రాణీ సంయుక్త/రెండవ ప్రకరణము
రెండవ ప్రకరణము
కొంతవడికటు లా సిపాయిలు నదిఁజేరి యందఱు నీద నేర్పియున్న వారగుటవలనఁ దమయిష్టమువచ్చినట్లు నీళ్లతోఁజెర్లాట మాడుకొనసాగిరి. నాఁడు గృష్ణపక్ష పాడ్యమి యగుటయునప్పటికి చంద్రమండలము బాగుగ ప్రకాశింపుచు నెక్కివచ్చు చుండెను. వాన సంపూర్ణముగ వెలిసి ధూళిలేక నిర్మలమైన వాయువులు వీచుచుండెను. నదీతీరమంతయు హోరుమను గప్పల రొదలతో నిండియుండెను. ఇవికాక క్రిమికీటకములు కీచుమని శబ్దించుచుండెను. ఆకసమునం దేభా గమునను నించుకైన మబ్బులేక ప్రకాశమానమై వెన్నెల కాయుచుండ నా సిపాయిలు సదియం దొండొరులపై నీరములఁ జిమ్ముకొనుచుఁ గొట్టుకొనివచ్చు దుంగలు మొదలగువాని నొడ్డునవైచుచు నింకను ననేకగతుల వర్తించుచుండిరి. నీటఁబడి వచ్చువానిఁ బట్టుకొని బయటఁ బారవేయుచున్న తరి నొకని చేతికి వెంట్రుకలు దగులఁ జప్పున నుల్కిపడి మరల ధైర్యముఁ దెచ్చుకొని పరికింప మనుష్యుని తల స్పష్టముగఁ గన్పించెను. వాఁడును దానిఁబట్టుకొని యీడ్చుకొనివచ్చి తీరమునవైచి యాసంగతిఁ దక్కిన వారల కెఱుకఁబఱుప నందఱు పరువెత్తుకునివచ్చి యా శరీరము చుట్టుజేరి వీక్షింపసాగిరి. అత్తరి నీ క్రిందిసంభాషణ ప్రారంభమయ్యెను.
ఒక మహమ్మదీయుఁడు : అరె! ఎవఁడురా వీఁడు ? కాఫరువలె నున్నాడు.
ఇంకొకఁడు : ఎవఁడైననేమి ? బ్రతికియున్నాఁడా?
మఱియొకఁడు : ఏమో !
వేరొకఁడు : నీ కెక్కడ దొరకినాఁడు?
శరీరమును దెచ్చినవాఁడు : అల్లదే! యా వైపునఁ గొట్టుకొని పోవుచుండ మొదటచూచి కుండబొచ్చెయని పట్టుకొనఁబోవ వెంట్రుకలు చేతికిఁ దగిలినవి. తరువాత దిన్నగఁ , బరిశీలింప మనిషి.
ఆ సమయమున వేరొకఁడు శరీరమును సమీపించి పొట్ట పైఁ గాలుపెట్టి ద్రొక్క లోపలనున్న నీళ్లన్నియు రంధ్రములద్వారా జిమ్మన గొట్టములనుండి వచ్చినట్లు బయటికేతెంచెను. అతఁ గొందఱాకాయమును జలిగాచుకొనుచున్న నెగడి వద్దకుఁ గొంపోయి ప్రక్కనఁ బరుండఁబెట్టి తమ శరీరముల దుడిచికొని క్రొత్త దుస్తులఁ దాల్చి యందఱును దీనిఁజూచుచుఁ జుట్టుఁ గూరుచుండి యుండిరి. కొంతవడికా శరీరము కదలెను. దానింగాంచి యొకఁడు. "అరే వీనిదెంత మొండిప్రాణము ? ముండవాడింత నదిలోఁబడి కొట్టుకొనివచ్చియు బ్రతికినాఁడే. "
అత్తరి నీ సమూహమునకుఁ గొంచెము దూరముననుండిన మఱియొకఁడు దగ్గరకువచ్చి "ఏమీ : ప్రాణమున్నదా?” యని యడుగ నున్నదని వచించిరి. అంత నా సిపాయి.
“ అట్లయిన మరల నెత్తుఁడు. నీటఁబారవైచివత్తము. " " చీ : దుర్మార్గుఁడా ! ప్రాణిని గాపాడిన నెట్టి మోక్షసుఖములు కల్గునో తెలియవా?" అని తక్కినవారు వచించిరి. అప్పుడు వారందఱకు నాయకుఁడుగానున్న వానికిని నా తురకకును ఈక్రింది సంభాషణ జరిగెను.
