రాజయోగసారము/తృతీయ ప్రకరణము

వికీసోర్స్ నుండి

శ్రీ ర స్తు

రా జ యో గ సా ర ము

————*****————

తృతీయ ప్రకరణము

శ్రీ రాజయోగసుస్థిరమహామహిమ
సారమై వెలుఁగు ముజ్జగములయందు
హరిణాక్షి నీ విప్పు డడిగినప్రశ్న
సరవిమై విను మది సంతసంబుగను
ఘనతరమోహదుఃఖంబులు రెండు
తనరారఁగా మనోధర్మంబు లరయ
బలము లై తగుక్షుత్పిపాసలు రెండు
నలప్రాణధర్మంబు లనఁబడుచుండు
మర్మంబు విను జన్మమరణము ల్దేహ
ధర్మంబు లనఁబడు తల్లిరో వినుము
ఇదియ షడూర్ములై యెల్లకాలంబు
గదలక యాత్మను గలసినట్లుండు
నాయాత్మ కొక్కటి నంట దూహింప
నాయాత్మ సాన్నిధ్య మందు సంతతము

§§§ పంచవింశతి ప్రకరణములు §§§

గగనంబు శ్రోత్రమై గగనసంబంధ
మగుచున్నశబ్దంబు నాలింపుచుండు

అనిలంబు త్వక్కులైయనిలసంబంధ
మనఁదగుస్పర్శ మొయ్యననైనఁ దెలియు
ననలంబు చక్షులై యనిలసంబంధ
మననొప్పు రూపంబు నరుదుగఁ జూచు10
జలము జిహ్వయజలసంబంధ మగుచు
విలసిల్లు రసమును వింతగఁ గ్రోలు
జగతియ ఘ్రాణమై జగతిసంబంధ
మగుచున్నగంధంబు నగునిద్ర దనరి
వరుసగఁ బలుకును వాగింద్రియంబు
చరియింపుచుండును జరణేంద్రియంబు
సొరిదిగ నిచ్చి పుచ్చుకొను హస్తములు
సరవిగఁ బాయుపస్థలు రెంటివలన
జలమలంబులను విసర్జించుఁ దల్లి
నిలయంబులై యుండు నెఱిి నెందుకైన
మనసున సంశయ మానుము జనని
తనర నేమైనఁ జిత్తము విచారించు
నన్నియు నేను నే నని యహంకార
మున్నతత్వంబు నుప్పొంగుచు నుండు
నంతఃకరణరూప మగుచు జ్ఞాతృత్వ
మంతటఁ దా నెప్పుడమరుచు నుండు
మొనసి ప్రాణాపానములు సంతతంబు
జనని యుచ్ఛ్వాసనిశ్వాసరూపములు

నలినమిత్రామిత్రనాడులలోన
నలరఁ జరించు సోహం సోహ మంచు20
నదియ జపాఖ్య మహామంత్రసంజ్ఞ
యదె జీవపరమున కైక్యంబు దెల్పు
నకుటిల మౌ హృదయంతరస్థలిని
నొకయష్టదళపద్మ మొనరుచు నుండు
నాలోన హంసదీపాకృతి యగుచుఁ
దాలిమి మౌ నష్టదళములమీఁదఁ
గరువలి చలనంబు గల్గినకతనఁ
బరిశోభితంబుగఁ బ్రసరించుచుండు
నొక్కొక్కదళమున నొక్కొక్కచింత
తక్కక గల్గుఁ దద్ధర్మంబులెల్ల
వరుసఁగ దెల్పెద వారక తల్లి
సురరాజదళమున సుకృతంబుచింత
బలువహ్నిదళమున భక్షించుచింత
ఆల యమభాగమందలి పాపచింత
సరవి నైఋతిని దోషము లెన్నుచింత
నెఱి వరుణునిదిశ నిద్రించుచింత
చాలవాయువుదిశ సంచారచింత
యాలోన ధనదుని యలధర్మచింత
వఱల నీశాన్యాన వైరాగ్యచింత
సరవిగ నాజ్యోతి జలజమధ్యమున30

బన్నుగనిల్చినఁ బరమార్థచింత
యెన్నెన్నిచందంబు లీశరీరమున
ఖండవృత్తులుగఁ బ్రకాశించుచుండు
దండిగ నీవది దగనేమిగావు
ఆవేళఁ జెప్పినయట్టిచందమున
బావన మగుపరబ్రహ్మంబు నీవు
గగన మద్దములోనఁ గన్పట్టుకరణి
నగణితంబుగ బ్రహ్మ మాబుద్ధియందు
బ్రతిఫలింపుచుఁ జిదభ్యాసాఖ్య నమరె
నతఁడు జీవుఁ డనంగ నలరారె వినుము
అలరార నాజీవుఁ డాననాబ్జమున
వెలసి జాగ్రతయందు విఖ్యాతి నమరి
స్థూలాభిమానియై సొంపుగ విషయ
జాలంబులం గ్రీడ సల్పుచు నుండు
తనరఁ గంఠమునందుఁ దైజసాఖ్యమున
ననువుగ సూక్ష్మదేహము నావరించి
యంతరింద్రియముల ననుసరించుకొని
వింతవింతగ స్వప్నవిభవంబు గాంచి
తదనంతరమున రుద్రగ్రంధిఁ జొచ్చి
పదిలంబుగా నందుఁ బ్రజ్ఞాఖ్య నలరి 40
కారణదేహంబు గైకొని యచట
ధీరుఁడై యంతరింద్రియముల నడఁచి

తెఱఁగార నట సుషుప్తిని జెంది యవల
సురుచిరమైన విష్ణుగ్రంధిఁ జొచ్చి
ఘనమహాకారణాంగంబు ధరించి
యనువుగ నచట తుర్యాఖ్య వహించి
మఱియు నందుండి బ్రహ్మగ్రంధిఁ జొచ్చి
సరవిఁ దుర్యాతీతసంజ్ఞ వహించి
క్రమముగ నాధారకమలంబు చేరి
అమర నచ్చట పరమానంద మేమొ
కరమర్థి క్షణముండి క్రమ్మరం దిరిగి
సరగున సామపంచకమును గూడి
మొనసి యాజ్ఞాచక్రమున నిల్చియుండు
వనజాఁప్తుఁ డుదయించి వచ్చినజనులు
మురసి తత్తత్కార్యములు సల్పుపగిది
నరయ భ్రూమధ్యమం దాత్మభాస్కరుడు
నిలిచి యుండినవేళ నిఖిలేంద్రియంబు
నలరారఁ దమపను లన్ని గావించి
యవల సుషుప్తియం దనుదినం బడఁగు
నవియెల్ల నీవు పాయక విను మమ్మ 50
అనువొంద నివియ నీవైనసుషుప్తి
నను నిత్య మొందకు నశ్వరం బగుచు
నీకు నాశము లేదు నిత్యం బటంచుఁ
బ్రాకటంబుగ శ్రుతు ల్పల్కుచు నుండు

కావున విలయ మక్కడ నీకుఁ గలదె?
యీవిధ మింద్రియావస్థల నైన
భావమెల్లను తేటపఱచెద వినుము
సావధానంబుగఁ జక్కఁగ నిపుడు
ఎపుడు నీదేహంబు నెఱిఁగెడు తెల్వి
యెపుడు సుషుప్తి తా నెందును బోయె
సహజంబుగా దాని సరవి నెట్లనిన
నహ మనియెడుభావ మాసుప్తిలోను
లయ మైనవేళ నీ లాలితజ్ఞప్తి
జయముగ నచట నే సాక్షియై యుండు
ఇది లేక యుండిన నింతలో నెలమి
నిదుర మేల్కని లేచి నే నింతతడవు
పొలువొందఁగా నిద్రఁ బోయితి నంచుఁ
దెలియువా రెవ్వ రా తెల్వియు గాక
యానిర్గుణజ్ఞప్తి యందుండఁగానె
పూని యహంకృతి పొడము గ్రమ్మరనె60
యానిర్గుణజ్ఞప్తి యట లేకయున్నఁ
బూని దానికి నిదె పోకడై యుండు
మందమై దేహంబు మఱచు టేమనిన
నం దహంకృతికి లేక యానిర్గుణాత్మ
తాను దానై యుండు తన్మయత్వమునఁ
గాన నహంకృతికరణి సంతతికి

