. అవునయ్యా వెనకటికావ్యాల్లో లేవని అనలేదు. ఇప్పటికావ్యాల్లో యెక్కువగా ఉన్నవి.

"ప్రణయ మలయానిలోర్మికా పటలినూగు
 ప్రణయ నీరజ మధుర సౌరభముగ్రోలు
 ప్రణయ విమలాంబరాబ్ధి గర్భమునఁదేలు
 ప్రణయ వనతరు శాఖలం బల్లవించు" (కృష్ణపక్షం)

"మధుర చంద్రికలలో మధురామృతంబు
 మదురామృతంబులో మదురరసంబు
 మధురరసంబులో మధురభావంబు" (యేకాంతసేవ)

అని యీతీరున హెచ్చుగావున్నవి, ఈహెచ్చే కొత్త. ఈహెచ్చు కావ్యగుణాన్ని హెచ్చిస్తున్నది. కనుక ఈ కావ్యాల్లో కొత్త వున్నదంటాము; అని వాదిస్తారా?

సమాధానం

వివరిస్తాను. ఈహెచ్చు కావ్యగుణమని తేలవలెను. ఇట్లా యెక్కువగా వుండడం దోషమని తెలిసిమనవారు మాని వుండవచ్చును.

వాస్తవంగా ఇది దోషమని పిమ్మట నిర్ణయించబోతున్నాను. ఇది కొత్త అయినా దోషం గనుకను కావ్యవైసిష్ట్యంగుణాలవల్ల యేర్పడవలె గనుకను దొషాలవల్లనే ఆవైశిష్ట్య మేర్పడితే దుష్టకావ్యాలన్నీ ఒక కొత్తకవిత్వమే కావలసివచ్చును గనుకను మీకావ్యవైశిష్ట్యానికి దోషభూతమైన యీ ఆనందల ప్రణయల మధురల దివ్యల హెచ్చుకారణంగా నిల్వనేరదు.

ఆ క్షేపం

అవునయ్యా ఈ కాలపు కృతికర్తలు కటువైన మాటలు లేకుండా రచిస్తారు. ఇది కొత్త అంటాము; అని వాదిస్తారా

సమాధానం

చెప్పుతున్నాను. కటువైనశబ్దాలు లేని రచన చిరకాలంనుండి వున్నది. కొందరు రాజులు అంతఃపురంలో వినబడదగిన భాషను గురించి కొన్ని నియమాలు చేశారని రాజశేఖరుడు కావ్య మీమాంసలో తెలుపుతున్నాడు.

"శ్రూయతే కున్తలేషు సాతవాహనో నామ రాజా తేన ప్రాకృత భాషాత్మక మంతఃపుర ఏవేతి"

"శ్రూయతే మగధేషు శిశునాగో నామ రాజా తేన దురుచ్చారనష్టౌ వర్ణాన్ అపాస్య స్వాంతః పురుఏవ ప్రవర్తితో నియమః టకారాదయ శ్చత్వారో మూధన్యా స్తృతీయవర్జ మూష్మాణ స్త్రయః క్షకారశ్చేతి." మవుతున్నవి. దేశం, కాలం, ప్రకృతి మొదలైన భేధాలవల్ల భావాలూ తద్వ్యంజకమైన శబ్దసందర్బాలూ యెన్ని విధాలనో మారుతవి వీటికన్నిటికిi విముఖుడై మెత్తటిమెత్తటి అర్ధాల మాటలని కూర్చుంటే భావసంకోచం వెగటు. తప్పక పైనబడుతున్న వంటున్నాను. అత్తవారింటిలో యెప్పుడూ మెత్తటి మెత్తటి మాటలే మాట్లాడ వలెననికోరి దూది, పేడ వెన్నపూస అని అత్త వారింటిని అలజడిపాలు చేసిన పరమానందాయ శిష్యుడివలె తప్పక కృతికర్త అకృతార్దుడు కాగలడు ప్రసన్నత్వంగాక తక్కినమాధుర్యం మొదలైనకొన్ని గుణాలకొరకు కొన్ని అక్షరాలను మాత్రమే -- భావస్పోరక మైనశబ్దాలను గాదు -- వదల మన్నఘట్టంలో ఒక్కొక్క సందర్బాన్ని అనుసరించి ఆ అక్షరాలనుసయితం మానవలసిన పనిలేదని

"క్వచిద్గోపస్తు సమతా మార్గాభేద స్వరూపిణీ.
 క్వచిద్వక్త్రాది వైశిష్ట్యా దన్యధా రచనాదయః" |(సాహిత్య)

అని హితం జెప్పిన భారతీయసాహిత్య వేత్తల ఔచిత్య విజ్ఞానం వాస్తవంగాఆరాధ్యమైవున్నది. ఇట్లాటి ఔచిత్య విజ్ఞానంతో వెలసిన వాల్మీకి కాళిదాసాదుల కావ్యాలు ఇష్టగుణసంపన్నమై లోకోత్తరంగా వున్నవి. ఇంతకూ చెప్పదలచిందేమంటే అంతటా మెత్తటిమెత్తటిమాటలతోనే కావ్యంనింపవలె నంటే భావసంకోచం వెగటు, ఆపతితమవుతున్నవని అవి రచయితను అకృతార్ధుణ్ని చేస్తున్నవని అంటున్నాను. లోకంలో సయితం సందర్బానికి తగినట్లు మెత్తమెత్తగా మాట్లాడితే వుచితంగా వున్నదని అనుకొంటాము. కాని అయినదానికీ కానిదానికీ సమయంలో అసమయంలో మెత్తమెత్తటి అర్ధాల మెత్తమెత్తమాటలు వేసి తలతిప్పుతూ మాట్లాడుతూవుంటే అతణ్ని ఆడమాదిరి మనిషి అని పరిహసనీయకోటిలో చేరుస్తాము. అట్లానే కావ్యంసయితం హాస్యాస్పదమవుతుంది. కనుక అంతటా మెత్తమెత్తటి మాటలు నింపడం గుణంగాదని దోష హేతువని మెత్త మెత్తటి అర్ధాల మాటలతో అంతటానిండిన యిప్పటికవిత్వం నూతనమంటే అదిదోషం గనుక గ్రాహ్యంగాదని చెప్పుతున్నాను.

ఆక్షేపం

అవునయ్యా.

