వల్లభాయి పటేల్/జీవన సమీక్ష
జీవన సమీక్ష
యోధుఁడు
వల్లభాయ్ జీవితములోఁ బ్రప్రథమముగాఁ గనుపించునది యాయన వీరత్వము. బాల్యమునుండి వార్ధాక్యములోఁగూడ నాయన మహావీరుఁడుగాఁ జూపట్టును. భయమనునది యెట్టిదో యెఱుఁగని నిర్భయుఁ డాయన. ఆయన మహాత్మునికిశిష్యుఁడే కాని మహాత్మునివలె నాయన సాధకుఁడు, బోధకుఁడుకాదు. ఆయన యోధుఁడు. ఈ విధముగానే యాయన జీవితరంగములో విహరించినాఁడు. ఆదర్శసత్యాగ్రహివలె నాయన శూన్యములో మిళితము కాఁజాలడు. ఆయనలో సత్యాగ్రహి యొక్క యజాతరత్రుత్వములేదు. కాని వీరోచిత క్షమాశక్తి గలదు. పోరాట మాయనకు సహజగుణము. యుద్ధముచూడఁ గనే యాయన కద్భుతభావావేశము గలుగును. భుజము లుప్పొంగును. రాజపుత్రవీరులవలె యుద్ధమాయనకుఁ గేళీవిలాసము. యుద్ధసమయములో వల్లభాయిని జూడఁదగినది. ఆ సమయములో నాయన ఛాతీ విప్పారును. భుజము లుప్పొగును. హృదయ ముత్సాహపడును. వాణి యగ్నికణములవలె నుండును. యుద్ధసమయమున నాయ మధ్యందిన మార్తాండునివలె నుండును. యుద్ధసమయమున, యుద్ధానంతరమున నాయనలో విశేష వ్యత్యాసము కన్పించును. ఆయన జీవిత రహస్యము మనము చక్కగా గమనించఁగలము. యుద్ధ సమయములో వల్లభాయికిఁ బ్రశాంత సమయములో వల్లభాయికి, యేమియుఁ బోలికయే కన్పించదు. సాధారణ పరిస్థితులలో నాయన నివురుకప్పిన నిప్పువలె నుండును. యుద్ధసమయములో నెఱ్ఱ చింతనిప్పువలె నుండును. అపాయములయెడల నాప్యాయము. ఆయన యనుక్షణమును నపాయముల నాప్యాయముగా నాలింగనమొనర్చును. విపత్కరకార్యములను విలోకించుటతోడనే యాయనయుల్లము వికసించును. వేయేల ? ఆయన నిప్పుతో చెల్గాట లాడఁగోరును. బార్డొలీ సంగ్రామ ప్రారంభకాలమున నాయన కిసాన్‌సభలో నిట్లు విస్పష్ట పఱచినాఁడు. "నాతో నెవరును గ్రీడించజాలరు. ఆపదగాని భయము గాని లేని కార్యములో నేను బ్రవేశించనే ప్రవేశించను. ఆపదల నాహ్వానించువారికి నేను సహాయపడుట కనుక్షణము సిద్ధముగా నుందును.
"కడ్డీ చల్లపడుచున్నది."
ఆయన కీ స్వభావ మసహాయోద్యమకాలమునందే యాకస్మికముగా నేర్పడినదికాదు జన్మాదారభ్య యాయన యట్టివాఁడే. కష్టము లాయనను వంచజాలవు. భయ మాయనను భయపెట్టఁజాలదు. నేఁడేకాదు, బాల్యమాది యాయన నిర్భయుఁడు. ఆయన నిర్భయత్వమునకు బాల్యములో నీ దిగువ ఘటన తార్కాణము కాఁగలదు. ఆయనకుఁ గక్షమునఁ గుఱుపు లేచినది. మన పల్లెటూరు వైద్యులకు సర్వరోగనివారిణి రక్షలేగా! ఆ యూరి వైద్యుఁడు కడ్డీ బాగుగాఁ గాల్చి యా కుఱుపుమీదఁ బెట్టిన వెంటనే యెగిరిపోవునని చెప్పినాఁడు. బాలుఁడైన వల్లభాయి యా వైద్యుని మాటలు శిరసావహించి యావిధముగాఁ జేయుటకు సంకల్పించినాఁడు. కణకణలాడు నిప్పులోఁ గడ్డిపెట్టి బాగుగాఁ గాలనిచ్చి దగ్గరనున్న యొకవ్యక్తి కిచ్చి పుండుపైని బెట్టుమని చెప్పెను. ఆ కడ్డీ చేతఁబుచ్చుకొన్న మనిసి యా లేతకుఱ్ఱవానిని గాల్చుటకు సంశయించుచుండెను. అంతట వల్లభాయి కుపితుఁడై యిట్లన్నాఁడు. "ఏమిటి! అట్లాలోచించుచున్నావు. కడ్డీ చల్లారిపోవుచున్నది. నీవల్లఁగాకపోయిన నది యిటు లిమ్ము. నేనే కాల్చుకొందు"నన్నాఁడు. ఆమాట విని యాయన యాశ్చర్యపడినాఁడు.
