రాధామాధవసంవాదము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

రాధామాధవసంవాదము

ప్రథమాశ్వాసము

క.

శ్రీరుక్మిణిమనోహర, కారుణ్యసుధాసముద్ర కంసమథనయ
క్రూరాంబరీషసుజనా, క్రూరచిదానంద కృష్ణగోపముకుందా.

1


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నారచియింపంబూనిన రాధామాధవసంవాదం బను మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టి దనిన.

2


చ.

అనవరతప్రబోధకరమౌ మిథిలాపురమందు నొక్కనాఁ
డనఘుఁడు ధన్యుఁడౌ జనకుఁ డార్యులతో సుఖలీల నుండి సొం
పున సకలావతారముల పుణ్యకథ ల్వివరింప వించు నా
చనవున వేఁడెఁ గృష్ణుకథ సత్యనిధిన్ శుకయోగిరాయనిన్.

3


చ.

అడిగిన భక్తితోడఁ బులకాంకితుఁడై నయనాంబుజంబులన్
వెడల యుదంబుధార యదువీరుని గృష్ణుని సన్నుతింపఁగాఁ
బడసితి నెంతభాగ్య మని పద్మదళాక్షుఁ దలంచి మ్రొక్కుచున్
బడలిక దీఱఁ బాపములు వాఱఁగ భాగ్యము చేర నిట్లనెన్.

4


గీ.

జనకరాజేంద్ర వినవయ్య సావధాన, మతిని గృష్ణునిచరితముల్ మహిని విందు మవి రుచింపవు మాకు మాయనుభవంబు, చెలగుశృంగారరూప మౌఁ జిత్తగింపు.

5


మ.

యమునాతీరమునందు బృందదరి బాగౌపల్లె వ్రేపల్లె నా
నమరున్ గొల్లలపల్లె తజ్జనులభాగ్యం బెంతవర్ణింతు మొ
ల్లముగా నందఱుఁ గొల్లలాడుదుఱు పాల న్నేతఁ దన్నేతయై
యమితానందుడుఁ నందుఁ డందు దగు దేవాధీశభోగంబులన్.

6


సీ.

తీరుగాఁ గైసేయు తేరులచందానఁ, బొదుగులతోడి యాఁగదుపు లమరఁ
గనుఁగానక మదించుగజములకైవడిఁ, గొమ్ములవృషభము ల్కొమరుమిగులఁ
జివ్వకు నటు కాలు ద్రవ్వువీరులరీతిఁ, జలపోరి పెనగుకోడెలు చెలంగఁ
చెంగున దాఁటుతురంగంబులవితానఁ, జురుకైనలేఁగలు సొంపుమిగుల

గీ.

వదియె చతురంగబలములై యతిశయిల్ల, మొల్లమై యున్నవ్రేపల్లె నల్లుకొన్న
ఫలితవనములు కోటలై పరిఢవిల్లు, నందుఁ జెలువొందు నందుఁ డానంద మొంది.

7


క.

ఒకపశువుఁ బ్రోచువానికి, సకలఫలంబులును గల్గు సంతతమును కో
టకు మించు పశుగణంబులఁ, బ్రకటంబుగఁ బ్రోచు నతనిఫల మే మందున్.

8


గీ.

అతని పుణ్యంబుననొ లేక యతనిపుణ్య, పత్నియగు యశోదాదేవి భాగ్యముననొ
కృష్ణుఁ డుదయించె వారి కింకేమి తెలుప, జలజనయనునిభక్తవాత్సల్యమహిమ.

9


చ.

చిగురులపాదము ల్కళలఁజిల్కెడు వ్రేళ్ళు నొయారిపిక్కలున్
జిగితొడ లందపుంబిఱుఁదుఁ జెన్నగుబొజ్జ వెడందఱొమ్ము బా
గగుకరము ల్నునుంగళము నద్దపుఁజెక్కులు నవ్వుమోము తే
టగుకనుదోయి ముద్దుగురియన్ బెరిఁగెన్ హరి యందు బాలుఁడై.

10


సీ.

పట్టాభియోగసౌభాగ్యము ల్దిలకించి, నందుండు సంతతానంద మొందఁ
దొట్రుపల్కులు ముద్దుదొలఁకునవ్వులు గాంచి, మురిసి యశోద సమ్మోద మంద
నవమోహనాంగసౌందర్యంబు భావించి, పసిగాఁపుగుబ్బెతల్ పైఁబడంగఁ
బూటపూటకు వృద్ధి బొందురూపముఁ జూచి, జను లెల్ల నాశ్చర్యమునఁ జెలంగఁ


గీ.

దలిరువలె గోమునై మొగ్గవలెను సోగ, యై యలరువలె మృదువునై కాయవలెను
బెక్కువై పండువలె నెఱచొక్క మగుచుఁ, దేనెవలెఁ దేటయై శౌరి తేజరిల్లె.

11


ఉ.

అప్పుడు లేఁతప్రాయమున నాడుచు నందునిముద్దుఁ జెల్లెలౌ
కప్పురగంధి రాధ యనుకన్నియ యొక్కయనామధేయుఁ భి
న్నప్పుడె పెండ్లియాడి మగఁడం చని చూడదు వాని వాఁడు నా
యొప్పులకుప్పఁ గన్గొనఁగ నోడును వ్రీడను గొల్లవెఱ్ఱిచేన్.

12


క.

వెన్నెలను జలువ పుట్టిన, చెన్నునఁ బువ్వులను దావి చెలఁగినరీతిన్
గన్నియసకలాంగంబులఁ, దిన్నఁగ నొకవింత వొడమె దినదినమునకున్.

13


క.

వనిత తనుఁదానె చూచుక, తనలో దా నుస్సు రను వితాకై తనకున్
దనసొగసుకుఁ దనముచ్చట, కనువైనప్రియుండు లేని యారాటమునన్.

14


క.

తొల్లి తప మేమి చేసెనొ, కొల్లగఁ బసిబాలుఁ డైన
గోపాలునితో
మల్లాడుచు నెల్లప్పుడు, చెల్లాటల నుండు రాధ జిలిబిలి తమిచేన్.

