Jump to content

రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఎనిమిదవ ప్రకరణము

సంవత్సరాది__రాజశేఖరుఁడు గారి ప్రయాణము__రాజానగరము నకు సమీపమున నొకరాజు వడగొట్టి పడిపోవుట __నల్లచెఱువు సమీపమున నొకయోగి కనఁబడుట__ దొంగలు కొట్టుట__రుక్మిణి మరణము.

సంవత్సరాదినాడు తెల్లవారిన తరువాత రామమూర్తిగారు మంగలివానిని పిలిపించి రాజశేఖరుఁడుగారికిని సుబ్రహ్మణ్యమునకును వానిచేత తల యంటించిరి. ఇంటనున్న మగవారి యభ్యంజన స్నానము లయినతరువాత, ఆఁడువారందఱును తలంటుకొని నీళ్లు బోసికొనిరి. స్నానములయిన పిమ్మట వేపపువ్వును క్రొత్తమామిడి కాయ ముక్కలును క్రొత్తచింతపండు పులుసుతో నందఱును దేశాచారము ననుసరించి భక్షించి రెండుజాములకు పిండివంటలతో భోజనములు కావించి పండుగ చేసికొనిరి; పండుగదినములలో జనులు మఱింత యెక్కువ సుఖపడవలసినదానికి మాఱుగా, ఈ దేశములో వేళతప్పించి భోజనములుచేసి యట్టిదినములందు దేహములను మఱింత యాయాస పెట్టుకొందురు. మధ్యాహ్నము చల్లబడినమీఁదట రామమూ_ర్తిగారు రాజశేఖరుఁడుగారిని వెంటబెట్టుకొని నూతన పంచాంగశ్రవణమునకయి వేణుగోపాలస్వామివారి యాలయమునకుఁ వెళ్ళిరి. ఆ వఱకే యొక సిద్ధాంతి పసుపుతోఁ గలిపిన యక్షతలను పళ్ళెముతో ముందు పెట్టుకొని __

శ్లో॥ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్న దోషాపహ
    గంగా స్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యంనృణాం
    ఆయుర్వృద్ధి దము త్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం
    నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం॥

అను శ్లోకమును జదివి, సంక్రాంతి పురుషుని లక్షణమును వివరించి సంవత్సర ఫలమును జెప్పి, ధాన్యాదులయొక్కయు వృశ్చికాదుల యొక్కయు వృద్ధి

క్షయములను జదివి, జన్మనక్షత్రములను తెలియని యెడల నామ నక్షత్రములను తెలిసికొని యెల్లవారికిని కందాయముల యంకములను ఆదాయవ్యయములను జెప్పెను. అక్కడనున్న కాపులు మొదలగువారు సిద్ధాంతిగారిచేతిలో నేమైనఁబెట్టి తమ కేకందాయము నందును సున్నలు రాకుండఁ జేసికొనిరి. పంచాంగశ్రవణ మయిన తరువాత రామమూర్తిగారు__"సిద్ధాంతిగారూ! కలియుగము ప్రారంభ మయి యిప్పటి కెన్ని సంవత్సరము లయినది?"

సిద్ధాంతి__ఇప్పటికి కలియుగాది గత సంవత్సరములు ౪౭౧౯, శాలివాహన శకొబ్దములు ౧౫౪౧, విక్రమార్క శక సంవ త్సరములు ౧౬౭౬.

రామ__మనదేశములో మ్లేచ్చుల యధికార మింకను ఎంత కాలముండునో కాలమానమునుబట్టి చెప్పఁగలరా?

సిద్ధాంతి__మనదేశములో తురుష్కుల దొరతనము అయిదు వందల సంవత్సరములకు లోపల పోదు. ఆ పిమ్మట పూసపాటి వారి వంశమున వేపకాయంత తోకగలవా డొకఁడు పుట్టి, ఆసేతు హిమాచలమునగల సర్వప్రపంచమును మరల జయించును.

అంత ప్రదోషసమయమయినందున పంచాంగము కట్టిపెట్టి యందఱును తమ తమ యిండ్లకు నడచిరి.

