రామాయణము
ఎఱ్ఱాప్రెగడ
కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసంగ్రహమున ఎఱ్ఱాప్రెగడ రామాయణములోని వని యీక్రిందిపద్యముల నుదాహరించినాఁడు.
ఉ.
అంగముతోడఁ గట్టు మిఁట యజ్ఞవిఘాతక చోరు నెందు వో
వంగలవాఁడ వింక నిటు వైళమ తాపసవేషధారి వై ........
...........................................................................
............................................................................
ఉ.
సందడి యధ్వరక్రియ కసంగతి మేనిబలంబుతోడఁ బెన్
గ్రం దది యేల మేన తగఁ గార్ముకహస్తుఁడ నై కడంగి మీ
ముందఱ నిల్చెదన్ గ్రతువు ముట్టక యుండఁ బ్రచండదైత్యరా
జిం దగ దవ్వుదౌల వెసఁ జించెదఁ బెంచెద మీకు మోదమున్.
వ.
అనుటయు మంత్రిమాటకుఁ బ్రియంపడి యాతని నాదరించి యమ్మనుజకులేంద్రుఁడు .............
ఉ.
నూర్వురు నొక్కచందము మనోగతి సైరణ చేసి నన్ను నా
సర్వకులంబు నుత్తమయశంబున నుంచితి రమ్మలార! మీ
కుర్విని సాటియే యబల లొండొరు దేవతలున్ బటుక్షమా
నిర్వహణం బొనర్చుటకు నేరరు మర్త్యులఁ జెప్ప నేఁటికిన్?
చ.
అనఘ యకంప మై విమల మై పరిపూర్తియు లోఁతుఁ దియ్యమున్
ఘనతయుఁ గల్గి సజ్జనమనస్సదృశస్థితిఁ జాల నొప్పు మీ
ఱినయది యన్నదీజలము ఱేపును మంచిది ........................
.................................................................................
ఉ.
కోఱలు నుగ్గును గ్గయిన క్రూరఫణీంద్రుగతిన్ దరంగముల్
మాఱినభూరివారిధిక్రమంబున రాహుకరాళవక్త్రమున్
దూఱినతీవ్రభానుక్రియ దుర్బలసైన్యతఁ బుత్త్రహీనతన్
గీఱి పరాభవాభిగతిఁ గీడ్పడి భూపతి నెమ్మనంబునన్.
శా.
తాఱం గ్రాఁగిననేలతంపలఱఁ బాతాళంబుదాఁకన్ జనం
దూఱం జల్మిఱి మిన్ను దాఁకి తరఁగల్ తోరంబు లై నల్గడల్
పాఱం బెల్లుగ నేఱు లుబ్బఱముగాఁ బైపైన నీ రెక్కి దై
వాఱన్ జెర్వులు చెన్ను మీఱె నఖిలప్రాణుల్ ముదం బందఁగాన్.
క.
నూఱు చెరంగుల నెఱసులు
మీఱఁగ నీ విభ్రమములు మెఱయించి మునిం
గాఱఁగఁ జేయుము మేనక
చూఱకొనదె యతని తెలివి సొమ్ములు మున్నున్.
మ.
చెఱకుందోఁటలఁ బెంచి శాలిమయసుక్షేత్రస్థలుల్ నించి య
క్కఱ లేకుండఁగఁ బూగనాగలతికాకాంతారముల్ ప్రోచి యే
డ్తెఱ నంతం గుముదోత్పలాళివనవాటీకోటిఁ బాటించి పె
న్జెఱువుల్ వొల్చెఁ బురంబునల్దెసలఁ బ్రస్ఫీతాంబుపూర్వస్థితిన్.
(ఇవి బాలకాండములోనివి)
ప్రాచ్యలిఖితపుస్తకశాలలోని యొక సంకీర్ణపద్యముల తాళపత్రసంపుటములో రామాయణ యుద్ధకాండమునందలి పద్యములు ముప్పది కానవచ్చినవి. అవి ప్రసిద్ధము లయిన భాస్కరరామాయణాదిగ్రంథములలోనివిగాఁ గాన రాలేదు. అవి యెఱ్ఱాప్రెగడ రామాయణములోనివి కాఁదగును. ఆపద్యము లివి.