"కవితాకన్యా వృణీతే స్వయం" (బిల్హ)
"కాంతా సమ్మితతయోపదేశయుజే" (కావ్య)
"నవపల్లవ కోమల కావ్యకన్యకన్" (కేయూర)

అని యిట్లా కవ్యాన్ని కన్యతో పోల్చడం భారతీయసంప్రదాయం కావ్యం కన్యవలె మృదువైంది గనుకను రమణులు మెత్తమెత్తటి మాటలాడుతూ మెత్తగావుండడం అందరికీ ఆహ్లాదకరమే గనుకను కావ్యంగూడా అట్లానే ఆహ్లాదకరమై వుండడానికి అంతటా మెత్తమెత్తంగా మెత్తమెత్తటి మాటలతో నిండివుండడం ఆవశ్యకమే అవుతున్నది అని అంటారా

సమాధానం

సాదృశ్యవిచారణ

వివరిస్తున్నాను. "కాంతేవసరసతాపాదనేన అభిముఖీకృత్య" అని మమ్మటుడు చెప్పినట్లు సరసత్వాపాదనం చేతశ్రోతను అభిముఖుణ్ని చేసేమటుకే కన్యతో సాదృశ్యంగాని కన్నెవలె మెత్తగామెత్తగావుంటుంది. రవికతొడుక్కొంటుంది అని సర్వాంశాలా సాదృశ్యం చెప్పగూడదు. ఆమె ముఖం చంద్రుడివలె వుంటుందంటే చంద్రుడివలె సౌమ్యం. కాంతిమత్త్వం కలిగివుంటుందని అభిప్రాయంగాని చంద్రుడివలె గుండ్రంగా ముక్కూ కండ్లూ లేకుండా చెక్కినట్లు వుంటుందని భావంగాదు. అట్లాసర్వ సాదృశ్యం చెప్పితే ఉపమానోపమేయభావంపోయి రెండూ ఒకటేననవలసివస్తుంది. కొంతభేదం కొంతసాదృశ్యం వున్నప్పుడే ఉపమానోపమేయ భావం సంగతమవు తున్నది. కనుకనే సాదృశ్యం భేదవిశిష్టమై వుంటుంది. ఈవిషయాన్నే శ్రీశంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రబాష్యంలో ఉపాదిగతమైన ఆత్మకు జలసూర్య కాదితుల్యత్వాన్ని సిద్దాంతీకరిస్తూ.

"అత ఏవ చోపమా సూర్యకాదివత్."
"అంబువదగ్రహణాత్తు న తధాత్వం." (బ్ర. సూ)

"వృద్ధిహ్రాసభాక్‌త్వ మంతర్భావా ధుభయసామంజస్యా దేవమ్" (బ్ర. సూ)

అనే సూత్రాల సందర్భాన వివరించారు.

"నజలసూర్యకాది తుల్యత్వమి హోపపద్యతే తద్వదగ్రహణాత్! సూర్యాదిభ్యో హి మూర్తేభ్యః పృథగ్భూతం విప్రకృష్టం మూర్తం జలం గృహ్యతే| తత్రయుక్తః సూర్యాది ప్రతిబింబోదయః| నత్వాత్మా మూర్తః నచాస్మాత్ పృథగ్భూతా విప్రకృష్టదేశాశ్చోపాధయః సర్వ గతత్వాత్ సర్వానన్యత్వాచ్చ| తస్మాదయుక్తోయం దృష్టాంత" ఇతి.

"యుక్త ఏవ త్వయం దృష్టాంతో వివక్షితాంశ సంబవాత్| నహి దృష్టాంతదార్ప్టాంతికయోః క్వచిత్ కించి ద్వివక్షితాం శం ముక్త్వా సర్వసారూప్యం కేన చిద్దర్శయితుం శక్యతే| సర్వసారూప్యే హి దృష్టాంత దార్ప్టాంతికయో। ఉచ్ఛేద ఏవ స్యాత్|... జలగతం సూర్యబింబం జలవృద్ధౌ వర్ధతే జలహ్రసే హ్రసతి జలచలనే చలతి జలభేదే భిద్యత ఇత్యేవం జలధర్మానుయాయి భవతి న పరమార్ధతః సూర్యస్యతథాత్వ మస్తి ఏవం పరమార్థతో 7 వికృతమేకరూపమపి సద్బ్రహ్మ దేహాద్యు పాధ్యంతర్భావాత్ ద్భజతివ ఉపాదిధర్మాన్ వృద్ధి హ్రసాదీన్ ఏవ ముభయో ర్దృష్టాంత దార్ప్టాంతికయో: సామంజస్యాదవిరోధః (బ్ర. భా)

పరమాత్మ ఒకటైనా దేహాద్యుపాధుల్లో వ్వవస్థితమై ఉదకంలో ప్రతిబింబితమైన సూర్యుడివలె అనేకవిధాల కనబడుతున్నదంటే ఆదృష్టాంతం వొప్పుకో వీలులేదు. జలసూర్యులకున్న సంబంధం ఉపాధులకు ఆత్మకు లేదు. మూర్తాలైన చంద్రుడు సూర్యుడు మొదలైన వాటినుండి అవి ప్రతిబింబించే జలం మూర్తమై వేరై వాటికి దూరమైన స్థలంలో వుంటున్నది. కనుక సూర్యుడూ చంద్రుడూ జలంలో ప్రతిబింబిస్తారంటే వొప్పుకోవచ్చును. కాని ఆత్మకు మూర్తే లేదు. అది ప్రతిబింబించడానికి ఉపాధులు వేరై దానికంటెదూరమైన స్థలాల్లో లేవు. యెందుకంటే ఆత్మసర్వగతం ఆత్మకంటె భిన్నమైనది మరొక్కటిలేదు. కనుక జలగతసూర్యుడికి ఉపాధివ్యవస్థితమైన ఆత్మకూ సారూప్యం జెప్పడం అనుచితం (అని వాదిస్తే సిద్ధాంతం ఉక్తమవుతున్నది.)

(పై వాదం సరిగాదు)

ఈ దృష్టాంతం యుక్తమేను సామ్యానికి విషమైన వివక్షితాంశం వున్నది. దృష్టాంతదార్ప్టాంతికల్లో వివక్షితమైన కొంత సాదృశ్యంతప్ప సర్వసాదృశ్యం నిరూపించడానికి యెవరికి సాధ్యంగాదు. సర్వసారూప్యమే చెప్పుతామా దృష్టాంత దార్ప్టాంతికభావమే పోతుంది. జలగతమైన సూర్యబింబంజలం హెచ్చితే హెచ్చుతుంది. జలం తగ్గితే తగ్గుతుంది. జలం కదిలితే కదులుతుంది. జలం భేదిస్తే భేదిస్తుంది. ఈతీరుగా సూర్యుడు జలధర్మాలను పొందుతాడు. కాని నిజానికి సూర్యుడికి జలసంబంధి వృద్ధిహ్రాసాదులు లేవు. అట్లానే వాస్తవానికి ఆత్మ అవికృతం యేకరూపం అయినప్పటికీ దేహాధ్యుసాధయంతర్భావంవల్ల ఉపాది ధర్మాలైన వృద్ది హ్రాసా దులను పొందినట్లు కనబడుతుంది (ఈ వృద్ది హ్రాసభాక్త్వమే సూర్యుడికి ఆత్మకు సాదృశ్యంలో వివక్షితాంశం. ఈతీరుగా దృష్టాంత దార్ప్టాంతికాలు సమంజసమై ఆవిరుద్ధంగావున్నవి) అని శ్రీశంకరభగవత్పాదులు విశదీకరించారు. ఇంతకూ వివక్షితాంశమేమంటే కావ్యం కాంతవంటిదన్నప్పుడు సరసత్వా పాదనంచేత శ్రోతను అభిముఖుణ్ణి చెయ్యడం మట్టుకే సాదృశ్యంగాని అసాదృశ్యాన్ని అంతటా అన్వయించి కాంతవలె కావ్యమంతా మెత్తమెత్తగావుంటుందనీ అందువల్ల కావ్యం అంతటా విశ్వమోహనం ప్రణయం శిరీషం చిరు సోనలు జింకపడతి యిట్లాటి మెత్తటి అర్ధాల మెత్తమెత్తటిమాటలతో నిండివుండవలెననీ అనడం అప్రశస్తమని చెప్పుతున్నాను.

