రామచంద్రప్రభుశతకము
రామచంద్రప్రభుశతకము - కూచి నరసింహము
1. శా. శ్రీల న్మేలగు చేలల న్నగల నర్పింపంగలే, కింక నే
వేళ న్నామతి శాంతి కడ్డముగ నావిర్భూత మౌచుండు ను
ద్వేలాంతఃకరణప్రవృత్తులను భక్తి న్నీకు మత్తేభశా
ర్ధూలాకారపుఁగాన్క బొమ్మలుగ నిత్తు న్రామచంద్రప్రభూ!
2. మ. శతకంబు న్రచియించి తొల్తఁ బిదప న్సామర్ధ్యముంబట్టి తా
మితరగ్రంధముల న్బొనర్తు రిలలో నేరేనియు; న్గాని త
ద్వ్యతిరిక్తంబుగ నర్వదేండ్లపయి రెండౌవెన్క నేఁజిక్కితిన్
శతకం బొండు రచించి నీ కొసఁగుకాంక్ష న్రామచంద్రప్రభూ!
3. మ. వృకసందోహము పొంచి యుండి పొలమందేకాకిగా నుండువృ
ద్ధకకుద్మంతముపైకి దూఁకుగతి, దుర్దాంతాధులు న్వ్యాధులున్
జకితస్వాంతత నుండున న్నఱిమి యేఁచన్జొచ్చె! గోపాలనా
మక! రక్షించుట కీవె శక్తుఁడవు రమ్మా! రామచంద్రప్రభూ!
4. శా. ఎన్నే నున్నవి నామరూపములు నీకెన్నో చరిత్రంబులున్,
గన్నారం గని వీనులార వినితి న్గ్రంధంబుల; న్గాని యే
తన్నామాకృతిదివ్యవృత్తములు హృత్తాపంబుఁ జల్లార్చి నా
కెన్నన్రానిముదం బదేమొ! యిడుఁ దండ్రీ! రామచంద్రప్రభూ!
5. వంతం బెట్టెడూచిత్తవృత్తులను జంప న్నీశుభాఖ్యాత్కరం
బెంతో శ్రద్ధ జపింపఁజూడ నకటా! యేయొక్కెడ న్నిల్వ కీ
స్వాంతం బంకపి యిచ్చవచ్చినటు సంచారంబుఁ గావించెడున్,
శాంతిస్థైర్యము లిమ్ము దానికి రమేశా! రామచంద్రప్రభూ!
6. శా. "అంతంబందున నెట్టులుండు మతి భావ్యం ముండు న" ట్లన్న సి
ద్ధాంతంబు న్స్మరియింపఁ గంప మొదవున్! బ్రాణావసానావధిన్
స్వాంతం బేస్థితి నుండునో యెవఁడు చెప్పంజాలు? నామ్రొక్కు ల
ర్పింతు న్నీకిదె! యిప్డె! సద్గతుల నీవే! రామచంద్రప్రభూ!
7. శా. బాధ ల్రోఁతలు నన్యు లెక్కుడుగ సేవల్చేయునావశ్యమున్
గ్రోధం బిట్టివి లేని సన్మృతియు, హృత్కోశంబునం దప్డు స
ర్వాధివ్యాధిహరత్వదీయశుభది వ్యాంఘ్రిద్వయి న్నిల్పుకొం
చే ధైర్యంబున నుండుపాటవము నీవే! రామచంద్రప్రభూ!
8. శా. అన్యార్థంబు లొసంగు మంచునినునే యాచించి పీడింప ని
ర్దైన్యంబైన సుజీవనంబు, విగతేర్ష్యాలోభదుర్భీరుతా
మన్యుస్వాంతవిశుద్ధియు, న్బరులక్షేమంబు న్సదాకోరుప్రా
వణ్యంబు, న్దయసేయు దీనజనకల్పా! రామచంద్రప్రభూ!
9. మ. పరశర్మప్రదకృత్యము ల్సలుపబోవ న్ధర్మరాజి న్బర
స్పరవైరుధ్యము దోఁచి మానసము క్షోభం బొందు నప్డప్పు; డ
త్తఱి నే దానిని వీడిదేనిఁ గినఁ గర్తవ్యంబొ బోధించి, న
న్సరియౌమార్గమునందుఁ బెట్టు పరమేశా! రామచంద్రప్రభూ!
10. ధరలో నందఱు సౌఖ్యమొందుదురుగాత న్నీకృఓ న్సర్వదా!
యొరుల న్వాఙ్మనసంబుల న్గ్రియల నేనొక్కప్పుడు న్భాదలన్
బొరయంజేయక యుందుఁగాక! యను సంపూర్ణాభిలాష న్నిరం
తరము న్నే మనున ట్లొనర్పు పరమాత్మా! రామచంద్రప్రభూ!
11. శా. ఱాతి న్నాతిగఁ జేసి ప్రోచెడుసమర్థత్వంబు నాదేకదా!
క్రోఁతి న్నిస్తులభక్తుఁ జేయగలనేర్పు న్నాకెగా యుండు! న
న్చేతోగర్వము నొంద! కీడ జడతాచిత్తోరులౌల్యంబుల
న్రాతి న్గోతినిమించువాఁడు గలఁడన్నా రామచంద్రప్రభూ!
12. మ. పతిపత్నిసుతసోదరప్రభృతు లాపత్కాలమందు న్బలా
యితులై పోదురు చెట్టలైన విడి; సద్వృత్తంబువా రైనచో
మృతులై పోవుటె కాక తాము పయిగా హృత్తాపముం దెత్తు రీ
గతి సంసారము నమ్మియుంట వెతయేగా! రామచంద్రప్రభూ!
13. మ. పరుషోక్తు ల్వచియించి చిత్తమును నొవ్వంజేయఁగా నెవ్వఁడే
దొరఁకొన్నన్ బ్రతినిష్ఠురోక్తులను దదుష్టత్వవహ్ని న్మఱిం
త రగుల్ప న్గమకింపకుండ నతిశీతక్షాంతివార్వృష్టి రూ
పఱఁ జల్లార్చుపటుత్వ మీవె పరమేశా! రామచంద్రప్రభూ!
