వదరుబోతు/ప్రపంచయంత్రము
ప్రపంచయంత్రము.
18
అనుదినమును మనము చిత్రవిచిత్రములగు యంత్రములను జూచుచున్నారము. ఏ యంత్రమెంత దృఢమైన నేమి, చాలకాల మొక్క తీరుగఁ బనిసేయదు. నడచి నడచి కీళ్ళరగిపోయి కొంతకాలములో నిరుపయోగములగుటచేఁ గ్రొత్త కీళు లమర్పవలసి యుండును.అనుక్షణమును తదంగ సంధులలో దుమ్ము ధూళి చేరుకతమునఁ గాలక్రమమున నవి చెడి త్రుప్పువట్టి యంత్రము తనపని తాఁ జేయనేరనిదగును. యజమానుఁ డదనెఱిఁగి తగిన పనివాని నియమించి యందలి మాలిన్యమును దొలగించి చెడిన కీళ్ళను బుచ్చి కందెన వేయింపక తామసించెనా, యంత్రము గొంతకాలమున నెందునకుం గొఱమాలినదగును.
"ఇరుసునఁ గందెన పెట్టక,
పరమేశ్వరు బండియైనఁ బారదు" కదా
మన ప్రపంచముగూడ నొక గొప్పయంత్రము. సృష్టికర్త యధీనమున నిరంతరమును విసుగు విరామము లేక పని సేయు యంత్ర రాజు మిది! కావుననే, దీనికి సయిత మపుడపుడు 'మరమ్మతు' కా కావలసియుండును. కాలక్రమమున సంఘమధ్యమున నీచులు గొందఱుచేరి ధర్మమునకు మార్గము సుక రముకాకుండ జేయుదుకు. ఆకారణమున సంఘ మర్యాదలన్నియుఁ గ్రమ క్రమముగ త్రుప్పు పట్టును. నీతిపధ్ధతులన్నియు బిగువులుసెడి కీళ్ళు తప్పును. అపుడీయంత్రము యజమానుని యుద్దే శమునకు భంగముగా నడువ నారంభింపఁ గలదు. అట్టి వేళలలోఁ దగిన యధికారి యొకఁడు వేంచేసి నలుసులఁ దొలగించి మరల బిగించి కందెన వేయ కున్నచో గతియేమి?
ఇట్టి యధికారు లపుడపుడు వచ్చుచుం మమా చరిత్రలలో దృష్టాంతములు పెక్కులు సూపవచ్చును. తొల్లి వైదికమతాచార విధులు మలినములై పరమార్థతత్త్వము జనులకందరాని పండయ్యె. అనర్థములకు ననార్యాచారములచే సంఘము క్షీణత నొంది మానవజాతి తుద కే న్యూనత నాపాదింపఁజాలిన దుర్ణయముల కలవాటుపడెను. దేవుని పేరునను, మతము పేరు నను మితిలేని జనహింసలు జరుపఁబడుచువచ్చె. దేవుఁడు లేకున్న నొక వేయి నమస్కారములు! అతనిపేరునఁ జేయబడు చుండిన దురాచారముల నాపుట యవశ్యకముగనున్న పని. మహాత్ముఁడు గౌతమ బుద్ధుఁ డుదయించి యాపని నెరవేర్చెను. భూతదయాగుణమును మరల నీ యార్యభూమిలో నుజ్జీవింపఁ జేసెను.
కొన్ని వందల యేండ్ల కాలములో మరల మన దేశమున కింకొక గొప్పకష్టము దాపరించెను. గౌతమ బుద్ధుని బోధనములలోని వాస్తవమును మరచిపోయి జనులు శుద్ధ నాస్తికులైరి. మత విషయమున నరాజకత్వ మేర్పడి శాఖలనేకములు బయలు వెడలెను. . ఈనాస్తిక వాదమున రుచి లేక యనాగరకు అనేకులు మరలఁ దమ మునుపటి మత పద్ధతుల శరణ మాశ్రయించుచువచ్చిరి. సంఘశక్తి పరిక్షీణత నొందుటయే ఫలమయ్యె. మతముపై వీరావేశమున నెంతపని కయినను జాలిన యన్య దేశీయులు గొంత కాలముననే యిచట నపార సేనతోఁ బ్రత్యక్షము 'కా నుండిరి.ఒక దేవుని నమ్ముకొని యొక మతమునం దభినివేశము గల్గిన జనసంఘ మాతరుణమున లేనిచో నేఁటి కీ దేశమున నార్య సంతతియే పేరు మాసి యుండును. కాననే శంకరాచార్యుఁ డుదయించి యాస్తిక మతమును బోధించి సమయమును కాపాడఁ గలిగెను.