ఆక్షేపం

అవునయ్యా మీరన్నట్లు సర్వసాదృశ్యం అవసరంకాకుంటే కాకపోనీయండి సరసత్వాపాదనంచేత అభిముఖీకరణం సాదృశ్యంలో వివక్షితాంశమంటే మేమొప్పుకోము. ప్రణయం మృదులం, విశ్వమోహనం కన్నెలేడి యిట్లాటి మెత్తటి మాటలు వుండడమే కాంతా కావ్యాలకు సాదృశ్యంలో వివక్షితాంశ మంటాము. అని వాదిస్తారా?

సమాధానం.

చెప్పుతున్నాను. సరసత్వాపాదనంచేత అభిముఖీకరణం వివక్షితాంశమనేమాటను ఒప్పుకోమని మీరంటే, కావ్యమంతటా "ప్రణయం, మృదులం, విశ్వమోహనం, జింకపడతి" వంటి మెత్తటిమాటలసద్భావం సాదృశ్యంలో వివక్షితాంశమనె మీమాటను అంతకంటె చులకనగా నిరాకరిస్తున్నాము. అయితే యిది రాయిగుద్దుడువాదం. మీరన్నట్లు మెత్తటి మాటలతో అంతటా నిండివుండడమే వివక్షితాంశమని కొంత సేపువొప్పుకొని విచారిస్తాను. అట్లా కావ్యంలో అంతటాప్రణయం , శిరీషం, కన్నెమావి, విశ్వమోహనం, జింకపడ తి యిట్లాటి మెత్తటి అర్ధాల మెత్తటిమాటలే నిండివుంటే భావసంకోచం వెగటు అనే దొషాలు ఆపతితమై రచయితను ఆకృతార్థుణ్ని చేస్తున్నవని యిదివరకే నిరూపించాను. కనుక మమ్మటాదులన్నట్లు దేశ కాలపాత్రాలను అనుసరించి రసభావాలను పరిపాలించి సందర్భం వచ్చినప్పుడు మాధుర్యాధిగుణాల రచనలు ప్రతిపాదించడం శోభా హెతువు తప్పక కాగలదు. లేదా అనౌచిత్యం. భావసంకోచం, వెగటూసంభవించి రచయిత ఆకృతార్ధుడవుతున్నాడని తిరిగి చెప్పుతున్నాను. కనుక యిప్పటి కావ్యాలు కొన్ని అంతటా మెత్తమెత్తటి మాటలతో నిండివున్నవని అది నూతనత్వమని అంటే అట్లావుండడం భావసంకోచం వెగటూవంటి దోషాలకు హేతువని దోషం అంగీకార్యం గాదని, దోషానికి హేతువైన వైలక్షణ్యం నూతనత్వంగాదని అది గ్రాహ్యంగాదని విశదంచేశానని చెప్పి యీవిచారణ ముగిస్తున్నాను.

పూర్వపక్షం

ఈ కాలపు కృతుల్లో స్వాతంత్ర్యమెక్కువ
'ఈకవులు నిక్కముగ స్వతంత్రులు"
      -క. రామలింగారెడ్ది (లక్ష్మీకాంత తొలకరిపీఠిక)
"నవకవులకు స్వేచ్చప్రాణము "
కట్టుబాటులోకవిత్వమా"- దే.కృష్ణశాస్త్రి (యేకాంతసేవపీఠిక)

"జగమునిండ స్వేచ్ఛాగానఝురులనింతు". (కృష్ణపక్షం)

"స్వాతంత్ర్య గీతానాదమే స్వర్ణయుగమునకు ప్రాణభూతము,
 పోకడలు స్వతంత్రములు భావములు స్వతంత్రములు
                                          దశిక సూర్యప్రకాశరావు (భారతి)

అని ప్రకటించిన తీరున ఇప్పటికవులు స్వాతంత్ర్యాన్ని కనబరుస్తున్నారు. ఇట్లాటి స్వాతంత్ర్యంపూర్వుల్లో లేదు. కనుక ఇది కొత్తకవిత్వం అని వాదిస్తారు.

సమాధానం

చెప్పుతున్నాను అదిసరిగాదు. స్వాతంత్ర్యం సర్వకాలాల్లోను వున్నది. ఒకహద్దుకు లోబడ్డ స్వాతంత్ర్యాన్ని ప్రాచీనకాలంనుండి భారతీయులు గౌరవిస్తున్నారు.

ఇట్లాటి స్వాతంత్ర్యం రానురాను భవిష్యత్ప్రజల్లో నశిస్తుందని చింతపడ్డారు.

"స్వాతంత్ర్యం కౌశలం కాన్తిర్త్ధర్యం మార్దవమేవ చ (శ్రీభా)

అని యీగుణాన్ని శ్రీభాగవతకారుడు ప్రశంసిస్తున్నాడు.

"సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మ వశం సుఖం" (మను) అని మనువు చెప్పుతున్నాడు.

అయితే నేను పాఠశాలనుమాని యెగురుతాను. ఆచార్యులవద్ద విద్యనేర్వడం స్వాతంత్ర్యానికిభంగం అందువల్ల నాకు యేవిద్యావద్దు అని అనడం అనర్థహేతువు. అజ్ఞానాపాదకం గనుక అది స్వాతంత్ర్యం గాదు. అందుకే కొన్నిహద్దులకు లోబడ్డ స్వాతంత్ర్యాన్ని భారతీయులు ఆరాధించారన్నాను. కవిత్వంలో చూస్తామా యెవరి మనః ప్రవృత్తిని అనుసరించ్క్షి వారుసృష్టి చేశారు. కాళిదాససృష్టి వేరు భవభూతిసృష్టి వేరు. భవభూతి స్వతంత్రించి "ఏకోరసః కరుణఏవ" (ఉత్తర) అని ఉపదేశించాడు. "మురారేస్తృతీయ; పన్ధా:" అని ప్రసిద్దమేగదా! దీన్ని విస్తరించి వ్రాయవలసిన పనిలేదు. "నిరంకుశాః కవయః" అనేమాటలే చాలును అవిబారతీయ కవుల యీస్వాతంత్ర్యాన్ని అస్ఫుటద్వనితో వినిపిస్తున్నవి కనుక స్వాతంత్ర్యం వల్ల ఈకాలపు కవిత్వం కొత్తదంటే అంగీకరించ వీలులేదంటున్నాను" జగమునిండ స్వేచ్చాగాన ఝురుల నింతు" అని యీతీరునచెప్పలేదుగదా అంటే అట్లాచెప్పడం ఒకశ్ళాఘ్య లక్షణంగాదు.

