రాణీ సంయుక్త/పదునెనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునెనిమిదవ ప్రకరణము

శ్వరభట్టు కన్యాకుబ్జముజేరి కొన్నిదినములు జననిచ్చి మరల దన పూర్వపు దుర్మార్గములఁ జేయ నారంభించెను. ఎటులైన జయచంద్రునిచేత బృధివీరాజు నోడించి యతనిచే ఢిల్లీనందు కొంతభాగము బహుమానముగ బడయ నభిలాష గలిగి యుండెను. అట్టి యుద్దేశముతో ననారతము జక్రవర్తిపై లేనిపోని వార్తలఁ గల్పించి చెప్పుచు జయచంద్రునకు గోప మెక్కించు చుండెను. వీని నడతఁ గుఱించి సాక్ష్యమొసంగిన తక్కిన యిద్దఱు వీనితో గలసి పనిచేయుచుండిరి. ఈ దుష్టత్రయము రాజుచే నమితముగ భ్రేమింప బడుచుండుట వలన రాజ్యమందలి గొప్పగొప్ప యధికారులు సహితము వీనికి వెఱచుచుండిరి. అధికారుల సంగతియే యటులుండ నిక తక్కిన ప్రజల గుఱించి వచింపనేటికి? దుష్టత్రయము కనూజియం దంతట దమప్రభావమే సాగుచుండ మెలంగుచున్న తరి వారికడనున్న నొక ముదుసలి కంచుకి మాత్రము వారలు కావించు పనుల కిష్టములేనివాడై యుండెను. లోపల నిష్టములేని వాఁడయ్యు బైకిమాత్ర మగుపడక శాంతము వహించియుండి యా దుష్టుల కెఱుకలేకుండ చేతనైనంత వట్టుకు వారి కుట్రలకు విఘ్నములఁ గల్పించుచుండెను, బహిరంగముగను నీ దుష్టుల యెడల వైరమూని రాజు నన్యాయముగ నాశనము సేయు చున్నారన తలచి ప్రధానమంత్రియగు వినయశీలుఁ డనేక పర్యాయములు జయచంద్రునకు మంచిమార్గ ముపదేశింపుచు వచ్చెఁగాని చక్రవర్తియెడ రోషము వహించి యసూయా పరుఁడై యున్న నతని మనసున నా మాటలు నాటవయ్యెను. దుష్టత్రయమును బ్రధానమంత్రి తమ యెడఁ జేయుచున్న ద్రోహమున కతని దొలఁగించుమన రాజుతో ననేక పర్యాయములు వచించిరిగాని తండ్రినాటి నుండివచ్చుచున్న మంత్రిని దీసివేయుట కతడునుసమ్మతింప డయ్యెను, అట్టియెడ వీరలుగావించు తంత్రము లెప్పటివప్పుడు వినయశీలునకు దెలియపఱచి యతడు. చెప్పునట్లు విఘ్నములు కల్పించుచు దుష్టత్రయమునకు మాత్ర మావంతయైనఁ దనపై సందేహము పొడమకుండునట్లు కంచుకి ప్రవర్తించుచుండెను. . ఈ సమయమందే గ్రామాంతరమునకేగి కొద్ది దినములలో మఱలి వచ్చెదనని చెప్పి కొన్ని మాసములు కడచినను రానట్టి దేవశర్మ యను బ్రాహ్మణుఁ డేతెంచెను. ఈ దేవశర్మయే సంయుక్త విద్యాగురువు. ఇతనియెడ నామె కమితమగు ప్రేమయు, భక్తియు గలదు. జయచంద్రుడు సహిత మితని విద్యానైపుణ్యమునకు మెచ్చి యందఱకన్న నెక్కుడుగ గౌరవించుచుండును. ప్రధానమంత్రికి నితనికి నమితస్నేహము. దేవశర్మ మున్ముందు వినయశీలుని మందిరమునకేగ నతడును గాంచినంతనే లేచివచ్చి యాలింగన మొనరించుకొని లోనికిఁ గొంపోయి కూరుచుండబెట్టుకొని