వాడుకరి:Bhanutpt/బాలవ్యాకరణం

వికీసోర్స్ నుండి

శ్రీ హయగ్రీవాయ నమః


క. శ్రీలతకుం బ్రాకయి వృష
శైలంబున వెలసి తనదు చాయ కెలయు ధ
న్యాళి దగ మాన్చి కొర్కులు
చాలంగా నొసగు కల్పసాలము గొలుతున్


క. అనయము లలితోక్తులతో
నొనరుపడం గూర్చి లక్ష్యయోజన మొప్పం
గను బాలవ్యాకరణం
బనగు లక్షణ మొనర్తు నాంధ్రంబునకున్


ఆ. దిక్ప్రదర్శనముగ దెలిపెద నిందు ల
క్షణము గాన బూర్వకవుల లక్ష్య
ములను లాతిలక్ష్మముల గాంచి తక్కుల
క్షణ మెఱింగికొనుడు చతురమతులు

బాల వ్యాకరణం[మార్చు]

సంఙ్ఞా పరిచ్ఛేధము[మార్చు]

  1. సంస్కృతమునకు వర్ణము లేబది
  2. ప్రాకృతమునకు వర్ణములు నలువది
  3. తెనుగునకు వర్ణములు ముప్పదియాఱు
  4. విసర్గ మొదలైనవి సంస్కృతసమంబులను గూడి తెలుగున వ్యవహరింపబడు
  5. కచటతపలు పరుషంబులని గడదబలు సరళంబులని చెప్పంబడు
  6. ఇతరములగు హల్లులు స్థిరములు
  7. దంత్యతాలవ్యంబులయిన చజలు సవర్ణంబులు
  8. ఇ ఈ ఎ ఏ లం గూడిన చజలు తాలవ్యంబులు
  9. అ ఆ ఉ ఊ ఒ ఓ లం గూడిన చజలు దంత్యంబులు (ఐదంతములయిన చజలు సమెతరశబ్దములందు లేవు)
  10. సంస్కృతసమంబులం దికారాంతములయిన శబ్దముల యుపధా చజలు బహువచనంబు పరంబగునప్పుడు దంత్యము లగును
  11. నకారంబు ద్రుతంబు
  12. ద్రుతాంతములయిన పదములు ద్రుతప్రకృతికములు
  13. ద్రుతప్రకృతులు గాని శబ్దంబులు కశలనంబడు
  14. హ్రస్వముమీది ఖండబిందువునకు బూర్ణబిందువు వైకల్పికముగ నగును
  15. దీర్ఘముమీద సాధ్యపూర్ణము లేదు
  16. సంస్కృతసమేతరములయిన తెలుగుశబ్దంబులయందు బరుషసరళంబులకు ముందే బిందువుకానంబడుచున్నది
  17. యకారంబును వు వొ వో లును దెలుగుమాటలకు మొదట లేవు
  18. యరలవలు లఘువులని యలఘువులని ద్వివిధంబులగు
  19. సంస్కృత ప్రాకృతతుల్యంబగు భాష తత్సమంబు
  20. సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవంబు
  21. త్రిలింగదేశవ్యవహారసిద్ధంబగు భాష దేశ్యంబు
  22. లక్షణవిరుద్ధంబగు భాష గ్రామ్యంబు
  23. ఆర్యవ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు

సంధి పరిచ్ఛేదము[మార్చు]