ఉత్తము లెప్పుడూ తమగుణాలను కార్యాలచేత విదితంచేస్తారు గాని చెప్పుకోరు. అది తేలిక మనుషుల యొక్క వెలితి లక్షణం ఈ సంగతినే.

"తస్య సంవృతమంత్రస్య గూఢాకారేంగితస్య చ.
 ఫలానుమేయాః ప్రారంభాః" (రఘు)

(ఆలోచన గూఢంగావుండే ఆయన యత్నాలు ఫలాలవల్లనే కనుక్కోదగినవి.)

అనే పఙ్త్కులవల్ల కాళిదాసీభావాన్నే వ్యక్తం చేస్తున్నాడు

"బ్రువతే హి ఫలేన సాధవో న తు వాక్యేన నిజోపయోగితాం"

(సాధువులు నిజోపయోగితను మాటలచేత చెప్పరు. ఫలాల చేత కనబరుస్తారు.)

అని శ్రీహర్షు డీ అంశాన్నే తెలుపుతున్నాడు.

ఇంతకూ ఇట్లా చెపుకొన్నవాండ్లుకూడా వెనకవున్నారు
అర్జవవేష్టి తాఖిలమహామహిమండలమందు బూతులం బూర్ణుడ
                                                        (జగ్గకవి - చంద్ర రేఖా)

"ఎవ్వరేమన్న నండ్రు నాకేమికొరత" (శ్రీనథుడు-కాశీ)

ఈతీరుగా వారివారి స్వాతంత్ర్యాన్ని చెప్పుకొన్నారు. అసలిట్లా చెప్పుకొనడం లఘుత్వద్యోతక మని అది కొత్తగా దనితెలిపినాను. కనుక స్వాతంత్ర్యప్రకటనంవల్ల ఇప్పటికవిత్వంకొత్త అన్న మాట నిలువజాలదు.

"మ్రోడుమోక చివురులెత్తి మురుపుసూప"
"కర్కశశిలయ నవజీవ కళలుదేర"
"జగము నిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు" (కృష్ణపక్షం)

అని యిట్లా ఆత్మస్తుతిచేసుకొనడం గూడా కొత్తగాదు

ఇతరు లక్షరరమ్యతనాదరింప (భా- నన్నయ)
"విటుడు యతిగాక పోవునే వెస మదీయ

కావ్య వైరాగ్య వర్ణనాకర్ణనమున
యతి విటుడుగాకపోవునే యస్మదీయ
కావ్య శృంగారవర్ణనాకర్ణనమున". (నృసింహకవి-కవి కర్ణ)

"ఆమూలా ద్రత్నసానో ర్మలయవలయితాదాచకూలాత్ పయోధేః
యావంతః సన్తి కావ్యప్రణయనపటవః తే విశంకం వదంతు

"మృద్వీకామధ్యనిర్యన్మసృణమధుఝురీమాధురీభాగ్యభాజాం
వాచామాచార్యతాయాః పదమనుభవితుం కోస్తి ధన్యో మదన్య"

(మేరువుమూలంనుండి మలయవలయితమైన సముద్రతీరందాకా వున్న కావ్యకర్తలు నిశ్శంకంగా చెప్పుదురుగాక. ద్రాక్షనుండి వచ్చే చిక్కటి మధువుయొక్క మాధుర్యభాగ్యంగలిగిన వాక్కులకు ఆచార్యపదం అనుభవింప ధన్యుడు నాకంటె అన్యు డెవడున్నాడు. జగన్నాథుడు) యీతీరుగా ఇట్లాటి ఆత్మస్తుతి యేసందర్బంలో చెప్పినా చిరకాలంనుండి వస్తున్నది. ఈఆత్మస్తుతులైనా యే వొకటిరెండు వాక్యాల్లోనో పద్యాల్లోనో చెప్పితే మితంగా వుంటుంది.

"కలికి పాటలకోయిల కులముమాది"
"పికకుమారకు నన్ను బాడుకొన నిమ్ము"
 రాళ్లకు జీవకళవచ్చేటట్లు మోళ్లు చిగురులు పెట్టేటట్లు స్వేచ్ఛా
 గానం చేస్తాను;

కట్టుబాట్లు తెగేటట్లు ఆకాశం ప్రత్రిధ్వనించగా స్వేచ్చాగానం చేస్తాను;

చిత్త మానంద మయమరీచికలసోల
హృదయ మానంద భంగమాలికలదేల
కనుల నానంద జనితాశ్రుకణములూర
జగము నిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు
విశ్వమే పరవశమయి వెంటాడ
జగమునిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు
మాయ మయ్యెదను నామధురగానమున
ఏను స్వేచ్ఛాకుమారుడ నేనుగగన
పథవిహారవిహంగమ పతిని నేను

మోహనవినీల జలధరమూర్తి నేను
ప్రళయ ఝుంఝూప్రభంజన స్వామి నేను."
                                      (దే. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం)

అని యింకా యీతీరున ఆత్మస్తుతులు కృష్ణపక్షకర్తవలె చేసుకుంటే రోతగానే వుంటుంది.

పాపాయి అనేకృతిలో తత్కర్త

"లేశమేనియుఁ బ్రఖ్యాతి లేని నాకు
 కలిగె పాపాయి తండ్రియన్ గౌరవంబు
 పద్ధియంబులు నీపేర వ్రాయు కతన"

"రాణ నొప్పారె నాంధ్రసారస్వతాబ్ధి
 కావ్య మణులెన్నియో నేటికాలమందు
 వాని నెల్లను సరిపోల్పవచ్చునొక్కొ
 తావకానూనకావ్యరత్నంబుతోడ" (భారతి)

అని మొదట తన్ను తాను స్తుతించుకొని తరవాత యితరులు స్తుతించారని చెప్పుతున్నాడు. ఈస్తుతి ఇంకా వున్నదిగాని ఉదాహరించక మానుతున్నాను.

యెంకిపాటల్లో ఆత్మస్తుతిచేసుకో వీలులేక వాట్లో మాట్లాడేది పాత్రలే గనక ఆత్మస్తుతులను పాత్రలకు యెంకిపాటలకర్త ఒప్పగించాడు.

"కతకాడుమావూసె చెప్పాలె
 ఈసీమ ఆసీమ అందరందాలు
 తిన్నగా నినుజూసి దిద్దుకుంటారు
 ముందు మనపాపణ్ని కిందదిగనీరు
 యెంకొక్క దేవతై యెలిసెనంటారు."