రాజశేఖరుఁడుగారు విదియనాఁడు కాశీయాత్రకు బయలుదేఱ నిశ్చయించుకొని యెంద రెన్నివిధములఁ జెప్పినను వినక ప్రయాణ ముహూర్తమును పెట్టుటకై గుడిలో పంచాంగమును జదివిన పిడపర్తి శ్రీరామసిద్ధాంతిని పిలిపించిరి. ఆతఁడును తిధివారనక్షత్రము లను చక్కఁగా నాలోచించి యారాత్రియే పదియారుఘటికల తొమ్మిది విఘటికలమీఁద యాత్రకు యోగ్యసమయమని ముహూర్తముంచెను. ఆ సమయమున కుటుంబముతో బైలుదేరుట క్షేమకరము కాదని యెంచి, రాజశేఖరుఁడుగారు పొరుగింట నొకవస్త్రమును దానిలో చుట్టబెట్టి యొకపుస్తకమును నిర్గమనముంచి తెల్లవారినతరువాతనే బైలుదేరుటకు నిశ్చయించిరి. అప్పుడు రామమూర్తిగారు బండి నిమిత్తము వర్తమానము పంపఁబోఁగా వలదని వారించి బండినెక్కి పోయినయెడల యాత్రాఫలము దక్కదు గాన కాలినడకనే పోయెద నని రాజశేఖరుడుగారు చెప్పిరి. ఆ రాత్రియే వారికందఱికిని క్రొత్తబట్టలు కట్టఁబెట్టి, రామమూర్తిగారు ప్రాతఃకాలముననే వారి కంటె ముందుగా లేచి,వారు ప్రయాణమగునప్పటికి సిద్ధముగా నుండిరి. అప్పుడు రాజశేఖరుఁడుగారు తాము ధవళేశ్వరమునుండి తెచ్చిన పాత్ర సామాగ్రియు, మంచములను, బట్టల పెట్టెలను తాము మరలవచ్చు వరకును భద్రముగా జాగ్రత్త చేయవలయునని రామమూర్తిగారికి చెప్పి యొప్పగించి, దారి ప్రయాణమునకు ముఖ్యముగా కావలసిన వస్తువులను మాత్రము తమతో నుంచుకొనిరి. మాణిక్యాంబ మొదలగువారు బైలుదేరునపుడు రామమూర్తిగారి భార్య వీధి వరకును వచ్చి వారు దూరదేశయాత్రను జేయఁబూనుటను దలచు కొని కంటఁదడిబెట్ట మొదలుపెట్టెను. అప్పుడు వారందఱును గుమ్మములో నున్నవారియొద్ద సెలవు పుచ్చుకొని, ఒంటి బ్రాహ్మణుఁ డెదు రుగా వచ్చుచుండఁగా నతఁడు పోవువరకును నిలిచి యావల నొక పుణ్యస్త్రీ రాఁగా మంచి శకునమయినదని దారిసాగి నడువనారంభించిరి. రామమూర్తిగారు వారి నూరిబయలవరకును సాగనంపి దూర దేశప్రయాణమును జేయుచున్నారు గాన భద్రముగా వెళ్ళుఁడని బుద్ధులు చెప్పి వెనుకకు మరలి యింటికి వచ్చిరి. రాజశేఖరుఁడుగారు త్రోవ పొడుగునను చెట్లు మొదలగు వానిని భార్యకును బిడ్డలకును జూపుచు దారి నడువసాగిరి.

రాజ__చూచితిరా యీ మఱ్ఱిచెట్టు ఆమూలాగ్రము చిగిరించి, పగడములవలె నున్న యెఱ్ఱని పండ్ల గుత్తులతో నెంత మనోహరముగా నున్నదో!

సుబ్ర__ఔనౌను, దానిచేరువ నున్న మామిడిగున్న చీనాంబరమువలె నున్న లేఁత చిగుళ్ళతో మఱింతవింతగా నున్నది. కొన కొమ్మను జేరి కోయిల యొక్కటి మధురమైన కంఠధ్వనితోఁ జెవుల పండుపు సేయుచున్నది.

రుక్మి__నాన్నగారూ! రామచిలుక కొమ్మమీఁద తలక్రిందుగా నిలుచుండి జామపండు నేప్రకారముగా ముక్కుతో పొడుచుకొని తిను చున్నదో చూడండి.

సీత __అన్నయ్యా! నాకామామిడికాయ కోసియిచ్చెదవా?

సుబ్ర__అమ్మాయీ! చెట్టు క్రింద చిలుక కొట్టిన దోరకాయ లున్నవి తెచ్చుకో.

సీత పరుగెత్తుకొనిపోయి నాలుగయిదు కాయలను తెచ్చుకొని కొఱికి చూచి పంచదార వలె నున్నవని చంకలుకొట్టుకొనుచున్నది.

మాణి__ఎక్కడనుండియో యిప్పడు గుప్పున మల్లెపువ్వుల వాసన కొట్టినది

సుబ్ర__అమ్మా! వేగిరమురా. అదిగో పొగడచెట్టు మీఁద నొక యడవిమల్లెతీగ అల్లుకొని, గంపలకొలఁది తెల్లని పుష్పము లతో నిండియున్నది. మన యింటికడ నెన్ని నీళ్ళు పోసినను, మల్లె పువ్వు లీలాగున పూయవుగదా!

మాణి__ ఆహా: పొగడపువ్వు లెంతసువాసన గలిగియున్నవి

సుబ్ర__ఇప్పడు పది గడియల ప్రొద్దెక్కినను, గాలి యెంత చల్లగా కొట్టుచున్నది! మన యింటివద్ద నెన్నఁడైన వేసవికాలములో గాలి యింత చల్లగా నున్నదా?

రాజ__సర్వేంద్రియములకు సౌఖ్యము కలుగునట్టుగా, మార్గ స్థుల సంతోషమునకై యిటువంటివాని నన్నిటిని సృజించి నిర్హేతుక జాయమానకటాక్షముచేత స్వేచ్ఛముగా ననుభవింప ప్రసాదించిన యీశ్వరుని మహత్త్వము నెఱిగి కొనియాడ మన మెంతవారము? మనమెన్నడును నిల్లు కదలక పోవుటచేత నిటువంటి సౌఖ్యముల నేమియు నెఱుఁగనివారమై యుండియ, మనమే యెల్లవారికంటెను మిక్కిలి సుఖపడుచున్నా మనుకొని గర్వపడుచుంటిమి. ఈ యడవులలోనే సదా కాపుర ముండి, దీనబంధువైన పరమాత్ముని యను గ్రహమువలనఁ గలిగిన యీ సౌఖ్యముల ననుభవించుచుండెడి యీ వనచరులైన కిరాతులు మొదలగువా రెంతటి యదృష్టవంతులు ఆహా! గ్రామములో నెప్పుడును మన కీవసంతకాల మింత మనోజ్ఞముగా నుండలేదుగదా?

సీత__అమ్మా! నేనిఁక నడవలేను. నన్నెత్తుకో,

మాణి__ఆ చెట్టదాఁక నడచిరా, అక్కడ యెత్తుగొనెదను. రుక్మిణీ, వెనుకపడుచున్నా వేమి? రెండడుగులు వేగిరము పెట్టు.

