రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఏడవ ప్రకరణము


రాజశేఖరుఁడుగారి బీదతనము__సుబ్బమ్మ మరణము__బంధు మిత్రుల ప్రవర్తనము__రాజమహేంద్రవర ప్రయాణము__గ్రహణ స్నానము.

పూర్వము పుస్తకములయందు__శ్లో॥ ఆధివ్యాధి శతైర్జనన్య వివిధై రారోగ్యమున్మూల్యతే లక్ష్మీర్యత్ర పతంతితత్ర వివృత ద్వారా ఇవ వ్యాపద:॥ ఇత్యాదులగు ధనమే యాపదకెల్లను మూల మని బోధించు వచనములను జదువునపుడు పురాణవైరాగ్యముగలిగి రాజశేఖరుడుగారు దారిద్ర్యమును గోరుచు వచ్చిరి. లక్ష్మీవలెఁ గాక యామె యప్పయైన పెద్దమ్మవా రిప్పుడు నాశ్రిత సులభురాలు గనుక, అతని కోరికప్రకారము దారిద్ర దేవత వెంటనే ప్రత్యక్షమయి యాతని యభిమతమును సిద్ధింపఁజేసినది కాని తాను మునుపనుకొన్న రీతిని పేదఱిక మాతని కంత సుఖకరమయినదిగాఁ గనుపించలేదు. ఇప్పుడు మునుపటివలె నిచ్చుటకు ధనము లేకపోయినది గనుక, ఈవఱకు నాతని నింద్రుఁడవు చంద్రుఁడవని పొగడుచు వచ్చిన స్తుతిపాఠకు లందఱును మెల్లమెల్లగా నాతనిని విడిచిపెట్టి, ఆతనివలన ధనికులయు బాగుపడినవారియొద్దకుఁ పోసాగిరి, అయినను రాజశేఖరుఁడుగారు చేయి చాచి యాచించినవారి నూరక పొమ్మనలేక నోటితో లేదనునది చేతి తోనే లేదనుచు, తమ కున్నదానిలోనే వేళకు వచ్చి యడిగినవారికి భోజనము పెట్టుచుండిరి.అందుచేత నతిథి యెంతబీదవాఁ డయిన నంత సంతోషించుచుండునే కాని మునుపటివలె విందులకు విజయం చేయు మిత్రులవంటివా రెవ్వరు నిప్పుడు సంతోషపడుచుండలేదు. ఈ దాన ధర్మములకు సహితము కొంత ధనము కావలసియున్నది. కాబట్టి ఇంటఁగల యిత్తడి సామానులను కుదువబెట్టి రాజశేఖరుఁడుగారు సొమ్ము తెచ్చుచుండిరి. అందుచే నానాటికి గృహమునఁగల సొత్తు తక్కువయి కాపాడవలసిన భారము తగ్గుచుండెను. ఇట్లు కొంత కాలము జరగఁగా నించుమించుగా నింటఁగల జంగమ రూపమయిన సొత్తంతయు బుట్టలను, తట్టలును కొయ్యలునుగా మా ఱఁజొచ్చెను. అప్పుడు సహిత మాతఁడు యాచించినప్పుడు లేదని యెవ్వరి మనసు లకును నొప్పి కలుగజేయ నిష్టములేనివాఁడయి, మున్నెప్పడు నసత్యమన్నమాట నెఱుఁగనివాఁడయినను దరిద్రత్వ దేవత యొక్కయుపదేశముచేత ధనదానములకు బదులుగా వాగ్దానములను మాత్రమే చేయనారంభించెను. ఆహా! మనుష్యులచేత దుష్కార్యములనుఁ జేయించుటలో దారిద్ర్యమును మించినది మఱియొకటి లేదుగదా? ఆతఁ డీ ప్రకారముగా సర్వవిధములచేతను బాధపడుచున్నను, ఆ సంగతి నొరు లెఱుఁగకుండుటకయి భోజన పదార్థములలోఁ దక్కువ చేసియైన మంచి బట్టలను గట్టుకొనుచు అప్పుచేసియైనను బీదసాదల కిచ్చుచుఁ బయి కొకరీతి వేషముతోఁ బ్రవర్తించుచుండెను. ఆది యేమి మాయయో కాని లోకములో నెల్లవారును తాము సుఖపడుట కయి వహించుదానికంటెఁ దాము సుఖము ననుభవించుచున్నట్టిత రులకుఁ దోచునట్లు చేయుటకయియే విశేష శ్రద్ధను వహిం తురు, బీదతనమువలనఁ గలుగు సౌఖ్యములను లాభములను వేదాంత గ్రంథములు వర్ణించి చెప్పుచు ధనము పాపమునకుఁ గుదురని దూషింపుచున్నను, రాజశేఖరుఁడుగారు మాత్రము మనల నీదారిద్ర్యదేవత యెప్పుడువదలునా యని నిమిషమొక యొగముగాc గడపుచుండిరి; కాబట్టి యాతఁ డింత వఱకును లక్ష్యముతోఁ జూడని యదృష్టదేవత నిప్పుడు మఱి మఱి ప్రార్ధింపసాగెను. దాని నాతఁ డెంతయాసపడి వేఁడుచు వచ్చెనో యాయదృష్టదేవతయు నంతదూర ముగాఁ దొలఁగ నారంభించెను.