కడ్డీ యెప్పుడును వేడిగానే యుండును.
ఈ వీరపురుషుని హృదయములో నా కడ్డీ యెప్పుడును జల్లబడనేలేదు. ఆ కడ్డీ చల్లపడుట చూడఁగానే యాయన దడదడఁ గొట్టుకొనును. ఎంతవఱకు నది వేడిగా నుండునో, యెంతవఱకు వాతావరణము తుపానుతోఁ గూడుకొని యాపదల కాటపట్టుగా నుండునో, యెంతవఱకు నగ్ని నలువైపుల ముట్టుకొని యాకాశమున కంటుకొనునో, యంతవఱకు నాయనకు స్వర్గము. ఆ తుపా నాగి, యగ్ని చల్లారిన, నాయన యానంద మంతరించును. అగ్ని పర్వతమునుండి యగ్ని కణములు బయలుదేరునట్లుగనే, వివిదవస్థలో నాయన నోటినుండి వాగ్రూపమైన యగ్నికణములు వెలువడును.
గాంధీజీ లోకమాన్యునిగుణములు
వల్లభాయి గాంధీజిని గురువుగా గ్రహించినమాట సత్యమే. ఆయన వివేక మట్లు వరింపఁజేసినదికాని, యాయన తత్త్వము, నాయనప్రేరణ, ప్రకృతి, లోకమాన్యునితో నధిక ముగాఁ గలియును. లోకమాన్యుని సిద్ధాంతము 'శఠంప్రతి శాఠ్యం' - ఎదిరి యెట్టిపద్ధతి నవలంబించిన నట్టిపద్ధతియే యవలంబించవలెనని యాయన సిద్ధాంతము. వల్లభాయి సిద్ధాంతముగూడ నట్టిదే. గాంధీజీ ప్రభావమువల్ల నది చాల సున్నితమైనది. కాని సిద్ధాంత మదియే. తిలక్‌సిద్ధాంతముపైన గాంధీజీ, ప్రభావము ప్రసరించుటవల్లఁ జేదుమందుకుఁ బంచదార పొదిగినట్లయినది. గాంధీజీ సిద్ధాంతము 'శఠం ప్రతి సత్యం.' రాలఁగొట్టినవారి వెన్నఁగొట్టవలయును. ఈ సిద్ధాంతము నాయన స్వీకరించినాఁడు. ఇది శ్రేష్ఠమైనదనికూడఁ దలఁచును. కాని యాయన సహజస్వభావమునకు గాంధీజీ సిద్ధాంత మనుకూలపడలేదు. ఆయన జీవనములోఁ గలియ లేదు. తీర్థమునకుఁ దీర్థము. ప్రసాదమునకుఁ బ్రసాదముగా నవి విడివడిపోయినవి. ఆయన దానిని స్వీకరించెనుగాని, గాంధీజీవలె నీసాధనలో నాయన యాత్మ పరిపూర్ణమై వికసించలేదు. ఆయనపరిస్థితి, బుద్ధి, వివేకములలో నాయన గాంధీజీ వైపునకు మ్రొగ్గును. ఆయన ప్రకృతియో -ఆయన స్వభావము, ప్రవృత్తి, లోకమాన్యునివైపుకుఁబోవును. ఈసంగతి సందర్భము లన్నియు సమీక్షించినయెడల నాయనలో లోకమాన్యుని గుణములుగాని గాంధీజీ గుణములుగాని లేవు. వీరి యుభయగుణముల సమ్మిశ్రణమే వల్లభాయి. ఆయనలో వా రిరువురి గుణములలోఁ గొన్ని యున్నవి. కొన్ని లేవు.