14. శా. వీరి న్వారిని జూచి స్వార్థపరత న్భీగ్రస్తచిత్తంబుతో
నోర న్సత్యము రాఁగనీ కనృతసుదోహంబుల న్బల్కున
ద్దారిం బట్టక యెట్టిపట్టులను సత్యంబేవినీతోక్తులన్
ధీరస్వాంతత వెల్చు బుద్ధి నిడు తండ్రీ! రామచంద్రప్రభూ!
15. శా. ఆపత్కాలమునందుఁ గ్రుంగఁబడి దైన్యం బంద కుద్దామ సౌ
ఖ్యాపాదస్థితిఁ గ్రిందు మీఁ దరయ కత్యౌద్ధత్యముం బొంద కే
యాపత్సంపద లెప్పు డేంతగను సంప్రాప్తించిన, న్నిశ్చలం
బై పొల్పారెడుచిత్తము న్గరుణ నీవా! రామచంద్రప్రభూ!
16. శా. కన్ను ల్గల్గిన బుద్ధిగల్గిన భవత్కల్యాణధర్మంబు లా
పన్నత్రాణపరత్వముఖ్యమహిమల్స్పష్టముగాఁ దెల్పుఁ బై
మిన్నున్ గ్రిందివిచిత్రవస్తుమయ భూమిన్; దర్కవేదాంతవి
ద్యౌన్నత్యం బసవశ్యకష్ట మగుజుమ్మా! రామచంద్రప్రభూ!
17. శా. "నీకర్మంబున వచ్చినట్టిదొసఁగుల్నే నెట్లు పోఁగొట్టి నిన్
సాఁకం గల్గుదు" నందువే సరియె! కష్టంబు లొలంగింపఁగా
నీకు న్నాపయి లేనిచోఁ గరుణ తండ్రీ! వాని నే సైఁచుకోఁ
జేగూర్పంగదె చాలు తాల్మి యయినన్! శ్రీరామచంద్రప్రభూ!
18. మ. వసనాన్నౌషధసంగ్రహార్థ మొరుల న్బ్రార్థించియో విత్త పుం
బస లేనట్టి స్వబాంధవప్రకరము న్బాధించియో వార్ధకం
బు సనంజేయక స్వార్జితార్థమున నన్బోషించుకోఁగల్గు పూ
ర్ణసమర్ధత్వ మసుక్షయంబువఱకీరా! రామచంద్రప్రభూ!
19. మ. పరు లింతే నొనరించినట్టిహితము న్బ్రాల్మాలి సోపేక్షతన్
మఱవంబోక, నిజోత్కటోపకృతు లైన న్జిత్తమం దింతయున్
స్మరియింపం జన, కెప్పు డన్యులకు క్షేమంబు న్ఘటింపంగ నౌ
తెరువు న్వీడక పట్టి న న్నరుగనిత్తే? రామచంద్రప్రభూ!
20. మ. ఇహపూర్వచరితోరుసత్క్రియలచే నేఁ గాక నీదౌనను
గ్రహముం గాంచుటనేని, చేకుఱుసుఖవ్రాతంబుతోఁ దుష్టినొం
ది హృది న్శంతముచేసికొంచు ద్రవిణాదిప్రీతిఁబోనాడి ని
స్స్పృహత న్గాలముపుచ్చి నిన్నెనయనీవే! రామచంద్రప్రభూ!
21.మ. ప్రణుతస్ఫారవిచిత్రసృష్టిగతదుర్వైషమ్యనైర్ఘృణ్యకా
రణము ల్తర్కముచేత నెవ్వరికి నగ్రహ్యంబులే కాని నే
ర్పున ని న్మానసమందుఁ గట్టి నిరతి న్బూజించి సేవించుధ
న్యునకు న్గన్నులఁ గట్టినట్టె యగునేమో! రామచంద్రప్రభూ!
22. శా. దివ్యంబైన సువర్ణ మౌఁ బరుసవేదిం దాఁకి యి; న్మట్టులే
భవ్యత్వత్పదభక్తు నంటఁగనె దుర్వారంబులై సర్వ మ
స్తవ్యస్తంబుగఁ జేయుకష్టములు నౌ సౌఖ్యంబు! లోదేవతా
సేవ్య! నీమహిమంబులెన్నఁదరమా? శ్రీరామచంద్రప్రభూ!
23. శా. ఇంపౌ విగ్రహ మైతి తొల్తఁ, బిదప న్హృన్మోదకాంభోదవ
ర్ణంపుంగోమున సచ్చరిత్రమున నార్తత్రాణశౌర్యంబులన్
బెంపుం గాంచిన రాఘవుండ వయి, తావెన్క న్స్మస్తాంతర
స్థంపుంజిత్సుఖసత్యమూర్తి వయి తీశా! రామచంద్రప్రభూ!
24. శా. బొమ్మ ల్వీడక యాడుబాలుఁ డెదుగ న్బోనాడి యాబొమ్మలన్
గొమ్మ న్గూడి సుఖించుమాడ్కిఁ దరుణీగోభూయశోవిత్తసౌ
ఖ్యమ్ము ల్గ్రోలుచునుండువాఁడు నినుఁదాఁ గంచంగనన్నింటిఁబో
పొమ్మంచు న్నిను నంటియుండు సతతంబు న్రామచంద్రప్రభూ!
25. అమితంబౌ ఫలమిచ్చు గొప్పక్షితిజంబౌ మున్ను బీజంబుతా
సమయంగావలె నేల; నట్లె భువిపైఁ జాలంగ నన్యోపకా
రములం జేయు నుదారతత్వ మగు పూర్వంబం దెటో యీయహ
మ్మమకారాత్మకతత్వ మీల్గవలెఁ జుమ్మా! రామచంద్రప్రభూ!