యాదరణ పూర్వకముగ క్షేమసమాచారము అడిగి తెలుసుకొని కొంతతడవునకు "దేవశర్మా ! నీ వింత కాలమైనను రాకుండుట వలన నా కేమేమో యాలోచనలు పోయినవి. నిన్ను సురక్షితముగ మఱల నా కగపఱచి నందుల దైవము కనేకవందనములు. నీ వేయే స్థలములం దింతకాలము వరకుఁ గ్రుమ్మరుచుంటి" వన నా వృత్తాంతమంతయు నిపుడు చెప్పుటగాదు. సావకాశముగ దెలిపెదను. నగరమందలి విశేషములేమి? సంయుక్త బాగుగనున్నదా యని దేవశర్మ యడిగెను. అంత వినయశీలుడు "రాజ్యమందలి వృత్తాంతము లన్నియుఁ బెద్ద భారతముగ నున్నవి. నీవు పోయిన తరువాత నీశ్వరభట్టను నతఁడొకడు ఢిల్లీనుండివచ్చి మన జయచంద్రుని దయకుఁ బాత్రుఁడై దుష్ట ద్వయముతో గలసి యనేక దుష్కార్యములు గావింపు చున్నాడు. వారు మువ్వురు గలసి చేయుచున్న కుతంత్రము లిట్టివని వచింపజాలను. నేనేమి చేయుదును. జయచంద్రుడును వారి స్తోత్రపాఠముల కుబ్బిపోయి వారి యిష్టానుసారమే నడచు కొనునుగాని నా మాటఁ బాటింపఁడు. ఏవోపూర్వకాలపు వాడను గావున నుంచినాడు గాని యనేకుల కిదివఱకే యుద్వాసన యైనది." అని యీశ్వరభట్టును గురించి వచించుటతోడనే దేవశర్మ యాశ్చర్యమగ్నుడై “ఆహా ! ఆ దుష్టుఁడు ఢిల్లీ నంతయు నాశనముఁజేసి యిక్కడఁ జేరినాడా? ఇక జయచంద్రుఁడు బాగుపడుట దుర్లభమే. ఈ క్రూరుఁ డిదివరకే ప్రాణహత్య గావించుకొనె నని తలఁచియుంటిని. ఇప్పుడీ వార్తవలన నా కమితమగు చింతగలుగుచున్నది. ఆ మువ్వురను రాజున కెఱుకలేకుండ నెటులైనఁ గడముట్టింపవలయును. ఇప్పుడు వారు చేయుచున్న పనియే " మన " ఏమున్నది? ఆ భట్టుగారు చక్రవర్తి లిఖించినదని యొక బాబును దెచ్చి జయచంద్రున కిచ్చినాఁడు. దానిఁ జూచుకొని సృపుఁడు కోపోద్దీపితుడై వెంటనే జక్రవర్తి కొడలు మండునట్టు ఒకలేఖ వ్రాసిపంపినాడు. అది చక్రవర్తికి జేరియేయుండును రేపోమాపో మన నగరముపై దండెత్తి రాగలడు. అందుకొఱకే జయచంద్రు డిప్పుడు రణమునకు వలయు సన్నాహంబులఁ జేయించు చున్నాడు." అని వినయశీలుఁడు వక్కాణించెను. ఇక్కడ వీరిరువు రెట్లు మాటలాడుకొనుచున్న సమయమున బయట ద్వారముకడ నెవరో పిలుచుచున్నట్లు శబ్దమురా వినయశీలుఁడు చని తలుపుదీసి చూడ గంచుకివచ్చి నిలిచియుండెను. అంత వారిద్దరు మరల దలుపు పెట్టుకొని దేవశర్మ దగ్గరకు వచ్చిరి. కంచుకి దేవశర్మను గావించుకొనుటతోడనే యానందమును బొంది యతనికి నమస్కరించి నిలువ నా విప్రుఁడును నతని క్షేమసమాచార మడిగి కూరుచుండ నియోగించెసు, అత్తరి వినయశీలుండు దేవశర్మతో " ఈ కంచుకి మనకు బరమాప్తుడు ఇతఁడు పైకి దుష్టత్రయమునకు మిత్రుడుగనుండి వారి సమాచారములన్నియు