రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/మొదటి ప్రకరణము
వివేక చంద్రిక
అను
రాజశేఖర చరిత్రము
వెుదటి ప్రకరణము
ధవళగిరి__ దేవాలయవర్ణనము__ గోదావరి యొడ్డున నున్న ధర్మశాల మీఁద ప్రాతఃకాలమున రాజశేఖరుఁడుగారు వచ్చి కూర్చుండుట__ అప్పు డచ్చటికి వచ్చిన సిద్ధాంతి మొదలగువారి స్తుతివచనములు__ అందఱును గలిసి రామపాదములయొద్దకు బైరాగిని చూడఁబోవుట.
శ్రీ నాసికాత్య్రంబకముకడ కడుదూరమున నెక్కడనో పశ్చిమమున నొక్కయున్నతగోత్రమున జననమొంది ఊర్మికా కంకణాదుల మెఱుంగులు తుఱంగలింపఁ దనజననమునకు స్థానమైన భూభృద్వర పురోభాగముననే పల్లములంబడి జాఱుచూ లేచుచుఁ గొంతకాలముండి యక్కడినుండి మెల్లమెల్లఁగా ముందుముందుకు ప్రాఁకనేర్చి యెల్లవారల చూడ్కులకు వేడ్కలు నింపుచు, పిదప నవ్యక్తమధురస్వరంబులతో ముద్దులు గులుకు శరవేగమునఁ బరుగిడుచు, ఆ పిమ్మట ఘనతరుల చెంతఁజేరి తల్లివేళ్ళను విడిచి తక్కినవేళ్ళనంటుచుబాఱి జమ్ములో నడఁగి దాఁగుడుమూఁత లాడుచు, వెలువడి విదర్భాదిదేశములగుండఁ బ్రయాణములుచేసి త్రోవపొడుగునను వచ్చిపుచ్చుకొననివారిదే లోపముగా స్నానపానంబులకు వలయునంత నిర్మల జలం బొసంగి యాబాల వృద్ధ మందఱి నానంద మొందించుచు తానడుగిడిన చోటులనెల్ల సస్యములకును ఫలవృక్షములకును జీవనములిచ్చి వానిని ఫలప్రదములఁ గావించుచు తన చల్లదనము వ్యాపించినంత వఱకు నిరుపార్శ్వములందును భూమినంతను బచ్చని లేఁబచ్చికతో నలంకరించి పశుగణంబుల కాహారంబు కల్పించుచు, తనరాక విని దూర మునుండి బయలుదేఱి యడవిపండ్లను నెమలికన్నులును వహించి పొంగి నానా ముఖములఁ దన్నుఁ గానవచ్చు వరద, మంజీర, పిన్న గంగ మొదలగువారి నాదరించి లోఁగొనుచు, అంతకంతకుఁ దన గంభీరత గానుపింప నాధుని వెదకి కొనుచు వచ్చివచ్చి, యేగిరిని దూరమునుండి విలోకించి గోదావరి రసోత్తరంగముగా ఘోషించుచు పాదమునంబడి శిఖరంబున నధివసించు జనార్ధనస్వామి దర్శనము చేసుకొని తోడనే యచ్చటనుండి తనశాఖారూపము లయిన రెండు చేతులను జాచి సరసతమీఱ నాధునిం గలియు భాగ్యము గాంచెనో యా ధవళగిరి, యాంధ్రదేశమున కలంకారభూతమయి రాజమహేంద్ర వరపుర సమీపమున మిక్కిలి వన్నెకెక్కి యుండెను.