చ.
అనిలజరావణానుజులు హస్తములన్ గయిదండ గొంచుఁ గ్ర
క్కునఁ జనుదెంచి భానుజుఁడు గొల్వ సుఖంబున నున్న రామచం
ద్రునిఁ గని పాదముల్ శిరముతో నొఱయన్ బ్రణమిల్లి లేచి ని
ల్చినయెడ నెమ్మొగమ్ము వికసిల్లి విభీషణుఁడుం బ్రియంబునన్.
ఉ.
తమ్ముఁడ నేఁడు నాకుఁ బ్రమదంబు ఘటిల్లె దశాస్యనందనుం
డిమ్మెయిఁ గూలుటన్ మనకు నింకఁ జయం బగు నంచు సిగ్గు లోఁ
గ్రమ్మఁగ నున్నలక్ష్మణునిఁ గ్రక్కున నంకమునందు నుంచి వ
క్షమ్మునఁ జేర్చుచున్ శిరము సారెకు మూర్కొనుచుం గ్రమంబునన్.
చ.
కరముల నవ్విభుం డతని గాయము లంటుచు నూర్పు పుచ్చుచున్
బురఁబురఁ బొక్కుచున్ శిరము మూర్కొని యెంతయు నూఱడింపుచున్
దురమున లెస్స గూల్చితివి దుర్దముఁ డైనవిరోధి పంక్తికం
ధరుఁడును నింకఁ గూలు నని నామది నిశ్చయబుద్ధి నొందెదన్.
చ.
మసలక రామరావణులు మార్కొని యుద్ధము సేయుచుండఁగా
నిసితశరంబు లొండొకటి నేర్పునఁ ద్రుంచుచు నుగ్రశక్తిమై
దశశిరుమస్తకప్రతతి దాఁకినఁ జిత్రమ డుల్లు సూపు మై
నుసిరిక మ్రానిమీఁదఁ బిడు గూనినఁ గాయలు డుల్లునాకృతిన్.
ఉ.
అక్కట ధూళిఁ బ్రుంగు డయి యంగము నెత్తుటఁ దోఁగి వేదనన్
స్రుక్కుచు ధాత్రిపైఁ బొరలుచున్ బడి లక్ష్మణుఁ డిట్టు లుండ నా
కెక్కడి యుద్ధకాంక్ష యిఁక నెక్కడి విక్రమగౌరవక్రమం
బెక్కడి ప్రాణ మెక్కడి మహీసుత యెక్కడి రాజ్యసంపదల్.
ఉ.
కందక గాజువాఱక మొగంబు వికాసముఁ జెందెఁ జేతు లీ
యందము లైనకాళ్లు నరుణాంబురుహంబుల లిలఁ జూడఁ జె
న్నొందెడు జీవహీను లిటు లుండరు ప్రాణముతోడ నున్న వాఁ
డిందు సహోదరుండు ధరణీశ్వర! నీకు విషాద మేఁటికిన్?
చ.
మనమున నిశ్చయించి పవమానతనూజుఁడు మూఁడుమాఱు లే
పునఁ గదలించి యంబుధరముంబలె నీలరుచిం జెలంగుత
ద్వనగిరిశృంగమున్ బిడిచి కైకొని పై కెగురంగ వైచి యాఁ
చి నిలువఁ బట్టుచున్ వెస సుషేణునిఁ జేరఁగ వచ్చి యచ్చటన్.
ఉ.
ఆతని రౌద్రరేఖ గని యబ్ధి గలంగెఁ, జలించె శైల, మౌ
త్పాతికవారిదంబు లతిదారుణరావము లై జనించె, ధా
త్రీతల మెల్ల బి ట్టదరె, దిక్కులు వ్రీలె సమస్తభూతముల్
భీతి వహించె, డెంద మగలెన్ రజనీచరలోకభర్తకున్.