కాని జ్ఞాన ప్రధానమయిన శంకరమతము సామాన్య జనులలోఁ జాల కాల మైకమత్యమును నెలకొల్పఁజాలినది కాదు. క్షణ క్షణమును శత్రు వుల దండయాత్రలచే హైందవ జాతీయతకే లోపము గలుగనున్న యాకాలమున సంఘీ భావము చాలనవసరముగఁ దోచెను. రామాను జూదులు మత సంస్కర్త లుద్భవించి సర్వ సులభ మగు వైష్ణవ మత ముపదేశించి మరల సంఘ శక్తిని నిలిపిరి . వీరి యుపదేశముల విలువను మహమ్మదీయ సామ్రాజ్యపు అంత్య దినములను వర్ణించిన చారిత్య్రకారులు బాగుగ నెఱుంగుదురు.
ఇట్టి మహనీయు లవతరించుట మత సం- స్కారమునకు మాత్రమేకాదు. తొల్లి గ్రీసు దేశపురాజులు చాల బలవంతులై యితర దేశముల నెల్ల నాక్రమింపఁ గోరిరి. అలెగ్జాండరు చక్రవర్తి యపార సేనతోడ నీదేశముం జొచ్చెను. అప్పటి కాలమున గ్రీసు దేశమునందలి జనులనీతి మిగులు శోచనీయ మగు నీచదశలో నుండినది. వారీ భరత భూమిని జయించి యిందు శాశ్వత సా- మ్రాజ్యమును నెలకొల్పి యుండిరా, వారి దుర్నీతి బీజము లిచట నాటుకొని నేఁటికి మ్రాకులై యూడలు వారి యుండును. ఆ యాపద నుండి మన దేశము నుద్ధరించుటకై చాణక్యుడును చంద్ర గుప్త చక్రవర్తియు జనింపవలసి యుండె. ఇఁక , ఔరంగజేబు కాలము నాటి మన దేశపుస్థితి యొకించుక స్మరింతము. మహత్తరమగు మతాభి మానము గల్గి యన్యమతాసహిష్ణులగు మహమ్మదీయులు. భారత దేశమున పాలక పదవి. నధిష్ఠించి యుండిరి. ఆర్య మతము లన్నియుఁ దమ సనాతన ధర్మములఁ దురుష్కుల పాలు గావించి పేరు పెంపులేకుండ నణగిపోవ సిద్ధముగ నుండినవి. దేవాలయము లన్నియు మసీదులుగ మాఱిపోన సాగెను. భారత మహిళల మానము లెల్ల బజారున విక్రయింపఁబడు చుండె . వేళ మీరక శూర శిరోరత్నము శివాజీ యవతరించి పొంగి పొరలి యార్భటించుచు వచ్చుచున్న మహ మ్మదీయ మతప్రవాహమునకు జెలియలి కట్టయై నిలువంబడి దేశమునుమతమును జాతీయతను సయి తము నిలువంబెట్ట గలిగెను.
మఱియు, ఆంధ్రభాషాయోషామణి యన దయై యున్నపుడు- ఆంధ్రు లాశ్రయ విహీనులై చెల్లా చెదరై యున్న పుడు - ఆంధ్రభూమి సరివారి కన్నులలోఁ జౌకగఁ బరిణమించు స్థితి దాపరించి నపుడు - జనించి, భాషతోడు జనులను దేశమును సముద్ధరించి మానము గాపాడి పేరు నిలువబెట్టిన యా మహామహుడు విజయనగర చక్రవర్తి మూరు రాయర గండడు కూడ నిట్టి మహనీయులలో నొక్కఁడు.
ఇట్టివారినే మనవా రవతార పురుషు లనుట; భగవదంశ సంజాతులని పూజించుట క్రైస్తువు, మహమ్మదు మున్నగు వారును దేశాం- తరములలో నిట్టి కార్యములకే యుదయ మందిరి.
ప్రపంచమున ధర్మలోపము సంభవించిన వేళ నిట్టివారిని సృష్టి కర్తపంపి సంఘమును మరలఁ జక్క చేయించు చుండును. అట్లుకాక, “కా నున్నది కాక మాన' దని యూరక చూచుచుండె నేని యాసోమరి సృష్టి కర్తకన్న కలిపురుషుఁడే మేలగునుగదా? అట్టి సంఘము కన్న వేఱు నరక లోక మేల? శ్రీ కృష్ణభగవానుని వాక్యము లిని స్మరింపుడు:-
"యదా యదా హి ధర్మస్య
గ్లాని ర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య
తదా త్మానం సృజామ్యహం”
- భగవద్గీత.