లోక మాన్యత్వము
ఒక్కక్షణము గాంధీజీ లోకమాన్యులతోఁ బోల్చి చూతము. లోకమాన్యుని యసాధారణవిద్వత్తు వల్ల భాయిలో లేదు. ఆయన గంభీర శాస్త్రజ్ఞానము శూన్యము; లోకమాన్యుని రాజనీతికౌశలము లేదు. కాని యాయనలోని యత్యధికపరిశ్రమ, పట్టుదల, వల్లభాయిలోఁ గలవు. లోకమాన్యునివలె వల్లభాయికూడఁ బ్రజాసేవలో నాత్మవిస్మృతితోఁ గృషిచేయును. లోకమాన్యునివలె నాయనకూడఁ దన్నుగుఱించి యేమియు వ్రాయఁడు. చెప్పఁడు. ఇంతేగాదు, లోకమాన్యునివలెఁ బైకిఁ గఠినుఁడుగా, నిష్ఠురుఁడుగా, నభిమానిగాఁ గన్పించునుగాని, సహజముగా, సరళుఁడు, కోమలుఁడు. స్వాతిశయము లేనివాఁడు.
రాజకీయవేత్తగాదు - యోధుఁడు.
ఇన్ని సమానగుణము లున్నప్పటికిని వీరిలో విభేదమేమి? అసలు వల్లభాయి లోకమాన్యునితో సరిసమానుఁడుకాదు. వా రుభయులలో జన్మతః విశేషవ్యత్యాసము కలదు. లోకమాన్యుఁడు రాజకీయ వేత్త. వల్లభాయి రాజకీయవేత్త కాదు. యోధుఁడు; సైనికుఁడు. సేనాధిపతి, రాజకీయవేత్తలోను యోధునిలోను, దత్త్వతః యధికాంతరము కలదు. రాజకీయవేత్త జిహ్వ చాల యదుపాజ్ఞలలో నుండును. అతని శబ్దములు మృదువై, సహజముగా రెండర్థములు కలిగియుండును. సహజముగా నతడు మనోగతాభిప్రాయమును మాటల ద్వారా వెల్లడించఁడు. అత డవసరము నుపయోగించుకొనును. యోధుఁ డట్లుగాక తద్భిన్నముగా సంచరించును. ఆతడు భావనను దత్త్వమును గ్రహించి సంచరించును. నైతిక విజయము లక్ష్యమైనను భౌతికావకాశములు తీసికొనుట యతని కంత యిష్టముండదు. అత డాపదల నాలింగన మొనర్చును. వీరత్వ మాయనసహచారిణి. సాహస యాయన యనుచరుఁడు. ఆకాశము మేఘావృతమైనప్పుడు రాజకీయవేత్త ముఖములో విచార మేర్పడును. ఈ పరిస్థియే యోధునికి హృదయానందకరమై, ద్విగుణీకృతోత్సాహుఁడగును. శత్రువుయొక్క సవాలు విని రాజకీయవేత్త యిపుడు పోరాటముచేయవలెనా, యక్కర లేదా యని యాలోచించును. యోధుఁడో వెంటనే రణరంగమున నుఱుకును. ఈ దృష్టిలో లోకమాన్యుఁడు వల్లభాయి సమాన ప్రవృత్తి కలవారైనప్పటికిని వారిలోఁ దేడా కలదు.