26. శా. వారాశి న్జనియించు నుప్పున నొనర్పంబడ్డ పాంచాలియా
వారాశిం బడి లోఁతు గన్గొనఁగఁబోవ న్లీనమైపోవు నం;
దారీతి న్గన నీదుపేర్మిఁ జని శుద్ధాత్ముండు నీలోననే
చేరు న్బేరును రూపుమాపుకొనుచున్ శ్రీరామచంద్రప్రభూ!
27. శా. బంగారంబున నుండు దోషముల విధ్వస్తంబుగావించి మే
ల్రంగు న్దానికిఁ దెచ్చువహ్నిపగిది న్బ్రాణివ్రజంబున్గడున్
గ్రుంగంజేయుచు నేఁచు నాపదలుత ద్రూక్షత్వకాలుష్యముల్
త్రుంగంజేయుచుఁ జేయు జీవుఁ బరిశుద్ధు న్రామచంద్రప్రభూ!
28. శా. ప్రేమం బింతయు లేక నీదెసను దుత్వృత్తంబుతో నుండి యిం
కామీఁద న్జదు వెంతగాఁ జదివిన న్వ్యర్థంబె! యాపందితుల్,
నీమాన్యాఖ్యలు నోటఁబల్కచిలుక ల్నీగీతము ల్వాడు నా
"గ్రామోఫో"నులు, నన్యమోదకరులేగా! రామచంద్రప్రభూ!
29. శా. ఏనామంబున నెట్టిరూపమున నింకేభాషలోనైన ని
న్ధ్యానంబందున నిల్పి యర్చనము సేయ న్నీవు ప్రీతుందవై
వాని న్బూతుని జేసి యిచ్చెదవు నిర్వాణంబె; యౌఁగాని యా
ధ్యానం బచ్ఛలమైయొసంగవలెనయ్యా! రామచంద్రప్రభూ!
30. మ. అమితభ్రాంతి గలట్టిచక్ర మిసుమంతైన న్జలింపంగలే
ని మహామాంద్యపుఁజక్రమొక్కగతిఁ గాన్పించు న్బహిర్దృష్టికిన్;
శమయుక్తంబగు సత్వము న్దమముఁ గాన న్వచ్చుఁ బై కట్లే యే
కముగాఁ బెక్కుర మోసపుచ్చును శుభాంగా! రామచంద్రప్రభూ!
31. మ. విసరు ల్తక్కుకుచేష్టలుం దొఱఁగి సద్వృత్తంబులై తొలఁ గై
వసమై గుఱ్ఱము లున్న, హాయి విహరింపన్వచ్చుఁ దత్స్వామి; మా
నిసికి న్లొంగి దశేంద్రియంబులటె వానిం ద్రిప్పులం బెట్టకు
న్న సుఖం బిందును నందు నొందు నతఁడన్నా! రామచంచ్రప్రభూ!
32. మ. పొగయంత్రంబున కంటఁ గట్టుశకటంబుంబోలి, మార్జాలినో
టఁ గడు న్నేర్పునఁ బట్టుకూసవలె, నేడం గష్టముం జెందకుం
డఁగ జీవించును మానవుండు తనడేందము న్గతాహంకృతిన్
భగచ్చిత్తముతోడఁ గల్పుకొన, నన్నా! రామచంద్రప్రభూ!
33. శా. జ్ఞానం బంచును భక్తి యంచు నెవియో కర్మంబు లం చింక నే
వానిం జేయ విలాతికి న్దమకు లాభంబు న్సుఖం బౌనొ య
వ్వాని న్మాని నిరర్థకక్రియలతోఁ బ్రాల్మాలిక న్బ్రాయముం
బోనీఁ జూతురు కొంద; అద్ది ఫలదంబో? రామచంద్రప్రభూ!
34. మ. జనవాక్యం బనృతోక్తియైనను బ్రజాసంతుష్టికై యాజగ
జ్జనని న్నీసతిఁ బాపికొంటివి! ప్రజల్సత్యంబు వాక్రుచ్చి కో
రినఁ, గల్లమ్ముట మాన్పి దాన నగు దూరిక్థంబు వర్జింపనే
రనివారై రిఁక నేఁటిభూమిపతులొరా! రామచంద్రప్రభూ!
35. మ. పరభూపాలుర నోర్చి తెచ్చువసుసంపత్తి న్స్వదేశీయులం
బొరయం జేసిరి పూర్వమందు నృపు; లిప్డో! దేశభాగ్యంబుఁ జె
చ్చెర దూరస్థవిదేశవాసులను నిశ్చితంబుగాఁ జేరని
త్తురు భూభర్త లధర్మకార్యమిది గాదో! రామచంద్రప్రభూ!
36. శా. నేఁ డుచ్చస్థితి నున్న దేశవిభుఁ డెందేఱేని కేమాత్రమో
తోడై వానిని దాను రాజ్యపదముక్తుం జేసి పాలించు; నా
నాఁ డర్కాత్మజరావణానుజులకు న్సహాయ్యముం జేసి చూ
ఱాడ న్లేదు తదర్థ మీ విఁక మహాత్మా! రామచంద్రప్రభూ!
37. మ. పరదేశములనుండి రావలయు సర్వంబున్; స్వదేశస్థు లె
వ్వరు నందొండును జేయలేరు; పరికింపంగ న్బరాపేక్ష యు
ద్ధుర మౌచున్న; దశక్తి హెచ్చుకొలఁది న్గుర్భోగవస్త్వశయుం
బెరుఁగం జొచ్చె; నిఁకేమి చేసెదవొసుమ్మీ! రామచంద్రప్రభూ!
38. శా. ధీమంతుండగు మానవుండు తనబుద్ధి న్లోకబాధాపహం
బై మోదంబును గూర్చు నౌషధములు న్యంత్రంబులు న్జేయనౌ;
నామూలం బిఁకఁ బ్రాణులం గెడపుదుర్యంత్రాదుల న్జేయుటెం
తో మారాత్మకదైత్యకృత్యమగు నయ్యో! రామచంద్రప్రభూ!