అట్టి సమయములోనే సుబ్బమ్మకు రోగము తిరుగఁబెట్టినది. డబ్బులేక యిబ్బంది పడుచున్న సమయములోనే యుపవాసమును నుప్పిడులను చేసి దినమున కిరువదిస్నానములుచేసి తడిబట్టలు కట్టు కొని రోగపడి యొక్కువ కర్చును దెచ్చిపెట్టినందున కామెమీఁద నెంతో కోపము వచ్చి రాజశేఖరుఁడుగారు విసుగుకొనుచుండఁగా పని నిమిత్తమయి వచ్చి తిరిగిపోవుచున్న యొక బ్రాహ్మణుఁడు దగ్గఱ నుండి విని యామెను దూషించిన లాభములేదని చెప్పి తాను వంట బ్రాహ్మణుఁడనుగా గుదిరెదననియు, ఆమెను మనసు వచ్చినన్నాళ్ళు రోగపడనిండనియుఁ జెప్పుటయేకాక వంటకు నలభీమ పాకములను మించునట్లు చేయ తానున్నందున నిష్టమున్నచో నామె మృతినొంది నను బొందవచ్చునన్న యభిప్రాయమును సహితము సూచనగాఁ గనఁ బఱిచెను అతని దెట్టిసత్యవాక్కో కాని యాదినము మొదలుకొని తగు వైద్యుఁడు లేనందుననో, ఆ బ్రాహ్మణుఁడే పథ్యపానములు జరుపుచు వచ్చినందుననో ప్రబల యొకనాఁ డామెకుఁ బ్రాణము మీఁదికి వచ్చెను. ఆ దినము నక్షత్రము మంచిది కాదని పురోహితుఁడు చెప్పినందున, ఆమెను వీధిలోనికిఁ గొనిపోయి గోడప్రక్కను భూశయనముచేసి యొకచాప యడ్డము పెట్టిరి, ఆమెయు రాత్రి జాము ప్రొద్దు పోయిన తరువాత లోకాంతరగతురా లయ్యెను. ఆ దినము తెల్లవాఱిన దనుక వింటనున్న వా రందఱును పీనుఁగుతో జాగరము చేసిరి. మఱునాఁడు ప్రాతఃకాలమునుండియు సమస్తప్రయత్నములు చేసినను, ఊరనున్న బ్రాహ్మణులలో నెవ్వరును సాహాయ్యమునకు వచ్చిన వారు కారు. రాజశేఖరుఁడుగారు తామే వెళ్ళి యొకచోట బోగముదాని యింట పీనుఁగుల విస్సన్నను పట్టుకొని సంగతిని దెలుపఁగాఁ ఆతఁడు బేరముల కారంభించి పదియాఱు రూపాయిలకు శవమును మోచుట కొప్పుకొని లేచివచ్చెను. ఇప్పుడు సహిత మాంధ్రదేశపు బ్రాహ్మణులలో ముఖ్యముగా స్మార్తులలో నెవరియింటనైన ఎవ్వరైనను మృతినొందినప్పుడు బంధువులును కులమువారును తక్కిన మతముల యందువలె దమంతట వచ్చి సాయము చేయుట లేకపోఁగా వచ్చి ప్రార్థించినను రాక సాకులు చెప్పుటయు మొగము చాటువేయుటయు బ్రాహ్మణజాతి కంతకు నవమానకరముగా నున్నది. సమస్తాపదలలోను ఘోరతరమయిన యీ యాపదకే యెవ్వరును తోడుపడనపు డొక మతములో నుండుటవలనఁ బ్రయోజనమేమి?ఉండకపోవుటవలన హాని యేమి? ఆ దినము శవ మింటనుండి కదలునప్పటికిఁ బగలు రెండుజాము లయినది; దహనముచేసి మరల వచ్చునప్పటికిఁ బడమట నాలుగు గడియల ప్రొద్దున్నది. తరువాత విధ్యుక్తముగా సంచయనము మొదలయిన యపరకర్మ లన్నియు జరిగినవి.

మునుపటివలె రాజశేఖరుఁడుగారిని చూచుటకయు బంధువులను మిత్రులును నంతగా వచ్చుట మానివేసిరి; వీధిలో గనఁబడి నపుడు సహితము చూడనట్టు తొలగిపోవుటకే ప్రయత్నించుచు, విధి లేక కలిసికొని మాటాడునప్పుడు సంగ్రహముగా రెండుమూడు మాటలతోనే సరిపెట్టుచు వచ్చిరి. పూర్వ మాయన మాటాడునపు డెల్లను ముఖస్తుతులను జేయువారు తరువాత సమ్మతిని గనఁబఱుచు శిర:కంపములను మాత్రము చేయుదు నాతని మాటలను మందహాస ముతో వినసాగిరి. కొన్నాళ్ళకా శిరకంపములును మందహాసములును పోయి యూరక యూకొట్టుట క్రింద మాఱినవి; అటుపిమ్మట నా యూకొట్టుటలు సహితము నడగి హితబోధలు బలిసినవి. కాలక్రమ మున హితబోధలు సహిత మడుగంటి యొకరీతి పరిహాసములుగా బరిణమించినవి. రాజశేఖరుఁడుగారును దారాపుత్రాదులును ధనము లేనివారయినను తామొక దుష్కార్యమునకయి ధనమును దుర్విని యోగము