వరవిక్రయము/దశమాంకము

వికీసోర్స్ నుండి

దశ మాంకము

(ప్రదేశము: రాజవీధి.)

(ప్రవేశము: పురుషోత్తమరావుగారు, బసవరాజు, భ్రమరాంబ, కమల.)

పురు : -

సీ. కొసరి కట్నములందు కొంటయే గౌరవ
        మని తలపోసెడి యజ్ఞులార!
    వచ్చి ముద్దుగఁ బిల్ల నిచ్చెద మనఁ గట్న
        ములకు బేరములాడు మూర్ఖులార!
    అబ్బాయి పెండ్లితో నప్పు పప్పులు తీర్చి
        నిలువ సేయఁగ జూచు నీచులార!
    ముడుపులు గొనితెచ్చి ముంగల నిడుదాఁక
        పల్లకి యెత్తని పశువులార!

    ఏమి యన్యాయమిది! పూర్వ మెన్నఁడేని
    వరుల నిటు విక్రయించిన వారు గలరె?
    పూజ్యతరమైన మన పుణ్యభూమియందుఁ
    గటకటా! నరమాంస విక్రయము తగునె!

బస :-

సీ. కట్నాలకై పుస్తకములు జేఁగొని, పాఠ
        శాలల కేగెడు చవటలార!
    పిలిచి కాళ్ళు కడిగి పిల్లనిచ్చినవారి
        కొంప లమ్మించెడి కుమతులార!
    అల్క పాన్పుల నెక్కి యవి యివి కావలె
        నని శివమాడెడి యధములార!
    ఎంత పెట్టినఁ దిని యెప్పటికప్పుడు

        నిష్ఠరోక్తులు పల్కు - నీచులార!

    కట్నమునుపేర నొక చిల్లి గవ్వ గొనిన
    భార్య కమ్ముడువోయిన బంటు లగుచు
    జన్మ దాస్యంబు సలుపుడు సలుపకున్న
    నత్తవారింటఁ గుక్కలై యవతరింత్రు.

భ్రమ :-

సీ. మగబిడ్డ పుట్టిన మఱునాఁడె మొదలు శు
        ల్కమువలె లెక్కించు రాకాసులార!
    మర్యాద కై చూడ మరల గట్నాలకై
        రేపవల్‌ వేధించు ఱేచులార!
    అయిదు ప్రొద్దుల రాణులై, చీటికిని మాటి
        కలిగి కూర్చుండు గయ్యాళులార!
    లాంఛనంబుల పేర లక్ష చెప్పుచు నిల్లు
        గుల్లసేయు దరిద్రగొట్టులార!

    ఆఁడుపుట్టువు పుట్టరే? ఆఁడువారి
    నిట్టు లవమానపఱచుట కించుకేని
    సిగ్గుపడకుండఁ దగునె ఛీ? ఛీ ధనంబె
    పావనంబుగఁ జూచుట పరువె మురువె.

కమల :-

సీ. వెల పుచ్చుకొని వచ్చు వెడఁగులచేఁ బుస్తె
          కట్టించు కొనియెడు కన్నెలార!
    కట్నాల మగలతోఁ గలసి పల్లకిలోనఁ
          గూరుచుండెడు పెండ్లి కూతులార!
    కోరిన వెల యిచ్చి కొని తెచ్చుకొన్న దా
          సానుసులకు దాస్యము సేయు సుదతులార!
    మీ వివాహములకై మీవారు ఋణముల
          పాలౌట గని యోర్చు పడఁతులార!

    ఎంచిచూడఁగ స్త్రీజాతి కింతకన్న

    గౌరవము లేమి యిల మఱి కలదె? చాలుఁ
    జాలు నిఁకనైన బౌరుష జ్ఞానములను
    గలిగి మెలఁగుడు సత్కీర్తిఁ గనుఁడు.

ఒక బ్రాహ్మణుఁడు :-(ప్రవేశించి) అయ్యా! కట్నపు సొమ్ముకంటె కాలకూట విషము మేలు. దానివల్ల నే నాకీ దరిద్రయోగము పట్టినది.

సీ. తగిన బేరము వచ్చుదాఁక నబ్బాయిని
       పాఠశాలకు తన్ని పంపినాను
    పోటీలపై వెల పొసఁగించి నాలుగు
       సంచుల వఱకు కక్కించినాను
    మాటిమాటికిని బోట్లాటకు సిద్ధమై
       లాంఛనాలని వేయి లాఁగినాను
    అద్దెల కీవచ్చునని యున్న సొమ్మెల్ల
       పెట్టి పెంకుటి యిల్లు కట్టినాను

    ఇల్లు కాలిపోయె నింటిది చనిపోయె
    పిల్లవాఁడు వెఱ్రి పీనుఁగాయె
    గోడ లొకనిఁ దగులుకొని లేచియే పోయె
    నాకు ముష్టిచెంబె లోకమాయె (నిష్క్రమించును.)

ఒక కమ్మ :-(ప్రవేశించి) అయ్యా! నా సొద కొంతాలకించండి.