39. శా. ధీరత్వంబున నాత్మతేజమున నుద్దీపించి దేశార్తులన్
బాఱంద్రోల నహింసఁ బూని తమకౌ బాధల్క్షమ న్సైఁచుచున్
బోరంజొచ్చుస్వకీయులన్ ధనముకై పోకార్చి ధర్మంబులన్
గారం బెట్టుట పట్టినీచకృతి యౌగా! రామచంద్రప్రభూ!
40. ఇతరు ల్గృహము సొచ్చి పాలనము తామే సేయుచుండ, న్స్వతం
త్రతతో నన్నియుఁ జావ, వారొసఁగు ప్రాణత్రాణమాత్రాన్నపుం
బ్రతుకే దీనత నింద్రభోగ మనుచు న్భావించు గేస్తుండు తా
మతిలేనట్టినరుండు గాఁడె? గుణధామా! రామచంద్రప్రభూ!
41. మ. ప్రజల న్బిడ్డలఁబోలెఁ జూచుకొనుచు న్వారర్థసౌఖ్యాదులం
దు జగత్ఖ్యాతిని బొంద నేలఁగ సమర్థుం డెవ్వఁ డాతండె పో
నిజమౌరా; జిఁక వారిలో జగడము ల్నెక్కొల్పి తామించుఱే
ని జగామ్రుచ్చని కాక రా జనఁగఁ జన్నే? రామచంద్రప్రభూ!
42. శా. ఆయాసక్షమ, యైకమత్యము, దవీయశ్చింతయు, న్ధైర్యమున్
స్థేయోయత్నము, దేశభక్తియు, నకుంఠితభూతకౌశల్య, మాం
గ్లేయు ల్చూపుదు; రవ్వి మా కెపుడిట న్లేవో! గతంబయ్యెనో!
యీయంగూడదె వానిమాకుఁగృపఁ? దండ్రీ! రామచంద్రప్రభూ!
43. మఱి నాంగ్లేయులు భూనభంబులకు సంబంధంబుఁ గల్పించి, తెం
పరులై భూతము లైదిటి న్స్వమహిమ న్బంధించి, యేర్పాటులన్
బరమాశ్చర్యకరప్రవీణతలు చూపంజొత్తు! రవ్వేల నీ
కరుణ న్మాకు లభింపఁగూడ? దసితాంగా! రామచంద్రప్రభూ!
44. మ. ఉరువై యుండును దప్ప క్రిందియబలాయుర్దైహికారోగ్యముల్
స్థిరకాంతారనివాసమూఢమతి; కుద్వేలంబుగా విద్యనా
గరకత్వంబును వానికిం గఱప, సౌఖ్యం బిచ్చుపై వన్నియున్
దఱఁగు; న్మేమిఁక వేనిఁ గోరనగు? సీతారామచంద్రప్రభూ!
45. శా. చేతిందండ్రి కొసంగి బాలకుఁడు దాఁ జిత్తనుసారంబుగాఁ
బాతం బందక తిర్గఁగల్గు; నటె మాస్వాంతంబు నీకిచ్చి యే
యాతంకం బిఁక మేము గాన కెపుడు న్హాయిన్ యథేచ్ఛంబుగా
వీతత్రాసులమై మెలంగఁగల మూర్వి న్రామచంద్రప్రభూ!
46. మ. వినయోపేతుఁడు సౌమ్యభాషణూఁడు నౌ విద్వాంసుఁ, డే తన్నుఁబో
డ్పును లేనట్టిప్రపూర్ణదుగ్ధగవిఁ దాఁ బోలు; న్గడున్ జిఱ్ఱుబు
స్సనువిద్వాంసుఁడు రెండుఁ గల్గి యిఁక నత్యల్పంపుఁబాలిచ్చును
స్రను బోలు న్గొఱగాక యేరికి రమేశా! రామచంద్రప్రభూ!
47. శా. నాసామూలము నంటు నట్లు తిరుమంట న్దాల్చురేఖాద్వయం
బౌ, సత్కర్మము జ్ఞానము; న్నడిమిశోభాన్వీతపుంగీఁతరం
గౌ సద్భక్తియె; మూఁడుత్రోవలకు గమ్యస్థాన మేకంబె; యే
వాసిం గాంచరు వానిలో బుధులు దేవా! రామచంద్రప్రభూ!
48. శా. పంగుత్వంబును దృష్టిలోపమువలెం బాపస్వభావంబునున్
సంగీతంబున కడ్డురా; దితరమౌ శాస్త్రంబులు న్నీతిలే
మిం గీడ్పాటును జెంద వంతగ నిజంబే, కాని నీభక్తిఁ గాం
చంగంజాలఁడు నీతిబాహ్యుఁడెవఁ డీశా! రామచంద్రప్రభూ!
49. మ. అఱపద్దెంబున ధర్మ మెల్లఁ బ్రతిపాద్యంబౌనటు ల్పూజ్యులౌ
పరుషు ల్పూర్వులు వల్కినారు - కననౌఁ బుణ్యంబు నన్యోపకా
రరతిం, బాపము నన్యపీడన మెనర్పం గోరఁగా - నం చిఁకన్
దరియింపం బెఱబోధ మేల? మహితాత్మా! రామచంద్రప్రభూ!
50. మ. తిరమౌ నింద్రియనిగ్రహంబు, దమ, మస్తేయంబు, శౌచంబు క్షాం
తి, రుషాభావము, బుద్ధి, మంచిచదువు, ంధీర్త్వము, న్సత్యమున్
వరధర్మంబులటంచు ఁదొంతి స్మృతి తా వాక్రుచ్చు స్పష్టంబుగాఁ;
దరియింపం బెఱబోధ మేటికి? మహాత్మా! రామచంద్రప్రభూ!
51. మ. ధరణి న్మానవుఁ డేయుపాయముననో తా నెట్టిదౌడేహినో
పొరయంజేయవలె న్ముదం; బదియె యౌ బూర్ణేశ్వరారాధనఁ
బరయంగా; నని శ్లోకమందు నొకధన్యాత్ముండు బోధించెడున్;
ధరియింపం బెఱబోధ మేల? పరమాత్మా! రామచంద్రప్రభూ!
