వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ)/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

వరాహపురాణము

తృతీయాశ్వాసము

క.

శ్రీవాసలోచనాబ్జ ది, శావిజయస్తంభదండచయదంతురిత
క్ష్మావలయ తుళువకులపా, రావారమృగాంక యీశ్వరప్రభునరసా.

1


వ.

అవధరింపు మవ్వరాహదేవుండు విశ్వంభర కిట్లనియె నిట్లు సుప్రతీకనరనాథుండు
లబ్ధమనోరథుండై నిజరాజధాని యగువారణాసికిం జని సకలకళావిలాసనివాసంబు
లైనరాణివాసంబులతోడ రాజ్యభోగంబు లనుభవింప దూర్వాసోమునివరప్రసా
దంబునం గొన్నివాసరంబులకు విద్యుత్ప్రభాదేవికి నెల మసలిన.

2


గీ.

రోమరాజి తమాలవల్లీమతల్లి, పగిది నలుపెక్కి మెఱసె నాపడఁతినడుమ
నింద్రసామ్రాజ్యహానికి హేతు వైన, ధూమకేతువు నభమునఁ దోఁచె ననఁగ.

3


గీ.

భావిపురుహూతకుంభికుంభములమీఁద, నల్లఁబాఱు నిజాత్మజుభల్లహతుల
నని యెఱిఁగించువిధమున నామరాళ, గమన పాలిండ్లకొనలు నీలిమ వహించె.

4


గీ.

తనతనూజునిబిరుదగాథలు వినంగ, మొనపువెఱపున సురరాజుమొగము తెల్లఁ
బాఱు నిఁక నని తెలిపెడుభంగి నాస, తీలలామంబువదనంబు తెల్లఁబాఱె.

5


గీ.

ఆత్మసూనుండు తరువాత నాజి గెలుచు, నమరవిభునకు నన్నింట నరుచి పుట్టు
నని నిరూపించుకరణి భోజ్యములమీఁద, నాచకోరాయతాక్షికి నరుచి పుట్టె.

6


గీ.

స్వతనుజన్ముండు దేవేంద్రసంపదలు హ, రించి మధ్యమలోకంబు వృద్ధిఁ బొందఁ
జేయఁ గలఁడని సూచించెనో యనంగ, నాసుధాకరముఖికి మధ్యంబు బలసె.

7


గీ.

అధికదౌహృదసంపద నాసరోజ, గంధినడిమికిఁ బేదఱికంబు మానెఁ
దలఁప నట్టిద యెట్టివారలకు నైన, లేమి గాపుర ముండునే భూమిలోన.

8


గీ.

సంచరణవేళ మణిమయసౌధజాల, కములఁ గనవచ్చురవిమయూఖములు చూచి
యష్టివిభ్రాన్తిఁ బట్టు గర్భాలసత్వ, మేమి యనవచ్చు నింక నానృపతిసతికి.

9


వ.

ఇవ్విధంబున దినదినప్రవృద్ధమానదౌహృదాభ్యుదయంబు వహింప నారాజహంసుం
డు నిజస్త్రీవతంసంబునకుం బుంసవనసీమంతంబులు సముచితప్రకారంబున నిర్వ

ర్తించి గర్భరక్షావిధానంబున సడిసన్నమన్నన ముదుసళ్ళం గనుసన్నల మెలంగ
నాసన్నలం జేసి దత్తావధానంబులు సేవింప నేర్పు గలపరిచారికలం బనుపుచుఁ
గోర్కులం దనుపుచు వయస్యలు రహస్యంబునం జెప్ప నప్పటప్పటికి నంతర్వత్ని
యైనపత్ని మధురాలాపంబులు వీనులం జొనుపుచుఁ గుతూహలంబు వెనుపుచు
వర్తించి నవమాసావసానంబున.

10


భుజంగప్రయాతము.

చకోరంబు లాసన్నచంద్రోదయం బ్రా
క్కకుప్తన్వి వీక్షించి కౌతూహలావ
స్థకు న్వచ్చురీతి న్విశాలేక్షణంబుల్
ప్రకాశింప విద్యుత్ప్రభాదేవిఁ జూచున్.

11


సీ.

అంత నత్యుత్తమం బైనవాసరమున వాసరేంద్రాదినవగ్రహములు
మంచిఠావుల నుండ మధ్యాహ్నవేళ శాత్రవజైత్రతేజోధురంధరుండు
దుర్జయాఖ్యుండు సుతుండు భీకరుఁడు విద్యుత్ప్రభాదేవికి నుద్భవింప
హృదయంబులోపల నెఱిఁగి యేతెంచి దూర్వాసుఁడు జాతకర్మములు గడపి
మేదినీధరవిద్వేషిమీఁదికోప, మెట్టిదో కాని పనివడి యిష్టి వేల్చి
నిమిషమున నక్కుమారరత్నముఁ బదాఱు, వత్సరంబులప్రాయంబువానిఁ జేసి.

12


గీ.

మఱియు సంయమికులశిఖామణి మహీమ, హేంద్రుగారాపుఁబట్టికి నేయ వ్రేయ
నడువఁ బొడువ నెఱిఁగించె నస్త్రవిద్య, చదువఁ జెప్పంగ నెఱిఁగించె శాస్త్రవిద్య.

13


క.

ఆవెనుక సుప్రతీక, క్ష్మావల్లభుపిన్నభార్య కాంతిమతీసా
ధ్వీవర్య గనియెఁ బెద్దల, దీవన సుద్యుమ్ను నాకృతిప్రద్యుమ్నున్.

14


శా.

వాఁడుం గంజభవాంజనాతనయులం వారించుధీశక్తి నై
దేఁడుల్ వెళ్ళకమున్న కైకొనియె సాహిత్యంబు సంగీతమున్
వీఁ డత్యుత్తముఁ డంచు భూజనులు వర్ణింపంగఁ దేజంబు క్రొ
వ్వాఁడిన్ వాసికి నెక్క జవ్వనమునన్ వర్ధిల్లె నానాఁటికిన్.


వ.

ఇట్లు వివిధవిద్యావిజృంభణంబున నవయౌవనారంభణంబున నయనానందసం
ఛాయిసౌందర్యంబున దుస్సహబాహుశౌర్యంబున మాఱులేక విస్ఫూర్జితు లైన
దుర్జయసుద్యమ్నకుమారుల విలోకించి తనవార్ధకంబు వివేకించి కించిత్కాలంబును
విలంబనంబు సేయక నాయకామాత్యభృత్యపురోహితబాంధవజనంబుల రప్పించి
వారలసమక్షంబున మోక్షలక్ష్మీనివాసంబును శ్రీమద్విశ్వేశ్వరమహాదేవునిరాణి
వాసంబును గృతనిమజ్జనజగజ్జననియోగవేదనాదూయమానదురితరోదనశంకాకర
నికటగంగాతరంగాక్రోశంబును సమావృతపంచక్రోశంబును మధ్యాహ్నసమయ

భిక్షాప్రదానవినోదనపరిగృహీతపురంధ్రీరూపవిహరమాణవిశాలాక్షీచరణకంజమణి
పుంజకిరణమంజరీపింజరితమంజుమంజీరశింజితముఖరవిశిఖాముఖంబును మణికర్ణికా
సరఃపద్మకర్ణికావిలీనశిలీముఖంబును డుంఠివేదండతుండతుండజనితశీకరప్రకరనిరం
తరతారకితనభోవకాశంబును ఘంటాపథప్రతినిశీధచరత్కాలభైరవారక్షకపురః
కరదీపికాసహస్రప్రకాశంబును శిఖగుంభితశాతకుంభకుంభామ్రేడితగగనకల్లోలి
నీకనకజలజాతగోపురంబును నైనవారణాసీపురంబున దుర్జయుఁ బట్టంబు గట్టి బుద్ధి
మంతుల సకాశంబునం బెట్టి సుద్యుమ్ను యౌవరాజ్యంబున నిలిపి నృపనీతివాక్యం
బులు దెలిపి సర్వసంగపరిత్యాగంబు గావించి తపం బవస్యకర్తవ్యంబుగా భావించి విర
క్త్యంగనాలింగితప్రతీకుండు సుప్రతీకుండు సకలకాలకిసలయకుసుమఫలభరితనగం
బునకుఁ బితృకూటనగంబునకుం జనియె నంత నిక్కడ.

16


గీ.

దుర్జయుుడు ధరిత్రీవధూటిఁ బిలువ, రాచవారివిపద్గతి చూచి బెగడి
చేర వచ్చిన సౌఖ్యలక్ష్మీపరంప, రాస్పదం బైనతనబాహు నాదరించి.

17


చ.

ఎనిమిదిదిక్కులన్ గుణము లెన్నిక కెక్క భుజాపరాక్రమా
ర్జనపరతంత్రచిత్తమున రాజ్యము సేయుచు నొక్కనాఁడు క
మ్మనిహిమవారిపూరమున మజ్జన మాడి దుకూలపుష్పచం
దనమణిభూషణావళులు దాల్చి నిజావరజానుయాతుఁడై.