చ.
అనయము సర్వభూతములయందును గోద్విజులందు శైలకా
ననగగనాఖిలానలఘనత్వము మించ సహస్రపాదలో
చనశతశీర్షమూర్తిపయి సారగతిన్ వసియించి సాద్రికా
వనియు సమస్తభుతముల వారి వహింతువు నీవె రాఘవా!
మ.
తరుణాదిత్యనిభద్యుతిన్ మెఱసి రక్తశ్రీచ్ఛటాశాటి కా
ధరయుం దప్తసువర్ణభూషణయు నుద్యన్నీలధూమాభ్రబం
ధురధమ్మిల్లయు నౌవిదేహతనయన్ దొల్తొల్త బెన్మంటలోఁ
జొర నేతెంచినరూపుతోన జగముల్ సోద్యంబునన్ జూచినన్.
చ.
అవనిజనంబు లెల్లను దశానను నంతిపురంబునందుఁ బె
క్కవుదివసంబు లున్నజనకాత్మజ శోధితఁ జేయకే యనా
ర్యవిహితవృత్తిఁ దెచ్చె రఘురాముఁడు బాలిశుఁ డంచు నెంచరా
భువనము లెల్ల నమ్ముటకుఁ బో యిటు సేసితి హవ్యవాహనా!
చ.
ప్రకటతరాత్మతేజమున రక్షిత యామిథిలాధిరాజక
న్యకను బయోధివేలఁబలె నాశరుఁ డెందు నతిక్రమింపఁ డె
న్నికకును నిప్పువంటి మహనీయచరిత్రము గల్గు నిట్టి జా
నకిని దరంబె వానికి మనంబున నేనియుఁ జుల్కఁ జూడఁగాన్.
ఉ.
వైరిజయంబు గాంచి బలవంతుల మిత్రులఁ గూడి తేజమున్
సారయశంబునున్ గనిననాదు సమాగమంబు నీవు సొం
పారఁగఁ జెప్పుచో నతని యాననవర్ణవిలోకనేంగితా
కారవచోవిశేషములకైవడి నేర్పునఁ జూడు మేర్పడన్.
మ.
అతులం బై వశవర్తి యై రథతురంగానేకపాకీర్ణ మై
పితృపైతామహ మైనరాజ్యము మదిన్ భేదింపఁగాఁ జేయు సం
తత మెవ్వానికి నైన రాజ్యఫల మాత్మన్ గోరినన్ గైక యీ
సుతుఁడే యేలుచు నుండుఁ గాక విపులక్షోణీతలం బంతయున్.
చ.
అతఁ డడరించుశస్త్రముల యారవముల్ శరపుంఖజాతమా
రుతములు గ్రమ్మినన్ గులగిరుల్ గదలెన్ గలఁగెన్ బయోనిధుల్
క్షితి వడఁకెన్ మనంబునఁ జలించిరి పన్నగలోగవాసు లు
న్నతరుచిఁ బాసి మాసె దిననాథుఁడు మందటిలెన్ సమీరుఁడున్.
చ.
వడి నమరేంద్రముక్త మగువజ్రములీల యుగాంతకాలుకై
వడిఁ బఱతెంచి రావణుని వక్షము గాఁడి ధరిత్రిఁ దూలెఁ బ
ల్వడి దశకంఠుఁ ద్రుంచె రఘువీరుఁడు నేఁ డని మేలువార్త యే
ర్పడ ఫణిలోకవాసు లలరన్ వివరింపఁగ నేఁగెనో యనన్.
శా.
ఆపుణ్యవ్రతఁ బట్టినప్పుడె తదీయం బై యనిర్వార్య మౌ
కోపాగ్నిన్ మసి గాక నీ వునికి రక్షోనాథ లోకంబునన్
బాపాత్ముం డగువాఁడు పాపఫలమున్ బ్రాప్తవ్యకాలంబునన్
బ్రాపించెన్ నిజపాపకర్మఫల మిబ్భంగిన్ నినుం జెందుటన్.