'గాంధీజీ దృక్పథములో -'
మహాత్మునితో వల్లభాయిని బోల్చవలసి వచ్చిన వారిలోఁ జాలవ్యత్యాసము కలదని స్పష్టపడఁగలదు. వ్యత్యాసమేకాదు, అసలు ప్రవృత్తిలోనే భేదముగలదు. ప్రవృత్తితో పాటు తాత్త్విక భేదమునుగలదు. గాంధీజీ సాధకుఁడు. సత్యము, ఆత్మసాక్షాత్కారము నాయనలక్ష్యములు. ఇందుచే సహజముగా నాయన జీవన మనావృతము, బహిరంగము. ఈ సత్య సాధన సందర్భములో నాయనకు సహకారులైన యల్పాత్యల్ప విషయముల నరమరలేక యాయన వెల్లడించును. సాధారణమానవుఁ డేవిషయములను జెప్పుటకుఁ గంపించునో, యట్టి విషయములనే యాయన యెట్టి సంకోచములేకుండ స్వీయసత్య సాధనకు సహాయకారులైనచోఁ జెప్పును. ఇతరులచే గౌరవ పూర్వకముగా నీయఁబడిన స్వల్పవస్తువును గస్తురిబా తా నుంచుకోఁ దలచినప్పు డామెయెడలఁ దాను బ్రవర్తించినవిధము నిరభిమానముగా నాయన వ్రాసెను. అది యితరుల కసంభవము. మోహరహితుఁడైన యాధ్యాత్మికసాధకునకే యది సంభవము. అది యాయనపధము. వల్లభాయి యొక గొప్ప స్వార్థత్యాగియైన వీరపురుషునివలె స్వవిషయములో మౌనము దాల్చును. ఈమౌనముకూడ విసుగుదలతోఁ గూడినదే. గాంధీజీవిరోధితోఁబోరాడును. కాని విరోధియనిభావించికాదు. అతని నాశనము చేయుటకుఁగాదు; ఆతనిలో మార్పుఁదెచ్చుటకు; నతనిని జెడుమార్గమునుండి తప్పించుటకును; యుద్ధసమయములోఁగూడ విరోధి కల్యాణము నాయన ధ్యానించును. ఈ సాధకుని యంతఃకరణములో నిండి నిబిడీకృతమైయున్న యుదారతచే నాయనకు సహజముగాశత్రువులేఁడు. వల్లభాయి యుదారత వీరోచితమైనది. అతఁడు చాటుమాటుననుండి శత్రుసంహారముచేయ నుంకించఁడు. శత్రుసమ్ముఖముననే నిలఁబడి నిప్పులు గ్రక్కు కన్నులఁ జూచుచు నతనిని నాశనము చేయఁగోరును. శత్రుపరాజయముచే నుప్పొంగును. గాంధీజీ సత్యాగ్రహి. విరోధికిఁ దన కార్యక్రమమును బ్రప్రథమముననే సూచించును.
వల్లభాయి తా నెవరికి శత్రువో, మిత్రుఁడో సూచన చేయఁడు. ఆయన కార్యక్రమము మనము కనుగొనఁజాలము. కార్యానంతరమే కనుగొనఁగలము.
భేదములు
ఇంతేగాదు. మగన్‌లాల్‌జీ చక్కగా వా రిద్దరనుగుఱించి యిట్లు వివరించినాడు. "మహాత్మాజీ యతి సామాన్యమానవునియొక్క ప్రశ్నకుఁగూడ జవాబుచెప్పును. అతని కుతూ హలము నీడేర్చును. వల్ల భాయిని బ్రశ్నించుటకే సహజముగా ధైర్యముండదు. ఆయనను బ్రశ్నించువారు వ్రేళ్ళమీదఁగూడ లెక్కపెట్టుట కుండరు. ఆయన స్వభావ మేమియనఁ దన విరోధికే యాయన జవాబు చెప్పును. మహాత్ముడు తన యాత్మకథ రచించగలఁడు. వల్లభాయి యాత్మచర్చ యెన్నడును జేయఁడు. మహాత్మాజీయొక్క సంయమము. నాయన తపస్సు, మహత్తరమైన కృషీఫలితము. వీరవల్ల భాయియొక్క సన్యాస మొకనాటి ప్రాతఃకాలమునఁ జేయబడినదైనప్పటికి నిలుకడగల దైనప్పటికి యోధునిప్రతిజ్ఞగా నుండును. మహాత్మాజీ సాధకుఁడు, సంస్కర్త, బోధకుఁడు - వల్లభాయి సాధకుఁడుకాదు. సంస్కర్తకాదు. బోధకుఁడుగాదు. అతఁడు యోధుఁడు, సేనాని, సేనాధిపతి. మహాత్మునియొక్క మహత్తరమైన క్షమాగుణములో నాత్మనిరీక్షణ, యాత్మచింతన కలదు. వల్లభాయియొక్క క్షమ వీరోచిత క్షమ. దానిలోఁ దన ప్రత్యర్థియొక్క నూరుతప్పులను మన్నించగలఁడు.