ఆ పర్వత మంతయున్నతమయినది కాకపోయినను, తెల్లని పిండి రాళ్ళతో నిండి యుండుటచేఁ జూచుట కెంతయు వింతగా మాత్ర ముండును; ఆ రాళ్ళనుబట్టియే దానికి ధవళగిరి యను నామము కలిగి యుండును. దక్షిణపువై పునఁ గ్రిందినుండి పర్వతాగ్రమువఱకును నల్లరాళ్ళతోఁ జక్కనిసోపానములు కట్టబడియున్నవి. ఆ సోపానముల కిరుప్రక్కలను కొండపొడుగున నర్చకులయుఁ దదితరులగు వైష్ణవ స్వాములయు గృహములు చాలుగానుండి కన్నులపండువు చేయు చుండును. ఆ సోపానముల వెంబడిని బైకిఁ జనినచో గొండమీఁద నల్లరాళ్ళతోఁ గట్టఁబడిన సుందరమైన చిన్నదేవాలయ మొక్కటి కానఁబడును. దాని చుట్టును నించుమించుగా నిలువెడెత్తు ప్రాకారము మూఁడు ప్రక్కలను బలిసియుండును. ఉత్తరపు వైపునమాత్రము గోడకు బదులుగా పర్వతశృంగమే పైకి వ్యాపించి, గోడలు తన పాదము నాశ్రయింప వానిని మించి యాలయశిఖరమును నిక్కి చూచుచుండును. ప్రాకారములోపలనె యుత్తరమున నొక చిన్న గుహ కలదు. అందులోఁగూర్చుండి పాండవులు పూర్వమరణ్యా వాసము చేయునప్పుడు తపస్సు చేసిరని పెద్దలు చెప్పుదురు. అందులో నప్పుడు చిన్న రాతివిగ్రహ మొక్కటియుండెను. సంవత్సరము పొడుగునను పూజాపురస్కారములు లేక బూజుపట్టియున్నయాదేవరనుత్సవదినములలో నర్చకుండొకఁడు పైకిఁ దీసి పులికాపుచేసి, ఆస్వామి సన్నిధానమున దీపము నొకదానిని వెలిగించి గుహాముఖంబునఁ దాను నిలుచుండి పల్లెలనుండి యాత్రార్థమువచ్చిన మూకలవలనం దలకొకడబ్బువంతునఁ బుచ్చుకొని లోనికిం గొనిపోయి దేవతాదర్శనము చేయించి వారిపెద్దలు ధన్యులయిరని జెప్పి పంపుచుండును. జనార్ధనస్వామి కళ్యాణదినములు నాలుగును వెళ్ళినతోడనే యెప్పటియట్ల స్వామిరథముయొక్క పగ్గముల నందుంచి వాని కాచిన్న దేవరను గావలియుంచి జీతబత్తెములు లేకపోయినను రాత్రిందినముల కాలుగదలపక స్థిరవృత్తితోఁ గాచుచుండు నాపిన్న దేవర యెడం గల విశ్వాసముచేత పూజారులు మఱుచటి సంవత్సర మా త్రాళ్ళపని మఱల వచ్చువఱకును ఆ గుహత్రొక్కి చూడనక్కరలేక నిర్విచారముగా నుందురు. ఈప్రకారముగ మనుష్యులు భక్తివిహీనులయి దేవతా సందర్శనము చేసికోకపోయునను పర్వతమును కనిపెట్టుకొనియున్న చిన్న చతుష్పాద జంతువులు మాత్రము మిక్కిలి భక్తికలవై నిత్యము నాస్వామిని సందర్శించుకొనుచు ఉత్సవదినములలో మనుష్యులువచ్చి తమ్ముఁ దఱిమివేయునంతటిపాపముం గట్టుకొన్నదాఁక రాత్రులు దేవతాసన్నిధానమున్ గుహలో వట్టిభూతలముననే శయనించుచుండును. తూర్పువయిపునఁ బ్రాకారములోనే జనార్దనస్వామి కెదురుగా గొప్పధ్వజస్తంభమొకటి యున్నది. దాని శిఖరమున నున్న చిఱుగంటలు గాలికిఁగదలుచు సదా శ్రావ్యమయిననాదముతోఁ జెవులను దనుపుచుండును. ఆస్తంభమునకు మెుదట నాంజనేయ విగ్రహమొకటి చేతులు జోడించుకొని స్వామి కభిముఖమయి నిలిచి యుండును. ఈ శిలావిగ్రహమునకును ధ్వజస్తంభమునకును