నాకుఁ దెల్పుచుండును.” అని కంచుకివంకఁ దిరిగి " నేఁడేమైన నూత్న వృత్తాంతములున్నవా ! నీ వెప్పుడును రానీయకాలమున వచ్చితి " వన "మహాప్రభో ! వారు చివరకు జయచంద్రునకే మోసము గావింపఁ బూనుకొన్నారు. ఇంకేమున్నది? వారు సంయుక్తా దేవినిం జంపు ప్రయత్నములు చేయుచున్నారు." అని కంచుకి పలుక " ఎట్లు ! సంయుక్త నే ! హా ! నాప్రాణములుండ నా ముద్దు బిడ్డ కట్టి యపాయము రానిత్తునా? యని దేవశర్మ ధీరముగ వక్కాణించెను. అంత నా సంగతులేమో వివరముగ వచింపుమన గంచుకి యిట్లనియె --

“కడచినరాత్రియం దాదుష్టులు మువ్వురు నొక రహస్యంపుఁ జోటఁజేరి మూడుగంటలసేపు సంయుక్తను గడ దేర్చు పన్నుగడలు పన్నుకొని యెవరిండ్లకు వారు వెడలిపోయిరి. ఈశ్వరభట్టు తెల్లవారినతోడనే నన్ను వెంటగొని సంయుక్త యుండు నతఃపుర మందిరములోనికిఁ జని ద్వారముకడ నన్నుంచి తాను లోపలికరిగెను. నేనును వానికి దెలియకుండ వెంటనేపోయి తలుపుచాటున దాగుకొనియుంటిని. సంయుక్త యొంటరిగ నొక సోఫాపైఁ గూరుచుండియుండెను. భట్టుగా రామెనుగాంచినంతనే సాగిలఁబడి నమస్కారము చేసెను. అత్తరి సంయుక్త "భట్టుగారూ ! ఏ మిట్లుదయచేసితిరి? చక్రవర్తిగారి వద్దనుండి మాతండ్రికడకు మఱేవైన జాబులు వచ్చినవా? యని నిష్టూరముగఁ బల్క నితడు ముసిముసి నవ్వులు నవ్వుచు "అమ్మా! మీ నాయనగారికి నే నగుపఱచిన లేఖను నీవును నిజమని నమ్మితివా? నాపై నెటులైన నమ్మకము కలుగుటకుగా నట్టి లేఖలఁ గల్పించి చూపించితిగాని వేరొండు కాదు. ఇప్పుడు నీకడ ప్రమాణపూర్వకముగ నిక్కమగుదానిని వచించెదవినుము జక్రవర్తికిని నాకును బరమమైత్రి. అతఁ డహోరాత్రంబులు నిన్నుగూర్చి తలఁచుకొనుచుఁ దుదకు నన్నుబిలచి మిత్రమా ! నా కెటులైన సంయుక్తనుగూర్చి నా వంతఁ దీర్పజాలవా ? నీవంటినెయ్యుఁడు నాకు మఱియెకండు దొరుకఁడుగాన నీతో వచించుచున్నాను. ఆ తన్వి వీక్షింపకున్న నా యసువుల భరింపనోప" నని దీనత్వముతో పలికిన నతని మాటలకు నా హృదయము కఱగి "చీ! మిత్రునభీష్టంబు దీర్పజాలని సౌజన్మమేలనని కొంతతడవు విచారించి యతనితోఁ గానిమ్ము ! నీ కోరిక నెరవేర్చెదను. ఇటులే యింకను గొన్ని దినములవరకు నోపిక బట్టియుండుము. నే గన్యాకుబ్జ నగరమునకేగి సంయుక్తం గొని తెచ్చెదను. జయచంద్రుని దగ్గరనుండి యొకవేళ నీ కేవిధమైన యుత్తరములు వచ్చినను వాని లెక్క గొనకుము." అని యతని సమ్మతిపరచి యీ పురముజేరితిని. మొదలే జక్రవర్తిపై వైర మూనియున్న నీతండ్రికిఁ దగినట్లు మాట్లాడనిచో నాకీరాజ్యమున నిలువ వీలుకలుగదనియు, నిలువకున్న నీతో నా మిత్రు సమాచారము