నమర కారణ మయ్యె నాయహంకృతికి
నమలాత్మ కారణ మని చెప్పఁబడును
ఆరీతి యెట్లన్న నయ్యహంకార
మారయ సుప్తియం దణఁగినయప్పు
డుండు వెలంగుచు నుండును జ్ఞప్తి
యుండఁగ గద మఱి యెకకొంతప్రొద్దు
గనినపిమ్మట నైన గ్రక్కున లేచి
గను నీ ప్రపంచసంగతు లాత్మ నిచట
నుండక యున్నను నూహింపరాదు
ఖండితంబుగ సర్వకారణ మాత్మ
ఆయహంకృతి హేతు వఖిలకృత్యములు
నాయహంకృతి శూన్య మైనవేళలను
సత్యాత్మ కీప్రపంచక్రియల్ లేవు
నిత్యమై శుద్ధమై నిర్వికారమునఁ70
దాను దానై తాను తనలోన వెలుఁగు
గాన నాత్మయ నిర్వికారనిర్గుణము
ఇల స్వయంజ్యోతిమై యిది ప్రకాశించె
లలిఁ దలంపంగఁ గాలత్రయంబునకు
ఆరయావస్థాత్రయమునకు దేహ
కారణాలకు మూలకారణం బగుచు
సుక్షేత్రనయనాగ్రసుషిరాంతరమున
నక్షయం బై పరమామృతనిత్య

పరిపూర్ణమై పరబ్రహ్మమై విమల
తరమై పరాత్పరతత్వమై భేద
రహితమై యమితమై రమ్యమై చూడ
సహజమై యచలమై శాంతమై యొనర
సదమలవేదాంతసారమై మఱియు
నిదురకు మొదలుగ నిర్మలం బైన
తెలివికిఁ దుదయైన దేదీప్య మగుచు
సలలిత మై సర్వసాక్షి యై దనరి
గణనాధికానందకారియు నగుచు
నణువుకు నణువైన యనవరతంబు
నామహత్తుకు మహత్తై రెంటికన్న
తా మించి పరమసత్తామాత్ర మగుచు
వెలిలోను శూన్యమై వెలిలోను నంది
వెలిలోను గాయక వెలుఁగుచు నుండు
అది నీవుగాఁ జూచి యానంద మొందు
మదియెట్ల నే నౌను నని యంటివేని
అద్దంబులోఁ జొచ్చినటువంటి గగన
మద్దంబు భిన్నమైనప్పుడు తనకుఁ
గారణమైన నాకాశానఁ గలయు
నారీతిగా బుద్ధి యణఁగినపిదప
పరికించి జీవుఁ డన్పంచవింశకుఁడు
అరయఁగ షడ్వింశకాభిధానంబు

కలిగిన యాబ్రహ్మకళయంద గలయు
నెలనాగ భావింపు మిది సౌఖ్యసరణి
నిది శాస్త్రములచేత నెఱిఁగినంతటనె
పొదలెడుసంశయంబులు వీడరాదు
వరశక్తి సుజ్ఞాన వైరాగ్యసరణి
నరయుచు నీయోగ మనవరతంబు
మననంబు చేసి సమ్మత మొందవలయు
మననంబు సేయక మఱి యుండిరేని
యామనంబున నింద్రియాదులఁ గూడి
కామాదిశత్రువర్గము నాశ్రయించు 90
కావున మదిఁ జక్కఁగం బట్టి నిలుప
గావలె నిల్ప కెక్కడి దీ మనంబు
తారకయోగావధాని యైనట్టి
ధీరుఁడు దాని నిందింపఁగ నేర్చు
నని యట్లు పలుకఁగ నాచంద్రవదన
తనయుని జూచి సంతస మార ననియె.

§§§ తారకలక్షణము §§§


 
ఓతండ్రి తారకయోగలక్షణము
ఖ్యాతిగఁ జెప్పి నన్గడతేర్చు మనఁగ
నానంద మంది మహామహుండు గని
పూని యిమ్మెయి నొగి బోధింపఁ దొడఁగెఁ
గ్రమముగ సకలయోగంబులయందుఁ

విమలమై శ్రేష్ఠమై వెలయు తారకము
వినవమ్మ యిది రెండువిధములై యుండు
నొనర పూర్వాపరయోగంబు లనఁగ
నమర నచ్చట పూర్వమగు తారకంబు
క్రమముగ రాజయోగం బపరంబు
గరిమమై పూర్వయోగము తొల్త వినుము
దిరముగ నెల్ల మూర్తిమయంబు నగుచు
భాసురలీల రూపగుణంబు లైన
యాసోమసూర్యబింబాంతరాళమునఁ
దళతళవెలిఁగెడు తారకలోన
నెలవుగ నొనఁగూర్చి నిటలంబు చేర్చి
యెక్కింత భ్రూయుగం బొనరంగఁ బైకి
నిక్కించి నడిమింట నిల్చి చూచినను
అచట నాత్మప్రత్యయంబు లావేళ
ప్రచురంబు లై తోఁచు బహువిధంబులను
అవి చూచుచును మనం బట్టట్టు వోక
యవిరళప్రజ్ఞతో నచట నిల్చుచును
మన మట్ల నిల్చిన మారుతం బపుడు
పనివడి తాఁ బట్టువడియుండు నచట
పొసఁగ మారుతమనంబులు గూడి యున్న
నసదృశం బగుబుద్ధి కప్పు డేకాగ్ర
భావంబు కల్గు నాభావంబు సగుణ

భావంబు లెల్ల తప్పకచూచుచుండు
నాచూపు ప్రత్యయం బభ్యాససరణి
చూచుచుండఁగ నందు సుచిదంబురాశి
యందు దృశ్యంబులు నడఁగి యిన్నిటికిఁ
జెందినయెఱుక తా శేషించి యుండు
మొనసి ధ్యాత ధ్యానములు లేక యుండు
వినరాక యిమ్ముగ వెల్గుచు నుండు 110
నది యమనస్కాఖ్యమగు వరయోగ
మదియ దానికిఁ బరం బైనది లేదు
క్రమముగ సకలయోగవిధానములకు
రమణీయ మై తాన రా జగుచుండు
కావున రాజయోగం బనుపేర
పావనమై గోప్యభావ మై యుండు
మురువుమీరఁ ద్రికూటమునకుఁ బూర్వానఁ
బరికింప నొప్పును బావనానలము
దానిపై భూమ్యాది తత్త్వంబు లైదు
పూనిన వర్ణము ల్బొలుపొందుచుండు
నానిగ్గులో నుండు ననలమండలము
దానిలోపల నుండు తరణిమండలము
మఱి దానిలోఁ జంద్రమండల ముండు
నరుదుగ దానిలో నంకురం బొకటి
అదియు భవ్యాకార మై చెల్వుమీర