ఉత్తరముగా గళ్యాణమంటప మొకటి యుండెను. స్వామి కళ్యాణ దినములలో నుత్సవవిగ్రహములు నందు వేంచేయింపజేసి యథావిధిగా వివాహ తంత్రము నంతయు మహావైభవముతో నడిపింతురు. ప్రతి మాసమును రెండు పక్షముల యందును ముఖ మంటపము మీఁద ఏకాదశినాఁడు రాత్రి హరి భజనము జరుగుచుండును. హరి భక్తులు తులసి పూసల తావళములను ధరించుకొని ద్వాదశోర్ధ్వ పుండ్రములను స్ఫుటముగా బెట్టుకొని, కరతాళములను మృదంగ ములను మ్రోగుచుండఁగా తంబురలుమీటుచు.. బిగ్గఱగాఁ దమ యావచ్చక్తిని "నవనీత చోరా" "గోపికాజారా" "రాధికాలోలా" గోపాలబాలా' మొదలగు నామములచే నిష్టదేవతలను సంబోధించుచు మధ్యమధ్య గొంతుకలు బొంగురుపోయినప్పడు మిరియములను బెల్లపు ముక్కలను నమలుచు కృష్ణలీలలను పాడుచుందురు. తలలు త్రిప్పుచు భక్తులు తమ సత్తువంతయుఁ జూపి చేతికొలఁదిని వాయిం చుటచే నొకానొకప్పుడు మద్దెలలును తాళములును పగిలి పోవుటయు సంభవించుచుండును. దేవతావేశముచేత తఱచుగా భక్తులలో నొక ఱిద్దఱు దేహములు పరవశమయి రెండు మూడు నిముషములవఱకు వెనుకకు స్తంభము మీది కొఱగు చుండుటయు గలదు. ఇట్టి భక్తి మార్గమును బొత్తిగా గుర్తెఱుఁగని యన్యదేశీయులకు మాత్రము వారి యప్పటి చేష్టలు పిచ్చ చేష్టలవలెఁ గనఁబడునుగాని, వేడుక చూడవచ్చిన జనులు వారెంత వికృతముగా కేకలు వేయుచు భజన చేయుదురో యంత పరమ భాగవతోత్తములని తలఁతురు.
కొంచెము శ్రమపడి యెవ్వరైన మధ్యాహ్నవేళ నొక్కసారి కొండమీఁదికెక్కి నలుఁగడలఁ జూడ్కి నిగిడించినచో, వన్నెవన్నెల పిల్లలు చెంగుచెంగునఁ దమముందఱ దుముకులాడుచుండ గొండ పొడుగునను ముంగాళ్ల మీఁదికెత్తి పొదలపయి యాకులను మేయు మేకలను, పూర్వదక్షిణములఁ గుప్పవోసినట్లున్న తాటాకుల యిండ్ల నడుమ వానిని వెక్కిరించున ట్లక్కడక్కడ నెత్తగా నొక్కొక్క పెంకుటిల్లును ఉత్తరమున మంచెలపైనుండి పొలము కాపులు కో యని కూఁత లిడుచు నొడిసెలలు ద్రిప్పుచు బెదిరింపఁ జేరువ తోపులలోనుండి వెలువడి మధుర రుతములు చేయుచు ఆకాశ మున కెగయుచు సందయినప్పుడు కంకులను విఱుచుకొని పఱచి పలు విధములయిన పక్షులు చెట్ల కొమ్మలమీఁదఁ బెట్టుకొని తినుచుండ ముచ్చటగా నుండు పలువిధముల వచ్చని పయిరులను, ఆ పయిని వృక్షములమీఁదను గూర్చుండి కర్ణ రసాయనముగా బిల్లన గ్రోవిని మోవినిబూని పాడెడి గోపబాలకుల గానములకు హృదయములు కరఁగి మేపులు చాలించి కేపల తోడఁగూడఁ జెవులు నిక్కించి యఱ్ఱులు చాచి యాలింపుచు నడుమ నడుమ గడ్డిపఱకలు కొఱుకుచు బయిళ్ళయందు నిలుచున్న పశుగణములను, పడమటను నీలముల వలెనున్న తేఁట నీటిపై సూర్యకిరణములు పడి యెల్లెడలను వజ్రపు తళుకులను బుట్టింపఁ బలుతెఱంగుల జలవిహంగంబులు పట్టచెండ్ల వలె మీలఁ బట్టుకొనుటకయి నీటం బడుచు లేచుచుఁ బ్రవాహంబు తోడం బఱచుచుండ నఖండ గౌతమియు నేత్రోత్సవము చేయు చుండును.