చేయలేదుగదా యని మనసులో నొక విధమయిన కైర్యము నవలంబించి యున్నదానితోనే తృప్తి వహించి యుండగా, వారి సౌఖ్యమునుగని యోరువలేనివారు కొందఱు మిత్రులని పేరుపెట్టు కొనివచ్చి వారును వీరును మిమ్ము దూషించుచున్నారని చెప్పి వారి నెమ్మదికి భంగము గలిగించుచు వచ్చిరి: రాజశేఖరుఁడుగారు చేసిన వ్యయమును బూర్వము దాతృత్వమని వేయినోళ్ళ బొగడినవారే యిప్పుడు దానిని దుర్వినియోగమని నిందింపసాగిరి; ఆయన వలన బూర్వ మెన్నివిధములనో లాభములను బొందినవారు సహితము రాజ శేఖరుఁడుగారు వీధిలోనుండి నడచుచున్నప్పుడు వ్రేలితోఁ జూపి యీయనయే తన ధనమునంతను బాడుచేసుకొని జోగియైన మహాను భావుఁ డని దగ్గఱనున్న వారితోఁ జెప్పి నవ్వ మొదలుపెట్టిరి. ఈవఱ కును సీతను దనకొమారుని కిమ్మని నిర్బంధించుచు వచ్చిన దామోదరయ్య, ఇప్పు డాపిల్లను దన కొడుకునకుఁ జేసికోనని వారి వీరి ముందఱను బలుఁకజొచ్చెను. ఆ సంగతి కర్ణపరంపరచే రాజశేఖరుఁడుగారి వఱకును వచ్చినందున,ఆయన యొకదినము పోయి యడు గఁగా తా నీసంవత్సరము వివాహము చేయనని చెప్పెను.సుబ్రహ్మణ్య మంతటి యదృష్టవంతుఁడు లోకములో మఱి యెవ్వరునులేరని జాతకము వ్రాసిన సిద్ధాంతియే యాతనికిఁ గన్యనిచ్చెదనన్నవారి యింటికిఁ బోయి యాతనిది తాను జూచినవానిలోనెల్ల జబ్బుజాతకమనిచెప్పి పిల్ల నీకుండఁ జేసెను. రాజశేఖరుఁడుగారు ధనము లేక బాధపడుచుండియు నొరులనడుగుట కిష్టములేనివారయి యూరకుండగా, నిజమైనమిత్రుఁ డొకడైన నుండకపోవునాయని ఎంచి మాణిక్యాంబయు సుబ్రహ్మణ్యమును రాజశేఖరుఁడుగారికడకుఁబోయి నారాయణమూర్తినిగాని మఱి యెవ్వరి నైననుగాని బదులడిగి యేమాత్రమయిన సుబ్బమ్మ మాసిక మునకయి తెండని ప్రార్థించిరి. ఆయన వారిమాటను దీసివేయలేక దామోదరయ్యను నారాయణమూర్తిని మిత్రులవలె నటించి తనవలన లాభమును పొందిన మఱికొందఱిని బదు లడిగి చూచెనుగాని, ఆక్కఱ లేనప్పుడు వెనుక మేము బదులిచ్చెదము మేము బదులిచ్చెద మని యడుగనిదే పలుమాఱు సంతోషపూర్వకముగాఁ జెప్పుచు వచ్చిన వారు ఇప్పుడు నిజముగాఁ గావలసి వచ్చినది గనుక పోయి యడగినను వేయిక్షమార్పణలను జెప్పి విచారముతో లేదనిరి. పలువురు రాజశేఖరుఁడుగారి యింటికి వచ్చుట మానుకొన్నను, గొంత కాలమువఱకును గొందఱు వచ్చుచుండిరి. కాని తమ్మేమయిన ఋణ మడుగుదురేమో యని యిప్పు డావచ్చెడువారుకూడ రాకుండిరి. కాబట్టి మును పెప్పుడును మనుష్యులతో నిండియుండి రణగుణధ్వని గలిగియుండెడి రాజశేఖరుఁడుగారి గృహ మిప్పుడు త్రొక్కిచూచు వారులేక నిశ్శబ్దముగా నుండెను. అయిన నా స్థితియందది చిరకాల ముండినది కాదు; దాని స్తంభముహూర్త బలమెట్టిదో కాని తరువాత మరల సదా మనుష్యులతో నిండి మునుపటికింటెను సమ్మర్దము గలిగి బహుజనధ్వనులతో మాఱుమ్రోయుచుండెను. మునుపు మనసులో నొకటి యుంచుకొని పయి కొకటి చెప్పుచుఁ గపటముగాఁ బ్రవర్తించువారితోను బట్ట యిమ్మని కూడు పెట్టుమని యాచించు దరిద్రులతోను నిండి యుండెను గాని యిప్పుడు మనసులో నున్న దానినే నిర్భయముగా మొగముమీఁద ననెడు ఋజువర్తనము గలవారి తోను బట్టలను భోజనపదార్థములు గొన్నందునకయి యీవలసిన సొమ్మిమ్మని యధికారమును జూప భాగ్యవంతులతోను నిండియుండ నారంభించెను. గృహమునకు మనుష్యసమృద్ధి గలిగినట్టుగానే రాజశేఖరుఁడుగారికి వస్తుసమృద్ధియు నానాఁటి కధికముగాఁ గలుగనారం