18


క.

ధళధళ మను వెన్నెలలం గలకల నగుచామరములు కరకమలములం
గలకలకంఠీజనములు, గొలగొల రా వచ్చి కొలువుకూటములోనన్.

19


స్రగ్ధర.

ఆసుద్యుమ్నాగ్రజన్ముం డధిగతమణిసింహాసనుండై సభాసీ
మాసేవాసన్ననానామనుజపతిహితామాత్యులం జూచి మిథ్యా
హాసాంకూరోద్గమం బాస్యమున మెఱయ నేత్రాంతముల్ గోరబాఱన్
మీసంబుల్ దీడి పల్కెన్ మృగపరివృతగంభీరనాదంబుతోడన్.

20


సీ.

భారతవర్షధాత్రీరమణులు మన నొల్లరో కొలువ రాకుంట యెట్లు
హరివర్షకువలయాధ్యక్షులు బ్రదుకంగ నొల్లరో కొలువ రాకుంట యెట్లు
భద్రాశ్వవర్షభూభర్తలు ప్రాణంబు లొల్లరో కొలువ రాకుంట యెట్లు
రమ్యవర్షవసుంధరావల్లభులు తల లొల్లరో కొలువ రాకుంట యెట్లు
బవరమున వారు నావాలుపాలుగాక, శరణు చొరఁ గేతుమాలకింపురుషకుర్వి
లావృతహిరణ్మయాఖ్యవర్షావనీశు, లొల్లరో తారు కొలువ రాకుంట యెట్లు.

21


క.

తనతోడిదిక్పతులుఁ దానును గతహంకారుఁ డై ననుం గనఁ డింకన్
వినఁడు సుమీ నే సింహా, సన మెక్కినవార్త పాకశాసనుఁ డహహా.

22

గీ.

అనిన యువరాజు సుద్యుమ్నుఁ డన్నపార్శ్వ, భాగముననుండి చిఱుతకోపంపుఁగెంపు
తనకనుంగవ మొనప ముందరికి వచ్చి, కేలుదోయి శిరంబునఁ గీలుకొలిపి.

23


చ.

అలఘుబలాఢ్యుఁ డయ్యును దయాళువు గావున శాంతచిత్తుఁడై
నిలిచినతండ్రికాలమున నెమ్మది గాదములోనిదోసకా
యలువలె నున్నరాజులు బలారిభయంకర నిన్ను నట్ల కాఁ
దలఁచిరి దాడి పెట్టి భుజదర్పము చూపుము వేయు నేటికిన్.

24


క.

అనవుడుఁ గూరిమితమ్మునిఁ, గని మెచ్చి పురంబు వెడలి కరితురగస్యం
దనభటులతోడు చూచి న, యనభయదస్ఫూర్తిఁ జైత్రయాత్రోన్ముఖుఁడై.

25


సీ.

ఘనఘనాఘనసన్నహనకుహనాఘోణిఘోణాపుటీగుటగుటలతోడఁ
బ్రళయకాలకరాశబహుశిఖాముఖసముద్భటహవ్యవహచిటచిటలతోడఁ
గులధరాధరకూటకోటిపాటనపతద్భీషణాశనిపెటపెటలతోడ
సరభసావిర్భవన్నరహరిస్తంభగర్భస్ఫుటీకృతపటపటలతోడ
నవఘళించి విడంబించి హంకరించి, రాయడించి ధణంధణారవము రత్న
సానుగుహలఁ బ్రతిధ్వను లీన విజయ, పటహపటలంబు చఱపించి పటురయమున.

26


క.

గమనింపఁ దలఁచుచోఁ బొం, దుము విజయం బనుచు నపుడు దూర్వాసుఁడు ల
గ్నము వెట్టఁగ ధవళచ్ఛ, త్రము వెట్టఁగ దుర్జయుండు రథ మెక్కుతఱిన్.

27


సీ.

వెడలె భూధరములవిధమునఁ గోటానుకోటులు మదభద్రకుంజరములు
నడచె వీచికలచందమునఁ బుంఖానుపుంఖములు జవనకంఖాణహరులు
కదలెఁ బుష్పకములకరణి లక్షోపలక్షలు రత్నకాంచనస్యందనములు
చనిరి సింహంబులజాడఁ దండోపతండంబులు వీరభటప్రవరులు
పోయె ముందట నీనినపులులవంటి, రాచబిడ్డలు తనవెంట రా నరాతి
గార్భిణభ్రూణహం బైన కాహళీమ, హావిరావంబు నిగుడ రాజానుజుండు.

28


క.

ఆసమయంబున శేషఫ, ణాసాహస్రంబు ముడిగె నడికె సమస్తా
శాసామజంబు లిట్లు జ, యాసన్నచమూపరంపరాన్వీతుండై.

29


గీ.

నగతనూజాత పెండ్లైననాఁటనుండి, నేఁటిదాఁక నగస్యుండు నిలువఁడేని
నిమ్మహాసేనబరువున నెగయకున్నె, దక్షిణం బన నరిగె నుత్తరమునకును.

30


చ.

అరుగునపారసైనికపదాహతిఁ దూలినరేణువు ల్దిగం
బరత లలాటనేత్రునకు మాన్చె ననంగ నిజాండకర్పరాం
తరమునఁ దోడిభూతములు నాల్గు నడంగిన భూమి తత్వమే
నెరసె ననంగ లోకములు నిండెఁ ద్రివిక్రమమూర్తికైవడిన్.

31

గీ.

అధరాధూళిపాళిచే నబ్జజాండ, భాండము వహించె భూతికరండలీలఁ
జుక్కలు ధరించె మేదిని దుక్కిలోన, విత్తిన విశాఖవిత్తులవిలసనంబు.

32


వ.

ఇవ్విధంబున సకలజగదంధకరణం బైనరజోగణంబు సముద్దండకేతనశిఖరవినిర్భి
న్నజలధరగర్భగోళగళద్వారిధారాభిషేచనంబున నడంగ మృదంగనిస్సాణదుందు
భిధ్వానంబులు మిన్నుముట్ట దాడివెట్టి కౌబేరదిశామహేశానదేశంబుల జనితాక్రో
శంబులం జేసి భారతభద్రాశ్వకేతుమాలకింపురుషకుర్విలావృతరమ్యహిరణ్మయవర్షావ
లంబజంబూద్వీపధరిత్రీకాంతులం బాదాక్రాంతులం జేసి పుష్కరక్రౌంచశాకశా
ల్మలప్లక్షకుశద్వీపంబులభూనాథుల దైన్యసనాథులం జేసి తురాషాడ్జిగీషాసమున్మేషం
బున దుర్జయుండు నిర్జరగిరికూటం బెక్కి మిక్కిలిగర్వంబున గంధర్వులం దూలిచి
గురుడులం గూలిచి కిన్నరులం గొట్టి కింపురుషులం బాడుదలవట్టి సారణుల వెం
టాడించి సాధ్యుల నోడించి విద్యాధరులం భంగపఱచి విబుధులవెన్ను చఱచి
దీర్ఘనిర్ఘాతర్ఘోషప్రతిభటాట్టహాసంబున దిక్కులు గ్రక్కదలఁ గదలి కదళీకాంతా
రంబు చొచ్చినమదాంధగంధసింధురంబునుం బోలె మీటు మిగులునమ్మేటిమ
గనిం గాంచి కాంచనగర్భసంభవుండు నిర్భరాహ్లాదంబునఁ గుంచె సారించి యింత
కాలంబునకు నీబుభుక్ష దీఱ మదీయవీక్షణంబులకు జగడంపుఁగూడు కుడువం గలిగె
నని లేటికొదమచందంబునఁ జంగుచంగునం దాఁటుచు నందనోద్యానంబునఁ గల్ప
వృక్షంబులనీడం గ్రీడించుబిడౌజుపాలికి హుటాహుటిం జని యిట్లనియె.

33


చ.

మఱి పని లేదె వేసరవు మాటికి నిక్కడ నుండ నోయి చే
టెఱుఁగనికూన దుర్జయనరేంద్రశిఖామణి వీఁడె వచ్చె నే
వెఱపును లేక వేలుపుల వెంపర లాడుచు నాలకింపు మా
మొఱలు తదీయధాటి నిను ముట్టుఁ జుమీ నిమిషంబు నిల్చినన్.

34


క.

నావుడు నింద్రుఁడు బెగడకు, నీవు సువర్ణాద్రి యెక్కి నిర్భయమున నా
పై వచ్చు నఁట నరాధముఁ, డీవింతలు వినఁగ వలసె నేటికి మాటల్.

35


చ.

ప్రమథగణంబుఁ దాను హిమభానుకళాధరుఁ డెత్తి వచ్చినం
దెమలక నిల్తు నారదమునీ చలియింపుదునే మనుష్యమా
త్రమునకు వీఁడు మున్ను బవరంబున నాకరవజ్రధారచే
సమసినపాకవృత్రబలజంభపులోములకంటె నెక్కుడే.

