Jump to content

వదరుబోతు/సారస్వత స్వప్నము (1)

వికీసోర్స్ నుండి

సా ర స్వ త స్వ ప్న ము.

20

ఒక్కొకప్పుడు నే నేదే నొక విషయముం గూర్చి ధ్యాన నిమగ్నుఁడై యుండుట వాడుక.. అప్పుడు నాకీ బహిః ప్రపంచము పై జ్ఞానము తప్పి యుండును. నాయంత రాత్మ యెందెందో చరించు చున్నట్లును, ఏవేవో వింత వింత విషయ ములు నాకు గోచరించు చున్నట్లును, నా కపుడు. భావాను భవము గలుగును. కొన్ని వేళల నట్టి ధ్యానముద్రల యందలి యనుభవములచే సా- మాన్యముగ నిర్ణయింపరాని యనే కాంశముల నిదమిత్థమనీ నిర్ణయింపఁ గలుగుటయు నా యను భవము లోనిది.


కడచీన సరస్వతీ పూజా దినమున నాకిట్టి యనుభవ మొండు కలిగెను. తోడనే నా మిత్రు లకు దాని నెఱిఁగింప నుంకించితిఁగాని దేవరహస్య మని తోచి యించుక జంకితిని. నాపట్ల నిది కేవల స్వార్థ పరతయని నా మనసు నా చెవి నిల్లు గట్టు కొని పోరుచు వచ్చినందున నేఁటి కీ రహస్యము లోకోపకారార్థమై వెలువరింపఁ గల భాగ్యము నా కబ్బినది. చదువరులు క్షమింతురు గాక!.

నాఁటి సాయంతనమున నాగదిలో నే నొంటరిగఁ గూర్చుండి యుంటిని. ముందు బల్లపై సరస్వతీ చిత్ర పటముండెను. నేనా మూర్తిని తదేక ధ్యానమునఁ జూచుచుండు నంతఁ గొన్ని క్షణములలో నా కన్నులు మూతలు పడినవి. ఈ భౌతిక ప్రపంచము తెర మఱుగైనది. నూ- తన నాటక మొకటి యారంభమయ్యెను. ఒకటి వెనుక నొకటిగఁ గొన్ని చిత్ర విచిత్రములగు రంగము లగుపడి నేత్రపర్వము గావించినవి. వింత యేమన, ఆనాటకమునఁ బ్రేక్షకుఁడు మా- త్రము కాక నేనుగూడ నొక పాత్రముగాఁ బరిణ మించితిని. ఈ విచిత్ర నాటకమునకు నటీ సూత్ర ధారులు మాత్రము నాకగుపడిన వారు కారనుట. నా యభాగ్యంపు ఫలము. ఆహా! మందార కుసుమ వాసనలచే గుమాళించు కల్ప వృక్షముల పూఁ దోఁట యొక రంగము. రాజహంస విహారములచేఁ గనుల పండువు గావించు కనక కల్హార కదంబ పరిశోభితమగు మానస సరోవర పుణ్యతీర మొక గంగము. కర్ణపేయములగు మహర్షి సామ గానములకుఁ ప్రతిధ్వను లిచ్చు శారికా క్షీరరాజ ములచే శోభితమగు దివ్య వనభూమి మఱి యొక్క రంగము. వీని వర్ణనల కిపు డదనుకాదు. సర్వ మును దివ్యము, నమూల్యము, ననిర్వాచ్యము, నతి మనోహరమనుట చాలును.

కొన్ని క్షణములలో నేనెట్లో యొక మహార్ర్హభననంపు శాలలో నుంటిని కట్టెదుట- నా యదృష్టఫల మేమి చెప్ప -- శ్వేత పద్మాసన మున, కోటి చంద్రప్రభా భాసమానయు, నవరత్నమయ వీణాదండ పరిశోభిత పాణిపంకే రహయు, సనిర్వాచ్య దివ్య మంగళ విగ్రహయు నగు దేవి యొకర్తు దృష్టిగోచర మయ్యెను. ఒక ప్రక్కన వేద ఘోషలు సలుపుచుఁ దెగ బారెఁడు తెల్లని గడ్డముల నిమురుకొనుచున్న వయోవృద్ధులు వినిర్మల బహ్మ తేజో విరాజితులు కొందఱు దర్భాసనముల నాసీనులై యుండిరి. వేఱొకప్రక్కన సాహిత్య ప్రసంగములు గావిం- చుచు దేదీప్యమాన విగ్రహులును నభినవ తారుణ్య కళా భూషితులు నగు దివ్యమూర్తులు పొందఱు రత్నాసనముల నలంకరించి యుండిరి.