భించెను. మునుపటివలెఁ బగటిపూట యందు బదార్థసందర్శన మంతగాఁ కలుగకపోయినను, తదేక ధ్యానముతో నున్నందున రాత్రులు కలలయందు మాత్రము తొంటికంటె సహస్ర గుణాధిక ముగాఁ గలుగుచుండెను. ఆ బాధ లటుండఁగా మున్ను రుక్మిణి శిరోజు ములను తీయించక పోవుటయే బాగుగనున్నదని శ్లాఘించిన శ్రోత్రి యులే యిప్పడాతనినిఁ బలువిధముల దూషించుటయే కాక సభవారికి నూఱు రూపాయ లపరాధము సమర్పించుకోనియెడల శ్రీశంకరా చార్య గురుస్వామికి వ్రాసి జాతిలో నుండి వెలి వేయించెదమని బెదరింపఁజొచ్చిరి. ఋణప్రదాతలతో నిండియుండి యిల్లొక యడవిగా నున్నందునను, వీధిలోనికిఁబోయిన సుగుణములను సహితము దుర్గుణములనుగానే పలుకుచు హేళనచేయుచు మహాత్ములతో నిండి యుండి యూరొక మహాసముద్రముగా నున్నందునను గౌరవముతో బ్రతికినచోటనే మరల లాఘవముతో జీవనము చేయుటకంటె మరణ మయినను మేలుగాఁ గనఁబడి నందునను, ఏలాగునై నను ఋణ విముక్తి చేసికొని యూరువిడిచి మఱియొకచోటికిఁ బోవలె నని ఆయన నిశ్చయించుకొనెను. కాబట్టి వెంటనే రామశాస్త్రి యొద్దకుఁ బోయి యింటి తాకట్టుమీఁద నయిదు వందల రూపాయలను బదులు పుచ్చుకొని, సొమ్ము సంవత్సరమునాటికి వడ్డీతోఁగూడ దీర్చునట్టును, గడుపునాటికి సొమ్మియ్యలేనిపక్షమున నిల్లాతనికిఁ గ్రయమగునట్టును పత్రమును వ్రాసియిచ్చెను.ఆ ప్రకారముగా సొమ్ము బదులు తెచ్చి దానిలో నాలుగువందల రూపాయలతో నన్నిటిని దీర్చి వేసెను. బదులిచ్చిన మఱుసటినాటినుండియు నిల్లు చోటుచేసి తన యధీనము చేయవలసినదని రామశాస్త్రి వర్తమానములు పంపుచుండెను.పూర్వము స్కాంధపురాణమును జదివినప్పటినుండియు రాజశేఖరుఁడుగారి మన సులో గాశీయాత్ర వెళ్ళవలెనని యుండెను. ఆ కోరిక యిప్పడీ విధముగా నెఱవేఱనున్నందునకు సంతోషించి, రాజశేఖరుడుగారు సకుటుంబముగా గంగాస్నానము చేసి వచ్చుటకు నిశ్చయించి తారా బలమును చంద్రబలమును బాగుగ నున్న యొక చరలగ్నమునందుఁ బ్రయాణమునకుఁ ముహూర్తము పెట్టి "ప్రతపన్నవమిపూర్వే" యని యుండుటచేత తిథిశూల లేకుండఁ జూచుకొని "నపూర్వేశని సోమేచ" యనుటచేత వారటాల తగులకుండ ఫాల్గుణ శుద్ధ త్రయోదశీ బుధ వారమునాడు మధ్యాహ్నము నాలుగు గడియల ప్రొద్దువేళ బయలు దేఱుటకు బండి నొకదానిని గుదిర్చి తెచ్చిరి. వారీవఱకు చేసిన యాత్ర లన్నియు గోదావరియొడ్డున నుండి యింటియొద్దకును, ఇంటి యొద్దనుండి గోదావరియొడ్డునకునే కాని యంతకన్న గొప్పయాత్ర లను జేసిన వారుకారు.

బండిని తెప్పించి వాకిటఁ గట్టిపెట్టించి ప్రయాణ ముహూర్తము మించిపోకమునుపే బండిలో వేయవలసిన వస్తువులను వేయ వలసినదని రాజశేఖరుఁడుగారు పలుమాఱు తొందరపెట్టినమీఁదట, మాణిక్యాంబ తెమలివచ్చి బండినిండను సుద్దతట్టలను బట్టలను చేఁద లను నింపి మఱియెుక బండికి గూడ జాలునన్నిటిని వీధిగుమ్మములో నుంచెను; బండిలో నెక్కవలసిన యిత్తడి పాత్రములను బట్టలపెట్టెలును లోపలనే యుండెను: ఇంతలో రాజశేఖరుడుగారు వచ్చి యాబుట్టలు మొదలగువానిని బండిలోనుండి దింపించి వారు వెళ్ళిపోవుచున్నారని విని చూడవచ్చిన బీదసాదలకు బంచిపెట్ట నారంభించిరి. ఆ వఱకు లోపలనుండి కదలి రాకపోయినను రాజ శేఖరుఁడుగారు వస్తువులను బంచిపెట్టుచున్నా రన్నమాటను విన్న తోడనే యిరుగుపొరుగుల బ్రాహ్మణోత్తములు వాయువేగమునఁ బరు గెత్తుకొనివచ్చిరి. బండిలో స్థలముచాలక క్రింద నుంచిన తట్టలు