36


గీ.

అనిన విని నారదుఁడు నీమహానుభావ, మే నెఱుంగుదు రిపుఁ డల్పుఁ డైన నధికుఁ
డైన నుండంగవలయు మహాప్రయత్న, మున నయజ్ఞానపరులకు ననిమిషేంద్ర.

37

ఉ.

కావున సప్రయత్నుఁడవు గమ్ము వినోదము చాలు రమ్ము వే
పావకుఁ డాదిగా దిగధిపాలకులం బిలువంగఁ బంపు సై
న్యావళి నేర్పరింపు మన నమ్మునివాక్యము లాదరించి లీ
లావనవాటి వెళ్ళె నవలన్ ధవళాక్షులు వెంటఁ గొల్వఁగన్.

38


క.

ఈరీతి వెడలి వజ్రి హ, జారంబున నిలిచి సరభసంబున నిఖిలా
శారమణులఁ బిలిపించిన, వారును వచ్చిరి చమూనివహములతోడన్.

39


ఉ.

వచ్చిన నానుపూర్వి మఘవంతుఁడు దుర్జయరాజురాక వా
క్రుచ్చి నరాధమున్ సమరకుంభినికిన్ బలియిత్త మంచుఁ గా
ర్చిచ్చును బోలె మండి వలచే భిదురంబు ధరించి సాహిణుల్
దెచ్చినకత్తళానిజవధిక్కృతగంధవహంబు నెక్కినన్.

40


క.

ఎక్కిరి నిజవాహములం, దక్కినదికృతులు వారుఁ దానును భేరీ
ఢక్కానకనిస్సాణహు, డుక్కులు ఘోషింపఁగాఁ గడు వడిఁ గదలెన్.

41


సీ.

లయసమారంభవలాహకస్తనితబాంధవములై కరిబృంహితములు నిగుడఁ
గరిబృంహితంబుల ఖండించి నిర్నిరోధంబులై హయహేషితములు నిగుడ
హయహేషితంబుల నదలించి ఘూర్ణితార్ణవములై రథనిస్వనములు నిగుడ
రథనిస్వనంబులఁ బ్రహసించి పరవీరభయదంబులై భటార్భటులు నిగుడ
శాతకరవాలధళధళచ్ఛవిసహస్ర, కరకరంబుల వారింప గములు గూడు
కొని పదాహతివిధ్వస్తకనకభూధ, రాగ్రవన్యము లమరసైన్యములు నడచె.

42


క.

ఆకలకలంబు విని ధర, ణీకాంతుఁడు కూర్మితమ్మునిం గని సేనా
నీకములం బురికొల్పి భు, జాకుశలతఁ జూపుమా దిశానాథులకున్.

43


గీ.

అన్న నన్నకు మ్రొక్కి మహాప్రసాద, మవనిపాలక ననుఁ జూడ నవధరింపు
మనుచు రథ మెక్కి నిజధనుర్జ్యారవంబు, మిన్ను ముట్టంగ సురసేనమీఁద నుఱికి.

44


స్రగ్ధర.

సుద్యుమ్నుం డాశ్రయాశార్చులు వెడలెడునక్షుల్ వెలుంగన్ మహేంద్రా
దిద్యోచారావలేపస్థితిఁ గనుఁగొని సంధించి మధ్యాహ్నవేళా
ఖద్యోతద్యోతవైభాకరమణిమయముల్ గాలసర్పోపముంబుల్
సద్యశ్శాణోపలాఘర్షణఖరశిఖరాస్త్రప్రతానంబు లేసెన్.

45


క.

ఆనారసములు రత్నవి, భానివహముతో జవప్రభవశాత్కార
ధ్వానముతో నొకటి పదా, ఱై నిగుడఁగఁ జొచ్చుటయు సురానీకినిలోన్.

46


సీ.

ఆయుధంబులు వేసి హంకారములు రోసి మ్రొక్కువారునుఁ బుట్ట లెక్కువారు
సాహసంబులు మాని సంత్రాసములు పూని పఱచువారును వ్రేళ్ళు గఱచువారు

ప్రాభవంబులు మాలి బాహుశక్తులు దూలి పాఱువారును విధి దూఱువారు
మానుషంబులు గ్రాఁగి మత్సరంబులు వేఁగి వెచ్చువారును మూఁక విచ్చువారు
నై మహీధరమథితదుగ్ధాబ్ధిఘుమఘు, మార్భటీసహచారి హాహా మహాని
నాదములు చేయ విని పావకాదిదిక్పతులకు, జంభాసురారాతి సెలవు పెట్టె.

47


చ.

నిలిచి కనుంగొనంగ ధరణీధవసోదరుపై దిశాధినా
థులు చతురంగసైన్యములతోడ మృగేంద్రునిపై మదావళం
బులు చనుదెంచుకైవడి గముల్ గములై చనుదెంచి నెత్తుటం
వెలిచిరి తీవ్రసాయకహతిన్ రథవాజిభటద్విపంబులన్.

48


ఉ.

అవ్వడిఁ జూచి దుర్జయనృపాగ్రణికూరిమితమ్ముఁ డద్దిరా
క్రొవ్విరి వేల్పుబిడ్డ లని ఘోరశరంబులపాలు చేసినం
గుప్పలుగా రణాగ్రమునఁ గూలె గజంబులు మ్రొగ్గె వాహముల్
ద్రెవ్వె సితాతపత్రములు ద్రెళ్లె రథంబులు వ్రాలెఁ గేతువుల్.

49


గీ.

ఇవ్విధంబున సైన్యంబు లెల్లఁ జెల్ల, విఱిగి దిక్పతు లపకీర్తి వెంటవెంటఁ
దగిలి వచ్చినచందానఁ దలలు వీడఁ, బాఱిరి బలారిగుండియ భగ్గు మనఁగ.

50


క.

పాఱఁగ సుద్యుమ్నుఁడు మది, నాఱనికోపంబుతోడ నదలిచి వీఁపుల్
దూఱఁగ వేసెన్ ఫణిపతి, కోఱలఁ గ్రొవ్వాడి సరకుగొననిశరంబుల్.

51


వ.

ఆసమయంబునఁ బునఃపునరాహ్వానంబునం గరభ్రమితపరిధానంబున వీరరసాధ్య
క్షుండు సహస్రాక్షుండు సుద్యుమ్నవిద్యున్నిభకార్ముకనిర్ముక్తశరవిదారణభయఫ
లాయమానులం బావకాదిదిగధీశానుల నిలిపి సమరంబునకు నూలుకొలిపి వెలివారు
వంబు డిగ్గి పవనజిత్వరత్వరానైపథ్యరథ్యంబును మాతలిసారథ్యంబును వశీకృత
నిశీధినీచరవిజయమనోరథంబును నైనరథం బెక్కి పెక్కుదెఱంగుల వాద్యంబులు
మొరయ రయంబున విబుధవరూధినీసనాథుండై కవిసి విశిఖంబులవాన గురిసిన
విరిసిన సైన్యంబులం జూచి యేచినకోపంబునఁ జాపంబున గొనయంబు సంధించి
కవదొనలు బంధించి తురగదట్టరింఖాఘరట్టఘట్టితపరశిరఃకపాలుండు దుర్జయనృపా
లుండు తబలడమామికాపణవడిండిమడిమడిమధ్వానంబు జలనిధానంబు గప్పం
దలంప నలవి గానివాహినీనివహంబులు మున్నాడి నడవ మెఱుంగు మెఱచినచం
దంబున నిజస్యందనంబు మెఱయ నఱిముఱిం దఱియ నుఱికి వెఱచఱవం గసవు
గఱవ నఱవం బఱవ సంక్రందనబలంబులఁ జిందఱవందఱ సేయ నమ్మేటివిలుకాని
బాణంబు లనుచిచ్చరపిడుగులు వడిం బడిన గండమండలగళద్దానధారానిర్ఝరంబుల
తోడ వదనసందీప్తసిందూరధాతురాగంబులతోడ సముత్తుంగకుంభకూటంబులతోడ