రుక్మి__అలవాటు లేకపోవుటచేత కాళ్ళ పొక్కులెక్కినవి. వేగిరము నడవలే కున్నాను.

రాజ__పసులకాపరివాని నడిగినాను. ఊరొక క్రోసున్నదంట! రెండుజాములు కావచ్చినది. ఏలాగునైనను కొంచెము శ్రమచేసి నాలుగడుగులు వేగిరము నడువవలెను.

మాణి__సీత నెత్తుకొని నడచుచున్నాను. ఆఁకలియగుచున్న దని యిది యేడ్చుచున్నది. మన కుడిచేతివైపున దూరమున నేమో మనుష్యుల మాటలచప్పడు వినవచ్చుచున్నది. అది యూరేమో మన మీ పూఁట అక్కడ దిగుదమా?

రాజ__ఎవ్వరో మనుష్యు లక్కడ తొందరపడి పరుగెత్తు చున్నారు; వారిలో నెవ్వరికైన నొకయాపద వచ్చియుండఁబోలును! శీఘ్రముగా వెళ్ళుదము రండి.

ఆని వేగముగా నడచి వారు మనుష్యుల కలకలములు వినఁ బడుచున్న ప్రదేశమునకు సమీపముగాఁ బోఁగా, మార్గమునకుఁ గొంచెముదూరములో దక్షిణపుదిక్కున మూగియున్న గుంపులోనుండి "శుద్ధిచేయుటకు మజ్జిగ" యని కేకలు వేయుచు కొందఱు పరుగెత్తు కొని వచ్చుచుండిరి. రాజశేఖరుఁడుగారు వాండ్రను జూచి యాసం దడి యేమని యడుగఁగా, వారిలో నొకగొల్లవాఁడు 'రాచకుమారుఁ డొకడు వడగొట్టి యారావిచెట్టు క్రింద పడిపోయినాఁ' డని చెప్పెను.

రాజ__మీ రాతని గొంతుకలోఁ గొంచెము నీళ్ళు పోయక పోయినారా? గొల్ల__మొట్టమొదట మేము నీళ్ళియ్యఁబోఁగా, శూద్రులము కాబట్టి మాచేతినీళ్ళు త్రాగనని యారాజు పుచ్చుకొన్నాఁడుకాఁడు. తరువాత దాహమునకు తాళలేక మాచేతినీళ్ళు త్రాగుటకొప్పుకొన్నాడు. కాని మా వారిలో పెద్దవాఁడు వచ్చి, శూద్రుఁడు రాజు నోటిలో నీళ్ళు పోసిన పాపమువచ్చునని చెప్పి, నీళ్ళు శుద్ధిచేయుటకై మజ్జిగనిమిత్తము మమ్ముఁబంపినాఁడు. మా పల్లె యిక్కడికి పావు క్రోసు దూరమున నున్నది. మీరు బ్రాహ్మణులుగాఁ గనఁబడుచున్నారు. మీవద్ద నేమయిన మంచితీర్థ మున్నయెడల, వేగిరముపోయి యాతని గొంతుకలో నాలుగుచుక్కలు పోసి పుణ్యము కట్టుకొండి.

ఆ మాటలు విని రాజశేఖరుడుగారు రుక్మిణిచేతిలో నున్న మంచినీళ్ళచెంబును పుచ్చుకొని, చెట్టు దగ్గఱకు పరుగెత్తిపోయి గుంపులోనుండి త్రోవచేసికొని ముందుకు నడచి గుంపు నడుమను చెట్టునీడను కటికి నేలను పరుండి చేతితో నోరునుజూపి నీళ్ళు నిమిత్తము సైగచేయుచున్న యొక మనుష్యునిఁ జూచిరి. ఆ మూఁక లలో నొకఁడు నీళ్ళముంతను జేతిలో బట్టుకొని "ఈ రాజు నిష్కారణముగా జచ్చిపోవుచున్నాఁడు; ఏ దోషము వచ్చినను నీళ్ళు పోసి బ్రతికించెద" నని చేరువకుఁ బోవుచుండెను. అప్పు డొక్క-ముసలివాఁ డడ్డము వచ్చి వానిచేయిపట్టుకొని నిలిపి, “ఈవరకుఁ బూర్వజన్మములో మనమెన్నియో పాపములను జేయుట చేతనే మనకిప్పు డీశూద్ర జన్మము వచ్చినది. ఇప్పు డీరాజును జాతి భ్రష్ట్రునిజేసి యీ పాపము సహితము కట్టుకోవలెనా? నామాట విని నీళ్ళు పోయవలద”ని వారించుచుండెను. ఇంతలో రాజు కన్నులు తేలగిల వైచి, చేయి నోటివద్ద కెత్తఁబోయి వడకించుచు క్రిందఁ బడవైచెను. అప్పడు రాజశేఖరుఁడుగారు వెంటనేపోయి మంచినీళ్ళతో ముందుగా నెండుకొనిపోవుచున్న పెదవులను దడిపి నోటిలోఁ గొంచెము నీళ్ళు పోయఁగా గొంతసేపటి కాతఁడు మెల్లఁగా చప్పరింప నారంభించెను. అంతట రాజశేఖరుడుగారు తనచేతిలోని యుదకముతో మొగమును దడిపి మఱికొంచెము నీరు లోపలికిఁ బోయఁగా త్రాగి కన్నులు విప్పి చూచి రెండవ ప్రక్కకొత్తిగిలి మఱికొంతసేపునకు సేద తేఱి, ఆ రాజు తన జీవములను నిలిపినందులకై రాజశేఖరుఁడుగారికి కృతజ్ఞతతో బహనమస్కారములు చేసి లేచి కూరుచుండెను. ఇంతలో పల్లెకుఁ బోయినవారు మజ్జిగయు, కొన్ని పండ్లను దీసికొనివచ్చి యిచ్చిరి. ఆ రాజు కొన్ని పండ్లను లోపలికిఁ బుచ్చుకొని మజ్జిగ త్రాగి స్వస్థ పడెను. అంతట నక్కడనున్న వారందఱును తమ తమ త్రోవలను బోయిరి. ఈలోపల మాణిక్యాంబ మొదలగువా రొక తరువు నీడను గూర్చుండి మార్గాయాసము కొంత తీర్చుకొనిరి. రాజశేఖరుఁడుగారు మిక్కిలి బడలియున్నవారయ్యను, సమీపములో నెక్కడను ఊరు లేదని విన్నందున నేవేళకైనను రాజా నగరమునకుఁ బోవ నిశ్చ యించుకొని, తమవారినందఱిని లేవ నియమించి యారాజుతో ముచ్చట లాడుచు దారిసాగి నడవనారంభించిరి.