ఆ పర్వతపాదమునకు సమీపమున గోదావరి యొడ్డున నల్ల రాతి బండమీఁదఁ జక్కఁగా మలఁచిన రామ పాదములు వెలసి యున్నవి. శ్రీరాములవారు పూర్వకాలమున సీతా లక్ష్మణులతోడఁ గూడఁ బర్ణశాలకుఁ బోవుచు త్రోవలో ఈ పర్వత సమీపమున నడచిన నాటి పాదముల చిహ్నములే యవి యని యెల్లవారును నమ్మదురు. కాబట్టి యా రామ పాదములను సందర్శింపవలెనను నభిలాషతో దూరదేశముల నుండి సహితము యాత్రాపరులు వచ్చి రామపాద క్షేత్రమున నఖండ గౌతమీస్నానము చేసికొని, కొండ మీఁది కెక్కి శ్రీ జనార్ధనస్వామివారి దర్శనము చేసికొని, స్వశక్త్యానుసారముగా దక్షిణతోడి ఫలములను సమర్పించి కలిగినవారైన స్వామికి భోగము సహితము చేయించి మఱి పోవుచుందురు. అది దివ్యక్షేత్ర మగుటం జేసి జాతిమతభేదములేక యెల్లవారును పులియోగిరము దధ్యోదనము మొదలుగాఁ గల స్వామి ప్రసాదమును స్వీకరించి కన్నుల కద్దుకొని యచ్చటనే యారగించి చేతుల నంటుకొన్నదానిని కడుగుకొన్న నప చార మగును గనుక గరతలములు పయికెత్తి చేతుల కందినంత వఱకు దేవాలయ స్తంభములకును గోడలకును వర్ణము వేయుటయే కాక తచ్ఛేషముతోఁ దమమీఁజేతులకును బట్టలకును మెఱుఁగు పెట్టు కొనుచుందురు. ఈ కొండకు దక్షిణమునకు తూర్పునను కొంత దూరము వఱకు గ్రామము వ్యాపించి యున్నది. పర్వతము పేరే పూర్వము గ్రామమునకుంగూడఁ గలిగియుండెను. కాని యిప్పడిప్పడు గ్రామ మును ధవళేశ్వర మని వ్యవహరించుచున్నారు. కొండమీఁది నుండి సోపానములు దిగి వచ్చినతోడనే రాజవీధి యొక్క యావలి ప్రక్కను శ్రీ అగస్త్యేశ్వరస్వామివారి యాలయ మొక్కటి లోచన గోచరం బగును. తొల్లి వింధ్యపర్వతము యొక్క గర్వము నణఁచి దక్షిణాభి ముఖుఁడయి చనుచు అగస్త్యుఁడాస్వామిని అచట ప్రతిష్టచేసెనని స్థల పురాణము చెప్పచున్నది. ఈ దేవాలయమునకును పర్వతమునకును మధ్యను తూర్పుననుండి పడమటకు గోదావరి వఱకును విశాల మయిన రాజవీధి యొకటి గలదు. ఆ వీధి చివరను నల్లరాళ్ళతో నీటి వఱకును సోపానములు కట్టబడియున్నవి. సోపానములకు సమీప మున వీధికిఁ దూర్పు ప్రక్కను "ధర్మచావడి" అని యొకటి యుండెను. అది పరదేశబ్రాహ్మణులను మార్గస్థులను రాత్రులు పరుండుటకై మొట్టమొదట కట్టబడినది కాని, ఆ కాలమం దది యుబుసు పోవుటకై గ్రామములోని పెద్ద మనుష్యులు ప్రతిదినమును ఉదయా స్తమయ సమయములయందు ప్రోగై యిష్టకథా గోష్టిం గొంత ప్రొద్దుపుచ్చి పోవుచుండుటకు మాత్రము వినియోగ పడుచుండెను.