గంధగజనగంబులు వ్రక్కలు గాఁగ నక్కుమారకంఠీరవునారాచంబు లనుకుఠా
మరప్రసూనగుచ్ఛంబులతోడ హిరణ్మయఘంటికాఫలంబులతోడ నంఘ్రిమూలం
బులతోడ హయానోకహంబులు విటతాటనంబులు గాఁగ నవ్వీరవరుని శిలీముఖం
రంబులు కఠోరంబులై తాఁకినఁ గర్ణపల్లవంబులతోడ గాత్రవిడంబమానధవళచా
బు లనుజంఝానిలంబు విసరినం గూబరస్తంభంబులతోడ సితాతపత్రశిరోగృహం
బులతోడ రథికసారథిసాలభంజిలకతోడ నవరత్నప్రభావిచిత్రవర్ణంబులతోడ నుత్తా
లకేతనపటపల్లవపారావతంబులతోడ శతాంగసౌధంబులు భగ్నంబులు గాఁగ నవ్వా
రణాసివల్లభుభల్లంబు లనుసంవర్తమార్తాండబింబంబులు వేఁడి చూపినం గరవాల
మీనంబులతోడ వర్తులఖేటకమఠంబులతోడ భుజాభుజగంబులతోడ దుకూలడిండీర
ఖండంబులతోడ బిరుదమేచకచమరవాలశైవాలంబులతోడ సింహనాదకల్లోల
కోలాహలంబులతోడ భటసముద్రంబులు శుష్కీభూతంబులు గాఁగ విలోకించి
రౌద్రంబున మిగుల నుద్రేకించి సునాశీరుండు సుధాంధసులు సూరెలం గొలువ
సుప్రతీకసూనుం దాఁకి సునిశితాస్త్రంబుల స్రుక్కించిన నతండు నడుము ద్రొ
క్కినమహానాగంబులాగునఁ గ్రోధనిశ్వాసఫూత్కారంబులు నిగుడ విషదిగ్ధమా
రణదంష్ట్రాంకురంబుల నొప్పింప మూర్ఛిల్లుటయు నుల్లంబులు దల్లడిల్ల వైమానికసైని
కులు పెల్లగిలినం గనుంగొని దిశానాయకుల: రోదసీకటాహంబు మిగుల నార్చి
యెదిర్చిన.

52


గీ.

నృపతి వేయేసిబాణంబు లేసె నేయ, గాయముల నాదిగీశులు గానఁబడిరి
తోడివారలు గాన నింద్రుండువలెనె, తారు వేయేసికన్నులు దాల్చి రనగ.

53


క.

ఆవేళ మూర్ఛ దేఱి శ, చీవనితావిభుఁడు రాజసింహముపై నై
రావణకరి నెక్కి ధరి, త్రీవలయము సంచలింప దీకొలుపుటయున్.

54


క.

బలువిడి నది ఘీంకారం, బులు సేయుచు వచ్చి కవియ భూపతి తాటా
కులచప్పుళ్ళకు దయ్యం, బులు వెఱచునె వత్తుగాక పొలియఁగ ననుచున్.

55


గీ.

కరటిపై నేసె నొకవాఁడిశరముఁ గ్రౌంచ, నగముపై నేయునాఁటిసేనానివోలె
దాన నొచ్చియు నిలువ హస్తమున నమ్మ, హాగజేంద్రంబుకుంభంబు లప్పళించి.

56


సీ.

సింగిణివిల్లు శచీనాథుఁ డెత్తినఁ దునిమె భల్లంబున దుర్జయుండు
జిష్ణుండు శక్తి వైచినఁ గృపాణమున సుద్యుమాగ్రజన్ముండు దుమురు చేసె
కుంతంబు సురరాజు గొన్నఁ జక్రమున విభాళించె విద్యుత్ప్రభాసుతుండు
నముచిమర్దనుఁడు శూలము ప్రయోగించినఁ జదిపె ముద్గరమున సౌప్రతీకి
పవికి నింద్రుండు చేసాచునవసరమునఁ, గాశికాభర్త హస్తలాఘవము మెఱయ
నతనిఫాలానఁ గ్రుచ్చె భాగ్యాక్షరములు, తుడువు మనిపంచెనన వాఁడితోమరంబు.

57

ఉ.

ఈపగిదిన్ మహేంద్రుఁడు మహీతలనాథునితోమరంబుచే
నేపరి నిల్వ లేక పడియెన్ మదనాగముమీఁదనుండి తాఁ
దాపసరాజమౌళిఁ గని దండము వెట్టనినాఁటిపాపమున్
బాపఁగ నద్రి యెక్కి భృగుపాతము చేసినభంగి దోఁపఁగన్.

58


సీ.

దర్పంబు మాని యథాయథలైరి నిలింపులు సిద్ధులు కింపురుషులు
లావు చాలించి చెల్లాచెదరైరి సారణులు గుహ్యకులు తురంగముఖులు
గర్వంబు విడిచి కకాపిక లైరి మరుత్తులు విద్యాధరులు దనుజులు
బంటుతనము డించి పంచము పాడైరి గరుడులు యక్షులు గగనచరులు
గౌరవము దక్కి పంచబంగాళమైరి, సాధ్యగంధర్వతుషితభాస్వరపిశాచ
విశ్వవసుకిన్నరాదికవివిధదేవ, యోను లత్యంతభయకంపమాను లగుచు.

59


క.

అప్పుడు గోత్రవిఘాతి క, కుప్పతియుతుఁడై ధరిత్రిఁ గూలి వసించెన్
ముప్పిరిగొనియెడివగ సడి, చప్పుడు గాకుండఁ బ్రాగ్దిశాకోణమునన్.

60


క.

ధరణీకాంచనధరణీ, ధరము విడిచి యింద్రుఁ డున్నఁ దత్ప్రాగ్దేశా
న్తరమున మీఁదటివిస్మయ, కర మైనచరిత్ర మొకటి కాఁ గలదు సుమీ.

61


చ.

అట రణరంగనర్తితహయీనటి దుర్జయభూమిపాలధూ
ర్జటి యెఱమన్ను పూసినహిరణ్యపుబూదియ దెచ్చి వన్నె దా
ల్చుటకు నిజప్రతాపశిఖిలోపల వైచినరీతిఁ గ్రొత్తనె
త్తుట నిబిడంబుగాఁ గలయఁ దోఁగిన మేరువు డిగ్గి శాంతుఁడై.

62


క.

అరిగె దరీముఖరితకి, న్న రీవిపంచీవినోదనమునకు శిఖరాం
తరపరివృతచందనతరు, మరుదోదనమునకు గంధమాదనమునకున్.

63


వ.

అరిగి తద్గంధమాదనకటకంబునం దనకటకంబు విడియించి వినోదార్థంబుగా
నహరహంబును హితసహితుండై మిహిరకరనివహదురవగాహంబు లైన సహకార
మహీరుహంబులవాడలనీడలఁ గ్రీడల సలుపుచు సామిసంపుల్లమల్లీవల్లీమతల్లికాకు
డుంగంబులప్రోవుఠావులం దావులు గ్రోలుచు సముత్తుంగశృంగశృంగాటకనటన్మ
యూరంబులకోపులతీపులం జూపులు నిలుపుచు విశంకటశిలాపట్టఘటనజర్ఝరనిర్ఝరీ
కణధురంధరమంధరగంధవాహంబులపొలయికల నలయికలు దీర్చుచుం గొన్ని
వాసరంబులు నిలువ నొక్కనాఁడు తాపసవేషధారు లైనపెద్ద లిద్దఱు వచ్చి
నచ్చినభృత్యామాత్యులు దొరలు దండనాథులుం గొలువ నలువచెలువు గెలువం
జాలుకవ శేఖరులవాక్యస్తబకంబులవలె విలువలేనిరత్నంబులు దాపించిన కాంచన
సింహాసనాసీనుండై పటమంటపంబులో నున్నమరున్నాయకదుర్జయు దుర్జయుం
గని యిట్లనిరి.

64

సీ.

తనదుర్గమునకు నక్తందివంబును సితభానుభాస్వంతులు ప్రహరి దిరుగ
రక్షోభయంకరైరావణమదగంధనాగంబు దనసాహిణమున నుండఁ
దనశాసనమును హుతాశనాఖిలదిశానాథులు మకుటకోణములఁ దాల్పఁ
గులధరాధరపక్షములు విభాళించినదంభోళి తనకటితాప గాఁగ
వాలి ముల్లోకముల నేలు వాసవుండు, నీతురంగమధాటికి నిలువ లేక
పాఱి తిన్నూళ్ళతిప్పలు పట్టినాఁడు, శూరుఁడవు నీవ దుర్జయక్షోణిపాల.

65


మ.

అనినన్ మానవలోకభర్త భవదాఖ్యల్ చెప్పుఁడా యేమి గో
రి ననుం గానఁగ నేగుదెంచితిరి సంప్రీతాత్ములం జేసి పు
త్తు నటన్నన్ విని వార లి ట్లనిరి విద్యుత్తున్ సువిద్యుత్తు నా
ననుభూతాఖ్యుల మైనదైత్యులము బాహాగర్వదుర్వారకా.

66


శా.

ఆకర్ణింపుము మత్సమాగమనకార్యం బష్టదిక్పాలకీ
లోకంబున్ విదళించి వచ్చితివి గళ్ళుం బాళ్ళు చిక్కంగ నా
లోకంబుల్ మనుపోలె నుండ మది నాలోకించి మా కీ వృధా
పోకార్పం బనిలేదు నావుడు దృగంభోజంబుల న్నవ్వుచున్.

67


క.

సచివుల నాలోకించిన, నుచితం బీకార్య మనుడు నుర్వీపతి రా
త్రిచరులకు నిచ్చె నాక, ల్పచామరాందోళికాతపత్రకళాచుల్.

68


వ.