52. మ. ధరలో శూరుఁ డనంజితేంద్రియుఁడె సద్ధర్మంబుల న్నిత్య మా
చరణంబందునఁ జూపువాఁడె కృతి వాక్శౌండుండు సత్యోక్తియే;
యరయ న్భూతదయాగరుష్ఠుఁడె వదాన్యాగ్రేసరుం డండ్రుగా
తరియింపం బెఱబోధమేటికి మహాత్మా! రామచంద్రప్రభూ!
53. మ. అనుశంబు న్సుఖిఁ జూచి మైత్రి, కృప దుఃఖార్తు న్విలోకించి పు
ణ్యుని వీక్షించి ముదం, బపుణ్యుఁ గనుచో సోపేక్షతావృత్తి భా
వనలీమాడ్కిని బోవుచో నొదవు సుస్వాంతప్రసాదం బటం
చను సూత్రం; బదినాకు నీ వొసఁగవయ్యా! రామచంద్రప్రభూ!
54. మ. అది ఇమ్మంచు ని దిమ్మటంచు నిను నే నర్థింపఁగా నాకెదన్
బెదరౌ; దానను నాకు మే లగునొ పిర్వీఁకౌనొకించిజ్జ్జుఁడన్
విదితం బౌ నెటు నాకుఁ? గాన, నెది గావింపంగ నీకిష్టమో,
యదె కానిమ్మని వేఁడుకొందుఁ బరమాత్మా! రామచంద్రప్రభూ!
55. మ. శివునిం జూడ నటంచు వైష్ణవుఁ, డిఁక న్శ్రీజాని నేఁ జూడ నం
చు విరోధంబున శైవుఁ, డందు; రెదలోఁ జూడంగ లే దిర్వురం
దెవఁడు న్వారియధార్థతత్వ; మదియే వీక్షించుచో నేకమౌ
శివుఁడు న్నీవును సర్వదైవములు న్శ్రీరామచంద్రప్రభూ!
56. మ. మనముం జూడఁ బ్రమేయమైన; దిఁక నీమాహాత్మ్యమో! కాలదే
శనిమిత్తంబుల దాఁటియుండుఁ; గనుక న్స్వాంతంబున న్నిన్నుఁగాం
చ నశక్యం; బది గిద్దలోపలను గుంచంబు న్గుదింపంగఁజూ
చినయ ట్లుండును హాసపాత్రమగుచు న్శ్రీరామచంద్రప్రభూ!
57. శా. కాన న్వచ్చియు బాహ్యభేదములు డెక్క న్బత్రవర్ణాదుల
న్లోనన్ గ్రంథముమాత్ర మేకమయియుండుంబెక్కిటన్; బాహ్యమౌ
వానిం ద్రోసి మతంబులం గనిన లోభాసిల్లు తత్వం బటే
కానంగా నగు నొక్కతీరున శుభాంగా! రామచంద్రప్రభూ!
58. శా. స్వామీ దిక్కిఁక నీవె నాకనెడువిశ్వాసంబుతో స్వీయమౌ
సామర్థ్యంబును వమ్ముసేయక ధృతి న్సాంసారికవ్యాపృతి
స్తోమంబుం బచరించుభక్తునకు నీతోడ్పాటు ప్రాప్తించుఁ దా
నేమార్గంబుననో సకాలముగఁ దండ్రీ! రామచంద్రప్రభూ!
59. మ. పరులం దుండేడు తప్పు లెంచి సవరింపం జూచుకంటె న్ననున్
దురితాపేతుని దొల్తఁ జేసుకొను టెంతోమంచి, దే మన్న, న
క్కరిణి న్నేను మెలంగినం, దఱుఁగు లోకంబందుఁ బాపాళి నొ
క్కరుఁ డైన, న్మహి కద్దిలాభమె యగుంగా! రామచంద్రప్రభూ!
60. మ. నిసువుం దల్లి జలంబుతోఁ గడిగి మేనిన్ శుభ్రముం జేసినన్
వెస బూడ్డం బడి వాఁడు చేసికొను దాని న్వెండి యేవంబుగా;
ససిగాఁ జేసి గురుండూ చిత్తమును దాఁ జన్నంత, శిష్యుండు న
ట్లే సుఖాభాసములందుఁ జిక్కి చెడుఁ దండ్రీ! రామచంద్రప్రభూ!
61. మ. సరిగా వంకరఁ దీర్చి కుక్కురపుఁబుచ్ఛం, బద్దివిడ్వంగనే
మరల న్వంకరపోవుఁ దొంటిగతి; నమ్మాడ్కి న్మహాతేజుఁ డొ
క్కరుఁ డేతెంచి ప్రపంచ మచ్చముగఁ దాఁ గావించి యేగంగనే
తిరుగ న్గిల్బిష మంది చెందునది యార్తి న్రామచంద్రప్రభూ!
62. శా. ఎవ్వండైనను జేసె నే నెదియొ దుష్కృత్యంబు గర్వంబునన్
నవ్వంగూడ దొరుండు వానిఁ గని; మానైర్మల్య మిట్టే సదా
దవ్వై మమ్మెడఁ బాయకుండు ననుచు ననుచు న్ధైర్యంబుతో నిల్చి వా
క్రువ్వ న్శక్తులు గారు నీయెదుట నేరున్ రామచంద్రప్రభూ!
63. శా. ఏయేవిద్యల నభ్యసించి తనుచుం బృచ్ఛింప వీవెప్పు, డిం
కేయేసత్కృతు లాచరించి తనుచుం బృచ్ఛింతువే కాని; యెం
తో యాహ్లాదకరంబుగాఁ బలికి తోహో! యంచు నా, కచ్ఛమౌ
న్యాయోపేతచరిత్ర మెచ్చుకొనుదయ్యా! రామచంద్రప్రభూ!