15


క.

బాలుఁ డగు శౌరి నెత్తుక, హేలాగతి ముద్దులాడు నేప్రొద్దు వృథా
కాలక్షేపంబునకును, జాలక రాధాలతాంగి చాలవిరాళిన్.

16

ఉ.

భావిఫలాభిలాషమున బాలుని కేమఱ కుగ్గు వెట్టు బె
య్యావులపాలతో జలకమార్చును దాఁ దొడనుంచి యేమిచూ
చేవని నవ్వుచున్ బయఁటచేఁ దడియొత్తి సిరామరక్షతో
గావుగఁ జుక్కబొట్టు నొసలన్ ఘటియించి కదించు నుయ్యెలన్.

17


ఉ.

 నావెలలేనిమానికమ నాతొలినోములమెట్టపంట నా
దేవుఁడ నామనోరథముఁ దీర్ప జనించిన చక్కనయ్య నా
జీవనజీవనంబ యదుశేఖర యించుక నిద్ర పోఁగదే
యో వెడమాయకాఁడ! యని నుయ్యెల నూఁచును రాధ మాధవున్.

18


గీ.

ఏమఱించి కృష్ణుఁ డిండ్లలోఁ జొరఁబడి, యున్న పాలు పెరుఁగు వెన్న నెయ్యి
కొల్లలాడుచుండ గోపిక లొకనాఁడు, దొమ్మి గూడి రాధతోడ ననిరి.

19


క.

ఉట్లపయి నున్న వెన్నల, చట్లెల్లను గొంచుఁబోయి సంగాతులతో
నాట్లాడఁదొడఁగె మాబ్రతు, కెట్లా కడవెళ్ళునమ్మ యిట్లాగయినన్.

20


క.

ముద్దిమ్మని బలిమిని మా, ముద్దియచే నున్నవెన్నముద్దలు గొనె నీ
ముద్దులబాలుఁడు నీ కిది, ముద్దయినన్ కొమ్మ మాకు ముద్దటవమ్మా.

21


క.

బంతులటంచును జెలిచను, బంతులు బిగిఁబట్టి లేదు బంతి యటంచున్
గంతులు వైచె చను మముఁ గని, కాంతా యిటు తగునె యెంతకలవారలకున్.

22


క.

మందకుఁ జని రాఁగను మా, మందగమన నాఁగి నీదుమగఁ డెవఁ డనుచున్
గందువమాటల నడిగె, న్నందమె మనజాతి కిట్టి యాగడము చెలీ.

23


క.

నీవైన బుద్ధి తెలుపుము, నీవలనను గాకయుండె వేమె యశోదా
దేవికి దెలిపెద మనఁగా, నావేళకుఁ బులిమిపుచ్చి యారాధ వడిన్.

24


క.

ముద్దిచ్చును గోపాలుఁడు, వద్దను నడయాడుచున్నవార్తలు విన్నన్
గద్దించును లేదన్నను, బద్దించును జూడకున్నఁ బరితాపించున్.

25


ఉ.

ఓయి మనోహరాంగ పని యున్నది పోయెదుగాని యిట్లు రా
వోయి మహానుభావ యని యూరక పిల్చును బిల్వ నేమి రా
ధా యని యాతఁడున్ బలుకఁ దా విని నవ్వును వేగ నిందు రా
కోయి భుజింపఁగా వలదటోయి యటంచు వచించు బాలితోన్.

26


చ.

పడుచులతోడ నాడ పసిబాలుఁడవా వలదన్న మాన వా
గడములు కొన్ని నేర్చితివి కల్లరి వైతివి కొల్లకాఁడ వై

దుడుకులు సేయసాగితివి దొంగిలఁజొచ్చితి వేమి తెల్పినన్
వడిగఁ బరాకు చేసికొని వాకిటి కేగెదు పిల్వఁబిల్వఁగన్.

27


ఉ.

బుద్దులు దెల్పఁబోవుగతిఁ బూనుక కన్నులు పుల్ముకొంచునే
ప్రొద్దున లేచి యిండ్లఁబడి పోయెద వమ్మకచెల్ల పిన్నవుం
బెద్దవుఁ గావు బువ్వ దీనిపించెదఁ జక్కనిసామి రార నా
ముద్దులకృష్ణ రార యని మ్రొక్కుచుఁ జీరును రాధ మాధవున్.

28


ఉ.

అల్లుఁడ దొండపండు వలెనా యని వాతెర యాన నిచ్చు నీ
కొల్లవె పుట్టచెండు నివిగో యని చన్గవఁ బట్ట నిచ్చు రా
గిల్లి మయూరపింఛ మడిగేవని పెన్నెరు లంట నిచ్చుఁ బో
కల్లరి యంచుఁ గృష్ణుఁడు నగ న్నగి రాధ యదేమిరా యనున్.

29


సీ.

తీరుగాఁ కస్తూరితిలకంబు దిద్దుచో, గమకించి నెమ్మోముఁ గదియఁ జేర్చు
హొయలుగా గంధంబు మెయినిండఁ బూయుఁచో, బరికించి యిక్కువల్ గరగనంటు
మెలపుగా సిగను బూవులదండ చుట్టుచో, బులకించి కుచము వీఁపున ఘటించు
హరువుగాఁ గైసేసి యుద్దంబుఁ జూపుచో, దిలకించి తనమోముఁ దెలియఁజూపుఁ


గీ.

జెలఁగి మాటాడబోవుచోఁ జెక్కు గీటు, బిలిచి వీడెం బొసంగుచోఁ బెదవిఁగ్రోలు
గదిమి పైఁబడఁ దిగుచుచోఁ గౌఁగిలించు, దమి మనంబున నాఁటి రాధావధూటి.

30


క.

కడిమాడ సేయు భోజన, మిడుఁ బిడికిట నిముడు వలువ లిచ్చును బెడఁగౌ
తొడవులు దొడుగును బడిబడి, గడెగడె కొకవింతెసొగసు గావించు హరిన్.