ఇవ్విధంబున మన్నించి విద్యుత్సువిద్యుత్తుల నిరీక్షించి యేను దిక్పాలకలోకంబులు
నిర్వక్రపరాక్రమంబున నాక్రమించువేళ మదీయకులగురుండు దుర్వాసోముని
వరుండు సకలజగత్సేవ్యమానుం డైనయీశానుదివ్యాంశంబున జన్మించినకారణం
బున నట్టియీశానుం డున్నలోకంబునకు మనంబున నుపద్రవంబు సేయం దలం
చుట మహాద్రోహం బని మానితి మీరు మఱచి తప్పియును నప్పరమాత్మునిలో
కంబుదిక్కు పోవక సంక్రందనసప్తజిహ్వసమవర్తిసంతమసవతిచరసలిలాధిపతి
సమీరసంపత్పతిలోకంబు లేలుకొండని పట్టదోరణచీట్లు వెట్టించి వీడ్కొలిపిన
నాపూర్వగీర్వాణసార్వభౌములు సేనాసమన్వితులై చని తమకు నమరావతీపురం
బు రాజధానిగా వసించి దుర్వారగర్వంబున విహరింపుచు నర్చిష్మతీపురంబు పా
లింప విషజిహ్వుం డనునక్తంచరుం బంపి సంయమనీపురంబు శాసింప నుద్దండుం
డనుదనుజాగ్రణిం బంపి కృష్ణాంగనాపురంబు నిర్వహింప ఖడ్గహస్తుం డనుదానవ
పతిం బంపి విమలావతీపురంబు సవదరింపఁ గబంధుం డనుదైతేయనాయకుం బంపి
గంధవతీపురంబు రక్షింప వేగవంతుం డనురాక్షసాధ్యక్షుం బంపి నవనిధానధా
మంబు గావున నలకాపురం బురువు గావింప మిగుల నాప్తుం డైనదీప్తాలకుం డను

నసురవల్లభుం బంపి నిజస్వామివాక్యంబు దలంచి యీశానుండు శాశ్వతైశ్వర్యం
బున నేలుయశోవతీపురంబునకు దూరంబున నమస్కారంబు చేసి దివిజరాజ్య
భోగంబు లనుభవించుచు సుఖంబున నుండిరి తరువాత వారివలన మహాద్భుత
చరిత్రంబు సంభవింపం గలదు విశ్వంభరా యిటు దుర్జయుండు జయపటహఢా
న్నినాదంబు మదవదహితహృదయవ్యధావిధానంబు సంధింప గంధమాదనంబు
డిగ్గి మందరకూటంబున విడిసె నంత వసంతసమయసమారంభణంబులు విజృం
భించిన.

69


మ.

అవతంసీకృతశాతమన్యవజయుండై దుర్జయక్ష్మావధూ
ధవుఁ డర్పించినధూర్తకీర్తిసుషమాధావళ్యము ల్ముట్టుకొ
న్న విహారంబులు చూపఁగా వెఱచి లీనా లైనచందంబునన్
లవలేశంబును లేక పోయె మహి యెల్లన్ మంచుసంచారముల్.

70


గీ.

గహనలక్ష్ములు తమపూర్వకనకభూష ణములు దిగఁద్రావి మధుమాసరమణుఁ డిచ్చు
మణులసొమ్ములు దాల్చినమాడ్కిఁ బొడమెఁ బండుటాకులు డుల్లినఁ బల్లవములు.

71


క.

తలిరాకుమోవులు గదల, నలికలరవకైతవమున నాలాపము సే
యులతారమణులపలువరు, సలువలె మొనసెం జిగుళ్ళసందున మొగ్గల్.

72


క.

సుమవికసనమున లతికా, రమణులు మెఱసిరి గళ న్మరందం బనుతై
లమునఁ బరాగం బనుకుం, కుమఁ దోఁగి సమర్తపెండ్లికూఁతులమాడ్కిన్.

73


క.

తనపగతుకంఠమును బో, లె నటంచు రతీశ్వరుం డలిగి కత్తులబో
నునఁ బెట్టిన మూల్గెడివిధ, మునఁ బికము ప్రవాళమధ్యమున నెలుఁగించెన్.

74


సీ.

విరహచింతాగ్ని యివ్విధిఁ గెరల్పుదు నన్నపగిదిఁ బద్మపరాగ మెగయఁ గొట్టి
కామునిపడవాలు గానఁ బౌజులు సేయుగతి మధుపంబులఁ గదలఁ దోలి
తీవెలేమలచేత నీవిధిఁ గలయంపి చెల్లించుక్రియఁ దేనె సడల సుడిసి
తనపగ సాధింపఁ గని మెచ్చి బుజ్జగించినరీతి శఖులపించెములు నిమిరి
తెరువు నడిచిన దాహంబు దీఱ గిరిఝ, రాంబువులు గ్రోలుకరణి రతాంతతాంత
వనితలకుచాగ్రముల ఘర్మవారిపూర, మడఁగ విహరింపఁ దొడఁగె మందానిలంబు.

75


వ.

ఇత్తెఱంగున సకలజగజ్జనానురంజనకరపరిమళపరంపరాసంపత్సమాసం బైనవసంత
మాసంబున రాజకీరమాలికలు పచ్చతోరణంబులుగా నిరంతరపరాగపటలంబులు
మేలుకట్టులుగా మల్లికాముఖవల్లీమతల్లికలు రాల్చినవిరులు ముత్యాలముగ్గులుగా
సరసకిసలయకుసుమఫలభరితంబు లైనగుజ్జుమామిళ్ళు బూజగుండలుగా మరకత
మణిమయూఖములడాలు విడంబింపంజాలుమరువంపుమళ్ళు జాజాలపాలికలుగా

విహరమాణమధులిహంబులు హోమధూమంబుగా ధగద్ధగితకళికలం గలసంపెంగలు
నివాళిపళ్ళెరంబులుగా మత్తకోకిలకాకలీకలకుహూకారకలకలంబులు పాటలుగా
భవిష్యద్వైవాహమంటపంబుచందంబున మందరకుధరశిఖరస్థానంబున నున్న కిన్న
రోద్యానంబునకు హేతిప్రహేతిపుత్రికలు సుకేశియు మిత్రకేశియు సహస్రకన్య
కాపరివృతలై చనుదెంచి తద్వనాంతరంబున.

76


గీ.

లతలలోపల జంగమలతలు వోలెఁ, దాము లీలావతులు వినోదంబు సలుపఁ
ప్రాణసఖి యైనకదళిక పలికె నిరవ, కాశలావణ్యరాశి సుకేశి దాసి.

77


చ.

ముకుళము లందెడిం దిలకమున్ వకుళంబును గోఁగు పొన్న చం
పకమును వావిలిం గొరవి మామిడి వంజుళమున్ బ్రియాళువున్
సకి కను మాసవం బుమియు నవ్వు వచింపు ముఖాబ్ద మెత్తు క్ర
మ్ముకొనఁగ నూర్చు చన్నుఁగవ మోపు కరం బిడు తన్ను పాడుమా.

78


క.

అని నున్ననితిన్ననిచ, ల్లనిమాటలఁ గదలికావిలాసిని పలుకన్
విని దశదోహదకేళీ, వినోదముల సంచరించు వేడుకతోడన్.

79


సీ.

పద్మిని విశ్వసింపఁగఁ బూచె వావిలి కమలాక్షి గనఁ దిలకంబు పూచె
నవపల్లవాంఘ్రి దన్నఁగఁ బూచెఁ గంకేళి కలకంఠి పాడఁ బ్రేంకణము పూచె
సంపెంగ పూచె రాజనిభాస్య మొగ మెత్త మంజులకర ముట్ట మావి పూచె
మధురభాషిణి వచింపఁగఁ బూచె సురపొన్న కుందరదన నవ్వ గోఁగు పూచె
ప్రమద గంధోత్తమాసవం బుమియఁ బూచెఁ, బొగడ కరికుంభనిభకుచ బిగియఁగౌఁగి
లింపఁ బూచెఁ గురువకంబు లేమ లెల్ల, నపుడు పుష్పాపచయము చేయంగఁ దివిరి.

80


క.

చేరువ నున్నవి చూడు వ, ధూరత్నమ కమ్మదేనె దొరుఁగఁగ సుమనో
నారాచునితుహినపయో, ధారాగృహములగతి లతాకుంజంబుల్.

81


క.

వనితా మదనరథాంగం, బు నేమిచందంబు దాల్చెఁ బుష్పస్తబకం
బునఁ జుట్టు దిరిగి రా వ్రా, లినమత్తమధువ్రతావళిం గనుఁగొనుమా.

82


క.

మదిరాక్షి వీక్షింపు మ, రుదాచలితవల్లివల్లరుల మెలఁగెడుష
ట్పదమాలిక నటిచన్నులఁ, గదలెడునీలాలసరులకైవడి నుండెన్.

83


క.