నది బీజమై యుండు నఖిలంబులకును
అచటఁ బ్రవర్తించు నఖిలదృశ్యములు
ప్రచురంబుగాఁ బరాత్పరవస్తు వరయు
ఘనతరాపోజ్యోతిగతిని రేపవలు
మొనసి యంతర్బాహ్యముల వెల్గుచుండు
నారయ నుపనిషదర్థసూచకము
వేఱు చిత్తములేక విన దృఢంబుగను
అలరార నీలతోయదమధ్యమందు
వెలుఁగు విద్యుల్లేఖవిధమున మఱియు
సురుచిరనీవారశూకంబు పగిది
నరయ నీలచ్ఛాయ నలరుచు మఱియుఁ
జెలువంద పావకశిఖ దానినడుమ
బలముగ వ్యాపించి పరమాత్మయుండు
నిది బ్రహ్మ మిదె శివుం డిదియ విష్ణుండు
నదియ దేవేంద్రుండు నదియ యక్షరము
అదియుపో పరమంబు నదియే స్వరాట్టు
నదియ సత్తామాత్ర మని యార్యజనులు
తఱచుగ దైవభేదంబు లెన్నుదురు
పరతత్వమున భేదభావంబు లేదు
నామరూపంబు లెన్నఁగ వేఱులైన
హేమంబునకు భేద మెందైనఁ గలదె?
ఆరీతి వెల్గు నాయాత్మఁ జూచుటకు

సారమై యుండును శాంభవిముద్ర
వలనొప్ప క్షలయ గావలె నెట్టులనిన
నరుల పాడ్యమిదృష్టి యమవసదృష్టి130
అల పౌర్ణవమిదృష్టి యనెడుసంజ్ఞలను
విలసిల్లుచును మూఁడు విధములై యుండు
పరగ నీమూఁటిలోపల తొలిరెంటిఁ
బరిహరింపుచు మహాప్రజ్ఞ దీపింప
సరవి మూఁడవచూపు సాధింపవలయు
నరయ నేర్పున లక్ష్య మనువెలదృష్టి
కలిగి రెప్పలపాటు కలగకుండినను
విలసితమగు శాంభవీముద్ర యగును
ఈముద్ర ధరియించి యేకాగ్రమతిని
యామద్వయము చూడ నపుడుమానసము
కరువలి క్షీరోదకన్యాయ మగుచుఁ
బరువడిఁ గూడి లోపల నిల్చియుండు
నొనరంగ నందులో నొకటి చలించి
చన రెండవదియు నాసరణిదీపింప
నారెంటి నొకచోట నమరంగఁ గూర్చి
సారంబు తనర నిశ్చలత వహించి
నిర్వికల్పసమాధి నిలచిన నదియ
సర్వంబు గనుఁగొను సత్పథం బరయ
రాజయోగంబు విరాజమానంబు

నైజమౌ సచ్చిదానందపదంబు140
పాటించి బుద్ధి నీభావంబునందు
నాటించు మని పల్కు నందను జూచి
నాతండ్రి సచ్చిదానందలక్షణము
ఖ్యాతిగఁ దెల్పిన న్గరుణించు మనిన
జనని వీక్షించి విశ్వాసంబుతోడ
మునిరాజచంద్రుండు మొససి యిట్లనియె
నలినాక్షి సచ్చిదానందప్రభావ
మెలమితో నిపుడు నీ కెఱిఁగింతు వినుము
లలి నొప్పుచున్న నీలజ్యోతిలోన
విలసిత చిద్బిందు వెలుఁగుచునుండు
సరసమై యచ్చట స్ఫటికతేజంబు
చిరమైన యాపరశివకళై యుండు
జనని యాశివకళ సత్తన నొప్పు
ననఘ చిద్బిందుచిత్తనఁగఁ బెంపొందు
నది రెండు గలయుట యానంద మగుచు
వివరంబుగాఁ దత్వవిదు లెఱుంగుదురు
ఒనరంగ నదియ నింకొకరీతిగాను
వినుము చెప్పెద దాని వేడ్క నోతల్లి
కనుఁగొన నీ సర్వకామరూపములు
ననువుగ సచ్చిదానందంబు గలదు
ఈరూపనామంబు లెసలారుచున్న

నల యస్తిభాతిప్రియములు భావింప
సత్తులింగ మనంగ సహజమై యుండు
చిత్తన నంగంబు చెలువంబు మీరు
నీరెండు నొక్కటియే యై నదృశ్య
కారణమై విశ్వగర్భమై వెలుఁగు
నలఘునాదము లింగ మనఁగఁ బెంపొందు
నల బిందు వగుచును నమరు నా రెండు
ఘనత సాంఖ్యంబైన కళ యగునదియ
పెను పగునాదంబు బిందుకళయన
నీమూఁటి కాధార మేస్థాన మనిన
కోమల మైన త్రికూటస్థలమున
లలితమై యొప్పునీలచ్ఛాయవలెను
పొలుపొందునట్టి యాపోజ్యోతినడుమ
విలసితచిద్బిందు వెలుఁగుచు నుండు
నలర నాబిందులో నలఘునాదంబు
పలుకుచు నుండును బరమార్థ మైన
కలనాదబిందుసంకలితమై యుండు
అదె మూలప్రకృతియు నదె దేవహూతి
పదిలంబుగాను త్వంపద తత్పదములు 160
అసిపదభావ మింకలర తేటగను
పొసఁగఁ జెప్పెద విను బొంపిరివోవ
తనరంగఁ ద్వంపదార్థము జీవుఁ డనఁగ

విను తత్పదార్థంబు విమలచిదాత్మ
ఈ రెంటి కైక్యంబ యెస నసిపదము
సారోక్తిగా నీవు సరణి భావింపు
మదె తత్వ మదె భావ మదె నిరాలంబ
మది సర్వసాక్షి నీ వదియ తలంప
నలరఁగ నీచంద మనవరతంబు
తలఁపుచు నుండు నంతర్లక్ష్యమందు
వెలుపల లోపల వెలిని యానడుమ
పొలుపొంద వెలుఁగు నాపోజ్యోతియందు
నిదుర జెందినరీతి నిల్చితివేని
యదియ యంతర్లక్ష్యమని చెప్పఁబడును
అది మహాకాశచిదాకాశ మనఁగఁ
బొదలు చిదంబరం బొనరంగ వినుము
తనరార నీనభాధారము చేసి
యొనరంగ నొకటితో నొక్కటిగూర్చి
యగణితం బైనచిదంబరస్థలిని
తగ నిల్ప నదియ యంతర్లక్ష్య మగును170
జనని నీమనము నిశ్చల మైనదనుక
మొనసి యంతర్లక్ష్యముద్ర యేమరకు
మది యేమఱిన నిర్జరాదుల కైన
మది సంశయంబులు మానవు దల్ప
కావున నీవిప్డు క్రమము దప్పకయ

కైవల్యచిన్మాత్రకళయందు బుద్ధి
నాటించి సచ్చిదానందపదంబు
పాటించి నీవని భావింపుచుండు
తెలిసిన తెల్వియుం దెలియని మఱపు
తెలియ కానందాబ్ధిఁ దేలి యుండినది
బ్రహ్మసాక్షాత్కారపద మని తెలియు
బ్రహ్మానుభవ మందె పట్టుగ నిల్పు
మెఱుక నీ వనుచు నీ వెఱిఁగిన వెన్క
వఱల నీ దేహంబు వాసన ల్మగుడ
కలిగిన నది బంధకము గాదు నీకు
వల నొప్ప సాదృశ్యవాక్యంబు వినుము
చెలువొంద ముత్యపుఁజిప్పలో వ్రాలి
సలిలంబు ముత్యమై సరవిఁ జిప్పనొగి
తొల్లిటివలె నీలతోయమై పోవు
తల్లి నీ వారీతి ధన్యత నొందు 180
నీయాత్మ నీవయై నిల్చినవెన్క
మాయ నిన్నంటునే మాయ యేదనిన
నిస్నుఁ గానక తన్వు నీ వన భ్రమసి
యిన్నాళ్లు పరమార్థ మెఱుగకయున్న
ఇదియపో మాయ యిం కెయ్యది గాదు
మది నెన్న నొకరూపు మాయకు లేదు
అదియ నిర్వచనీయ మదియని గాదు