31


సీ.

ఎవతెతో సయ్యాట మింటిలోన నటంచు, భయపడ వదలించు బైటనుండి
చంటిఱైక సడల్చి జారుపైఁట ఘటించి, యేది బాగని వేఁడు నెదుట నిల్చి
వాకిట మగవారు రాకుండ నిలుమంచు, జలువకోక ధరించుఁ దలుపుమూల
దాఁగనేరవు పల్కుదారి గాదని దూరు, వలదని మురిపాన వద్దఁ జేరు


గీ.

నాఁడునాఁటికి గోపాలుఁ డీడు మీఱి, తొలుత నూనూఁగుమీసాలతోఁ జెలంగఁ
బదరి మునువలెఁ బైబక్కఁ బడఁగ నళికి, బెళకు వగఁగుల్కు మరునికి బెదరి రాధ.

32


క.

ఆరాధమనోజవ్యధ, నీరీతుల నిరుగుపొరుగు లెఱుఁగక యుండన్
గారాబు సేయఁ గృష్ణుఁడు, చేరక తా నది పరాకు చేయుచునుండెన్.

33


సీ.

తొలుదొలఁ బసిగాపుఁ గులుక గుబ్బెత యొంటి, పాటైనమోము తప్పకయె చూచుఁ
జూపు వెంబడిఁ దన్నుఁ జూచి సిగ్గున నిల్వ, దల యూఁచి కోరికల్ దెలియ నవ్వు
నవ్వు వెంబడిఁ బిన్ననాటిమచ్చిక లెంచి, నను నయో దయ జూడ వనుచుఁ బలుక
బలుకు వెంబడి గేలఁ బైఁటకొం గెడలించి, నునుజన్ను లాన ఱొమ్మునకుఁ జేర్చు

గీ.

జేర్చి మునిపంట జిగిమోవిఁ జీరనొక్కు, నొక్కి సొక్కించి మరుకేళి స్రుక్కఁజేయుఁ
జేసి కనుమాటి యింటికిఁ జేరనరుగు, నరిగి తనుగానిరీతి తనంత నుండు.

34


క.

ఆచిన్నెలు సవసవఁగా, జూచాయఁగ విని చలించి స్రుక్కినరాధన్
జూచి యదేమే రాధా, నాచాయన్ సిగ్గువడెదు నాహరి కనియెన్.

35


సీ.

చెంత నీవును లేక చింతతోఁ బవళించి, నిదురబోవుచునుండ నిన్నరేయి
కలలోన నొక్కచక్కనిరాచకొమరుండు, దోఁచె నెవ్వఁ డటంచుఁ దెఁచదాయె
నొకకొంతసేపు తప్పక చూడఁజూడంగ, నీపోలికై యున్న నీవటంచు
రార కృష్ణాయని బారతోఁ జేసాప, నేమె రాధాయని యెదురుకొనుచు


గీ.

నెనసి యేమేమొ వింతగా నింపొనర్చె, నంత మేల్కాంచి నినుఁ గాంచి యది తలంచి
మురిపెమున నిన్నుఁ జూడక మోమునంచు, కొంటి నాసిగ్గు నేమనుకొందు నోయి.

36


మ.

అనినం బక్కున నవ్వ చిక్కితివి రాధా సాధువే యంచు నుం
టిని నీనాథునిమీఁదిప్రేమ వినగంటిని దుంటవిల్దంట వెం
టనె యంట న్ననవింటితూఁపు లెద నంటన్ దుంట లింకేల నీ
ధ్వని వాచారసభావభావభవగాథల్ నీ వగ ల్దెల్పెడిన్.

37


క.

విరిదాఁపఁ దావి దాఁగునె, పరిపరి పలుకేల నిజము పలిగితి వౌ నౌ
ధర వినమె “సత్యవాణీ సరస్వతీ" యటన్నమాట చడువులలోనన్.

38


క.

అని పల్కు శౌరిపలుకులకును మెచ్చుచు నిన్నినాళ్ళకును నీవైనన్
మన సెఱిఁగి చిక్కఁబట్టితి, తనుఁ బో యని కృష్ణం తోడఁ దా ని ట్లనియెన్.

39


సీ.

కండచక్కెరపానకంబు గావలెనందు, వది గోర వేమిరా యంబుజాక్ష
రంగుబంగరుబొంగరాలు గావలెనందు, వవి గోర వేమిరా మదనజనక
యిసుకతిన్నెలమీఁద నెక్కిగావలెనందు, వది గోర వేమిరా మదనరూప
తోడిబాలురతోడ నాడగావలెనందు, వది గోర వేమిరా యమర వంద్య


గీ.

తియ్యునై యున్న యలమోనితేనె వలతొ?
జంటగొనియున్న యలచన్ను లంటవలతొ?
త్రొక్కి కదసినపిఱుఁదుల నెక్కవలతొ?
జోడువాయక స్త్రీలతో నాడవలతొ?

40


ఆ.

నీకువాడమెల్ల నిన్నరాతిరి గంటి, నమ్మచెల్ల న్నిను నమ్మరాదు
నవ్వు గాదు రేయి నా ప్రక్కలోనుండి, కలువరించలేదె చెలులనెల్ల.

41


ఉ.

అందుల కాసయేని మగవాండ్రపయిం బడి దూరు వొందఁగా
నెందుకు కంటి కింపయినయింతుల నల్గురఁ బెండ్లి సేయవో

పొందుగఁ బ్రొద్దుపోకలకుఁ బూనితివేనియు మేము నేరమో
యందఱవంటిముచ్చటలు నాటలు పాటలు నోటిమాటలున్.

42


క.

చిన్నప్పుడె యెడఁబాయక, కన్నుల నిన్నెపుడుఁ జూడఁగలిగుండును నేఁ
డెన్నంగ నీదుసముఖము, క్రొన్నెలపొడు పయ్యె గగనకుసుమం బయ్యెన్.

43


చ.