ఇవి నాయుడి ఆత్మస్తుతులు

ఈవక్రమార్గపుస్తుతులతో తనివిలేక--

"ఆమహోన్నతభవాలకు నాయెంకిపాటలే కారణమైతే ధన్యుడను ... ధన్యుడను .... నన్ను ప్రత్యేకించి ఆహ్వానించి గౌరవించారు". అని కూడా యెంకిపాటలకర్త చెప్పుకున్నాడు. యిట్లాటి ఆత్మస్తుతులు ఈతీరుగా రోతలోకి దిగి యీనాడు మెండైనవి ఇట్లాటివి యేకాలంలో నైనా సరే అల్పబుద్ధిత్వ సూచక మేగాని పరిణతిద్యోతకంగావు. కవికుల గురువు కాళిదాసు.

"మందః కవియశఃప్రార్థీ గమిష్యామ్యపహాస్యతాం" (రఘు)

(మందుడను కవియశస్సునుగోరి అపహాస్యతను పొందుతాను) అని విజ్ఞలోకానికి వినతుడవుతున్నాడు.

అంతేగాని పికకుమారుణ్ణి కోయిలను, చిలకను అవి పాగడుకోలేదు. ఈ ఆత్మస్తుతి అధములుగూడా చేసుకోవచ్చును. మహాకవులను లోకం స్వయంగానే ఆరాధిస్తున్నది.

"వందే వాల్మికికోకిలం"
"పురా కవీనాం గుణనాప్రసంగే కనిష్ఠికాధిష్ఠితకాళిదాసా
 అద్యాపి తత్తుల్యకవేరభావాత్ అనామికా సార్ధవతీ బభూవ"
"దాసతాం కాళిదాసస్య కవయః కే న విభ్రతి"
                                               (గంగాదేవి - మధురా)
"నిర్గతాసు నవా కన్య కాళిదాసస్య సూ క్తిమ.
 ప్రీతిర్మధురసార్ద్రాసు మంజరీష్వివ జాయతే. (హర్ష - బాణుడు)
"శ్లోకత్వమాపద్యత యస్య శోకః" (రఘు - కాళిదాసు)

అని మహాకవులు నాటికి నేటికి ఆరాధితులవుతున్నారు. అనుచితమైన ఆత్మస్తుతులు అల్పబుద్ధిత్వసూచికమని అది కొత్తకాదని చెప్పి యీ విమర్శ ముగిస్తున్నాను.

పూర్వపక్షం

"పూర్వులాశ్రయించిన పద్యములు ముఖ్యముగా వృత్తములు కందములు ఇప్పటినవకవులకు విశేషముగా యోగ్యమయినవి గీతములు, ద్విపదలు" అని లక్షీకాంతతొలకరి పీఠికాకర్త శ్రీ రామలింగారెడ్దివారు వ్రాసినట్లు యిదివరకు చంపకమాలలు మొదలైనవి వ్రాసే వారు. యిప్పటి కవులు గీతాలు ద్విపదలు వ్రాస్తున్నారు యింకా ముత్యాల సరమువంటి వెన్నోకొత్తవి వ్రాస్తున్నారు. యీతీరుగా పద్యాల్లో కొత్తకనబడుతున్నది కనుక యిప్పటి కవిత్వం కొత్తఅంటామంటారా

సిద్ధాంతం.

చెప్పుతున్నాను. మీరన్నమాటసరికాదు. ఇప్పటికవులుగూడా చంపకమాలలు మొదలైనవి తరుచుగా వాడుతున్నారు, వనకుమారి నిండా ఈవృత్తాలువున్నవి. కొమాండూరి కృష్ణమాచార్య కృతులైన విరహోత్కంఠిత, పాదుకాస్తవం ఇవి వృత్తమయాలు గీతాలు, ద్విపదలు వెనుకటివారు సయితంవాడినారు వెనుకటివారు అక్కడక్కడ వాడినారుగాని, యిప్పటివారు గ్రంథమంతా గీతాలుగాని ద్విపదగాని వాడుతున్నారంటారా? అదిగూడా అసత్యం రంగనాథుడు శ్రీనాథుడు మొదలైనవారు కేవలం ద్విపదలలోనే గ్రంథమంతావ్రాశారు. ఇక వేమనశతకం చాలామట్టుకు గీతమయమేగదా ఇట్లాగీతాలు, ద్విపదలు గ్రంథమంతా వాడడం మనకు కొత్తగాదు. ఇప్పుడెక్కువమంది వాడుతున్నారంటారా అదిసరిగాదు. అప్పుడెంతమంది అట్లాగీతమయంగా ద్విపదమయంగా వ్రాశారో యెవరెరుగుదురు?

నలచరిత్రం. సారంగధరచరిత్ర (బాణాల శంభుదాసుడు)

ధర్మాంగదచరిత్ర (బొమ్మకంటి నృసింహకవి)

మైరావణచరిత్రం. భారతోద్యోగపర్వం (తిమ్మయ)

గీతరఘునందనం (తిరుమలకవి)

ఇట్లా ద్విపదగ్రంథాలెన్నోవున్నవి. వీట్లో అచ్చుపడనివి కొన్ని వున్నవి. యథా వాల్మీకమనే ద్విపదరామాయణం. ద్విపదబారతమే వున్నవని తెలిసినప్పుడు ఆకాలంలో ద్విపద యెంతవ్యాప్తిలో వుండేదో మనకు గోచరిస్తున్నది. ఇఘ ముత్యాలసరంవంటి పద్యాలను విచారిస్తాను. ఈ తీరుగా కొత్త పద్యాలను వాడడం యిప్పటి యీతొలకరి కృష్ణ పక్షం మొదలైన కృతికర్తలతో ఆరంభంగా లేదు. భారతరామాయణాల్లోలేని రగడలను పెద్దనవాడినాడు. శ్రీనాథుడు, పోతన అదివరకు నన్నయ తిక్కనలు, యెర్రాప్రగడా వాడని దండకాలను వ్రాశారు.

శ్రీ కొక్కొండ వేంకటరత్న శర్మవారు వెండి బంగారు రత్నం మొదలైన కొత్తపద్యాల నెన్నిటినో నిర్మించారు. కనుక కొత్తపద్యాలను వాడడం నేడు కొత్తగావచ్చిందికాదు. ఒకవేళ వచ్చిందని నొప్పుకున్నా అది పద్యాలకొత్త అవుతుంది కవిత్వంలో కొత్తగాదు గదా యెందుకంటే పద్యాలే కవిత్వంగాదు కవిత్వంలేని పద్యాలు వుండవచ్చును గద్యంలోగూడా కవిత్వం వుండవచ్చును.

"పద్యగద్యమయం ద్విధా" (సాహిత్య)

అని సాహిత్యదర్పణకారు డీసంగతిని తెలుపుతున్నాడు కనుక ఒకవేళ పద్యాలు కొత్తవున్నా అది కవిత్వానికి సంబంధించినది కాదు. ఇంతకూ అనుశ్రుతంగా యీకొత్త వస్తున్నదేగాని నేటికాలపు కృతికర్తల అపూర్వమార్గం కాదని యిదివరకే తెలిపినాను.