ఒకానొక దినమున సూర్యుఁ డుదయించి ప్రాచీముఖంబునఁ గుంకుమబొట్టచందంబు వహించి వృక్షాగ్రములను బంగారు నీరు పూసినట్టు ప్రకాశింపఁజేయుచుండెను; చెట్ల మీఁది గూళ్ళనుండి కల కల ధ్వనులతో వెలువడి పక్షులు నానా ముఖముల ఎర కయి వెడలు చుండెను: పసులకాపరి బాలురు చలుదులు మూటగట్టుకొని పశువుల మందలను దోలుకొని పచ్చికపట్ల కరుగుచుండ, వెనుక 'వెల్లావు కడి నాది' 'దోరగేదె కడి నాది"యని గంపలు చేతఁబట్టకొని, పడుచు లొండొరుల మీఱి పరుగులిడుచుండిరి. కాపులు ములుకోలులు భుజముల మీఁదఁ బెట్టుకొని, కోటేరులను దోలుకొని తమతమ పొలము లకుం బోవుచుండిరి; అప్పడు కాయ శరీరముగల యొక పెద్ద మనుష్యుఁడు జందెము పేరుగా వేసికొని యెడమచేతిలో నిత్తడి చెంబు నొకదానిం బట్టుకొని, గోదావరిలోఁ గాళ్ళును చేతులును గడుగుకొని, ఒడ్డునకు వచ్చి పుక్కిలించివైచి యజ్ఞోపవీతమును సవ్యముగా వేసికొనివచ్చి, ధర్మశాల మీఁద నొడ్డున గూర్చుండి. వచ్చునప్పడు చెంబులో వేసి తెచ్చుకొన్న తుమ్మ పుడకతో దంత ధావనము చేసికొనుచుండెను. ఆయనకు వయస్సు నలువది సంవత్సరము లుండును: మొగము మీఁద స్ఫోటకపు మచ్చలే లేకపోయె నేని, మొగము సుందరమయిన దనుటకు సందేహింప నక్కఱు యుండదు; అట్లని, యాముఖ మాయనను నిత్యమును దర్శింపవచ్చు ప్రవక్తల స్తోత్రములకు మాత్రమెప్పుడును బాత్రము కాకపోలేదు; శరీరచ్ఛాయ యెఱ్రనిది; విగ్రహము కొంచెము స్థూలముగాను పొట్టి గాను ఉండును; నుదురు విశాలమయి చూచువారి కతడు పండితుఁ డని తోపఁజేయుచున్నది; అప్పుడు కట్టుకొన్నది గోరంచు నీరు కావి దోవతి; సరిగంచుల చలువ వస్త్రమొకటి శిరస్సునకు వదులుగా చుట్టఁబడి కొంగు కొంత వ్రేలాడ వేయబడి యున్నది; చెవుల నున్న రవలయంటుజోడును, కర్మిష్టుఁ డనుటకు సాక్ష్యమిచ్చుచున్న కుడిచేతి యనామిక యందలి బంగారపు దర్భముడి యుంగరమును తర్జని యందలి వెండి బటువులు రెండునుదప్ప శరీరమున నాభర ణము లేవియలేవు; ఆయన పేరు రాజశేఖరుఁడు; ఆయన ముఖ ప్రక్షాళన మగునప్పటికి గ్రామములోని గృహస్థులు నలువురును అక్కడకు వచ్చి ఆయన వారి వారి తారతమ్యముల కర్హముగాఁ దగిన మర్యాదలు చేసి కూర్చుండుఁడని చేయిచూప, "చిత్తము" 'చిత్తము" "మీరు దయచేయండి" అనుచుఁ జావడినిండఁ గిటకిట లాడుచుఁ గూరుచుండిరి.