అరమరలేక నీకొఱకు నల్లికబిల్లికగా వసింతు మి
ద్దఱ మపు డెవ్వరున్ మనలఁ దాఁకి తలంపరు నేఁడు వింటివో
మఱి వినలేదొ యీజనులమాటలు వాడల నాడ నాడ నీ
పరువులు చూచి నాపయిని పాపముఁ గట్టి రిఁ కేమి తెల్పుదున్.

44


క.

మచ్చరమున నొక రనుకొన, నొచ్చెము నాయందుఁ గలదె యొకనాఁడైనన్
ముచ్చటగా నినుఁ గౌఁగిఁట, గ్రుచ్చితినో లేనిచొరవకుం జొచ్చితినో.

45


క.

నే నిందుకొఱకె నవ్వస, హా నోడుదు వట్టినింద లందితి నయ్యో
యైన దిఁక నాయె నందుకె, పూనుద మందఱకుఁ గన్ను పొడిచినరీతిన్.

46


క.

నామనసులోనికోరికి, సీమజనంబులె నిజంబు చేసిరి మన కీ
నీమం బెందుల కీవఱ, కేమాయెను గొదవ లోకు లిటులాడుటచేన్.

47


సీ.

చూడనేర్చిననాఁడె సొలపుగా మునుమున్నె, చేరంగ ననుఁ గటాక్షించినావు
నవ్వనేర్చిననాఁడె ననువుగాఁ దొలుదొల్త, నాతోడ వగగుల్క నవ్వినావు
పల్కనేర్చిననాఁడె భావంబుగా ముందు, నత్త త్త రమ్మని యాడినావు
నడవనేర్చిననాఁడె నమ్మికగాఁ దొల్త, దొడరి చేపట్టి కాల్ ద్రొక్కినావు


గీ.

నాఁడు సేయనియోజన నేఁడు గలదె, మరుఁడు దైవంబు సాక్షులు మనమనములు
విను సదాచారనిరతులు విబుధులైన, ఘనులు తారాశశాంకులు గాదె మనకు.

48


చ.

అన విని రామ రామ యిటు లాడఁగఁ జెల్లునె నీకుఁగాక నా
మన సరయందలంచితివొ మక్కువతోఁ గరుణించి నీవు పెం
చినతను వింత నీ వగడుసేసిన కాదనువార లెవ్వ రిం
దున కొడిగట్టినన్ వెనక దోసము గాదఁటె రాధికామణీ.

49


క.

నీతోడఁ జర్చ సేయఁగ, బోతే నామనసు కొకటి పొడమినఁ బొడమున్
నీతోడఁ బలుకరా దిఁక, వాతప్పితి మొదలఁ బడుచువాఁడను నేనున్.

50


క.

అని విఱుగ నాడి యంతనె, తనసంగడికాండ్రు పిలువ, దా నాపలుకుల్
విని హో యని యెలుఁ గిచ్చుచు, వనజాక్షుఁడు వెడలె మరల వచ్చెద ననుచున్.

51

చ.

రమణియు నంతఁ లేదొరకురత్నము నాఁచుకపోయినట్టు లోఁ
గుములుచు నేరికిన్ దెలుపఁగూడక దొంగను దేలుగుట్టు చం
దమునఁ దపించుచు న్నలిననాథుఁడు మున్ విడనాడినట్టివా
క్యములకు సంగతుల్ తఱచుగాఁ దలబోయుచుఁ జింత సేయుచున్.

52


గీ.

పొరుగులిరుగులచెలులతో బోయె ననుచు, గొండెములు దెల్పును యశోద కోపగింప
శౌరి రూపింపుమని తన్నుఁ గోర నెవరి, నడుగవచ్చెదు పడుచుల నడుగు మనుచు.

53


సీ.

పనిలేనిపని జారుపైఁటతో నడయాడు, ముసిముసినగవుతో మోము వంచు
గడెగడె కొకవింతగా మేనుఁ గైసేఁయు, దోడిబోఁటుల వృథా దూరి పలుకుఁ
బలుమారు ముంజేతిచిలుకను ముద్దాఁడు, గని కాననటులఁ గ్రేగంటఁ జూచు
నొంటిపాటైనచో నుస్సురు మని నిల్చు, దనుఁజూచునెడ గిరుక్కున దొలంగు


గీ.

నవల నివలను గుసగుసల్ సవసవలుగ, వినియు వినములుగాఁ జేసికొనుచు మొదటి
నీటులకుఁ బోక పోవక నిలువలేక, మురియు నీలీల గోపాలుమ్రోల రాధ.

54


క.

డాయు ననుఁ జెంతఁ బిలిచితి, వాయను నిన్నేనుఁ బిల్వ నంచన నట్టే
పోయి నునుబువ్వు లివి వలె, నే యనునవి వలదటన్న నిఁక నెట్టు లనున్.

55


ఉ.

ఘల్లున మ్రోయ వందియలు గజ్జలు మువ్వలు సందడింపఁగా
వల్లనిమేనుడా లమర నవ్వుచు నల్లన నీవు రాఁగ రా
గిల్లుచు రబాతో దిగియ గిల్లెద వేమిర మెల్ల మెల్లనే
యల్లుఁడె యర్ధ మియ్యమని యందురు గావున నెవ్వఁ డేమనున్.

56


క.

రారా నందకుమారక, రారా నవనీతచోర రారా కృష్ణా
రారా రాజులయేలిక , రారా ముద్దులమురారి రారా శౌరీ.

57


శా.

రారా నందకుమార రార యదువీరా రార రాకాసుధా
ధారాకార మనోహరాంగ దయలేదా యైన నాయింటికిన్
రారాదా నినువంటివాని కిది మేరా నిన్ను నేమంటిరా
యేరా నీదగుజుంటితేనెతెరమో వీరా మనోవల్లభా.

58


చ.