కంతుని సతిని దిసంతుగొట్టఁజాలు తరుణీ మణులు కొందఱు దేవి పురోభాగమున రాల్గర గించు గానకళతోడ నభినయించు చుండిరి. ఆవల కోట్లకొలఁదిగ నంజలిబద్ధు లై దివ్యపురుషులు. నిలిచి దేవికి నానావిధోపచారములు సలుపు చుండిరి. ఆ మహాభవన రాజపుఁ బ్రకాశము, ఆదివ్య వ్యక్తి యనుభావ విశేషము, ఆసభాసదులు తేజః పుంజము, ఆ దివ్యసుందరుల యమూల్యాలంకార - శోభ, అన్నియు నొకమారు నాకన్నుల మిఱు మిట్లు గొలుపుటంజేసి దిగ్భ్రాంతుఁడనై నిమీలిత నేత్రుఁడనైతిని. నా దేహము పులకితమై స్తబ్ధ మయ్యెను.

కొన్ని నిమేషములకుఁ గాని నాకుఁ గన్నులం దెరచు శక్తిరాలేదు. ఆలో నొక్కింత చింతించి నా యున్న రంగము సత్యలోక మనియు, నా దివ్య మంగళమూర్తి వాణి యనియు నిర్ధారించుకొనఁ జాలితిని. కన్నుల విచ్చితిఁగాని యానంద బాష్ప ప్రవాహ వేగమున నా కేమియు గానవచ్చినదికాదు. భాగ్యము పండెనని యా దేవివైపు చేదోయి జోడించి, సాష్టాంగ ప్రణామ మాచరించి, వినయ వినమితోత్తమాంగుఁడనై నిలుచునంతలో నిరవధి క కరుణారాశియగు నాదేవి మాతృ వాత్సల్యముట్టి పడ “వత్సా” యని కనుసైగచే ననుచేరఁబిలిచి దీవించెను. హరోత్ఫుల్ల లోచనుఁడనై యామాతృ మూర్తి యలంకారము సనిమేష దృష్టితోఁ 'గనుం గొనుచు నట్లేనిలిచి నిర్విణ్ణుఁడ నైతిని. నాటి

దృశ్యము నేఁటికిని నాకనులఁ గట్టినట్లున్నది.

      మానిషాద ప్రతిష్ఠాంత్వ
           మగమశ్శాశ్వతీ స్సమాః
     యత్క్రౌంచ మిధునాదేక
          మవధీః కామమోహితం
          

అను శ్రీమద్రామాయణ కావ్య మూల శ్లోకము వాగ్దేవి నెన్నుదుట కస్తూరి తిలకముగఁ బ్రకాశించుటఁ జూచి యబ్బుర పడితిని. భాగవత సూక్తి ముత్యాల ముంగరగ గన్పట్టెను. మృచ్ఛ కటికా నాగానందములు తాటంకయుగమై తళతళ మెరయుచుండె. భాస నాటకములు కర్ణ పూరములుగఁ గానవచ్చినవి. అభిజ్ఞాన శాకుంత- లము నాయకమణిగాఁ గాళిదాస కావ్యత్రయము వాగ్దేవికి గంఠాభరణముగ నొప్పుచుండినది. ఉత్తరరామచరిత్ర ముద్దుల ముక్తాహారముగఁ జూపట్టెను. రత్నావళి రత్నావళియే కిరాతార్జు నీయము కేయూరభావము వహించినది. భారత రామాయణ చంపూలు ముత్యాల మురుగులు గను, శిశుపాలవధ నైషధకావ్యములు మణి కంకణములుగను విరాజిల్లు చుండెను.హంస సందేశము ముద్దుటుంగర మయ్యెను. దశకుమార చరితము తళుకుకంచుకముగను, కాదంబరి కన కాంబరముగను దేవిని సేవించుచుండినవి. వాసవ దత్త బంగరు 'మొలనూలుగఁ గనుపట్టెను.