"తటతరంగము విరిగెనే
                కెరటాలు
 చిటిలియొడ్డున చిందెనే
               చివురాకు. (విశ్వనాధ సత్యనారాయణ - భారతి)

అని యీతీరున దరువులు విరుపులు వెనకలేవు. కనుక ఇది కొత్త అంటారా అది అసంగతం. పెద్దన, వాడినరగడలు దరువులతో విరుపులతో కూడినవే అదిగాక అప్పకవి కళిక, ఉత్కళిక, నవవిధరగడలు మొదలైన లయతాళ సమన్విత రీతుల నెన్నిటినో తెలిపినాడు.

దనరహయతదార్క్ష్యుండంచు మును శుకాదిమునులు పొగడ (హయప్రచారరగడ)

విజయభద్రముచెల్లు నిదురపూజితపాద (ద్విరదగతిరగడ)

కమలనేత్రునిరాక రోయుచుయమునయొడ్డును దపము చేయుచు (ఉత్కళిక)

మరియువ్రేతలనెల్ల మరులుకొల్చినవాని (కళిక)

గాలిరక్కసుఁ జాహగాలదన్నినవాని (కళిక)

నేర్పుమైనల్ల యది నెఱుల దొలుపూదుఱిమె
దర్పకునకర్పింపఁ దలాపదెంతటి పెరెమె"
ఇంతిపావురపురొద యేలవినెదారజము
వింతయేవిరహిణుల వెతబెట్టు బేరజము. (రగడ-మను)

బాలబాల రసాలమిది పికపాలిపాలిటి యమరసాలము
గేలిగేలిడి గ్రుచ్చగడురా గిల్లుగిల్లుము తత్ప్రవాళము
మూలమూలల మల్లె లెంతటిమోహమో హరిణాక్షిదాచితి

యేలయేలకిపొదలు వెదకెద వింత వింతలె యెందుజూచితి"
                                                 (వృషభగతిరగడ-వసు

అని యీతీరున దరువులు విరుపులు చిరకాలమునుండి వున్నవిగాని కొత్తవిగావు. వీటిలో ఉత్కళిక గురుజాడఅప్పారావు కన్యక అనే ఖండకావ్యపు వృత్తానికి మూలమనదగినది. వీరు కట్టుబాట్లు తెంపి కావ్యాలు వ్రాస్తున్నారు. అది కొత్త అంటారా? అదిగూడా నిల్వజాలదు. కట్టుబాటులో కవిత్వమా అనిచెప్పిన పీఠికాకర్త కృష్ణపక్షంలో వళులు, ప్రాసలు మొదలైన వాటికిందనే వున్నాడు.

........... మాలికలంబ్రణయార్ద్ర -
........... బూవుపూవునకు -
ఆకులో నాకునై (మురువుసూప)
యదృశ్యమౌ నిద్రవోవు (కృష్ణపక్షం)

అని యీతీరున నుగామం గజడదబల గసడదవల అదేశం, యడాగమం మొదలైనవన్నీ వెనుకటికావ్యాల్లో వలెనే వున్నవి. యెంకిపాటలు యెంకయ్య చంద్రమ్మపాట యిటువంటి కావ్యాల్లో భాష కొత్తది అంటారా అదీ సరిగాదు.

"యెట్లా పోనిస్తివోయి మట్లావోరి చిన్నదాన్ని"
"ఓరందకాడా బంగారుబావా"

అనే యిట్లాటి యాటపాటల్లో చిరకాలమునుండి యీభాష వుంటూనే వున్నది.

ఆక్షేపం.

అవునుగాని వీటిలో ఋతువర్ణనలు చంద్రోపాలంభాదులు మొదలైనవి లేవు గనక యీకలపు కవిత్వం కొత్త అంటాము అని వాదిస్తారా?

సమాధానం

చెప్పుతున్నాను మీమాట సరిగాదు. ఋతువర్ణనలు మొదలైనవి వుండడం లేకపొవడం కవిత్వానికి నూతనత్వ మాపాదించవు. సందర్భానికి వుచితంగా వుంటే అవి కావ్యానికి నూతనత్వ మాపాదించవు. సందర్భానికి వుచితంగా వుంటే అవి కావ్యానికి గుణాన్నే ఆపాదిస్తవి. ఉచితదశల్లో మనోహరంగా వుండే ఋతుసందేశాలకు చంద్రుడికి కవియెట్లా విముఖుడు కాగలడు? అనుచితంగావుంటే అవి ధోషమే అవుతవి. అంతేగాని అవి వుండడం లేకపోవడం కవిత్వానికి నూతనత్వ మాపాదిస్తవనడం అసంగతం అసిలింతకూ ఋతువర్ణనలూ, చంద్రోపాలంభాదులూ అనుచితమైన జాబితాలుగా లేని మేఘసందేశాదులు శాకుంతలాదులు ఓరోరిబండోడ ఓరందకాడా బంగారు బావా మొదలైన పాటలు చాలాకాలంనుండి వున్నవి దీంట్లో యేమీ కొత్తలేదు. కనుక ఋతువర్ణనలు చంద్రోపాలంబాదులు మొదలైనవి లేకపోవడంవల్ల యీకాలపు కవిత్వం కొత్త అనడం అసంబద్ధమంటున్నాను.

పూర్వాక్షం

అవునయ్యా యిప్పటికవులు ఒకటి రెండుపద్యాలు మాత్రం వ్రాసి ఒకపేజీమీద ప్రత్యేకంగా అచ్చువేస్తున్నారు. వెనకటి కావ్యాలన్నీ యెంతో విపులమైనవి. యిది కొత్త అంటారా?

సిద్దాంతం.

చెప్పుతున్నాను అది అసంబద్దం వెనుకటి కవులుగూడా ఇట్లా ఒకటి రెండు పద్యాలు వ్రాశారు.