అప్పుడు రాజశేఖరుఁడుగారు 'సిద్ధాంతిగారూ! మీరు నాలుగు దినములనుండి బొత్తిగా దర్శన మిచ్చుట మానివేసినారు. మీ యింటఁ బిన్న పెద్ద లందఱును మఱేమియు లేకుండ సుఖముగా నున్నారు గదా?" సిద్ధాంతి-"చిత్తం చిత్తము. తమ యనుగ్రహమువల్ల మే మందఱము సుఖముగానే యున్నాము. ఎన్ని కుటుంబములనైన నన్న వస్త్రాదు లిచ్చి కాపాడఁగల ప్రభురత్నములు తమరు గ్రామములో నుండఁగా మా వంటి వారి కేమి కొదువ మా గ్రామము చేసి కొన్న భాగ్యముచేతను, మా పురాకృత పుణ్యము చేతను, తమవంటి దాన కర్ణులు మా గ్రామమునకు విజయం చేసినారు గాని మఱియుకటి కాదు" అని రామశాస్త్రిగారి వంకఁ దిరిగి, "మనము వారి ముఖము ముందఱ స్తుతిచేయవలసినది కాదు గాని రాజశేఖరుఁడుగారు కేవ లము నీశ్వరాంశ సంభూతులు సుండీ."
ఆ మాటల కాదరమును సూచించెడి మందహాసము చేసి రామ శాస్త్రి "అందుకు సందేహమేమి? ఈ సంగతి మీరు నాతోఁ జెప్ప వలెనా? వారీ గ్రామమున నుండఁబెట్టి మన మందఱము వారియండను విలువఁగలిగినాముగాని, లేని యెడల నిండ్లును వాఁకిళ్ళను విడిచిపెట్టి మన మీపాటికి దేశములపాలయి లేచిపోవలసినవారము కామా? వారి తండ్రిగా రిక్కడకు వచ్చినప్పటినుండి యిది యొక గ్రామముగాఁ గనబడుచున్నదిగాని యింతకుఁ బూర్వము దీనికి నామరూవము లున్నవా?"
అని, మంచి సమయము తటస్థించినప్పడు తన పాండిత్య మును దాఁచిపెట్టక, అందుకొని సిద్ధాంతిగారి స్త్రోత్రపాఠములకు సాయ ముగాఁ దనవి కూడ నాలుగు కలిపెను.
అప్పడు రాజశేఖరుఁడుగారు మనసులో మిక్కిలి సంతోషించి నను పయి కాసంతోషము కానరాకుండ నఁడచికొని "పిద్ధాంతిగారూ! మొన్న మీ రెండవ చిన్నదాని కేమో గ్రహబాధ కనఁబడ్డట్టు విన్నాను. కొంచెము నిమ్మళముగా నున్నదా"
అని యడిగినతోడనే సిద్ధాంతిగారు మోమున దీనభావము గాని పింపఁ గొంచెమాలోచించి తలయూఁచి "జోస్యుల కామావధానుల చేత విభూతి పెట్టించుచున్నాను. కాని దానివల్ల నిన్నటి కేమియు గుణమే కనఁబడలేదు. జాతకరీతిచే దాని కిప్పుడు శని చాలదు. ఎందుకైనను మంచిదని నా తమ్మునిచేత నవగ్రహ జపము చేయించుచున్నాను. అంతతో నూరకుండక కామావధానులుగారినే 'పంచముఖి వీరహనుమంతము పునశ్చరణ చేయవలసిన దనియు, జపశాంతి కేమయిన గావలసియున్న ఏ రాజశేఖరుఁడుగారినైన కాళ్ళో కడుపో పట్టుకొని తెచ్చి నాలుగురూపాయల సొమ్మిచ్చుకోనైన నిచ్చుకొనియెద మంచి విభూతి పెట్టుమనియు ఆయన ననుసరించి బతిమాలుచున్నాను. అందు చేతనే యీ నాలుగు దినములనుండి దర్శనము చేయలేదు గాని లేక పోయిన నేది యెట్లయినను నేను తమ దర్శనము మానుదునా?"