అది గల్గి లేనిది యదియ యవిద్య
యది యెట్లు జనియించు నది యెట్టు లడఁగు
నది తేటపఱచు మనంగ నిట్లనియె.
పరిశుద్ధమైన నభంబు వీక్షింప
సొరిది నీలచ్ఛాయ చూపట్టునటుల
నిర్మలమై వెల్గు నిర్గుణమందు
గర్మంబు గర్మగఁ గల్గినమాయ
యెందెందుఁ జూచిన యేకమై పొంది
యుంది యంచును జూడ నుండును మాయ
యెందు లేదని చూడ నెటులేదు మాయ
యందు నీలత్వ మాకాశంబునందు
నెటువలె దబ్బరో యెఱుకతోఁ జూడ
నటువలెనే దబ్బ రై యుండు మాయ190
యిదివరదాక ని న్నెనసినమాయ
మదితోడ నీమాయ మాయమై పోయె
మాయలోపల మాయ మహనీయమాయ
యీయఖండజ్ఞప్తి యెఱుఁగనిమాయ
యిటువంటిపరమార్థ మిద్ధాత్రిలోన
కుటిలచిత్తులకు సద్గురుదూషకులకు
నత్యంతవిషయేంద్రియాసక్తులకును
సత్య మూహింపని సంశయాత్ములకు
భీతాత్ములకు మిత్రభేదవాదులకు

నీతిశూన్యులకును నిర్దయాత్ములకు
కామంబు గల యహంకారచిత్తులకు
గామకర్మాసక్తి గల్గువారలకు
నుపదేశ మిచ్చిన నూరక లేని
విపరీతసంశయవితతులు చెలఁగు
గాన ధృఢజ్ఞానకలితులు గారు
గాననీసద్విద్య గావలె నంచు
నడిగి నప్పు డనిశ్చితార్థుఁ డటంచు
నెడఁబాయకే విద్య యియ్యఁగరాదు
ఈవిద్య కర్హుఁ డిం కెవఁ డంటివేని
పావనవైరాగ్యపద్ధతు లెఱిఁగి 200
తలఁగక మొదటిసాధనచతుష్టయము
చెలఁగ కభ్యాసంబు చేసినవాఁడు
శమదమాదులు గల్గి సద్గురుపాద
కమలంబులే గతి గా నమ్మువాఁడు
కనులముందఱ పరాంగన నిల్చియున్న
తను గన్నతల్లిగఁ దలఁచినవాఁడు
పరులవిత్తము లగుపడిన వీక్షించి
సరగునఁ దనకేలు చాఁచనివాఁడు
ఎక్కడి సంసార మెక్కడ గల్గు
నెక్కడ నడఁగు నే నెవ్వఁ డటంచు
దనుదాన వెదకుచుం దనమనంబునను

పని బూని యీశ్వరార్పణము చేయుచును
విగతసంకల్పుఁ డై విహితకర్మములు
తగ సల్పుచును భూతదయగలవాఁడు
సంతతంబును యదృచ్ఛాలాభమునకు
సంతసింపుచు సాధుజనులతో మైత్రి
శాంతవర్తనముచే సల్పెడువాఁడు
శాంతవేత్తల నొక్కసారి వంచించి
యది దెల్పు మిది దెల్పు మని త్వరపడక
సదమలుఁడై ధర్మ మనవరతంబు 210
కారణగురుమూర్తిఁ గన్గొన్నలోన
సారెకు మెలఁగుచు సామి యింకేమి
శరణంబు లేదు మీచరణద్వయంబ
శరణంబు నాకు నిశ్చయముగా ననుచు
బదరి తా నడుగక భక్తి యేమరక
చెదఱక శుశ్రూష చేసెడువాఁడు
అవనిలో విద్యకు నర్హుఁడై యుండు
నవలసంశయములు నన్నియుం దీరు
నిటువంటిసద్విద్య నెఱుఁగనేరకయ
మటుమాయచేఁ జిక్కి మదమత్తులైన
ఘోరాత్మకులు వారు గొఱ్ఱెలుగాక
వారి కెక్కడిది జీవన్ముక్తిసుఖము
అందందుఁ బాపతిర్యగ్జంతుతతుల

యందు జనింపుచు నడఁగుచు నుండు
పొలుపొందనటుకొంత పుణ్యవేషంబు
కలిగి యామనుజుఁడుగాఁ బుట్టి యపుడ
కనవచ్చు మోక్ష మేగతినైన నిపుడు
గనలేనివానికిఁ గల్గునే యవల
నిపు డిట్టి సుజ్ఞాన మెఱుఁగనినారు
చపలాత్ములై మఱి జన్మజన్మమున220
పాపంబు చేసి తత్పారంబు లేని
కూపాన మఱి మునుంగుచుఁ దేలుచుందు
రిటువంటిసంసార మెసలారు చుండి
పటువిరక్తిని దోసి పరమాత్ముఁ డైన
కారణగురు చేరి కడతేరినట్టి
ధీరమానసుఁ డాదిదేవుఁ డై నిల్చి
పన్నుగఁ దనఘటప్రారబ్ధమునను
ఎన్నిదినంబు లిం కీధరయందు
విహరింపుచుండును విశ్వమంతయును
మహిమ మీర వినోదమాత్రుఁ డై చూచుఁ
దలఁపున విధినిషేధము లెంచఁబోఁడు
చెలఁగి తా నొకరిని సేవించఁబోఁడు
భేదవాదులతోడ బిట్టుగఁ దర్క
వాదము లాడఁడు వదఱఁ డెప్పుడును
ఎందుఁ జూచినఁ గాని యెఱుఁగనివాని

చందంబుతోఁ గడు సాత్వికుఁ డగును
నతులప్రకాశుఁ డై యానంద మొందు
నతఁ డిల నవధూత యనిపించుకొనును
విలసితముగ బ్రహ్మవేత్తలక్షణము
తెలిపెద విను మింకఁ దెఱుఁగునోతల్లి230
గురుకటాక్షంబున గుఱియందు భ్రమసి
గురుతరసంసారగోష్ఠియందుండు
నమలుఁడై లౌకిక మనుసరించుకొని
యమరంగ శత్రుమిత్రాదుల బ్రహ్మ
భావంబుగాఁ గని పరమతత్వైక్య
భావుఁడై యెపుడు నిర్భరచిత్తుఁ డగుచు
వాసి నింద్రియముల వ్యాపారములను
జేసి యడంగును సిద్ధం బటంచు
పరమాత్ము తా నను భావ మేమనక
యరుదుగ సంసారి యగు నొకవేళ
నుప్పొంగి యోగియై యుండు నొక్కతఱి
నెప్పు డెట్లుండుట నెఱుఁగంగ రాదు
ఘనమైన రాజయోగప్రకారమునఁ
దనయభీష్టముగ స్వతంత్రుఁడై మఱలు
జల మంటనట్టియీ సరణి దీపించు
నలరు దేహంబున నబ్జపత్రమునఁ
దనరంగ జలమునఁ దా నంట దెపుడు

