వల్లభాయి పటేల్/అన్నదమ్ములు

వికీసోర్స్ నుండి

నేమి, యాయన కాంగ్రెసు రాయబారిత్రయములో (నెహ్రూ, అజాద్) నొకఁడై కాంగ్రెసుప్రతిష్ఠకుఁ దగినట్లుగా నడపిన సంగతి సర్వజనవిదితము.

ఆయన కాంగ్రెసు వర్కింగుకమిటీ సభ్యుఁడేగాదు. కాంగ్రెసు సూత్రధారులలో నొకఁడేకాదు. గాంధీజీ తర్వాత కాంగ్రెసువిధాననిర్ణేతలలో నగ్రస్థానము వహించినవాఁడు.

అన్నదమ్ములు

కాంగ్రెసులోఁ బ్రఖ్యాతి గాంచిన నాయకులలో నన్నదమ్ములజంటలు కొన్నిగలవు. ఆలీసోదరులు, బోస్ సోదరులు, ఖాన్ సోదరులు, పటేల్ సోదరులు ప్రఖ్యాతులు.

ఆలీసోదరులలోఁ బెద్దన్నయ్యషౌకతాలీ భీమాకారుఁడు. ఆయన యాకారమే రాజద్రోహకర మైనదని యాయన యనుచుండెడివాఁడు. నిండుహృదయుఁడు. ఆయనతమ్ముఁడు మహమ్మదాలీ యఖండప్రతిభావంతుఁడు. ఆలీసోదరు లిరువురు మహాత్ముఁడు ఖిలాఫతుద్యమములో నేకీభవించిచేసిన స్నేహము ప్రచారము ప్రబోధము. చరిత్ర ప్రసిద్ధమైనవి. వారిరువురు వామనమూర్తియగు గాంధీమహాత్మున కంగరక్షకులై యను యాయులై, వర్తించిన విషయము విశదమే. అందులో మహమ్మదాలీ 1923లోఁ బ్రథమముగా నాంధ్రదేశమునఁ గాకినాడ కాంగ్రెసుసభ కధ్యక్షుఁడైనాఁడు. కాంగ్రెసధ్యక్షోపన్యాసములలోనికెల్ల నాయన యుపన్యాస మతిదీర్ఘమైనది. ఆ దీర్ఘ బాహువునకుఁ దగినట్లుగానే యది యున్నది. ఖాన్‌సోదరులు సరిహద్దురాష్ట్రపు కాంగ్రెసుభక్తులు. మహాత్మునిమిత్రులు. ఈశ్వరసేవకులు. వారి కుటుంబము 1857 సంవత్సరములో జరిగిన స్వాతంత్ర్యసమరములోఁ బ్రభుత్వమున కండయై నిలచి, చేసిన పాపపరిహారార్థ మీనాటి స్వాతంత్ర్య సమరములో నా కుటుంబమంతయు నాహుతియై యధికఖ్యాతిఁగాంచినది. వారిలోఁ బెద్దవాడగు ఖాన్ సాహెబ్ గొప్ప పార్లమెంటేరియను. కేంద్రశాసనసభలో సభ్యుఁడుగను, సరిహద్దు రాష్ట్రములో సచివుఁడుగను నుండి, యాయన చేసిన సేవ విఖ్యాతమైనది. చిన్నవాఁడగు గపూర్‌ఖా నీశ్వరసేవక సంఘము నేర్పాటుజేసి, నిర్మాణకార్యక్రమములో నిరుపమాన కార్యదక్షతను జూపి యవక్రపరాక్రమశాలులైన పఠానులలో నహింసాసిద్ధాంతము నమలులోఁబెట్టి సరిహద్దుగాంధీ యని ఖ్యాతిఁగాంచిన యహింసామూర్తి. కాంగ్రె సధ్యక్షపదవి నంగీకరించని నిరాడంబరుఁడగు సేవాతపస్వి.

బోస్ సోదరులలోఁ బెద్దవాఁడగుశరత్ చంద్రబోసుకూడఁ బార్లమెంటేరియను. బెంగాలు శాసనసభలోను గేంద్రశాసనసభ కాంగ్రెసు నాయకుఁడుగను నాయన ఖ్యాతిఁగాంచినాఁడు.