సకియా చివురున సుమనో, మకరందము వడిసెఁ జూడుమా విరహుల ద
ర్పకుఁడు నఱక శాతకృపా, ణికఁ జొటఁజొటఁ గాఱుక్రొత్తనెత్తురుభంగిన్.

84


క.

స్మరపునరుద్భూతికిఁ బం, దిరిగుండము చొచ్చి మ్రొక్కు దీర్చినకరణిం
తరుణీ యాయెలమావిచి, గురుజొంపముఁ జొచ్చి వెడలెఁ గోయిల గంటే.

85

క.

 ప్రకుపితహరనిటలతటాం, బకహుతవహదగ్ధచిత్తభవభస్మముపో
లిక నుండెం గను సతి చం, పకధూళీనిహతిపతితమధుకరవితతిన్.

86


క.

కుటిలాలక చూడుము వి, స్ఫుటమంజరి డాసె భృంగములచాలు నిశా
విటబింబముఁ బట్ట హుటా, హుటి వచ్చువిధుంతుదునకు నుపమానం బై.

87


క.

కొలఁది యెఱుంగక తిని కో, కిలకామిని వెడలఁ గ్రాసెఁ గిసలయఖండం
బులు విరహిజనులపై ని, ప్పులు గ్రక్కెడు ననఁగఁ జూడు పుష్పసుగంధీ.

88


క.

లలనా విచ్చినపూఁబా, ళల నాలేఁబోఁకమోక లక్ష్మీసుతుసే
నలలోపలిజ ల్లెడక, త్తులకొంతము విలసనమునఁ దోఁచెం గనుమా.

89


క.

కలయఁగ వ్రాలినచిలుకలు, గలపూచినచంపకంబుఁ గనుము చెలీ ప
చ్చలుఁ గెంపులు దాపించిన, వలరాయనిపసిఁడిమేడవడువున నొప్పెన్.

90


మ.

సుమనశ్చాపునిరాణివాసమునకున్ సొమ్ముల్ వినిర్మించుయ
త్నమునన్ విచ్చినమెట్టదమ్మికమటానం గేసరాంగారమ
ధ్యమునన్ వైచినకర్ణి కాకనకముం దన్వీ రజఃకీలపుం
జము నర్తింపఁ గరంగెడుం గనుము గూజద్భృంగనాడింధమున్.

91


రగడ.

మందగమన చొరకు చొరకు మావి మావిమోక లెల్ల
నిందువదన మనసు విఱిగె నీడ నీడ నిలువ నొల్ల
లేమ జాదిపువ్వుమొగ్గ లేదులే దురాశ గాని
చామ వృక్షవాటిఁ దిరుగఁ జాలఁ జాల సొలపు పూని
రామ మమ్ము లూటిసేయ రాకు రాకుమారి ననుచు
హేమవర్ణ విరులు నాకు నీవు నీవు దాఁచికొనుచు
కొమ్మ యిది నిజంబు పలుకఁ గొంచెఁ గొంచె పఱచి ప్రేమ
తమ్మికంటి చంపకంబు దా సదా సగంధసీమ
అతివ నారదములు గోయ నందు నందు వేగ పొమ్ము
సతి తదీయభాషణము పిసాళి పాళిఁ జెప్పఁ జుమ్ము
సూనగంధి వెదకు తావిఁ జొక్కఁ జొక్క మైనదిక్కు
మానవతి గయాళిపొత్తు మాను మానుషంబె దక్కు
పడఁతి వెనకకొమ్మ చించెఁ బట్టు పట్టునున్నచేల
మడఁతి పొగడ పొన్నతో సమానమా నగంగ నేల
యింతి వేగ తెలియ నేర వింత వింతయే మొఱంగు

కాంత ననలు వలపు గలవి గావు గావునం దొఱంగు
గోతి చిలుకపెంటి మగనిఁ గూడు గూడు చేరఁ జనకు
నాతి పుష్పములకుఁ గా వనాన నాన వెట్టుకొనకు
తనువలగ్న మీఁదఁ దేఁటిదాఁటు దాఁటుఁ జెట్టు వంప
వనిత యెట్లు వచ్చు వన్నె వాసి వాసినం జరింప
భామ తోడివారిఁ బిలువఁ బంచి పంచిపెట్టు తేనె
వామ కుముదదామకంబు వాడ వాడవైతి వౌనె
కన్నెచంటి ముంట గీరఁ గన్నఁ గన్నతల్లి దిట్టు
నన్ను సకియ నిట్టు లేటి కంటి కంటి కెఱ్ఱ పుట్టు
కోమలాంగి పాటలములు గూర్చు గూర్చుబోఁటి జోక
కామినీలలామ బంతి గట్టు గట్టు వాపు గాఁగ
తెఱవ యెచటనుండి పాలు తెంచి తెంచితే సరాలు
మెఱుఁగుబోడి చెక్కుచెమట మీటు మీటు మిగులఁ జాలు
చెలువ కేతకములు తావి చేరు చేరువలకుఁ బొమ్ము
లలన జోటి మనమతుల్ గలంచ లంచ మందె నమ్ము
పొలఁతి ప్రేంకణంబు చూడఁ బుచ్చఁ బుచ్చడిక మసలు
నెలఁత చైత్రమాసమున జనించు నించువిలుతుపసలు.

92


ఉ.

అంచు మదాంధగంధగజయానలు పువ్వులు గోసి మూఁకలై
కాంచనశైలశృంగములఁ గల్పకవల్లుల దర్పణంబులం
గొంచెపుమంచు పట్టుగతి గుబ్బల మేనులఁ జెక్కులం గదం
బించుచు ఘర్మబిందువులు పిచ్చిల బంతులవాటు లాడఁగన్.

93


గీ.

రాచకూఁతులసకియలు రత్నవతియుఁ, గదళికయు వచ్చి వారించి కమలగర్భ
గేహినీహస్తమణివల్లకీనినాద, బాంధవము లైనమంజులభాషణముల.

94


సీ.

చెలులార పువ్వులు చిదిమినఁ బుష్పబాణాసనునకుఁ గీడు చేసినారు
తరుణులార చివుళ్ళు దడవినఁ గలకంఠదంపతులకు నఱ్ఱు దలఁచినారు
రాజాస్యలార మరందంబు ముట్టినఁ జంచరీకంబులఁ జంపినారు
రమణులార ఫలాలు రాల్చినఁ గీరపోతములప్రాణములకుఁ దప్పినారు
కోకకుచలార కొలనికి రాక యిచట, నొకతె నిలిచిన రాకుమారికలయాన
ద్రోచినా రని పలుక వధూటికాల, లామలు ధనాధిపారామసీమ వెడలి.

95

లయగ్రాహి.

నీలమణితూలికల డాలునకు మాఱుకొనఁజాలెడు మెఱుంగుల నరాళచికురంబుల్
ఫాలమున వ్రాల నిడువాలుమగమీలగమి డీలుపడఁ దోలెడుపిసాళికనుగ్రేవల్
సోల శరదంబుదమృణాళహిమవాలుకల నేలెడురుచి న్వలిపెచేలలు కుచాగ్రులం
దూలఁ జని మన్మథునికేలికరవాలమునఁ దోలినసుకేశిఁ గని మేలములతోడన్.

96


క.

చేరిరి కాసారము మద, కారిమధుపగానలహరికాసారము నీ
రేరుహవనీవినిస్రవ, ణారవమధుబిందుమాలికాసారంబున్.

97


వ.