  1. ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధి యగు
  2. ప్రధమేతరవిభక్తి శత్రచువర్ణంబులందున్న యుకారమునకు సంధి వైకల్పికముగానగును
  3. సంధిలేనిచోట స్వరంబుకంటెం బరంబయిన స్వరంబునకు యడాగమంబగు
  4. అత్తునకు సంధి బహుళముగా నగు
  5. ఎమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగానగు
  6. క్రియాపదంబులం దిత్తునకు సంధి వైకల్పికముగానగు
  7. మద్యమపురుషక్రియలయం దిత్తునకు సంధి యగును
  8. క్త్వార్థంబైన యిత్తునకు సంధిలేదు
  9. ఇకాదులకుదప్ప ద్రుతప్రకృతికములకు సంధిలేదు
  10. అచ్చునకామ్రేడితంబు పరంబగునపుడు సంధి తఱచుగనగు
  11. అంద్వవగాగమంబులుదప్ప నపదాదిస్వరంబు పరంబగునపుడచ్చునకు సంధియగు
  12. కుఱు చిఱు కడు నడు నిడు శబ్దముల ఱడల కచ్చు పరంబగునపుడు ద్విరుక్తటకారంబగు
  13. ప్రథమమీది పరుషములకు గసడదవలు బహుళముగానగు
  14. తెనుగులమీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు
  15. ద్వంద్వంబునం బదంబుపయి పరుషములకు గసడదవలగు
  16. ద్రుతప్రకృతికముమీది పరుషములకు సరళములగు
  17. ఆదేశసరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషములు విభాషనగు
  18. ద్రుతంబునకు సరళస్థిరంబులు పరంబులగునపుడు లోప సంశ్లేషంబులు విభాషనగు
  19. వర్గయుక్సరళములు పరములగునపు డొకానొకచో ద్రుతమునకు బూర్ణబిందువును గానంబడియెడి
  20. అవసానంబునందు ద్రుతస్వరంబునకేని, ద్రుతంబునకేని లోపంబు బహుళంబుగా నగు
  21. కొన్నియెడల ద్రుతంబుమీద నకారంబు గానంబడియెడి
  22. అట యిక చుడ శబ్దంబులందప్ప నుడితొలి హ్రస్వంబుమీద ఖండబిందువును, ద్రుతంబునకు లోపంబును లేవు
  23. తాను నేను పదంబుల ద్రుతంబునకు సంశ్లేషంబు లేదు
  24. సమాసంబునందు ద్రుతంబునకు లోపంబగు
  25. సమాసంబుల నుదంతంబులగు స్త్రీసమంబులకుంబుంపులకుం బరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు
  26. సమాసంబులందు ద్రుతంబునకు స్వత్వంబులేదు
  27. తలంబ్రాలు మొదలగుసమాసంబుల ద్రుతమునకు లోపములేదు
  28. కర్మధారయంబునం దుత్తున కచ్చుపరంబగునపుడు టుగాగమంబగు
  29. కర్మధారయంబునందు బేర్వాదిశబ్దముల కచ్చుపరంబగునపుడు టుగాగమంబు విభాషనగు
  30. పేదాదిశబ్దంబుల కాలుశబ్దము పరంబగునపుడు కర్మధారయంబునందు రుగాగమంబగు
  31. కర్మధారయంబునం దత్సమంబులకాలుశబ్దముపరంబగునపుడత్వంబున కుత్వంబును, రుగాగమంబు నగు
  32. కర్మధారయంబునందు మువర్ణకంబునకుం బుంపులగు
  33. ఉదంతమగు తద్ధర్మార్థవిశేషణమున కచ్చుపరమగునపుడు నుగాగమంబగు
  34. షష్టీసమాసమునం దుకారఋకారముల కచ్చు పరమగునపుడు నుగాగమంబగు
  35. ఉదంతస్త్రీసమంబులకును దనంబు పరంబగునపుడు నుగాగమంబగు
  36. సమాసంబునం బ్రాతాదులతొలియచ్చుమీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగా నగు
  37. లుప్తశేషంబునకుం బరుషములు పరములగునపుడు నుగాగమంబగు
  38. క్రొత్తశబ్దమున కాద్యక్షరశేషంబునకుం గొన్నియెడల నుగాగమంబునుం, గొన్నియెడల మీదిహల్లునకు ద్విత్వంబు నగు
  39. అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొకచోగానంబడియెడి
  40. ఆమ్రేడితంబు పరంబగునపుడు కడాదులం దొలియచ్చుమీది వర్ణంబులకెల్ల నదంతంబగు ద్విరుక్తటకారం బగు
  41. ఆమ్రేడితంబు పరంబగునపుడు విభక్తిలోపంబు బహుళంబుగా నగు
  42. అందదుకుప్రభృతులు యధాప్రయోగంబుగ గ్రాహ్యంబులు
  43. చేత తోడ వలనల కిత్వంబు సమానంబులం దగు
  44. అంద్వాదుల కలిగాగమంబు సమాసంబునం దగు
  45. అది యవి శబ్దంబుల యత్తునకు వృత్తిని లోపంబు బహుళంబుగ నగు
  46. పడ్వాదులు పరంబులగునపుడు మువర్ణకంబునకు లోప పూర్ణబిందువులు విభాష నగు
  47. మధ్యమపురుష మువర్ణకంబునకు హలవసానంబులు పరంబులగునపుడు లోపము విభాషనగు
  48. వ్యతిరేకమధ్యమ మువర్ణకంబున కెల్లయెడల లోపంబు విభాషనగు
  49. ఆమ్రేడితంబు పరంబగునపుడు మధ్యమ ముడుజ్జులకు లొపంబు విభాషనగు
  50. విసర్గంబున కనుకరణంబున లోపంబగు
  51. అనుకృతిని నమశ్శబ్దము తుదియత్తున కోత్వము విభాషనగు
  52. అనుకరణంబునం దుదిహల్లునకు ద్విర్వచాంబగు
  53. అనుకరణంబునం దహమాదుల మకారంబునకు ద్విరుక్తి విభాషనగు
  54. ఉదంతనామంబున కనుకరణంబునందు వుగాగమంబగు
  55. వాక్యావసానంబున సంధిలేమి దోషంబు గాదని యార్యులండ్రు