చ.
సవితృఁడు చంద్రుఁడున్ దిశలు సంధ్యలు రేలుఁ బగళ్ళుఁ గాలమున్
భువియును నాదిగా సకలమున్ గనుసాక్షులు వీ రెఱుంగఁ నేఁ
బ్రవిమలసద్గుణోత్తరధురాపరిభూషిత నైతి నేలి హ
వంయవహుఁడు నన్ను నిప్పుడు దయాయతచిత్తతఁ బ్రోచిఁ గావుతన్.
శా.
ఆరీతిన్ భువనత్రయిన్ గలుగువా రత్యంతశోకార్తు లై
ధీరత్వంబు పరిత్యజించి యలధాత్రీనందనం జెందుదు
ర్వారాపన్నత యెంచుచున్ బలుకఁ దద్వాక్యంబు లాలించుచున్
ధారాళాశ్రులతో మనం బెరియఁ జింతన్ రాముఁ డున్నత్తఱిన్.
చ.
ఖలునిఁ గబంధునిన్ నిశితకాండములన్ దునుమాడి వాని ప
ల్కులు విని ఋశ్యమూకమునకున్ జని భానుజుఁ గూడి వాలి ను
జ్జ్వలబలుఁ గూల్చి యర్కసుతు వానరరాజ్యమునందు నుంచి య
య్యలఘుఁడు పంపె భూమితనయన్ వెదకన్ గపివీరకోటులన్.
చ.
నిరుపమమూర్తి రామధరణీపతి శోభనవేళ నాడి ర
చ్చరపుపుఁబోండ్లు కిన్నరులు సారెకుఁ బాడిరి దేవదుందుభుల్
మొరసెను ధాత్రి సస్యములు మోహనలీల వహించె వృక్షముల్
వరసురప్రసూనఫలవర్గములన్ విలసిల్లె నెంతయున్.
చ.
అని కొనియాడుచున్ జలరుహాక్షులు సేసలు మీఁదఁ జల్లఁగా
ననఘచరిత్ర! రామ! సుగుణాకర! వర్ధిలు మంచుఁ బౌరు లె
ల్లను దనచుట్టుఁ గొల్వఁగ నలంకృత మైనరథంబుపై ముదం
బున భరతాగ్రజుండు రఘుపుంగవుఁ డీగతి వైభవంబులన్.
చ.
జలనిధి గట్టి మించుకపిసైన్యముతో వనరాశి దాఁటి దో
ర్బలమున లంకపై విడిసి రావణముఖ్యనిశాటకోటులన్
గలన జయించి భూతనయఁ గ్రమ్మఱఁ గైకొని నిత్యకీర్తులన్
వెలసినవాఁడు రాముఁ డిటు వింటిమె కంటిమె యిట్టి చిత్రముల్.
శా.
భేరీకాహళశంఖతూర్యములు గంభీరంబు లై మ్రోయఁగాఁ
దారామార్గమునందు దేవఋషిగంధర్వస్తుతుల్ మీఱ సే
వారూఢిం దగ వందిమాగధులు కైవారంబు గావించుచున్
సారోదారవిచిత్రవైఖరుల నానందంబు గల్పింపఁగన్.
ఉ.
రావణుఁ గూల్చి క్రమ్మఱ ధరాసుతఁ జేకొని వచ్చుచున్నవాఁ
డావసుధాకళత్రుఁ డిదె యాప్తులతోడ మహేంద్రుతో శచీ
దేవియుఁ బోలె సీత జగతీతలనాథునిఁ గూడి సంతత
శ్రీ విలసిల్ల నున్నయది చేరినవాఁడు సుమిత్రపట్టియున్.
చ.
అలికులవేణులన్ జలరుహాక్షులఁ జంద్రనిభాస్యలన్ విని
ర్మలమణిహేమభూషణసమగ్రల భార్యలఁ గా వరింపు గ
న్యల గుణజాతియుక్తలఁ బదార్గుర గ్రామశతంబుఁ జూడఁ జె
న్నలరెడులక్షగోవులఁ బ్రియం బెఱిఁగించిన నీకు నిచ్చెదన్.