రాజ:__రాజుగారూ! మీ పేరేమి? మీ నివాసస్థల మెక్కడ? మీరిక్కడ కొంటిగా నెందుకు వచ్చినారు?

రాజు__నాపేరు రామరాజు; మాది పెద్దాపురమునకు సమీప ముననున్న కట్టమూరు వాసస్థలము; మా కక్కడ నాలుగు కాండ్ల వ్యవసాయ మున్నది:రాజమహేంద్రవరములోనున్న మా బంధువులఁ జూచుటకై పది దినముల క్రిందటపోయి, నిన్న తెల్లవారుజామున బయలుదేరి మరల వచ్చుచుండఁగా నొక పెద్దపులి వచ్చి న న్నెదిరించి నది; నాపైన నున్న యుత్తరీయమును వేగముగా నెడమచేతికిఁ జుట్టుకొని యాచేయి పులినోటి కందిచ్చి రెండవచేతిలోని కత్తితో దాని ఱొమ్మునఁ బొడిచితిని; ఆ పులి బలముకలది కాఁబట్టి యాపోటును లక్ష్యముచేయక త్రోవపొడుగునను నెత్తురు గాలువలగట్ల నన్నడవి లోనికి బహుదూర మీడ్చుకొనిపోయెను; ఈలోపల నేనును కత్తితో దానిని పలుచోట్లను బొడిచినందున నడువలేక యొక వృక్షసమీపమునఁ బడిపోయెను. నేను బహప్రయాసముతోఁ జేయి వదల్చుకొనుటకై కుడిచేతిలోని కత్తి వదలిపెట్టి దానినోరు పెగలించి చేయూడఁదీసి కొంటిని; ఇంతలో మునుపటిదానికంటెను బలమైన మఱియొక వ్యాఘ్రము చేరువపొదయం దుండి నామీఁదికి దుమికెను: కాని దైవ వశముచేతఁ గొంచెము గుఱితప్పి నాప్రక్కనున్న చిన్న గోతిలో బడెను; కత్తిని బుచ్చుకొనుటకు సమయము చిక్కనందున వెంటనే నేను వృక్షమున కెగఁబ్రాఁకి అది మరల దూఁకులోపల పైకొమ్మను జేరి కూర్చుంటిని; పులియు విడిచిపోవక వృక్షము క్రిందనే పీట పెట్టు కొని కూరుచుండెను; నేఁడు తెల్లవారిన తరువాత పది గడియల ప్రొద్దెక్కు వఱకును అది యాప్రకారముగానే యుండి చివరకు విసిగి లేచిపోయినది; నేను నిన్నటి యుదయమునుండియు నిద్రాహారములు లేక వృక్షశాఖయందే యుండి, పులిపోయిన గడియకు మెల్లగా వృక్షముదిగి కత్తిని చేతఁబుచ్చుకొని బయలుదేఱి గతదినమంతయు నెండచేత మలమల మాడినందున నాలిక పిడచకట్టి నడచుటకు కాళ్ళ యందు సత్తువ లేక యేరీతినో దేహము నీవృక్షచ్చాయకుఁ జేరవైచి పడిపోయితిని. నాకు చేతిమీఁదమాత్ర మివుగో రెండు గాయము లైనవి.

అని చెప్పి చేయి చూపి పైకి చేతికఱ్ఱలాగున నగుపడుచున్న యొఱయందున్న కత్తినిదీసి చూపెను. రాజశేఖరుడుగారును దానిని పుచ్చుకొని చూచి యాతఁడుచేసిన సాహసకార్యమునకు మిక్కిలి యాశ్చర్యపడసాగిరి.

రామ:__నాకు మీరీదినమున పోయిన ప్రాణములను మరల నిచ్చినారు; మీకు నా ప్రాణము లిచ్చినను మీరు చేసిన యుపకారము యొక్క ఋణము తీఱదు. నాయందు దయచేసి నేను కృతజ్ఞతా సూచకముగా జేయు నమస్కారముల నంగీకరింపుడు. అదృష్టదేవత యితరులను ధనదానము మొదలయిన కార్యములచేతఁ దమ కృతజ్ఞతను దెలుపునట్టుగాఁజేసి యిప్పుడు బీదవాఁడనైయున్న నన్నుమాత్రము మీయంతటి మహోపకారికి వట్టిమాటలచేతనే నా కృతజ్ఞతను దెలుపు నట్టు చేసినందున కెంతయుఁ జింతిల్లుచున్నాఁడను. అయినను నాచేత నైన యుపకారము మీకేదైన గావలిసియున్నచో నా ప్రాణములకైన నాశపడక చేయ సిద్ధముగా నున్నాఁడను, మీ రిప్పు డెక్కడకు బోయెదరు?  రాజ__కాశియాత్రకయి బయలుదేఱినారము.