ప్రకటమనోజరూప పసిబాలుఁడ వంచును నమ్మి ప్రక్క నుం
చుక నిదురించఁగాఁ బుణుకుచున్ గుచముల్ బిగఁబట్టి మేను మే
నికిఁ గదియించి పల్పెదవి నిల్పితి వేమిర మేనమామపో
లికలకుఁ జొచ్చినాఁడవొ? భళీ యనుచున్ దలయూఁచి నవ్వుచున్.

59

గీ.

ఒంటి నెదురైన రాధ యోరోరి కృష్ణ, దాళు తాళు మటంచనఁ బాళు శౌరి
పదుగు రున్నప్పుడొకమాట పైఘటించి, తాళు తాళు మటంచనుఁ దనకుఁ దానె.

60


చ.

విడు విడు నీ కొసంగ నని వేఱొకబాలున కొక్కతియ్యమా
మిడిఫల మీయఁబోవ బలిమింగొని తా మొనపంట నొక్కి గ్రు
క్కెఁడురస మాని సీత్కృతు లొగిం జెలఁగం దల యూఁచి చూచెఁ గే
రడమున రాధికామధురరాగసుధాధర వీటి సారెకున్.

61


క.

ఆముద్దు చూచి రాధిక, యేమఱితి నదేమి చూచి తీవన నగి నే
నేను నినుఁ జూచినట్టులు, నీమనసునఁ దోఁచెఁ దెలుపు నీవని వేఁడన్.

62


చ.

తెలిపెద రమ్మటంచు సుదతీసుణి దుప్పటికొంగుఁ బట్టి లో
పలిపడకింటికిన్ దిగువఁ బద్మదళాక్షుఁడు మోడిమానిసిం
బలెఁ జని తెల్పుమంచనిన మంచిది పానుపుఁ జూడుమన్న ని
శ్చలుఁడయి కొంతసేపునకు జవ్వనిఁ దప్పక చూచి యిట్లనున్.

63


ఉ.

మొన్ననె తెల్పలేదఁటవె మొన్నటి నిన్నటి పిన్నవాఁడ నాఁ
కొన్నను నీవు భోజనము కోరి యిడన్ వలె నెత్తి పెంచినా
వెన్నఁడు లేనిమాట లిటులేటికి నాడెదు మాటిమాటికిన్
గన్నులఁజూడు మల్లుఁడను గానఁటవే యన రాధ యిట్లనున్.

64


సీ.

పసిబాలఁ డందునా పరికింప నూరిలో, నీవు జూడనియట్టి నెలవు లేదు
వగఁ గాన వందునా మగఁడు నీవే యని, నీరాకఁ గోరని నెలఁత లేదు
విననేర వందునా విద్యల యొరగల్లు, నీ వెఱుంగపాటి నీతి లేదు
దయఁ జూడ వందునా ప్రియముతో నయముతో, నీవు లాలింపని నెలఁత లేదు


గీ.

అన్నిటను జాణవే యౌదు వైన నాదు, కూర్మి నెఱుఁగ నిదొక్కటే కొదవ నీకు
నీకు నీయంతఁ దోఁచని నెనరు కలిమి, వచనరచనలఁ దెల్ప నెవ్వరితరంబు.

65


ఉ.

పెంచినదాన నంచుఁ దలఁపించెదు సారెకు సారె నీదు ప్రా
పెంచినదాన నౌదు నిదె యెన్న రహస్యము మావిపిల్కలన్
వంచన లేక పాదినిడి వారక పోషణ చేసి పెంపు గా
వించుట తత్ఫలం బసుభవించనొ యన్యులపాలు సేయనో.

66


మ.

వినరా వావుల కేమి కాముకుల మున్ విన్నాము కన్నాము లే
నినుఁ బోలంగలవానిఁ గాన మవులే నీ నేర్పు లోకంబులె

ల్లను గల్పించినధాత భారతికి యేలా లోలుఁడై వావి గై
కొనఁడాయె న్నిటువంటిసామెతలు నీకు న్నాకు గానున్నవే.

67


ఉ.

లేదని కుందినన్ ఫలము లేదని దైవము దూర నేల? నీ
కే దయ రావలెన్ వెనుక నీవె తలంచుక చేరఁదీవలెన్
కాదని పైకొనన్ వరుస గాదని నిన్నెద నమ్మియుంటి నీ
వే దయ లేక నన్నుఁ గడ కింతకుఁ దెచ్చుటఁ నేఁ డెఱింగితిన్.

68


శా.

ఓహో యత్తను వంటెనేని నతఁ డాయుష్మంతుఁ డౌనంట నా
యూహాలోకము సామెతాయె నన వేదోక్తంబు గాదందువే
నాహా మంచిది భూమిసామికిని నాలై యుండి యత్తౌట సం
దేహాంచా యిది వేదమందె వినవా నీమాట నీకే తగున్.

69


ఉ.

ఎన్నఁడు పెద్దవాఁ డవుదు వెన్నఁడు జాణతనంబు నేర్తు వీ
వెన్నఁడు నామనంబు ఫలియింపగఁ జేయుదు వంచు గోరి నే
నున్నది వల్లవీజనుల యుల్లముఁ జల్లగఁ జేసి మెచ్చుకొం
చు న్ననవింటివానిపని చూఱలు వెట్టుటకా మనోహరా.

70


ఉ.

భూషణభూషి తాంగ పరిఫుల్లసరోరుహనేత్ర నీకు సం
తోషము వచ్చినప్పుడె ననున్ దయజూతువు గాక యూరకే
దోషమటంచు న న్వెతలఁ ద్రోయకు నేనిఁక మాన నీవపు
ర్వేషవిలాసమేఘము భరించెద మత్కుచపర్వతంబులన్..

71


క.

విను కాకుండిన వేఱొక, తనువున నినుఁ జెట్టఁబట్టఁదలఁచెద నపుడున్
వినవేమొ వావివరుసలు, తనువులకర్మంబొ జీవధర్మమొ చెపుమా.

72


వ.

అనిన నబ్బాలికామణికి గోపాలచూడామణి యిట్లనియె.

73


ఉ.