రాజ-"శాస్త్రిగారూ! మీరు రూపాయిల నిమిత్తము సంశయ పడ నక్కరలేదు. కావలసియున్న ఆ నాలుగురూపాయలను నే నిచ్చెదను. మఱి నాలుగురూపాయలు పోయినను మంచి వైద్యుని విచారింపవలెను. మన గ్రామములలో కామావధానులుగారికన్న_" అని మిన్ను వంక చూచి యేమో యాలోచించుచుండెను. సిద్ధాంతి గారు చేసిన స్తుతి యమోఘముగాఁ బట్టుకొని కొంచెముగానో, గొప్పగానో ధనరూపమైన ప్రతిఫలమును దెచ్చుచునే వచ్చుచున్నది గాని యీవఱ కెన్నఁడును రాజశేఖరుడుగారి వద్ద వ్యర్థముగా బోలేదు.
ధవళేశ్వరము నందును చుట్టుపట్టుల గ్రామములయందును వేఱు సిద్ధాంతి లేఁడు గనుక, ఆయన యింటికి వచ్చి వర్జ్య మొప్ప డని కాని, ప్రయాణముకు ముహూర్తము పెట్టుమని కాని, క్రొత్త బట్ట చించి కట్టుకొనుట కేదినము మంచిదని కాని, ఇల్లు కట్టుకొన నారంభించుట కేమాస మనుకూలమైనదని కాని, క్షౌరము చేయించుకొనుట కేవారము మంచిదని కాని, వివాహమునకు లగ్నము పెట్టుమని కాని, రజస్వల యయినప్పడు నక్షత్రము చెప్పు మని కాని, సదా యెవ్వరో యొక రాయన నడిగి పోవుచునే యుందురు. దూరబంధువులు పోయినప్పడు మైల యెంతకాలము పట్టవలెనో తెలిసికోవలె నన్నను, జబ్బు నక్షత్రమున నెవ్వరైన మృతినొంది నప్పుడు ఇల్లు వదలి యెంతకాలము లేచిపోవలెనో కనుఁగొనవలె నన్నను, రోహిణ్యాది నక్షత్రముల యందు బిడ్డను గన్నప్పుడేమి శాంతి తగులునో యెఱుఁగవలెనన్నను, సిద్ధాంతి యొద్దుకురాక సరి పడదు. ఏ కాపువాని పశువు తప్పిపోయినను, ఎవనింట ఏ వస్తువు పోయినను, వచ్చి సిద్ధాంతిగారి నడుగక పోరు.ఇటువంటి సమయము లయం దెల్లను,అతఁడు వీధి నడవలో నేలమీఁద ఇసుక పోసి దానిలో పూచికపుడకతో ఏమేమో బీజాక్షరములను అంకెలును వ్రాసి మీఁది వంక చూచియాలోచించి వచ్చిన కార్య మిదియనియు,కార్య మీ ప్రకార ముగా నగుననియు చెప్పి పంపుచుండును. అతఁడు బల్లి పాటు మొదలైన వాని ఫలములను, శకునములు చూచి సంతానము కలుగు కాల మును కూడ చెప్పచుండును. వేయేల? సిద్ధాంతి యాలోచన లేక యాచేరువ గ్రామములో ఏ శుభకార్యముకాని యశుభకార్యముకాని జరగదు. ఆతఁడు చెప్పెడి జ్యొతిషము తఱచుగా అబద్దమే యగుచు వచ్చినను, అప్పడప్పడు కాకతాళీయముగా కొన్ని సంగతులు నిజ మగుటయుఁ గలదు గనుక జనులాతనిమాట యమోఘమని నమ్ముచునే యుండిరి.