రామ__ఈ వేసవికాలము ప్రయాణమున కెంతమాత్రమును మంచిసమయముకాదు. ఈ యెండలో మీరు గాడుపుకొట్టి పడిపోవుదురు. త్రోవపొడుగునను దొంగల భయము విశేషము. మీకు రాజమహేంద్రవరములో నెవరైన బంధువులున్నారా? లేక మీకదే నివాస స్థలమా?

రాజ__గోటేటి రామమూర్తిగారిని మీ రెఱుఁగుదురా? అతఁడు నా పినతండ్రి కొమారుఁడు; వారి యింటనే నేను పదియేను దినము లుండి బయలుదేఱినాను. మా స్వస్థలము ధవళేశ్వరము.

రామ__మీపేరేమి? వీరందఱును మీకేమగుదురు?

రాజ__నా పేరు రాజశేఖరుడు; వాఁడు నా కొమారుడు; ఆ యాడుపిల్లలిద్దఱును నా కొమార్తెలు; అది నా భార్య.

రామ__మీరింత వేసవికాలములో యాత్రకు బయలుదేఱుటకు కారణమేమి? మీ వైఖరి చూడ మిక్కిలి సుఖము ననుభవించినవారుగాఁ గనఁబడుచున్నారు.

రాజ__నేను మొదట ధనికుఁడనే యౌదును, కాని నావద్ద నున్న ధనమునంతను నా కొమార్తె వివాహములో నిచ్చిన సంభావనల క్రిందను ముఖస్తుతులనుచేయు మోసగాండ్రకుఁ జేసిన దానముల క్రిందను వెచ్చపెట్టి బీదవాఁడనయిఁ కడపట యాత్రకుఁ బయలుదేఱి నాను.నిత్యమును వారి స్తుతిపాఠముల స్వీకరించి నేను తుష్టిపొందుచుం టిని; నా ధనమును స్వీకరించి వారు తృప్తినొందుచుండిరి. తుదకొక బైరాగి బంగారము చేసెదనని నాయొద్దనున్న వెండి,బంగారముల నపహరించి వానికి బదులుగా నింత బూడిద నిచ్చిపోయి నన్ను నిజమైన జోగినిగాఁ జేసెను.

రామ__మున్నెప్పుడును మీరు దూరదేశప్రయాణములను చేసినవారుకారు.నా మాటవిని మీ రీ వేసవికాలము వెళ్ళు వఱకైన భీమవరములో నుండుఁడు. అది గొప్ప పుణ్యక్షేత్రము; భీమ నది సమీపమున భీమేశ్వరస్వామివారి యాలయమున్నది; దానికిని పెద్దాపురమున కును క్రోసెడుదూరము కలదు. పెద్దాపురమును పాలించుచున్న కృష్ణ గజపతిమహారాజుగారు మిక్కిలి ధర్మాత్ములు: వారు తమ ప్రజల క్షేమమును విచారించు నిమిత్తమయి మాఱు వేషము వేసికొని తిరుగు చుందురు; వారియొద్ద మా బంధువొకఁడు గొప్ప పనిలో నున్నాఁడు. మీరు భీమవరములో నుండెడిపక్షమున, మా వానితో మాటాడి సమయము వచ్చినప్పడు మీకొక యుద్యోగమును జెప్పించెదను.

రాజశేఖరుఁడుగారు మంచివారుగనుక పెద్దాపురము వెళ్ళిన మీఁదట నాలోచించెదమని యప్పటికి చెప్పిరిగాని,యా రాజుస్థితిని జూచి యాతఁడుద్యోగము జెప్పించునన్న యాశను మాత్రము పెట్టుకొన్నవారు కారు. ఈ మాటలు ముగియునప్పటికి వారు గ్రామమును సమీ పించిరి.

రాజ__ఆ చెట్లకు గ్రామ మెంతదూరము?

రామ__గ్రామసమీపమునకు వచ్చినాము. ఆ చెట్లు చెఱువు గట్టు మీదివి; చెఱువున కెదురుగానే సత్రమున్నది.

రాజ__మీరీపూట మాతో భోజనము చేసెదరా?

రామ__నాకు గ్రామములో బంధువులున్నారు; అక్కడకు వెళ్ళి భోజనముచేసి, చల్లపాటు వేళ మెల్లఁగా బయలుదేరి వచ్చెదను. మీరు స్త్రీలతో బయలుదేఱినారు. కాబట్టి భోజనముచేసినతోడనే ప్రయాణమయి ప్రొద్దుకుంక ముందే వేడిమంగలమును దాటవలెను. అక్కడ దొంగల భయము బహు విస్తారము. మీరేలాగున నయిన శ్రమచేసి చీకటిపడకముందే పెద్దాపురము చేరి యొకనాఁ డక్కడ నుండుఁడు. నేను మిక్కిలి డస్సియున్నాను గనుక మీతో నిప్పుడు రాలేను. రేపటిదినము వచ్చి మిమ్ముఁ గలిసికొనెదను.