ఉ.
కొంచక కోటపై నిలిచి కొందఱు భీమబలాఢ్యు లైనన
క్తంచరు లుగ్రతోమరగదాపటుశక్తుల వానరాలి నొ
ప్పించిరి వానరేంద్రులును బేర్చి రణంబునఁ గోడపైకి లం
ఘించి నిశాటులన్ ధరణికిం బడ నీడిచి నొంచి రుద్ధతిన్.
మ.
నిను సేవించినఁ గల్గు మానవులకున్ వీటివధూటీఘటీ
ఘనకోటీశకటీకటీతటిపటీగంధేభవాటీపటీ
రనటీహారిపటీసువర్ణమకుటీప్రచ్ఛోటికాపేటికల్
కనదామ్నాయమహాతురంగ! శివలింగా! నీలకంఠేశ్వరా!
చదలువాడ ఎఱ్ఱాప్రెగడ రచనముతో నీకవిస్తుతిపద్య మొకప్రాచీనపద్యసంకలమునఁ గానవచ్చినది.
శా.
సారోదారసమంచితస్ఫురదురుస్ఫాయల్లసల్లాలిత
(స్ఫారంబుల్ వె?)సఁ ద్రిప్పి పెట్టుచును శబ్దద్రవ్యహీనుల్ సదా
తారుం జెప్పితి మంచుఁ జెప్పికొనుటల్ తప్పే నిరాఘాటవా
క్సౌరభ్యప్రతిభావిజృంభితులు మెచ్చర్ గాక యా చందముల్.
ఇది ఎఱ్ఱాప్రెగడ రామాయణకృత్యవతరణికలోనిది గావలెను.
ఈ క్రింది పద్యమును ‘ఎఱ్ఱన రామాయణములోనిదా?’ అని యెప్పుడో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తమ నోటుబుక్కులో వ్రాసికొని రఁట!
ఉ.
చువ్వన మేను వంచి రవి సోఁకఁగఁ దోఁక విదిల్చి పాదముల్
వివ్వఁగఁ బట్టి బాహువులు వీచి మొగంబు బిగించి కొండ జౌ
జవ్వన నూఁగి ముందఱికిఁ జాఁగి పిఱిందికిఁ దూఁగి వార్ధిపై
ఱివ్వన దాఁటె వాయుజుఁడు ఱెక్కలతోడిసురాద్రియో యనన్.
కూచిమంచి తిమ్మకవి గాక మఱికొందఱు లాక్షణికులును ఎఱ్ఱాప్రెగడ రామాయణములోని పద్యములను తమ లక్షణగ్రంథములం దుదాహరించినారు. అట్టివి మఱికొన్ని యీ క్రిందివి.
ఎఱ్ఱాప్రెగడ సంక్షేపరామాయణము
క.
ధాత్రీ సురసేవారతి
భాతృభృతిగురూక్తిపాలబంధురమతి దు
శ్శాత్రవహరణస్థితి
మిత్రానందకరవిహృతి మీ యం దమరున్.
సీ.
బాలసుధాంశునిటాలుని నవసుధా
లాపముల్ వినవలె ననెడువాస
క.
ఆ దశరథసూనుండు ప
యోధి జలం [ 1] బింకఁ జేసి యొకశరమునఁ గ్ర
వ్యాదవిభుఁ దునిమి సీతను
మోదంబునఁ [ 2] జేకొనె కపిపుంగవు లెన్నన్.
ఆంధ్రప్రయోగరత్నాకరం, సుకవిమనోరంజనం 1.254
వావిళ్లవారి ముద్రణమున భాస్కరరామాయణము యుద్ధకాండములోని యీ క్రిందిపద్యము ‘ఎఱ్ఱాప్రెగడవారి పద్య మని ప్రతీతి’ అను అధోజ్ఞాపికతో కానవచ్చును.