64. శా. ఆయతున్నతు లుండుభూరుహము వాత్యాబాధపాలౌఁ దృణం
బాయసంబును జెంద దట్టు; లటె యౌద్ధాత్యాధికుం డెందెడున్
మాయాబాధలు సంస్కృతి, న్వినయసంపన్నుం డటు ల్గాక తా
హాయి న్జేయును జీవయాత్ర జగదీశా! రామచంద్రప్రభూ!
65. శా. ఔచోఁ గానిస్థలంబున న్నిజమహత్త్వావిష్క్రియోత్కంఠతో
వాచాడంబర మేచి చూప, కితరుల్వాక్రుచ్చువాక్యంపుసా
మీచీన్యంబు గ్రహించి దానివలన న్మేలొందుప్రోడండెపో
నీచిత్తంబున కించిధన్యుఁ డగుఁ దండ్రీ! రామచంద్రప్రభూ!
66. మ. తొలుతం జెడ్డతలంపు పుట్టు; నది తోడ్తోఁ జంపకున్న న్మదిన్
గలుగుం దానికిఁ బుష్టి నిచ్చెడు నసంఖ్యాకంబు లౌభావనల్;
పలుదుర్వాంఛలు గల్గువెంకఁ; గడ కావాంఛల్క్రియారూపమై
కలిగించు న్సుఖనష్టి రెంతను, శుభాంగా! రామచంద్రప్రభూ!
67. మ. మరణం బొందెడువేళఁ, గుత్తుకకు శ్లేష్మం బడ్డమౌవేళ,నం
దరు "నన్నెవ్వరి కప్పగించి చనె?" దన్నాదంబె గావించియే
డ్తురు శాంతిం జననీక; యచ్చటి యొకండు న్నిన్నుఁ బ్రార్థించినీ
చరణాబ్జస్మృతిఁ దేఁడు వానికి! రమేశా! రామచంద్రప్రభూ!
68. మ. తనయిష్టానుసృతి న్గృహంబుఁ దను చిత్తవ్యాపృతు ల్సాగుచో,
మన మత్యంతము శాంతినుంట యది సామాన్యంబే; యింకెవ్వఁడుం
డును శాంతాత్మతఁ గ్రూరకష్టదశయందు న్వాఁడె నీసత్యభ
క్తనికాయంబునఁ జేర్చుకోఁదగు ననంతా! రామచంద్రప్రభూ!
69. అంతస్సార మెఱుంగ సాధనము గాదైశ్వర్యసంపత్తి, య
త్యంతంబైన ప్రలోభకార్థనిచయం బాపత్తులుం గాని; స్వ
ర్ణాంతస్థ్సంబగు నుగ్గుఁగాంచ నొరగల్లౌఁగాని స్నిగ్ధంబు భా
స్వంతంబౌ మొకమాలుగాదు జగదీశా! రామచంద్రప్రభూ!
70. కాంతం గాంచనము న్శరీరసుఖము న్గావంచు వర్జించి నీ
చెంత న్భక్తులు చేరుటేల? యన, నీ శ్రీపాదపద్మద్వయీ
చింతాలభ్యసుఖంబు వానివలన న్సిద్ధించుసౌఖ్యంబుఁ దా
నెంతో మించి యొసంగుచుండుటనే తండ్రీ! రామచంద్రప్రభూ!
71. మ. అనుతాపాగ్ని మదీయకిల్బిషవనం బామూలదాహంబుచే
సినవెన్క న్భవదీయభవ్యగుణసంస్మృత్యాదులం బిట్టు నా
కనులం బుట్టునుసుశీతలశ్రుతతి నాకాఁక న్శమింపంగఁజే
సి, నను న్భక్తి సుదాబ్ధిఁ దేల్పఁగదవే రామచంద్రప్రభూ!
72. మ. అకలంకాత్ముల దీర్ఘజీవనతఁ బుణ్యం బుర్విఁ బెంపొందు; దు
స్ప్రకృతివ్రాతము దీర్ఘజీవనతచే వర్ధిల్లుఁ బాపంబె; కో
రక తీర్ఘాయువు పాపి మృత్యువునె కోరంజెల్లు నద్దానవా
నికి న్యూనాఘపులాభ మౌను గనుక న్శ్రీరామచంద్రప్రభూ!
73. శా. నీపాదాంబుజచింతనాభ్రధునిలో నేస్నానముం జేసి నా
పాపౌఘంబులఁ గడ్డివైచుకొని శుభస్వాంతత న్నిల్చి నీ
రూపంబు న్మదిఁగట్టి మృత్యువును మిత్రుంవోలె రావొయి యం
చాపద్భాంధవ! నిల్చు నిర్భయత నీవా? రామచంద్రప్రభూ!
74. శా. అన్నం బంబువు లగ్ని గాలి పొగబండ్ళాకాశయానంబు లిం
కెన్నో మానవసౌఖ్యసాధనము లీ పృధ్వీస్మృతిం దెచ్చు; ని
ట్లున్న, "న్జీవితమధ్యమందు మృతిలో నున్నను నే" నన్నమా
ట న్నీమాయ జడుండు తామఱచుఁ గట్టా! రామచంద్రప్రభూ!
75. మ. సువిచారంబున నెవ్వఁ డీల్గు టనఁగాఁ జొక్కాల మార్పంచు నెం
చి వపుర్నాశముకై భయంబు మదిలోఁ జెందండొయాతండు మృ
త్యువు నిర్జించినశూరుడే యనఁదగున్, దోఁబుట్టునట్లే యతం
డవలోకించును మృత్యుదేవత మహాత్మా! రామచంద్రప్రభూ!
76. శా. చావుం బొందినవానికై పొగులు చశ్రాంతంబు నిర్వేదమం
దేవాఁడు బడియుండఁ డెప్పతివలెన్ సృష్టిస్థమౌ సర్వముం
బోవు న్సాగి; యటంచు నెంచు నెడల న్బోకాడుఁ దోక్తో(?) నహం
భావం; బంత నరుండు ధన్యుఁడగుజుమ్మా! రామచంద్రప్రభూ!