మొదలగువానిని మాణిక్యాంబయుఁ దన్ననుసరించుచున్నవారికిఁ బంచిపెట్టెను. తరువాతఁ బెట్టెలును నిత్తడి సామానులను బండిలో నెక్కింపఁబడినవి; మునుపు నాలుగుబండ్లలో నెక్కించినను సరి పోని సామాను లిప్పు డొక్క బండిలోనికే చాలక దానిలో నలుగురు గూరుచుండుటకు స్థలముకూడ మిగిలెను. రాజశేఖరుడుగా రెంత తొందరపెట్టుచున్నను మాణిక్యాంబ తన కాప్తు రాండ్రయిన యొక రిద్దఱు పొరుగు స్త్రీల వద్ద సెలవు పుచ్చుకొని వచ్చుటకే ప్రత్యేకముగా నాలుగు గడియ లాలస్యము చేసెను. ఈలోపుగా మంచములను బండిగూటిపయిని గట్టించి, పిల్లలను బండిలో నెక్కించి, రాజ శేఖరుఁడుగారు కోపపడినందున మాణిక్యాంబవచ్చి బండిలోఁ గూర్చు చుండెను. బండివాని వద్దకు వచ్చినప్పటినుండియు గొంచెము వట్టిగడ్డిపరకలతోను కావలసినంత జలముతోను మితాహారమును గొనుచు పథ్యముచేయుచున్న బక్క యెడ్లు మెల్లఁగా బండిని లాగ నారంభించెను. బండివాఁడును వానివెనుకనే నడచుచు మేత వేయు టలో బరమలుబ్దుడుగానే యున్నను కొట్టుటలో మాత్రము మిక్కిలి యౌదార్యమును గనఁబఱుపసాగెను. ఊరిబయలవఱకును వచ్చి, రాజశేఖరుఁడు గారివలన బిచ్చములనుగొన్న నిరుపేదలయిన తక్కువ జాతులవారు పలువిధముల వారిని దీవించి, విచారముతో వెనుకకు మరలిపోయిరి. నల్లమందు వేసికొనుటచేతనో త్రాగుటచేతనో సహజ మైన మత్తతచేతనో యీ మూడునుగూడఁ గలియుటచేతనో త్రోవ పొడుగునను తూలుచుఁ గునుకుపాట్లు పడుచు నడుచుచున్న బండి వాఁడు మొత్తనెక్కి కూరుచుండి బండిలోని వారికి పరిమళమును ఆకాశమునఁ జిన్నమేఘములను గలుగునట్టుగా సగము కాలియున్న ప్రాఁతపొగచుట్టలను నాలిగింటిని గుప్పుగుప్పున గాల్చి బండిలోని పెట్టెకుఁ జేరగిలబడి హాయిగా నిద్రపోయెను. బండియు మెల్లగా ప్రాకుచున్నట్టే కనఁబడుచుండెను: ఇంతలో జీఁకటియుఁ బడెను. కొంతసేపటికి రాజశేఖరుఁడుగారు క్రిందఁ జూచునప్పటికి బండి కదలుచున్నజాడ కనఁబడలేదు. అప్పడు కుంభకర్ణునివలె నిద్రపోవుచున్న యా బండివానిని లేపఁబూనుకోగా, కేకలేమియు బనిచేసినవికావు కాని వాని కాలిమీఁద కొట్టినదెబ్బలు మాత్రము వానిని, కదలి యొక్క మూలుగు మూలిగి మఱి యొక్క ప్రక్క పరుండు నట్లు చేసినవి, మహాప్రయత్నముమీఁద వానిని లేపి క్రిందదిగి చూచువఱకు బండి త్రోవతప్పి వచ్చి యొకపొలములో మోఁకాలిలోతు బురదలో దిగఁబడియుండెను. అప్పుడందఱును దిగి యావచ్ఛక్తి నుపయోగించి రెండు గడియలకు బండిని రొంపిలోనుండి లేవనెత్తి మార్గమునకు లాగుకొని వచ్చిరి, కాని యెడ్లు మాత్రము తాము బండిని గొనిపోవు స్థితిలో లేక తమ్మే మఱియొకరు గొనిపోవలసిన యవస్థయం దుండెను. కాబట్టి చీకటిపడువఱకును బండి శ్రమచేసి వారిని లాగుకొని వచ్చినందునకుఁ బ్రత్యుపకారముగా నిప్పుడు చీకటిపడ్డందున వారే బండి నీడ్చుకొనిపోవలసిన వంతు వచ్చెను. ఇట్టియవస్థ పగలు సంభవింపక రాత్రి సంభవించినందున కెల్లవారును మిక్కిలి సంతోషించిరి, అందఱి బట్టలకును బురదచేత జిన్నవియుఁ బెద్దవియునైన పలువిధములైన పుష్పము లద్దబడినవి; బండిలో నెక్కివచ్చినవారి కెట్లున్నను చూచువారు లేకపోయిరి కాని, యున్న యెడల వారికెంతయైన వినోదము కలిగి యుండును. బండివాఁడు భీమునివంటివాఁడు గనుక రాజశేఖరుడుగారి సహాయ్యముచేత బండిని సులభముగా నీడ్చుచుండగా, సుబ్రహ్మణ్యము వెనుక జేరి యెడ్లను స్త్రీలను నడిపించుకొని