క్రమ్ముక యెన్ని పల్కెదవు కానివిపోనివి గుంపు సేసి వే
దమ్ములు నీతులుం దగవు ధర్మము శాస్త్రములున్ స్మృతుల్ పురా
ణమ్ములు నీకుఁ జక్కవయినన్ వినువారికిఁ జక్కనౌనె నీ
సమ్మతు లూరివారలకుఁ జాటవలెంగద నేఁడు ముందుగన్.

74


ఉ.

మంచితనాన వల్దనినమాటలు నీ కెగబోఁత లయ్యె నౌ
నంచు భవత్ప్రియంబునకు నై వినినం గొఱ గా దిదేల నీ
కించుకవల్ల నేమి యొకయించుక వావి దలంచుకొమ్ము మ
న్నించుము నన్ను ముచ్చటయు నేస్తముఁ జాలదె రాధికామణీ.

75

ఉ.

వెంటనె పాప మేల యవివేకము గట్టెదు వావి గాదు న
న్నంటకు మన్న ఱంతులిడి యల్లునిమంచితనంబు లేదు పొ
మ్మంటివి యత్తసేయుపని కాఱడి లేదనుటే నిజంబు నీ
వంటియభిజ్ఞురాలి కిటువంటివి నుంచి వొకే తలంపఁగన్.

76


గీ.

అవనిఁ గాంతలు స్వేచ్ఛావిహారు లగుట, తెలిసియే కాదె బ్రహ్మ విధించినాఁడు
మగువకొక్కఁడె మగవాఁడు మగఁడు గాఁగ, రాధ యిది ధర్మశాస్త్రవిరోధముగద.

77


వ.

అనిన గోపాలగ్రామణికి రాధికావధూమణి యిట్లనియె.


క.

మహి దేహసుఖ మెఱుంగక, తహతహపడి పరసుఖంబుఁ దాఁ గన కిహమున్
నహి పరము న్నహి యైతే, సహజమ యామగనిఁ గొల్వఁ జలమో ఫలమో.

78


మ.

గతి వీఁ డంచును బిన్ననాఁడు తమవేడ్కన్ బెద్ద లొప్పింతు రె
వ్వతె కెవ్వాఁడు మగండు కొసరు మనోవాక్కాయకర్మంబులం
బతి యెవ్వాఁడని తోఁచె వాఁడె పతిగా భావించునాలే పతి
వ్రత నాసమ్మత మీమతంబు చెడుత్రోవన్ బోవ నే వెఱ్ఱినే.

79


క.

ఒక్కటి గల దైన మనో, వాక్కాయములందుఁ జెడ్డవారలత్రోవల్
ద్రొక్కక మక్కువ నొక్కఁడె, దిక్కని దక్కినదియే పతివ్రత తలఁపన్.

80


క.

మగఁడు మగండని మగువలు, తగవులు నడపినను గాక తమ రొల్లనిచో
నగుఁ గాదని దండించునె, తగవున ధర్మాసనమునఁ దగి మగఁ డోహో.

81


క.

నిను నౌఁ గాదన నేమో, యన వెఱతును గాని మిగిలినందులకైతే
ననువారు వీరు నౌఁగా, దనఁగాఁ బనియేమి యొకరికై బ్రతికెదనే.

82


చ.

బుడుతవు నీ వసడ్డతనముల్ బచరించెదు బుజ్జగించి నే
నడిగినఁ బాపమంచనెర వంతకు నీకుఁ బనేమి నీకుఁగా
బడిబడి బాలనాఁడు మఱి పాలును నుగ్గిడునాఁడు నుగ్గునున్
నడపుచు నేనె పెంతునట నాకు స్వతంత్రత లేకపోయెనే.

83


చ.

పలుకుల కేమి యే వగను బల్కఁగఁజాలవు నిన్ను మించి యు
క్తులు పచరింప నాతరమె తొల్లిటివారలయాడికోలుమా
టలెకద పల్కఁబోయిన నొడంబడికల్ పని గావు నాపయిన్
చలమొ ఫలంబొ యేల కరసానలబట్టెదు మౌక్తికంబులన్.

84


ఉ.

పాపము పుణ్య మేర్పరుపఁ బాల్పడినాఁడవె నీవు నీకు నీ
పాపము లేల నీకొఱకుఁ బైబడి దీనత నొందజేసె నా

పాపము నిన్నుఁ గూడఁగల భామల కబ్బెను బుణ్య మిందుపైఁ
బాపము పుణ్యముం గలదె భావమునన్ బరికించి చూడగన్.

85


శా.

పో నామాటలు పూర్వపక్షములు గాఁ బోనాడి పోనాడి యౌ
నౌ నీమాటలె నిల్పుకొంటి నవి సిద్ధాంతంబుగాఁ జేసి నీ
తో నింకేటివితండముల్ పలుక నేర్తు న్నేఁటితో నిగ్రహ
స్థానం బైతిని నీవి దెల్పుపలుకే శాస్త్రంబు తర్కింపఁగన్.

86


క.

శృంగారకవితవంటిది, యంగన కడుఁబ్రేమచేత నానందముతో
నంగీకరించినం దగు, భంగంబున కోర్వఁగలదె భావజ్ఞనిధీ.

87


చ.

లలితుఁడ వౌదు వంచు మొదలన్ జదివించినదెల్ల నేఁటికిన్
గలిగెను గాళ్ళపైఁ బడినకామినిఁ గాదని వాడ వాడలన్
గలమగనాండ్రకాళ్ళఁ బడఁగాఁ జదు వున్నదె మాట లేల నన్
సొలపునఁ గూడరా మనసుతీఱఁగ జల్లనిమాటలాడరా.

88


క.

అల్లుఁడ వైనందులకున్, జెల్లుగ నుపకార మొకటి సేయుము నామే
నెల్లఁ గడుఁ గ్రాఁగుచున్నది, చల్లనినీమేన నొత్తి చల్లార్చు మిఁకన్.

89


గీ.

నన్నుఁ దాఁకినపుడె నామేనికాఁకలు, నిన్ను సోఁకు ననుచు నెన్నవలదు
నిన్ను సోఁకఁబోదు నిను మున్ను గూడిన, మందసతులతనువులందుఁ గాక.