77. మ. గదిలోనుండి మఱొక్కటౌగదికి నేగ న్రేయి బాలుండు తా
బెదరు న్మధ్యతమఃప్రదేశము సొరన్ భీకారణాభావ మం;
దిదియే మాదిరి మృత్యుభీతి గదురు న్హృద్వీథి నజ్ఞాని కం
చుదితంబౌ నుడి సత్యమైన నుడిగాదో? రామచంద్రప్రభూ!
78. మ. నొగులౌ నెత్తగు రెండుపీఁటలపయి న్గూర్చుండ యత్నించినన్;
వగయౌ నిర్వురు స్వాములం గొలుచు దుర్భాగ్యంబు ప్రాప్తించినన్;
జగతి న్నీకు ధనాధిదేవతకు నర్చల్సేయ నుంకించినన్
సుగము న్మేమటె కోలుపోదు మిట నందు, న్రామచంద్రప్రభూ!
79. మ. తనకే దన్యులు చేయఁగా వలయు నంతాపర్యమో తను దా
నిని జేయ న్వలె వారి; కన్యు లిఁక దేనింజేయఁ దానొచ్చు దా
నిని జేయం దగ దెప్పు డన్యులకు; దీనింబట్టి సాగించు జీ
వన మెవ్వాఁడతఁడౌను రెంతసుఖి దేవా! రామచంద్రప్రభూ!
80. శా. ఏదెట్లుండును మ్రోల నద్దియె యటే వీక్షింప నౌ న్వచ్ఛమౌ
నాదర్శంబున; నట్లె ద్రష్టలకుఁ జిత్తావస్థ యెట్లుండు న
ట్లే దృష్టం బగు లోక మెల్లఁ; గనుకన్ సృష్టీక్షితంబైన దో
షాదు ల్మావియె, కావు దానివి, మహాత్మా! రామచంద్రప్రభూ!
81. శా. కోర న్రా దిహసౌఖ్య మేది నిను భక్తుం; డల్లరాధాంగనా
సారప్రేమయు నిస్పృహత్వ మెద దైవాఱంగ, వాసోజలా
హారాదు ల్సకలంబు నీవె యనుచున్ ధ్యానింప నౌఁ; బ్రార్థనన్
బేరం బాడుట మాకుఁ గూడదు కృపాబ్ధీ! రామచంద్రప్రభూ!
82. శా. శారీరామయపీడఁ బోవును మనస్స్వాస్థ్యంబు; లోలాంబు కా
సారంబట్టుల చిత్త ముండు నెడ ధ్వస్తంబౌను ధ్యానంబు; నిం
డార న్భక్తిఫలంబు నిచ్చుట కవశ్యం బందుచేఁ బూర్ణదే
హారోగ్యం బని పెద్దలందురు రమేశా! రామచంద్రప్రభూ!
83. శా. స్వాసాహారజలంబుల న్మరలఁ బుష్టం బయ్యెడు న్జీవన
వ్యాపారంబుల జీర్ణమై చెడిన దేహాంశంబు; లవ్వానిచే
నేపుం గాంచు మనంబుగూడఁ; గనుక న్హేయార్థనిర్వృత్తికై
మాపం గూడదు భక్తసారము మహాత్మా! రామచంద్రప్రభూ!
84. శా. సంతానార్థమె పెండ్లికాని సురతేచ్ఛాతృప్తిసంభూతమౌ
సంతోషంబున కెప్డు గా దని శ్రుతుల్శాస్త్రంబులు న్జెప్పుటన్
గాంతాభోగపరాయణత్వము నణంగంద్రొక్కి గేస్తుండు తా
శాంతి న్దాంతి గడింపఁ జూడవలె నీశా! రామచంద్రప్రభూ!
85. మ. విమలాంతఃకరణంబు, దేహబలము. న్విఖ్యాతధీశక్తి, ధై
ర్యము, విత్తాఢ్యత, నూత్నకల్పనసామర్థ్యంబు, డేశంబు, స
ర్వముఁ గోల్పోవుటకుం గతం బరయ నార్యస్తుత్యసద్బ్రహ్మచ
ర్యము లేకుంతయె యంచుఁ దోఁచు రఘువీరా! రామచంద్రప్రభూ!
86. మ. క్రిమిసందోహమువంటిసంతతి, కభుక్తిన్దేశ మందెల్లఁ బ్రే
తము లట్లుండెడు వారికిం గొద వొకింతన్లేదు! సద్భ్రహ్మచ
ర్యము తర్వాత గృహస్థులై కనిన శౌర్యస్ఫీతులౌ వారు మా
త్రము కన్పింపరు నిన్నుబొంట్లు మహితాత్మా! రామచంద్రప్రభూ!
87. శా. వాసంబందునఁ బెద్దవారినడత ల్వైవాహికాచారముల్,
గ్రాసంబందున లేమి నేమము, లసద్గ్రంధాదులు, న్రంతుకై
యౌసంకల్పలఘుప్రసంగములు, నిత్యాదు ల్మఱెన్నో శమా
భ్యాసోరుప్రతిబంధకంబు లగు దేవా! రామచంద్రప్రభూ!
88. శా. నీరాహారసుషుప్తివాంఛల నెటుల్నిర్జింపలేఁడో నరుం,
డారీతి న్వనితాభిలాషయును దానడ్డంగలేఁ డంటని
స్సారాసత్యపుమాట కానియెడ, భీష్మప్రాయులైనట్టిలో
కారాధ్యు ల్భువి నుంటసాధ్య మిపు డెట్లౌ? రామచంద్రప్రభూ!
89. శా. హిందూదేశపుఁ బ్రస్తుతస్థితికి నెన్నేఁ గారణాలున్న; విం
కందు న్బాల్యవివాహము ల్కనఁగ మూలాధారము ల్పల్విస
స్తందోహంబుల కంచుఁ జెప్పుదురు పెద్దల్పెక్కు; రామాట ని
స్సందేహం బని నాకుఁ దోఁచెడు రమేశా! రామచంద్రప్రభూ!