ఉ.
త్రెవ్వెడు గంటులం గురువు దేఱెడునెత్తురు రాక మున్న యే
నొవ్వియు నేవికారము మనోగతిఁ జెందక మున్న సాయకం
బవ్వలఁ బోక మున్న మకుటాట్టవిఘట్టనరావ మొప్పఁగా
నువ్వున నుప్పతిల్లె నసురోద్వహమూర్ధచయంబు గ్రక్కునన్.
1154
ఆనెగొందిలో దొరకిన యొక భాస్కరరామాయణపుఁ దాళప్రతిలో నారణ్యకాండమున ఎఱ్ఱాప్రెగడ కృతములుగాఁ గొన్నిపద్యములు కావచ్చిన వని డాక్టరు నేలటూరి వెంకటరమణయ్యగారు గుర్తించి తెలిపిరి.
ఉ.
ఆనెఱజోదు కేలు దొనకై నిగుడించుట, యమ్ము మౌర్విసం
ధానముసేఁత, నిండఁ దెగఁ దార్కొని లక్ష్యము సేయు, డేయుడున్
గాన నజస్రమండలితకార్ముక మొక్కటి గంటిఁ గంటి న
ద్దానవదీర్ఘసముదాయనిరంతరపాతవేగముల్.
స్రగ్ధర.
కరిణీయానంబు నవ్వున్ గతి, నవలతికాకార మంగంబు, చంద్రున్
బురుణించున్ ముద్దుమో, మంబురుహదళములం బోలుఁ గన్ను, ల్విపంచీ
స్వరసంకాశంబు పల్కున్, జలదళినిచయస్ఫర్ధి యై యుండు వేణీ
భర, మాతన్వంగి కింద్రప్రముఖనిఖిలదిక్పాలకాభీలశౌర్యా!
చ.
అలినిభవేణి చంద్రసదృశానన యుత్పలపత్రనేత్ర కో
మలలతికాభిరామభుజ మంజులవృత్తలసత్కుచద్వయీ
కలిత సుమధ్య హృద్యకటి కామ్యతరోరువు రమ్యజంఘ యు
జ్జ్వలచరణాబ్జ తద్వనిత జానకి నా విలసిల్లు రావణా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వప్రాచ్యలిఖితపుస్తకభాండాగారంలో ఉన్న ఒక భాస్కరరామాయణ తాళపత్రప్రతి (T 19-50 Acc No 3249)లో అరణ్యపర్వంలో ఎఱ్ఱాప్రెగడ పద్యంగా ఈ పద్యం ఇవ్వబడింది.
ఉ.
నిర్మలహేమబిందుకమనీయము గాఢము నైన విస్ఫుర
ద్వర్మముఁ దాల్చి శిప్త(?)పరివారితవహ్నియుఁ బోలె రుద్రుఁడై
కార్ముక మెక్కువెట్టి గుణకర్కశటంకృతులన్ సమస్తది
ఙ్మర్మములుం బగల్చుచు సమర్థుఁడు రాముఁడు నిల్చె నయ్యెడన్.
క.
ఓ నారీమణి యీ మెక
మే నిప్పుడ తెచ్చి యుంతునె మ్రోలన్
గానుకగా నని రాముఁడు
చే నమ్మును విల్లు దాల్చి ... యుండు తమిన్.
ఉ.
త్యాగులు పాతకేతరులు నై నుతి కెక్కఁగ నాకలోక లీ
లా గరిమంబు నంబుదము లాగు దలిర్చిన సంస్కృతోల్లస
ద్వాగభి యుక్తి నాత్మ విబుధత్వము సిద్ధత నొందఁగా సుధా
యోగము నొందుదు ర్శ్రుతిపయోధి మధించి రసజ్ఞులై కవుల్.
ఉ.
దాన మిచ్చితి నని యీని దీనుని భంగి .............
↑ బింక నేసి
↑ జేకొని సురపుంగవుతోడన్