"రంజనచెడి పాండవులరిభంజనులైవిరటుగొల్వ పాల్పడిరకటా"
"నరసింహ కృష్ణరాయల కరమరుదుగకీర్తియొప్పె"
'కరిభిత్ గిరిభిత్ కరికరిభిత్ గిరిగిరిభిత్
"కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబై"
"కాశికావిశ్వేశు గలిసె వీరారెడ్డి"
"రత్నాంబరంబులే రాయడిచ్చు" (చా)

ఇవన్నీ అట్లాటివే వీటికే చాటూక్తు లనిపేరు. ఇప్పటి పద్యకర్తలు వ్రాసేవిగూడా మనోహరంగా వుంటే చాటూక్తులే అవుతవి. వీటిని వీరు కావ్యమంటున్నారు. ఇది కొత్త అంటారా? అది వీలుగాదు. ఒకటి రెండు పద్యాలు కావ్యం కాదని, రసభావాలసిద్ధికి సాంగస్వరూపావిష్కృతి అవశ్యకమని అవి చాటూక్తులేనని ముందు తెలుపబోతున్నాను. వాటిని కావ్య మనడం అజ్ఞానంగాని కొత్తగాదు. ఈ తెలియక పోవడం కొత్త అయితే కావచ్చునుగాని కొత్త గుణప్రతిపాదకమైనపుడే గ్రాహ్యం గనుక దానిని ఉపేక్షిస్తున్నాను. ఇక ఈ కాలపుకృతులలో వుండే నిదర్శనపరంపరలు, దరువులు, విరుపులు వికారాలని, వృత్తంతో సంబంధించని జడకుచ్చులవంటి పేర్లు అనుచితమని ముందు నిరూపించబోతున్నాను. ఇఘ వాగులు, కొండలు, మేఘములు, విద్యుల్లతలు, వీటిమీది ఆసక్తి యీకాలపు కృతికర్తలకు కొత్త ఆనడం అవివేకం. భారతీయకవుల కివి చిరకాలంనుండి ప్రేమపాత్రంగా వున్నసంగతి భారతీయవాఙ్మయం బహుముఖాల వ్యక్తం చేస్తున్నది.

"ఉద్యానే సరణిః సర్వఫలపుష్పలతా ద్రుమాః
 పికాలికేకిహంసాద్యాః క్రీడావాప్యధ్వగస్థితిః,
 శైలే మేఘౌ షధీధాతువంశ కిన్నర నిర్ఘరాః". (సాహిత్య)

అని యీతీరున వీటిని కావ్యవేత్తలు విడదీసి సయితం చెప్పినారు. రసభావాలసందర్భా లకు తగినట్లు సర్వజగత్తునందు మృదువుకఠినం ప్రసన్నమప్రసన్నం ఋజుకుటిలం అయిన సమస్త పదార్ధసంచయాన్ని పరిణతదృష్టితో చూడగలిగిన భారతీయకవుల సృష్టి అమేయమై వెలసివున్నది.

"రమ్యం జుగుప్సితముదారమధాపినీచ
 ముగ్రం ప్రసాది గహనం వికృతం చ వస్తు
 యద్వాప్యవస్తు కవిభావకబావ్యమానం
 తన్నాస్తి యన్న రసభావముపైతి లోకే." (దశ)

అని దశరూపకకారుడు చెప్పుతున్నాడు ఇట్లాటి భారతీయవాఙ్మయంలో ఈకాలపు కృతికర్తలకు వాగులకొండల లతల కోయిలలమీది ప్రీతి కొత్త అనడం అవివేకమే అవుతుంది.

ఆక్షేపం

అవునయ్యా మీ రిదివరకు కొత్తలేదని చూపినవన్నీ స్వల్పవిషయాలు అప్రధానవిషయాలు. వాటిలో కొత్తలేకున్నా మావాదానికి భంగంలేదు. నేటి కాలపుకవిత్వం వాస్తవంగా కొత్తది. వెనుకటికవులు ఆశ్వాసాలని, సర్గలని, కావ్యవస్తువును విభజించి పెద్దపెద్దకావ్యాలు వ్రాశారు కాని యెంకిపాటలవలె కధ కొంచెంగా సర్గవిభాగం లేకుండా కొద్దిపాటిగా భావమే ప్రధానంగా వ్రాసినకావ్యాలు లేవు. ఇవి యింగిలీషు లిరిక్సునుబట్టివ్రాసినవని వీటిలో భావోద్రేకం ప్రధానం. ఇట్లాటివి మనకు లేవు. ఇప్పటికవుల చిన్నకావ్యాలు యీలిరిక్కులకు చేరినవి వీటిని మేము భావకవిత్వమంటాము. ఇవి కొత్త, దీన్నికాదని మీరెంత యత్నించినా అనలేరు. అని వాదిస్తారా?

సమాధానం

చెప్పుతున్నాను. ఈసంగతి ముందు విచారిస్తాను. దాన్నిప్పుడు నిల్పుతున్నాను.

ఆక్షేపం

"ఈదులాడంగవచ్చు మీయింటికెలని
 పంటకాలవ కొబ్బరిపాలలోన
 నొకరిపై నొకరము చేతు లుంచుకొనుచు
 ఇష్టపడెదవు నీతోడ నేనుగూడ
 పూని చనుదెంతు నీసన్నిధానమునకు
 మరువకే నెచ్చెలీ నన్ను మరువబోకు"
                               (గిరికుమారుడు.సాహితి)

"సుందరాంగుల నెందర జూచియున్న
 జానకీ ఆత్మ నిల్పు నీయానవంబె
 తరుణి నాచిత్త మనియెడు దర్పణమున
 బింబితంబగు నీముఖ బింబమెపుడు"
              (అధికార్ల సూర్యనారాయణ - భారతి సం.2 సం.2)

"ఏల నాహృదయంబు ప్రేమించు నిన్ను"
                                   (దే. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం)

"విబుధులందరు నన్ను విడిచిపోయినను
 హేతులందరును నన్ను నేవగించినను
 నాప్రేమభాగ్యంపు నవ్వువెన్నెలలు
 నాపైన ప్రసరింప నాకేమిభయము"
                      (గరిగపాటి రామమూర్తి - భారతి 2.11)

అని యీతీరున "నేను" అని ఉత్తమపురుషతో చెప్పడం కొత్త. వెనకటివాండ్లంతా యేనలుడిథనో చెప్పేవాండ్లు కాని యిప్పుడు నేను, నా, అని చెప్పుతున్నారు. ఇది కొత్తగాదా అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. అది అసంబద్ధం ఇట్లాటి "నేను" పద్యాలు చిరకాలంనుండి వుంటున్నవి.

"జొన్నచేలోమంచి సొగసుకత్తెనుజూస్తి
 నిన్నటాలనుంచి నిరుదలేదు-"

"గొల్లవారీచిన్నది నన్ చల్లగుండూమన్నదీ"

"వరబింబాధరమున్ పయోధరములున్ వక్రాలకంబుల్ మనో
 హరలోలాక్షులు చూప కవ్వలిమొగంబై నంత నేమాయె నీ
 గురుభాస్వజ్జఘనంబు క్రొమ్ముడియు నాకుల జాల వేగంగ కి
 ద్దరిమేలద్దరి కీడునుం గలదె యుద్యద్రాజబింబాననా"- (చాటు)

"అవిదితసుఖదుఃఖం నిర్గుణం వస్తు కించిత్
 జడమతిరిహ కశ్చిన్మోక్ష ఇత్యాచచక్షే
 మమ తు మతమనంగస్మేరతారుణ్యఘూర్ణ
 న్మదకలమదిరాక్షీనీవిమోక్షో హి మోక్షః"

(సుఖంగాని, దుఃఖంగాని విదితముకానటువంటి ఒక నిర్గుణవస్తువు మోక్షమని ఒక జడబుద్ది అన్నాడు. నామత మదిగాదు. వికసించే యౌవనంతో ప్రకాశిస్తూవున్న స్త్రీయొక్క నీవిమోక్షమే మోక్షమని నామతం.)