90


చ.

ఇపుడు మదీయవాక్యముల కీకొనవో యని డెందయారకే
తెపతెపఁ గొట్టు కాడెడిఁ బదింబదిగా నిదె చూడు మంచు న
చ్చపలమృగాక్షి లేచి యలసారసలోచను కేలుఁదమ్మి నం
దపుటురమందు మోపుకొని తల్సు బరాలన మూసి కృష్ణునిన్.

91


ఉ.

గొబ్బున శయ్యకున్ దిగిచి గుత్తపుటబ్బురపుబ్బుసిబ్బెపుం
గుబ్బ లురంబునం దలమి క్రుమ్ముచు మెచ్చుచు మోవితేనియల్
జుబ్బనఁ జూఱఁగాఁ గొనుచు సొక్కుచు ముద్దులఁ గొల్లలాడె త
బ్బిబ్బయి కొంతసేపు చెలి ప్రేమ నదే మనుచున్ వచింపకన్.

92


గీ.

అత్త మల్లాడునప్పు డయ్యంబుజాక్షుఁ, డూరకుండుట సరిపోలకుంట గాదు
పరవశతచేత నేమియు బదులుసేయ, మనసులో దోచకుండిన యునికి గాని.

93


సీ.

మొదలఁ బుక్కిటివీడె మొసఁగి యెంగిలి గాదె, మంచి దిమ్మనుచు నిప్పించుకొనును
తానె గుబ్బ లురంబు నాని దోసము ద్రొబ్బు, మంచని కేలఁ బట్టించుకొనును
పలుమోపి తప్పాయె బదులైనఁ బరిహార, మంచు కెమ్మోవి నొక్కించుకొనును
పరవశయై మ్రొక్కి మఱచితి నే బెద్ద, వంచని మరల మ్రొక్కించుకొనును

గీ.

ఒకటి చెలిగోర శౌరి దా నొకటిగోర, గొమరుబ్రాయంపుధనమెల్లఁ గొల్లలాడి
రిద్దఱును దోడుదొంగలై యింక మరుని, కేమి లంచంబు లిత్తురో యెఱుఁగరాదు.

94


సీ.

కనుబొమల్ ముడి వెట్టుకొని నీవు నే నంచు, వరుసవెంబడుల కైవాదు లాడి
యాయతంబై నిల్చి యటు కేల నొడ్డుక, విరులబంతులతోడ వ్రేటులాడి
యాయముల్ దాఁకి హా యని వొచ్చి రోషాన, మురళించి గోళ్ళచే నఱకులాడి
కెరలి చేపట్లైనఁ గ్రిందు మీఁ దయి పోర, బిగువుతో సందీక పెనఁగి కూడి
బడలి సొక్కుచు సోలుచుఁ బాన్పుమీద, బడుచు లేచుచు మరలఁ బైఁబడుచునుండి
రిద్దఱును గొంతసేపు పెన్నుద్దులగుచు, జిగురువిలుకానిబిరుదు మాష్టీ లనంగ.

95


వ.

ఇట్లు పెనంగుచు ననంగసంగరారంభమున కిద్దరుం జొరక యగరుధూపధూమంబుల
గుబులుకొను కమ్మకస్తూరితావులం బొనుగువడి కొంతవడిఁ జిత్రరూపంబులకైవడి
గదలకుండి రంత నగ్గోపికాకాంతునిం గవయుతమకంటున నక్కంబుకంఠి యిట్టట్టు
గొట్టుకాఁదుచు నతఁడు గదిసినఁ గదియనీక యవాంతరలజ్జాభయంబున దాఁపురం
బులు వెట్టుచు నట్టిట్టు గుట్టునం జిట్టాడి బట్టినం దట్టివైచి యొయ్యునొయ్యనం
బయ్యెదకొంగుఁ దిగిచి యుబికినచనుమిట్టల కెట్టకేలకుఁ గేలు సాచినం బట్టీక చిట్టా
డుచు పట్టువిడుపుల చిట్టకంబులను వేగిరింపక యేమఱించి లాలించి కౌఁగిలించినం
గృష్ణుండు గదిమి యదుముచు, నుదుటుసిబ్బెంపుటుబ్బు గబ్బిగుబ్బ లురమ్మునం
గ్రుమ్మి సొమ్మసిల హా యని కనుదమ్ములం దేలవైచుచు, మోహంపువగలను
మోము మోమునం జొనుపవచ్చినం దప్పించి యొప్పక యవ్వల నివ్వలఁ ద్రిప్పి యబ్బిన
యెడలం గొబ్బునం జుబ్బనఁజూఱఁగా వాతెరఁ గ్రోలిన నఱగన్ను వైచుచు బెండు
వడి మునింగి విడువిడు మని విదళించి బదులు తెమ్మని పెదవి మొదలానం బొదవి
యాని నాలుకచేఁ బైపైఁ బెణుకుచు, చూడకుమని డాకేలఁ గ్రేగన్నులు మొగిచి
నలకేలఁ జనుముక్కులు పులిమి బలిమిం దక్కితివని చురుక్కునం జుక్క లేర్పడ
నొక్కుచు, మక్కువను గోటిఁసోకులం బొక్కిలి నిమిరి యవ్వలఁ దడవఁగడంగినఁ
దడంబడుచు, మెడబలిమితనంబున మోహరంబుగ దేహంబు లాహిరింగొను తెఱంగు
నకుం గఁలగి కన్మొగిచి నగుచు, నఖంబులం జెక్కిలి మీటుచు, లెమ్ము లెమ్మని
కమ్మవిల్తునికేళికిం బయికొల్పిన మెలఁకువలం గవకవలు చెవులం దవులం జొనిషి
తనివిదీఱక విడిపడక యొడలెల్లం గలయం గరఁగించితి వేడ నేర్చితి? వెవ్వతెమీదిఁ
పరాకునం బడలితి? వలసితి, విదిరా సుఖానందం, బిదిరా వింతచందం, బని
పయ్యెదకొంగునఁ జెమట లెడనెడం దుడుచుచు, బొమలు ముడుచుచు, నన్నుం
జూడకుమని చివుక్కునం బయికొని యంతకంతకుఁ గందుకంబాడు కెవడిం
దూఁగాడుచు, మఱియునుం బాతరలాడురీతులం గుల్కుచు, నల్లనల్లన లకుముకి