అప్ప డా చావడిలో నున్న వారిలో నెవరో "బైరాగులు భూతవైద్యమునకు గట్టివా" రని మెల్లగా ననిరి. అంతలో రాజ శేఖరుఁడుగారు సిద్ధాంతిగారి వంకఁ జూపు త్రిప్పి "ఔను. బైరాగు లన్నతోడనే జ్ఞప్తికి వచ్చినది. పది దినముల క్రిందట ఈ గ్రామమున కెవ్వఁడో యొక బైరాగి వచ్చినాఁడట! ఆతనికిఁ జూపింప రాదా? గోసాయీలకుఁ బరమహంస క్రియలను వనమూలికలును విశేషముగాఁ దెలిపి యుండును, వాండ్రెట్టి యసాధ్యమైన పీడల నైనను జిటికెలోఁ బోఁగొట్టుదురు" అనిన తోడనే చావడి యంతయు "చి త్తము" "వాస్తవము" "ఆలాగున నవశ్యము చేయ వలసినదే" యను ధ్వనులతో నిండిపోయెను. మాటాడువారు ధన వంతులైనచో, వ్యర్థవచనము నహితము స్తుతియోగ్యము కాక పోదు సుండీ. ఆ మాటలవలన నుత్సాహము కలిగి, రాజశేఖరుఁ డుగా రాబైరాగిని తాము చూడక పోయినను బ్రహ్మ వర్చస్సు కల వాఁడని శ్లాఘించిరి. అంత సిద్ధాంతి యుల్లములో లేని సంతోషమును మోమునఁ దెచ్చిపెట్టుకొని యొక్క చిఱునవ్వు నవ్వి, వినయముతోఁప చేతులు జోడించి రాజశేఖరుఁడుగారి ముఖమున దృష్టి నిలిపి, "తమ మాట చేతనే మా చిన్నదాని బాధ నివారణమయినదే. దాని యదృష్టము బాగుండ బట్టియే దేవరవారి ముఖమునుండి యీ మాట వచ్చినది. ఇప్పుడే తమ సెలవు ప్రకారము బైరాగి యొద్దకు వెళ్ళెదను" అని మనవిచేసి, ప్రయాణోన్ముఖుఁ డయి లేచి నిలువఁబడెను. రాజశేఖరుఁడుగారి యభిప్రాయము కొంచెము తెలిసినతోడనే బైరాగి మహానుభావుఁ డనువారును, మహామంత్రవేత్త యనువారును, వాయుభక్షణము చేయుననువారును, మండువేసవిని పంచాగ్ని మధ్యమునఁ దపస్సుచేయు ననువారును, ఆయి సభ యంతయు ఆతని విషయమైన స్తుతి పాఠములలో మునిఁగి పోయెను. ఒక్కగొప్పవాఁ డొకనిని మంచి వాఁడన్నచో, ఎవ్వని వాక్కు భిన్నముగా లేచును? ఎవ్వని నోరు స్తుతి వాక్యముల కొరకు తడుపుకొనును?
అప్పడు రాజశేఖరుఁడుగారు వీధి వంకఁ జూచి. "ఎవ్వరో స్త్రీలు నీళ్ళకువచ్చి మనలఁజూచి సిగ్గుపడి వెనుకకు నాలుగడుగులు పెట్టి నిలుచుండి యొండొరుల మొగముల వంకఁ జూచుకొను చున్నారు. మన మందఱమును లేచి బైరాగిని జూచి వత్తము రండి" అను మాట తోడనే ఎల్లరును లేచి ప్రయాణిలోన్ముఖు లయి నిలుచుండిరి. వెంటనే యందఱును గలిపి యుత్తర ముఖ ముగా రామపాదముల వైపునకు నడవ నారంభించిరి,