'కర్మవీర్'-
సర్దార్
పలువిధములఁ బరామర్శించినప్పటికి వల్లభాయిని గుఱించి యొక్కమాటలోఁ జెప్పవలయునన నతఁ డాత్మరక్షణ పరుఁడు. తన దేశమునకై బలియగు పురుషుని గుణగణము లాయనలో గుమిగూడినవి. ఆయన యోధుఁడు. బుద్ధి, వివేకము, పరిస్థితి, మౌనావలంబనము, సంఘటనాశక్తి, యీ యోధుని యోధునికంటె గొప్పవానినిగాఁ జేసినవి. ఆయన లోని యీ సహజగుణములే యాయనను సైన్యాధిపతిగాఁ జేసి "సర్దార్" ఆసనముపై నధిష్ఠింపఁ జేసినవి. రాజకీయవేత్తకు సహజలక్షణమగు - డిప్లమసీ -కుటిల రాజనీతి - యాయనలో లేదు. కాని గంబీరత, ప్రాణోత్తేజకరమైన భావావేశమున ఈ రెండు నావశ్యకమైనంత మాత్రమేయుండి యాయనను సైన్యాధిపతిఁ జేసినవి. సర్దారు కావశ్యకమైన యీ గుణము లాయనలో విరాజిల్లినవి. నీళ్ళలోఁ జేప యెట్లు సహజముగా గ్రీడించునో, యట్లే యుద్ధరంగములో నాయన విహరించును. రాజకీయవిషయములు, పరస్పర సమాలోచనలు, సంధులు, నాయన భావావేశమును శిధిలపఱచును. ఆయన ప్రతిభ యందుఁ గుంఠితమగును. ఈ సంగతియే స్వయముగా వచించినాఁడు. "పోరాటములోఁ గలుగు కష్టములు, చిక్కులు, వెంటనే నేను విడిదీసికోఁగలను. ఇట్టి సంకటావస్థలనుండి విడివడుశక్తి నాకెట్లు కలుగునో, నేను వివరించజాలను. కాని రాజీసంభాషణలు నాకు మనస్కరించవు. ఇట్టి యకర్మణ్య చర్చలలో నే ననేకపర్యాయములు గందరగోళములో బడితిని."
వాక్కులో నగ్ని
యుద్ధరంగమునం దాయన వాణిలో నగ్ని యావిర్భ వించును. యుద్ధకాలములో సరళమార్గమునఁగూడ నింతటి శక్తిమంతములైన శబ్దములను సృష్టించుటలో భారతనాయకు లందరిలోను సర్దార్ సమర్థుడు. ఆయన వాణిలో నగ్నికలదు. ఉదాహరణకు - "శత్రువుయొక్క కడ్డీ సలసల క్రాగవలసినదే. సమ్మెటమాత్రము చల్లగా నున్నప్పుడు మాత్రమే యుపయో గింపఁబడును." బార్డోలీరైతులను గష్టముల నెదుర్కొనుటకు హెచ్చరించుచు, "వైశాఖజ్యేష్ఠమాసములలోఁ బ్రచండమగు నెండవేడిమి లేకపోయిన నాషాడశ్రావణమాసములలో వర్షము లుండ వను సంగతి రైతులయిన మీరు మఱవరాదు. లేక "చంపుటకుఁ జచ్చుటకుఁ బ్రభుత్వమువారు సైనికుల నాఱు మాసములలోఁ దయారు చేయుదురు. మనము కేవలము మరణించుటే నేర్చుకోవలయును. ఇట్టి సందర్భములో మూడు మాసము లెందుకు?"
వల్లభాయి పండితుడన నెవరో యిట్లు వివరించిరి. "భాషను గృత్రిమపద్ధతిని నిగూఢముగాఁ జేయువాఁడే పండితుడు." విద్యార్థులయెదుటఁబ్రసంగించుచు నిట్లన్నాఁడు. సర్పము తన కుబుసమును విడిచివేయుటలో నేమైన బాధగలుగునా? ఏమైన శ్రమచేయునా? ఇదేవిధముగా మనముకూడ నొకా నొకదినమునఁ బరప్రభుత్వ మను కుబుసమును విసర్జించఁగలము. ఇందులో శ్రమగాని కష్టముగాని యేమున్నది?" ఈ విధముగానే "ప్రభుత్వము దుష్కార్యము చేసిన రైతు సూటిగాఁ జెప్పవలసిన జవా బిది ............"పో,పో, నీబోటిరాజు లెందఱో మట్టిలోఁ గలియుట కనులారఁజూచితిని." బార్డోలీ సత్యాగ్రహ సమయములో బాలోడైలోఁ బ్రసంగించుచు - "ప్రభుత్వమువారు జైలు కతిథుల నాహ్వానించుచున్నారు. మీరు, వారికిఁ గావలసినంతమందిని బంపించఁగోరుచున్నాను. ఇదేవిధముగా నాయనను నిర్బంధించినపుడుకూడ భారతీయ వాతావరణ సూచకముగాఁ జెప్పెను. "ప్రభుత్వమువారు నా కాళ్ళను ద్రుంచివేసి ఱెక్కలులేని పక్షినవుదునని విశ్వ సించుచున్నారు. వర్షము కురిసినవెంటనే గడ్డిమొలచున ట్లనేకులు నూతనపురుషు లుద్భవించఁగలరని వారిని నేను హెచ్చరించుచున్నాను."