"సతి ప్రదీపే సత్యగ్నౌ సత్సు తారామణీందుషు
 వినా మే మృగశాబాక్ష్యా తమోభూతమిదం జగత్" (భర్తృ)

దీపముంటేనేమి అగ్నివుంటేనేమి నక్షత్రాలు చంద్రులు మణులుంటేనేమి, నామృగశాబాక్షిలేకుంటే నాకు జగమంతా చీకటే.)

"కదా కాంతాగారే పరిమళమిళత్ పుష్పశయనే
 శయానః కాంతాయాః కుచయుగమహం వక్షసి వహన్.
 అయే కాంతే ముగ్దే కుటిలనయనే చంద్రవదనే
 ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్"

(కాంతాగారంలో సువాసనగల పుష్పశయ్యమీద పరుండి ప్రియురాలి వక్షోయుగ్మాన్ని రొమ్ముమీద వహిస్తూ "ఓముగ్దా, కుటిలనయనా, చంద్రవదనా, ప్రసన్నురాలవు కావలసినది. అని అంటూ యెప్పుడు దినాలను నిమిషంవలె గడుపుతాను?)"

అని "నేను" అని చెప్పినవి చిరకాలంనుండి వుండినవి

"దై వేపరాగ్యదనశాలిని హంత జాతే
 యాతే చ సంప్రతి దివం ప్రియబంధురత్నే
 కస్తై మనః కథయితాసి నిజామవస్థాం
 కః శీతలైః శమయితా వచనై స్తవార్తిం (భామిని)

దైవం పరాఙ్ముఖంకాగా ప్రియబంధురత్నం స్వర్గానికిపోగా ఒమనస్సా! ఇఘ నీదశను యెవరికి చెప్పుకుంటావు. శీతలవచనాలతో యెవరు నీసంతాపాన్ని పోగొడతారు) అని మనస్సును సంబోధించి తరువాత--

"ప్రత్యుద్గతా సవినయం సహసా పురేవ
 స్మేరైః స్మరస్య సచివైః సరసావలోకైః
 మామద్యమంజురచనై ర్వచనైశ్చ బాలే
 హాలేశతోపి న కథం శిశిరీకరోషి" (భామిని)

"సర్వేపి విస్మృతిపథం విషయాః ప్రయాతాః
 విద్యాపి భేదగళితా నిముఖీబభూవ
 సా కేవలం హరిణశాబకలోచనామే
 నైవాపయాతి హృదయాదధిదేవతేవ" (భామిని)

"మందస్మితేన సుధియా పరిషిచ్య యా మాం
 నేత్రోత్పలైర్వికసితై రవిశం సమీపే
 సా నిత్యమంగళమయీ గృహదేవతామే
 కామేశ్వరీ హృదయతో దయితా న యాతి" (భామిని)

"బాలా యిదివరకువలె యెదురుగావచ్చి వినయంతో మన్మథుడి మంత్రులనదగిన ఆలోకనాలతో మనోహరమైన మాటలతో అయ్యో! కొంచెమయినా నన్నిప్పుడు సంతోషపెట్టవెందుకు?

ఇంద్రియార్థాలు మరచాను. దుఃఖంచేత విద్యగూడా వెనక బట్టింది. కేవలం ఒక్క నాభార్యయే లేడిపిల్లలవంటి కన్నులుగల నాభార్యయే. ఆధిదేవతవలె నాహృదయంనుండి పోదు.

"చిరునవ్వనే అమృతంతో నన్ను స్నానంజేయించి వికసించిన నేత్రోత్పలాలతో నన్నెప్పుడూ పూజిస్తున్న ఆ నిత్యమంగళమయి ఆ నాగృహదేవతాకామేశ్వరి, ఆనాప్రియురాలు నాహృదయంనుండిపొదు" అని భామినీవిలాసాంతర్గతమైన కరుణవిలాసంలో జగన్నాథవిరచిత పద్యాలు కనబడుతున్నవి.

ఈ తీరున నేను, నా, అనేపద్యాలకవిత్వం చిరకాలంనుండి వస్తున్నది. దీంట్లో యేమీకొత్తలేదు. ఇంతకూ నేను, నా, అనే యిట్లాటి కవిత్వం యొక్క ఔచిత్యం ముందు చర్చించబోతున్నాను. కనుక యిక్కడి ఆప్రశంస వదలుతున్నాను. ఇఘ మరేవిధమైన కొత్తాలేదు. యేదైనా కొత్తవుంటే అది దోషభూతం గనుక కొత్తలోచేరదని తెలపబోతున్నాను. కనుక "కొత్తకవితాప్రపంచం" "మనవారు కొత్తవారైనారు"

అని యిట్లా అనుకొనడం భ్రమ. అజ్ఞానం. అవివేకం అని చెప్పుతూ యిఘ యీకాలపుకృతులలో గుణదోషవిచారణ చేస్తాను.

నేటికాలపు కవిత్వం వెనుకటిదానికి తీసిపోదని వెనుకటికాలపు కవిత్వం కంటె ఉన్నతదశలో వున్నదని కొంద రంటున్నారు

"కవులు బయలుదేరినారు. పాతకవులవంటి వారుగారు"
"కవనమున కుండవలసిన లక్షణము లన్నియు నిద్దానికి
 సంపూర్ణముగ గలవు"
               (యేకాంతసేవ పీఠిక. దే. కృష్ణశాస్త్రి.)

"ఈబాలకవులు తొల్లింటిస్కంధముల యశంబునకేమాత్రమును తీసిపోని యొక కొత్తస్కంధమును చేర్చబొవుచున్నారు."
                                                     (బాపిరాజతొలకరి పీఠిక - కూల్ద్రే)
"గుణమున నింతకంటె శ్రేష్ఠములైన కృతులు మనలో లేవు"
                                        (లక్ష్మీకాంత తొలకరిపీఠిక -క.రామలింగారెడ్డి)
"యెంకిపాటలు పూర్వపురచనలకంటె వింత అందమును నూతనప్రకాశమును వెలిగక్కుచున్నవి"
                                                       (దశిక సూర్యప్రకాశరావు. భారతి)

అని యీతీరున అన్నారు. మంచిది. ఈవిషయాన్ని ఇక విచారిస్తాను. ఇంతటి ఉత్కృష్టమైనకవిత్వం నేటికాలంలో వున్నదని విన్నపుడు నాకెంతో ఆనందం కలిగింది. మిక్కిలి కుతూహలంతో ఈకవిత్వాన్ని పఠించాను. గుణదోషాలను వివరిస్తాను.

అని శ్రీమదక్కి రాజు లక్ష్మీనారాయణపుత్ర - ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో

వాఙ్మయసూత్ర పరిశిష్టంలో నూతనత్వాదికరణం.

సమాప్తం