అమృతధారలొలుకు కనకకల్హారమై గీత- గోవిందము దేవికరము నలంకరించెను. అనర్ఘ రాఘవము మణి మంజీరత్వమును ధరించియుండె. ఆ దేవి పాదసీమ నలంకరించియున్న భూషణములు కోటికి మించియుండినవి. వానిని బేర్కొన శేషాహికైనను దరముకాదన్నచో నాయట్టివాని మాటయేమి? ఇవికాక లక్షలకొలఁదిగ సొమ్ము- లను బంగరు పళ్ళెరములలో నిడుకొని మాత కర్పింపఁగోరి యనేకులు కాచియుండిరి. కాని దేవి వారికడ కటాక్షించినది కాదని వారివిషణ్న వదనములే చాటుచుండెను. ఈ వింతలన్నియుఁ జూచిచూచి నే నెంత యుప్పొంగితినో, ఇప్పుడు వ్రాయజాల.

దేవికిఁ జేరువనున్న యా వృద్ధులు నాతరు - ణులు నెవరోయని యెఱుంగఁగోరి వారికడ తేరి పారజూచుసంతలో నా భావ మూహించిన వాగ్దేవి కటాక్షమందలి యాజ్ఞ నౌదలఁబూని యొక దివ్య పురుషుఁడువచ్చి యాసభాస్తారుల పరిచయము నొక్కింత నాకొసంగి సను ధన్యుని గావించెను. ఆ వృద్ధులు వశిష్ఠ విశ్వామిత్రాది బహ్మర్షులనిఁ యెఱింగి వారి కంజలి యొనర్చితిని. దేవిని బరిచర్య సలుపుచున్నవారు దిక్పాలురనియు, గానము సేయుచున్న వారు రంభాద్యప్సరస లనియు విని యానందించితిని. రెండవప్రక్క నున్న దివ్యతరుణ మూర్తులు మహాకవులని యాపురుషుఁ- డు నా కెరిఁగించెను. వారిలో దేవికన్న నున్న తా సనమున నాసీనుండై యున్న మహనీయుడు వల్మీక భవుఁడఁట! అతని నాశ్రయించియున్న వ్యక్తి పారాశర్యుఁడు. కాళిదాస కవితిలకుఁడు దేవికి సమీపమున సమానాసనము నధిష్టించి యుండె. దాపునఁ గూర్చుండి యతనిని సాసూయముగఁ జూచుచున్నవాఁడు భవభూతి. వారికిఁ దరువాత భాస, శూద్రక, శ్రీహర్ష, మాఘ, బాణ, దండి, భారవి, సుబంధు, భోజ, జయదేవ, మురారి విము ఖులగు మహాకవులు యధార్హముగ పీఠముల నలం కరించి యుండిరి.

ఇట్టి మహాను భావులు నిందఱ నొక్క మాఱుగ దర్శించుభాగ్యము సేకూరుట కెంతో సంతసించితిని, గాని యంతలో నా హృదయమున నొక విషాదము జనించెను.. నా కంటఁ బడిన దంతయు గీర్వాణవాగ్జాలమే; గీర్వాణ కవిబ్బం దమే. ఆంధ్రకావ్య మొక్కటేని, ఆంధ్రకవి యొక్కఁడేని వాగ్దేవికడ కానరామి నాకెంతో తలఁగొట్టినట్లయ్యెను. మన దేశముపై, మనభా షపై; మన కవులపై, భాషాసతికి వాత్సల్యము లేదా? ఆమెకిది పక్షపాతమా, కాక మనకిది యభాగ్యమా? లేక, "దేశ భాషలందుఁ దెలుఁగు లెస్స” యని విఱ్రవీగుచున్న మన కిది గర్వశాంతియా? నాకనుల నానందభాష్పము లొక్క క్షణమున శోకాశ్రువులుగ మాఱెను.

అంతలో నా హృదయాంత రాళమునందలి యీభావము నెట్లు కనుగొనైనో కాని, వాగ్దేవి “వత్సా! రమ్మని ననుఁ జేరఁబిలిచి "ఆంధ్ర" భాష నాప్రీతికిఁ - బాత్రము కాదని నీవు శంకింపకుము. దేశభాషలలో నెల్ల నాయకమణియగు నా భాషయు తత్కవులును నాకు మిగులఁ గూర్చువారు. మరల నొకమారుచూడుము" అని యానతిచ్చి కరకలిత కల్హార మరంద ధారచే నాకనులఁ దుడిచెను.

కంఠగతమైన యుత్కంఠతో నేనును కనుల విచ్చి దేవిని చూచునంతలో, అయారే! ఏమి నా భాగ్యము! ఇంద్రజాలప్రభావమునంబలె సర్వము- ను మార్పుసెంది నాకపరిమితాశ్చర్య మొదవించె.

తరువాతి కథకై చదువరులు కొన్నాళ్ళు. వేచియుందురు గాక.