మనుజులు కొంద రా మహిమఁ గానకయ
సంసారియై మనచందంబు నుండి
హంసస్వరూప మె ట్లగును వీఁ డంచు240
దూషించుచుందురు దొడరి యారీతి
దూషించువారికిఁ దొలఁగక యోగి
చేసిన దుష్క్రియ ల్చేరు నాక్షణమ
వాసిగఁ గొంద ఱా పరయోగియందు
నిలుకడగా భక్తి నిల్పి సంతతము
వెలయుఁ దద్గుణములు వినిపించు చున్న
వారికి నాయోగి వాంఛలు లేక
ధీరుఁడై చేసినదివ్యపుణ్యములు
చేరుచు నుండుఁ బ్రసిద్ధంబుగాను
సారె కీలోకానుసారంబుకొఱకు
నిర్మలుఁడగుయోగినేర్పునం జేయు
కర్మముల్ రెండుభాగంబులై పోవు
నతనికి నీరెండు నంట దూహింప
నతఁడు నిర్విషయుఁ డై యానందమొందు
అల తొలియవధూత యాబ్రహ్మవేత్త
పొలుపొందుసమయము పొందుచుండునొగి
అతఁడు విరక్తుడై యడవిలో నున్న
నితఁడు సంసారియై యింటిలోనున్న
నెక్కువ తక్కువ లెన్నంగరాదు

తక్కక మోక్ష మిద్దరికిని సమము250
పొలుపొంద నంచితపూర్వజన్మమున
బలముగఁ గేశవోపాసన చేసి
గురుతరమోక్షంబు కోరినకతన
పరువడి తా సుఖప్రారబ్ధగతిని
అరుదుగ సంసారి యై ముక్తి నొందెఁ
బరికించి చూడ నప్పరమావధూత
అల పూర్వజన్మంబునందు శంకరుని
చెలఁగి యుపాసనచేసి భావమునఁ
గ్రమమున మోక్షమ కామించుకతన
రమణీయలీల విరక్తుఁ డై నిల్చి
మోహపాశములను మొదలంటఁ గోసి
సాహసుఁడై ముక్తి సాధించుకొనియె
నిరువురకును మార్గ మేకమేగాని
ధరఁ దల్లి వినుము భేదము లేదు చూడ
మదిలోన నీ విట్టి మహిమ భావించి
మదికి రమ్యం బైనమార్గమం దుండి
గురుతరముగఁ బంచకోశంబులకును
బరము నీ వైయున్న భావంబు గనుము
అన విని యాదేవి యాత్మజుఁ జూచి
విను మోపరబ్రహ్మ వేదాంతవేద్య 260

§§§ పంచకోశ ప్రకరణము §§§

పంచకోశంబుల భావముల్ దెలియ
నంచితంబుగఁ దెల్పు మన నతం డనియె
విను మంబ యన్నంబు విఖ్యాతి బ్రహ్మ
మని శ్రుతియందలి యలరంగఁ బడియెఁ
గమలాప్తవార్షికకరములవలనిఁ
గమలంబు లుదయించె ఘనసస్యసమితి
నాయె నయ్యోషధు లన్నమై యొప్పె
నాయన్నరసము దేహం బయ్యె నిట్లు
అది యాత్మ యని కొంద ఱండ్రు దృగ్దృశ్య
మది నశ్య మని నిగమాంతము ల్వలుక
గాన దేహం బాత్మ గాదు భావింప
మానిని యీప్రాణమయ మాత్మ యంచు
పదరి కొందఱు మించి పల్కుచుండుదురు
విదితంబుగా దానివిధము భావింప
నది సూక్ష్మదేహాంగ మది యస్థిరంబు
నది యాత్మ యని చూడ నర్హంబు గాదు
అల మనోమయకోశ మాత్మ యటంచు
చెలరేగి కొందఱు చెప్పుచుండుదురు
అది సంశయాత్మకం బది యణుమాత్ర
మది చంచలము గల్గ నాత్మఁ గాఁబోఁడు 270
ఆలఘువిజ్ఞానమయబ్రహ్మ మగుచుఁ

బలుమాఱు కొందఱు పల్కుచుండుదురు
దానికివృత్తి సంతతమును గల్గు
గాన నావృత్తి యఖండప్రవాహ
రూప మౌ నది యాత్మ రూపంబు గాదు
కాపట్యరహిత నిక్కంబుగ వినుము
ఆనందమయకోశ మట పంచకంబు
దానికి నభిమాని తనర మాయావి
పరగంగ సైంధవోపాధిచే నతఁడు
కర మొప్పజగములు గల్పించు నడఁచు
ధరశుద్ధసత్వప్రధాన మైనదియె
యిరవొంద మాయను నెసలారఁ దల్లి
మాయావి యరయ బ్రహ్మం బనుయుక్తి
పాయక కొందఱు పల్కుచుండుదురు
వనజాస్య యద్వైతవాదులమాట
కనుమతింపక మిథ్య యని తలంచుదురు
అతఁ డీశ్వరుండు విశ్వైకకారణుఁడు
అతులితమాయావి యైన దెట్లనినఁ
బూని చెప్పెద నది పొందుగఁ దెలియు
భూనభోతోయదముల జలబిందు280
మొగి సదాంతర్భాహ్యముల ప్రతిఫలిత
మగుచున్నయిటువంటియాకాశ మటుల
అలఘుమహాబింబమాత్రుఁడై తనరి

వల నొప్పగాను సర్వజ్ఞత్వముఖ్య
విలసితగుణగణాన్వితుఁ డైనకతన
నలినలోచన సగుణబ్రహ్మ యనఁగ
నటియింపు చుండు నానావిధంబులను
నటు గాన నిర్గుణ మని చెప్పరాదు
మఱి తల్లి విను మన్నమయకోశ మమరఁ
గర మర్థి నీస్థూలకాయమై యొప్పె
నవ్వలకోశత్రయంబు భావింప
నవ్వల సూక్ష్మాంగ మలరారు చూడ
అలఘుపంచమకోశ మయ్యెఁ గారణము
తలఁప మాయారూపు తను వయ్యె నట్లు
ఆమాయ నాత్మజ్ఞు లందు లే దండ్రు
వామాక్షి సంశయవారితంబుగను
పరఁగఁ జిత్తమును నభస్థలమైన
సురుచిరం బాశ్రయ శుద్ధవిజ్ఞాన
పటిమచే నైశ్వర్యభావంబు నొందు
నట భ్రాంతిచేఁ గల్గినటువంటిమాయ290
సకలాశ్రయబ్రహ్మ సంవిత్తుచేత
నకలంకముగ నష్ట మౌక్షణంబునను
జననిబుద్ధాబుద్ధజను లిందుఁ గొంద
ఱనుమతింపక యుందు రాయుక్తి వినుము
అలరంగ రజితాని కలభిన్నధర్మ

ములు గల్గి యాభాసమును గల్గె నంచు
తొలినుండి భిన్నసత్తులు గావు విశ్వ
ములకుఁ బరబ్రహ్మ మనియెడువాఁడు
ధరణీస్థలిని వేదతత్వుండుగాని
పరగ మూఢుం డట్లు భావింపఁ గలఁడె?
అటువలె నిశ్చయం బందె నీమనము
నిటులైన విశ్వ మేదెసఁ దలంపంగ
మదిలోనఁ దన కనుమానంబు కొంత
కదిసి యున్నందున కల్గె నవ్వేళ
జనని యివ్వలపుచ్ఛ సద్బ్రహ్మ మనఁగ
ననువొందఁ బంచకోశాతీత మయ్యె
నది యసత్యం బన్న ననృతంబు వెలయు
నదియ నీవును నేను నఖిలవిశ్వంబు
సచ్చిదానందాబ్ధి సంపూర్ణ మగుచు
నెచ్చక తగ్గక యేకమై యుండు300
నది మనం బందెఁ దదన్యభావమున
విదితంబుగాఁ జూచి విశ్వంబు మఱువు
మది యెట్లనిన నీసమాధానమతిని
ముద మొప్ప వినుము నే మొనసి చెప్పెదను
పని బూని వామగుల్భమున నాధార
వనజంబు పీడించి వామేతరంబు
వామాంకతలమున వైపుగ నిడిన

