Jump to content

వదరుబోతు/కృతార్థత

వికీసోర్స్ నుండి

కృతార్థత.

1

సంఘమర్యాదలు, గుణశీలములు, విద్యా వృత్తులు మున్నగు వానిలో నాలేఖలకు విషయ ములు కాఁగల యంశములు పెక్కులుంటంబట్టి వానిలో నెద్దాని గూర్చి తొలుత వ్రాయవలయు ఇని యాలోచించుచుండగనే వారము దినములు గడచెను. నవనాగరకత (Modern civilisation), గౌరవ బిరుదములు (Sounds of Honour), భౌతిక సంపత్కళలును (Material Prosperity) బలు మాఱు నాస్మృతి పథమునం దిగులుచుండెను. కాని, యిప్పటి సంఘములో నగ్రమర్యాద వానికే యున్నఁగూడ నాకవి రుచించినవికావు. ఏదియుం దోపక యొక సాయంతనమున నగరారామ (Public Park) ప్రాంతమున బచ్చికతిన్నెపి గూర్చుండి యాలోచించుచుండు నంత, నాప్రాంత మున నరుగు బాలుఁడొకగీతము పాడుట వింటిని. నామది కది యొక వింత వికాసము గూర్చెను. ఆగీత

గీ|| చెట్టునకు మొగ్గదొడిగెడి చేష్ట గలదు,
     కోరకమునకు వికసించు గుణము గలను.
     విరికి వలపులు వెదజల్లు విద్య గలదు,
     వలపునకు గుబుల్కొను నలవాటు గలదు..
     ఇంత సౌభాగ్య మంతయు నెందు కొఱకు?

నిజము! ఇంత సౌభాగ్యమంతయు నెందు కొఱకు? కొంత తడవునకు నా యోజనాధోరణి మానవజన్మము వంకఁ దిరిగి యెప్పటి కీజన్మము. నకుఁ గృతార్దత యనుకొంటిని. చింతించుకొలఁది నొకటిపై నొకటి యాలోచనాతరంగము లుద యించి నా భావమును క్షణమొక వైపునకు ద్రిప్పుచు నెంతో తొందర చేయుచు వచ్చెనుగాని, "ఇదమిత్థ మని నిర్ధరించుకొనలేక పోతిని.

అర్థ మెఱింగియో, ఎఱుగకయో-ముప్పది వంతు లిదియే వాస్తవము పలువురు మోక్ష ప్రాప్తిచే మానవజన్మమునకు సాఫల్యమబ్బునం దురు. కాని యామాట శాస్త్రార్థమే! కాన నిది వదలితిని. ఇక సనుభవమున నీవిషయమై జనుల యభిప్రాయము పలుతెఱఁగులుగ నున్నది. వారి వారి యభిరుచికిని, సాంగత్యమునకును, అభ్యాస మునకును, వివేకమునకును దగినట్లు వారు నిర్దరించు కొందురు. ధనమే ప్రపంచమున కాధారభూత మని నమ్మి, కుడువక, కట్టక, ప్రాణము పోయినను సరే పణపుసంచి ముడి విప్పరాదని లక్ష్మీ దేవి నూపిరి యాడకుండఁ బాతిపెట్టుచుఁ గొల్లలుగ నార్జించి లోభి "ధన్యోస్మి" యనుకొనును. పని పాటలు లేక వివిక్తస్థలమునఁ గూర్చుండి, ఏ యూరుబిచ్చుకపైననో, ఏ గురువింద పొదను గూ ర్చియో, పోలు పొందు లేని యుత్ప్రేక్షోపమాన ములతో, బద్యము లల్లుచుఁ గవులు నిర్భరానంద మనుభవింతురు. సృష్టికర్త స్త్రీ లింగము ప్రసా- దించియున్నను "కళత్ర"మునకు నపుంసక లింగ మును దమంత నారోపించి లేని తంటాలు పడుచు నెన్నెమ్ముల కంటులాగు శాస్త్రము గంఠపాఠము చేసి వైయాకరణు లానందింతురు. పెరటి వాకిటఁ పదుగు రిలుపొచ్చి యిల్లాలి యోగక్షేమము లరయుచున్నఁ గూడఁ తెలియనేరక వసారాలోఁ జిరుచాపపైఁ గూర్చుండి గుణితము వేయుచు నాక సమునఁ జంద్రుఁడు విశాఖ కడకేగు కాలము తేలి 2నంతఁ దమ శాస్త్రమునఁ గాకున్న బ్రపంచమే యుండదని జ్యోతిష్కులు పొంగుదురు. మోయ లేని బరువుమోసిగాని, ఇనుపసంకెలలఁ ద్రెంచిగాని చూపఱచే సెబా సనిపించుకొన్నంత సృష్టికర్త యుద్దేశము నెఱవేరెనని “కలికాలభీములు” కొం దరు సంతసింతురు. స్వభావసిద్ధమగు పుంభావ మునకు లేని పోని స్త్రీత్వమును బలాత్కారముగ నారోపించుకొని 'చిత్రాంగిగానో, 'తార'గనో రంగస్థలమున నటింపఁగోరి, యొంటిగ నద్దము ముందు నిలిచి యక్కఱమాలిన నవ్వును, అనవసర మగు శోకమును సక్రమముగ నభ్యసించుచు, దమ వికార చేష్టలకుఁ దామే యానందించుకొను బృహ న్నలలు కూడఁ గలరు. సర్వస్వమును బచ్చింటఁ గుదువ యుంచి బాలామణికో మోహనాంగికి. చరణదాసులై, సమయమెఱిఁగి మునుముందుగ సానతిపొంది యామిటారి తాంబూల రక్తాధరమును ముద్దుగొని యందలి యమృత ధారల - అబ్బ!--- చేరలబంటి జుఱ్ఱుచు “బ్రహ్మానందాధి రాజ్యపదవి లోనున్న తరుణమూర్ఖుల జీవితమునకుఁ గృతార్ధత వేఱుగ నడుగ నేల