ఇట్లు చేరి వారివిహారోపయోగ్యంబులుగా సరోవరలక్ష్మి దమకు నాయితంబు చేసి
పెట్టిన కుంకుమగంధంపుముద్దలచందంబున నున్నతీరస్థలపతితజంబీరచూతమాతు
లుంగఫలంబులం గనుంగొని మజ్జనావసానంబునఁ గర్ణికాసీన యైనసరోలక్ష్మి తడి
యాఱ విప్పినకేశపాశంబులలాగునఁ జెలంగు సారసోపరిపరిభ్రమద్భ్రమరంబులఁ
గనుంగొని సకలాంగంబుల సరోలక్ష్మి ధరించినవజ్రమణిమయభూషణంబులతళు
కులవిధంబున నెగరుతగరుమీలం గనుంగొని ప్రతికమలసౌధవీథివిహారఖేదంబునం
బ్రాదుర్భవించినఁ గొనగోళ్ళం దిగిచి సరోలక్ష్మి మాటుకుచకపోలఫాలస్వేదకణం
బులచాడ్పునం దూలురంగతరంగజలబిందుసందోహంబులం గనుంగొని సలిలాధి
దేవతలం గూడి సరోలక్ష్మి వేడుక నాడెడుకందుకంబులకైవడిఁ గ్రీడించుపునః
పునరుత్పతనపరాయణంబు లైనలకుముకులం గనుంగొనుచు సహోదరవాత్సల్యం
బున సరోలక్ష్మికిం బరిచర్య గావింప సంపూర్ణచంద్రుండు పంపిన కిరణమాలికల
కైవడిం గ్రాలురాజమరాళంబులం గనుంగొనుచు వినోదవాదనాంతరంబున సరో
లక్ష్మి నిలిపినదంతప్రవాళసమంచితవిపంచిపోలికం దిలకించుచంచుదష్టైకమృణాళ
కాండచక్రవాకదంపతులం గనుంగొని నీరాటకు వచ్చు మదవతీవతంసంబుల నర్చింప
సరోలక్ష్మి గంధాక్షతలు సంధించి కుదురుపఱచినపచ్చలహరివాణంబులరూపంబున
దీపించు మధూళిమిళితకుసుమధూళీపుంజకింజల్కరంజితపద్మినీపత్రంబులం గనుంగొని
తత్కాసారంబుసౌభాగ్యంబునకు మెచ్చి పాదకటకంబులు పుచ్చి ధమ్మిల్లబంధం
బులు బిగియ ముడిచి విచిత్రాంబరంబులు విడిచి జిలుఁగుపావడలు గట్టి పరస్పర
కరంబులు పట్టి సౌపానంబులు డిగ్గి మిథ్యాలసత్వంబునఁ జేతులమీఁద మ్రొగ్గి
చెఱకువిలుకానిబరిగోలలతెఱంగున మెఱసి నిర్మలాంబుపూరంబులు దఱిసి కంజ
కల్హారకైరవబిసకిసలయగ్రహణసమయంబునం గలహింప నొండొరులవలనం బుట్టు
హుంకారంబుల బెదరి కులాయంబులు విడిచి గగనంబున కెగయుహంసక్రేంకా
రంబులు రేఁగి వికస్వరతామరసాగ్రంబులఁ గించిదుడ్డీనంబు లైనచంచరీకంబుల

ఝంకారంబులు మణికంకణఝణఝణత్కారంబులు సందడింప నందంద చిల్లలం
జిలుకలం జల్లులాడుసమయంబున.

98


గీ.

ఒకతె పలువురు సతులపై నుమియ వారు, తత్తరుణిమీఁద హస్తయంత్రములఁ జిమ్మ
వారిధారలు మెఱసె నీహారకరుఁడు, జలజములు చొర వెడలెడుశరము లనఁగ.

99


చ.

తనసరినీలవేణులు సుధామధురోక్తుల మాక మాక యి
మ్మని పలుకంగ నీ ననుచు నందఱు చూడ మనోజరాజకాం
చనమణిదండచామరముచందము దాల్పఁ గరాంబుజంబునన్
బనివడి యెత్తి పట్టె నొకబాలవిలోల మృణాళజాలమున్.

100


గీ.

 మచ్చరంబున నిద్దఱుమానవతులు, పెడమరలి చల్లులాడంగ నడుమఁ గూడి
జడలు గనుపట్టెఁ గాంచనస్తంభకీలి, తాంగభవనీలడోలికాయంత్ర మనఁగ.

101


చ.

సకి నతిముగ్ధఁ దోడుకొని చన్నులబంటిజలంబు గల్గుచా
యకుఁ జని యీఁత నేరిపెద నంచుఁ దదీయవలగ్నసీమ నా
త్మకరము దూర్చె నొక్కమదమత్తగజేంద్రసమానయాన ద
ర్పకుఁడు లతాంతచాపమునఁ బల్లవబాణముఁ గూర్చుకైవడిన్.

102


గీ.

ఒక్కసతి వెలకిలి యీఁద నొ ప్పెఁ గురులు, వీఁగుఁజన్నులు వలరాచవేఁటకాఁడు
కోకములఁ బట్ట నొడ్డువాగురులు వాని, డాకొనఁగఁ బెట్టుదీముపిట్టలు ననంగ.

103


చ.

తమకముఁ గోతము న్మొనప దంతపుబుఱ్ఱటకొమ్ములోనికుం
కుమసలిలంబు నాఁగ నొకకోకిలభాషిణి పాండురారవిం
దము దనచేతఁ బట్టుకొని తన్మకరందము చల్లె బోఁటివ
క్త్రమున మృగాంకబింబమునఁ గాఱుసుధారసధారఁ బోలఁగన్.

104


గీ.

ఇవ్విధంబున హేతిప్రహేతిపుత్రి, కలు సఖులుఁ దారు జలకేళి సలిపి విగళ
దంబువేణులు వదనచంద్రామృతంబు లాని కక్కెడురాహువు లనఁగ వెడలి.

105


క.

దరి యెక్క వారినీడలు, సరసిం గనుపట్టెఁ గూడి సలిలక్రీడల్
జరపి తమపురికి నరుగం, దిరిగినపాధోధిపతిసతీతతిభంగిన్.

106


శా.

ఆకాలంబునఁ జిత్రశాటి నృపకన్యల్ మెచ్చి కప్పించిరో
యీకాసారజలంబుమీఁద ననఁగా హెచ్చెన్ సఖీలోకవీ
క్షాకౌతూహలకారులై కుచతటీకాశ్మీరమున్ గంఠసీ
మాకస్తూరియు ఫాలచందనము సీమంతాగ్రసిందూరమున్.

107


వ.

మఱియు ననుకూలప్రమదానేకపదర్పణంబు గాక వివేకింప ననుకూలప్రమదానేక
పదర్పణం బైనపద్మాకరంబు చూచి హృదయానందంబున మిన్ను మోచి మోపులు

గడగిన వలరాజువాలుచందంబున వాలువాలుంగంటిమొత్తంబు చతుర్విధశృంగార
కళాయత్తంబై తనచిత్తంబు రా మెలంగు సుకేశిమత్తకాశిని మిత్రకేశీసమేతంబుగా
నేతెంచి మలయపవనఝంపాసంపాతసకంపకుసుమసంపన్నచంపకపాదపంబునీడ
యని దాపునీలాలవేది శుకతురంగసాది నిలిపి తదీయసతి రతిం గీలుకొలిపి షోడ
శోపచారంబులు సలిపి మీవంటిదాంపత్యంబు మాకుం గలుగ వరంబు గృప
సేయుం డని మనోరథంబు దెలిపి మ్రొక్కి సంస్తుతించునవసరంబున.

108


సీ.

వలపులు గులుకుచెంగలువక్రొవ్విరులఱేకులు గాన రా సేసకొప్పు ముడిచి
మంచిపన్నీట మేదించిన సారంగనాభిపంకంబున నాభి దీర్చి
కుడివంకఁ గోణముకొంగు రింగులు వార నిండుచెంద్రికచేల దిండు గట్టి
కొమరువెన్నెల వెల్లికొలుపుకట్టాణిమౌక్తికములఁ గంఠమాలికలు వైచి
పసిఁడిసింగిణి ధరియించి రసికజనస, మేతుఁడై దుర్జయక్ష్మాతలేశ్వరుండు
వచ్చె నెదుటికి నారాజవదన గొలుచు, నించువిలుకాఁడు సాక్షాత్కరించె ననఁగ.

109


క.

ఈరీతి నైలబిలకాం, తారము చూడంగ వచ్చి తనముందట నా
కారంబు వహించినశృం, గారరసముపగిది నుండఁగాఁ గుతుకమునన్.

110


ఉ.

చూచె నృపాలునెమ్మొగము చూపు సరోజగతాళిసన్నిభం
బై చరియింపఁ జూచి హృదయంగమరూపవిభేదనార్థమై
చూచె నిజార్చితాంగజునిఁ జూపు మహీవిభు నేయ నిచ్చునా
రాచముకైవడి న్మెఱయ రాజకుమారిక ఘర్మవారి యై.

111


క.

జనపతియు నాసుకేశీ, వనితావదనంబు ఱెప్ప వాల్పక వీక్షిం
చెను రాకాచంద్రోదయ, మునఁ గలువలపగిది నయనములు వికసింపన్.

112


క.

వీక్షించి పలికె విద్యా, రక్షకుఁ డనుపేరఁ బరఁగుప్రాణసఖునితో
ద్రాక్షాఫలమధురాధర, లక్షణములు చూడ రా కళాతత్త్వనిధీ.

113


చ.

తనశర మైనచంపకముతావులఁ గూడినగాడ్పు రేణుమే
దిని దళధాళధళ్యరుచి తేనియనీరు పుటాంతరాంబరం
బును సవరించి యీచిగురుబోఁడి ననాంగవిధాత చేసెఁ బో
తనులత గందుఁ దక్కినవిధాత కరంబున నంటి చేసినన్.

114


సీ.

లపనంబు శశిమండలంబునఁ జేసి తచ్చిహ్నంబు కుంతలశ్రేణిఁ బెట్టి
మోవి పంకజరాగమునఁ జేసి తత్కఠినత్వంబు తుంగస్తనములఁ బెట్టి
దేహంబు విద్యుల్లతికఁ జేసి తచ్చలకంబు విలోచనాంతములఁ బెట్టి
కరరుహాంకురములు గలువఱేకులఁ జేసి తన్మార్దవంబు హస్తములఁ బెట్టి

గళము కంబునఁ జేసి తత్కాంతి మందహాసమునఁ బెట్టి తనుమధ్య మంబువాహ
మార్గమునఁ జేసి తత్కాళిమంబు రోమరాజిఁ బెట్టి సృజియించె నీరామ నజుఁడు.