సిపాయి : ఇప్పుడెట్టి సౌఖ్యము కలిగినను, నీ వార్త సుల్తాను గారికిఁ దెలిసినపిదపఁ గలుగు సౌఖ్యము తరువాతనే !
నాయకు : ఈ సంగతి సుల్తానుగారి కేల తెలియవలయును ?
సిపా : దొంగతనము. రంకుతనము, దాగునాయేమి ?
నాయ : ఏడిచినావులే! సేనాపతిగూడ నామాట జవదాటఁడు. ఈ వార్త సుల్తానుగారి కెఱుకఁబఱప వలదంటే తెలుపనే తెలుపఁడు. ఇఁక నీవంటవారలుండినసరి,
సిపా : నాబోటి వారలమాట నటుండనిమ్ము. సుల్తానుగారి యాజ్ఞలఁ బాలింతువా ? లేదా ? కాఫర్ కంటబడినటులైన దత్క్షణము వానిఁ జంపి వేయమనికదా వారియుత్తరువు.
నాయ : నీ యధిక ప్రసంగముఁ జాలించి యావలకు పో! సిపా : సరియే. సమయము వచ్చినపుడు మాత్రము నేను సహాయమునకు వచ్చువాఁడనుగాను,
నాయ : పోరా ! నీలాటి దివానాలు సహాయ మొనరించిననెంత ! యొనరింపకున్న నెంత !
అన వాఁ డావలకు వెడలిపోయెను. కొంత సేపటికి నీట దొరకినవాఁడు కనులు దెఱచి చుట్టుపట్ల నున్నవారి నవలోకించుచుఁ బొట్టఁ జూపించి నైగఁ జేయ నదివారు గ్రహించి తమ దగ్గరనున్న గోదుమపిండిని దెచ్చి యా నెగడి మీదనే జావగాఁ గాచి వేడివేడిజావ వానినోటఁబోయ మ్రింగసాగెను. అట్లు వాడు వలదను నంతవరకుఁ బోసి పిదప గిన్నె నావలనిడి యొండొరులతో ముచ్చడించుకొనుచుఁ గూరుచుండి యుండిరి. జావ కడుపులోఁబడిన కొంతసేపటికి శక్తివచ్చి యా మనుజుడు బాగుగఁ గనులఁ దెఱచి చెంతనున్న సిపాయిలఁగాంచి భయం పడసాగెను. అందులకు వారు భయపడవలదని వానితోఁజెప్పి నీ వెవఁడవని యడిగిరి. అందుపై వాఁ డిదివరకు దప్పించుకొని వచ్చిన సిపాయిల వేషములును వీరి వేషములును నొకటిగఁ గాన్పించినందున వారు వీ రొకటియేనని తలచి తిన నిజవృత్తాంతము వెలిబఱచినచో దనకక్కడనే మృతికలుగునని యీ క్రింది రీతిగఁ దన సంగతి వచింపసాగెను.
" అయ్యా! నేను మధురానగరమున నొక గొఱ్ఱెల కాపరిని. నది యెండిపోయి యుండు కాలమున దానిదాటి యావలి గట్టున ననుదినము నామందను మేపుకొనుచుందును. ఈ దినము నను నట్లే గొఱ్ఱెలఁ దోలుకొని పోయితిని. సాయంకాలమగు నప్పటికి మబ్బుపట్టి చినుకులారంభ మయ్యెను. పెద్దవర్షము కాకమునుపే కొంపఁజేరుకొనుట మంచిదని మందను నదిలో గుండా నడిపించుకొనుచు నింటికేగుచుంటిని. అత్తరిఁ బ్రవాహముసకు నిలువలేక రెండుమూఁడు గొఱ్ఱెపిల్లలు నీటఁబడి కొట్టుకొని పోవుచుండ వాటిం దక్కించుకొన నేనును నీట దుమికి యీదుకొని పోవుచుండ నదివర కారంభించిన చినుకులు మిక్కుటమై యాకస్మికముగఁ బెద్దవర్షము కురిసెను. చీకటులునుఁ గ్రమ్మెను. ఆ చీఁకటియందు గొఱ్ఱెలఁ గన్గొనలేక విసిగి తుదకు తీరమున కీదసాగితిని ఎంత యీదినను గార్యము లేక పోయెను క్రమక్రమముగఁ బ్రవాహమధికమై నన్ను వెనుకకే నెట్టివేయుచుండెను. కొంతసేపటికి నా యవయములన్నియు బలహీనములై నందునఁ గదలింపఁ జాలక మిన్నకుండ వలసిన వాఁడనైతిని, అనంతర మేమైనదియు నాకుఁ దెలియదు. మరల దెలివిగలిగి చూచునప్పటికి మీ రగుపించితిరి. మీరలే నా ప్రాణ దాతలని తలఁచెదను.”