“మదకలమదిరాక్షీ నీవిమోక్షోహి మోక్షః

అనుసూత్రము వీరికయ్యే వారియఁబడుట! ఇక సురాదేవీ వరప్రసాదముననో, గానామృత రసాస్వాదమహిమ వలననో, చొక్కి యిహపరము లెఱుఁగక వికార చేష్టలఁ జేయుచు సద్వైతసుఖ మనుభవించు చరితార్థ జన్ములగువారి యానంద పరిమితి వర్ణింపఁ దరముగాదు.

ఇట్టి కృతార్ధ జీవితులలో నింకొక తెగవారిని మాత్రము స్మరింపకుండఁ జాలను. "దేహ మశా శ్వతము ప్రాణము బుద్బుద ప్రాయము. బ్రతికిస నాఁడే బాగుగ తిందము గాక!" అనుట వీరి మూలమంత్రము. ఈమహానీయులకు “దినముల లోపల నుత్తమ దినమే తద్దినము.” నాకుఁజూడ వీరి పద్ధతి యొకవిధముగ మెఱుఁగే! తత్త్వములలో నెల్ల ముఖ్యమైనది - దేహ మశా శ్వతమని - వీరు మాత్రమెఱుఁగుదురు గాన.

ఈ యాలోచనల సారాంశము ప్రపంచ మునఁ బ్రతిమానవునకునుఁ గృతార్ధత వేఱనుట! కాని తుదకీ ఫలితార్ధమును విశ్వసింప నైతిని. సర్వసముఁడగు సృష్టికర్త కిట్టి పిచ్చియుద్దేశ ముండ దనుట స్పష్టముగఁ దోచెను. అప్పటికిఁ జాలఁ జీకటి పడియుండుటచే యోజనలఁ జాలించి యెవరినైన మహనీయుల నడిగి యీపశ్నమున కుత్తరము వడయ వచ్చుననుకొని యిలుసేరితిని. తరువాత ననేకులఁ బ్రశ్నించి కొన్ని యుత్తరములకను గొంటిని. ఫలము తృప్తికరము గాదు.

నిన్న రాత్రి బజారున హరికథాకాలక్షేప మని విని యట కరిగి దూరమున గుంపునఁ గూ- ర్చుంటిని. నాఁటికథ “గరుడగర్వభంగము”. త న్నవమానింప నెంచిన నారదుని మోసపుమాటల నమ్మి యమాయకురాలగు సత్యభామ, వనవాస మున నున్న సీతాదేవివలె వేషము ధరింపఁగోరి మొగమునిండ మసిబొట్లు పెట్టుకొని కుంటినడ కలతో, శ్రీరామాకృతితో నున్న కృష్ణుని కడ కరుగుదెంచుచుండెనని కథకుఁ డభినయ పూర్వక ముగఁ నుపన్యసించుచుండెను. క్రిక్కిరిసియున్న జనులందరు కడుపు లుబ్బ నవ్వుచు సత్య నవమా నించుచుండిరి. కథకుని చేరువనున్న పండితులు తలలూచుచుండిరి. వాస్తవముగ నింతటి యన మానమే గల్గియున్న సాత్రాజితియంతటి మానవతి యూపిరితో నుండియుండ దనుకొంటిని.

అంతలో నాయున్న చేరువ నొక చిన్న కలకలము గలిగెను. ఏనడో యనాథ బాలుఁ డొకడు రెండు దినములుగఁ దన కాహారములేదని దీనముగ నచటి వారి నన్నము యాచించుచుండె. ముఖవైఖరి జూడ వానికథ నిజముగఁ దోచినది. అచటి వారు వానిని 'దొంగ' యనియు, కథ కడ్డము వచ్చెననియుఁ జీవాట్లు పెట్టుచు నవలఁ ద్రయసాగిరి. వానిగతి పాప మనిపించుచుఁడెను. అంతలో నచటి ముసలియవ్వ యోర్తు లేచి వారిని వారించి “నాయనా! అన్నము పెట్టెదర”మ్మని యాబాలునిఁ దోడ్కోని పోవసాగెను. కథను వదలి పోవుచున్నదేయని నే నాశ్చర్యపడి "అవ్వా హరికథవలదా?” యంటిని. ఆమె నవ్వి యిట్లనుచు వెడలి పోయెను.

 "జపతపంబుల కన్న, చదువు సాముల కన్న,
  నుపకారమే మిన్న, యో కూనలమ్మా!

____________