115


క.

స్మరమాంత్రికుండు నిలుపం, గ రానిరోమాళిపన్నగము నిలుపుట దు
స్తర మని తలఁపక వ్రాసిన, బరులు సుమీ యీసరోజపత్రాక్షివళుల్.

116


గీ.

మేచకభుజంగనిభవేణిమీఁదఁ గడచి, వ్రేల నిబ్బాలపిఱుఁదు విరాలి గొలిపె
నన్ను యమునానదీవేణినడుమఁ బాఱఁ, గానఁబడియెడిపులినయుగ్మంబుకరణి.

117


గీ.

అంటుకొనక విలోకింప నాత్మఁ జల్లఁ, జేయునీకాంతతొడలతోఁ జెప్పఁ దగునె
తరము గా నంటుకొనుపాణిఁ దక్క నాత్మఁ, జల్లఁ జేయనికదళికాస్తంభములను.

118


క.

వికచాబ్జదళాగ్రంబుల, మకరందము కరుడు గట్టి మఱి జాఱనిపో
లిక నున్నవిరా సఖ యా, లికుచస్తనిమృదుపదాంగుళీనఖపంక్తుల్.

119


క.

అని పిదప నాసుకేశికి, ననుసంభవ యైనమోహనాకార వధూ
జనచింతామణి నాళీ, కనిభేక్షణ మిత్రకేశిఁ గనుఁగొని పలికెన్.

120


క.

ఈరాజకీరవాణికి, నీరాకాచంద్రవదన యే మౌనో వి
ద్యారక్షక వయసున సుకు, మారత రూపమునఁ గాంతి మార్పఁగ వచ్చున్.

121


గీ.

నద్వితీయంబుగా దీని నలువ చేయఁ, దలఁచి చేయుచుఁ దలఁచినతలఁపుకొలఁది
వచ్చునందాఁకఁ జేసినవారు మేన, కాదిసుతు లన్నుసౌందర్య మడుగ నేల.

122


క.

మధురమధురసాస్వాద, గ్రధితారుణ్యంబు లైనకనుఁగోనలతో
ఢ ధవునిమీఁద నొరగి నవ, సుధాంశుమణిసౌధవీథి సుఖపరవశయై.

123


గీ.

ఇందుబింబాస్య వీణ వాయించెనేని, మృగవిలోచన కిన్నర మీటెనేని
పల్లవాధర మెల్లన పాడెనేని, మూఁడుజగములు రాగాబ్ధి మునుఁగకున్నె.

124


సీ.

అని మహీపతి మన్మథాధీనుఁడై కుమారికులరూపములు వర్ణించువేళ
నైరావతీసమాహ్వయదూతి యేతెంచి కన్యకలార యిక్కాననమున
పోక ప్రొద్దునఁ జరింపుట నీతి యే పురంబునకుఁ బోదము రండు కినిసి మిమ్ముఁ
బిలువంగ నన్నుఁ బంపిరి కన్నతల్లులు నావుడు నమ్మాట నారసంబు
కరణి హృదయంబు నాటినఁ గళవళించి, పాపకర్మపుదైవ మీపాటిమేలుఁ
జూడఁజాలక నిస్తంద్రసుఖవిహార, మునకు విఘ్నంబు గావించె ననుచు వగచి.

125


గీ.

సర్వలోకైకసౌందర్యదూర్వహునకు, మముఁ బరాన్ముఖలను జేయ మగువ నీకుఁ
బాడి గా దని పలికినపగిది నంది, యలు గులుకరింపఁ గొంతద వ్వరిగి నిలిచి.

126


శా.

ఆరాజుం గనువేడ్క చిత్తముల నూటాడన్ విధం బేవిధం
బో రామా ననవింటివేలుపునకుం బుష్పాంజలుల్ సేయ మం

చైరావత్యలకుంతల న్మొఱఁగి జోడై చంపకక్ష్మాజముం
జేరం గ్రమ్మఱ నేగుదెంఛిరి సుకేశీమిత్రకేశీసతుల్.

127


క.

అది యెఱిఁగి బాలికల ని, ల్పుద మని పఱతెంచి నెచ్చెలులు రత్నవతీ
కదళికలు విన్నవించిరి, మృదులోక్తుల మరులుగొన్న మెలఁతలతోడన్.

128


మ.

నగరే చూచినవారు మీరు మదనోన్మాదంబునం బొందినన్
మగవారి న్మొగ మెత్తి చూడఁ గులకన్యాధర్మముల్ దప్పవే
తగవే పైకొనఁ గాక కూర్మి బలవంతం బైన నారాజు ధై
ర్యగుణోదాత్తునిఁ దెత్తు మబ్జముఖులారా యేల చింతింపఁగన్.

129


క.

అన మరలి చనిరి నమ్రా, ననలై నన లైదు నేర్పునను శరములఁ జే
సినవిలుకాఁడు గుఱించిన, తనువుల హేతిప్రహేతితనయలు సనయల్.

130


సీ.

ఇట దుర్జయతలేంద్రుండు కన్యకావీక్షణసంప్రాప్తవిరహవేద
నాయత్తుఁడై వేఁగఁ బ్రాణసఖుండు విద్యారక్షకుఁడు చూచి ధరణినాథ
యేను లతాంగులవృత్తాంత మెఱుఁగుదు విను మందరాచలంబునకు నికట
మున నున్నపాటలం బనుపురంబున వేలుపులకు నాతంకించి వలస వచ్చి
నిలిచి యెప్పుడు నీదురాకలకు నెదురు, చూచు హేతిప్రహేతులసుతలు మీఁది
పని ఘటించెద విచ్చేయు మనిన సంత, సిల్లి యక్షేశ్వరారామసీమ వెడలి.

131


వ.

నిజభుజప్రతాపంబునకు వెఱచి భానుమంతుం డనుసామంతుండు వినతాపత్య
పురస్సరంబుగాఁ బొడసూపి పగలు నాలుగుజాములుం బాదంబులు సేవించి సం
ధ్యాసమయంబునం గరకమలంబులు మోడ్చి పశ్చిమభూధరం బనునివాసంబు
నకుం బోవుచు రాత్రి గొలువంబెట్టినకిరణంబులకరణిఁ గరదీపికాసహస్రంబులు
వెలుంగ మకరాకరగర్భంబున నెవ్వనిబాధలకుం గాక చిరకాలంబు డాఁగె నట్టి
గోత్రభేదిం బట్టి మనికిపట్టు విడిచి పాఱం గొట్టుట విని భయంబు దక్కి
తన్ను భజింప వచ్చినమైనాకంబుచందంబున మెఱయునుభయపార్శ్వలంబమాన
చమరవాలం బైనభద్రశుండాలంబు నాయితంబు చేసి తెచ్చిన నెక్కి క్రిక్కిఱి
సినహేతిప్రహేతికన్యకాకుచకుంభంబు లిప్పగిది నప్పళింప నెప్పుడు దొరకునో
యనువిధంబునఁ దద్గజేంద్రకుంభంబు లప్పటప్పటికి నప్పళించుచు వాహినీవాహినీ
శ్వరప్రాచీనవేలంబునకు వేలంబునం జని యామకుంజరగ్రైవేయఘంటాఘణా
త్కారబధిరితాఖిలదిశాంతం బైనపటనిశాంతంబుబహిరంగణంబున నేనుఁగు డిగ్గి
పరివారంబు నిలిపి విద్యారక్షకుముంజేయి కరతలంబున నవలంబించి శయ్యాగృ
హంబు సొచ్చె నని వరాహదేవుండు చెప్పిన విపులాచపలాక్షి మీఁదటివృత్తాం
తం బానతి మ్మని విన్నవించిన.

132

మ.

తులువక్ష్మాపకులావతంసక సుధాంధోవాహినీభోగిరా
డ్కలశాబ్ధిప్రభకీ ర్తివైభవ భుజాకాక్షేయధారావిని
ర్దళితారాతివరూధినీధవ కృపారారజ్యమానేక్షణాం
చలధైర్యాచల సత్యభాషణహరిశ్చంద్రా నరేంద్రాగ్రణీ.

133


క.

దృఢవాచాపన్నగపరి, వృఢ జయసంభరణ రణధరిత్రీనిస్సా
ణఢిమఢిమనినాద ఝలిపి, సుఢాలగతిచతురహయరజోరుద్ధరవీ.

134


స్రగ్విణి.

స్వర్ధవప్రస్ఫురద్వైభవా కన్యకా
గీద్ధరిత్రీముఖాగ్రీయదానక్రియా
దూర్ధరాగర్వసంధుక్షమాణాసహ
న్మూర్ధరత్నప్రభాముగ్ధపాదద్వయా.

135

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబునఁ దృతీయాశ్వాసము.