వచ్చెను. వారు నడిచియే వెళ్ళినయెడల జాములో పలనె రాజమహేంద్రవరము వెళ్ళి చేరియుందురు గాని బండినికూడ నీడ్చుకొని పోవలసివచ్చినందున రాత్రి రెండు యామములకు రాజశేఖరుఁడుగారి పినతండ్రికుమారుఁడగు రామమూర్తిగారి యిల్లు చేరిరి. అప్పుడందఱును మంచినిద్రలో నుండిరి; కాఁబట్టి బండిచప్పుడు కాఁగానే తలుపు తీయఁగలిగినవారు కారు. కొంత సేపు తలుపువద్ద బొబ్బలు పెట్టినమీఁదట చావడిలోఁ బరున్న వారెవ్వరో లేచివచ్చి తలుపుతీసిరి. రాజశేఖరుడుగారి మాట వినఁబడినతోడనే లోపలిగదిలోఁ బరుండియున్న రామమూర్తిగారు లేచివచ్చి, అన్న గారిని కౌగలించుకొని వారావఱకే వత్తురని కనిపెట్టుకొనియుండి జాము ప్రొద్దుపోయిన మీఁదటనుగూడ రానందున, ఆ దినము బయలుదేఱలేదని నిశ్చయించుకొని భోజనములుచేసి తామింతకు మునుపే పడుకొన్నామని చెప్పి యంతయాలస్యముగా వచ్చుటకుఁ గారణమేమని యడిగిరి. తాము చెప్పనక్కఱలేకయే తమ బట్టలను మోకాలివఱకును బురదలో దిగబడిన కాళ్ళను జెప్ప సిద్ధముగా నున్నదానినిమాత్ర మాలస్యకారణముగాఁ జెప్పి బండిని దామీడ్చుకొని వచ్చిన సంగతిని మాత్రము చెప్పక రాజశేఖరుఁడుగారు దాచిరి. అప్పు డీయవలసిన బండికూలి నిచ్చివేసి బండివానిని పొమ్మని చెప్పఁగా వాఁడు తాను విశేషముగా శ్రమపడితి ననియు తన బండియెడ్లంతటి మంచివి మఱెక్కడను దొరకవనియఁ జెప్పి తన్నును తన యెడ్లను గొంతసేపు శ్లాఘించుకొని బహుమతి రావలెనని యడిగెను. తడవుగ మాటాడనిచ్చినయెడల మాట వెంబడిని బండిని తాములాగుకొనివచ్చిన మాటను చెప్పునేమో యనుభయమున సామాను దిగినతోడనే బహుమతిని సహిత మిచ్చి రాజశేఖరుఁడుగారు వెంటనే వానిని బంపివేసిరి. కొత్తగా మగడుపోయినవారిని పుణ్యస్త్రీలు భోజనము లయిన తరువాత మొదటిసారి చూడరాదు గనుకను, ఆ రాత్రి మంచిదినము కాదు గనుకను, సువాసినుల నందఱును గదిలోనికిఁ బోయి తలుపు పేసికొండని చెప్పి యొక విధవ ముందుగా రుక్మిణిని లోపలికిఁ దీసికొనివచ్చి మఱియొక గదిలోనికిఁ బంపి తలుపు దగ్గఱగా వేసెను. తరువాత లోపలినుండి యాడువారు వచ్చి మాణిక్యాంబ మొదలైన వారిని పడమటింటిలోనికిఁదీసికొనిపోయి రుక్మిణికి దటస్థించిన యవస్థ కయి యేడుపులు మొదలైనవి చల్లారినపిమ్మట, వారినిమిత్త మా వఱకు చేసిన వంట మిగిలియున్నది కాన వారికి వడ్డించి రాజశేఖ రుఁడుగారి నిమిత్త మప్పుడత్తెసరు పెట్టిరి. అందఱును భోజనము లయినతరువాత మూడుజాములకు పరుండి సుఖనిద్రచేసిరి. రాజశేఖరుఁడుగారు కొన్నిదినములు రామమూర్తిగారి లోపలనే యుండిరి. ఒకనాడు పడవమీద గోవూరునకుఁ బోయి యచట బూర్వము గౌతముఁడు తపస్సు చేసిన స్థలమును మాయగోవు పడిన చోటును జూచి గోపాదక్షేత్రమున స్నానముచేసి రాత్రికి మరల వచ్చిరి; మఱియొకనాడు కోటిలింగక్షేత్రమున స్నానమునకుఁ బోయి యచట నొక శాస్త్రులవలనఁ బూర్వ మాంజనేయు లొక లింగము నెత్తుకొనిపోయి కాశీలో వేయుటయు అప్పటినుండియు కాళికాపట్ట ణము ప్రసిద్దిగనుటయు మొదలుగాగల కథను వినిరి. ఇంకొక నాఁడు రాజరాజనరేంద్రుని కోటకుఁ బోయి అందులోఁ బూర్వము చిత్రాంగి మేడయున్న తావును సారంగధరుఁడు పావురముల నెగరవేసిన చోటును జూచి, పూర్వము రాజరాజనరేంద్రున కమ్మవారు ప్రత్యక్ష మయు నీ వెంతదూరము వెనుక తిరిగి చూడకుండ నడతువో యంత దూరము కోటయగునని చెప్పటయు అతఁడాప్రకారముగా నడచుచు వెనుక గొప్ప