90. మ. తినునాహారముఁబట్టి యుండు మనము న్దేహంబు; జిహ్వేంద్రియం
బును స్వాధీనము చేసికొన్న నిరతంబు ల్వశ్యమై యుండుఁ; గా
వున, నద్దానిని బ్రహ్మచర్యనియమంబు న్నిల్పుకోఁజూచువాఁ
డు నిరోధించుక వర్తులన్వలయు నెప్డు న్రామచంద్రప్రభూ!
91. మ. శమసంపత్తి, చిరాయు, వద్భుతమనీషాశక్తి, యారోగ్యతే
జముఁ ద్వత్సృష్టిరహస్యవేత్తృతయు, నిచ్ఛాసత్వంపుబెంపు, స
త్యముగా నిన్ను నెఱుంగఁజాలు మహితత్వంబు, న్సదాబ్రహ్మచ
ర్యమునం గల్గు నమూలలాభములు దేవా! రామచంద్రప్రభూ!
92. మ. విమలస్వాంతత నిన్నుఁ గొల్వనొ, రుజావృద్ధత్వపీడార్తులౌ
తమవారిం బరిచర్యలం దనుపనో, దైన్యస్థమౌనాత్మదే
శము సేవింపనొ, పెండ్లిమానుకొని యిచ్ఛాపూర్వకబ్రహ్మచ
ర్యముతో నుందురు కొందఱుత్తములు దేవా! రామచంద్రప్రాభూ!
93. శా. తన్నట్లే సకలేతరోరుతరభూతవ్రాతముం జూచుకొం
టెన్నం గష్టతమంపుఁగృత్య మగుచో నిం కన్యజీవాళియం
దు న్నైసర్గికవృత్తిమైఁ బొడమునా దుర్ద్వేషభావంబుతోఁ
దన్ను న్భక్తుఁడు చూచుకోవలయు సీతారామచంద్రప్రభూ!
94. మ. వినయం బున్న సమస్తసద్గుణము లావిర్భూతమౌ నద్ది భ
క్తున కావశ్యక మైనలక్షణము తన్మూలంబుపై నిల్చుఁ ద
క్కినయాధ్యాత్మికవృద్ధి యంతయును ముక్తింగూర్చుసామాగ్రియున్
ఘనసౌధంబు పునాదిపైనె నిలుచుంగా! రామచంద్రప్రభూ!
95. మ. ధనవిద్యాదుల పెంపుచే నర్న కౌద్ధత్యము రానున్నచోఁ
దనకంటె న్బలవత్తరుం దలఁచి డిందంజేయ నౌ దాని; నిం
కను గష్టంబులఁ గల్గకుందు నడఁపగానౌఁ బ్రపంచంబులోఁ
దనకంటెం బృధుకష్టజీవిఁ గని; సీతారామచంద్రప్రభూ!
96. శా. రానున్నట్టి విపత్తుల న్నరుఁడు నేరం డడ్డి యాఁపంగఁ దాఁ
గాన, న్వానిని ధీరచిత్తతఁ సితిక్ష న్సైఁచుకొం టొప్పు; నేఁ
డేని న్నీరధిఁ గూలి వీతధృతియై యిట్టట్టు తాఁ గొట్టుకో
కానీటం బడియున్నఁ దేలి మను నీశా! రామచంద్రప్రభూ!
97. మ. శ్రమ మెంతెక్కువయైన దానింవెనుకం బ్రాప్తించు సౌఖ్యంబు గా
టమె యౌ నంతగ; నిన్నె నమ్ముకొనియుంటం గల్గు మోదంబుతో
సమమౌ మోదము లేమి, నద్ది యగుఁ గష్టం బందునేకానఁ, గ
ష్టములే భక్తులు కోరుకొందురెపుడీశా! రామచంద్రప్రభూ!
98. మ. ఎవఁడుం దాఁ దసచర్మచక్షువులతో హృద్భావనాతీతమౌ,
రవికోటిద్యుతి మించుదీప్తి గలదౌ బ్రహ్మాదిదేవార్చ్యమౌ
భవదీయాకృతిఁ జూడలేఁ డని కృపన్భావించి యపప్పు డీ
వవతారంబుల నెత్తుచుందు పరమేశా! రామచంద్రప్రభూ!
99. శా. "నీపాపంబులఁబట్టి నీగతులు నిర్ణీతంబులౌ" నందువే
నోప న్నే నిలువంగ నీయెదుట న్యాయోద్వృత్తికిన్! నీవిఁకే
పాపుఘం బవలీలక్షాళిత మొనర్ప న్ద్క్షమౌ సత్కృపా
కుపారం బవు! నన్నుఁబ్రోవభారమొక్కో? రామచంద్రప్రభూ!
100. శా. "నీకర్మం" బని కన్ను దుడ్చి చను, దంతేకాని నీవే సదా
వాకు న్భావముఁ గర్మము నండపి సర్వప్రాణులం ద్రిప్పు దీ
లోకంబందున; నిద్ది దూషణముగా లోనెంచి కోపింపక
య్యా! కేల్మోడ్చి నమస్కరింతుఁ బరమాత్మా! రామచంద్రప్రభూ!
101. కం. వందనము సుందరాంగా!
వందనము మపవర్గసౌఖ్యవరదాయి! ప్రభూ!
వందనము దేవదేవా!
వందన మోజానకీధవా! శ్రీరామా!
102. కం. వందన మానందాత్మక!
వందన మోచిత్స్వరూప! వందన మభవా!
వందనము భక్తకల్పక!
వందన మఖిలప్రపంచపాలక! రామా
103. కం. శ్రీరామా! శ్రీరామా!
శ్రీరామా! రామ! రామ! శ్రీరఘురామా!
శ్రీరామా! శ్రీరామా!
శ్రీరామా! రామ! రామ! సీతారామా!
సమాప్తం