అని రాజశేఖరుడుగారికి నమస్కారము చేసి, అందరివద్దను సెలవు పుచ్చుకొని తోవలో భద్రమని పలుమాఱు చెప్పి, రామరాజు తనదారిని పోయెను. వంటలైన తరువాత భోజనములుచేసి వారందఱును బయలుదేఱి యెండలో దేహముల నిండను జెమ్మటపట్ల, ఆడు గడుగునకు ముంతెడు నీళ్ళు త్రాగుచు నడుమనడుమ వృక్షచ్ఛాయలను నిలుచుచు అడుగొక యామడగా నడచి నాలుగు గడియల ప్రొద్దువేళ నల్లచెఱవు చేరిరి. ఆ చెఱువుగట్టునకు క్రిందుగానున్న యొక జువ్వి చెట్టు మొదలను తాటాకు పందిరిలో దేహమునిండ విభూతి పూసికొని కంఠమునను చేతులను శిరస్సునను రుద్రాక్షమాలలను ధరించుకొని గూరుచుండి వారిని సైగచేసి పిలిచి, దగ్గఱనున్న చాపమీఁద గూరు చుండ నియోగించి యెుక యోగి కుడిచేతిలోని తులసిపూసల తావళ మును ద్రిప్పుచు నోటిలో నేమేమో జపించుకొనుచు నడుమ నడుమ నొక్కొక్క ప్రశ్న వేయనారంభించెను.

యోగి__మార్గస్థులారా! మీరు మిక్కిలి యెండఁబడి మార్గాయాసముచే బడలియున్నారు. కొంచెముసే పిక్కడ విశ్రమించి పొండి. సకుటుంబముగా బయలుదేఱినట్లున్నది. మీ రెక్కడకుఁ బోయెదరు ?

రాజ__కాశీయాత్ర పోవుచున్నాము.

యోగి__ అట్టి దూరదేశయాత్ర ధనవంతులకు లభింపదు. త్రోవ పొడుగునను సత్రములు లేవు. మీరేమైనా ధనమును సేకరించు కొని మఱి బయలుదేఱినారు కారా?

రాజ__మావంటి బీదవారికి విశేష ధన మెక్కడనుండి వచ్చును? అయినను మేము నూరు రూపాయల సొమ్ము తెచ్చు కొన్నాము. ఏలాగునైనను వానితోనే గంగాయాత్ర చేసికొని రావలె నని యున్నది.

యోగి__మీరు బహు జాగ్రత్తగా నుండవలెను. ఇక్కడకు రెండు క్రోసుల దూరములోనున్న వేడిమంగలము వద్ద బాటసారులను దొంగలు కొట్టుచుందురు. గడియసేపు తాళుదురేని మా శిష్యులను తోడిచ్చి పంపెదము.

అని చెప్పి యా యోగి తావళమును ద్రిప్పుచు మరల జపము చేయనారంభించెను. ఏవేళకును నాతని శిష్యులు రానందున, రాజశేఖ రుఁడుగారు మనసులో తొందరపడుచుండిరి. ప్రొద్దును అంతకంతకు వాలుచుండెను.  రాజ__స్వామీ! మీ శిష్యులీవఱకును రాలేదు. రెండు గడియల ప్రొద్దున్నది. వేగిరము వర్తమానము పంపెదరా?

యోగి__ఆవశ్యముగాఁ బంపెదము,

అని చివాలున లేచి జువ్విచెట్ట్టునకు నూఱుబారల దూరములో నున్న యొక గుడిసెయొద్దకుఁ బోయి 'గోపాలిగా యని యొకపిలుపు పిలిచెను. లోపలినుండి చినిగినగుడ్డను కట్టుకొని బొగ్గువంటి శరీర ముతో బుఱ్ఱముక్కును మిట్టనొసలను తుప్పతలయు గొగ్గిపళ్ళును గల యొక కిరాతుఁడు బయలవచ్చెను. వానితో నేమేమో మాటాడుచు పందిరివఱకును దీసికొనివచ్చి, రాజశేఖరుఁడుగారు వినుచుండగా 'వీరికి సహాయముగాఁ బంపుటకయి మనవాండ్రను బిలుచుకొని యిక్కడ నున్నట్టగా రమ్మ'ని పంపెను.

రాజ__స్వామీ! మీ శిష్యు లేవేళకు వత్తురో చీకటిపడక ముందే వేడిమంగలము దాటవలేను. మేము నడుచుచుందుమా?

యోగి__అవును. మీరు చెప్పినమాట నిజమే. మీరు నడుచు చుండుడు, వాండ్రు వచ్చి మి మ్మిప్పుడే కలసికొందురు.

అప్పుడు రాజశేఖరుడుగారు పెండ్లముతోను బిడ్డలతోను బయలుదేఱి దొంగల పేరు జ్ఞప్తికి వచ్చినప్పడెల్ల గుండెలు తటతటఁ గొట్టుకొన, బుజముమీఁది మూటను పలుమాఱు తడవి చూచుకొనుచు, చీమ చిటుక్కు-మన్న వెనుక దిరిగి చూచుచు, కొంచెమెక్కడ నయినను పొద కదలిన నులికి పడుచు నడుచుచుండిరి.ఆ యోగిచే బంపబడిన కిరాతుఁడును వేగముగా నడచిపోయి త్రోవలో నొకచోట దిట్ట ముగా కల్లు నీళ్లు త్రాగి తూలుచు తల వణికించుచు చింతనిప్పుల వలె నున్న గ్రుడ్లు త్రిప్పచు సంకేతస్థలమును జేరి, అక్కడ నొక పాకలో నిదురించుచున్న మనుష్యుని చేతితో గొట్టి లేపి, "ఓరీ ఒక బ్రాహ్మణుండును కొడుకును భార్యయు యిద్దరు కొమార్తెలను నూఱు రూపాయలతో వెళ్లచున్నారు. కాబట్టి మీరు చీమలచింతదగ్గఱకు వేగిరము వెళ్ళవలె నని మన గురువుగారు చెప్పినారు" అని చెప్పి పోయెను. అతఁ డామాటలు విన్న తోడనే కొంతసే సేమో యాలో చించి సంతోషపూర్వకముగా లేచి, ఆ త్రోవలను సంకేత స్థలములను నెఱిగియున్నవాఁడు కావున మాఱుమాటాడక కత్తిని చేతఁ బట్టు కొని పాకవెడలి బయలుదేఱెను. ఆ కిరాతుఁడును అడ్డత్రోవను బోయి దారిలోఁ గనఁబడ్డ మఱియొకనితోఁగూడఁజెప్పి తిరిగి యోగిని గలిసికొని యాతని యుత్తరువు వ్రకారము విల్లును నమ్ములును ధరించి వారిని మార్గము తప్పించి చీమలచింతయెద్దకుఁ దీసికొని పోవుటకయి పరుగెత్తుకొని పోయి సంజచీఁకటి వేళ వారిని గలిసి కొనెను.