ధ్వని యగుచుండఁగా గొంతసేపటికి మనస్సు పట్టలేక వెనుక తిరిగి చూచుటయు, చుట్టును బంగారుకట్టుతో నించుమించుగా ముగియవచ్చిన కోట యంతటితో నిలిచిపోవుటయు, మొదలుగాఁ గల కథను దగ్గఱనున్న వారివలన రాజశేఖరుడుగారు సారంగ ధరుని కాళ్ళను చేతులను నఱికిన స్థలమును జూచిరావలె నని బయలుదేఱి సారంగధరుని మొట్టకుఁ బోయి యక్కడ నొక నిమ్మ చెట్టుకింద సారంగధరుని కాళ్ళను, చేతులను ఖండించిన చాపరాతిని, దాని చుట్టును గడ్డి సహితము మొలవక నున్న ప్రదేశమును దాని సమీపముననే సిద్దుఁడు సారంగధరుని గొనిపోయి స్నానము చేయించిన కొలఁకును జూచి వచ్చిరి. రాజమహేంద్రవరములో నున్న కాలములో రాజశేఖరుఁడుగారు పట్టణములో నుండెడి జనులకును, పల్లెలలో నుండెడి జనులకును నడవడియం దేమివ్యత్యాస ముండునో చూడవలెనని యెల్లవారియొక్క చర్యలును బరీక్షింప సాగిరి. కాబట్టి యిప్పుడిప్పుడాయనకు నిజమయిన ప్రపంచజ్ఞానము కొంతవఱకు గలుగ నారంభించెను. ఆ పట్టణములో __ ఎరువడిగి తెచ్చుకొనియైనఁ జేతికి మురుగులు నుంగరములను వేసికొని, చాకలి వానియొద్ద పడిదెకుఁ దెచ్చుకొనియైనను విలువబట్టలను గట్టుకొను వారె మిక్కిలి గౌరవమునకుఁ బాత్రులుగా నుండిరి. లోపల సార మేమియు లేకపోయినను జెవులకు మంచి కుండలములను జేయించు కొని తలకు గొప్ప శాలువను జుట్టుకొన్నవారు మహాపండితులుగా నుండిరి. ఎల్లవారును ధనికుల యిండ్లకుఁ బోయి జీవితకాలములో నొకప్పుడును దేవాలయము త్రొక్కిచూడక పోయినను భగవన్నామమును కలలోనైనను స్మరింపకపోయినను వారిని పరమ భాగవ తోత్తములని, భక్తాగ్రేసరులని పొగడుచుండిరి; నిజమైన విద్వాంసుల యొక్కయు కవీశ్వరులయొక్కయు నోళ్ళను కడుపులును సదా శ్లోక ములతోను, పద్యములతోను మాత్రమె నిండియుండెనుగాని బాహ్య దంభము లేకపోవుటచేత నన్నముతో నొకప్పుడును నిండియుండ లేదు; దినమున కెనిమిది దొమ్మరగుడిసెలలో దూకినను, స్నానము చేసినట్టు జుట్టు చివర ముడివైచికొని బిళ్ళగోచులను బెట్టుకొని తిరుగు వారు పెద్దమనుష్యులని పొగడొందుచుండిరి. వేయేల, చాటున లక్షదుష్కార్యములు చేయుచున్నను, బాహ్యవేషధారణమునందు మాత్రము లోపము లేకుండ నున్నచో వారి ప్రవర్తనమును సంపూర్ణముగా నెఱిగియు నట్టివారి కందఱును సభలో సహితము మంచి నడవడి గలవారికిఁ జేయుదానికంటె నెక్కువ మర్యాదనుఁ జేయుచుండిరి. నీతి విషయమున వారి ప్రవర్తనమెంత హేయమయినదిగా నున్నను, మత విషయమునందు మాత్రము పయికి భక్తులుగానే కనఁబడుచుండిరి. నిలువ నీడలేక బాధ పడుచుండెడి ప్రాణమిత్రుల కొక కుటీరమును గట్టించి యియ్యలేనివారు సహితము రాతివిగ్రహములు కాపురముం డుటకయి వేలకొలఁది వెచ్చపెట్టి దేవాలయములు కట్టించుచుండిరి; కట్టించినవారు పోయిన తరువాత వసతులు లేక పాడుపడిన దేవా లయములను నూటయిరువదిమూటిని లెక్కపెట్టి రాజశేఖరుఁడుగారు కోటిలింగములకుఁగూడ బూర్వమెప్పుడో దేవాలయములు పాడయి నందున నా ప్రకారముగా నిసుకదిబ్బలయందుఁ బడియుండినవైయుండ వచ్చునని సంశయించిరి; అక్కడ వేశ్యలు తప్ప మఱియెవ్వరును స్త్రీలు చదువకుండిరి; అట్టివా రభ్యసించిన విద్య యంతయు వ్యభిచారమును వృద్ధిచేసి పురుషులను దమ వలలలోఁ బడవేసికొని పట్టణము పాడు చేయుటకొఱకే పనికి వచ్చుచుండెనుగాని జ్ఞానాభివృద్ధికిని సన్మార్గప్రవర్తనమునకును లేశమయినను తోడుపడుచుండ లేదు.