యామహనీయముక్తాసన మాయె
నియ్యాసనంబున నేకచిత్తమున
నెయ్యంబుతో నిల్చి నిక్కించి నడుము
దృష్టి నాసాగ్రానఁ దిరముగ నుంచి
యష్టమదంబుల నడఁచి పిమ్మటను
ఘటపటాదులమాయగాఁ జూచి యచట
ఘటిత మైనది సత్తుగాఁ గనుంగొనుము
ఆసత్తు విస్ఫురణాకార మగుచు
భాసురచిత్తుగఁ బ్రబలుటఁ దెలిసి
రహిస్థూలసూక్ష్మగారణముల వెలుఁగు
సహజవస్తువు నేకసరణిగఁ గాంచి
అరయ ననేకోర్వియండకోశములు
వరుస నావరణతత్వముల నన్నిటిని310
హెచ్చుగ నోతల్లి యెలరార వినుము
సచ్చిదైక్యంబుగ సమరసింపుచును
అస్తిభాతులచేత నడఁచి వైచుచును
వస్తుమాత్రం బెల్ల నారూప మంచు
నారూప మెంచ స్వయంజ్యోతి యేక
మారూఢి సరణిచే నాత్మగాఁ గనిన
నాయాత్మ నాదిమధ్యాంతము ల్దొలఁగి
మాయావిరహితమై మదిభేద ముడుగు
నప్పుడు ఘనసచ్చిదానందపూర్ణ

మొప్పుగ నీవగుదుర్విలోకముల
కరమర్థి నపుడు జగద్వాసనముల
దొరఁకొని మనమందుఁ దోఁచినగాని
హస్తిభాతుల చేత నాత్మగాఁ గనుచు
నిస్తరంగం బైన నీరధిపగిది
కలలేని నిద్దురగతిని భేదంబు
తొలఁగి సంపూర్ణమై తుర్యమౌ నంచు
నిర్వికల్పంబున నిశ్చలత్వమున
సర్వ మఖండమై సత్యమై నిత్య
శుద్ధబుద్ధవిముక్తి సొంపొంది పరమ
సిద్ధాంతసిద్ధమై చెలఁగుచునుండు320
నోయమ్మ యచట నేనుండినయపుడ
నీయాత్మ నర్చించు నిశ్చయంబుగను
వలనొప్పఁ దెలియఁగ వలెనని యాత్మ
నలరార నర్పించు నట్టిచందంబు
క్రమముగఁ దెల్పె నుత్కంఠ దీపింప
నమలమానస యైన యాదేవహూతి
అలఘుత్వ మైనముక్తాసనమందు
నలువొందఁ గూర్చుండి నడుము నిక్కించి
మెడ దృఢంబుగ నిల్పి మిహిరాబ్జరిపుల
నడరంతఁ గూర్చి నాసాగ్రంబు చేర్చి
అనుపమసద్బోధ యనువహ్నిలోను

జనియంచినట్టి విజ్ఞానదీపంబు
కరమొప్ప మతియను కరమునం బూని
చొరవఁగ హృద్వీథిఁ జొచ్చి శోధించి
అచ్చటినాళంబు లచ్చటిక్రమము
లచ్చటిచోద్యంబు లరసి చూచుచును
చెలువగు దేహపశ్చిమభాగమందు
నిలిచి వీణాదండ నిజమై తనర్చి
యొనర దీర్ఘాన్తియు నొఱపుగ నమరి
తనుతరంబై బిసతంతుచందమున330
సురుచిరం బైన సుషుమ్నంబునంటి
కరమర్థితో నూర్ధ్వగమనంబు చేతఁ
జె న్నలరిన మేరుశిఖరిపైఁ జేరి
కన్నచోటున బయ ల్కలయ భావించి
నొలయ కప్పుడు వెలి చూపులోఁ జూపు
నలరారఁగాఁ జూచి యట రెండు విడచి
మహనీయతరమైన మధ్యలక్ష్యమున
సహజంబుగా నిల్పి సంతసమంది
నెలవుగ నాత్రివేణీసంగమమునఁ
జలన మొందక నిల్పి స్నానంబు చేసి
లాలితజ్ఞప్తి కళామాత్రమైన
లీలనొందెడి యాత్మలింగంబు గాంచి
అర్మిలి దీపింప నర్చింపఁ దలఁచి

పేర్మిగల్గిన చతుష్పీడమందుంచి
అమలమౌ తత్వమస్యాదివాక్యములు
క్రమముగ మంత్రము ల్గా స్మరింపుచును
ప్రణవం బనెడుఘంటపట్టి వాయించి
గణనము చేయక కామాదు లనెడు
ఘనవిఘ్నకారిరాక్షససమూహముల
మునుకొని బలుదూరమునఁ బారదోలి340
కూర్మితోఁ బూర్వ మాగురుని కర్పించి
కర్మనిర్మాల్యంబు కడపట ద్రోచి
ఆలమట శమదమం బనెడుతోయమున
నలరు నర్ఘ్యము పాద్య మాచమనంబు
నలువొప్ప నొసఁగి స్నానంబు చేయించి
బలమైన సమదృష్టిభావన యనెడు
పరిశుద్ధసాత్వికాంబరము ధరించి
యరుదుగ శక్తిత్రయము నొనఁగూర్చి
తనర యజ్ఞోపవీతంబుగ నిచ్చి
యనుపమసద్విద్య యనుగంధ మలది
తనభూతదయ నక్షతలుగ ధరించి
సునయగుణములను సుకృతవాసనలు
తనరు పుష్పములు సద్భక్తియన్పూజ
మనము రంజిల్ల సమ్మతముగఁ జేసి
రమణీయమగు నంతరంగచతుష్ట

యము ధూపముగనిల్చి యఖిలేంద్రియాది
ప్రమదముపేర్మి దీపంబుగ నొసఁగి
యమరినజపతత్వమగు సుధారసము
మునుకొని నైవేద్యముగ సమర్పించి
తనరార నానందతాంబూలమిచ్చి350
పరఁగాత్మప్రత్యయప్రభ సముజ్వలము
పరఁగ సువర్ణపుష్పంబుగనిచ్చి
పంచభూతములఁ బ్రపంచమంతయును
పంచార్తులుగ సమర్పణ మొప్పఁజేసి
ఆట చిత్తవిశ్రాంతి యనుప్రదక్షిణము
పటుముదంబునఁ జేసి బ్రహ్మైక్యమనెడి
ఘననమస్కార ముత్కంఠతోఁ జేసి
తనలోనిపరమాత్మ దాఁ జూడఁగాను
చూపురూపుననంటి సొరిదిగనట్టి
చూపురూపైక్యమై సుస్థిరమైన
ఆత్మలింగము తానయై ప్రకాశించు
నాత్మానుభవమునం దలరుచుసొక్కి
మననంబు మఱచియు న్మనుజెందునపుడు
మొనయ జ్ఞాతృజ్ఞానములు జ్ఞేయమందు
గూఢమై యవివేకగూర్మి యంతయును
రూఢిగ సచ్చిత్సురూపమైనట్టి
నిర్వాణపదమందు నిండియేకముగ