ఇవన్నియు యుద్ధకాలమునఁ బలికిన పలుకులు. సహజముగా వల్లభాయికి మాట్లాడు నలవాటు తక్కువ. ఒక్క మాటలో వచింపవలెనన నాయనలో మాటలుతక్కువ. క్రియ యెక్కువ. ఆయన వాక్శూరుడుకాడు వేదిక లెక్కి లెక్చర్లు కొట్టు మానిసికాదు. ఆయన పబ్లిసిటీ కోరఁడు. కార్యము ననుసరించి యాయన ప్రకటనఁ గోరునుగాని తననుగుఱించి ప్రకటన మాత్రముచేయఁడు. ఆయన గర్జించు మేఘమువంటివాఁడు కాఁడు. కుంభవృష్టి కురిపించు కారుమేఘమువంటివాఁడు. అటులనే యాయన మౌన మాశ్చర్యజనకమైనది. ఆయన సహజ వీరుఁడు. అందుచే నుత్తరకుమారప్రజ్ఞ లాయనకు సరిపడవు. ........కఠోరముఖము, దృడమైన దవడలు, శత్రువునుఁ గాయ్యమునకు కాలుద్రువ్వు కన్నులు, విషముతో నిండిన వ్యంగ్యము. ఇవి వల్లభాయి స్వరూపస్వభావములు. ఆయన ముఖవర్చస్సులో నాయన యాంతరంగికశక్తి కనుగొన నగునని యొక యాంగ్లేయ పత్రికావిలేఖకుఁడు పలికినమాట యక్షరాల నిజము. ఆయన వ్యంగ్య మాయనకు నమృతము వంటిది. సాధారణాచరులనేకాదు గాంధీజీపైనగూడ వ్యంగ్య బాణము వదలుటలో నాయన యీషణ్మాత్రము సంకోచించఁడు. తుపానులో నాయన పర్వతమువలె నచలుఁడు. విరోధియెడలఁ గఠినుఁడు. ఈ విషయములో గాంధీజీ నాయనకు నెట్టిపోలికయులేదు. విరోధి కాంగ్రెసువాఁడుకాని, తదితరుఁడుకాని, యాయన యన్న మిక్కిలి భయపడును. ఎందుచేతనన నాయన యెవ్వరి వెంటఁబడునో వానిని నామరూపములు లేకుండఁజేసి విడిచిపెట్టగలఁడు. నిర్మాణములోను, గార్యనిర్వహణలోను నాయనలో నపూర్వశక్తి గలదు. గుజరాతులో నాయనను బ్రతిఘటించు పురుషుఁడు పుట్టలేదు.
కర్షకుల కాశాజ్యోతి
వీని యన్నిటికిమించి వల్లభాయి కిసానుల హృదయమును గనుగొన్నాడు. భారతదేశమునకు సరియైన ప్రతినిధులుగా వారిని గ్రహించి వారిని దనవారిగా నెంచెను. ఆయన కిసానులను బాగుగా దెలిసికొన్నాడు. రైతు లాయనను బూర్తిగా గ్రహించినారు. కాకా కలేల్క రిట్లు వ్రాసెను. "రైతాంగము వ్యాకులహృదయ మైనప్పుడు వల్లభాయి రక్తముపొంగును. ఈ బాధా హేతువువలననే యాయన గ్రామములను దన కార్యక్షేత్రముగా గావించి రైతుల నాత్మీయులుగా భావించుటయేకాక యాయనయే కృషీవలుఁడైనాడు. కైరా, బోర్సద్, బార్డోలీ - యివియన్నియు నిందు కుదాహరణములు. ఆయనవలె రైతాంగమునకుఁ బ్రత్యక్షముగా నింత సహాయము చేసిన నాయకులు భారతీయనాయకవర్గములోలేరు. ఆయన భారతీయకర్షకుల యాశాజ్యోతి-ఆయనను గుఱించి "జోనాబేలీ"రచించిన యీ పంక్తులు నిత్యసత్యములు.
Even to the dullest peasant standing by
Who fasten'd still on hims wandering eye,
He seemed the master-spirit of the land.
వల్లభాయి కాంగ్రెసుయొక్క సంఘటనాత్మక ప్రతిభా శక్తులకుఁ జిహ్నము.