అనివచించి తన యాలు బిడ్డలఁ దలఁపునకుఁ దెచ్చుకొని కపట దుఃఖమున నభిలయింప సాగెను. అదిచూచి ఒక సిపాయి " అరే! దివానా! ఇంచుకసేపుక్రింద మేము పైకిఁదీయకపోయి యుండిన నీ పాటికి మృతినొంది యుందువే. అప్పుడీ భార్యా పుత్రులేమగుదురో!" యని యడిగెను. అంతవాఁడు మరల " అయ్యా ! బ్రతికేయుండగనేకదా! యీ చింతలన్నియు, ” నని పల్కెను. అప్పుడింకొకఁడు ముందరికివచ్చి తక్కినవారితో " అరే! వీఁడు గొఱ్ఱెల కాపరికదా ! వీని నెటులైన లోఁబఱచుకొని యుంచుకొంటిమా మాంసము దొఱకక చచ్చిపోవుచున్న మనకీ దేశమునఁ గావలసినంత పలలము పుష్కలముగ లభింప గలదు." అన నందఱు నియ్యకొని గొఱ్ఱెలకాపరితో నిట్లు మాటలాడసాగిరి.
సిపా : అరే నీవు మా వద్దనుండి రోజుకు మాకుఁగావలసినన్నిమేకలఁ దెచ్చియిచ్చెదవా?
కాప : మీకు గొఱ్ఱెలతో నేమిపని? పాలకొఱకేకదా ?
సిపా : పాలెవరికిఁ గావలయును . వాఁటి మాంసముకొఱకు. దినమున కిరువది ముప్పది గొఱ్ఱెలనిచ్చితివా యొక్కొక్క దానికి నాలుగైదు వరహాలవంతున నిచ్చెదము.
సిపాయిలట్లు వచించిన వెంటనే జీవహింస యనినఁ గంటగించు కొనునట్టి యా యుత్తమ బ్రాహ్మణుఁడు చింతాక్రాంతుడై “హా! పవిత్రవంతమగు నార్యావర్తమున కెంత గతిపట్టినది. ఇదివరకు జరుగుచున్న వామమార్గులయల్లరులకే పడలేకయుండ నిప్పుడీ దుష్టులుగూడ ప్రాప్తించినారు. హా ! నోరులేని దనంపుమృగముల ఖండించి వానిపలలమునా వీరలు దినగోరుట ! ఇంతకన్న దమలో గొందఱి వధించియేల భక్షింపరాదు? ఇప్పుడు వీరివాక్యములకు సమ్మతించకున్న నన్నిక్కడనే కడఁదేర్తురు. దైవమా ! ఈ కఠినాత్ముల హృదయముల వజ్రములతో నిర్మించితివా ఏమి? లేకున్న వీరలకట్టి దుర్వాంఛ యేల పొడమును? పూజనీయంబగునో యార్యావర్తమతల్లీ ! నీ కైనను వీరలపైఁ గిన్కజనింపదా ? సాధువులగుఁ బశువులు నీ యెడగావించిన యపకారమింతైన గలదా ? ఒక్క పర్యాయముగ నీ దుష్టు లందఱని నేలమ్రింగివేయవు?" అని యింతసేపు విచారించి యప్పటికట్లేయని సిపాయిలతో నొప్పుకొనెను. అంత రాత్రి విస్తారము ప్రొద్దుపోవుట వలన శయనింపఁదలచి వారలు వృక్షముక్రింద మైనపుగడ్డలఁ బఱపించి వానిపై బ్రక్కల వేయించి కాపరిని నడుమఁ బరుఁడబెట్టుకొని తాముచుట్టు బరుండి నిదురపోయిరి.