ఆయన యనుంగు సోదరుఁడగు సుభాషబాబు బ్రహ్మచర్యము స్వీకరించి దేశభక్తి వ్రతమును బూని స్వరాజ్య కంకణమును ధరించిన విప్లవమూర్తి. కాంగ్రెసు బహిష్కరించిన రోజులలోఁగూడఁ బ్రజాభిమానమును జూఱగొన్న ప్రజానాయకుఁడు. ప్రభుత్వమువల్లఁ బెక్కు బాధలు పొందిన దేశభక్తుఁడు. ప్రభుత్వమునకుఁ బ్రక్కలో బల్లెమై ప్రవర్తించిన యోధుఁడు. తన జీవితమంతయు దేశమున కర్పించిన మహాత్యాగి. కట్టుగుడ్డలతోఁ బ్రభుత్వమువారి కండ్లలోఁ గారముగొట్టి కానిదేశముపోయి యజాద్‌హింద్‌ఫౌజును స్థాపించి, భారత స్వాతంత్ర్యమును బ్రకటించిన వీరాగ్రణి - నేతాజీ యన్న యాయన నామము సార్థకము.

మనపటేలుసోదరులలో విఠల్‌భాయిపటేలు పెద్దవాఁడు. ఆయన గొప్ప పార్లమెంటేరియనే. అఖండ ప్రతిభావంతుఁడు, గొప్పవిమర్శకుడు. విధ్వంసనములో నధికుఁడు. స్వరాజ్యపార్టీ ప్రముఖులలో నొకఁడు. బొంబాయి మేయరుగాను నాగపూరు జెండాసత్యాగ్రహములోను, నింకను బెక్కువిధముల నాయన సేవఁజేసినను భారతకేంద్రశాసనసభాధ్యక్షుఁడుగా నాయన ప్రదర్శించిన ప్రతిభావిశేషములు, స్వాతంత్ర్యనిరతి, యనన్య సామాన్యమైనవి. ప్రత్యర్థిశక్తులపై నాయనపొందిన విజయము లనంతములు. ప్రెసిడెంటు పటే లనుపేరున నాయన ప్రఖ్యాతుఁడైనాఁడు. ఆయననామము స్వాతంత్ర్యసమరచరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపఁదగినది.

పైన బేర్కొన్న సోదరత్రయములో నన్నలకంటెఁ దమ్ము లధికసేవావ్రతులు, ప్రతిభావంతులు, విఖ్యాతులుకూడ. మనపటేలు సోదరులలో, నిరువురు నిరువురే. ఒకరినిమించిన వా రొకరు. పెద్దపటేలు కోటలోఁ బ్రవేశించి పోరాడినఁ జిన్న పటేలు కోటబయటనుండి పోరాడినాఁడు. ఉభయులు సమాన శక్తియుక్తులు కలవారే. కాని భిన్న ప్రవృత్తులు కలవారు. కనుకనే భిన్నమార్గము లవలంబించినారు. మార్గములు భిన్నములైనను నాదర్శ మొక్కటే. ఆ యన్నదమ్ము లిర్వురు నొకరితో నొకరు వైరుధ్యభావముతోఁ బోరాడుచుండువారు, కాని యీ విరుద్ధభావమునకు వెనుక నొక ప్రేమవాహిని ప్రవహించుచునే యుండెను.

తండ్రికిఁ దగిన తనయ

సర్దారుకు 1905 లో నొక కుమారుఁడు గలిగెను. ఆయనపేరు దయాభాయి. ఆయనకూడ శ్రీకృష్ణజన్మస్థానమున కరిగినవాఁడే. ఆయన కుమారుని కంటె విఖ్యాతయైన దాయన కుమార్తె మణిబెన్. (1907) నిజముగా నామె మణివంటిది. ఆమె గాంధీజీని బ్రథమముగా దర్శించినప్పుడు చేతిబంగారు గాజులుతీసి బాపూజీకి సమర్పించినది. అవి స్వీకరించి "స్వరాజ్యము వచ్చువఱకు మఱల నీవు గాజులు ధరించరాదు. దేశ సేవలోనే నిమగ్నురాలవై యుండవలయు"నని గాంధీజీ హితోపదేశముచేసెను. ఆమె దానిని ద్రికరణశుద్ధిగా నంగీకరించినది. నాటినుండి యామె సిరుల నవతలకుఁ ద్రోసినది. భోగాలను వీడినది. ఇంతేగాదు. వివాహమే మానినది. బ్రహ్మచర్య మవలంబించి తదేకదీక్షతో దేశసేవచేయుచున్నది. తండ్రికిఁ దోడుగా నిలచి స్వాతంత్ర్యసమరములో ముందడుగు వేసినది.

మణిబెన్‌లోఁగల యీ దివ్యభావమును, త్యాగమును జూచి, లోకము విస్తుపోవును. ఎక్కడివా యీ పోకడలని యాశ్చర్యపడును. కాని యామె జన్మించిన వంశములోని సేవాభావమును గమనించిన నా యనుమానము పటాపంచలైపోవును.