కిరా__అయ్యా! శిష్యులు రానందున మా గురువుగారు మీ కాపదలకయి నన్నుఁ బంపినారు. మంచిసమయములో వచ్చి మిమ్ముఁ గూడుకొన్నాను. దొంగలుకొట్టు స్థలమునకు సమీపములో నున్నాము. అయినను మీకేదియు భయములేదు. మన మీ మార్గమును విడిచి కాలిమార్గమునఁ బోయి భయపడవలసిన స్థలమును దాఁటినతరువాత పెద్దబాటలో వెళ్ళి చేరుదము.

రాజ__ఏలాగు నయినను మమ్ము సుఖముగాఁ దీసికొని వెళ్ళ వలసిన భారము నీది. నీ వేత్రోవను రమ్మన్న నాత్రోవనే వచ్చెదము.

అప్పు డాకిరాతుఁడు వారిని పెద్ద త్రోవ నుండి మరలించి యిఱుకుదారిని వెంటఁ బెట్టుకొని పోవుచుండెను. ఇంతలో మబ్బు పట్టి దారి కానరాక గాడాంధకార బంధురముగా నుండెను. చెట్లమీఁది పక్షుల కలకలము లుడిగెనుగాని గ్రుడ్లగూబ మొదలగు కొన్ని పక్షులు మాత్రము మేతకయి సంచరించుచుండెను; చిమ్మటలు కీచు మని దశదిశలయందును ధ్వనిఁ జేయఁజొచ్చెను; అడవిమృగముల యొక్కకూతలును పాముల యొక్క భూత్కారములను కర్ణకఠోరములుగా వినఁబడుచుండెను. నడుమనడుమ మేఘములలోనుండి తళుక్కని మెఱు పొక్కటి మెఱసి కొంచెము త్రోవ కనఁబడుచుండెను. ఈరీతిని కొంచెము దూరము నడచినతరువాత దూరమున వెలుతు రగ పడెను; ఆ వెలుతురు సమీపించిన కొలఁదిని గొప్పమంటగా నేర్ప డుచు, ఒక్క గొప్ప చింతచెట్టునకు సమీపముగా నుండెను. చీకటిలో నీ ప్రకారముగా నడచునప్పుడు రాజశేఖరుఁడుగారి ప్రాణము లాయన దేహములో లేవు; తక్కినవారును అఱచేతిలో ప్రాణములు పెట్టు కొని కా ళ్ళీడ్చుచు నడచుచుండిరి. ఆ రాత్రి యాపద నుండి తిప్పించు కొని యేదైన నొకయూరు చేరితిమా యిఁక నెప్పడును దారి ప్రయాణము చేయమని యెల్లవారును నిశ్చయము చేసికొనిరి. ఊరు చేరినతరువాత గ్రామ దేవతకు మేకపోతును బలి యిప్పించెదనని మాణిక్యాంబ మ్రొక్కుకొనెను. ఈ ప్రకారముగా వ్యాకులపడుచు వారు నడిచి యొక విశాల స్థలమును జేరునప్పటికి, చింతచెట్టు క్రింద మంట ముందఱఁ గూరుచుండియున్న రెండు విగ్ర హములు లేచి, దేహమునిండ కంబళ్ళు కప్పుకొని నోటిలో చుట్ట లంటించి బుజములమీఁద దుడ్డుకఱ్ఱలతో వారివంక నడచి రానారం భించెను. వాండ్రను జూచినతోడనే వారి కందఱకును పయిప్రాణ ములు పయిని పోయినవి; వెనుకనున్న కిరాతుఁడు దొంగలని కేక వేసి వెనుకవాఁడు వెనుకనే పాఱిపోయెను. ఇంతలో నా దొంగ లలో నొకఁడు ముందుకు వచ్చి రెండుచేతులతోను కఱ్ఱను పూనిపట్టి, మాటాడక ముందున్న రుక్మిణి నెత్తిమీఁద సత్తువకొలఁది నొకపెట్టు పెట్టెను. ఆ పెట్టుతో మొదలు నఱికిన యరcటిచెట్టు వలె రుక్మిణి నేల కొఱిగి నిశ్చేష్టురాలయి పడియుండెను. ఇంతలో నెవ్వఁడో కత్తి దూసికొని ఆగు ఆగు మని కోకలు వేయుచు, మెఱుపు మెఱిసి నట్టు మీఁదఁబడి దొంగలలో నొకనిని మెడమీఁద ఖడ్గముతో వేసెను. ఆ వేటుతో శిరస్సు పుచ్చకాయవలె మీఁది కెగరి దూరముగా బడఁగా మొండెము భూమిమీఁదఁబడి చిమ్మన గొట్టములతో గొట్టి నట్లు రక్తధారలు ప్రవహింప కాళ్ళతోను, చేతులతోను విలవిల గొట్టు కొనుచుండెను. శత్రువాయుభపాణియయి యుండుటయు, తా నొంటి గాఁడగుటయు, బాటసారులలో మఱి యిద్దఱు మగవాం డ్రుండుటయు చూచి కిరాతునితోఁ గూడికొని రెండవ దొంగవాఁడు కాలికొలఁదిని దాఁటెను. ఖడ్గపాణియైన యా పుణ్యాత్ముడు వాండ్రను కొంత దూరము వెంబడించెను గాని వాండ్రు నిమిషములోఁ జూపుమేర దూరము దాఁటి యదృశ్యులయినందున వెనుకకు మరల వచ్చి రాజ శేఖరుడుగారిని కలిసికొనెను.