నిర్వికల్పంబున నిద్దురఁజెంది
తానునై కొంతతాఁ దడవుండి లేచి
మానినీమణి సత్కుమారునిం గనియె360
జయసర్వభూతాత్మ జయపరమాత్మ
జయచిన్మయాకార జయవేదసార
జయకలుషవిభంగ జయమహాలింగ
జయసత్యసంకల్ప జయనిర్వికల్ప
నీకటాక్షంబున నిర్గుణమంద
ప్రాకటంబుగ నైక్యభావ మొందితిని
ఆయాత్మలోపల నఖిలవిశ్వంబు
మాయగనున్నది మైనీడమాడ్కి
నదిసత్యమన్న మహాద్వైతమందు
నుదితస్వదంతర మున్నదేతండ్రి
వ్యావహారికమాత్మ నంగీకరించి
వావిరిరెండని వచియింపవలసె
గురుతరంబుగఁబూజ గొనెడువాఁ డెచట
చిరభక్తితోఁ బూజ సేయువాఁడెవఁడు
సరవిఁబూజింపఁ బూజాద్రవ్యమేది
అరయఁగ వాఙ్మానసాతీత మగుచు
సొరిదిగ నిన్నుఁ బ్రస్తుతి చేయు టెట్లు
పురుడించు సర్వప్రపూర్ణమౌ నిన్నుఁ
జెలఁగి యావాహన చేయుటయెట్లు

తలఁప సర్వమున కాధారమౌనీకు370
విహితాసనంబు గావించుటయెట్లు
మహితగుణంబును మఱియుండునీకు
దనరార నర్ఘ్యపాద్యము లిచ్చు టెట్లు
మొనసి సత్పరిశుద్ధముగ నుండునీకు
నలరార నాచమనాదుల యెట్లు
మలినంబులేక నిర్మలముగ నెప్డు
వెలుఁగుచుండెడు నీకు వేఱతోయమునఁ
జెలువుగ స్నానంబు సేయించుటెట్లు
కొమరొప్ప విశ్వాసకుఁడవైన నీకు
నమరంగ నొకవస్త్రమర్పించు టెట్లు
మొనయఁగ గులగోత్రములు లేనినీకుఁ
దనర యజ్ఞోపవీతము లిచ్చుటెట్లు
పొలుపొంద నవయవంబులు లేనినీకు
వలనొప్ప భూషణావళిఁ దాల్చుటెట్లు
అనఘ నిర్లిప్తుఁడ వైయున్ననీకు
మును గుసుమార్చనంబును జేయుటెట్లు
సలలిత గుణనిరంజకుఁడవౌ నీకు
నెలమిగ ధూపంబు లిచ్చుటయెట్లు
వనజాప్తచంద్రపావకులరూపముల
నొనరెడు దీపంబు నొసఁగుటయెట్లు380
పొలుపార నిత్యతృప్తుఁడవైన నీకు

నలరఁగ నైవేద్య మర్పించుటెట్లు,
మొనసి సదానందమునఁ జొక్కునీకుఁ
గొనకొని విడెము మక్కువనిచ్చు టెట్లు
మురువగు నాద్యంతములు లేనినీకుఁ
బరువడి మంత్రపుష్పము నిచ్చుటెట్లు
సునిశితస్వప్రకాశుఁడవైననీకు
నొనర నీరాజన మొసఁగుటయెట్లు
అనిశ మనంగుఁడ వౌనీకు భక్తి
మొనసి ప్రదక్షణమును జేయుటెట్లు
వారక యద్వైత వస్తునౌనీకుఁ
జేరి ప్రణామంబు చేయుటయెట్లు
సారస్వతుల కగోచరమైన నిన్ను
ధీరత్వముగ వినుతించుటయెట్లు
పొలుపొంద నిశ్చింతముగ నుండునదియె
నెలవుగ నిన్నుధ్యానించుక్రమంబు
ఊరక నిష్క్రియ నుండుచందంబె
భూరిభక్తిని నిన్నుఁ బూజించువిధము
ఘననిశ్చలత్వంబు గల్గియుండినదె
యొనరప్రదక్షణం బొనరించు సరణి390
నలరు సోహంభావ మందునిల్చినదె
చెలఁగి ప్రణామంబు సేయుభావంబు
మొనయ నాత్మజ్ఞానమున నేకనిష్ఠ

నొనరు సంకీర్తన మొనరించురీతి
పరిపూర్ణ భావసంపద గల్గినదియ
పరమైనమంత్రజపంబు సేయుగతి
అలరార నెపుడు కృత్యాకృత్యములను
దెలియక మరచుట దివ్యశమంబు
అంతియకాని మహాబ్రహ్మమందు
వింతగభావంబు వేఱేమి లేదు
మతియున్న దదియున్న మాడ్కిఁ గన్నట్టు
మతివోవ నదివోవు మాయమాయగనె
అతులితబ్రహ్మమం దాకలంకంబు
సతమౌనె చూడ వసంతకాలాన
సతులితంబుగనుండు నబ్జాప్తుకరణి
వితతి ప్రకాశింప వింతగ నందుఁ
బెదరెడి మఱుమరీచిక చూచి జలము
కదలుచున్నది గ్రోలగావలెనంచు
భ్రాంతిచే మృగములు పరువెత్తుకొంచు
నెంతదూరమువోవ నెదురుగజలము400
కదలిపోవుచునుండు కైవడిగాను
మదికి దృగ్వ్యాపారమహిమ లోఁదోఁచుఁ
గాని లేదనెడి నిక్కముదోఁచవోదు
గాను దద్భ్రాంతిచేఁ గడఁ గనలేక
సుడివడితిరిగించు సుడిగుంటరీతిఁ

గడఁగానరాని యఖండాత్మకాంతి
అతిశయంబునఁదోఁచు నఖిలప్రపంచ
మతిసత్యమై యుండునట్లుండుగనుక
జనులీప్రపంచ మసత్యమటంచు
గనుకంటభావించి కడఁగానలేక
సతతంబు నీ ప్రపంచము నిత్యమంచు
నెంతకాలంబున్న నెదురుగజలము
గనుపించుచుండును గానియాలేమి
గనుపించ దీకర్మకాండంబు చూడఁ
గావున నీకర్మకాండచేఁ బుట్టి
వోవుచుందురు ముక్తి పొందంగ లేక
ఘనతరసుజ్ఞానకాండను సత్తుఁ
గనినధన్యులకు మోక్షంబుసిద్ధించు
పరగరజ్జువుఫణిపగిది తొ ల్తఁదగి
యరసిచూచినవెన్క నదిలేనిమాడ్కిఁ410
బరమాత్మయం దీ ప్రపంచంబు మొదలు
తెఱుఁగొప్పుచుండు నీతీరున నెపుడు
పావనసుజ్ఞానపటిమచే దాని
భావించిచూడఁగ భగ్నమైపోవు
ఇట్టిమిథ్యారూప మెసఁగువిశ్వంబు
పట్టుగ నిరత మీ బ్రహ్మంబునందు
నున్నదియని కొంద ఱొనరభాషింతు

రున్నదిసత్తైన నున్నదేజగము
తాను దాననుదాని తలఁచినంతటను
నేను నేననువాఁడు నీరసంబయ్యె
నేనెవ్వఁడోయని నేను భావించి
నేనుగా కటుమున్నె నేనుదానయ్యె
నేను తానైక్యమై నిలిచిచూడంగ
నేనుదాననరాని నేనునేనైతి
లలినెంచసలిలము లవణమైయుండి
సలిలంబులోఁబడి సలిలమౌకరణి
నాబ్రహ్మ మీజీవుఁ డనిపించి పిదప
నాబ్రహ్మమును బొంది యదియుఁదానయ్యె
మొనసి పరబ్రహ్మమును నేనుగంటి
ననుమాట లేభ్రాంతి యదియెట్టులనినఁ 420
దనముఖంబెవఁడైన దర్పణమందుఁ
గనిదర్పణముదీసి కడనుంచినప్డు
మునుదాను దర్పణమున జూచుచున్న
తనప్రతిబింబంబు తనలోనఁగలయు
నలరంగఁ బరమాత్ముఁ డాబుద్ధియందు
జెలువొంద బ్రతిఫలించినతన్వుదాను
కనుచున్న తఱిబుద్ధి గరిగివోవగునె
తనప్రతిబింబమై తనమాడ్కినుండు
జీవుండు తనయందుఁ జెందుటకాని