అక్కడ సప్తమివఱకునుండి రాజశేఖరుఁడుగారు కాశీకి వెళ్ళుటకు ప్రయాణమయిరిగాని, సంవత్సరాదివఱకు నుండుఁ డని రామమూర్తిగారు బలవంత పెట్టినందున నాతని మాట తీసివేయలేక యొప్పుకొనిరి. ఫాల్గుణ బహుళ అమావాస్యనాఁడు పగలు మూడు జాములవేళ సంపూర్ణ సూర్యగ్రహణము పట్టెను.జను లందఱును గోదావరిలో పట్టుస్నానము చేసి తమపితరులకు తర్పణము లిచ్చుచుండిరి; కొందఱు పుణ్యము కొఱకు నవగ్రహ జపములు చేయుచు బ్రాహ్మణులకు నవధాన్యములను దానము చేయుచుండిరి; కొందఱు ఛాందసులను వృద్ధాంగనలను సూర్యునకు విపత్తువచ్చె నని కన్నుల నీరు పెట్టుకొనసాగిరి; వారిలో దెలిసినవార మనుకొను వారు సూర్యునకుఁ బట్టిన పీడను వదలగొట్టుటకయి మంత్రములను జపించుచుండి; వారికంటెను దెలివిగలవారు గ్రహణ కాలమునందు తమ కడుపులలో జీర్ణముగాని పదార్థము లుండిన దోషమని యెఱిగి దాని ముందు మూడుజాముల నుండియు నుపవాసములు చేయుచుండిరి; ఎల్లవారును భోజనపదార్థము లుండు పాత్రములో దర్భగడ్డిని వేయుచుండిరి; కడుపుతో నున్న స్త్రీలు పైకి వచ్చినయెడల అంగహీను లయిన పిల్లలు పుట్టుదురని యెంచి పెద్దవా రట్టి స్త్రీలను గదులలో బెట్టి తాళమువేసి కదలమెదలవదని యాజ్ఞాపించిరి; మఱి కొందఱు మంత్రవేత్తలమని పేరుపెట్టుకొన్నవారి కేమయిన నిచ్చి మంత్రోప దేశమును బొంది శీఘ్రముగా సిద్ధించుటకయి ఱొమ్ముల బంటి నీటిలో జపము చేయుచుండిరి, గ్రహణకాలమున నోషధులయందు విశేషగుణ ముండునని యెంచి కొందఱు మూఢులు స్నానముచేసి దిసమొలలతో జట్టు విరియఁబోసికొని చెట్లకు ధూపదీపములు సమర్పించి వేళ్ళను దీయుచుండిరి; గ్రహణ సమయమున దానముచేసిన మహాపుణ్యము కలుగునని చెప్పి బ్రాహ్మణ బ్రువులు తమ బట్టలు తడియకుండఁ బయి కెగఁగట్టుకొని మోకాలిలోతు నీళ్ళలో నిలుచుండి సంకల్పమును జెప్పుచు మూఢులయొద్దను స్త్రీలయొద్దను జేరి నీరుకాసులను గ్రహించు చుండిరి. పూర్వాచారమును బట్టి రాజశేఖరుఁడుగారు తామును స్నానము చేసిరిగాని, పయిని చెప్పిన కృత్యమును జేయువా రంద ఱును మూఢులని యెంచి గ్రహణవిషయమయి యచ్చటి పండితులతో వాదములు చేయ నారంభించిరి. అతఁడు జ్యోతిష శాస్త్రమును నమ్మినను పురాణములను మాత్రము శాస్త్రవిరుద్ధముగా నున్నప్పడు నమ్మకుండెను. కాబట్టి-శ్లో॥ పశ్చాద్భాగా జ్ఞలదవదధ స్సంస్థితోథేత్య చంద్రో భానోర్బింబంస్ఫురదసితయా, ఛాదయత్యాత్మమూర్త్యా ఆను సిద్ధాంత శిరోమణి శ్లోకమును, శ్లో॥ ఛాదకో భాస్కరస్యేందు రథస్టో ఘనవద్భవేత్। భూచ్చాయాం ప్రాజ్ముఖశ్చంద్రో విశత్యస్య భవేదసౌ॥__అను సూర్యసిద్ధాంతశ్లోకమును జదివి, భూగోళమున కుపరిభాగమున సూర్యుడుండునపుడు చంద్రుఁడు తన గతివిశేషముచేత సూర్యునకును భూమికిని నడుమ సమకళయందు వచ్చునేని సూర్య గ్రహణము కలుగునుగాని రాహువు మ్రింగుటచేతఁ గలుగదనియు, పౌరాణికులు చెప్పినదే గ్రహణమునకుఁ గారణ మయినయెడల రాహు కేతువుల మనసులలోని యభిప్రాయములను దెలిసికొనుటకు మనము శక్తులము కాముకాబట్టి గ్రహణ మిప్పుడు కలుగు నని ముందుగా దెలిసికోలేకపోయి యుందుమనియు, సూర్య గ్రహణ మమా వాస్యనాడును చంద్రగ్రహణము పూర్ణిమనాఁడును మాత్రమే పట్టుటకుఁ గారణ ముండదనియు, రాహు కేతువు లాకాశమున నెప్పుడును గనఁబడకపోవుట యెల్లరు నెఱుఁగుదురు గాన సూర్య చంద్రులను మ్రింగఁగలిగినంత పెద్దవియే యయియుండినయెడల గ్రహణసమయమున నవేల కనఁబడకుండుననియు, రాహువే మ్రింగు నేని మన పంచాంగరీతిగా నీగ్రహణ మొక దేశమునఁ గనఁబడి మరి యొక దేశమున గనబడకపోవుటకు హేతువుండదనియు, రాజశేఖరుఁడుగారు బహుదూరము వాదించిరి. అక్కడ నున్న పండితు లలో నెవ్వరికిని యుక్తులు తోఁచకపోయినను, విశేషముగా కేకలు మాత్రమువేసిరి. అక్కడ నున్నవారి కా వాదమేమియు లేదు కనుక బిగ్గఱగా నఱచినందున శాస్త్రుల పేళ్ళవారే గట్టివా రని మెచ్చుకొని రాజశేఖరుడుగారి వాదము బౌద్ధవాదమని దూషించిరి. ఒకరిని వెక్కిరించుటవలనఁ గలుగవలసిన సంతోషముతప్ప మఱియొకవిధమైన సంతోషము తమకు లేదు గనుక, విద్యాగంధ మెఱుగని మూర్ధశిరోమణులు రాజశేఖరుఁడుగారిని బహువిధముల బరిహసించి పొందదగిన యానందమునంతను సంపూర్ణముగా నను భవించిరి. ఇంతలో గ్రహణమోక్షకాలము సమీపించినందున నెల్ల వారును విడుపు స్నానమునకై పోయిరి. శుద్ధమోక్ష మయిన తరు వాత ముందుగా స్నానము చేసివచ్చి యాఁడువారు వంటచేసినందున దీపములు పెట్టించి యెల్లవారును ప్రధమ భోజనములను జేసిరి.