రామ__రాజశేఖరుఁడుగారూ! ప్రొద్దుండగానే యీ స్థలమును దాఁటవలసినదని నేను మధ్యాహ్నముననే బహువిధముల బోధించితిని గదా? మీరు నా మాటలను లక్ష్యముచేయక యీ యాపదను దెచ్చి పెట్టుకొంటిరి.

రాజ__ఓహోహో, రామరాజుగారా? మీరు మా పాలిట దైవమువలె సమయమునకు వచ్చి మా యందఱి ప్రాణములను నిలువఁబెట్టిరి. మీ రింకొక నిమిషము రాకుండిన మేమందఱము నా దుర్మార్గుల చేతులలోఁ బడిపోయి యందుము. మీ రీవేళ నిక్కడ కెట్లు రాగలిగితిరి ?

రామ__మీతో వచ్చిన కిరాతుఁడు యోగిచే దొంగలను బిలుచు కొని వచ్చుటకయి పంపఁబడి, యెండలో నడువలేక యొక పాకలోఁ బరుండియున్న నన్నుఁ దనవారిలో నొకనిగా భ్రమించి తన గురువు కొందఱు బ్రాహ్మణులు చింతచెట్టువద్దకు వెళ్ళుచున్నాఁడని చెప్పెను.ఆ మాటలు విన్నతోడనే యా బ్రాహ్మణులు మీరేయని యూహించి నా కచట గాలునిలవక దొంగలను వారింపవలె నను నుద్దేశముతో యోగియున్న తావునకుఁ బోతిని. అక్కడ నా వరకే దొంగలు వచ్చి యోగితో మాటాడిపోయినారన్నవార్త విని గుండెలు పగిలి నేను వచ్చులోపల మీకేమి యుపద్రవము వచ్చునో యని మార్గాయాసము నేమియు లక్ష్యముచేయక యొక్కపరుగున వచ్చి యుక్త సమయమున మీఁకు దోడుపడఁగాంచి, నా జన్మము కృతార్థత గనెను గదా యని సంతోషించు చున్నాఁడను.

అనునప్పుడు మాణిక్యాంబ రుక్మిణిని నఖశిఖపర్యంతము తడవి చూచి గొంతెత్తి యేడ్వఁజొచ్చెను. రామరాజును రాజశేఖరుఁడు గారును గూడ దగ్గఱకుఁ బోయి చూచి కడుపుపట్టి చూచి ముక్కు దగ్గఱ వ్రేళ్ళు పెట్టి యూపిరి గానక దెబ్బచేతను భయముచేతను మరణము నొందెనని నిశ్చయించుకొనిరి. రామరాజును నాడి నిదానించి చూచి యామె చచ్చినదనియే స్థిరపరచెను. అప్పడందఱును శవము చుట్టును జేరి విలపించుచుండిరి. ఆ సమయమున సమీపమున నుండి వ్యాఘ్రముయొక్క కూఁత యొకటి వినఁబడెను. అంత యాపదలో సహిత మాధ్వని కందఱును బెదరి వడకుఁచుండగా, రామరాజు వారికి ధైర్యము చెప్పి క్రూరమృగములతో నిండియున్న యరణ్య మధ్యమగుటచేత నచ్చట నిలువఁగూడదనియు తెల్లవారిన మీఁదట మరల వచ్చి శవమునకు దహనాది సంస్కారములు చేయవచ్చు ననియు బోధింపఁజొచ్చెను. కన్నకూతును కారడవిలో విడిచిపెట్టి వెళ్ళుటకు మనసు రాక, వారాతని మాటలను చెవినిబెట్టక రుక్మిణి సుగుణములను దలఁచుకొని యేడుచుచుండిరి. ఇంతలో మఱింత సమీపమున గాండ్రు మని పులి మఱల నఱచెను. ఆ రెండవ కూఁతతో సూర్యకిరణములకు మంచు కరఁగునట్టుగా వారి ధైర్యసారము కరఁగి పోయెను. అప్పుడా రామరాజు హితబోధ నంగీకరించి, యెంతో కష్ట ముతో రుక్మిణిని విడచిపెట్టి, నడవ కాళ్ళరాక ముందుకు నాలుగడు గులు పెట్టి మరల వెనుక తిరిగి చూచుచు, తుదకు విధిలేక రామరాజు వెంట వారందఱును పెద్దాపురమునకుఁ బోయిరీ, తమ ప్రాణముల మీఁదికి వచ్చునప్పడు లోకములో నెల్లవారును తామావఱకు ప్రాణా ధికులనుగాఁ జూచుకొనువారి యాపదలనయినను మఱచిపోయి తమ యాపదను తప్పించుకొనుటకే ప్రయత్నింతురు గదా?