దెల్పుటకు వలను కలుగదనియు, నీతోమాట్లాడి నిన్ను గొనిపోవకున్న నా మిత్రునికోరిక నెరవేరదన్న భయము నను నీతండ్రికి గల్పితలేఖ నొకదానిని గనుబఱచి మఱికొన్ని యిచ్చకములు పలికి యితని దయకుఁ బాత్రుఁడనైతిని. నీతండ్రి చేయుచున్న సన్నాహములఁ జూచి చక్రవర్తి దాడివెడలి వచ్చునని తలఁచెదవేమో ? జయచంద్రుఁడు వ్రాసిపంపిన యుత్తర మప్పుడే యే పెంటలోనో కలిసిపోయి యుండును, చక్రవర్తి మన యిద్దరి రాకకొరకై యెదురు చూచుచుండును. ఇప్పుడు నీతో నున్న సంగతులన్నియు వచించితి. ఇక నీ యిష్టానుసార మేమిచేయుమన్న నట్లుచేయుటకు సిద్ధముగ నున్నా " నని నమ్మకము కలుగునట్లు తియ్యని మాటలతో వచింప నా కన్నియ తా నదివరకు బూనియున్న కోపమును విడచి మెల్లన "నయ్యా! మీరిదివరకు గావించుచున్న కార్యముల వలననే నన్యముగ భావించితి. కాని యిప్పుడు మీరు చెప్పినదంతయు నిక్కువమేకదా? యని యడిగెను. భట్టుగారామె దారిలోనికి వచ్చుచుండుట గనిపెట్టి మరల "తల్లీ ! చక్రవర్తినివి కాబోవుచున్నావు కాన నీవు కేవలము ధీరమాత వగుదువు. నీ యెడ ద్రోహము దలపెట్టినవాఁ డెట్టిఘోర నరకమైన నొందుఁగాక. నా మిత్రునివాంఛ దీర్పనెంచి నే నెన్నియో టక్కులఁ బన్నితిని. అమ్మా ! ఆట్లు చేయనియెడల నా కిచట బ్రవేశము గలుగనే కలుగదు." ఆని నుడివి యొక కమ్మ నామె కొసంగి " అమ్మా! దీనిని మీరు నా నెయ్యునకు వ్రాసి పంపితిరఁట. దీని నానవాలుగ గనుబఱచి మిమ్ముఁ దోడ్కొని రమ్మని పంపినాఁ" డనెను. ఆ లేఖను జూచుకొని సంయుక్త సంతోషభరితయై భట్టుగారితో అయ్యా! మీ యిష్టానుసారము నడచుకొన సిద్ధముగ నున్నా" నని పలికెను. కాముక జనంబులకు యుక్తాయుక్త వివేచనము శూన్యంబుగదా ! అంత మరల నతఁడు " అమ్మా ! మనమీరాత్రియే బయలు దేరి పోవలయును. సుమారు పండ్రెండు గంటలకు వెడలుదము. అప్పటికి సంసిద్ధురాలవై యుండుమనిచెప్పి తాను వెనక్కు మరలెను. అతఁడు వచ్చువేళకు నేను ముందుజని యతఁ డుంచిపోయన ద్వారము కడనుండ నన్ను గలుసుకొని రహస్యముగ రాత్రికొక బండిని గుదుర్చుకొని రమ్మని చెప్పి తనదారిం బోయెను. ఇందుకు మీరేమీ ప్రతీకారము చెప్పెదరోయని వెంటనేయిక్కడి కి వచ్చితినని యావదృత్తాంత మెరుక బఱుప “ ఔరా ! కుట్రముండ వాఁడెంతపనిఁ జేయఁబూనినాఁడని యాశ్చర్యపడుచు దేవశర్మ బండిని గుదుర్చుకొని వచ్చితినని భటులతో జెప్పుమని కంచుకిం బంపి " వినయశీలా ! మన నగరమందెట్టి రాజద్రోహులున్నారో చూచితివా? కానిమ్ము. ఆ దుష్టులుమువ్వురు వచ్చుట తటస్థించినచో నేడే కడముట్టించెదనని మఱికొన్ని రహస్యము లతని చెవిలోజెప్పి తాను వెడలిపోయెను.