తెఱంగునం గెరలుచు, నప్పటప్పటి కాముద్దు లద్దంబునీడలం జూచుచు, నిట్లు
సేసేద విది యెట్లు మఱతురా యని భావవిరహంబు దోఁపఁ గొంతవడి నిశ్చలంబుగ
నుండి తలయూఁచుచు, రాలుపువ్వులు గ్రమ్ముచెమటయు జాఱుక్రొమ్ముడియు
నెఱుంగక యందందు వింతపిలుపులం బిలుచుచుఁ గంతుసాయుజ్యంబందుచందంబున
దనువు లేకీభావంబుగా నంటుకొన వ్రాలుచుఁ బ్రేమాతిశయంబునం జొక్కుచుఁ,
గరంగుచు, నమ్మాధవుండు రాధికాపుంభావసంభోగశృంగారక్రీడానందసాగరంబున
మునుంగుచుం, దేలుచుండె నంత.

96


చ.

తెలతెలవాఱజొచ్చె నలుదిక్కులు విచ్చె శుకీపికావళుల్
కలకలఁ గూయఁజొచ్చె మఱి కంతుఁడు విల్ రతిచేతి కిచ్చెఁ దే
టులరొద హెచ్చె జక్కవకుటుంబము విచ్చె సమీరుఁ డంత శ్రాం
తులకు ముదంబుఁ దెచ్చె మది నొచ్చె విటీవిటచోరకోటికిన్.

97


సీ.

మినుకుఁజెక్కుల గోటిచెనకు లేడవి కృష్ణ !, యదిగదా నీ వెఱుంగుదువు రాధ!
సొంపుకన్నుల నిద్రమంపు లేడవి కృష్ణ!, యదిగదా నీ వెఱుంగుదువు రాధ!
కెంపువాతెరఁ బచ్చికెంపు లేడవి కృష్ణ!, యదిగదా నీ వెఱుంగుదువు రాధ!
నునుమేనఁ జిఱుగాజునొక్కు లేడవి కృష్ణ!, యదిగదా నీ వెఱుంగుదువు రాధ!


గీ.

నిన్న మొన్నటివాఁడవు నేఁడు చూడ, నేడ నేర్చితి వీమాట లీవు కృష్ణ!
నాకు నాశ్చర్యమైనది నీకుఁ దెల్ప, గూడ దదిగదా నీ వెఱుంగుదువు రాధ!

98


క.

అని యొండొరు లిటులాడుచు, దినదినముల్ గలసి యొరులు దెలియకయుండన్
గనుమాటి తిరుగుచుందురు, కనఁబడినన్ వారి బొంకుఁ గావింతు రొగిన్.

99


సీ.

తనమోవి పంటికొద్దిని జుఱుక్కున నొక్క, గినుకతో విదళించుకొని పెనంగుఁ
బెనగినఁ బోనీక బిగికౌగిఁటఁ గదింప, విడువిడు మనుచు నల్గడలం జూచుఁ
జూపువెంబడి నొకించుక నీవిఁ జేనంట, దుడుకు మానవటంచు వెడలబోవుఁ
బోవుచో నొడిసి హా పోకు మంచు దమింప, నొడిపిమ్మట జంటనుండ వెఱచు


గీ.

వెఱచి వెఱవని తెగువచే వెడలమఱచు, మఱచి మఱవని తెలివిచే మగుడఁదలచుఁ
దలఁచి తలఁవని తలపుచే దగులుపడుచు, పడుచుదనమునఁ దిరుగుఁ బైబడుచు రాధ.

100


ఉ.

కూరిమిఁ గొన్నినా ళ్ళిటులు గోపసుతుండు చెలంగుచుండి యే
మేర తలంపునంబడెనొ మెల్లన రాధను నిద్రవుచ్చి వా
ర్వారలకెల్లనుం దెలిపి రాతిరి వేకువజామువేళ న
క్రూరుని వెంబడి మధురకుం జని వేడుక నుండె నయ్యెడన్.

101

వ.

అనిన నవ్వలివృత్తాంతంబుఁ జెప్పు మనుటయు.

102


శా.

వీక్షామాత్రఫలప్రదప్రళయకావేరీమహాపట్టణా
ధ్యక్షా! శంకరపద్మనాభరఘునాథామాత్యగోపాలకా
దిక్షేమాంకరసోదరాగ్రజపదాత్మీయాఢ్య! వాఙ్మంజరీ
సాక్షాన్నందకుమారపాదయుగపూజాలబ్ధభాగ్యోదయా!

103


క.

గంధేభగామినీకుచ, గంధాంకితవక్ష! భాగ్యకలితకటాక్షా!
బంధురహయసింధురజయ, బంధురనయకీర్తి! వంశపావనమూర్తీ!

104


తరల.

మధురభాషణ! మంజుభూషణ! మాన్యసజ్జనపోషణా!
కధితపర్తన! కీర్తినర్తన! కాంక్షితాచ్యుతకీర్తనా!
ప్రధితలక్షణ! బంధురక్షణ! భాగ్యదాయకవీక్షణా!
మధితఘోరవిపక్షసార! విమానితస్థిరభారవీ!

105


గద్య.

ఇది శ్రీ మద్వేణుగోపాల వరప్రసాదలబ్ధ శృంగార కవిత్వవైభవ
వెలిదిండ్ల తిరువేంగళార్యతనూభవ విద్వజ్జనవిధేయ వేంకట
పతినామధేయ ప్రణీతం బైన రాధామాధవ
సంవాదం బను మహాప్రబంధంబునందు
బ్రథమాశ్వాసము.