లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు/చివరిఅట్ట
మండలి బుద్ధ ప్రసాద్ 26-05-1956న జన్మించారు. వీరి తండ్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు రాష్ట్ర విద్యా, సాంస్కృతిక శాఖామాత్యులుగా పనిచేసి 1975లో ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదిక పైకి తీసుకువచ్చిన ఘనత దక్కించుకున్నారు. శ్రీ బుద్ధప్రసాద్ తండ్రి అడుగుజాడలలో తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి నడుంకట్టి పనిచేస్తున్నారు. తెలుగు భాష పరిరక్షణకు, తెలుగు ప్రాచీన హోదా సాధనకు సాగిన ఉద్యమాలకు సారధిగా నిలిచారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయలు 'ఆముక్తమాల్యద' రచించిన కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు సన్నిధిలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని నెలకొల్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్న శ్రీ బుద్ధప్రసాద్ డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల మంత్రిగా పనిచేశారు. 1999, 2004లలో అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యునిగా పనిచేశారు. 12 సంవత్సరాలపాటు కృష్ణా జిల్లా కాంగ్రెసు సంఘ అధ్యక్షునిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎ.ఐ.సి.సి. సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
శ్రీ బుద్ధప్రసాద్ మారిషస్, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, చైనా, జర్మనీ, అమెరికా, ఇంగ్లాండు దేశాలలో పర్యటించి తన పర్యటన విశేషాలతో “మారిషస్‌లో తెలుగు తేజం”, “ప్రజలు - ప్రగతి”, “జర్మనీయానం” గ్రంథాలను రచించారు. ఇప్పుడు ఇంగ్లాండు దేశ పర్యటన విశేషాలతో “లండన్లో తెలుగు వైభవ స్మృతులు” వెలువరిస్తున్నారు.