సీ. వొడ్డికి వొడ్డీలు వొంతున పెంచేసి
         మంచి మాన్నాలు గడించినాను
    పది పుట్ల బూఁవితో పండంటి బిడ్డ నో
         యెదవ కుక్కల కొడుక్కిచ్చినాను
    అలక పానుపుకాడ అసలైన శంగలి
         బీ డాడి కడుపునఁ పెట్టినాను
    అన్ని తిన్న యెదవ అమ్మాయి నొదిలేసి
         యింకోర్తి పక్కలో యివిడినాఁడు

    నాకు కూడు లేదు నా బిడ్డ కిప్పుడు
    కూడు, గుడ్డ, కొంపకూడ లేవు
    అయినవెల్ల సేర్చి అల్లుడోళ్ళకు పెట్టు
    కమ్మ సచ్చినోళ్ళ కర్మఁమింతె. (నిష్క్రమించును.)

ఒక సెట్టి :- (ప్రవేశించి) నా కతగూడా సెపుతాను నవ్వకండేం.

సీ. పెసలలో, సోళ్లలో బెడ్డలు కలిపివేసి
         పెజల నెత్తులు గొట్టి పెంచినాను
    మేనల్లు డింట్లోను మిడుకుతుంటే పిల్ల
         నింకొక సిన్నోడి కిచ్చినాను
    గళ్లున పదివేలు పళ్ళెవులోఁ పోసి
         సకల మరేదలూ జరిపినాను
    గుంటూరు మేళవూ గూడూరి సుందరి
         పీకపాటా పిలిపించినాను

    అయిదు రోజులు జుట్టిప్పు కాడినాను
    తెలక రెండు దివాలాలు తీసినాను
    యెల్లి యిరసాలుమెంటు కోర్టెక్కినాను
    వచ్చి పెసరట్ల జంగిడి పట్టినాను. (నిష్క్రమించును.)

లింగ :- (చటాలున ప్రవేశించి) బావగారు! చివరకు, బందిని బొడిచి బంటనిపించుకొన్నారు! మీ ప్రబోధము వినుచుఁ, ప్రచ్ఛన్నముగా నేనును మీ వెనుకనే వచ్చుచున్నాను. ప్రజలలో మిమ్మును, మీ కొమార్తెను, మీ యల్లునిఁ బ్రశంసింపని వారును, నన్నును నా భాగ్యమును బరిహసింపని వారును లేరు.

సీ. కట్టక ముట్టక కడుపునకేనియుఁ
         గుడువక యొక కొంత కూర్చినాను!
    వడ్డికి వడ్డీలు వంతునఁ బొడిగించి

          పెనకువపైఁగొంత పెంచినాను!
    పద్దులు పత్రముల్‌ దిద్ది, దీపము లార్పి
          వంచించి కొంత గడించినాను!
    కాయమ్మీ కసరమ్మి కడుగమ్మి, వోట్లమ్మి
          చిల్లరగాఁ గొంత చేర్చినాను!

    అతిథి చుట్టము గురువును యాచకుండు!
    దేవుఁడను మాట లేక వర్తించినాను!
    కడకుఁగట్నంబునకు గడ్డి కఱచినాను!
    కలడె నావంటి ఖలుఁడు లోకంబునందు?

పురు :- బావగారు! గతజల సేతుబంధనమువల్లఁ గార్యమేమున్నది? ప్రస్తుతము తాము దయచేసిన పని ఏమో సెలవిండు!

లింగ :- ఇఁక నాకేమి పనియున్నది? అబ్బాయినిఁ, గోడలిని యింటికిఁ దోడుకొనిపోయి ఆస్తి అంతయు వారివశము చేసి హాయిగా మీతో హరినామ స్మరణ చేసికొనుచు, గూర్చుండవలెనని వచ్చినాను.

పురు :- ఈ మాటలు మీరు మనస్ఫూర్తిగా నన్నవేనా?

లింగ :- సందియమేమి? నా కోడలిని సమాధానపఱచి, నా కుమారుని మరల నా వానిఁగ జేసికొన్న రేపు వాడు నాకు గర్మ చేయుటకుగాని, వాడు చేసిన కర్మ నాకు ముట్టుటకుఁగాని యవకాశ మెక్కడిది? అప్పు డాలోచనములేక పాడు కట్నము కొఱ కన్నిపాట్లు పడినాను! ఆ పాపమును బరిహరించుకొనువరకున నా యంతరాత్మకు శాంతి కలుగదు!

పురు :- అట్లయిన మీ యిష్టానుసారమే యగుఁగాక! మన మందఱమును గలిసి యొకసారి మంగళాశాసనము కావించి పోవుదము.

సీ. ఆడుబిడ్డల వివాహములకై తండ్రులు
           పడుబాధ లెల్లను బాయుఁ గాక!
   లింగ :- కట్నాల కోసము గడ్డికఱచువారి
           కెల్ల నా పాట్లె ఘట్టిల్లుఁగాక
   బస :- పణములు గొనువారు భార్యల కేప్రొద్దు
           నూడిగంబులు సేయుచుంద్రుగాక
   కమ :- వెలమగల్‌ మెడలఁబుస్తెలు కట్టు దౌర్భాగ్య
           దశ కన్నియల కింకఁ దప్పుఁగాక!
   భ్రమ :- కట్నముల నందుకొంటయే గౌరవమను
           వెడఁగుదన మాడువారిని వీడుఁగాక!
   అందరు :- ఉర్వి నన్నిటఁ గాళింది కుద్ధియైన
           వెలదులే యెప్పుడును బ్రభవింత్రుగాక!


సంపూర్ణము


★ ★ ★