జీవుండు తన్నుఁ జూచిన నెందుఁగలదు
ముఖదర్పణంబులో మొనసిబింబంబు
ముఖము తాననిజూచి ముదమందుఁగాని
ముఖముకైవడి నద్దమునఁ గాన బడును
ముఖముసత్యంబైన ముఖము గన్గొనునె?
అలబుద్ధిచూపునా యభవుండటంచు
పలికినజడమది భావింపలేదు
గను లద్దమును జూచుఁ గాని యద్దంబు
కనులఁ జూచుటలేదుగద పరికింప
నెలమి నద్దము లేక యీక్షణయుగము
వెలయఁగఁ దనుదాను వీక్షింపఁగలదె?430
కనుదోయిఁదనుదాను గనిసంతసింప
దనరనద్దంబు సాధనముగ నుండు
నారీతిపరమాత్ముఁ డాత్మప్రకాశ
మారూఢిఁగాఁ జూడ నమరుచు బుద్ధి
అలరారసాధన మైయుండుఁగాని
యలరుభావాతీత మైనబ్రహ్మమును
గనెడుసాధనమెందుఁ గలదెన్నటికిని
గనుచుండునదె సాక్షిగాసంతసంబు
పరిపూర్ణతరమగు బ్రహ్మైక్యమునకు
సరవిగనొకదిక్కు చనుటేల యెలమి
అలరునవిద్యాదు లనెడునుపాధు

లలరార నశియించు నాక్షణమందె
యుండెడుచేతనే యుండుపూర్ణముగ
నుండెడు బ్రహ్మమం దూరకేకలయు
సరవిమై నుండును సాదృశ్య మొకటి
వెఱవుగ నీకు నే విన్నవించెదను
ఘటము భిన్నంబైన ఘటపటాకాశ
మటగగనంబున మఱియుండుఁగలసి
ఆమఠం బడఁగిన నామఠాకాశ
మామఠాకాశము నందుండిగలయు
నారీతిగానట్టు లైనపిండాండ
కారణవిద్య దగ్ధంబయివోవు
సొరిదిగాకుండిన చోటనయుండి
సరగున జీవుఁ డీశ్వరునిలోఁ గలయు
నారీతిగా దివ్యమగుశుభకాండ
కారణమగు మాయ క్రమమదె ముందె
కప్పురంబునుగాల్పఁ గడపటదాను
నుప్పరంబున వోవుచుండినరీతి
అలవిద్య తుదకు మహాబ్రహ్మమంది
వెలిఁగిలయంబొంది వేఱతాలేక
గానగు నావిద్య గల్గినయపుడ
వూని ప్రపంచబుద్బుద మొండులేదు
అంతట యిది మిథ్య యనరాని యెఱుక

వింత యొక్కటి లేక వెల్గుచునుండు
నటువంటిబ్రహ్మమేనైతి కలంక
మెటులైన జనియింప దిది నిశ్చయంబు
బట్టబైటను మోక్షపద మిట్లు దనరు
నెట్టులఁ గనుగొందు ఱీబ్రహ్మవిద్య
అప్పు డాకపిలాఖ్యుఁ డా దేవహూతి
నొప్పుగఁ గన్గొని యొగి నిట్టు లనియె
జననిరో బహుజన్మసంస్కారమహిమ
ఘనతరమైయుండె గనుక శీఘ్రముగ
పరమనిర్గుణపరబ్రహ్మైక్యభావ
మరుదుగఁ బొందితి వంతియ చాల
నందఱ కిది లభ్యమైన ప్రపంచ
మెందుండు నటమీఁద నెనలార తల్లి
అనువుగ నెపుడున్న యదిలేని దంచు
నెనకలరీతి లేనిది యున్నదంచు
బలముగ భావించు ప్రాకృతజనము
వలన విశ్వం బట్లు వర్తింపుచుండు
నొనరంగ వారు లేకుండినమాయ
కునికి యెక్కడ లేక యూరకపోవు
దానికి యుక్త మాత్మజ్ఞానవిద్య
గాన తద్విద్య నిక్కము గుప్త మగుచు
వరపతివ్రతరీతి వర్తింపుచుండు

కర మొప్పుచుం గర్మకాండాదులెల్ల
సామాన్యగణికాళిసరణి నటించు
కామయుక్తులకు భోగముల నొసంగు
ఆభోగముల రోసి నటువంటిఘనుల
చే భగ్నమగుదాని చిత్రమంతయును
అటమీఁదఁ దానాత్మ ననెడునిశ్చయము
దిటవుగఁ గల్గుసందేహంబు తలఁగు
నంతట పరిపూర్ణమై తానువెల్గు
నింతంత కీకర్మ మెఱుఁగంగరాదు
సులభంబుగల్గు నీ సుజ్ఞానవిద్య
సులభకాఠిన్యవిస్ఫురణ మెట్లనిన
నేను నేనని పండి నిండినదెఱుక
నేనని సులభమౌ నెఱిఁగహంకృతిని
నేననఁ గఠినమౌ నిశ్చయమందుఁ
గాన నీబంధమోక్షంబులు రెండు
వలనొప్పఁగలవని వచియింపవలసె
నలకంటఁగని నిశ్చయంబు భావించి
ఆబంధమోక్షంబు లభ్రముల్గాని
యాబంధమోక్షంబు లాత్మకెక్కడిది
నిత్యముక్తుం డాత్మ నిర్గుణుండనెడి
సత్య మూహించిన సంకల్ప మేది
ప్రాకటముగ నిట్టి భావనిశ్చయము

నీకు లభ్యంబయ్యె నెఱిఁగన్న తల్లి
ఇరువుగ మఱియు నింకెన్ని చెప్పినను
నిరుపమానందమౌ నిశ్చల మొకటి
పరగ నీనిశ్చయభావంబుచేత
నరయక పరమాత్మ నంచు భావించు
భానుప్రకాశ మంబరమెల్ల నిండి
పూనియుండియును సద్భూరికాంతియొగి
స్ఫుటముగఁ గనరాక భూవృక్షశైల
ఘటపటాద్యాకారఘనమౌ వెలుంగు
సరణిఁ బరాత్ముఁ డాసనముననుండి
కరణాదులందుం బ్రకాశించుచుండు
సంతతం బీరహస్యము భావమందుఁ
జింతింపుచుండు సుస్థిరముగ జనని
ఇలభానుఁ డస్తాద్రి కేఁగినవేళ
కళలచే వెల్గుఁ దక్కక జాలమెల్ల
అమర నాతనియందు ననువొందుమాడ్కి
నమనస్కమున నడఁగా విశ్వమెల్ల
గనుక యీయమనస్క ఘనతరాభ్యాస
మున నీవు పరిపూర్ణముగ నిండియుండు
మానసమున వేంకమాంబికరచిత
మైననట్టి రాజయోగామృతసార

మందెన్నఁగాఁ దృతీయప్రకరణము
పొందుగఁ దఱికుండపురిధాముఁ డైన
వీరనృసింహుఁడు వెలయఁ గైకొనియె
ధారుణి నాచంద్రతారార్కముగను.


రాజయోగసారము తృతీయప్రకరణము
          సంపూర్ణము